25, జూన్ 2023, ఆదివారం

విత్తిన జుట్టు- పచ్చని అడవి




ఒక ఊరిలో  ఒక వృద్ధుడు ఉండేవాడు.అతనికి చాలామంది సంతానం వుంది. వారందరి చదువులు పెళ్ళిళ్ళు అయ్యాక.. అతను విశ్రాంత జీవనం గడపాలని కోరుకున్నాడు. ఊరి చివర అడవికి దగ్గరగా వున్న అతని పొలంలో చిన్న ఇల్లు నిర్మించుకుని భార్యతో సహా అక్కడ నివసించసాగాడు. 

ఆ వృద్దుడికి చాలా అందమైన జుట్టు వుండేది. వయసు పెరగడంతో అతని జుట్టు రాలడం ప్రారంభించింది, అతడి జుట్టు అంటే అతనికి చాలా ఇష్టం. ప్రతి రోజూ రాలిన జుట్టును లెక్కించి అన్ని మొక్కలను నాటేవాడు.  కొన్నేళ్ళ తర్వాత  అతను అనారోగ్యంతో  వున్నప్పుడు అతని భార్య తన సంతానం అందరికీ సమాచారం పంపింది. పిల్లలందరూ వచ్చి తండ్రిని పరామర్శించారు. అతను అప్పటికి  పూర్తిగా బట్టతలతో ఉన్నాడు. 


ఆ రోజు తన పిల్లలతో ముచ్చటించాడు. ... "నా వెంట్రుకలు చూడండి ఎలా ఊడిపోయాయో!.  ఒకప్పుడు నా జుట్టు చాలా అద్భుతంగా ఉండేదని మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు పూర్తిగా పోయింది,  ఏమీ చేసి కూడా నా జుట్టును రక్షించలేకపోయాను. కానీ బయట అడవి వైపు చూడండి.

అది చాలా చెట్లతో చాలా అందమైన అడవిగా తయారైంది, కానీ నేను చనిపోయిన తర్వాత మీ అందరూ  అవన్నీ అమ్మడం ప్రారంభిస్తారు.వారు ఆ అడవిని నరికివేస్తారు. నా జుట్టు ఊడిపోవడం వల్ల నా తల ఎలా బట్టతలగా కనిపిస్తుందో అప్పుడు ఈ అడవి కూడా ఖాళీగా కనిపిస్తుంది” అని విచారపడ్డాడు.

 

“అయితే ఈ అడవినంతా మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి నాన్నా!” అని అడిగారు కొడుకులు. 


 ఆ తండ్రి తన మాటలను  కొనసాగించాడు.

"ఒక చెట్టును నరికిన ప్రతిసారీ అది చనిపోతుంది నా లాగే. 

అప్పుడు, నా జ్ఞాపకార్థం అక్కడే కొత్త మొక్క నాటండి. ఈ మాట మీరూ  మీ వారసులకు చెప్పండి.అదే విధంగా వారిని చేయమని కోరండి. . ఈ అడవిని పటిష్టంగా ఉంచడం మా కుటుంబ బాధ్యత అని కూడా చెప్పండి..అని కోరాడు. 


కొన్నాళ్ళకు ఆ వృద్ధుడు మరణించాడు. కొడుకులు తండ్రి జ్ఞాపకార్ధం ఒక చెట్టును నాటారు. ఆ భూమిలో ఒక చెట్టును కూడా నరకకుండా తగినచర్యలు చేపట్టారు. ఆ అడవి ఒక చెట్టును కోల్పోయిన ప్రతిసారీ, పిల్లలు ఒక చెట్టును తిరిగి నాటుతూ వచ్చారు. అలాగే వారి పిల్లలు, మరియు వారి తరువాత వారి పిల్లలు.మరియు శతాబ్దాలుగా ఆ పని చేస్తూనే వున్నారు. ఇప్పుడు అడవి ఒకప్పుడు  ఉన్నంత పచ్చగా  అందంగా తయారైంది. 


ఈ అడవి ఇంత పచ్చగా అందంగా ఉండటానికి  కారణం  ఎవరో తెలుసా.. మా ముత్తాత తాత. ఈ అడవి అంతా అతను తన వెంట్రుకలు రాలినప్పుడల్లా  తిరిగి విత్తిన అతని వెంట్రుకలు.. అని వారసులు నవ్వుతూ చెప్పుకుంటారు. 


బాగుంది కదండీ.. కథ. మన చుట్టూ ఉన్న పచ్చదనాన్ని కాపాడుకోవాలంటే.. మనం కూడా ఊడిపోయిన జుట్టు స్థానంలో మొక్కలను నాటాలి. 


ఈ మంచి సందేశాన్ని అందరికీ పంచండి. పిల్లలకు కథ గా చెప్పండి. 



కామెంట్‌లు లేవు: