7, ఏప్రిల్ 2023, శుక్రవారం

మా ఊరు - మా ఇల్లు 3

 ఇంతకు ముందు రెండురోజులుగా ముందర రెండు భాగాలు పోస్ట్ చేసాను . 

 


మా ఊరు - మా ఇల్లు మూడవ భాగం ఇది. 


కొన్నేళ్ళ తర్వాత మరొకసారి ఇల్లు మారిపోయింది. మా చిన్న తాతగారి భాగానికి మాకు మధ్య వున్నగోడ ఇవతల మా భాగం వైపు కోసేసి గది వెడల్పు తగ్గించి ఉత్తరం.. స్థలం వుండేలా గోడలు కట్టారు. వంటిల్లు పడగొట్టి నైబుతిలో చుట్టిల్లు కట్టారు. ఆవరణ లో బావి తవ్వించారు.  అంతకు ముందు మా నీటి కష్టాలు అంతులేనివి. ఆ కష్టాలకు తెరపడిందని అమితంగా సంతోషించాము. ఇల్లు చిన్నదైంది కానీ ఇంట్లో మనుషులు కొత్త ఆశతో తమ జీవితాల్లో మంచి మార్పు కోసం ఎదురు చూసారు.


1992 లో  మా నాయనమ్మ చనిపోయింది. చిన్నపాటి అనారోగ్యమే! నా అనారోగ్య కారణం వల్ల ఆఖరి చూపు కూడా దక్కలేదు. నడి వేసవిలో తుఫాను. పెద్ద వర్షం. సంప్రదాయమైన అంత్యక్రియలకు నోచుకోలేదు. ఖననం చేసారు. తాతయ్య నాయనమ్మ వారి వృద్దాప్యంలో అంతులేని మానసిక వేదన పేదరికం అనుభవించారు. ఇది రాస్తుంటే కూడా చాలా దుఃఖం గా వుంది. ఎవరైనా సరే జన్మనిచ్చిన తల్లిదండ్రులను యవ్వనంలో వున్నప్పుడు లక్ష్యపెట్టకపోయినా వృద్దాప్యంలో వారిని  ప్రేమగా దయగా చూసుకోవాలి. తల్లిదండ్రులు యెంత గొప్పవారైనా పిల్లలకు చులకన భావమే వుంటుంది. వారు దాటిపోయాక కానీ వారి విలువ తెలియదు. ఐదుగురు బిడ్డలను కన్నారు.. ఐదు రకాలుగా మానసిక క్షోభ బాధ అనుభవించారు. నేను యిప్పుడు అనుకుంటాను.. మాకు ఇంకొంచం ఆర్థిక స్వేచ్ఛ  వచ్చినదాకా బతికి వుండకూడదా నాయనమ్మ తాతయ్యా అని. నిజానికి మన దగ్గర డబ్బు లేనప్పుడు కూడా వారిని ప్రేమగా చూసుకోవాలి. డబ్బు వచ్చాక వారు వుండమన్నా ఉండలేరు కదా ! 


మా అమ్మ వారికి మనోవర్తి కచ్చితంగా ఇచ్చేది. కానీ ఆదరణ సరిగా ఉండేది కాదు. అది మాకు కూడా కినుకగా ఉండేది అమ్మ మీద కోపంగా ఉండేది. కానీ ఏం చేయగలం పెద్దవారితో వాదన చేసి ? ఆ విషయంలో నిన్ను క్షమించలేం..అని అన్నాము. స్త్రీలు సాధారణంగా అత్తమామల పట్ల ద్వేషం కల్గివుండరు. తనపై తన బిడ్డలపై భర్త ఆదరణ ప్రేమ లేకపోవడం దుర్వస్యనాల బారినపడి కుటుంబ భాద్యతలు మర్చిపోతే ఆ అసహనాన్ని భర్త తల్లిదండ్రులపై వ్యక్తీకరించడం అని తర్వాత తర్వాత నాకర్థమైంది. ఇంకో విషయం ఏమిటంటే ఏ తల్లిదండ్రులైనా సరే ఉన్న ఆస్తులను బిడ్డలకు సమస్తం రాసి యివ్వకూడదు. జాగ్రత్తలు తీసుకోవాలి.


ఇక 1998 లో మా అమ్మ చనిపోయింది.చిన్న వయసే! అప్పటికి అమ్మకి యాబై ఒక్క సంవత్సరాలు. ఆ తరువాత మాకు మా ఊరుకు అంతగా వెళ్ళే అంత బంధం లేకపోయింది. మేమందరం విజయవాడ దరిదాపుల్లో వుండటం వల్ల.. నాన్న మా దగ్గరికే వస్తూ ఉండేవారు.   


మా ఊరు మా ఇల్లు అనగానే నాకు మదిలో మెదిలే చిత్రం చాలా పాతది. నాకప్పుడు తొమ్మిదేళ్ళు. అప్పటి వరకూ అమ్మమ్మ వాళ్ళింట్లో పెరిగాను. దాదాపు నలభై అయిదేళ్ళ కిందట వున్న ముఖ చిత్రం. అప్పుటి దృశ్యసమాహారమే యిప్పుటికి కూడా నాకు  స్పష్టంగా గుర్తుంది. ఆ తర్వాత ఊరు ఇల్లు చాలా మారిపోయి వుండొచ్చు. ముఖ్యంగా మా ఇల్లు వాస్తు దోషాలతో వుందని రెండుసార్లు మార్పు జరిగింది. ఇప్పుడైతే ఆ ఇల్లు పూర్తిగా కూల్చబడి .. పునాదులతో సహా తవ్వి పోసి  మట్టితో ఎత్తు లేపి కొత్త యిల్లు కట్టారు మా అన్నయ్య. ఆ ఇల్లు కూల్చేసే ముందు వొకసారి చూసి వుంటే బాగుండేది అనిపించింది. బాధ కూడా కలిగింది. ఇప్పుడు మారిపోయిన ముఖ చిత్రంతో మా ఊరు మా ఇల్లు ఇరవై నాలుగేళ్ళ క్రితం మరణించిన మా అమ్మ. ఏదో ఖాళీ తనం.  


నాకంటూ అక్కడ భౌతికమైన ఆస్తులు  ఏమీ లేవు. నాన్న అన్నయ్య వదిన వున్నారు.  వారికి కొద్దిపాటి భూమి ఆ ఇల్లు వున్నాయి. కానీ నాది అంటూ నాకు మిగిలింది అమూల్యమైనవి మా ఊరితో ఇంటితో వున్న అనుబంధం సజీవమైన జ్ఞాపకాలు మాత్రమే!. 


ఆడపిల్లలకు మమతలు భ్రమతలు కూడా యెక్కువేనేమో! అందుకే నేను యిదంతా రాసుకున్నాను. రాసుకోవడం పూర్తయ్యాక యెందుకో దుఃఖం ముంచుకొచ్చింది. మట్టి-మనిషి అంటారు కదా! మట్టి అలాగే వుంటుంది. మనిషి ఆ మట్టిలో కలిసిపోతాడు. ఎవరికి ఏ నీళ్ళు ప్రాప్తం వుంటాయో అవే దక్కుతాయి. తరచూ మా అమ్మ కలలో కనబడుతుంది కానీ మా తాతయ్య నాయనమ్మ అసలు కనబడరు. వాళ్ళ మాటలు వాళ్ళు మసలిన తీరు కళ్ళ ముందు మెదులుతాయి. మా అన్నయ్యకు కూడా ఊరు అన్నా ఇల్లు అన్నా మమకారం. అందుకే ఊరికి వెళ్ళి విశ్రాంత జీవనం గడుపుతున్నాడు. వృద్దాప్యంలో నాన్న ను బాగా చూసుకుంటున్నారు. 


నాకు ఏ మాత్రం సాధ్యపడినా మా ఊరు వెళ్ళిపోయి అక్కడే వుండాలనిపిస్తుంది. కానీ మా నాన్నగారికి అది యిష్టం వుండదు. 1998 తర్వాత ఒక్క రాత్రి నిద్ర చేయడం తప్ప ఆ వూరిలో సూర్యోదయం చూడలేదు నేను. గత జూలై నెలలో వొక ఆరు రోజులు వున్నాను. ఆ వాతావరణం నాకు సరిపోతుందో లేదో నని అనుమాన పడ్డాను. కానీ నా శరీరం మనస్సు పురా స్మృతులను వొడిసి పట్టుకుంది. ఊరు ఇల్లు నన్ను ఆలింగనం చేసుకుంది. ఆ రోజులలో హాయిగా మెలుకువ రాని నిద్ర పోయాను. 


ఎప్పుడైనా మా ఊరు ను మా ఇంటిని చూడాలని అనుకున్నప్పుడల్లా.. గూగుల్ యెర్త్ మ్యాప్  ఓపెన్ చేస్తాను. ఊరు పరిసరాలు మావి కాని మా పొలాలు నేను ఆడుకున్న స్థలాలు అన్నీస్పష్టంగా కనబడతాయి. మొదటిసారి అలా చూసినప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. తర్వాత అప్పుడప్పుడు  తనివితీరా చూసుకుంటాను. 


నిజజీవితంలో నువ్వు నీకు  దొరకకపోతే అక్షరాలలో నిన్ను నీవు వెతుక్కో..  అంటారు కదా! ఎన్ని దుఃఖాలను  నిరాశలను వొడపోస్తేనో కదా మనస్సు స్వచ్ఛత భాసిల్లేది. స్వచ్ఛమైన బాల్యం కల్మషం యెరుగని మనస్సు .. ఆ జ్ఞాపకాల్లో  వొక జీవరాగం  వుంటుంది. మనకు మాత్రమే వినిపించే అర్ధమయ్య  సడి వుంటుంది. జీవన గమనంలో ఎంతో యిష్టంతోనూ కష్టంతోనూ నిన్ను నువ్వు సాధించుకున్న తర్వాత మనదంటూ అనుకున్న దేనిని  వొదులుకోవడం యిష్టం వుండదు. కానీ అది సాధించడం కూడా కష్టమైన పనే కదా ! యేవో అడ్డంకులు ఉంటాయి.   


 

అమెరికా లో అట్లాంటా నగరంలో కూర్చుని పక్కన మనుమరాలు నన్ను ఆనుకుని ఐపాడ్ లో రైమ్స్ చూస్తూ నవ్వుకుంటుంది. నేను నా ఊరి స్పర్శ ఊహలో మునిగి తేలియాడుతూ యిదంతా రాసుకుంటున్నాను. 


నేను నాన్న పోలిక. నాన్న తాతయ్య నాయనమ్మ లు కలగలిసిన పోలిక.. ఒంటి రంగు కాళ్ళు చేతులు శారీరక సౌష్టవం అంతా నాయనమ్మ లాగా వుంటూ ముఖం తాతయ్య పోలికలు. నేను పూర్తిగా మా నాన్న పోలిక. మా నాయనమ్మ పోలికలు రాలేదు కానీ శరీరతత్వం గుండ్రటి ముంజేతులు పొడవు పొట్టి కాని చేతివేళ్ళు పాదాలు మెత్తని శరీరం తీరు వచ్చింది. మా అన్నయ్య అంతా మా తాతయ్య పోలికలు. ఇక నా కొడుకు కి నా పోలికలు వచ్చాయి. కాళ్ళు చేతులు వాళ్ళ నాన్న నాన్నవి అంటే మా మామ గారి జీన్స్ వచ్చాయి. ఇక నా మనుమరాలికి అంతా తండ్రి నానమ్మ పోలికలు. కాళ్ళు చేతులు మాత్రం వాళ్ళ నాన్న నాన్న వి. కాళ్ళు చేతులు కాలి పిక్కలు నడక అంతా నా మనుమరాలికి వాళ్ళ తాత పోలికలు. మా అందరి బ్లడ్ గ్రూఫ్ లు అంటే నాన్న అన్నయ్య నేను నా కొడుకు మనుమరాలు నా చెల్లెలు అందరివీ వొకటే బ్లడ్ గ్రూఫ్ లు. మా పెద పెదనాన్న కూతురు అక్క అంతా నాయనమ్మ పోలిక లే. మా రెండవ పెద నాన్న కొడుకు అన్నయ్య అచ్చం తాతయ్య పోలికే.. వాళ్ళ అబ్బాయి నా మేనల్లుడు కూడా తాతయ్య పోలిక. ఇక అన్నయ్య కూతురు కూడా అన్నయ్య పోలిక.


ఇవన్నీ సరిచూసుకుంటూ.. పెద్దలను జ్ఞాపకం చేసుకుంటుంటే యెంతో బావుంటుంది. నా మనురాలిని తీసుకుని మా ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు వుండాలని మా నాన్న యెత్తుకుని వుండగా ఫోటో తీసి భద్ర పరచాలని నా కోరిక. ఇవి నా మూలాలు అని నా మనుమరాలు చూసుకోవడానికి గుర్తులు వుంచాలి. ఎక్కడ పుట్టాము యెక్కడ పెరిగాము మన మూలాలు యెక్కడ అన్నది పిల్లలకు తెలిసి వుండాలి. ఆ ప్రదేశాలతో మనుషులతో అనుబంధం వుండాలి. వీలైనంత అనుబంధాలు కాపాడుకోవాలి. యివ్వన్నీ మనిషికి కనీస ధర్మం. స్వభావాలు గుణాలు అలవాట్లు ఆస్తిపాస్తులు ఉత్థానపతనాలు కష్టాలు సుఖాలు అన్నీ మారుతుంటాయి. కొత్తగా కొన్ని వస్తూ వుంటాయి పోతూ వుంటాయి. స్థిరంగా వుండేది వున్నంత వరకూ వుండేది మనది అన్న భావన మాత్రమే.. అదే మన ఊరు మన ఇల్లు. 


వృద్దాప్యాన్ని గౌరవించాలి. వారిని కూడా మన బిడ్డల లాగానే చూసుకోవాలి.  వారిని నిర్లక్ష్యం చేస్తే మనకంటూ పశ్చాత్తాపం మిగిలే వుంటుంది. కృతజ్ఞత మరిచిన జాతి అవుతుంది అని మా ముందు తరం వాళ్ళను చూసి మేము నేర్చుకున్నాం.



ఎప్పుడో నాలుగు తరాల క్రితం గుంటూరు జిల్లా వెంకటపాలెం గ్రామం లో పుట్టి పెరిగిన మా ముత్తాత ను అదే యింటి పేరిట వున్న వెంకటపాలెం కోడలే అయిన కుంటముక్కల గ్రామం పాటిబండ్ల వారి ఆడపడుచు లంకా శేషమ్మ   దురదృష్టవశాత్తు  వెంట వెంటనే పుత్ర విహీన పతి విహీన గా మారి .. తన భర్త వారసులకు చెందిన తల్లి లేని బిడ్డను పెంచుకుంది. ఆ బిడ్డ పేరు లంకా రామచంద్రయ్య.  యుక్తవయస్సు వచ్చాక తన మేనకోడలు రత్తమ్మని యిచ్చి వివాహం చేసింది.వారి బిడ్డలు  పంచ పాండవుల్లాంటి ఐదుగురు అన్నదమ్ములు ఒక ఆడపడుచు.  నూట పాతిక యెకరాల భూమి. పెద్ద వ్యవసాయం. మా తాత తన పెద్ద కూతురికి శేషారత్నం అని తన నాయనమ్మ పేరును పెట్టుకుంటే.. మా పెదనాన్నలిద్దరూ తమ ఆడపిల్లలకు శేషు కుమారి అని మా చిన్న మేనత్త తన కూతురికి కూడా శేషు కుమారి అని పేరు పెట్టుకున్నారు. తమ వంశ అభివృద్ధికి మూలమైన ఆ పెంపుడుతల్లి మాతృహృదయానికి ప్రణమిల్లి కృతజ్ఞతగా గౌరవంగా ఆమె పేరును తమ బిడ్డకు.. బిడ్డల బిడ్డలకు పెట్టుకున్న సంస్కారమైంతమైన  భక్తి కల్గిన కుటుంబం మాది. 


అలెక్స్ హేలీ..దక్షిణ ఆఫ్రికా నుండి తన పూర్వీకుడైన యువకుడిని బలవంతంగా   యెత్తుకొచ్చి బానిసగా మార్చితే ఏడు తరాల్లో ఆరుతరాలు బానిసలుగా హీనంగా బ్రతికినట్లు గుర్తిస్తాడు. తమ వారిని వెతుక్కుంటూ  వెళ్లి వారిని గుర్తించుకుంటూ ఎట్టకేలకు  తమ  మూలాలను కనుగొంటాడు. ఆ చరిత్రను అక్షరబద్ధం చేసి  “రూట్స్” అనే నవలను రాసుకున్నట్టు నేను కూడా నా మూలాలను తెలుసుకుంటూ.. నేనంటే ఇది..ఇదిగో.. నా మూలం యిక్కడ వుంది కదా! నా జేజి తాత ముత్తాత తాతలు తండ్రులు యిలా జీవనం గడిపారు. ఇంత ఉదాత్త గుణాలతో కృషీవలులై సంస్కారవంతమైన జీవనం కొనసాగించారు. వారి గుణగణాల్లో సంస్కారంలో దాతృత్వంలో కష్టపడే తత్వంలో పట్టుదల లో నాకు కొంచెమైనా అబ్బి వుంటాయి అన్న భావన నాకు అంతర్లీనంగా బలంగా వుంది. వారిని స్మరించుకుంటూ.. నా మూలాలను అక్షరాలలో యిమిడ్చి యిలా భద్రపరచుకుంటున్నాను. ఎప్పుడైనా నేను వెనక్కి తిరిగి చూసుకోవడానికి స్మృతిపథంలో నాకంటూ మిగిలిన గొప్పదైన విలువైన విషయాలు ఇవి. మా వంశ వృక్షం రాయాలని ప్రయత్నిస్తున్నాను. 


నిజానికి ఇవన్నీతెలుసుకునే   ఆసక్తి పిల్లలకు  ఉంటాయా ?అని సందేహం కూడా!  నా బిడ్డ లేదా నా రక్త సంబంధీకులు వారి బిడ్డలు యివన్నీ ఓపిగ్గా చదువుతారని వారికి అంత ఆసక్తి వుందని కూడా నేననుకోను. కానీ యెందుకు రాసుకున్నాను అంటే.. ఏమో తెలియదు.నేను బ్లాగ్ లో చాలా రాసాను.కథలు కవిత్వం చాలా రాసాను.  కానీ నేను రాసిన రాతలన్నింటిలోకి నాకిష్టమైన రాత, ఆత్మ సంతృప్తి కల్గించిన రాత యిది. ఇంతకు ముందు నా బాల్యానికి సంబంధించిన టపా లలో కొన్ని విషయాలు పంచుకుని ఉంటాను. 


ఇంకా చాలా రాయాలి. మా నాయనమ్మ తాతయ్య గురించి చాలా రాయాలి . ఒక విధమైన బాధతో ఇప్పుడు రాయలేకపోయాను. మనసు బాగున్నాక రాస్తాను. ముఖ్యంగా ఎవరి గురించి చెడ్డగా వాస్తవంగా రాయాలని లేదు. ఇప్పుడు  బ్రతికి లేని మనుషుల గురించి అసలు రాయకూడదు. నాయనమ్మ కన్న సంతానంలో ఇద్దరు జీవించి వున్నారు. వారికి తల్లిదండ్రుల పట్ల ప్రేమ వుంది. కదిలిస్తే కన్నీరవుతారు. నేను ఇంకా లోతైన బాధలోకి వెళతాను. అందుకే చాలా రాయలేకపోయాను . 


మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి లాగా గొప్పలు చెప్పడం కాదు .. వారి జీవన విధానం మనసుల మంచితనం మనిషి తత్త్వం ఆనాటి సాంఘిక జీవన పరిస్థితులు ఇవన్నీ రాయాలి .. 


తప్పకుండా రాస్తాను .. కొంచెం సమయం తీసుకుని రాస్తాను.


కింద ఫోటో .. మా నాన్న గారు . గత సంవత్సరం అమెరికా కి వచ్చే ముందు మా ఇంటి ముందు నిలబెట్టి  ఫోటో తీశాను.






 


కామెంట్‌లు లేవు: