గోడలో మర్రి విత్తనం
యాభైల్లో కూడా ఇరవైల్లో లాగాఇవ్వడంలో నీకు నీ మీద గొప్ప నమ్మకం
అది మాత్రం యెల్లప్పుడూ ..
ప్రపంచానికి వెల్లడి చేయని రహస్యమై వుండాలంటూ
పదే పదే .. నన్ను మెప్పించే ఒప్పించే ప్రయత్నం.
కానీ నాపై నమ్మకం లేదు నీకు.
నీ గౌరవం, నీ మర్యాద, నీ పరువు అనే
అద్దాల మేడను నేను భంగ పరుస్తానని
ఎనలేని భయం నీ అంతరంగంలో
ఇచ్చిన వాగ్థానం అవలీలగా వెనక్కి తీసుకుంటావు
ప్రేమలో విశ్వాసం, మనిషిపై నమ్మకం లేని చోట
బంధం యెలా వేళ్ళూనుతుంది చెప్పు?
ఎడారిలో వర్షం కురిసినట్టా?
గోడలో మొలిచిన మర్రి విత్తనానికి వున్నపాటి
ఆత్మవిశ్వాసం నీ మనసుకు లేకపోయినాక,
నువ్వు చేసే ఏ ఆరాధన, ఏ అంకితభావం సత్యం కాదు.
అది భయం. అది కాలక్షేపం. అది వ్యాపారం.
ముందు సత్యశోధన మొదలెట్టు.
నీ లోపలికి తొంగి చూసుకో.
నేను యెందుకు నమ్మలేకపోతున్నాను? అని.
నేనిక్కడే వుంటాను.
నీ అనుమానం శిఖరాగ్రం అంచున నిలబడినా సరే,
నా నిజంతో నేను వేచి చూస్తాను.
అసలు ..
ఈ బోలు ప్రేమలను నేనెందుకు నమ్మనో తెలుసా!
నా గుండె గోడల్లో నమ్మకంగా ఓ విత్తనం మొలకెత్తి
అది మహావృక్షమై విస్తరించింది. ఆ లోపలి నీడ నను
గొడుగై నిలువెల్లా కమ్ముకుని బయట కూడా
ఊడల్లా విస్తరించింది మరో మొక్క పెరగకుండా.
28 June 2026. 02:40 pm.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి