26, జూన్ 2023, సోమవారం

వ్యాపకాల వాతలు వ్యాపకాలు వాతలు పెట్టుకున్నట్లైతే యెలాగబ్బా!  

కడుపునిండిన మహిళలకు ఫోన్ ల ద్వారా బాధలు గాధలు పోసుకోలు కబుర్లు చాడీలు చెప్పుకోవడం కూడా పాతదైపోయింది. సీరియల్స్ కూడా విసుగెత్తిపోయాయి. చీరలు మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్లు స్టీల్ సామానులాగా సాధారణం అయిపోయాయి. అమెరికా కబుర్లు మరీ సాధారణం అయిపోయాయి.  ఆకాశం నీలిమేఘచ్చాయలోకి మారిన తర్వాత వెలుగు తగ్గినట్లు స్త్రీల ముఖాల్లో కూడా వెలుగు తగ్గి నిరాశ కమ్మి కొత్తగా ఏం చేయాలా అని అన్వేషణ మొదలు పెట్టగా.. వారికి పెన్నిధి దొరికింది.  మిద్దె తోటలు బాల్కనీ గార్డెన్స్. ఆ అవకాశం లేనివారికి  టిక్ టాక్ వీడియోలు రీల్స్. అవి రాజ్యమేలుతుండగానే.. సమాంతరంగా ఫేస్ బుక్ ఇన్స్టాగ్రామ్ టిట్వర్ వాట్సాప్ స్టేటస్ లు. ఇప్పుడేమో ప్రతి ఒక్కరికి యూ ట్యూబ్ చానల్స్. మూడు చుక్కల ముగ్గు పెట్టడం దగ్గర్నుండి థమ్ బిర్యానీలు ప్రపంచయాత్రల సాహసోపేతర వివరాలు పంచుకోవడం దాకా వచ్చి ఆగింది. కిచెన్ బాల్కనీ తోట నగలు గాజులు బొట్టుబిళ్ళలు ఈ రోజు వండిన కూర మధ్య రకరకాల మసాలాలు గుప్పించి వండిన సినిమాలు సీరియల్స్ అంతే శ్రద్దగా వండిన వార్తలను దాటేసి ఈ వీడియోలనే చూస్తూ.. సంభ్రమఆశ్చర్యాలతో అన్నం తినడం గాకుండా వీడియోలు చూసి బతికే ఇల్లాళ్ళు. పోనీ వీరు చూసి ఊరుకుంటారా.. వీడియో చూడటం ఆ వస్తువు కోసం ఆన్లెన్ ఆర్డర్ పెట్టడం.. లేకపోతే మార్కెట్ కి పరుగులు దీయడం. భక్తి ఆహారం వస్త్రాలు అలంకరణ సామాగ్రి గా లోహ వస్తువులను కొనడం విపరీతంగా పెరిగిపోయింది. కొనుక్కోవడం తప్పేం కాదు కానీ ఇరుగమ్మను పొరుగమ్మను చూసి వాతలు పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది. పూర్వం మన ముందుతరాల వారు పొలం బంగారం కొనుక్కొని ఆదాయాలను భద్రపరుచుకునేవారు. ఇప్పటి వారు అప్పులు చేసైనా ఆడంబరంగా బతకడం ఆనందం వస్తువుల్లోనే వుందనుకోవడం లోకి వచ్చేసారు. 


చదువు వైద్యం ఇంటి అద్దెలు కిరణా ధరలు కూరగాయల నాన్ వెజ్ ల ఖర్చులు పెరిగి భార్యభర్తలిద్దరూ అర్హతలకు తగినట్లుగా పనులు చేస్తూ కష్టపడి.. వస్తువినియోగానికి 60% వరకూ ఖర్చు పెట్టడం సాధారణం అయిపోయింది. మొదటి తారీఖు నే కష్టపడిన రూపాయికి రెక్కలొచ్చి యెగిరిపోతున్నాయి. 


అభిరుచులు వుంటే.. అవి కూడా నెరవేరడం సులభం కాదు ఇప్పుడు. మధ్యతరగతి ప్రజలు కాలక్షేపం కోసం చేసే పనుల వల్ల ఎంతోకొంత ఖర్చు తప్ప  వ్యక్తిగత అభిరుచి నెరవేరి సంతోషం మిగిలే సంగతి చాలా తక్కువ. మనిషి బాహ్య సంతోషాలను వెతుక్కుంటూ  అలజడితో  లోన ప్రశాంతతను పోగొట్టుకుంటున్నాడు. 


హస్తభూషణంగా మారిన మొబైల్ మూలంగా ప్రతి ఇంట్లో ఖర్చు ఆడంబరం పెరిగిన మాట వాస్తవం. అమాయకమైన స్త్రీలు కూడా రకరకాల వ్యామోహాల్లో చిక్కుకుని చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటున్నారు. నియోరిచ్ కుటుంబాల స్త్రీలను చూస్తూ వారిని అనుకరించాలని ప్రయత్నించకూడదు. వారికి ప్రదర్శించుకోవడం అవసరం. అందుకు మరియు కాలక్షేపం కోసం వీడియోలు చేసి వదులుతారు. పైగా పిచ్చి జనం ఎంతమంది చూస్తే వారికి అంత ఆదాయం వుంటుందట. చూసేవాళ్ళు పనీపాటా లేకుండా సోమరిపోతుల్లా వుండిపోతే వారు బిజినెస్ క్లాస్ లో విమానాల్లో ప్రయాణిస్తూ.. మళ్ళీ వాటిని కూడా వీడియోలు తీసి వదులుతున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే చిన్న పిల్లలు కూడా అన్నీ మాకు తెలుసు అంటున్నారు. ఎలా తెలుసు అంటే.. యూ ట్యూబ్ లో చూసాం అంటున్నారు. ఇక పెద్దలు చెప్పే విషయాలు నేర్పే పనులు గురువులు ఏమి అవసరం లేదు అనే స్థితికి చేరుకుంటున్నారు. మహిళలు విద్యార్ధులు ఖాళీ సమయాలను సద్వినియోగం చేసుకుని మానసిక వికాసానికి పనికి వచ్చే అభిరుచులు పెంపొందించుకుంటూ  కుటుంబ ఆర్ధిక ప్రగతికి తోడ్పడుతూ  పొదుపుగా బతకడం అలవాటు చేసుకోవాలి. ఇద్దరు కష్టపడి సంపాదించేది అంతా కూడా చెడిబడీ కొనేస్తే.. అవసరం అయినప్పుడు ఆదుకునేవారు లేక అలమటించిపోవాలి. 


వస్తువుల ఉత్పత్తి అంచనాల మేరకే తయారుచేయడం వుంటుంది. మితిమీరిన అవసరాలు వచ్చాయంటే అది విపత్తులు సంభవించినప్పుడే జరుగుతాయి. ఉత్పత్తి కి వినియోగానికి మధ్య అవసరం అనేది ఎంత వుంటుందో అనవసరం అనిపించడం కూడా అంతకన్నా ఎక్కువే వుంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతటా అలాంటి వ్యాపారమయ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. లాభాలు కొందరివే ఇక్కట్లు ఎక్కువమందివి. ఆ ఆలోచనతోనే ఇది 100% నా అభిప్రాయంగానే ఇది రాసాను. 


(యూ ట్యూబ్ లో వీడియోలు చూసి అప్పులు చేసి వన్ గ్రామ్ నగలు బ్రాస్ ఐటమ్స్ మొక్కలు పింగాణీ కుండీలు కొనడం రోజూ పూజలు చేయడం అనే వలలో చిక్కుకున్న ఒక పరిచితురాలిని చూసి ఈ స్పందన)


నక్క నీలిరంగు బానలో మునిగిందట.. ఎందుకు? 

కథ తెలిస్తే చెప్పండి. 
25, జూన్ 2023, ఆదివారం

విత్తిన జుట్టు- పచ్చని అడవి
ఒక ఊరిలో  ఒక వృద్ధుడు ఉండేవాడు.అతనికి చాలామంది సంతానం వుంది. వారందరి చదువులు పెళ్ళిళ్ళు అయ్యాక.. అతను విశ్రాంత జీవనం గడపాలని కోరుకున్నాడు. ఊరి చివర అడవికి దగ్గరగా వున్న అతని పొలంలో చిన్న ఇల్లు నిర్మించుకుని భార్యతో సహా అక్కడ నివసించసాగాడు. 

ఆ వృద్దుడికి చాలా అందమైన జుట్టు వుండేది. వయసు పెరగడంతో అతని జుట్టు రాలడం ప్రారంభించింది, అతడి జుట్టు అంటే అతనికి చాలా ఇష్టం. ప్రతి రోజూ రాలిన జుట్టును లెక్కించి అన్ని మొక్కలను నాటేవాడు.  కొన్నేళ్ళ తర్వాత  అతను అనారోగ్యంతో  వున్నప్పుడు అతని భార్య తన సంతానం అందరికీ సమాచారం పంపింది. పిల్లలందరూ వచ్చి తండ్రిని పరామర్శించారు. అతను అప్పటికి  పూర్తిగా బట్టతలతో ఉన్నాడు. 


ఆ రోజు తన పిల్లలతో ముచ్చటించాడు. ... "నా వెంట్రుకలు చూడండి ఎలా ఊడిపోయాయో!.  ఒకప్పుడు నా జుట్టు చాలా అద్భుతంగా ఉండేదని మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు పూర్తిగా పోయింది,  ఏమీ చేసి కూడా నా జుట్టును రక్షించలేకపోయాను. కానీ బయట అడవి వైపు చూడండి.

అది చాలా చెట్లతో చాలా అందమైన అడవిగా తయారైంది, కానీ నేను చనిపోయిన తర్వాత మీ అందరూ  అవన్నీ అమ్మడం ప్రారంభిస్తారు.వారు ఆ అడవిని నరికివేస్తారు. నా జుట్టు ఊడిపోవడం వల్ల నా తల ఎలా బట్టతలగా కనిపిస్తుందో అప్పుడు ఈ అడవి కూడా ఖాళీగా కనిపిస్తుంది” అని విచారపడ్డాడు.

 

“అయితే ఈ అడవినంతా మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి నాన్నా!” అని అడిగారు కొడుకులు. 


 ఆ తండ్రి తన మాటలను  కొనసాగించాడు.

"ఒక చెట్టును నరికిన ప్రతిసారీ అది చనిపోతుంది నా లాగే. 

అప్పుడు, నా జ్ఞాపకార్థం అక్కడే కొత్త మొక్క నాటండి. ఈ మాట మీరూ  మీ వారసులకు చెప్పండి.అదే విధంగా వారిని చేయమని కోరండి. . ఈ అడవిని పటిష్టంగా ఉంచడం మా కుటుంబ బాధ్యత అని కూడా చెప్పండి..అని కోరాడు. 


కొన్నాళ్ళకు ఆ వృద్ధుడు మరణించాడు. కొడుకులు తండ్రి జ్ఞాపకార్ధం ఒక చెట్టును నాటారు. ఆ భూమిలో ఒక చెట్టును కూడా నరకకుండా తగినచర్యలు చేపట్టారు. ఆ అడవి ఒక చెట్టును కోల్పోయిన ప్రతిసారీ, పిల్లలు ఒక చెట్టును తిరిగి నాటుతూ వచ్చారు. అలాగే వారి పిల్లలు, మరియు వారి తరువాత వారి పిల్లలు.మరియు శతాబ్దాలుగా ఆ పని చేస్తూనే వున్నారు. ఇప్పుడు అడవి ఒకప్పుడు  ఉన్నంత పచ్చగా  అందంగా తయారైంది. 


ఈ అడవి ఇంత పచ్చగా అందంగా ఉండటానికి  కారణం  ఎవరో తెలుసా.. మా ముత్తాత తాత. ఈ అడవి అంతా అతను తన వెంట్రుకలు రాలినప్పుడల్లా  తిరిగి విత్తిన అతని వెంట్రుకలు.. అని వారసులు నవ్వుతూ చెప్పుకుంటారు. 


బాగుంది కదండీ.. కథ. మన చుట్టూ ఉన్న పచ్చదనాన్ని కాపాడుకోవాలంటే.. మనం కూడా ఊడిపోయిన జుట్టు స్థానంలో మొక్కలను నాటాలి. 


ఈ మంచి సందేశాన్ని అందరికీ పంచండి. పిల్లలకు కథ గా చెప్పండి. 23, జూన్ 2023, శుక్రవారం

వానొచ్చే.. ఊరు గుర్తొచ్చే..

 


వారం రోజులుగా ముసురు. అయినా యెక్కడా చుక్క నీరు నిలిచి కనబడలేదు. ఎందుకో పద్దాక మా ఊరు గుర్తొస్తుంది. 

ఇదే ముసురు మా ఊరిలో పడితే.. పండగే.. ఎవరెవరికి అంటే.. మా ఊరి చెఱువుకు కప్పలకు బీడు భూములకు నిద్రాణమై వున్న గింజలకు రైతులకు 

పశువులకు పక్షులకు అన్నింటికి.. 

నాకొక సుందర దృశ్యం పారాడుతూ.. చెరువులో తమ్మచెట్టు పూసిన మల్లెల్లా కొంగలు..తొణికిసలాడుతూ.. ఎర్రని నీళ్ళు, నానిన చెఱువు కట్టలకు అలఅలలాడుతూ కొట్టుకునే కెరటాలు ఆ నీటిమీద తేలివచ్చే చల్లని గాలికి చిరుచలి కల్గించే ఆహ్లాదం.. చెరువుకట్ట కింద బురదమళ్ళను మెత్తంగా చేసే టాక్టర్ దమ్ము చక్రాల శబ్ధం.. అడుగు దూరం వచ్చే దాకా నిబ్బరంగా నిలబడి ఆహారపు వేటలో నిమగ్నమైన పక్షుల తదేకదృష్టి.. టాక్టర్ అడుగుదూరంలో వుందనగానే యెగిరిపోయే రెక్కల సౌందర్యం..  ఇంకొంత దూరంలోనే వాలి ఆకులు కనబడని  తెల్లతామరల్లా కదలాడుతూ వుంటాయి.

 లేత చివురుల ఆకుమళ్ళు, ముదురు పచ్చకు మారిన నారుమళ్ళు, ఆ నారుమళ్ళలో వొంగిన స్త్రీలు,  వారు విసిరి వేస్తున్న  ఆశల కట్టలు,  పార చేతబట్టుకుని గణెం సరిచేసుకుంటున్న రైతన్నలు. మొత్తంగా కలసి  భూమికి పచ్చరంగు వేయడానికి మన అందరి ఐదు వేళ్ళు నోటి దగ్గరకు చేరడానికి కృషి చేయడం కనబడుతూ వుంటుంది. 

మహా నగరాల్లో కూర్చుని కలలు కనే వారికి వారి కష్టం ఏ మాత్రం తెలుసు అని.. ప్లాస్టిక్ సంచుల్లో నార సంచుల్లో వివిధరకాల బ్రాండ్ ల్లో అందంగా ముస్తాబై వచ్చిన సంచీలకు కుట్టిన దారాన్ని విప్పడానికి కష్టపడే మనకు తెలుసా.. పండే ప్రతి గింజ వెనుక వున్న ఆశలు వారి శ్రమ  వారికి లభించిన విలువ? వారికన్నా మార్కెటింగ్ చేసేవారికే ఎక్కువ లాభం అని.

భూమి ని పంటతో కాక గజం విలువల్లోనో లక్షల కోట్ల విలువల్లోనో చూడటం అలవాటయ్యాక పంట విలువ తెలియకుండా పోతుంది. 

రాబోయే దశాబ్దాల్లో ఆహారపు కొరత ఏర్పడినప్పుడు కానీ రైతు విలువ పంట విలువ తెలియదు. వ్యవసాయం నష్టమై రైతులు వ్యవసాయాన్ని వదిలేసి స్విగ్గీ జమాటో  లాంటి ఆహార సంస్థల్లో అమెజాన్ లాంటి సంస్థల్లో డెలివరీ బాయ్ లుగా మారిపోతున్నారు. పల్లె వ్యవసాయం చిన్నసన్నకారు రైతు మాయమైపోయి ఫార్మ్ హౌస్ లు కార్పోరేట్ వ్యవసాయాలు వస్తాయనే ఊహ అబద్దమైతే కాదు. 

ఇంకొకవైపు మిద్దెతోటల ఫలసాయం మిద్దెతోటల రూపకల్పనల చుట్టూ నెలకొన్న వ్యాపార ధృక్ఫధం YouTube లో లక్షల వీడియోలు.. ఏమిటో అంతా అయోమయం నాకు. 

ఎప్పుడో రాసిన కవితను ..(దాదాపు పదేళ్ళ క్రితం అనుకుంటాను ) ఈ మధ్య ఒక పత్రిక వారు ప్రచురించారు. 

అప్పుడే నా ఆవేదన.. అలా వుంటే ఇప్పుడింకా ఎక్కువైంది.. 

ఆ కవిత.. హాలికుడా.. 

ఇదిగోండి.. ఆ కవిత. మన రైతువాణి మాసపత్రిక జూన్ సంచికలో.. 
22, జూన్ 2023, గురువారం

యుగళ గీతం
కొత్త ప్రయత్నం. సినిమా పాట రాయలేనా.. అని. పర్వాలేదంటారా.. !? 

అయినా కామెంట్ ఆప్షన్ లేదు కదా.. బావుందని ఇంకొకరు అనకుండా.. నేనే అనేసుకుంటే పోలా 😊😁


పల్లవి 

అతడు : 


వనమై వచ్చావా

విరులే పరిచావా

పరిమళమై కోసావా

తేనె ను పంచావా 

ఈ సీతాకోకచిలుకకు.. ఊ .. 


ఆమె :

మొయిలై వచ్చావా

నిలువున తడిపావా

దప్పిక తీర్చావా

ఊపిరి పోసావా

ఈ బయలు కు.. ఊ.. 


చరణం 1

అతడు: బుుతువులా వెళ్ళిపోకు ప్రియతమా! 

కాలమై తోడుండి పోవే 

శ్వాసగా నను కలిసిపోనీ

నీ అడుగులో అడుగేయనీయవే


ఆమె : హరివిల్లు లా మురిపించు చెలికాడా

ఇరుసంజెల నడుమ వాన వెలుగుల్లో 

మలి తొలి నడిమి చీకట్లో

మన ఏడేడు జన్మల్లో (పల్లవి)


చరణం 2


అతడు:విరిసిన తామర నీవు 

వెలిగే దీపం నీ హృదయం

సడి చేయని సరస్సు  నీవు 

గులక రాయిని విసిరే తుంటరి నేను


ఆమె : ప్రేమ నది వి నీవు 

ఆ నది వొడ్డును నేను 

ఆగని పయనం మనది

ముగిసెను గమ్యం వొకటై (పల్లవి)
21, జూన్ 2023, బుధవారం

ఆమె నవ్వు వినండీ..

 


నేను రాసిన కథల్లో నాకు నచ్చే కథ ఇది. నా కథల గురించి మాట్లాడిన  పాఠకులెవరైనా ఈ కథ గురించి మాట్లాడకుండా వుండరు. కథ ప్రచురితమైనప్పుడు ఎన్ని కాల్స్ వచ్చాయో లెక్కలేదు. ముఖ్యంగా రోడ్డు పక్క చిన్న చిన్న టిఫిన్ సెంటర్ లు నడుపుకునే స్త్రీలు ఆ స్త్రీల తాలూకూ పురుషులు ఫోన్ చేసి కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం నేను మర్చిపోలేదు. ఈ కథలో కృష్ణ  రాగద్వేషాలు వున్న సాధారణ యువకుడి పాత్ర. స్పందనలు భావనలు మంచితనం బ్రతకడానికి సరిపడ తెలివితేటలు అన్నీ వున్న సగటు మనిషి పాత్ర. ప్రతి కథలో రచయిత కనబడతాడు అంటారు కదా.. అలా అనుకుంటే .. ఆ కథలో బ్యాంక్ ఉద్యోగపాత్ర నేనే అనుకోండి అంటాను. 

ఈ కథలో కామయ్య తోపు ఆ టిఫిన్ బండి ఆమె ఆమె కూతురు నిజం. ఆమె ఇప్పుడు కనబడటం లేదనేది నిజం. కథంతా ఆవరించిన వాస్తవికత కల్పన ఏది తక్కువేం కాదు. అన్నీ సమపాళ్ళు. 

చాలామందికి.. నచ్చిన మాటలు ఇవి. 

నగల షాపులాళ్ళు,కార్ల కంపెనీలాళ్లు,బట్టల షాపులాళ్ళు ఆఖరికి గడ్డం గీసుకునే రేజర్ కోసం కూడా ఆడాళ్ళని చూపిస్తూ టివి లలో advertisementlu ఇస్తున్నారు కదా! నా వ్యాపారం బాగా సాగడానికి చెమటలు కక్కే మా ఆవిడని చూపిస్తే తప్పేం ఉంది సార్!


వినిపించే కథలు చానల్ లో వెంపటి  కామేశ్వరరావు గారు కథ వినిపిస్తానమ్మా అన్నారు. 

సంతోషం సర్.. ఎక్కువమందికి చేరాలనే కదా.. రచయిత కోరుకునేది అని  అనుకుని కథ పంపాను. చక్కగా చదివి వినిపించారు. ధన్యవాదాలు సర్. 🙏. 

మీరూ కథ వింటారు కదూ.. 17, జూన్ 2023, శనివారం

మనం మనలా వుందాం
ఆది పురుష్ సినిమా గురించి  ఫేస్ బుక్ లో ఓ చిన్న పోస్ట్ పెట్టాను. 

నేను రామాయణం చదవడానికన్నా ముందు విన్నాను. నాలా కోట్లమంది ఈ దేశంలో.. 

మూడు వందల రామాయణాలకు  తోడు ఇది నాలుగో వంద రామాయణం కావచ్చు.  

మన భావనలో రామాయణం మహా కావ్యం. మహనీయుడు శ్రీ రాముడు మహాతల్లి సీతమ్మ.  అది ఒక మహనీయ చరిత్ర. చరిత్ర కాదనలేని అవుననలేని ప్రజల విశ్వాసం. 

నాలుగో వంద రామాయణం ఎలా వుంటే ఏమిటి? 

ఇదో పని లేని గోల.. ఉబుసుపోక గాని. 🤔

అని.. 

ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇలా అడిగారు. 

వారు: మీకెందుకు రామాయణం ఇష్టం సీతకు శీల పరీక్ష చేసినందుకా?  

అని.

నేను : ఇష్టం అని అనలేదండీ.. రామాయణం విన్నా చూసినా అదో ఎమోషన్. కొన్ని రచనలు చదివినప్పుడు మనకు కల్గుతుంది చూడండి.. ఆ ఎమోషన్. అంతే!

వారు: అప్పుడు ఆ పారవశ్యంలో రాముడి పాత్ర చెబుతున్న శీలం, శంబూక వధ తాటకి హత్య, దక్షిణాణాది ధీరోదాత్తుడు దశకఠుంని సంహారం ఇవన్నిటినీ మీరు అంగీకరించినట్టే కదా మేడం

నేను: లేదండీ అంగీకరించను.

అని చెప్పాను. వివరణగా .. ఈ కింద.. 

************

నేను పరోక్షంగా చూసినదానికన్నా విన్నదానికన్నా చదివినదానికన్నా.. 

ప్రత్యక్షంగా చూడటం అనుభవంలోకి రావడం ద్వారానే ఒక స్థిరమైన అభిప్రాయానికి వస్తాను. 

ఒకరు వొక సంఘటన జరిగినప్పుడు వారు కూడా అక్కడే వుండి అందులో భాగస్వామ్యం అయ్యో కాకుండానో వుండి తర్వాత వారు నాకు ఆ విషయం చెబితే అది పరోక్ష కథనం. అది కూడా పూర్తిగా నమ్మను. 

సినిమానో నాటకమో కథో నవలో చూసినప్పుడు విన్నప్పుడూ చదివినప్పుడు కల్గిన స్పందన తాత్కాలికం. అవి మన మనస్సుల మీద బలమైన ముద్ర వేయకపోతే మాత్రం వాటి ప్రభావం చాలా తక్కువ. 

చరిత్ర అంటే ఆధారం వున్నదానిని అంటారు కదా! 

ఇక రామాయణం మహాభారతం కి చరిత్రాత్మక ఆధారాలు వున్నాయా లేదా అన్నది తెలుసుకోవాలనే ఆసక్తి నాకు లేదు. కొన్ని చూసి ఊరుకుంటాం కొన్ని విని ఊరుకుంటాం. అంతే తప్ప నిరూపణలకు సిద్ధమవడం పిడి వాదనలు చేయడం ఆ అభిప్రాయమే కరెక్ట్ అని అదరగణ్ణం ప్రదర్శించడం అవివేకమైన విషయం. 

ఇక వీటిల్లో విషయాలను తీసుకుని చర్చలకు నేను పూనుకోను. సీత కు జరిగిన శీల పరీక్ష ను ఇంకా కొన్ని అంశాలను వ్యతిరేకిస్తాను. 

అందరికి అన్ని విషయాల పట్ల స్పష్టత వుండదు. మిక్స్డ్ ఫీలింగ్స్ వుంటాయి. ఇవీ అంతే! 

నా చిన్నతనంలో మా నాయనమ్మ మన ఇలవేల్పు శ్రీరామచంద్రుడమ్మా అంది. నమ్మి భక్తిగా దణ్ణం పెట్టుకున్నాను. సీతా లక్ష్మణ హనుమంత సమేత శ్రీరామచంద్రస్వామి నా హృదయంలో వుంటారు. మా అత్తమ్మ శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం వుంచి పూజిస్తుంది. నాకు నమస్కారం చేసుకోవడం అలవాటు. అలాగే నా ఇష్టదైవం.. శ్రీగిరి మల్లన్న. మా అమ్మ భ్రమరాంబిక. వారిని పూజిస్తాను స్మరిస్తాను.అది నా వ్యక్తిగత విశ్వాసం. 

నా నమ్మకాలు విశ్వాసాలు నావి. అంతమాత్రం చేత నేను మెసులుతున్న సమాజంలో మూఢవిశ్వాసాలకు అరాచక అన్యాయాలను సమర్ధిస్తాను అనుకోవడం పొరబాటు. ఓ అన్యాయం జరుగుతుంటే దానిని అడ్డుకోవటానికి శివలింగం ఆకారమో శ్రీరామ చిత్రపటమో వుంటే దానిని తొక్కుకుంటూ వెళ్ళగల తెంపరితనం కూడా వుంది. ఒక ఆవు ఎవరినైనా నన్నైనా పొడుస్తుంటే  గోవులో ముక్కోటి దేవతలు కొలువై వున్నారని పొడిపించుకోను పొడవనివ్వను. ఏ ఆయుధమో లేకున్నా నా చేతులనే ఆయుధం చేసుకునే ప్రయత్నం చేయకమానను. 

నమ్మకాలు విశ్వాసాలు మనలో విచక్షణ ను నశింపజేయకూడదు. అది.. నా విచక్షణ. 

భక్తి పారవశ్యంలో రాముడి పాత్ర చెబుతున్న శీలం, శంబూక వధ , తాటకి హత్య, దక్షిణాణాది ధీరోదాత్తుడు దశకఠుంని సంహారం ఇవన్నిటినీ మీరు అంగీకరించినట్టే కదా .. అంటే.. అంగీకరించను. 

ఒక మనిషి లో వున్న లోపాలు వల్ల ఆ వ్యక్తిని మనం నిరసించవచ్చు.అదే వ్యక్తిలో వున్న మంచి గుణాల వల్ల అభిమానించవచ్చు. ఏది ఎక్కువ ప్రభావం చూపితే ఆ విధంగా ఆ వ్యక్తి పట్ల మనకొక అభిప్రాయం వుంటుంది తప్ప.. నిత్యం మనం ఆ వ్యక్తిని పనిగట్టుకుని మోయాల్లిన అవసరం లేదు. అది రాముడైనా వొకటే రావణుడైనా వొకటే మా పక్కింటి రామారావైనా వొకటే! నా మనుగడలో నాకు కావాల్సింది ఏదో నాకు స్పష్టంగా తెలుసు.

రాముడిని నెత్తికెత్తుకుని ఇతరులతో పేచీపడటానికి నేను మోడీ బిజెపి భక్తురాలిని కాదు. మా నాయనమ్మ చెప్పింది కాబట్టి ఆమె నమ్మిన విశ్వాసమేదో నమ్మకమేదో  ఆమె చూపిన మంచి ఏదో అదే నన్ను ఆవరించి వుంది తప్ప మిగతావి ఏవీ కాదు.. 

పరిణామక్రమంలో మనిషి కొన్ని వొదిలించుకునే దశలో వుంటాడు.. అన్నీ ఒకేసారి వదిలించుకోవడం సాధ్యపడదు. 

PS: కొందరు కమ్యూనిస్ట్ మార్కిస్ట్ భావజాలం కలవారు వేదికల మీద కులం మతం నాస్తికత్వం గురించి బల్లలు విరగగొట్టినట్టు మాట్లాడుతూ ఇంట్లో రహస్యంగా పూజలు చేయడం తెలుసు. నిత్యం సంధ్యావందనం చేస్తూ అస్పృశ్యత లాంటివి పాటించకుండా మంచిని తీసుకుని మానవత్వానికి చిరునామా గా నిలిచిన వారిని చూసాను నేను. స్వధర్మం పరధర్మం కి సున్నితమైన రేఖ వుంటుంది. అదేమిటో తెలిస్తే చాలు.

ద్వేషం Vs  పూజించడం 

రెండూ కాదు. మనం మనలా వుండటం. అది ఇంకొకరికి అనవసరం.


15, జూన్ 2023, గురువారం

అణ్ణయ్య మానవ శాస్త్రం

 పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అంటారు. అలాగే దూరపు కొండలు నునుపు అంటారు. అదే రీతిగా.. దేశం వీడితే కానీ దేశ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు గుర్తుకు రానట్టు.. వుంటుంది. ఎక్కడైతే పరాయి భావన మనుషులను ఉక్కిరి బిక్కిరి చేస్తుందో అక్కడ మనం మన ఉనికి మనవాళ్ళు అప్రయత్నంగా గుర్తుకు వస్తారు. అలాగే ఇతర దేశాల సంస్కృతి గురించి పరాయి వారికి ఆసక్తి ఎక్కువ. మన వాటిపై మనకు చిన్నచూపు అని కాదు కానీ.. అంత శ్రద్ధ ఆసక్తి వుండవు. ఎవరైనా మన దేశం గురించి మన గొప్పతనాన్ని గురించి చెప్పమంటే పట్టుమని పది వాక్యాలు చెప్పడానికి మాటలు తడుముకుంటాం. ఇతరములపై చూపిన శ్రద్ద మన వాటిపై వుండదు. 

మనకు సంబంధించిన వివరాలను సంపద రహస్యాలను పరాయి వారికి అందించేది కూడా మనవాళ్ళే అన్నది కూడా సత్యమే. ఈ కథ గొప్ప సెటైర్ గా తోచింది నాకు. 

ఈ కథలో ఒక పేద యువకుడు విదేశానికి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తండ్రి అనారోగ్యంతో వుంటాడు. తల్లి 15 రోజులకు ఒకసారి క్షేమసమాచారంతో ఉత్తరం రాయిస్తుంది. అతనికి విదేశంలో లైబ్రరీకి వెళ్ళి మన దేశ ఆచారాలు వ్యవహారాలు గురించి చదువుతూ వుంటాడు. .. ఇక కథ నేను చెప్పడం బాగుండదు. ముగింపు చదివేటప్పటికి హృదయం మెలిపెట్టింది. ఏమైందో  మీరే కథ చదివి తెలుసుకోండి. 

ఏ కె రామానుజన్ రాసిన  కన్నడ కథ “ అణ్ణయ్య మానవ శాస్త్రం“ కు తెలుగు అనువాదం ఇది. 

అన్వర్ పోష్ట్ లో  ఈ కథ గురించి ప్రస్తావించడం జరిగింది. వెతికితే ఆంగ్లం లోనూ తరువాత తెలుగు అనువాదం లోనూ ఈ కథ దొరికింది. అనువాదం: శార్వాణి. 


అణ్ణయ్య మానవ శాస్త్రం

డా. ఎ.కె. రామానుజన్


అతనికి ఆశ్చర్యంగా, చాలా ఆశ్చర్యంగా వుంది.

ఈ అమెరికా మానవశాస్త్రవేత్త ఈ ఫర్గూసన్ వున్నాడే, ఇతను మనుధర్మశాస్త్రం చదివాడు. ఇతనికి మన సూతకాల సంగతి ఎంత బాగా తెలుసు! తను బ్రాహ్మణుడై వుండి కూడా తనకివేమీ తెలియవు.

ఆత్మజ్ఞానం సంపాదించాలంటే అమెరికాకి రావాలన్నమాట. మహాత్ముడు జైల్లో కూర్చుని కటకటాలు లెక్కపెడుతూ ఆత్మచరిత్ర రాసినట్లుగా, నెహ్రూ ఇంగ్లండికి వెళ్ళి స్వదేశాన్ని గుర్తించినట్టుగా, దూరంగా వుంటేనే కొండ గొప్పదనం.

"మన దేహంలో పన్నెండు విసర్జక ద్రవ్యాలవల్ల మనకి మురికి-మైల. దేహంలోని జిడ్డు పదార్థాలు, వీర్యము, రక్తము, మెదడులోని మజ్జారసం, మూత్రం, మలం, చీమిడి, చెవిలోని గుల్మము, శ్లేష్మము, కన్నీరు, కంటి-పుసి, చమట.” మను(5.135)

చికాగోలో వున్నా లెక్క పెట్టడం కన్నడంలోనే లెక్కపెట్టాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు.... మొదటిసారి లెక్క పెట్టినప్పుడు పదకొండే మలాలు దొరికాయి. మళ్ళీ లెక్కపెట్టినప్పుడు పన్నెండు, సరిగ్గా పన్నెండు. ఈ పన్నెండింటిలో అతనికి తెలిసింది. ఉమ్మి, ఉచ్చ, దొడ్డి. చిన్నతనంలో చెప్పేవారు - ఎంగిలి చెయ్యకూడదు, దొడ్డి కెళితే శుభ్రంగా కడుక్కోవాలి. ఉచ్చపోస్తే కడుక్కోవాలి, అంటూ. వాళత్త కక్కసుకి వెళితే పిడికెడు మట్టి (మృత్తిక) కూడా తీసికెళ్ళేది. ఆవిడున్నంతకాలం పెరట్లో గొయ్యి ఒకటి వుండేదెప్పుడూ.

దక్షిణదేశంలో, నోట్లో పెట్టుకుని ఎంగిలి చేసి ఊదే బూరా, నాగస్వరం, ఇవన్నీ ముట్టకూడని వస్తువులు. ఎంగిలి వస్తువులు అస్పృశ్యులు మాత్రమే ముట్టుకుని వాయించే వాయిద్యం. వీణ బ్రాహ్మణలకు ముఖవీణ మాదిగ జాతికి.

కుండకన్నా వెండి, పత్తికన్నా పట్టు, ఉత్తమం. ఎందుకంటే దానికి ఈ పన్నెండు మలాలు అంత సులువుగా అంటుకోవు. పట్టు, పట్టుపురుగు వొంటినుంచి వెలువడే విసర్జక ద్రవం, నిజమే. కాని అది మనుషులకి మడి. చూడండి ఎలా వుంటుందో!

ఈ అమెరికన్లకి ఎన్ని విషయాలు తెలుసు! ఏవేవో లైబ్రరీలకి వెళ్ళి చూశారు.

కాశీలోని పాతకాలపు పండితుల్ని పట్టుకుని, వాళ్ళకి తెలిసినదంతా సంగ్రహించి పాండిత్యపు సారాన్ని పిండుకున్నారు. ఎక్కడెక్కడి తాళ పత్రాలు వెతికి, దుమ్ము దులిపి సేకరించారు. మహా ఆశ్చర్యం ఇతనికి. భారతదేశపు విషయాలు తెలుసుకోవాలని వుంటే ఫిలడెల్ఫియా, బర్క్లీ, చికాగో - అలాంటి చోట్లకి వెళ్ళాలి. వీళ్ళకున్నంత ఆసక్తి మన కెక్కడుంది ? వివేకానందుడు చికాగోకి రాలేదూ? ఆయన మన ధర్మం మీద ఇచ్చిన మొదటి ఉపన్యాసం ఇక్కడే కదా.

సూతకం తెప్పించే మూడు క్రియలలో ముట్టవడం మొదటిది. పుట్టుక దాని కన్న ఓ డిగ్రీ ఎక్కువది. అన్నిటికన్న ఎక్కువ సూతకం అంటే చావు సూతకం. చావు మైల తగిలినా చాలు. సూతకం తెప్పిస్తుంది. కాలుతున్న పాడె నుంచి వచ్చిన పొగ తగిలినా చాలు బ్రాహ్మణుడు స్నానం చెయ్యాలి. మాదిగ వాళ్ళు తప్పించి మరొకరెవరూ చచ్చిన వాడు కట్టుకున్న గుడ్డలు కట్టుకోరు.

(మను 10.39) శుభంలో శుభ ప్రదమైన ఆవు చనిపోతే ఆ గోవు మాంసాన్ని తినేవాళ్ళు అందరికన్న తక్కువ జాతి వాళ్ళు. కాకి, గ్రద్ద కూడా ఈ కారణం చేతనే పక్షి జాతిలో నీచజాతిగా పరిగణింప బడతాయి. కొన్ని సార్లు చావుకి, అస్పృశ్యతకీ వున్న అంచు చాలా సూక్ష్మంగా అనిపిస్తుంది. బెంగాల్లో తెలివికలవాళ్ళలో రెండు శాఖలున్నాయి. నూనె అమ్మేవాళ్ళు ఉత్తమ జాతివారు. కాని గానుగ ఆడించి గింజల్ని నూనెగా చేసేవాళ్ళు తక్కువరకం జాతి. ఎందుకంటే వాళ్ళు విత్తనాల్ని చంపుతారు గాబట్టి చావు - మైల వున్నవాళ్ళు.

ఇవన్నీ అతనికి తెలియనే తెలీదు.

అతనేమీ చదువుకోని వాడు కాదు. మైసూరులో రోజూ యూనివర్శిటీకి, లైబ్రరీకి చెప్పులరిగేలా తిరిగిన వాడే. అక్కడున్న వాళ్ళలో ఐదారుగురు గుమాస్తాలతో పరిచయం వుంది. అందులో శెట్టి తనతో బాటే ఎకనమిక్స్ చదువుకుని పోయిన సంవత్సరం ఫెయిల్ కావడంతో లైబ్రరీలో పనిలో చేరాడు. అణ్ణయ్య వచ్చినపుడల్లా శెట్టి అతనికి లైబ్రరీ తాళం చెవులు గుత్తి నిచ్చేసి 'కావల్సిన పుస్తకం చూసుకుని తీసుకోండి' అనేవాడు.


బరువైన గుత్తి అది. బాగా వాడటం వల్ల చేతి నుంచి చేతికి మారి, అరిగి, నున్నగా మెరుస్తున్న ఇనుప తాళం చెవులు. వాటి మధ్య కలిసిపోయిన పసుపురంగు ఇత్తడి తాళం చెవులు. ఇత్తడి తాళానికి ఇత్తడి చెవులు, ఆడతాళానికి మగ తాళం చెవి, మగ తాళానికి ఆడతాళం చెవి. పెద్ద దానికి పెద్దది, చిన్నదానికి చిన్నది. కొన్ని మాత్రం పెద్ద తాళానికి చిన్న తాళం చెవి, చిన్న తాళానికి పెద్ద చెవి. ఇలా విపర్యాసం, పర్యాయం, అనులోమం ఈ పుస్తకంలో చెప్పిన మనువు చెప్పిన పెళ్ళిళ్ళలాగ. కొన్ని బీరువా కన్న తాళం పెద్దదిగా వున్నా, తాళం వెయ్యడానికే కుదిరేది కాదు. ముట్టుకుంటే విడిపోయేది. కొన్ని మహా బిగువు. పగలగొట్టే తియ్యాలి. దాని వెనకాలే కళ్ళకి కనిపిస్తూ, చేతికి దొరకని పుస్తకం. ఏ కథ వుందో, సమాజ శాస్త్రవు నగ్న చిత్రం వుందో ఏమో ఆ పుస్తకంలో.


మైసూర్లో ఇతను చదివినదంతా పాశ్చాత్యుల గురించి. ఇంగ్లీషు, కన్నడం చదువుకున్నా అన్నాకెరీనా అనువాదం. మూర్తిరావు, షేక్స్పియర్ మీద రాసిన పుస్తకం. అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు రాసిన స్థల పురాణాలు సముద్రపు అవతల నుంచి, అపూర్వ పశ్చిమం, అమెరికాలో నేను లాంటివి.

మల శుద్ధికి మనువు పదకొండు మార్గాలు చెప్పాడు. బ్రాహ్మణ్యపు విధులు, అగ్ని, ప్రసాదము, మట్టి, అంతఃకరణ సంయమము, నీరు, పేడ చేతిలో పట్టుకుని చేసే ప్రమాణం, గాలి, కర్మలు, సూర్యడు, కాలము దేహదారులని శుద్ధి చేసేవి. - ఇవి

(మను 5-105) ఈ తెల్లవాళ్ళకి ఇవన్నీ ఎలా తెలిసిపోయాయి ? ఇంత దూరంలో, పదివేల మైళ్ళ దూరంలో, నీరు, సూర్యడు, గాలి, నేల, కాలాలని దాటివచ్చి ఇతను, ఈ గబ్బు కంపు కొట్టే చికాగోలో, అణ్ణయ్య - శ్రోత్రియుల జాతిలో మేకులా పుట్టిన అణ్ణయ్య, ఇక్కడికి వచ్చి ఇవన్నీ నేర్చుకోవల్సి వచ్చింది. ఈ చలిలో, ఈ తెల్ల మంచులో వుండి ఆ వేడి, ఆ ఎండల మధ్య బ్రతికే ఈ నల్లవాళ్ళ రహస్యాలన్నీ ఆ తెల్లవాళ్ళెలా తెలుసుకున్నారు? ఈ మంత్రం వీళ్ళ చెవుల్లో ఎవరు జపించారు? జర్మనీ మ్యాక్స్ ముల్లర్ సంస్కృతం నేర్చుకుని మోక్షముల్లా భట్టుగా మారి మాకే వేదాలు నేర్పుతున్నాడు కదా!

భారతదేశంలో అతను అమెరికా, ఇంగ్లండ్, యూరప్ అని జపించినట్లుగా ఇక్కడ ఈ అమెరికాలో అతను మళ్ళీ మళ్ళీ భారతదేశం గురించి చదివాడు, మాట్లాడాడు. కనపడ్డవాళ్ళందరికి కాఫీ ఇప్పించి, వాళ్ళిచ్చిన బీరు తాగి, తెల్ల పిల్లల చెయ్యి పట్టుకుని తనకి రాని హస్తసాముద్రికం చెప్పాడు.

ఇక్కడ అతనికి ఆంత్రపాలజీ గురించి జిజ్ఞాస. కామతురం లా, ఈ అత్మజ్ఞానాన్ని గురించిన ఆత్రం దీనిక్కూడా సిగ్గు, భయం, మొహమాటం లేవు. హిందూ సంప్రదాయం గురించి మానవశాస్త్రజ్ఞులు రాసినవి. దొరికినవన్నీ చదివాడు. రెండవ అటక (అర)లో ఆ పుస్తకాలు దొంతర్లుగా వున్నాయి. దాని నంబరు PK 321. నిచ్చెన ఎక్కి, కాలావధిలా చెక్కతో కట్టిన, చేతిపిడి వున్న అటక. ఈ పశ్చిమాన తూర్పు వచ్చి చేరుకుంది. దూరపు పచ్చదనం, ఇంటర్నేషనల్ హౌన్లో అలవాటైన తెల్ల అమ్మాయిలు.

"మీ దేశపు స్త్రీలు నుదుట ఎర్రటి బొట్టు పెట్టుకుంటా రెందుకు? అని కుతూహలంతో ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పడానికి సిద్ధంగా వుండాలి అన్న ఉద్దేశంతోనో ఏమో మైసూర్లో వున్నపుడు వాళ్ళ నాన్న ఎంత కోపగించుకున్నా చెయ్యని గీతాపారాయణం అమెరికాలో చేసి, వీరు, విస్కీ, గోమాంసం, దొడ్డికి వెళితే శాచానికి నీళ్ళు లేక కాగితంతో తుడుచుకునే చండాలత, ప్లేబాయ్ మ్యాగజైన్లో బూతు బొమ్మలు చూడ్డం, వీటి మధ్యనుంచి ఎకనమిక్స్ చదువు మధ్య నుంచీ ఖాళీ చేసుకుని అతను ఈ రెండేళ్ళూ హిందూ సంప్రదాయం చదివాడు. స్టాటిస్టిక్స్ సంఖ్యల మధ్య రామకృష్ణాశ్రమపు పుస్తకాల జాబితా. హిందూ సంస్కృతి తెలుసుకోవాలంటే అమెరికా రావాలి అనేవాడు. మా చికాగో లైబ్రరీలో ప్రజావాణి కూడా వస్తుంది సుమండీ - హిందూ సంస్కృతిని దాచిపెట్టి మూసిన తలుపులకి వేసిన తాళాలెన్నింటికో అమెరికాలో తాళం చెవులు దొరికాయి. తాళాల గుత్తే దొరికింది ఇప్పుడు.

అతను ఆ రోజు పుస్తకాల అలమార్ల మధ్యలో తిరుగుతున్నపుడు హఠాత్తుగా ఒక కొత్త పుస్తకం కనిపించింది. నీలిరంగు గుడ్డ అట్ట. చేతినిండుగా వున్న పుస్తకం, బంగారు రంగులో ఆ నీలం రంగు అట్టమీద, Hinduism: Custom and Ritual అని రాసుంది. స్టీవన్ ఫర్గూసన్ రాసినది. 1968లో అచ్చయిన కొత్త పుస్తకం. వేడి వేడి విషయాలు. సీమంతం, నామకరణం, పుట్టు వెంట్రుకలు . తీయించడం, అన్నప్రాశన, వడుగు, పెళ్ళి, సప్తపది, శోభనం రాత్రి ఇచ్చే పళ్ళు, బాదం పాలు....

"కొత్త పెళ్ళానికి ఏలకులు, బాదం పప్పు తినిపించి తనేమో తిన్నగా బాదంపాలు తాగేస్తాడురా ఈ రసికుడు" అంటూ హుణసూరులో ఎవరింట్లోనో శోభనం జరిగినపుడు బూతు జోక్ ఒకటి విన్నాడు.

భర్త భార్యకి చెప్పే సంస్కృత మైధున మంత్రం, షష్ఠ్యబ్ధి పూర్తి శాంతులు, ప్రాయశ్చిత్తాలు, దానాలు, ఉత్తర క్రియలు ఇలాంటి సంస్కారాలన్నిటినీ విడివిడిగా వివరంగా రాశారు.

బ్రాహ్మణుల ఉత్తర క్రియల వర్ణన, చిత్రాలతో సహా. ఎన్ని విషయాలు చెప్పాడు. 'ఈ ఫర్గూసన్ మహాశయుడు! మాటిమాటికి మనువు, పితృమేధ - సూత్రం అంటూ, సపిండం. ఎవరు నిజం, ఎవరు కాదు. సన్యాసికి, పళ్ళురాని పసిపాపకి సూతకం లేదు. వళ్ళు వచ్చాక బిడ్డ చనిపోతే ఒక రోజు మైల. బేల కర్మ (పుట్టు వెంట్రుకలు) జరిగి వుంటే మూడు రోజులు. శ్రాద్ధానికి ఏడుగురు కావాలి. కొడుకు, మనవడు, వాడి కొడుకు శ్రాద్ధం చేసేవాళ్ళు, తండ్రి, తాత, ముత్తాత చేయించుకునే వాళ్ళు. మూడు తరాలుపైన, మూడు తరాలు క్రింద మథ్యలో తను. ఏడు పిండాల మధ్యన వున్న పిండం. ఇలాంటి వివరాలెన్నో. దానికి తోడు ఏ యే వర్ణాలలో ఎవరెవరికి ఎన్నెన్ని రోజుల సూతకం అన్నదంతా వరుస క్రమంలో రానుంది. అంతేకాదు, పర దేశంలో సంబంధీకులు చచ్చిపోతే, సంగతి వినేవరకూ సూతకం లేదు. విషయం తెలిసిన వెంటనే సూతకం అంటుకుంటుంది. దానికి తగ్గట్టు రోజుల లెక్క, స్నానాల లెక్క అవ్వాలి. ఇతని శ్రద్ధ, కుతూహలం ఒక్కొక్క వాక్యానికి ఎక్కువ కాసాగింది.

పుస్తకాల మధ్యన అలాగే కూర్చుని చదివాను. శ్రాద్ధాలలో నాలుగు భాగాలనీ చెప్పింది పుస్తకం. అతను ఇంతవరకూ ఎవరి చావునీ చూసిన వాడు కాదు. మూడో వీధిలో చాకలి వాళ్ళు శవాన్ని అలంకరించి, వూరేగింపు తీసికెళుతుంటే రెండు సార్లు చూశాడు. పెద్దనాన్న చనిపోయినపుడు బొంబాయి వెళ్ళాడు. ఇంట్లో నాన్నకి మూత్రరోగం వున్నప్పటికీ, జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకుంటే ప్రాణభయం లేదని డాక్టర్లు చెప్పారు. ఒకటిన్నర సంవత్సరం క్రితం పక్షవాతం వచ్చి చెయ్యి పడిపోయింది. ముఖం ఎడం వేపు వంకర పోయింది. అయినా బాగానే వున్నారంటూ రెండు వారలకోసారి అమ్మ రాస్తూనే వుంది. నీరసమైన ఉత్తరాలు, దమయంతి పురుడు, అక్కడ ప్రతి శనివారం తలంటుకుని నీళ్ళు పోసుకో. లేకపోతే వేడి చేస్తుంది. సీకాయి పంపనా అంటూ వణికే అక్షరాలతో ఉత్తరం రాస్తుంది.

బ్రాహ్మణుడికి చావు దగ్గరయితే అతన్ని మంచం మీంచి కిందకి దింపేసి దర్భలు పరిచిన నేల మీద దక్షిణంగా కాళ్ళు పెట్టి పడుకోపెడతారు. దేహం నేలకి ఆకాశానికి మధ్య ఇబ్బందిగా మంచం మీదుండకుండా నిరాటంకంగా నేల దుండాలి. దర్భ ఎలాగూ భూసారాన్ని పీల్చుకున్న రసమయమైన గడ్డి నిప్పుకీ ప్రియమయినది. దక్షిణ దిక్కు యముడి స్వంతం. పితృ దేవతలకీ అదే దిక్కు.

ఆ తరువాత కుడి చెవిలో వేద స్వరం నోటిలో పంచ గవ్యం. చనిపోయిన మనిషి దేహం మైల. సజీవమైన అవు మలం పవిత్రం. చూడండెలా వుందో. దశ దానాలు - నువ్వులు, ఆవు, భూమి, నెయ్యి, బంగారం, వెండి, ఉప్పు, బట్టలు, ధాన్యం, పంచదార. మనిషి చనిపోగానే మగ పిల్లలంతా స్నానం చేసి, పెద్దకొడుకు జందెం ఎడం వేపు చంక కిందికి మార్చుకుంటాడు. అశుభానికి సూచనగా. దేహానికి స్నానం చేయించి, విభూది రాసి, భూమి తల్లికి శ్లోకం చెబుతారు.


పేజీ ప్రక్కనే నున్నటి కాగితం మీద ఒక బొమ్మ వుంది. మైసూరు ఇళ్ళల్లో మాదిరిగా వున్నట్టు ఇంటి ముందు వరండా, వెనుక గోడకి కటకటాల కిటికి, వరండా నేల మీద స్నానం చేయించి అలంకరించి పడుకోబెట్టిన శవం. చనిపోయిన వాడు దేవుడు. అతని దేహం విష్ణువు, స్త్రీ అయితే లక్ష్మీ. దేవుడికి చేసినట్టు దానికి ప్రదక్షిణ, హారతి అన్నీ జరుగుతాయి.

ఇప్పుడిక యముడికి అగ్ని నర్పించి నేతి హవిస్సు వేస్తారు. శవానికి, అగ్నికి సంబంధం కోసం ఒక నూలు పోగు వుంచుతారు. శవం బొటన వేళ్ళని దగ్గరికి చేర్చి కట్టి, దాని మీద నూలు గుడ్డ కప్పుతారు.

దీని చిత్రం కూడా వుందక్కడ. అదే మైసూరులో మాదిరి ఇల్లు. కటకటాల కిటికీ, కాని ఒకరిద్దరు విభూతి పట్టెలు పెట్టుకున్న బ్రాహ్మణులు చిత్రంలో వున్నారు. ఎక్కడో చూసినట్టుగా కూడా అనిపిస్తోంది. ఇంత దూరంలో వుండి చూస్తే మైసూరు విభూతి బ్రాహ్మణులందరి మొహాలు ఒక్కలాగే వుంటాయి అనిపించింది.

నలుగురు శవం మోసేవాళ్ళు. పాడె కట్టి ఇంటికి విముఖంగా శవం ముఖాన్ని తిప్పి, ఆఖరి వూరేగింపు బయలుదేరుతుంది.

ఇక్కడ మరొక చిత్రం. మైసూరు వీధే అది. సందేహం లేదు. నాలుగైదు ఇళ్ళు చిరపరిచితంగా అనిపించాయి. మూడు ప్రదేశాలలో వూరేగింపు ఆపి పాడె దింపుతారు. దానికి ప్రదక్షిణ చేసి క్షుద్ర దేవతలకి బియ్యపు గింజలు విసురుతారు.

వల్లకాటికి వచ్చాక దక్షిణ ముఖంగా చితి మీద దేహాన్ని వుంచి, బొటన వేళ్ళ ముడి విప్పి, కప్పిన తెల్ల గుడ్డ తీసి, దాన్ని శ్మశానంలో చండాలుడికి దానం చేస్తారు. కొడుకు, సంబంధీకులు శవం నోట్లో నీళ్ళు చిలకరించిన అక్షింతలు వేస్తారు. బంగారు నాణెంతో దాని నోరు మూస్తారు. నడుము కింద చిన్న· అరటాకో, గుడ్డ పీలికో తప్ప పుట్టినప్పుడున్నట్టుగానే వుంటుంది అప్పుడూను. బంగారం, ఈ కాలంలో ఎక్కడ దొరికిందో తెలీదు. పద్నాలుగు కారెట్లయితే ఫరవాలేదా? వేదసమ్మతమేనా?

పెద్ద కొడుకు కొత్త కుండలో నీళ్ళు నింపి, దాని పక్కగా చిల్లు చేసి, భుజం మీద పెట్టుకుని, చితి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి, నీళ్ళు నేలమీద పోస్తాడు. మూడు సార్లయ్యాక భుజం వెనుకగా దాన్ని విసిరేసి పగలకొడతాడు.

వల్లకాటి చిత్రం కూడా ఒకటుంది అందులో. దాన్ని చూసి ఇతని మనసు కలిచి వేసినట్లయింది. ఎందుకో అంతా చిరపరిచితంగా వుంది. మంచి కేమేరాతో తీసిన చిత్రం. చితి, దేహం, తల బాదామి ఆకారపు కావు మధ్యవయస్కుడి భుజం మీద కారుతున్న కుండ ఇతరులు.

దూరంగా చెట్లు అరె, ఈ మధ్య వయస్కుడి మొహం బాగా తెలిసినట్లుందే! దాయాది సుందర్రావు మొహమే. హుణసూరులో స్టూడియో వుందాయనకి. ఇక్కడెందు కుంది ఆయన ఫొటో? ఈ ఛండాలుడు ఇక్కడకెక్కడ్నుంచి వచ్చాడు? పక్క పేజీలో చితి మండుతున్న చిత్రం. దానికింద అగ్నికి చెప్పిన మంత్రాలు.

"అగ్ని దేవుడా ఇతని దేహాన్ని కాల్చకు, చర్మాన్ని కాల్చకు. ఇతన్ని పక్వం చేసి పితృ దేవతల దగ్గరికి చేర్చు. అగ్నిదేవుడా! నువ్వు ఈ యజమాని యజ్ఞంలో పుట్టావు. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఇతను పుట్టుగాక!

మంత్రం సగంలో ఆపేసి మళ్ళీ అతను వెనుక పేజీ తిప్పి దాయాది సుందర్రావుగారి మొహం ఓసారి చూశాడు. తెలిసిన మొహమే. కళ్ళజోడు తీసేశాడు. సగం నెరిసిన పూర్తి కాపు బదులుగా, కొద్దిగా శాస్త్రానికి తీయించిన బాదామి కాపు. కొత్తగా సర్వాంగ క్షవరం చేయించుకున్నాడు. రొమ్ము మీద వెంట్రుకలు కూడా లేవు. బొడ్డు కిందకి మేలుకోట మడి పంచె. ఇతడెందు కొచ్చాడిక్కడికి? ఈ పుస్తకంలోకి?

మున్నుడి చూశాడు. అందులో ఈ ఫెర్గూసన్ ఫోర్డ్ విద్యార్థి వేతనపు సాయంతో మైనూరికి 1966 68లో వెళ్ళినట్టుగా తెలిసింది. మైసూర్లో మ. సుందరరావుగారు, ఆయన కుటుంబము విషయ సంగ్రహణకి చాలా సహాయం చేసుకున్నట్లుగా వుంది. అందుకే మైసూరు ఇళ్ళు కనిపించాయన్న మాట! మళ్ళీ బొమ్మలన్నీ పరిశీలనగా చూశాడు. ఆ కటకటాల కిటికీ ఇల్లు ఆ పక్కిళ్ళు గోపీ ఇల్లు సంపంగి చెట్టున్న గంగమ్మ ఖాళీ ఇల్లు - తమ ఇంటి వీధి, ఆ వరండా తన ఇంటి వరండా శవం తండ్రిదయి వుండొచ్చు. మొహం సరిగ్గా కనిపించలేదు. వంకరబోయిన మొహం. పారే నీటిలో చూసే మొహంలా వుంది. వొంటి నిండా తెల్లటి గుడ్డ కప్పి వుంది. బ్రాహ్మణులూ తెలిసిన వారిలాగే వున్నారు.

మళ్ళీ మున్నుడి చదివాడు.

సుందర్రావుగారు చాలా సహాయం చేశారు. తమ సంబంధీకుల ఇంట్లో పెళ్ళి. ఒడుగు, సీమంతం, ఉత్తరక్రియలు అన్నిటికి తీసికెళ్ళి, ఫోటోలు తియ్యడానికి సాయం చేసి, ప్రశ్నలడిగి సమాధానాలు రాసుకోడానికి, మంత్రాలను టేన్లికార్డు చేసుకోడానికి వీలు కల్పించారు. ఇంట్లో భోజనం పెట్టారు. ఆయనకి ఈ మ్లేచ్చుడు చాలా కృతజ్ఞతలు వెలిబుచ్చాడు. మళ్ళీ చితి చిత్రాన్ని చూశాడు. మండుతోంది. దాని క్రింద అగ్నికి చెప్పే మాటలు. చెట్లు, చేమలు, మైసూరు శ్మశానంలో వున్నట్టే వుంది. క్రింద సన్నటి అక్షరాలతో కృతజ్ఞత : సుందర్రావుగారి స్టూడియో అని వ్రాసుంది. అతనే తీసిన చిత్రం.

అతని తండ్రి చనిపోవడంతో దాయీది సుందర్రావు కర్మ చేశాడు. కొడుకు పరదేశంలో వాళ్ళమ్మ తెలియజేయడానికి ఒప్పుకోలేదేమో. దూర దేశంలో వంటరిగా వున్నాడు. తండ్రి లేని నిస్సహాయుడు. దుర్వార్త తెలిపితే ఏమవుతాడో ఏమో. వెళ్ళిన పని పూర్తి చేసుకుని రానీలే అని వుండాలి. లేకపోతే, ఈ సుందర్రావే ఆ సలహా ఇచ్చి వుండాలి. అతని మాటంటే గురి అమ్మకి. పక్షవాతం వల్ల చెయ్యి స్వాధీనం లేక నాన్న వుత్తరాలు రాయడం లేదని సర్ది చెప్పింది అమ్మ రెండేళ్ళ క్రితం. ఇతను ఇక్కడి కొచ్చిన మూడు నెల్లకంతా జరిగిందన్నమాట. ఇక అమ్మనేం చేశారో! ఆచార వంతులంతా చేరి జుట్టు తీయించేశారా? సుందర్రావు మీద ఒళ్ళు మండుకొచ్చింది. నీచుడు, చండాలుడు మళ్ళీ మళ్ళీ చితి చిత్రాన్ని చూశాడు. కటకటాల కిటికి, ఆ శవం, సుందర్రావు బాదామి క్రాపు, బొడ్డు చూశాడు. వర్ణన చదివాడు.

వెనక, ముందు పేజీలు తిప్పాడు. కంగారులో పుస్తకం లైబ్రరీ నేల మీద పడింది. తలక్రిందులుగా ఆ పేజీలు కలిసిపోయాయి.

కంగారుగా పుస్తకం పైకి తీసి సరిచేసి తిరగేశాడు. మళ్ళీ తిరగేశాడు. అంతవరకూ ఏమీ మరింకే ధ్యాస లేని అతనికి కారిడార్ కొసలో వున్న అమెరికన్ కక్కసులో ఎవరో ఫ్లష్ చేసిన నీరు జలపాతపు చప్పుడులా భోరుమని పైకి లేచి దిగిపోయి ఇంకిపోవడం వినిపించింది.

పేజీ తిప్పాడు. సీమంతపు అధ్యాయంలో సీతలాగా వేషం వేసుకుని, తలకి కిరీటం పెట్టుకుని చాలామంది ముత్తైదువుల మధ్య కొద్దిగా మూతి వంకరగా పెట్టుకుని కూర్చుంది దాయాది సుందర్రావు కూతురు దమయంతి. తొలి చూలు. ఏడు నెలల పొట్ట కనిపిస్తోంది. ఈ సుందర్రావు ఎలానూ ఒక అమెరికన్ వచ్చాడు కదా, ఇదే మంచి సమయం ఫోటో తీయిద్దాంలే అని కూతురికి కడుపు రావడం కోసమే కాచుకుని సీమంతం చేయించి వుండాలి. ఉత్తర క్రియలు చూపిద్దామని కాచుకున్నాడేమో పెద్దనాన్న ఇంట్లో వీలు దొరికింది.

వాడుకున్నాడు. ఎంత డబ్బిచ్చాడో ఆ ఫెర్గూసన్ మానవుడు. ఆ ముత్తైదువల మధ్య అమ్మ మొహం కోసం వెతికాడు. కనబడలేదు.సంపంగి చెట్టు గంగమ్మ, అవతలి ఇంటి లచ్చమ్మ వున్నారు. అవే మొహాలు. ముక్కుపుడక, దుద్దులు, పైసా వెడల్పు బొట్టూనూ. ఆత్రంగా అనుక్రమణిక పేజీ తిప్పాడు. వకారం, వికారం, వుకారం దాటి,'వై' దాటి, వేదాలు వేష భూషణాలు దాటి, వైఖానస, వైదిక అనుక్రమణికలో వైధవ్యం దొరికింది. వైధవ్యం మీద మొత్తం ఒక అధ్యాయం వుంది. వుండదామరి. అందులో 233 వ పేజీ ఎదుట ఒక పొగసైన ఫోటో.

హిందూ విధవ. కొన్ని శైవ సంప్రదాయాల ప్రకారం తల మీద జుట్టు పూర్తిగా తీయబడి వుంది.అంటూ వున్నదున్నట్టు శీర్షిక. కృతజ్ఞత సుందర్రావుగారు, స్టూడియో : హుణసూరు. అమ్మ ఫొటో నా అది? తెలిసిన మొహమే. అయినా అపరిచితంగా వుంది. గుండు గీయించుకున్న తల. దాని మీద ముసుగు. అది నలుపు-తెలుపు చిత్రమే అయినా ఇతనికి తెలుసు అది ఎర్ర చీరని మాసిన చీరె.... సుందర్రావుగారు పసిఫిక్ సాగారానికి అవతల, 10,000 మైళ్ళ దూరంలో వున్న హుణసూరు బెలువాంబా అగ్రహారం వెనకాల సందులో నివసిస్తున్నందువల్ల ఆ రోజు బ్రతికిపోయారు


**************0****************


నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారు ప్రచురించిన కథా భారతి కన్నడ కథానికలు పుస్తకం నుండి సేకరించబడింది.రచయిత పరిచయం: డా.. ఎ.కె. రామానుజన్ జననం 1929, మైసూరు. మైసూరు విశ్వవిద్యాలయం, పూనా డెక్కన్ కాలేజీలలో విద్యాభ్యాసం. ఇండియానా విశ్వవిద్యాలయం వారి పిహెచ్.డి పట్టా 1963. ఇప్పుడు చికాగో విశ్వవిద్యాలయంలో ద్రావిడ భాషాధ్యయనంలో ప్రాధ్యాపకులు. హెూక్కుళల్లి హూవిల్ల (కవితా సంకలనం), హళదిమీను (అనువాద నవల) సామెతలు - కన్నడ గ్రంధాలు, The strides, Relation(కవితా సంకలనాలు), Speaking of Shiva, The Interior Landscape మరికొన్ని - ఇంగ్లీష్ రచనలు.10, జూన్ 2023, శనివారం

సీతాకోకచిలుక - సన్ బర్న్ #చిత్కళ కబుర్లు

ఆడుకుందాం రా… 

ట్రెడ్ మిల్ పై యాంత్రికమైన పరుగులు తీస్తున్న నా దగ్గరికి వచ్చి “ఆడుకుందాం రా.. నాయనమ్మా” అని అడిగింది మనుమరాలు. 

“బయట యెండ చురుక్కుమంటుంది బంగారం, సాయంత్రం ఆడుకుందాం” 

“అయితే బ్యాక్ యార్డ్ లోకి వెళదాం రా.. “

“కాసేపు ఆగి వెళదాం వుండు. అయినా అక్కడ కూడా యెండ. సన్ బర్న్ అయి నల్లగా అయిపోయావు యిప్పటికే”

“రా.. నాయనమ్మా వెళదాం” గట్టి పట్టు పట్టింది. 

నేను కేలరీల అరుగుదల లెక్క చూసుకుంటూ వున్నాను.

“నా కోసం బటర్ ప్లైస్ వెయిట్ చేస్తున్నాయి, నేను వెళతా, నన్ను తీసుకెళ్ళు”

నేను సరిగ్గానే విన్నానా.. అనుమానం ఆశ్చర్యం.

“ఏమన్నావు చిన్నితల్లీ .. మళ్ళీ చెప్పు”

“నేను బటర్ ప్లైస్ ని చూడాలి. సన్ బర్న్ అయిందేమో చూడాలి” 

ఆ మాట విన్నానో లేదో.. 3.5 వేగంలో వున్న నేను స్టాప్ నొక్కి పడకుండా వుండటానికి ప్రయాస పడ్డాను. కిందకి దిగి మనుమరాలిని గట్టిగా హత్తుకున్నాను. 

కళ్ళు చెమ్మగిల్లి.. గొంతు పూడుకుపోయి.. 

“నువ్వు గాక నాకు కవిత్వమో కథో.. యెందుకు తల్లీ.. 

పద చూద్దాం”

(ప్రపంచాన్ని పిల్లల దృష్టిలో చూడటంలో కరుణ వుంది)
5, జూన్ 2023, సోమవారం

ఓ పచ్చని ప్రేమ కథ వినండి

నేనెప్పుడూ నా కథలను పరిచయం చేయరూ, చదివి వినిపించరూ.. అని యెవరినీ అడగలేదు,అడగను కూడా! 

కొంతమంది నా కథలు నచ్చి ఆడియో బుక్ చేసి వినిపించారు. నా అనుమతి లేకున్నా నా దృష్టికి వచ్చిన ఆడియోలు విన్న తర్వాత కూడా వారిని కానీ ఎవరినీ కానీ ఇబ్బంది పెట్టలేదు కూడా. 

ఇదిగో.. ఈ కథల స్వాతి Swathi Pantula పరిచయమై రెండేళ్ళు దాటింది. చాలా కథలు వింటాను. స్పందిస్తాను. కథలు పంచుకుంటాం. కథ గురించి మాట్లాడుకుంటాం. కానీ నా కథ తన ఛానల్ లో రావాలని నేను అడగలేదు.. అడగను అని కూడా చెప్పాను. 

ఇదిగో.. ఇలా ఊహించని కానుక అందింది. 

నేను యెన్నో కథలు రాసాను. కానీ యీ కథ నాకు చాలా యిష్టమైన కథ. ఆ కథ ను నాకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందించింది స్వాతి. 

Love this!❤️ Thank you so much Swathi. ఎంత బాగా వినిపించారో. కథలో భావానికి తగినట్లు మీ గొంతును మలుచుకుని అన్ని పాత్రలను విడివిడిగా చూపించారు. ❤️💐 ధన్యవాదాలు.

స్వాతి పంతుల నా “బయలు నవ్వింది” కథ గురించి చక్కని పరిచయం చేసారు.. ఈ కింది విధంగా.. 

ఒక కుటుంబం లోని మనుషుల మధ్యే బంధాలు సడలి పోతుంటే మనిషికి చెట్టుకి మధ్య బంధం

నిలబడుతుందా?

 తోట లోని ఆఖరి చెట్టుని , తన హక్కుని కాపాడుకున్న మహిళ కథ

నిజం చెప్పండీ....యశోదమ్మ అడిగినట్టు  చెట్టుని నరికేస్తుంటే మీ ఒక్కో అవయవాన్ని కోసి పారేస్తున్నట్టు అనిపించడం లేదూ??

పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఓ చక్కని కథను వినండి.

ఈ కథను ఆడియో రూపంలో అందించడానికి అనుమతి ఇచ్చిన వనజ తాతినేని  గారికి కృతజ్ఞతలు.

#Telugukatha #teluguaudiobook #teluguaudiostories #teluguaudiokathalu #రాయికినోరొస్తే #కులవృక్షం #ఈస్తటిక్_సెన్స్

 బయలు నవ్వింది ఆడియో బుక్ ఈ లింక్ లో వినండి.. Pic courtesy: మాంట్రియల్ బొటానికల్ గార్డెన్ కంభంపాటి సుశీల గారి చిత్రం . 

1, జూన్ 2023, గురువారం

జీవనగంగ

 గబగబ నడుస్తూ పని చేసే యింటికి  వెళుతుంది గంగ. చేతిలో వున్న ఫోన్ మోగింది. సరళ నుండి ఫోన్. యెత్తగానే అవతలి నుండి ప్రశ్న.

“ఎక్కడ వున్నావు” 


“ మీ యింటికి దగ్గరలో వున్నానండి అపార్ట్మెంట్ లో పని చేసుకుని వస్తాను”


“నేను యింట్లో లేను కానీ నువ్వు యింటికి వెళతావుగా , నేను చెప్పిన పని చేస్తావు కదా” అదో రకం వొత్తిడి పెడుతూ అడిగింది సరళ.


ఇబ్బంది పడుతూ నిమిషం పాటు ఆలోచించి “గంట తర్వాత వెళతాను, పర్వాలేదా అండీ”


“బయటకు వచ్చాక ఫోన్ చేయి, యెక్కడో వొక చోట కాలక్షేపం చేస్తాను. చెప్పిన మాట మర్చిపోకు. బుస్స్ మనే ఆ పాము కోరలు పీకి పడేసేలా వుండాలి. ఇంకెప్పుడూ బుస కొట్టకూడదు,కాటు అసలే వేయకూడదు”


“సరేనండీ”.. నడుస్తూ ఆలోచిస్తుంది. ఇలాంటి వొక రోజే కదా..ఉన్నపళంగా తన యింటి రాతంతా మారిపోయింది అని బాధగా అనుకుంటూ రెండు నెలల కిందట జరిగిన చేదును గుర్తుచేసుకుంది గంగ. 


**********

మసక చీకట్లోనే తడుము కుంటూ మెల్లగా యింటి వెనక్కి నడిచింది నర్సమ్మ. ఈడుస్తున్న కాళ్ళతో రెండడుగుల యెత్తులో వున్న బాత్రూమ్ లోకి పోవడానికి చానాసేపు పట్టింది. పది నిమిషాల తర్వాత తలుపు తీసి చుట్టూరా చూసి నివ్వెరపోయింది. ఐదారు ఆకులతో వొత్తుగా నవనవలాడుతూ గోడ వారగా పెరుగుతున్న కొత్తిమీర మడి తోటకూర మడి మాయమైపోయాయి. 


“అయ్యో అయ్యో, నా ఆక్కూర మడంతా మాయమై పొయ్యింది. నిన్న పొద్దుటేల కూడా చూసేను కదా. ఏ ముదనష్టపు చేతులు పడ్డాయో,పరక్కూడా లేకుండా పీక్కుపొయ్యాయి,ఆ చేతులిరగిపోనూ ఆళ్ళకు కుష్ఠు రోగం రానూ, ఆళ్ళ అమ్మ కడుపు కాల”.. తిట్ల దండకం తో సన్నటి దుఃఖపు గొంతుతో మడి దగ్గరకు నడిచింది నర్సమ్మ.


“అత్తా, యెవరో యెందుకు చేత్తారు, నిన్న మజ్జేనం నీ కొడుకే పీక్కుపోయి అమ్మేసుకుని తాగేసాడు” అన్జెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంది గంగ.  

“ఓరి దుర్మార్గుడా, నీకు పోయేకాలం వచ్చింది రా,” అని తిట్టుకుంటూ రేకుల వసారాలోకి జేరి మంచంపై కూలబడింది. ఇంటిని వొకసారి కలియదిప్పి చూసుకుంది. ఒక పెద్ద గది దానిముందు రేకు వసారా.అందులో చిన్న వంట గది. వసారా లో తన మంచం. గవర్నమెంట్ కట్టించిన యిల్లు అది.  ఈ యింటి మీద కూడా వీడికి యిక అప్పు పుట్టనట్టు వుంది.అందినకాడికి యేదిబడితే అది యెత్తుకుపోవడమే మిగిలింది.ఇల్లు వొల్లు గుల్ల చేసుకుని నూరేళ్ళు బతికింది యెవరూ.. అందులో సగం ఆయువుంటే మా గొప్ప అనుకుంది ఖాళీ గా వున్న తన నుదుటిని తడుముకుంటూ. 


 తన చేత్తో తన కన్ను ని తానే పొడుచుకుంటున్నట్లు తమ బతుకుల్లో నెలకొన్న పేదరికాన్ని  యెన్నడూ జయించనివ్వని వ్యసనానికి బానిసైన కొడుకుని తలుచుకుని దిగులుపడింది. కళ్లల్లో గుచ్చుకుంటున్న పొద్దుకి యెదురుగా కూర్చుని కోడలిచ్చిన టీ తాగి నెమ్మదిగా లేచి గోనెపట్టా చేతబట్టుకుని కర్రపోటు సాయంతో ఆ కాలనీ సెంటరుకు బయలుదేరింది. 


మార్కెట్ లో గుత్తానికి  ఆకు కూర కట్టలు కొని మార్కెట్ బయట గోనెపట్టా పరుచుకుని కూర్చునేదాకా రోజూ కోడలు వచ్చి సాయపడుతుంది. ఆ రోజు కోడలిని సాయమడగాలన్నంత బుద్ది పుట్టక ఒంటరిగానే బయలెల్లింది. 


 నర్సమ్మ ఆకు కూరలు అమ్ముకుంటూనే కూసింత ఖాళీ దొరికితే చాలు కట్టల మట్టి దులిసేసి చీడ పట్టిన ఆకులేరేసి పచ్చబడిన ఆకులను తుంచేసి శుభ్రం చేసి క్యారీ బేగ్ లలో పెట్టి వుంచుతుంది.ఆ పనులన్నీ చేసుకునే తీరిక ఓపిక లేని కొందరు వాటిని వతనుగా ఆమె దగ్గరే కొంటూ వుంటారు. మరికొందరు ఆమెతో కూడా గీచి గీచి బేరమాడతారు. దయాశీలురు కొందరు ఆ వయస్సులో కూడా యేదో వొక పని చేసుకుని బతకాల్సిన అవసరాన్ని గుర్తించి గ్రహించి యింకొంత డబ్బును వుదారంగా యిచ్చిపోతారు. 


మధ్యలో నాలుగు ఇడ్లీలు తిని యింకోసారి టీ తాగి మధ్యాహ్నం దాకా పనిచేసుకుని యాభై వంద మధ్య డబ్బు చేసుకుని యింటికి చేరుకుంటుంది. కోడలు వుదయాన్నే వంట చేసి పెట్టి వెళ్ళి నాలుగిళ్లల్లో పనిచేసుకుని వచ్చేటప్పటికి .. నర్సమ్మ ఓ కునుకు తీసే వుంటుంది. 


కానీ ఆ రోజు గంగ ఇంటికి రావడం ఆలస్యం అయింది. 

నక్షత్రాలు కనబడనివ్వని కారు మేఘాలు నగరాన్ని కమ్మేసాయి. నగర శివారు  రాత్రి  దీపాలతో వెలుగుతుంది. మెయిన్ రోడ్ లో అడపాదడపా తిరిగే ఆటోలు తప్ప పెద్దగా సందడి లేని రోడ్డు. బస్టాఫ్ దగ్గర ఆగిన ఆటో లోనుండి  దిగిన గంగ నడుస్తుంది. 


వర్షాకాలపు గంభీరమైన నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ వీధి కుక్కల కాట్లాట. చేతిలోని గొడుగుని వాటికి  తర్జన గా చూపిస్తూ వడి వడిగా యింటికి చేరుకుంటూ.. మొగుడిని తలుచుకుని మహానుభావుడు ఖాళీ అయిన గ్యాస్ బండ యిచ్చేసి నిండు బండ తెచ్చాడో లేదో. అప్పు దొరికిందో లేదో అనే ఆలోచనలతో  యిల్లు చేరింది. 


వరండాలో మంచంపై కూర్చున్న అత్త.. “ఇంత ఆలస్యమైందేమే గంగా” అని అడిగింది. 


“యాభై మందికి వంట చేయడం చిన్నమాటా.. అన్ని చేసి సర్ది వచ్చేటప్పటికి యీ టైమైంది. కాళ్ళు పడిపోయినయ్యి అనుకో” 


“ఆడింకా రాలేదు.  నువ్వు కూడా యేమి తేకుండా చేతులూపుకుంటా వచ్చావే! అంత మందికి వండిచ్చుకుని నీకేం పెట్టలేదా” అడిగింది ఆరాగా ఆకలిగా. 


“వాళ్ళ పార్టీ అవ్వలేదు,రాత్రి పన్నెండింటికి అంట. అదవకుండా చుట్టాలు తినకుండా నాకెట్టా పెడతారు”అంటూ కాళ్ళు కడుక్కొని లోపలికి నడిచింది. 


“పిల్లలూ నేనూ  మద్దేనం యేదో వొకటి తిన్నాం. ఇప్పుడు యేం తినాలో యేంటో చూడు. సరిగ్గా కళ్ళు కనబడని నేను యేమి వండేది యెట్టా వండేది” అంది నర్సమ్మ. 


కుక్కపిల్లను వొళ్ళో కూర్చోబెట్టుకుని ఆడుకుంటున్న కృష్ణుడు తల్లిని చూసి గబుక్కున లేచాడు. 


మెటల్ గాజుకు గమ్ రాసి మునివేళ్ళతో చకచక దారాన్ని అల్లుతూన్న నవ్య తల్లిని చూసింది.చేతిలో గాజుని కిందేసి వొక్క వుదుటున లేచొచ్చి తల్లిని చుట్టేసి గగ్గోలు పెట్టి యేడ్చింది. . 


బడికి వెళ్ళి ఆరవ తరగతి చదువుకుంటూనే తల్లికి  ఉదయం యింటి పనిలో సాయం చేయడం సాయంకాలం  గాజులకు రంగులు అద్దడం రాళ్ళు అతకడం దారం చుట్టటం ద్వారా రోజుకు పాతిక ముప్పై రూపాయల సంపాదించి తల్లి చేతికిస్తుంది. అట్టాంటి పిల్ల అంతలా బావురమనడంతో బిత్తరపోయింది గంగ. . 


“ఎందుకు యేడుస్తున్నావే బంగారు తల్లీ,యేం జరిగిందో నువ్వైనా చెప్పవే అత్తా” అంది కంగారుగా. 


“ఏం జరగలేదులే గంగా, నువ్వు బెంబేలుపడమాకు. ఆ యెదవ సచ్చినోడు యేదో చేయబోయాడట. బిడ్డ బాగా భయపడినట్టుంది” అంది. 


“ఎవడాడు?


కూతురిని వొళ్ళోకి తీసుకొని వోదార్చి కాసిని మంచినీళ్ళు తాగిచ్చి యేం జరిగిందో చెప్పమని అడిగింది. 


 “ఆ రమణారావు డబ్బు యిస్తానన్నాడు. ఆ యింటికి వెళ్ళి డబ్బు తీసుకురా అన్నాడు నాన్న” అంటూ మొదలెట్టి జరిగిందేమిటో మననం చేసుకుని చెప్పసాగింది నవ్య. . 


 **********


సన్నగా రివటలా వుండి  పత్తికాయలంటి కళ్ళేసుకుని పెదాలు తడుపుకుంటూ ఆడాళ్ళని అదోరకంగా చూసే రమణారావు యింటికి వెళ్ళమంటే వెనక్కి తగ్గింది నవ్య. 


“ఆ యింటికి నేనెళ్ళను నువ్వే వెళ్ళు”  అంది తండ్రిని.   


“ఎల్లమని చెబుతుంటే నీక్కాదు. నా నాలుగు నాకు పడితేకాని కదలవేమో” అని కసిరాడు. 


అయిష్టంగానే కదిలింది.మూడొంతస్తుల  ఇంటి గేటు ముందు నిలబడి బెల్ కొట్టింది నవ్య. రమణారావు కుక్క తో కూడా వచ్చి తలుపు తీసాడు.ఆ యిల్లు చిన్నతనం నుండి నవ్య కు పరిచయమే.  తమ్ముడు పుట్టక ముందు తన తల్లి ఆ యింట్లో పనిచేస్తున్నప్పుడు  తనను కూడా తీసుకొచ్చి పెరట్లో కూర్చోబెట్టి పని చేసుకునేది. రమణారావు భార్య సరళమ్మ. అప్పుడామె యింట్లో లేదు. 


“ఎంత పెద్దదానివైపోయావే..నువ్వు అంటూ   బుగ్గ గిల్లాడు... టీచరమ్మ యింట్లో లేదు. కూతురిని తీసుకుని షాపింగ్ కి వెళ్ళిందంట. కాసిని కాఫీ కలిపియ్యవే నవ్యా.. తల పగిలిపోతుంది అన్నాడు. “నాకు కాఫీ పెట్టడం రాదండీ. మీరు డబ్బులిస్తే వెళ్ళిపోతా”.. అంది జంకుగా. 


“అదేం బ్రహ్మ విద్యా? నేను యెలా చేయాలో చెబుతాను నువ్వు చేద్దువుగాని. లోపలకు రా” అంటూ చొరవగా చెయ్యి పట్టుకుని వంటింట్లోకి లాకెళ్ళాడు. పాల గిన్నె పొయ్యి మీద పెట్టించి “నేను పైకి వెళ్ళి డబ్బులు పట్టుకొస్తా, పాలు పొంగకుండా చూడు” అని పైకి వెళ్ళాడు. నవ్య పాల వంక చూస్తూనే వుంది. లోలోపల బితుకు బితుకు మంటూ యేదో భయం.  కొద్దిసేపటికి పిల్లిలా చప్పుడు చేయకుండా వెనక నుంచి వచ్చి కొండచిలువలా వొళ్ళంతా చుట్టేసాడు. భయంతో అరుస్తూ విదిలించుకుంటూ గుమ్మం వైపు చూస్తే. తలుపులు  మూసేసి వున్నాయి. నవ్య వణికిపోతూ  బిగ్గరగా అరిచినా బయటకు వినబడని పెద్ద శబ్దంతో  టివి లో పాటలు. 


యెరుపెక్కిన కళ్ళతో  ముఖమంతా తడిచేసి  గుండెలపై కర్కశహస్తాలతో తడిమి తడిమి తర్వాత అకస్మాత్తుగా నీరుకారిపోయి కుర్చీలో కూలబడిపోయాడు. షాక్ నుండి అయోమయం లోకి తర్వాత  అసహ్యంలోకి మారిన ముఖంతో బయటకు రాబోతున్న నవ్య చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాడు. “ఇక్కడ జరిగింది యెవరికీ చెప్పకు. అప్పుడప్పుడు వస్తూ వుండు. నీకు చాలా డబ్బులిస్తాను” అన్నాడు.


ఆ డబ్బులు అక్కడే విసిరేసి పరిగెత్తుకుని యింటికి వచ్చి పడింది. డబ్బు కోసం యెదురుచూస్తున్న తండ్రికి  జరిగింది చెప్పింది. డబ్బులెందుకు  పడేసి వచ్చావని తండ్రి వొక్కటిచ్చాడు. ఏడ్చుకుంటా వెళ్ళి నాయనమ్మకు చెప్పింది. అది విన్నాక ఆవేశపడిన నర్సమ్మ యెదురుగా లేని కొడుకుని తిట్టిపోసింది, దినవారాలు చేసేసింది. 


తల్లితో ఆ విషయమంతా చెప్పిన నవ్య  మళ్ళీ వెక్కుతూ యేడ్చింది. వింటున్న గంగ కోపంతో వణికిపోయింది. పిల్ల ఏడుపు చూసి కడుపు తరుక్కుపోయింది.తల్లి ముఖంలో కోపం, ఏడుస్తున్న అక్కను చూసి బిక్కముఖం పెట్టుకున్నాడు కృష్ణుడు.  


గంగ కాసేపటికి మనస్సు చిక్కబట్టుకుని కూతురి వైపు చూసింది.  నవ్య కళ్ళలో యింకా వీడని భయం. చీటికిమాటికి తాగుబోతు తండ్రి తిట్టే తిట్లకు కన్నీళ్ళు తప్ప మరే యితర కలలు కనని ఇంద్రధనుస్సు లసలే  పూయని అమాయకమైన సోగ కళ్ళు అవి. అమ్మ ను యెప్పుడూ విసిగించకూడదని వొట్టు పెట్టుకున్నట్టు వుండే ముఖం.  నాన్నను యేవీ తెచ్చిమ్మని అడగని నోరు అది.  జరిగినదాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే యెట్టా! ఆ సంగతి మర్నాడు చూద్దాం, పిల్లలు ఆకలి తీర్చాలి ముందు అని నెమ్మదిగా లేచింది.

 

స్టీల్ బేసిన్ లో పిండిని ముద్దగా కలుపుతున్న తల్లి చేతి కదలికను తదేకంగా  చూస్తున్నాడు కృష్ణుడు. అమ్మెందుకో బాగా కోపంగా వుందని అర్దమై దిగులేసింది.  కసిగా కదిలే ఆ వేళ్ళ కదలికల్లో కట్టుకున్న వాడిపై వున్న కోపావేశాలు కళ్ళలో బిడ్డలకు పట్టెడన్నం వొండి పొట్ట నింపలేని ఆక్రోశం వాడికేమీ తెలియకపోయినా నెమ్మదిగా తల్లి పక్కనజేరి చేరాడు. 


గంగ యేడేళ్ళ కొడుకు వైపు చూసింది. మాములుగా అయితే ఆమెతో పాటు పీటపై కర్రతో రొట్టెలు చేయడానికి సరదా పడేవాడు. కానీ వుదయం నుండి అర్దాకలితో వున్నాడయ్యే. ఆ పనిజోలికి వెళ్ళకుండా పక్కనే కూర్చున్నాడు. వాడి చిన్ని పొట్ట ఆకలిని కళ్ళలో వినబడని ప్రశ్నలను అర్దం చేసుకున్నది గంగ. పిండి కలిపిందే కానీ సిలిండర్  లేని పొయ్యి పై రొట్టె యెట్లా కాల్చాలో  పాలుపోలేదు.మూడు రాళ్ళ పొయ్యి కింద  మండటానికి కట్టెలు గతి లేని కిరోసిన్ లేని యిల్లే గాని ఆమె గుండెల్లో మొగుడు రగిలించిన  నెగడు మండుతూనే వుంది. కలిపిన పిండి డిప్పను పక్కన పెట్టి వరండాలో మూలనున్న అట్టపెట్టె తెరిచి చూసింది. రొండే దోసిళ్ళు వున్న కర్ర బొగ్గుల సంచి కనబడింది.  కుంపటిని తీసుకొచ్చి గుమ్మం ముందు కూర్చుని కుంపట్లో బొగ్గులేసి నిప్పు పుట్టించే పని మొదలెట్టింది. 


అత్త నర్సమ్మ కోడలు  గంగ ఆలోచనలు కనిపెట్టింది. 


“పొద్దుననగా యెల్లాడు గేస్ బండ పట్టుకొత్తానని. ఇంతవరకు అయిపులేడు.ఏడ తాగి తందనాలు ఆడుతున్నాడో.” అంది. గంగ మాట్టాడలేదు. మళ్ళీ నర్సమ్మే అంది.  “పిల్ల అంతా చెప్పేసి వుంటదని నీకు మెుకం చూపిచ్చడానికి సిగ్గేసి యేడాడ తిరుగుతున్నాడో” అంది.


అత్త వైపు చురుగ్గా చూసి  “నీ కొడుకు సిగ్గు పడటమా, అదో యెనిమిదో వింత అయ్యిద్ది. గేస్ బండ తెస్తాడని నీకు నమ్మకం వుందా యేంటి, చేసే యెదవ పనుల చిట్టా రోజు రోజుకి పెచ్చరిల్లిపోతుంది. ఎవడన్నా బిడ్డను చూసి యెదవ్వేషాలేస్తే దుడ్డు కర్ర తీసుకొని వాడి నడుం యిరగ్గొట్టాలి. తాగుడికి డబ్బులొస్తయి అని పెళ్ళాన్నో కడుపునబుట్టిన బిడ్డనో యెవడి పక్కలోనో పండబెట్టే తార్పుడుగాడి అవతారం యెత్తడు. సరళమ్మ యింట్లో పని మానేసింది యిందుక్కాదు,నేను తప్పించుకున్నాననుకుంటే బిడ్డను ఆడికి అప్పగించబోయాడు. తలుచుకుంటే భయమేస్తంది,వొళ్ళంతా కంపరంతో  వుడికిపోతుంది.  నీ కొడుకుని మాత్రం వొదుల్తానా? రానీ ఆడి పని చెప్తా”. కుంపట్లో మంట గంగ ముఖంపై తారట్లాడింది కాసేపు. 


ఆమె పిండి గిన్నె తీసుకొని వుండలు చుడుతుండగా.. 

“ఇదిగో గంగా! ఆడిని నేను తిట్టలేదనుకునేవు,ఆడికి ఫోన్ చేపిచ్చి తిట్టా.  దైవసాచ్చిగా చెపుతున్నా! ఇంకెప్పుడైనా ఆయన దగ్గరకు డబ్బెట్టుకు రమ్మని పిల్లను పంపావా కాళ్ళిరగ్గొడతా సన్నాసెధవా! మరీ యింత సన్నాసి యెధవ్వి అవుతావనుకుంటే పురిట్లోనే వడ్డ గింజేసి చంపి వుందును” అని తిట్టిపోసా. ఆ రమణారావును మాత్రం నేను వొదిలాననుకున్నావా?, నడివీధిలో పెట్టకపోయినా యింటెనకమాలకు పిలిచి ఆడి పెళ్ళాం పిల్ల ముందర బుగ్గల్లో బుగ్గల్లో పొడిచి మొకాన ఊసి వచ్చా!  నువ్వొచ్చాక నీకొక మాట చెప్పి పోలీసు స్టేషన్ కి పోదాం అని చూత్తన్నా, నువ్వేమంటావ్ మరి” 


 “ఇప్పుడేడ పోతాం, ఆలోచిచ్చుకోని నన్ను. ఏ సంగతి రేపు చూద్దాం.” 


ఈ మాటలేవిటికీ  అర్దం తెలియని కృష్ణుడు అమ్మ చేతిలో పిండి రొట్టైలయ్యీ  పళ్ళెంలోకి  పరుగెత్తి వచ్చే గోధుమ వర్ణపు చంద్రుడై నోట్లో వెన్నముద్దై కరిగి భగభగమని మండే జఠరాగ్నిని చల్లబరుస్తాయని ఆత్రంగా యెదురుచూస్తున్నాడు. నవ్య మంచంపై ముడుచుకుని  ఆలోచిస్తుంది. 


పిల్లలకు అత్తకు రొట్టెలు పెట్టి తను మజ్జిగ తాగి పడుకుంది గంగ. ప్రసాద్ పేరుకు ఆటో తోల్తాడు. అంగట్లో సరుకుల్లా ఆమ్మాయిలను బుక్ చేసి రమణారావుకు అప్పగించేవాడు.  భార్య గంగ తన సొంత ఆస్థి అనుకుని ఆమెను రమణారావు వైపుకు నెట్టడానికి శక్తియుక్తులన్నీ ప్రయోగించాడు. గంగ మొగుడిని ఛీత్కరించుకుంది. పెట్టెబేడా సర్దుకుని పిల్లలను వెంటబెట్టుకుని పల్లెటూరుకు బయలెల్లింది. కాళ్ళబేరానికి వచ్చినట్టే వచ్చాడు కానీ యింటికి రావడమే మానేసాడు. గంగ కాకపోతే మంగ అన్నట్టు వేరొక స్త్రీతో రెండో యిల్లు యేర్పరుచుకున్నాడు. ఆ సంగతి తెలిసినా పట్టించుకోలేదు గంగ. పట్టించుకుని గనుక యేమి చేయగలను,ఎక్కడైనా రెక్కలు ముక్కలు చేసుకుని బతకాల్సిందే కదా బిడ్డల చదువు కోసమైనా పట్నాన్ని అంటిపెట్టుకుని వుండాలి తప్పదు అనుకుంది. 


సన్నగా మొదలైన వాన కుంభవృష్టి గా మారింది. గంటల్లోనే లోతట్టు ప్రాంతంలో వుండే వారిళ్ళ మధ్య కలకలం.దాదాపు అందరి  ఇళ్ళను వరద చుట్టేసింది. పిల్లలు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ఆడాళ్లు కంగారుగా చేతికందిన చెంబూ తపేళ మూటాముల్లె నెత్తినెట్టుకుని పిల్లలను పట్టుకుని  మోకాలు లోతు నీళ్ళలో కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నారు. మగవాళ్లు  ఇళ్ళ వరుసను బట్టి రోడ్డును అంచనా వేసుకుంటూ అందరినీ హెచ్చరిస్తూ ముందుగా నడిచారు. 


నర్సమ్మ అందరికన్నా చివరన నడుస్తూ వెనక్కి వెనక్కి చూసుకుంటుంది.  “నాయనా.. కిట్టయ్యా కుక్క పిల్లను చంకనేసుకున్నావా  లేదా? పిచ్చిముండ మునిగి చచ్చిపోద్ది” అంది. 


 “నానమ్మా, నేను కుక్క పిల్లను భుజానేసుకుని నడుస్తున్నా. నువ్వు గబగబ రా.. నీళ్లు పైకొచ్చేస్తున్నాయి” అని అరిచాడు కృష్ణుడు. అందరూ భయం గుప్పిటబెట్టుకుని వానలో తడుస్తూనే ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు. గంగ చేతిలో వున్నవి తలపై వున్న మూటను దించి అక్కడే పిల్లలను  కూర్చోబెట్టి నర్సమ్మ కోసం వెనక్కి వచ్చింది.  భుజం పట్టుకుని నడిపిస్తుంటే నర్సమ్మ వెనక్కి తిరిగి ఇంటి వైపు చూసుకుంటూ కళ్లు తుడుచుకుంటూ గొణుక్కుంటూ కోడలితో నడిచింది. ఎత్తుపై నుండి కూడా తదేకంగా  కనీకనబడని తన ఇంటిని చూసుకుంటూ వుండిపోయింది. ఆ రాత్రి కాళరాత్రే అయింది వారికి. అధికారులు వచ్చి  అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు.  రాజకీయ నాయకుల సహాయ కార్యక్రమాలు జరుగుతూనే వున్నాయి.


తెల్లారినాక కూడా వాన కురుస్తూనే వుంది.  గంగ నర్సమ్మకు టీ టిఫిన్ తీసుకొచ్చి యిచ్చి “ఇంకా రెండు రోజులు వాన యిట్టాగే వుంటదంట. ఇక మనం ఇంటి ముఖం చూత్తామో లేదో,  అంతా నానిపోయి కూలిపోద్దో యేమో, తలదాచుకోడానికి ఆ నీడ కూడా లేకుండా పోద్దేమో అత్తా! ఈ కష్టం పగోడికి కూడా వద్దు’’  అంది దిగులుగా.


“నాకు అదే దిగులుగా వుందే గంగా”


“నీ కొడుకెక్కడికి వెళ్లాడో.  మిత్తవల్లే యింత వరదొచ్చి పడిందే,పిల్లలు తల్లి పెళ్లాం యెట్టా వుండారో యెక్కడ వుండారో అన్న ఆలోచన ఇంగితగానం వుండొద్దు. ఇట్టాంటి వాడు బతికి వుంటే యేంటి చస్తే యేంటి?’’ అంది కోపంగా. 


“అంత మాట అనకే గంగా” అంటూ గట్టిగా ఏడ్చింది నర్సమ్మ. తెల్లారితే చాలు గుక్కెడు టీ కోసం పెర పెరలాడే ఆమె ఆ రోజు టీ ముట్టలేదు, టిఫిన్ తినలేదు.గోడకు ముఖం పెట్టుకుని ముడుచుకుని వుండిపోయింది. 


అప్పుడప్పుడూ “గంగా, అట్టా బయటకుపోయి మన ఇళ్ల దగ్గరోళ్ళకు  ప్రసాదు యేడన్నా కనబడ్డాడేమో అడిగి రా పో..”  అనీ, పిల్లలను “మీ నాన్న వచ్చాడేమో చూసిరండి పోండి’’ అని తరుముతానే వుంది.  నర్సమ్మ నసకు విసుగొచ్చిన పిల్లలు దగ్గరకు రావడం మానేసారు. గంగ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ మొగుడి కోసం ఆరా తీస్తానే వుంది.


మూడో రోజుకు వాన తెరిపిచ్చింది. నాలుగో రోజుకు మునిగిన కాలనీ ఇళ్లు బురద మేటేసుకుని దుర్గంధం కొడుతూ బయటపడ్డాయి. పశువుల కళేబరాలు కుక్కల కళేబరాలతో పాటు కరెంట్ స్థంభానికి తట్టుకుని ఆగిపోయిన ప్లాస్టిక్ నవ్వారు మంచం.నవ్వారు పట్టెల్లో చిక్కుకున్న కాళ్ళతో ఉబ్బిపోయిన శరీరంతో  వున్న శవం. మంచం, వొంటిపై అరకొర బట్టలు చూసి నర్సమ్మ కొడుకు ప్రసాద్ గా గుర్తించారు. నర్సమ్మ కుప్ప కూలిపోయింది. గంగ నిబ్బరంగా పిల్లలిద్దరిని పట్టుకుని నిలబడింది.  


నర్సమ్మ మనసులో కుళ్ళి కుళ్ళి యేడుస్తుంది. “అయ్యో కొడుకా! నా చేత యెంత పని చేయించావురా. నన్నెంత కటికదానిగా చేసావ్ రా అయ్యా!   నీ బుద్ధి సక్రమంగా లేదని కోపంతో ఈ పని చేసాను. తాగొచ్చి వొళ్లు తెలియకుండా  మంచం మీద పడిపోతే   నిన్ను లెగవకుండా కట్టి పడేసా కదరా. ఆ తాడే నీకు ఉరితాడు అయ్యి నీళ్ళలో మునిగిపోతున్నా లెగవకుండా చేసింది కదరా అయ్యా.  నన్ను బిడ్డను చంపిన పాపిని చేసావు కదరా అయ్యా” అని. 


సరళ వచ్చి గంగ కు అండగా నిలబడింది.  నర్సమ్మ వచ్చి రమణారావు పై కేసు పెడతానని అనేసరికి భయపడి ఫిట్స్ లాగా వచ్చి పడిపోయాడని హాస్పిటల్ కు వేసుకుని వెళితే పక్షవాతం వచ్చే సూచనలన్నారని చెబుతూ…

 “గంగా..నీ మొగుడు చచ్చాడని నువ్వు యేడుస్తున్నావు నా మొగుడు యింకా  యెందుకు చావలేదని నేను యేడుస్తున్నా” అంది సరళ.  


“అయ్యో! అంతమాట యెందుకులేమ్మా, ఊరుకోండి అమ్మ గారూ” అంది. గంగ  జాలి నిండిన గొంతుతో చెమ్మగిల్లిన మనసుతో.  


కూలిపోయిన యింటిలో అప్పుల వాళ్ళ తాకిడితో చాలీ చాలని పరదా పట్టాల కింద తలదాచుకుంటుంది గంగ కుటుంబం. బతుకు భారంగా రోజులు వేగంగా గడుస్తున్నాయి. పశ్చాతాపంతో  నర్సమ్మ గుండెలు మండిపోతున్నాయి.  తప్పు చేసిన బిడ్డను మందలించవచ్చు దండించవచ్చు గానీ ప్రాణం తీసే హక్కు తనకు యేముందనీ అని లోలోపల కుమిలిపోయింది. ఎక్కువ కాలం  రహస్యం కప్పిపెట్టలేక  మనసు ఉగ్గబట్టుకోలేక చేసిన పాపం చెబితే పోతుంది అన్నట్టు  గంగ కాళ్ళు పట్టుకుని తను చేసిన పని  గురించి చెప్పింది క్షమించమని ప్రాధేయపడింది.


 గంగ నిర్లిప్తతంగా చూసి “ఇట్టా జరుగుద్దని నువ్వు మాత్రం అనుకున్నావా యేంటి, ఊరుకో అత్తా”  అంది. “ఈ మాట మరెక్కడా అనబోకు కడుపులో దాచుకో” అని కూడా చెప్పింది. నర్సమ్మ  పాప భారాన్ని యెక్కువ కాలం ఓపలేకపోయింది.గంగ మోసే తన భారాన్ని  కూడా తగ్గించేసి లోకం నుండి నిష్క్రమించింది. ఆ రోజు అండ పోయిందో బరువు తగ్గిందో యేమి బోధ పడలేదు గంగకు. అప్పు కోసం సరళ యింటి మెట్లెక్కింది మళ్ళీ. 


*********

జ్ఞాపకాల్లో నుండి బయటపడి..  అపార్ట్మెంట్ లో  త్వరగా పని ముగించుకుని కృత నిశ్చయంతో  సరళ యింటి మెట్లు యెక్కింది గంగ.


రెండు గంటల తర్వాత పార్క్ లో కూర్చున్న సరళ ఫోన్ మోగింది. “పని అయిపోయిందమ్మా యింటికి  వెళ్ళండీ” 


సరళ ఇంటికి చేరింది. బెడ్ రూమ్ లో భర్త విడిచిన షర్ట్ ని ముఖంపై కప్పుకుని మూడెంక వేసుకుని పడుకుని వున్నాడు. 


ఆమె ముఖంలో క్రూరమైన నవ్వొకటి తొంగిచూసింది.

 

“ఏమిటలా ముఖం పై మసుగేసుకుని చేతకాని దద్దమ్మాలా పడుకున్నారు. రంధి, అదే నిద్ర రంధి తీరిందా” అని నర్మగర్భంగా అడిగింది. 


ఉలికిపడి అనుమానంగా భార్య ముఖం వైపు చూసాడు. 


 “నీ స్త్రీ వ్యసనంతో నన్నెంత రంపపుకోతకు గురిచేసావు మదపత్రాష్టుడా! నా శరీరాన్ని రోగాల పుట్టగా మార్చావు. పసివాళ్ళని కూడా చూడకుండా చిన్న పిల్లలపై  అఘాయిత్యాలకు పూనుకుంటున్నావ్ . నీ పురుషత్వం తలెత్తి చూడకుండా  మానసికంగా నిన్ను బలహీనుడిని చేయడమే నీకు సరైన శిక్ష. నువ్వు ఈ గదిలో మగ్గి మగ్గి ఇలా కుమలాల్సిందే.” కసిగా తిట్టింది. 


అవమానంతో దిండు లో ముఖం దాచుకున్నాడు రమణారావు.


“నీ బతుక్కి సిగ్గు వొకటి వుండట్టు..ఆ ముఖం దాచుకోవడం వొకటే తక్కువ. కొడుకనే కనికరం లేకుండా  తెగువగా ఆ నర్సమ్మ చేసిన పని నేను చేయలేకపోతున్నా” అంటూ కోపంగా జుట్టు పట్టుకుని తల గుంజింది. 


భార్య వైపు  భయంగా చూస్తూ “వద్దు వద్దు. నా తప్పు తెలుసుకున్నాను  మారిపోయాను. నన్ను క్షమించు సరళా” అన్నాడు. ఏడుస్తూ.. ఛీ అనుకుంటూ అతనికి దూరంగా వెళ్ళింది ఆమె.


చీకటి పడుతున్న వేళ గంగ వచ్చి వంట ఇంటి గుమ్మం దగ్గర నిలిచింది. కూర్చోమని అన్నా కూర్చోకుండా.. 


“సరళమ్మా ! నిలువెల్లా కామంతో రగిలిపోయే మనిషిని ఉసిగొల్పి  మానసికంగా కుంగదీయాలి అని నాకో పని అప్పజెప్పావ్. డబ్బు అవసరం యెంతున్నా నేను  అన్నీ ఇడిసేసిన మనిషిని మాత్రం కాదండీ. నీ అంత చదువుకున్నదాన్ని కాకపోయినా మనుషులను వస్తువులను వాడుకున్నట్టు వాడుకోకూడదనే ఇంగితగేనం వుంది. నువ్వు చెప్పినట్టు కాకుండానే నీ భర్తకు  నాలుగు మంచి మాటల్జెప్పి ఇకనైనా మార్పు తెచ్చుకో. లేకపోతే నీ బిడ్డలకు మొహం కూడా చూపించలేక పోతావు అని మందలిచ్చాను యెత్తి పొడిచాను చీత్కరిచ్చాను. ఇని యిని  ఆఖరికి దిండులో తలదాచుకుని ఎక్కిళ్లు పెట్టి యేడిసాడు. ఇక ఆయన నడుము యిరిగిన పాము అనుకో”


“చాలా చాలా థ్యాంక్స్ గంగా! నువ్వన్నట్టు  యికనైనా ఆయన మారిపోతే చాలు” కృతజ్ఞత తో తేలికైన మనసుతో చిరునవ్వు ముఖంతో.


“అమ్మా!  ఇంకో మాట విను. నా బిడ్డలకు పొట్టనిండా కూడు పెట్టుకోలేకపోతే పస్తు పడుకోబెడతాను కానీ జారతనం చూపెట్టను. ఆపదలో వున్నప్పుడు సాయం చేసావని నీ మాట కాదనలేకపోయాను కానీ అది నీలాంటివాళ్ళు చెప్పదగ్గ పని కాదు నేను చేయదగ్గ పని కాదు. ఇంటి పని వంట పని  యివ్వాలనుకుంటే యివ్వండి. కష్టం చేసుకుని మీ బాకీ తీరుస్తాను కానీ యిట్టాంటి పని యింకెప్పుడూ చెప్పబాకమ్మా” బాధ నిండిన గొంతుతో  కళ్లు తుడుచుకుంటూ  వెళ్ళిపోయింది. 


చెంప పై చెళ్ళున కొట్టినట్లైంది సరళ కు. గంగను నేనెంత తక్కువగా అంచనా వేసాను. నాకు నా భర్త కు తేడా ఏం వుంది? నేను పురమాయించిన పని కూడా అత్యాచారం కన్నా తక్కువేం కాదు.తనెంత దిగజారిపోయి భర్తను రెచ్చగొట్టి నీరు కారిపోయేటట్టు చేయమని అడిగింది? గంగ కాబట్టి నర నరం  పదునుగా కోసినట్టు మెత్తగా స్పష్టంగా తనేంటో చెప్పింది. తల భూమిలో పెట్టుకున్నంత పనైంది సరళ కు.   ఇంకా ఆలోచిస్తూ...  దీనినే వ్యక్తిత్వం అని అంటారేమో!  పరిస్థితులు యెలా వున్నా గంగ లాంటి వారు విలువలను పణంగా పెట్టలేరు, తమ ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోలేరు. గంగ ముందు నేను నిత్యం సిగ్గుతో తలొంచుకోలేను పని కూడా ఇవ్వలేను అనుకుంది. 


ఎదురుగా టివి లో .. గంగా పుష్కరాల ప్రత్యక్ష ప్రసారంలో వేటూరి పాట బ్యాక్ గ్రౌండ్ లో వినబడుతూ వుంది. “గండాలను పాపాలను కడిగివేయగా ముక్తినదిని మూడు మునకలే చాలుగా”  తెర వైపు చూస్తూన్న సరళ మానసిక స్నానం చేస్తూ గంగలో మూడు మునకలు మునిగింది.


*******************0**********************

“బహుళ త్రైమాసిక వెబ్ పత్రిక “ జూన్ 2023 సంచికలో ప్రచురితం.
Pic: Gibbs Garden GA USA