28, ఏప్రిల్ 2023, శుక్రవారం

రెండు నవలలు

మైదానం చెలియలికట్ట

చలం మైదానం లో  లైంగిక వాంఛలు తీరని ఆకర్షణకు లోబడిన వొక స్త్రీ గడప దాటిన తర్వాత వచ్చే పర్యవసనాలను చూచాయగా చెబుతూనే ఆ స్త్రీ అంతకన్న హీనంగా దిగజారిపోవడాన్ని సూచిస్తుంది. చలం మొదటి నవల అది.. అందులో రాజేశ్వరిని ఆయన సమర్దించలేదు వ్యతిరేకించలేదు. పాత్రను  స్వేచ్ఛగా సంచరింపజేసాడు. ఆయన మైదానం రాయడంలో పాఠకుల వ్యతిరేకత వుంటుందని లేదా మెప్పుదల  గురించి అంచనా వేసి రాయలేదని మనం గమనించాలి. రచనా కాలం 1927 సంవత్సరం. 


అదే విశ్వనాథ చెలియలికట్ట మైదానం కి జవాబుగా రాయబడింది అని అంటారు. ఈ నవల 1935 లో వచ్చింది. ఈ నవలలో  ఆది నుండి పాత్రల చిత్రణ కట్టుదిట్టంగా సృజించారు.  ముగింపు వెళ్ళేసరికి ఆ కాలపు మెజారిటీ  పాఠకులను సంతృప్తి పరచడానికే క్రాప్టింగ్ జరిగిందని తెలివిగల పాఠకులకు అర్థమవుతుంది. ఇక చెలియలి కట్టలో  మాత్రం రత్నావళి లో ఆధునికత యెక్కడ వుంది. మరిదితో వెళ్ళిపోయి కొంత సంపాదనతో వెనక్కి వచ్చి అది భర్త కొడుక్కిచ్చి  అంతిమ సంస్కారాలు చేయమని అబ్దికం జరిపించమని కోరడం తప్ప. అది హస్యాస్పదం అనిపించింది నాకు. పశ్చాత్తాపంతో మరణించడం వేరు అన్ని అంపకాలు చేసి మరణించడం వేరు. ఆమె ధర్మాన్ని అర్ధం చేసుకుంది కాబట్టి అని సింపతీ చూపడం పాఠకులకు తగదు. అది ముమ్మాటికీ  రచయిత అభిప్రాయం. ఆ ఒరవడి లోనే రాసాడు ఆయన.


రత్నావళి వికాసం చదువు ఆర్థిక స్వాతంత్ర్యం వొంటరిగా బ్రతికే దైర్యాన్ని ఇవ్వలేనప్పుడు మరిది వెంట వచ్చి తప్పు చేసానని మథనపడినప్పుడే చంపేయాలి కదా! రచయితకు అది యిష్టం లేదు. రత్నావళి చదువుకుని ధర్మాధర్మ విచక్షణల గురించి కుహనా అభ్యుదయాల గురించి చర్చించి ఇతరుల చర్యలు అభిప్రాయాలు తప్పని వొప్పించే సామర్థ్యం కల్గిన స్త్రీ అయివుండి కూడా  యెవరి సానుభూతి కోసమో జాలికోసం ఆశ పడాలి చెప్పండి. భర్త తృతీయ వివాహం చేసుకుని కొడుకుని కన్నందుకు సంతోషిస్తుంది. రత్నావళిలో  పశ్చాత్తాపం కల్గింది అనుకుంటే సమంజసమే కావచ్చు. కానీ రచయిత విశ్వనాథ ఆ పాత్రను యెలా తీర్చిదిద్దారు అంటే..  చదువుకుని సంపాదన పరురాలైన విజ్ఞానవంతురాలైన స్త్రీ పురుషుడితో సమానస్థాయి కల్గిన వ్యక్తి అయినప్పటికి ఆమె తప్పును  భర్త క్షమించడం లోకం కూడా తప్పైపోయిందని కాళ్ళు పట్టుకుందిగా పోనీలే పాపం అని సానుభూతి పొందటం కోరుకుందా?  పశ్చాత్తాపం అంటే చావడమే శరణ్యమని చెప్పదలిచిందా? అది రచయిత అభిప్రాయమే అయివుంటుంది. కాదంటే రత్నావళి బ్రతికివుండేది అని నా అభిప్రాయం.రంగారావు రత్నావళిని చివరి వరకూ అంటిపెట్టుకునే వుంటాడు. పుట్టి ముంచలేదు. రత్నావళి ఒక్కటే సముద్రంలోకి నడిచి వెళుతుంది. గిల్టీ రంగారావుకు కూడా వుండింది. మరి అతనెందుకు ఆమెను అనుసరిస్తాడో ..  ఆమెను నిలువరించి ఇరువురూ జీవించలేరెందుకో! బహుశా ఆ కాలానికి తగిన శిక్షను విధించుకున్నారేమో! ఆ కాలానికి అది అవసరం అనిపించింది కనుక రాసారేమో అనుకుంటాను.


నేను రత్నావళి పాత్ర తో differ అయ్యాను. అంతఃచక్షువులు తెరుచుకోని ఏ జ్ఞానమైనా నక్క నీలి నీలిమందు బానలో మునిగినట్టే అని నా భావన. గిల్ట్ తో జీవితాన్ని ముగించుకుంది తప్ప బతికే అవకాశం లేక ముగించుకోలేదు. ప్రణయమైనా ప్రళయమైనా ఉదృతి కొంత సమయమే!  రంగారావుకి తన పై ప్రణయం జీవితకాలం  వుండదనే తెలివిడిగా మేల్గొన్న ఆమె కు ఆత్మహత్య కూడదనే జ్ఞానం కల్గలేదు అంటే అది రచయిత అభిప్రాయమే కదా!    ఇవన్నీ వ్యాఖ్యలలో రాసి మనఃశ్శాంతి పోగొట్టుకోను.  రచనల్లో పాఠకులు ఎవరికి నచ్చింది వారు తీసుకుంటారు. . 


నేను “మైదానం” నవల ని పరమ చెత్త  అని చెబుతాను. అలా అని రత్నావళి కూడా నాకు నచ్చలేదంతే! 


అదేదో రాధికా శోభన్ బాబు సినిమా రమ్యకృష్ణ రాజశేఖర్ సినిమాలు కూడా ఈ కోవలేవే!


ఆడది తప్పు చేసింది అంటే... ఆమెకు ఆత్మహత్యే శరణ్యం అని అన్నమాట. ఇప్పటికి కూడా అదే తరహా ఆత్మహత్యలు జరుగుతూ.. వుంటున్నాయి కూడా! 


భార్య ఏ కారణాల చేతనైనా సరే మరొక పురుషుడితో వెళ్ళిపోయి ఆ బతుకు నరకప్రాయమై తిరిగివస్తే భర్త క్షమించినా ఆమెతో కలిసి వుండటానికి కుటుంబం

 సమాజ ఆమోదయోగ్యం కావాలి.  మరి అదే తప్పు  భార్య వుండి కూడా నిత్యం వ్యభిచరించే మగవాడు  కూడా తప్పు చేస్తున్నట్లు లెక్కే కదా! మరి అతనికి పశ్చాత్తాపం వుండొద్దా. రోజు కొక పురుష ఆత్మహత్య వుండొద్దా.. 😂😂


మైదానం నవల చెలియలి కట్ట నవలలు సమకాలీన నవలలు కాదు. రాజేశ్వరి లు రత్నావళి లు వీధి కొకరు వున్న కాలం యిది. రచనల ప్రభావం స్వల్పం మాత్రమే! పూర్తి ప్రభావం వుంటే లోకం యింత చెడ్డగానో లేపోతే యింకా కొంత మంచిగానో వుండేది కాదు. 


రచనల్లో యెవరికి నచ్చినది వారు తీసుకుంటారు. భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ సాగిపోవడమే తప్ప .. నేను చెప్పిన కోణమే.. సరైనదని భావించడం దానినే బలపరుచుకుంటూ వితండవాదం చేయడం.. కూడదు అనే ఎఱుకతో.. నా బ్లాగ్ లో రాసుకుంటున్నాను.  


రచనను బట్టి తప్ప  ఈ రచయిత చెప్పిందే   నాకు వేదం అని ఆ రచయిత రచనలు హేయం అని నేనెప్పుడూ అనలేదు. చలం విశ్వనాధ.. ఎవరిని చదివేటప్పుడు వారిని గౌరవిస్తాను. అచ్చెరువు చెందుతాను. మరొకసారి రెండు నవలలూ చదవాలి. ఈ నవలల పై ఇంతకూ ముందు బోలెడు చర్చలు జరిగాయి. ప్రస్తుతకాలానికి అవసరం లేని చర్చ కూడా ఇది.24, ఏప్రిల్ 2023, సోమవారం

సౌందర్యమంటే.. సృహ, స్వీయ ప్రేమ

 


ఎలాగో.. ఒక కథ ఆమె దృష్టిలో పడింది. అది చదివాక  ఆ కథా రచయితనైన నేను బాగా నచ్చాననుకుంటా.. మరొక రచయిత ద్వారా నా ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు. నెంబరు అందగానే వెంటనే కాల్ చేసారు. నేనిక్కడ వున్నానాయే!  వాట్సాప్ లో మెసేజ్ చేసారు. నా కథ ను ఓ ప్రముఖ రచయితకు పంపారట. ఆ రచయిత కూ ఆమె కు మంచి స్నేహం అంట. ఈమెకు నచ్చిన కథ ను ఆ స్నేహితురాలైన ప్రముఖ రచయిత చదివి.. ఈ మధ్య వనజ గారి కథను సమీక్షించాను అని చెప్పారంట. 

 రెండు రోజుల తర్వాత వాట్సాప్  కాల్ లో మాట్లాడారు. ఎన్నో ప్రశంసలు ఆమె నుండి. నా బ్లాగ్ లో చాలా చదివి వచ్చారు. ఈ కథ “ఈస్తటిక్ సెన్స్” కథ బాగా నచ్చింది. ఆడియో బుక్ చేసి తన ఛానల్ ద్వారా మరికొందరికి పరిచయం చేయాలని అభిలాష ను వ్యక్తీకరించారు. అంతకన్నా భాగ్యం యేముందీ.. అని ఉత్తరక్షణం అనుమతించాను. ఆడియో బుక్ చేసి పంపారు.. ఆమె తన ఛానల్ లో ఆడియో బుక్ రిలీజ్ చేసాక ఆ కథ ఆడియో ను పరిచయం చేయడం కోసం.. యెదురు చూసాను. ఇదిగో.. ఇలా మీ ముందుకు వచ్చేసింది.. నా ఛానల్ లో కూడా! 

కథ ఎక్కువమందికి చేరడమే కదా కావాల్సింది.. 

కథ ను మీరు కూడా వింటారు కదూ.. 

ఈ కథ ను చదివి బాగా నచ్చి ఆడియో బుక్ చేసిన వారు.. S.Rajya Lakshmi-Psychologist. 

 Uma Nuthakki Dr.Geetanjali Bharathi Bharathi ఈ పోస్ట్ లో ఉదహరించిన రచయితలు.. నా మిత్రులు. చైతన్యవంతమైన ఒరవడి తో  ముందుకు సాగుతున్న S. Rajyalakshmi గార్కి హృదయపూర్వక ధన్యవాదములతో.. 🙏🎈

#ఈస్తటిక్_సెన్స్  #వనజతాతినేని  కథ .. ఇక్కడ.. లింక్ లో వినగలరు. 


11, ఏప్రిల్ 2023, మంగళవారం

అవార్డ్ అందుకున్నా

 


అయిపోయిన పెళ్ళికి యిప్పుడెందుకు బాజాలు మోగించడం అని నవ్వకండి ఫ్రెండ్స్.. ఆ విషయాన్ని నా జ్ఞాపకాలనూ భద్రపరచాలని… అంతే! 

ఇంటి పేరు అనే కవిత రాసాను. ఎందుకో సంతృప్తిగా అనిపించలేదు.. మళ్ళీ అదే పేరు తో కథ రాసాను. అది “భూమిక” పత్రికలో ప్రచురితమైంది. 2016 లో అని గుర్తు. 

అంతకు ముందు రెండేళ్ళు లాడ్లీ మీడియా అవార్డు కొకరు నామినేషన్ పంపమని స్నేహితులు కొందరు చెప్పారు. నేను ఆసక్తి లేక మౌనంగా వున్నాను. ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందూ.. మీరు పంపాల్సిందే అని పట్టుబట్టింది. నేను కథ, కవిత రెండు విభాగాలకు నామినేషన్ పంపాను. 

కథ విభాగానికి అవార్డ్ లేదంట. కానీ నా కథ “ఇంటి పేరు” ను యెంపిక చేసి లాడ్లీ మీడియా అవార్డ్ ప్రకటించారు. 

అసలు లాడ్లీ మీడియా అవార్డ్ అంటే యేమిటో చూద్దాం. 

మీడియా లో జెండర్ అవగాహన/స్పృహ పెంచే ఉద్ధేశ్యంతో 2007 నుండి  యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ సహకారంతో పాపులేషన్ ఫస్ట్ సంస్థ భారతీయ పత్రికా ప్రపంచంలో లింగ వివక్ష వ్యతిరేక, స్త్రీపురుష సమానత్వ వార్తలకు, రచనలకు, విశ్లేషణలకు గత పది సంవత్సరాలుగా ప్రాంతీయ భాషలలోనూ, ఇంగ్లిష్ లోనూ అవార్డులు ఇస్తున్నది. తెలుగులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేసిన వారికి జర్నలిస్ట్ లకు డాక్యుమెంటరీలకు కూడా ఈ అవార్డులు ప్రకటిస్తారు. 

2017 వ సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల వారికి సంబంధించిన వారికి (నాలుగు రాష్ట్రాల వారికీ) అవార్డుల ప్రధానోత్సవ సభ హైదరాబాద్ కేంద్రంగా రవీంద్రభారతో లో జరిగింది. 

అవార్డ్ కి యెంపిక అయ్యాను అని తెలిసిన తర్వాత ఆ రోజు కు హైదరాబాద్ కు నేనూ, మా చెల్లి, మా అపూ, నా ఫ్రెండ్ కలసి వెళ్ళాం. అక్కడ వసతి భోజన సౌకర్యాలు లాడ్లీ మీడియా సంస్థ వారు అందించారు. 

అవార్డ్ అందుకోవడం.. ఆ అవార్డ్ కార్యక్రమానికి నా స్నేహితులు అనేకమంది వచ్చారు. ఆ సభలో కొండవీటి సత్యవతి గారూ శివాలోలిత గారూ.. సి.వనజ గారూ.. ఇంకా చాలామందిని ప్రత్యక్షంగా కలుసుకున్నాను. తులసి చందూ మా ఇంటి అమ్మాయే అనిపించింది. 

ఆ కార్యక్రమం గురించి నేను బ్లాగ్ లో కూడా పంచుకోలేదు. అవార్డ్ అయితే తీసుకున్నాను కానీ ఆ విషయాన్ని ఆనందంగా పంచుకునే సమయం కాదు అది. ఇంట్లో మా వారు అనారోగ్యంతో వున్నారు. నేను వెళ్ళను అన్నా కూడా “అలా యెందుకు? వెళ్ళి అవార్డ్ తీసుకో” అని పదే పదే వొత్తిడి చేసారు. 

లాడ్లీ మీడియా అవార్డ్ ప్రకటన చేస్తూ కథ కు అవార్డ్ ఇవ్వడం అదే తొలిసారి అని ఆ కథ బాగా రాసారు నాకు బాగా నచ్చింది అని హత్తుకుని అభినందించారు Population First  Director Dr. A L Sharada గారు. ఈ  అవార్డు నా భాధ్యతని మరింత పెంచింది . Thanks a lot  Laadli Media. . 

ఆ కార్యక్రమం జరిగినప్పటి ఫోటోలు ఇవి. 2017 ఏఫ్రియల్ 10 న అందుకున్నాను. ఫేస్ బుక్ లో అప్పుడు share చేసిన post ఇవాళ జ్ఞాపకం చేసింది. బ్లాగ్ లో భద్రపరచుకుందామని ఈ రోజు యిక్కడ పంచుకుంటున్నాను. 

నిజానికి అవార్డులు అందుకోవడం పురస్కారాలు  తీసుకోవడం సత్కారాలు చేయించుకోవడం నాకు యిబ్బందిగా వుంటుంది. 2019 లో కూడా ఒక అవార్డు ను తిరస్కరించాను. నేను సాహిత్యం లో అంత ఎత్తు కు చేరుకోలేదని నాకు తెలుసు. ఇప్పుడు అవన్నీ యెలా వస్తాయో కూడా తెలుసు. నిజానికి నాకు వాటిపై అంత ఆసక్తి కూడా లేదు. 

ఆ నాటి చిత్రాలు.. సర్టిఫికెట్ విజయవాడ ఇంట్లో భద్రంగా వుంది. 😊ఇంటి పేరు పై నిరసనగా కథ కవిత రాసి.. మీ పేరు చివర ఇంటి పేరు యెందుకు పెట్టుకున్నారు అని అడగకండీ.. సాహిత్యరంగంలో సి. వనజ అక్కినేని వనజ, అడవి పుత్రిక రాసిన వనజ.. ఇంకా చాలామంది వున్నారు. ఎప్పుడూ తికమక అందరికీ.. నాకు ఫోన్ చేసి వారిని ఉదహరించి నాతో మాట్లాడబోతారు అందుకే నా పేరు చివర.. ఇంటిపేరు. నిజానికి నాకు ఇంటి పేరు యిష్టం వుండదు కూడా. అందుకు నా ఆలోచన నా అభిప్రాయం నా అనుభవాలు నావి. అవి మరొకసారి రాస్తాను. 

******************

ఈ అవార్డు కోసం…. 

ప్రింట్,ఎలక్ట్రానిక్,వెబ్ మీడియా నుంచి ఎంట్రిలను పంపవచ్చు. బ్లాగ్స్, ఇ పత్రికలు, ఈ మాగజైన్స్,సోషల్ నెట్వర్కింగ్ లో కాంపైన్స్ మొదలైన వాటి నుండి ఎంట్రీలు పంపొచ్చు.

ఆన్ లైన్ లో కూడా పంపొచ్చు.
9, ఏప్రిల్ 2023, ఆదివారం

మా ఊరు - మా ఇల్లు 4

 కలిమి నిలవదు లేమి మిగలదు

కలకాలం ఒక రీతి గడవదు

నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా

వాడిన బ్రతుకే పచ్చగిల్లదా

ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము.. 


రేడియో లో పాట వస్తుంది. నేను అప్పటికే ఏడ్చి వున్నాను.. ఏడుస్తూ వున్నాను. మనసు గాయపడింది. ఇస్తానన్నంత కట్నం ఇవ్వలేదని నగలు పెట్టలేదని అత్తగారి అమ్మగారు దెప్పుళ్ళు.మామగారి తిరస్కార దృక్కులు. భర్త గారి పదునైన మాటల గాయాలు. పోనీ వారికేమైనా మా కుటుంబం గురించి తెలియదా అంటే బాగా తెలుసు.దగ్గర బంధువులమే, అయినా మనిషి నైజం బయట పెట్టుకుంటారు. అంతే!


 అయినా యింటి కొచ్చే కోడలు తెచ్చే కట్నంపై మోజు. ఇవ్వలేదని కోపమో చులకన భావమో! పోనీ యిచ్చిన పొలంపై రాబడి అన్నా యిస్తారా అంటే అదీ లేదు. అల్లుడు కు భారీ మర్యాదలు జరుపుతారా అంటే అదీ లేదు.అదీ వాళ్ళ బాధ.


 పెళ్ళి చూపులకు వచ్చినప్పుడు కట్నంగా మూడెకరాల మామిడి తోట పదివేలు రొక్కం నాలుగుజతల గాజులు పెడతామని వొప్పందం. తీరా పెళ్ళి తేదీ దగ్గర కొస్తుంటే డబ్బు సర్దుబాటు చేయలేక నగలు చేయించలేక వున్న నగలు బ్యాంక్ తాకట్టు నుండి బయట పడక నాలుగో ఎకరం పొలం నా పేరున రాసిచ్చి లగ్నం పెట్టించి పత్రిక తీసుకుని  మిఠాయిలు తీసుకుని ఇంటి చాకలిని వెంటబెట్టుకుని వెళ్ళాడు నా మేనమామ. వారు  అప్పటికప్పుడే మనుషులను  పురమాయించుకుని చీకటి పడే వేళకు పెళ్ళి కబురుతో పాటు మిఠాయిలూ  ఊరందరికి పంచి పెట్టుకున్నారు.  రాత్రి భోజనాల వేళ పిల్ల పేరున రాసిచ్చిన పొలం కాగితాలు పిల్లకు కాబోయే మామగారి చేతిలో పెట్టి అభ్యర్దించాడు పిల్ల మేనమామ. ఇబ్బందుల వల్ల రొక్కం బంగారం పెట్టలేకపోతున్నాం అని అందుకే నాలుగో ఎకరం పొలం రాసిచ్చామని.. ఆయన ఒక్క ఉదుటున లేచి ఈ పెళ్ళి జరగదు అనేసారు. మగ పెళ్ళి వారి ఇంటి వారందరికీ పెట్టిన బట్టలు మిగిలిన స్వీట్స్ తినుబండారాలతో పాటు అవమాన భారంతో    ముహూర్తం పెట్టుకున్న పెళ్ళి ఆగపోయిన బాధతో తెల్లవారి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు నా మేనమామ. 


పోన్లే! వాళ్ళు డబ్బులు మనుషులు. పెళ్ళి తప్పిపోవడమే మంచిదైంది అనుకుని వేరే సంబంధాలు చూడటం మొదలెట్టారు. నేను ఊ హూ అనడం మొదలెట్టాను. అంతా వాళ్ళ ఇష్టమేనా.. చూసి వెళతారు మళ్ళీ కట్నం సర్దుబాటు చేయలేదని వొద్దంటారు. నేనేమన్నా ఆట బొమ్మ నా.. చేసుకుంటే ఆ అబ్బాయి నే చూసుకుంటాను అన్నాను. 


ఇంట్లో వారి ఆలోచనలు వేరే!ఎంత తొందరగా పెళ్ళి చేసేయాలా అని. పదిహేడేళ్ళు కూడా నిండని నేను ఇంటర్మీడియట్ తప్పి ఇంట్లో వారికి భారం అనిపించాను. వెనకాల యింకో ఆడపిల్ల వుంది. ఒక్కగానొక్క మగపిల్లాడు చదువు ఆపేసి మూడొందల రూపాయల జీతానికి కాంట్రాక్ట్ పనుల దగ్గర ఉద్యోగంలో చేరాడు. ఇంటికి వచ్చి పడే అప్పుల వాళ్ళు, కలిగే అవమానాలు. నాన్న వ్యాపారానికి అమ్మకు కట్నం యిచ్చిన పొలం అమ్మి యిమ్మని నాన్న వొత్తిడి కోపాలు తిట్లు. నిత్యం యింట్లో రాద్దాంతమే!  ససేమిరా అనే అమ్మమ్మ తాతయ్య మేనమామల పట్టుదల. ఉన్నదంతా అయిపోయింది. అక్కడ ఇంకో మూడెకరాలు వుందిగా అది అమ్ముకోండి అని. ఆడపిల్లలిద్దరికీ అమ్మ కు ఇచ్చిన ఆరెకరాలు పొలం చెరిసగం యిచ్చి పెళ్ళి చేసేద్దాం అని వారి ఆలోచన.ఆ చుట్టాలబ్బాయ్ కాకపోతే లోకం యేమన్నా గొడ్డుపోయిందా.. రాజమండ్రి పేపర్ మిల్లు లో అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు. జీతం మూడు వేలన్నర పైనే అంట. అబ్బాయి చక్కగా వుంటాడు. ఈడూ జోడు బాగుంటుంది.. అని మా పెద మేనమామ. నేను వొప్పుకోలేదు. 


మళ్ళీ సంవత్సరానికి  అనుకున్న కట్నం అనుకున్నట్టు ఇవ్వలేదని ఈ పెళ్ళి జరగదు అన్న యింటికే కోడలిగా వెళ్ళాను. పెళ్ళి చూపులు లో పెద్దవాళ్ళే నన్ను చూసారు. నేను పెద్దవాళ్ళనే చూసాను. పెళ్ళి కొడుకును చూడలేదు. మొండి పట్టు పట్టాను. అయినా  అలా పెళ్ళి యెలా క్యాన్సిల్ చేస్తారు మీరు?. ఇవతల ఆడపిల్ల మనసుతోటి ఆలోచనలతో మీకు సంబంధం లేదా.. అని రిజిష్టర్ పోస్ట్ లో ఉత్తరం రాసాను. ఆ ఉత్తరం మా మామ గారు చదివి కట్నం ప్రమేయం లేకుండా మా పెళ్ళికి వొప్పుకున్నారు  పదిహేడేళ్ళ వయస్సులో అలా వుండేది నా పట్టుదల. (మొదటి మరణం బీజం పడింది యిక్కడే)


పెళ్ళి తరువాత చాలా అవమానకర సన్నివేశాలు యెదురైనాయి. అప్పుడేమో కానీ.. తర్వాత తర్వాత మా అత్తమ్మ మామయ్య ధర్మబద్దంగా నిలబడ్డారు నాకు కొండంత అండ అయ్యారు కూడా!  


నా జన్మ నక్షత్రం లో మొదటి పద్దెనిమిది యేళ్ళు లేదా పందొమ్మిది యేళ్ళు శని వున్నాడు. అప్పుడే నీకు పెళ్ళైంది అనేది మా మేనత్త. శనీశ్వరుడు వెళుతూ ఈయన్ని యిచ్చి వెళ్ళాడు లే అనేదాన్ని నేను. 


పాపం! మా వారిది కూడా ఉదార స్వభావమే! జాలి గుణం కూడా!  ఆయన మనసులో మా పుట్టింటి నుండి ఏమీ తెచ్చుకోలేదని చిన్నచూపు వుండేది. వివిధ సందర్భాల్లో నా పొగరు ఆయన అహంకారాన్ని తట్టి రేపెట్టేది అనుకుంటాను. నన్ను బాధ పెట్టడానికి ఏదో వొకటి అనాలి కదా!


నీ పుట్టింటి వాళ్ళు గతి లేని వాళ్ళు అని పదే పదే అంటూ వుండేవారు. నా మనసు గాయపడేది. కళ్ళు కన్నీటి కుండలయ్యేయి. ఏడెనిమిదేళ్ళు కట్నంగా యిచ్చిన పొలం లో వచ్చే రాబడి కూడా యివ్వకపోతే అంటారు, యెందుకనరు అని పుట్టింటి వారిపై కోపం ముంచుకొచ్చేది.ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయేవి.


యేదో విధంగా జీవితం తెల్లారక మానుతుందా.. చెప్పండి. వొడ్డున పడ్డాను. తాతయ్య నాయనమ్మ జ్ఞాపకాల్లో భాగంగా మా ఇంటి ఆడపడుచుల వెతలను జ్ఞాపకం చేసుకున్నాను ఇవాళ. 


నాలుగు తరాల మా యింటి ఆడపడుచులు యెవరూ సుఖ జీవనానికి నోచుకోలేదు. మొదటి రెండు తరాల్లో మా పెద్ద మేనత్త ఆమె మేనత్త పచ్చగా పదికాలాలు బతికింది లేదు. అవమానంతో ఆత్మహత్య, అనారోగ్యం తో మానసిక వ్యథ తో మరణించడం. (నూతిలో గొంతుకలు కథలో మొదటి యిద్దరు స్త్రీలు వారే) ఇక మా ఇంకో మేనత్త పెళ్ళి కాక ముందు ఏం సుఖ పడిందో.. బతుకంతా కడగండ్ల మయం. ఇప్పటికీ వొంటరిగా బతుకు ఈదుతుంది. ఇక మా తరం ఆడపిల్లలు..నలుగురం. అందరిదీ పోరాట పథం. లంకా వారి ఆడపిల్లలు గట్టివాళ్ళు. అదరరు బెదరరూ.. మగ పిల్లలు మెతక కానీ ఆడపిల్లలు అలా కాదు అని అనిపించుకున్నాం. జీవితం యెన్ని సమస్యలను సవాల్ గా బహుమతిగా యిచ్చినా .. వాటిని యెదుర్కొన్నాం. బిడ్డలే ఊపిరిగా  కుటుంబమే ముఖ్యంగా నిలబడ్డాం, నిలబెట్టుకున్నాం. 


 మా నాన్న వారి సోదరులు సోదరి అందరూ ఆస్థిపాస్తులు పోగొట్టుకున్నారు. నిజాయితీ గా బతకడానికి అష్టకష్టాలు పడ్డారు. ఒకరికి ద్రోహం చేయలేదు.నేరాలు చేయలేదు. ఘోరాలు చేయలేదు. కాకపోతే ఆరంభశూరత్వం. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు (ఇంట్లో వారికి) మా ఇంటి ఆడపడుచులకు స్త్రీ ధనం యివ్వడంలో మర్యాదలు జరపడంలో కొంచెం నిర్లక్ష్యం వహించేవారు. దానికి తోడు కట్నం అనే దురాచారం వల్ల సమాజంలో తరతరాలుగా ఏ భావజాలాలు వర్ధిల్లుతున్నాయో.. అవి అన్ని కుటుంబాల్లో పీటముడులు వేసుకుని కూర్చుని వున్నాయి. అవి మా అత్త వారిళ్ళలోనూ మా ఇంటికి అల్లుళ్ళుగా  వచ్చిన వారిలో మెండుగా వున్నాయి. ఆ భావ జాలం మా ఆడపడుచులను చాలా బాధ పెట్టింది. ఇక ఇప్పటి తరం ఆడపిల్లలు వాటిని యెదుర్కోకుండా వుండాలని నేను కోరుకుంటున్నాను. నాల్గవ తరంలో ఇద్దరు ఆడపిల్లలు ఐదవ తరంలో ఇద్దరు ఆడపిల్లలు.. వున్నారు. 

 

ప్రస్తుతం ఎనభై సంవత్సరాల వయస్సు నుండి సంవత్సరం లోపు పసిపిల్ల వరకూ నాలుగు తరాల ఆడపిల్లలం వున్నాం. ఎవరైనా హోదాలతో డబ్బుతో యెకరాలతో మమ్మల్ని పోల్చి చూడాలనుకుంటే.. మేమందరం down to earth మనుషులం. దానికి మూలం మా తాతయ్య మా నాయనమ్మ… అని గర్వంగా చెప్పుకుంటాం.. .. 


మళ్ళీ.. మా తాతయ్య నాయనమ్మ గురించి.. 


మా తాతయ్య  ఎంత కష్టజీవి మంచి మనిషో.. మా తాతయ్యకు సహాయకుడుగా వున్న అప్పటి యువకుడు ఇప్పుడు మా నాన్నగారి వయస్సులో వున్నతను.. నాకు పాతికేళ్ళ క్రితం చెప్పిన విషయాలు నా మనస్సులో అలా ముద్రించుకు పోయాయి. ఏ వ్యక్తి గురించైనా వారి పిల్లలు బంధువులు చెప్పిన విషయాలకన్నా వారి కింద పనిపాటలు చేసిన మనిషి చెప్పిన మాటలు ప్రామాణికం అవుతాయి కదా.. 


******** 


మామిడి కోతలు పూర్తయ్యాయి. అర కొర కొస కాయలు వేలాడుతున్నాయి. పేడ దిబ్బ చేలల్లో తోలి అక్కడక్కడ కుప్పలు పోసి వుంది. ఒక సాలు దున్ని వదిలేసిన చేలల్లో మొలిచిన గడ్డి దుబ్బులు కట్టి ఎండలకి నిలువునా మాడిపోయి వుంది. తొలకరి వాన పడక ముందే ఇంకోసాలు దున్నితే బాగుండును రా.. కోటేశూ.. అన్నాడు చలమయ్య బబాయ్.

 

“పైన ఎండ చూస్తే మాడ్చేత్తందయ్యా.. నెర్రలిచ్చిన నేల కొండరాయల్లే గట్టిబడిపోయి వుంది. కిందపైనా కాల్తూ దుక్కి సాగదు,  నాలుగునాళ్ళు ఆగితే పోలా.”అన్నాను నేను.. 


“ఎద్దుల ఉసురు పోసుకోవడం నాకు మాత్రం యిష్టమా..  గరువు నేల వొకసాలు దున్ని వదిలేస్తే వాన కురిసినప్పుడు నేల నీళ్ళు యింకిచ్చుకుని తర్వాత దుక్కి కి అనువుగా వుంటది” అన్నాడు ఆయన.. 


“సరే అయ్యా.. మీరు యెట్టా అంటే అట్టా.. అన్ని జతలు కడదామంటారా.. మిగిలినోళ్ళని పిలవమంటారా.”. 


“రోజుకొక రెండు జతలు లెక్క  నాగలి కడదాం నువ్వు నేనూ నాగలి పడితే మిగతావాళ్ళు సరిహద్దుల్లో కంప నరికి యెండు కొమ్మలు యిరిసి చెట్ల మొదళ్ళ చుట్టూ పాదులు చేత్తారు. తర్వాత ఎరువు కుప్పలు చిమ్ముతారు”. 


“సరే నయ్యా.”. 


తొలి ఏకాదశి కి ముందే గరువు పొలం అంతా వొక సాలు దున్ని తొలకరి కోసం ఎదురుచూడటం.. పాలేరులు అందరూ మాగాణికి ఎరువు దిబ్బ తోలడం,విత్తనాలు వడ్లు మరొకసారి యెండబెట్టి బస్తాలకు యెత్తడం. అన్ని పనులు చలమయ్య బాబాయ్ పూనుకోవడం.


పెద్దాయన రోజూ వెల్లటూరు యెల్లి బెజవాడ బస్ యెక్కి కోర్టులు కాగితాల కోసం తిరగడం, మూడో ఆయన పనిలో వేలు బెట్టేవాడు కాదు. పైపైన తిరిగి నడి మంచం ఇరిగేదాకా పడుకునేవాడు. నాలుగో ఆయన అత్తగారి అండ చూసుకుని మిడిసిపడటం ఆస్తులను పెంచుకోవడం.. ఐదో ఆయన చదువు వ్యాపారాలు వెలగబెట్టడం తప్ప వొక్కరు పనిచేసే వారు కాదు. ఆ ముసలమ్మ గారు కూడా ఈ కొడుకునే పట్టుకుని యేలాడేది. పెద్ద కమతం అమ్మా.. మీ తాత వాళ్ళది. అని ఆపేసాడు.


ఇంకా చెప్పండి.. అంటూ ఉత్సాహం నాకు.ఆ రోజు తొలి ఏకాదశి.వేగు చుక్క పొడిచేటప్పటికే..ఆ పశువుల చావిడి ముందు సందడి మొదలైంది. యజమానితో పాటు మేము ఆరుమంది పాలేరులు తయారుగా వున్నాం. ప్రతి నాగలికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. ఎద్దుల మెడపై కాడి పెట్టి ప్రతి జత ఎద్దుల జతలకు హారతి పట్టి బసవన్నను తలుచుకుని దణ్ణం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ఎద్దులకు బెల్లం వుండను తినిపిచ్చారు. నిలబడిన చోట నేలకు దణ్ణం పెట్టి ఆకాశం వైపు చూసి చేతులు జోడించారు.


రత్తమ్మ తల్లి సొరకాయ బుర్రల్లో నీళ్ళు చద్ది కూడు కుండ సర్ది తయారుగా పెట్టింది.. అవి భుజానికి తగిలించుకుని  నాగలిని భుజాన వేసుకుని కాడి పట్టిన ఎద్దుల్లో ఎలపటెద్దు ని యెహేయ్ అని అదిలించాడు చలమయ్య బాబాయ్.  భూమి పూజ చేయడానికి పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయలు పెట్టిన సంచీ ని పట్టుకుని ఎదురొచ్చింది ఆయన యిల్లాలు మాణిక్యమ్మ. ముందు చలమయ్య బాబాయ్ తర్వాత పాలేరులు వొకరి వెనుక వొకరు.. బాటలోకి వచ్చి ఊరికి ఉత్తరం వైపు బాటకు మళ్ళాం. ఎద్దుల మెడలో మువ్వల పట్టీల సవ్వడికి మామిడి చెట్ల పై వున్న కోయిలలు మేల్కొని కూత మొదలెట్టాయి. కాకులు మేల్కొన్నాయి. కోడిపుంజులు మాత్రం ఇంకా బద్దకం వదలనట్టు మెదలకుండా వుండాయి. ఆరు బయట పడుకొన్న మనుషులు ఎద్దుల మెడలోని మువ్వల చప్పుడుకు లేచి కూర్చున్నారు. అప్పుడే చుక్క పొడిచింది కాబోలు అనుకుంటూ. 


లంకోరి (లంకా వారి) అరకలు పొలానికి బయలెల్లాయి. అనుకుంటూ హడావిడి పడ్డారు. నోట్లో పదుంపుల్ల వేసుకుని రోడ్డు మీదకు వచ్చి ఆరాగా చూసేయి. చిమ్మ చీకట్లో తెల్లని ఎద్దుల జత మెడపై నాగళ్ళ తో యజమాని చలమయ్య. అతని వెనుక మరికొన్ని ఎద్దుల జతలు పాలేర్లు. దేశవాళీ ఎద్దులు మూడు జతలు, ఒంగోలు ఎద్దులు రెండు జతలు, ఆఖరున ఒక జత మైసూరు జత ఎద్దులు. చూడటానికి రెండు కళ్ళూ చాలవు. అనుకుంటూనే .. 


ఏమైనా లంకోరు వ్యవసాయం చేయడంలో దిట్టలు. ఊరు లెగవక ముందే లేచి పనుల్లోకి జొరబడతారు. ఊరు కాని ఊరు నుంచి వచ్చి ఊరు కే మొనగాడు దారు  సేద్యగాళ్ళు అయ్యారు.. అనుకునేవాళ్ళు.


“చలమయ్య అన్నయ్యా! మీరు అరకలు కట్టారంటే తొలి ఏకాశి వచ్చినట్టే, మాకెవరికీ అంత గుర్తు లేదే ఇయ్యాల ఏకాశి అని” అని పలకరించే వాళ్ళు. 


అవునంట, మా అన్నయ్య పంచాగం చూసి చెప్పాడు. మీరు కూడా మొదలెట్టండి మంచి ఘడియలు దాటకముందే” అనేవాడు చలమయ్య బాబాయ్.


“నువ్వొక్కడివే బయలెల్లావ్, మీ అన్నదమ్ములు రారా పొలానికి ఆరా తీసేవాడు” పుల్లలేసే గుణం వున్న ఆయన.. 


“ఎనకా ముందు వస్తారులే, చిన్నోళ్ళు  ఎండబడి లేస్తారు కదా”అని జవాబిచ్చి ఊరుకునేవాడు ఆయన.

 

 వెనుక నడుస్తున్న పాలేర్లు మనసులో అనుకునే వాళ్ళం “అన్నదమ్ములందరికీ పనికి వొంగాలంటే సా చేటు, తెగులు అనే మాటకు ముందు మోటు మాట  బూతు మాట చేర్చి. మరొకమాట అనుకునే వాళ్ళం. మా చలమయ్య బాబాయ్ ధర్మరాజు కష్టజీవి. ఆయన లేకపోతే యింత వ్యవసాయం ఆళ్ళ వల్ల అయ్యిద్దా..” అని. 


“చలమయ్య బాబాయ్.. అంత దూరం పొయ్యి చానా ఖరీదు పెట్టి మైసూరు జత ఎద్దులు తెచ్చినావు కదా.. అవి మన ఎద్దుల్లా అరక దున్నలేవు బండి లాగలేవు.. దండగ మారి పని కదా” అని అడిగాను. 


“చిన్న తమ్ముళ్ళు రంగయ్య రాఘవయ్య మైసూరు ఎద్దులు కావాలని ముచ్చటపడినారు లే కోటేశూ.. ఆళ్ళకు తగ్గ ఎడ్లు అయ్యి. చదువుకుంటూ వున్నారు. ఎక్కడో చూసారు.. మనక్కూడా వుండాలని అనుకున్నారు.అందుకే కొన్నాను లే.. అని జవాబు. 


ఎద్దులు కావాలంటే.. డబ్బు పట్టుకొని పోయి నెలా రెండ్నెల్లు తిరిగి కొనుకొచ్చేవారు. జత బాగుంటేనే కొనేవాడు ఆయన. దొడ్డో పుట్టినవి కాడికి సరిపోకపోతే ఆటిని అమ్మేసి కాడికి సరిపడా కొనేవాళ్ళు. ఆరు జతల ఎద్దులు ఆవులు పాడి గేదెలు ఎంత పెద్ద చావిడ అని. మీ నాయనమ్మ కూడా బాగా పనిచేసేది. రోజూ యాభై మంది చెయ్యి కడిగేవాళ్ళు. దాలి లో ఉలవలు వొక కుండలో ఉడుకుతా వుంటే పాలు వొక కుండలో కాగుతా వుండేవి.  ఏ వేళప్పుడు వెళ్ళినా అన్నం కుండ పొయ్యి మీద వేడిగా దించకుండా వుండేది. చలమయ్య బాబాయ్ ఆ ఇంటికి దాపటెద్దు అనుకో.. అంత పని భారం వుండేది ఆయన మీద. గొప్ప మనుషులు. నేను యిల్లు కట్టుకున్నప్పుడు శంకుస్థాపనకు ఆ భార్యభర్తలనే తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టిచ్చుకున్నాను. నాకు కొడుకు పుడితే.. వారి చేతే ఉయ్యాల లో బిడ్డ ను వేయించుకున్నాను. మంచి మనసు వున్నవాళ్ళమ్మా కల్లాకపటం తెలియదు పేద గొప్ప తేడా చూపించే వారు కాదు. ఆ రత్తమ్మ గారు కన్నబిడ్డల్లో గొప్ప మనసున్న బిడ్డ మీ తాతయ్య. ఎవరి గురించి చెడ్డగా మాట్లాడటం కానీ అబద్దాలు చెప్పడం గానీ ఆయనకు తెలీదమ్మా, ఆయన బిడ్డలే ఆయనను సరిగ్గా చూసుకోలేదు” అని చెపుతుండగానే అతను వెళ్ళే బస్ వచ్చేసరికి వెళ్ళిపోయాడు. నేను వొంటరిగా మిగిలిపోయాను.


నేను అప్పటిదాకా కూర్చున్న సత్రం వైపు చూసాను. లంకా రంగయ్య సీతారావమ్మ  జ్ఞాపకార్ధం  నిర్మించిన ప్రయాణికుల సత్రం లో కూర్చుని కోటేశూ అనే అతను చెబుతున్న సంగతులు విన్నాను. ఆ సత్రం మా తాతయ్య తమ్ముడు రంగయ్య ఆయన భార్య (మేనమామ కూతురు) సీతారావమ్మ పేరిట నిర్మించిన సత్రం. ఆయన అరవై యెకరాల భూస్వామిగా.. కొడుకును బాగా చదివించి హైదరాబాద్ లో బ్యాంక్ మేనేజర్ గా చూసుకుంటే.. మా తాతయ్య యేంటీ అలా మిగిలిపోయాడు. మంచితనం కష్టపడే స్వభావం ఉదారగుణం వుండటం వల్ల ఆయనకు ఏం మిగిలింది?  ముందు చూపులేకపోవడం వలన యెంత బాధ పడ్డారు? అని చాలా బాధ కల్గింది. 


మా తాతయ్య పిన్ని కూతురు హనుమాయమ్మ అనే ఆవిడ మా ఊరి లోనే వుండేవారు.. ఆమె మాటల్లో.. మరికొన్ని విషయాలు.. మరో భాగంలో.. 
8, ఏప్రిల్ 2023, శనివారం

జీవితం

 జీవితం పట్ల ప్రేమ ఉన్న వారు.. ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొని అయినా జీవించడానికి ప్రయత్నిస్తూవుంటారు. 

ఇతరుల జీవనం పట్ల ఆరాధన ఆకర్షణ ఉన్నవారు వారితో పోల్చుకుని అసంతృప్తితో జీవనం సాగిస్తారు. 

జీవితం పట్ల అవగాహన ఉన్నవారు ఇతరుల జీవితం పట్ల గౌరవం కల్గినవారు సహృదయంతో అర్దం చేసుకుని చేతలతో మాటలతో ఇతరులను బాధించకుండా నడుచుకుంటారు. 

ఈ ముగ్గురిలో మనం యెక్కువగా యెందులో కనబడితే అదే మన జీవితం. ఒక్కటి గుర్తుంచుకోవాలి మనం. మన జీవితాన్ని మనం మాత్రమే జీవించగలం. వేరొకరి జీవితాన్ని మనమెన్నడూ జీవించలేము. 


నా కాలం

మీరు జీవించిన కాలంలోనే నా జీవితాన్ని నేనూ జీవించాను. మీ అభిప్రాయాలతో భావనలతో నాకేం పని!? అనుకుని జీవించడమే అని తేలిగ్గా అనేస్తాము కానీ అదెంత కష్టమో! మాటలు చెప్పడం రాయడం సులభం ఆచరణ లో కష్టం.


అలా జీవించగల దైర్యం తెగింపు కూడా అందరికీ వుండదు. 

కాలు తడవకుండా కన్ను తడవకుండా జీవితం ఎల్ల మారదు అనేది మా నాయనమ్మ. మనమెంత పద్దతిగా బతికామనే భావనలోనో భ్రాంతి లోనో సత్యం లోనో యేదో విధంగా వున్నప్పటికి కూడా మన చుట్టూ వున్న సమాజానికి తోటి వారి అజా పజా కావాలి. ఏదో వొక వ్యాఖ్యానం చేస్తారు. విన్న మనకు యెప్పుడో వొకసారి బాధ కల్గుతుంది.


వీలైనంత భాద్యత తో విచక్షణ తో జీవించగల్గడం.. ఏదైనా వొక అడుగు సాహసోపేతంగా వెయ్యాలనుకునేటప్పుడు మనకు సన్నిహితమైన వారికి వొకరికైనా చెప్పడం మంచిది. వారిచ్చే సలహా నో సూచనో మనను కొంత ఆలోచింపజేస్తుంది. Right choice అయితే కూడా కొంచెం ఆలస్యంగా మరింత దృఢంగా ముందుకు వెళ్ళవచ్చు.


నా జీవితం నా యిష్టం అని తెంపరిగా వెళ్ళినవారి అనుభవాలు

విజయవంతమైతే గొప్పగా చెప్పుకుంటారు. వారి శాతం తక్కువ. ఎక్కువ మంది బయటకు పొక్కనీయరు. కానీ వారిని చూస్తే తెలుస్తుంది మనకు. 


ఇక మనలో ఏ లోపాలు ఫెయిల్యూర్స్ కనబడతాయా.. మన తాటిమట్ట లాంటి నాలుకతో చీల్చి చెండాడదామా అని కొందరు యెదురుచూస్తూ వుంటారు. అందుకే జాగ్రత్త గా మసలుకోవాలి.


జీవితం అంటే క్రమశిక్షణ. కళ్ళు వెళ్ళినచోటు కల్లా కాళ్ళు వెళ్ళకుండా వుండటం. నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవడం

నువ్వు తలెత్తి సగర్వంగా నిలబడటం.


జీవితం బాగుండాలంటే..  


శ్రమ సహనం త్యాగం స్నేహం దయ ప్రేమ సేవ ఇవన్నీ చాలా అవసరం.


జీవన సారాంశమో సుగంధమో యిదే నిత్య సత్యం

(Essence + ultimate truth)


నేను అర్థం చేసుకున్న జీవితం యిది. పెద్దగా ఆరోపణలు కూడా లేవు.


జీవితం ప్రతి పథం సమరమై సాగనీ.. చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటుంది. ❤️😊


******************


కొంతమంది జీవన విధానంలోని కొత్తదనం యువతను ఆకర్షిస్తుంది. వారికి కూడా ఆ దారిలో నడవాలని అనిపిస్తుంది.


చదువు కు ప్రణాళిక శ్రద్ద 

ఉద్యోగానికి అర్హత అనుభవం  

వ్యాపారానికి పెట్టుబడి మార్కెట్ నమ్మకం ఇవన్నీ అవసరం.


వ్యవసాయం చేసే వారికి ఆరు గాలం కష్టపడినా పంట చేతిలోకి రావడం అనేది వాతావరణం పై ఆధారపడి వున్నట్లు ..


వలస జీవితాల అగ్రిమెంట్ ఉద్యోగాలు కూడా.. గాలిలో దీపం లాంటివే..


పైకి కనబడే జీవితం వేరు. కనబడని జీవన సంఘర్షణ వేరు.


కలలు వేరు. జీవితం వేరు. కొన్ని కలలే నిజం అవుతాయి.


అబ్బాయిని సంవత్సరం పైగా దగ్గరుండి చూస్తున్నాను.

ఇలా తప్ప యింకోలా వుండేదానికి అవకాశం లేదు.. అంటాడు..

స్వదేశానికి రావడానికి యేదో.. తాత్సర్యం. పెద్దవాళ్ళు వున్నారు.. చూసి రావాలని వుంటుంది. కానీ వీలవడం లేదు.


యాదృచ్ఛికంగా.. ఇదంతా రాసుకున్నాక.. నిన్న పాత ఫోటో ఆల్బమ్ తీసి చూస్తుంటే.. అబ్బాయి ది 15 సంవత్సరాల క్రితం ఫోటో కనబడింది. నవ్వుకున్నాను..


.

7, ఏప్రిల్ 2023, శుక్రవారం

మా ఊరు - మా ఇల్లు 3

 ఇంతకు ముందు రెండురోజులుగా ముందర రెండు భాగాలు పోస్ట్ చేసాను . 

 


మా ఊరు - మా ఇల్లు మూడవ భాగం ఇది. 


కొన్నేళ్ళ తర్వాత మరొకసారి ఇల్లు మారిపోయింది. మా చిన్న తాతగారి భాగానికి మాకు మధ్య వున్నగోడ ఇవతల మా భాగం వైపు కోసేసి గది వెడల్పు తగ్గించి ఉత్తరం.. స్థలం వుండేలా గోడలు కట్టారు. వంటిల్లు పడగొట్టి నైబుతిలో చుట్టిల్లు కట్టారు. ఆవరణ లో బావి తవ్వించారు.  అంతకు ముందు మా నీటి కష్టాలు అంతులేనివి. ఆ కష్టాలకు తెరపడిందని అమితంగా సంతోషించాము. ఇల్లు చిన్నదైంది కానీ ఇంట్లో మనుషులు కొత్త ఆశతో తమ జీవితాల్లో మంచి మార్పు కోసం ఎదురు చూసారు.


1992 లో  మా నాయనమ్మ చనిపోయింది. చిన్నపాటి అనారోగ్యమే! నా అనారోగ్య కారణం వల్ల ఆఖరి చూపు కూడా దక్కలేదు. నడి వేసవిలో తుఫాను. పెద్ద వర్షం. సంప్రదాయమైన అంత్యక్రియలకు నోచుకోలేదు. ఖననం చేసారు. తాతయ్య నాయనమ్మ వారి వృద్దాప్యంలో అంతులేని మానసిక వేదన పేదరికం అనుభవించారు. ఇది రాస్తుంటే కూడా చాలా దుఃఖం గా వుంది. ఎవరైనా సరే జన్మనిచ్చిన తల్లిదండ్రులను యవ్వనంలో వున్నప్పుడు లక్ష్యపెట్టకపోయినా వృద్దాప్యంలో వారిని  ప్రేమగా దయగా చూసుకోవాలి. తల్లిదండ్రులు యెంత గొప్పవారైనా పిల్లలకు చులకన భావమే వుంటుంది. వారు దాటిపోయాక కానీ వారి విలువ తెలియదు. ఐదుగురు బిడ్డలను కన్నారు.. ఐదు రకాలుగా మానసిక క్షోభ బాధ అనుభవించారు. నేను యిప్పుడు అనుకుంటాను.. మాకు ఇంకొంచం ఆర్థిక స్వేచ్ఛ  వచ్చినదాకా బతికి వుండకూడదా నాయనమ్మ తాతయ్యా అని. నిజానికి మన దగ్గర డబ్బు లేనప్పుడు కూడా వారిని ప్రేమగా చూసుకోవాలి. డబ్బు వచ్చాక వారు వుండమన్నా ఉండలేరు కదా ! 


మా అమ్మ వారికి మనోవర్తి కచ్చితంగా ఇచ్చేది. కానీ ఆదరణ సరిగా ఉండేది కాదు. అది మాకు కూడా కినుకగా ఉండేది అమ్మ మీద కోపంగా ఉండేది. కానీ ఏం చేయగలం పెద్దవారితో వాదన చేసి ? ఆ విషయంలో నిన్ను క్షమించలేం..అని అన్నాము. స్త్రీలు సాధారణంగా అత్తమామల పట్ల ద్వేషం కల్గివుండరు. తనపై తన బిడ్డలపై భర్త ఆదరణ ప్రేమ లేకపోవడం దుర్వస్యనాల బారినపడి కుటుంబ భాద్యతలు మర్చిపోతే ఆ అసహనాన్ని భర్త తల్లిదండ్రులపై వ్యక్తీకరించడం అని తర్వాత తర్వాత నాకర్థమైంది. ఇంకో విషయం ఏమిటంటే ఏ తల్లిదండ్రులైనా సరే ఉన్న ఆస్తులను బిడ్డలకు సమస్తం రాసి యివ్వకూడదు. జాగ్రత్తలు తీసుకోవాలి.


ఇక 1998 లో మా అమ్మ చనిపోయింది.చిన్న వయసే! అప్పటికి అమ్మకి యాబై ఒక్క సంవత్సరాలు. ఆ తరువాత మాకు మా ఊరుకు అంతగా వెళ్ళే అంత బంధం లేకపోయింది. మేమందరం విజయవాడ దరిదాపుల్లో వుండటం వల్ల.. నాన్న మా దగ్గరికే వస్తూ ఉండేవారు.   


మా ఊరు మా ఇల్లు అనగానే నాకు మదిలో మెదిలే చిత్రం చాలా పాతది. నాకప్పుడు తొమ్మిదేళ్ళు. అప్పటి వరకూ అమ్మమ్మ వాళ్ళింట్లో పెరిగాను. దాదాపు నలభై అయిదేళ్ళ కిందట వున్న ముఖ చిత్రం. అప్పుటి దృశ్యసమాహారమే యిప్పుటికి కూడా నాకు  స్పష్టంగా గుర్తుంది. ఆ తర్వాత ఊరు ఇల్లు చాలా మారిపోయి వుండొచ్చు. ముఖ్యంగా మా ఇల్లు వాస్తు దోషాలతో వుందని రెండుసార్లు మార్పు జరిగింది. ఇప్పుడైతే ఆ ఇల్లు పూర్తిగా కూల్చబడి .. పునాదులతో సహా తవ్వి పోసి  మట్టితో ఎత్తు లేపి కొత్త యిల్లు కట్టారు మా అన్నయ్య. ఆ ఇల్లు కూల్చేసే ముందు వొకసారి చూసి వుంటే బాగుండేది అనిపించింది. బాధ కూడా కలిగింది. ఇప్పుడు మారిపోయిన ముఖ చిత్రంతో మా ఊరు మా ఇల్లు ఇరవై నాలుగేళ్ళ క్రితం మరణించిన మా అమ్మ. ఏదో ఖాళీ తనం.  


నాకంటూ అక్కడ భౌతికమైన ఆస్తులు  ఏమీ లేవు. నాన్న అన్నయ్య వదిన వున్నారు.  వారికి కొద్దిపాటి భూమి ఆ ఇల్లు వున్నాయి. కానీ నాది అంటూ నాకు మిగిలింది అమూల్యమైనవి మా ఊరితో ఇంటితో వున్న అనుబంధం సజీవమైన జ్ఞాపకాలు మాత్రమే!. 


ఆడపిల్లలకు మమతలు భ్రమతలు కూడా యెక్కువేనేమో! అందుకే నేను యిదంతా రాసుకున్నాను. రాసుకోవడం పూర్తయ్యాక యెందుకో దుఃఖం ముంచుకొచ్చింది. మట్టి-మనిషి అంటారు కదా! మట్టి అలాగే వుంటుంది. మనిషి ఆ మట్టిలో కలిసిపోతాడు. ఎవరికి ఏ నీళ్ళు ప్రాప్తం వుంటాయో అవే దక్కుతాయి. తరచూ మా అమ్మ కలలో కనబడుతుంది కానీ మా తాతయ్య నాయనమ్మ అసలు కనబడరు. వాళ్ళ మాటలు వాళ్ళు మసలిన తీరు కళ్ళ ముందు మెదులుతాయి. మా అన్నయ్యకు కూడా ఊరు అన్నా ఇల్లు అన్నా మమకారం. అందుకే ఊరికి వెళ్ళి విశ్రాంత జీవనం గడుపుతున్నాడు. వృద్దాప్యంలో నాన్న ను బాగా చూసుకుంటున్నారు. 


నాకు ఏ మాత్రం సాధ్యపడినా మా ఊరు వెళ్ళిపోయి అక్కడే వుండాలనిపిస్తుంది. కానీ మా నాన్నగారికి అది యిష్టం వుండదు. 1998 తర్వాత ఒక్క రాత్రి నిద్ర చేయడం తప్ప ఆ వూరిలో సూర్యోదయం చూడలేదు నేను. గత జూలై నెలలో వొక ఆరు రోజులు వున్నాను. ఆ వాతావరణం నాకు సరిపోతుందో లేదో నని అనుమాన పడ్డాను. కానీ నా శరీరం మనస్సు పురా స్మృతులను వొడిసి పట్టుకుంది. ఊరు ఇల్లు నన్ను ఆలింగనం చేసుకుంది. ఆ రోజులలో హాయిగా మెలుకువ రాని నిద్ర పోయాను. 


ఎప్పుడైనా మా ఊరు ను మా ఇంటిని చూడాలని అనుకున్నప్పుడల్లా.. గూగుల్ యెర్త్ మ్యాప్  ఓపెన్ చేస్తాను. ఊరు పరిసరాలు మావి కాని మా పొలాలు నేను ఆడుకున్న స్థలాలు అన్నీస్పష్టంగా కనబడతాయి. మొదటిసారి అలా చూసినప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. తర్వాత అప్పుడప్పుడు  తనివితీరా చూసుకుంటాను. 


నిజజీవితంలో నువ్వు నీకు  దొరకకపోతే అక్షరాలలో నిన్ను నీవు వెతుక్కో..  అంటారు కదా! ఎన్ని దుఃఖాలను  నిరాశలను వొడపోస్తేనో కదా మనస్సు స్వచ్ఛత భాసిల్లేది. స్వచ్ఛమైన బాల్యం కల్మషం యెరుగని మనస్సు .. ఆ జ్ఞాపకాల్లో  వొక జీవరాగం  వుంటుంది. మనకు మాత్రమే వినిపించే అర్ధమయ్య  సడి వుంటుంది. జీవన గమనంలో ఎంతో యిష్టంతోనూ కష్టంతోనూ నిన్ను నువ్వు సాధించుకున్న తర్వాత మనదంటూ అనుకున్న దేనిని  వొదులుకోవడం యిష్టం వుండదు. కానీ అది సాధించడం కూడా కష్టమైన పనే కదా ! యేవో అడ్డంకులు ఉంటాయి.   


 

అమెరికా లో అట్లాంటా నగరంలో కూర్చుని పక్కన మనుమరాలు నన్ను ఆనుకుని ఐపాడ్ లో రైమ్స్ చూస్తూ నవ్వుకుంటుంది. నేను నా ఊరి స్పర్శ ఊహలో మునిగి తేలియాడుతూ యిదంతా రాసుకుంటున్నాను. 


నేను నాన్న పోలిక. నాన్న తాతయ్య నాయనమ్మ లు కలగలిసిన పోలిక.. ఒంటి రంగు కాళ్ళు చేతులు శారీరక సౌష్టవం అంతా నాయనమ్మ లాగా వుంటూ ముఖం తాతయ్య పోలికలు. నేను పూర్తిగా మా నాన్న పోలిక. మా నాయనమ్మ పోలికలు రాలేదు కానీ శరీరతత్వం గుండ్రటి ముంజేతులు పొడవు పొట్టి కాని చేతివేళ్ళు పాదాలు మెత్తని శరీరం తీరు వచ్చింది. మా అన్నయ్య అంతా మా తాతయ్య పోలికలు. ఇక నా కొడుకు కి నా పోలికలు వచ్చాయి. కాళ్ళు చేతులు వాళ్ళ నాన్న నాన్నవి అంటే మా మామ గారి జీన్స్ వచ్చాయి. ఇక నా మనుమరాలికి అంతా తండ్రి నానమ్మ పోలికలు. కాళ్ళు చేతులు మాత్రం వాళ్ళ నాన్న నాన్న వి. కాళ్ళు చేతులు కాలి పిక్కలు నడక అంతా నా మనుమరాలికి వాళ్ళ తాత పోలికలు. మా అందరి బ్లడ్ గ్రూఫ్ లు అంటే నాన్న అన్నయ్య నేను నా కొడుకు మనుమరాలు నా చెల్లెలు అందరివీ వొకటే బ్లడ్ గ్రూఫ్ లు. మా పెద పెదనాన్న కూతురు అక్క అంతా నాయనమ్మ పోలిక లే. మా రెండవ పెద నాన్న కొడుకు అన్నయ్య అచ్చం తాతయ్య పోలికే.. వాళ్ళ అబ్బాయి నా మేనల్లుడు కూడా తాతయ్య పోలిక. ఇక అన్నయ్య కూతురు కూడా అన్నయ్య పోలిక.


ఇవన్నీ సరిచూసుకుంటూ.. పెద్దలను జ్ఞాపకం చేసుకుంటుంటే యెంతో బావుంటుంది. నా మనురాలిని తీసుకుని మా ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు వుండాలని మా నాన్న యెత్తుకుని వుండగా ఫోటో తీసి భద్ర పరచాలని నా కోరిక. ఇవి నా మూలాలు అని నా మనుమరాలు చూసుకోవడానికి గుర్తులు వుంచాలి. ఎక్కడ పుట్టాము యెక్కడ పెరిగాము మన మూలాలు యెక్కడ అన్నది పిల్లలకు తెలిసి వుండాలి. ఆ ప్రదేశాలతో మనుషులతో అనుబంధం వుండాలి. వీలైనంత అనుబంధాలు కాపాడుకోవాలి. యివ్వన్నీ మనిషికి కనీస ధర్మం. స్వభావాలు గుణాలు అలవాట్లు ఆస్తిపాస్తులు ఉత్థానపతనాలు కష్టాలు సుఖాలు అన్నీ మారుతుంటాయి. కొత్తగా కొన్ని వస్తూ వుంటాయి పోతూ వుంటాయి. స్థిరంగా వుండేది వున్నంత వరకూ వుండేది మనది అన్న భావన మాత్రమే.. అదే మన ఊరు మన ఇల్లు. 


వృద్దాప్యాన్ని గౌరవించాలి. వారిని కూడా మన బిడ్డల లాగానే చూసుకోవాలి.  వారిని నిర్లక్ష్యం చేస్తే మనకంటూ పశ్చాత్తాపం మిగిలే వుంటుంది. కృతజ్ఞత మరిచిన జాతి అవుతుంది అని మా ముందు తరం వాళ్ళను చూసి మేము నేర్చుకున్నాం.ఎప్పుడో నాలుగు తరాల క్రితం గుంటూరు జిల్లా వెంకటపాలెం గ్రామం లో పుట్టి పెరిగిన మా ముత్తాత ను అదే యింటి పేరిట వున్న వెంకటపాలెం కోడలే అయిన కుంటముక్కల గ్రామం పాటిబండ్ల వారి ఆడపడుచు లంకా శేషమ్మ   దురదృష్టవశాత్తు  వెంట వెంటనే పుత్ర విహీన పతి విహీన గా మారి .. తన భర్త వారసులకు చెందిన తల్లి లేని బిడ్డను పెంచుకుంది. ఆ బిడ్డ పేరు లంకా రామచంద్రయ్య.  యుక్తవయస్సు వచ్చాక తన మేనకోడలు రత్తమ్మని యిచ్చి వివాహం చేసింది.వారి బిడ్డలు  పంచ పాండవుల్లాంటి ఐదుగురు అన్నదమ్ములు ఒక ఆడపడుచు.  నూట పాతిక యెకరాల భూమి. పెద్ద వ్యవసాయం. మా తాత తన పెద్ద కూతురికి శేషారత్నం అని తన నాయనమ్మ పేరును పెట్టుకుంటే.. మా పెదనాన్నలిద్దరూ తమ ఆడపిల్లలకు శేషు కుమారి అని మా చిన్న మేనత్త తన కూతురికి కూడా శేషు కుమారి అని పేరు పెట్టుకున్నారు. తమ వంశ అభివృద్ధికి మూలమైన ఆ పెంపుడుతల్లి మాతృహృదయానికి ప్రణమిల్లి కృతజ్ఞతగా గౌరవంగా ఆమె పేరును తమ బిడ్డకు.. బిడ్డల బిడ్డలకు పెట్టుకున్న సంస్కారమైంతమైన  భక్తి కల్గిన కుటుంబం మాది. 


అలెక్స్ హేలీ..దక్షిణ ఆఫ్రికా నుండి తన పూర్వీకుడైన యువకుడిని బలవంతంగా   యెత్తుకొచ్చి బానిసగా మార్చితే ఏడు తరాల్లో ఆరుతరాలు బానిసలుగా హీనంగా బ్రతికినట్లు గుర్తిస్తాడు. తమ వారిని వెతుక్కుంటూ  వెళ్లి వారిని గుర్తించుకుంటూ ఎట్టకేలకు  తమ  మూలాలను కనుగొంటాడు. ఆ చరిత్రను అక్షరబద్ధం చేసి  “రూట్స్” అనే నవలను రాసుకున్నట్టు నేను కూడా నా మూలాలను తెలుసుకుంటూ.. నేనంటే ఇది..ఇదిగో.. నా మూలం యిక్కడ వుంది కదా! నా జేజి తాత ముత్తాత తాతలు తండ్రులు యిలా జీవనం గడిపారు. ఇంత ఉదాత్త గుణాలతో కృషీవలులై సంస్కారవంతమైన జీవనం కొనసాగించారు. వారి గుణగణాల్లో సంస్కారంలో దాతృత్వంలో కష్టపడే తత్వంలో పట్టుదల లో నాకు కొంచెమైనా అబ్బి వుంటాయి అన్న భావన నాకు అంతర్లీనంగా బలంగా వుంది. వారిని స్మరించుకుంటూ.. నా మూలాలను అక్షరాలలో యిమిడ్చి యిలా భద్రపరచుకుంటున్నాను. ఎప్పుడైనా నేను వెనక్కి తిరిగి చూసుకోవడానికి స్మృతిపథంలో నాకంటూ మిగిలిన గొప్పదైన విలువైన విషయాలు ఇవి. మా వంశ వృక్షం రాయాలని ప్రయత్నిస్తున్నాను. 


నిజానికి ఇవన్నీతెలుసుకునే   ఆసక్తి పిల్లలకు  ఉంటాయా ?అని సందేహం కూడా!  నా బిడ్డ లేదా నా రక్త సంబంధీకులు వారి బిడ్డలు యివన్నీ ఓపిగ్గా చదువుతారని వారికి అంత ఆసక్తి వుందని కూడా నేననుకోను. కానీ యెందుకు రాసుకున్నాను అంటే.. ఏమో తెలియదు.నేను బ్లాగ్ లో చాలా రాసాను.కథలు కవిత్వం చాలా రాసాను.  కానీ నేను రాసిన రాతలన్నింటిలోకి నాకిష్టమైన రాత, ఆత్మ సంతృప్తి కల్గించిన రాత యిది. ఇంతకు ముందు నా బాల్యానికి సంబంధించిన టపా లలో కొన్ని విషయాలు పంచుకుని ఉంటాను. 


ఇంకా చాలా రాయాలి. మా నాయనమ్మ తాతయ్య గురించి చాలా రాయాలి . ఒక విధమైన బాధతో ఇప్పుడు రాయలేకపోయాను. మనసు బాగున్నాక రాస్తాను. ముఖ్యంగా ఎవరి గురించి చెడ్డగా వాస్తవంగా రాయాలని లేదు. ఇప్పుడు  బ్రతికి లేని మనుషుల గురించి అసలు రాయకూడదు. నాయనమ్మ కన్న సంతానంలో ఇద్దరు జీవించి వున్నారు. వారికి తల్లిదండ్రుల పట్ల ప్రేమ వుంది. కదిలిస్తే కన్నీరవుతారు. నేను ఇంకా లోతైన బాధలోకి వెళతాను. అందుకే చాలా రాయలేకపోయాను . 


మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి లాగా గొప్పలు చెప్పడం కాదు .. వారి జీవన విధానం మనసుల మంచితనం మనిషి తత్త్వం ఆనాటి సాంఘిక జీవన పరిస్థితులు ఇవన్నీ రాయాలి .. 


తప్పకుండా రాస్తాను .. కొంచెం సమయం తీసుకుని రాస్తాను.


కింద ఫోటో .. మా నాన్న గారు . గత సంవత్సరం అమెరికా కి వచ్చే ముందు మా ఇంటి ముందు నిలబెట్టి  ఫోటో తీశాను.