బాల్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బాల్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మే 2023, బుధవారం

మా ఊరు - మా ఇల్లు 7


మా ఊరు



మా ఇల్లు పశువుల శాల గడ్డివాము స్థలం వరకూ వీటన్నింటి పొడవునా  పడమట వైపు ప్రహరీ  వుండేది.  దక్షిణం వైపు అంతా పల్లం ఉత్తరం వైపు అసలు   స్థలం లేదు. తూర్పు ఓ పదడుగులు అదీ ఉమ్మడి దారి. మా చిన్న తాతగారికి ఉమ్మడి బావిలో నీరు తెచ్చుకోవడానికి గానూ  నడక హక్కులు వుండేవి. మాకు వారి ఇంటి ముందు నుండి వీధి లోకి రావడానికి నడక దారి వుండేది. మొట్టమొదటగా మా ఇంటి పరిసరాలు పరిశీలించిన వాస్తు సిద్ధాంతి దక్షిణం స్థలం ఎక్కువ వుండటం అదీ లోతుగా వుండటం వల్ల మీకు ఆర్ధిక నష్టాలు కలిసిరాకపోవడం లాంటివి చెప్పారనుకుంటా. ఇక మా వాళ్ళు ఆ సిద్ధాంతి చెప్పిన అన్ని సవరణలు చేయడానికి పూనుకున్నారు. 


ఇంటికి దక్షిణం వైపు వున్న పశువుల శాల స్థలం మధ్య  ప్రహరీ నిర్మించారు. పశువుల శాలకు గడ్డివాము వేసుకునే స్థలానికి మధ్య కూడా మరొక గోడ ఆరడుగుల యెత్తులో నిర్మించారు. కొంత మట్టి తోలి స్థలం యెత్తు పెంచారు. అప్పుడు ఆ పశువుల శాల చతురస్రాకారంగా అందంగా తయారైంది. ఆ స్థలంలో ఆగ్నేయ మూల స్నానాల గది కూడా నిర్మించారు. పశువుల శాల నుండి  ఉత్తరం వైపు ఇంటి  దక్షిణం గోడకు మధ్య నిర్మించిన గోడ కు మధ్య కొంత నైఋతి భాగం పెరిగిందని ఆ పెరిగిన స్థలం వాడకుండా పారు (పనికిరానిదని అర్ధం )  స్థలంగా విడగొట్టి మరొక చిన్న గోడ కట్టారు. అది వాడకూడదని ఎవరూ  నడవకూడదని అన్నారని అన్నయ్య నేను ఆ రెండుగోడల మధ్య మట్టి నింపి పూల మొక్కలు వేసాం. వంట ఇల్లు కూలగొట్టి ఆ స్థానం ఖాళీగా వదిలేసి దక్షిణం వైపున ఇంటి సరిహద్దుగా తాటాకు వంట ఇల్లు నిర్మించారు.


 ఇక మా నాయనమ్మ తాతయ్య లకు వొక్క గది మాత్రమే మిగిలింది. వంట చేయడానికి ఆరుబయట స్థలం. వర్షం వస్తే కట్టెలు తడిచి వంట చేసుకోవడానికి నానా ఇబ్బంది పడేది. పొగ వచ్చే కట్టెలు మండటానికి ఇనుప గొట్టంతో  ఊది ఊది దగ్గుతూ కళ్ళు తుడుచుకునే నానమ్మ రూపం గుర్తొస్తుందిపుడు. 🥲🥲 మా వంటిల్లు ను ఆనుకుని ఇటుకలతో ఆర్చి కట్టి.. అందులో పాటి మట్టి పోసి పశువుల ఎరువు పోసి మూడు రంగుల చామంతి మొక్కలు వేసాం. పారు స్థలంలో కాకర చెట్టు, కనకాంబరం మొక్కలు, బంతి మొక్కలు చిలక గోరింట మొక్కలు మందార బంగాళా బంతి (zinia) మొక్కలు వేసాము. అన్నయ్య నేను ఆ మొక్కలు చుట్టూ తెగ  తిరిగేవాళ్ళం. ఒకసారి ఏదో పువ్వు (గడ్డి పువ్వు కూడా కాదనుకుంటా) వున్న మొక్క వచ్చింది. దానికి పువ్వు కూడా వుంది. అది పీకేస్తాను అని నేను, వద్దు.. బాగుంది వుండనివ్వు అని అన్నయ్య. నేను వద్దు అన్నాక వుండనిచ్చే  రకాన్ని కాదు  కదా! ఆ పువ్వు వున్న చెట్టును మొదలంటా పీకి పడేసాను. అప్పుడు అన్నయ్య కోపంగా వచ్చి ఒక్క దెబ్బ కొట్టాడు. నేను ఏడుస్తుంటే.. పెరిగి పూలు పూస్తున్న మొక్కను ఎందుకు పీకావు? పిచ్చి మొక్కలు మంచి మొక్కలు అని వుండవు. ఎలా పెరిగేవాటిని అలా పెరగనివ్వాలి. నాశనం చేయకూడదు లాంటి హిత వాక్యాలు చెప్పిన గుర్తు. అప్పటి నుండి ప్రతి మొక్కను సునిశితంగా చూడటం అన్ని పూలను సమదృష్టితో చూడటం అలవడింది నాకు. ఇక సంక్రాంతి సమయం వచ్చేసరికి మా ఇంటి చుట్టూ పూలవనం తయారయ్యేది. ఒకసారి హైదరాబాద్ నుండి మా నాలుగో తాతయ్య కోడలు పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి వేణి అక్క వచ్చారు. మా ఇంటి చుట్టూ వేసిన మొక్కలు విరిసిన పూలు చూసి భలే ఆశ్చర్యపోయారు. అది బాగా జ్ఞాపకం వుంది. పొయ్యిలో బూడిద పోసేవాళ్ళం తాతయ్య సలహాతో.  అందువల్ల మొక్కలు బాగా పెరిగేవి.


మా నట్టింట్లో చిన్న రాతి రోలు  నేల మట్టానికి వుండేది. రైస్ మిల్లు రాని కాలం అది. వానా కాలంలో ఆరుబయట పనిచేయడానికి వీలవనప్పుడు ఆ రాతి రోలుపై రాతి కుంది వేసి రోకళ్ళతో జొన్నలు తొక్కేవారంట. వడ్లు, బియ్యం పిండి,అటుకులు  దంచేవారంట. ఇంకా తొక్కుడు లడ్డు కోసం నువ్వులు బెల్లం అన్నీ దంచేవాళ్ళం అని నానమ్మ చెప్పింది. అలాగే కొయ్య కుంది కూడా వుండేది. నల్లమద్ది రోకళ్ళు బరువుగా వుండేవి. వాటికి మందపాటి ఇనుప రేకుతో చేసిన పొన్నులు వుండేవి.  అలాగే కలవారి కోడళ్ళ రోకళ్ళకు ఇత్తడి రేకు పొన్నులు వుండటమే గొప్ప అనుకుంటే మా నాయనమ్మకు వాళ్ళ పుట్టింటి వారు వెండి పొన్ను వేయించిన రోకళ్ళను పంపించారంట. ఆ రోజుల్లో ఆడపిల్లకు కాపురానికి వచ్చేటప్పుడు ఇత్తడి  సామాను పందిరి నవ్వారు మంచం భోషాణం మైలుపెట్టే పెద్ద కుర్చీ డ్రాయర్ బల్ల తప్పకుండా పంపేవారంట. అవన్నీ నాయనమ్మకు ఇచ్చారు.  అత్తగారు కోడలికి వెండి బొట్టు పెట్టె పెడితే అల్లుడికి అత్తగారు వాచీ వెండి సబ్బు పెట్టె సైకిల్ పెట్టేవారంట. 


మా నాయనమ్మ పుట్టిల్లు విజయవాడ పక్కన నిడమానూరు. పరిటాల వారి ఆడపడుచు. మేనమామలు అయినంపూడి వారు. మా నాయనమ్మ వారి కూటస్థులు కొంతమంది పరిటాల వారు కనసానపల్లి వెళ్ళిపోయారంట. మా నాయనమ్మ కు పుట్టింటి వారు ఎకరంన్నర మాగాణి ఒంటినిండా బంగారం పెట్టి పంపారంట. అందులో కంటె అనే నగ నవరత్నాల హారం ప్రత్యేకంగా వుండేది అంట. ఆమెకు ఒక అక్క ఊర్లోనే మేనమామకు ఇచ్చారు. ఒక అన్నయ్య. కాలక్రమేణా నాయనమ్మ అన్నయ్య కోర్టు కేసులు మూలంగా ఆస్థి అంతా కోల్పోయారు అని ఆ కేసులకు మూలం మా పెద తాతయ్య అని ఆయన బావమరుదలకు మా తాతయ్య బావ మరిదికి మధ్యనే కేసు నడిచినట్లు చెప్పుకునేవారు. వారి అన్నల కోర్టు కేసులు వాజ్యాలు గురించి ఇక్కడ తోడికోడళ్ళు కూడా పోట్లాడుకునేవారంట. ఆ వాదనలో మా పెదనాయనమ్మ మా నాయనమ్మ మెడలో కంటె పట్టుకుని లాగేదట. ఆమె చాలా గడుసరి.ఆమె దూకుడు చూసి నాయనమ్మ ఆమె మెడలో కాసుల దండ పట్టుకునేది అంట. అలా వుండేవట తగువులు. ఈ విషయం మా పెద్దతాత కూతురు సావిత్రి అత్తయ్య నవ్వుతూ చెప్పేది.



మొత్తానికి కోర్టు తీర్పు వల్ల నాయనమ్మ అన్నయ్య ఆస్తులన్నీ కోల్ఫోతే  అన్నయ్యకు ముగ్గురు నలుగురు పిల్లలు వున్నారు ఎలా బతుకుతారు అని అక్క చెల్లెళ్ళు ఇద్దరూ పుట్టింటి వారిచ్చిన పొలం బంగారం అంతా అన్నకు ఇచ్చేసారంట. అదే కాకుండా మా తాతయ్య ఉమ్మడి కుటుంబంలో నుండి విడిపోయాక ఆ కుటుంబానికి పప్పులు ఉప్పులు మిరపకాయలు మామిడికాయలు ధాన్యం పచ్చళ్లు లాంటివన్నీ బండికి వేసి పంపేవారంట. ఆలితట్టు వారు ఆత్మబంధువులగుదురు. కొంపంతా దోచిపెడుతున్నారు అని తాతయ్య సోదరులు వారి భార్యలు అనుకునేవారట. మా తాతయ్య ది జాలి గుణం.

 తన కున్నదానిని ఎవరికైనా ఉదారంగా పంచిపెట్టేవాడంట. 


ఇక తాతయ్య నాయనమ్మ ను బాగా చూసుకునేవాడంట. ఒక్క తిట్టు తిట్టడం వినలేదు మేము అనేవారు మా బంధువులు. నేను విన్న హాస్య సంభాషణ ఇది..

మీ పుట్టింటి గొప్ప ఏముందిలే.. పెళ్ళికి మేము తెచ్చిచ్చిన చీర కట్టుకుని పీటల మీద కూర్చున్నావు అని నాయనమ్మతో హాస్యం ఆడేవాడు తాతయ్య. అయ్యో! అదో సంబడమా.. ఆ మాత్రం మా పుట్టింటి వాళ్ళకు లేకా..!? పెళ్ళికి అత్తగారు ప్రధానంలో పెట్టిన చీర కట్టుకోవడం ఆచారం కాబట్టి మీరు తెచ్చిన చీర కట్టుకున్నా.. అనేది మా నాయనమ్మ ఉడుక్కుంటూ. 


ఇలాంటి కబుర్లన్నీ నాయనమ్మ తాతయ్య తెల్లవారుఝామున లేచి ఏమీ తోచక గతాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పుకునేవారు. అవి అలా నేను విని జ్ఞాపకం పెట్టుకున్నవీనూ ఇవన్నీ. వారి ముచ్చట్లలో గాంధీ గారు నిడమానూరు పెనమలూరు రావడం రేడియో కి లైసెన్స్ తెచ్చుకోవడం లాంటి విషయాలు వుండేవి. మా తాతయ్య కబుర్ల లో వేట విషయాలు నాటకాల విషయాలు కూడా వుండేవి. ఇంకా ఎద్దులు ఏట్లో ఈదడం కూడా అబ్బురం అనిపించే విషయాలు. అవన్నీ తాతయ్య గురించి రాసేటప్పుడు చెబుతాను.



మా నాయనమ్మ కు పదకొండో ఏడు వచ్చాక పెళ్ళైంది అంట. మూడవ తరగతి వరకూ చదువుకుంది. కావ్యాలు చది వేది. భగవద్గీత తప్పు రాకుండా చదివేది.  1938 లో మా పెదనాన్న పుట్టాడంట. ఆయనకు 1957 లో పెళ్ళైంది. మా రెండవ పెదనాన్నకు కూడా అప్పుడే పెళ్ళి జరిగింది. 1963 లో అమ్మ నాన్నల పెళ్ళి. అందరికీ 20 ఏళ్ళు రాకముందే పెళ్ళి అవడం పెద్దల అజమాయిషీ లేకుండా  కొడుకులు వ్యవహారవేత్తలుగా మారడం వలనే మా కుటుంబం ఆర్ధికంగా పతనమైంది అనుకుంటానిపుడు. ఇద్దరు మేనత్తలు. ఒకామె మరణించింది మా ఇంటి వెనుక వారికే ఇచ్చారు.రెండో మేనత్తను దగ్గరలోనే ఇచ్చి వివాహం చేసారు. నాయనమ్మ తాతయ్య వారి భాద్యతలు చక్కగా పాటించారు. ఆస్తులు మాత్రమే సంపాదించలేదు. కొడుకులకు అది చిన్న చూపేమో మరి అనుకోవడానికీ లేదు. మా వాళ్లు ఆ తరహా కూడా కాదు.   


మా నాయనమ్మ వెంట వొకసారి ఆమె పుట్టింటికి వెళ్ళాను.  మా మామిడి తోటలో నుండి నడుచుకుంటూ  తోట వెనుక వాగులో దిగి నడుచుకుంటూ  పెద్ద వాగు వరకూ చేరి అక్కడ రోడ్డు ఎక్కి.. విజయవాడ బస్ ఎక్కి వెళ్ళడం నిడమానూరు వెళ్ళడం బాగా జ్ఞాపకం నాకు. అప్పుడు మా ఇద్దరి కాళ్ళకు చెప్పులు కూడా లేవు. కాళ్ళు కాలుతూ చిందులేసాను. మా నాయనమ్మతో నాకు అనుబంధం ఎక్కువ. చింత చిగురేసి పప్పు వండేది. వంకాయ చింత చిగురు కూర వండేది. ఉల్లిపాయ వేసి చింత చిగురు వేపుడు చేసేది. చిలకడ దుంపలు నివురులో మగ్గబెట్టి ఇచ్చేది. ఆమె ప్రేమకు  మరేది సాటిలేదు. ధనం లేకపోవడం సమస్య కాదు. ఉన్నదానిలో ప్రేమగా పిల్లలకు పెట్టేది. తాటాకు మంట లాంటి కోపం. ఎన్ని పొరపొచ్చాలు వచ్చినా  మాటపట్టింపులు లేకుండా అందరినీ కలుపుకుని పోవడం నోరార పలకరించడం మా నాయనమ్మ స్వభావం. ఒక కాలు వొంగేది కాదు కింద కూర్చోవడం కష్టం అయ్యేది.  ఒక చెక్క స్టూల్ మీద కూర్చుండేది. కింద కూర్చుంటే వొక కాలు ఆరజాపి కూర్చోవాల్సి వచ్చేది.


నాకు చిన్నప్పుడు బాగా జుట్టు ఎక్కువ. ఆ స్టూల్ మీద కూర్చుని తల మీద రసం పోసేది. తల యెల్లడానికి (మురికి విడవడానికి ) మూడు సార్లు రసం పోసేది.  నీ మనుమరాలికి నీ జుట్టు నీ కొడుకు జుట్టో వస్తే ఆరుసార్లు రుద్దే వాళ్ళేమో అని విసుక్కునేది అమ్మ. మా నాయనమ్మది నాన్నది ఉంగరాల జుట్టు. మా నాన్నకు తన మేనకోడలిని చేసుకోవాలని వుండేదట నాయనమ్మకు. ఆమె బంగారు బొమ్మలా వుంటుంది. నాన్న నలుపు. సరిగ్గా చదువు సంధ్యలు లేవని ఇవ్వన్నన్నారంట. ఎలాగైతేనేం పసిమిరంగు గల కోడలిని ధనవంతులింటి పెద్ద కూతురిని కోడలిగా తెచ్చికుంది నాయనమ్మ. అమ్మను అందరూ ఎర్ర కోడలా.. అని పిలిచేవారు అత్త వరుస అయ్యేవాళ్ళు అందరూనూ. నేను తొమ్మిదేళ్ళు వచ్చాకనే మా వూరు వచ్చాను. అంతకు ముందు అంతా అమ్మమ్మ వాళ్ళింట్లో పెరిగాను. అమ్మమ్మ వాళ్ళింటికి నానమ్మ వాళ్ళింటికి పూర్తీ వ్యతిరేకం. ఇక్కడ ఇల్లు వోట్టిపోయినట్టు వుండేది. అక్కడ పాడి పంట పొలాలు అంతా సంవృద్ది. నాయనమ్మ వెంట నేను హరికథా కాలక్షేపం కి వెళ్ళేదాన్ని. రోటి పచ్చడి చేసి రోట్లోనే అన్నం కలిపి ముద్దలు పెట్టేది. సంక్రాంతి వస్తే కోడిపందాలు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చేది. మట్టి అరుగులు అలికి బొటనవేలితో చుక్కలు పెట్టేది. ముగ్గులు వేసేది. కార్తీక స్నానాలు త్రిమూర్తి వ్రతం చేసేది. ఎదురుగా ఉండే మా తాతయ్య మేనమామ కొడుకు ఇంటికి వెళ్ళేది. మా తాతయ్య మేనమామ  కోడుకి కి తాతయ్య పిన్ని కూతురిని ఇచ్చారు.వారి మధ్య  బంధుత్వం అనుబంధం  బలంగా ఉండేది.ఆమె పేరు నాగరత్నమ్మ. ఆ మామ్మ కోడలు పుష్పవతి అత్తయ్య నాయనమ్మకు ప్రతిరోజూ కూరలు మజ్జిగ ,తినుబండారాలు, కూరగాయలు అన్నీ పంపేవారు. నాయనమ్మ వెళ్లకపోయినా సరే .. బుట్టలో పెట్టి పని ఆమెకు ఆమెకు ఇచ్చి పంపేవారు. వారి ఇల్లు చల్లగుండా.. అని మనఃస్పూర్తిగా అనుకుంటాను ఈ రోజుకి.  


నాయనమ్మ తాతయ్య ఆస్తులన్నీ కొడుకులకిచ్చేసి మనోవర్తి తీసుకుంటున్నారు కాబట్టి వారికి చేతినిండా డబ్బు వుండేది కాదు. మా పెదనాన్న లిద్దరూ సమయానికి వారికి ధాన్యం పంపేవారు కాదు. వారి భుక్తి కి కష్టం వచ్చింది. ఇక చిరుతిండ్లు ఎక్కడ? వారు స్వయంశక్తి తో వున్నప్పుడు దండిగా ఏమి తిన్నారో అదే వారికి దక్కింది. యాబై ల్లోకి వచ్చేసరికే దంత సిరి లేకుండా పోయింది. మా అమ్మ వారికి ఇవ్వాల్సింది యెంతో అంత పంట రాగానే వారికి పంపించేది. కానీ వారికి ఏమీ పెట్టేది కాదు అంటే కాదు కానీ మర్యాదకు పెట్టేది ధారాళంగా పెట్టేది కాదు. అది పిండివంటలైనా పాలైనా పెరుగైనా కూరలైనా మామిడి పండ్లైనా పచ్చళ్ళైనా సరే. నాయనమ్మ తాతయ్య నోరు కట్టుకునే బతికారు. అదే దుఃఖంగా వుంటుంది నాకు. మా నాన్నపై వున్న కోపం అంతా అత్తమామలపై చూపేది అమ్మ. ఒకోసారి వాళ్ళు కదిలితే తప్పు మెదిలితే తప్పు అన్నట్టు వుండేది. వాళ్ళ కు వాడుకోవడానికి నీళ్ళు కూడా పోయనిచ్చేది కాదు. నేను తిట్లు తిని అయినా వాళ్ళకు తొట్టినిండా నీళ్ళు  వొంపేదాన్ని. మా ఆర్ధికనష్టాలు కష్టాలు మొదలయ్యాక వారికి బాధలు మరింత ఎక్కువయ్యాయి. మానసికంగా నలిగిపోయారు.పెదవి విప్పి ఎవరికీ చెప్పుకునేవారు కాదు. దానికి తోడు మా మేనత్త భర్త ఆమెను విపరీతమైన హింస పెట్టి పుట్టింటికి పంపేశాడు. కూతురు జీవితం గురించి కొడుకులు ఆస్తులు పోగొట్టుకోవడం గురించి దిగులుగా ఉండేది. 


ఇంకా తాతయ్య వ్యక్తిత్వం గురించి మంచితనం గురించి రాయడం మొదలు పెట్టనే లేదు. ఆయన గురించి వినాలంటే ఇంకా జీవించి వున్న అన్నదమ్ముల పిల్ల నోట వినాల్సిందే .. అమ్మో ! మా బాబాయి ఎంత బంగారమో ..మా పెదనాన్న కు పిల్లలంటే ఎంత ప్రేమో ..అని అందుకుంటారు. నాన్న మేనత్త కాకుండా ఇంకా ఐదుగురు కజిన్స్ ఉన్నారు. వారిని కదిలిస్తే బోలెడు విషయాలు వరదలా చుట్టేస్తాయి. 


గతమెంతో ఘనకీర్తి అని నేను చెప్పుకోవడంలేదు … అందులో  మా పూర్వీకుల వెతలు కష్టం ఉన్నాయి. వాటిని దాటుకుంటూ కూడా వారు గొప్పగా బతికారు. .. 


ఇంకా ఉంది …నా మనుమరాలు నాయనమ్మా అని పిలిచినప్పుడల్లా.. నాకు మా నాయనమ్మ గుర్తుకొస్తుంది. ఆ జ్ఞాపకాలు  బరువైనవి. మా నాయనమ్మ తాతయ్యకు ప్రేమతో..




6, మే 2023, శనివారం

మా ఊరు -మా ఇల్లు 6

 మా తాతయ్య నాయనమ్మ down to earth మనస్తత్వం అని చెప్పాను కదా.. చాలా సాదాసీదాగా వుండేవారు. మా తాతయ్య సాయంత్రం వేళల్లో వీధి అరుగు మీద కాసేపు కూర్చుని వచ్చేవాడు. ఎప్పుడైనా గదిలోనే పడుకుని పడుకుని విసుగువచ్చి ఇంటిముందు వరండాలో గచ్చుమీద వాలు వసారా స్తంభానికి తల ఆన్చి తలగుడ్డ తలకింద పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని పడుకునే వాడు. నేలతల్లి వొడిలో యెక్కడ బడితే అక్కడ విశ్రమించిన అలవాటు అది. మా అమ్మకు నాన్నకు అది అభ్యంతరంగా తోచేది. మంచం వుందిగా అది వేసుకుని పడుకోవచ్చుగా కింద పడుకుంటే చూసినవాళ్ళు ఏమనుకుంటారు అని అజమాయిషీగా మాట్లాడేది. ఏమీ మాట్లాడేవాడు కాదు తాతయ్య.. కాసేపాగి నెమ్మదిగా లేచి వెళ్ళిపోయేవాడు. మా అమ్మ అరవడం చూసి మాకు చిరాకు వచ్చేది. 

పెద్దలు తాము కట్టిన ఇంట్లో తాము ఇష్టం వచ్చనట్లు కూర్చోవడానికి నిలబడటానికి పడుకోవడానికి అధికారం లేకుండా.. పిల్లలకు ఇచ్చేస్తే భర్త కి వచ్చిన ఆస్థి అనుభవించడానికి వచ్చిన భార్యలు అత్తమామలను రాచిరంపాన పెడతారు. పెత్తనం చేస్తారు.  ధనవంతుల కుటుంబం నుంచి వచ్చినవారైతే మరీనూ.. పాపం.. పెద్దల మనసు యెంత చిన్నబోతుందో కదా! 

ఇక్కడ ఒక మాట చెప్పదల్చుకున్నాను.. అందుకే ఇప్పటివారు ఒక విషయం గమనించాలి. ముసలితనంలో వుండటానికి ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాకనే పిల్లలకు ఆస్తులను పంచి ఇవ్వాలి. లేదా సంపాదించుకుని బ్రతకమని ఎడ తోలాలి. పశువులు పక్షులు అనుసరించే దారిని వదిలేసి  నా పిల్లలు వారి పిల్లలు అంటూ భ్రమత పెంచుకోవడం తర్వాత కుమిలి కుమిలి ఏడ్వడం పరిపాటి కాకూడదు. నేను ఎరిగినంత వరకూ పిల్లలు 90% మంది స్వార్ధం జీవలక్షణంగా వుంటున్నారు. ఎక్కడో కొంతమంది మంచివారు తల్లిదండ్రుల విలువ తెలిసినవారూనూ. 

మా నాయనమ్మ తాతయ్య వున్నదంతా పిల్లలకు అప్పజెప్పి మూగబాధ అనుభవించారు. అదే నా కళ్ళల్లో మనసులో మెదులుతూ వుంటుంది. 

ఉమ్మడి కుటుంబంలో వున్నప్పుడు మా తాతయ్య చేనుకు తీసుకువెళ్ళడానికి  జొన్న పిండి గండ్ర బియ్యంతో కలిపి సంకటి తయారు చేసేవాడంట. ఒక కుండలో సంకటి ఇంకో చిన్న కుండలో మజ్జిగ పండు మిరపతొక్కు ఇవన్నీ మోసుకుని వెళ్ళేవారంట. పాలేర్లు ఇంటివారు అనే బేధం లేకుండా అదే తినేవాళ్ళంట.  పిల్లాజెల్లాతో   దంపుడు వ్యవహారాలతో పాలు పితకటాలు మధ్య ఆడవాళ్ళకు పని చెప్పడం ఎందుకని తాతయ్య ఉలవలు వండుతూ ఆ పక్కనే పొయ్యి మీద సంకటి వండటం చేసేవారంట. ఉమ్మడి కాపురంలో ఇష్టం లేని మరదలు .. ఆ ఉడికే సంకటిలో కోడిపెంట తెచ్చివేయడం చూసారంట. అది కుమ్మరించి మళ్ళీ వండాడు అంట తప్ప తమ్ముడు భార్యను ఒక్క మాట కూడా అనలేదంట. ఆ మరదలే.. ఇంకో పిచ్చి చేష్టలు కూడా చేసేదట. పిల్లలు దొడ్డికి వెళితే  చేటతో అది తీసుకువచ్చి వాకిలి చిమ్మిన పాచిపోగులో పోసేదంట. రోజూ వాకిళ్ళు వూడ్చిన పాచిపోగును  వంట ఇంటి చెత్త  ఎత్తి దూరంగా వున్న పేడదిబ్బలో పోసేది తాతయ్యేనంట. ఒక ఆడమనిషి  ఇంటి పనులు చేయడానికి వుండేదంట. ఆమెను లోనికి రానీయకుండా ఏమీ అంటుకోనీయకుండా తను పనిచేయకుండా నానా ఇబ్బందులు పెట్టేదంట. ఆమె భర్త కూడా భార్య మాటను జవదాటకుండా పనులు చేయకుండా తప్పించుకు తిరిగేవాడంట. ధాన్యం కల్లంలో నూర్చే సమయానికి బళ్ళకెత్తే సమయానికి వచ్చి లెక్కలు వేసేవాడంట. మా తాతయ్య తమ్ముడిని మరదలను ఒక్క మాట కూడా అనేవాడు కాదని మా మేనత్త చెబుతుండేది. అందరూ ఇబ్బంది పెట్టినవారే! అయితే నేం.. అట్టాంటివాళ్ళే మీటలేసుకుని పోయారు. తెలివిగా సంపాదించుకుని పొలాలు కొనుక్కున్నారు. కూతురికి వొంటినిండా బంగారం దిగేసారు. అని ఉక్రోషంగా అనేది.  

ఇక మా మామిడితోట గురించి

మా ఇంటికి దగ్గరగా తూర్పు వైపు  మాగాణి పొలాలను దాటుకుని మా కంటి చూపు అనేంత సమీపంగా వాగు వొడ్డున మాకొక మామిడితోట వుండేది. చెట్లు కొంత తక్కువగా అప్పుడే వేసిన చిన్నమొక్కలతో బయలుగా వున్నట్టు వుండేది. మా పక్కనే చిన తాత గారి భాగం వుండేది. ఆ తోటలో బోరు సౌకర్యం వుండేది. ఎక్కువగా కూరగాయల తోట లేదా మల్బరీ సాగుచేసేవారు వారు. ఇక మా తోటలో పెద్దరసాల చెట్లు కలెక్టర్ కాయలు (తోతాపురి) బంగినపల్లి చెట్లు వుండేవి. 

పిందెలు పడి పప్పులో వేసుకునేంత సైజు కాయ అవుతుందనుకునే కాలానికి సుమారుగా శివరాత్రి వెళ్ళిన దగ్గర్నుండి మా తాతయ్య తోటకు వెళ్ళేవాడు.  ఇంట్లో ఒక ముద్ద తిని  గంజి మజ్దిగ కలిపిన అన్నం వున్న      చట్టినో తపేలా లాంటిదో ఉగ్గములో పెట్టుకుని మట్టి బుర్రకాయ నిండా మంచినీళ్ళు పోసుకుని కర్రకు ఆ రెండింటిని తగిలించుకుని చురచురమనే ఎదురు యెండకు మగాణి పొలాల మధ్య నడుచుకుంటా వెళ్ళేవాడు. పొలంలో పశువులు వెళ్ళే వీలుంటే వాటిని కూడా తోలుకుని వెళ్ళి సాయంత్రానికి తిరిగివచ్చేవాడు. ఉగాది వెళ్ళిన దగ్గర్నుండి  రాలిన మామిడికాయలు పప్పులోకి మామిడికాయలు తెచ్చేవాడు. ముంజెకాయలు ఈతకాయలు తెచ్చి పిల్లలకు ఇచ్చేవాడు. మామిడి పళ్ళు వచ్చే కాలంలో పెద్దరసాలు పండ్లు బంగినపల్లి పండ్లు భద్రంగా పైపంచెలో కట్టుకుని జాగ్రత్తగా తెచ్చేవాడు. ముందుగా మా చెల్లెలు కు తీపి కాయను తర్వాత అన్నయ్యకు ఆఖరిలో నాకు మా నాయనమ్మకు ఇచ్చేవాడు. నేను ఏది యిచ్చినా సంతోషంగా తీసుకునేదాన్ని. మామిడిపండ్లు అంటే నాకు అంత యిష్టం వుండేది కాదు. పెద్ద రసాలు కాయలతో యెండు వొరుగులు మాగాయ పచ్చడి వేసేవారు పులుపు యెక్కువ అని. బంగినపల్లి మామిడికాయలు అన్నయ్యకు యిష్టం.

 ఇలా తోట అమ్మకుండా మా ఇంటి వాడకానికి పంచడానికే సరిపోయేయి. ఎక్కువ కాయలు కావాలి అనుకున్నప్పుడు చిక్కం దోటీ పట్టుకుని నేనూ అన్నయ్య వెళ్ళేవాళ్ళం. తాతయ్య  చిక్కం దోటితో కాయలు కోసి చేతి సంచీ లో వేసి యిస్తే మోయగల్గినన్ని కాయలు తీసుకుని ఇంటికి చేరుకునే వారిమి. ఇంటి చాకలికి మంగలికి వతనుగా పనికి వచ్చేవారికి కాయలు పంచేవారు. మా నాయనమ్మ అమ్మ పందేరం అనే వాళ్ళు. కోసుకొచ్చి పండేస్తే పిల్లలు తినరా అనేవాళ్ళు. వేసవి సెలవులు వస్తే పొద్దున్నే అన్నం తిని పిల్లలందరం తోట దగ్గరికి పరిగెత్తే వాళ్ళం. వాగులో ఇసుకతో ఆడుకోవడం చిట్టీత పొదల్లో నల్లగా పండిన కాయల కోసం వెతకడం సీమతుమ్మ కాయలు కోసుకోవడం చెట్లెక్కడం అక్కడ నుండి పెద్ద వాగుకు పరుగులు దీయడం. ఒకోసారి ఆ వాగులో నీళ్ళు పారుతూ వుండేది. అక్కడే చెలమలు తవ్వడం గవ్వలు ఏరడం గచ్చకాయలు ఏరడం పిచ్చుక గూళ్ళు కట్టడం కాశీ పుల్ల ఆట ఆడటం.. సెలవలు యెంత త్వరగా అయిపోయాయో అనిపించేది. 

మా నాన్న లారీ రిపేరులకు అప్పు తెస్తే అది వడ్డీతో సహా తీర్చడానికి ఆ పొలం అమ్మి అప్పులు తీర్చారు. 1983 లో ఆ మామిడితోట యెకరం ఎనిమిది వేలు లెక్కన అమ్మినట్టు గుర్తు. అలా మా ఊరిలో మామిడి తోటకు కాలం చెల్లిపోయింది. నా బాల్యం జ్ఞాపకాలలో ఆ మామిడితోట ది అగ్రతాంబూలం. 2014 లో నేను ఆ భూమి కొందామని ప్రయత్నం చేస్తే ఎకరం నలభై లక్షలు చెప్పారు. అదే కాలంలో విజయవాడ  నిడమానూరు పక్కన గూడవల్లి లో  ఎకరం 46 లక్షలకు లభ్యం అవుతుంటే.. ఆ భూమి ని కొనడానికి వెనుకాడాను. ఇప్పటికీ ఆ భూమి అమ్ముతారా? రేటెంత అని ఆరా తీస్తాను. వాళ్ళు అమ్మరంట అని చెబుతారు. ఆ తోట ఇసుకతో కూడిన నల్లరేగడి నేల. కూరగాయలు మల్బరీ అరటి మొక్కజొన్న మామిడి జామ అన్నీ వేయడానికి అనువైన భూమి. తాతముత్తాల ఆస్థి అది. మళ్ళీ మాలో ఎవరైనా కొనుక్కొంటే బాగుండును అని ఏదో ఆశ భ్రమత. మా అక్కచెల్లెళ్ళ మగపిల్లలకు మార్కెట్ వాల్యూ పెరిగే రోడ్డు పక్కన భూములు కొనాలనే ఆసక్తి. మా మాట పడనివ్వరు. మాకేమో ఏదో ఆశ. మన పూర్వీకులు నడయాడిన నేల చేను ఇల్లు అనే సెంటిమెంట్ వుంటుంది కదా.. అది నాకు మరీ యెక్కువ. పుట్టింటి ధనంగా మా నాన్న వైపు నుండి నాకు సెంటు భూమి కూడా రాలేదు. అయినా మా ఊరు మా ఇల్లు అనేది నాకు ప్రపంచంలో వున్న అన్నింటికన్నా విలువైనది. అసలు నాకే కాదు ఆడపిల్లలందరికీ ఈ భావన వుంటుందేమో! ఆడపిల్లలకు అరకొర యిచ్చి పుత్ర సంతానానికి ఆస్తులకు వారసులను చేయడం తరతరాల ఆనవాయితీ. కానీ ఆడపిల్లలకూ మనసు వుంటుందే! 

భూమి నాది అన్న వాడిని చూసి భూమి ఫక్కున నవ్వింది అంట. ఇప్పుడు  అది నిజం కదా అనుకోవడమే మిగిలింది. 

ఈ మధ్య గూగుల్ యెర్త్ మేప్ లో మా ఊరు మా పొలం ని చూసుకుని వచ్చాను. ఆ జ్ఞాపకాల స్రవంతిలో.. 

ఈ కింది  Map లో  పసుపు గీతల మధ్య మార్క్ చేసి వున్నదే మా మామిడితోట. ఇప్పుడు ఖాళీ భూమి గా వుంది. ఆ భూమి కి ఆనుకుని తూర్పుగా వున్నది వాగు. కట్టువకాలువ అంటారు. ఆ వాగులో దిగి ఉత్తరం వైపు నడిస్తే పెద్ద వాగు వస్తుంది. అక్కడే మా  బాల్యపు ఆటలు. ఆ పెద్ద వాగు ఆనుకుని విజయవాడ కు వెళ్ళే రోడ్డు. భీమవరప్పాడు. ఆ గ్రామమే విప్లవ రచయిత శివసాగర్ ఊరు. ఆ పైన కనబడేది శోభన్ బాబు స్వగ్రామం చిన నందిగామ. ఆయన మా ఊరిలోనే  మాతామహుల ఇంట పుట్టాడు. (కుంటముక్కల)



4, మే 2023, గురువారం

మా ఊరు మా ఇల్లు 5


నా జ్ఞాపకాలు వరుస క్రమంలో వుండక పోవచ్చు. ఎప్పుడు యేది గుర్తుకు వస్తే అది రాసుకుంటూ వస్తున్నాను.. గమనించగలరు. 

మా ఊరి కి తూర్పు పక్కన పడమట పక్కన కూడా మూడు కిలోమీటర్ల దూరంలో కనుమలు వున్నాయి. ఆ అడవి అంచు దాకా మామిడి తోటలు వుంటాయి. మా వాళ్ళందరూ గట్టుకాడ తోటలు అనేవారు. ఈ పొలాలన్నీ గరపనేలలు. నీటి వసతి వుండాలే కానీ బంగారం పండుతుంది అని నానుడి.. ఇంకోపక్క బాడవ పొలం అని అనేవాళ్ళు. నల్లమట్టిలో ఇసుక కలిపిన నేలలు. ఇంకా పాటినేలలు, మాగాణి పొలం నల్లరేగడి నేలలు వుంటాయి. ఎక్కువగా తొలకరికి కంది వేసేవాళ్ళు. కందిలో అంతర పంటగా పెసర కానీ జనుము కానీ వేసేవారు. మిరప తోటలు కూడా వుండేవి కానీ తక్కువ. మాగాణిలో ఒక పంట వరి వేసేవారు. అది అయిపోయిన తర్వాత ఆరుతడి పంటలు మినుము పెసర పిల్లి పసర ధనియాలు వేసేవారు. ఒకొకరు పైరు శెనగ కూడా వేసేవారు. వర్షాధారం పంటలే ఎక్కువ. వర్షాలు కురిసి చెరువులు నిండితేనే వరి పండేది. అందుకని ధాన్యం మళ్ళీ పంట చేతికి వచ్చేదాకా ఎవరూ అమ్మేవారు కాదు. ఇంటి ముందు కొంచెం మిట్ట లాగా ఎత్తు గా మట్టిపోసి వడ్ల పురి కట్టే వారు. ఆ పురి చుట్టూ వర్షం నీరు నిల్వకుండా నాప బండలు వేయడమో సిమెంట్ దిమ్మ కట్టడమా చేసేవారు. వరి బస్తాల్లో వేసి గడమంచి మీద వేసి వుంచితే వడ్ల చిలకలు వచ్చేయి. ధాన్యం పొట్టు మాత్రమే వుండేదట ఆరుబయట అలా వేస్తే! కొంతమంది వడ్ల ను పాతర వేసి  నెలల పాటు మగ్గబెట్టేవారు. రుచి పెరిగి ఆరోగ్యం బాగుంటుంది అని. 

వర్షాలు కురవకపోతే కప్పలకు పెళ్ళిచేసేవారు. దున్నపోతును బలి ఇచ్చేవారు గంగానమ్మ కు. అదొక భయకంపితమైన జ్ఞాపకం. వేపమండలు పట్టుకుని కల్లు సేవించిన మనుషులు డప్పు మోతకు లయబద్దంగా.. అలుపన్నది లేకుండా ఊగుతూ వుండేవారు. ఇంటింటి వారు వీథిలో వెళుతున్న ఊరేగింపుకి బిందెలతో ఎదురు వెళ్ళి పసుపు నీళ్ళ వార పోసి హారతిచ్చేవాళ్ళు. ఎక్కువగా ఆ కార్యక్రమం ఆదివారం వుండేది. అంతకుముందు రోజు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని అలికి ముగ్గు పెట్టిన పొయ్యి పై నిండుకుండ అన్నం వండి ఆ అన్నం వేడిగా వున్నప్పుడే పాలుపోసి తోడు పెట్టేవారు. దానిని సద్దెపారం అనేవారు. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పసుపు కుంకుమలు పూలు కొబ్బరికాయ తీసుకెళ్లి పూజ చేసి సద్దేపారంని గంగానమ్మకు సమర్పించే వారు. అది అయినాక మూడు ప్రదక్షిణలు చేసిన నూటొనిమిది బిందెల నీటితో అమ్మ వారికి అభిషేకం చేసేవారు.అదలా సాగుతుండగానే ఊరి చివర నుండి ఊరేగింపు మొదలయ్యేది. అలంకరించిన దున్నపోతును లాక్కుంటూ. రెండు కప్పలను కావడికుండల్లో అటొకదానిని ఇటొకదానిని పెట్టుకుని నడక సాగిస్తూ వచ్చేవారు. ఊళ్ళో మగవాళ్ళంతా తప్పనిసరిగా పాల్గొనేవాళ్ళు. మా ఇల్లు గంగానమ్మ గుడికి దగ్గరగానే వుండేది కాబట్టి… ఆ కాస్త దూరం ఊరేగింపు వెంట నేను వుండేదాన్ని అదీ ముందు భాగంలో సాగుతూ.. అంతే బాగానే వుండేది. దున్నపోతును బలి యిచ్చే సమయానికి ఇంటికి పరార్. కొద్దిరోజులు బలి యిచ్చిన జంతువుల అరుపులు రక్తం భయంతో వణికించేవి. ఒళ్ళు జలదరిచ్చితేనే జీవాన్ని తెగకోసేవారు. ఆ సమయానికి గణాచారికో ఇంకెవరికో (మొత్తానికి స్త్రీలకు మాత్రమే) గ్రామదేవత ఒంటి మీదకు వచ్చేది. ఎక్కువసార్లు రెండు మూడు రోజుల్లో వాన పడేది. వరుణుడి దీవెన బట్టి పంటలు. మా నాయనమ్మ అనేది “జలదీవెన లేకపోతే జనులకు కడగండ్లు అని” .

ఆ రోజుల్లో పంటలు పండకపోయినా జాగ్రత్తగా దాచుకున్న ఆహార ధాన్యంతో మప్పితంగా రోజులు వెళ్ళమార్చేవారు. ఆ రోజుల్లో జీవనం సాఫీగా జరగడానికి కారణం చదువుల ఖర్చులు గొంతెమ్మ కోరికలు లేకపోవడం అనిపిస్తూంది. మిశ్రమ వ్యవసాయ పద్దతిలో ఏదో ఒక పంట రైతును తిండిగింజలకు సరిపడనంతగానైనా ఆదుకునేది. వారి ముందుచూపులో పశువుల గ్రాసం కూడా వుండేది. జనుము వేసేవారు. పూతదశలో వుండగానే కోసి యెండబెట్టి గడ్డి వాముల్లో రొండొంచెల పద్దతిలో భద్రం చేసేవారు. 

ప్రతి ఊరికి  రైతుకు తాటితోపు తప్పనిసరిగా వుండేది. చేల సరిహద్దుల మధ్య తాటి చెట్లు నాటేవారు. మగ తాటి చెట్లను పోతు తాళ్ళు అని పెంటి తాళ్ళు అని అనేవారు. పోతు తాళ్ళు నుండి కల్లు తీసేవారు. పోతు తాడి మువ్వలో నుండి గెలలు వచ్చేయి. వాటిని గులకచళ్ళు అనేవారు. కల్లు గీసే వాళ్ళు ఆ గులక చళ్ళును కొట్టి వేసి (45 డిగ్రీలలో అని గుర్తు) దానికి కల్లు ముంతను బిగించేవారు. ఆ గులకచళ్ళను పొయ్యిలో పెడితే చిటపట రవ్వలు రువ్వేవి. ఆ పూల గరుకు పొడిని దీపావళి పండగకు కాల్చే మతాబులు పూల పొట్లాలు చుట్టేటప్పుడు ఆ మందులో కలిపేవాళ్ళు. ఇసుకపొలాల్లో ఎర్ర రేగడి పొలాల్లో తాటి చెట్ల దగ్గర ఎక్కువగా తేళ్ళు వుండేవి. ఆ తేళ్ళు కూడా యెర్రగానే వుండేవి. తాటి తోపుల్ల వల్ల రైతుకు ఆదాయం వుండేది. తాటి దూలాలు వెదురుకర్రతో వేసిన చావిడి వుండేది.  బెంగుళూరు పెంకు ఇళ్లకు తాటి బద్దెలు వేసేవారు. అలాగే పొలాల మధ్య కాలువలు దాటడానికి తాటి బద్దెలు వేసేవారు. నేల  బావి మీద తాటి బొత్తాం వేసి వుండేది. తాటి కల్లు తాటి ముంజెలు తాటిపండ్లు తేగలు తాటి ఆకులు తాటినార తాటి చీపుర్లు ఎన్నెన్ని ప్రయోజనాలని. 

మా ఆరెకరాల మామిడితోట చుట్టూ మూడు పక్కల తాటి చెట్లు వుండేవి. ఒక పక్క వాగు వుండేది. ఆ వాగు పక్క జీడిమామిడి చెట్లు వుండేవి. ప్రతి ఏటా వేసవి ప్రారంభంలో గుత్తానికి తాటియాకు అమ్మేవారు. అందుకుగాను కొంత ఆదాయం వచ్చేది. ఒక సంవత్సరం అలా తాటియాకు అమ్మిన డబ్బుతో మా అమ్మ నాకు పది చిన్నాలుతో ఒక జత పోగులు చేయించింది. (బంగారం ని కాసులు చిన్నాలు తో తూకం వేయించేవారు అప్పుడు. కాసు అంటే 8 గ్రాములు. 21 చిన్నాలు అయితే ఒక కాసు) అందుకే ఇప్పటి రైతాంగం కూడా తాటిచెట్లు పెంచడంలో శ్రద్ద చూపితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. తాటిచెట్లు చాలా ఆలస్యంగా పెరుగుతాయి. కానీ ఒక పది పన్నెండు ఏళ్ళ తర్వాత ఇచ్చే ఫలితాలు ఒక యాభై ఏళ్ళ వరకూ ఢోకా వుండదు అని చెప్పవచ్చు. చెట్లు నాటేది ఒకరైనా ఫలితాలు భావితరాలవి. 

ఇంకో విషయం గుర్తుకు వచ్చింది నాకు.. బావి మీద వేసిన దాన్ని తాగాడి అనేవారు. మా బావిపై వేసిన బొత్తం ఊలిపోయినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. తాతల కాలం నాటి ఉమ్మడి బావి అది. అందరూ ఎవరికి వారు వారి ఆవరణలో బావి తవ్వించుకుంటే మాకు మాత్రం తూర్పున స్థలం లేక బావి తవ్వడానికి వాస్తు కుదిరేది కాదని అనేవారు. అందుకనే తప్పనిసరిగా ఆ  ఉమ్మడి బావినీళ్ళే మాకు ఆధారం. బావి గట్టు పై ఒక కాలు తాటి బొత్తాం పై ఒక కాలు వేసి వంగి కడవలతో నీళ్ళు తోడేవారు. మా ఇంటి వాడుకకు ఉదయాన్నే 13 నుండి 15 జోళ్ళు నీళ్ళు పట్టేవి. (జోళ్ళు బహువచనం. జోడు అంటే రెండు చేతుల్లో రెండు కడవలతో తెచ్చే నీరు. ఒక్కో కడవ పాతిక లీటర్ల వరకూ నీరు పట్టేది. ఇత్తడి అల్యూమినియం కడవలు వుండేవి. పూర్వం అంతా మట్టి కడవలు.) 

ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని పశువుల కొట్టం శుభ్రం చేయడం నీళ్ళు నింపడం నా వంతు పని. రాతిగాబు శుభ్రంగా కడిగి దానిని నింపుతూ వుండేదాన్ని. పశువులకు చిన్న తొట్టిలో నీళ్ళు నింపడం స్నానాల దొడ్డిలో నీళ్ళు నింపడం అయ్యేటప్పటికి వొళ్ళంతా చెమటలు ధారలు కట్టేవి. ఎండా కాలంలో ముప్పై అడుగుల లోతులో నీళ్ళు వుంటే వానాకాలం పది అడుగుల లోతులో తొణికిసలాడుతూ వుండేవి నీళ్ళు. మా నీళ్ళబావి వొక పక్క కూలిపోతూ భయం కల్గించేది. (అంటే రాతిగోడతో నిర్మించిన బావి అది. ఒక పక్క రాళ్ళు కూలిపోయి మిగతా భాగం కూడా ఎప్పుడో వొకప్పుడు కూలిపోతుంది అన్నట్టు భయపెట్టేది) దానికి తోడు ఊలిపోయిన తాటి బొండు కూడా ఇరిగి బావిలో పడుద్దేమో అన్న భయంతోనే నీళ్ళు తోడేదాన్ని. అలా ఏడెనిమిది ఏళ్ళు నీళ్లు తోడాను మోసాను. మా బావి నల్లని  నీళ్ళతో కళకళలాడుతూ బహు ఆకర్షణీయంగా కనబడేది. కొబ్బరి తాడు తో అన్ని నీళ్ళు తోడేసరికి అరచేతులు ఎర్రగా కందిపోయేయి. (కొబ్బరిపీచుతో పేనిన తాడు) 

నాకు ఊహ తెలిసేసరికే మాకు నాగలితో వ్యవసాయం చేయడం మరుగునపడింది. మా ఊర్లో టాక్టర్ వుండేది. దుక్కి దున్నడానికి టాక్టర్ వచ్చేది. మా నాన్న వ్యవసాయం చేయడానికి వొళ్ళు వొంగేది కాదు అనుకుంటా. మా నాన్న కాలక్షేపంగా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుని మా నాన్న వయస్సు వున్న స్నేహితుడు కాకర్ల రామారావు గారి ట్రాక్టర్ నడపడానికి వెళ్ళిపోయేవాడు. మా తాతయ్య మా వ్యవసాయం సంగతి చూసుకునేవారు. పశువులను చేనుకు తోలుకు వెళతం కాపు అయ్యేవరకూ మామిడి తోటకు కాపలాగా వుండటం చేసేవాడు. నాకు పదేళ్ళు వచ్చేసరికి ఇంట్లో పాలేరు ను పెట్టడం ఆపేసారు. పంటలు పండకపోవడం పశువులు తగ్గడం కారణం కావచ్చు. 

పంటభూమి అంటే రత్నగర్భ అనేవాడు తాతయ్య . ఆ భూమి ని సంపాదించడం కోసం నిలబెట్టడం కోసం యెంత కష్టపడి వుంటాడు ఆయన. ఉమ్మడి కుటుంబంలో కష్టజీవి ఆయన. ఆయన కళ్ళముందే భూమి అంతా అన్యాక్రాంతం అయితే యెంత బాధపడి వుంటాడో.. తల్చుకుంటేనే బాధగా వుంటుంది. నా దృష్టిలో పెద్దలు యిచ్చిన భూములను పోగొట్టుకోవడం నిలుపుకోవడానికి ఏ మాత్రం కష్టపడకపోవడం అన్నంత దురదృష్టకరమైన విషయం మరొకటి వుండదు. 

మా మేనత్త.. ఇలా అంటుంది.. ఏ వంశమైనా మూడు తరాలు దేదీప్యమానంగా వెలిగిపోతుంది అంట. నాలుగోతరం వచ్చేసరికి అష్టకష్టాలు పడి ఐదో తరం వచ్చేసరికి మళ్ళీ పుంజుకుని వైభవంగా వుంటారట. తల్లిదండ్రులు తాతలు ముత్తాతలు చేసిన కర్మఫలాలు వారసులు అనుభవించాలట అని చెబుతూ.. మా అమ్మ నాన్న లు ఏ పాపం యెరగరు. మంచిమనసు వున్నవాళ్ళు.అధర్మం యెరగని వాళ్ళు. ఒకరికి పెట్టడమే తప్ప ఇంకొకరి సొమ్ము చిల్లికాణీకి కూడా ఆశపడని వారు అని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటది. నాకేమో గుండె కన్ను తడైతది.. మనసులో వారిని తలుచుకుని దణ్ణం పెట్టుకుంటాను. 

మా తాతయ్య వాళ్ళు ఆయుకట్టు (కప్పం) పన్ను చెల్లించేవారంట. నిజాం నవాబు ల కాలంలో కొండపల్లి సంస్థానంలో  భాగంగా మా ఊరు వుండేదట.. ఆ విషయాలు మరొక భాగంలో..



9, ఏప్రిల్ 2023, ఆదివారం

మా ఊరు - మా ఇల్లు 4

 కలిమి నిలవదు లేమి మిగలదు

కలకాలం ఒక రీతి గడవదు

నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా

వాడిన బ్రతుకే పచ్చగిల్లదా

ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము.. 


రేడియో లో పాట వస్తుంది. నేను అప్పటికే ఏడ్చి వున్నాను.. ఏడుస్తూ వున్నాను. మనసు గాయపడింది. ఇస్తానన్నంత కట్నం ఇవ్వలేదని నగలు పెట్టలేదని అత్తగారి అమ్మగారు దెప్పుళ్ళు.మామగారి తిరస్కార దృక్కులు. భర్త గారి పదునైన మాటల గాయాలు. పోనీ వారికేమైనా మా కుటుంబం గురించి తెలియదా అంటే బాగా తెలుసు.దగ్గర బంధువులమే, అయినా మనిషి నైజం బయట పెట్టుకుంటారు. అంతే!


 అయినా యింటి కొచ్చే కోడలు తెచ్చే కట్నంపై మోజు. ఇవ్వలేదని కోపమో చులకన భావమో! పోనీ యిచ్చిన పొలంపై రాబడి అన్నా యిస్తారా అంటే అదీ లేదు. అల్లుడు కు భారీ మర్యాదలు జరుపుతారా అంటే అదీ లేదు.అదీ వాళ్ళ బాధ.


 పెళ్ళి చూపులకు వచ్చినప్పుడు కట్నంగా మూడెకరాల మామిడి తోట పదివేలు రొక్కం నాలుగుజతల గాజులు పెడతామని వొప్పందం. తీరా పెళ్ళి తేదీ దగ్గర కొస్తుంటే డబ్బు సర్దుబాటు చేయలేక నగలు చేయించలేక వున్న నగలు బ్యాంక్ తాకట్టు నుండి బయట పడక నాలుగో ఎకరం పొలం నా పేరున రాసిచ్చి లగ్నం పెట్టించి పత్రిక తీసుకుని  మిఠాయిలు తీసుకుని ఇంటి చాకలిని వెంటబెట్టుకుని వెళ్ళాడు నా మేనమామ. వారు  అప్పటికప్పుడే మనుషులను  పురమాయించుకుని చీకటి పడే వేళకు పెళ్ళి కబురుతో పాటు మిఠాయిలూ  ఊరందరికి పంచి పెట్టుకున్నారు.  రాత్రి భోజనాల వేళ పిల్ల పేరున రాసిచ్చిన పొలం కాగితాలు పిల్లకు కాబోయే మామగారి చేతిలో పెట్టి అభ్యర్దించాడు పిల్ల మేనమామ. ఇబ్బందుల వల్ల రొక్కం బంగారం పెట్టలేకపోతున్నాం అని అందుకే నాలుగో ఎకరం పొలం రాసిచ్చామని.. ఆయన ఒక్క ఉదుటున లేచి ఈ పెళ్ళి జరగదు అనేసారు. మగ పెళ్ళి వారి ఇంటి వారందరికీ పెట్టిన బట్టలు మిగిలిన స్వీట్స్ తినుబండారాలతో పాటు అవమాన భారంతో    ముహూర్తం పెట్టుకున్న పెళ్ళి ఆగపోయిన బాధతో తెల్లవారి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు నా మేనమామ. 


పోన్లే! వాళ్ళు డబ్బులు మనుషులు. పెళ్ళి తప్పిపోవడమే మంచిదైంది అనుకుని వేరే సంబంధాలు చూడటం మొదలెట్టారు. నేను ఊ హూ అనడం మొదలెట్టాను. అంతా వాళ్ళ ఇష్టమేనా.. చూసి వెళతారు మళ్ళీ కట్నం సర్దుబాటు చేయలేదని వొద్దంటారు. నేనేమన్నా ఆట బొమ్మ నా.. చేసుకుంటే ఆ అబ్బాయి నే చూసుకుంటాను అన్నాను. 


ఇంట్లో వారి ఆలోచనలు వేరే!ఎంత తొందరగా పెళ్ళి చేసేయాలా అని. పదిహేడేళ్ళు కూడా నిండని నేను ఇంటర్మీడియట్ తప్పి ఇంట్లో వారికి భారం అనిపించాను. వెనకాల యింకో ఆడపిల్ల వుంది. ఒక్కగానొక్క మగపిల్లాడు చదువు ఆపేసి మూడొందల రూపాయల జీతానికి కాంట్రాక్ట్ పనుల దగ్గర ఉద్యోగంలో చేరాడు. ఇంటికి వచ్చి పడే అప్పుల వాళ్ళు, కలిగే అవమానాలు. నాన్న వ్యాపారానికి అమ్మకు కట్నం యిచ్చిన పొలం అమ్మి యిమ్మని నాన్న వొత్తిడి కోపాలు తిట్లు. నిత్యం యింట్లో రాద్దాంతమే!  ససేమిరా అనే అమ్మమ్మ తాతయ్య మేనమామల పట్టుదల. ఉన్నదంతా అయిపోయింది. అక్కడ ఇంకో మూడెకరాలు వుందిగా అది అమ్ముకోండి అని. ఆడపిల్లలిద్దరికీ అమ్మ కు ఇచ్చిన ఆరెకరాలు పొలం చెరిసగం యిచ్చి పెళ్ళి చేసేద్దాం అని వారి ఆలోచన.ఆ చుట్టాలబ్బాయ్ కాకపోతే లోకం యేమన్నా గొడ్డుపోయిందా.. రాజమండ్రి పేపర్ మిల్లు లో అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు. జీతం మూడు వేలన్నర పైనే అంట. అబ్బాయి చక్కగా వుంటాడు. ఈడూ జోడు బాగుంటుంది.. అని మా పెద మేనమామ. నేను వొప్పుకోలేదు. 


మళ్ళీ సంవత్సరానికి  అనుకున్న కట్నం అనుకున్నట్టు ఇవ్వలేదని ఈ పెళ్ళి జరగదు అన్న యింటికే కోడలిగా వెళ్ళాను. పెళ్ళి చూపులు లో పెద్దవాళ్ళే నన్ను చూసారు. నేను పెద్దవాళ్ళనే చూసాను. పెళ్ళి కొడుకును చూడలేదు. మొండి పట్టు పట్టాను. అయినా  అలా పెళ్ళి యెలా క్యాన్సిల్ చేస్తారు మీరు?. ఇవతల ఆడపిల్ల మనసుతోటి ఆలోచనలతో మీకు సంబంధం లేదా.. అని రిజిష్టర్ పోస్ట్ లో ఉత్తరం రాసాను. ఆ ఉత్తరం మా మామ గారు చదివి కట్నం ప్రమేయం లేకుండా మా పెళ్ళికి వొప్పుకున్నారు  పదిహేడేళ్ళ వయస్సులో అలా వుండేది నా పట్టుదల. (మొదటి మరణం బీజం పడింది యిక్కడే)


పెళ్ళి తరువాత చాలా అవమానకర సన్నివేశాలు యెదురైనాయి. అప్పుడేమో కానీ.. తర్వాత తర్వాత మా అత్తమ్మ మామయ్య ధర్మబద్దంగా నిలబడ్డారు నాకు కొండంత అండ అయ్యారు కూడా!  


నా జన్మ నక్షత్రం లో మొదటి పద్దెనిమిది యేళ్ళు లేదా పందొమ్మిది యేళ్ళు శని వున్నాడు. అప్పుడే నీకు పెళ్ళైంది అనేది మా మేనత్త. శనీశ్వరుడు వెళుతూ ఈయన్ని యిచ్చి వెళ్ళాడు లే అనేదాన్ని నేను. 


పాపం! మా వారిది కూడా ఉదార స్వభావమే! జాలి గుణం కూడా!  ఆయన మనసులో మా పుట్టింటి నుండి ఏమీ తెచ్చుకోలేదని చిన్నచూపు వుండేది. వివిధ సందర్భాల్లో నా పొగరు ఆయన అహంకారాన్ని తట్టి రేపెట్టేది అనుకుంటాను. నన్ను బాధ పెట్టడానికి ఏదో వొకటి అనాలి కదా!


నీ పుట్టింటి వాళ్ళు గతి లేని వాళ్ళు అని పదే పదే అంటూ వుండేవారు. నా మనసు గాయపడేది. కళ్ళు కన్నీటి కుండలయ్యేయి. ఏడెనిమిదేళ్ళు కట్నంగా యిచ్చిన పొలం లో వచ్చే రాబడి కూడా యివ్వకపోతే అంటారు, యెందుకనరు అని పుట్టింటి వారిపై కోపం ముంచుకొచ్చేది.ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయేవి.


యేదో విధంగా జీవితం తెల్లారక మానుతుందా.. చెప్పండి. వొడ్డున పడ్డాను. తాతయ్య నాయనమ్మ జ్ఞాపకాల్లో భాగంగా మా ఇంటి ఆడపడుచుల వెతలను జ్ఞాపకం చేసుకున్నాను ఇవాళ. 


నాలుగు తరాల మా యింటి ఆడపడుచులు యెవరూ సుఖ జీవనానికి నోచుకోలేదు. మొదటి రెండు తరాల్లో మా పెద్ద మేనత్త ఆమె మేనత్త పచ్చగా పదికాలాలు బతికింది లేదు. అవమానంతో ఆత్మహత్య, అనారోగ్యం తో మానసిక వ్యథ తో మరణించడం. (నూతిలో గొంతుకలు కథలో మొదటి యిద్దరు స్త్రీలు వారే) ఇక మా ఇంకో మేనత్త పెళ్ళి కాక ముందు ఏం సుఖ పడిందో.. బతుకంతా కడగండ్ల మయం. ఇప్పటికీ వొంటరిగా బతుకు ఈదుతుంది. ఇక మా తరం ఆడపిల్లలు..నలుగురం. అందరిదీ పోరాట పథం. లంకా వారి ఆడపిల్లలు గట్టివాళ్ళు. అదరరు బెదరరూ.. మగ పిల్లలు మెతక కానీ ఆడపిల్లలు అలా కాదు అని అనిపించుకున్నాం. జీవితం యెన్ని సమస్యలను సవాల్ గా బహుమతిగా యిచ్చినా .. వాటిని యెదుర్కొన్నాం. బిడ్డలే ఊపిరిగా  కుటుంబమే ముఖ్యంగా నిలబడ్డాం, నిలబెట్టుకున్నాం. 


 మా నాన్న వారి సోదరులు సోదరి అందరూ ఆస్థిపాస్తులు పోగొట్టుకున్నారు. నిజాయితీ గా బతకడానికి అష్టకష్టాలు పడ్డారు. ఒకరికి ద్రోహం చేయలేదు.నేరాలు చేయలేదు. ఘోరాలు చేయలేదు. కాకపోతే ఆరంభశూరత్వం. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు (ఇంట్లో వారికి) మా ఇంటి ఆడపడుచులకు స్త్రీ ధనం యివ్వడంలో మర్యాదలు జరపడంలో కొంచెం నిర్లక్ష్యం వహించేవారు. దానికి తోడు కట్నం అనే దురాచారం వల్ల సమాజంలో తరతరాలుగా ఏ భావజాలాలు వర్ధిల్లుతున్నాయో.. అవి అన్ని కుటుంబాల్లో పీటముడులు వేసుకుని కూర్చుని వున్నాయి. అవి మా అత్త వారిళ్ళలోనూ మా ఇంటికి అల్లుళ్ళుగా  వచ్చిన వారిలో మెండుగా వున్నాయి. ఆ భావ జాలం మా ఆడపడుచులను చాలా బాధ పెట్టింది. ఇక ఇప్పటి తరం ఆడపిల్లలు వాటిని యెదుర్కోకుండా వుండాలని నేను కోరుకుంటున్నాను. నాల్గవ తరంలో ఇద్దరు ఆడపిల్లలు ఐదవ తరంలో ఇద్దరు ఆడపిల్లలు.. వున్నారు. 

 

ప్రస్తుతం ఎనభై సంవత్సరాల వయస్సు నుండి సంవత్సరం లోపు పసిపిల్ల వరకూ నాలుగు తరాల ఆడపిల్లలం వున్నాం. ఎవరైనా హోదాలతో డబ్బుతో యెకరాలతో మమ్మల్ని పోల్చి చూడాలనుకుంటే.. మేమందరం down to earth మనుషులం. దానికి మూలం మా తాతయ్య మా నాయనమ్మ… అని గర్వంగా చెప్పుకుంటాం.. .. 


మళ్ళీ.. మా తాతయ్య నాయనమ్మ గురించి.. 


మా తాతయ్య  ఎంత కష్టజీవి మంచి మనిషో.. మా తాతయ్యకు సహాయకుడుగా వున్న అప్పటి యువకుడు ఇప్పుడు మా నాన్నగారి వయస్సులో వున్నతను.. నాకు పాతికేళ్ళ క్రితం చెప్పిన విషయాలు నా మనస్సులో అలా ముద్రించుకు పోయాయి. ఏ వ్యక్తి గురించైనా వారి పిల్లలు బంధువులు చెప్పిన విషయాలకన్నా వారి కింద పనిపాటలు చేసిన మనిషి చెప్పిన మాటలు ప్రామాణికం అవుతాయి కదా.. 


******** 


మామిడి కోతలు పూర్తయ్యాయి. అర కొర కొస కాయలు వేలాడుతున్నాయి. పేడ దిబ్బ చేలల్లో తోలి అక్కడక్కడ కుప్పలు పోసి వుంది. ఒక సాలు దున్ని వదిలేసిన చేలల్లో మొలిచిన గడ్డి దుబ్బులు కట్టి ఎండలకి నిలువునా మాడిపోయి వుంది. తొలకరి వాన పడక ముందే ఇంకోసాలు దున్నితే బాగుండును రా.. కోటేశూ.. అన్నాడు చలమయ్య బబాయ్.

 

“పైన ఎండ చూస్తే మాడ్చేత్తందయ్యా.. నెర్రలిచ్చిన నేల కొండరాయల్లే గట్టిబడిపోయి వుంది. కిందపైనా కాల్తూ దుక్కి సాగదు,  నాలుగునాళ్ళు ఆగితే పోలా.”అన్నాను నేను.. 


“ఎద్దుల ఉసురు పోసుకోవడం నాకు మాత్రం యిష్టమా..  గరువు నేల వొకసాలు దున్ని వదిలేస్తే వాన కురిసినప్పుడు నేల నీళ్ళు యింకిచ్చుకుని తర్వాత దుక్కి కి అనువుగా వుంటది” అన్నాడు ఆయన.. 


“సరే అయ్యా.. మీరు యెట్టా అంటే అట్టా.. అన్ని జతలు కడదామంటారా.. మిగిలినోళ్ళని పిలవమంటారా.”. 


“రోజుకొక రెండు జతలు లెక్క  నాగలి కడదాం నువ్వు నేనూ నాగలి పడితే మిగతావాళ్ళు సరిహద్దుల్లో కంప నరికి యెండు కొమ్మలు యిరిసి చెట్ల మొదళ్ళ చుట్టూ పాదులు చేత్తారు. తర్వాత ఎరువు కుప్పలు చిమ్ముతారు”. 


“సరే నయ్యా.”. 


తొలి ఏకాదశి కి ముందే గరువు పొలం అంతా వొక సాలు దున్ని తొలకరి కోసం ఎదురుచూడటం.. పాలేరులు అందరూ మాగాణికి ఎరువు దిబ్బ తోలడం,విత్తనాలు వడ్లు మరొకసారి యెండబెట్టి బస్తాలకు యెత్తడం. అన్ని పనులు చలమయ్య బాబాయ్ పూనుకోవడం.


పెద్దాయన రోజూ వెల్లటూరు యెల్లి బెజవాడ బస్ యెక్కి కోర్టులు కాగితాల కోసం తిరగడం, మూడో ఆయన పనిలో వేలు బెట్టేవాడు కాదు. పైపైన తిరిగి నడి మంచం ఇరిగేదాకా పడుకునేవాడు. నాలుగో ఆయన అత్తగారి అండ చూసుకుని మిడిసిపడటం ఆస్తులను పెంచుకోవడం.. ఐదో ఆయన చదువు వ్యాపారాలు వెలగబెట్టడం తప్ప వొక్కరు పనిచేసే వారు కాదు. ఆ ముసలమ్మ గారు కూడా ఈ కొడుకునే పట్టుకుని యేలాడేది. పెద్ద కమతం అమ్మా.. మీ తాత వాళ్ళది. అని ఆపేసాడు.


ఇంకా చెప్పండి.. అంటూ ఉత్సాహం నాకు.



ఆ రోజు తొలి ఏకాదశి.వేగు చుక్క పొడిచేటప్పటికే..ఆ పశువుల చావిడి ముందు సందడి మొదలైంది. యజమానితో పాటు మేము ఆరుమంది పాలేరులు తయారుగా వున్నాం. ప్రతి నాగలికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. ఎద్దుల మెడపై కాడి పెట్టి ప్రతి జత ఎద్దుల జతలకు హారతి పట్టి బసవన్నను తలుచుకుని దణ్ణం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ఎద్దులకు బెల్లం వుండను తినిపిచ్చారు. నిలబడిన చోట నేలకు దణ్ణం పెట్టి ఆకాశం వైపు చూసి చేతులు జోడించారు.


రత్తమ్మ తల్లి సొరకాయ బుర్రల్లో నీళ్ళు చద్ది కూడు కుండ సర్ది తయారుగా పెట్టింది.. అవి భుజానికి తగిలించుకుని  నాగలిని భుజాన వేసుకుని కాడి పట్టిన ఎద్దుల్లో ఎలపటెద్దు ని యెహేయ్ అని అదిలించాడు చలమయ్య బాబాయ్.  భూమి పూజ చేయడానికి పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయలు పెట్టిన సంచీ ని పట్టుకుని ఎదురొచ్చింది ఆయన యిల్లాలు మాణిక్యమ్మ. ముందు చలమయ్య బాబాయ్ తర్వాత పాలేరులు వొకరి వెనుక వొకరు.. బాటలోకి వచ్చి ఊరికి ఉత్తరం వైపు బాటకు మళ్ళాం. ఎద్దుల మెడలో మువ్వల పట్టీల సవ్వడికి మామిడి చెట్ల పై వున్న కోయిలలు మేల్కొని కూత మొదలెట్టాయి. కాకులు మేల్కొన్నాయి. కోడిపుంజులు మాత్రం ఇంకా బద్దకం వదలనట్టు మెదలకుండా వుండాయి. ఆరు బయట పడుకొన్న మనుషులు ఎద్దుల మెడలోని మువ్వల చప్పుడుకు లేచి కూర్చున్నారు. అప్పుడే చుక్క పొడిచింది కాబోలు అనుకుంటూ. 


లంకోరి (లంకా వారి) అరకలు పొలానికి బయలెల్లాయి. అనుకుంటూ హడావిడి పడ్డారు. నోట్లో పదుంపుల్ల వేసుకుని రోడ్డు మీదకు వచ్చి ఆరాగా చూసేయి. చిమ్మ చీకట్లో తెల్లని ఎద్దుల జత మెడపై నాగళ్ళ తో యజమాని చలమయ్య. అతని వెనుక మరికొన్ని ఎద్దుల జతలు పాలేర్లు. దేశవాళీ ఎద్దులు మూడు జతలు, ఒంగోలు ఎద్దులు రెండు జతలు, ఆఖరున ఒక జత మైసూరు జత ఎద్దులు. చూడటానికి రెండు కళ్ళూ చాలవు. అనుకుంటూనే .. 


ఏమైనా లంకోరు వ్యవసాయం చేయడంలో దిట్టలు. ఊరు లెగవక ముందే లేచి పనుల్లోకి జొరబడతారు. ఊరు కాని ఊరు నుంచి వచ్చి ఊరు కే మొనగాడు దారు  సేద్యగాళ్ళు అయ్యారు.. అనుకునేవాళ్ళు.


“చలమయ్య అన్నయ్యా! మీరు అరకలు కట్టారంటే తొలి ఏకాశి వచ్చినట్టే, మాకెవరికీ అంత గుర్తు లేదే ఇయ్యాల ఏకాశి అని” అని పలకరించే వాళ్ళు. 


అవునంట, మా అన్నయ్య పంచాగం చూసి చెప్పాడు. మీరు కూడా మొదలెట్టండి మంచి ఘడియలు దాటకముందే” అనేవాడు చలమయ్య బాబాయ్.


“నువ్వొక్కడివే బయలెల్లావ్, మీ అన్నదమ్ములు రారా పొలానికి ఆరా తీసేవాడు” పుల్లలేసే గుణం వున్న ఆయన.. 


“ఎనకా ముందు వస్తారులే, చిన్నోళ్ళు  ఎండబడి లేస్తారు కదా”అని జవాబిచ్చి ఊరుకునేవాడు ఆయన.

 

 వెనుక నడుస్తున్న పాలేర్లు మనసులో అనుకునే వాళ్ళం “అన్నదమ్ములందరికీ పనికి వొంగాలంటే సా చేటు, తెగులు అనే మాటకు ముందు మోటు మాట  బూతు మాట చేర్చి. మరొకమాట అనుకునే వాళ్ళం. మా చలమయ్య బాబాయ్ ధర్మరాజు కష్టజీవి. ఆయన లేకపోతే యింత వ్యవసాయం ఆళ్ళ వల్ల అయ్యిద్దా..” అని. 


“చలమయ్య బాబాయ్.. అంత దూరం పొయ్యి చానా ఖరీదు పెట్టి మైసూరు జత ఎద్దులు తెచ్చినావు కదా.. అవి మన ఎద్దుల్లా అరక దున్నలేవు బండి లాగలేవు.. దండగ మారి పని కదా” అని అడిగాను. 


“చిన్న తమ్ముళ్ళు రంగయ్య రాఘవయ్య మైసూరు ఎద్దులు కావాలని ముచ్చటపడినారు లే కోటేశూ.. ఆళ్ళకు తగ్గ ఎడ్లు అయ్యి. చదువుకుంటూ వున్నారు. ఎక్కడో చూసారు.. మనక్కూడా వుండాలని అనుకున్నారు.అందుకే కొన్నాను లే.. అని జవాబు. 


ఎద్దులు కావాలంటే.. డబ్బు పట్టుకొని పోయి నెలా రెండ్నెల్లు తిరిగి కొనుకొచ్చేవారు. జత బాగుంటేనే కొనేవాడు ఆయన. దొడ్డో పుట్టినవి కాడికి సరిపోకపోతే ఆటిని అమ్మేసి కాడికి సరిపడా కొనేవాళ్ళు. ఆరు జతల ఎద్దులు ఆవులు పాడి గేదెలు ఎంత పెద్ద చావిడ అని. మీ నాయనమ్మ కూడా బాగా పనిచేసేది. రోజూ యాభై మంది చెయ్యి కడిగేవాళ్ళు. దాలి లో ఉలవలు వొక కుండలో ఉడుకుతా వుంటే పాలు వొక కుండలో కాగుతా వుండేవి.  ఏ వేళప్పుడు వెళ్ళినా అన్నం కుండ పొయ్యి మీద వేడిగా దించకుండా వుండేది. చలమయ్య బాబాయ్ ఆ ఇంటికి దాపటెద్దు అనుకో.. అంత పని భారం వుండేది ఆయన మీద. గొప్ప మనుషులు. నేను యిల్లు కట్టుకున్నప్పుడు శంకుస్థాపనకు ఆ భార్యభర్తలనే తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టిచ్చుకున్నాను. నాకు కొడుకు పుడితే.. వారి చేతే ఉయ్యాల లో బిడ్డ ను వేయించుకున్నాను. మంచి మనసు వున్నవాళ్ళమ్మా కల్లాకపటం తెలియదు పేద గొప్ప తేడా చూపించే వారు కాదు. ఆ రత్తమ్మ గారు కన్నబిడ్డల్లో గొప్ప మనసున్న బిడ్డ మీ తాతయ్య. ఎవరి గురించి చెడ్డగా మాట్లాడటం కానీ అబద్దాలు చెప్పడం గానీ ఆయనకు తెలీదమ్మా, ఆయన బిడ్డలే ఆయనను సరిగ్గా చూసుకోలేదు” అని చెపుతుండగానే అతను వెళ్ళే బస్ వచ్చేసరికి వెళ్ళిపోయాడు. నేను వొంటరిగా మిగిలిపోయాను.


నేను అప్పటిదాకా కూర్చున్న సత్రం వైపు చూసాను. లంకా రంగయ్య సీతారావమ్మ  జ్ఞాపకార్ధం  నిర్మించిన ప్రయాణికుల సత్రం లో కూర్చుని కోటేశూ అనే అతను చెబుతున్న సంగతులు విన్నాను. ఆ సత్రం మా తాతయ్య తమ్ముడు రంగయ్య ఆయన భార్య (మేనమామ కూతురు) సీతారావమ్మ పేరిట నిర్మించిన సత్రం. ఆయన అరవై యెకరాల భూస్వామిగా.. కొడుకును బాగా చదివించి హైదరాబాద్ లో బ్యాంక్ మేనేజర్ గా చూసుకుంటే.. మా తాతయ్య యేంటీ అలా మిగిలిపోయాడు. మంచితనం కష్టపడే స్వభావం ఉదారగుణం వుండటం వల్ల ఆయనకు ఏం మిగిలింది?  ముందు చూపులేకపోవడం వలన యెంత బాధ పడ్డారు? అని చాలా బాధ కల్గింది. 


మా తాతయ్య పిన్ని కూతురు హనుమాయమ్మ అనే ఆవిడ మా ఊరి లోనే వుండేవారు.. ఆమె మాటల్లో.. మరికొన్ని విషయాలు.. మరో భాగంలో.. 




7, ఏప్రిల్ 2023, శుక్రవారం

మా ఊరు - మా ఇల్లు 3

 ఇంతకు ముందు రెండురోజులుగా ముందర రెండు భాగాలు పోస్ట్ చేసాను . 

 


మా ఊరు - మా ఇల్లు మూడవ భాగం ఇది. 


కొన్నేళ్ళ తర్వాత మరొకసారి ఇల్లు మారిపోయింది. మా చిన్న తాతగారి భాగానికి మాకు మధ్య వున్నగోడ ఇవతల మా భాగం వైపు కోసేసి గది వెడల్పు తగ్గించి ఉత్తరం.. స్థలం వుండేలా గోడలు కట్టారు. వంటిల్లు పడగొట్టి నైబుతిలో చుట్టిల్లు కట్టారు. ఆవరణ లో బావి తవ్వించారు.  అంతకు ముందు మా నీటి కష్టాలు అంతులేనివి. ఆ కష్టాలకు తెరపడిందని అమితంగా సంతోషించాము. ఇల్లు చిన్నదైంది కానీ ఇంట్లో మనుషులు కొత్త ఆశతో తమ జీవితాల్లో మంచి మార్పు కోసం ఎదురు చూసారు.


1992 లో  మా నాయనమ్మ చనిపోయింది. చిన్నపాటి అనారోగ్యమే! నా అనారోగ్య కారణం వల్ల ఆఖరి చూపు కూడా దక్కలేదు. నడి వేసవిలో తుఫాను. పెద్ద వర్షం. సంప్రదాయమైన అంత్యక్రియలకు నోచుకోలేదు. ఖననం చేసారు. తాతయ్య నాయనమ్మ వారి వృద్దాప్యంలో అంతులేని మానసిక వేదన పేదరికం అనుభవించారు. ఇది రాస్తుంటే కూడా చాలా దుఃఖం గా వుంది. ఎవరైనా సరే జన్మనిచ్చిన తల్లిదండ్రులను యవ్వనంలో వున్నప్పుడు లక్ష్యపెట్టకపోయినా వృద్దాప్యంలో వారిని  ప్రేమగా దయగా చూసుకోవాలి. తల్లిదండ్రులు యెంత గొప్పవారైనా పిల్లలకు చులకన భావమే వుంటుంది. వారు దాటిపోయాక కానీ వారి విలువ తెలియదు. ఐదుగురు బిడ్డలను కన్నారు.. ఐదు రకాలుగా మానసిక క్షోభ బాధ అనుభవించారు. నేను యిప్పుడు అనుకుంటాను.. మాకు ఇంకొంచం ఆర్థిక స్వేచ్ఛ  వచ్చినదాకా బతికి వుండకూడదా నాయనమ్మ తాతయ్యా అని. నిజానికి మన దగ్గర డబ్బు లేనప్పుడు కూడా వారిని ప్రేమగా చూసుకోవాలి. డబ్బు వచ్చాక వారు వుండమన్నా ఉండలేరు కదా ! 


మా అమ్మ వారికి మనోవర్తి కచ్చితంగా ఇచ్చేది. కానీ ఆదరణ సరిగా ఉండేది కాదు. అది మాకు కూడా కినుకగా ఉండేది అమ్మ మీద కోపంగా ఉండేది. కానీ ఏం చేయగలం పెద్దవారితో వాదన చేసి ? ఆ విషయంలో నిన్ను క్షమించలేం..అని అన్నాము. స్త్రీలు సాధారణంగా అత్తమామల పట్ల ద్వేషం కల్గివుండరు. తనపై తన బిడ్డలపై భర్త ఆదరణ ప్రేమ లేకపోవడం దుర్వస్యనాల బారినపడి కుటుంబ భాద్యతలు మర్చిపోతే ఆ అసహనాన్ని భర్త తల్లిదండ్రులపై వ్యక్తీకరించడం అని తర్వాత తర్వాత నాకర్థమైంది. ఇంకో విషయం ఏమిటంటే ఏ తల్లిదండ్రులైనా సరే ఉన్న ఆస్తులను బిడ్డలకు సమస్తం రాసి యివ్వకూడదు. జాగ్రత్తలు తీసుకోవాలి.


ఇక 1998 లో మా అమ్మ చనిపోయింది.చిన్న వయసే! అప్పటికి అమ్మకి యాబై ఒక్క సంవత్సరాలు. ఆ తరువాత మాకు మా ఊరుకు అంతగా వెళ్ళే అంత బంధం లేకపోయింది. మేమందరం విజయవాడ దరిదాపుల్లో వుండటం వల్ల.. నాన్న మా దగ్గరికే వస్తూ ఉండేవారు.   


మా ఊరు మా ఇల్లు అనగానే నాకు మదిలో మెదిలే చిత్రం చాలా పాతది. నాకప్పుడు తొమ్మిదేళ్ళు. అప్పటి వరకూ అమ్మమ్మ వాళ్ళింట్లో పెరిగాను. దాదాపు నలభై అయిదేళ్ళ కిందట వున్న ముఖ చిత్రం. అప్పుటి దృశ్యసమాహారమే యిప్పుటికి కూడా నాకు  స్పష్టంగా గుర్తుంది. ఆ తర్వాత ఊరు ఇల్లు చాలా మారిపోయి వుండొచ్చు. ముఖ్యంగా మా ఇల్లు వాస్తు దోషాలతో వుందని రెండుసార్లు మార్పు జరిగింది. ఇప్పుడైతే ఆ ఇల్లు పూర్తిగా కూల్చబడి .. పునాదులతో సహా తవ్వి పోసి  మట్టితో ఎత్తు లేపి కొత్త యిల్లు కట్టారు మా అన్నయ్య. ఆ ఇల్లు కూల్చేసే ముందు వొకసారి చూసి వుంటే బాగుండేది అనిపించింది. బాధ కూడా కలిగింది. ఇప్పుడు మారిపోయిన ముఖ చిత్రంతో మా ఊరు మా ఇల్లు ఇరవై నాలుగేళ్ళ క్రితం మరణించిన మా అమ్మ. ఏదో ఖాళీ తనం.  


నాకంటూ అక్కడ భౌతికమైన ఆస్తులు  ఏమీ లేవు. నాన్న అన్నయ్య వదిన వున్నారు.  వారికి కొద్దిపాటి భూమి ఆ ఇల్లు వున్నాయి. కానీ నాది అంటూ నాకు మిగిలింది అమూల్యమైనవి మా ఊరితో ఇంటితో వున్న అనుబంధం సజీవమైన జ్ఞాపకాలు మాత్రమే!. 


ఆడపిల్లలకు మమతలు భ్రమతలు కూడా యెక్కువేనేమో! అందుకే నేను యిదంతా రాసుకున్నాను. రాసుకోవడం పూర్తయ్యాక యెందుకో దుఃఖం ముంచుకొచ్చింది. మట్టి-మనిషి అంటారు కదా! మట్టి అలాగే వుంటుంది. మనిషి ఆ మట్టిలో కలిసిపోతాడు. ఎవరికి ఏ నీళ్ళు ప్రాప్తం వుంటాయో అవే దక్కుతాయి. తరచూ మా అమ్మ కలలో కనబడుతుంది కానీ మా తాతయ్య నాయనమ్మ అసలు కనబడరు. వాళ్ళ మాటలు వాళ్ళు మసలిన తీరు కళ్ళ ముందు మెదులుతాయి. మా అన్నయ్యకు కూడా ఊరు అన్నా ఇల్లు అన్నా మమకారం. అందుకే ఊరికి వెళ్ళి విశ్రాంత జీవనం గడుపుతున్నాడు. వృద్దాప్యంలో నాన్న ను బాగా చూసుకుంటున్నారు. 


నాకు ఏ మాత్రం సాధ్యపడినా మా ఊరు వెళ్ళిపోయి అక్కడే వుండాలనిపిస్తుంది. కానీ మా నాన్నగారికి అది యిష్టం వుండదు. 1998 తర్వాత ఒక్క రాత్రి నిద్ర చేయడం తప్ప ఆ వూరిలో సూర్యోదయం చూడలేదు నేను. గత జూలై నెలలో వొక ఆరు రోజులు వున్నాను. ఆ వాతావరణం నాకు సరిపోతుందో లేదో నని అనుమాన పడ్డాను. కానీ నా శరీరం మనస్సు పురా స్మృతులను వొడిసి పట్టుకుంది. ఊరు ఇల్లు నన్ను ఆలింగనం చేసుకుంది. ఆ రోజులలో హాయిగా మెలుకువ రాని నిద్ర పోయాను. 


ఎప్పుడైనా మా ఊరు ను మా ఇంటిని చూడాలని అనుకున్నప్పుడల్లా.. గూగుల్ యెర్త్ మ్యాప్  ఓపెన్ చేస్తాను. ఊరు పరిసరాలు మావి కాని మా పొలాలు నేను ఆడుకున్న స్థలాలు అన్నీస్పష్టంగా కనబడతాయి. మొదటిసారి అలా చూసినప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. తర్వాత అప్పుడప్పుడు  తనివితీరా చూసుకుంటాను. 


నిజజీవితంలో నువ్వు నీకు  దొరకకపోతే అక్షరాలలో నిన్ను నీవు వెతుక్కో..  అంటారు కదా! ఎన్ని దుఃఖాలను  నిరాశలను వొడపోస్తేనో కదా మనస్సు స్వచ్ఛత భాసిల్లేది. స్వచ్ఛమైన బాల్యం కల్మషం యెరుగని మనస్సు .. ఆ జ్ఞాపకాల్లో  వొక జీవరాగం  వుంటుంది. మనకు మాత్రమే వినిపించే అర్ధమయ్య  సడి వుంటుంది. జీవన గమనంలో ఎంతో యిష్టంతోనూ కష్టంతోనూ నిన్ను నువ్వు సాధించుకున్న తర్వాత మనదంటూ అనుకున్న దేనిని  వొదులుకోవడం యిష్టం వుండదు. కానీ అది సాధించడం కూడా కష్టమైన పనే కదా ! యేవో అడ్డంకులు ఉంటాయి.   


 

అమెరికా లో అట్లాంటా నగరంలో కూర్చుని పక్కన మనుమరాలు నన్ను ఆనుకుని ఐపాడ్ లో రైమ్స్ చూస్తూ నవ్వుకుంటుంది. నేను నా ఊరి స్పర్శ ఊహలో మునిగి తేలియాడుతూ యిదంతా రాసుకుంటున్నాను. 


నేను నాన్న పోలిక. నాన్న తాతయ్య నాయనమ్మ లు కలగలిసిన పోలిక.. ఒంటి రంగు కాళ్ళు చేతులు శారీరక సౌష్టవం అంతా నాయనమ్మ లాగా వుంటూ ముఖం తాతయ్య పోలికలు. నేను పూర్తిగా మా నాన్న పోలిక. మా నాయనమ్మ పోలికలు రాలేదు కానీ శరీరతత్వం గుండ్రటి ముంజేతులు పొడవు పొట్టి కాని చేతివేళ్ళు పాదాలు మెత్తని శరీరం తీరు వచ్చింది. మా అన్నయ్య అంతా మా తాతయ్య పోలికలు. ఇక నా కొడుకు కి నా పోలికలు వచ్చాయి. కాళ్ళు చేతులు వాళ్ళ నాన్న నాన్నవి అంటే మా మామ గారి జీన్స్ వచ్చాయి. ఇక నా మనుమరాలికి అంతా తండ్రి నానమ్మ పోలికలు. కాళ్ళు చేతులు మాత్రం వాళ్ళ నాన్న నాన్న వి. కాళ్ళు చేతులు కాలి పిక్కలు నడక అంతా నా మనుమరాలికి వాళ్ళ తాత పోలికలు. మా అందరి బ్లడ్ గ్రూఫ్ లు అంటే నాన్న అన్నయ్య నేను నా కొడుకు మనుమరాలు నా చెల్లెలు అందరివీ వొకటే బ్లడ్ గ్రూఫ్ లు. మా పెద పెదనాన్న కూతురు అక్క అంతా నాయనమ్మ పోలిక లే. మా రెండవ పెద నాన్న కొడుకు అన్నయ్య అచ్చం తాతయ్య పోలికే.. వాళ్ళ అబ్బాయి నా మేనల్లుడు కూడా తాతయ్య పోలిక. ఇక అన్నయ్య కూతురు కూడా అన్నయ్య పోలిక.


ఇవన్నీ సరిచూసుకుంటూ.. పెద్దలను జ్ఞాపకం చేసుకుంటుంటే యెంతో బావుంటుంది. నా మనురాలిని తీసుకుని మా ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు వుండాలని మా నాన్న యెత్తుకుని వుండగా ఫోటో తీసి భద్ర పరచాలని నా కోరిక. ఇవి నా మూలాలు అని నా మనుమరాలు చూసుకోవడానికి గుర్తులు వుంచాలి. ఎక్కడ పుట్టాము యెక్కడ పెరిగాము మన మూలాలు యెక్కడ అన్నది పిల్లలకు తెలిసి వుండాలి. ఆ ప్రదేశాలతో మనుషులతో అనుబంధం వుండాలి. వీలైనంత అనుబంధాలు కాపాడుకోవాలి. యివ్వన్నీ మనిషికి కనీస ధర్మం. స్వభావాలు గుణాలు అలవాట్లు ఆస్తిపాస్తులు ఉత్థానపతనాలు కష్టాలు సుఖాలు అన్నీ మారుతుంటాయి. కొత్తగా కొన్ని వస్తూ వుంటాయి పోతూ వుంటాయి. స్థిరంగా వుండేది వున్నంత వరకూ వుండేది మనది అన్న భావన మాత్రమే.. అదే మన ఊరు మన ఇల్లు. 


వృద్దాప్యాన్ని గౌరవించాలి. వారిని కూడా మన బిడ్డల లాగానే చూసుకోవాలి.  వారిని నిర్లక్ష్యం చేస్తే మనకంటూ పశ్చాత్తాపం మిగిలే వుంటుంది. కృతజ్ఞత మరిచిన జాతి అవుతుంది అని మా ముందు తరం వాళ్ళను చూసి మేము నేర్చుకున్నాం.



ఎప్పుడో నాలుగు తరాల క్రితం గుంటూరు జిల్లా వెంకటపాలెం గ్రామం లో పుట్టి పెరిగిన మా ముత్తాత ను అదే యింటి పేరిట వున్న వెంకటపాలెం కోడలే అయిన కుంటముక్కల గ్రామం పాటిబండ్ల వారి ఆడపడుచు లంకా శేషమ్మ   దురదృష్టవశాత్తు  వెంట వెంటనే పుత్ర విహీన పతి విహీన గా మారి .. తన భర్త వారసులకు చెందిన తల్లి లేని బిడ్డను పెంచుకుంది. ఆ బిడ్డ పేరు లంకా రామచంద్రయ్య.  యుక్తవయస్సు వచ్చాక తన మేనకోడలు రత్తమ్మని యిచ్చి వివాహం చేసింది.వారి బిడ్డలు  పంచ పాండవుల్లాంటి ఐదుగురు అన్నదమ్ములు ఒక ఆడపడుచు.  నూట పాతిక యెకరాల భూమి. పెద్ద వ్యవసాయం. మా తాత తన పెద్ద కూతురికి శేషారత్నం అని తన నాయనమ్మ పేరును పెట్టుకుంటే.. మా పెదనాన్నలిద్దరూ తమ ఆడపిల్లలకు శేషు కుమారి అని మా చిన్న మేనత్త తన కూతురికి కూడా శేషు కుమారి అని పేరు పెట్టుకున్నారు. తమ వంశ అభివృద్ధికి మూలమైన ఆ పెంపుడుతల్లి మాతృహృదయానికి ప్రణమిల్లి కృతజ్ఞతగా గౌరవంగా ఆమె పేరును తమ బిడ్డకు.. బిడ్డల బిడ్డలకు పెట్టుకున్న సంస్కారమైంతమైన  భక్తి కల్గిన కుటుంబం మాది. 


అలెక్స్ హేలీ..దక్షిణ ఆఫ్రికా నుండి తన పూర్వీకుడైన యువకుడిని బలవంతంగా   యెత్తుకొచ్చి బానిసగా మార్చితే ఏడు తరాల్లో ఆరుతరాలు బానిసలుగా హీనంగా బ్రతికినట్లు గుర్తిస్తాడు. తమ వారిని వెతుక్కుంటూ  వెళ్లి వారిని గుర్తించుకుంటూ ఎట్టకేలకు  తమ  మూలాలను కనుగొంటాడు. ఆ చరిత్రను అక్షరబద్ధం చేసి  “రూట్స్” అనే నవలను రాసుకున్నట్టు నేను కూడా నా మూలాలను తెలుసుకుంటూ.. నేనంటే ఇది..ఇదిగో.. నా మూలం యిక్కడ వుంది కదా! నా జేజి తాత ముత్తాత తాతలు తండ్రులు యిలా జీవనం గడిపారు. ఇంత ఉదాత్త గుణాలతో కృషీవలులై సంస్కారవంతమైన జీవనం కొనసాగించారు. వారి గుణగణాల్లో సంస్కారంలో దాతృత్వంలో కష్టపడే తత్వంలో పట్టుదల లో నాకు కొంచెమైనా అబ్బి వుంటాయి అన్న భావన నాకు అంతర్లీనంగా బలంగా వుంది. వారిని స్మరించుకుంటూ.. నా మూలాలను అక్షరాలలో యిమిడ్చి యిలా భద్రపరచుకుంటున్నాను. ఎప్పుడైనా నేను వెనక్కి తిరిగి చూసుకోవడానికి స్మృతిపథంలో నాకంటూ మిగిలిన గొప్పదైన విలువైన విషయాలు ఇవి. మా వంశ వృక్షం రాయాలని ప్రయత్నిస్తున్నాను. 


నిజానికి ఇవన్నీతెలుసుకునే   ఆసక్తి పిల్లలకు  ఉంటాయా ?అని సందేహం కూడా!  నా బిడ్డ లేదా నా రక్త సంబంధీకులు వారి బిడ్డలు యివన్నీ ఓపిగ్గా చదువుతారని వారికి అంత ఆసక్తి వుందని కూడా నేననుకోను. కానీ యెందుకు రాసుకున్నాను అంటే.. ఏమో తెలియదు.నేను బ్లాగ్ లో చాలా రాసాను.కథలు కవిత్వం చాలా రాసాను.  కానీ నేను రాసిన రాతలన్నింటిలోకి నాకిష్టమైన రాత, ఆత్మ సంతృప్తి కల్గించిన రాత యిది. ఇంతకు ముందు నా బాల్యానికి సంబంధించిన టపా లలో కొన్ని విషయాలు పంచుకుని ఉంటాను. 


ఇంకా చాలా రాయాలి. మా నాయనమ్మ తాతయ్య గురించి చాలా రాయాలి . ఒక విధమైన బాధతో ఇప్పుడు రాయలేకపోయాను. మనసు బాగున్నాక రాస్తాను. ముఖ్యంగా ఎవరి గురించి చెడ్డగా వాస్తవంగా రాయాలని లేదు. ఇప్పుడు  బ్రతికి లేని మనుషుల గురించి అసలు రాయకూడదు. నాయనమ్మ కన్న సంతానంలో ఇద్దరు జీవించి వున్నారు. వారికి తల్లిదండ్రుల పట్ల ప్రేమ వుంది. కదిలిస్తే కన్నీరవుతారు. నేను ఇంకా లోతైన బాధలోకి వెళతాను. అందుకే చాలా రాయలేకపోయాను . 


మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి లాగా గొప్పలు చెప్పడం కాదు .. వారి జీవన విధానం మనసుల మంచితనం మనిషి తత్త్వం ఆనాటి సాంఘిక జీవన పరిస్థితులు ఇవన్నీ రాయాలి .. 


తప్పకుండా రాస్తాను .. కొంచెం సమయం తీసుకుని రాస్తాను.


కింద ఫోటో .. మా నాన్న గారు . గత సంవత్సరం అమెరికా కి వచ్చే ముందు మా ఇంటి ముందు నిలబెట్టి  ఫోటో తీశాను.