17, జూన్ 2023, శనివారం

మనం మనలా వుందాం




ఆది పురుష్ సినిమా గురించి  ఫేస్ బుక్ లో ఓ చిన్న పోస్ట్ పెట్టాను. 

నేను రామాయణం చదవడానికన్నా ముందు విన్నాను. నాలా కోట్లమంది ఈ దేశంలో.. 

మూడు వందల రామాయణాలకు  తోడు ఇది నాలుగో వంద రామాయణం కావచ్చు.  

మన భావనలో రామాయణం మహా కావ్యం. మహనీయుడు శ్రీ రాముడు మహాతల్లి సీతమ్మ.  అది ఒక మహనీయ చరిత్ర. చరిత్ర కాదనలేని అవుననలేని ప్రజల విశ్వాసం. 

నాలుగో వంద రామాయణం ఎలా వుంటే ఏమిటి? 

ఇదో పని లేని గోల.. ఉబుసుపోక గాని. 🤔

అని.. 

ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇలా అడిగారు. 

వారు: మీకెందుకు రామాయణం ఇష్టం సీతకు శీల పరీక్ష చేసినందుకా?  

అని.

నేను : ఇష్టం అని అనలేదండీ.. రామాయణం విన్నా చూసినా అదో ఎమోషన్. కొన్ని రచనలు చదివినప్పుడు మనకు కల్గుతుంది చూడండి.. ఆ ఎమోషన్. అంతే!

వారు: అప్పుడు ఆ పారవశ్యంలో రాముడి పాత్ర చెబుతున్న శీలం, శంబూక వధ తాటకి హత్య, దక్షిణాణాది ధీరోదాత్తుడు దశకఠుంని సంహారం ఇవన్నిటినీ మీరు అంగీకరించినట్టే కదా మేడం

నేను: లేదండీ అంగీకరించను.

అని చెప్పాను. వివరణగా .. ఈ కింద.. 

************

నేను పరోక్షంగా చూసినదానికన్నా విన్నదానికన్నా చదివినదానికన్నా.. 

ప్రత్యక్షంగా చూడటం అనుభవంలోకి రావడం ద్వారానే ఒక స్థిరమైన అభిప్రాయానికి వస్తాను. 

ఒకరు వొక సంఘటన జరిగినప్పుడు వారు కూడా అక్కడే వుండి అందులో భాగస్వామ్యం అయ్యో కాకుండానో వుండి తర్వాత వారు నాకు ఆ విషయం చెబితే అది పరోక్ష కథనం. అది కూడా పూర్తిగా నమ్మను. 

సినిమానో నాటకమో కథో నవలో చూసినప్పుడు విన్నప్పుడూ చదివినప్పుడు కల్గిన స్పందన తాత్కాలికం. అవి మన మనస్సుల మీద బలమైన ముద్ర వేయకపోతే మాత్రం వాటి ప్రభావం చాలా తక్కువ. 

చరిత్ర అంటే ఆధారం వున్నదానిని అంటారు కదా! 

ఇక రామాయణం మహాభారతం కి చరిత్రాత్మక ఆధారాలు వున్నాయా లేదా అన్నది తెలుసుకోవాలనే ఆసక్తి నాకు లేదు. కొన్ని చూసి ఊరుకుంటాం కొన్ని విని ఊరుకుంటాం. అంతే తప్ప నిరూపణలకు సిద్ధమవడం పిడి వాదనలు చేయడం ఆ అభిప్రాయమే కరెక్ట్ అని అదరగణ్ణం ప్రదర్శించడం అవివేకమైన విషయం. 

ఇక వీటిల్లో విషయాలను తీసుకుని చర్చలకు నేను పూనుకోను. సీత కు జరిగిన శీల పరీక్ష ను ఇంకా కొన్ని అంశాలను వ్యతిరేకిస్తాను. 

అందరికి అన్ని విషయాల పట్ల స్పష్టత వుండదు. మిక్స్డ్ ఫీలింగ్స్ వుంటాయి. ఇవీ అంతే! 

నా చిన్నతనంలో మా నాయనమ్మ మన ఇలవేల్పు శ్రీరామచంద్రుడమ్మా అంది. నమ్మి భక్తిగా దణ్ణం పెట్టుకున్నాను. సీతా లక్ష్మణ హనుమంత సమేత శ్రీరామచంద్రస్వామి నా హృదయంలో వుంటారు. మా అత్తమ్మ శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం వుంచి పూజిస్తుంది. నాకు నమస్కారం చేసుకోవడం అలవాటు. అలాగే నా ఇష్టదైవం.. శ్రీగిరి మల్లన్న. మా అమ్మ భ్రమరాంబిక. వారిని పూజిస్తాను స్మరిస్తాను.అది నా వ్యక్తిగత విశ్వాసం. 

నా నమ్మకాలు విశ్వాసాలు నావి. అంతమాత్రం చేత నేను మెసులుతున్న సమాజంలో మూఢవిశ్వాసాలకు అరాచక అన్యాయాలను సమర్ధిస్తాను అనుకోవడం పొరబాటు. ఓ అన్యాయం జరుగుతుంటే దానిని అడ్డుకోవటానికి శివలింగం ఆకారమో శ్రీరామ చిత్రపటమో వుంటే దానిని తొక్కుకుంటూ వెళ్ళగల తెంపరితనం కూడా వుంది. ఒక ఆవు ఎవరినైనా నన్నైనా పొడుస్తుంటే  గోవులో ముక్కోటి దేవతలు కొలువై వున్నారని పొడిపించుకోను పొడవనివ్వను. ఏ ఆయుధమో లేకున్నా నా చేతులనే ఆయుధం చేసుకునే ప్రయత్నం చేయకమానను. 

నమ్మకాలు విశ్వాసాలు మనలో విచక్షణ ను నశింపజేయకూడదు. అది.. నా విచక్షణ. 

భక్తి పారవశ్యంలో రాముడి పాత్ర చెబుతున్న శీలం, శంబూక వధ , తాటకి హత్య, దక్షిణాణాది ధీరోదాత్తుడు దశకఠుంని సంహారం ఇవన్నిటినీ మీరు అంగీకరించినట్టే కదా .. అంటే.. అంగీకరించను. 

ఒక మనిషి లో వున్న లోపాలు వల్ల ఆ వ్యక్తిని మనం నిరసించవచ్చు.అదే వ్యక్తిలో వున్న మంచి గుణాల వల్ల అభిమానించవచ్చు. ఏది ఎక్కువ ప్రభావం చూపితే ఆ విధంగా ఆ వ్యక్తి పట్ల మనకొక అభిప్రాయం వుంటుంది తప్ప.. నిత్యం మనం ఆ వ్యక్తిని పనిగట్టుకుని మోయాల్లిన అవసరం లేదు. అది రాముడైనా వొకటే రావణుడైనా వొకటే మా పక్కింటి రామారావైనా వొకటే! నా మనుగడలో నాకు కావాల్సింది ఏదో నాకు స్పష్టంగా తెలుసు.

రాముడిని నెత్తికెత్తుకుని ఇతరులతో పేచీపడటానికి నేను మోడీ బిజెపి భక్తురాలిని కాదు. మా నాయనమ్మ చెప్పింది కాబట్టి ఆమె నమ్మిన విశ్వాసమేదో నమ్మకమేదో  ఆమె చూపిన మంచి ఏదో అదే నన్ను ఆవరించి వుంది తప్ప మిగతావి ఏవీ కాదు.. 

పరిణామక్రమంలో మనిషి కొన్ని వొదిలించుకునే దశలో వుంటాడు.. అన్నీ ఒకేసారి వదిలించుకోవడం సాధ్యపడదు. 

PS: కొందరు కమ్యూనిస్ట్ మార్కిస్ట్ భావజాలం కలవారు వేదికల మీద కులం మతం నాస్తికత్వం గురించి బల్లలు విరగగొట్టినట్టు మాట్లాడుతూ ఇంట్లో రహస్యంగా పూజలు చేయడం తెలుసు. నిత్యం సంధ్యావందనం చేస్తూ అస్పృశ్యత లాంటివి పాటించకుండా మంచిని తీసుకుని మానవత్వానికి చిరునామా గా నిలిచిన వారిని చూసాను నేను. స్వధర్మం పరధర్మం కి సున్నితమైన రేఖ వుంటుంది. అదేమిటో తెలిస్తే చాలు.

ద్వేషం Vs  పూజించడం 

రెండూ కాదు. మనం మనలా వుండటం. అది ఇంకొకరికి అనవసరం.


కామెంట్‌లు లేవు: