24, జూన్ 2019, సోమవారం

వర్ష ఆహ్వానం

చినుకు కోసం ఎదురుచూపులు .. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం సాల్లూరి రాజేశ్వరరావు గారి సంగీతంలో రూప కల్పన చేయబడిన పాటను ఇష్టంగా చిత్రాలను కూర్చి ఒక వీడియో చేసాను. చూస్తారు కదూ.. 

 
పాట సాహిత్యం



13, జూన్ 2019, గురువారం

తెరిచితిని హృదయ పత్రం





 🌷తెరిచితిని హృదయ పత్రం🌷💕✍️

ప్రియ మిత్రుడా !
ఇన్నేళ్లకి నిన్నొకమారు చూసి పోదామని ఈ ఉగాదికి ఇటువైపు వచ్చాను. ఈ నది వొడ్డున చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నవేమో కాళ్ళు అటువైపు లాగుతూ ఉంటాయి. ఆ జ్ఞాపకం యెలా వుందంటే అమ్మ దేవుడికి నిత్య హారతిచ్చేందుకు పచ్చ కర్పూరాన్ని పల్చటి వస్త్రంలో వేసి గట్టిగా మెలిపెట్టి చిన్న చిన్న వుండలుగా చేసిన తర్వాత ఆ వస్త్రాన్ని దండెం మీద వేస్తే నేను దానిని తీసి రహస్యంగా అబ్బురంగా దాచుకుని కొన్ని నెలలపాటు ఆ వస్త్రానికంటుకున్న కర్పూరపు వాసనలను ఆఘ్రాణించి మురిసిపోయినట్లు నీ జ్ఞాపకాలని దాచుకుని మురిసిపోతున్నాను గనుక.

ప్రకృతికి నేపధ్య సంగీతమాలపిస్తున్నటు కోయిల గానానికి సెలయేటి గలగలలు. రాత్రంతా లోకాన్ని సేదతీర్చిన నల్లని ఆకాశం వెండి మబ్బులు కమ్ముకుని మెరిసిన పిమ్మట హడావిడిగా మారిపోయిన ఊదారంగు ఆకాశలో అప్పుడే విచ్చుకుంటున్న పొద్దు.బంగారురంగు మైదానంలో దొర్లుతున్న నారింజరంగు బంతిలా సూర్యుడు. మరి కాసేపటికి పసుపుపచ్చని కిరణాలూ నులివెచ్చగా తగులుతూవుండగానే  నీలంరంగులో మారిన ఆకాశం. రేకులు విప్పుతున్న పూపొదలు మొత్తానికి అక్కడంతా వనవీథిలో ఉషోరాగం ఆలపిస్తున్నట్టు వుంది. ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ గతంలోకి వెళ్లాను.

ఆధ్యాత్మిక ప్రసంగాలలో మనుషులను మాములుగా కాదు హృదయంతో పరామర్శించమని చెపుతుంటే నాకు నువ్వే గుర్తుకొస్తుంటావు

రసాకృతి యందునే మనుషులు జీవించియుందురు కదా. ప్రేమ అనిన మునుపు ఆలపించిన రాగము లాంటిది. ఎడబాటులెన్ని యెదురైనా రాగము వినిపిస్తూనే వుంటుంది.

ఇక్కడ పాతేసుకున్న చెట్టులా నిలబడి నేనెంత సేపటినుండి యెదురుచూస్తున్నానో తెలుసా! ఆకు అలికిడైతే చాలు వచ్చేవేమోనని ఉలిక్కిపడుతున్నా. అసలీ ఎదురు చూపులో ఎంత తీయదనమో అంత అసహనం కూడా! ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే నీకేమి తెలుసు లే బాధ మధురమూ రెండూనూ. చీకటి రెప్పలను తెరిచి నది గొంతుకకు మన పాటనిచ్చి మనం మౌనంగా ప్రేమతపంలో మునిగిన రోజులను గుర్తుతెచ్చుకోవడానికి తప్ప నేనిక్కడకు ఎందుకు వస్తాను చెప్పు ? అని పోట్లాడిన జ్ఞాపకం పచ్చిగానే ఉంది ఇంకనూ.

ఇదిగో ... ఇద్దరమూ చేతిలో చెయ్యేసుకుని అలా అలా వెళ్ళొద్దామా అనుకుంటూ మనుషులకు దూరంగా పచ్చని కోనలోకి దారి చూసుకుంటూ దారి చేసుకుంటూ వెళ్ళి వో చెట్టు మొదలుకు సాగిలబడి ఒంటరి రాత్రులలో వొంటిగా కన్నకలలను మళ్ళీ ఒకసారి పంచుకుందామా.. నీ భుజంపై గడ్డమానించి ప్రపంచాన్ని పరికిస్తూ వుంటానా.. తత్పూర్వమే పూర్ణ చంద్రోదయాన్ని సేవించినట్లున్న కనులతో ఆ చంద్రుడు అక్కడ లేడు ఇదిగో యిక్కడ ఈ కళ్ళలో వెలుగుతున్నాడు అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుంటున్నాను. కళ్ళనిండా తొణుకుతున్న ప్రేమను అంతలా యెలా కురిపించావో మరి మరి జ్ఞాపకం చేసుకుంటాను. ఆ జ్ఞాపకాల నిధిని తవ్వుకోవడానికే మరి మరి యిక్కడికి వస్తూ వుంటానని చెపుతున్నా.

ఇంతకుమునుపే నువ్వేమో వూగే లోలాకులను చూస్తూనో కురులకల్లుకున్న పరిమళాలను ఆస్వాదిస్తూనో వుంటావా,అప్పుడే ఓ జంట పక్షుల కువకువలో రాలిపడుతున్న ఆకుల చప్పుడో మన యేకాంత ఆస్వాదనకు విఘ్నం కల్గిస్తాయి. తెప్పరిల్లి నా వొడిలోకి నీవో నీ వొడిలో నేనో ప్రశాంతంగా తలపెట్టుకుని ముందు నడకలో వుండే ముళ్ళ గురించి వెలుగు నీడలు గురించి సంధ్య వేళలకు ముందు వెనుక వున్న చీకటి రంగు గురించి యెన్నో మాట్లాడుకుంటూ వుంటామా.. చిరుచీకట్లు క్రమ్ముకొస్తుంటాయి. నెమ్మదిగా లేచి బట్టలు దులుపుకున్నట్లు ఆలోచనలు దులుపుకోలేక భారంగా మనుషుల లోకంలోకి నడుచుకుంటూ వస్తాం. మనుషుల చేరువవుతున్నామనుకుంటుంటే కలసిన చేతులే కాదు. హృదయాలు కూడా విడిపడి నడక మార్చుకుంటూ.. దూరంగా వెళతాయి. ఆ అడవిలో జంతువులే వుంటాయి. ఈ అడవిలో కుల మత అంతస్తుల అగాధాలుంటాయి ఎవరిని ఎప్పుడు విడదీయాలో అన్నట్టు పన్నాగాలు పన్నుతుంటాయి.ఆ దాడికి గురవకుండానే జీవితమంతా కలలో గడిపినట్లే గడుస్తుందన్న భ్రమలు లేని మనం తొందరగానే తేరుకొని మనసుకు ఇనపతొడుగు తొడుక్కొని యాంత్రిక జీవనంలోకి జొరబడిపోయాము కదా ! ఆ నాళ్ళు, లేనగవులు చిందులాడే మోముతో పరిచిన హృదయాన్ని అంది పుచ్చుకున్న నా హృదయమూ రెండు హృదయాలు కలబోసి ప్రేమను ఆసాంతం ఆస్వాదించి తరించి పునీతమైంది కదా! ఈనాటి తలపులలో అది సజీవమై సాగుతుంది మరి.

తొలి ప్రేమ లోని పరిమళానివి
గత కాలపు చిరునామాలో మిగిలిన వసంతానివి
వర్తమానానికి వొక జ్ఞాపకానివి .
మొత్తానికి నా ఈ జీవిత కాలానికి సరిపడా వెన్నెలను కురిపించి హృదయ పత్రముపై లేఖ వ్రాసిన  ప్రేమికుడివి .తెరవని తలుపులు తెరిపించి మాయని తీయని గాయం చేసేసి జ్ఞాపకాల నీడగా మిగిలావు.ఈర్ష్య ద్వేషం ప్రేమ నశించడం కష్టం. చెదలు పుట్టినట్టు పుడుతూనే వుంటాయి.చెదపట్టిన మనసుతో ఈ వేళ యిక్కడ కాస్త స్వేచ్ఛగా మసలి ఆనందంలో మునకలు వేసి ఆఖరికి భారమైన మనసుతో ఇంటిదారిపడతాను.

నిన్న పాత యింటి వైపు వెళ్ళాను..గతాన్ని హతం కానివ్వని జ్ఞాపకాలేవో అటు లాగేస్తుంటాయి. అలవాటైన దారైనా కొత్తగా వుంది. మనుషులకన్నా చెట్టు పుట్ట కొండగురుతులుగా మిగిలివున్నాయనుకుంటా. వాటినే చూపులతో పలకరిస్తుంటే మొహమంతా సంతోషంగా విప్పార్చుకుని చూస్తున్నట్లనిపించింది. ఇంటెనుక అనేక కోయిలలకు నెలవైన గుబురు మామిడి నిండుగా కాయలతో పలకరిస్తుందనుకుంటే వాటితో పాటు చిక్కుడు పాదంతా దట్టంగా అల్లుకుని యెండిన కాయలతో యెబ్బెట్టుగా స్థలాభావంతో కుంచించుకుపోతున్న మనిషి మితిమీరిన ఆశకు పరాకాష్టలా కనిపించింది. నిండుగా పూసిన పూల సౌరభంతో వసంతానికి వేప స్వాగతం పలుకుతూ కనబడుదనుకుంటే నేలమట్టంగా కత్తిరించబడి ఉగాది ముఖాన వత్సరాల గ్రీష్మాన్ని మిగిల్చిపోయిందే అని బాధ కల్గింది. ఇక మూడంతస్తుల యెత్తున యెగబాకి మత్తెక్కింతే వాసనతో తన చుట్టూ ప్రదక్షిణం చేయించుకునే మూడువరుసల రేకులతో నిండుగా నవ్వే మరుమల్లి యెండిపోయి కనబడింది.కొత్తగా వచ్చినవారు ఏడు పదులు నిండిన వారు.. మూడుతరాల వివరాలు గొప్పగా చెప్పింది కాని ఓ పచ్చని ఆనవాలు లేని యిల్లు కిక్కిరిసిన సామానుతో వూపిరాడనివ్వలేదు. రెండు నిమిషాలుకూడా నిలవలేక నిస్సారమైన మనసుతో వెనక్కిమళ్ళాను.

చిన్న వుపశమనం యేమిటంటే వీథి చివర నిండా పూసిన బిళ్ళగన్నేరు చుట్టూ అల్లుకున్న చిక్కడు తీగ పసుపు బారిన ఆకులతో కలిసి రెండూ యెంత మనోహరంగా కనిపించాయో! చీటికి మాటికి క్లిక్ మనిపించే నేను ఆ అందాలను కళ్ళ నిండానూ మదినిండానూ నింపుకుంటూ వచ్చేసాను.

మనిషికో గొప్ప స్నేహం ప్రకృతి. ప్రకృతితో స్నేహం యెంత బాగుటుందో!  తీరని ప్రేమ  దాహంతో అలమటించే వారికి ప్రకృతి వరప్రసాదం. వచ్చీపోయే పండగల్లా మనుషులు హంగు ఆడంబరమూ ఆర్భాటాలు ప్రదర్శిస్తూ వెళ్ళిపోతుంటారు, వెలిసిపోతుంటారు ఋతువులూ వాటితో వచ్చే అందాలు ఆహ్లాదాలు ఫలాలు మన జీవన మధుపాత్రను నింపుతూనే వుంటాయి. గుండె గూటికి పండగ తెచ్చేది యిచ్చేది నిత్య సూర్యోదయం సూర్యాస్తమయం పచ్చని ప్రకృతి యే. ప్రకృతిలో మమేకమై పోవడమే మాయమై పోవడమే ఆదియునూ అంతిమం కూడా.

కృష్ణశాస్త్రి గారిలా నాకు ఉగాదులూ లేవు ఉషస్సులు లేవు అనుట న్యాయం కాదు. మనసులకు హోళి ఉగాదికి వునికి మిగిలే వుంటుంది కదా..

ప్రతి జీవితానికి వొక  వసంతం తప్పక వుంటుంది. అందులో కనిపించని కోయిల వుంటుంది. కనబడలేదని కోయిల లేదు అనుకోకూడదు కదా.. కనబడని కోయిల పిలుపులే కానకు అసలైన సందడి . ఆనాటి ప్రేమ వెలుగుతో నిత్యం మునిగి తానాలాడుతూ యిలా అనుకుంటున్నా "మనుషులెపుడూ భావగతమైన వ్యామోహానికి బానిసలు"
మరలమరల ఇక్కడికి వస్తూనే ఉంటాను ప్రియతమా..
దుఃఖాన్ని జ్ఞాపకాలను ఒంటరితనంలో తరచి తరచి అనుభవించాలట.

నువ్వు నన్నైనా మర్చిపోకానీ పంచుకున్న గీతాలు కవిత్వం మర్చిపోకు
మత్తిల్లే మనసు పరిమళాల మధ్య సోయ లేకుండా గడిసిన క్షణాలను మర్చిపోకు
దూరాలెప్పుడూ సిగ్గిల్లుతాయి కలగలిసిన హృదయాలను జూచి.
ఆ దూరాలెప్పుడూ నామమాత్రమేనని శ్వాస చెబుతుంది జీవిస్తున్న క్షణాల సాక్షిగా .
దూరాలు హృదయాలు వలపు వాగ్ధానాలు కంటికి అగుపించని కమ్మతెమ్మెర లాంటిది అగరు పరిమళం లాంటిది.

వికసనమంటే యిదే! ప్రతి క్షణం కొన్ని లక్షల కిరణాలు మన చీకట్లను చేధించి విహాయస పథాల్లోకి తీసుకొని వెళతాయి. ప్రేమికులను మరీ తీసుకుని వెళతాయి.సఖుడా! ఈ వేకువపువ్వు సాక్షిగా నా యీ ప్రేమపత్ర హృదయం పరిచాను జ్ఞాపకాల నీడలతో.
ఆఖరిగా ఈ మాటలు గుర్తుచేసుకుంటూ

“Cry if you need to, it’s good to cry out all your tears, because only then you will be able to smile again…”
―Paul Coelho, Like the Flowing River