3, ఏప్రిల్ 2023, సోమవారం

మౌనం మిత భాషితం శరణం మమ

 ఎవరైనా ముందు నడిచిన అనుభవంతో ఆ బాటలో వెళ్ళవద్దని చెబుతారు. నాకు బోలెడంత శక్తి, నడిపించే భరోసా. ఆత్మవిశ్వాసం వగైరాలున్నాయి నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదంటే యెవరూ సలహాలు యిచ్చే సాహసం చేయరు. చేసి నాలుగుమాటలు అనిపించుకోరు. అనుభవాలు వొకటి కాకపోయినంత మాత్రాన అనుభవం ప్రామాణికం కాకుండా పోదు. అడగకుండా సలహాలు యివ్వకూడదు.అడిగినా యివ్వకూడదు యీ రోజుల్లో. మాటలు రువ్వి గాయపరచడం చాలా ఈజీ. గాయాలు మానడమే బహుకష్టం.  మౌనం ... మహా మంచిది. ఎవరికైనా, యెప్పుడైనా, యెక్కడైనా.


మన అనుకున్న వాళ్ళు యెవరైనా సరైన నిర్ణయం తీసుకోకుండా నష్టపోతారనే బెంగ ఇబ్బందులు యెదుర్కొంటారనే భయం వాళ్ళు బాగుండాలనే ఆత్రుత తో వొకోసారి వారు అడగకపోయినా గమ్మున వుండబుద్ది కాక సలహాలు యివ్వబోతాం. అది వారికి రుచించదు. వారి దృష్టికోణం అంచనాలు వేరుగా వుంటాయి. మన సలహాలు సూచనలు వారికి నచ్చకపోవడమే కాకుండా వారి స్వవిషయాలలో జోక్యం చేసుకుంటున్నాం అని అనుకుంటారు. తీరా వారికి అనుభవంలోకి వచ్చాక చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వుంటుంది. అలాంటి సమయాల్లో వారిపట్ల సానుభూతి చూపడం కన్నా దైర్యం ఉత్సాహం ప్రోత్సాహం అందించాలి. కొన్ని అలాగే జరుగుతుంటాయిలే! ఈ సారి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకో అని మాత్రమే చెప్పాలి. 


ఇంకో రకం మనుషులు యెలా వుంటారంటే.. 

అలా వారికి నెగిటివ్ గా జరిగిందని ఆప్తులెవరూ సంతోషపడరు. కానీ సంతోషపడతారని ఊహించుకుని రగిలిపోతారు. ఇతురులపై ఆరోపణలు చేస్తారు. తమ కష్టాలన్నింటికీ ఇతరులే కారణం అని దూషిస్తారు కూడా! అదే వారు ఇతరులకు  సలహాలు సూచనలు యిచ్చిన వారైతే వారి మాటలు వేరేగా వుంటాయి.   “అదిగో.. నేను ఆ రోజే చెప్పాను, మీరు వినలేదు.మీకు యిలాగే జరగాలి”అని ముఖం మీద అనేస్తారు.  అందుకే మీకు తగినశాస్తి జరిగింది అని లోలోపల సంతోషపడతారు. ఇతరులు కూడా వారిలాగానే ఆలోచిస్తారని అపోహ పడతారు. మనుషులు యిలాగే వుంటారు.మాలాగే వుంటారు మా లాగే ఆలోచిస్తారు అని తీర్మానించేసుకుంటారు తప్ప ప్రతి మనిషి విభిన్నంగా వుంటారు విభిన్నంగా ఆలోచిస్తారు అని ఊహ లో నైనా ఆలోచించరు. ఇలాంటి మనస్తత్వం గలవారితో చాలా కష్టం. అందుకే ఉచిత సలహాలు సూచనలు అభిప్రాయాలు వెల్లడించడం మానుకోవాలి. 


స్నేహితులకైనా తల్లిదండ్రులకైనా  సోదరీసోదరులకైనా పిల్లలకైనా యెవరికైనా వర్తించే సూత్రం యిది. సదా మౌనం మిత భాషితం అంత హాయి యింకోటి లేదు. ఈ విషయం అనుభవపూర్వకంగా చెబుతున్నాను.


 మనిషిని దగ్గరగా వుండి చూడటమే కాదు దూరంగా వుండి దూరమై కూడా చూడాలి అపుడే మనిషి బాగా అర్దమవుతాడు. అంచనాలు దగ్ధమవుతాయి అనిపిస్తుంది నాకు.



చిత్రం: Camillia flower in my backyard


*విసుగు విరక్తి రెండూ వచ్చాక మనుషులను వద్దనుకోవటం మరణించడం కన్నా తక్కువేమీ కాదు.*




కామెంట్‌లు లేవు: