15, జూన్ 2026, సోమవారం

నీలంపు పువ్వు

 


నీలంపు పువ్వు   - వనజ తాతినేని. 


నా హృదయం సరస్సులో ఒక నీలంపు పువ్వు ఉంది. 

అప్పుడప్పుడుఅది బయటకు రావాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది.

దాని పట్ల నేను కఠినంగా ఉంటాను.

‘నువ్వు కాస్త ఆగు’ అంటూ మందలిస్తాను.

ఏమిటీ అంత తొందర అంటూ గట్టి పంజరం బిగిస్తాను.


నా హృదయం సరస్సులో ఒక నీలంపు పువ్వు ఉంది.

అది పగలైతే రవి ని చూస్తే చాలు ముచ్చటపడి వికసిస్తుంది

అప్పుడు దాని పేరు వారిజాక్షి

రాత్రి అయితే చాలు శశాంకుడు పై మనసు పారేసుకుంటుంది.

అప్పుడు దాని పేరు కుముదవల్లి.

రేయింబవళ్లు సరస్సు దాటి విహరించాలని దాని ఆకాంక్ష.


నా హృదయం సరస్సులో ఒక నీలంపు పువ్వు ఉంది.

అది అల్ప సంతోషి.ఎవరైనా మృదువుగా మర్యాదగా పిలిచినా 

పలుకుతుంది; మంచి పాట వినిపిస్తే పరవశిస్తుంది.

మంచి కవిత్వం వినిపిస్తే ఊగిపోతుంది.వానొస్తే నాట్యమాడుతుంది.

నేను దాన్ని కట్టడి చేస్తాను కంచెలు వేస్తాను.

మరీ అంత అవసరం లేదు.జాగ్రత్త అంటాను.



నా హృదయం సరస్సులో ఒక నీలంపు పువ్వు ఉంది.

అది ఎవరి కష్టాల కథలు విన్నా కరిగిపోతుంది.

జీవుల యాతన చూస్తే కన్నీరు అవుతుంది.

ఇతోధికంగా సాయం చేయాలని చప్పున తోసుకుని  రాబోతుంది.

ముందు నీ దగ్గర ఏముందో చూసుకో. లోకం అంతా మాయా ప్రపంచం

అని జ్ఞాన బోధ చేస్తాను. మాట చేయి జారొద్దని ఆజ్ఞాపిస్తాను.


నా హృదయం సరస్సులో ఒక నీలంపు పువ్వు ఉంది.

దాన్ని నేను సదా సంరక్షిస్తూ వుంటాను.

పైకి కటువుగా వున్నా లోపల దాన్ని సుతిమెత్తగా కాపడటానికి

ప్రయత్నిసాను; ఏ కసాయి చేతికి అందకుండా నయవంచకుల

బారికి గురి అవకుండా కాపలా కాస్తుంటాను. పాపం పిచ్చిది!

పై పై మెరుగులకు ఆకర్షణలో పడుతుంటుంది మరి. 


నా హృదయం సరస్సులో ఒక నీలంపు పువ్వు ఉంది.

దాన్ని నేను అమితంగా ప్రేమిస్తాను, అనుక్షణం హద్దుల్లో ఉంచుతాను.

ఎందుకంటే అది నాది గా భావింపబడే మరొకరిది.

దాన్ని పదిలంగా కాపాడటమే తప్ప తుంచి అన్యాక్రాంతం చేయబోను.

పన్నీరు ను బూడిదలో పోస్తారా ఎవరైనా!?  


15 June 2026. 04:10 am 






కామెంట్‌లు లేవు: