గదిలో ఒంటరిగా
కాలం బరువుగా తోస్తున్నప్పుడు
చేజారనీయకు నీ బాల్యాన్ని
అపుడే దాని అవసరం మరింత
నిన్నెవరూ అడగపోయినా
నీకు నువ్వే చెప్పుకుంటూ వుండాలి
ఆ మధుర జ్ఞాపకాలన్నీ
బాల్యకాలపు అమాయకపు చేష్టలనుకుంటావ్
కానీ.. కొన్ని కఠోరసత్యాలు
ఆ కాలగతిలో దాక్కుని వుంటాయి
వాటిని తొలుచుకుంటూనే వుండాలి
ఎవరో వొకరు వొక చెవినిటు వేస్తారనే నమ్మకంతో శ్వాసిస్తూ వుండాలి
అనుభవాలు జీవితాన్ని కరిగిస్తే వచ్చిన తురుపు ముక్కలు.
ఊరకనే ఊటబావిలోన ఊరే నీరు కావవి.
అనేక తారకలు వెలిగించిన నీ గమనం వుంది
ఆర్జించిన జ్ఞానం వుంది.
ఇచ్చట పండితుడివి పసిపాపవు నీవే
మనసుకు గాఢంగా
కస్తూరి పరిమళం అద్దుకున్నట్టు
వృద్దాప్యానికి బాల్యపు ఆనవాళ్ళే
మంచి గంధపు పరిమళాలు
జీవితం యెప్పుడూ వెనక్కి మళ్ళదు.
చేసిన తప్పులకు పశ్చాతాపం చెందటమే శిక్ష.
ఇసుకపై వ్రాసుకున్న రాతల్లా
మబ్బుల కేన్వాస్ పై గీసుకున్న గీతాల్లా
అవి చెరిగిపోయాయని మనసులో కూడా తుడిపేయడమే ప్రశాంతత
మనిషి తన బాల్యాన్ని తలుచుకున్నప్పుడల్లా
గింజల కోసం చిలకలు తొలుస్తునపుడు
వెదజల్లబడిన పింజెల వలే మనసు తేలిపోతుండాలి
జ్ఞాపకాలు ఆలస్యంగా బయలుదేరిన
బడి పిల్లలవలె బిరబిర సాగిపోయినట్లుండాలి
పడమటి గాలి కదలికలు పూరా స్మృతులనెన్నో
మోసుకొచ్చినట్లు తొణికిసలాడుతూ వుండాలి.
బిక్కముఖం వేసో రాగం తీస్తూనో
రెండుచేతులు చాచి చేతులెత్తితే
ప్రేమగా హత్తుకోవడానికి వొంగే రెండుచేతుల కోసం
యిప్పుడూ యెదురెదురుచూడాలి
జీవనయానంలో అలసినప్పుడు
యెక్కడో వొకచోట కాస్త ఆగినపుడు
తరువొకటి నీపై నిండుగా పూలవర్షం కురిపించి
అభినందించిన సన్నివేశం గుర్తుచేసుకోవాలి
ఆ తరువులే ఏటేటా శిశిరంతో చేస్తున్న యుద్దాన్ని
జీవన సంఘర్షణనూ నిత్యస్పూర్తిగా ఊతం చేసుకోవాలి
మనిషి ఏదో వొకటి వొదులుకుంటూనే వుండాలి
ఆశలైనా ధనమైనా సుఃఖమైనా దుఃఖమైనా
కానీ ప్రాణాన్ని మాత్రం కాదు
ఎవరికో వాగ్దానం చేసినట్టు మనకు మనమే
సంకెళ్ళు వేసుకున్నంత గట్టిగా వాగ్దానం చేసుకోవాలి.
ఆశ చేజారనీయకు అని
రెండో బాల్యాన్ని వాడనీయకు అని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి