కలిమి నిలవదు లేమి మిగలదు
కలకాలం ఒక రీతి గడవదు
నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా
వాడిన బ్రతుకే పచ్చగిల్లదా
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము..
రేడియో లో పాట వస్తుంది. నేను అప్పటికే ఏడ్చి వున్నాను.. ఏడుస్తూ వున్నాను. మనసు గాయపడింది. ఇస్తానన్నంత కట్నం ఇవ్వలేదని నగలు పెట్టలేదని అత్తగారి అమ్మగారు దెప్పుళ్ళు.మామగారి తిరస్కార దృక్కులు. భర్త గారి పదునైన మాటల గాయాలు. పోనీ వారికేమైనా మా కుటుంబం గురించి తెలియదా అంటే బాగా తెలుసు.దగ్గర బంధువులమే, అయినా మనిషి నైజం బయట పెట్టుకుంటారు. అంతే!
అయినా యింటి కొచ్చే కోడలు తెచ్చే కట్నంపై మోజు. ఇవ్వలేదని కోపమో చులకన భావమో! పోనీ యిచ్చిన పొలంపై రాబడి అన్నా యిస్తారా అంటే అదీ లేదు. అల్లుడు కు భారీ మర్యాదలు జరుపుతారా అంటే అదీ లేదు.అదీ వాళ్ళ బాధ.
పెళ్ళి చూపులకు వచ్చినప్పుడు కట్నంగా మూడెకరాల మామిడి తోట పదివేలు రొక్కం నాలుగుజతల గాజులు పెడతామని వొప్పందం. తీరా పెళ్ళి తేదీ దగ్గర కొస్తుంటే డబ్బు సర్దుబాటు చేయలేక నగలు చేయించలేక వున్న నగలు బ్యాంక్ తాకట్టు నుండి బయట పడక నాలుగో ఎకరం పొలం నా పేరున రాసిచ్చి లగ్నం పెట్టించి పత్రిక తీసుకుని మిఠాయిలు తీసుకుని ఇంటి చాకలిని వెంటబెట్టుకుని వెళ్ళాడు నా మేనమామ. వారు అప్పటికప్పుడే మనుషులను పురమాయించుకుని చీకటి పడే వేళకు పెళ్ళి కబురుతో పాటు మిఠాయిలూ ఊరందరికి పంచి పెట్టుకున్నారు. రాత్రి భోజనాల వేళ పిల్ల పేరున రాసిచ్చిన పొలం కాగితాలు పిల్లకు కాబోయే మామగారి చేతిలో పెట్టి అభ్యర్దించాడు పిల్ల మేనమామ. ఇబ్బందుల వల్ల రొక్కం బంగారం పెట్టలేకపోతున్నాం అని అందుకే నాలుగో ఎకరం పొలం రాసిచ్చామని.. ఆయన ఒక్క ఉదుటున లేచి ఈ పెళ్ళి జరగదు అనేసారు. మగ పెళ్ళి వారి ఇంటి వారందరికీ పెట్టిన బట్టలు మిగిలిన స్వీట్స్ తినుబండారాలతో పాటు అవమాన భారంతో ముహూర్తం పెట్టుకున్న పెళ్ళి ఆగపోయిన బాధతో తెల్లవారి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు నా మేనమామ.
పోన్లే! వాళ్ళు డబ్బులు మనుషులు. పెళ్ళి తప్పిపోవడమే మంచిదైంది అనుకుని వేరే సంబంధాలు చూడటం మొదలెట్టారు. నేను ఊ హూ అనడం మొదలెట్టాను. అంతా వాళ్ళ ఇష్టమేనా.. చూసి వెళతారు మళ్ళీ కట్నం సర్దుబాటు చేయలేదని వొద్దంటారు. నేనేమన్నా ఆట బొమ్మ నా.. చేసుకుంటే ఆ అబ్బాయి నే చూసుకుంటాను అన్నాను.
ఇంట్లో వారి ఆలోచనలు వేరే!ఎంత తొందరగా పెళ్ళి చేసేయాలా అని. పదిహేడేళ్ళు కూడా నిండని నేను ఇంటర్మీడియట్ తప్పి ఇంట్లో వారికి భారం అనిపించాను. వెనకాల యింకో ఆడపిల్ల వుంది. ఒక్కగానొక్క మగపిల్లాడు చదువు ఆపేసి మూడొందల రూపాయల జీతానికి కాంట్రాక్ట్ పనుల దగ్గర ఉద్యోగంలో చేరాడు. ఇంటికి వచ్చి పడే అప్పుల వాళ్ళు, కలిగే అవమానాలు. నాన్న వ్యాపారానికి అమ్మకు కట్నం యిచ్చిన పొలం అమ్మి యిమ్మని నాన్న వొత్తిడి కోపాలు తిట్లు. నిత్యం యింట్లో రాద్దాంతమే! ససేమిరా అనే అమ్మమ్మ తాతయ్య మేనమామల పట్టుదల. ఉన్నదంతా అయిపోయింది. అక్కడ ఇంకో మూడెకరాలు వుందిగా అది అమ్ముకోండి అని. ఆడపిల్లలిద్దరికీ అమ్మ కు ఇచ్చిన ఆరెకరాలు పొలం చెరిసగం యిచ్చి పెళ్ళి చేసేద్దాం అని వారి ఆలోచన.ఆ చుట్టాలబ్బాయ్ కాకపోతే లోకం యేమన్నా గొడ్డుపోయిందా.. రాజమండ్రి పేపర్ మిల్లు లో అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు. జీతం మూడు వేలన్నర పైనే అంట. అబ్బాయి చక్కగా వుంటాడు. ఈడూ జోడు బాగుంటుంది.. అని మా పెద మేనమామ. నేను వొప్పుకోలేదు.
మళ్ళీ సంవత్సరానికి అనుకున్న కట్నం అనుకున్నట్టు ఇవ్వలేదని ఈ పెళ్ళి జరగదు అన్న యింటికే కోడలిగా వెళ్ళాను. పెళ్ళి చూపులు లో పెద్దవాళ్ళే నన్ను చూసారు. నేను పెద్దవాళ్ళనే చూసాను. పెళ్ళి కొడుకును చూడలేదు. మొండి పట్టు పట్టాను. అయినా అలా పెళ్ళి యెలా క్యాన్సిల్ చేస్తారు మీరు?. ఇవతల ఆడపిల్ల మనసుతోటి ఆలోచనలతో మీకు సంబంధం లేదా.. అని రిజిష్టర్ పోస్ట్ లో ఉత్తరం రాసాను. ఆ ఉత్తరం మా మామ గారు చదివి కట్నం ప్రమేయం లేకుండా మా పెళ్ళికి వొప్పుకున్నారు పదిహేడేళ్ళ వయస్సులో అలా వుండేది నా పట్టుదల. (మొదటి మరణం బీజం పడింది యిక్కడే)
పెళ్ళి తరువాత చాలా అవమానకర సన్నివేశాలు యెదురైనాయి. అప్పుడేమో కానీ.. తర్వాత తర్వాత మా అత్తమ్మ మామయ్య ధర్మబద్దంగా నిలబడ్డారు నాకు కొండంత అండ అయ్యారు కూడా!
నా జన్మ నక్షత్రం లో మొదటి పద్దెనిమిది యేళ్ళు లేదా పందొమ్మిది యేళ్ళు శని వున్నాడు. అప్పుడే నీకు పెళ్ళైంది అనేది మా మేనత్త. శనీశ్వరుడు వెళుతూ ఈయన్ని యిచ్చి వెళ్ళాడు లే అనేదాన్ని నేను.
పాపం! మా వారిది కూడా ఉదార స్వభావమే! జాలి గుణం కూడా! ఆయన మనసులో మా పుట్టింటి నుండి ఏమీ తెచ్చుకోలేదని చిన్నచూపు వుండేది. వివిధ సందర్భాల్లో నా పొగరు ఆయన అహంకారాన్ని తట్టి రేపెట్టేది అనుకుంటాను. నన్ను బాధ పెట్టడానికి ఏదో వొకటి అనాలి కదా!
నీ పుట్టింటి వాళ్ళు గతి లేని వాళ్ళు అని పదే పదే అంటూ వుండేవారు. నా మనసు గాయపడేది. కళ్ళు కన్నీటి కుండలయ్యేయి. ఏడెనిమిదేళ్ళు కట్నంగా యిచ్చిన పొలం లో వచ్చే రాబడి కూడా యివ్వకపోతే అంటారు, యెందుకనరు అని పుట్టింటి వారిపై కోపం ముంచుకొచ్చేది.ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయేవి.
యేదో విధంగా జీవితం తెల్లారక మానుతుందా.. చెప్పండి. వొడ్డున పడ్డాను. తాతయ్య నాయనమ్మ జ్ఞాపకాల్లో భాగంగా మా ఇంటి ఆడపడుచుల వెతలను జ్ఞాపకం చేసుకున్నాను ఇవాళ.
నాలుగు తరాల మా యింటి ఆడపడుచులు యెవరూ సుఖ జీవనానికి నోచుకోలేదు. మొదటి రెండు తరాల్లో మా పెద్ద మేనత్త ఆమె మేనత్త పచ్చగా పదికాలాలు బతికింది లేదు. అవమానంతో ఆత్మహత్య, అనారోగ్యం తో మానసిక వ్యథ తో మరణించడం. (నూతిలో గొంతుకలు కథలో మొదటి యిద్దరు స్త్రీలు వారే) ఇక మా ఇంకో మేనత్త పెళ్ళి కాక ముందు ఏం సుఖ పడిందో.. బతుకంతా కడగండ్ల మయం. ఇప్పటికీ వొంటరిగా బతుకు ఈదుతుంది. ఇక మా తరం ఆడపిల్లలు..నలుగురం. అందరిదీ పోరాట పథం. లంకా వారి ఆడపిల్లలు గట్టివాళ్ళు. అదరరు బెదరరూ.. మగ పిల్లలు మెతక కానీ ఆడపిల్లలు అలా కాదు అని అనిపించుకున్నాం. జీవితం యెన్ని సమస్యలను సవాల్ గా బహుమతిగా యిచ్చినా .. వాటిని యెదుర్కొన్నాం. బిడ్డలే ఊపిరిగా కుటుంబమే ముఖ్యంగా నిలబడ్డాం, నిలబెట్టుకున్నాం.
మా నాన్న వారి సోదరులు సోదరి అందరూ ఆస్థిపాస్తులు పోగొట్టుకున్నారు. నిజాయితీ గా బతకడానికి అష్టకష్టాలు పడ్డారు. ఒకరికి ద్రోహం చేయలేదు.నేరాలు చేయలేదు. ఘోరాలు చేయలేదు. కాకపోతే ఆరంభశూరత్వం. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు (ఇంట్లో వారికి) మా ఇంటి ఆడపడుచులకు స్త్రీ ధనం యివ్వడంలో మర్యాదలు జరపడంలో కొంచెం నిర్లక్ష్యం వహించేవారు. దానికి తోడు కట్నం అనే దురాచారం వల్ల సమాజంలో తరతరాలుగా ఏ భావజాలాలు వర్ధిల్లుతున్నాయో.. అవి అన్ని కుటుంబాల్లో పీటముడులు వేసుకుని కూర్చుని వున్నాయి. అవి మా అత్త వారిళ్ళలోనూ మా ఇంటికి అల్లుళ్ళుగా వచ్చిన వారిలో మెండుగా వున్నాయి. ఆ భావ జాలం మా ఆడపడుచులను చాలా బాధ పెట్టింది. ఇక ఇప్పటి తరం ఆడపిల్లలు వాటిని యెదుర్కోకుండా వుండాలని నేను కోరుకుంటున్నాను. నాల్గవ తరంలో ఇద్దరు ఆడపిల్లలు ఐదవ తరంలో ఇద్దరు ఆడపిల్లలు.. వున్నారు.
ప్రస్తుతం ఎనభై సంవత్సరాల వయస్సు నుండి సంవత్సరం లోపు పసిపిల్ల వరకూ నాలుగు తరాల ఆడపిల్లలం వున్నాం. ఎవరైనా హోదాలతో డబ్బుతో యెకరాలతో మమ్మల్ని పోల్చి చూడాలనుకుంటే.. మేమందరం down to earth మనుషులం. దానికి మూలం మా తాతయ్య మా నాయనమ్మ… అని గర్వంగా చెప్పుకుంటాం.. ..
మళ్ళీ.. మా తాతయ్య నాయనమ్మ గురించి..
మా తాతయ్య ఎంత కష్టజీవి మంచి మనిషో.. మా తాతయ్యకు సహాయకుడుగా వున్న అప్పటి యువకుడు ఇప్పుడు మా నాన్నగారి వయస్సులో వున్నతను.. నాకు పాతికేళ్ళ క్రితం చెప్పిన విషయాలు నా మనస్సులో అలా ముద్రించుకు పోయాయి. ఏ వ్యక్తి గురించైనా వారి పిల్లలు బంధువులు చెప్పిన విషయాలకన్నా వారి కింద పనిపాటలు చేసిన మనిషి చెప్పిన మాటలు ప్రామాణికం అవుతాయి కదా..
********
మామిడి కోతలు పూర్తయ్యాయి. అర కొర కొస కాయలు వేలాడుతున్నాయి. పేడ దిబ్బ చేలల్లో తోలి అక్కడక్కడ కుప్పలు పోసి వుంది. ఒక సాలు దున్ని వదిలేసిన చేలల్లో మొలిచిన గడ్డి దుబ్బులు కట్టి ఎండలకి నిలువునా మాడిపోయి వుంది. తొలకరి వాన పడక ముందే ఇంకోసాలు దున్నితే బాగుండును రా.. కోటేశూ.. అన్నాడు చలమయ్య బబాయ్.
“పైన ఎండ చూస్తే మాడ్చేత్తందయ్యా.. నెర్రలిచ్చిన నేల కొండరాయల్లే గట్టిబడిపోయి వుంది. కిందపైనా కాల్తూ దుక్కి సాగదు, నాలుగునాళ్ళు ఆగితే పోలా.”అన్నాను నేను..
“ఎద్దుల ఉసురు పోసుకోవడం నాకు మాత్రం యిష్టమా.. గరువు నేల వొకసాలు దున్ని వదిలేస్తే వాన కురిసినప్పుడు నేల నీళ్ళు యింకిచ్చుకుని తర్వాత దుక్కి కి అనువుగా వుంటది” అన్నాడు ఆయన..
“సరే అయ్యా.. మీరు యెట్టా అంటే అట్టా.. అన్ని జతలు కడదామంటారా.. మిగిలినోళ్ళని పిలవమంటారా.”.
“రోజుకొక రెండు జతలు లెక్క నాగలి కడదాం నువ్వు నేనూ నాగలి పడితే మిగతావాళ్ళు సరిహద్దుల్లో కంప నరికి యెండు కొమ్మలు యిరిసి చెట్ల మొదళ్ళ చుట్టూ పాదులు చేత్తారు. తర్వాత ఎరువు కుప్పలు చిమ్ముతారు”.
“సరే నయ్యా.”.
తొలి ఏకాదశి కి ముందే గరువు పొలం అంతా వొక సాలు దున్ని తొలకరి కోసం ఎదురుచూడటం.. పాలేరులు అందరూ మాగాణికి ఎరువు దిబ్బ తోలడం,విత్తనాలు వడ్లు మరొకసారి యెండబెట్టి బస్తాలకు యెత్తడం. అన్ని పనులు చలమయ్య బాబాయ్ పూనుకోవడం.
పెద్దాయన రోజూ వెల్లటూరు యెల్లి బెజవాడ బస్ యెక్కి కోర్టులు కాగితాల కోసం తిరగడం, మూడో ఆయన పనిలో వేలు బెట్టేవాడు కాదు. పైపైన తిరిగి నడి మంచం ఇరిగేదాకా పడుకునేవాడు. నాలుగో ఆయన అత్తగారి అండ చూసుకుని మిడిసిపడటం ఆస్తులను పెంచుకోవడం.. ఐదో ఆయన చదువు వ్యాపారాలు వెలగబెట్టడం తప్ప వొక్కరు పనిచేసే వారు కాదు. ఆ ముసలమ్మ గారు కూడా ఈ కొడుకునే పట్టుకుని యేలాడేది. పెద్ద కమతం అమ్మా.. మీ తాత వాళ్ళది. అని ఆపేసాడు.
ఇంకా చెప్పండి.. అంటూ ఉత్సాహం నాకు.
ఆ రోజు తొలి ఏకాదశి.వేగు చుక్క పొడిచేటప్పటికే..ఆ పశువుల చావిడి ముందు సందడి మొదలైంది. యజమానితో పాటు మేము ఆరుమంది పాలేరులు తయారుగా వున్నాం. ప్రతి నాగలికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. ఎద్దుల మెడపై కాడి పెట్టి ప్రతి జత ఎద్దుల జతలకు హారతి పట్టి బసవన్నను తలుచుకుని దణ్ణం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ఎద్దులకు బెల్లం వుండను తినిపిచ్చారు. నిలబడిన చోట నేలకు దణ్ణం పెట్టి ఆకాశం వైపు చూసి చేతులు జోడించారు.
రత్తమ్మ తల్లి సొరకాయ బుర్రల్లో నీళ్ళు చద్ది కూడు కుండ సర్ది తయారుగా పెట్టింది.. అవి భుజానికి తగిలించుకుని నాగలిని భుజాన వేసుకుని కాడి పట్టిన ఎద్దుల్లో ఎలపటెద్దు ని యెహేయ్ అని అదిలించాడు చలమయ్య బాబాయ్. భూమి పూజ చేయడానికి పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయలు పెట్టిన సంచీ ని పట్టుకుని ఎదురొచ్చింది ఆయన యిల్లాలు మాణిక్యమ్మ. ముందు చలమయ్య బాబాయ్ తర్వాత పాలేరులు వొకరి వెనుక వొకరు.. బాటలోకి వచ్చి ఊరికి ఉత్తరం వైపు బాటకు మళ్ళాం. ఎద్దుల మెడలో మువ్వల పట్టీల సవ్వడికి మామిడి చెట్ల పై వున్న కోయిలలు మేల్కొని కూత మొదలెట్టాయి. కాకులు మేల్కొన్నాయి. కోడిపుంజులు మాత్రం ఇంకా బద్దకం వదలనట్టు మెదలకుండా వుండాయి. ఆరు బయట పడుకొన్న మనుషులు ఎద్దుల మెడలోని మువ్వల చప్పుడుకు లేచి కూర్చున్నారు. అప్పుడే చుక్క పొడిచింది కాబోలు అనుకుంటూ.
లంకోరి (లంకా వారి) అరకలు పొలానికి బయలెల్లాయి. అనుకుంటూ హడావిడి పడ్డారు. నోట్లో పదుంపుల్ల వేసుకుని రోడ్డు మీదకు వచ్చి ఆరాగా చూసేయి. చిమ్మ చీకట్లో తెల్లని ఎద్దుల జత మెడపై నాగళ్ళ తో యజమాని చలమయ్య. అతని వెనుక మరికొన్ని ఎద్దుల జతలు పాలేర్లు. దేశవాళీ ఎద్దులు మూడు జతలు, ఒంగోలు ఎద్దులు రెండు జతలు, ఆఖరున ఒక జత మైసూరు జత ఎద్దులు. చూడటానికి రెండు కళ్ళూ చాలవు. అనుకుంటూనే ..
ఏమైనా లంకోరు వ్యవసాయం చేయడంలో దిట్టలు. ఊరు లెగవక ముందే లేచి పనుల్లోకి జొరబడతారు. ఊరు కాని ఊరు నుంచి వచ్చి ఊరు కే మొనగాడు దారు సేద్యగాళ్ళు అయ్యారు.. అనుకునేవాళ్ళు.
“చలమయ్య అన్నయ్యా! మీరు అరకలు కట్టారంటే తొలి ఏకాశి వచ్చినట్టే, మాకెవరికీ అంత గుర్తు లేదే ఇయ్యాల ఏకాశి అని” అని పలకరించే వాళ్ళు.
అవునంట, మా అన్నయ్య పంచాగం చూసి చెప్పాడు. మీరు కూడా మొదలెట్టండి మంచి ఘడియలు దాటకముందే” అనేవాడు చలమయ్య బాబాయ్.
“నువ్వొక్కడివే బయలెల్లావ్, మీ అన్నదమ్ములు రారా పొలానికి ఆరా తీసేవాడు” పుల్లలేసే గుణం వున్న ఆయన..
“ఎనకా ముందు వస్తారులే, చిన్నోళ్ళు ఎండబడి లేస్తారు కదా”అని జవాబిచ్చి ఊరుకునేవాడు ఆయన.
వెనుక నడుస్తున్న పాలేర్లు మనసులో అనుకునే వాళ్ళం “అన్నదమ్ములందరికీ పనికి వొంగాలంటే సా చేటు, తెగులు అనే మాటకు ముందు మోటు మాట బూతు మాట చేర్చి. మరొకమాట అనుకునే వాళ్ళం. మా చలమయ్య బాబాయ్ ధర్మరాజు కష్టజీవి. ఆయన లేకపోతే యింత వ్యవసాయం ఆళ్ళ వల్ల అయ్యిద్దా..” అని.
“చలమయ్య బాబాయ్.. అంత దూరం పొయ్యి చానా ఖరీదు పెట్టి మైసూరు జత ఎద్దులు తెచ్చినావు కదా.. అవి మన ఎద్దుల్లా అరక దున్నలేవు బండి లాగలేవు.. దండగ మారి పని కదా” అని అడిగాను.
“చిన్న తమ్ముళ్ళు రంగయ్య రాఘవయ్య మైసూరు ఎద్దులు కావాలని ముచ్చటపడినారు లే కోటేశూ.. ఆళ్ళకు తగ్గ ఎడ్లు అయ్యి. చదువుకుంటూ వున్నారు. ఎక్కడో చూసారు.. మనక్కూడా వుండాలని అనుకున్నారు.అందుకే కొన్నాను లే.. అని జవాబు.
ఎద్దులు కావాలంటే.. డబ్బు పట్టుకొని పోయి నెలా రెండ్నెల్లు తిరిగి కొనుకొచ్చేవారు. జత బాగుంటేనే కొనేవాడు ఆయన. దొడ్డో పుట్టినవి కాడికి సరిపోకపోతే ఆటిని అమ్మేసి కాడికి సరిపడా కొనేవాళ్ళు. ఆరు జతల ఎద్దులు ఆవులు పాడి గేదెలు ఎంత పెద్ద చావిడ అని. మీ నాయనమ్మ కూడా బాగా పనిచేసేది. రోజూ యాభై మంది చెయ్యి కడిగేవాళ్ళు. దాలి లో ఉలవలు వొక కుండలో ఉడుకుతా వుంటే పాలు వొక కుండలో కాగుతా వుండేవి. ఏ వేళప్పుడు వెళ్ళినా అన్నం కుండ పొయ్యి మీద వేడిగా దించకుండా వుండేది. చలమయ్య బాబాయ్ ఆ ఇంటికి దాపటెద్దు అనుకో.. అంత పని భారం వుండేది ఆయన మీద. గొప్ప మనుషులు. నేను యిల్లు కట్టుకున్నప్పుడు శంకుస్థాపనకు ఆ భార్యభర్తలనే తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టిచ్చుకున్నాను. నాకు కొడుకు పుడితే.. వారి చేతే ఉయ్యాల లో బిడ్డ ను వేయించుకున్నాను. మంచి మనసు వున్నవాళ్ళమ్మా కల్లాకపటం తెలియదు పేద గొప్ప తేడా చూపించే వారు కాదు. ఆ రత్తమ్మ గారు కన్నబిడ్డల్లో గొప్ప మనసున్న బిడ్డ మీ తాతయ్య. ఎవరి గురించి చెడ్డగా మాట్లాడటం కానీ అబద్దాలు చెప్పడం గానీ ఆయనకు తెలీదమ్మా, ఆయన బిడ్డలే ఆయనను సరిగ్గా చూసుకోలేదు” అని చెపుతుండగానే అతను వెళ్ళే బస్ వచ్చేసరికి వెళ్ళిపోయాడు. నేను వొంటరిగా మిగిలిపోయాను.
నేను అప్పటిదాకా కూర్చున్న సత్రం వైపు చూసాను. లంకా రంగయ్య సీతారావమ్మ జ్ఞాపకార్ధం నిర్మించిన ప్రయాణికుల సత్రం లో కూర్చుని కోటేశూ అనే అతను చెబుతున్న సంగతులు విన్నాను. ఆ సత్రం మా తాతయ్య తమ్ముడు రంగయ్య ఆయన భార్య (మేనమామ కూతురు) సీతారావమ్మ పేరిట నిర్మించిన సత్రం. ఆయన అరవై యెకరాల భూస్వామిగా.. కొడుకును బాగా చదివించి హైదరాబాద్ లో బ్యాంక్ మేనేజర్ గా చూసుకుంటే.. మా తాతయ్య యేంటీ అలా మిగిలిపోయాడు. మంచితనం కష్టపడే స్వభావం ఉదారగుణం వుండటం వల్ల ఆయనకు ఏం మిగిలింది? ముందు చూపులేకపోవడం వలన యెంత బాధ పడ్డారు? అని చాలా బాధ కల్గింది.
మా తాతయ్య పిన్ని కూతురు హనుమాయమ్మ అనే ఆవిడ మా ఊరి లోనే వుండేవారు.. ఆమె మాటల్లో.. మరికొన్ని విషయాలు.. మరో భాగంలో..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి