నివురు - వనజ తాతినేని
చుట్టూ పచ్చని కొండలు. కొండల క్రింద ఊరి వాళ్ళు తప్ప పరులెవరు గుర్తించలేని కనీకనబడని చిరు గ్రామాలు. ప్రవహించే వాగులు వంకలు డొంకలు. ముక్కీ మూలుగుతూ ప్రయాణించిన బస్ నుండి క్రిందికి దిగాన్నేను.
కళ్ళెదురుగా ఎడమ ప్రక్క ఊరి పేరున్న ఆకుపచ్బ బోర్డు. బాణం గుర్తుతో ఇంకా చేరవలసిన దూరాన్ని అంకెల గుర్తుతో సూచిస్తూ.
దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో చెమటతో తడిసిపోయిన శరీరం ఇంకానా అన్నట్టు నిసృహగా నిట్టూర్చింది. తూర్పుకు దృష్టి సారిస్తే గతుకుల గుంటల బాట బదులు నల్లని నున్నని తారు రోడ్డు ఆశ్చర్యపరిచింది. ఆకాశం కూడా నీలం రంగు నుండి నల్లరంగులోకి జారుకుంటుంది.
బ్యాక్ ప్యాక్ తో నడక మొదలెట్టాను. గతంలో మనుషుల గలగలలతో సందడిగా వుండే రోడ్డు ఇప్పుడు నిశ్శబ్దంగా వెలుగుతుంది. ముందు నుండి వెనుక నుండి అనేక మోటర్ సైకిళ్ళు వేగంగా దూసుకుపోయే ఆటోలు అప్పుడప్పుడు కార్లు నన్ను దాటుకుని ముందుకు వెనక్కి ప్రయాణిస్తున్నాయి.
“చీకటి పడిందాకా వుండావేంటిరా అబ్బాయ్ ! రా వెనుక కూకో “ అంటూ సైకిల్ ఆపి యెక్కించుకు తీసుకువెళ్ళే నిష్కళంకమైన మనుషులు మాయమైపోయారు కాబోలు.. చుట్టూరా అవసరాల ప్రాతిపదికన పలకరించే మనుషులే కాబోలు ఇక్కడ కూడా!
కిలోమీటరు నడిచాక వీధి లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. దీపం చుట్టూ ముసిరే ఉసుర్లు లా సిమెంటు బెంచీలపై బారుతీరిన మనుషులు. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు. అప్పుడప్పుడు అందులోంచి తల పైకెత్తి చూసి అరకొర పలకరింపులు. పర్లాంగుకో జెండా దిమ్మె. నాయకుడి విగ్రహం. ఊరంతా సిమెంటు రోడ్లు. ఇంటింటిపై అమర్చబడిన డిష్ యాంటెన్నాలు. రైతు భరోసా కేంద్రం, పంచాయతీ కార్యాలయం, వైద్యశాల, ఉన్నత పాఠశాల.. రక్షిత మంచినీటి పథకం. ఊరు అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్న సూచనలు.కాగల కార్యం మా లాంటి వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిపోయింది. కానీ అలముకుని వున్న జాడ్యాలు అవినీతి లంచగొండితనం,దోపిడీ మరింత బలపడ్డాయి. మేడిపండు చూడు మేలిమై వుండు, పొట్ట విప్పి చూడు… నవ్వొచ్చింది.
ఒకప్పుడు నా లోలోపల కవాతు చేసిన కవిస్వరం డస్సిల్లింది. అలవోకగా దూసుకువచ్చే తూటాల్లాంటి వాక్యాలు లోలోపల అణగారిపోయాయి. ఊరు నన్ను గుర్తించలేదు. నేను మర్చిపోని దారి నేరుగా ఇంటికి చేర్చింది. పాతబడిన ఇల్లు ముతక వెలుగులో గంభీరంగా వుంది. తలుపులు బార్లాగా తీసివున్నాయి. పారిజాతం చెట్టు పక్కన చెక్క కుర్ఛీలో ఒంగి కూర్చుని ఏ మాత్రం కండ లేని కొంకర్లు తిరిగిన వేళ్ళను గుప్పిటగా మార్చి లోనికి పోయిన బుగ్గలను మరింత లోపలికి ఒత్తుతూ దీర్ఘాలోచనలో వుంది నా తల్లి. ఆమె కి ఎనిమిది పదులుదాటి నాలుగేళ్ళు అయింది. ఆమె పుట్టినరోజు ఎప్పుడు జరుపుకునే వారమో నాకు బాగా గుర్తుంది. నేరుగా ఆమె వద్దకు వెళ్ళి బూట్లు విప్పి కాళ్ల దగ్గర కూర్చున్నాను. ఆమె ముందు అయోమయంగా తర్వాత అనుమానంగా చూసింది. నేను తలపై వున్న టోపీ తీసి పలుచగా నవ్వాను. ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఆనందం వల్ల వచ్చిన దుఃఖంలో ఆమె కనులు తడిసాయి. బలహీనమైన స్వరం వణుకుతుంది. ఎట్టకేలకు నా తలపై చేయి వుంచి “ వచ్చావా” అంది.
“ఊ.. నువ్వింకా ఎదురుచూస్తూనే వున్నావని వచ్చాను”
ఆమె తుళ్ళిపడి లేచింది. గబ గబ నడుచుకుంటూ వెళ్ళి తలుపులు మూసింది. ఇంటి ముందు దీపం ఆర్పింది.
ఇంట్లో వున్న సరుకులతోనే నాకిష్టమైన పదార్ధాలను చేస్తూ నాణ్యమైన రుచిని తెప్పించడానికి తాపత్రయపడింది. పదే పదే కళ్ళు తుడుచుకుంటూంది. తలుపు చప్పుడైంది. ఉలిక్కిపడింది. తలుపు తీయకుండానే ఎవరూ అని అడిగింది. నేనేలే పిన్ని! కూర ఇద్దామని వచ్చా!”
“నీ స్నేహితుడు రామకృష్ణ భార్య” అని చెబుతూ సంకోచం లేకుండా తలుపు తెరిచింది. జున్ను గిన్నె, చేపల కూర డబ్బా ఇచ్చి లోపలికి తొంగి చూడనుకూడా చూడకుండా వెనుదిరిగింది. "ఆమె కళ్ళు నన్ను చూడలేదు. చూస్తే, తన భర్తని గుర్తుచేసుకుని ఏడుస్తుందేమో అని కావచ్చు.
అమ్మ తలుపు మూసి “నా మంచి చెడు అంతా చూసేది వాళ్ళే” అంది.
కంచంలో జున్ను వడ్డించింది. రెండు తునకలు ఆమెకి తినిపించే ప్రయత్నం చేసాను. రుద్దమైన కంఠం సాఫీగా మింగలేక అవస్థ పడింది. చేపల కూరలో ముళ్ళు తీసి ముందు పెట్టింది. తన కుక్కి మంచం పై పరిచిన పాత చీరలను తీసేసి బొంత వేసి శుభ్రమైన దుప్పటి పరిచింది.బలవంతం చేసింది నన్ను మంచంపై పడుకోమని శక్తిహీనమైన స్వరంతో. ఒకప్పటి బలమైన స్వరం నన్ను ఆ బాటలోకి వెళ్ళొద్దని మందలించిన విషయం గుర్తొచ్చింది. నేను ఆమెతో ఏమి మాట్లాడలేదు మాట్లాడటానికి విషయాలు లేవు.
ముక్కాలి పీట వేసుకుని తల పక్కన కూర్చుంది. మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్టు లేచింది. పెట్టె తెరిచి అందులో వున్నవి పట్టుకొచ్చింది. తుండుగుడ్డలో పదిలంగా చుట్టిన వాటిని భద్రంగా బయటకు తీసింది. ఒకటి రెండు మూడు. ముచ్చటగా ముగ్గురు ఫోటోలు అవి. అమరవీరులైన భర్త నేను కాక మరో ఇద్దరు కొడుకులు. ఒక్కొక్కటి నా చేతికి అందించింది. నా చేయి అందుకోవడానికి క్షణకాలం జంకింది. అమ్మ కంఠంలో, కళ్ళల్లో దుఃఖచ్చాయలు లేవన్న మాటే కానీ గుండెల్లో సముద్రాన్ని దాచినంత గంభీరంగా వుంది.
నెమ్మదిగానే వచ్చినా మాటలు తూటాలయ్యాయి. “అమ్మను చూడటానికి నలభై ఏళ్ళు పట్టింది నీకు. ఈ గుండె కోత కడుపు కోత భరించి ఎట్టా బతికి వుందో చూడటానికి వచ్చావా బిడ్డా! “
“………”
“మీ అక్షరాలు ఆయుధాలయ్యాయా? మీరంతా సాయుధులై సమాంతర రాజ్యం స్థాపించారా? ఏం సాధించారు? ఒక్కడో ఇద్దరో కాదు కుటుంబం మొత్తం. మొత్తంగా నలుగురు.ఉద్యమం అంటూ ఇల్లు ఊడ్చి పారేసారు. ఇల్లు విడిచిపోయే, ఊరు దాటి పోయే, రాష్ట్రం దాటిపోయే. కొండ కోన రాయి రప్పల మధ్య క్రూర మృగాల మధ్య ప్రాణాలు పిడికిట్లో పట్టి తోటి వాళ్ళను కాపాడుకుంటూ పరుగులు పెడుతూ, వ్యూహాలు రచిస్తూ ఏం సాధించారు కొడుకా! కట్టుకున్నోడు కన్నబిడ్డలు ముగ్గురూ కూడా కసాయోళ్ళకు మల్లే నన్ను ఒంటరిగా వదిలేసి పోయారు. ఏళ్ళకేళ్ళు నా చుట్టూ నిఘా. మీ ఆచూకీ చెప్పమని రోజుకొకరు వచ్చి పీడించి పొయ్యే వాళ్ళు. మీ నాన్న మాత్రం సరైనోడా? భార్యనైన నన్ను అనుమతి అడిగి అడవుల్లోకి పొయ్యినాడా? మీరు మాత్రం నేను చెప్పినమాట విన్నారా? ఉండారో పొయ్యారో తెలియని అయోమయంలో ఎక్కడ తుపాకీ పేలి పిట్టల్లా శవాలు రాలితే.. అందులో నీ వాళ్ళు వుండారేమో చూడు అని గుట్టలు ఎక్కించితిరి, కొండలు ఎక్కించితిరి, మార్చురీలు చుట్టూ తిప్పించిరి. మీరు చావకుండానే చచ్చిండ్రి అని రేయింబగళ్లు ఏడ్చి ఏడ్చి ఆఖరికి నిజంగానే చచ్చినప్పుడు ఏడుపు రానంత గడ్డ కట్టుకుని పొయ్యి బండ మాదిరి మారిపోయాను. లోన నివురు మధ్య దుంపలా మగ్గి పోయాను. ఆకలికి అడుక్కుని తినలేక పస్తులు వుండాను. మొండిగా ఏదో ఇట్టా బతికి వుండాను. ఈ బతుకు ఎవ్వరికి కావాలి? ఆఖరికి నువ్వు నేనూ మిగిలాం. ఇకపై ముందు ఎవరో వెనక ఎవరో!
న్యాయమైన ప్రశ్నలే అవి. సమాధానం లేదు నా దగ్గర. ఉన్నా చెప్పలేను. సిద్ధాంతాలు ఆమెకు అర్థం కావు. రాద్దాంతం చెయ్యకూడదు అని ఆమెకు తెలుసు.మా చుట్టూ అనుక్షణం అనేక కళ్ళు పహరా కాస్తూ వుంటాయి. ఇంట్లో నుండి వేళ కాని వేళ పొగ బయటకెళితే కూడా అనుమానం. అడుగడుగూ అణువణువణువూ జల్లెడ పడతారు. ఆ ఆలోచనలో వున్నాను.
నా మౌనం అమ్మను శాంతింపజేయలేదు సరికదా మరింత ఉద్రేకపరిచింది. “కొడుకా! నా గురించి మాత్రమే కాకుండా తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను వదిలిపోయిన వాళ్ళందరి తరపున అడుగుతున్నా. మీ కుటుంబాలను కష్టాలు పాల్జేసి ఇరకాటంలో పెట్టి మీరందరూ ఏ కలల రాజ్యం మత్తులో కూరుకుపోయారు కొడుకా! ఎవరు సుఖపడ్డారు ఎవరు మీరనుకున్న వెలుగుల లోకంలోకి ప్రయాణం చేసారు. జనం మధ్య వుండి జనం కోసం పోరాటం చెయ్యాలి కానీ.. అడవుల్లో దాక్కుని చేసే వితండవాదం ఏమిటి? ఒక్కొక్కరు పాండవుల మాదిరి రెండేసి మూడేసి సార్లు వనవాసం చేస్తుంటురి. నీ చిన్ననాటి స్నేహితులు చూడు! పెళ్లి చేసుకుని చక్కగా కాపురాలు చేసుకుంటూ పిల్లా జెల్లా చదువు నౌఖరీ లతో చక్కంగా వున్నారు. అయినోళ్ళని అనాథలు చేసి మీరు ఏం బావుకుంటిరి?” ఆక్రోశం వెళ్ళగక్కింది.
మాట్లాడి మాట్లాడి నేలపై చాప పరుచుకుని ముడుచుకుని పడుకుంది. ఆమె నిద్ర పోలేదు. నేను నిద్ర పోలేదు. రాత్రి నిద్ర పోలేదు. తన పని తాను నిశ్శబ్దంగా చేస్తుంది. నాలో నైరాశ్యం కమ్ముకుంది. ఫలితం ఇవ్వని పనులు చేసే వారికి మిగిలింది అది ఒక్కటే!
రాత్రంతా చల్లారని పొయ్యిలా లోలోపల మండిన అమ్మ వేకువలోనే పొయ్యి వెలిగించింది. దంతదావనానికి నీళ్ళు అందించింది. బ్లాక్ కాఫీ కలిపి ఇచ్చింది. ఎవరో తలుపు పై సన్నగా కొట్టారు. చటుక్కున చీకట్లోకి తప్పుకున్నాను. రామకృష్ణ భార్య పాల చెంబు చేతిలో పెట్టి అమ్మ చెవిలో ఏమో చెప్పింది. గిరుక్కిన వెనుదిరిగింది.
అమ్మ గబగబా లోపలికి వచ్చింది. రాత్రి నేను విప్పిన బట్టలు నా బ్యాగ్ లో కుక్కింది.
వాళ్ళు ఊర్లోకి వచ్చారంట అంది. నేను వేగంగా బూట్లు తొడుక్కున్నాను. టోపీ కూడా బ్యాగ్ లో పెట్టేసి తలగుడ్డ చుట్టుకున్నాను. లుంగీ పైకి ఎగగట్టి మా ఇంటి వెనక చెరువు గట్టు పైకి చేరుకున్నాను. తూర్పు దిక్కు నారింజ రంగులో మెరిసిపోతుంది. కొంగలు చెరువులో వాలుతున్నాయి. తామరపూలు నెమ్మదిగా వికసిస్తున్నాయి. చెరువులోకి దిగి ఈత కొడుతూ ఆవలి గట్టుకు చేరుకున్నాను. కూతవేటు దూరంలో వుండే చిట్టడవి నుండి మగ నెమలి కూతలు కేవ్ కేవ్ మని వినిపిస్తూనే వున్నాయి. నేను అడవిలోకి దారి తీసాను. కొద్ది దూరం నడిచానో లేదో .. నిశ్శబ్దంగా నన్ను చుట్టుముట్టింది ఓ సాయుధుల గుంపు.
*"అడవి నాకు కొత్త కాదు. కానీ ఈ సారి నా వెంట తూటాలు లేవు. అమ్మ మాటలు ఉన్నాయి. మరే ఆయుధం తీసే సమయం కూడా లేదు. ఈ సారి మా అమ్మకు కొండలు గుట్టలు ఎక్కేపని మార్చురీ గుమ్మం ముందు పడిగాపులు పడే అవసరం తప్పించాను.
***************(*)******************

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి