#చిత్కళ కబుర్లు
ఆడుకుందాం రా…
ట్రెడ్ మిల్ పై యాంత్రికమైన పరుగులు తీస్తున్న నా దగ్గరికి వచ్చి “ఆడుకుందాం రా.. నాయనమ్మా” అని అడిగింది మనుమరాలు.
“బయట యెండ చురుక్కుమంటుంది బంగారం, సాయంత్రం ఆడుకుందాం”
“అయితే బ్యాక్ యార్డ్ లోకి వెళదాం రా.. “
“కాసేపు ఆగి వెళదాం వుండు. అయినా అక్కడ కూడా యెండ. సన్ బర్న్ అయి నల్లగా అయిపోయావు యిప్పటికే”
“రా.. నాయనమ్మా వెళదాం” గట్టి పట్టు పట్టింది.
నేను కేలరీల అరుగుదల లెక్క చూసుకుంటూ వున్నాను.
“నా కోసం బటర్ ప్లైస్ వెయిట్ చేస్తున్నాయి, నేను వెళతా, నన్ను తీసుకెళ్ళు”
నేను సరిగ్గానే విన్నానా.. అనుమానం ఆశ్చర్యం.
“ఏమన్నావు చిన్నితల్లీ .. మళ్ళీ చెప్పు”
“నేను బటర్ ప్లైస్ ని చూడాలి. సన్ బర్న్ అయిందేమో చూడాలి”
ఆ మాట విన్నానో లేదో.. 3.5 వేగంలో వున్న నేను స్టాప్ నొక్కి పడకుండా వుండటానికి ప్రయాస పడ్డాను. కిందకి దిగి మనుమరాలిని గట్టిగా హత్తుకున్నాను.
కళ్ళు చెమ్మగిల్లి.. గొంతు పూడుకుపోయి..
“నువ్వు గాక నాకు కవిత్వమో కథో.. యెందుకు తల్లీ..
పద చూద్దాం”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి