4, ఏప్రిల్ 2023, మంగళవారం

అక్షర ధ్యానం

 


ప్రస్తుతానికి నటించడం అనే ముసుగు తీసేసి జీవించడం అనే దశలోకి చేరుకున్నాను. 

నాకు ఎవరిపైనా యెలాంటి ఆరోపణలు  యెలాంటి నిరాశలు విచారాలు (regrets)  లేవు. నేను మహా  దైర్యవంతురాలిగా కనబడే మహా పిరికిదాన్ని. మనుషులు నచ్చకపోతే మౌనంగా దూరంగా జరుగుతాను తప్ప అనవసర ఆరోపణలు చేయడం నిందలు వేయడం నాకు నచ్చని పని. ఇతరులు కూడా అలా వుండాలని అతిగా ఆశిస్తాను. అది అత్యాశ అని తెలిసినా.

“Corona వచ్చిందని భయం వేసిందా అమ్మా! ‘’అని అడిగాడు అబ్బాయి ఏడు నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు..

“నీ దగ్గర వుండగా నాకు భయమెందుకు నాన్నా!’’ అన్నాను. అదే విజయవాడలో ఇంట్లో వుండి వుంటే విపరీతంగా భయపడేదాన్ని. 

పదమూడేళ్ళనాడు అబ్బాయి వెంట శ్రీశైలం స్వామి దర్శనం కోసం వెళుతూ మనీ పర్స్ తీసుకెళ్లడం మానేసాను. అబ్బాయి ఆశ్చర్యపోయాడు మనీ పర్స్ లేకుండా యెలా వచ్చావమ్మా అని. రెట్టించి అడిగాడు కూడా. ‘’నువ్వు వున్నావు కదా నాన్నా” అన్నాను. అప్పటి నుండీ అదే భరోసా.డబ్బు-జీవితం రెండూ సమాంతరంగా నడిచాయి, నడిపించాయి. ఒక దానికోసమా రెండవదాన్ని ఫణంగా పెట్టలేదెపుడూ..

నా కొడుకు నా చిటికెనవేలు ను వదిలించుకుని తన కూతురుని చిటికెనవేలు పట్టుకుని నడిపించే కాలానికి యెన్నో యెదురుదెబ్బలు కముకురాతి దెబ్బలు తిన్నాడు. తగిలితే కదా గట్టిపడతాడు అని చూస్తూ వూరుకున్నాను. బాధ యెక్కువైనప్పుడు తెలివిగా నడుచుకోవడం నేర్పాను. మానసిక రుగ్మతలు లేని ఆరోగ్యకరమైన జీవితం కోసం అవసరమైతే కొన్ని సులువుగా వొదిలేసుకోవాలి.చుట్టుకుని పట్టుకుని వుంటే సున్నితంగా తీసివేసుకోవాలి అని చెప్పాను. నా సూత్రం అదే గనుక.

ఇలాంటి  మానసిక స్థితి ని చాలా కాలంగా సొంతమై వున్నందువల్లనేమో ‘’ వాతాపి జీర్ణం’’ కథ రాసాను. అందుకే మరొకసారి రిపీట్ చేస్తున్నాను యీ వాక్యాన్ని. 

‘’ప్రస్తుతానికి నటించడం అనే ముసుగు తీసేసి జీవించడం అనే దశలోకి చేరుకున్నాను’’ అని. నా పై యెవరి మానసికదాడులు పనిచేయవు నన్ను ఇసుమంత కూడా బలహీనపరచలేవు అని. 

ఒక కథో కవితో కాకరకాయో అది నా మానసికమైన భావన. అది హిట్ or ఫట్ అన్నది నాకు పెద్దగా పట్టని విషయం. నా బలం యేమిటో నేను యెలా బలంగా  సంతృప్తిగా జీవించగలనో అన్నది నాకు ఎరుక వుంది...

నేను రాసిన “ఉదయమిత్ర’’ పాత్ర లాంటి దాన్ని నేను. కొన్ని అసలు లక్ష్యపెట్టను. ఇంటి సమస్య అయినా సమాజం నుండి యెదుర్కొన్న  యే సమస్య అయినా! నా “ఈస్తటిక్ సెన్స్” అది.  

ఇంకా చాలా కథల్లో స్త్రీలు ఆత్మవిశ్వాసంతో యెలా మనగలరో కూడా రాసాను.  అదే నేను కూడా! నలుగురితో పొగిడించుకోవాలనో కీర్తిప్రతిష్టలు వొనగూర్చుకోవాలని కాంక్ష కూడా అట్టే లేనిదాన్ని . ఇక సాగిలబడడం అనేది నా మనస్తత్వానికి యే మాత్రం పొసగదు కూడా! 

‘కథలు కూడా పకడ్బందీగా రాస్తే అది కథ లాగా ఉండదేమో! 

"ఇది కల్పిత కథా ? నిజమైన కథా ? వారు నిజమైన కథ అని వ్రాశారు. ఒక కథ జరగవచ్చు. ఒక కథ జరగకపోవచ్చు. జరిగిన కథ జరగనట్లు ఉండవచ్చు. జరగని కథ జరిగినట్లు ఉండవచ్చు… చదివి వొదిలేస్తే పోలా.. 

కథ కాస్త జాగ్రత్తగా రాయాల్సిన మాట నిజమే అయినప్పటికీ.. 

భూతద్దంలో కథను చూడాల్సిన పనిలేదు. విమర్శ పేరుతో దాడి చేయకూడదు. 

రచయితలందరూ  కథల పాఠశాలలో కూర్చోలేదు కదా! బెత్తం పట్టుకుని సరిచూసుకో అని చెప్పడానికి.  

కథల్లో లోపాలు వుంటాయి జీవితాల్లో వున్నట్టు. ఇతర మతాల వారిని కులాల వారిని వ్యక్తులెవరినీ టార్గెట్ చేసి వివాదస్పదమైన కథలు రాయలేదు నేనెప్పుడూ. 

ఎదుటివారిలో లోపాలు వెతక్కుండా ఉండటం ధ్యానం. మన గవాక్షంలో నుండి కనబడినంత వరకూ మాత్రమే  చూసి ఓస్.. ప్రపంచమంతా ఇంతే అనుకోవడం అవివేకం. 

“ఐ యామ్ ఆల్వేస్ ఏ లూజర్” కవిత రాసినందుకు, “ఇల్లాలి అసహనం” అని కథ రాసినందుకు.. గానూ.. ఎన్నేళ్ళుగా నా మీద విషం కక్కాలనుకున్నారో అదంతా కలిపి.. అజ్ఞాత పేరిట.. 

ఆనందం బ్లాగ్ లోనూ హరి కాలమ్ బ్లాగ్ లోనూ..  నా గురించి చాలా బాధ కల్గించే వ్యాఖ్యలు రాసారు.  ఆ వ్యాఖ్యలను కొద్ది నెలల క్రితమే చూసాను. అందులో   స్త్రీ లు కూడా వున్నారనేది నాకు యెరుక వుంది. ఆ వ్యాఖ్యలు చేసినవారి మానసిక దౌర్బల్యానికి నేను జాలిపడ్డానంతే!  




*గొప్పగా బ్రతకడానికి గొప్పగా బ్రతికినట్టు నటించడానికి చాలా తేడా వుంది. ఈ రెండిటికి గల  తేడా చాలామందికి అర్దంకాదు*.

కామెంట్‌లు లేవు: