29, మే 2011, ఆదివారం

ఐదే ఐదు నిమిషములలో అప్పటికప్పుడు ఆరవ వేదం గా వర్ణిస్తూ..భావశక్తికి..ప్రాణం పోసిన వేటూరి.

ఒక పాటలో ఎన్నో.. స్పూర్తికర అంశాలు.. ఉంటే  ఆ పాట చూసిన ప్రేక్షకుడికి.. గుండెల్లో వేయి ఆలోచనా శతఘ్నులు బ్రద్దలైతే.. ఆ..పాట విన్నప్పుడు.. కొన్ని రోజుల వరకు.. ఆవేదన ఆక్రోశం నిండిన ఆ గళం.. వెంటాడి..మనని..వేదనలో.ముంచేస్తే .. అవమానిన్పబడిన స్త్రీ మూర్తి..ఆక్రోశం ప్రశ్నగా ఉత్పన్నమై సమాధానం చెప్పలేని..మానవజాతి..కి తప్పు దిద్దుకోలేని సిగ్గు లేని చర్యగా అనిపిస్తే.. ఈ సమాజంలో.. ఈ నాడు మహిళలపై ఇన్ని అకృత్యాలు జరుగుతూ ఉంటాయా?


విన్నప్పుడు మాత్రమె.. నిజం అని  అనుకుంటూనే..మార్పురాని ఈ పురుషజాతి ఆగడాలకి.. భాదపడుతూ.. ఈ..పాటని గుర్తు చేసుకుంటూ.... ఇకనైనా మారి స్త్రీ జాతిని అవమానించ కుండా ఉండాలని కోరుకుంటూ... ఈ పాట. 

1986 వ సంవత్సరం గాయని ఎస్.జానకి నంది అవార్డ్ ని అందించిన పాట... ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో.. పాట. "ప్రతిఘటన"చిత్రం తలుచుకోగానే..విజయశాంతి ని చూడగానే అందరికి.. గుర్తుకు వచ్చే పాట.  ఈ..చిత్రంలో.. ముందుగా అనుకోని పాట.  ఆ చిత్రం నిర్మించేటప్పుడు..కళాశాల తరగతి గదిలో..ఆ లెక్చరర్  నగ్న చిత్రం గీసి..అంగాంగ కొలతతో... వర్ణించి అవమానిస్తే..ఆ సన్నివేశంలో.. అప్పటికప్పుడు.. ఒక పాట రూపంలో..ఆ స్త్రీ హృదయం ఆక్రోశం, ఆవేదన.. తో.. ఆ విద్యార్ధుల్ని ప్రశ్నించడమే కాదు..అడుగడుగునా అవమానిన్చబడే..స్త్రీ ఆక్రోశం ప్రతిబింబించే విధంగా.. ఉండాలని దర్శకుడు టి .కృష్ణ గారు అడగగానే  ఈ  పాట   అప్పటికప్పుడు అనుకుని కేవలం ఐదే ఐదు నిమిషములలో.. ఒక చెట్టు క్రింద కూర్చుని "వేటూరి"గారు..వ్రాసారంటే..ఆయన.. పాదాలకి.. మ్రొక్కి తీరవలసిందే!!!                


ఈ దుర్యోధన  దుశ్వాసన దుర్వినీత  లోకంలో
రక్తాశ్రులు  చిన్దిస్తూ  రాస్తున్నా  శోకంతో...
మరో  మహా  భారతం  ఆరవ  వేదం ...
మానభంగపర్వంలో .....మాతృ  హృదయ నిర్వేదం నిర్వేదం
మాతృహృదయ  నిర్వేదం నిర్వేదం.


మనకి వేదాలు నాలుగు.. అవి కాకుండా పంచమ వేదంగా.. భావింపబడే.. మహా భారతం లో.. సభాపర్వంలో..  దుర్యోధనుడు.. దుశ్శాసనుడు..శ్హకుని,కర్ణ మొదలగు వారు కురువంశ మహామహుల  సమక్షంలో..ద్రౌపదిని అవమానించిన..సందర్భంతో.. పోల్చి.. మరో మహాభారతం ని.. రక్తాశ్రువులు  చిందిస్తూ.. వ్రాసిన ఆరవ వేదం గా వర్ణిస్తూ  .. వ్రాసిన శైలి..వేటూరికి.. కావ్య రచనల పై ఉన్నఆసక్తి..ని.. సాహిత్యపు లోతుల్ని చవిచూసిన అనుభవాన్ని చెప్పకనే చెపుతాయి.మాన భంగపర్వంలో..మాతృ  హృదయ నిర్వేదం..అని ఎందుకు అన్నారంటే.. అక్కడ   ఆమె స్థానం గురుతుల్యం. గురువు మాతృమూర్తితో..సమానం. అయినా.. ఆ.. విద్యార్ధులు..ఆమెని అలా అవమానిస్తే.. ఆ మాతృ   హృదయం నిర్వేదంగా మారడంలో..ఆశ్చర్యం  ఏముంది...!?            


పుడుతూనే  పాలకేడ్చి  పుట్టి జంపాల కేడ్చి   
పెరిగి  పెద్ద  కాగానే  ముద్దు  మురిపాల  కేడ్చి
తనువంతా  దోచుకున్న  తనయులు  మీరు
మగసిరితో  బ్రతకలేక  కీచకులై
కుటిల కామ నీచకులై 
స్త్రీ  జాతిని  అవమానిస్తే.. పుట్టి పుట్టగానే పాల కోసం ఎడ్వగానే.. ఆ తల్లి స్తన్యం అందించి..ఆ బిడ్డ ఆకలి తీరుస్తుంది..తర్వాత ఆ గుండెలపై..ఆడుకుంటారు..పెరిగి  పెద్దకాగానే..ముద్దు మురిపాలు..కి..ఏడ్చి..తనువంతా.. దోచుకున్న తనయులు.. మగ సిరితో..బ్రతకలేక (ఇక్కడ మగ సిరి అంటే.. సంస్కారంతో..మంచి నడవడిక అనేదే..అసలైన మగ సిరి) కీచకుడిలా మరి.. కుటిలనీతితో.. కామ నీచకులై స్త్రీ జాతి ని అవమానిస్తుంటే..మీ  అమ్మల  స్తన్యంతో   మీ  అక్కల  రక్తంతో
రంగరించి  రాస్తున్నా  ఈనాడే  మీకోసం
మరో  మహా భారతం  ఆరవ  వేదం
మానభంగ  పర్వంలో ....
మాతృ హృదయ నిర్వేదం  నిర్వేదం..మీ అమ్మల స్తన్యంతో  ..మీ అక్కల రక్తంతో..అమ్మ చనుబాలని..అక్కల రక్తాన్ని రంగరించి.. ఈనాడు వ్రాస్తున్న  మరో..మహాభారతం.. అని..ఎంత వేదన.. అ.. వేదన వర్ణించ లేక.. అది పదునెనిమిది..పర్వాలు కల మరో.. మహాభారతం..గా వర్ణించి  అందులో.. మానభంగ పర్వంలో.. ఒక మాతృ హృదయ నిర్వేదం...కి..అక్షర రూపం ఇచ్చి.. భావశక్తికి..ప్రాణం పోశారు వేటూరి.          కన్న మహా  పాపానికి  ఆడది  తల్లిగా  మరి
నీ  కండలు  పెంచినది  గుండెలతో  కాదా?
యెర్రని  తన  రక్తాన్నే  తెల్లని  నెత్తురు    చేసి
పెంచుకున్న  తల్లి   ఒక  ఆడదని  మరిచారా?
కనపడలేదా  అక్కడ  పాపలుగా  మీ  చరిత్ర
ఏనాడో  మీరుంచిన  లేత  పెదవి  ముద్ర..నవమాసాలు మోసి..తన రక్తం తోనే ఊపిరి పోసి  తన రక్తాన్నే.. పాలగా మార్చి..బిడ్డని పెంచినది.. ఈ..గుండెలు కాదా?  బిడ్డలకి..పాలు ఇచ్చే రెండు అమృత భాండాగారాలు..స్తన్యాలు..అని  సమస్త   మానవాళికి పాపలుగా ఉన్నప్పుడు .. లభించిన ఆహార సంపద...అలాటి ఆ గుండెల్ని.. కాముక ప్రవృత్తితో.. చూసే..ఈ..నీచ సంస్కృతిలో..కనబడలేదా?అక్కడ పాపలుగా..మీ చరిత్ర... అప్పుడెప్పుడో.. మీరు ఉంచిన లేత పెదవి ముద్ర..అని..అడుగుతూ.. ప్రతి స్త్రీ మూర్తిలోను.. మీ తల్లి ని..చూడమని.. ఎలుగెత్తి అడిగిన  స్త్రీ అంతరంగ వేదన ..ఇది..


ప్రతి  భారత  సతి  మానం  చంద్రమతి  మాంగల్యం
మర్మస్థానం   కాదది  నీ  జన్మ  స్థానం
మానవతకి  మోక్షమిచు  పుణ్యక్షేత్రం...ప్రతి భారతీయ సతి మానం ఇక్కడ మానం అంటే..అభిమానం,గౌరవం  (సతి అంటే..కేవలం స్త్రీ కాదు..ఆది శక్తి కూడా ) చంద్రమతి మాంగల్యం...సత్య హరిచంద్రుని  భార్య చంద్రమతి.. ఆమె మాంగల్యం ఒక్క హరిచంద్రునికి తప్ప మరెవరికి.. కనిపించేది కాదట..అలా టి.. మానం.. కేవలం మర్మస్థానం మాత్రమె కాదు.. నీ జన్మ స్థానం కూడా.. అని చెప్పడం.. ఎంతటి బలవత్తర భావం. మానవజాతి మొత్తంకి.. ఈ..ప్రపంచమని..చూపించేందుకు..తెరువబడిన,మోక్షం చూపించబడే.. పుణ్య క్షేత్రం ..గా కీర్తించిన వేటూరి.. మహనీయునికి.. శతకోటి వందనాలు  ..నిత్యం.. సమర్పించ వలసిందే !! 

శిశువులుగా  మీరు  పుట్టి  పశువులుగా  మారితే
మానవ  రూపంలోనే  దానవులై  పెరిగితే
సభ్యతకి  సంస్కృతికి  సమాధులే  కడితే..

శిశువులుగా..మీరు పుట్టి పశువులుగా  మారి..మానవ రూపంలో.. రాక్షసులుగా పెరిగి..సభ్యతకి  ..సంస్కృతికి..సమాధి కట్టేసి ..

కన్నులుండి  చూడలేని  దృతరాస్త్రుల పాలనలో
భర్త లుండి విధవ ఐన  ద్రౌపది  ఆక్రందనలో
నవశక్తులు యువ శక్తులు నిర్వీర్యం  అవుతుంటే
ఏమైపోతుంది  సభ్యసమాజం  ఏమైపోతుంది  సభ్యసమాజం
ఏమైపోతుంది  మానవ  ధర్మం
ఏమైపోతుంది  ఈ  భారత దేశం
మన  భారతదేశం  మన భారత దేశం.. 


కన్నులుండి  చూడలేని  ఏమి పట్టించుకోని ఈ.. సమాజంలో..
ఉత్కృష్ట  నటనకి పరాకాష్ట    
 భర్త లుండి  కూడా..విధవ గా మారిన ద్రౌపది ఆక్రందన .ఆమె ఆక్రందన కూడా.. నవ శక్తులు..దుష్టులని  దునుమాడె తొమ్మిది శక్తులు... గా ఉండే.. యువ శక్తులు.. అవినీతి..కి..పట్టం కడుతూ..రాజకీయ చదరంగంలో.. పావులుగా మారి నిర్వీర్యం అవుతుంటే ... ఈ దేశం ఏమైపోతుంది ..ని తన వేదనలో..కూడా.. దేశం కోసం ఆలోచించిన ఆ స్త్రీ మూర్తి..  హృదయంతరంగమే.. ఈ.. పాట.  


ఈ..పాటకి.. నంది అవార్డ్ ని అందుకున్నారు.. వేటూరి..ఆ పాట సాహిత్యమే... తెలుగు చిత్ర గీతాలలో..కలికితురాయి. ఇక జానకమ్మ గళంలో.. ఒలికిన భావాలు.. విజయశాంతి..నటన కి పరాకాష్ట.. టి.కృష్ణ గారి కధ, దర్శకత్వ ప్రతిభ..  ఇన్ని మేళవింపులు కల ఈ పాట..  మరపురాని..స్ఫూర్తి గీతం.  కొంత  మంది ఆలోచనా విధానంలో.. అయినా మార్పు తీసుకురావడానికి..
ఈ.. పాటని.. పదే పదే..ప్లే చేయడం ..ఈ కాలానికి..అవసరం కూడా..!!!

ఐ యాం ఎ కామన్ వుమెన్


ఇదిగో... పొద్దు ప్రొద్దునే కొంచెం బద్ధకం వదిలించుకుని ఇలా ఈ  ప్రపంచం యెలా వుందో  చూద్దామని అంతర్జాలం లోకి తొంగి చూసాను.

చాలా రోజులయింది. కొంచెం విభిన్నంగా ఆలోచించి  మనసులో విషయం వ్రాసి కూడా ! అయినా నేనమంత గొప్పదాన్ని!? అని.

విభిన్నంగా ఆలోచించడానికి వ్రాయడానికి ఒకరికి చెప్పడానికి !?

 "ఐ యాం ఎ కామన్  వుమెన్"

 ఏదో చేద్దామని మొదలెట్టినా ఆరంభ శూరత్వంగా మిగిలిపోతుందేమోనని అంతర్లీనంగా  భయం కూడా. పట్టుకుంటుంది. ఎవరిని నమ్మే  వీలు లేని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాం. ఛీ! వెధవ జీవితం అనుకున్నది. చేయగలగడం కుదిరి  చావడం లేదు పైగా అడగక పోయినా  జాగ్రత్తలు చెప్పేవాళ్ళు తయారుగానే ఉంటారు. విన్నట్లు నటించాలి తప్పదు.లేకపోతే పొగరు, అహంకారం ఇలాటి ముద్రలు వేసి ఒంటరి లని చేసేస్తారు అయినా ఒంటరి ప్రపంచంలో  ఎంతో  ఆనందం అనుకుంటూ.. "ఒంటరి" లం అయిపోయి  మనం  ఇలా బ్రతికేస్తున్నాం.

 మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న వాటిల్లో  కొన్నింటిని  కూడా మనం మార్చలేం.
 అవి ఏమిటో మీరే చూడండి.

అంధ విశ్వాసాలకు అడ్డుకట్ట వేయలేం.
అజ్ఞాన  తిమిరాన్ని పారద్రోలలేం
అవకాశ వాద  ఉద్యమాలకి చేయూత ఇవ్వలేం.     
పదవీ దాహ దావానలం ని చల్లార్చలేం.   
అపరిపక్వత ఆలోచనలకి బలం చేకూర్చలేం.
అవినీతి చక్రాలకి ఇరుసు కాలేం.  

కానీ.. వీటన్నిటి  ప్రక్కన మనం బ్రతికేస్తున్నాం.   మనలో కూడా అవి ఉండవచ్చొమో కూడా. 

ఏదేదో.. చేద్దామనుకుని ఏమి చేయలేక దుఃఖం కల్గుతుంది.  ఆశనిహతి వల్ల దుఃఖం కల్గుతుంది అంట.

కొన్ని చేయటానికి మనస్కరించక,  కొన్ని చేయటానికి  దైర్యం చేయలేక  ఇదిగో ఇలా బ్రతికేస్తున్నాను. 

 "ఎస్"

 ఐ యాం ఎ కామన్ వుమెన్.

 ఇప్పుడే పోన్ చేసి మా చెల్లి అక్కా ! లంచ్ మీ ఇంట్లోనే అంది. "వంట" వెంటబడి  రుచికరం ని సాధించాలి.
మా అన్నయ్య నాగాలాండ్ కి ప్రయాణం కొంచెం  కాదు బాగానే దిగులు రైల్వే స్టేషన్ కి వెళ్లి అన్నయ్యకి మమకారంతో జాగ్రత్తలు చెప్పి రావాలి.  మా అబ్బాయి వీడియో కాల్ చేస్తే ఎలాగబ్బా! రిసీవ్ చేసుకోలేనే!?  దిగులుగా అనుకుంటూ  ఇదిగో ఇలా మాత్రం బ్రతికేస్తాను.

   

22, మే 2011, ఆదివారం

నీ కావ్య గంగ లేక మా కంట భాష్పగంగ... నా.. అభిమాన కవికి.. నీరాజనంశివుని శిరస్సున ఉంది గంగ
విష్ణువు పాదమున ఉన్నదీ గంగ
బ్రహ్మ గారి ఉదక మండలమున ఉన్నదీ గంగ
నీ కంటిలో భాష్ప గంగ
నా కలమున కావ్య గంగ
హలం పట్టుకున్న రైతన్న పొలాన పొంగాలి గంగ
వారి కస్టాలు కడ గంగ ....
అంటూ.. హృదయంతో.. భాష్పించి.. వ్రాసిన గీత మిది.


కావ్య గంగని తన భావ జుటలో.. ధరించిన హరుడాయన. .
పాటల తోటమాలి "వేటూరి" కావ్య గంగ ని .. జాతికి అందించి..
తన భావ సంపదను గంగా ప్రవాహంలో.. పరవళ్ళు త్రోక్కిస్తూ..
పాటల ప్రవాహంలో..పరమ పవిత్ర గంగమ్మ లా.. భాసిస్తూ.. తెలుగు తల్లి ముద్దు బిడ్డడు..
కావ్య సంద్రంలో.. తనొక పాయ అయి
మనలని నిత్యం ఆయన పాటలో.. స్నానించమని
తను మాత్రం.. హరిహరదులని.. కీర్తిస్తూ.. కావ్య రచనలు.. చేయడానికి..
కావ్య బ్రహ్మ గా.. సత్య లోకం వెళ్లి..
మనలని అనంత దుఃఖంలో ముంచి వెళ్ళిన పాటల తోట మాలి..
నీ పాట పువ్వు పరిమళించని నేల మౌనంగా .. భాస్పాంజలి ఘటిస్తుంది.
మిమ్ము.. స్మరణం చేసుకుంటూ.. మీ పాటని మనం చేసుకుంటూ..
మీ.. ఈ గీతం. గంగమ్మ లా మా కనులు ప్రవహింతలతో..


ఓం ఓం
జీవన వాహిని ... పావని
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయము తీర్చి శుభము కోర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావని
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి
గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి

మంచు కొండలో ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజాహిని
విష్ణుచరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని
అత్తింటికి సిరులనొసను అలకనందమై
సగర కులము కాపాడిన భాగీరధివై
బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి

గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి

జీవనదివిగా ఒక మోక్ష నిధివిగా పండ్లుపూలుపసుపుల పారాణి రాణిగా
శివుని జటలనే తన నాట్యజతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా
గండాలను పాపాలను కడిగివేయగా ముక్తినదిని మూడుమునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ గంగోత్రి

గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి

నా.. అభిమాన కవికి.. నీరాజనం ..

21, మే 2011, శనివారం

మళ్ళీ కావాలన్నా మనసు వున్నది "మరకతమణి" స్వరాలతోపాటు..పదాలు కూడా..

ఒక ఆసక్తికరమైన విషయం.. ఏమంటే.. మరీ అంత ఆసక్తి కాదనుకోండి.
అయినా నాకు మాత్రం బాగా నచ్చేస్తుంది.
ఈ పాట విని ప్రతి ఒక్కరు కాసేపు సరదాగా నవ్వుకుంటారు.
ఫక్తు ఒక ఫోక్ సాంగ్ ని .. తలపిస్తుంది. ఎంతో కష్టపడి.. అందరికి చూపుదామని.. జల్లెడ పట్టానో.! మొత్తానికి .. దొరికింది..
ఎంతైనా రాఘవేంద్ర రావు గారి హీరోయిన్ కదా.. ఆ చిత్రంలో..హీరో గారికే దొరకలేదు..
అందుకే నేమో .. "మరకతమణి" .. స్వరాలతోపాటు.. పదాలు కూడా.. అందించి.. ఔరా.. అందె వేసిన చెయ్యే అనుకునేలా..ఏం సాహిత్యం .!?. సూపర్ .. ఏం టీజింగో.. !! చాలా బాగుంటుంది.

ఆ హీరో.. ''అల్లరి ప్రియుడు" ఏమంటున్నాడో వినండి.. ఆ కుర్రది.. ఎంత నెరజాణో..మీరే కనండీ!!!
ఇక్కడ చూడండీ.. లేదా.. సమయం లేకుంటే ఆఖరున వినేయండీ!!!


సాహిత్యం ఇదుగోండి...

ఏం పిల్లది ఎంత మాటన్నది
ఏం కుర్రది కూత బాగున్నది
ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది
బాగున్నది కోడె ఈడన్నది
ఈడందుకే వీధి పాలైనది
కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది


శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి

సెనగలట్టు చేత బెట్టి సాగనంపింది
మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి

అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నాది
ఇనుకొని ఆరాటం ఇబ్బంది ఇడమరిసే ఈలెట్టా వుంటుంది
ఎదలోన ఓ మంట పుడుతుంది పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది
చిరు ముద్దుకి వుండాలి చీకటి అంది
ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది
తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది ("ఏం")

శుక్రారం మాలచ్చిమి నీకు సాటి అంటూ

పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నాడు
సోమారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి

మల్లెపూల కాపడాలు పెట్టమన్నాడు
ఉత్సాహం ఆపేది కాదంట ఉబలాటం కసిరేస్తే పోదంట
ఉయ్యాల జంపాల కధలోనే ఉ కొట్టే ఉద్యోగం నాదంట
వరసుంటే వారంతో పని ఏముంది
ఉత్తుత్తి చొరవైతే ఉడుకేముంది

మళ్ళీ కావాలన్నా మనసు వున్నది.. "ఏం "
ఇదండీ.. ఎం.ఎం.కీరవాణి..లిరిక్స్ + సంగీతం.. వెరసి ఒక హుషారైన పాట..
ఆస్వాదిన్చేయండి .

20, మే 2011, శుక్రవారం

భ్రమరాంబిక ఆలయం.. తుమ్మెద ఝుంకార శబ్దం... ఒక నమ్మకం

జ్ఞాన దాన మొనర్చి ,యజ్ఞాన మెపుడున్
బాపి ,ముక్తి పదమ్మును జూపి ,మేలు
కలుగజేయు సద్గుండు డొకండె  భువిని
అతని మనసారా ద్యానింతు నవవరతము ... 

ఇది మా అమ్మ నేర్పిన  తేటగీతి పద్యం.. 

శ్రీశైల శృంగే విభుదాతిసంగే 
తులాద్రితుంగే..పి ముదావసంతం
తమర్జునం మల్లికపూర్వమేకం 
నమామి సంసారసముద్రసేతుం ... 

ఇది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో  .. శ్రీశైల క్షేత్రంలో.. మల్లికార్జుని  దర్శనం..  యొక్క ప్రాశ్తస్యం చెపుతుంది. 
మా ఇంటిల్లపాదికి ఇష్టదైవం.. "మల్లికార్జున స్వామి "  ఆయన ని దర్శించుకోవడం.స్మరించుకోవడం .. మాకు..చాలా..చాలా  ఇష్టం.

  మా ఇంటిల్లపాదికి చాలా ముఖ్యమైన ఘట్టాలలో.. స్వామి ఆశీస్సులు   మాకు లభించాలని మేము  తరచు శ్రీశైలం స్వామి దర్శనం కొరకు వెళుతూ ఉంటాము.  అలా వెళ్ళినప్పుడల్లా.. స్వామికి ప్రాతః కాలంలో   అభిషేకం చేయించుకోవడం   చాలా ఇష్టం కూడా..  ఈ రోజు న  ప్రాతః కాలమున అభిషేకం చేయించుకోవాలంటే.. ముందుగా.. ఆర్జిత సేవల టికెట్  ముందు రోజున తీసుకోవాలి.  'గంగా సదన్ " లో.. మల్లికార్జున స్వామి  దేవస్థానం వారి కౌంటర్ రాత్రి ఏడు గంటలకి తెరువబడుతుంది. అక్కడ స్వామి వారి అభిషేకం టికెట్ వెల 1000 రూపాయలు.. భ్రమరాంబిక అమ్మవారి కుంకుమ పూజ టికెట్ వెల 350 .. రూపాయలు. పూజా సామాగ్రి టికెట్ తో పాటు దేవస్థానం  వారే ఇస్తారు.మనకు లభించిన టికెట్ల వరుస క్రమం ప్రకారం మనకి స్వామి సన్నిధికి స్వయంగా అభిషేకం చేయటానికి.. ప్రవేశం కల్పిస్తారు. దంపతులకి..మాత్రమే ప్రవేశం లేదా  సింగిల్  కి..ప్రవేశం ..ఉంటుంది.పురుషులు  పంచె  లేదా ఫేంట్  ధరించవచ్చు పైన మాత్రం  కండువా మాత్రమే కప్పుకోవాలి..అది నియమం. స్వామి ఆలయానికి  దగ్గరలో.. సాధారణ కౌంటర్ లో.. అభిషేకానికి.. టిక్కెట్లు సమయం ప్రకారం లభిస్తాయి కాని.. 600 వెల కల ఆ ఆర్జిత సేవలు..ఉద్యయం 08.30 తర్వాత జరుగుతాయి.. అప్పుడు సాధారణ భక్తులు దర్శనం కొరకు రావడంతో  చాలా వత్తిడి ఉంటుంది.. స్వామి దర్శనానికి .. వచ్చేవారి మద్య అభిషేకాలు ..అంత బాగా జరగవు.. అనే కంటే..మనకి..అసంతృప్తి ఉంటుంది. అంత దూరం వెళ్ళేది స్వామికి అభిషేకం  చేయించుకోవడానికే కదా! 

   ఇక పోతే.. మనం అభిషేకానికి..పన్నీరు, తేనె,గంధం,త్రయంబకం,జలం..వగైరా  తీసుకు వెళ్ళవచ్చు.. కానీ మనకి.. అవి స్వామివారికి సమర్పించే సమయం లభించదు. ఒక్కొక్క సారికి నాలుగైదు జంటలని లోపలకి..పంపుతారు. అక్కడ బలవంతులదే..ఒడుపుగా ఉన్నవారిదే పై చేయి. స్వామిని స్పర్శ  దర్శనం  చేసుకోనిస్తారు. .. "శివ శివేతి శివేతి  శివేతివా .. భవ భవేతి భవేతి వా.. హర హరేతి హరేతి హరేతి వా .".అంటూ.. మల్లన్న స్పర్శ దర్శనం తర్వాత అభిషేక జలాన్ని .. శిరస్సున  జల్లుకుని.. అమ్మ దర్శనానికి.. వెళతాము.అక్కడ అమ్మకి.. కుంకుమార్చన చేయించుకుని.. అమ్మ కరుణాశీస్సులు  అందుకుని .. భ్రమరాంబిక   ఆలయం  వెనుకకి వెళ్లి.. అమ్మ వెనుక దేవాలయ గోడకి..ఖచ్చితంగా .. అమ్మవారి విగ్రహం తిన్నగా చెవి ఆనించి  వినండి.. తుమ్మెద  ఝుంకార శబ్దం వినవస్తుంది.

 మా చిన్నప్పుడు..విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆ ఝుంకార  శబ్దాన్ని రికార్డ్  చేయించుకుని వచ్చి  భక్తిరంజనిలో వినిపించేవారట,. నేను..ఆ విషయాన్ని.. మా అబ్బాయికి చెపితే.." ఊరుకోమ్మా! నాకు చెపితే చెప్పావు..ఇంకెవరికి చెప్పకు.. భక్తి ముదిరి.. ..ఇంకా ఏదో అంటారు" అన్నాడు. కానీ నాకు.. ఒక నమ్మకం.   చాలా..నిశ్శబ్దంలో.. వింటే.. తప్పక  ఆ ఝుంకారం వినబడుతుంది... కానీ అక్కడ నిశ్శబ్దమే ఉండదు. అమ్మవారి గుడిలో..సేవలు జరిపే భూసురులు మాత్రం నిజమే తల్లి.. ఝుంకార ధ్వనం వినిపిస్తుంది. "యద్భావం తద్భవతి" అని చెప్పారు.


    అన్నట్టు అమ్మ వారికి కుడిప్రక్కన దేవగన్నేరు చెట్టు ఉంది.. ఎన్ని శతాబ్దాల నాటిదోనట. దేవ గన్నేరు పుష్పాల  సౌరభం మరపురాని..ఆఘ్రాణం. నేను అలాటి సౌరభం ఎక్కడా ఆస్వాదించలేదు. కానీ..అక్కడ అమ్మకి..స్వామి సేవకే పూచిన పూలు అవి. ప్రసాదంగా లభిస్తే భక్తి తో..కళ్ళకద్దుకుని  వాసన   చూడండి..మీకే తెలుస్తుంది.  వృద్ద మల్లికార్జున స్వామి ఆలయం, నాలుగు వందల ఏళ్ళనాటి..జువ్వి,అశ్వద్ధ ,వేప వృక్షం  ప్రసిద్ధి. అక్కడ ప్రదక్షణలు చేయడం ..చాలా మంచిది.    

శ్రీశైలం దర్శనం రెండు విధాల మేలు. ఒకటి భక్తి.. రెండోది.. ఆహ్లాదకరం. నాకు..చాల ఇష్టమైన ప్రదేశం ఇది.. ఎప్పుడైనా వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాను. "మల్లన్న" దర్శనం నాకు కొండంత బలం ఉత్సాహం .. మానసికంగా అలసి పోయినపుడు నన్ను నేను రీచార్జి  చేసుకోవడానికి  శ్రీశైలం వెళ్ళిపోతాను. సాక్షి గణపతి ,పాలధార,పంచదార.శిఖరధర్శనం ,ఘటకేశ్వర స్వామి ఆలయం.పాతాళ గంగ స్నానం.. అన్ని మామూలే! కానీ.. అక్క మహాదేవి తపస్సు  చేసిన స్థలం,ఇష్ట కామేశ్వరి టెంపుల్.. చాలా కష్ట  తరం. ఈ రెండింటి గురించి    .. మరొకసారి చెపుతాను..  ఇప్పుడు.. ఈ దృశ్యాలు చూడండి.        
.   
వెనుకనుండి.. మల్లన్న ఆలయ  శిఖరం  

కృష్ణమ్మ పరవళ్ళకి ఆన కట్ట .. మన జల సంపద 

నదీ విహారానికి నౌకలు సిద్దం 
అంతా శివమయం.. పాతాళ గంగ కెళ్ళే దారిలో.. నా  కెమెరా  కళ్ళకి.. ఎంత అదృష్టం 
రోప్ వే .. ఎంత సుందర దృశ్యం   

ఆలయ ముఖ ద్వారం.. ఇలా నాలుగు ప్రక్కల గోపురాలు 

శిఖర దర్శనం ఇక్కడినుండే.. 


జలవిహారానికి వెళుతూ...


.
అమ్మ సన్నిధికి .. ముఖ మండపం.. ఆలయ గోపురం   

స్వామి ఆలయ దర్శనమే.. ప్రశాంత..తీరం   మబ్బులు ఆడుకుంటున్నాయి  స్వామి సన్నిధి చెంత      

చత్రపతికి.. అమ్మ బహుకరణ ..

శ్రీశైలం  డాం వ్యూ ..   ..
స్వామి ..ని దర్శించి .. ఆహ్లాద కర దృశ్యాలు చూసారు  కదా!! .. శివ నామాని.. యః  పటేన్నియతః సకృత్  నాస్తి మృత్యు భయం తస్య పాప రోగాది  కించన..."ఓం నమః శివాయ "  తప్పకుండా "శ్రీశైల క్షేత్రం " దర్శించండి.. స్వామి ఆశీస్సులు..మీకు లభించాలని కోరుకుంటూ..  అక్షర దోషాలు ఉంటే మన్నించండి.

19, మే 2011, గురువారం

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదు..మద్యపానం చేసి..బస్ లు ఎక్కవచ్చా?

నేను నిన్న రాత్రి పదకొండు గంటల సమయం అవుతుండగా ..సరాగమాల ..తో.. రేడియోకి..గుడ్ నైట్ చెప్పేసి బయట గేటు కి.. తాళం పెట్టేసి రోడ్డువైపు యధాలాపంగా చూసాను.. ఒక మందు బాబు.. మాకు రెండిళ్ళ అవతల ఉంటారు. తూలుతూ..పడుతూ..లేస్తూ.. నడుస్తూ.. తిట్టుకుంటూ..వస్తున్నాడు..నేను టక్కున లోపలి వచ్చేసి ..తలుపు వేసుకున్నాను. నాకు..అసలు.. ఆ మందు   బాబులని చూస్తేనే భయం. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ .. తిట్టు కుంటూనో,తిడుతూనో....ఆడజన్మలు ..సిగ్గుతో..తలదించుకునేటట్లు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళని కన్నందుకు..అమ్మ ,కట్టుకున్నందుకు..భార్య ..అలాంటి తండ్రి ఉన్నందుకు పిల్లలు.. లోకం మొహం  చూడలేక తాము తప్పు చేసినట్లు తలదించుకు వెళతారు. వాళ్ళ పాటికి వాళ్ళు వెళుతూ..ఉంటారా.. ఇరుగుపొరుగు ఊరుకోరు.. "ఏమిటి రాత్రి మళ్ళీ ..మీ ఇంట్లో.. వీరంగం మొదలయింది" అంటూ సానుభూతి వాక్యాలు కురిపిస్తూనే.. లోపల లోపల నవ్వుకుంటారు. అయినా ఆ నోటికి హద్దు -అదుపు లేదు.. ఇరుగు పొరుగు..వినలేక చస్తున్నాం..కాస్త ఒక గదిలో  పెట్టి తలుపులన్న వేయండి.అంటూ..ఉచిత సలహాలు ఇస్తారు. గదిలో..పెడితే ఉంటారా? సృహలో..లేనట్లు నటిస్తూనే .. నిజజీవనంలో.. మాట్లాడలేని మాటలన్నిటిని  గుర్తుపెట్టుకుని మరీ తిడుతూ..మాట్లాడతారు. 

అడ జన్మలకి..ఎంత కష్టమో..పాపం....  పూటుగా తాగి నోరు పట్టకుండా..కూస్తున్నా.. గుడ్ల నీరు కుక్కుకుని ..వాళ్ళకి.. తిండి తినిపించడానికి..తాపత్రయపడతారు.. నాశనం అవుతున్న వాళ్ళ ఆరోగ్యం పట్ల దిగులు పడతారు...ఎంత అవమానంగా మాట్లాడినా ..సహించి ..ఏదోలే తాగి మాట్లాడాడు.. అనుకుని సర్దుకుపోతారు.  అయితే.. మా ..పక్కింటి ఆవిడ అలాటి బాపతు కాదు..  భర్త తాగి వచ్చాడో.. పొరపాటున కూడా..తలుపు తీయదు.. పిల్లలిద్దరిని ఏ.సి గదిలో పెట్టి డోర్స్ క్లోజ్ చేసి.. బయట గదిలో..తను పడుకుని .. ప్రహరి గేటుకి మాత్రం తాళం వెయ్యకుండా వదిలేస్తుంది.  భర్త రోజు తాగి   రావడం మాములే!. వచ్చి నానా యాగి చేసి.. అర్ధరాత్రి ..అందరిని లేపి.. పంచాయితి పెట్టింప చూస్తాడు.. అలా నాలుగైదు సార్లు.. అతని భార్యని .. ఇరుగుపొరుగు... "నువ్వు చేస్తుంది.. తప్పమ్మా.." అని హిత బోధలు చేసి.. అతనికి..పరోక్షంగా సపోర్ట్ చేస్తారు. .  ఇవ్వన్నీ  చూసి ఒకింత కటినత్వం అలవర్చుకుని.. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా  పట్టించుకోకుండా  ఉంటుంది.. అలాగే  దోమలు  కుడుతూ..ఆకలికి  మాడి .... ఆరుబయట పడి .. పోర్లుతుంటే పాపం చూసే వాళ్ళకి..జాలి. కానీ..ఆ ఇల్లాలు .. ఇద్దరు బిడ్డలతో.. అతని  తెచ్చిచ్చే అరకొర జీతంతో....అతని.. వ్యసనాన్ని,నిర్లక్ష్యాన్ని,భాద్యతరహిత్యాన్ని భరిస్తూ..అతని అసభ్య పదజాలాని భరిస్తూ.. ఎన్నాళ్ళు  అలా ఉంటుంది.. చెప్పండి... అలా ఉండక తప్పదు..అప్పుడైనా బుద్ధి వస్తుందేమో.. అనుకుంటాను.
   
 ఒక పది సంవత్సరాల కాలంలో.. ఎక్కడ చూసినా.. మద్యం ఏరులై  పారుతుంది అంటారు.. నేను.. స్త్రీల  దుఖం .. సముద్రంలో.. ఇంకుతుంది అంటాను నేను.  చాలీ  చాలని బతుకుల్లో.. ఎక్కువ నష్టపోయేది.. కుటుంబమే..!   .. మనని పాలించే  వారికి..బంగారు..ఖనిలు.. ఈ..త్రాగుబోతులు..గత సంవత్సరం ..సంక్షేమ కార్యక్రమాలకి  ..ప్రభుత్వం కేటాయించినది  పన్నెండువందల కోట్లు అయితే ..మద్యం అమ్మకాల షాపుల వేలం ద్వారా.. కూడబెట్టుకుంది.. పదిహేను వందల కోట్లు... సిగ్గు లేదు..ఈ..ప్రభుత్వానికి.  

అడుగడుగునా..మద్యం షాప్ లే.. ఆడవాళ్ళు..పట్టపగలే  రోడ్డు ప్రక్కన నడవటానికి.. బయపడుతున్నారు.. అలాగే రాత్రి సమయాలలో.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల వాహనాలలో..కూడా.. త్రాగి.. ప్రయాణిస్తూ.. ఉండేవారు తక్కువేమీ కాదు.. వాళ్ళు వచ్చి ఆడవారి మద్య నిలబడతారు..వాసన భరించడమే కాకుండా.. వాడు ఎలా బిహేవ్  చేసిన భరించడం..ఆడవాళ్ళ వంతు అయింది...అదేం అంటే.. తాగి ఉన్నాడులే ! పోనీయండి అంటారు. అయినా  బహిరంగ ప్రదేశాల్లో.. ధూమపానం  చేయకూడదు అని..  హెచ్చరికలు వింటూ ఉంటాము. మద్యపానం చేసి.. బస్ లు ఎక్క  వచ్చా? కూడదని..రూల్ పెట్ట కూడదా ?..అన్నాను నేను.. నా వంక వింతగా చూసారు.. నిజమే లెండి...ఆర్ టి.సి. కి..ఆదాయం  తగ్గుతుందేమో..కదా.. !? టీ.వి సీరియల్స్  లో.. తప్ప మద్యపానం ,ధూమపానం తప్పని  ఎక్కడా అంతగా.. కనపడదు.. మా అబ్బాయి ..అ హెచ్చరికలు చూసి తెగ నవ్వేవాడు.. మిలీనియం  జోక్..అనేవాడు.

ఏమైనా.. మద్యపాన నిషేధం అవసరం ఎంతైనా  ఉంది. .యువతరం  కూడా.. మద్యం మత్తులో.. తూగుతుంది.  ప్రపంచ కప్..క్రికెట్ ..పోటీలలో.. సెమి ఫైనల్స్ ,పైనల్స్ జరిగినప్పుడు.. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినాయి.. అవి కొన్నది కూడా..యువతే ..అంటే  ..నమ్మి తీరాలి...మనం . ఎక్కడ చూసినా బెట్టింగులు.. మందు పార్టీలు.. తండ్రుల తరం కన్నా కూడా పిల్లలు ఇంకా.. ఎక్కువ మత్తులోకి జోగటానికి.. అలవాటు పడుతున్నారు...  మా ప్రక్కింటి ఆవిడ  లాటి కోడలు..కావాలనుకుంటారో.. లేదా..  మాయదారి మద్యం బారిన  పడకుండా.. పిల్లలని ..కాపాడుకుంటారో!?తల్లిదండ్రుల విచక్షణకి  కి..పెద్ద పరీక్ష. 

అలాగే.. స్త్రీలందరు  కలసి.. దూబగుంట ఉద్యమాలకి..తెర తీయాలి... కదా!..అయినా.. ఊరు కి ఊరు మారిపోవడానికి ..ఇదేమన్నా.. " బాలచందర్".. సామాజికసృహాతో..తీసిన .రుద్రవీణ  సినిమా..నా? ఉద్యమాలని పట్టించుకునే.. మహానుభావులు ఎవరు?   పట్టించుకుంటే.. దానికి.. హంగులు,  రంగులు పులిమి సినిమాలు తీయడానికి.. మన టాలీవుడ్  లో..నిర్మాతలకి,దర్శకులకి..కొదవ ఏంలేదు కదా!ఒక ఉద్యమం వంద ఉద్యమాలై .. చైతన్య పరుస్తుంది..  అనుకుంటూ  .. నిద్రపోయానండీ.. కలలో..అంతా.. మద్యపానం నిషేధం జరిగినట్లు.. అందరు.. సంతోషం గా  ఉన్నట్లు.... కలలు.  ఆ కలలు  నెమరవేసుకుంటూ.. వాకిలి ఊడ్చి ముగ్గు పెడుతున్నాను.. మా ఇంటి ఎదురుగా గ్రూప్ హవుస్  కట్టారు కొత్తగా .. అందులో.. రెండు కార్లు ఉన్న ఒకరు అద్దెకి..దిగారు.. అ కారాయనేమో.. తూలుతూ.. పడుతూ.. కారు దిగి లోపలి వెళ్ళారు.. అలా.. వెళ్ళారో..లేదో..  కింగ్ ఫిషర్ ..లేబిల్  బాక్స్ ..డోర్ డెలివరీ కి.. వచ్చి డెలివరీ బాయ్  నన్ను అడ్రస్  అడిగాడు.. నేను చెపుతున్నాను.. వాళ్ళ అబ్బాయి వచ్చి.. సంతకం చేసి బాక్స్ లోపలికి   పట్టుకుని  వెళ్ళాడు.  హతవిధీ!!  నా  కలలు  కల్ల్లలేనా?..    

రహదారి మద్యం కాదు.. మద్యమే రహదారి ..నేడు 
మత్తు చిత్తులో..
మద్యం -మగువ 
ఈ పోస్ట్  కనుక  వాళ్ళలో..ఎవరైనా  చూసారా..! ఉంది..నా పని..!!!అని భయపడుతూ... భాధ పడుతూ.. "సురాపానం సదా జగతి."

17, మే 2011, మంగళవారం

పచ్చదనాలని.. గాలి గంధర్వాలని ఆస్వాదిస్తూ..ఈ దృశ్యమాలికలు.ఎన్నో ఏళ్ళ  తర్వాత స్వామి  నాకు తన  దర్శన భాగ్యం కల్గించడం వల్ల నేను తిరుమల కాలినడక బయలు దేరి వెళ్లాను..ఆ వెళ్ళేదారిలో.. సప్తగిరుల పై  భక్తి పవనాలు మనని తాకి.. స్వామి   సన్నిధి చేరడానికి..అలసట లేకుండా  సేదతీరుస్తూ...ఉంటాయి. ఇంకెంత... దూరం!?... వచ్చేసాం .. స్వామి దివ్య మంగళ  స్వరూపాని.. చూడగల్గు తున్నాం.. అనే ఆనందంలో కష్టమే తెలియదు.. అందుకే.. సునాయాసంగా.. ఆ.. శిఖరాలని.. భక్తిలో..అధిరోహిస్తూ.. సంసార కష్టాలని కూడా.. నీ దయతో.. ఇలా గట్టేకించు తండ్రీ.. అని కోరుకుంటూ.. పచ్చదనాలని.. గాలి గంధర్వాలని.. ఆస్వాదిస్తూ.. సాగుతూ... మద్య మద్యలో.. ఈ దృశ్యమాలికలు.      ..     

అరణ్యం నుండి జనారణ్యం ప్రక్కకొచ్చి.. ఆసక్తిగా బెదురుగా చూస్తున్న దుప్పి.. నా కెమరా కళ్ళకి చిక్కింది.

గాలిగోపురం .. ఇక్కడి చేరుకున్నాక అమ్మయ్య అనుకుంటాం..


ఆంజనేయ స్వామి.. మనం ఆయనకీ మ్రోక్కుతుంటే..
అంతా శ్రీ రామచంద్ర ప్రభు దయ అంటునట్లు ఉంటుంది..కదా!!!


నల్లనయ్య  సప్త గిరులపై.. మురళీగానం లో.. మనలని  మైమరపిస్తూ..   .. నాదమయం  వేదిక నిత్యం .. స్వామిని  కీర్తిస్తూ.. 

ఇస్కాన్ మందిరం  రెండు కళ్ళు చాలవే!!!!.విదేశీయులు .. ఒడలంత హరే రామ హరే కృష్ణ మయం


స్వామి... కైంకర్యం కి.. తరలి వచ్చిన సుమాలు..గోమాత విశిష్టత  తెలియజెప్పె చిత్రాలు 


తులసి త్వాం ప్రణమామ్యహం 


పద్మావతి అమ్మవారి సన్నిధి  చెంత పూలమ్మి .. ఎంత బాగుంది !!!


కపిలతీర్ధం 


కళ్యాణ శ్రీనివాస ఆలయం 


 బ్రహ్మ కడిగిన పాదం 

నేను గత మూడు నెలల క్రితం  తిరుమల కాలినడకన వెళ్ళినప్పుడు.. మద్యలోను... పరిసర ప్రాంతాలలోను వీలును బట్టి .. నా .. కెమరా లో..బంధించిన దృశ్యాలు  ఇవి.

16, మే 2011, సోమవారం

యద్దనపూడి నవలా నాయిక
యద్దనపూడినవలానాయికలు
ఆత్మగౌరవం,ఆత్మీయులు,సెక్రెటరీ,జీవనతరంగాలు,ప్రేమలేఖలు,మీనా,బంగారుకలలు,జైజవాన్,విచిత్రబంధం, రాధాకృష్ణ , మధురస్వప్నం,అగ్నిపూలు, చండీప్రియ కాంచన గంగ.. ఇవి నాకు తెలిసిన  చిత్రాలు. 
సౌకుమార్యం,ఆత్మాభిమానం,అందం.. ఇంకా ఉత్తమ గుణగణాలు కల అమ్మాయిలూ అబ్బాయిల పాత్రల  చిత్రీకరణకి.. యద్దనపూడి పెట్టింది పేరు.  తెర మీద  ఆమె "నాయికలు" కొందఱు...ఇక్కడ...చూడండీ!!!       

15, మే 2011, ఆదివారం

అసలే వేణువు..వినడమంటే తీపి కోత.. స్వప్నవేణువేదో.. సంగీత మాలపించే...

కొన్నిపాటలు వినడానికి బాగుంటాయి .. కొన్ని పాటలు చూడటానికి బాగుంటాయి.. వినడానికి చూడటానికి కూడా.. బాగుండే పాట "రావోయి చందమామ " చిత్రంలో.."స్వప్న వేణువేదోసంగీత మాలపించే"..పాట. నాకు చాలా ఇష్టమైన పాట..నా కాలర్ ట్యూన్ గా ఊరేగిన పాట.. పాటల పల్లకిలో.. ఊరేగిన పాట. అందరికి సర్వసాధారణంగా నచ్చడానికి..కావాల్సిన అర్హతులున్న పాట. .

ఈ పాటకి..గీత రచన వేటూరి. ఆ పాట సాహిత్యం .. చాలా బాగుంటుంది. విని విని.. పాట మొత్తం.. కలలో కూడా మర్చిపోను..అంత గాడంగా నాటుకుని పోయింది..పాట సాహిత్యం పై మమకారం అది. అందులో.. ఈ చిత్రం ..నా అభిమాన చిత్రం కూడా....ఈ పాట వింటుంటే.. మదిలో..యేవో..భావాలు.. మేల్కొలేపే.. నాలో...

స్వప్న వేణువేదో .. సంగీతమాలపించే
సుప్రభాత వేళ ... శుభమస్తు గాలివీచే..
జోడైనా రెండుగుండెల ఏక తాళమో..
జోరైన యవ్వనాలలో..ప్రేమ గీతమో...
లేలేత పూలబాసలు .. కాలేవా చేతిరాతలు (స్వ)

నీవీ ప్రాణం,నీవే సర్వం
నీకై చేశా వెన్నెల జాగారం (బాలు జాగారం అన్నది ఎంత బాగుంటుందో!)
ప్రేమ నేను రేయి పగలు ( భావన వ్యక్తి, రోజు లో..ఆ రెండు సగాలు)
హారాలల్లే మల్లెలు నీకోసం ( పరాకాష్ట భావం)
కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచువేళ
నిండు ఆశలు రెండు కన్నులై చూస్తే .. నే రానా ..
కాలాలే ఆగిపోయునా గానాలే మూగబోవునా... ( కలసిన రెండు హృదయాల గానాలు మూగాపోతాయా) (స్వ).

నాలో మొహం రేగే దాహం
దాచేదేప్పుడో .పిలిచే కన్నులలో..(రసజ్ఞత )
ఓడె పందెం గెలిచే బంధం ( ప్రేమికులలో..ఎవరు ఓడినా రెండో వారు గెలిచినా )
రెండు ఒకటే కలిసే జంటల్లో..
మనిషి నిండుగా మనసు తోడుగా ( మానసికమైన తోడు)
మలచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలి తీరం (నిజం కదా!)
వారేవా ..ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం (ఎక్సలెంట్ ఎక్స్ ప్రెషన్ )

స్వప్న వేణువేదో.. సంగీత మాలపించే .. అసలే వేణువు.. వినడమంటే తీపి కోత.. రాత మనసు దోచే మధుర గీత.
వేటూరి కలం ఒలికించిన ప్రేమ గీతం.. ఎస్ పి.బాలు,చిత్ర గళ మాదుర్యం .. తోడై ..మన కోసం
నాయికా నాయికలు.. వారి ఇద్దరి మద్య ఉన్నదీ ప్రేమ లేక ఆకర్షణ అన్నది తేల్చుకోవడానికి..పరీక్ష పెట్టుకుని.. దూరం జరిగి.. ఒకరి ఊహలలో...ఒకరు జీవిస్తూ.. పాటలో..జీవిస్తూ..అతను.. పాటతో ప్రాణం లేచొచ్చి..ఆమె..ని చుట్టేసిన భావ తరంగం ఈ పాట...

కధకి..అనుగుణమైన పాట. వేటూరి సాహిత్య సొబగులతో.. మణి శర్మ అందించిన స్వరాలూ.. ఘాడ సుప్తావస్థలో ఉన్నా మేలుకొలిపే..పాట. మణిశర్మకి..శాక్సోఫోన్ తో స్వరాలూ అందించిన (అజ్ఞాత)ఆ కళాకారుడికి.. హాట్స్అఫ్ఫ్..అన్నమాట. నాకు చాలా ఇష్టమైన ఈ పాటని.. మెమరి కార్డ్లో..నింపుకుని..వచ్చి మా అబ్బాయి చిరంజీవి .. నిఖిల్ చంద్ర నాకు.. పుట్టిన రోజు కానుకగా ఇస్తూ.. వినిపించిన రోజు.. నా మది పుటలలో.. మరపురాని జ్ఞాపకం. ఇక పాట చిత్రీకరణ అత్యద్భుతం ... ఈ.. పాట నాకిష్టమైన పది పాటల్లో..క్రమం...నంబర్ నాలుగు..
పాట మాత్రం ..అయిదు నక్షత్రాల మార్క్ పాట. ఈ.. పాట ఇనుస్త్రుమేంట్ మ్యూజిక్ కూడా మనసు దోచేస్తుంది. పాట చూసే ఓపిక లేకుంటే ..వినేయండీ.. ఇక్కడ ...

14, మే 2011, శనివారం

సినిమా పాటకి..ఎస్.జానకి.గళం..."కామధేనువు" లాటిదని..


మరుగేలరా.. ఓ..రాఘవా.. అంటూ .అచ్చ తెలుగు  అమ్మాయి  ..సబిత (భమిడిపాటి అనుకుంటాను.ఒక చిత్రంలో... కనిపించి..తన ముద్ర వేసుకుని వెళ్ళింది )  తన అభినయం తో..ఎంత బాగా ఆకట్టుకుంటుందో! చిత్రం ఆసాంతం నయనాలతోనే నటించి నటనలో..జీవించింది..

 అందమైన అమ్మాయి.. ఒక అబ్బాయి పై మనసు పడి.. ఆ..విషయాన్ని.. తను చెప్పలేక బిడియపడి.. ఆ అబ్బాయే.. ఆమె అంతరంగాన్ని గ్రహించి.. చొరవజూపి...తనని గైకొనమని..చెపుతూ..  ఆ అందాల భరిణ విన్నమించుకోవడం  ని..  ఎంత హృద్యంగా...చిత్రీకరించి..  తెర మీద అతివ మనసు ఇలా ఉంటుందని దృశ్య మనోహరంగా..చూపి   మనసు దోచేసే... మధురమైన పాట.. .. మరుగేలరా..పాట. 

 "సప్తపది " చిత్రం అనగానే ఎస్.జానకి..గళంలో  వైవిధ్యభరితమైన పాటలు.. గుర్తొస్తాయి. నాకు ఆ చిత్రంలో.. అన్ని పాటలకంటే.. "మరుగేలరా..ఓ..రాఘవా" చాలా ఇష్టం.  సంగీత పరిజ్ఞానం  లేని నాలాటి వారికే ఈ..పాట అంతగా నచ్చేస్తే.. సంగీతజ్ఞాన సంపన్నులకి..ఈ పాట ఇంకా బాగా నచ్చేస్తుంటుంది.. ఈ..పాట ఆస్వాదనలో..నన్ను  నేను మరచిన సందర్భాలు ఎన్నెన్నో!  ఎన్నిసార్లు..పాకాలు మాడ్చి .. తిట్లు తిని పాటని కట్టుకునేపని..అన్పించుకుని ఉంటానో  ! ...  "మరుగేలరా..చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచన ".. అన్న చోట..నాకు.. ఎంత బాగా నచ్చుతుందో! అలాగే రెండో..చరణం లో.."నిన్నేగాని   మదిన్ని".... .. అని నొక్కి చెప్పడం.. "ఎన్నజాల నొరుల ".. అంటూ..గట్టిగా అంతరంగాన్ని  వ్యక్తీకరిస్తూ  ..పునరుక్తిలో.."నిన్నేగాని మదినెన్నజాల"..అంటూ..సరళంగా సాగటం  వినడం..మధురం మధురం. 

మామ "మహాదేవన్ " స్వరాలకి.. జానకమ్మ గళం లోని మాధుర్యం .. ఎంత.. మధురమో! సంప్రదాయ కీర్తన లో.. ఒక  కన్నెపిల్ల అంతరంగం ని..  హృద్యంగా చూపించగలగడం.. ఎవరికి సాధ్యం కాదేమో.. అన్నంతగా  అత్యున్నత భావం ఒలికించిన ఆ.."సబిత" ఇప్పటికి కళ్ళ ముందు కదలాడుతుంటుంది.

  ఇక జానకమ్మని.. విశ్వనాథ్ గారు.. ఈ పాటకి.. ఎంతో ప్రశంసించారట. సినిమా  పాటకి..ఎస్.జానకి.గళం.. "కామధేనువు" లాటిదని..   ఏం కావాలంటే ఆ భావం ఒలికిన్చగల.. అత్యున్నత గాయని  అన్న ప్రశంస తో..పాటు.. విశ్వనాథ్ గారు  దర్శకత్వం వహించిన..ప్రతి చిత్రంలోనూ.. ఆమెతో.. పాటకి..పట్టం కట్టించారు. అని ..నా ఫ్రెండ్ ఒకరు.. చెబుతూ..ఉంటారు. నాకు లాగే ..ఎస్.జానకి..గళం అంటే..ఎంత పిచ్చో! అందుకే..ఇలాటి ఆసక్తికరమైన కబుర్లు..నాకు చెబుతూ..ఉంటె.. నేను.. ఇలా చెబుతూ..ఉంటాను.. ఒక వేళ.. ఇవేమైనా తప్పు అయితే (సాధారణంగా కాదు) మన్నించాలి మరి.  నాకు నచ్చినవారి గురించి  నచ్చిన విషయం చెప్పడం నాకు..ఇష్టం.

పాటని..చూడడం కంటే..వినడమే  బాగుంటుంది. అందుకే..ఈ పాట .. మరుగేలరా ..ఓ  రాఘవా     వినేయండీ!!!... మళ్ళీ మళ్ళీ వింటారు  ... నాకైతే ఈ పాట ఆస్వాధన  మాగాయ పచ్చడి అంత రుచి..మరి..


మా అ (త్త)మ్మ..తో..నాకున్న అనుబంధం..మాతృ దేవోభవ !!


అసలు నేను ఈ పోస్ట్ మొన్న మాతృ దినోత్సవం.. అప్పుడు పెట్టాల్సింది.

కానీ ఈ రోజుకి.. పోస్ట్ పోన్ చేసాను. కారణం ఏమంటే.. ఈ రోజు కి ఆమెకి నాకు..సంబంధం ఉంది.. 26 సంవత్సరాల క్రితం నేను.. మా ఇంట ఆమెకి కోడలిని అయ్యాను. ఆమె మా "అత్తమ్మ". 26 సంవత్సరాలలో.. నేను.. ఆమెలో.. తల్లినే చూసాను.

భిన్న సందర్భాలలో.. విభిన్న సమయాల్లో..ఆమె.. నాకు అమ్మ గానే తెలుసు. ఎప్పుడూ.. అత్త గారిలా.. ఉండటం నేను చూడలేదు. అందుకే.. మా ఈ పెళ్లిరోజు.. మా అత్తమ్మ గురించి..మీతో..పంచుకోవాలనిపిస్తుంది

కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలో.. 1943 వ సంవత్సరంలో.. "పోలవరపు" వారింట పుట్టి..అపురూపం గా పెరుగుతూ.. ఆ వూరిలో..ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ లో.. ఏడవ తరగతి చదువుకుంటూ.. తన పద్నాలుగేళ్ళ వయసులోనే.. పక్క ఊరిలోని "తాతినేని" వారింట పెద్ద కోడలిగా అడుగు పెట్టి.. ముగ్గురు బిడ్దల తల్లి అయి అప్పటికి..ఎప్పటికి.. అందరికి "పాపమ్మ" అయి.. అందరికి తలలోనాలుకై, ప్రేమపాత్రురాలై .. పాడిపంటలతో.. సిరిసంపదలతో...ఆనంద జీవనం సాగించిన సాగిస్తున్నస్త్రీ మూర్తి .. మా "అత్తమ్మ."

నా పద్దేనిమిదోయేట ఆ ఇంట కోడలిగా అడుగు పెట్టిన నాకు.. వంటావార్పు..మంచి చెడు అన్నీ.. ఆవిడ నుండే నేర్చుకున్నాను.

అసలు ఒక్క పని కూడా చేతకాని నాకు.. అన్నీ ఆవిడే నేర్పించారు. పద్నాలుగు సంవత్సరాల ఉమ్మడి కుటుంబ జీవనంలో.. ఆవిడకి నాకు ఉన్న అనుబందం అంతా ఇంతా కాదు.

వనజా..ఏం కూర వండుకుందాం ? అని ఆవిడ అడగటం...నుండి.. మా ఇద్దరికి కుదిరినంత సఖ్యత ..ఆమె కున్నమరో.. ఇద్దరి కోడళ్ళతో..ఉండదు ఎందుకో..నాకు అర్ధం కాదు. షాపింగ్ కి వెళ్ళడం.. కావాల్సినవి కొనుక్కోవడం ..మంచి చెడు మాట్లాడుకోవడం.. అన్ని విషయాలు.. ఆమె తో..నిరభ్యతరంగా మాట్లాడుతుంటాను.

వ్యవసాయ ప్రధాన వృత్తి గా కల మా కుటుంబాలలో.. పని పాట ఎప్పుడు ఎక్కువే! ఉమ్మడి కుటుంబంలో ఆమె ఎప్పుడూ..పని పాటలు.. అత్తగారి ఆరళ్ళు.. అన్నీ అనుభవించినా.. కోడళ్ళని ఎప్పుడూ.. ఏమి అనడం ఇప్పటికి ఆవిడకి రాదు. మగ పిల్లల తల్లిగా కోడళ్ళు అవి తేలేదు ఇవి తేలేదు..మంచి మర్యాదలు జరుపలేదు..అని అనడం అసలు ఆమెకి తెలియదు.. చక్కగా ముగ్గురు కొడుకులకి పైసా కట్నం ఇంటి క్రిందకి ఆశించడం ఆమె ఎరుగదు. ఆడ పిల్లలు లేని ఆవిడ...కోడళ్ళు.. చక్కగా ఉంటే  చాలు అని తలపోసేవారు. ఆవిడలో..గొప్ప సుగుణం. ఎవరిని ఏమి అనరు.గుంభనంగా ఉంటారు.

మా మామయ్యగారు..పది వరకు చదివి బాగా వ్యవసాయం చేసేవారు. ఉమ్మడి కుటుంబం నుండి విడిపోయాక వారికి వచ్చిన వాటా పొలం తో పాటు.. కౌలుకి తీసుకుని పసుపు,చెరకు,అరటి తోటలు,కూరగాయలు తోటలు వేసేవారు.. విపరీతంగా శ్రమించడం.. పంట చేతికోచ్చేసరికి.. ఏ తుఫాను లో రావడం అరటి తోటలు పడిపోవడం,మిగతా పంటలకి గిట్టుబాటు ధర లభించపోవడం.. అన్నీ ఆర్ధిక నష్టాలే! విసిగిపోయి కృష్ణా జిల్లా "తాడిగడప'' లో.. భూములని అమ్ముకుని.. నెల్లూరు జిల్లా లో.. కోవూరు కి సమీపంలో.. వ్యవసాయ భూములు కొని పెద్ద ఎత్తున ఆధునిక వ్యవసాయం ప్రారంభించారు.

ముప్పై ఏళ్ళ క్రితం ప్రారంభమైన ఆ దశ ఆరేళ్ళ క్రితం వరకు కొనసాగింది. ఇరవై రెండు ఎకరాల ఒకే క్షేత్రంలో..ఎన్ని రకాల పంటలు పండిచేవారో! అన్నీ వాణిజ్య పంటలే! అధిక దిగుబడులు..తో.. నాయుడు గారి కుటుంబం అంటే మారుమ్రోగిపోయేది.. (అక్కడ కమ్మ కులస్తులని నాయుడు లని ఉదహరిస్తారు) పంటలు ఎలా పండిస్తున్నారో..చూడటానికి.. ఆ జిల్లా లోని చుట్టుప్రక్కల ఊర్ల వాళ్ళు పదే పదే వచ్చేవారు. వాళ్ళకి ఆతిధ్యాలు ఇవ్వడం మా వంతు.

షుగర్ ఫాక్టరీ నుండి ఫీల్డ్ మాన్స్ వచ్చినా, ఎలక్షన్స్ అప్పుడు ప్రిసైడింగ్ అధికారులు వచ్చినా, ఎలక్త్రసిటి డిపార్ట్మెంట్ వాళ్ళు..ఇలా.. ఎవరికైనా ఆతిద్యం మా ఇంటే! విసుక్కోకుండా చక్కగా వండి వడ్డించేవారు. .. మా పొలం లో.. ఎన్ని రకాల ఫల వృక్షాలు,ఎన్ని రకాల పూల మొక్కలు..ఉండేవో..! నేను ఎప్పుడూ..వాటిమద్యే ఉండేదాన్ని. మా అత్తమ్మ మామయ్య పువ్వులు,కాయలు కోసి స్వయంగా పంచేవారు.

బాగా చదువులు చదివిన ముగ్గురు కొడుకులు కూడా మళ్ళీ వ్యవసాయం లో.. మునిగి తేలడం మా అత్తమ్మ కి ఇష్టం ఉండేదు కాదు.. అయినా ముగ్గురు కొడుకులు..అదే వృత్తిలో.. పీకలదాకా మునిగిపోయారు. నా పెళ్లప్పటికి మా వారు జాబ్ చేస్తూ..ఉన్నారు.. నేను ఆవూరిలో కాపురం ఉండనేమో అనుకునే దాన్ని. విచిత్రంగా అక్కడే ఉండిపోయాం. మూడు జతల ఎద్దులతో వ్యవసాయం ,నలుగురైదుగురు పాలేరులు, ట్రాక్టర్ డ్రైవర్లు..ఎప్పుడు.. వండటాలు,కడగటాలు,పెట్టడాలు.. ఎప్పుడూ పనే!మా అత్తమ్మకి తోడు నేను.

ఎంత విచిత్రం అంటే.. అక్కడికి పేపర్ కూడా ఈ రోజు పేపర్ రేపు వచ్చేది. అసలు బయట ప్రపంచం తో సంబంధం ఉండేది కాదు. రేడియో.. తర్వాత తర్వాత టీ.వి. వచ్చింది.. నెల్లూరు సిటీ కి వెళ్ళాలంటే.. కొంచెం దూరం వెళితే కానీ బస్ లు ఎక్కడానికి కుదిరేది. రోగం, నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే.. ఎంత ప్రయాసో! మా మామ గారంటే అందరికి గౌరవం,భయం. ఆయన ముందు ఎవరు మాట్లాడేవారు కాదు. కారు కాకపోయినా.. ఒక మోటార్ సైకిల్ అయినా కొనమని కొడుకులు గొణుక్కునేవారు.. ఆయన అవేమి పట్టించుకునేవాళ్ళు కాదు.వ్యవసాయం ఎంత బాగా చేశామా..ఎంత దిగుబడులు సాధించామా..?అన్నదే ముఖ్యంగా ఉండేది. వారికి.. కొడుకులకి మద్య మా అత్తమ్మ వారధి. ఇవన్నీ ఇష్టం లేని మా బావగారు..అక్కడినుండి మళ్ళీ విజయవాడకి వచ్చేసినా మేము అక్కడే ఉన్నాం.

తెల్లవారు ఝామునే లేచి పాలు పితకడం..నా డ్యూటీ . అల్లాగే మగవారు బయటికి వెళితే.. కరంట్ రాగానే.. పంపులు వదలడం , ట్రాక్టర్ డ్రైవర్ లెక్కలు చెపుతుంటే వ్రాసుకోవడం.. .. ఇలాటి పనుల మధ్య నాకు రోజు ఎలా గడిచిందో.. తెలిసేది కాదు. అలా పద్నాలుగు ఏళ్ళు గడచిపోయాయి

ఆడ పిల్లలు అంటే.. మా అత్తమ్మ కి ఇష్టం. ఒకొక్కరికి ఒక్క సంతానం చాలని ఆవిడే సూచించారు.. మేము పాటించాం కూడా..

దానికి ఒక కారణం ఉంది. మా కుటుంబాలలో.. అప్పటికి మేమే ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబం కావడం వల్ల అలా భావించేవారు. మా బావ గార్కి ఒక అమ్మాయి. తను డాక్టర్ శిరీష..ఇప్పుడు US లో ఉంది .మా మరిది గారికి ఒక అమ్మాయి.'" భవ్య" తను ఇంజినీరింగ్ చదువుకుంటుంది.వీళ్ళిద్దరూ అమ్మాయిలు కావడం .. పైగా ఎందుకో.. నేను అంటే ఆమెకి ఉన్న ఇష్టం కారణంగా మాకు అబ్బాయి పుట్టడం.. వాడిని అపురూపం గా పెంచడం .. తతిమా అందరికన్నా ఆమెకు నా కొడుకంటే పంచప్రాణాలు. కొడుకులకన్న కూడా ..ప్రేమగా.."అయ్యా!బంగారం ..అని పిలుచుకుంటుంది.. చదువు కునేందుకి కుదరడం లేదని మా అబ్బాయికి పదేళ్ళప్పుడు మేము అక్కడి నుండి విజయవాడకి.. తిరిగి వచ్చేసాం. తర్వాత కూడా వ్యవసాయం జరుగుతూ..ఉండేది. సడన్ గా ఆరేళ్ళ క్రితం మా మామగారు వ్యవసాయం పనులు చేయిస్తూ.. మద్యాహ్నం పూట భోజనం చేసి కూలీలని పిలవటానికి వెళ్లి .. వారి రాక ఆలస్యం అయిందని గుడి ముందు కూర్చుని.. ఆ గుడిలోనే .. హార్ట్ ఎటాక్ తో ఒరిగి పోయారు.

ఆయన మరణం మా అత్తమ్మకె కాదు మా అందరికి ఆశా నిఘాతం.

మనుమడి,మనుమరాళ్ళ అభివృద్ధి ,పెళ్ళిళ్ళు చూడకుండానే చనిపోయారని ఇప్పటికి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. అందరి ఆడ వారిలాగా .. ఆమె డబ్బు దాచుకోవడం ఉండేది కాదు.. మా మామ గారు..ఇస్తేనే తీసుకోవడం ఆమె అలవాటు.అలాగే..ఆమెని ఈ డబ్బు ఏం చేసావని అడిగేవారు కాదు.. వారిద్దరిని మించిన ఆదర్శం నాకు..ఎవరిలో..కనపడదు.

మా మామగారు ఎవరితోనూ మాట్లాడే వారు కాదు. ఏదైనా అవసరం వస్తే.. వనజ ని అడుగు.. ఇలా చేస్తే.. బాగుంటుందా అని అనేవారు.. అత్తమ్మ వచ్చి.. ఏమే! ఇలా చేస్తే ఎలా ఉంటుంది..? అనేవారు. వారికి సంబంధించి నేను.. వాళ్లకి.. రెండో..కొడుకుని ..కోడలిని.. కూతురిని కూడా.. చాలా క్లిష్ట సమయాలలో.. నాకు.. అండ దండగా ..నిలిచారు. అలా ప్రతి అత్తా-మామ ఉండగలగడం కూడా అదృష్టమేనేమో!

ఇప్పటికి.. ఆమె చేతి వంట నాకిష్టం. నేను పాలు తీసే సమయానికి కుంపటి వెలిగించి .. కాఫీ డికాషన్ వేయడం .. కూరలకి అన్నీ రెడీ చేయడం చేస్తారు. వద్దన్నా వినరు. పప్పులు విసరడం,వడియాలు పట్టడం.. అన్నీ చేస్తారు.

అలాగే.. మనుమడికి రకరకాల పిండివంటలు చేసిపెట్టడం చాలా ఇష్టం. నాలుగు రోజుల నుండి ముదిమనుమరాలు "శ్రీ" కి జ్వరమని ..ఆ..పాపనే అంటి పెట్టుకుని ఉంది. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టం. ఈ మద్య కాశీ క్షేత్రం వెళ్ళారు.అక్కడ మా మామ గారి పేరిట పిండ ప్రదానాలు పెట్టించి.. కాశీ అన్నపూర్ణ ఈశ్వరికి కి..మొక్కి.. ఆమె ముందు..కొంగుచాచి భిక్ష అడిగి తర్వాత అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో.. మా అబ్బాయి పుట్టినరోజు న ప్రతి సంవత్సరం అన్నదానం జరిగేలా డబ్బు కట్టివచ్చి. ఆ రశీదులు నాకు ఇచ్చినప్పుడు కోప్పడ్డాను. మామయ్యగారి పేరున కట్టకుండా.. ఇదేమిటి పాపమ్మా.!.అంటే.. నవ్వి ఊరుకున్నారు. మా అబ్బాయంటే అంత ఇష్టం ఆమెకి.

చుట్టరికాలలో.. శుభ కార్యాలకి,మంచి చెడు కార్యక్రమాలకి నేను వెళ్ళడం అంత కుదరదు అంటే వినరు .. వెళ్లి తీరాల్సిందే! అక్కడ అందరికి నన్ను చూపించి.. మా అశోక్.భార్య..మా రెండో కోడలు అని పరిచయం చేస్తారు. మంచి మంచి చీరలు ధరించడం.. నగలు పెట్టుకోవడం ఎక్కువ ఇష్టం. నేను నలుపు ఎక్కువ ఇష్టపడతానని .." ఏమ్మా..ఇంకేదైనా రంగులు కొనుక్కోరాదూ..!" అంటారు తప్ప ఆజ్ఞా పించడం ఉండదు.

మేము అక్కడ నుండి విజయవాడ వచ్చేసిన తర్వాత కూడా అక్కడే ఉండి ..పొలాలు చూసుకునేవారు. మా మామ గారి మరణం తర్వాత.. కొడుకులు.. ఎవరి కారణాలవల్ల వాళ్ళు.. ఆ భూములు అమ్ముకోవడం ఆమెకి తీరని బాధ. అలాగే.. ఉన్న ఇంటిని పడగొట్టి వాటాలుగా విడకోట్టుకోవడం వల్ల ఇప్పుడు అద్దె ఇంట్లో ఉండాల్సిరావడం మాకు మరింత బాధ.

సిరి సంపదలతో,పాడిపంటలతో.. వైభవంగా బ్రతికిన ఆమెని .. జీవన చరమాంకంలో..హాయిగా ఉంచాల్సిన భాద్యత మాకుంది. అప్పుడు.. మేము అమ్మిన భూముల వెల కోట్లాను కోట్లు.

ఇప్పుడు అవన్నీ..లేకున్నా.. ఆమెకి బిడ్డలే ఆస్తులు-అంతస్తులు కూడా.. అందుకే..మా అబ్బాయి అంటూ ఉంటాడు.. ఇలా అని.."పాపమ్మా! ఒక రెండు సంవత్సరాలు ఆగితే .. మన వూర్లో.. మంచి ఇల్లు కట్టి.. మల్లికార్జునరావు గారి ఇల్లు చూడు.. ఎంత బాగుందో.. !! అనుకునేలా కట్టి.. నీకు గిఫ్ట్ గా ఇస్తాను అంటే.. ఆమెకు.. ఎంత సంతోషమో! అది నిజం చేయడానికి.. మా కుటుంబం అంతా.. శ్రమిస్తున్నాం. అది నిజం అవుతుంది కూడా..

పద్నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మ చనిపోతే.. మా అమ్మని నేను.. మా అత్తమ్మలో..చూసుకున్నాను.

ఎన్నో.. సమయాలలో.. కొడుకులకన్నా.. నాకే ప్రాముఖ్యత ఇచ్చి.. నన్నే సపోర్ట్ చేసి.. నాకు అండ దండగా నిలిచి.. ..నన్ను కన్న కూతురిగా కన్నా ఎక్కువగా.. చూసుకున్న అత్తమ్మని.. నేను అమ్మగానే భావిస్తాను. అలా ప్రతి ఒక్క అత్తా గారు తమ కోడలిలో.. కూతురిని చూసుకోవాలని, ప్రతి కోడలు.. అత్తమ్మలో.. అమ్మని చూసుకుంటే.. ఎంత బాగుంటుంది అనుకుంటాను.

ఒకే ఒక కారణం చేత ఆవిడని మా దగ్గర ఉండటం కుధరనందుకు.. నాకు ఎంతో..బాధ. తెలిసి తెలియక నేనేమైనా తప్పు చేసినా ఆ  తప్పిదాల్ని క్షమించి..నాకు ఎంతో.. మార్గదర్శకత్వం చూపిన ఆ తల్లి మనసు.. నిజంగా ఆడ మనసు.

ఆమెలో.. నేను తల్లినే..చూసాను.. తప్పు చేస్తే.. దండించే.. తల్లినే చూసాను కాబట్టే..ఈ..రోజుకి వనజా..ఏం కూర వండుకుందాం అని ఆవిడ అడిగితే..నేను.. పాపమ్మా..! భోజనం చేద్దాం రా... అంటూ.. పిలిచేదాకా .. రోజంతా..  ఆ అనుబంధంతో.. గడుస్తూ..ఉంటుంది.

ఇది.. మా .. అ (త్త)మ్మ..తో నాకున్న అనుబంధం. మళ్ళీ జన్మంటూ ఉంటె ఆమెకే.. కోడలిని అయ్యే భాగ్యం ప్రసాదించు.. తండ్రీ.. అని భగవంతుడిని వేడుకుంటాను.

మాతృ దేవోభవ !!!!! ప్రాతఃస్మరామి పాదాభి వందనం..ఆమెకి..ఎప్పుడూ..కూడా..


Posted by Picasa