వానకు వందనం -వనజ తాతినేని
పెళ పెళ మండే ఎండలో జల జల కురిసే వాన
మధ్యాహపు కునుకులో తూగుతున్న నేను ఉలికిపడ్డాను.
రివ్వున డాబా పైకి చేరి ఎండబెట్టిన వడియాలు
ఆరవేసిన బట్టలు జవురుకుని మెట్ల గదిలోకి చేరాను.
సగం తడిచిన దేహం మిగతా సగం పూర్తి చేయమని తోసింది.
వర్షం పాటైంది.
దుమ్ దుమ్ దుదుంభి నాదం
మంగళ నాదం మొదలైంది
నా మేని రాగమైంది. కుండపోత వానలో
నెమలిలా నాట్యం చేయమంది.
ఈ వానలో ఎంత ప్రేమ వుంది!
ఈ వానలో ఎంత జీవం వుంది
ఈ వానలో ఎంత తేనె వుంది.
ఈ వాన కిందనే కదా మనం జీవిస్తున్నాం
నేనలా కాగితపు పడవలా
ఆనందడోలికల్లో తేలుతున్నాను.
నా సోమరితనంపై గట్టి నమ్మకం వున్న
నా తల్లి పరుగున వచ్చింది.
పూర్తిగా పాడైపోని తన పనిని చూసి
ఊపిరి పీల్చుకుంది. నన్ను చూసి నవ్వింది.
పుడమిని చేరుతున్న చినుకులా నేనూ
అమ్మని చేరుకుని చేయి పట్టి వానలోకి లాక్కొచ్చాను.
మురిపెంగా విసుక్కుంటూనే అమ్మ వాన ను
మనసారా ఆస్వాదించింది. ఆమె
లోపలి గాయాల బాధకు కాస్త ఉపశమనం
కల్గించినందుకు వానకు వందనం చేసాను
కృతజ్ఞత తో.
14 June 2026. 07:05 am.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి