31, ఆగస్టు 2013, శనివారం

ఆకుపచ్చ రంగు ఆశ

మా పెనమలూరు అంటేనే పచ్చని ప్రకృతి. కానీ ఇప్పుడంతా కాంక్రీట్ భవనాల సముదాయం . ఇలా ఆహ్లాదకర వాతావరణం ని బంధించినప్పుడు ఇలాంటి దృశ్యాలని ఇకముందు చూడలేమన్న దిగులు మొదలవుతుంది .. గత నాలుగేళ్ల నుంచి అనూహ్యంగా మా వూరి ముఖచిత్రం మారిపోతుంది. అభివృద్ధి కన్నా మూలాలు నాశనం కావడమే బాధగా ఉంది . ఎటుచూసినా భూమికి ఆకుపచ్చని రంగేసినట్లుండే పరిసరాలు కనుమరుగవుతూ ....................

ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది ..  

మచిలీపట్నం రోడ్డు వెంబడి భూమి విలువ ఎకరం ఒక కోటి ముప్పై లక్షలు దాటుతుంది .  తామరతంపరగా నెలకొంటున్న కార్పోరేట్ కాలేజ్ లు ,విస్తరిస్తున్న కాలనీల సంస్కృతీ .. వ్యవసాయం ని దూరం చేస్తున్నాయి . అభివృద్ధి - సోమరితనం రెండు పోటీ పడుతున్నాయి.  నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత పరిడవిల్లుతుంది అంటే ఇలాగేనేమో మరి !అడవులు  ఉండేవి.. అన్నగుర్తుకు..
ఆనవాళ్ళుగా మిగిలిన మొదలంటా.. నరికిన మోళ్లు..
ఒట్టిపోయిన పుడమి తల్లి ఒడిలో..
పచ్చదనాలు స్థానే .. ఆక్రమిస్తున్నఎడారులు ..
కాలుష్య పరిమాణాన్ని సూచించే..
ఎలక్ట్రానిక్ . డిస్ప్లే బోర్డులు.. 
మునిగిపోతున్న ద్వీపకల్పాలతో.. 
ఎటు చూసినా.. నీరే!. 
తాగేందుకు చుక్క కూడా లేదనుకుంటూ .. 
మనం పడే.. పాట్లు...
ఎక్కడ ఉంది.. ప్రకృతి..? 
మనిషి వికృత  చేష్టలకి  మలిగి.. 
సాధించిన ప్రగతి ముంజేతి కంకణం లా..
గ్రీన్ హౌస్  ఎఫెక్ట్ .. అనే అద్దంలో..  కనబడుతుంటే..
చాపక్రింద నీరులా.. కబళిస్తున్న కాలుష్యం లో మునిగి తేలుతున్నాం
మలమలలాడుతూ..భూమండలం.. అగ్నిగుండమవుతుందని వాపోతున్నాం
నీటికై.. మరో.. ప్రపంచ యుద్ధానికి.. సమాయుతం అవుతున్నాం
క్షామంతో.. మన జీవనాలు.. అతలాకుతలం కావడం నిజం .
విచ్చల విడి వినియోగాన్ని మానేద్దాం
భావితరంకి ప్రకృతి  ఆకృతిని ..మిగుల్చుదాం
మొక్కలని  మొక్కవోని దీక్షతో..  నాటి...
భూమికి .. ఆకుపచ్చని రంగు వేద్దాం
(అని ఓ.. ఆశ )

ఈవిషయం ఓ.. 11 ఏళ్ళ క్రితం వ్రాసుకుంది . ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది

28, ఆగస్టు 2013, బుధవారం

అష్టమి కష్టమా!?

నిన్న నాకు  ఫేస్ బుక్ లో   మెసేజెస్ లో  ఒక రిక్వెస్ట్ వచ్చింది .  మా పేజ్ ని like చేయండి recommend చేయండి అని .. అది జ్యోతిష్యం కి సంబందించిన పేజ్. నేను అసలు ఒక్క క్షణం కూడా చూడకుండా తొలగించాను. జ్యోతిష్యం పై మీకు నమ్మకం లేదా అంటే అవునని.. కాదని రెండు రకాలుగా తల ఆడించే రకం నేను . అంటే నమ్మకం ఉందొ లేదో అన్నది నేనే తెల్చుకోలేను అన్నమాట.

ఒకసారి ఇలాగే పంచాంగం చూసి  ఆ విషయాన్ని దీర్ఘంగా తలకి ఎక్కించుకుని నేను నాతొ పాటు మా అబ్బాయిని కూడా టెన్షన్ పెట్టిన వైనం .. ఏమిటంటే ఖచ్చితంగా ఇది జరిగి రెండేళ్ళు అయింది .. ఇలాగే కృష్ణాష్టమి రోజున US వెళ్ళడానికి   రిటర్న్ టికెట్ కొనుక్కునే వచ్చాడు . వచ్చేటప్పుడు తెలంగాణా సంపూర్ణ బంద్  ఆ రోజు నానా తిప్పలు పడి  ఇంటికి వచ్చాడు . ఆ వచ్చేటప్పుడే తన లగేజ్ లో చాలా విలువైన వస్తువులు మిస్ అయ్యాయి . అలా జరిగిందని నేను వెంటనే పంచాంగం చూసి " నువ్వు బయలుదేరిన సమయమే మంచిది కాదు .. మళ్ళీ తిరుగు ప్రయాణంకి ఏ తేదీ " అని అడిగి .. ఆ తేదీ చెప్పగానే నీరస పడిపోయాను "ఆ రోజు కృష్ణాష్టమి . అష్టమి పూట ప్రయాణమా !?" అని చిరాకు పడుతూ .. ఈ సారి ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు నాకోకసారి చెప్పి చేయి అని కొంచెం క్లాస్ తీసుకున్నాను .

"అమ్మా ! నీకు చాదస్తం ఎక్కువైపోతుందమ్మా" అంటూ విసుక్కున్నాడు .

" హా ..  మీకే మీరలాగే అంటారు. ఇప్పుడు చూడు ఎన్ని ఇబ్బందులు పడ్డావో ? వేళా విశేషం .అంటూ ఉంటారు పెద్దలు . వాళ్ళేమి ఉబుసుపోక కాకమ్మ కబుర్లు చెప్పలేదు. దానికి ఏదో రీజన్ ఉంటుంది .. అందుకే పెద్దల మాట చద్దిమూట అంటారు అలా .. ఊరికే  త్రోసి పారేయకూడదు " అని చెప్పాను  ఇలా చెప్పి ఊరుకున్నాననుకున్నారా ? మళ్ళీ వెంటనే "పెద్దవాళ్ళు ఏది చెప్పినా వ్యతిరేకించడం ప్యాషన్ అయిపొయింది .. మీలా మేము పెద్దవాళ్ళకి ఎదురు చెప్పలేదు " అన్నాను .

అందుకు .."నిజంగా.. అలాగే ఉన్నావమ్మా! ? నిజం చెప్పమ్మా మా అమ్మవి కదూ గడ్డం పట్టుకుని అడిగాడు బ్రతిమలాడుతున్నట్లు .

నాకు నవ్వు ..(అబద్దం చెపుతున్నాను కాబట్టి ) నవ్వుతూనే నిజం నాన్నా .... కావాలంటే అడుగు .. అన్నాను .

"నిజంగా అడగనా ? " మళ్ళీ ప్రశ్న

"నిజంగానే అమ్మమ్మని అడుగు కావాలంటే "అన్నాను ఆ ఫ్లో లో ......

"ఎక్కడకి వెళ్లి అడగాలి ? అని నవ్వుతుంటే గాని నాకు వెలగలేదు . "అమ్మ " చనిపోయి పుష్కరం దాటిందని. నవ్వులు మాయమయ్యాయి.

నలబై రోజుల  తర్వాత అబ్బాయి ప్రయాణం కి ముందు చాలా చికాకులు ఎదురయ్యాయి . ముందు రోజు ప్రయాణం కావడానికి వీలు కాలేదు ఒక రోజు ముందుగా వెళ్ళి హైదరాబాద్ లో ఉందాం అనుకున్నాం కానీ అప్పటికి  అనుకున్న పనులు ఏవి సరిగా పూర్తవలేదు,  బస్ లు నడవడం లేదు,. ఎక్కడబడితే అక్కడ ప్రయాణించే కార్లని  కూడా ఆపేస్తున్నారు. ప్లైట్ టికెట్స్ కొనుక్కోమంటే రెండు టికెట్స్ మాత్రమే దొరికాయి. లగేజ్  మొత్తం వెళ్ళడం కుదర లేదు . అబ్బాయేమో ఫ్రెండ్స్ లగేజ్ బోలెడు పోగేసాడు  ఏది వదలకుండా అన్నీ పట్టుకుని వెళ్ళాలి అంటాడు   నేను గన్నవరం వరకు వస్తాను, నువ్వు మీ నాన్నగారు వెళ్ళండి నాన్నా..  అంటే వినడు ....."  అమ్మా నువ్వు రావాలి నువ్వు రాకుండా నేను వెళ్ళను" అని దిగులుగా ముఖం పెట్టాడు . ఏదైతే అదయిందని టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని రెంటల్ కార్ ని పిలిచాము.

సప్తమి ఘడియలు దాటాక ముందే అతనిని రమ్మని చెప్పాను అంతకి ముందు బయలుదేరడానికి దుర్ముహూర్తం ఉందని బయలుదేరలేదు . దుర్ముహూర్తం దాటినాక సప్తమి కొద్ది సమయం మాత్రమే ఉంది . అష్టమి రానే వస్తుంది ఆ సమయంలో బిడ్డని బయలుదేరదీయడం ఎలా ? అని నాకు ఒకటే టెన్షన్ . మధ్యలో అబ్బాయిని బాగా విసుక్కోవడం .. జరిగిపోయాయి . అంతలోనే మేము మాట్లాడుకున్న కారు రానే వచ్చింది .  టైం కి చక్కగా వచ్చాడన్న సంతోషంలో డ్రైవర్ కి థాంక్స్ కూడా చెప్పేసాను. మీరు చెప్పిన టైం కి కాకుండా ఆలస్యంగా ఎప్పుడూ రాలేదు కదండీ ? అని అతని నవ్వుతాల ప్రశ్న.

 హడావిడిగా సప్తమి ఘడియలు ఉండగానే ఇంటి నుండి బయలు దేరాం. ఉత్తరం కి ప్రయాణించి బాబా దర్శనం చేసుకుని తూర్పుకి తిరిగి ప్రయాణించి ఆగ్నేయంగుండా దక్షిణం వైపు ఉన్న మెయిన్  రోడ్డుకి చేరుకొని శివపంచాయతన మూర్తుల దివ్యదర్శనం చేసుకుని "అమ్మయ్య " చక్కగా బయలుదేరాం అనుకుంటూ ఉండగా .. "అమ్మా .. నా ఫోన్  ఎక్కడ ?" అన్నాడబ్బాయి. "ఫోన్ మర్చి పోయినా సరే ఇంటికి వెళ్ళడానికి  వీల్లేదు " అని ఖచ్చితంగా చెప్పేసి నేను ఆ నంబర్ కి రింగ్ చేసాను . ఆ పోన్ నా బేగ్ లో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నాకు మా అబ్బాయికి మరోసారి ఈ  చాదస్తాల వాదన మొదలయ్యేది .

మా అత్తమ్మ , అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వు . అబ్బాయితో .. చెపుతున్నారు ."మీ అమ్మ ఎప్పుడూ మంచి-చెడు అంటూ ఇంతగా పట్టించుకోలేదు .. ఇప్పుడు బాగా హైరానా పడిపోయిందంటే అదంతా నీ మీద ప్రేమ వల్లనే !  .. నీకేమి ఇబ్బందులు కలగకూడదని క్షేమం చేరాలని . మీ అమ్మ ఆరాటం " అంటూ రహస్యం చెప్పేశారు . అబ్బాయి .. ప్రశాంతంగా అమ్మ భుజం పై వాలి పడుకున్నాడు . డ్రైవర్ సుబ్రహ్మణ్యం  భోజనం చేయడానికి కూడా ఆగకుండా అతను భోజనం చేయడం కూడా మానుకుని చాలా జాగ్రత్తగా కారు నడుపుతూనే నాలుగున్నర గంటల్లో మేము ప్రయాణిస్తున్న వాహనం  "ఇన్నోవా" ని   అనుకున్న సమయం కంటే  గంట  ముందు గానే "రాజీవ్ గాంధి " విమానాశ్రయంలో ఉంచాడు.

ఇక అక్కడ గంట సమయం ఉండేటప్పటికి  అప్పటి వరకు లోలోపల దాచుకున్న దిగులు బయటపడింది.  అబ్బాయి చేయి పట్టుకుని  నేను ఒకటే ఏడుపు. "అమ్మా ! అందరు ఇటే చూస్తున్నారు  చూడు ..మా అమ్మ.. కి అలా చూడటం ఇష్టం ఉండదు .. కాబట్టి  ఇప్పుడు మా అమ్మ ఏడుపు ఆపేస్తుంది .. అంటూ  నవ్వించడం ,  అక్కడి నుండి ప్రక్కకి తీసుకు వెళ్లి ..ఫొటోస్ తీద్దాం రా..  అంటూ ....  విమానాశ్రయంని  ఫొటోస్ తీయించాడు.  కాసేపటి తర్వాత మళ్ళీ నాకు దుఖం ముంచుకొస్తుంది  ... ఇంకొంచెం సేపటిలో అబ్బాయి చెక్ ఇన్ లోకి వెళితే మళ్ళీ ఎప్పుడో అబ్బాయిని చూసేది .... అని దిగులు . "నాన్నా ! నిన్ను చూడ కుండా ఈ అమ్మ ఎలారా..  బ్రతికేది ? అని  కన్నీళ్లు . "అమ్మా ! నువ్వలా ఏడిస్తే నేనలా వెళ్ళేది ? పోనీ వెళ్ళడం మానేయనా ? ఇంటికి వెళ్ళిపోదాం పద .... " అన్నాడు . "వద్దు " అని అడ్డంగా  తలూపి గట్టిగా కళ్ళు తుడుచుకున్నాను.

నవ్వి "మా అమ్మ గుడ్ " అంటూ అదిగో అక్కడ "ఆడీ" కారుంది చూసొద్దాం రా.... అంటూ తీసుకు వెళ్ళాడు ఆ కారు ని చుట్టూ తిరిగి చూపిస్తూ చాలా  బావుంది కదమ్మా ! అన్నాడు .. బావుంది కాని "మెర్సిడెస్ బెంజ్" కన్నా బాగా కాదు అన్నాను .. అలా కబుర్లు చెపుతూ ఉంటే గంట గడచిపోయింది

5 గంటలు అవుతుండగా .ఇక  లోపలికి వెళదాం  రా ..అమ్మా..!  అన్నాడు .. లోపలికి వెళుతూ ఉంటే  నిలబెట్టి ఇలా ఒక పిక్ తీసుకున్నాను


చెక్ ఇన్ అయి లగేజ్ వెయిట్ వేయించుకుని, వీసా అన్నీ చెక్ చేయించుకుని మళ్ళీ దగ్గరికి వచ్చాడు . "అమ్మా ! నువ్వసలు ఏడవ కూడదు, నువ్వ లా ఏడుస్తుంటే నాకు వెళ్ళబుద్ది కాదు " అన్నాడు . అప్పుడు నేను నవ్వు తెచ్చుకుని .. bye బంగారం అని చెప్పాను . మా నాన్న గారు , అబ్బాయి  వాళ్ళ నాన్న గారు జాగ్రత్తలు చెపుతూ ఉన్నారు . వాళ్ళ నానమ్మ .. కళ్ళ నీళ్ళతో .. జాగ్రత్త బంగారం ..  అంటూ మనుమడిని ముద్దాడారు. మా మరిది గారు .. "జాగ్రత్త చంద్రబాబు ".... లాండ్ అవగానే కాల్ చేయి ' అని చెప్పారు

లిఫ్ట్ వైపు వెళుతూ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ .. నన్ను చూసుకుంటూ .. రెడ్ కలర్ డోమ్ ఉన్న లిఫ్ట్ లోకి వెళుతూ .. అమ్మా.. వెళ్ళొస్తా!  అంటూ చూపులతో చెప్పిన చూపు .... సరిగ్గా రెండేళ్ళ క్రితం నాటిది . ఇప్పుడూ..   నా కళ్ళ ముందు  మెదలాడుతూ  ఉండగా మనసు నిండుగా నా బిడ్డని  అప్పుడు, ఇప్పుడు కూడా దీవిస్తున్నాను .." చల్లగా ఉండాలి బంగారం " అనుకుంటూ ..  మా ఇంటికి అల్లరి కృష్ణుడు .. వాడే ! తను ఇంట లేకుండా .. నేను కృష్ణాష్టమి జరుపుకోలేను ..  ఈ పండుగే కాదు అసలు ఏ పండుగ లేదు మా ఇంట.   తల్లి  ప్రేమతో .. తనతో గడిపిన సమయాలని ఇలా ముచ్చటించుకుంటూ...  కాస్త తేలిక పడతాను అంతే!..

అలా ఆరోజు ఆ ప్రయాణానికి నేను ఎంత టెన్షన్ అనుభవించానో! ఛీ.. ఇంకెప్పుడూ ఈ పంచాంగం చూడటం లాంటి సెంటిమెంట్స్ పెట్టుకోకూడదు, నేను  టెన్షన్ పడటం  మాత్రమే కాకుండా ఇంటిల్లపాది నా వలన టెన్షన్ పడ్డారు . ముఖ్యంగా .. నా బిడ్డ. తను  పైకి ప్రకటించలేదు కాని చాలా చాలా ఇబ్బంది పడ్డాడు ...అనిపించింది  నిజంగా అష్టమి పూట ప్రయాణం కష్టమా !? అనిపించింది కూడా !

మనవారి పట్ల మనకున్న ప్రేమ తో వారికి ఏ ఇబ్బంది కలగకూడదని అనుకుంటాం. అందులో తప్పులేదు కాని ఇలా పంచాగం చూసుకుని పనులు చేయడం, ప్రయాణాలు చేయడం ,జ్యోతిష్యం ,శాంతులు చేయించడం ఇవన్నీ పరిగణన లోకి తీసుకోవడం వల్ల .. కొంత మానసిక శాంతి లోపిస్తుంది. అనవసర  భయాలు ఏర్పడతాయన్నది నిజం. అన్నింటికీ ఆ సర్వేశ్వరుడే ఉన్నాడనుకుని .. ఆయనకీ నమస్కరించుకుని ఎటువంటి సంశయాలు లేకుండా బ్రతుకు గమనంలో సాగిపోవడం నేర్చుకోవాలనుకున్నాను. ఇక తర్వాత ఎప్పుడు అలాంటి విషయాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు.మనం నమ్ముతున్నామా  లేదా ? అన్నదానికన్నా మనం ఇతరులని ఇబ్బంది పెడుతున్నామేమో అన్నదాని గురించి  ఎక్కువ ఆలోచిస్తాను నేను.  ఆకోణంలోనే ఈవిషయం వ్రాసాను కూడా !

ఇక ఈ మధ్య నేను విన్న అనుభవాల గురించి .. జ్యోతిష్యం , పండితుల దోరణి గురించి కొన్ని విషయాలు చెప్పదలచాను .వ్యక్తుల బలహీనతల పై కొందరు ఎలా తమ పాండిత్యంతో అజమాయిషీ చేస్తారో అన్నది నాకు అర్ధమైనప్పుడు .. నిరసించాను . అలాంటి పాండిత్య ప్రకర్ష వల్ల  మనకున్న శాస్త్రాల్ని కూడా మనం వ్యతిరేకిస్తాం.  అలాగే మరికొందరి చేత పరిహసించబడతారన్నది కూడా చాలా  నిజం . నాకు జ్యోతిష్యం, జాతకాలు ఇటువంటి విషయాలు పై బొత్తిగా పరిజ్ఞానం లేదు . ఈ వ్రాయడం కూడా నేను సరిగా వ్రాస్తున్నానో లేదో తెలియదు కాని .. నా ఫీలింగ్స్ ని, నా అనుభవాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేసానంతే.. ! .

ఇక్కడ ఈ పోస్ట్ లో నేను ఎవరిని కించపరచలేదు . దయ చేసి తప్పుగా తీసుకోవద్దని మనవి.  ఎవరి వ్యక్తిగత అనుభవాలు వారికి ఉంటాయి కదా ! అదే దృష్టితో ఈ పోస్ట్ 

25, ఆగస్టు 2013, ఆదివారం

కొన్ని దుఃఖాలు

నిన్న ఉదయం  మా "భవ్య " ఒక వీడియో లింక్ పంపి .. ఇది చూడమ్మా ! అంది

"సరే  చూస్తాను ".. అని చెప్పాను

మళ్ళీ కాసేపటికి .. "చూస్తున్నావా ..?  లాస్ట్   వరకు  చూడు"  అని చెప్పింది .

నన్ను   ఎడ్యుకేట్  చేయడంలో  మా  పిల్లలు  ఎప్పుడూ  ముందుంటారు .  అమ్మాయి  పంపిన లింక్ లో ఉన్న వీడియోని డౌన్ లోడ్  చేసుకుని   దాదాపు గంట సేపు  నిడివి  ఉన్న ఆ వీడియో చూస్తున్నంత  సేపు  చాలా దుఃఖం వచ్చింది  ఆ వీడియో  మీరూ  చూడండి.


అసలు ఈ వీడియో చిత్రించినందుకు BBC వారిపై కోపం వచ్చింది . ఎందుకు ప్రపంచదేశాలకి మన దేశం  గురించి తక్కువది ఎక్కువగా, ఎక్కువది తక్కువగా గా చెప్పి  మన దేశం పట్ల భీతీ  కల్గిస్తారు . అని అనుకున్నాను కూడా. ఇప్పటికే మన దేశం గురించి ప్రపంచ దేశాలకి చెడ్డ సందేశాలు  వెళుతుంటే పర్యాటకులుగా  ఈ దేశాన్ని  సందర్శించడానికి  కూడా భయపడి వారి ప్రయత్నాలని విరమించుకుంటున్నారు అని వింటున్నాం. అది నిజం కూడా అని కొన్ని చోట్ల రూడీగా  చదివాను కూడా. అలాంటి మెసేజ్ వెళ్ళడానికి ఇక్కడ పరిస్థితులు కూడా  కారణం అయ్యాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు

ఇంతకీ ఈ వీడియోలో చూసింది ఏమిటంటే .... మన భారతీయ సంస్కృతీ సంప్రదాయం అని గొప్పగా చెప్పుకుంటామే .. ఆ సంప్రదాయం  ఎగతాళిగా మారిన వైనం ని మనకి దృశ్య రూపంలో చూపించింది. డిల్లీ లో జరిగిన అత్యాచారం కి దేశం  అంతా  అట్టుడికి  పోయి   నిరసన చేసిన దృశ్యాల నుండి,అమ్మాయిలని నడిబజారులో వివస్త్రని చేసి ఆడుకున్న వైనాన్ని; యాసిడ్ దాడికి బలైపోయిన అమ్మాయిని, ఆడపిల్లలు పుట్టి మగ పిల్లలు పుట్టకపోతే మొహం మాడ్చుకునే ఇంటి పెద్దలని , మగ సంతానం పుడితే  మాత్రమే వేడుకలు చేసే కుటుంబాలని,అదే ఆడపిల్లలు అయితే నడిరోడ్డు పై  వదిలేస్తే ఆ వదిలేసిన పాపలని పెంచే తల్లిని ,  కారణం ఏమిటో చెప్పకుండానే ఉరితీసుకుని మరణించిన యువతి  గురించి ఆవేదనగా చెప్పే తండ్రిని, చదువుకుని డాక్టర్  వృత్తి  లో ఉండి కూడా అధిక కట్నం కోసం బార్య  ని వేదించే భర్తలు .. ఇలా ఎన్నో వాస్తవ సంఘటనలతో కూడిన విషయాలల్తో ఈ వీడియో  ఘనత కల్గిన మన  దేశంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉందొ చెప్పింది. India A Dangerous Place to Be a Woman -ఇలా 

ఏ వార్తా పత్రిక చూసినా అత్యాచారాల వార్త లతో విరాజిల్లుతూ ఉంటుంది . చట్టం తనపని చేయడానికి న్యాయస్థానం నేర నిర్ధారణ చేసి శిక్ష ఖరారు చేయడానికి ఎంత అలసత్వం చూపుతున్నాయో చెపుతుంది ఈ జాతి మూల మూలాల్లో స్త్రీ ల పట్ల ఉన్న వ్యతిరేకతని, వివక్ష ని భ్రూణ  హత్యలని, సెక్సువల్  హెరాస్మెంట్ ని , నేరాల చిట్టా తో సహా చూపుతూ .. ఈ దేశంలో ఎందుకింత ప్రమాదకరమో ! ఆలొచించమంటూ  ప్రశ్నిస్తూ ముగుస్తుంది .

ఈ వీడియోలో చూసింది చాలా తక్కువ . ఇంతకన్నా ఎక్కువ మనం చూస్తూనే ఉన్నాం . మన్ను తిన్న పాముల్లా పడి  ఉంటున్నాం .

 ఒక అజ్ఞాత నాకొకసారి ఒక  వ్యాఖ్య వ్రాసారు . మగవాళ్ళు అందరూ చెడ్డవారు కాదు . అందరిని దూషించకండి . ఎక్కడో  వెనుకబడిన బీహారీ ప్రాంతపు యువకుడు ఏదో చేసాడని మీరు అందరిని తిడుతున్నారు . అసలు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయంటే అని ఏదో చెపుతూ నా వ్రాతల పట్ల తీవ్ర వ్యతిరేకతని తెలిపారు . ఆ అజ్ఞాత చెప్పిన దానిలో నిజం ఉండవచ్చు . కానీ ఈ దేశంలో  ఇన్ని లైంగిక వేదింపులు,  అత్యాచారాలు ,వరకట్న హత్యలు ఇవన్నీ చదువుసంధ్యలు లేని మారుమూల ప్రాంతాల వారే చేయడం లేదు కదా !  చట్టం దృష్టికి  వచ్చిన కేసుల గణాంకాలకే  ఒణుకు  పుడుతుంది. ఇంకా చట్టం దృష్టికి రాని కేసులు ఎన్ని ఉంటాయో !

స్త్రీని గౌరవించడం నేర్పని, నేర్పని ఈ దేశంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి వీటికి అడ్డు,  అదుపు లేదు కాకుల లెక్కన రోడ్డున పడి నాలుగు రోజులు కూసి  గమ్మున ఊరుకుంటాయి అనే అలసత్వం కనబడటం తప్ప. " "సహభాగినిగా సమభాగినిగా " అనే పాటలు వినడానికి బాగానే ఉంటాయి. ఆచరణలో అవి శూన్యం అని తెలుస్తున్నప్పుడు .. భయం భయంగా ఆడపిల్లల్ని బయటకి పంపుతూ చదువు అయ్యి అవగానే పెళ్లి చేసేసి విదేశానికి కాపురానికి పంపించేసి,  హమ్మయ్య .. ఇక్కడంత  భయం అక్కడ ఉండదు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోతే  నన్నెందుకు ప్రేమించవ్  అని యాసిడ్ బాటిల్స్ పట్టుకుని వెంటబడే కాలమిది. ఒంటరిగా ఆడపిల్లలు కనబడితే బ్రతకనివ్వని కాలమిది. వీళ్ళని పువ్వుల మాదిరి ఎక్కడ కాపాడ గలం ? అని భయపడుతున్న కాలమిది.

ప్రతి ఇంట్లో ఒక కూతురు ఉండాలి .అప్పుడే భాద్యత కల్గి సంస్కారంతో నడుచుకునే సోదరుడు ఉంటాడు , ఉండాలి కూడా !.

ఆడదానిగా పుట్టడం కంటే .అడవిలో మానై  పుట్టినా బాగుండేదని ఆడవాళ్ళ వెతలు ని చెప్పుకుంటూ  ఒక పోలిక చెప్పుకుంటారు. ఇప్పుడంతా అలా పోల్చడం బాగోదు అడవిలో మానై  పుడితేను మొదలంటా నరికేస్తారు. ఆడదానిగా పుట్టినా అణచి వేస్తారు, నలిపి వేస్తారు, సమూలంగా పెరికేస్తారు ఇదండీ విషయం
ఇదే విషయం పై .. ఈ లింక్ లో ఈ ఆర్టికల్ కూడా India: a Dangerous Place for Women?ఈ వీడియో చూసినప్పటి నుండి కొంత దుఃఖం  మోస్తూ ..ఉన్నాను. ఈ దుఃఖాలు  మనవి కావు కాని సమాజానివి అనుకుంటే ... ఏ రోజైనా కొన్ని దుఖాల బారిన పడే తీరతాము .

మనదేశం గురించి ఇంత  చెడ్డ  సందేశం ప్రపంచానికి  అందుతుంటే  ఏం  చేయాలో మేధో వర్గానికి తెలుసు. హృదయ సంస్కారం ఉన్నవారికి తెలుసు .

అన్నలారా ..తమ్ములారా.. బిడ్డలారా ! ఆలోచించండి ..

23, ఆగస్టు 2013, శుక్రవారం

గ్రీష్మంలో

ఆడవారు నున్నితంగా లతలా మగవాడిని అల్లుకు పోవాలనే అనుకుంటా రట... చాలా మంది చెపుతుంటారు నిజమేనేమో!
 సున్నితత్వం అవసరమే కావచ్చు మరీ ఇతరులపై ఆధారపడే అంతగా ఉండే సున్నితత్వం వల్ల... ధీర లా బ్రతకగల్గి కూడా పురుషావరణం లోకి వచ్చేసరికి వాలిపోతారు . పురుషులు "టచ్ మీ నాట్ "  లా ఉండేటప్పుడు కూడా వెంటపడి వేధింఛి కాని బందాలనేవో బలవంతంగా సొంతం చేసుకోవాలనేంత వెంపర్లాడటం చూస్తే జాలి కలుగుతుంది . అది అమాయకత్వమో తెలియదు తనని తానూ కోల్పోయెంత ప్రేమో తెలియదు . .. అలాంటి వాళ్ళే  ఈ భారతీయ సంస్కృతికి వారధులు. సంప్రదాయాన్ని తుచ తప్పక పాటించేవాళ్ళు .. అలాంటి ప్రేమభరిత నెచ్చెలిని చూసినప్పుడు నాకనిపించిన భావన ఇది .. ప్రేమ ఉద్భవం ఎదని చిగిర్చే వసంతం అయితే అది మిగిల్చే ఎడబాటు గ్రీష్మం తో పోల్చవచ్చు ..

గ్రీష్మంలో..   ఓ.గ్రీష్మ  (కాస్త కవితాత్మకం .కలపోసి )..ఆమె ఇలా అంటుంది


గ్రీష్మంలో


ఝరీ ప్రవాహంలాటి నా గమనానికి అడ్డుకట్ట వేసేసి..
నా కళ్ళల్లో నక్షత్ర కాంతులని దోచేసుకోవాలని
నా నవ్వుల పువ్వులని చిదిమేయాలని..
కంకణం కట్టుకున్నట్లు
నువ్వు గ్రీష్మంలో సూర్యుడిలా
రాచ బాటలోనే వచ్చావు
నీకు అలవాటైన ప్రయాణపు మజిలిలో
అన్నీ దోచేసుకుని హృదయాన్నిశూన్యం చేసి
చూపులని నిస్తేజం చేసి..
జీవమే లేని మోదంతో..
జీవశ్చవం లా బతకమని
నిట్టూర్పు సెగలతో కుమలమని .
నిర్దాక్షిణ్యంగా వెళ్ళాక
నేను నా చిరునామా ని..
యే చంద్రుడు నీడలో వెతుక్కోను
ఒంటరితనమనే సముద్రపు ఒడ్డున
 వేయినోక్క రాగాల విషాద ఆలాపన చేస్తున్నా
 అలవాటైన అలల హోరులో..
ఏ కాకి రొదగా ప్రపందానికి సొదగా వినిపిస్తుంది..
రోదన ఇంకిపోవడానికి అది గుండె కాదు..
మహా సముద్రం
ప్రవహించి పోవడానికి  అది నది కాదు
నాలాటి ఒంటరి ల రోదనని  వేదనని
అమ్మలా  అక్కున చేర్చుకుంటుంది.
మరో అమ్మని  నేనని గుర్తు చేస్తూ

(బిడ్డల కోసమే బ్రతికే ఆ అమ్మకి .. అంకితం )

21, ఆగస్టు 2013, బుధవారం

మనం నేర్పేదేమిటీ !?

ఈ చిత్రం చూడండి.... 

వారివురు కుశలవులు ఆమె సీతమ్మ .

శ్రీరామ చంద్రుడు అవతార పురుషుడు. మానవ రూపంలో వచ్చి  ఈ లోకానికి ఉత్తమ పురుషుడు ఎలా ఉంటాడో అని చాటి చెప్పడానికి వచ్చిన  ఆదర్శ మూర్తిగా  కీర్తిన్చుకుంటాం న్యాయానికి, ధర్మానికి, నైతిక విలువలకు ఒక ప్రతీకగా నిలిచిన ఉత్తమోత్తమ పురుషుడని మన ఇతిహాసాలు మనకి చెపుతున్నాయి

యుగాలు కాలధర్మంలో కలసిపోయినా జాతిని సన్మార్గం వైపు నడిపించడానికి ఇతిహాసాలను ఉదాహరించుకుంటూ మానవాళి ముందుకు నడుస్తుంది. నడవాలి కూడా . లేకపోతే నాశనం అయిపోతాము అని చెపుతున్నాను  
ఏమిటీ రామాయణం  చెపుతున్నాను  అనుకోకండి ...  ఆ  రోజు కొంతమంది పిల్లలకి చెపుతున్న విషయాలు నేను చిన్నప్పుడు  విన్నవే ! నేనైతే అలాగే విన్నాను మా పెద్దలు చెప్పినదానిని శ్రద్దగా విన్నాను మరి

ఇప్పటి తరం నేను చెపితే అలా వినరు . వారికి ఎన్నో సందేహాలు. వాలిని ఎందుకు చెట్టు చాటు నుండి చంపాడు , (సంపూర్ణ రామాయణం సినిమాని గుర్తుకు తెచ్చుకుంటూ  అడిగిన మాటలు ) సీతమ్మని అడవికి ఎందుకు పంపాడు . ఆమె అగ్ని పరీక్ష చేసిన తర్వాతే కదా  రాజ్యానికి వచ్చింది  ! ఒక చాకలి వాని మాట విని అడవికి పంపేశాడు . తర్వాతైనా ఆమె ఎలా ఉందొ విచారించాడా? గర్భిణీగా ఉన్న భార్యని వదిలేసి రాజ సౌధంలో కూర్చుని విలపించడం ఏమిటీ !? (బాపు శ్రీరామరాజ్యం  చూసారు లెండి )

అదే సీతమ్మ చూడు రాముడు నిర్దాక్షిణ్యంగా అడవికి పంపినా తానూ సీత నని చెప్పకుండా గోప్యంగా ఉంచి బిడ్డలని కని ఆ బిడ్డలని విధ్యాబుద్దులతో  పెంచి అయోద్యకి పంపడానికే ప్రాముఖ్యతనిచ్చింది.  .రాముడు ఉత్తమ పురుషుడు అంటావు ఏమిటీ .. కలియుగపు పెద్ద జోక్ ఇది అంటూ ఒకటే నవ్వు ...

లేదు లేదు రాముడు చాలా మంచి వాడు ఒకటే భార్య  - ఒకటే బాణం . తండ్రిమాట జవదాటలేదు. ఇంకా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి . ఆయనే మనకి ఆదర్శం కావాలి . తప్పు అలా విమర్శించకూడదు కళ్ళు పోతాయి . లెంప లేసుకొండి.. అంటూ  .. "రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ గలిగెనిందరికి" అంటూ మొదలెట్టాను . "ఆపమ్మా ఆపు .. వినలేము తల్లీ ! నీ భక్తిరస గీత మాలికలు " అంటూ ..ఎగతాళిగా దణ్ణం పెట్టేసారు

నాకు కోపం వచ్చి చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారు, చెపుతుంటే వినని వాళ్ళు చెడిపోతారు అంటూ విసుక్కుంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాను


ఇది రెండేళ్ళ క్రిందటి సంగతి . ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఈ తరం పిల్లలకి ఇలాంటి కథలు (క్షమించాలి ఇతిహాసాలు ) చెప్పి నమ్మించగలమా? అసలు రామచంద్రుడు లాంటి కొడుకులున్నారా? రామచంద్రుడు లాంటి ఏక పత్నీవ్రతుడు ఉంటున్నారా? ఇప్పుడు ఉన్నట్టే రామాయణం మన పూర్వీకుల కాలం నుండి  ఎట్ లీస్ట్ ఒక అయిదారు తరాలు ముందు నుండి అయినా  ఉంది కదా ! మరి ఆ రామాయణం ని విని చదివి కూడా  మన ఇండియన్ పురుషులు ఎందుకు మారలేదు . రాజులు ఎందుకు అన్నేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు.   మన భారతీయ  మహిళలు  సతీసహగమంలాంటి ఎన్నో దురాచారాలు ఎదుర్కున్నారు . వంట ఇంటికే పరిమితం అయ్యారు .  కన్యాశుల్కం, వరకట్నం ,లాంటి   సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పిన రామాయణం అప్పుడు ఉంది కదా ! ఆ రామాయణం ని అప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు కదా ! మరి వాళ్ళెందుకు వినలేదు ? రామునిలా ఎందుకు ఉండలేదు ? అని అడిగింది మా చెల్లిగారి అమ్మాయి  ఆ లాజిక్ కి నాకు దిమ్మ తిరిగి పోయింది (అమ్మాయి ఐఐటి స్టూడెంట్ )నేను నోటమాట రాక వింటూనే ఉన్నాను  అమ్మాయి తన మాటలు కొనసాగిస్తూ ....

అలాగే  రాముడిలాగా  భర్తలు వదిలేసిన భార్యలు ఎంతోమంది  ఉన్నారు . వాళ్ళు సీతమ్మ లాగా పిల్లలని పెంచుకుంటూనే ఉన్నారు. మరి మగవాళ్ళు రాముడిలాగా  ఉండటం ఎందుకు నేర్చుకోరు? సీతమ్మకి లాగా సహనంగా ఉండమని ఆడపిల్లల్కే ఎందుకు చెపుతారు పాపం సీతమ్మ ! ఎంత మంచి తల్లి ! ఆఖరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంది. అసలు అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్  కూడా ఉండాలి . తనకి అన్యాయం జరిగితే గళం విప్పి ప్రశ్నించాలి. అంతే కాని ఎప్పటివో పురాణాలు చెప్పి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పడం మానేయి. ఇప్పటి కాలం ఆడపిల్లలు తండ్రి చాటు బిడ్డలు, భర్త చాటు భార్యలు కాదు. పిల్లలకి తల్లిగా మాత్రమే ఉండే   రోల్ ఒక్కటే  కాదు  విద్య,. ఉద్యోగం,  వ్యాపారం, సాంస్కృతిక పర్యటనలు  చేస్తూ అన్ని దేశాలు గిర గిర తిరిగేస్తున్నారు.  భర్త రాముడిలా ఉత్తమ పురుషుడు కాకపోయినా సీతని అడవిపాలు చేసినట్లు చేసేవారు ఉన్నారు. మీరు  రామాయణంని నేర్పించాల్సింది  అమ్మాయిలకి కాదు ముందు అబ్బాయిలకి , నేర్పండి  అని చెప్పేసి .. వెళ్ళిపోయింది

అప్పటి నుండీ  ఒక ఆలోచన నా మెదడుని  తొలిచేస్తూనే  ఉంది . రామాయణం ని ఈ తరం పిల్లలకి ఎలా చెప్పాలి ? వాళ్ళ రిసీవింగ్ ఇలా ఉన్నప్పుడు ఇంకా .. అప్పుడెప్పుడో యుగాల కాలం లో జరిగింది అనుకుంటున్న,  కొన్ని శతాబ్దాల కాలం క్రిందట అక్షర రూపంలోకి వచ్చిన ఈ ఇతిహాసాలని కథలుగా మలచి ఎలా చెప్పగలం?
ఎలా ఉన్నాయో అలా  చెప్పి జాతికి మంచి మెసేజ్ వెళ్ళాలి సమాజం లో మంచి నెలకొనాలి   అంటే ఎలా కుదురుతుంది? అదసలు సాధ్యమా . .. చెప్పండి .. ? అంతకన్నా ముఖ్యంగా ఆడ-మగ మధ్య అసమానతలు, దౌర్జన్యాలు దాష్టీకాలు రాజ్యాలేలుతుంటే .. ఈ పుక్కిటి పురాణాలు శతాబ్దాలగా  విని జనం ఏం నేర్చుకున్నారు ఏమి ఆచరిస్తున్నారు అని అనుమానం వస్తుందంటారా, రాదంటారా?..

ఇంకోసారి పిల్లలకి ఇలాంటి రామాయణ, భారతాలు గురించి చెప్పే సాహసం చేయగలరా ? వాళ్ళ సందేహాలు తీర్చగలరా ? వాళ్ళ లాజిక్ కి పిచ్చేక్కిపోదు . మన అజ్ఞానం కి పెద్దరికం ముసుగేసి .. వారిని నోర్మూసుకోండి అని ఒక్క కసురు కసిరి .. అక్కడి నుండి మెల్లగా జారుకోము .

నేను అదేపని చేసాను.

మనం నేర్పెదేమిటీ.. వాళ్ళే మనకి నేర్పుతున్నారు అనుకుంటాను  కాదనగలమా !? మరి . మీరేమంటారు ???

19, ఆగస్టు 2013, సోమవారం

ఫెమినిస్ట్ !!! ???

ఒక బ్లాగర్ ఫ్రెండ్ నాతొ గంటలు తరబడి పోన్లో మాట్లాడతారు విధ్యాదికురాలు, ఉపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ కూడా చేసారు  ఆమె తో మాట్లాడితే నేను చాలా విషయాలు తెలుసుకుంటాను.  అలాగే  ఆమెకి . ఏవైనా సందేహాలు ఉంటే తెలియజేపుతాను. ఆమె నా బ్లాగ్ చదువుతారు. కానీ ఒక్క కామెంట్ కూడా ఇవ్వరు . మళ్ళీ ఆమెకి నేనే మార్గదర్శకత్వం అంటారు . నాకేంటో తికమకగా ఉంటుంది . ఒక రోజు అడిగాను "అసలు నా బ్లాగ్ చదువుతారా ? "అని ."  రోజూ చూస్తాను" అని చెప్పారు . 

సరే మీ అభిప్రాయం మీరెప్పుడు వ్రాయలేదు .. మరికొంతమంది మీ స్నేహితులు చూస్తారు అని చెప్పారు కదా ! వాళ్ళ అభిప్రాయమేమిటో తెలుసుకోవచ్చా ? అన్నాను.

వనజ వనమాలి బ్లాగ్ ఎప్పుడు మగవాళ్ళని దుయ్యబడుతూ రాస్తారు అని అన్నారు .. ఆమె పోస్ట్ లు నచ్చినా కామెంట్ చెయ్యాలంటే భయపడతాము. మనం అలాంటివి సమర్దిస్తున్నాం అని మన మగవారు అనుకునే ప్రమాదం ఉంది .. అన్నారట.

ఇది విన్న నేను గట్టిగా నవ్వేసాను. బహుశా నాతొ గంటల తరబడి మాట్లాడుతున్న ఆ ఫ్రెండ్ అభిప్రాయం కూడా అదే కావచ్చు. నాకైతే కామెంట్ ఇవ్వడం లేదనే సమస్య లేదు.  బట్ నాకైతే ఫెమినిస్ట్ అన్న ముద్ర పడిందన్నమాట. :) నాకైతే భలే నచ్చేసిందండి.  సమస్యలని గుర్తించేవారు, ప్రశ్నించేవారు, తామున్న స్థితిని తెలుసుకోమని చెప్పేవారు  ఫెమినిస్ట్ లు అన్నమాట. ఇన్నాళ్ళు నాకు ఈ మాట అర్ధం అయ్యేది కాదు.. ఇప్పుడు బాగా అర్ధం అయ్యింది. :)

సామాజిక జీవనంలో సమస్యలకి ఇతిహాసాలలోని పాత్రలని ప్రామాణికంగా తీసుకుని వారి వారి వ్యాఖ్యానాన్ని జత చేసి పాజిటివ్ గాను,నెగిటివ్ గాను లేదా పాత్రోచిత పరంగాను సాహితీ  సృజన చేసినవారు ఉన్నారు. నచ్చిన వారు చదువుతున్నారు లేనివారు విమర్శిస్తున్నారు. అందులో ఎవరి అభిరుచి వారిది. 

సాహిత్యం అంటే సమాజానికి హితం కల్గించేది. మంచికి చెడుకి తార్కాణంగా ఇతిహాసాలలో పాత్రలు ని చెప్పుకుంటూ ఉంటారు. సాంఘిక మార్పుల వల్ల ఆ పాత్రల సృజనలో వున్న లోపాలో లేదా లోటుపాటులనో.. తర్కిస్తూ అలాగే ఉండాలనుకోవడం, ఉండాలని  అతిగా ఆశించడం కూడదని చెప్పడమనేది జరుగుతుంది. అలా జరిగేది .. స్త్రీలు సృష్టిస్తున్నసాహిత్యంలో ఇంకా వివరంగా చెప్పాలంటే కొందరు అంటున్న పెమినిస్ట్ సాహిత్యంలో ఉన్నది అదే !

ఇతిహాసాలని సృశించకుండా కథలు వ్రాసేవారు ఉన్నారు. మరి వారి మాట ఏమిటి ? వారు వారి సృజనలో చెపుతున్న ఆంశాలలో నిజాలు  అసలు లేనే లేవా?  ప్రపంచంలో  లేదా మన దేశంలో స్త్రీలకి సమస్యలే లేవా? లేని సమస్యలని కల్పించి రచనలు చేస్తున్నారా ?  పురుషులని దుయ్యబట్టడమే పనిగా పెట్టుకున్నారా ? ఇలాంటి  ఆలోచన చేయడం మాని  మన సాంఘిక జీవనాన్ని అక్కడ నెలకొన్న సమస్యల్ని సహృదయత తో అర్ధం చేసుకుని అలాంటి సమస్యలు లేకుండా ఉంటె బావుంటుందని తలంచాలి కాని .. ఇతిహాసాలని స్త్రీలు మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి. సీతలు,సావిత్రులు, ద్రౌపదిలు, అనసూయలు,అహల్యలు లాగానే ఉండండి.  పురుషులు మేము అలాగే ఉంటాము. ఇంకా అంతకన్నా ఘోరంగానే రాచిరంపాన పెడతాం .. అంటూ  చెప్పకండని.. విమర్శకులకి మనవి.

 భర్త పురుషుడే! ప్రేమికుడు పురుషుడే ! వాళ్ళలో ఏమి లోపాలు ఉన్నాయో .. స్త్రీకే తెలియాలి. లేదా ఆ పురుషులకే తెలియాలి.  పురుషులందరూ ఒకే విధంగాను ఉండరు స్త్రీలందరూ ఒకే విధంగాను ఉండరు .. .  అచ్చంగా మీరు చెప్పే "ఇతిహాసాలలో " చెప్పినట్టు గానే !

స్త్రీలకి తమ  సమస్యల పై అవగాహన కల్గించే విధంగా అనేక రచనలు చేసిన   "ఓల్గా "  గారి గురించిన వ్యాసం ఒకటి ఇక్కడ ..  ఏ పత్రికలో వచ్చిందో గుర్తు లేదు .. మళ్ళీ చదువుకోవచ్చని భద్ర పరచుకున్నాను . ఇక్కడ షేర్ చేస్తున్నాను. .  చదివినవారికి .స్త్రీవాదంపై కాస్తంత అవగాహన కోసం.

******************************************************

 ఓల్గా
మృణ్మయనాదంతో కాసేపు.....
ఇప్పుడున్న ఈ ప్రపంచం ఎట్లా ఉంది అంటే- కొందరు వందల ఏళ్ళ పాటు కుట్రలు చేసి తమకు అనుకూలంగా మలుచు కున్నట్లు ఉంది. అడ్డంగా ఒక గీత గీసినట్టుగా, మెట్లు మెట్ల నిచ్చెనలా ఉంది. అలాటి ఈ గీతల, నిచ్చెన మెట్ల సమాజాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా పరిశీలించి, ఇలా ఉండటం పరమ తప్పు అని గ్రహించి సంస్కర్తలు, మేధావులు దానిని మార్చడానికి ప్రయత్నించారు. తెలుగు నేలపెై అలాంటి గ్రహింపుతో ప్రారంభమైన స్త్రీవాద సాహిత్యోద్యమం కోసం, తన జీవితంలోని అత్యంత విలువెైన సంవత్సరాలను వెచ్చించిన, ఇంకా వెచ్చిస్తున్న రచయిత్రి ఓల్గా.

‘మృణ్మయనాదం’ పన్నెండు కథల సంకలనం. స్త్రీవాదుల రచనలు అనగానే ‘ఫెమినిస్టు పాఠాలు చెప్పే పాత్రలు’ అనే అపప్రథ ఉందని అంటారు విమర్శకులు. అందుకు సమాధానమా అన్నట్లు ఓల్గా ‘అసలు నేను కథల కోసం కథలు రాసే రచయిత్రిని కాదు. స్త్రీ వాద రాజకీయ చెైతన్యాన్ని సాహిత్యం రూపంలో అందించడానికి కథారచనను ఒక మార్గంగా ఎంచుకున్నాను’ అంటారు. ఓల్గా రచనల పెై వచ్చిన ఈ తరహా విమర్శలకు ఇది చాలా స్పష్టమైన సమాధానం.ఓల్గా రచనలలో స్త్రీలు రచయిత్రి చేయిదాటి నడవరు. కథ కానీ పాత్రలు కానీ యథేచ్ఛగా సంచరించవు. రచయిత్రి ఎంపిక చేసుకున్న సిద్ధాంతాన్ని అనుసరించి ఆవిడ చెప్పిన మార్గంలోనే ప్రయాణం చేస్తాయి. అందుకే ఓల్గా రచనలు పరిశీలించేటప్పుడు అందులోని శెైలి- శిల్పాలు ఏమిటి, ఆ పాత్రలు సహజత్వానికి ఎంత దగ్గరగా వచ్చాయి, ఎంత దూరంగా నడుస్తున్నాయి అని చర్చ చేయడం అర్ధ రహితం.

Volgaఆవిడ రచనలు స్త్రీ చెైతన్యానికి చేసిన దోహదం ఎటువంటిది అనే దృక్పథం నుండి మాత్రమే చూడాలి.మృణ్మయ నాదంలో ధన యవ్వనం, సారీ జాఫర్‌, నిర్వాసం, రోషనార, 1971లో రాసిన జెైలు గది ఆత్మకథ తప్పించి మిగిలిన ఏడు కథలూ, ఓల్గా మాటల్లోనే చెప్పాలంటే- ‘స్త్రీల శరీరాల చుట్టూ, స్త్రీలకు తోటి స్త్రీలతో, సమాజంతో, తమ పురుషులతో ఉండే సంబంధాల చుట్టూ అల్లిన భావజాలానికి సంబంధించిన కథలు’. ఓల్గా ప్రతి రచన స్త్రీవాదానికి సంబంధించినంతవరకు ఒక అధీకృత రచనే. ఈ మృణ్మయ నాదం కూడా అట్లాంటిదే.‘సమాగమం’ ఈ సంకలనంలోని మొదటి కథ. తరతరాల నుంచి పురుషుల పగలు ప్రతీకారాలు తీర్చుకోడానికే స్త్రీలుండేది అని చెప్పే కథ. సీత కథ, శూర్పణఖ కథ. ధర్మపత్ని- రాజ్యపాలనల మధ్య రాజరికాన్నే ఎంపిక చేసుకుని రాముడు సీతను విడిచిపెట్టిన తరువాతి కథ. అరణ్యంలో ఉన్న సీతకు ఒకానొక సందర్భంలో శూర్పణఖని కలిసే అవకాశం వస్తుంది.

వారిద్దరి మధ్య జరిగిన పరిణత సంభాషణే ‘సమాగమం’. కథ పూర్తిగా ఓల్గా కల్పనే అయినా అసహజంగా అనిపించదు. కథంతా చదివేసిన తర్వాత- అవును సీత శూర్పణఖ ఇద్దరూ నివసిస్తున్నది అడవిలోనే అయినప్పుడు వారి సమాగమం ఎందుకు జరిగి ఉండదు? చరిత్ర దానిని లిఖించి ఉండకపోవచ్చు, కానీ అది సంభవమే అనిపిస్తుంది. ఇద్దరూ పురుషుడి దౌష్ట్యానికి బలెైన వారే. విషయం పట్ల ఇద్దరికీ అనుభవ సృష్టత ఉంది. అందుకే వారిద్దరి స్పష్ట సంభాషణ కథను పండించింది. ‘సాఫల్యానికి అర్థం పురుషుని సాహచర్యంలో లేదని గ్రహించాను’ అని శూర్పణఖ అన్నా, ‘శూర్పణఖను రాముడు అవమానిస్తే రావణుడు తన నపహరించి రాముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. పురుషుల పగలు, ప్రతీకారాలు తీర్చుకోవటానికేనా స్త్రీలున్నది’ అని సీత అనుకున్నా పురుషుల పట్ల ఆ ఇరువురికి ఏర్పడ్డ స్పష్టమైన అభిప్రాయాలు, ఆ అభిప్రాయాలని ఏర్పరిచిన అనుభవాలే కారణం.

పురాణాలు, చరిత్ర ఏదెైనా సరే లిఖితమైన ప్రతి పదానికీ మధ్య ఇంకేదో ఉంటుంది. అది అస్పష్టం కావచ్చు, కావాలని తొక్కిపెట్టిందే కావచ్చు. వాక్యాల నడుమన జాతులు, కులాలు, స్త్రీలు నలిగిపోయారు. స్త్రీల విషయంలో ఈ అనావిష్కృతాలను ఆవిష్కరించే పని తలపెట్టిన ఓల్గా ఆ పనిలో సఫలీకృతం అయ్యారు. అందుకు ఉదాహరణే సమాగమం, మృణ్మయ నాదం కథలు.

మృణ్మయ నాదంలో నాయిక అహల్య. మొదటిసారి అహల్య గురించి రాముడి ద్వారానే వింటుంది సీత. అప్పటినుండే సీతకి వంచిత అహల్యను చూడాలని ఆసక్తి. ఆ కోరిక ఒక సందర్భంలో తీరుతుంది. మనిషి తన వయసులోని ఒక్కో దశను దాటే క్రమంలో అనుభవంతో సంపన్నమవుతారు. అనుభవాలు ఒక్కోసారి దృష్టి కోణాలను మార్చుతాయి. మొదటి సారి అహల్యను చూసినప్పుడు సీత ముగ్ధ. అందుకే అహల్య మాటలు ఆమెకు అర్థం కాలేదు. రెండవసారి అహల్యను కలవాల్సి వచ్చినప్పుడు సీత త్యజిత. అప్పుడు అహల్య మాటలు విరబూసిన పువ్వులా సీతకి స్పష్ట పడ్డాయి. సీత- అహల్య మార్గదర్శకత్వాన్ని కోరుకున్నది. ఆ మార్గంలో పయనించి ‘తన లోపల తన మీద తనకున్న అధికార శక్తి’ని మొదటిసారి సంపూర్ణంగా అనుభవించగలిగింది.

సీత వ్యక్తిత్వం, చరిత్ర ఆసక్తికరమైనవి. స్త్రీల జీవితానికి ఒక చిరనమూనా సీత. ఆ నమూనాని స్త్రీవాదంలోకి తీసుకొచ్చి స్త్రీ వాదాన్ని సాధారణ స్త్రీల వద్దకి కూడా తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు ఓల్గా. ఈ ప్రయత్నం ప్రశంసనీయం.సంకలనంలోని మరో కథ ‘నిర్ణయం’. స్త్రీ మాతృత్వం పెైన స్త్రీకి హక్కు లేదు. అసలు స్త్రీ జీవితం పెైనే స్త్రీకి హక్కు లేదు. పుట్టబోయే ముందు ఆమె పుట్టుకా నియంత్రితమే. పుట్టిన తర్వాత బతికినంత కాలం స్త్రీ జీవించేది నియంతల మధ్యనే. ‘నిర్ణయం’ కథలో తన శరీరం పెైన తనకే నిర్ణయాధికారం లేని ఒక ఉద్యోగిని కథ చెప్పారు ఓల్గా. కమల భర్తకి తన భార్య గర్భంలో ఉన్నది స్త్రీ శిశువు అని తెలిసిన తర్వాత, రెండవసారి కూడా కూతురేనా అని అబార్షన్‌ చేయించుకోమంటాడు. అనేక మంది నేటి ఆధునిక స్త్రీల లాగే ఆర్థికంగా స్వతంత్రురాలయినా కమలది భర్త మాట జవదాటలేని స్థితి. ఆమె పనిచేసే హాస్పిటల్లో డాక్టరమ్మ శెైలజ ఇటువంటి పనులను సుతరామూ అంగీకరించని వ్యక్తి. అటువంటి ఆవిడతో అబార్షన్‌ చెయ్యమని ఎలా చెప్పాలో తోచదు కమలకి.

అనుకున్నట్లుగానే ఆవిడ కమలను నిందిస్తుంది. ఇక్కడ శెైలజ తాను చాలా అభ్యుదయంగా ఉన్నాను కాబట్టి పరిస్థితులతో సంబంధం లేకుండా అందరూ తనలాగే అభ్యుదయంగా ఉండాలనుకునే రొడ్డ కొట్టుడు తరహా ఆధునిక అభ్యుదయ స్త్రీలకు ప్రతినిధి. ‘అందుకే నువ్వు అబార్షన్‌ చేయిన్చుకోదల్చుకుంటే లెక్క చూసుకుని నీ జీతం నువ్వు తీసుకెళ్ళిపో, మళ్లీ రావొద్దు’ అనేస్తుంది. చివరికి ప్రమాద వశాత్తు కమలకి గర్భం పోతుంది. తన కసలు ఒక్క బిడ్డే చాలు అని ఆపరేషన్‌ చేయమంటుంది డాక్టర్ని. ‘నా నిర్ణయం మీకు నచ్చకపోతే ఉద్యోగం మానేస్తాను’ అని డాక్టర్‌కి ప్రకటిస్తుంది. ఇపుడు కమలకి భర్తను కూడా విడిచిపెట్టే తెగువ వచ్చిందని రచయిత్రి సూచనగా చెబుతుంది. కమల ఆర్ధికంగానే కాదు, ఇప్పుడు మానసికంగా కూడా స్వతంత్రం.

మారుతున్న కాలంలో స్త్రీ పురుషుల మధ్యనున్న అస్పష్టమైన విభజన రేఖ మసక బడుతూ వస్తోంది. స్త్రీకి పురుషుడికి మధ్య ఉండే ప్రేమ లేదా పెళ్లి సంబంధాలే కాకుండా స్నేహాలు కూడా మొదలయ్యాయి. అయితే కొన్నిసార్లు ఈ స్నేహాలు స్నేహేతర మలుపు తీసుకోవడం కూడా ఉంటుంది. అంతవరకు ప్రాణ స్నేహితుడు అనుకున్న వ్యక్తి స్నేహానికి మించి తననించి ఏదో కోరుకుంటున్నాడని తెలిసినప్పుడు ఆ స్త్రీ అనుభవించిన మానసిక ఘర్షణను సమర్ధవంతంగా అక్షరాలలో పెట్టగలిగారు ఓల్గా. అతి దగ్గరగా పురుష స్నేహాన్ని అనుభవిస్తున్న ఆధునిక స్త్రీల అనుభవం ఇది. ఒక మంచి ఆధునిక కాలపు కథ ‘స్పర్శ’.
పురుషాధిక్య సమాజం స్త్రీని తనకు అనుగుణంగా మలుచుకున్నది. స్త్రీని ఆమెకే తెలీకుండా నేరస్థురాలిని చేసి నిలబెడుతుంది. ‘అత్తిల్లు’ కథ అందుకు సంబంధించినదే. కుటుంబ వ్యవస్థ స్త్రీల పాలిటి ఒక విషపు వల. ఆ వలలో ‘రెండు వేళ్ళ మధ్య తూనీగలాటి’ ఒక అత్త ‘గుబురుగా ఎదిగిన తులసి మొక్కలాంటి’ కోడల్ని చంపేసిందనే నేరంపెై అరెస్టై జెైలు పాలవుతుంది.

ఈ కథలో తండ్రీ కొడుకుల క్రూరత్వం అతి స్పష్టంగా కనపడుతుంది. బయటి ప్రపంచంలో అలా స్పష్టంగా కనిపించదు కానీ విషయం మాత్రం అదే.‘పట్ట పగటి చీకటి’ కథలో విశాల పేదింటి పిల్ల. అవసరాలు ఆమెను నగరంలోని చిన్న ఉద్యోగంలో చేరేట్టు చేస్తాయి. అక్కడ సులభంగా వచ్చే డబ్బు ఎర చూపించే ప్రలోభాలు ఎన్నెన్నో. విశాల చాలా వరకు ఎదురు నిలబడి పోరాడుతుంది. చివరికి కుటుంబ పరిస్థితి ఆమెను ఆ విషవలయం వెైపు నిర్దాక్షిణ్యంగా నెడుతుంది. సమాజంలో విశాల లాంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. వారి జీవితాన్ని మన ముందు శ్రద్ధగా పరిచారు ఓల్గా.మిగిలిన కథలు సూటిగా స్త్రీవాదాన్ని చర్చించవు. ఓల్గా స్త్రీవాద కథలు మాత్రమే రాయలేదు, సమాజంలోని ఇంకా ఇతర కోణాలను కూడా స్పృశించారని చెప్పడానికి ఇవి ఉదాహరణలు.‘ధనయవ్వనం’లో ఈ కాలపు యువత డబ్బు చుట్టూ ఎలా పరిభ్రమిస్తుందో చెప్తే,

‘వెలుగులోని చీకటి’ మారుతున్న సమాజంతో పాటు మారుతున్న విలువల్ని చెబుతుంది. ‘సారీ జాఫర్‌’ హిందూ ముస్లిం మతాల మధ్య మొలకెత్తిన ఘర్షణ గురించి. గతకాలం ఇరు మతాల వారి మధ్య ఉండిన స్నేహ నేపథ్యం నుండి చర్చిస్తుంది. కథ పరమార్థం ఇది అని చెప్పకున్నా పాఠకుడిలో ఆలోచనలు రేకెత్తించే కథ ఇది.‘నిర్వాసం’ భూ నిర్వాసితుల వెతలను రెండు వేణువుల చేత పలికించిన కథెైతే, రోషనారా రెండు దేశాల మధ్య నెలకొని ఉన్న కలహం ఒక విద్యావంతురాలి మనస్సులో ఎలాటి గోడలను కట్టిందో చెప్పే కథ. చివరి కథ జెైలుగది ఆత్మకథ. ఇది ఓల్గా మాటల్లో చెప్పాలంటే ఆమె యవ్వనారంభ సహచరి సామ్యవాదం. ప్రపంచంలోని బాధలన్నిటికీ పరిష్కారమని నమ్మిన సామ్యవాదం గురించి రాసిన కథ. బహుశా ఇది పత్రికలో ప్రచురితమైన ఆమె తొలికథ కావచ్చు.

సామ్యవాదాన్ని నమ్మి నెత్తి మీద పెట్టుకుని తిరిగి, ఆశ నిరాశ అయిన తర్వాత విడివడి తమలో తాము అనుకుని ఏకమైన అస్తిత్వవాద ఉద్యమాలు దళిత, స్త్రీవాద ఉద్యమాలు. మహిళలో అస్తిత్వ చెైతన్యం మొదలవగానే అనేకమంది తీవ్రస్థాయిలో గొంతెత్తారు. అట్లా స్త్రీల నుండి విరివిగా రచనలు వెలువడ్డాయి. అయితే మిగిలిన అస్తిత్వ వాదుల లాగే స్త్రీ వాదంలోనూ వస్తువుదే పెైచేయి అయి శెైలి, శిల్పాలు వెనకబడ్డాయి. ఓల్గా రచనలకి ఈ విషయంలో సంపూర్ణంగా మినహాయింపు ఇవ్వచ్చు. శెైలి, శిల్పం, సిద్ధాంతం వంటి అన్నింటినీ ఏకతాట బిగించి సంధించిన బాణాలు ఆమె రచనలు.ఆంధ్రదేశంలో అంతో ఇంతో చదువుకున్న స్త్రీలలో చెైతన్యానికి, మార్పుకు, ప్రశ్నించే ధోరణి పెరగడానికి స్త్రీవాదం ఎనలేని కృషి చేసింది అనుకుంటే, ఆ స్త్రీవాదానికి మూల స్థంభం ఓల్గా!

    ఈ వ్యాస రచయిత : డా:సామాన్య (ఓల్గా రచనల పై పరిశోధన చేస్తూ అందులో భాగంగా ఈ వ్యాసాన్ని పత్రికలకి అందించారు.) "సూర్య" పత్రిక సౌజన్యంతో .. ఈ వ్యాసం 

15, ఆగస్టు 2013, గురువారం

రహస్య స్నేహితుడు

ప్రతి రోజు ... ఉదయాన్నే  ఓ  స్నేహితుడు నన్ను తన  చిరునవ్వుతో  పలకరిస్తాడు .   ఆ నవ్వు చూస్తే మురళీ మోహనుడు ఇంత మోహనంగా నవ్వి ఉంటాడా ? అని అనిపిస్తుంది. పెద్దగా నవ్వడం రాని నాకు...నవ్వడం నేర్పి వెళతాడు . ఎంత మంచివాడో కదా !

అలాగే సాయం సమయమప్పుడు వచ్చి గేటు  ముందు నిలబడి నేను కనబడే దాక వేచి ఉండి  మరీ నన్ను తన చిరునవ్వుతో పరామర్శించి వెళుతుంటాడు. దాదాపు అలా ఒక ఆరేడు నెలలుగా జరుగుతుంది

కనీసం ఆ స్నేహితుడిని నేను పలకరించను కూడా పలకరించను. తన పేరేమిటో,ఊరేమిటో కూడా తెలియదు. మా మధ్య ఏదో గత జన్మల బంధం ఉన్నట్టు నేను తనకి కనబడకపోతే అలాగే మా గేటు బయటే నిలబడి ఉంటాడు. కావాలని  నేను బయట కనబడకుండా అతనిని  పరీక్షించడానికి ఇంటిలోపలనే ఉండి కిటికీకి అమర్చిన పరదాల మధ్య నుండి చూస్తూ ఉంటాను . నేను కనబడేదాకా,  అతని చిరునవ్వు అంటువ్యాధిని  నాకు అంటించే దాకా అతను అక్కడినుండి కదలడని తెలిసాక . అయ్యో ! అతనిని అలా మా గేటు ముందు పడిగాపులు కాయించ కూడదు అని జాలి తలచి బయటకి వస్తాను. నన్ను చూడగానే మాములుగా నవ్వే నవ్వుకన్నా ఇంకా మోహనంగా నవ్వుతాడు, వెంటనే తుర్రు మంటాడు

ఉదయాన్నే అయితే నేను కనబడకపోతే ఏం చేస్తాడో  తెలుసా ? నేను వాకిట్లో పెట్టిన ముగ్గుని తదేకంగా చూస్తూ ఉంటాడు. నేను కనబడ్డాక  వెంటనే  వెళ్ళిపోతాడు

నాకైతే కొత్తలో చాలా చిత్రంగా అనిపించేది. రోజు ముగ్గు చూసి అది వేసిన నన్ను చూస్తాడు అనుకునే దాన్ని. అలా అని అతను  వాకిట్లో  ముగ్గులు వేయని మతానికి  చెందిన వాడిలా తోచలేదు. చెవికి పోగు కుట్టించుకుని హిందువుల  కుటుంబంలో పుట్టినతనిలా ఉన్నాడు. సరే జడ వేసుకోని నా రూపం వింతగా తోచేమో  అలా చూస్తున్నాడనుకునేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్ది  ఇవేమీ కాదని నాకు అర్ధమై పోయింది.

ఈ రహస్య స్నేహితుడు ఏ జన్మలో నాకు స్నేహితుడబ్బా !? అనుకుంటూ గత జన్మ జ్ఞాపకాలలోకి వెళ్లి అతన్ని కనుక్కోవాలని అన్వేషణ మొదలెడతాను. ఊహు .. అది నీ వల్ల  కాదన్నట్లు అతని మనోహరమైన  ..ఓ .అల్లరి నవ్వు నన్ను తాకి వెళ్ళినట్లు ఉంటుంది. అతను  నాతో పలకపోవచ్చు కానీ  అతనిని ఛాయా చిత్రంలో బందిస్తుంటే మాత్రం వద్దని అనలేదు, అందుకే ఇలా బంధించి  అతనిని మీకు పరిచయం చేయాలని ఇలా వచ్చేసాను మీకు చూపాలని తెచ్చేశాను.

ఇదిగో .. ఇతడే ..నా గతజన్మల రహస్య స్నేహితుడు ...


నిన్న ఉదయం  వాకిట్లో ముగ్గు వేసుకుంటుంటే ఇలా దర్శనమిచ్చాడు. ఎంతటి గడుసువాడంటే  వెళ్ళేటప్పుడు అన్న రిక్షా తొక్కుతుంటే దర్జాగా కూర్చుని వెళతాడు. తిరిగి వచ్చేటప్పుడు అన్నని ఆ రిక్షా పై చెయ్యి కూడా వేయినివ్వడు. ఎంత కాన్పిడేన్సో ! 

ఈ రోజు ఇలా నన్ను పలకరించి నేను ఎంత పెద్దాడిని అయిపోయానో అని చెప్పీసి వెళ్ళిపోయాడు. నేను ఫోటో తీసుకుంటుంటే ... ఒకటే నవ్వుకుంటున్నాడు. 
చెప్తా ..చెప్తా .రేపటి  నుండి నేను దొంగాట మొదలెడతా ... అసలు కనబడను.  :) ఎందుకంటే ఈ ఫోటో చూస్తే ... నేను అప్రయత్నంగా చిరునవ్వులు చిందిస్తాను.

అనుబంధాల అల్లిక అంటే ఇదేనేమో ! జవం,జీవం ఉన్నప్పుడు అందరూ మనవాళ్ళేనని  నాకనిపిస్తూ ఉంటుంది.  ఎన్నాళ్ళొ  చెప్పలేను, కాని  ఇప్పుడు నా రోజును ఆహ్లాద భరితంగా చేసే ఈ గతజన్మల రహస్య స్నేహితుడికి .... 

సలాం -ఎ -ఇష్క్ మేరి జాన్ ... కన్నయ్యా .. !


13, ఆగస్టు 2013, మంగళవారం

మాతృ హృదయం

‘మాతృ హృదయం’

అమ్మూ!  అమ్మూ! లెగు, లేచి బయటకి వస్తన్నావా లేదా  అరిచింది రమణ

అంతలో ఉల్లిపాయలు రిక్షా వచ్చింది   ఉల్లిపాయలు ఇద్దువు గాని ఉండన్నా అని చెప్పి  ఇంటెనక్కి ఎల్లింది పనిచేసే వాళ్ళిల్ల  నుండి పోగేసుకొచ్చిన పాత ఇనుము,అట్టపెట్టెలు, పగిలిపోయిన ప్లాస్టిక్ సామాను అన్నీ కలిపి ఒక గోనె  సంచిలో వేసి వుంచినవాటిని    గోనె సంచితో సహా వుల్లిపాయలబ్బాయికిచ్చి వుల్లిపాయలు తీసుకుంది

"మరీ నాలుగే ఇచ్చావేమన్నా ! ఇంక నాలుగియ్యి. పిల్లలకి రోజు పొద్దుట పూట కూరోండి కేరేజీ కట్టాలి "అంది .
"నువ్వెందుకు కేరేజీ కట్టడం? మజ్జానం బళ్ళో పిల్లకాయలకి కూడేడతారు కదా!" అడిగాడు ఆరాగా అతను

"బడికెళ్ళడం  మొదలై పది రోజులయిందో లేదో పిల్లకాయలిద్దరికి జొరం ముంచుకొచ్చింది. ఆడ పెట్టె అన్నం తిని పిల్లలకి వాంతులు, విరోచనాలు పట్టుకున్నాయి. ఆళ్ళని హాస్పటల్కి తీసుకెల్లలేక మందులు కొనలేక చచ్చాననుకో. పేపర్లో కూడా పడతనయ్యి. బళ్ళో పెట్టె బోయనాలు తిని పిల్లలు చచ్చిపోతున్నారంట. ఇంటినెకాల చిట్టిమ్మామ్మ పేపర్ తెచ్చి నా ముందు కూకుని చదివి ఇనిపిచ్చింది "ఒసే  రమణా! పిల్లలకి ఎట్టోగట్టా వండిపెట్టి కేరేజి కట్టవే! ఆ కూళ్ళు తిని పేణం మీదకి తెచ్చుకుంటారు" అంది.

"పలకరిస్తే భారతం చెపుతావ్ కదమ్మే! అంటూ మరో నాలుగు వుల్లిపాయలిచ్చాడు. అయి చాలవన్నట్టు మరో రెండుల్లిపాయలు తీసుకుంది రమణ  "ఇట్టా ఇచ్చుకుంటూ పొతే నేనుకూడా నా రిచ్చాబండిని  పాత సామానాడికి తూకం లెక్కన అమ్మి తువ్వాలేసుకోవాల్సిందే".. అంటూ ఇసుక్కున్నాడతను.

"అబ్బో ఈ మాత్రం దానికే అట్టాగ అయిపోతే యేళ్ళ తరబడి  యిక్కడెట్ట వుంటావు! సంపాయించిన యిల్లు సంగతేంటో" అని దీర్ఘం తీస్తూ యింట్లోకి వచ్చి

చేతిలో వుల్లిపాయల సంచీని అక్కడేసి యింకా  మొద్దు నిద్దర పోతున్న అమ్ము ని గట్టిగా ఒక్కటి చరుస్తూ " ఎన్ని సార్లు లేపినా లేగవకుండా దున్నపోతులా పడి నిదరపోతున్నావ్ కదే! ఎనిమిది గంటలయ్యింది. మీకెప్పుడు జడలెయ్యాలి, అన్నం తినిపిచ్చి స్కూల్ కాడ వొదిలి మళ్ళీ పనికెప్పుడు పోవాలి"అంటూ అరిచింది.
ఆ దెబ్బతో అమ్ము లేచొచ్చి మళ్ళీ వరండాలో ఓ.మూల కూర్చుంది .

అయిదేళ్ళచిన్న కూతురుని  శృతీ ..  శృతి లెగవరా తల్లీ ! ఈ రోజు బడికి వెళ్ళాలి అంటూ బలవంతంగా లేపి ముద్దులాడుకుంటూ బయటకి వస్తూ వరండాలో కూర్చున అమ్ముని చూసి  "ఏంటి ఇయ్యాల కూడా బడికెల్లవా? "అడిగింది కోపంగా .

అమ్ము తల అడ్డంగా తిప్పింది . నీకేం మాయరోగం వచ్చిందే ! నాకు పట్టిన గతే నీకు పట్టకూడదని పనిలో కూడా పెట్టకుండా బడికి పంపుతొన్నా, నీ అయ్యా యేమన్నా సంపాయించి నీకు యేలకి యేలు యిచ్చి పెళ్ళిచేత్తాడు అనుకుంటున్నావా? ఆరవ తరగతికి వచ్చావు యెట్టోగట్టా యింకో నాలుగు కాసులు చదివితే యేదో  వొక ఉజ్జోగం వస్తందని అంగన్వాడి టీచర్ చెప్పింది. నువ్వేమో మూడు మూడు రోజులకి బడి యెగ్గొట్టి తిరుగుతున్నావ్ నిన్ను యిట్టా కాదు  వొంచాల్సింది  అంటూ వొంగి  జుట్టుపట్టుకుని కొట్టబోయింది. చంకలో చిన్నది ఉండటం మూలంగా ఈలు కుదర్లా. ఈలోపులో అమ్ము లేచి వీధి లోకి పరుగులు తీసింది . "అమ్ము ! మరియాదగా ఇంటోకొచ్చి  తొందరగా బయలెల్లి బడికెల్లు " అంది రమణ

"అమ్మా! నేను బడికి పోను" అంది .  ఎందుకనెల్లవే! పాఠాలు అర్ధమగడం లేదా ? నేను వచ్చి అయ్యోరమ్మకి చెప్పేసి వస్తా. నిన్ను కొట్టదు, యే౦ చేయదు.. మమ్మవిగా బడికెల్లవే.. నీకు దణ్ణం పెడతాను "కూతుర్ని  బతిమలాడింది.

 "నేనెల్లనంటే యెల్లను నువ్వు పనికి పో ! చెల్లిని పెట్టుకుని నేనింట్లో ఉంటా"  మొండిగా చెప్పింది
 " ఇయ్యాల నిన్ను యిరగదీసయినా సరే బడికి తీసుకుపోతా"అంటూ అమ్ము వెనకాల పడింది రమణ . ఆ పిల్ల అందకుండా రోడ్డు మీదకి  పరుగు తీసింది .  అరగంట దాటినా దాన్ని పట్టుకోవడం రమణ వల్ల కాలేదు. పనికి ఆలస్యమైపోతుంది, తొందరగా యెల్లకపోతే వుండ రెండిళ్ళు కూడా పోతాయి అనుకుంటూ  చిన్నదాన్ని చంకనేసుకుని యింటికి తాళం పెట్టి గబా గబా పని చేస్తున్న యింటికి వచ్చింది

"ఏంటి రమణా ! నువ్వు వచ్చేదెప్పుడు యిల్లు చిమ్మి తుడిచేదేప్పుడు ? నేను పూజ చేసుకునేదేప్పుడు ? రోజు రోజు కి నువ్వొచ్చే టైం మారిపోతుంది. ఇలా అయితే నిన్ను మానిపించాల్సి వస్తుంది"  గట్టిగా కోప్పడింది హేమ .

"అమ్మా ! మీరు కూడా అట్టంటే యెట్టాగమ్మా! ఇప్పుడుదాకా దానితో యేగి యేగి యిదిగో దీనిని చంకనేసుకుని వచ్చా " అని వరండాలో నిలబెట్టిన చిన్న దాన్ని చూపెట్టింది .

"ఇవాళ కూడా అమ్ము బడికి వెళ్ళ లేదా ! " ఆరాగా, కోపంగా అడిగింది ఆమె.

"లేదమ్మా ! రోడ్లమ్మట పరిగెత్తుతుంది. దాన్ని పట్టుకోడం నావల్ల  అయ్యే పని కాదు. ఆ బాడుకోవ్ ముండని పెంచడం నావల్లకాదు. దాని అయ్యకాడికి పంపిచ్చేత్తాను" అంది ముక్కు చీదుతూ బాధగా.

"కోపమొచ్చినప్పుడల్ల్లా  నువ్వలా అనడం దానికి తేలికయిపోయింది. అది చెప్పా పెట్టకుండా  వాళ్ళ నాన్న దగ్గరికి వెళుతుంది. రెండురోజులు అక్కడుంటే నీకు దిగులు  అదెక్కడ  అక్కడే ఉండిపోద్దోఅని  రమ్మని ఫోన్ చేస్తావ్ !
 అది  నీఅలుసు కనిపెట్టి బడి యెగ్గొట్టి తిరగడం మొదలెట్టింది . పన్నెండేళ్ళ పిల్ల అలా రోడ్లెంమ్మట తిరగడం ఏమిటే ?  మొన్న అర్ధరాత్రి పూట పన్నెండింటికి బాంక్ దగ్గర రోడ్డు ప్రక్కనే వేసిఉన్న బెంచీ మీద కూర్చుని ఉందంట.  మీ సార్ గారు చెప్పారు"

అవునమ్మా ! ఆరోజు తిట్టానని అలిగెల్లి అక్కడ కూకుంది యెంత  బతిమలాడినా రాలేదు. అప్పుడు మా చెల్లెల్లి  తీసుకొచ్చింది "

"ఏమన్నా అనుకో రమణా ! నీకసలు వివరం లేదే! పిల్లలని అంతగా తిట్టడం యెందుకు ? నిదానంగా అర్ధం అయ్యేదాకా చెప్పుకోవాలి. మొగుడు పెళ్ళాం విడిపోతే పిల్లలు యిలాగే తయారవుతారు, పద్దాక నువ్వు మీ అయ్యదగ్గర కెళ్ళు అనబట్టేగా ఆదట్టా.. తయారయింది. మన కోపాలు, మన బాధలు పిల్లలు మీద చూపెట్ట కూడదే!
అన్నీ దిగమింగుకుని పిల్లలని పెంచాలి.పిల్లలని పెంచడం అంటే మాటలనుకున్నావా? వాళ్ళని కన్నంత తేలిక కాదు"

"అవునమ్మా ! ఆ సంగతి అప్పుడు తెలియాలా, అందరొద్దన్నా నా పిల్లలు నాకే కావాలని తెచుకున్నా. ఇయ్యాల యేకు మేకైనట్టు తయారయింది.  మొన్న అప్పు జేసి మూడొందల రూపాయలు పెట్టి నోట్స్ పుస్తకాలు కొనిచ్చా, ఆ అప్పు ఇంకా తీరనే లేదు . రెండు రోజులు పని మానుకుని మీటింగ్ కి ఎల్లా ! బడికి నాగా పెట్టకుండా ఎల్లినాల్లకి డబ్బులు ఇస్తారని చెప్పారు. చక్కగా సదువుకోమ్మా అని బతిమలాడి చెపుతున్నాయినడంలేదు నేనేం  జేయాలి? "

 రమణ ఆక్రోశం చూసి బాధ కల్గింది హేమకి "తీసుకెళ్ళి హాస్టల్లో  పడేయి, బయటకి రాకుండా అందులో పడి ఉంటుంది "

 అమ్ము మీద హేమకి  చాలా కోపం ఉంది . అది వాళ్ళ మ్మ మాట వినదు.  తెలివికలదే కాని చదువు మీద శ్రద్ద లేదు బడి యెగ్గొట్టి ఆటలాడటం, ప్రక్క యిళ్ళకి వెళ్లి టీవి చూట్టానికి  అలవాటు పడిపోయింది.
రమణ ఆ పిల్లని ఒక్క దెబ్బ కూడా కొట్టదు కాని నోటికివచ్చినట్టు తిడుతుంది. అలా తిట్ట కూడదే! మంచిగా చెపితే వినకపోతే గట్టిగా నాలుగు వడ్డించు. ఆ  భయం ఉండాలి .. అంటుంది

"ఏమోనమ్మా ! నేను దాన్ని కొట్టలేను బిడ్డలని కొట్టడానికి నాకు పేణం ఒప్పదు "అంటుంది. ప్రేమగా . ఆ రోజంతా చిన్న దానినేసుకునే యిళ్ళల్లో పనులు చేసుకుంది . సాయంత్రం ఇంటికెల్లాక చూసింది  అమ్ము ఇంటికి రాలేదు .. రాత్రి అయింది అయినా అమ్ము ఇంటికి రాలేదు, రోజూ అమ్ముఎక్కడెక్కడతిరుగుతుందో అక్కడక్కడికివెళ్లి వెదికింది

అమ్ము కనబడలేదు . ప్రక్కన ఊరిలో వున్న వాళ్ళ నాన్న దగ్గరికి యెల్లిందేమో అన్న ఆలోచన చేసింది.  అమ్ము తండ్రికి ఫోన్  చేసి కనుక్కోవడం ఆమెకి  ఇష్టం లేక పోయింది .. ఇంకాసేపు చూసింది.  ఇక ఉండబట్టలేక  చెల్లెలుతో  కలసి హేమ ఇంటికి వచ్చింది .  అమ్ము నాన్న నంబరు ఆమె కిచ్చి వాళ్ళ నాన్నకి పోన్ చేయించింది .  హేమ  అతని నంబరు నొక్కి .. రమణ చెల్లెలికి  మాట్లాడమని ఇచ్చింది.

"బావా.. అమ్ము వచ్చిందా !?"

 "అది నాదగ్గరకేందుకు వస్తాది,. అయినా నేను వూళ్ళో లేను. ఇటికరాయి తోలుకొచ్చే లారీలో బట్టీ కాడికి పోతున్నా .  ఇంటో మా ఆవిడ పిల్లలు కూడా లేరు వూరికి బోయినారు. పిల్లని పెంచని రాని  నీ అక్కని రోడ్డ్లెమ్మట యెతుక్కోమను" చెప్పి ఫోన్  పెట్టేసాడు .

రోజులు చూస్తే బాగా లేవు . దానికి చిలక్కకి చెప్పినట్టు చెప్పాను . ఎన్నిసార్లు చెప్పానో .. అలా వొంటిగా  తిరగోద్దె.. అని నా మాట యింటేగా!? అని యేడుస్తూ కూర్చుంది రమణ .

అమ్ము యేమై ఉంటుంది ?హేమలో  కూడా చిన్న ఆందోళన మొదలైంది . అసలే ఆడపిల్ల... ఆలోచించడానికే భయమేసింది .
అమ్ము నాన్న ఫోన్  లో యే  మాటలైతే చెప్పాడో ఆ  మాటలని తిరిగి చెప్పింది రమణ చెల్లెలు .

అప్పటిదాకా నిబ్బరంగా కనబడిన రమణ నేలపై కూలబడింది. కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ "చూడమ్మా! ఇది ఎంత పంజేసిందో! నేను యేడని దాన్ని వెదుక్కురాను నాకాడ ఓపిక్కూడా లేదాయే! నేనేం చేయను దేవుడోయ్" అంటూ కనబడని దేవుడిన్ని అడిగింది. అమ్ము వాళ్ళ నాన్న దగ్గిరికే పోయుంటదమ్మా! ఆ దొంగనాకొడుకు నన్నేడిపీనాటికే అబద్దపు కూతలు కూస్తా ఉన్నాడు. ఇప్పుడే ఆడి  పని చెబుతా.. ఆడింటికిపోదాం పదవే."  అంటూ చెల్లెలిని పిలిచింది. ఇంత  రాత్రేల పోయి యేడ యెతుకాతం? రేపు చీకటేల్నే పోదాం. ఇప్పుడు యింటికి పోదాం పద,  ఈ పాటికి అమ్ము కూడా యెడేడో   తిరిగి యింటికి  వచ్చేసే వుంటాది అంది రమణ చెల్లెలు.

అప్పుడు హేమ  కలగజేసుకుని "నువ్వు యింటికిపో దుర్గా , నేను రమణని తీసుకునెల్లి అమ్ము అక్కడుందేమో . చూసొస్తాం." అని చెప్పి బండి బయటకి తీసింది. ఓ.మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణీంచాక అమ్ము వాళ్ళ నాన్నుండే  యింటి  ముందు బండి ఆపి  నిలబడి చుట్టూ చూసారు. అక్కడ నిర్మాణంలో వున్న అపార్ట్మెంట్లు చాలా వున్నాయి . ఇంకొద్ది దూరంలో ఒక పాక వేసి ఉంది . ఆ పాకలో అక్కడ వాచ్ మెన్ గా పనిచేసే అమ్ము వాళ్ళ నాన్న కాపురం ఉంటాడు. ఆ పాకలో నుండి సన్నని వెలుతురూ కనబడుతూ ఉంది.  వాడు చూడమ్మా యెంత  అబద్దపు కూతలు కూసాడో! ఎవరు లేకపోతే   యింటో దీపం ఎట్టా ఎలుగుతాది? అంటూ యింటి ముందు కళ్ళతో వెదుకుతుంది. హేమ  ఇంటి ముందుకు వెళ్లి తలుపు తట్టబోయింది.  రమణ వచ్చి చటుక్కున ఆమె చేయిని పట్టుకుని ఆపేసింది.

"అమ్మా ! యెల్లిపోదాం  రా"  అంది  రమణ. "అదేమిటే? పిల్ల కోసం అన్జెప్పి వచ్చి పిల్ల వుందో లేదో చూడకుండా పోదాం పదమంటావు? నీకేమైనా వెర్రా? "

ఇదిగో.. యిక్కడ చూడమ్మా ! అమ్ము చెప్పులున్నాయి. అంటే అదిక్కడ వుండట్టే గా. వాడు నాటకాలు ఆడుతున్నాడు
ఆడనీ, నాటకాలాడనీ , యెన్నాళ్ళు నాటకాలు ఆడతాడో చూత్తా! రేపు మా కులపోళ్ళతో పంచాయితీ పెట్టిస్తా! వాడిని అందరితో వూపియ్యాలి. ఆడు మొగుడు కాదమ్మా ! నా పాలిట యముడు. ఆడిని వదిలిచ్చుకుని తప్పు కట్టానా!  రొయ్యల ప్యాక్టరీలో రాత్రిబవళ్ళు కష్టపడి ఆ అప్పు దీర్చుకున్నా. పిల్లలతో ఆడికి సంబందం లేదని రాయించుకున్నా. చిన్న పిల్ల తెలిసో తెలియకో అది వాడి యింటికి   యెల్లిందీ  అనుకో తీసుకొచ్చి దించిపోకబోగా యింటో  పెట్టుకుని నన్ను దేసంమీద పడి వెదుక్కోమన్నాడు.  ఆడికి నిలువెల్లా ఇసమేనమ్మా! నన్నిట్టా  కూడా  ఎందుకు బతకనీయాలని ఆడి  కచ్చ..అంటూ ముందుకు దారితీసింది . రమణ మాటల శబ్దానికి  యెవరైనా బయటకి వస్తారేమోనని కాసేపు ఆగి చూసింది హేమ . ఎక్కడా ఆ అలికిడే లేదు . బండి స్టార్ట్ చేసిన చప్పుడుకి  ఇరుగుపొరుగు  ఆరాగా తొంగి చూసారు  కాని ఆ ఇంట్లో నుండి సవ్వడే లేదు.

ఇంటికి వస్తున్నంత సేపు దారంతా  రమణ మొగుడ్ని తిడుతూనే ఉంది. ఇంటికి వచ్చాక ఇంకా ఇప్పుడు ఏమి వెళతావ్ ఇక్కడే పడుకో అంటే  . లేదమ్మా ! చిన్నది నేను లేకపోతే  నిదరపోదు.. ఇంటికి పోతాను అంది . సరే .. ఈ అన్నం పట్టుకెళ్ళు అని  రమణకి అన్నం పెట్టి  యిస్తుంటే సమాజ సేవ అయిందా ..?  అంటూ యింట్లో  వాళ్ళ గొణుగుడు . అవన్నీ గోడకి తగిలినట్టే అనుకుని .. అయ్యో రామా! ఇది ఒక సేవే నంటారా? మగవాళ్ళు చేస్తే అది మరపురాని సేవ . ఆడవాళ్ళు  చేస్తే అధిక ప్రసంగం అంటారనుకుంటా  కదా? అని ఎదురు ప్రశ్న వేసింది. ఆమె గడసరి ప్రశ్నకి  అటువైపు నుండి శబ్దమే లేదు.

తెల్లవారి రమణ రోజుకన్నా పెందలాడే పనికి వచ్చింది చాలా హుషారుగా ఉంది . ఎన్నాళ్ళు వుంటదో  వుండనీయమ్మా !  నేనసలు దాని జోలికే పోను ... దానిని తలిస్తే మీ చెప్పు తీసుకుని కొట్టండి .. అంటూ బింకపు మాటలు పలికింది. అలా రెండు రోజులు గడచిపోయాయి .
పంచాయితీ పెట్టిస్తానన్నావు కదే, యెప్పుడు  పంచాయితీ? అని అదిగింది హేమ

"అది యింకో  రెండు రోజులకైనా యింటికోస్తాది కదా ! అప్పడే చెపుతా ఆ సంగతి" అంది .

********************

బడి ఎగ్గొట్టి  నాన్న ఇంటికి చేరిన అమ్ము ని గుమ్మంలో నుండే నిలబెట్టి అడిగింది   వాళ్ళ నాన్నని  కట్టుకున్న మూడో పెళ్ళాం  వసంత.  ఏమ్మా ..! ఇట్టా వచ్చావ్? బడికి పోలే ?  మీ యమ్మ నిన్ను యిట్టా గాలికోదిలేసిందేంటే ! భయంబత్తి లేకుండాతిరుగాతా ఉండావ్! నీకులా నా బిడ్డలు తిరిగితే అట్టకాడ కాల్చి వాతలెడతా! అని చీదరిచ్చుకుంది. మీ నాయనొచ్చి నీ సంగతి తేల్చుకుంటాడు నాకెందుకు మధ్యలో అని లోపలికి పోయింది.

మొన్నేగా యీడకి వచ్చినప్పుడు  బాగా పలకరిచ్చి రెండురోజులుండిపోవే  అని అంది. ఇప్పుడేంటి చిన్నమ్మ యిలా యిసుక్కుంటుంది అనుకుంది  అమ్ము .

కాళ్ళకున్న చెప్పులిడిసి యింటోకి పోబోయింది.. "ఎక్కడికి అట్టా యింటో  జోరబడుతున్నావ్.. కాళ్ళు చేతులు కడుక్కొని   రా! పయిటేలకి కానీ నిన్ను కన్నోడు రాడు. ఆయనొచ్చాక నీ సంగతి తేల్చు కుంటాడు మద్దిలో. నా కెందుకు దురద.? నన్ను యీడికి యిచ్చేటప్పుడు మొదటి పెళ్ళాం బిడ్డలు, రెండో పెళ్ళాం బిడ్డలతో యీడికి సబందమే లేదు అని లొల్లి మాటలు జెప్పారు. ఇప్పుడేమో  పెల్లీడుకోచ్చాక నువ్వు మా ఎదానే పడతావని చెపుతూ ఉండారు. ఇట్టైతే నేను నా పిల్లలు మట్టి కొట్టుకుని పోతాం " అని  ఒకటే సాపించడం మొదలెట్టింది
చానా సేపు చిన్నమ్మ మాట్టాడే ముల్లుమాటలు యింటూనే గుమ్మం ముందే నిలబడింది అమ్ము.

పన్నెండు గంటలప్పుడు చెల్లెళ్ళు యిద్దరూ బడి నుండి ఇంటికొచ్చారు . ఆళ్ళ కాళ్ళకి కొత్త బూట్లు  విప్పుతూ .. నువ్వు కూడా రా! ఈళ్ళతో పాటు  నీకు అన్నమేస్తా అని లోపటికి పిలిచింది . కూరాకు మరింత లేదు నువ్వు ఈ పచ్చడేసుకుని తిను . పూజ,వనజ చిన్న పిల్లకాయలు కదా ! పచ్చడి తింటే రొప్పుతారు అంటూ .. పచ్చడేసి పెట్టింది . అప్పుడు అమ్ము కి వాళ్ళమ్మ గుర్తుకొచ్చింది .. కళ్ళల్లో నీరు పళ్ళెం లో పడ్డాయి. ఈ మాత్రం దానికే యేడవాలా? పచ్చడి తిని బతకాలా, గొడ్డుగారం వేసుకుని తిని బతకాల. అంటూనే పిల్లలిద్దరికి పాలబూత్లో కొనుకోచ్చిన పెరుగు కప్పు తీసి అన్నంలో కలిపి ఇచ్చింది.  అమ్ము మారు అన్నం అడక్కుండానే పళ్ళెం తీసుకుని బయట కుళాయి దగ్గరికి కెళ్ళి పళ్ళెం కడిగి నీళ్ళు తాగి అక్కడే నిలబడింది.

అమ్ము ఇటు రాయే! ఈ గిన్నెలు తీసుకుపోయి కడుక్కురా! నేను యీళ్ళని తీసుకుని బంగారంగడికి పోయి రావాలి . కంసాలాయన  కాళ్ళ గొలుసులు  యిస్తానన్నాడు.  అన్జెప్పి తలుపుకు గొళ్ళెం పెట్టి తాళం వేసుకుని  మరీ పోయింది .
వాళ్లటు పోగానే అరుగుమీద పడుకుంది అమ్ము. నాన్న యెప్పుడు వస్తాడో ?  సైకిల్ యెప్పుడు కొనిస్తాడో అడగాలి. పుస్తకాల సంచీ బోలెడు బరువు. మోయలేక సాలి వస్తుంది నడుం వంగి పోతుంది . ఆ మాటే అమ్మకి చెపితే రోజు బడిదాకా వచ్చి సంచీ వరండాలో పెట్టి వస్తంది కానీ సైకిల్ అడిగితే  కొనదు. ఏమడిగినా డబ్బులేడయి? నీ కళ్ళు దొబ్బినాయా అని పిచ్చి కూతలు కూసుద్ది . రేషన్ షాప్ లో బియ్యమే తెచ్చి వండుద్ది. పోస్టాపీసులో నెలనెలా డబ్బులు కట్టకపోతే ఆ డబ్బులతో సైకిల్ కొనీయోచ్చు కదా ! అదే మాట అడిగితే అమ్మకి మాలావు కోపం వచ్చుద్ది. గవర్నమెంటాళ్ళు చెల్లికి నాకు నలబయ్యేసి యేలు లెక్కన  బాంక్ లో యేసారని అమ్మమ్మ చెప్పింది . అన్ని డబ్బులున్చుకుని సైకిల్ కొనమంటే కొనదు. నోట్స్ పుస్తకాలు కొనదు. అమ్మ వొట్టి రాకాసిది. నోటికొచ్చినట్టు కూస్తాది. మళ్ళీ అంతలోనే ముద్దులాడుద్ది. నాన్న అట్టా కాదు యెక్కడ కనబడినా పలకరించక్కపోయినా యింటికి  యెలితే.. వచ్చావా అమ్ము రా రా నాన్నా అంటూ దగ్గరికి తేసుకుంటాడు. చెల్లెళ్ళతో పాటు నాకు చాక్లెట్లు కొనిస్తాడు. ఇంటికెల్లెటప్పుడు చార్జీలకి డబ్బులిస్తాడు ... ఛీ ! అమ్మ మంచిది కాదు . నాన్నే మంచాడు . నేను నాన్న దగ్గరే ఉంటా,యిక పొమ్మన్నా పోను అనుకుంటూ గోడకి తిరిగి పడుకుంది .

గుమ్మానికడ్డంగా అట్టా పడుకున్నావేంటే..? యింటికి దరిద్రం, ముందు ఆడ నుండి లే ! అంటూ కసురుకుంది చిన్నమ్మ . బిత్తరపోయి లేచి నిల్చుంది. ఎదురుగా చెల్లెల్లిద్దరూ మువ్వలు పట్టీలు పెట్టుకుని అటు యిటు యెగురుతూ ..ఆమువ్వలుమోతకి నవ్వుకుంటూతిరుగుతున్నారు .అమ్ముతన కాళ్ళకేసి చూసుకుంది.బోసిగా వున్నాయి. దిగాలేసింది. "నాక్కూడా కాళ్ళగొలుసులు తేకూడదా చిన్నమ్మా.." అని అడిగింది .

"అడిగావు ? యింకా  అడగలేదేందా అని అనుకుంటా ఉండా? ఈ గొలుసులేయి మీ బాబు తెచ్చిచ్చిన సొమ్ముతో కొనలేదమ్మా! మా అమ్మోళ్ళు సాంగ్యానికి చెవులు కుట్టిచ్చి కాళ్ళ గొలుసులేసారు. అయ్యో ! నీ అయ్య కంతటి యివరం కూడానా? సంపాయించడం తాగడం సరిపోయే ! అయినా నీ కాళ్ళకి గొలుసులు నేనెందుకు చేయిన్చాలే ? నువ్వేమన్నా నా కడుపున బుట్టావా? లేకపోతే  నీ అమ్మచస్తే నన్ను నీ నాయన కట్టుకున్నాడా? మీ యమ్మ గిత్త లాగా బాగానే ఉందిగా, మూడు మూడు నాళ్ళకి నిన్ను ఈ కొంప మీదకి వుసిగొల్పుతుందేంటి? నా కాడ  ఆ యవ్వారాలు అన్నీ కుదరవు.  వచ్చినావా ఒక పూట వుండావా ... అంతే ! తెల్లారి లేచి  వచ్చిన దారిన పోవాల.. చిన్నమ్మా,పెద్దమ్మా అని వరసలు కలిపి యీడే  తిష్ట వేయడంకాదు. "అని  ఎడతెరిపి  లేకుండా వాయించి యీసడించింది .

అమ్ము అక్కడి నుండి లేఛి దూరంగా పోయి రోడ్డు ప్రక్కనే వున్న రాయి మీద కూర్చుంది. రాత్రైనదాకా అక్కడే కూర్చుంది . మీ బాబు వస్తే నిన్నాడనే కూర్చోబెట్టాడని తిడతాడు, నన్ను తిట్టియ్యడానికే కూసున్నావా? లోపలకి వచ్చి కూసో! అని  పిలవాలి కాబట్టి వొకపాలి పిలిచి  మళ్ళీ లోపలి యెల్లిపోయింది . చీకటీగలు పీక్కు తింటన్నాయి. లోపలి పోదామా  అంటే చిన్నమ్మ అనే మాటలు చానా బాధగా ఉండాయి.  అమ్మ యెప్పుడు తిట్టే తిట్లు కన్నా చిన్నమ్మ మాటలు చానా బాధగా ఉండాయి. అయినా సరే యిక్కడే ఉండాలి . అమ్మ దగ్గరికి యెల్ల కూడదు. నేను కనబడకపోతే అమ్మ యేడవాలి, బాగా యేడవాలి అప్పుడు కాని  నా కసి తీరదు అనుకుంటూ కచ్చగా అమ్మని తలుచుకుంది అమ్ము

అమ్ము రాత్రి తొమ్మిది గంటలయ్యేదాక   రోడ్డు మీద బండ పైనే కూర్చుని నాన్న కోసం  యెదురుచూసి  చూసి  యింటి లోపలకి వచ్చింది . చిన్నమ్మ పట్టె మంచంపై చెల్లెళ్ళు యిద్దరినీ  వేసుకుని పడుకుని టీవి చూస్తూ ఉంది   అమ్ముని చూసి "కుండలో కూడుంది . యేసుకుని తిని మిగతా అన్నంలో ఆ గిన్నెలో ఉంచిన గంజి పోసేయి. రేపొద్దున  చద్ది అన్నంకి  ఉంటాది "అని  చెప్పింది .

కొంచెం అన్నం యేసుకుని మిగతా అన్నాన్ని  ఆమె చెప్పినట్టు చేసి,  కంచం తెచ్చుకుని టీవి చూస్తూ అన్నం తిని  కంచం కడుక్కొచ్చి చాప తీసుకుని పరుచుకుని పడుకుంది. దోమలు కుడుతా  వున్నా కూడా కప్పుకోడానికి దుప్పటి కూడా యివ్వని చిన్నమ్మతో తల్లిని పోల్చుకుంది. అమ్మ యెంత జాగ్రత్తగా చూసుకునేదో గుర్తు తెచ్చుకుంటూ చెల్లిని తలచుకుంటూ కళ్ళు మూసుకుంది   మెల్లగా నిద్ర పట్టేసింది. తెల్లారేపాటికి అమ్ముకి జ్వరం ముంచుకొచ్చింది.  ఎండ  బడుతున్నా లేగవకుండా జొరం వల్ల  వచ్చిన చలికి వణుకుతూ మునగదీసుకుని పడుకుంది.

అక్కా! లెగు అమ్మ నిన్ను లేచి వాకిలూడ్వమంటుంది . అంటూ పూజ చేత్తో కదుపుతుంటే మెలుకువ వచ్చింది . జొరం వచ్చిందని చెప్పు అమ్మకి అంది . అమ్మా అక్కకి జొరం వచ్చిందంట అంది. ఆ మాటకి వసంత దగ్గరికి వచ్చి టవొంటి  మీద చెయ్యేసి చూసింది. "మొన్నే కదే ..టైపాయిడ్  జొరం వచ్చింది. పత్తెం చేసావా అడ్డమైన గడ్డి తిన్నావా ? అంటూ తిడుతూనే పోయి పళ్ళు తోముకోచ్చుకో! కాసిని పాలు తాగి మందు బిళ్ళ వేసుకుందుగాని"   .
పదిగంటలకి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళి చూపిచ్చి మందులు తెచ్చింది.డాక్టర్గారు అన్నం తినొ ద్దన్నారుగా .. అంటూ బ్రెడ్ కొనిపెట్టింది. ఇంటికొచ్చి మందు లేసుకుని నాలుగు బ్రెడ్ ముక్కలు తిని టీవి చూస్తా పడుకుంది . పైటేలకి  అమ్ము నాన్న వచ్చి అమ్ముని చూసి  ఈ అమ్మి ఎప్పుడొచ్చింది అడిగాడు , నిన్ననంగా  వచ్చింది. పిల్ల యేమైందా అని ఆ తల్లికి పట్టలా  వదిలేసి ఊరుకుంది . పిల్లకి జొరం వచ్చింది హాస్పిటల్కి తీసుకుపోయా.. అని చెప్పింది  వసంత . రాత్రి అమ్ము వాళ్ళమ్మ పోన్ చేసింది అని చెప్పకుండా దాచిపెట్టి .. దానికేం బట్టీ ... పొతే పోయింది అనుకుంటాది ,దాని సంగతి నీకు తెలియదులే  అంటూ రంగులు పూయబోయాడు.

ఏరా .. అమ్ము యెప్పుడొచ్చావ్  యెందుకొచ్చావ్ ?   అడిగాడు అమ్ము పక్కనే చాప పై కూచుని .

 ఆపాటి కూసింత  పలకరింపుకే  అమ్ము కి యేడుపొచ్చింది . "నేను ఆడ వుండను నాన్నా! మా అమ్మ నన్ను పద్దాక తిడతంది కొడతంది , శృతిని  అసలు యేమనదు. దానికి కొనుక్కోడానికి డబ్బులు  యిచ్చుద్ది, పాలు యిచ్చుద్ది. పద్దాక మీ అయ్య కాడికి పో అని తిట్టుద్ది . నేనక్కడ వుండను యిక్కడే ఉంటా" తండ్రిని అంటుకుని యేడుస్తూ  చెప్పింది.
సరేలే అట్టాగే  వుందువు గానిలే! అంటూ లేచిపోయాడు. తండ్రి యెల్లాక  కూడా అమ్ము యెక్కెక్కి యేడుస్తానే  వుంది.

బయటకి వెళ్ళిన అమ్ము నాన్న వసంత దగ్గరికి వెళ్ళి "నువ్వెందుకు  హాస్పిటల్ కి తీసుకు పోయావ్ ,ఆళ్ళ మ్మే తీసుకుపోయేదిగా " అన్నాడు మేవానంగా .

"ఎవురు తీసుకుపోతే  యే  వుందిలే గాని .  నిన్ననగా  పోయినావ్  యేడికి   పోయినావ్ ?  కోళ్ళ  పందేలకేగా  పోయావ్ ? దొంగ సొమ్మంతా  ఆడ పోసోత్తేగాని  నీకు నిదర పట్టదు.  నీకు మళ్ళీ మూడు పెళ్ళిళ్ళు, పెళ్ళాలు  బిడ్డలూనూ , యే౦  ఆ బతుకు బతకపోతే  చావకూడదా ? ఉరుములేని పిడుగల్లె, వానలేని వరదల్లే  విరుచుకు పడింది. నేను కోడి పందేలకి  పోయ్యానని కలగన్నావా ? నోరు మూసుకేయే, మొగుడ్ని  మగాడిని అని కూడా చూడకుండా  పెట్రేగి పోతన్నావ్ , వంగదీసి నాలుగుద్దులు గుద్దితే చచ్చి వూరుకుంటావ్ ". అని బయటకి   పోబోయాడు వెంకటేశం

 "ఏడికి  మళ్ళీ  పోతన్నావ్ ? ఆ  అమ్మిని యీడనే వుందువుగాని అని చెపుతున్నావ్, మింగటానికి మెతుకు లేదు కాని మీసాలకి సంపంగి నూనె అన్నట్టు  ఆ అమ్మిని కూడా  సాకడం  నా వల్లగాదు .  ముందు దాన్ని పంపిచ్చి రా ! నువ్వా పని జేయకుంటే  నేను నా బిడ్డలు కిరసనాయిలు పోసుకుని చస్తాం." అంది వసంత.

ఇప్పుడు దాక  హాస్పిటల్కి యెవరు  తీసుకుపోతే యేమిలే అన్న మనిషి యింతలోనే ప్లేట్  మార్చేసింది యెందుకో ? ఈ ఆడముండలని అర్ధం జేసుకోవడం  యమా  కష్టం  అనుకుంటూ "అట్టాగే పంపిచ్చేత్తానులే , నువ్వూరికూరికే యెగరబాకు " అంటూ  బయటకి పోయాడు.

అమ్ము కి ఆళ్ళ  మాటలు వినబడ తానే వున్నాయి. నాన్న తనకి అన్ని అబద్దాలే చెపుతున్నాడన్నమాట. అని అర్ధం అయ్యేసరికి యింకా యేడుపొచ్చింది. వెంటనే లేచి యింటికి యెల్లిపోవాలి అనుకుంది. ఇంటికి ఎల్లాలంటే చానా దూరం నడవాలి. బస్ ఎక్కడానికి చార్జీలకి డబ్బులు కూడా లేవు. చిన్నమ్మని అడిగినా తిట్టుద్ది , నాన్న యింటికొచ్చాక డబ్బులడిగి తీసుకుని యెల్లిపోవాలి అనుకుంది. ఆ రాత్రికి తండ్రి రానూ లేదు వేరే వూరికి సామానేసుకుని వెళ్ళాడని చిన్నమ్మ చెప్పింది. మేమందరం కూడా రెండు రోజుల్లో యీ వూరు నుండి యేరే వూరికి యెల్లిపోతన్నాం. నువ్వు అక్కడికి కూడా యిట్టా యెగేసుకుని రాబాకు. ఈ సారి యింటికి వచ్చావంటే కాళ్ళు యిరక్కొడతా . వేలు చూపిస్తూ బెదిరించింది వసంత.

కాసేపటికే వేన్నీళ్ళు  పెట్టి  నీళ్ళు పోసుకోమని చెప్పింది. జొరం తగ్గలా .. ఈ పూట కూడా ఈ బ్రెడ్ ముక్కలు పాలల్లో నంజుకుని తిను అని ముందు పెట్టింది. తినే దాకా ఉండి  మళ్ళీ మొగుడ్ని, అమ్ము వాళ్ళ అమ్మని తిట్టటం మొదలెట్టింది. ఆ తిట్లు యింటున్న అమ్ముకి చివుక్కుమనిపించింది. "మా అమ్మని తిట్టబాకు చిన్నమ్మా ! నేను రేపు మా యింటికి  యెల్లిపోతా  " అంది . అయినా కూడా  ఆగకుండా అరగంట దాకా తిడతానే వుంది  వసంత. అమ్ముకి రోషం ముంచుకొచ్చింది. రాత్రిల కాకుంటే అప్పటికప్పుడు బయలేల్లేదే.

తెల్లారి నిదరలేస్తూనే   "నేను మా యింటికి వెళ్ళిపోతా   చిన్నమ్మా"  అంది అమ్ము

ఆ పటినే  పోతావా ? తల దువ్వుతా రా.. అంటూ పిలిచి జడలేసి చార్జీలకి డబ్బులిచ్చింది.  ఇక యిక్కడికి రాబాకు నువ్వొచ్చినా  యిక్కడ మేముండం, మీ అమ్మ చెప్పినట్టు యిని చదువుకో .. అంది. సరే  అని తలూపి బయటకి వచ్చింది . రోడ్డులో తండ్రి యెదురయి యెల్తన్నావా .. అడిగాడు. తల ఊపింది

 "నువ్వు నా కాడ  వుండాలంటే  మీ అమ్మ , మీ అమ్మమ్మ ,తాత అందరిని తీసుకొచ్చి వొప్పందం చేస్తే నా కాడ  వుందువు గాని లేకపోతే లేదు, వాళ్ళని తీసుకు రా ..  ఈ వూరు నుండి మేము యెల్లిపోతున్నాం , నువ్వు వస్తానంటే మాతో పాటు వద్దువుగాని అక్కడే ఉందువుగాని "అన్నాడు.
"అది అబద్దమే అని నాకు  తెలుసని నాన్న అనుకోడంలేదు.  మాయమాటలు చెప్పి నన్ను  యింకా   మోసం చేస్తన్నాడు "  మనసులో అనుకుంది అమ్ము.

 "మా అమ్మని, చెల్లిని వదిలి పెట్టి యెక్కడ వుండను, నేను అక్కడే వుంటా, యిక నేనెప్పుడు  మీ యింటికి  రాను నాన్నా ! నువ్వు రమ్మన్నా రాను .  నీ కన్నా మా అమ్మ చానా మంచిది "అంది బస్ ఎక్కుతూ

అమ్ము  రావడం రావడం హేమ  ఇంటికే వచ్చింది .  బయట అంట్లు తోముకుంటున్న తల్లి దగ్గరికి వెళ్లి నిలబడింది. అమ్ముని పలకరీయకుండానే  రమణ గబా గబా లోపలి వచ్చి .. "అమ్మా యెవరొచ్చారో చూడు! " అని హేమని  బయటకి పిలిచింది .

 అమ్ముని చూసి యెందుకొచ్చావే .. అని కోప్పడింది. తలొంచుకుని నిలబడింది అమ్ము . రమణ దాన్ని దగ్గరికి తీసుకుంది. అక్కడ యే౦ జరిగిందో పూస గుచ్చినట్టు తల్లికి చెపుతూ వుంది .  హేమ  వంట చేసుకుంటూనే అమ్ము మాటలు వింటూ  యిక అమ్ము ఎప్పుడూ  వాళ్ళమ్మని వదిలి పోదు అనుకుంది

 పోద్దుటి నుండి  యేమీ  తినలేదాంటీ!  ఆకలవుతుంది   అన్నం పెట్టరా అని అంది. అమ్ముకి అన్నం పెట్టి  అది తింటున్నంత సేపు అమ్ము చిన్నమ్మని  హేమ  రమణ ఇద్దరూ కలిసి  ఆమెసలు  ఆడదే కాదని జాలి,దయ ఏ కోశానా లేదని వీలయినంతగా తూర్పారబోసారు

ఆ తర్వాత అమ్ముని నట్టింట్లో కూర్చో పెట్టి   హేమ సుద్దులు చెప్పడం మొదలెట్టింది .  అరగంట పాటు మందలిస్తూ   వాళ్ళమ్మ వాళ్ళ కోసం యెలా కష్టపడుతుందో  చెపుతూ .. అలా యిల్లు వదిలేసి వెళ్ళకూడదని , బడి యెగ్గొట్టి   తిరగ కూడదని చెప్పి .  " నీకేం  కావాలన్న నన్ను అడుగు .. నేను కొనిస్తాను"  అని చెప్పింది హేమ.

"ఆంటీ నాకు సైకిల్ కావాలాంటీ! "అని ఠక్కున అడిగింది . "క్రొత్త సైకిల్ అయితే యిప్పుడు కొనలేను కానీ  మా అన్నయ్య వాళ్ళమ్మాయి సైకిల్ వుంది  అది తెప్పిచ్చి ఇస్తాను . అది కొన్నాళ్ళు  వాడుకో!  తర్వాత క్రొత్తది కొంటాను . అయితే ఒక షరతు నువ్వు అసలు బడి కెళ్ళడం  మానకూడదు అలా అయితేనే  సైకిల్ తెప్పిచ్చి ఇస్తాను " అని షరతు పెట్టింది కూడా . "

కాసేపు ఉండి  అమ్ము, రమణ ఇంటికి వెళ్ళిపోయారు . ఇంతటితో  ఈ కథ అయిపోయింది అనుకుంది హేమ

  ఆ రోజు సాయంత్రం పూట ..ఓ .. ఆడ మనిషి హేమ  యిల్లు వెదుక్కుంటూ వచ్చింది వసంత. ఎవరో  వో  పెద్దాయన ఆమె కూడా వచ్చి "ఇదిగో ..యీ యిల్లే..!  నువ్వడుగుతున్నామె కూడా యీమె " అంటూ  హేమని   చూపి వెళ్ళి పోయాడు

వచ్చింది  యెవరా  అని  ప్రశ్నార్ధకంగా చూస్తున్న ఆమె దగ్గరికి వచ్చి  "హేమమ్మ అంటే మీరేనంటకదమ్మా" అని  అడిగింది . అవునని తల ఊపింది.

"నేను రవణ సవితినమ్మా "... అంటూ పరిచయం చేసుకుంది . అమ్ము చెప్పిన మాటలు గుర్తుకొచ్చి  ముఖం  చిట్లించింది  ఆమెతో   మాట్లాడటం  యిష్టం లేనట్టుగా .

"కాసిని  నీల్లియ్యమ్మా తాగేదానికి"  అడిగింది , ఇవ్వక తప్పదు గనుక యిచ్చేసి లోపలి వెళ్ళడానికి  వెనుతిరగబోతూ "రమణ యిప్పుడు రాదు, రెడ్డి గారింట్లో  పనులన్నీ చేసినాక రాత్రి యేడుగంటలకి వస్తుంది "

ఆ అక్కతో పనిబడి రాలేదమ్మా! మీతోనే ఒక చిన్న యిసయం  చెప్పిపోదామని వచ్చాను "

"నాతో  చెప్పే విషయాలేముంటాయి నీకు ?అడిగింది

అదేనమ్మా ! అమ్ము వచ్చినాక అక్కడ ఇసయాలు  చెప్పి ఉంటాదిగా .మీకు  కూడా తెలిసి ఉంటాయని "... అని సగం చెప్పి ఆమె  ముఖంలోకి చూస్తూ ఆగింది

"నాకు చెప్పడానికి యేముంటాయి ? అది బడి యెగ్గొట్టి వాళ్ళమ్మ కొట్టుద్దని తప్పించుకోవడానికి మీ యింటికి  వస్తుంది .మీరు రెండు రోజులుంచుకుని పంపిస్తారు అంతేగా ! "అంది   యేమి తెలియనట్లు.

"రెండు రోజులుంచుకుని నానా మాటలు అంటున్నానని ఆ అమ్మి చెప్పలేదా .. అమ్మా !"  అడిగింది అనుమానంగా .
హేమ  మాట్లాడలేదు.  ఆమె  చెప్పడం మొదలెట్టింది .

"ఆ అమ్మి మూడు మూడు రోజులకి బడి యెగ్గొట్టి అక్కడికి వస్తుందమ్మా ! వచ్చి ఆళ్ళ మ్మ , తిట్టిందనో ,కొట్టిందనో ,పుస్తకాలు కొనలేదనో , తిండి సరిగా పెట్టడలేదనో చెపుతా వుంటది . అట్టా  చెప్పకూడదని ఆ అమ్మికి యింకా  తెలియదు కదమ్మా ! దాని బాబు చచ్చినాడు రమణక్కని అమ్మనా బూతులు తిడతా ఉంటాడు . అయి విన్న ఆ పిల్లకి ఆళ్ళ  అమ్మంటే మరీ చులకనైపోదూ. నాకా ఇద్దరూ ఆడ పిల్లలే ! ఆడు తెచ్చింది తాగడానికే సరిపోద్ది.  అనుమానం  జబ్బుతో నన్ను  పనికిబోయేదానికి యీల్లేదంటాడు. ఆడు తెచ్చింది యెన్నిటికని సరిపెట్టేది నేను. అయినా ఆయన యెన్ని రోజులు నికరంగా పనిచేస్తాడో నమ్మకం లేకపోయే !  కంటో  కనుమాయం చేసినట్టు ఇనప చువ్వలు,సిమెంట్ కట్టలు అమ్ముకుంటా వుండాడు . అది యెక్కడ బయట పడిపోద్దో అని నాకు వుచ్చబడి పోతా  వుంటాయి. నమ్మకంగా అంతా అప్పజెప్పి పొతే అట్టాచెత్తే  యెట్టా ?  సామాను దొంగతనంగా అమ్మొద్దు అని నెత్తినోరు కొట్టుకుంటా ! ఆడి దొంగ బుద్ది మారదు . ఎప్ప్దడో ఒకప్పుడు  దొంగతనం బయట పడదా ! చేట్టుకట్టేసి కొట్టడమే కాదు జైల్లోనూ  పెట్టిత్తారు . అట్టాంటాడితో  బితుకు బితుకంటూ  కాపరం జేస్తన్నా !

హేమ  మౌనంగా వింటుంది   ఈ విషయాలు నాకు తెలియనివి కాదు . రమణ అప్పుడప్పుడు  భర్త గురించి చెపుతూ వుంటుందిగా అనుకుంది మనసులో.

"నేనే అట్టా  వుంటే  ఆ పిల్లని నేనెక్కడ  తగిలిచ్చుకుంటానమ్మా! అందుకే ఆ అమ్మి మనసు యిరిగేటట్టు మాటలని ఆడ నుంచి వెళ్ళగొట్టినట్టు చేస్తన్నా!  అయినా ఆ పిల్ల వాళ్ళమ్మ  మీద సాడీలు చెప్పడం మొదలెట్టింది. పిల్లలట్టా కన్న తల్లి మీద చాడీలు చెప్పి పెరక్కూడదు. కన్న తల్లి మొత్తుకుంటూ పిల్లకాయలని పెంచొచ్చు  కానీ పిల్లలు  అమ్మని తిట్టుకుంటూ పెరక్కూడదు. . ఆ అక్క   మొగుడితో యేగేగి  అలుపొచ్చింది. ఇప్పుడు యీ పిల్లా యిసిగిత్తే  యెట్టా బతికేది? ఇప్పుడు బడికి పోవాలంటే సైకిల్ కావాలంటది,బూట్లు కావాలంటుంది. వాళ్ళ నాన్న అడిగినయ్యన్నీ కొనిస్తాడనుకుని  మా చుట్టూ తిరుగుతుంది . ఆళ్ళ మ్మని  వదిలేసి యిట్టా తిరుగతా వుంటే   ఆ అక్క యెంత  కుమిలిపోద్ది ? ఆయన్నీ తల్చుకుని అమ్ము ని ఆడ నిలవనీయకుండాజేసా ! నన్ను తిట్టుకున్నా  బాధనేదు,  తల్లి బిడ్డలు కలిసి ఉండాల.
 వసంత  వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది హేమ
చెట్టులాంటి అమ్మ నీడ వొదులుకుని గొడుగులాంటి నాయన నీడకి చేరతావుంది  ఆ పిల్ల . వాళ్ళమ్మకాడికి చేర్చాలనే అట్టా చేశా!  మనసు రాయిలా  జేసుకుని రాకాసిలా  తరిమేసా ! నేను ఆడదాన్నే ! కడుపు తీపి నాకు తెలుసు. మొగుడ్ని వద్దనుకునే ఆడాళ్ళు  యె౦దఱో వుంటారు. బిడ్డలని వొదిలేసే  ఆడాళ్ళు యేడో తక్కువుంటారు.  మా అక్క బిడ్డలని వొదిలేసే ఆడది కాదు . కులపోల్లు యేసిన తప్పు కట్టి  బిడ్డలని యెంట తెచ్చుకుంది. పని పాటలకి పంపకుండా బడికి పంపతా  ఉంది. అమ్ముకి అమ్మ యిలువ తెలియాలనే నేను అట్టా  కఠినంగా ఉండా" మనసులో వున్నదంతా  వెళ్ళబోసుకుంది వసంత.
ఆహా ..యేమి మనిషి యెంత  ముందు చూపుతో ఆలోచించింది యీమె అనుకుంటూ వుండగానే

   రొంపిన దోపుకున్న చీర కొంగుని బయటకి తీసి మూలన వేసి వున్న ముడి విప్పి మడతలు పెట్టి వున్న డబ్బు ని తీసి హేమ  చేతిలో పెట్టేసింది."అమ్మా .. అమ్ము కి సైకిల్ కొనిపెడతానని పోయినసారి వచ్చినప్పుడు చెప్పా . కానీ కావాలనే కొనిపెట్టలా, ఈ  మూడేలు  పెట్టి దానికి ఒక సైకిల్ కొనియ్యండి . ఇంకేమన్నా డబ్బు పడినా సరే మీరేసి కొనియ్యండి . వచ్చే నెలలో ఆ డబ్బు కూడా తెచ్చిస్తా .. అని చెప్పింది.   హేమ ఆశ్చర్యంగా  చూస్తుంటే "నేనిట్టా  యిచ్చినట్టు ఆళ్ళకి  తెలియనియ్యకండి. నన్ను రాకాసి దాన్నిగానే  వుండనీయండి . తల్లి బిడ్డలు యేరు కాకుండా వుంటే  అదే చాలు "  అన్జెప్పి   గేటు తీసుకుని  గబగబా వెళ్ళిపోయింది.  హేమకి  నోట మాట రాలేదు.  తేరుకుని చూసేసరికి ఆమె  పిలుపు వినబడనంత దూరం వెళ్ళిపోయింది వసంత.

నేను  కఠినాత్మురాలు  అని తిట్టుకున్నది ఈ అమ్మనేనా !? అని సిగ్గుపడింది హేమ

ఆణువణువూ  నింపుకున్న ప్రేమేగా అమ్మంటే ! అమ్మ విలువ తెలిసేది మరో అమ్మకేగా ! అనుకుంటూ  కళ్ళ తడితో గేటు వరకు వెళ్లి  దూరంగా  నడచి వెళుతున్న ఆ అమ్మ వొంక చూస్తూ ఉండిపోయింది..          

7, ఆగస్టు 2013, బుధవారం

బ్లాగ్ పయనంలో కొన్ని మైలు రాళ్ళు

ఈ రోజు నా బ్లాగ్ వీక్షణల  సంఖ్య 200000 లని  దాటింది అక్షరాలా రెండు లక్షల వీక్షణలని  ఖాతాలో జమ చేసుకుంది అనాలేమో!  :) 

ఆ  సంఖ్యని అందుకుంటున్నప్పుడు ఏ పోస్ట్ ఉంటుందా...  అని  అనుకున్నాను కూడా ! ఇదిగొ.. నాకెంతో ఇష్టంగా ఇలా...


 ఒక విశేషం ఏమంటే ... ఒకసారి నాకు మా అబ్బాయికి జరిగిన సంభాషణ.

తన   పర్సనల్ సైట్ కి  ... 24,000 మంది వీక్షకులు ఉన్నారు. అది చూసి నేను అబ్బ ..పెద్ద గొప్పేలే ! అన్నాను సరదాగానే .

"అలాగే ఉంటుందమ్మా ! .. నువ్వు వ్రాసి చూడు .. అంత ఈజీ కాదని  నువ్వే ఒప్పుకుంటావ్ " అన్నాడు

"అలాగే చూస్తూ ఉండు ... నీకన్నా బెటర్  గా .. తక్కువ టైం లో నిన్ను బీట్ చేస్తాను ".. అన్నాను  మాట పట్టింపు గా, పట్టుదలగా కూడా.

"తప్పకుండా  ట్రై చెయ్యమ్మా ! నువ్వు గెలిస్తే ఏముంది ?  మా అమ్మవే కదా ! " అన్నాడు .

ఆ సంగతి మర్చి పోయాం కూడా .

ఇదిగో ఇవాళ  చప్పున జ్ఞాపకం వచ్చింది. తన సైట్ 100000 వీక్షణల  లోనే ఉంది.

నా బ్లాగ్ వయస్సు 2 సంవత్సరముల 8నెలలు , 682 టపాలు ,,,

అలాగే    నా బ్లాగ్ కి విచ్చేసిన తోటి బ్లాగర్ ల సంఖ్యా 100000 కి చేరుకుంటుంది. ఎక్కువ మంది గూగుల్ సెర్చ్  ద్వారా వివిధ దేశాలకి చెందినవారు నా బ్లాగ్ ని  దర్శిస్తున్నట్లు గుర్తించాను. అదండీ సంగతి !

నేను బ్లాగ్ వ్రాసిన క్రొత్తలో వ్రాసిన పోస్ట్ ఒకటి .. మళ్ళీ షేర్ చేస్తున్నాను . అప్పుడు ఏ సంకలినిల ద్వారాను పరిచయం చేయబడ నప్పుడు   వ్రాసిన పోస్ట్ ఇది .  ఆ పోస్ట్ ... పేరు

కృష్ణా తీరంలో ఓ ..సాయం సమయం

 నేను.. ఇటీవల.. ఒక.. చర్చా కార్యక్రమానికి అధ్యక్షత వహించాను.. ఒకింత బిడియం.. జంకు, వగైరాలతో..  భయపడ్డాననుకోండి .. అసలు భయపడటం  నా సహజలక్షణం కాదండోయ్ .. అసలు విషయం ఏమిటంటే .. శ్రీమతి ఇందిరా గాంధి  జయంతి సందర్భంగా  మహిళలు -రాజకీయాలు అనే అంశం పై చర్చా కార్యక్రమం అన్నమాట. ఆ కార్యక్రమంలో పేరుగాంచిన మునుపటి ఎం.పీ  గారు, ప్రస్తుత జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు , మాజీ మేయరు గార్లు, కొంతమంది కార్పెరేటర్లు..ఆతిధులుగా ఆహ్వనింపబడ్డారు.

సమయం వచ్చేసరికి  మాజీ మేయరు గారు తప్ప అందరు గైర్హాజరు.

ఇదేనా మహిళల అంకితభావం .. రాజకీయ రంగం అంటేనే విముఖత వ్యక్తపరుస్తున్న కాలంలో మహిళలు రాజకీయరంగంలోకి  ప్రవేశించడం అత్యంత ఆవశ్యకరం అని .. వారి అనుభవాలు, ఎదుర్కున్న వత్తిళ్ళు, అణచివేతలు, సవాళ్లు  అన్నీ సభికులకి అందునా ఎంతో ఆసక్తిగా  ఎదురుచూసిన మహిళల  అందరికి నిరాశని మిగిల్చారు.

చట్టసభల్లో మహిళల శాతం, అంగ బల-అర్ధ బల, వారసత్వ,గరిటె తిప్పుదు     రాజకీయాల గురించి .. ప్రపంచ వ్యాప్తంగా మహిళ రాజకీయ రంగంలో ఎలా దూసుకుని వెళ్లి హక్కుల సాధనలో, ఎలా అభివృద్ధి సాధనలో భాగస్వామ్యం వహించిందో ..  ఆదర్శప్రాయమైన రాజకీయ నాయకురాళ్ళ అవసరం మనకు ఎంత ఉందో .. అని ఇలాటి విషయాలు ఎన్నో చర్చిద్ధామానుకున్న  నా ఆశ అడియాసే అయ్యింది.

ఇంతకి మన నాయకీమణుల  అభ్యంతరాలు  ఏమిటి  అంటారా.. !?

చెపుతున్నానండీ. ఒకావివాడ  అందుబాటులో  ఉండే రాజధాని లో ఉన్నానని చెప్పడం..  సెల్ ఫోను  కదండీ .. ఏదిచేప్పినా  అతుకుతుంధికదా.. ! ఒకావిడ  తన మామగారికి అనారోగ్యం అని,  ఒకావిడ అసలు తన మొబైలు ఫోను  పీక నొక్కేసింది. ఇవండీ వీరివీరి వాటాలు.

ఆమెరికా ప్రధమ మహిళకి  మన జాతిపిత ఆదర్శనీయం, స్పూర్తికరం అంట.

మరి మన మహిళలికి.. కుటుంబ భాధ్యతలు,కుటుంబ నిబంధనలు  ఉండే ఉంటాయేమో.కాదనలేను,. కానీ వీరికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే  నిబద్దత ఉండాలి కదా. !   పాపం మా సాహిత్య సంస్థ కార్యదర్శి  గారి భాధ చూడలేకపోయానంటే  నమ్మాలి మీరు. జయంతులకి, వర్ధంతులకి  పట్టుచీరల రెపరెపలతో హాజరయ్యే మహిళా నాయకురాళ్ళు  యువనేత పుట్టినరోజుకు బోకే తో వరుసలో గంటల తరబడి వేచిన అమ్మలు .. సాదాసీదా కార్యక్రమాలకి రారు కాబోలు.వీరిని ఆదర్శంగా తీసుకునా...  ఇతర మహిళలు  బిడియం వదిలేసి రాజకీయరంగం లోకి ప్రవేశించేది ..???? 

ఇందిరాజీ..!క్షమించు  తల్లీ .!! జాతీయ మహిళా దినోత్శవం రోజు  నీ స్పూర్తికి  అననుకూలంగా మహిళా సభలో.. ఎంతటి నిర్లక్ష్యం .. మన నాయకురాళ్ళకి వారి అధిరోహణ క్రమాన్ని  ఇతరులతో  పంచుకుని  ఉత్తేజం చేసే భాద్యత ఉందా-లేదా..  పదవులు కాపాడుకోవడానికి, అనునూయులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి పోటీ పడటం మానేసి  రాజకీయ శిక్షణ తరగతుల శిబిరాల రూపకల్పనకి ఉపక్రమిస్తే  వారిలా మహిళలు   రాజకీయరంగంలో ప్రవేశించి మహిళా  బిల్లు అమోధంకి  తగినంత బలం  కూడగట్టుకుంటారు కదా .. మీరేమంటారు.!? 

:) :)  (బ్లాగ్ వ్రాయడం మొదలు పెట్టినప్పుడే బాగానే రాశానని అనిపిస్తుంది )

5, ఆగస్టు 2013, సోమవారం

ఇదే రోజు ...

ఒక ప్రయాణం ఆప్తులని విడదీస్తుంది .. 

మూడేళ్ళ క్రితం .. సరిగ్గా ఇదే రోజు ఇదే సమయానికి ఒక లోహవిహంగం నన్ను - నా కొడుకుని విడదీసి వేలమైళ్ళ దూరంలో  ఉంచింది.

చిన్ని ..బంగారం !!
కన్న పేగు దీవెన...  నిన్ను ఎప్పుడూ  కాచే కన్నై ...ఉంటూ 

ఎక్కడ నీవున్నా   నా ఆశలు  నీవన్నా
నీతో  నీడల్లే నా ప్రాణం ఉందన్నా... 
నువ్వు ఇంతకూ ఇంతయి అంతకు అంతై  ఎదగర ఓ ..నాన్నా!

ఐ మిస్ యూ .. బంగారం ... blessings  with lots of love ... "అమ్మ"

దూరాలు పెరిగినా గారాలు, మారాలు.. అనీ మామూలే ! అమ్మకి ముద్దు బిడ్డడు కదా !

4, ఆగస్టు 2013, ఆదివారం

సహృదయ స్త్రీ (అనుబంధాల అల్లిక మిగతా భాగం)

.... అలా  రెండు నిమిషాలు వేచి చూసి మళ్ళీ తలుపు కొట్టాలి అనుకునేలోపు తలుపులు తీస్తున్న శభ్ధం వినపడింది. కొంచెం వెనుకకి జరిగాను. తలుపు తీసిన ఆమె  ఆమేనా .... సందేహం . ఆమె ననుకుంటాను ..  అన్న నిర్ధారణ ల మధ్య .. సరయు గారు  ! అన్నాను . ..నా గొంతు వినగానే  "వనజ గారు కదా" ... అన్నారు ఆమె. అబ్బ ఎంత బాగా గుర్తుపట్టారు . అనుకుంటూ "అవునండీ ! అన్నాను .

చాలా సంతోషం .. చెప్పాపెట్టకుండా వచ్చేస్తాను అని ఊరిస్తుంటే .. అలాగే అంటారు కాని ఇంత దూరం వస్తారా?  అనుకున్నాను . అన్నట్లుగానే వచ్చేసారు.  అంటూ చేయి పట్టుకుని లోపలకి తీసుకు వెళ్ళారు. కూర్చోండి .. అని నన్ను హాల్లో కూర్చోబెట్టి  బెడ్ రూం లోకి వెళ్లి ... " ఆమె భర్త గారితొ.. ఏమండీ .. వనజ గారు వచ్చేసారండీ " అంటూ సంతోషంగా చెప్పి వచ్చారు. మళ్ళీ వచ్చి నా ప్రక్కన కూర్చుని  ప్రయాణం బాగా జరిగిందా ... ఇబ్బంది పడ్డారా ? అంటూ కుశల ప్రశ్నలు వేసి .. ముందు బ్రష్ చేసుకుని స్నానం  చేసి రండి అంటూ ..  స్నానశాల చూపించారు. నేను బయటకి వచ్చేటప్పటికి  ఇంట్లో ఉన్న అందరూ నా ముందు ఉన్నారు ఒకోకరిని పరిచయం చేసారు. ఆమె భర్త గారు ని పరిచయం చేసినప్పుడు .ఆయనకి నమస్కారం చెప్పి ..సర్ .. ఆరోగ్యం బావుందా.. అని అడిగాను." పర్లేదమ్మా ! ఏదో ఆ భగవంతుని దయ " అన్నారు.

భగవంతుని  దయ ఏమోకాని  అక్క చాలా శ్రద్ద తీసుకుంటారు అయినా .. ఆయనకంత  బావుండటం లేదండీ! ఆయన బాగా చూసుకోవాలనే తాపత్రయంతో అక్క ఆరోగ్యం పాడవుతుంది . అయినా సరే .. పసి పాపని చూసుకుంటున్నట్లు చూసుకుంటున్నాం  అని చెప్పారు సరయు గారి చెల్లెలు నర్మద.తర్వాత సరయు గారి తమ్ముడు ,మరదలు,వారి పిల్లలి అందరిని పరిచయం చేసారు .  చిక్కని చక్కని వాసనలు వెదజల్లే వేడి వేడి కాఫీని అందించి నాతొ మాట్లాడుతూనే రెండు మూడు నాస్టాలు   ఉగ్గాని,పెసరట్టు,ఉప్మా తయారు చేసారు.  ఈ సమయం లో కావేరి గారు కూడా ఉండి బావుండేది అన్నాను . కావేరి సరయు గారి చిన్న చెల్లెలు. అవును .. మిమ్మల్ని చూసి చాలా సంతోష  పడేది   నంద్యాల కొంచెం దూరమే అయినా ఇప్పటికిప్పుడు రమ్మని పోన్ చేసినా వచ్చేస్తుంది పాపకి పరీక్షలు జరుగుతున్నాయి కదా ..  అందుకని రాలేదేమో ! అని అన్నారు సరయు గారు 

అలా  అందరి మధ్యన కూర్చుని టిఫిన్ చేస్తూ బోలేడన్నీ రేడియో కబుర్లు చెప్పుకున్నాం . మేమందరం ముక్త కంఠం తో బహిర్పరచే పేరు .. ఒకే ఒక ప్రయోక్త పేరు ని ..  ఆనందంగా ఉదహరించుకుని కాసేపు ఆయన గురించి ముచ్చటించుకున్నాం.

మరికొంతసేపు అనేక పాటలు గురించి చెప్పుకుంటూ ఇట్టే  సమయాన్ని గడిపేసాము. మీ అందరిని చూడాలని నా మనసు వేగిరపడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వచ్చేసాను.  నేను విన్నవాటినన్నింటిని  ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను . మీ  ప్రేమైక కుటుంబం,  కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం,ఒకరిపట్ల ఒకరు చూపే శ్రద్ద, అభిమానం నాకు నమ్మశక్యం కావడం లేదు . ఇంకా ఇలాంటి కుటుంబాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది.
అన్నాను .

అదంతా ఏ ఒక్కరి గొప్పతనం కాదు వనజ గారు . అందరూ ఒకరికొకరు సహకరించుకుంటాం. ఒక తల్లి బిడ్డలం కదా ! మాలో మాకు బేధాభిప్రాయాలు ఉన్నా .. ఒక పని చేయాలనుకుంటే అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఆ పని చేయడం మొదలు పెడతాము అని చెప్పారు. రక్తం పంచుకు పుట్టిన మాకు  ఏకాభిప్రాయం రావడం గొప్ప కాదు . ఈ ఇంటికి అల్లుళ్ళు అయిన వాళ్ళు, కోడళ్ళు  అయిన వాళ్ళు కూడా మాలో కలసి పోయారు. ఏనాడు వారిది ఒక మాట  మాది ఒక మాట అంటూ వేరేగా  ఉండదు. ఒకవేళ అలా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా వెంటనే సర్దుకు పోతారు .. అన్నారు .

అదంతా .. వదిన గారి మంచితనం అండీ ! కోడలినయి  వచ్చి 30 ఏళ్ళు దాటినా చిన్నమెత్తు మాట అనరు. భోజనం టైం  కి  మేడ  దిగి రావడమే ! పిల్లలని చూసుకోవడం తప్ప నాకు ఏమి బరువు భాద్యత లేవు . మా వారికి సరయిన ఉద్యోగం లేకపోయినా అంతా పెద్దక్కే .. చూసుకుంటారు  అని చెప్పారు. పెద్దక్క అంటే సరయు గారు అన్నమాట.
అమ్మ నాన్నలు ఇద్దరూ అనారోగ్యంతో మంచాన పడినా " సరయ" అక్కే అన్నీ చూసుకునేదమ్మా .. అని  సరయు గారి తమ్ముడు చెప్పారు. ఆయన కాకుండా సరయు గారి ఇంకో అన్నయ్య ఉన్నారు. ఆయన ఉద్యోగ రీత్యా వేరే వూరిలో ఉంటారు. వారి పిల్లలు ఇద్దరూ కూడా .. సరయత్తా .. అని కలవరిస్తారమ్మా ! అన్న కూతురికి ఒకరికి, నా కూతురికి ఒకరికి పెళ్లి కూడా జరిపించేసాము. అన్నీ అక్క చేతి మీదే జరగాలి. మా కుటుంబం అంతటికి అక్కే అమ్మ. జగదాంబ .. అంటూ ఆయన భక్తిగా చెప్పారు.

"నారాయణా మరీ ఎక్కువ జేసి చెప్పేస్తా ఉండావ్ ! ఊరుకో .. " అని సరయు గారు సిగ్గుపడుతుంటే  చూస్తున్న నాకు భలే ముచ్చట గా ఉంది .

సరయు గారు స్నానాని కి వెళ్ళినప్పుడు ...  ఆమెకి వినబడకుండా నర్మద గారు ఆమె గురించి చెప్పుకొచ్చారు. నాకు పెళ్లి అయిందండీ ! ఉమ్మడి కుటుంబమే ! అతనికి  నేను నచ్చలేదని గొడవ చేసేవారు.  పెల్లైయిన రెండేళ్ళకి రకరకాల కారణాలు చెప్పి నన్ను గెంటేసారు . మా అమ్మ నా జీవితం చూసి బాధ పడేది. ఇంత అమాయకంగా కనబడే దీనిని మళ్ళీ పెళ్లి చేస్తే ..  వచ్చే ఆతను ఎలాంటివాడో ఇంకోసారి జీవితం ఎలా ఉంటుందో .. అని దిగులు పడేది. అప్పటికి సరయు అక్కకి పెళ్లయి  ఐదారేళ్ళు అయింది. బావ గారికి ఈ ఊరిలోనే ఉద్యోగం. పేరుకి వేరే ఇల్లు ఉన్నా కాని ఎప్పుడు ఇక్కడే ఉండేవారు. అక్కకి పిల్లలు కలగలేదు. అమ్మ నాన్న నా గురించి దిగులు పడటం చూసి .. అమ్మ నాన్న ని ఒప్పించి బావగారిని ఒప్పించి బావ గారితో నాకు రెండో పెళ్లి చేయించింది. అప్పటి నుండి అందరం ఈ ఇంట్లోనే ఉంటున్నాం. మా రాతలు బాగోలేదు .. నాకు పిల్లలు పుట్టలేదు బావగారికి మాత్రం అనారోగ్యం చేసింది రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు. సరయక్కే  బావ గారికి కిడ్నీని దానం చేసింది. అవసరమైనప్పుడు రక్తం ఇస్తుంది .  చెల్లెలుని  సవతి  చేసుకుంది. ఎవరిని ఒక్క మాట అనదు. ఎవరైనా అన్నా పట్టించుకోదు. అందరూ కావాలనుకుంటుంది. ఆర్ధికంగా చితికి పొతే కుటుంబాన్ని ఆదుకుంది. నా తరువాతి 
చెల్లెలికి తనే  పెళ్లి చేసింది.  అందుకే నాన్న గారు ఈ ఇల్లు స్థలం అంతా అక్కకే వ్రాసి ఇచ్చారు. ఇపుడు ఎవరైనా ఆమె ఉండమంటే ఉండాలి లేకపోతే  బయటకి వెళ్లిపోవాలి .  అని చెప్పింది

నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను . సరయు గారు నాకు ఎంతో  ఉన్నతంగా కనబడ్డారు. ఎంతటి సహృదయత. ఎంత చెల్లెలు అయితే మాత్రం సవతిగా అంగీకరిస్తారా ?  పెళ్లి అయిపోయి ఒకరింటికి వెళ్ళిన ఆమెలా ఎవరైనా పుట్టింటిని ఆదుకుంటారా? తల్లిదండ్రులకి సేవ చేయగలరా !? అసలు ఆమె భర్త ఇవన్నీ ఎలా ఆమోదించారు ?

ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకునే టట్లు  ఉన్న ఈ రోజుల్లో   వీరందరి మధ్య ఈ బంధుత్వాలు, బంధాలు ఎంత అపురూపంగా పెనవేసుకు పోయి వున్నాయి   అని అబ్బురంగా అనిపించింది. ఆమె భర్త ఆమె మాట జవదాటకుండా ప్రతి విషయానికి అతని ఆమోదం తెలిపారు అంటే అతనిదెంత మంచి మనసు అనిపించింది. చాలా మందికి వారి భార్యభర్త ల బంధం  గురించి  అనేక పెడార్ధాలు తీసి ఉండవచ్చు. సరయు గారిది స్వార్ధం అని వ్యాఖ్యానించ వచ్చు కాని నాకు అక్కడ కుటుంబ సభ్యుల అందరి మధ్య  ఉన్న అవగాహనే కనబడింది. ఒకరి పట్ల మరొకరికి ఉండే ఈర్ష్యా ద్వేషాలు స్థానే అనుబంధాల అల్లికే కనబడింది. ఒకరినికరు గౌరవించుకోవడం కన్నా కూడా అర్ధం చేసుకుంటున్న తీరే ఎక్కువ కనబడింది. బహుభార్యతత్వం, సంతానలేమి,ఆర్ధిక అవసరాలు అనేవి బాహ్యంగా కనబడే విషయాలు కాని .. ఒక చూరు  క్రింద ఇంత మంది మనుషుల మధ్య పెనవేసుకున్న అనుబంధం అన్నదే  వారిని అలా కలిపి ఉంచింది. ఆ కుటుంబాన్ని ఏకతాటిపై ఉంచిన సరయు గారి గొప్పదనం ని ఆమె పట్ల నాకు కల్గిన భావనని నేను ఇక్కడ  వ్యక్తీకరించడానికి అక్షరాలూ సహకరించడం లేదు. అది మాటలకందని ఒ.గొప్ప  భావం. ఆమెని గురించి వేరొకరి నోట విని ఆమెని చూడాలన్న ఆసక్తితో నేను ఆ ఇంటికి చేరుకున్నాను. నేను విన్నదానికన్నా ఎక్కువ చూసాను, నా మనసుకి చాలా తృప్తి కల్గింది. ఆమెకి పాదాభివందనం చేసాను. వారి ఆత్మీయత, ఆదరాభిమానం మనుషుల పట్ల వారికి ఉన్న నమ్మకం చాలా చాలా బాగా అనిపించాయి

కారణాలేవి లేకుండానే   చీటికి మాటికి తగవు పడి విడిపోయే భార్యాభర్తలు,  ఆస్తులన్నీ చేజేక్కిన్చుకుని తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసిన బిడ్డలు, సోదరీ సోదరులని ఎలాంటి ఆపదలోను ఆదుకొని ధన పిశాచాలని, భర్తని అనుమానంగా కాల్చుకు తినే భార్యలని చూస్తూ ఉండే కాలంలో ఓ .. విభిన్నమైన వ్యక్తిని చూసాను. ఆమె ఒక్కరి గురించే ఆ ఇంటివారందరూ అలా ఉండటం సాధ్య పడిందేమో కూడా ! మళ్ళీ ఇంకొన్ని సార్లు కలసినప్పుడు  మిగిలిన కుటుంబ సభ్యులు, మేనకోడళ్ళు  అందరిని చూసాను . అందరూ ఆమెని మనఃస్పూర్తిగా ప్రేమించే వారే నని తెలిసింది .

నేను ఒంటరిగా వెళ్లి  వారిని అలా  కలసి వచ్చాను. తర్వాత కొద్దికాలానికే సరయు గారి భర్త కి అనేకసార్లు డయాలసిస్ చేయాల్సి రావడం మద్రాస్ విజయ హాస్పిటల్ కి త్రిప్పడం, అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ కి ట్రీట్మెంట్ కి రావడం అన్నీ సరయు గారు ఒంటరిగానే చూసుకున్నారు.  బోలెడంత డబ్బు, విపరీతమైన  శ్రమ, అనారోగ్యాలు మధ్య ఆమె భర్తని బ్రతికించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ నిష్ప్రయోజనమే అయ్యాయి. ఆ సమయాన నేను వారింటికి వెళ్లి ఓదార్చి రావాల్సింది. కానీ వెళ్ళలేకపోయాను అప్పుడప్పుడు పోన్ లో మాట్లాడుతూనే ఉంటాను

రోడ్డు విస్తరణ లో భాగంగా వారు నివాసం ఉంటున్న ఇల్లు కూడా రోడ్డు కి వదలాల్సి వచ్చినా ఆమె చాలా హుందాగా ఆవిషయాన్ని స్వీకరించారు. ఎవరికీ ఏది ప్రాప్తమో  అంతే  ప్రాప్తం వనజ గారు .. ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఇంకో స్థలంలో ఇల్లు కట్టుకోవాలి అన్నారు. మేనకోడళ్ళు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వారందరూ  పిల్లా పాపలతో హాయిగా ఉన్నారు . వారికి పురుళ్ళు పుణ్యాలు అన్నీ ఆమె చేసారు . ఇప్పుడు ఉన్న కాస్త డబ్బుని ఇల్లు కట్టుకోవడానికి వెచ్చించి చేతిలో డబ్బు లేకుండా చేసుకోవద్దు. ఏదైనా అనారోగ్యం వస్తే బోలెడు డబ్బు కావాల్సి వస్తుంది. పిల్లలు మనవాళ్ళు అయినా వారికి వచ్చిన వాళ్ళు మనవాళ్ళు అవరేమో... ఆలోచించండి అని సలహా ఇచ్చాను . అంతే నంటారా ...   మీరు చెప్పిన  మాట  గురించి అంతా కలసి ఆలోచిస్తాం .అని ఆమె అన్నారంటే ..
ఆమె గురించి మన అభిప్రాయమే మార్చుకోవాలి తప్ప ఆమెలో ఏ  మార్పు ఉండదు అని నాకు అర్ధమయింది
 US  వెళ్లేముందు మా బాబుని కూడా తీసుకు వెళ్లాను ఆమె ఆశీర్వాదం కోసం.

కుటుంబం అంటే మనలో చాలా మందికి మనం మాత్రం ఉండే ఇల్లు అని అనుకుంటాం. ఇలా అన్నదమ్ములు,అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా అందరూ అరమరికలు లేకుండా కలసి ఉండే కుటుంబం సరయు గారి కుటుంబం. ఆ కుటుంబం మధ్య ఉన్న అనుబంధాల అల్లిక చాలా ప్రత్యేకం అనిపిస్తూ ఉంటుంది.

ఇలా అప్పుడ ప్పుడూ  నా మనసుకి నచ్చిన పనులు చేస్తూ ఉంటానండీ! ఇలా నేను కలవాల్సిన వారి లిస్టు చాలా ఉంది. కలిసిన వారి లిస్టు చాలా ఉంది . ఇలా . మీ  అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది.

పెళ్ళిలో ఏముంది ? కుటుంబం అంటే ఏమిటి ? తినడం, త్రాగడం ,పడుకోవడం ఇదేగా జీవితం అనుకుంటే మాత్రం పొరబాటు. మనకంటూ ..ఓ ..నలుగురు లేకపోయాక ఎన్ని ఉండి  ఏం  ప్రయోజనం !?
కష్టమైనా -సుఖమైనా పంచుకునే మనసు ఉండాలి, మనిషి ఉండాలి.

నా ఎరుకలో "సరయు " గారు .. ఓ  అసాధారణ వ్యక్తిత్వం అనేకంటే సహృదయ స్త్రీ !  అక్కా మీకు వందనం ...
ప్రేమతో ... అభిమానం తో  ఈ పోస్ట్ ...  వనజ


" కంటేనే అమ్మ అని అంటే ఎలా !" అనే పాట  ఆమె కోసం ...

3, ఆగస్టు 2013, శనివారం

అనుబంధాల అల్లిక

 నాకు ఏ  మాత్రం పరిచయం లేని ఒక కొత్త ప్రాంతం వైపు  హఠాత్తుగా బయలుదేరి వెళ్ళాలని  నేను ఎప్పుడు కలగనలేదు కలల్లో ఎంతెంత దూరాలో ప్రయాణిస్తాను కానీ ఇలా ఇలలో   ఇంత దూరం ఒంటరిగా ప్రయాణం చేయలేదు. చేసే దైర్యం పుష్కలంగా ఉన్నా ఒంటరి ప్రయాణం అంటే విముఖత.  సరే .. నేను వెళుతున్న ప్రయాణం  కేవలం నా ఆసక్తి మాత్రమె కాకుండా నాతొ పాటు నాకు పరిచయం ఉన్న అందరితో పంచుకోగల   చక్కని అనుభవాన్ని ఇస్తుందని,  మనుషుల పట్ల నమ్మకాన్ని పెంచుతుందనే  విషయం నాకు తెలియదు కాబట్టి.... 
ఈ ప్రయాణం నాకు అవసరమా ? అని  ప్రశ్నించుకుంటూనే  బస్ లో  సీట్ ని వెనక్కి దించుకుని అలా కళ్ళు మూసుకున్నాను. ప్రయాణం రాత్రి కావడం వల్లనేమో  బస్ లో ప్రయాణిస్తూ  వెనక్కి జారుకుంటున్న ప్రకృతి ని ఆస్వాదించే అవకాశం లేదు కాని బస్లో అమర్చిన టీవి లో పెద్ద సౌండ్ తో ఒక మాస్ చిత్రాన్ని ప్రదర్శిస్తూ నరకం తొలిమెట్టు పై ఉన్న బావన కల్గించారు మనకి ఇష్టం లేకుండానే యుద్దవాతావరణం లోకి మనని లాక్కువెళ్ళే  భయంకరమైన హింసాత్మక దృశ్యాలు చూడలేక చెవుల్లో వేళ్ళు  పెట్టుకుని బలవంతంగా  కళ్ళు మూసుకున్నాను.

అలా మూసుకున్న కళ్ళని 7 రోడ్స్ .. 7 రోడ్స్ దగ్గర దిగే వాళ్ళు రావాలండీ...  అని బస్ డ్రైవర్  కేకతో ఉలికిపడి తెరచి చూసాను . ఇంకా త్తెల్లవారలేదు ..టైమ్ చూస్తె నాలుగున్నారే ! .. ఈ చీకట్లో నేను వెళ్ళాల్సిన ప్రదేశం కి ఎలా వెళ్ళడం అనుకుంటూ లగేజ్ తీసుకుని బస్ దిగాను. వెంటనే ఆటో వాళ్ళు చుట్టుమిట్టారు శంభుమియా పేట వెళ్ళాలి వస్తారా !? అడిగాను.  ఆ ఏరియా అంతా తెలిసిన దానిలా అడగటమయితే అడిగాను కాని లోలోపల భయం తన్నుకు వస్తుంది. తెలియని ప్రదేశం. ఈ ఆటోవాడు ఎటు తీసుకువెళతాడో తెలియదు. కానీ ఆ భయం కనబడనీయకుండా ఆ ప్రాంతం చాలా చాలా పరిచయం ఉన్నదానిలా నిలబడ్డాను. శంభుమియా పేట ఎక్కడికమ్మా !? అడిగాడు. శనక్కాయల మిషన్ ఉంది కదా .అక్కడికి  అన్నాను సరే .రండమ్మా  అన్నాడు . ఎంత తీసుకుంటావు చెప్పలేదు అన్నాను ఆటో ఎక్కబోతూ. నలబై రూపాయలు అన్నాడతను. బేరం ఆడాలి లేకపోతె నాకు ఈ ప్రదేశం క్రొత్త అనుకుని కనిపెట్టేస్తాడు అనుకుని 30 రూపాయలు ఇస్తాను. లోపలి రావద్దు .రోడ్డు పైనే దిగేస్తాను అని చెప్పాను. సరే నన్నాడు . ఎక్కి కూర్చుని రోడ్డు మార్గాలని చూస్తూ గుర్తు పెట్టు కుంటూ అక్కడక్కద కనబడుతున్న జనసంచారంని పరిశీలిస్తూ మధ్య మధ్యలో ఆటో అతనివంక అనుమానం చూస్తూ ఒంటిమీద ఆభరణాలని కనబడకుండా జాగ్రత్తగా కప్పుకుంటూ ఉన్నాను . పది  నిమిషాల లోపే కనబడే ఆంధ్రజ్యోతి దగ్గరలో ఆటో ఆపించి దిగేసాను.

ఆ ఇంటి ముందు నిలబడి నేను గుర్తు ఉంచు కున్న  ఆనవాళ్ళు ప్రకారం చూసి అదే ఇల్లని నిర్ణయించుకున్నాను. ఇంత ప్రొద్దు ప్రొద్దుటే అపరిచిత వ్యక్తుల ముందు నిలబడటం బావుండదేమో ! ఈ బస్ ఇంత త్వరగా వచ్చి చావాలా?  ఆ డ్రైవర్ కాస్త నెమ్మదిగా బస్  నడపవచ్చు కదా ! తెల్లవారి పోయేది ... అప్పుడు నాకు బాగుండేది అని నా అనుకూలత కి డ్రైవర్ సమయపాలనని ఖూనీ చేద్దామని చూసాను. ఇంటి  ముందు నిలబడి వెళ్ళాలా  వద్దా ,,,  అనే  సందేహం ఏమిటీ? ... పిచ్చి కాని అనుకుంటూ ..  మూసి ఉన్న తలుపుల పై మునివేళ్ళతో  కొట్టాను  ....

ఈ రోజు కి ..ఇంతే ....

2, ఆగస్టు 2013, శుక్రవారం

లాస్ట్ మెసేజ్ ...

లాస్ట్  మెసేజ్ 

నేను ఈ  కథని వ్రాయడంలో కొంత సాహసం చేశాననిపించింది. ఈ కథ వ్రాయడానికి వెనుక నా సునిశిత పరిశీలన ఉంది. సంప్రదాయ స్త్రీల ఆలోచనలలో మార్పు వస్తుంది. ముఖ్యంగా పాశ్చాత్య  సంస్కృతీ అని తెగనాడే మనం . అక్కడ వారికన్నా కొన్ని విషయాలలో తెంపరితనం ప్రదర్శిస్తున్నారు. ఆకాంక్ష - అవసరం - సరదా  ఈ మూడింటి మూలంగానే మనిషి యొక్క బాహ్య ప్రవర్తన ఉంటుందని అనుకోవచ్చు.

స్త్రీల ఆలోచనలో మార్పు నే భరించలేని...  ఆమోదించలేని మన భారతీయ పురుష సమాజం స్త్రీలలో వచ్చిన ఇలాంటి తెంపరితనంని తెగనాడుతుంది.   ప్రస్తుత సమాజంలో కొన్ని వర్గాలలో నెలకొంటున్న స్వేచాయుత శారీరక సంబంధాలు గురించి టచ్ చేసే ప్రయత్నం చేసాను.

ఒక ముఖ్య విషయం  ఏమంటే .. ఈ కథని ఒక ప్రముఖ పత్రికకి పంపి నాలుగు నెలలు వేచి  చూసాను. వారు అనంగీకారం తెలిపారు. "విహంగ" కి పంపాను. అక్కడ ప్రచురించారు.

వెబ్ పత్రికలు  చెత్త కథలని ప్రచురణ చేస్తుంది అనే ఆరోపణ చేసేవారు ఒకటి గమనించాలి. అసలు వర్ధమాన రచయితలూ ఏం  చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని పరిశీలించి సూచనలు చేస్తే  బావుంటుందేమో ! అలాగే కథలలో పాత్రల సృష్టి కి రచయిత వ్యక్తిగతానికి అన్వయించి వ్యక్తిగత ఆరోపణలు చేయడం  కూడా మంచిది కాదేమో  ! ప్రతి పాత్ర సృజన కావచ్చు. లేదా అనుభవాలలో నుండి పుట్టింది కావచ్చు కదా !

ఈ కథ పై మీ సునిశిత అభిప్రాయాలని, విమర్శలని....  ఆహ్వానిస్తూ ...  ఈ క్రింది లింక్ లో ....

లాస్ట్ మెసేజ్ ...  విహంగ  లో నా కథ  చదవండి  ఒక కథా రచయిత గా నేను పరిణితి సాధించాల్సింది ఎంతో ఉంది. ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నాను. మీ సద్విమర్శలని కోరుతూ ...