28, ఆగస్టు 2013, బుధవారం

అష్టమి కష్టమా!?

నిన్న నాకు  ఫేస్ బుక్ లో   మెసేజెస్ లో  ఒక రిక్వెస్ట్ వచ్చింది .  మా పేజ్ ని like చేయండి recommend చేయండి అని .. అది జ్యోతిష్యం కి సంబందించిన పేజ్. నేను అసలు ఒక్క క్షణం కూడా చూడకుండా తొలగించాను. జ్యోతిష్యం పై మీకు నమ్మకం లేదా అంటే అవునని.. కాదని రెండు రకాలుగా తల ఆడించే రకం నేను . అంటే నమ్మకం ఉందొ లేదో అన్నది నేనే తెల్చుకోలేను అన్నమాట.

ఒకసారి ఇలాగే పంచాంగం చూసి  ఆ విషయాన్ని దీర్ఘంగా తలకి ఎక్కించుకుని నేను నాతొ పాటు మా అబ్బాయిని కూడా టెన్షన్ పెట్టిన వైనం .. ఏమిటంటే ఖచ్చితంగా ఇది జరిగి రెండేళ్ళు అయింది .. ఇలాగే కృష్ణాష్టమి రోజున US వెళ్ళడానికి   రిటర్న్ టికెట్ కొనుక్కునే వచ్చాడు . వచ్చేటప్పుడు తెలంగాణా సంపూర్ణ బంద్  ఆ రోజు నానా తిప్పలు పడి  ఇంటికి వచ్చాడు . ఆ వచ్చేటప్పుడే తన లగేజ్ లో చాలా విలువైన వస్తువులు మిస్ అయ్యాయి . అలా జరిగిందని నేను వెంటనే పంచాంగం చూసి " నువ్వు బయలుదేరిన సమయమే మంచిది కాదు .. మళ్ళీ తిరుగు ప్రయాణంకి ఏ తేదీ " అని అడిగి .. ఆ తేదీ చెప్పగానే నీరస పడిపోయాను "ఆ రోజు కృష్ణాష్టమి . అష్టమి పూట ప్రయాణమా !?" అని చిరాకు పడుతూ .. ఈ సారి ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు నాకోకసారి చెప్పి చేయి అని కొంచెం క్లాస్ తీసుకున్నాను .

"అమ్మా ! నీకు చాదస్తం ఎక్కువైపోతుందమ్మా" అంటూ విసుక్కున్నాడు .

" హా ..  మీకే మీరలాగే అంటారు. ఇప్పుడు చూడు ఎన్ని ఇబ్బందులు పడ్డావో ? వేళా విశేషం .అంటూ ఉంటారు పెద్దలు . వాళ్ళేమి ఉబుసుపోక కాకమ్మ కబుర్లు చెప్పలేదు. దానికి ఏదో రీజన్ ఉంటుంది .. అందుకే పెద్దల మాట చద్దిమూట అంటారు అలా .. ఊరికే  త్రోసి పారేయకూడదు " అని చెప్పాను  ఇలా చెప్పి ఊరుకున్నాననుకున్నారా ? మళ్ళీ వెంటనే "పెద్దవాళ్ళు ఏది చెప్పినా వ్యతిరేకించడం ప్యాషన్ అయిపొయింది .. మీలా మేము పెద్దవాళ్ళకి ఎదురు చెప్పలేదు " అన్నాను .

అందుకు .."నిజంగా.. అలాగే ఉన్నావమ్మా! ? నిజం చెప్పమ్మా మా అమ్మవి కదూ గడ్డం పట్టుకుని అడిగాడు బ్రతిమలాడుతున్నట్లు .

నాకు నవ్వు ..(అబద్దం చెపుతున్నాను కాబట్టి ) నవ్వుతూనే నిజం నాన్నా .... కావాలంటే అడుగు .. అన్నాను .

"నిజంగా అడగనా ? " మళ్ళీ ప్రశ్న

"నిజంగానే అమ్మమ్మని అడుగు కావాలంటే "అన్నాను ఆ ఫ్లో లో ......

"ఎక్కడకి వెళ్లి అడగాలి ? అని నవ్వుతుంటే గాని నాకు వెలగలేదు . "అమ్మ " చనిపోయి పుష్కరం దాటిందని. నవ్వులు మాయమయ్యాయి.

నలబై రోజుల  తర్వాత అబ్బాయి ప్రయాణం కి ముందు చాలా చికాకులు ఎదురయ్యాయి . ముందు రోజు ప్రయాణం కావడానికి వీలు కాలేదు ఒక రోజు ముందుగా వెళ్ళి హైదరాబాద్ లో ఉందాం అనుకున్నాం కానీ అప్పటికి  అనుకున్న పనులు ఏవి సరిగా పూర్తవలేదు,  బస్ లు నడవడం లేదు,. ఎక్కడబడితే అక్కడ ప్రయాణించే కార్లని  కూడా ఆపేస్తున్నారు. ప్లైట్ టికెట్స్ కొనుక్కోమంటే రెండు టికెట్స్ మాత్రమే దొరికాయి. లగేజ్  మొత్తం వెళ్ళడం కుదర లేదు . అబ్బాయేమో ఫ్రెండ్స్ లగేజ్ బోలెడు పోగేసాడు  ఏది వదలకుండా అన్నీ పట్టుకుని వెళ్ళాలి అంటాడు   నేను గన్నవరం వరకు వస్తాను, నువ్వు మీ నాన్నగారు వెళ్ళండి నాన్నా..  అంటే వినడు ....."  అమ్మా నువ్వు రావాలి నువ్వు రాకుండా నేను వెళ్ళను" అని దిగులుగా ముఖం పెట్టాడు . ఏదైతే అదయిందని టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని రెంటల్ కార్ ని పిలిచాము.

సప్తమి ఘడియలు దాటాక ముందే అతనిని రమ్మని చెప్పాను అంతకి ముందు బయలుదేరడానికి దుర్ముహూర్తం ఉందని బయలుదేరలేదు . దుర్ముహూర్తం దాటినాక సప్తమి కొద్ది సమయం మాత్రమే ఉంది . అష్టమి రానే వస్తుంది ఆ సమయంలో బిడ్డని బయలుదేరదీయడం ఎలా ? అని నాకు ఒకటే టెన్షన్ . మధ్యలో అబ్బాయిని బాగా విసుక్కోవడం .. జరిగిపోయాయి . అంతలోనే మేము మాట్లాడుకున్న కారు రానే వచ్చింది .  టైం కి చక్కగా వచ్చాడన్న సంతోషంలో డ్రైవర్ కి థాంక్స్ కూడా చెప్పేసాను. మీరు చెప్పిన టైం కి కాకుండా ఆలస్యంగా ఎప్పుడూ రాలేదు కదండీ ? అని అతని నవ్వుతాల ప్రశ్న.

 హడావిడిగా సప్తమి ఘడియలు ఉండగానే ఇంటి నుండి బయలు దేరాం. ఉత్తరం కి ప్రయాణించి బాబా దర్శనం చేసుకుని తూర్పుకి తిరిగి ప్రయాణించి ఆగ్నేయంగుండా దక్షిణం వైపు ఉన్న మెయిన్  రోడ్డుకి చేరుకొని శివపంచాయతన మూర్తుల దివ్యదర్శనం చేసుకుని "అమ్మయ్య " చక్కగా బయలుదేరాం అనుకుంటూ ఉండగా .. "అమ్మా .. నా ఫోన్  ఎక్కడ ?" అన్నాడబ్బాయి. "ఫోన్ మర్చి పోయినా సరే ఇంటికి వెళ్ళడానికి  వీల్లేదు " అని ఖచ్చితంగా చెప్పేసి నేను ఆ నంబర్ కి రింగ్ చేసాను . ఆ పోన్ నా బేగ్ లో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నాకు మా అబ్బాయికి మరోసారి ఈ  చాదస్తాల వాదన మొదలయ్యేది .

మా అత్తమ్మ , అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వు . అబ్బాయితో .. చెపుతున్నారు ."మీ అమ్మ ఎప్పుడూ మంచి-చెడు అంటూ ఇంతగా పట్టించుకోలేదు .. ఇప్పుడు బాగా హైరానా పడిపోయిందంటే అదంతా నీ మీద ప్రేమ వల్లనే !  .. నీకేమి ఇబ్బందులు కలగకూడదని క్షేమం చేరాలని . మీ అమ్మ ఆరాటం " అంటూ రహస్యం చెప్పేశారు . అబ్బాయి .. ప్రశాంతంగా అమ్మ భుజం పై వాలి పడుకున్నాడు . డ్రైవర్ సుబ్రహ్మణ్యం  భోజనం చేయడానికి కూడా ఆగకుండా అతను భోజనం చేయడం కూడా మానుకుని చాలా జాగ్రత్తగా కారు నడుపుతూనే నాలుగున్నర గంటల్లో మేము ప్రయాణిస్తున్న వాహనం  "ఇన్నోవా" ని   అనుకున్న సమయం కంటే  గంట  ముందు గానే "రాజీవ్ గాంధి " విమానాశ్రయంలో ఉంచాడు.

ఇక అక్కడ గంట సమయం ఉండేటప్పటికి  అప్పటి వరకు లోలోపల దాచుకున్న దిగులు బయటపడింది.  అబ్బాయి చేయి పట్టుకుని  నేను ఒకటే ఏడుపు. "అమ్మా ! అందరు ఇటే చూస్తున్నారు  చూడు ..మా అమ్మ.. కి అలా చూడటం ఇష్టం ఉండదు .. కాబట్టి  ఇప్పుడు మా అమ్మ ఏడుపు ఆపేస్తుంది .. అంటూ  నవ్వించడం ,  అక్కడి నుండి ప్రక్కకి తీసుకు వెళ్లి ..ఫొటోస్ తీద్దాం రా..  అంటూ ....  విమానాశ్రయంని  ఫొటోస్ తీయించాడు.  కాసేపటి తర్వాత మళ్ళీ నాకు దుఖం ముంచుకొస్తుంది  ... ఇంకొంచెం సేపటిలో అబ్బాయి చెక్ ఇన్ లోకి వెళితే మళ్ళీ ఎప్పుడో అబ్బాయిని చూసేది .... అని దిగులు . "నాన్నా ! నిన్ను చూడ కుండా ఈ అమ్మ ఎలారా..  బ్రతికేది ? అని  కన్నీళ్లు . "అమ్మా ! నువ్వలా ఏడిస్తే నేనలా వెళ్ళేది ? పోనీ వెళ్ళడం మానేయనా ? ఇంటికి వెళ్ళిపోదాం పద .... " అన్నాడు . "వద్దు " అని అడ్డంగా  తలూపి గట్టిగా కళ్ళు తుడుచుకున్నాను.

నవ్వి "మా అమ్మ గుడ్ " అంటూ అదిగో అక్కడ "ఆడీ" కారుంది చూసొద్దాం రా.... అంటూ తీసుకు వెళ్ళాడు ఆ కారు ని చుట్టూ తిరిగి చూపిస్తూ చాలా  బావుంది కదమ్మా ! అన్నాడు .. బావుంది కాని "మెర్సిడెస్ బెంజ్" కన్నా బాగా కాదు అన్నాను .. అలా కబుర్లు చెపుతూ ఉంటే గంట గడచిపోయింది

5 గంటలు అవుతుండగా .ఇక  లోపలికి వెళదాం  రా ..అమ్మా..!  అన్నాడు .. లోపలికి వెళుతూ ఉంటే  నిలబెట్టి ఇలా ఒక పిక్ తీసుకున్నాను


చెక్ ఇన్ అయి లగేజ్ వెయిట్ వేయించుకుని, వీసా అన్నీ చెక్ చేయించుకుని మళ్ళీ దగ్గరికి వచ్చాడు . "అమ్మా ! నువ్వసలు ఏడవ కూడదు, నువ్వ లా ఏడుస్తుంటే నాకు వెళ్ళబుద్ది కాదు " అన్నాడు . అప్పుడు నేను నవ్వు తెచ్చుకుని .. bye బంగారం అని చెప్పాను . మా నాన్న గారు , అబ్బాయి  వాళ్ళ నాన్న గారు జాగ్రత్తలు చెపుతూ ఉన్నారు . వాళ్ళ నానమ్మ .. కళ్ళ నీళ్ళతో .. జాగ్రత్త బంగారం ..  అంటూ మనుమడిని ముద్దాడారు. మా మరిది గారు .. "జాగ్రత్త చంద్రబాబు ".... లాండ్ అవగానే కాల్ చేయి ' అని చెప్పారు

లిఫ్ట్ వైపు వెళుతూ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ .. నన్ను చూసుకుంటూ .. రెడ్ కలర్ డోమ్ ఉన్న లిఫ్ట్ లోకి వెళుతూ .. అమ్మా.. వెళ్ళొస్తా!  అంటూ చూపులతో చెప్పిన చూపు .... సరిగ్గా రెండేళ్ళ క్రితం నాటిది . ఇప్పుడూ..   నా కళ్ళ ముందు  మెదలాడుతూ  ఉండగా మనసు నిండుగా నా బిడ్డని  అప్పుడు, ఇప్పుడు కూడా దీవిస్తున్నాను .." చల్లగా ఉండాలి బంగారం " అనుకుంటూ ..  మా ఇంటికి అల్లరి కృష్ణుడు .. వాడే ! తను ఇంట లేకుండా .. నేను కృష్ణాష్టమి జరుపుకోలేను ..  ఈ పండుగే కాదు అసలు ఏ పండుగ లేదు మా ఇంట.   తల్లి  ప్రేమతో .. తనతో గడిపిన సమయాలని ఇలా ముచ్చటించుకుంటూ...  కాస్త తేలిక పడతాను అంతే!..

అలా ఆరోజు ఆ ప్రయాణానికి నేను ఎంత టెన్షన్ అనుభవించానో! ఛీ.. ఇంకెప్పుడూ ఈ పంచాంగం చూడటం లాంటి సెంటిమెంట్స్ పెట్టుకోకూడదు, నేను  టెన్షన్ పడటం  మాత్రమే కాకుండా ఇంటిల్లపాది నా వలన టెన్షన్ పడ్డారు . ముఖ్యంగా .. నా బిడ్డ. తను  పైకి ప్రకటించలేదు కాని చాలా చాలా ఇబ్బంది పడ్డాడు ...అనిపించింది  నిజంగా అష్టమి పూట ప్రయాణం కష్టమా !? అనిపించింది కూడా !

మనవారి పట్ల మనకున్న ప్రేమ తో వారికి ఏ ఇబ్బంది కలగకూడదని అనుకుంటాం. అందులో తప్పులేదు కాని ఇలా పంచాగం చూసుకుని పనులు చేయడం, ప్రయాణాలు చేయడం ,జ్యోతిష్యం ,శాంతులు చేయించడం ఇవన్నీ పరిగణన లోకి తీసుకోవడం వల్ల .. కొంత మానసిక శాంతి లోపిస్తుంది. అనవసర  భయాలు ఏర్పడతాయన్నది నిజం. అన్నింటికీ ఆ సర్వేశ్వరుడే ఉన్నాడనుకుని .. ఆయనకీ నమస్కరించుకుని ఎటువంటి సంశయాలు లేకుండా బ్రతుకు గమనంలో సాగిపోవడం నేర్చుకోవాలనుకున్నాను. ఇక తర్వాత ఎప్పుడు అలాంటి విషయాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు.మనం నమ్ముతున్నామా  లేదా ? అన్నదానికన్నా మనం ఇతరులని ఇబ్బంది పెడుతున్నామేమో అన్నదాని గురించి  ఎక్కువ ఆలోచిస్తాను నేను.  ఆకోణంలోనే ఈవిషయం వ్రాసాను కూడా !

ఇక ఈ మధ్య నేను విన్న అనుభవాల గురించి .. జ్యోతిష్యం , పండితుల దోరణి గురించి కొన్ని విషయాలు చెప్పదలచాను .వ్యక్తుల బలహీనతల పై కొందరు ఎలా తమ పాండిత్యంతో అజమాయిషీ చేస్తారో అన్నది నాకు అర్ధమైనప్పుడు .. నిరసించాను . అలాంటి పాండిత్య ప్రకర్ష వల్ల  మనకున్న శాస్త్రాల్ని కూడా మనం వ్యతిరేకిస్తాం.  అలాగే మరికొందరి చేత పరిహసించబడతారన్నది కూడా చాలా  నిజం . నాకు జ్యోతిష్యం, జాతకాలు ఇటువంటి విషయాలు పై బొత్తిగా పరిజ్ఞానం లేదు . ఈ వ్రాయడం కూడా నేను సరిగా వ్రాస్తున్నానో లేదో తెలియదు కాని .. నా ఫీలింగ్స్ ని, నా అనుభవాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేసానంతే.. ! .

ఇక్కడ ఈ పోస్ట్ లో నేను ఎవరిని కించపరచలేదు . దయ చేసి తప్పుగా తీసుకోవద్దని మనవి.  ఎవరి వ్యక్తిగత అనుభవాలు వారికి ఉంటాయి కదా ! అదే దృష్టితో ఈ పోస్ట్ 

11 కామెంట్‌లు:

SRINIVASA RAO చెప్పారు...

RaviTheja (my son) girthuku vachchaadu..no words..lovely

జలతారు వెన్నెల చెప్పారు...

పోస్ట్ అంతా అమ్మ ప్రేమ తో నిండిపోయిఉంది.చాలా బాగా రాసారు పోస్ట్ వనజగారు.

అజ్ఞాత చెప్పారు...

S...we should not blindly follow...
Remembered my brother...he always argued with mom n grandmother regarding the ' tithi'....
I agree with Ur opinion

అజ్ఞాత చెప్పారు...

"మీ అమ్మ ఎప్పుడూ మంచి-చెడు అంటూ ఇంతగా పట్టించుకోలేదు .. ఇప్పుడు బాగా హైరానా పడిపోయింది అదంతా నీ మీద ప్రేమ వల్లనే ! .. నీకేమి ఇబ్బందులు కలగకూడదని క్షేమం చేరాలని .

ఇదే అసలు నిజం మీ శ్రీవారు సరిగానే చెప్పేరు.

పల్లా కొండల రావు చెప్పారు...

అమ్మ ప్రేమ ముందు శకునపరిగణనం ఎంతండీ... పోస్టు నిండా అమ్మ ప్రేమ ఉన్నా అందరికీ ఉపయోగపడే విధంగా , మీరు సంతృప్తిగా ఈ పోస్టు వ్రాశారు. మంచి తలంపులతో చేసేది ఏ సమయమైనా , సందర్భమైనా మంచే చేయిస్తుంది. ఇపుడు మీచేత ఈ పోస్టు వ్రాయించినదీ అదే కదా?

Meraj Fathima చెప్పారు...

అమ్మ ప్రేమకంటే గొప్పవి కావు యే శకునాలూ.. అవి మనం నిర్మించుకున్నవి, మీ పొస్ట్ బాగుంది వనజా.

ధాత్రి చెప్పారు...

చాలా బాగుందండీ పోస్ట్..:))..
ఎవరినీ కించపరచకుండా మీ అభిప్రాయన్ని చాలా బాగా వ్యక్తపరిచారు..:)
అమ్మ ప్రేమే కనబడుతుంది టపాలో..

ranivani చెప్పారు...

చాలా బాగుంది వనజ గారూ !పిల్లలు దూరంగా విదేశాల్లో ఉన్న ,తల్లులందరూ మీ టపా లో తమను తాము చూసుకుంటారు.మీ భావాల్ని చక్కగా వ్యక్తపరిచారు.

ప్రేరణ... చెప్పారు...

వనజగారు చాలా చక్కగా చెప్పారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసాంతం అమ్మప్రేమలో అంతా చెప్పేసారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీనివాసరావు గారు ధన్యవాదములు
@జలతారు వెన్నెల గారు .. ఎలా ఉన్నారు? పోస్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదములు
@అనూ గారు .. థాంక్ యూ !
@కష్టేఫలే..మాస్టారూ ..అదే నిజం :) ధన్యవాదములు
@ కొండలరావు గారు ..ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మేరాజ్ ..థాంక్ యూ డియర్ . ఎలా ఉన్నావ్? కొంచెం బిజీగా ఉన్నాను. అంతే!
@ధాత్రి గారు థాంక్ యూ సో మచ్
@నాగరాణి గారు అంతేనంటారా ? పోస్ట్ నచ్చినందుకు మనసారా ధన్యవాదములు
@ప్రేరణ గారు .. థాంక్ యూ సో మచ్ .
స్పందించిన అందరికి పేరు పేరునా మనసారా ధన్యవాదములు