6, నవంబర్ 2021, శనివారం

గోవు మాలక్ష్మి

 అమ్మా.. గోవుమాలక్ష్మి వచ్చిందమ్మా.. అంటూ గేటు దగ్గరనుండి పిలుపు. 

వాష్ ఏరియా లోకి వెళ్ళి కిందకి తొంగి చూసాను. గోధుమరంగు బక్కచిక్కిన ఆవు కు శరీరమంతా అక్కడక్కడ గుండ్రటి పసుపుచక్రాలు వాటిపై కుంకుమబొట్లు మెడలో నల్లని దిష్టితాడు కొమ్ములు రెండింటికి కలిపి చుట్టిన మూడుపోగుల జడఅల్లికతో నేసిన తాడు.. చూడగానే కాస్త గౌరవభావం. అది అనాదిగా గోవు పట్ల సంస్కృతి సంప్రదాయం నేర్పిన గౌరవభావం.. కొత్తగా పుట్టుకొచ్చినది ఏమీ కాదు. 

అంతలోనే చిన్న నిరసన నాలో. గోవు రైతు పాక లోనో శాల లోనో చెట్టు క్రిందనో కాక లేదా దేవాలయ ప్రాంగణంలోనో కాక ఇల్లిల్లూ తిరగడం ఏమిటి!? గోవు ఉదరపోషణకు కావాల్సింది సందెడు పచ్చగడ్డిపరకలు

వాటెడు ఎండుగడ్డి ఓ బకెట్ కుడితినీళ్ళు. 

గోవును పోషిస్తూ అది పాలిస్తే తాగాలి. విసర్జితాలను సంవత్సరానికి పొలానికి ఎరువుగా చల్లుకోవాలి కానీ గోవును మహాలక్ష్మిగా చూపి ఇల్లిల్లూ తిప్పి డబ్బులు దండుకోవడం ఏమిటి? 

గోవును పూజించాలంటే స్నానం చేసి వుండాలి. మూడు ప్రదక్షిణలు చేయాలి. ఇలాంటివేమో వుంటాయని గుర్తుకొచ్చింది. గోవును ప్రేమించడానికి నాలుగు గడ్డి పరకలో ఓ అరటిపండో తినిపించి గంగడోలు నిమిరితే చాలదూ.. అయినా

పశువులకు కృతజ్ఞత తెలుపుకోవడానికి మనం ఒక ప్రత్యేకదినం నిర్ణయించుకున్నాం. అది సంక్రాంతి వెళ్ళిన మర్నాడు వచ్చే కనుమ పండుగ. అప్రయత్నంగా గుర్తుకొచ్చిందీ సినిమా పాట.. 

పాడిచ్చే గోవులకు పసుపు కుంకం

పనిచేసే బసవనికి పత్రీ పుష్పం 

గాదుల్లో ధాన్యం, కావిళ్ళ భాగ్యం 

కష్టించే కాపునకు కలకాలం సౌఖ్యం

మనం కృతజ్ఞతగా చూసే విషయాలకు ఇంకొంచెం శ్రద్ద కలిపితే దానిని భక్తి అంటారేమో నాకు తెలియదు.  భక్తి భావాన్ని  ఉదారంగానో కానుకగానో దండుకునే విధానమే.. ఇంటింటికి గోవు మాలక్ష్మి రావడం. ఇలా ఆలోచనలు చేస్తున్నా. 

మళ్ళీఅంతలోనే బుద్దిని మందలించుకుని “అబ్బ .. ఇవన్నీ ఎందుకు ఆవుకు రెండు అరటిపళ్ళు.. ఆవు యజమానికి ఓ పది రూపాయలూ ఇస్తే పోలా” 

అనుకుంటూ వుండగానే.. గోవు మాలక్ష్మి పక్కింటికి వెళ్ళిపోయింది.

నా స్నేహితురాలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాక రెండురోజులకు కోవిడ్ బారిన పడిందంట. రెండవ డోస్  వేయించుకోమని గుర్తుచేస్తున్న అందరినీ కోప్పడుతుంది. మీ వ్యాక్సిన్ వద్దు మీరు రావద్దు అని. గో మూత్రం తాగితే కోవిడ్ రాదు ఏమి రాదు అంటుంది మొండిగా.. ఏమి చేయలేం. మౌనంగా వుండిపోయాను. 

ఏదిఏమైనా ఇంటింటికి వుండాల్సిన పశుసంపద మాయమయ్యాక..  మనుగడలో అన్నీ సరళీకృతమైన వ్యాపార రహస్యమే! 

భక్తి.. ప్రత్తి వ్యాపారం మాత్రం కాదు.

కార్తీకం మొదటిరోజున..  చల్లగాలికి ముక్కు కారుకుంటూ .. వ్రాసిన పోష్ట్.. 🙂  క్షమించాలి మనోభావాలు దెబ్బతింటే.



5, నవంబర్ 2021, శుక్రవారం

మేఘ రాగమ్

 మేఘ రాగమ్ -1

(ఇంట్రో)

నీలాంజనా… అపుడపుడూ ఇలాగే ఉత్తరాలు వ్రాసుకుందాం. కలలను విశ్లేషించుకుందాం. ఆకాంక్షలను వెల్లడించుకుందాం.మనసు విప్పి అనేక విషయాలు ముచ్చటించుకుందాం. మనచుట్టూ కమ్ముకుంటున్న భయానక వాతావరణాన్ని చెదరగొట్టుకుందాం. అపోహలు తొలగించుకుందాం. జీవితాల చుట్టూ అలుముకున్న వేదనలను కరిగించుకుందాం. ఇతరుల కోసం కురిసే కన్నీరవుదామ్ చిలకరించుకునే పన్నీరవుదామ్. ఇదే మేఘ రాగమ్.

ప్రియ నేస్తం నీలాంజనా..

ఎలా వున్నావు! మనసారా మాట్లాడుకుని చాలా కాలమైంది కదా.. అందుకే ఈ ఉత్తరం. అయినా ఉత్తరాలు చదువుకునే తీరిక ఎక్కడుంది చెప్పు. మన వాట్సాప్ స్టేటస్ చూసుకుని ఓ మెసేజ్ అటునిటూ ప్రవహిస్తూ వుంటే చాలు ఎంతెంత దూరమైనా చెంతనే వున్నట్టు అదో భరోసా నిశ్చింతానూ!  మన తరం ఒక విధంగా దురదృష్టవంతులం. నిన్నైతే అనలేను కానీ నా గురించే నేను చెబుతున్నా. ముందుగా నీతో పోల్చుకుంటూ.. నా ఆలోచనలు నీతోనే  పంచుకుంటూ.. 


ఎనబై యేళ్ళు దాటిన అత్తగారైన వృద్దురాలి సేవలో అంకితమైన నిన్ను చూస్తుంటే.. గర్వం కల్గుతుంది.  నా ఊహాచిత్రంలో పసిపాపల సేవలో నిమగ్నమైన ఓ తల్లి గోచరిస్తుంది.

కానీ నన్ను  నీతో పోల్చుకుంటే సిగ్గేస్తుంది. ఎందుకంటావా? డెబ్బై పైబడిన నాన్నను ఎనబై దాటేసిన అత్తమ్మను చూసుకో లేనందుకు. వారికి కనీసం ఓ కప్పు కాఫీ నో టీ నో తయారుచేసి చేతికి అందివ్వలేని స్థితిలో వున్నందుకు. వారు వారి గృహాలను అలవాట్లను వారికి నచ్చిన మెచ్చిన సౌకర్యాలనూ వొదిలి ఈ అపార్ట్మెంట్ సంస్కృతిలో  ఇమడలేమని  బాహాటంగా అంటుంటారు.ఆర్దిక బలిమి వున్న వారిద్దరూ  వారి ఇగోలను వొదలలేరు. అందుకే వారిని నేను బలవంతం చేయడం లేదు. అలా అని వొంటరిగా మిగిలిన  నేనూ వెళ్ళి వారివద్ద వుండనూలేను. అటు బిడ్డలకు ఇటు పెద్దలకూ మధ్య మన తరం వారు వారధులమే కానీ ఎవరూ ఎవరితోనో కలిసి జీవించలేని కాలంతో యాంత్రికంగా బ్రతకడం అలవాటైపోయింది. ఇది ఆర్ధికంగా ఇబ్బందులు లేని వృద్దజీవనంలో ఒక పార్శ్వమైతే మరొక పార్శ్వం బీదరికంతో అలమటిస్తున్న వృద్దుల జీవితాలు.


నన్ను ఈ మధ్య అతిగా కదిల్చివేసిన సంఘటన  ఏమిటంటే వృద్దాప్యంలో వున్న తల్లిని ఆదరించలేక కన్నబిడ్డే స్మశానవాటికలో వదిలివెళ్ళిన కథనం చూసి మనసు విచలితమైపోయింది. అది చూసిన తర్వాతే చాలా విషయాలు నీతో పంచుకోవాలనిపిస్తుంది.  అసలు మన వృద్దాప్యం గురించి మనమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నామో తెలుసుకుంటూ ఇంకేమి తీసుకోవాలో అని ఆలోచిస్తూ వున్నాను. 


పూలను సృష్టించినవాడే తుమ్మెదలను సీతాకోకచిలకలను సృష్టించాడు కానీ గొడ్డలిని సృష్టించలేదు.. అన్నానొక సందర్భంలో.  ప్రకృతిని గౌరవించినట్లే మన ఉనికికి కారణమైన తల్లిదండ్రులను గౌరవించడంలో సంరక్షించుకోవడంలో మనమెందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాం నిర్దాక్షిణ్యంగా వుంటున్నాం!? నిజంగా అంత అసహాయతలో మునిగిపోయామా లేక అశ్రద్ద చేస్తున్నామా? అనిపిస్తుంది. 


పెద్దలున్న పంచన సిరులు తాండవిస్తాయని పెద్దల మాట. అది నిజమని చాలామంది అంగీకరిస్తారు. కానీ బిడ్డలెందుకు ఇంత కాఠిన్యంగా వుంటున్నారు? నానాటికి లక్షలమంది జీవితాలు ఎందుకింత దుర్భరంగా మారుతున్నాయి. నిరుద్యోగం పేదరికం నియంత్రణ లేని ధరలు ఆర్ధిక అసమానతలు ఉగ్రవాదం ప్రకృతి వైపరీత్యాలు కాలుష్యం ధన వ్యామోహం విశృంఖలమైన స్వేచ్ఛా జీవనం మత్తుపదార్దాల సేవనం ఇంకా ఇంకా అనేక కారణాలతో మనిషి జీవితం నానాటికీ కుంచించుకుపోతుంది. మానసిక శారీరక అనారోగ్యాలతో మనిషి విలవిలలాడుతున్నాడు. వృద్దాప్యం అయితే ఇక చెప్పనవసరం లేదు.


ముడుతలు పడిన శరీరంతో  శక్తి సన్నగిల్లబడిన దేహంతో వొకింత వేగం మందగించిన నడకలో  నరాల మధ్య ప్రవహించే రక్తంలో ఆవేశం అణిగి నెమ్మది సంతరించుకున్న ఆలోచనల్లోని అనుభవసారాన్ని విప్పి చెప్పే గళాలను వినే ఆసక్తి సమయం మనకు లేవు. వృద్దాప్యాన్ని బాల్యాన్ని ముడిపెట్టి  నిశ్చింతగా మనగల్గే  కుటుంబ భద్రత మనకు కరువైంది. వ్యక్తి స్వేచ్ఛకు దాసోహం అయిపోయిన మనం చిన్న మందలింపును తట్టుకోలేకపోతున్నాం. ఎడగారు పిల్లలే కాదు  ఎడగారు తల్లిదండ్రులు అయిపోతున్నారందరూ.. 


ఊరు పొమ్మంటుంది కాడు రావద్దు అంటుంది ఏం చెయ్యాలి అని దీనంగా వేడుకునే పేద వృద్దుల ఆవేదన కలచివేస్తుంది. కనిపెంచిన బిడ్డలే తల్లిదండ్రులను ఆదరించక రాక్షసుల మాదిరిగా ప్రవర్తిస్తుంటే వారికి ఎంత వేదన. ఆ మూగరోదనలు నిస్తేజంతో కన్నీరు ఇంకిన గాజు కళ్ళు మేమింకా ఎందుకు బ్రతికివున్నాం భగవంతుడా! అని  విలపించే రోదనలు వారి వేడికోళ్ళు హృదయఘోష వినగల్గే బిడ్డలు అయినవాళ్ళు ఎందరు? వృద్దాప్యం ఎంత శాపం!?


మనుషులు ఇంత కరుడుగట్టిన కాఠిన్యంతో ఎలా బ్రతకగల్గుతారు అనే ఆశ్చర్యం వేస్తుంది. పుట్టుకముందు మనచుట్టూ కొన్ని ఆశలు మమకారాలు అల్లుకునివుంటాయి. పుట్టాక యెదుగుదల క్రమంలో జాగ్రత్తలు ఆంక్షలు ఆకాంక్షలు వుంటాయి. అధికారాలు అహాలు అసక్తతలూ నిస్సహాయాలు ప్రేమరాహిత్యం అన్నీ భరిస్తూనే వృద్దాప్యపు వొడ్డుకు యెప్పుడొచ్చి చేరుకుంటారో కదా! తరచిచూసుకుంటే యెన్నో అసంత్రుప్తులు ఆవేదనలూ ఆరోపణలూనూ.  ఎవరిమీదో ఒకరిమీద ఆధారపడే స్థితిలో ఎన్ని ఆలోచనలూ ఎంత వేదన!


వృద్ధాప్యం ఓ శాపం కాదు, వ్యాధి కాదు, అది రెండో బాల్యం’’ అన్నారట తిరుపతి వేంకట కవులు.

మన భారతదేశంలో పదహారు కోట్ల మంది వృద్ధులు బిడ్డల నిర్లక్ష్యాలకు గురైన వారు అనాధలగా వున్నారట. తల్లిదండ్రులను దేవతలుగా భావిస్తారనుకునే ఈ దేశంలో కుటుంబజీవనానికి గొప్ప చిరునామా అనుకున్న మనదేశంలో ఉన్న పరిస్థితి ఇది. ప్రపంచ వ్యాప్తంగా కూడా వృద్దులను నిర్లక్ష్యం చేస్తున్నారు.  నిజం చెప్పాలంటే ఇది ఉగ్రవాదం లాంటి ముఖ్యమైన సమస్య. 

 

వృద్దులు పిడికెడు మెతుకుల కోసం పెట్టే ఆకలి కేకలు రోగగ్రస్త శరీరాలతో వారి ఆలాపనలు  అరుపులు ఈ ప్రపంచానికి వినబడదు వినిపించుకోదూ.   వారి అరుపులు వారికే  ప్రతిధ్వనులతో  వినబడి  జీవితంపై అసహనం అసహ్యం పుట్టిస్తుందట. ఆ అసహాయ జీవం పిడికెడు ప్రేమ కోసం తహతహలాడుతూ  చకోరంలా ఎదురుచూస్తుంది. తుదకు  ఏదో ఒకనాడు మరణిస్తుంది. 


మా పక్కన నివసించే ఒక వృద్దజంటను గమనిస్తూ వుంటాను. బిడ్డలతో అంటీముట్టనట్లు వుంటారని అనుకునేదాన్ని. కానీ కరోనా కాలంలో బిడ్డల క్షేమం కోసం వారు ఎంత అలమటించారో. బిడ్డలు వారి క్షేమసమాచారం ఎలానూ విచారించలేదు కానీ వారు ఎంత ఆత్రుత ప్రదర్శించారో తెలుసా! వారికి అయినవాళ్ళపై బిడ్డల ప్రవర్తనపై విసుగు విరక్తి రెండూ వచ్చాక మనుషులను వద్దనుకోవటం మరణించడం కన్నా తక్కువేమీ కాదు. చుట్టూ వున్న మనుషులు చెప్పాపెట్టకుండా మాయమైపోతున్నప్పుడు మనతో అనుబంధం వున్న మనుషులు హఠాత్తుగా గుర్తుకు వచ్చి  అయినవారికి గుబులు పుట్టిస్తారనుకుంటా.  ఆ వృద్దులిరువురూ ఆత్రుతగా వారి కుశలం అడగాలని ఫోన్ పట్టుకుని మళ్ళీ అంతలోనే ఆగిపోవడం. అపుడు నాకనిపించింది మనుషులు సంకోచాలను జయించడం అనుకున్నంత తేలికైన విషయం కాదు. సంకోచం జయించినపుడు వచ్చే స్వేచ్ఛ ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు కానీ కచ్చితంగా సంతోషాన్ని మాత్రం ఇస్తుంది కదా అని. 


తల్లిదండ్రులను ధనం కోసం పీడించే పిల్లలూ వున్నారు. వారు ఆశించినవి

ఇవ్వడం కూడా అంత తేలికైన విషయమూ కాదు. అది శారీరక శ్రమా వస్తు రూపమా వడ్డీ రూపమా స్థిరచరాస్తులా అన్నది కాదు. అన్నింటి మీద తన హక్కులో ఇతరుల హక్కులో ఇష్టాలో అయిష్టాలో యెన్ని కలగాపులగమై వుంటాయసలు. ఇవ్వలేదని నిరసన అలక ఆరోపణ అన్నీ ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతూ వుంటాయి. అవి  వృద్దుల మనసుకు తెలుస్తుంటాయి. మేమేం బండరాళ్ళం కాదుగా.  బిడ్డల మాటలు  ప్రవర్తన  లోపలి మనిషిని పట్టిస్తాయి. ఒకవేళ వాటిని అవసరం మేర దాపెట్టినా మేము చూసింది విన్నది నిజం కాదనీ తెలుస్తూనే వుంటుంది.  ఎందుకు ఇంత బాధని వున్నదంతా ఇచ్చేసాము,  ఇక తర్వాత మా ముఖం చూసినవాళ్ళే లేరు అని వాపోయారు.  ఇలా అన్నీ బిడ్డలకిచ్చేసి అనాదరణకు గురైన అనాధలైన వృద్దుల గుండెల్లో చెప్పలేని కథలెన్నో.. అందుకే అంటున్నా, మన పూర్వులు చేసిన తప్పులు మనం చేయకుండా మనకోసం మనం కొంత సమయం కేటాయించుకుని అందులో లీనమైపోదాం.వీలైనంతగా బిడ్డల మీద ఆధారపడకుండా గౌరవంగా జీవనం సాగించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఉరుకుల పరుగుల జీవనంలో యెపుడైనా మన కోసం మనం ఆగి చూసుకున్నామా అని విచారపడుతున్నాను కూడా.


కూటికిగుడ్డకు నోచుకోని నిరాదరణ పాలైన వృద్దులు దిక్కులేని రెక్కలు విరిగిన పక్షులై దీనస్థితిలో పుట్ పాత్ లపైన స్మశానాల పంచన కాలం వెళ్ళదీస్తూ యెంతకూ రాని మరణం కోసం దుఃఖిస్తూ కన్నీరు కూడా రాని గాజుకళ్ళతో నిర్వేదంగా చూస్తున్న చూపుతో కలవరపెడతారు. ఎవరిదీ నిర్లక్ష్యం. ఎవరిదీ పాపం!? ఎక్కడుందీ మానవత్వం. వీరిని సేవించడానికి ఆకలి నింపడానికి యెన్ని ఆపన్నహస్తాలు కావాలి.అమెరికాలో మరికొన్ని దేశాలలో లాగా వృద్ధుల భాద్యతను ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుందేమో!


పిల్లలు కూడా ఎంతసేపూ వారి వారి వ్యక్తిగత అభిరుచులకూ ఆకాంక్షలకూ అనుగుణంగా నడుచుకోవడమే తప్ప ఇతరుల గురించి ఆలోచించడం అంటే మానేసారు సరే.. కన్న తల్లి తండ్రి రక్త సంబంధం గురించి కూడా ఆలోచించకుండా వుండటం యెంతవరకూ సబబు అనుకుంటున్నాను.  వృద్దురాలైన తల్లికి గ్లాసుడు పాలు కొనడానికి డబ్బులేదన్న కొడుకు  పట్టుమని పదేళ్ళు లేని  తన పిల్లల కోసం మేకప్ కిట్ ల కోసం వేలకువేలు ఖర్చు పెట్టడం వింతగా తోసింది. ఏ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం మనం. ఎంత విచారంగా వుంటుందో ఇవ్వన్నీ చూస్తుంటే.


ఇంకొక విషయం చెబుతాను విను. ఒక స్త్రీ మూర్తి కథ ఇది. నాకు పిన్ని  వరుస అవుతారు ఆమె. కొడుకు ఆమె ఆశలకు విభిన్నంగా వివాహం చేసుకున్నాడు. దానిని ఆమె దశాబ్దాలుగా అంగీకరించలేదు జీర్ణం చేసుకోలేదు. అనారోగ్యం కల్గితే ఆసుపత్రికి కూడా వెళ్లదు.ఆమెకు పిసినారితనం లేదా డబ్బు వెసులుబాటు లేకపోవడమేమో కాదు. తనకు తనమీద శ్రద్ద లేకపోవడం,  ఆసుపత్రికి వెళ్ళడం పట్ల అయిష్టత,బద్దకం, నిర్లిప్తత కూడా కావచ్చేమో.  కానీ ఆమె పెదవులపై ఎపుడూ ఆరోపణ కొడుకుపై కోడలిపై భర్తపై ఆఖరికి ఆమెపై ఆమెకు కూడా. మనకు వొకరు చేసే అన్యాయం కన్నా మనకు మనం చేసుకునే అన్యాయం ఎక్కువ అని చెప్పాలనిపించింది. మనుషులు పైకి కనబడేదానికన్నా అంతర్గతంగా విభిన్నమైన వాళ్ళు. వాళ్ళు హఠాత్తుగా  షాక్ యిస్తూ వుంటారు. నిజమా నిజమా అని మనం పదే పదే గిచ్చి చూసుకునేంతగా. అందుకే ఎవరిపైనా కచ్చితమైన అంచనాలు పెట్టుకోకూడదు.  బిడ్డలైనా సరే వారిని గుడ్డిగా నమ్మకూడదూ.  నమ్మకం పక్కన అపనమ్మకం వుండాలి పొర క్రింద పొరలా. మనుషుల మధ్యే కాదు బంధాల మధ్య కూడా ధనం ప్రవేశించి నీకింత సేవ చేస్తే నాకెంత ఇస్తావు అని అడగటాన్ని సహజంగా తీసుకోవాల్సి వస్తుంది. అమ్మనాన్నలంటే ఆఖరి రక్తం బొట్టు వరకూ ఉదాత్తంగా ఇచ్చేవారే కదా..అది మరుస్తుంది పిల్లల లోకం.


అప్రయత్నంగా ఎప్పుడో చదివిన కథలు గుర్తొచ్చాయి “రుకైయ్యా రీహానా” ఉర్దూ రచయిత వ్రాసిన “తల్లి” కథను నేనెప్పటికీ మర్చిపోలేను. ఇంకో కథ “జహీదా హీనా” అనే రచయిత వ్రాసిన “తితిలియోం దూండ్నే వాలే” అన్న కథ తెలుగు అనువాదంలో “నిష్క్రమణం” అనే శీర్షికతో చదివినపుడు ఎంత కదిలిపోయానో. అలాగే ఇటీవల చదివిన తమిళ రచయిత  “పెరుమాళ్ మురుగన్” వ్రాసిన అమ్మ కథ ఎంత హృద్యంగా వున్నాయో!  వాటిని చదివిన మనుషులెవ్వరూ అమ్మనాన్నలను నిర్లక్ష్యం చేయరు అనిపించింది. నేను చదివిన అత్యుత్తమ తల్లిదండ్రుల కథలను సంపుటిగా వేసి పంచిపెట్టాలనిపిస్తూ వుంటుంది. ప్రేమ కథలు కాదు ఇపుడు కావాల్సింది. తల్లిదండ్రులను వృద్దులనూ ప్రేమించి ఆదరించే విధంగా కఠినశిలగా మారిన హృదయాలను తుత్తునియలు చేసే సాహిత్యం సినిమాలు చిన్న చిత్రాలు రావాల్సిన అవసరం వుంది. వీధి కుక్కల కళేబరాలవలె దిక్కుమొక్కు లేని అనాధ శవాలుగా మనుషులు మిగలకూడదని నా ఆశ ఆకాంక్ష. మీ అత్తగారితో పాటు అమ్మను కూడా మీ ఇంటికి తెచ్చుకుని ఆమెకూ నీ సేవనూ ప్రేమాప్యాయతలనూ పంచిపెట్టాలని కూతురివైతే మాత్రం ఏమిటీ అమ్మను చూడటం కూడా నీ భాద్యతే కదా అని నీకు గుర్తుచేయాలని అనిపించింది. 


జీవిత తీరం దాటడానికి ఏం కావాలి చెప్పు? ఓ  రెండు చాలు. పిడికెడంత ప్రేమ చిటికెడంత ఓదార్పు. వృద్దాప్యాన్ని  అదే రెండో బాల్యాన్ని మన బిడ్డల బాల్యాన్ని కాపాడినట్లు పదిలంగా కాపాడుకుందాం. అదే మనం చూపే అసలైన ప్రేమ భాద్యత. వృద్దులను వినడం ఒక వరం చాదస్తపు కబుర్లు అని కొట్టి పడేయకుండా మనసుపెట్టి వింటే ఎన్నెన్ని అనుభవపాఠాలు అనుకున్నావు. వారి కబుర్లలో చరిత్ర దాగివుంటుంది.లోకరీతి వుంటుంది.వారు అధిగమించిన అవరోధాలు వారి త్యాగాలు కఠినమైన మాట వెనుక దాగున్న మంచి విషయాలు ఇలా ఎన్నెన్నో. 

వృద్దుల అనుభవాలు జీవనసారం. వారి మాటను పెడచెవిన పెట్టకుండా విని ఆలోచిస్తే మంచి జరుగుతుంది అని నమ్మేదాన్ని. ఇప్పటికీ నమ్ముతాను. వృద్దుల కౌన్సిలింగ్ యువతను పెడత్రోవ పట్టకుండా కాపాడుతుంది. నాయనమ్మలను అమ్మమ్మలను తాతయ్యలను మీ పిల్లలకు కానుకలుగా ఇవ్వండి అని విదేశీ తల్లిదండ్రులకు చెప్పి చెప్పి వెగటు కల్గిస్తున్నానట. నా కొడుకు   హాస్యంగా చేసే ఆరోపణ. ఇపుడు నువ్వేమంటావో! 


చివరగా మనుషులైన వారందరిని ఒకటే కోరుకుందాం...


“మిమ్మలను ప్రేమించే వారి హృదయాలను ఎప్పుడూ గాయపర్చకండి. 


ఎందుకంటే వారు మిమ్మల్ని యేమీ అనలేరు. 


మౌనంగా మీ జీవితం నుండి నిష్క్రమించడం తప్ప.” అని. 


వృద్దుల యొక్క  సంతోషపు జీవనసూచికతో  మాత్రమే కుటుంబానికి అర్దాన్ని దేశానికి అభివృద్దిని ప్రపంచానికి శాంతిని కనుగొనగల్గం అనిపిస్తుంది. 


                                                                                    ఉంటాను మరి..

                                                                                 ప్రేమతో నీ ప్రియ నేస్తం 

                                                                                        “అమృత”




1, నవంబర్ 2021, సోమవారం

ప్రేమే నేరమౌనా!?

 భోజనం బల్లపై కంచాలు పెడుతుంది దేవకి. ఎలక్ట్రిక్ కుక్కర్ లో  తయారై వున్న బిర్యాని గిన్నెను డిష్ మ్యాట్ పై ఉంచింది అంతకుముందే.  సోఫాలో కూర్చుని మొబైల్  చూసుకుంటున్న కూతురు తలతిప్పి చూసి మసాలా వాసనను ముక్కుతో ఎగబీల్చి బిర్యానీ అనుకుంటా అంది తమ్ముడితో. మొబైల్ లో నుండి తలెత్తి చూసి బ్రహ్మాండం బద్దలైందన్నమాట అన్నాడతను. 


“అదంతా ప్రేమేనంటావా నాకైతే నమ్మశక్యంగా లేదు”

అని భుజాలను ఎగరేసింది. నిమ్మకాయను ముక్కలుగా కోస్తున్న దేవకి పిల్లలిద్దరిని గమనిస్తూవుంది. 


చేతులు కడుక్కొని వచ్చి బల్లపై వుంచిన కంచాలలోకి బిర్యాని పెట్టి చికెను కూరను వడ్డించి ప్లేట్స్ ను రెండింటిని రెండుచేతులతో తీసుకెళ్ళబోయాడు వాసుదేవరావు.


“ఎక్కడికీ అటుతీసుకువెళతారు, వాళ్ళే వచ్చి ఇక్కడ కూర్చుంటారు” అంది భర్త తో.


“ఎక్కడైతే ఏముంది పిల్లలు తినడం కావాలి కానీ “ అనుకుంటూ ప్లేట్స్ వారిచేతికిచ్చి ఫ్రిజ్ తెరిచి నీళ్ళసీసాలు కూడా వారికి అందించాడు. 


దేవకి భర్త ప్లేట్లో వడ్డించింది. తను వడ్డించుకుని కుర్చీ లాక్కుని కూర్చుంది. భర్త  వచ్చి కూర్చున్నాక తినొచ్చు అని. అతనొచ్చి  ప్లేట్ తీసుకుని వెళ్ళి పిల్లల మధ్య కూర్చున్నాడు. ముగ్గురూ తింటూనే తింటున్నదానికి వొంకలు పెట్టారు. 


“డాడీ అసలామెను ఎందుకు చేయనిచ్చావ్, బిర్యానీ తిన్నట్టు లేదసలు. పసుపేసిన ఉప్మా ముద్ద తిన్నట్టు వుంది. చికెన్ కర్రీ కూడా టేస్ట్ గా లేదు “ అంది కూతురు సిరి.


“మీ డాడీకి వచ్చినట్టు నాకు వంటచేయడం  రాదు.అలాగే రెస్టారెంట్ టేస్ట్ ను తెప్పించడం నావల్లకాదు. శుభ్రంగా ప్రేమగా చేసింది తింటే మీకు ఆరోగ్యం నాకు ఆనందం “ అంది . 


“నీ ఆనందం కోసం మమ్మల్నీ చప్పిడి కూడు రుచిపచీ లేని చెత్తను తినమంటావా, మమ్మీ! మా వల్ల కాదు నీ వంట తినడం. డాడీ నీకు దణ్ణం పెడతాను నువ్వే వంట చేయి “అంది మరొకసారి వడ్డించుకోవడానికి వచ్చి. 


దేవకికి ఒళ్ళు మండిపోయింది. “కుంభాలకు కుంభాలు మెక్కుతానే వుంటావు. వొంకలు పెడతావు. అంత వొంకలు పెట్టేదానివి మీ నాన్ననైనా వండి పెట్టమని అడగడం ఎందుకు?  ముడ్డిమీదకు ముప్పై ఏళ్ళు వస్తున్నాయి వంటచేయడం నేర్చుకోవడమో అమ్మ చేస్తుంటే సాయం చేద్దాం అన్న ఇంగితం మాత్రం లేదు. “


“నా ఇష్టం నేను డాడీతోనే వంట చేయించుకుంటాను ఆయన వండి పెడితేనే తింటాను. నీ ముష్టివంట తినడం నీ దెప్పుళ్ళు భరించడం నావల్ల కాదు “ అంటూ తినడం ఆపి తింటున్న ప్లేట్ ను కోపంగా సింక్ లో పడేసి పంపు కట్టెయ్యకుండానే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. 


వాసుదేవరావు భార్య వైపు కోపంగా చూసాడు. కొడుకు తల్లి వైపు నిరసనగా చూస్తూ “బ్రహ్మాండం బద్దలవుతుందని నేను ముందే చెప్పాగా” అన్నాడు. 


ఇద్దరూ తిన్నంత తిని నొప్పించే మాటలతో ఆమెకూ కడుపునింపేసారు. కూతురుకు గిన్నెలో పెరుగన్నం కలిపి తీసుకువెళుతూ.. “ ఇపుడు నీ కళ్ళు చల్లబడినయ్యా” అన్నాడు భర్త.


కళ్ళనీళ్ళు తింటున్న కంచంలో పడతాయని చీరచెంగుని అడ్డుపెట్టుకుని ముఖం పక్కకు తిప్పుకుంది. ఇది ఆమెకు కొత్తేమికాదు.. 


పిల్లల భావస్వాతంత్ర్యప్రకటన ఆమెను ముల్లులా గుచ్చుతూనే వుంటుంది. మరీ మనసు నొచ్చుకున్నప్పుడు మాత్రం కళ్ళనీళ్ళు ఊరుతుంటాయి.


ఆలోచనల పరంపర.. 


“పిల్లలతో పంతాలు ఏమిటీ.. వారివి అంతా ” బూ.. బు” అనుకో”


“తండ్రి పిల్లలను ప్రేమిస్తే ఈర్ష్యపడే తల్లిని నిన్నే చూస్తున్నా” అనడం


తనొక పాడి పశువు. సంపాదించి వారికి ఏటి ఎమ్ కార్డును పువ్వులలో పెట్టి అందించే పాడిపశువు” అంతే!


తండ్రి మాత్రం ముద్ద ముద్దకు నెయ్యి పోసి కాలుకందకుండా పిల్లలు ఏవి అడిగితే అవి అపురూపంగా అందించడమే తన పని అన్నట్టు వుంటాడు. సినిమాలు షికార్లు రెస్టారెంట్ లకు తిప్పడం. మొత్తానికి సమాజానికి మంచి తండ్రి మంచి భర్తగా కనబడతాడు.


పైగా దేవకిపైనే నెపం


“ఆమెకు  సంపాదిస్తున్నానని అహంకారం. పేచీకోరు జగమొండి పిల్లలకు ప్రేమ పంచడం రాదు. తల్లి లాగా ట్రీట్ చేయదు. అడుగడుగుకి  ఆంక్షలు పెట్టాలని చూస్తుంది. పిల్లలతో ఫ్రెండ్ లాగా మసలాలి అంటే ఊరుకోదు. క్రమశిక్షణ వుండాలి ఎవరి పనులు వారు చేసుకోవాలి అని అంటుంది అని ప్రచారం చేస్తూ వుంటాడు.


“పిల్లలకు మనం తప్ప ఎవరు చేసి పెడతారు,మనమే కదా అన్నీ “ అని నెత్తికెక్కించుకునే తండ్రి అతను.వారేమో నూతిలో కప్పల్లాగా సమాజసృహ లేకుండా వ్యక్తిగత ఆనందం సంతోషం తప్ప మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా వుంటారు.చదువు ఉద్యోగం స్వీయానందం తప్ప సమాజంతో పనిలేదు అన్నట్టు కేజ్ బర్డ్స్ లాగా తయారయ్యారు. అది భరించలేదు దేవకి.  


ఆమెలో నిత్యనూతన వేదన ఒకటే! తల్లి ఉనికిని భరించలేని పిల్లలను చూస్తున్నాను అది నా దురదృష్టం. చేస్తున్న పని చేయొద్దు అని కూడా అనదు. మరొకసారి ఆలోచించుకో అన్నా కూడా నువ్వేంటి నాకు చెప్పొచ్చేది అన్నట్టు చూస్తారు. ఏ మాటామంతీ అయినా వారి ముగ్గురి మధ్యే. వారి మధ్య తనొక అనామకురాలు.


ఇలా.. భోజనాల బల్లముందు కూర్చునే తానున్న దీనస్థితిని బేరీజు వేసుకుంటుంది.. దేవకి. 


*********


సిరికి చదువు పూర్తైనప్పటి నుండి సంబంధాలు వస్తూనే వున్నాయి. వాసుదేవరావుకు కూతురుని తన సామాజికవర్గం వారికి ఇచ్చి చేయాలని కోరిక. అందుకు సిరి మంచి ఉద్యోగంలో కుదురుకుని ఆర్ధికంగా బలపడితే తన కోరిక సులభమవుతుందని ఆలోచనతో.. చిన్న పిల్ల పాతికేళ్ళన్నా రాకుండా పెళ్ళి ఎలా చేస్తాము అని దాటేసేవాడు. 


సిరికి ఉద్యోగం వచ్చింది. కొడుక్కి చదువు అయిపోయింది. అబ్బాయి కోచింగ్ లు తీసుకోవాలి. అమ్మాయి  ఏదో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో వుండాలి.. ఎందుకీ బాధంతా.. హైదరాబాద్ లోనే ఇల్లు అద్దెకు తీసుకుని అందరూ కలసి అక్కడ వుండాలని నిర్ణయించుకున్నారు. మీరందరూ ఇలా ఉన్నపళాన వెళ్ళిపోతే వొంటరిగా నేను ఎలా వుండగలను అని దేవకి అనుకోలేదు. పోన్లే పిల్లలు ఉద్యోగాలలో కుదురుకునేదాకా వుండి తర్వాత భర్త వచ్చేస్తాడులే అనుకుంది. 


ఇక వారి ఆలోచనలు చూస్తే మరొకలా. పిల్లలకు రక్షణగా నేను వుండాలి అని తండ్రి అనుకుంటాడు.  డాడీ వుంటే సకలం అమర్చిపెడతాడు. తమకు కావలిసినవి వండి పెడతాడు తమతోపాటు సరదాగా తిరుగుతాడు పైగా అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని సలహాలివ్వడు. లైఫ్ ను ఎంజాయ్ చేయాలి గో హెడ్ అంటూ ప్రోత్సహిస్తాడు అనుకున్న పిల్లలు. కనీసం తల్లి ఒక్కటే ఎలా వుంటుంది అని చిన్నపాటి  ఆలోచన చేయకుండానే తమకు కావాల్సిన వస్తువులను సర్దేసారు. సిరిని ట్రైన్ ఎక్కించి లగేజ్ ను ట్రాన్స్పోర్ట్ లో వేసేసి  తండ్రి కొడుకు టూ వీలర్ వేసుకుని నగరం బాట పట్టేసారు.


ఖాళీ అయిన ఇల్లును చూసి దేవకి గుండె బద్దలైంది. పగలు ఉద్యోగంతో గడిచిపోయినా రాత్రుళ్ళు ఒంటరిగా వుండాలంటే భయమేసింది. 


కనబడని పంజరాలెన్నో

ఈ ఆడ బ్రతుకులకు


అనుబంధాల సంకెళ్ళెన్నో

పేగు ని  తెంచి జన్మ నిచ్చిన అమ్మలకు


 ప్రేమతోనో బరువుతోనో తడిసిన రెక్కలతో  

స్వేచ్ఛగా యెగరలేని  అక్కు పక్షులు 

ఈ ఆడమనుషులు.


అని దుఃఖించింది. 


పిల్లలు చిన్న పిల్లలగా వున్నప్పుడు భర్తకు సరైన ఉపాధి దొరకక పస్తులుండాల్సిన పరిస్దితులలో పోరాటం చేస్తూ చదువు కొనసాగించింది. పసిబిడ్డను ఒడిలో వేసుకుని చదువుతూ వుండేది.ఆమె కష్టం అదృష్టం ఫలించి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. కుటుంబాన్ని నిలబెట్టుకోవడం తన భాద్యత అనుకుంటూ పిల్లల ఆలనపాలన భర్తకు వదిలేసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాతైనా పిల్లలను చూసుకోవాలనుకున్నా భర్త సహకారం లభించేది కాదు. వాళ్ళను పెంచడం నీ వల్లకాదులే. వారికి ఇలా తినిపించాలి ఇది పెట్టాలి అంటూ వొంకలు పెట్టేవాడు. నిజమే కాబోలు అని నిర్లక్ష్యం వహించడం వల్ల పిల్లలు అతనికి పూర్తిగా మాలిమి అయిపోతున్నారని గ్రహించేలోగానే అది జరిగిపోయింది. అమ్మా ఆకలవుతుంది అని అడగాల్సిన పిల్లలు డాడీ ఆకలి డాడీ కథలు చెప్పవా.. డాడీ చాక్లెట్ కావాలి డాడీ ఐస్ క్రీం కావాలి లాంటివితో మొదలెట్టి డాడీ ఫిజాలు బర్గర్ లు కావాలి... అని అడగటం వరకే కాదు.. వరుడు చదువు ఉద్యోగం అందం ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్  ఇలా వుంటేనే పెళ్ళి చేసుకుంటా అని తండ్రితో చర్చించేదాకా కూతురు.  


మీరు పెళ్ళి చేసుకుని ఏం సాధించారు. చిన్నప్పటినుండి చూస్తున్నాను.  ఎప్పుడూ గొడవలే! మీరు ఏమి సంతోషం అనుభవించారు? మళ్ళీ అలాంటి ఊబిలోకి నన్ను దించాలని చూస్తున్నారు. నాకసలు పెళ్ళే వద్దని భీష్మించుకున్న కొడుకు అజయ్. అరే! ఇంతలోనే పిల్లలు ఎలా ఎదిగిపోయారు అనిపిస్తుంది దేవకికి.  వారి  ముగ్గురు మాటలకు తాను మూగమనిషిలా తలవూపడం మాత్రమే అలవాటైపోయింది.  


కూతురుకి ముఫ్పై ఏళ్ళు వచ్చినా పెళ్ళి ఊసులేదు. ఉన్న ఉద్యోగంతోపాటు కావాల్సిన  హంగు ఆర్బాటాలు వుండటం తెలిసిన తర్వాతనే  వరుడి గుణగణాలు గురించి విచారణ చేస్తున్నారు. అమ్మాయికి థర్టీ ప్లస్ అయితే ఆమెకన్నా కొద్ది సంవత్సరాలు లేదా సమ వయస్కులనే కావాలనుకుంటారు. వ్యక్తిత్వం గుణసంపన్నత నచ్చడం లేదు ఎవరికీ. మనిషి సంపాదనే అన్నింటికి మూలం అన్నట్టు వుంటున్నారు. మనుషులే అనేకానేక కోర్కెల పుట్టలు. పెరుగుతూ పోవడమే తప్ప ఆగడం వుండదు .అసలు మనిషికి  ఎన్ని సంతోషం కలిగించే వస్తువులు, పరిస్థితులు ఉన్నా, మంచి వాటిని అశ్రద్ధ చేసి మనం అసంతృప్తి నే వెదుక్కుంటున్నామేమో! అనిపించింది దేవకికి. 


ఒకోసారి పిల్లలు గురించి భర్త గురించి తనెందుకు ఇంతలా ఆలోచించడం అని అనుకుంటుంది కానీ నిరంతరం వారి గురించే ఆమె ఆలోచన. ఆ రోజుల్లో భర్త సరైన ఉద్యోగం చేసి కుటుంబపోషణ భారం వహిస్తే అందరి తల్లులలాగానే పిల్లలను తనే పెంచుకునేది కదా! అది చేతకాక  పిల్లలను పెంచడం రాదనే అపవాదు వేసుకుని బ్రతుకుతుంది. పిల్లలకు తనకూ మధ్య వారధిగా వుండాల్సిన భర్త శకునిలా ప్రవర్తిస్తున్నాడు. పిల్లలకూ తనకూ అడ్డుగోడ కట్టి  సైకలాజికల్ గా తనను దెబ్బతీస్తున్నాడు. అది దేవకి భరించలేకపోతుంది. అంతులేని అసహనం పిచ్చి కోపం. ఎవరిపైన ప్రదర్శించాలో తెలియదు. తన ఉద్యోగానికి కూడా న్యాయం చేయలేకపోతుంది. విపరీతమైన కోపం వచ్చినపుడు ఏదైనా వస్తువులను బద్దలు కొడదాం అనిపించేది. మళ్ళీ అవి కొనడానికి సంపాదించడానికి పడిన కష్టం సర్దుబాట్లు గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకునుకుని తనను తాను హింసింసుకోవడం మొదలెట్టింది. 


ఆ విషయాన్ని మాత్రం  సీరియస్ గా తీసుకున్న భర్త పిల్లలు ఆమెను సైక్రియాటిస్ట్ వద్దకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసారు. సఫలం అయ్యారు. ఏముంది అక్కడ!?.. నెపాలన్నీ ఆమె పైనే. కౌన్సిలింగ్ మందులు ఆమెకు మాత్రమే లభించాయి. 


 దేవకి తన బాల్యాన్ని తన స్నేహితులను  బంధువులను అందరిని గుర్తుచేసుకుంటుంది. ఎంత బాగుండేవి ఆ రోజులు. పెద్దగా ఆంక్షలు లేని జీవితం ఆడపిల్లల చదువుకు అభ్యంతరం పెట్టని కుటుంబం స్వేచ్ఛగా నచ్చిన పుస్తకాలు చదువుకోవటం వల్ల జ్ఞానం వికసించడమే కాదు మనుషుల మధ్య కులం మతం ఆస్తి అంతస్తులు భేదం వుండదనే భావంతో వాసుదేవరావుతో స్నేహం చేసింది. అతనికీ అభ్యుదయభావాలు వుండటం వల్ల ఆ స్నేహాన్ని ప్రేమగానూ ప్రేమను వివాహం గానూ మార్చుకున్నాక ఇరువురి కుటుంబాలు వారిని దూరం పెట్టడం జరిగిన తర్వాత వారికి  బ్రతకాలంటే బాగా బ్రతకాలంటే కులం మతం అవసరం లేకపోయినా డబ్బు కావాలని తెలిసింది.  


వాసుదేవరావు అభ్యుదయం భార్యను ఉన్నత చదువుచదివించడానికి బాగా పనికివచ్చింది. తను చదివినా రాని అవకాశాలు భార్య చదువుకుంటే వస్తాయని సులభంగా గ్రహించి తను కష్టపడిన డబ్బుతో భార్యకు ఫీజులు కట్టి చదివించాడు. అతని మాటల్లో చెప్పాలంటే భార్య మీద పెట్టుబడి పెట్టి ఆ లాభాన్ని నెల నెలా వసూలు చేసుకుంటున్నాడు. భార్య అంటే ప్రాణమున్న మనసున్న మనిషి కాదు. డబ్బు సంపాదించే ఒక యంత్రం. పిల్లలను కనిచ్చిన ఉపకరం. ఆమె సంపాదించి యిచ్చిన డబ్బుపై ఆమె నవమోసాలు కనియిచ్చిన బిడ్డలపై ఆధిపత్యం వహిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా అతిశ్రద్ద వహిస్తూ మంచి భర్త మంచి తండ్రి స్థానం సంపాదించేసాడు. 


దేవకి కి తెలుసు. తమ వివాహబంధం లో లోతైన వ్యాపార సంబంధమైన చిక్కుముడి ఉందని.ఇద్దరు మనుషులు పదిమంది సాక్షిగా మొదలుపెట్టీ..  మొదట ఆసక్తితో మొదలై తర్వాత తర్వాత  వెగటుపుట్టి  యెవరికివారు ఆ బంధంలో ఉక్కిరిబిక్కిరి అయిపోయి తప్పుకు తిరుగుదామని చూస్తారు. కానీ అప్పటికే నెత్తికెత్తుకున్న బరువును భాద్యతను దించుకునే వెసులుబాటు ఉండదు గనుక ఒక విధమైన హింసా ప్రవృత్తి బయటపెట్టుకుంటారు. కొంతమందికి మానసిక హింస ఆయుధమైతే మరికొంతమందికి అదీ  మగవాళ్ళైతే శారీరక హింస ప్రదర్శిస్తారు. ఆలుమగల మధ్య స్నేహం ప్రేమ అనే పదాలకు అర్థాలు తెలీకుండానే  అవసరాల ప్రాతిపదికపై రోజులు సంవత్సరాలు గడిచిపోతాయి. వెనుకటి  తరాలు  కూడా ఇలాగే వెళ్ళమారిపోయాయేమో!కొంతమందేమో  అలవాటైన మనుషులకు ప్రదేశాలకు  వస్తుసౌకర్యాలకు వ్యామోహాలకు తలొంచి కొంత అవసరార్థం  ఏదో‌ అలా సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటారు. 


తను మాత్రం బిడ్డల ప్రేమ కోసం భర్త స్నేహం కోసం పిడికెడంత ఆత్మీయత కోసం అలమటించిపోతుంది. ఒకోసారి  పిల్లలకూ తనకు మధ్య ఓ తరం  వ్యత్యాసం వుందని వారి ఆలోచనావిధానానికి తమ ఆలోచనావిధానానికి తేడా వుందని  మనసును సర్దిపెట్టుకుంటుంది. కానీ భర్త మళ్ళీ కావాలనే ఏదో ఒక వివాదం రగిలిస్తున్నట్లు అన్పిస్తుంది.  బిడ్డలు తొందరపాటుతో ఒకమాట తూలితే మందలించాల్సిందిపోయి  ముసి ముసిగా నవ్వుకుంటాడు. తనను బిడ్డలు విలువ తక్కువగా ట్రీట్ చేస్తే అతనికి అందులో అంత ఆనందం ఎందుకో అర్దం కాదు. 


భర్త ఆర్ధిక ప్రణాళికల వల్ల చేతిలో డబ్బులు మెదలకపోవడం తన వాళ్ళెవరన్నా సహాయం అడిగినా చేయలేకపోవడం వల్ల వారి దృష్టిలో పిసినారిగా స్వార్దపరురాలిగా మానవత్వం లేని మనిషిగా తన బాగు తను చూసుకునే మనిషిగా ముద్రింపబడిపోయింది. తనకంటూ ఒక్కరంటే ఒక్కరు ఆత్మీయులనువారిని ఆమె మిగుల్చుకోలేకపోయింది. తను ఏమి కోల్పోయిందో అది అర్దమయ్యేసరికి ఆమె మానసికంగా కృంగిపోయింది.అనారోగ్యం చుట్టుముట్టింది. మానసిక అనారోగ్య ముద్ర తోడై.. శుష్కించిపోతుంది. 


ప్రేమించడమే తాను చేసిన నేరమా... 

నిజంగా సైక్రియాటిస్ట్ కౌన్సిలింగ్ అవసరం ఎవరికి!? 


*********


దేవకి ఆలోచిస్తూనే వుంది.


పిల్లలను అర్దం చేసుకునే అవసరం గురించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ యివ్వాలా?

లేక తల్లిదండ్రులను అర్దంచేసుకోవడానికి  పిల్లలకు కౌన్సిలింగ్ అవసరమా.. ? 


ఫ్యాషన్, సినిమాలు, పార్టీలు, పుడ్ ఆర్డరింగ్ లకు అలవాటైపోతున్న యువతకు తెలిసింది మాత్రం ఒక్కటే.డబ్బు బాగా సంపాదించాలని. అంతే! డబ్బు  వుంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటున్నారు. అందుకోసమే చదువు తప్ప మనిషిని మౌఖికంగా అంతర్ముఖంగా ఆలోచింపజేసే జ్ఞానం కోసం చదవడమో.. ఏ పని చేసైనా గౌరవంగా సంపాదించాలి అనే ధ్యేయం కోసమైతే కాదు. పరిస్థితులకు అనుగుణంగా బ్రతకడం కూడా తెలియని అయోమయంలో చిన్నపాటి కష్టమొచ్చినా తట్టుకోలేని బలహీనంగా పైపై మెరుగులతో బ్రతుకుతున్నారు. తమ పిల్లలూ అందుకు అతీతం కాదు. 


చదువుకుని ఉద్యోగాలు చేస్తూ నాగరికంగా బ్రతుకుతున్న యువతకు తమ తల్లిదండ్రులు తమను ఎంత కష్టపడి పెంచారో గుర్తుకు చేసుకోవడం అస్సలు యిష్టం వుండదు. వారిని వారి శ్రమను గౌరవించడం తెలియదు. ఆ.. పెంచారులే గొప్పగా.. రేపు మేము ఎలా పెంచుతామో చూడండి అంటూ పిల్లలు అడగకుండానే ముందు ముందే అమర్చి కష్టం తెలియకుండా పెంచుతున్నారు.


స్త్రీలు కూడా సమాన అవకాశాలు పేరిట పోటీపడటం మంచిదే అయినా మరొక విధంగా తనలా ఇబ్బంది పడుతున్నారు. మానసిక వేదన అనుభవిస్తున్నారు.బిడ్డలు పసి బిడ్డలుగా వున్నప్పుడు తల్లి పూర్తి సమయం కేటాయించి బిడ్డలను సంరక్షించలేకపోయినట్లైతే కుటుంబంలోనే అనేక పాత్రలు పసిమనసులలో తల్లి పట్ల ద్వేషం వ్యతిరేకముద్ర వేయడానికి బలంగా పనిచేస్తాయి. 

బి కేర్ పుల్ .. అమ్మల్లారా..అని హెచ్చరించాలనపిస్తుంది.


కొడుకు అజయ్ తో ఒకసారి వివరంగా మాట్లాడింది.“నిన్ను కడుపులో మోస్తున్నప్పుడూ రెండుపూటలా కడుపునిండా ఆహారం తినడానికి లేక ఎంత విలవిలలాడిపోయేదాన్నో. సరైన ఆధారం లేక తినడానికి తిండిలేక పూట  గడవడం కూడా కష్టమైపోతున్నప్పుడూ మళ్ళీ ఇంకొకరికి జన్మనిచ్చి ఆకలికేకలకు బలిచేయడమెందుకు అనే ఆలోచనతో చిన్న జీతానికి కూడా పనిచేసి కడుపునింపుకున్నాను. నా పిల్లలకు ఆకలి తెలియకూడదు అని రాత్రుళ్ళు అదేపనిగా మేల్కొని పోటీపరీక్షలకు పడీపడీ చదివేదాన్ని. అలాంటి కష్టాలన్నీ పడి మిమ్మలను కనీ ఉద్యోగం సంపాదించి మీ నాన్న చేతుల్లో పోస్తుంటే ఆ డబ్బుతో మీరు అడిగినవన్నీ సమకూర్చే  ఆయన మంచి తండ్రయ్యాడు నేను ఎందుకూ పనికిరాని తల్లిని అయ్యాను. ఇదేనా మీరు తల్లిని అర్దం చేసుకుంది అని ఏడ్చింది దేవకి. కొడుకు కాస్త అర్దం చేసుకుంటున్నట్టు అనిపించాడు. కూతురే మరీ కొరకరాని కొయ్య. అన్నీ తండ్రి ఆలోచనలే.. తండ్రి నుంచి నేర్చుకునే మాటలే. తల్లిని బాధ పెడతాయనికూడా వెరపులేదు. 


పిల్లలు సంపాదనా పరులయ్యాక సొంత యింటి కోసం లోన్ అప్లై చేసి ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు  ఎవరి కోర్కెలకు అనుగుణంగా వారికి  గదులు కేటాయించడం అయిపోయాక దేవకి కి హాలు ఒక్కటే మిగిలింది. హాలు కూడా అందరి అభిరుచికి అనుగుణంగా రూపొందించాక ఆమెకు వంట గది కూడా మిగలలేదు. అక్కడ కూడా వాసుదేవరావు అభిరుచి ఆక్రమించేసింది. తనది కాని తన యింట్లో తనకు ఇంత స్వేచ్ఛ మిగలకపోయింది అనుకుని వాపోయింది. పోన్లే తన పిల్లలే కదా వారికి కోరికలు వుంటాయని సర్దుకుంది. ఎవరి గదులు వారికి ఏర్పడ్డాక భర్త తనతో అన్యోన్యంగా వుంటాడని ఆశపడింది. ఒంటరిగా వున్నప్పుడైనా తనను కాస్త లాలించి ప్రేమించి గుండెల్లో పొదువుకుని సేదదీరుస్తాడన్న ఆశ అడియాస అయింది. భర్త భాద్యతలను గుర్తుచేయాల్సిరావడమన్న సిగ్గుమాలిన దుస్థితిలో తాను వున్నందుకు విరక్తి చెందింది. 


దేవకిలో పూర్తి నైరాశ్యం అలుముకుంది. ఇంట్లో ఎవరికీ తన అవసరం లేదు తాను సంపాదించే డబ్బు తప్ప. ఆ మాటే అంటే.. నీ డబ్బుతో కట్టిన యిల్లు అవడం మూలంగానే కదా నువ్వు ఈ మాట అంటున్నావు రోజూ నరకం చూపిస్తున్నావ్ నీ యింట్లో నువ్వే వుండు కావాలంటే మేమే వెళ్ళిపోతాం అని ముగ్గురూ వెళ్ళడానికి సిద్దపడిపోయారు. వాళ్ళనే ఆ యింట్లో వుండనిచ్చి తనే వెళ్ళిపోతే బాగుండును అని ఆలోచన చేసింది కూడా దేవకి. హితురాలుకి సూచనాప్రాయంగా తెలిసి మందలించింది. “ఎక్కడికి వెళతావ్ ఇల్లు వదిలేసి? ఎంతకాలం వుంటావు వారిని ఎవాయిడ్ చేసి? మీ పిల్లల ఆలోచన విధానమే బాగోలేదు.. తల్లిని అర్దం చేసుకోకపోయినా పర్లేదు కానీ ఆమె మనసును బాధ పెట్టకూడదనే ఇంగితజ్ఞానం లేకపోయిందే. కుటుంబ సభ్యుల మధ్య తల్లి బిడ్డల మధ్యే అవగాహన అర్దం చేసుకునేశక్తి లేకపోతే వీళ్ళు ప్రపంచంతో ఎలా సంభాళించుకోగలరు? -


వీరికి వివాహమైతే జీవిత భాగస్వామ్యితో ఎలా సర్దుకోగలరు? ఎల్లకాలం తండ్రి సపోర్ట్ వుంటుందా కొంచెమైనా ఆలోచించరేంటి పిల్లలు!? దేవకి నువ్వు కూడా ఇలా ఊగిసలాడే మనస్తత్వంతో  వుంటే వారు నిన్ను మరీ బలహీనురాలిని చేస్తారు. పిల్లలు కూడా స్వార్దపరులే. వాళ్ళ దారి వారిని చూసుకోనీయ్.. లేదా నువ్వే వారి ప్రవర్తనకు అలవాటు పడిపో” అని గట్టిగా మందలించింది. 


 పిల్లలిద్దరికీ రిమోట్ వర్క్ మూలంగా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది. కూతురు ఏదో పరీక్షలకు పడీపడీ చదువుతుంది. వాసుదేవరావు నువ్వు వారిని డిస్ట్రబ్ చేయకు నీకు దణ్ణం పెడతాను అంటూ దణ్ణం పెట్టేసాడు కూడా. దేవకి ఉద్యోగం చేస్తున్న ఊరిలో చిన్న గది అద్దెకు తీసుకుని వుందామనుకుంది ముందు. తర్వాత ఒక ఆరునెలలు మెడికల్ లీవ్ తీసుకుని దూరంగా వెళ్ళి వుందామనుకుంది. ఆర్దిక పరిస్థితులు ఆమెను ఆ ప్రయత్నం విరమించుకోమని హెచ్చరిస్తున్నాయి అంటే కూడా సమంజసనీయం కాదు. ఆమెను అలా మలిచేసేసాడు భర్త. ఆమె సంపాదనను ఎలా ఖర్చుచేయాలో ఏయే బాకీలు తీర్చాలో అన్నీ ఒక ప్రణాళికలా ముందుగానే నిర్ణయించబడేవున్నాయి.  నా పిల్లలూ భర్త నన్ను అర్దంచేసుకోలేకపోయినపుడు ఆ జంజాటాలన్నీ నాకెందుకు అని దేవకి అనుకోలేదు. అలా అనుకోకుండా ఆమెను ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లో పకడ్బందీగా బంధించివేసాడు భర్త. 


పతి సుతులు  హితులు అంతా స్వార్ధం కంపు డబ్బు కంపు కొడుతున్నారు. రంగు రుచి వాసన లేని రుతువులు దొర్లిపోతున్నాయి. 


దేవకి కి  అపుడపుడు తమ పక్కింటామె గుర్తుకువస్తుంది.ఆమె పెద్దగా చదువుకోలేదు కానీ అఖండమైన తెలివితేటలు. భర్త సరిగా కుటుంబ భాద్యతలు పట్టించుకోడు. నెలల పర్యంతం కనబడకుండా పోతాడు.ఒక కొడుకు యానిమేషన్ కోర్స్ చేస్తూ దూరంగా వున్నాడు.మరొక కొడుకు ఇంట్లో వుండి చదువుకుంటాడు. పుట్టింటిసాయంతో కుటుంబం జరుపుకుంటున్నానని చెబుతూవుంటుంది. ఆమె నెలలో సగం రోజులు బంధువుల ఇంటికి పుట్టింటికి తిరుగుతూ వుంటుంది. తలకు శ్రద్దగా హెన్నా పెట్టుకుని చేతులకు గోరింటాకు పెట్టుకుని శ్రద్దగా అలంకరించుకుంటుంది. అయ్యో! ఈమెకు వీసమెత్తు దిగులులేకుండా  సరదాగా సంతోషంగా కాలం గడిపేస్తుంది. నాకేమైంది ఆమెలా నేనెందుకలా ఉండలేకపోతున్నానని బేరీజు వేసుకుంటుంది.  ఆమె పిల్లలను కూడా సరిగా పట్టించుకోకుండా వుంటుంది. అమ్మనాన్నలది చెరోదారైనా..ఇంకా ఆ బిడ్డలు సంస్కారం కలవారు. దుష్టసహవాసాలు చేయకుండా మంచి నడవడిక అలవడింది. ఇక సంతోషం ఒకరు ఇస్తే రాదని తమకు తామే ఇచ్చుకోవాలని పక్కింటి ఆమెకు తెలిసినట్లు తనకు తెలియడం లేదు. ఆమెలా వుండాలని గట్టిగా అనుకుంటుంది. కానీ అంత చొరవచేయలేదు. గృహప్రవేశానికైనా తనంతట తాను కొలీగ్స్ ను కూడా పిలవగల్గే చొరవలేకుండా చేసుకుంది. 


“ఒకరిస్తే తీసుకునే ప్రేమ కోసం ఎన్నాళ్ళు పిచ్చిదానిలా ఎదురుచూస్తావ్? మూడ్స్ మార్చుకుని స్నేహితులను కలువు, రూఫ్ గార్డెన్ మొదలెట్టు. నీకు కావాల్సింది వండుకుని తిను. నువ్వు చేసింది తింటున్నారు అనుకుంటే వండిపెట్టు. లేదు అనుకుంటే మానేయ్. స్విగ్గి జొమాటో వాళ్ళు ఇంటికి తెచ్చిస్తున్నారు రోజూ అలా అయితే ఆరోగ్యాలు ఏమికాను డబ్బు ఎంతవుతుందని లెక్కలు వేయకు ప్రశాంతత పోతుంది అని అంతరాత్మ హెచ్చరిస్తూనే వుంటుంది.


*********


దేవకి బాగా ఆలోచించింది. గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది. తనకు ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఒక లాయర్ ద్వారా ప్యామిలీ కోర్డ్ కు విడాకుల కోసం  అప్లై చేసుకుంది. 


ఆమె అప్లికేషన్ తయారుచేస్తున్న లాయర్ ఆమె అభియోగం కోరిక విని ఒకింత ఆశ్చర్యపోయింది. దేవకి కేసు తొందరగానే జడ్జి ముందుకు వెళ్ళింది. వాసుదేవరావు పిల్లలు కూడా విసుగ్గా కోర్టుకు హాజరయ్యారు. 


ముందు దేవకి ని మాట్లాడమని అన్నారు.


దేవకి దైర్యంగా తన కథను చెప్పింది. జడ్జి గారు సానుభూతితో ఆమె కథనంతా విని ఒకే ఒక ప్రశ్న అడిగారు. భర్త నుండి విడాకులు అడగడంలో ఆశ్చర్యం లేదు. కానీ మీరు మాతృత్వపు హక్కును రద్దు చేయమని పిల్లలను భర్తను అనుమతినివ్వమని అడగడమే ఆశ్చర్యంగా వుంది. ఇంత వరకూ ప్రపంచంలో ఎవరూ ఇలాంటి కోరిక కోరి వుండరు” అన్నారు. 


దేవకి సమాధానంగా “నేను భర్త నుండి విడాకులను ఎందుకు కోరుతున్నానో పిల్లల నుండి మాతృత్వపు హక్కును రద్దు చేయమని అందుకే కోరుతున్నాను. అదీ ప్రేమతోనే. నా భర్త నా బిడ్డలు అని ప్రేమించడమే తెలుసు. ముందు ముందు వారిని నేను ద్వేషించకుండా వుండటం కోసమే నేను యీ కోరిక కోరుతున్నాను. నేను ఒక భాద్యత గల పౌరురాలిని.ఉపాధ్యాయురాలిని. క్రమశిక్షణ లోపించిందని భాద్యతారాహిత్యంగా ప్రవర్తించారని పాఠశాలలో పిల్లలనే మందలించలేదు,

దండించలేదు. ఇక కుటుంబంలో నా పిల్లలను ఎలా దండించగలను. వారి ప్రవర్తన వారి నిర్లక్ష్యపు వైఖరి వారి ఆలోచనాధోరణి నాకేమాత్రం రుచించడం లేదు. జీర్ణం కావడం లేదు, నచ్చడం లేదు. నా భర్త కూడా వారినే సమర్దించడం నేను భరించలేకపోతున్నాను. అలా అని వారిని ద్వేషించలేకపోతున్నాను. భర్త నుండి పిల్లల నుండి  నాలుగు ప్రేమ నిండిన మాటలను గౌరవాన్ని కోరుకుని నేను చాలా పెద్ద పొరబాటు చేస్తున్నాను. అవి అంగడిలో దొరికే వస్తువులైతే పస్తులుండి అయినా వాటిని కొనుక్కోగలను. నాభర్త నుండి పిల్లలనుండి తప్ప వేరొకరు వాటిని యిచ్చినా నేను పుచ్చుకోలేను. ప్రేమరాహిత్యంతో నేను రోజూ మనసుకు గాయాన్ని చేసుకోలేను. నా ఓర్పును లేపనంగా పూసుకోలేను. నాకు ఆ బంధాలనుండి విముక్తి కల్గించండి. నేను పూర్తి మానసిక ఆరోగ్యంతో మీకు నా కోరికను నివేదిస్తున్నాను. నా భర్త కష్టించి సంపాదించిన సొమ్ముతో ఫీజులు చెల్లించి నేను చదువుకొన్నందువల్ల.. ఆ చదువు ఆధారంగా ఉద్యోగం చేస్తున్నందువల్ల నేను సర్వీస్ లో వున్నంత కాలమూ నా జీతభత్యాలను నాల్గు భాగాలుగా విభజించి వారు ముగ్గురికి మూడు భాగాలు నాకు ఒక భాగం ఇప్పించే ఏర్పాటు చేయండి. నిర్మించుకున్న ఇల్లు కూడా అదే దామాషాలో లోను డబ్బును జమచేసుకోవాలని అభ్యర్దిస్తున్నాను. నేను ఆ శూన్య మందిరంలో ప్రేమరాహిత్యంతో జీవించలేను. మరణించలేను. నాకు అంత దైర్యం కూడా లేదు.  ఇంటిలో నా వాటా భాగాన్ని కూడా వారినే అనుభవించనీయండి. నేను వారికి దూరంగా వుండదల్చుకున్నాను. ఇది నా అభ్యర్దన. నా భర్త కానీ పిల్లలు కానీ నన్నెప్పుడూ కలవకూడదని నేను మరణించినట్లు మానసికంగా భావించాలని కోరుకుంటున్నాను. ఇదే ఆఖరిసారిగా వారిని నేను కోరుకునే అభ్యర్దన” అని చెప్పింది. 


జడ్జి మౌనంగా ఆమె మాటలను విన్నాడు. బలంగా నిట్టూర్చాడు.. వాసుదేవరావు వైపు పిల్లల వైపు చూసారొకసారి. 


మరలా దేవకి వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వారు.జడ్జిమెంట్ ను చదివి వినిపించడం ప్రారంభించారు. 


*********0********



25, అక్టోబర్ 2021, సోమవారం

రెండో బాల్యం

గదిలో ఒంటరిగా  

కాలం బరువుగా తోస్తున్నప్పుడు

చేజారనీయకు నీ బాల్యాన్ని

అపుడే దాని అవసరం మరింత 


నిన్నెవరూ అడగపోయినా 

నీకు నువ్వే చెప్పుకుంటూ వుండాలి

ఆ మధుర జ్ఞాపకాలన్నీ

బాల్యకాలపు అమాయకపు చేష్టలనుకుంటావ్ 

కానీ..  కొన్ని  కఠోరసత్యాలు 

ఆ కాలగతిలో దాక్కుని వుంటాయి  

వాటిని తొలుచుకుంటూనే వుండాలి 

ఎవరో వొకరు వొక చెవినిటు వేస్తారనే నమ్మకంతో శ్వాసిస్తూ వుండాలి


అనుభవాలు జీవితాన్ని కరిగిస్తే వచ్చిన తురుపు ముక్కలు.

ఊరకనే ఊటబావిలోన ఊరే నీరు కావవి. 

అనేక తారకలు వెలిగించిన నీ గమనం వుంది 

ఆర్జించిన జ్ఞానం వుంది. 

ఇచ్చట పండితుడివి పసిపాపవు నీవే


మనసుకు గాఢంగా 

కస్తూరి పరిమళం అద్దుకున్నట్టు 

వృద్దాప్యానికి బాల్యపు ఆనవాళ్ళే 

మంచి గంధపు పరిమళాలు 


జీవితం యెప్పుడూ వెనక్కి మళ్ళదు. 

చేసిన తప్పులకు పశ్చాతాపం చెందటమే శిక్ష. 

ఇసుకపై వ్రాసుకున్న రాతల్లా 

మబ్బుల కేన్వాస్ పై గీసుకున్న గీతాల్లా 

అవి చెరిగిపోయాయని మనసులో కూడా తుడిపేయడమే ప్రశాంతత  


మనిషి తన బాల్యాన్ని తలుచుకున్నప్పుడల్లా

గింజల కోసం చిలకలు తొలుస్తునపుడు 

వెదజల్లబడిన  పింజెల వలే  మనసు తేలిపోతుండాలి

జ్ఞాపకాలు  ఆలస్యంగా బయలుదేరిన 

బడి పిల్లలవలె బిరబిర సాగిపోయినట్లుండాలి


పడమటి గాలి కదలికలు పూరా స్మృతులనెన్నో 

మోసుకొచ్చినట్లు తొణికిసలాడుతూ వుండాలి. 

బిక్కముఖం వేసో రాగం తీస్తూనో 

రెండుచేతులు చాచి చేతులెత్తితే 

ప్రేమగా హత్తుకోవడానికి వొంగే రెండుచేతుల కోసం 

యిప్పుడూ యెదురెదురుచూడాలి


జీవనయానంలో అలసినప్పుడు 

యెక్కడో వొకచోట కాస్త ఆగినపుడు 

తరువొకటి నీపై నిండుగా పూలవర్షం  కురిపించి 

అభినందించిన సన్నివేశం గుర్తుచేసుకోవాలి

ఆ తరువులే ఏటేటా శిశిరంతో చేస్తున్న యుద్దాన్ని 

జీవన సంఘర్షణనూ నిత్యస్పూర్తిగా ఊతం చేసుకోవాలి 


మనిషి ఏదో వొకటి వొదులుకుంటూనే వుండాలి

ఆశలైనా ధనమైనా సుఃఖమైనా దుఃఖమైనా

కానీ ప్రాణాన్ని మాత్రం కాదు 


ఎవరికో వాగ్దానం చేసినట్టు మనకు మనమే  

సంకెళ్ళు వేసుకున్నంత  గట్టిగా వాగ్దానం చేసుకోవాలి. 

ఆశ చేజారనీయకు అని 

రెండో బాల్యాన్ని వాడనీయకు అని.

5, అక్టోబర్ 2021, మంగళవారం

ఏ దరికి ...

 పూబాల

నిలువెల్లా తడసిపోయింది

జాలిలో తడవడం కావచ్చు

ప్రేమలో తడవడం కావచ్చు

దాహంలో తడవడం కావచ్చు

ఎలాగైతేనేం నిండా తడిసిన తర్వాత 

మిగిలిన అనుభూతిని

గుదిగుచ్చడానికి ఓ దారం కావాలి. 

దండగా మారడానికి ముడులు వేయాలి

కట్టినపుడు బిగిసినట్టే వుంటుంది

వెనుక వెనుక బిగి సడలి ముడి నుండి 

జల్లున జారి పడతాయవి 

అల్లిన చేతులు పూలవలె సుకుమారమైనవి

కుత్తుకలు తెగిపడేలా బలంగా ముడి వేయలేని

జాలి హృదయం కలవి. 

పూలను భావాలను అల్లనల్లగా ముడివేయాలని

సుతిమెత్తగా దరికి చేరవేయాలని 

ఏ దరికి చేరాలని రాసిపెట్టి వుందో 

కడకు ఆ దరికే చేరతాయవి.



18, సెప్టెంబర్ 2021, శనివారం

మాయ

 



చిన్ని పువ్వు

తన హృదయమంతా పరుచుకుని సంతోషాన్ని ప్రకటిస్తూ కేసరాలను ముకిళిత హస్తాలుగా జోడించి వినమ్రంగా తలొంచింది చిన్ని పువ్వు. 

ఆ పువ్వు రంగు రూపు లావణ్యాన్ని మైమరిచి చూస్తున్న నేను యెంత మాత్రమూ వినమ్రతను గుర్తించలేకపోయాను. బాహ్యమైన ఆకర్షణలకు దాసోహమైన నేను అంతఃకరణను శుద్ది చేసుకోలేకపోతున్నాను. ఇది మాయ కాకపోతే మరేమిటి?


చివురులు

ఈ లేత చివురులు రాత్రంతా తపస్సు చేస్తాయి.. నువ్విచ్చే ప్రాణశక్తి కోసం.. గొప్ప నమ్మకంతో.
నేను కూడా నీ ప్రేమ కోసం చూసినట్లు
నువ్వు వచ్చేవుంటావ్.. నేను ఏ బాహ్యబంధాలలో తలమునకలై వున్నానో.. 😍💞



12, సెప్టెంబర్ 2021, ఆదివారం

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రచయిత

 ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రచయిత

తర్వాత ఏమి జరిగింది!? అతని జీవితంలోకి వెలుతురు యెలా ప్రవేశించింది!? 

చేపలు చెప్పిన కవిత్వం విందామా... వెలుతురు నింపుకుందామా!?

మొదటి చేప చెప్పిన కవిత్వం.. 

“ ఇటునుంచి అటు చూసాను

 మరల మరల వచ్చే మరణం 

ఆ చివర కనిపించింది

అటునుంచి ఇటు చూసాను

ఒకే ఒక్కసారి వచ్చే జీవితం

ఈ చివర కనిపించింది

ఎటునుండి ఎటు చూడాలో 

ఇప్పుడు అర్దమైంది”

ఇక రెండో చేప చెప్పిన కవిత

“ఈ భూమ్మీద

 మూడొంతులు నీరు

ఒకవంతు నేలా ఉన్నాయి

కాబట్టి మనిషి కష్టాలూ దుఃఖమూ

అతడి మొత్తం జీవితంలోని

ఒకవంతు పరిధిలోకి మాత్రమే వస్తాయి

మిగతా మూడొంతుల్లోకి

మానవ దుఃఖ ప్రవేశాల్ని సృష్టి 

 నిషేదించింది

ఈ సృష్టి సౌకర్యం తెలియక

ఒకవంతు దుఃఖానికి

నాలుగురెట్లు రోదిస్తున్న మనుషులని చూసి

ఎనిమిది దిక్కులు 

ఎప్పటికీ జాలిపడుతూనే ఉన్నాయి”

ఈ రెండు కవితలు చెప్పినది ఎవరో తెలుసా!?

చెరువులో చందమామ.

ఆత్మహత్య చేసుకోవాలని చెరువులోకి దూకిన మనిషిని  చెరువులోని చందమామ రక్షించి వొడ్డుకు చేర్చి తన వొడిలో పడుకోబెట్టుకుని ఉపదేశం చేసింది. 

అతను నమ్మలేదు తనను రక్షించింది  చెరువులో చందమామ అంటే. కానీ పైకి చూస్తే ఆకాశంలో చందమామ కనబడుతూనే వుంటాడు. చెరువు వొడ్డున చందమామ వొడిలో తను. చందమామను నమ్మాడు. చందమామ చెప్పిన చేప చెప్పిన కవితలను మనసుతో విన్నాడు బుర్రతో ఆలోచించాడు. ఇంటికి తిరిగి పయనమయ్యాడు. చెరువులో చందమామ వెలుగుతూనే వున్నాడు. 

ఆత్మహత్య చేసుకోవాలని వచ్చిన ఆ మనిషి రచయిత.  గయ్యాళి భార్యతో జరిగిన గొడవలో ఆవేశంలో ఆమె యిలా అంటుంది.. ”సంపాదించడం చేతకాకపోతే ఎందులోనైనా దూకి చావొచ్చుగా, మమ్మల్నెందుకు చంపుతారు” అని  భార్య నోరు జారిన తర్వాత తీవ్ర అశాంతితో అతనికి నిద్ర పట్టక చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుందామని వస్తాడు. కానీ చెరువులోకి దూకబోయే సరికి అతని ఇద్దరు ఆడపిల్లలూ గుర్తుకువచ్చి ఆపని చేయలేక ఎన్ని బాధలు భరించి అయినా ఆ బిడ్డలకోసం  బతకాలని నిర్ణయించుకుంటాడు.

ఎలాంటి బాధలనైనా భరించి జీవితాన్ని దాటేయడానికి మనిషి లోపలికి ఏదో వొక వెలుతురు ప్రవేశిస్తే బాగుండును అనుకుంటాడు.

చెప్పాను కదా... ఈ మనిషి ఒక రచయిత అని. చనిపోవడానికి చెరువు దగ్గరకు వచ్చి... తను  చనిపోవడానికి చెరువులోకి దూకితే చందమామ రక్షించినట్లు కథ అల్లుకుని ఆ కథలో చేపలు చెప్పిన కవితలు తనకు అన్వయించుకుని తనలోకి వెలుతురు నింపుకుని ఇంటికి చేరడానికి వెనక్కి మళ్ళుతాడు కథలోని మనిషి. రచయిత కూడా. ఇందులో రచయిత తనకూ ఉపదేశం ఇచ్చుకుని పాఠకులకూ ఇచ్చాడు.

జీవితాన్ని ఈదలేక బ్రతుకు ముగించుకోవాలనుకునే ప్రతి నిరాశావాదికి ఏదో వొక ఆశ కొత్త వెలుతురు లోనికి ప్రవేశించాలని... అది ఆ మనిషిని ఆత్మహత్యా ప్రయత్నం నుండి కాపాడుతుందని హృద్యంగా చెప్పిన కథ  ‘’వెలుతురు’’ ఈ కథా రచయిత భగవంతం.   మనుషులు ఎవరైనా చేపలు చెప్పిన కవిత్వాన్ని మనసుపెట్టి అర్దం చేసుకుంటే  తమంతటతామే ఆత్మహత్యా ప్రయత్నాలను విరమించుకుంటారు.

ఈ కథ నేను చదివి సంవత్సరంన్నర అయింది. ఈ కథ చదివిన సమయానికి నేను తీవ్రమైన వొత్తిడిలో వున్నాను. ఈ కథ నాలో కొత్త వెలుతురు నింపిందని నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. 

మంచి కథ.. నిడివి రెండు పేజీలే! అద్భుతమైన కథ. 

నమకాలీన పరిస్థితుల్లో బతుకు దుర్భరమై ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో... రచయితల భాద్యత గురించి P.Jyothi గారు సమాజంలో భాగం అవ్వాల్సిన భాద్యత గురించి ప్రత్యేకంగా చెప్పారు..కథలు వ్రాసేసి తమ భాద్యత అయిపోయిందనుకోకుండా ప్రత్యక్ష సమాజంలో ఆత్మహత్యలను నివారించడం మన చుట్టూ వున్నవారిలో ఆ లక్షణాలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ చేయడం..లాంటి వాటిలో స్వచ్ఛందంగా పాల్గొనాలి అని. 

అందుకే ఈ కథను గుర్తు చేసాను. కథ కోసం...   మార్చి 2020 చినుకు మాసపత్రిక చూడాల్సిందే! 

ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినోత్సవం సందర్భంగా... 




25, ఆగస్టు 2021, బుధవారం

అమ్మ - అమ్మాయి

అమ్మ: అమ్మాయి అమ్మాయి.. ఏమి చేస్తున్నావు?

అమ్మాయి: అమ్మా వాకిలి ఊడుస్తున్నాను మన పరిసరాలను పరిశుభ్రంగా వుంచుతున్నానమ్మా


అమ్మ: అమ్మాయి అమ్మాయి.. ఏమి చేస్తున్నావు?

అమ్మాయి: మన ఇంట్లోకి దుమ్ము ధూళి రాకుండా నీళ్ళు చల్లుతున్నానమ్మా.


అమ్మ: అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు?

అమ్మాయి: ముగ్గులేస్తూ జ్ఞాపకశక్తి పెంచుకుంటున్నానమ్మా.


అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు

అమ్మాయి: ఆరోగ్యకరమైన వంట చేసుకోవడానికి పాత్రలు శుభ్రం చేయడం నేర్చుకుంటున్నానమ్మా.


అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు

అమ్మాయి:స్నానం చేయడానికి నీళ్ళు మోసుకుంటున్నానమ్మా.. 


అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు

అమ్మాయి: మొక్కలకు నీళ్ళు పోస్తున్నానమ్మా


అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు

అమ్మాయి: సైకిల్ నేర్చుకుంటున్నామ్మా


అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు

అమ్మాయి: పశువులకు మేత వేస్తున్నానమ్మా


అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు 

అమ్మాయి: ప్రకృతికి నమస్కరిస్తున్నానమ్మా

అమ్మ: అలాగే! మంచి వర్షాలు కురియాలని పంటలు బాగా పండాలని మీ నాన్న వ్యాపారం బాగుండాలని కోరుకోమ్మా 


అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు అమ్మాయి: దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటున్నానమ్మా

అమ్మ:మంచి భర్తను ఇమ్మని కోరుకో..


అమ్మాయి: అమ్మా అమ్మా.. దేవుడు అడిగినవన్నీ ఇస్తాడా.. 

అమ్మ: ఇస్తాడని నమ్మకం తల్లీ


అమ్మాయి:  అమ్మా అమ్మా! తల్లీతండ్రీ దేవుడితో సమానం అంటారు కదా.. నాకు దేవుడు దేవత మీ యిద్దరేనమ్మా.. నేనడిన వరాలన్నీ యివ్వాలమ్మా.

అమ్మ: సంతోషం తల్లీ.. నీకేం కావాలో కోరుకో తల్లీ..


అమ్మాయి: ముచ్చటగా మూడు వరాలు కోరుకుంటానమ్మా. 


మొదటిది..అమ్మ చేసే పనులన్నీ ఆనందంగా చేస్తాను. 


రెండవది:నాన్న చేసే పనులన్నీ బాధ్యతగా నేర్చుకుంటాను. 


ఇక మూడవది ఆఖరిది : ఆడపిల్లవి చదువులు నీకెందుకని అనకండమ్మా. మంచి మొగుడు దేవుడిస్తే రాడమ్మా.. తల్లిదండ్రులందరూ అమ్మాయిని అబ్బాయిని తేడా లేకుండా పనులు చేయిస్తూ చదువులు చెప్పిస్తూ లోకం చూపిస్తూ వుంటే మంచి అలవరుచుకుంటారమ్మా. వాళ్ళే మంచి భర్తలు మంచి పౌరులు అవుతారమ్మా. 


అమ్మ: నువ్వు నేర్చిన  ఈ కొద్ది చదువు నీకింత మంచి ఆలోచనలు నేర్పింది. నిన్ను మంచిగా చదివిస్తానమ్మా, ఆడమగ భేదం లేని పనులన్నీ నేర్పిస్తానమ్మా.  ఆడబిడ్డకు ఆత్మవిశ్వాసం పెరిగేలా బాటలు వేస్తానమ్మా.  

అమ్మాయి: అమ్మా ఈ మాత్రం ఊత చాలమ్మా.. ధన్యవాదాలమ్మా.. 


అమ్మాఅమ్మాయి చేతులు పట్టుకుని సంతోషంగా నాట్యం చేసారు.




16, ఆగస్టు 2021, సోమవారం

దుఃఖపు రంగు దర్శించి... ప్రదర్శించిన దార్శనిక కలం



హటాత్తుగా మనకొక బహుమతి లభిస్తే... చాలా సంబరంగా వుంటుంది. ఆ బహుమతి విలువైనది అయితే యిక  ఆ ఆనందానికి అవధులు వుండవు. 


 నా రచన “దుఃఖపు రంగు’’ సాహిత్య విమర్శకుడి దృష్టిలోపడి.. చక్కని విశ్లేషణకు నోచుకుంది. ఆ విశ్లేషణ వీడియోగా రూపాంతరం చెందింది. ఒక రచయితకు యింతకన్నా యేం కావాలసలు!?


ధన్యోస్మి కంపల్లె రవిచంద్రన్ గారూ... 


మీరూ యీ విశ్లేషణ వినండి... కథ చదవడం మాత్రమే కాదు కథను యెలా అర్దం చేసుకోవాలో తెలియజేస్తుంది. వినండి.. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి..


*********


 'దుఃఖపు రంగు' దర్శించి... ప్రదర్శించిన దార్శనిక కలం - కంపల్లె రవిచంద్రన్ 



“దుఃఖపు రంగు” తెలియాలంటే కన్ను అనే చర్మేంద్రియం ఉంటే సరిపోదు, జ్ఞాననేత్రం కావాలి. 

సరే! దుఃఖపు రంగు తెలిసింది, మరి దాన్ని తెలియజేయాలంటే ఏం కావాలి? 


వనజ తాతినేని అనే కవయిత్రి, రచయిత్రి, చింతనాశీలి సహజంగా, సహజాతంగా కలిగిన వివేకంతో, సాధన వల్ల ప్రోదిచేసుకున్న జ్ఞానంతో దుఃఖపు రంగు చూడగలిగారు, తెలుసుకోగలిగారు. దాన్ని నా బోటి పాఠకుడికి తెలియజెప్పాలి అంటే అని ఇలా ఓ కథ రాయాలి. కథలో వ్యథ ఉన్నంత మాత్రాన పాఠకుడికి దుఃఖపు రంగు తెలిసిపోతుందా? మంచి కథ అయితే కేవలం ప్రదర్శించడమే చేస్తుంది, అదే గొప్ప కథ అయితే ఆ ‘దుఃఖపు రంగు' అనుభవం అవుతుంది. అంటే, ఒక రచయిత తాను జ్ఞాననేత్రంతో దర్శించిన ఓ జీవన సత్యాన్ని,   కాకుండా, చదువరిని కూడా ద్రష్టని చేయడం! తన తలంలోకి తీసుకురాగలగడం! చూపించే వేలు, చూసే కన్నూ ఒకటే అయిపోవడం- ఎంత విశేషం!


అందుకే వనజ తాతినేని కథ- 'దుఃఖపు రంగు' ని మంచి కథఅని మాత్రమే అనలేను, గొప్ప కథ అంటాను. కథ అనే సాహిత్యప్రక్రియ కింద రాసిననవన్నీ కథలే అని చెప్పలేము. కథలుగా consider చేయదగ్గ వాటిల్లో కొన్నే మంచి కథలు. ఆ మంచి కథలన్నీ గొప్ప కథలని అనడానికి వీల్లేదు. ఆ మంచి కథల్లోనే 'దుఃఖపు రంగు' లా విలక్షణత సంతరించుకొన్నదే గొప్ప కథ. అంటే ఇదొక పరమపదసోపానం లాగా అన్నమాట. వ్రాసింది ముందు కథకావాలి, ఆ కథ మంచికథ కావడానికి తోడు, వైవిధ్యభరితమైన మన జీవితాల్లో నిగూఢంగా దాగిన మహత్తర సత్యాన్ని అద్భుతశిల్ప నైపుణ్యంతో కళ్ళకు కట్టించి, హృదయాన్ని అనుభూతితోనింపి, మళ్ళీ మళ్ళీ చదివించేది గొప్ప కథ. చదివిన ప్రతిసారి ఒకకొత్త వెలుగుని ప్రసరించేది గొప్ప కథ!  అందుకే 'దుఃఖపు రంగు' గొప్ప కథ. కథ అనే ప్రక్రియలో దొంతర్లు దొంతర్లుగా అనేకజీవనపార్శ్వాలను ఒదిగించి, నవలకి ఉన్నంత విస్తృతిని ప్రదర్శించిన 'దుఃఖపు రంగు' వస్తు- రూప- సారాల వంటి అనేక విలక్షణ విధాలుగా గొప్ప కథ.


వస్తుపరంగా చెప్పుకుంటే- వర్తమాన సమాజం అనుభవిస్తున్న ఆధునిక ఫలాలు అప్పుడప్పుడే అందుకుంటున్న తండాలో, వాటికి కూడా నోచని అభాగ్యురాలు సోనాబాయీ కథ ‘దుఃఖపురంగు’


సోనా భర్త భూక్యా, సోనా అన్నయ్య మురళి. ఒకే సామాజిక స్థితి, కానీ, సాంస్కృతికంగా ఇద్దరి మధ్యా ఎంత దూరం! మురళి చదువుకున్న వాడు, ఉద్యోగస్తుడు. భూక్యా మారుమూల కొండప్రాంతంలో తండా మనిషి. అనాగరికుడు.  


"గొడ్డు గోదా మందకి తాగేదానికి నీళ్ళు కావాలి, ఆడది బిందెపుచ్చుకుని నీళ్ళు మోయాలి.మగోడు పుల్లరి కాపు కాయాలి, కట్టెల మోపు మొయ్యాలి" ఇవీ అతని అభిప్రాయాలు. పెళ్లామంటే ఒంటికి, ఇంటికీ ఒక అవసరమని తప్ప అంతకంటే ఆలోచించలేని మోటుమనిషి.


ఆధునికత అందించే సౌఖ్యాలు, సౌకర్యాలు అందనంతదూరంలో ఉంది భూక్యా కొండంచు పల్లె. తాగునీరు లేదు. నీళ్లకిరెండేసి మైళ్లు వెళ్ళాలి ఆడవాళ్లు. అరక్షితమైన నీళ్లు తాగి రోగాలతోఎంతో మంది చనిపోతారు ఆ తండాలో. అయినా, బోర్లువేయించమని డిమాండ్ చేసేంత చైతన్యం ఉండని తండా అది. భూక్యా పేరుకి వార్డు మెంబరే. రెండొందల ఓట్లు ఉన్న బలం ఉందివెనక. కానీ, బోర్లు వేయించమని అడిగే అవగాహన, చైతన్యంలేవు. "నీళ్ళు మోయడానికే యింటికొక మనిషిఅవసరపడతన్నారనే సాకు చెప్పి రెండో పెళ్ళాన్ని తెచ్చుకునే తండామగవాళ్ళ" లో ఒకడు భూక్యా. 


సొంత చెల్లి పెళ్లికి కూడా రాలేనంత పెద్ద బాధ్యతలు ఉన్నఉద్యోగంలో ఉన్న మురళికి, భూక్యాకి మధ్య సాంస్కృతికంగా ఎన్నితరాల దూరం ఉందో ప్రతిభావంతంగా చూపెట్టారు రచయిత్రివనజ తాతినేని. 


మురళీ- భూక్యా భౌగోళికంగా పరస్పరం చాలా దూరాల్లో ఉంటారు. కోస్తాంధ్ర- రాయలసీమ- తెలంగాణా వంటి ప్రాంతీయమైన అంతరాలున్న ప్రదేశాలే కానక్కర్లేదు. ఒకే ప్రాంతంలో కూడా రెండుజీవనవిధానాల మధ్య అంతులేని అంతరాలు, అందరాని దూరాలూ ఉండొచ్చు. ఉదాహరణకి తెనాలి- మాచర్ల- రెండూ గుంటూరు జిల్లాలో పట్టణాలే. కానీ, తెనాలి సస్యశ్యామలమైనఊరు, మరి మాచర్ల- శ్రీనాథ కవిసార్వభౌమ చెప్పినట్టు - 


'చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు

నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు

పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు" 


ని గుర్తుకుతెచ్చే ప్రదేశం. ఈ రెండుచోట్లా మధ్య కూడా సాంస్కృతిక అంతరం ఎంతో. ఈ అంతరాన్ని చూపడంలో ఏమంత విశేషం లేదు. ఈ కథలో అంతకంటే విశేషం మరొకటి ఉంది.


మురళి సోనా తోడబుట్టిన వాళ్లు. ఒకే ఊళ్లో, ఒకే వాతావరణంలో, ఒకే కప్పు కింద బతికిన వాళ్లు. కానీ, సోనా- కూతురు - అంటే స్త్రీ, మురళీ- కొడుకు- అంటే పురుషుడు. కుటుంబంలో ఆడపిల్లకి- మగపిల్లాడికీ సాంస్కృతికంగా ఉన్న దూరం గురించి కూడారచయిత్రి చాలా subtle గా చూపెట్టారు. అదే అసలైననేర్పరితనం, అదే లింగవివక్షని ఎత్తిచూపిన కథా సంవిధానం, అదే అసలైన జీవితావిష్కరణం... అదే గొప్ప శిల్పం! 


ఆడవాళ్ళు ఆకాశంలో సగమన్నారు. ఆడ మగ సమానమేననిరాజ్యాంగమూ చెబుతోంది. సమాన అవకాశాలు కల్పిస్తామనిపాలకులూ ఊదరగొడుతుంటారు. కానీ, ఈ మధ్య వరల్డ్ఎకనమిక్ ఫోరం (డబ్యూఈఎఫ్) ఇచ్చిన నివేదిక ప్రకారం లింగసమానత్వం రావాలంటే మరో 100 సంవత్సరాలు పడుతుందట. అంతేకాదు స్త్రీ-పురుష అసమానతలు గతంతో పోలిస్తేపెరుగుతున్నాయని కూడా డబ్యూఈఎఫ్ ఆ నివేదికలో చెప్పింది. మగవాళ్లకు ఉన్న అవకాశాల్లో స్త్రీలకు కేవలం 68 శాతం మాత్రమేఉన్నాయని అంటోంది ఆ నివేదిక. బడి చదువులోనే లింగవివక్షనూరిపోస్తున్నాయి పుస్తకాలు. ఆ వ్యత్యాసం మరింత పెరిగిందట.అటువంటి పరిస్థితుల్లో సామాజికంగా దిగువున ఉన్న లంబాడి, సుగాలి తండాల్లో ఇంకెంత వివక్ష ఉంటుందో చూపెట్టారు 'దుఃఖపు రంగు' (కథ)లో రచయిత్రి వనజ. 


"ఈ కొండ కింది తండా యింత దూరం వుంటదనుకోలేదు చెల్లి. చెల్లెలు కొడుకని పొలాలు వున్నాయని ఇంత దూరంనిన్నిస్తాడనుకోలేదు బాపు. ఈ అడివిలో పడి మూఢాచారాలలోమగ్గుతా వుంటివి," అంటాడు చెల్లిని చూడ్డానికి వచ్చిన మురళి. 


కొడుక్కి చదువులు చెప్పించిన మురళీ - సోనా తండ్రి, కూతురుకిపెళ్లిజేస్తే చాలనుకున్నాడు. 

"మీ చెల్లిని మేనమామ కొడుక్కి చేయాలనే గందా లగ్గం పెట్టితిరి. ఆడేమో లగ్గం రోజుకి మొహం తప్పించే, ఎక్కడోచెట్టుకి ఉరేసుకునిచచ్చిపోయే నీ చెల్లిని చేసుకోవడం యెందుకిష్టం లేకపోయిందో యెవరికి యెరుక. సమయానికి నేను అక్కడుంబట్టే మా అమ్మపోరింది.. దీన్ని చేసుకోమని." అంటాడు మురళితో భూక్యా. అంటే, అసలు పెళ్ళీ చేద్దామని అనుకుంది వేరే మేనల్లుడితో, అతను  ఏ కారణాలతోనే ఉరేసుకొని చచ్చిపోయాడు. ఏదో రకంగా పెళ్లిచేయాలనుకొని అదే లగ్గానికి భూక్యాకి అంటగట్టేశాడు సోనాతండ్రి. అతని యోగ్యతలతో ఆ తండ్రికి సంబంధం లేదు. తనకూతురి స్థాయి, స్థితి, మనసుతో అస్సలు సంబంధం లేదు. వదిలించుకోవడమే తన బాధ్యత. 


పెళ్ళయ్యాక రుక్కు మీద కోరికపుట్టింది భూక్యాకి. వంద అబద్ధాలుఆడి, వెయ్యి కలబొల్లి మాటలు చెప్పి మసిబూసి మారేడు కాయచేసి మారుమనువు చేసుకున్నాడు భూక్యా. అది కూడా ముందటిభార్య సోనా అనుమతితో, పెద్దల పంచాయితీ ఆమోదంతో. ఆతర్వాత సోనా పడుతున్న నరకబాధ గురించి పొరుగింటివాళ్లు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెబుతున్నా పట్టించుకోలేదా తండ్రి. అదీ, ఒకే ఇంట్లో పెరిగిన ఆడపిల్లకీ- మగపిల్లాడికీ మధ్య ఉన్నదూరం. అదీ వ్యత్యాసం. 


తండాలలో తాండవమాడుతున్న అవిద్య, అనాగరికత, సామాజిక, సాంస్కృతిక,  రాజకీయ అణిచివేత, ఆడవాళ్ల పట్లవివక్ష, లైంగిక హింస... వంటి ఎన్నో అంశాలను స్పృశించారువనజ తాతినేని ఈ కథలో. కొండంచు పల్లెలో మట్టి వాసన, బురద లసలస, ఎండిపోయిన దిగుడుబావు, కన్నీళ్లింకని కళ్ళు, కష్టాలు, ఆనంద విషాదాలు, వేదనావేదనలను, ఆవేశకావేశాలు, ఆక్రందనలు, అరణ్యరోదనలు, పొరుగింటి వాళ్ల మనస్తత్వాలూ... అన్నింటినీ కథ అనే చిన్న కాన్వాస్ లో కుదించి చూపారురచయిత్రి. “To see the world in a grain of sand, and to see heaven in a wild flower, hold infinity in the palm of your hands, and eternity in an hour” అంటాడు కదా గొప్ప కవి William Blake. అలా అల్పంలో అనల్పాన్ని కూర్చడం వంటిది ఈకథ. అందుకే 'దుఃఖపు రంగు' గొప్ప కథ అయ్యింది.


సంచార జాతుల్లో ఆధునికతా సంపర్కం వల్ల కలిగిన మార్పులు, పెళ్లి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలో లోపాయికారిచేసుకుంటున్న సర్దుబాట్లు ఈ కథలో పొందుపరిచారు రచయిత్రి. కథా నిర్మాణంలోను, వస్తుపరంగాను వైవిధ్యభరితంగా ఉన్న ఈకథని వనజ నడిపించిన తీరు, ఎత్తుగడలో  కూడా ఆమె చూపినప్రతిభ ప్రశంసనీయం. కథన శిల్పం గెలవడానికి సఫలంకావడానికీ ముఖ్యం భాష, శైలి. 'దు:ఖపు రంగు' సమకాలీకమైన వస్తువు. వార్తాపత్రికల్లో ఇటువంటి కథనాలు మనకిసుపరిచితమే. కనీసం సింగిల్ కాలం వార్తలుగా అయినా, దగాపడిన స్త్రీల వెతలు చూస్తూనే ఉంటాం. ఆ వార్తకు లేనిచైతన్య శక్తి కథకి ఎక్కడి నుంచి వస్తుంది? దానికోసం ఆ కథలో రచయిత్రి ఏఏ అంశాలు కూర్చుతారు? అక్షరాల సాయంతో జరిగిన ఆ కూర్పు- అది ఇచ్చే అర్ధంలో గానీ, అది డీల్ చేసిన వస్తువుతోకానీ, నడిపిన  పాత్రతో కానీ, మొత్తం మీద అది ప్రతిపాదించినజీవిత సత్యంతో కానీ అనుసంధానమై ఉండటం చేత ఆసాదాసీదా వార్తకే కళాస్థాయి చేర్చబడుతుంది. అదే ఇక్కడ వనజచేశారు. 


వస్తుగత, రూపగత, సంవిధానగతమైన వివిధాంశాల కూర్పులోనైపుణ్యం ప్రదర్శించే కథ పాఠకుల మనసుల్లో నిలిచిపోతుంది. అయితే, ప్రతి మంచి కథకూ ఈ లక్షణాలు ఉండవల్సిందేనా? అక్కర్లేకపోవచ్చు, ఉంటే మాత్రం గొప్ప కథ అవుతుంది- 'దు:ఖపు రంగు' కథ అయినట్టుగా. అన్ని కథల్లో శైలీగతమైన సుగుణాలన్నీఉండవు, ఉండాలని ఆశించడం అత్యాశే. కానీ, అటువంటి సమ్మేళనం కుదిరితే 'దుఃఖపు రంగు' వలె వస్తు విన్యాసంలో, పాత్ర చిత్రణలో, సంవాదశైలిలో, సంఘర్షణాత్పాదనలో, సన్నివేశకల్పనవంటి అనేకానేక అంశాల్లో కలగలిసి ఉన్నతమైన శిల్పపారమ్యాన్ని అందుకొని గొప్ప కథగా నిలవొచ్చు. వనజ తాతినేనిఎన్నుకొన్న వస్తువు, చెప్పదలచిన పరమార్ధం అంటే, ఆ వస్తువుపట్ల ఆమె ప్రదర్శించే దర్శనం ఉదాత్తమైనాయి కాబట్టే సంవిధానశిల్పం రాణించి గొప్ప కథ అయ్యింది. 


ఈ కథ ఎత్తుగడే చూద్దాం: 


"ఇంటి వెనుక నుండి మొదలయ్యే అడవి. పేరుకు అడవే కానీ, ఒక పచ్చని చెట్టు కూడా కనబడని ఆరుబయలు. చిన్న చిన్నచిట్టీతి పొదలు బొమ్మేడు,చిట్టికీసర చెట్లు. గట్టి ఎర్రటి నేల. చిన్నగాలికే నేల దుమ్మురేగి చెట్ల ఆకులు కూడా జేగురు రంగువేసుకున్నట్టు వుంటాయి."


- నాందీ శ్లోకంలోనే కథాంశం యావత్తూ సూచించడం సంస్కృతనాటక మర్యాద, సంప్రదాయం. ఈ కథారంభంలోనే అడవి కానిఅడవిని, ఆ వాతావరణాన్ని చిత్రించడం ద్వారా ఆ అడవి వంటి సోనా జీవితం, అరణ్యరోదన వంటి ఆమె ఆక్రోశం చెప్పేశారు వనజ.  


వర్ణన, శైలి, కథనంలో అంతర్భాగాలు. ఈ కాలం రచయితల్లో కరువౌతున్న వాటిల్లో భౌతిక వాతావరణ పరిసరాల వర్ణన పూర్తిగా కరువవుతోంది. ఆ భౌతిక వాతావరణాన్ని పాత్ర చిత్రణను జోడించికాల స్థల వస్త్వైక్యం సాధించడమే 'దుఃఖపు రంగు' విశిష్టత. అదిపచ్చాపచ్చాని అడవి కాదు, 'దుమ్మురేగి చెట్ల ఆకులు కూడా జేగురు రంగు...' పులుముకున్నాయి. సోనా కూడా తనదైన సహజత్వం మాసిపోయి, జేగురు రంగు జీవితాన్ని జీవిస్తోంది. మాట్లాడేటప్పుడు, అంటే మాటల్ని రాసేటప్పుడు అభివ్యక్తం లో కనబడే తీరునే శైలీవిన్యాసం అంటాము. 'దు:ఖపు రంగు' కథకిఒక మాండలికాన్ని కేటాయించే క్రమంలో నైపుణ్యాన్ని చూపించారురచయిత్రి. వివిధ ప్రాంతీయ, సామాజిక వర్గ మాండలీకాలగురించి అవగాహన, సాధికారతా లేకుంటే ఇది సాధ్యం కాదు. ఆసముచిత   ప్రయోగం వల్ల కథన సంవాదాలు రెంటికీ సహజసౌందర్యం సమకూరింది. 


సోనాని భూక్యా చావగొట్టి వీధిలోకి తోసేస్తాడు. "పలుపుతాడు దెబ్బలకి ఒళ్ళంతా పొంగింది సోనాకి. జ్వరంముంచుకొచ్చింది. నోరు పిడచగట్టుకు పోతోంది. ఎవరన్నా నీళ్ళుఇవ్వకపోతారా అన్నట్టు చూస్తూ వుంది. ఊరంతాసద్దుమణిగింది కానీ, గొంతులో చుక్క నీళ్ళు పడలేదు. ఆకాశంలోచంద్రుడికి మల్లే నడీధిలో సోనా."


- ఆకాశంలో చంద్రుడికి మల్లే నడీధిలో సోనా. ఎటువంటివాక్యమిది? "ఆకాశపు టెడారిలో కాళ్లు తెగిన... ఒంటరిఒంటెలాగుంది జాబిల్లి!" అన్నాడు కదా మహాకవి శ్రీశ్రీ (ఒక రాత్రికవితలో). యుగయుగాలుగా కవులకి ప్రేరణగా నిలిచిన చంద్రుడుకి ఆధునిక మహాకవి కొత్త ప్రతీకని అన్వయించాడు. అటువంటిదే వనజ తాతినేని చేసిన ప్రయోగం, ఇచ్చిన ప్రతీకకూడా. నిరాశ, నిస్సహాయత, నిర్వేదం, ఒంటరితనం - అన్ని అర్థాలు ఒక్కవాక్యంలో- "ఆకాశంలో చంద్రుడికి మల్లే నడీధిలో సోనా" - ఇంతకు మించి వనజ ప్రతిభని చెప్పడానికి ఏముంది? 

**​**

వసుధైక కుటుంబాన్ని కలగని, దాని సాకారానికి తపించే వనజ తాతినేని వంటి ఉత్తమ రచయిత్రి సాహిత్యం గురించి కాకుండా సాహిత్యేతర మైన సామాజిక కులీనతని ప్రస్తావిస్తున్నందుకునన్ను మన్నించాలి. కానీ అనివార్యం కాబట్టే తప్పడం లేదు. సగటు పారిభాషిక పదాల్లో చెప్పాలంటే, వనజ తాతినేనిఅగ్రకులానికి చెందిన రచయిత. సామాజికంగా అట్టడుగువర్గానికి చెందిన బడుగు, దళిత స్త్రీ గురించి, ఆ అభాగ్యుల జీవనంలోని దుస్థితి గురించి ప్రతిభావంతంగా కళ్లకు కట్టారు. 


నా దృష్టిలో అది చాలా గొప్ప విషయం. కానీ, దళితేతరులు, లేదాగిరిజనేతరులు దళితుల, లేక గిరిజనుల సమస్యల గురించిమాట్లాడటం, రచనలు చేయడం కూడదనే వాదనలు మనతెలుగు సాహిత్యంలో, మరీ ముఖ్యంగా అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్న వినిపిస్తున్న మొండి వాదం. ఎవరి రచనలువారే రాసుకోవాలని అస్తిత్వ ఉద్యమాలు హోరు పెడుతున్నాయి. తనదికాని జీవితాలకు విస్తరించడమనే అభిలాష, ఆసక్తీ సాహితీకారులకు ఉండనక్కర్లేదని వాదాలరాయుళ్లు గొడవలగోదాల్లోకి దూకుతున్నారు. ఈ వాదనే సబబైతే, రెండో పెళ్లి చేసుకున్న భర్తతో వేగి, హింసలు పడితేనే 'Jane Eyre' నవల రాయాలని Charlotte Bronte ని దబాయించాల్సి వస్తుంది. 'Madame Bovary' గురించి మగాడివి అయిన నువ్వెలారాస్తావయ్యా అని మహారచయిత  Gustave Flaubert తో దెబ్బలాట కి దిగాలి. మన భారతీయ రచయితల విషయానికొస్తే,  హరిజనులు, దళితుల స్థాయి, దయనీయమైన వారి స్థితిగతులు, అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలూ మీరెందుకురాశారని ముల్కరాజ్ ఆనంద్, రాజాజీ (సి.రాజగోపాలాచారి- తమిళం), శంకర్రావ్ ఖరత్ (మరాఠీ), కుం.వీరభద్రప్ప (కన్నడ) వంటి గొప్ప రచయితల్ని బోను ఎక్కించాలి.


మన తెలుగులో  1913లోనే వచ్చింది హేలావతి'' కథ. వెంకటపార్వతీశ్వరకవుల 'మాతృమందిరం'  వచ్చి నూరేళ్ళునిండిపోయింది.  ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ‘‘"మాలపల్లి'కికూడా నిండు నూరేళ్ళే కదా. 1925 లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి‘ పుల్లంరాజు’ కథ , 1931 లోని ‘సాగర సంగమం', 'ఇలాంటితవ్వాయి వస్తే', (1934 ) వంటి కథలు హరిజనుల సమస్యగురించే. అసలు గిరిజనుల గురించి కథలు రాసిన, రాస్తున్నవారికి ఆద్యులు చింతా దీక్షితులు గారు. సుగాలీలు, చెంచులు, ఎరుకలు, యానాదులు, కోయలు మొదలైన వారి జీవిత శైలినిఅత్యంత సహజంగా, దగ్గరగా చూపించారు- ‘సుగాలీకుటుంబం’లో.  ‘చెంచురాణి’ చెంచుల జీవితం, ‘అభిప్రాయభేదం’ యానాదుల కథ. 


రెండు మూడు దశకాల నుంచీ వెలుగులోకి వచ్చిన దళిత, స్త్రీ, మైనారిటి, ప్రాంతీయవాద అస్తిత్వ సాహిత్యోద్యమాలు వారివర్గాలకు చెందని రచయితలు, కవుల మీద నిషేధాజ్ఞలు విధించడం బాధాకరం. అస్తిత్వ చైతన్యాలు ఎవరి మూలాల్నివాళ్లు వెతుక్కునేందుకు దోహదపడటం ఎంత వాస్తవమో, ఆయాచైతన్యోద్యమాలకు చెందని సృజనకారుల్లో కొత్త స్పృహల్నికలిగించి, ఉత్తమోత్తమ కోణాల్ని ఆవిష్కరించే విధానాలకి తెరతీసింది. అట్టడుగు జీవుల ఆక్రందనలు, శ్రామికులనిస్సహాయత, అస్పృశ్యుల ఆవేదన, సంచారజీవుల బతుకుల్లో చీకటి వెలుగులు వస్తువులుగా స్వీకరించి, ఆ వస్తువులకి తగ్గ భాషని, యాసని, శిల్పాన్ని సాధించి, సంతరించే రచయితల వల్ల ఇంకా ఆ అస్తిత్వవాదాలకి మేలు జరుగుతుందని గ్రహించడం లేదు- వివాదాల వాదులు. 


ఒక రైటర్ కు భావపుష్టి, పలుకుబడి ఎంత ముఖ్యమో అంతకన్నాముఖ్యమైనది సాంస్కృతిక సంపద.  ఆ సాంస్కృతిక సంపద పుష్కలంగా ఉన్న రచయిత్రి వనజ. కాబట్టే, ఒక అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీ బీభత్స ... విషాద... కారుణ్యమైన కథనురాయగలిగారామె. పాత్రల సహజ ప్రవృత్తి, వాళ్ళకే తెలియని సైద్ధాంతిక మూలాల్లోంచీ కొన్ని భావప్రకటనల్ని పదాల్లో పలికించి పాఠకుడిలో cultural అడ్డుగోడల్ని కూల్చి, వస్తువులోని గాఢత, తీవ్రత అతనికి కలిగించి, సమస్య పట్ల తీవ్ర నిరసనలు పాటూసహానుభూతిని, రస స్పందన కలిగించేలా  'దుఃఖపు రంగు' రచించిన వనజ తాతినేనికి అభినందనలు. 


**​**​**

వీడియో యీ లింక్ లో...