17, జూన్ 2022, శుక్రవారం

చిట్టిగుండె
యదాలాపంగా వార్తలు చూస్తున్న పద్మ కనబడుతున్న దృశ్యం పై పూర్తి దృష్టి పెట్టింది. 


మేజర్ కాని వొక యువతి ఆమె ప్రియుడు విషం కలిపిన కూల్ డ్రింక్  తీసుకుంటూ  పోలీస్ స్టేషన్ ఎస్సైని  ఉద్దేశించి మాట్లాడుతూ వీడియో తీసుకుంటున్నారు.


 ఆ యువతి సెల్ఫీ వీడియో తీసుకుంటూ చెబుతుంది. ప్రేమించినతన్ని పెళ్ళి చేసుకోవాలని కోరుకున్నాను. మా పెద్దవారికి అతని పెద్దవాళ్ళకూ మా పెళ్ళి యిష్టం లేదు. అందుకే మేమిద్దరం యింటి నుండి వెళ్ళిపోయాం. వాళ్ళూ వీళ్ళూ మా కోసం వెతుకుతున్నారు. నా తల్లిదండ్రులు మిస్సింగ్ కేస్  కూడా పెట్టారంట. నేను దొరికితే తీసుకెళ్ళి వేరొకరికిచ్చి పెళ్ళిచేస్తారు లేదా నేను పరువుహత్యకు గురవుతాను. అందుకే మేమిద్దరం కలసి బతకలేనపుడు కలసి చనిపోదాం అని నిర్ణయించుకున్నాం. మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు అని చెప్పింది. ఆమె తర్వాత అతనూ ఫోన్ అందుకుని అదే విషయం చెపుతూ విషం కలిపిన కూల్ డ్రింక్ సేవించాడు. తర్వాత ఆ వీడియో ఎస్సై కి అందింది. తర్వాత మీడియాకి అందింది. అది పద్మ చూసింది.


 అయితే ఆమె వార్తను వార్తగా చూసి మర్చిపోలేకపోయింది.అయ్యో! ఎంత పిచ్చి పని చేస్తున్నారు యీ పిల్లలు. రెక్కల చాచి యెగర గల్గితే.. ఈ ప్రపంచంలో యెక్కడోచోట బ్రతకలేరా? పొరబాటు పని చేసారు అని వగచింది. ఆ ప్రేమికులపై సానుభూతి కల్గింది.  వారిరువురి ఉమ్మడి నిర్ణయం పట్ల కోపం వచ్చింది,


 పోలీస్ స్టేషన్  ఎస్సైకి వీడియో చేరకముందే వారిద్దరి తల్లిదండ్రులకో స్నేహితులకో ఆ వీడియో అందే వుంటుంది కదా! వాళ్ళు ఏం చేస్తున్నట్లో! కాపాడగల్గారో లేదో! ఇపుడు  ఈ వీడియో లక్షలాదిమంది ప్రేమికులకూ వారి తల్లిదండ్రులకూ సమస్త జనులకూ అందుతుంది. అయినా పిల్లల ప్రేమను పెద్దలు అంగీకరించరు. పిల్లలు ప్రేమించుకోకుండా ఆకర్షించుకోకుండా కామించుకోకుండా వుండలేరు వుండనివ్వదు యీ లోకం. ప్రేమ పేరిట యెన్ని రంగుల వలలు భ్రాంతులు. 


ప్రాణం విలువ తెలియకా లేక ప్రాణం కన్నా ప్రేమ యెక్కువని అలా చేస్తుంటారా అని ఆలోచిస్తున్న పద్మను మేనకోడలు శృతి ఫోన్ లో పిలిచి పలకరించింది కుశల ప్రశ్నలయ్యాక ఇంతకు ముందు వార్తలలో తను చూసిన విషయాన్ని క్లుప్తంగా చెబుతుంది. 


అంతలో యెఫ్ యెమ్ రేడియో నుండి  “సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని” అంటూ పాట మొదలైంది. రెండో చెవిలో పడిన పాట వింటూ భలే కరెక్ట్ టైమ్ కి పాట కూడా కనెక్ట్ అయిందనిపించి..మేనకోడలితో అంది.”నా చిన్నప్పుడు వొక మాట అనుకున్నాను. మళ్ళీ నలబై అయిదేళ్ళ తర్వాత కూడా అదే మాట అనుకుంటున్నానమ్మా. యువతీయువకుల ప్రేమపై తల్లిదండ్రుల అభిప్రాయాలు మారలేదు ప్రేమికులు మారలేదు చాలా ప్రేమ కథల ముగింపు మారడం లేదు. ఆ మాట యేమిటంటే ‘’ ఎవరూ యెవరినీ ప్రేమించకూడదు. ప్రేమిస్తే పెళ్ళి అవదు. పెద్దవాళ్ళు వొప్పుకుంటేనే పెళ్ళవుతుంది, అంతే ’’ అని.


“తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్ళి చేసుకునేవాళ్ళు వున్నారు కదత్తా” అనడిగింది శృతి.


“అప్పుటి కాలంలో ఇంత దైర్యం తెగింపు లేదు. ఆ మాట ఎందుకనుకున్నానో ఆ విషయం కూడా చెబుతాను విను” అంటుంటే.. 


నవ్వి “కథ చెబుతున్నావా అత్తా” అంది. 


కథ కాదమ్మా! నా చిన్నప్పుడు జరిగిన  వాస్తవ విషయం వొకటి చెబుతాను విను అంటూ మళ్ళీ  కథ కానీ కథ మొదలెట్టింది పద్మ.  


***********

“సిన్ని ఓ సిన్ని.. ఓ సన్నజాజుల సిన్ని” రేడియోలో పాట వింటే చాలు నేను జ్ఞాపకాలతో వుల్కిపడతాను. ఎప్పుడు విన్నా ఇంతే! అతను అంటే “చిన్ని”  గుర్తుకు వస్తాడు. అలాగే ఇంకో పాట కూడా.” అంజలి అంజలీ పుష్పాంజలి” అనే పాట విన్నప్పుడు ఆమె గుర్తుకొస్తుంది. వీరిరువురి గురించి కలిపి తలచుకున్నా విడివిడిగా తలచుకున్నా కలిగే బాధ మాత్రం వొకటే. 


ఆ “చిన్ని” ఎవరంటే.. వాళ్ళు మనకు చుట్టాలవుతారు. మన యింటి వెనకాల మూలమీద వున్న పెంకుటిల్లు వాళ్ళది. చిన్ని అందగాడు.మరీ యెరుపు నలుపు కాని రంగు ఉంగరాల జుట్టు సన్నని కోటేరేసిన ముక్కు నవ్వకపోయినా నవ్వినట్టుండే కళ్ళు ఎత్తుకు తగ్గ లావుతో బాంబేడైయింగ్ లుంగీ కట్టుకుని ఎప్పుడూ సందడి సందడిగా తిరుగుతుండేవాడు. ఏం చదువుకున్నాడో యేం చేసేవాడో కూడా గుర్తులేదు. నాకు తెలియదు కూడా. 


నాకప్పుడు యెనిమిదేళ్ళు వుంటాయేమో! ఆడవాళ్ళకు పిల్లలకూ చిన్న వినోదం రేడియోలో ఆదివారం రోజు మధ్యాహ్నం మూడింటికి వచ్చే సినిమా వినడం అయితే.. పెద్ద వినోదం హాలుకు వెళ్ళి సినిమా చూడటం. మన చిన్న వూరి పక్కనే వున్న చిన్న పట్టణంలో సినిమా చూడటానికి వెళ్ళాలంటే కొంచెం కష్టమే అప్పట్లో. ఇంట్లో మగవారిని వొప్పించాలంటే చాలా కష్టమైన విషయం. నువ్వు మీ ఇంటాయనను అడగకూడదా అంటే మా ఆయన మీ ఆయన కన్నా తక్కువేమీ కాదు సినిమా అంటే కయ్యిమంటాడు. అమ్మ ఆమోదం లేనిదే చుక్క ఆవనూనె కూడా బండి ఇరుసు చక్రంలో వేయడు.అట్టాంటిది నేను అడిగితే మాత్రం బండి కడతాడా. ఎట్టాగొట్టా మీ ఆయన్ని వొప్పించు అని మరొకరిని వేడుకునేవాళ్ళు. రాత్రి వేళ గోముగా అడిగిన భార్య మాట కాదనలేని సున్నితపు మగవాడు అప్పటికి మాటయిచ్చేవాడు. మరల మరిచేవాడు. రెండు రోజులు భార్య గునిస్తే విసుక్కుంటూ బయలెల్లేవాళ్ళు. వారిని చూసి ఇంకొకరు బండి కట్టేవారు. రెండింటికి మ్యాట్ని సినిమా అయితే పన్నెండింటికల్లా అన్నాలు తినేసి పిల్లా పీచు అందరూ కలసి ఇరుక్కుని ఇరుక్కుని కూర్చుని బండి కొయ్యలను పట్టుకొని వేలాడుతూ గంటసేపు ప్రయాణించి పట్టణం చేరేవాళ్ళు. పిల్లలను టికెట్లిచ్చే క్యూ దగ్గర నిలబెట్టి ఆడవాళ్ళు ఫ్యాన్సీ షాపు మీద బడితే మగవాళ్ళు కొందరు కిరణా షాపులకు ఎరువులు పరుగులమందు షాపులకు వెళ్ళి కావాల్సినవి గబగబ కొనుక్కొచ్చేవారు. అవి మా అమ్మ తరం వారి  వినోదపు కష్టాలు.  మాకు తెలిసీ తెలియని వినోదపు ముచ్చట్లూను. 


“జీవనజ్యోతి” సినిమా వచ్చిన రోజులవి. ఆ సినిమా  పాటలు కూడా రేడియోలో వింటూ వుండేవాళ్ళం. ఆ రోజు  మా అమ్మ మూలింటి సూరమ్మ మామ్మతో కబుర్లాడుతూ జీవనజ్యోతి సినిమా గురించి మాట్లాడుకుంటూ నువ్వు చూసావా పిన్నీ నువ్వు చూసావా అమ్మాయి ఆ సినిమా అంటూ వొకరినొకరూ విచారించుకున్నారు. అమ్మ అంది” ఆ సినిమా వచ్చిన కొత్తల్లోనే మా వాళ్ళందరూ బెజవాడ వెళ్ళి చూసి వచ్చారు. ఏడాది తర్వాత మన వూరుకు వచ్చినా నేనింకా చూడనేలేదు. సినిమా బాగుంటదంట. ఎవరిని బండి కట్టమన్నా రేపు మాపు అని రోజులెల్లమారుస్తున్నారు. మనం రిక్షా కట్టించుకొని అయినా వెళ్ళి చూసొద్దాం పద పిన్నీ “అని. 


ఆ మాటలు వింటున్న చిన్ని “నేను రేపు బండి కడతానులే అత్తా! మాయింటో వాళ్ళతోపాటు  పిల్లలు నువ్వు కూడా వద్దురుగాని” అన్నాడు. 


“సరే అయితే, అయినా రేపు ఆదివారం గా. కొట్లు తీసివుంటాయా యేమన్నా కొనుక్కోవాలంటే యెట్టా” అని అమ్మ సందేహం. 


“అశోక్ హాలు చుట్టూ వున్న కొట్లు తీసే వుంటన్నయి. ఈ సినిమాకి  జనం మాములుగా వస్తన్నారనుకున్నావా?తిరనాళ్ళకు వచ్చినట్టు వస్తున్నారు. పెందలాడ బయలుదేరండి టికెట్లు అయిపోతే మళ్ళీ మొదటి ఆట దాకా వుండాలి “ అన్నాడు. 


అనుకున్నట్టుగానే సినిమాకు బయలుదేరి బండెక్కడానికి వెళితే..“చిట్టి మరదలా నువ్వు కూడా వస్తన్నావా సినిమాకి “ అన్నాడు నా బుగ్గ మీద చిటికేసి. నాకు సిగ్గేసి బుగ్గ తుడుచుకుని తలవూపాను. మనంగాక బండిలో యింకా ఖాళీ వుందని నీ స్నేహితురాలికి కూడా చెప్పా. వాళ్ళు వస్తున్నారత్తా అని చెప్పాడు అమ్మతో. అంజలి వాళ్ళ వదిన  అమ్మకు స్నేహితురాలు. ఆ రోజు  మాతో పాటు అంజలీ వాళ్ళ వదిన  కూడా సినిమాకి వచ్చారు. దారంతా చిన్ని “సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని” అని పాట పాడుతూనే వున్నాడు. విన్నకొద్ది వినాలనిపించేది అతని పాట. పెద్దాళంతా వాళ్ళ కబుర్లులో వాళ్ళుంటే చిన్ని మాతో సరదా కబుర్లు చెపుతూ.. అంజలీ యేం మాట్టాడవేంటమ్మాయ్ అనేవాడు. ఆమె ముసిముసి నవ్వులు నవ్వి వూరుకునేది. 


అలా సినిమాకి వెళ్ళే గూడు బండిలో  కలిసిన చిన్ని అంజలి మధ్య యేదో జరుగుతూ వుండేది. దాన్ని వలపు అంటారో ప్రేమ అంటారో నాకేమి తెలియదు. ఇపుడైతే ఒకటో తరగతి పిల్లలకు కూడా లవ్ అంటే యేమిటో తెలుసు అని నవ్వాను. బదులుగా మేనకోడలు నవ్వింది.


చిన్ని - అంజలి. వీళ్ళ ఇద్దరిళ్ళ మధ్య  నాలుగైదు యిళ్ళు వుండేవి. ఇద్దరూ వొకరి యింటివైపు నుండి మరొకరి యింటి వైపుగా నడవాల్సిన అవసరమూ వుండేది. వారి యింటి ముందునుండి  లైబ్రరీ దగ్గరకు వెళుతుండేవాడు చిన్ని. అతను చూడాలనుకున్నట్టుగా పచ్చగా పేడ కళ్ళాపిజల్లిన వాకిట్లో రాతిముగ్గు పిండితో యెర్రగా పండిన గోరింట మునివేళ్ళతో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ వుండేది. కచ్చితంగా అదే సమయానికి అంజలి ని చూడటానికి చిన్ని ఆ దారెంట నడుచుకుంటూ వెళ్ళేవాడు. మనోహరమైన ఆ దృశ్యం యిప్పటికి నా కళ్ళలో మెదులుతుంటుందంటే .. యెంత బలంగా మనసులో ముద్రించుకుపోయిందో. కొన్ని దృశ్యాలకు ఆయువెక్కువ. 


ఆ పని అయ్యాక బావిలో నీళ్ళు తోడటం రోడ్డుకు అవతలవైపున్న గొడ్లచావిడిలో పని చేయడం యిలా యేదో వొక పని చేస్తున్నా ఆమె చూపులు మాత్రం అతన్ని వెదుక్కుంటూ వీథి వైపే వుండేవి. వారిద్దరి మధ్య భాష లేని ఊసు లేవో వుంటూ వుండేవి. వాళ్ళను ఆసక్తిగా  రహస్యంగా గమనిస్తూ నేను. ఇంతకూ వారిద్దరూ నా కంట్లో పడటం యెందుకంటే.. అంజలి వాళ్ళ అన్నయ్య ప్రెవేట్ లు చెప్పేవాడు. నేనూ అన్నయ్య పొద్దున్నే లేచి ఆరింటికల్లా ప్రెవేట్ కి వెళ్ళేవాళ్ళం. యెనిమిదింటికి యింటికెళ్ళి స్నానం చేసి అమ్మ పెట్టింది తిని బడికెళ్ళడం. సాయంత్రం మళ్ళీ ప్రెవేట్ కి వెళ్ళడం మాములే. నేను వీథి కనబడేటట్టు గోడకానుకుని కూర్చుని రహస్యంగా వారిద్దరిని గమనించేదాన్ని. అది నాకెంతో యిష్టంగా వుండేది కూడా. 


 రోజూ చిన్ని అంజలి వాళ్ళింటి చుట్టూ అట్టా ప్రదక్షిణలు చేసేవాడు. రేడియోలో వార్తలు వినడానికి, క్రికెట్ కామెంటరీ వినడానికి వచ్చి అరుగుల మీద కూర్చుండిపోయేవాడు కానీ అసలు అదంతా వొంక మాత్రమే అని కేవలం అంజలిని చూడటానికే వచ్చేవాడని నాకనిపించేది. నేను చెంబు పట్టుకుని పాటి దొడ్లు వైపుకు వెళ్ళినపుడల్లా వాళ్ళిద్దరూ  కనబడేవాళ్ళు. చుట్టుపక్కల యెవరూ కనబడకపోతే కబుర్లు చెప్పుకునే వాళ్ళు. 

 

ఒకరోజు చిట్టి మరదలా! యెవరికి తెలియకుండా యీ వుత్తరం అంజలీకి యివ్వు అని యిచ్చాడు నాకు. మంచినీళ్ళు తాగడానికని సందులోకి యెళ్ళి అంజలికి యిచ్చాను ఆ కాగితం. ఆ రోజు ఆదివారం. సాయంత్రం నాలుగింటి నుండి యేడింటి వరకూ ప్రెవేట్. చీకటి పడే ముందు చెంబు తీసుకుని బయలుదేరుతూ అంజలి నన్ను తోడు రమ్మంటే వెళ్ళాను. మేము అటువెళ్ళడం చూసి చిన్నీ కూడా చెంబు తీసుకుని వచ్చాడు. మనం వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుని వద్దాం. అమ్మ నాలుగు రోజులు గొడవ చేసుద్దేమో కానీ తర్వాత బాగానే వుంటదని నా నమ్మకం. గురువారం దుర్గ గుడికెళ్ళి పెళ్ళి చేసుకుందాం వచ్చెయ్యి అన్నాడు చిన్ని అంజలితో. 


“అమ్మో ! ఇదంతా తెలిసిందంటే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. మీ అమ్మ వొప్పుకుంటేనే మనం పెళ్ళి చేసుకుందాం. లేకపోతే వద్దు. నన్ను మర్చిపో” అని చెంబులో నీళ్ళు పారబోసి నా చెయ్యి పట్టుకుని గబగబ లాక్కొంచింది యింటికి. 


రెండురోజుల తర్వాత పొద్దున్నే గుండె గుభేల్మనే మాట విన్నాం. రాత్రి చిన్ని ఎండ్రిన్ తాగాడంట. హాస్పిటల్ కు తీసుకెళ్ళే దాక కూడా బతకలేదు. మధ్యలోనే  ప్రాణం పోయిందంట అన్న వార్త అంజలికి అందింది. ఊరంతా గుస గుసలాడింది. 


“చిన్నీ, యింత పని చేస్తావనుకోలేదురా, ఆ పిల్లకాకపోతే లోకమేమన్నా గొడ్డుపోయిందా, అంతకన్నా మంచి పిల్లను చూసి పెళ్ళి చేస్తానన్నాగా. ఆ మాట విషమై పోయిందా నీకు. నాకింత కడుపుకోత పెట్టావు కదరా, శిక్షేసి పోయావురా,అమ్మకు శిక్షేసి పోయావురా అని  చిన్నీ శవంపై పడి సూరమ్మ మామ్మ  గుండెలవిసిపోయేలా  యేడుస్తుంటే చూడటానికి వెళ్ళిన  అందరూ కూడా వెక్కివెక్కి యేడ్చారు. అప్పటిదాకా అమ్మకొంగును పట్టుకుని పక్కన నిలబడి బిక్క ముఖం వేసుకుని చూస్తున్న నాకూ కన్నీళ్ళు కారిపోయాయి. ఉహ తెలిసాక నేను చూసిన మొదటి మరణం చిన్ని ది. అయ్యో! యెందుకిలా చేసావు చిన్నీ! నువ్విలా చేయడం నాకు నచ్చలేదు అంజలి యేమైపోవాలిపుడు. మీరిద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడటానికి యెంత బాగుంటుందో అనుకునేదాన్ని నేను. ఛీ ఫో .. యిలా చేసేవేంటి? నీతో పచ్చి. అనుకున్నా. 


ఇంటికొచ్చాక అమ్మ పెద్దమ్మ నాయనమ్మ వొకచోట చేరి చెప్పుకుంటుంటే యేమి తెలియనట్టే విన్నాను. ఆ విషయాలు నాకు అంతగా అర్దం కాకపోయినా సరే. ఆ అంజలి చిన్నీ ప్రేమించుకున్నారంట. రోజూ పాటి మీద కలుసుకుని మాట్టాడుకునే వాళ్ళంట. చానాళ్ళనుండి  వాళ్ళూవీళ్ళు గమనించి చెవులు కొరుక్కొంటున్నారు. ఇద్దరిళ్ళల్లో ఆ సంగతి తెలిసిపోయి ఆ పిల్లకు కాపలా పెట్టారు. చెంబు తీసుకుని యెల్లేటపుడు కూడా యెవరో వొకరు కాపలా వుండారంట. చిన్ని ఆ పిల్లను పెళ్ళి చేసుకుంటానని అడిగితే సూరమ్మ వద్దంది అంట. కట్నం యివ్వకపోతే మాన్లే అమ్మా, ఆ పిల్ల నాకు నచ్చింది ఆ పిల్లనే చేసుకుంటానని చిన్ని గొడవంట. కట్నం గురించి కాదురా, ఆ పిల్ల అమ్మ మంచిది కాదు. కులం తక్కువ వాళ్ళకు పుట్టిన పిల్ల అది. దాన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెడతావా వీల్లేదు అందంట. ఎక్కడో సంబంధం కూడా చూసారు. గురువారం వెళ్ళి పిల్లను చూసి ఖాయం చేసుకుని రావడమే అనుకున్నారట. ఇంతలో యీ పిల్లాడు యిట్టా చేసేడు అని చెప్పింది నాయనమ్మ. 


సినిమాలు చూసి ప్రేమ గీమ అని పిల్లలు చెడిపోతున్నారు. పిల్లలను యేసుకుని సినిమాలకు యెల్లొద్దు అంటే యినరు. ఇపుడు చూడు యేమైందో అని మా చిన్న నాయనమ్మ దండకం మొదలెట్టింది. అమ్మ పెద్దమ్మ అక్కడనుండి మెల్లగా జారుకున్నారు. 

 

తర్వాత రోజుల్లో  వున్నట్టుండి మా యింటి వెనుక నుండి చిన్ని వాళ్ళమ్మ  సూరమ్మ మామ్మ శోకాలు విన్నప్పుడల్లా నా కళ్ళల్లో కన్నీళ్ళు సుడులు తిరుగుతుండేవి. చిన్నీ చిన్నీ అని లోలోపల వెక్కివెక్కి యేడ్చేదాన్ని. ఎందుకో అంజలి మీద కోపం వచ్చేది. ఆమె కూడా చచ్చిపోతే బాగుండును అనిపించేది. అలా యేమి జరగలేదు కానీ కొన్నాళ్ళకు ఆమెకు పెళ్ళైపోయింది. ఆ పెళ్ళి కూడా నేను చూడలేదు. చిన్ని గుర్తుకొచ్చి పెద్దగా యేడ్చాను. “ఎవరూ యెవరినీ ప్రేమించకూడదు. ప్రేమిస్తే పెళ్ళి అవదు. పెద్దవాళ్ళు వొప్పుకుంటేనే పెళ్ళవుతుంది, అంతే!” అనుకున్నాను దృఢంగా అంటూ కథ ముగించింది పద్మ.


***********

“అసలిపుడు చూస్తున్నట్లే కళ్ళకు కట్టినట్లు చెప్పావత్తా. చిన్ని అన్నతనిని తల్చుకుంటే  నాక్కూడా బాధేస్తుంది. హి వాజ్  ట్రూ లవర్” అంది మేనకోడలు శృతి.


“చిన్ని జ్ఞాపకం చాలా బరువైంది. అలా నాకెంతో యిష్టమైన చిన్ని చితిలో నాకు తెలిసిన  ప్రేమ పరిమళం కాలి బూడిదైంది. అంజలికి యిద్దరు పిల్లలు పుట్టారు. నన్ను చూస్తూనే వుంటుంది అపుడపుడు పలకరిస్తుంది కానీ నాకే యేమీ మాట్లాడాలనిపించదు.  తర్వాతర్వాత నా చిట్టిగుండెకు యేమి అర్దమైందో యేమోకానీ యెవరిని తప్పు పట్టాలనిపించలేదు. అసలిదంతా నాకు గుర్తు వుంటుందని అంజలి అనుకుంటుందో లేదో అంటూ భారంగా నిట్టూర్చింది పద్మ. 


“ఈ ప్రేమ అనే సబ్జెక్ట్ చాలా టిపికల్ అత్తా, అందులో ఇప్పడొస్తున్న సినిమాలన్నీ కొత్త కొత్త థియరీ లు చెపుతున్నాయి.కన్ఫ్యూజన్ లో వున్నారు యూత్ అంతా”


“ఈ సినిమాల సంగతేమో కానీ.. నా అనుభవంలో నుండి నేను చెప్పేది యేమిటంటే..మనిషి మనసుకు మనసుకు  మధ్య  వొక యింటర్ లాకింగ్ వుంటుందనుకుంటానమ్మా. అది యెవరికిబడితే వారికి తెరుచుకోదు. ఆ బాండింగ్ అలా వుంటుందేమో మరి. ప్రేమించిన హృదయం దుర్బలం కారాదని గొప్పగా సాంత్వన వచనాలు చెప్పి ఓదార్ప చూస్తారు కానీ ఆ దుర్బలమైన మనసు వెనుక యెన్ని కలలు యెన్నెన్ని ఆశలు అథఃపాతాళానికి అణచివేయబడుతున్నాయన్నది యెవరికి తెలుసు? జాలి సానుభూతి స్థాయిని దాటి ఆలోచించగల్గిన వారికి ప్రేమికుల  ఆత్మహత్య వారు తెలిపే నిరసన బావుటా అని అర్దమవ్వాలి.  


-అంజలి కూడా మీ అమ్మ వొప్పుకుంటేనే పెళ్ళి. లేకపోతే నన్ను మర్చిపో అని యెలా అనగల్గిందో అని ఇపుడు ఆశ్చర్యపోను. తర్వాత రెండురోజులలో  యేం జరిగిందో యేమో! పెద్దలకు తెలిసి వాళ్ళు ఏమన్నారో! నేను చూసినదంతా సత్యమూ కాదు చూడనిదంతా అబద్దం కాదేమో!ఆమె అతని ప్రేమకు రుజువు అడిగిందేమో, చిన్ని ప్రాణం తీసుకుని రుజువు చూపించాడేమో  అని రకరకాలుగా తరచి తరచి ఆలోచిస్తుంటాను. తర్వాత రోజుల్లో నేను మర్చిపోయినట్టు అంజలి కూడా చిన్నిని మర్చిపోయిందేమో! ఆ రెండు పాటలూ విన్నప్పుడల్లా నాకు వారి కథ గుర్తొచ్చినట్లు వారిరువురి జ్ఞాపకాలకు సంబంధించిన వేరొక పాటలు విన్నప్పుడల్లా ఆమెకు చిన్ని గుర్తు రావచ్చేమో! లేదా దశాబ్దాలుగా అంజలి మనసులో యెన్ని అగ్ని గోళాలు బ్రద్దలవుతున్నాయో!  నాకు మాత్రమేం తెలుసు!? అంది పద్మ. 


“ఇప్పుడు ఆమె వుందా అత్తా!”  శృతి ఆసక్తిగా అడిగింది. 


“ఉందనుకుంటాను. అయినా ఆ జ్ఞాపకాలను వెలికితీయడం  యెందుకు అనిపిస్తుంది. ఒకవేళ అంజలిని  ఎప్పుడైనా కలిసినప్పుడు ఆ విషయం గుర్తు చేసానే అనుకో.. నాకిప్పుడు అసలతను గుర్తులేడు యేదో అప్పుడలా జరిగిపోయింది అందనుకో!  అప్పటి  నా చిట్టిగుండె తట్టుకోలేదు. నా మనసులో గాఢంగా ముద్రించుకున్న ఆ ప్రేమ కథ ఆ విషాద కథ అలా మిగిలిపోవడమే నాకిష్టం.  చిన్ని ప్రేమను పలుచన కానీయకుండా అప్పటి నా చిట్టి గుండెను ఎప్పటికీ భద్రంగా కాపాడుకుంటా” బాధగా ఒకింత ఉద్వేగంగా అంది పద్మ. 


ఏమి మాట్లాడకుండా మౌనంగా వుంది శృతి. కొన్ని క్షణాల తర్వాత  “బేటరీ లో చూపిస్తుందత్తా వుండనా మరి”.. అంటూండగానే ఫోన్ కట్ అయింది. 

****************

రేడియోలో “అంజలీ అంజలీ పుష్పాంజలి” పాట మొదలైంది. వినాలనిపించలేదు పద్మకు. రేడియోకి పవర్ వెళ్ళకుండా స్విచ్ ఆఫ్ చేసింది. “సిన్ని ఓ సిన్ని..ఓ సన్నజాజుల సిన్ని”..అంటూ నలబై అయిదేళ్ళ కిందట వినబడిన చిన్ని పాట ఆమె గుండెను హంట్ చేస్తూనే ఉంది.అదో తీపికోత. ప్రేమికుల గుండె కోత.  అందుకే ప్రేమికుల నిర్ణయాల గురించి  ఎన్నడూ వ్యాఖ్యానించాలని అనిపించదు ఆమెకు.


కనిపించే వార్తలో ఒక కథే వుంటుంది. వెనుక  కనబడని కథలెన్నో కన్నీళ్ళెందరివో ! హ్మ్. నేనే రచయితనై ఇదంతా ఒక కథగా రాస్తే.. ఊహించని కోణం మరొకటి చూపిస్తాను అనుకుని అప్పటికప్పుడు కలం పట్టుకుంది పద్మ.


ఉత్సాహం గంతులు వేసే యవ్వనకాలంలో తీసుకునే నిర్ణయాలలో ఆవేశం తెంపరితనం ఎక్కువగానే వుంటుంది గనుక సులువుగా ప్రాణ త్యాగం చేసెయ్యగలరు కానీ నూకలు తినే రాత వాళ్ళ నుదుటిన రాసి వుంటే మరొకటి జరుగుతుంది.


జంటగా విషం పుచ్చుకుంటూ వార్తలకెక్కిన వారిని సమయానికి అటుగా వెళ్తున్న వారెవరో చూసి హాస్పిటల్  కు చేర్చారు. ప్రాణాలు నిలిచాయి.

పశ్తాతాప పడిన ఇరువైపు పెద్దలు అభ్యంతరాలన్నీ మరిచి బాజాలు మ్రోగించారు. తర్వాత మీ బ్రతుకు మీరు బతకండని ఇంటినుండి పారద్రోలారు. వాళ్ళు బతకడానికి నానాపాట్లు పడుతూ కీచులాడుకుంటూ సర్దుబాట్లు చేసుకుంటూ బ్రతికి వున్నందుకు అసహ్యించుకుంటూ   ప్రేమరంగు వెలిసిపోయేదాకా ఓపికగా కాపురం చేసుకుందాంలే  అని అనుకుంటుండగా చటుక్కున పసిపాప రూపంలో అనుబంధం వచ్చి వారి మధ్య ఇరుక్కుని కూర్చుంది. 


అప్పుడు వారు అనుకుంటారిలా…ఈ ప్రేమేంటి దోమేంటి!?  ఎద గిల్లి గుచ్చి చంపకుంటే అంతే చాలు. గుండె ఝరి అంటే ఏమిటో తెలియకుండా గంతకు తగ్గ బొంతతో జరిగిన పెళ్ళి పెటాకులవకుండా నిత్యం బ్రతుకు జీవుడా.. అనుకుంటూ బ్రతికేస్తాం. చాలా చాలా మంది సాధారణమైన మనుషుల్లా అనుబంధాల పీట ముడులు వేసుకుంటూ మమతల పందిరి అల్లుకుంటూ..కథలా కల్పనలా..  అని  కథ ముగించింది పద్మ. కానీ ఆమెలో ఏదో అసంతృప్తి. తయారు చేయలేని ప్రశ్నలూ అంతుచిక్కని జవాబులూ. 


************0**********


(విశాలాక్షి మాస పత్రిక జూన్ 2022 సంచికలో ప్రచురితం)
కామెంట్‌లు లేవు: