మిత్రులారా! కథ చదవాలని మరీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కదా!
సుధ చెప్పే కథ చదవండీ.. మరొక భాగం త్వరలోనే..
చదివి మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. రెండో భాగం కూడా చదివితేనే టైటిల్ కి అర్థం బోధపడుతుంది.
***********
కథేమో ఆమెది. జీవితమేమో నాది.
(మొదటి భాగం)
ఆమె అంత అందంగా ఏమి వుండదు. నిజం చెప్పాలంటే నాకన్నా అందమైనదేం కాదు. కానీ చురుకైనది తెలివైనది. ఏ విషయమైనా త్వరగా ఆకళింపు చేసుకోగలదు. మనసారా నవ్వగలదు. బేషరతులు లేకుండా ఇతరులను ప్రశంసించగలదు. కపటం లేకుండా ప్రేమించగలదు. ఆమె ఎల్లప్పుడూ నా తలపుల నిండా కిక్కిరిసి వుండేది. ఆమె పట్ల ఈర్ష్యతో నా హృదయం భగభగమండుతూ వుండేది. నా భర్త తో కూడిన ఏకాంత సమయాల్లో కూడా ఆమెను పదే పదే స్మరించేదాన్ని. కొన్నిసార్లు స్వగతంలా. కొన్నిసార్లు సాధింపుగా. అతను ఓపికగా భరించేవాడు. లేదా వెళ్లి పిల్లల దగ్గర పడుకునేవాడు.
నా ఈ ప్రవర్తన వెనుక కారణం వుంది. నా భర్త హృదయంలో ఆమె చెరపలేని పచ్చబొట్టుగా ముద్రింపబడి వుంది. అలా అని ఆమె చెడ్డది నాకు ద్రోహం చేసే మనిషి కాదని కూడా నాకు నిశ్చయంగా తెలుసు. ఒక విధంగా ఆమె నా పాలిట దేవత. ఆమె మాటల్లో మాయ మంత్రం ఏమైనా వున్నాయేమో అని నాకు అనుమానం. ఆమె ఏం చెపుతుందో ఏమో! నా భర్త తు చ తప్పకుండా పాటిస్తాడు. ఆ విషయం మా అత్తగారు కూడా హెచ్చరిస్తుంది దృవ పరుస్తుంది. . “ఇదిగో .. సుధా! మీ కాపురం చక్కబడుతుందని నేను కలలో కూడా అనుకోలేదు.అందుకు కారణం ఆమె” అనేది. నాకు లోలోపల అగ్గి రాజుకునేది. మనిషి మాటల్లో సత్యం కరుకుగా అయినా వుండాలి. అబద్దం ధర్మం కోసమైనా చెప్పివుండాలి. మొదటిదే నిజం.
నిజమే! నా అనుమానపు చూపులు సూటీపోటీ మాటలు వల్ల దుకాణంలో ఆడవాళ్ళను పనిలోకి పెట్టుకోవడం మానేసాడు నా భర్త. అయినా నా అనుమానపు జబ్బు ఆముదం జిడ్డులాగా నా మనసును అంటిపెట్టుకుని వుండేది. కారణం నా భర్త అందగాడు.అతన్ని ఎవరైనా నాకు దూరం చేస్తారని నా భయం. ఈ విషయం వల్లే మా మధ్య తరచూ గొడవలు జరిగేవి. అవి తారాస్థాయికి చేరుకుని నేను పిల్లలను కూడా వదిలేసి పుట్టింటికి చేరుకున్నాను. రెండేళ్ళ తర్వాత మళ్లీ కలిసాం.
అప్పుడే చెప్పాడు ఆమె గురించి. మన హితం కోరే మనిషి మనల్ని విడదీసే మనిషి కాదని. ఒకసారి బిల్ బుక్ ల మధ్య ఓ కాగితం చూసాను. ముత్యాలకోవ లాంటి దస్తూరి. ఆ దస్తూరి నా భర్తదే!
“ఆమె చిటారు కొమ్మన వున్న మిఠాయి పొట్లం కాదు అందని పండు కాదు. చిటారు కొమ్మన ఊయలలూగుతున్న యెన్నడూ రాలని దేవతా పుష్పం. అయినా దోసిలి పట్టే వుంచాను. ఆమె తలపు నాలో ఏదో తెలియని అతి మృదువైన బాధను రేపుతుంది. ఏకాగ్రతగా పని చేసుకుంటున్నప్పుడు ఆమె మాటల్లో కర్తవ్యదీక్షను బోధించే తాత్వికత, ఏదైనా పాట వింటున్నప్పుడు సంగీతం విన్నట్లుండే ఆమె పలుకులు గుర్తుకు వచ్చేవి. పుస్తకం చదువుతున్నప్పుడు పుటల్లో ఆమె రూపం ప్రత్యక్షమై.. నేను నేను కాకుండా పోయిన రోజులవి. ఆమె ఎల్లప్పుడూ అదృశ్య నీడ రూపంలో సున్నితమైన స్పర్శను నా శరీరంపైనా, మనసుపైనా ప్రసరింపజేస్తూ వుండేది.” అని.
అత్తెసరు చదువులు చదివిన ఆ రాత లోతులు అర్థం కాకపోయినా ఎవరిని ఉద్దేశించి రాసుకున్నాడో నాకు అర్థం అయ్యింది. ఆ రాత్రి పెద్ద యుద్ధమే జరిగింది.
“ఫేస్ బుక్ లో రాసుకుంటూ వుంటాడు కదా! ఆ కవిత్వం కాకరకాయ ఏమో! అంతా నీ అనుమానం” అని కొట్టిపారేసింది అత్తగారు.
అలా లేదని నేను వాదిస్తుంటే ..
“నువ్వసలే అనూరాధ నక్షత్రంలో పుట్టావ్ , నీది అసూయ ఈర్ష్య ద్వేషాల స్వభావం. నీలాంటి అనుమానపు పిశాచాన్ని కట్టబెట్టి నా బిడ్డ గొంతు కోసాను అంది.
చుట్టం చూపుగా వచ్చిన మా అమ్మ కల్పించుకుని పదహారేళ్ల పిల్లనిచ్చి పెళ్ళి చేసాను. పదహారేళ్ళ నుండి ఇవే తగువులు. మా పిల్ల మాకు బరువు కాదు. తీసుకుని పోతాం” తగ్గేదే లేదు అన్నట్లు.
నేను కొంచెం తగ్గాను. అప్పటికి గొడవ సద్దుమణిగింది. ఆ రాతి నా భర్త స్థిరంగా స్పష్టంగా చెప్పాడు. ఆమె నా స్నేహితురాలు మాత్రమే! అంతకుమించి ఏమీ కాదు, కాబోదు. నువ్వు ప్రతిసారి ఇలాగే గొడవపడితే నీతో నేను గొడవపడలేను విడాకులు ఇచ్చేస్తాను అని. నేను జంకాను. నా అనుమానం నిరాధారమైనది కాదు కానీ.. నా భర్త ఆమె స్నేహం అంతకు మించి అభిమానం ప్రేమ గొప్పవి. హద్దులు ఎరిగినవి. అనుబంధాలు ఎంత సున్నితమైనవి . ఒక చోట తెగి పోయి మరొక చోట పెనవేసుకుంటాయి . బాహ్యంగా కాదు అంతర్లీనంగా, దృఢంగా.
మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. కథంతా ఆమెదే! జీవితమే నాది. నాకేం లోటు లేదు సంతోషం కూడా నిండుగానే వుంది. కానీ.. కానీ.. నా భర్త హృదయంలో ఇప్పుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఆమె వుంటుంది. ఏం చేసి కూడా ఆమెను తొలగించడం సాధ్యం కాలేదు. ఆ విషయం తల్చుకుంటే దుఃఖం పొంగుతుంది. ఒకసారి ఏమైందంటే… నేను ఆత్మహత్య ప్రయత్నం చేసాను. హాస్పిటల్ లో బెడ్ మీద నేనుప్పప్పుడు నా భర్త హృదయవిదారకంగా రోదించడం నాకు తెలుస్తూనే వుంది. అదెలాగంటే ఆమెకు ఫోన్ చేసి .. “చూడు నేస్తం ! ఈ పిచ్చిది ఎంత పని చేసిందో! పిల్లలు వచ్చి అమ్మనేంటి ఇలా చేసావ్ నాన్నా! అంటే నేను ఏం సమాధానం చెప్పాలి? నా చుట్టూ ఎన్ని గాలి వార్తలు పోగయ్యేవి. నీ చుట్టూ ఎన్ని అపవాదుల గోడలు కట్టేసేవారు” అని. ఆ సమయంలో కూడా ఆమె కోసం కూడా సమానస్థాయిలో తల్లడిల్లిపోయాడు. అంతకన్నా విషాదం ఏముంటుంది నాకు. పరమసత్యాన్ని జీర్ణించుకుంటూ బతకడానికే బతికాను అనుకుంటా. మేము విడిపోయి మళ్ళీ కలిసిపోయేటప్పుడు కంటికి రెప్పలా కాపాడతానని మా వాళ్ళకు మాటిచ్చాడు. ఏనాడూ మాట తప్పలేదు. కానీ .. కానీ అతని హృదయంలో నాకు స్థానం లేదు. అది నాకు కచ్చితంగా తెలుసు.
ఇదంతా జరిగి 15 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు చదువులు పూర్తై ఉద్యోగాల్లో కుదురుకున్నారు. నేను కూడా కళ్ళకున్న అనుమానపు పొరలు తొలగించుకుని మనసును విశాలం చేసుకున్నాను. మా కుటుంబాల మధ్య స్నేహం బలపడింది.
బాల్య వివాహాలు చేయడం సరియైన నిర్ణయం కాదని “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” కథ చెప్పినట్లు
భర్తల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రియురాళ్ళ గురించి భార్యల దుర్భర వేదన గురించి కూడా కథలు కథలుగా చెప్పాలి. వివాహానంతరం కూడా స్త్రీ పురుషుల మధ్య కలిగే ఆకర్షణ వల్ల జరిగే పరిణామాలు గురించి చెప్పాలి. తలలు బోడులైనా తలపులు బోడులా అనే వేమన పద్యం ఉదహరించుకోవాలి.
శారీరక ఆకర్షణలా? భావసారూప్యత పట్ల కలిగే ఆకర్షణలా.. లేక నిజంగానే తన వారందరినీ కూడా మరిపించే ప్రేమ అనే దివ్యౌషధం అనేది ఒకటి వుందా? అది యాదృచ్ఛికంగా తారసపడుతుందా? నా భర్త హృదయంలో నాకు స్థానం లేకపోవడం అనే నష్టాన్ని ఎవరు పూడుస్తారు? తప్పు నా భర్త దా? ఆమె దా? లేక నాదా?
హృదయాలలో ప్రేమ దివ్వె వెలిగించడం ఎవరు నేర్పిస్తారు? నేను మరొక పురుషుడి రూపాన్ని హృదయంలో ప్రతిష్టించుకున్నాను అంటే నా భర్త భరించగలడా?
అనూరాధ నక్షత్రంలో పుట్టిన వారికేనా ఈ ఆలోచనలు ప్రశ్నలు? మా అత్తగారిని అడగాలి జవాబు ఏం చెబుతుందో!
ఇప్పటి వరకూ.. నేను చెప్పిన కథ విన్నారు కదా! మరొక భాగంలో కథ చూపిస్తాను.
వేచి వుంటారు కదూ! _ సుధ.
#వనజతాతినేని

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి