29, ఫిబ్రవరి 2012, బుధవారం

ది రియాలిటీ ఆఫ్ ఇండియా ..

ది  రియాలిటీ ఆఫ్ ఇండియా ..

ధైర్యం  ఉంటేనే ఈ వీడియో ..చూడండీ ! మూఢ విశ్వాసాలకు నెలవు ..మన  దేశం. నమ్మాలి తప్పదు.

గగుర్పాటు,జుగప్స..బాబోయ్.. యెంత భయానకం ...

        ఈ  లింక్   లో   The Relity of India .  

28, ఫిబ్రవరి 2012, మంగళవారం

అచంగ ప్రశ్నలకి నా జవాబులు

  "అమయ" బ్లాగర్ ... సామాన్య గారి కథ "కల్పన" కథ పై.. జరుగుతున్న  వాడి, వేడి చర్చ ఇది. ఈ కథ పై.. కథా విశ్లేషణ చేసినందుకు గాను..నాకు ..ప్రధమ బహుమతి లభించింది. కథ జగత్ లో ఈ కథని..  ఈ  లింక్ లో  చూడండి.
అలాగే నావిశ్లేషణ ని  .. ఈ  లింక్  లో  చూడండి.
కృష్ణ వేణి తీరం  బ్లాగర్ అచంగ గూగుల్ + లో ఈ రోజు జరుగుతున్న చర్చలో సంధించిన ప్రశ్నలకి  నా జవాబులు  

అరుణ్ చంద్ర ఇలా అన్నారు 

మగవారి యాంగిల్ నుండి నాకు కొన్ని ప్రశ్నలున్నాయి.... అతితెలివిగా భావించక మన్నించండి.
 
1. మగాడు ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే ఆడువారికి సమ్మతమేనా?

జవాబు: పూర్తి సమయం హౌస్ హస్బండ్ గా మగవారిని భరించడం చాలా కష్టం. షిప్ట్ ల ఉద్యోగాలు అయితే భార్య ఉద్యోగానికి వెళ్ళినప్పుడు భర్త ఇంట్లో ఉండి(బయట అనవసర కాలక్షేపం చేయకుండా ) బిడ్డలని, ఇంటిని చూసుకోవాలి కదా! అది భర్తగా,తండ్రిగా భాద్యత కాదా!? ఇది ఆడువారి మనసులోని కోరిక. మరి ఇది తప్పంటారా? 

2. ఆడపిల్లలే అనే కారణం చేత స్కూల్లో తన్నులనుండి ఆఫీసుల్లో బాస్ తిట్లవరకూ మినహాయింపులు పొందటం లేదా? మగవారికలాంటి అవకాశమే ఉండదు. అతను పోరాడాల్సిందే.

జావాబు: మినహాయింపు ఉంటే అది.. సానుభూతి మాత్రమే! లేదా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి ఉండటం కద్దు.  ఇప్పటికాలంలో..ఆడువారిపై జరుగుతున్నలైంగిక వేదింపులు,మానసిక హింస మగవారికి ఉండవు. ఉద్యోగ భాద్యతలు.. స్త్రీ-పురుష ఇద్దరికీ సమానమే! ఆడవారికి కొంచెం వెసులుబాటు ఇస్తే తప్పు లేదు. ఇంటా-బయట చాకిరి కదా ఇప్పుడు రిజర్వేషన్ లు ఉండగా లేనిది ఇవి తప్పు కాదు. :)))))


3. తలకిందులుగా తపస్సు చేసినా మగాడు బిడ్డని కనలేడు. అలాంటప్పుడు మగాడే స్త్రీ రక్షణ, పోషణ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆడువారు పిల్లల పెంపకం చూసుకోవటానికి వచ్చిన బాధేమిటి?


జవాబు: నవమాసాలుమోయడం,ప్రసవవేదన శారీరక అసౌకర్యం అన్ని భరించిన భార్య అలసిపోతే..బిడ్డల పెంపకంలో.పురుషుడు సాయం చేయకపోవడం,ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడు..తప్పుకోవడం తప్పు కాదా? బిడ్డల భాద్యత అతనికి లేదా?. 


4. ఒక ఆడది ఏడాదికి పాతిక లక్షలు సంపాదించగలిగినప్పుడు, యాభై లక్షలు సంపాదించే ప్రేమించనివాడిని చేసుకోవటమెందుకు? పనీపాటా లేకుండా  ప్రేమించటమే పనిగా పెట్టుకున్నవాడినికి ఒకణ్ణి చేసుకోవచ్చుగా?

జవాబు: ఆడది సంపాదించి..నువ్వు సంపాదించకపోయిన పర్లేదు.నువ్వు ఇంట్లోనే ఉండి నన్ను ప్రేమించడమే పనిగా పెట్టుకో..అనరు. పని-పాటా లేకుండా బలాదూర్ గా   తిరుగుతూ..వ్యసనపరుడు అయి..పైసా సంపాదనలేకున్నా అర్ధరాత్రి వరకు తిరిగి ఇంటికి వచ్చినా .. పోద్దస్తమాను   కష్టపడి అయినా  తను సంపాదిన్చినదానిలో..పస్తులుండి అయినా భర్తకి అట్టేపెట్టి ఓపికతో.. భర్త కి ఇంత కూడు పెట్టి..ఆయన గారి వికృత రూపాన్ని భరించేది ఆడది. ఉద్యోగం పురుష లక్షణం. గృహస్తు   ధర్మం భాద్యతలు పంచుకోవడం. రెండు ఆశించడం తప్పు కాదు కదా  ! .

5. సాధించి చట్లో పెడుతున్నది అత్తా-ఆడపడుచులైనప్పుడు దానికి మగాడిని పూర్తిగా బాధ్యుడిని చెయ్యటం ఎంతవరకూ సబబు? అత్తలు, ఆడపడుచులూ ఆడువారేకదా!

జవాబు: ఖచ్చితంగా ఆడువారు! కానీ వారికి వంత పాడటమో..మౌనం వహించడమో..కాదు సమస్యకి పరిష్కారం..జోక్యం   చేసుకుని..తప్పు ఎవరిదైనా ఖండించడం. అలాగే..కోడలికి చాలా చట్ట సంబంధమైన బలం ఉంది.అందుకే.. కొన్ని సమసిపోతాయని ఆశ. అవకాశవాదంగా మార్చుకుంటే.. దాని అంత విచారం ఇంకోటి లేదు.
6. ఆడదానికి సమస్య వచ్చినప్పుడు మొగుణ్ణి అడ్డంపెట్టుకుంటుంది మరి ఇరవైనాలుగ్గంటలూ పెళ్ళాం కొంగు పట్టుకుని ఇంట్లొ ఉంటే మగాడికి సమస్య వచ్చినప్పుడు అతన్ని సమర్థించే వ్యక్తులు ఎక్కడనుండి వస్తారు?!

జవాబు: అతని తరపు వారు ఏమవుతారు? నిజం ని నిగ్గదీసి అడగడానికి ఎవరు లేకుండా ఉంటారా? 

7. మగాడి తన్నుల గురించి మాత్రమే మాట్లాడేటప్పుడు ఆడువారి సణుగుడు గురించి అసలు బయటకు రాదెందుకు? (సుప్రీం కోర్టు ఆడువారి సణుగుడుని మానసిక హింసగానే పరిగణించాలని తీర్పు చెప్పింది).

జవాబు: చట్టం,న్యాయం ఎవరికి చుట్టం కాదు. పోరాడటం లక్షణం. 

25, ఫిబ్రవరి 2012, శనివారం

గెలుపు రహదారినీ కోసం చూసే క్షణాలు బరువుగా కదులుతూ..యుగాలని పిస్తుంటే
నీతో ఉన్న కొన్నిగంటలు క్షణాలులా కరిగిపోతుంటాయి
నీవు దూరమైన తరవాత గడపాల్సిన కాలం గుర్తుకువచ్చి
జీర్ణించుకోవడానికి నన్ను నేను సమాయుత పరచుకోవడం
దుర్లభం కనుక అసలు నేను నిన్ను కలవాలని అనుకోవడం
వద్దని   నన్ను నేను నియంత్రిచుకోవడంలోను విఫలమై
అర్ధం కాని అయోమయ స్థితిలో ఉహాల్లో బతికున్నానేమో..
జీవనంలో జీవశ్చవంలా మారానో..? 
ఏమైనా నీ పై నాకున్న భావన సహనశీలి గా ముద్రించుకుని
గెలుపు రహదారి మొదట్లో ఆగి చూస్తుంది...
           

22, ఫిబ్రవరి 2012, బుధవారం

అందమైన పాట - అమ్మ లాలిపాట


ఉదయ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. గుమ్మం ముందు చెప్పుల జతల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది. బంధువులు అందరు వెళ్లిపోయినట్లు ఉన్నారు. "అమ్మయ్య" అని అనుకున్నాడు. అలా అని ఉదయ్ చుట్టపక్కాలంటే ముఖం చాటేసే బాపతు కాదు. బంధువులంటే   అభిమానం,పెద్దలంటే గౌరవం,అతిధి దేవుల పట్ల విపరీతమైన శ్రద్ద ఉన్నవాడు. అమ్మయ్య !అని ఎందుకు అనుకున్నాడు అంటే.. ":తనకి చీటికి మాటికి సెలవు పెట్టడానికి వీలు లేని ఉద్యోగం. ఒక వేళ  సెలవు పెట్టినా రోజులో సగ భాగం ఫోన్ కాల్స్ అటెండ్ అవడానికి,మెయిల్స్ ద్వారా ఆన్సర్ చెయ్యడానికో..ప్రాముఖ్యం ఇచ్చే మొహమాటస్తుడు.

తప్పని సరి కాదు కానీ చాలా ముఖ్యంగా..,శ్రద్దగా  తన వారిని చూసుకోవడానికి ఒక వారం సెలవు పెట్టి ఆ రోజే ఆఫీసులో పునర్దర్శనం  ఇచ్చాడు. ఆ సెలవు పెట్టడానికి కారణం ఏమనగా.."అమ్మ కడుపులో చల్లగా ఇంకో నెలపాటు ఉండాల్సిన చిన్ని కన్నయ్య " అప్పుడే ఈ లోకంలోని అందాలని చూడాలనుకుని..త్వర త్వరగా.. అరుదెంచాడు. వస్తూ వస్తూ..వాళ్ళ అమ్మని కాస్త బాగానే బాధపెట్టాడు. ఇక వాళ్ళ నాన్నకైతే ఒకటే సంతోషం. వాళ్ళ అమ్మ - నాన్న పుట్టేది అమ్మాయా-అబ్బాయా!? ఏం పేరు పెట్టాలి అనేది కూడా నిర్ణయించేసుకుని..స్వాగతం పలుకుతూ ఉండిపోయారు కాబట్టి సరిపోయింది. 

చిన్ని కన్నయ్య అమ్మకి  ఏమో..తమ పనులు అన్నీ తామే స్వయంగా చేసుకోవాలని,వీలైనంతవరకు ఇతరలుకు ఇబ్బంది కల్గించ కూడదనుకుని .. తోలి కాన్పు సంప్రాదాయం కోసమైనా వాళ్ళ పుట్టింటికి వెళ్లక పోవడం వల్ల చిన్ని కన్నయ్య పుట్టిన శుభ సందర్భంగా వారి ఇంటికి  ముచ్చటగా ఒక ముప్పై మంది వరకు బంధువులు విచ్చేసినారు. వారికి ఆ మహా నగరంలో అన్నీ సమయానికి అందుతూ సకల మర్యాదలు అందుతున్నాయో..లేదో అని చిన్ని కన్నయ్య నాన్న ఉదయ్ కి దిగులు.అదన్నమాట సంగతి.

ఓ..వారం రోజుల పాటు హాస్పిటల్ చుట్టూ తిరగడం చిన్ని కన్నయ్య ముందుగా పుట్టడం వల్ల తనని ఇంక్యుబేటర్ లో ఉంచడం,వాళ్ళ అమ్మ కి సిజేరియన్  వల్ల తనని జాగ్రత్తగా చూసుకోవడం ఇవే సరిపోయింది. ఇక అతిధి మర్యాదల లోపం జరిగితే బాగోదని అతని ఉద్దేశ్యం కూడా.


ఉదయ్ తన షూ విప్పి స్టాండ్ లో సర్ది శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని   ఇంట్లోకి అడుగుపెడుతూనే.. మన బుల్లి హీరో చిన్ని కన్నయ్య కోసం వెదికాడు.  ఆయన గారేమో.. అమ్మ కడుపులో ఉన్నంత భద్రంగా ఆ రోజే కట్టిన చీర ఉయ్యాలలో..హాయిగా నిద్రపోతున్నాడు.

 "నిద్ర పోతున్నాడా?"అని అడిగి..ఆసేపు అలా చూసుకుని.. అబ్బో..! వీడు అప్పుడే వళ్ళు విరగ దీయడాలు,   ఆలోచన ముద్ర భంగిమలు,ముఖం చిట్లిన్పులు ..అన్నీ నేర్చేసుకున్నాడు అనుకున్నాడు ముచ్చటగా.పసి పిల్లలు,పువ్వులు యెంత సేపు చూసినా మొహం మొత్తవు.అలా కాసేపు చూసి ..వీడిని మంచి సంప్రదాయ పద్దతులలో..చక్కటి అభిరుచులతో..కలగలిపి..తన తాత ముత్తాతల ఒరవడిలో పెంచాలి అని మనసులో అనుకున్నాడు.

ప్రక్కనే ఉన్న బాల్కనీలో కూర్చుని వారం రోజుల నుండి తనకి వచ్చిన మెయిల్స్  చూసుకుంటూ ..  పోన్ లు చేసుకుంటూ ఓ గంట గడచి పోయింది. ఉన్నట్టు ఉండి ఒక స్వరం పాట పాడటం వినబడింది ఉదయ్ కి. శ్రద్దగా విన్నాడు.

చిన్ని కన్నయ్య   లేచి నట్లు ఉన్నాడు. లేస్తూనే ఏడుపు మొదలెట్టాడు.వేలెడంత లేడు. ఇంట్లో ఉన్న ముగ్గురు తమ చేతుల్లోకి తీసుకుని  సముదాయిస్తున్నా  ఏడుపు మానడం లేదు. అప్పుడు ఒక లాలి పాట పాడటం మొదలైంది.ఏ బిడియం లేకుండా  స్వేచ్చగా గొంతెత్తి పాడుతుంది ఆ గొంతు. ఉదయ్ ఆశ్చర్య పోయాడు చాలా సంతోషం వేసింది.

అతని గురించి...చెప్పాలంటే..

ఉదయ్ కి..తన మా తృ  భాష పైన మమకారం ఎక్కువ. సాహిత్యం అంటే ప్రాణం.సంగీతం వినడంపట్ల  ఆసక్తి. ఓ..నాలుగు  భాషలలోని పాటలని,సంప్రదాయ కీర్తనలని..ఆస్వాదిస్తూ.. ఉంటాడు.
అలాగే..తన భార్య అంటే అమితమైన ఇష్టం.  ఉదయ్ ని  ఓ మూడేళ్ళ పాటు గాడం గా  ప్రేమించి అతనికే  ఇల్లాలు అయిన అమ్మాయి. అన్యోన్య మైన జంట.

 ఉదయ్ కి.. తను నిత్యం ప్రాతః కాలం లోనే నిద్ర లేచి  సంప్రదాయ కీర్తనలు   వింటూ ఉండటం,సాయంత్రం ఆఫీస్   నుంచి వచ్చాక కాస్త   సేదదీరుతూ..పుస్తకాలు చదువుకుంటూ,మంచి సినిమా పాటలు వింటూ ఉండటం చాలా ఇష్టం . అప్పుడప్పుడూ.. తను కూడా శ్రావ్యంగా  పాడుకుంటూ ఉంటాడు.

అలాగే..తన అందమైన   భార్య సుమధుర స్వరం నుండి తనకి ఓ..పాట వినాలని చాలా కోరిక. పెళ్లి కాక ముందు ఓ..మూడేళ్ళు   కాలంలో..ఉషా...ఓ..పాట  పాడవా!? ప్లీజ్ అంటూ..పాడమని  వెంట  పడి అడిగేవాడు. అబ్బే!నాకసలు పాటలే రావు..మీరు పాడితే బాగుంటుంది..పాడండి..నేను వింటాను అని తప్పించుకునేది ఉష. అది పోన్ లో సంభాషణ కాబట్టి అలా తప్పించుకోవడం తో సరిపోయింది.

 ఇక పెళ్లి అయిన తర్వాత ఓ..రెండేళ్ళ నుండి..పదే పదే "ఉషా..పాట పాడవా.?.అని అడుగుతూనే ఉన్నాడు. నా పాట ఏం బాగుంటుంది చెప్పండి..?  ఏ కలకూజితం జానకమ్మ పాడితేనో, ఏ సొగసరి గొంతుక "చిత్ర"  పాడితేనో, ఏ గాన గంధర్వుడు జేసుదాస్ పాడితేనో బాగుంటుంది.అంతకన్నా .. అందరికన్నా నా ప్రియమైన శ్రీవారు ..కూనీ రాగం  తీసినా  వినసొంపుగా ఉంటుంది కానీ..అంటూ..తప్పించుకునేది.

అలా పాట పాడటం అంటే తప్పించుకునే ఉష.. ఇప్పుడు ఏ బిడియం లేకుండా స్వేచ్చగా గొంతెత్తి.. శృతి లయల రాగ,తాళాల సమన్వయము అలాటివేమి చూసుకోకుండా ఆనందంగా పాడు తుంది. "అమ్మ పాట వింటూనే చిన్ని కన్నయ్య ఏడుపు మాని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. " వడి వడిగా  వచ్చి ఆ దృశ్యాన్ని ఆనందంగా చూసాడు ఉదయ్.

ఇన్నేళ్ళు తన ముందు పాడటానికి బిడియపడే..ఉష ఇప్పుడు పాడుతుంది. అవును..తన బిడ్డ ని సముదాయిస్తూ నిద్ర పుచ్చడం కోసం పాడుతుంది.  ఆ పాట  అన్ని పాటల కన్నా ఎంతో బాగుంది

ఈ లోకాన   "ఆమ్మ  లాలి పాట కన్నా అందమైన పాట ఉందా..!? అనుకున్నాడు ఉదయ్.  ప్రేమగా, మురిపెంగా వారిద్దరిని చూసుకుంటూ.
 (ఇటీవలే పుట్టిన "మా చిన్ని కన్నయ్య " వాళ్ళ ఆమ్మ-నాన్న కబుర్లు ఇవి.)
 
         

20, ఫిబ్రవరి 2012, సోమవారం

కథా విశ్లేషణ పోటీలో బహుమతి కి నా స్పందన.

కథా జగత్ .. వారికి.. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీ విహారి గారికి,కస్తూరి మురళీ కృష్ణ గారికి మనః పూర్వకధన్యవాదములు.

దాదాపు రెండు వందల కథలలో పాఠకురాలిగా నేను అడుగుపెట్టడమే నాకు అసలైన బహుమతి. కథా విశ్లేషణలో పాల్గొనడం కూడా..

ఒక సామాన్య పాఠకురాలికి కథలు చదవడం పట్ల అనురక్తి మరియు కథలోని విషయం పట్ల, పాత్రల చిత్రీకరణ పట్ల సునిశిత పరిశీలనా..శక్తి తో పాటు ఆ పాత్రల స్వభావాన్ని అవగాహన చేసుకుని కథని విశ్లేషించుకుంటే.. మంచి కథ ఏదో మనకి తెలుస్తుందని నా అభిప్రాయం.

నేను అలాగే "సామాన్య" గారి "కల్పన" కథని చూసాను.

మంచి ఇతి వృత్తం తో పాటు కథా రచయిత కథని అందించడంలో యెంత వరకు కృతకృత్యులయ్యారో అన్నది కథ విజయానికి మూలకారణం అనుకుంటాను.

నా ఈ విశ్లేషణకి బహుమతి రావడం నాకు చాలా ఆనందదాయకం అనే కంటే.. "కల్పన" కథలోని స్త్రీ పాత్రల అంతరంగం,ఆలోచనల,ఆవేదనల ఉదృతిని అర్ధం చేసుకుని ఆ కోణంలో నేను చేసిన విశ్లేషణకి వచ్చిన బహుమతి అని నేను భావించడమైనది.

"సామాన్య"..గారు.. మరొకసారి మంచి కథని అందించిన మీకు అభినందనలు. అందరికి ధన్యవాదములు.

కథ జగత్ ని నిర్వహిస్తున్న మురళీ మోహన్ గారికి,కథా విశ్లేషణ కి బహుమతుల్ని అందించి ప్రోత్స హిస్తున్న చావా కిరణ్ కుమార్ గార్కి మనః పూర్వక ధన్యవాదములు.

లక్ష్మి మాధవ్ గార్కి,శైలజామిత్ర గారికి.. మనఃపూర్వక అభినందనలు.

కథా జగత్ లో పాల్గొన్న అందరికి కూడా అభినందనలు. ఇలాగే మంచి కథలని విశ్లేషించు కోవడానికి పోటీ పడదాం.

కథా జగత్ లో విహరిద్దాం.

17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

దేవత - ప్రేమ దేవత

రైలు రెండు గంటలు ఆలస్యంగా వస్తున్నందుకు  క్షమాపణ చెబుతూ పదే పదే  త్రి భాషల్లో వినవస్తున్న ఎనౌన్స్ మెంట్  వింటూ చాలా అసహనంగా ''ఈ దేశంలో.. రైళ్ళు   సకాలంలో యెప్పుడు  ప్రయాణించాయి గనుక " అనుకున్నాడు కుమార్.

ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటు లాగా యీ రెండు గంటల  ఆలస్యాన్ని  భరించడం కూడా తనవల్ల
కాదనుకుంటూ వెయిటింగ్ రూమ్లో కూర్చున్న సీట్ లోనుండి లేచి  నుంచుని  పాకెట్లో నుండి సిగెరేట్ పేకెట్ తీసాడు. లైటర్ తో సిగెరేట్ వెలిగించుకుని ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చి  గట్టిగా రెండు దమ్ములు లాగి  బిగించి  రింగులు రింగులుగా గాలిలోకి వదులుతూ కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు కుమార్. అలా సిగెరేట్ తాగుతూ వుంటే  ప్రక్కన సీట్లో కూర్చున్న ఆమె ఒడిలోని మూడేళ్ళ బుడతడు  తనవంకే కన్నార్పకుండా చూస్తున్నట్లు  గమనించి చిన్నగా నవ్వుకున్నాడు.

తన కొడుక్కి అంత వయసున్నప్పుడే యిలాగే రింగులు రింగులుగా పొగ వదలడం వాడికి  భలే ఆశ్చర్యంగా ఉండేది. తన చిన్ని చిన్ని చేతులతో చప్పట్లు కొడుతూ.. "భలే భలే ! డాడీ.. మళ్ళీ అలా చేయి,అలా చేయి "అంటూ..
గంతులేసేవాడు. వాళ్ళమ్మ ఆ దృశ్యాన్ని   చూస్తే వెంటనే..  వాడిని యెత్తుకుని ప్రక్కకు తీసుకు వెళ్ళిపోయేది.

 "వాడు సరదా పడుతున్నాడు..చూడనీ" అంటుంటే.. "అదేమన్నా మంచి విషయమా సరదా పడుతూ చూడటానికి. మీ ఆరోగ్యం అంటే మీకు లెక్కలేకపోవచ్చు. వాడి ఆరోగ్యం ముఖ్యం కదా!" అనేది.

ఆలోచనలో చేయి చురుక్కుమంది అప్పటి ఆమె మాటల్లాగే!

ఆ సిగెరెట్ ని ప్లాట్ ఫారం   పై విసిరేస్తూ..యాధాలాపంగా పక్కక్కి చూసాడు..

ఏదో అయస్కాంతం ఆకర్షించినట్లు అతని చూపులటువైపు మళ్ళాయి.   అతని  కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవయినాయి.  కొంచెం దూరంలో ఆమె ప్రయాణీకులతో కలసి కూర్చుని వుంది.

పింక్ చీరలో .అబ్బ!  యెంత బాగుంది.  అందమా, కాదు కాదు, అరే! తనకసలు పింక్ కలర్ చీరే  నచ్చదు. తన భార్యకిష్టమైన రంగు. ఆమె  ఆ రంగు చీరెప్పుడు కట్టుకున్నా చిరాకుగా చూసేవాడు.  తన చూపులను ఆమె  అర్ధం చేసుకుని వార్ద్రోబ్ లో ఆ కలర్ చీరే లేకుండా చేసుకుంది.  ఇప్పుడేమిటీ ఆ రంగు చీర కట్టుకున్న ఆమెని అలా చూస్తున్నాను అనుకున్నాడు.

ఆమెలో  అందాన్ని మించిన యేదో గ్రేస్.. హుందాతనం. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏ విదమైన మేకప్ లు లేకుండా సహజ సిద్దమైన అందం. తనకి చాలా చాలా నచ్చింది. ఆమెని తన సొంతం చేసుకోవాలన్న ఆశ కల్గింది.  తాను యెన్నో అందాలని చూసాడు.సమీపంగాను,బాహ్యంగాను కూడా. అవేమి తనకి గుర్తు రావడంలేదు.

ఎన్నో యేళ్ళుగా కాంచని అందం యేదో ఆమెలో కనబడుతుంది. బాగా వెనక్కి జరిగి ఆమెనే చూస్తూ..నిలబడ్డాడు.
నలబై పైన  వుంటాయేమో.. అలా వయసు వున్న యితర స్త్రీలలా కనిపించడంలేదు.  కొంచెం సన్నగా చామాన చాయ రంగులో  నల్లని జడ తో.  చెంపల దగ్గర అక్కడక్కడా వెండి తీగల్లా మెరుస్తూ వున్నా కూడా అవేమి లెక్క అన్నట్లు తళుకులీనే ఆమె చర్మసౌందర్యం .. "వాటే..బ్యూటిఫుల్ లేడీ!"

రెండు గంటలేమిటీ నాలుగు గంటలపాటు ఆలస్యం అయినా  సరే ఆ సౌందర్యాన్ని చూస్తూ కాలం గడిపేయవచ్చు. అలా పదినిమిషాలు గడచిపోయాయి. అయిదు నిమిషాలకొకసారి తగలేసే సిగెరెట్ అసలు వొక్క సారాన్నా  గుర్తుకురాలేదు.

ఆమె మందస్మిత ముఖారవిందాన్ని   చూస్తే చాలు ఆకలి దప్పికలు మర్చి పోవచ్చు . ఆమెలో యెక్కడా అసహనం అన్నది కనిపించడం లేదు. చాలా రిలాక్స్ గా కూర్చుని చుట్టూ పక్కల చూస్తుంది.  తానూ దూరంగా వెనుకగా వున్నాడు కాబట్టి తనని గమనించే అవకాశమే లేదు. హ్యాపీగా అలా చూస్తూ వుండిపోవచ్చు.

ఇంతకూ ముందు తననే కన్నార్పకుండా చూసిన బుడతడు వాళ్ళమ్మ చేతిలోనుండి జారి పోయి ప్లాట్ పారం మీదకి వెళ్లి నడవాలని ఆరాట పడుతున్నాడు. ఆ బుడతడి తల్లికి మోసి మోసి విసుగేసిందేమో అలా వదిలేసింది. వాడు నడుస్తూ ఆమె ముందుకు వెళ్ళాడు.  వాడు అక్కడే తిరుగుతూ  వుంటే చిరు దరహాసంతో ఆత్మీయంగా చూస్తూ వుంది.

తను కాకుండా యింకో యిద్దరు ముగ్గురు ఆమె పై చూపుల వల వేసే వుంచారు. ఒకరు..మాటి మాటికి తల తిప్పుతూ..కాస్త సభ్యతగా,ఇంకొకరు సభ్యత మరచిపోయి ఆబగా.  ఇంకొకరు తనలా దొంగలా చూస్తూనే ఉన్నారు.

ఆమె చుట్టూ పక్కల రైలు కోసం వేచి చూస్తున్న వారిలో  ఆమె కన్నా తక్కువ వయసులో వున్నవారు,అందంగా వున్నవారు,అందంగా వున్నామనుకుని యెబ్బెట్టుగా అలంకరించుకున్న వారు ఉన్నారు.   కానీ వాళ్ళపై  చూపు నిలవడం లేదు.

అందమైన కనుదోయి కొంచెం అలసినట్లున్న ఆ కళ్ళల్లో  అందం కన్నా ఆకర్షణ కన్నా విజ్ఞానం నింపుకున్నట్లు మెరుస్తూ  ఉన్నాయి. ఆమె ముందు తిరుగుతున్న ఆ  బుడతడు పరుగులు పెట్టబోయి.. యెదురుగా వస్తున్న వారిని తట్టుకుని దబీ మని పడిపోయాడు. వాడి తల్లికంటే   ఆమె ముందు లేచి వెళ్ళి  వాడిని లేపి ఎత్తుకుని సముదాయించ సాగింది. ఆ లాలనలో ప్రేమ,దయ నిండుకుని వున్నాయి. ఆ బుడతడి తల్లి వాడిని కుదురుగా వుండవెందుకని.. ? అంటూ కోపంగా రెండు దెబ్బలు వేసింది.  ఇక వాడి యేడుపు తారా స్థాయికి చేరుకుంది.

"అయ్యో, యె౦దుకలా కోపగించుకుంటారు. పిల్లలని అలా విసిగించుకోకూడదు."  అని చెప్పి ఆ బుడతడిని యెత్తుకుని.. అలా ప్లాట్ ఫారం పై అటు వైపుకి తీసుకువెళ్ళింది.. దూరంగా వున్న యేమేమో చూపి వాడి యేడుపు మాన్పించ ప్రయత్నం చేసింది.   ఆమె మాటలకి మంత్రం వేసినట్లు.. ఆ కన్నీటి కళ్ళల్లో యేదో ఆనందం అరవిరిసిన నవ్వులు.  వాడితో సమానంగా ఆమె  నవ్వుతూ చాలా ప్రశాంతంగా కనిపించింది.

ఆ బుడతడిది యెంత అదృష్టం. ఆమె బాహువుల మధ్య  అన్నీ మరచి ఆనందంగా ఆడుకుంటున్నాడు. తిరిగి తెచ్చి వాడిని వాళ్ళ మ్మకి యివ్వబోయింది. వాడు ఆమెని వదల లేదు. అలాగే యెత్తుకుని నిలబడింది. ఆమె భుజం పై తల వాల్చి ఆ స్పర్శని అనుభవిస్తూ వాళ్ళ మ్మ వైపు చూడనైనా చూడటం లేదు. ఆ బుడతడి స్థానంలో వుండి
తను కూడా అలా సేదతీరితే యెంత బాగుండును.  కుమార్ లో వొక కోరిక మొదలైంది.

ఆడవాళ్ళలో అందం అంటే ఇతరులపై ప్రవహింపజేసే ప్రేమ, కళ్ళల్లో కరుణ, కొంత దయార్ద్ర హృదయం,మనిషిని అర్ధం చేసుకునే తత్త్వం, యితరుల  తప్పులని క్షమించే గుణం , యే సమస్యనైనా యెదుర్కునే దైర్యం. ఇలాటి సహజ గుణాలే  అసలయిన అందము,అలంకారమూనూ .. అవి లేకపోతే  ..యెంత అందమైనా శోభించదు..రా, నీ మనసులో నీ భార్య అందంగా లేదన్న సంగతి మరచి పోయి అణుకువగా,అర్ధం చేసుకునే గుణం వున్నఆ  పిల్లతో.. హాయిగా కాపురం చేసుకో అని అమ్మ చెపుతున్నా వినకుండా వసి వాడి పోయే అందాల కోసం ఆరాట పడ్డాడు.

పై పై అందాలు అన్నీ యవ్వనం,డబ్బు,హోదాలున్నప్పుడు వుండి తర్వాత కరిగిపోతాయి అన్నయ్యా.  నువ్వు ప్రేమించిన" లత " కంటే  వదిన అందంగా లేదని భావించి  వదిన  అంటే ప్రేమ లేదని అయిష్టం గా వుంటావు. పెళ్లి చేసుకున్నాక అలా వుండటం తప్పని  పెద్ద చదువులు చదువుకున్ననీకు నేను చెప్పాలా అన్నయ్యా,  వదిన నీకు నచ్చలేదంటావు కానీ నాకు మాత్రం  యెంతో బాగుంటుంది అనేది సుజాత.

ఎవరు యేమన్నా  ఊ..హు.. తను వింటేగా,  కోరుకున్న అందాల దేవత " లత" కోసం అన్వేషణ.
భార్య  నుండి దూరంగా, తను కోరుకున్న అందాల అన్వేషణలో అలసే దాకా తిరుగుతూనే వున్నాడు. ఎండ మావుల వెంట పరుగులు తీసినట్లు. తనకి అశాంతి తప్ప యే౦ మిగిలింది? అందుకే తనలో యెప్పుడు చిరాకు,అసహనం,గిల్టీ నెస్.  అలా వొప్పుకోవడం అనుకోవడం నామోషీతనమేమో కానీ..అంతకన్నా యెక్కువైన భావమే వెంటాడుతూ, బ్రతుకంతా వేటాడుతూ..

ఏం మిగిలింది? యే౦ సాదించాను? ఆత్మ విమర్శ అతనిలో..

కొన్నేళ్ళ  జీవనం తర్వాత ఆఖరికి "లత" వేరొక ధనవంతుని  భార్యగా తనొక పావులా మిగిలిపోయారు.

రెండు గంటలు గడచిపోయాయి. ట్రైన్ వస్తుందన్న ఎనౌన్స్ మెంట్. ఆమె లేచి నిలబడింది. చేతిలో చిన్న బ్రీఫ్ కేస్ తీసుకుని  ముందుకు వెళ్ళింది. తనని గమనించనే లేదు.

ఆమె వెనుకనే నడుస్తున్నాడు. ఆమె ఎక్కిన బోగీనే యెక్కాడు. ఆమె తన రిజర్వేషన్  ప్రకారం తన సీట్ నెంబర్ సరి చూసుకుంది. సర్దుకుని కూర్చుంది. ఆమెకి కుడి వైపు వున్న విండో సీట్ తనకి కేటాయించబడ్డ సీట్.

కూర్చుంటూ ఆమె వైపు   చూసాను. ఆమె నా వైపు చూసింది.  ఆ కళ్ళల్లో ఒక్క క్షణం సంతోషం. మరు క్షణం కదలాడిన ఓ విషాద వీచిక తన చూపుని దాటి పోలేదు. 

కుమార్ ఆమెని మాట్లాడించే సాహసం చేయలేదు.   ఆమె లెక్చరర్ గా వర్క్ చేస్తున్నట్లు విన్నాడు. ఇప్పుడు యెక్కడ వుంటున్నారో..తెలియదు.  కొడుకు  యే౦ చదువుతున్నాడో అంతకన్నా తెలియదు.  మౌనం గానే  ప్రయాణం సాగుతుంది.

సమాంతరమైన పట్టాలపై  ఒకే  ప్రయాణం. ఎన్నటికి కలవని  రెండు పట్టాలపై జీవన ప్రయాణం.
నా ప్రయాణం లో ఆమె నా అందాల దేవత కాదు ప్రేమ దేవత. చేజారిన ప్రేమ దేవత.  మూసిన కళ్ళలో కురవని వర్షం లోలోపలకి ప్రవహిస్తూ అతనిని  ముంచేస్తూ..

ఓ.. పది  గంటల ప్రయాణం తర్వాత రైలు  ఆగింది. చుట్టూ యింకా చీకటే ఉంది.  కుమార్  యింకా మేల్కొనలేదు. కళ్ళు విప్పి చూసాదు.  ఆమె సీటు ఖాళీ.  ఆమె దిగవలసిన స్టేషన్లో దిగి పోయింది అనుకున్నాడు.  ఆ చీకట్లో బయటి నుండే తన చెల్లెలి పిలుపులు వినవస్తున్నాయి.

 అన్నయ్య త్వరగా దిగు. ట్రైన్ కదలబోతుంది అని.  లగేజ్ తీసుకుని వడి వడిగా దిగాడు.

"జాగ్రత్త అన్నయ్యా.    జాగ్రత్తగా దిగు.  ట్రైన్  ఆలస్యంగా రావడం వల్ల  సరిగా సమయాన్ని అంచనా వేయలేక పోవడం వల్ల రిసీవింగ్ కి మీ బావ గారు రాలేకపోయారు. ఇంట్లో పెళ్లి పనులు యెన్ని వున్నా సరే నువ్వు వస్తున్న ఆనందంలో అవి వదిలేసి కూడా నేనే వచ్చేసాను "  అంది చెల్లెలు ప్రేమగా, సంతోషంగా.

 సుజాతని  చూసి ఓ నాలుగేళ్ళు దాటి ఉంటుంది. సుజాత కూతురు పెళ్లి అంటే తప్పని సరై బయలుదేరి వచ్చాడు. ఆమె సంగతి సుజాతకి తెలుసేమో అని అడగాలనుకున్నాడు.

 అంతలోనే అన్నయ్యా ! నీకు ఒక సర్ ప్రైజింగ్..గిఫ్ట్. అంది సుజాత.   ఏమిటమ్మా అది  అని అడిగాడు కుమార్.

ఏమిటో చూడు .అంటూ అడ్డు తొలగింది.  కుమార్ అటు వైపు చూసాడు. పింక్ కలర్  చీరలో ఆమె.

ఆమె అతని  ప్రేమ దేవత. అతని భార్య, యెప్పుడో పోగొట్టుకున్న పెన్నిది.

"మీ వదిన  ఇక్కడ " ఆశ్చర్యంగా అడిగాడు.

"అవునన్నయ్యా ! మేనకోడలి   పెళ్ళికి  మేనమామ సతీ సమేతంగా వచ్చి  పద్దతి ప్రకారం  మట్టెలు తొడగాలి బట్టలివ్వాలి కదా!  మరి వదిన కూడా  రాకుంటే యెలా? " అంది.

అర్ధమై చాలా సంతోషంగా, సంభ్రమంగా అడిగాడు. " నిజంగానా!? "

" నిజంగానే  నిజం" అన్నది ఆమె చల్లని చిరునవ్వుతో.

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

విరాళాల సేకరణ

స్కూల్ పిల్లలు...  స్వచ్చంద  సేవా సంస్థలకి విరాళాలు సేకరించే కార్య కర్తలా !? 

మానవ జీవితంలో ఇతరలుకి సాయం చేయడం,వీలయితే సేవ చేయడం తప్పకుండా చేయాలి. పెద్దలు పిల్లలకి అటువంటి విషయాలు నేర్పించాలి. తప్పులేదు. 

స్వచ్చంద  సేవా సంస్థలు పాఠశాలలో విరాళాల సేకరణ చేయడం ఒక ఎత్తయితే.. విద్యార్ధుల చేత.. విరాళాల  సేకరణ చేయించడం మరొక కోణం. 

దాదాపు నాలుగైదు నెలలుగా మా ఇంటి చుట్టుపక్కల ప్రేవేట్ స్కూల్స్  లో చదువు కునే పిల్లలందరూ.. బధిరుల సేవ చేయు నిమిత్తం అనో, శారీరక,మానసిక వైకల్యం ఉన్నవారికి సహాయం కోసం అనో.. ఫండ్స్ కలక్ట్ చేయాలని పిల్లలపై ఒత్తిడి తెచ్చి  ప్రింటెడ్ మేటర్ ఉన్న కార్డ్ ఇచ్చి పంపడం చేస్తున్నారు. అవేసుకుని పిల్లలు ఎక్కే గడప దిగే గడప తో..అలసి పోతున్నారు. 

కొంత మంది అయితే పిల్లలని.. భిక్ష గాళ్ళని కసురుకున్తున్నట్లు కసురుకుంటున్నారు కూడా..  వాళ్ళ చిన్నబోయిన మొహాలని చూస్తే..జాలి అనిపిస్తుంది.

ఆ విషయమే చెపుతూ.. ఆ నిధుల సేకరణ ఏదో.. పిల్లలతోనే చేయించక ,టీచర్స్  పిల్లలతో.సమూహంగా వెళ్లి చేస్తే బాగుంటుంది కదా..అన్నాను ఆ స్కూల్ టీచర్ తో..పోట్లాడినట్లుగానే. ఆవిడ మొహం ఇంత లావు పెట్టుకుని.. ఈ సారి అలాగే చేస్తాం లెండి అంది.   

సేవా సంస్థల ముసుగులో.. అతి తేలికగా డబ్బు సంపాదించే మార్గాలలో.. ఇది ఒక మార్గం ఏమో..అనుకుంటాను. 
ఎందు కంటే.. సేవ చేస్తున్నామని చెప్పుకోవడం ప్యాషన్ అయిపొయింది కాబట్టి.

మా ఇంటి పై భాగంలో ఉండే "మౌని" అనే చిచ్చుర పిడుగు.. ఆంటీ..మీరు నాకే ఫండ్స్ ఇవ్వాలి. వేరెవరికన్నా ఇస్తే..వాళ్ళు నాకన్నా ఎక్కువ కల్లెక్ట్   చేసినవాళ్ళు అవుతారు అని నాకు రూల్స్ పెట్టి కట్టి పడేసింది కూడా.. 

ఏది ?ఒకసారి నన్ను ఆ..సేవా సంస్థ వివరాలు చూడనీ..!అని చెప్పి తీసుకుని చూస్తే..ఆశాసేవా సంస్థ అని ఉంది. ఆ సంస్థ వాళ్ళు వాళ్ళ ఆశ్రమ చిరునామా ని కానీ.. శాశ్వత చిరునామా కానీ ఏమి లేవు. ఇలా స్కూల్ పిల్లల చేత నిధులు సేకరింపజేసి..వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నవారికి స్కూల్  యాజమాన్యం ఎలా సహకరిస్తుందో అర్ధం కాదు. 

ఎంతో మంది పీటర్ సుబ్బయ్యలు మన చుట్టూ ఉన్నారు. అనాధ పిల్లలని చేరదీసినట్లు చేరదీసి వారిని.. దత్తత పేరిట విదేశాలకి  అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే బాలభవన్ లో చేర్పించిన పిల్లలని.. ఆ సంస్థ నిర్వాహకులే.. బాల కార్మికులగా పంపే.. వాళ్ళు ఉన్నారు. మా ప్రాంతం లో అయితే.. అనాధ పిల్లలు లేకుండానే ఉన్నట్లు చూపించి.. విదేశాల నుండి నిధులు సేకరించే వాళ్ళు ఉన్నారు. అలాటి వారికి దండన ఉంటుంది అనుకోండి. 

 ఇలాటి వారి మూలంగా నిజంగా సహాయం అవసరం ఉన్న వారికి  సహాయం అంద కుండా పోతుంది. 

మొన్నీ మధ్య..ఒక ఆదివారం ఉదయాన్నే నేను బయటకి వెళ్ళే సమయానికి ఒక యుక్త వయస్కురాలు అనాధ వృద్దాశ్రమం కి నిధులు సేకరిస్తున్నాం అని,సహాయం చేయమని వచ్చింది.ఆశ్రమం  పేరు అడ్రస్ ఇచ్చి వెళ్ళండి..మేము నలుగురైదుగురం కలసి బట్టలు,బియ్యం లాటివి అందజేస్తాం అని చెప్పాను. వృద్ధులకి ప్రత్యేక   ఆశ్రమం లేదు. ఇంట్లోనే నడుపుతున్నాం అని చెప్పింది.సరే ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి అంటే ఒక నంబర్ ఇచ్చి వెళ్ళింది. అలా జరిగిన ఓ..వారానికి 

మా ఫ్రెండ్స్ అందరం కలసి కొన్ని బట్టలు, నిత్యాసర వస్తువులు,బియ్యం అన్నీ కొని ఆ ఆశ్రమం వాళ్ళ కి ఇచ్చి వద్దామని ఆ నంబర్ కి డయల్ చేసి అడ్రెస్స్ చెప్పమన్నాం. అది అనాధ ఆశ్రమం కాదని..అందులో ఉన్న వారు వృద్దులే కానీ.. ఇంకా అనాధ ముద్ర పడలేదు .. అలా అని ముద్ర పాడినప్పుడు  ..మేమే మీకు కాల్ చేస్తాం.అప్పుడు వచ్చి పుణ్యం కట్టుకోండి..అని చెప్పి నషాలాని కి   అంటేలా మాటలు పెట్టారు. అలా ఉంటాయండి ముసుగు సేవలు. 

ఇంకోసారి సేవ అని  అనకుండా.. కాస్త జాగ్రత్తఃగా.. వచ్చిన వాళ్ళని భూతద్దం లో చూడటం మొదలు పెట్టాను అని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.:))))) 

13, ఫిబ్రవరి 2012, సోమవారం

రోజా పూలు

ఎవరు ఎవరికి ఏ పూలు అయినా పెట్టవచ్చేమో! లేదా  ఇవ్వ వచ్చేమో కానీ అమ్మాయి..అబ్బాయి ఇచ్చుకునేవి  పుచ్చుకునేవి  మాత్రం..   రోజా పూలు ... 

మొదటి రోజు .. స్నేహం గా నవ్వి.. స్వచ్చమైన స్నేహంకి గుర్తుగా


                                 
రెండవరోజు.. నువ్వు నాకు నచ్చావ్.. అంటూ.. 


                                                
మూడవరోజు.. పెరుగుతున్న స్నేహానికి చిహ్నంగా.. 


నాలగవరోజు.. గాఢమైన ప్రేమ కి గుర్తుగా.. 


అయిదవ రోజు.. కలసిన మసులకి వేదికగా.. 


ఆరవ రోజు నిరసన తెలుపుకుంటూ..


ఏడవ రోజు.. మళ్ళీ  ప్రెష్ గులాబీ పూసింది.. చివరిగా.. ఓ..జోక్.. నవ్వాలి మరి. 

భార్య: ఏమండీ!! నాకు రోజా పూలు అంటే చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా!?. 

నేను  అడగ కుండానే ఈ  వాలెంటైన్స్ డే కి నాకు కానుకగా.. రోజాలు ఇస్తారనుకున్నాను. అంది నిష్టూరంగా.. 

భర్త: ఒసేయ్ పిచ్చి మొహమా!  రక రకాల గులాబీలు ఇచ్చి ఇచ్చి విరక్తి కలిగిందే!  నీకు రోజాలు వద్దు కానీ.."సరోజా" ని ఇస్తాను అన్నాడట. 

భార్య: సరోజా.. ఆమె ఎవరు..అంది

భర్త: ఆమె కాదు.. మనకి పుట్టబోయే  అమ్మాయి..అన్నాడంట.


11, ఫిబ్రవరి 2012, శనివారం

వ్యాపార శైలి

మొన్నొక రోజు మా కాలనీ లోఉన్న జనరల్ స్టోర్స్ కి వెళ్ళా నండీ! 

సాధారణంగా హొల్  సేల్  వ్యాపారుల వద్ద మనం కొనుగోలు చేస్తే.. 6  %  నుండి 12  % వరకు  మనకి కలసి వస్తుందని చెపుతారు.ఆ లేక్కల్లన్నీ నాకు అంత తెలియదు కానీ నాలుగైదు నెలలకు ఒకసారి అలా వన్ టౌన్ కి   వెళ్లి అన్నీ కొనేసుకుని, కష్టపడుతూ తెచ్చేసుకుని..  సర్దేసుకుని.. ఎప్పుడైనా నిండుకున్న వస్తువులని మా కాలనీ స్టోర్ లోనే   మాత్రం  కొంటూ ఉంటాను.

ఎందుకంటే.. నగరాలలో.. వూరికి చివరగా కొత్తగా కాలనీలు ఏర్పడ్డప్పుడు...ఆ కాలనీలో ఒక షాప్ పెట్టి  ..అందరికి కావాల్సిన వస్తువులని అందించడానికి చాలా శ్రమ పడతారు. డబ్బు కొంచెం ఎక్కువ పుచ్చుకున్నా సరే.. ఒక  నిత్యావసర వస్తువు దగ్గరలో లభించడం అనేది ఆనందమే! లేకుంటే ఎంతో దూరం వెళ్లి సమయం  ఎక్కువ పట్టి.. కొన్నిసార్లు వెళ్ళ లేక,వెళ్ళే వాళ్ళు లేక.. అవసరాలని వాయిదా వేసుకుని సర్దుబాట్లు చేసుకుని బ్రతికేయడం అలవాటే! అలాగే.. అలా కొత్తగా ఏర్పడ్డ కాలనీలు అభివృద్ధి చెందే టప్పటికి ఆ కాలనీలో షాప్ పెట్టినవాళ్ళు నాలుగు  రెట్లు ఆర్ధికంగా అభివృద్ధి చెందటం చూస్తుంటాం కూడా.. ఆ రకంగా నాలుగు రెట్లు అభివృద్ధి చెందిన షాప్   మా కాలనీ లో షాప్. నేను కూడా మొదట్లో ఓ.. నాలుగేళ్ళు అలానే అన్నీ వారి దగ్గరే కొన్నాను. కాస్త ఎంకరేజింగ్ గా ఉంటుందని.  రేట్లు తేడా.. సరిచూసుకుంటే..బాగా ఎక్కువ తేడా ఉందని గమనించి తర్వాత అక్కడ అన్నీ కొనడం మానేసాను. 

నేను ఎప్పుడు వెళ్ళినా నాతొ మాట్లాడుతూనే.. ఓ.పది మంది తరవాత నాకు కావాల్సిన వస్తువు అందిస్తారు. నేను త్వరగా వెళ్ళాలమ్మా..అని అంటే..మీరు అయితే ఓపికగా వెయిట్   చేస్తారు  కొందరు  అసలు ఆగరు  అంటారు.  నాకు కావాల్సిన లిస్టు ఎక్కువ ఉండటం తో..వేచి ఉండక తప్పని పరిస్థితి.  నేను ఉన్న కాసేపటిలో ఎక్కువగా.. రీ చార్జ్ లు, పాన్ పరాగ్ లు,గుట్కాలు..కోసం వచ్చే   వాళ్ళని చూస్తే..నిత్య అవసరాలు ఇవే  కదా అనిపిస్తుంది .

ఇంకో తమాషా   విషయం చెప్పనా!?  నాకు ఆశీర్వాద్ ఉప్పే కావాలండీ! ఆశీర్వాద్ గోధుమ పిండే కావాలండీ అంటారు ఒకోకరు.  అవి లేవని చెపితే ఇంకోటి వేరేది తీసుకోవడానికి ఇష్టపడరు. బ్రాండ్ నే మ్ కాదండీ!  ఆ  ఆశీర్వాద్ బ్రాండ్ పై వస్తువులు అన్నీ..ఓ.. మతం అవలంభిస్తున్న భక్తుడు దేవుని ఆశీర్వాదంతో.. ఆశీర్వాద్ బ్రాండ్ నే మ్  తో వ్యాపారం ప్రారంభించి.. లాభాలార్జించి  వారి లాభాలలో.. ౩౦ % ని మత వ్యాప్తికి పేదల సేవకి ఖర్చు పెడుతున్నారట..అని చెపుతుంటే.. నోరు వెళ్ళ బెట్టాల్సి  వచ్చింది.  గోపురం బ్రాండ్ గుర్తుకు వచ్చింది. దేశీయ   ఉప్పు, స్వచ్చమైన గిరిజన తేనే..సంప్రదాయ చేనేత వస్త్రాలు ఇలా గుర్తుకు వస్తూనే ఉంటాయి కదా! ఇలా స్థానిక ప్రాంతీయత,దేశీయ.విదేశీయ వస్తువుల మాయాజాలంలో   చిక్కుకుని కొనుగోలు శక్తి తగ్గుతున్నా సరే  అప్పు భరోసాతో.. జీవిత  కాలాన్ని నెట్టేస్తున్న విని యోగ ..దారులం కదా! 

సరే మళ్ళీ విషయంలోకి వెళ్ళిపోదాం. నేను నా ముందు పది మంది కొనుగోలు దారుల లో ఎనిమిది మందికి  ఆ షాప్ ఆమె ఒకే విషయం చెప్పడం గమనించాను. 

అది అందరికి పది రూపాయల  లోపు చిల్లర లేదని.. చెప్పి  ఒక రూపాయి బ్రూ కాఫీ పేకెట్ లు, లేదా సుర్ఫ్ పేకెట్ లు   ఇస్తుంది అనడం కంటే..అంట గడుతుంది ..అనడం బెటర్.  పిల్లల కైతే చాక్లెట్ లు ఇవ్వడం గమినించాను. 

ఇక్కడ మన అందరికి తెలిసిన విషయం  ఏమంటే.. 

మన దేశంలో..దారిద్ర్య రేఖకి దిగువున బ్రతుకుతున్న  పూటకి  గతిలేని కడు పేదలకి కూడా  ఇన్ స్టంట్   కాఫీ రుచిని పట్టు కుచ్చు లాంటి జుట్టు నిచ్చే ఉదార వాదులు, చిరుగులు ఉన్నా మురికి లేని తెల్లని బట్టలు వేసుకోమని ఇచ్చే సర్ఫ్ పేకెట్ లు..  డిప్ చాయ్ లు , ముష్కిల్ జిందగీలో  భాదని మరపించి నశ్యం పొడులు.. అన్నీ పేదవాడికి అందే ధరలోనే!  ప్రతి వీదిలోను ఏమున్నా లేక పోయినా ఆ సాచే లు  మాత్రం తోరణాలు తోరణాలుగా దర్శనమిస్తూ  ఆ సాచే లు ఇచ్చే అత్యధిక  లాభాల కిక్కు ఎక్కిన వస్తు తయారీదారులు.. మధ్య తరగతి వినియోగదారులని కూడా వాటిని కొనడానికి అలవాటు చేసేసారు అనాలో.. కొనుగోలు శక్తి తగ్గి..అవసరాలని కుదిన్చుకున్నారో అనాలో తెలియని స్థితి. 

  ఇంతకీ.. ఇక్కడ ఆ షాప్ ఆవిడ ఏం చేస్తున్నారు అంటే..  ఆమె వద్దకు వచ్చిన డబ్బుని మరలా చిల్లర లేదు అనే నెపంతో.. వెనక్కి వెళ్ళనీయకుండా.. అవసరం ఉన్నా లేకపోయినా సరే..తప్పనిసరిగా ఆ డబ్బుకి సరిపడ సాచేలని ఇస్తున్నారు. ఆ మిగులు చిల్లర లోను వ్యాపారం చేసి.. ఎక్కువ లాబాలని ఆర్జించడం ని ద్యేయం చేసుకున్నారు అని నాకు అర్ధమైపోయింది. అది కూడా వ్యాపార దక్షత అనాలేమో! 

  సాచేల వల్ల ఆరోగ్యానికి,పర్యావరణానికి యెంత నష్టమో కదా! అది తెలిసినా కొనడం తప్పదు.తప్పించుకోలేని ఉచ్చు కదా.అనిపించింది. 

వినియోగదారుడి కొనుగోలు శక్తిని అంచనా వేసి.. వాళ్లకి అందుబాటు ధరలో కి వస్తువుని అందించి (అవి నాసి రకం )  వినియోగదారులే  మా దేవుళ్ళు అని కీర్తించే.. వినిమయ వ్యవస్థలో.. కోట్లాది రూపాయాల లాభాలు వల్ల ఖాతాల్లోకి.. వెళుతున్నా సరే.. ఇంకా వినియోగదారుడిని ఎలా మోసం చేయాలో ఎప్పుడు ఆలోచించే.. తయారీదారులు, వ్యాపార దారుల వ్యాపార శైలి ని తిట్టుకుంటూ..  మెచ్చుకుని తీరాల్సిందే! 

ఇంత చెప్పానా!! ఆఖరికి ఆ షాప్ ఆమె నాకు చిల్లర లేదని  ఆరు రూపాయలకి సరి పడా.. ఒక 5 రూపాయల బ్రూ..సాచే ,ఒక అగ్గిపెట్టె..ఇస్తే.. నోరు మూసుకుని వద్దనుకుండా తీసుకుని వచ్చేసాను .అదీ సంగతి. . 

6, ఫిబ్రవరి 2012, సోమవారం

మేరీ లిల్లీయమ్మ టీచర్

మేరీ లిల్లీయమ్మ ..  ఆవిడ పేరు వినగానే.. నాకు ఏర్పడ్డ  గౌరవభావం పెరుగుతుంది.  ఒక ప్రేరణ గా మిగిలిపోయింది. పెరిగిన  సానుభూతి , ఆఖరిగా ఓ..విషాద భావం చుట్టేస్తాయి. చక్కని మాట తీరు,అపరితమైన ఆంగ్ల పాండిత్యం, అలవోకగా తేదీలతో సహా చెప్పే చరిత్ర పాఠాలు, సామాజిక,రాజకీయ అంశాలపై ఆమెకి ఉన్న అవగాహన అబ్బురంగా తోచేవి. ఆమె మాట్లాడుతుంటే..గంటల తరబడి వింటూ ఉండిపోయే దాన్ని.

ఆమె నాకు ఎలా పరిచయం అంటే.. ఆవిడ ఒక రిటైర్డ్ టీచర్. అలా అని ఊరికే ఉండేవారు కాదు. వ్యవసాయం పట్ల ఆసక్తి ఎక్కువ.  తమలపాకు తోటలు,కూరగాయల తోటలు సాగు చేసేవారు. అందరు ఆవిడకి  అవి అన్నీ ఎందుకు ? మగవాళ్ళే  వ్యవసాయం చేయలేక కౌలుకి ఇచ్చి హాయిగా కూర్చుంటుంటే.. డబ్బు నష్టపరచుకుంటూ..ఈమె వ్యవసాయం చేయిస్తుంది.గవర్నమెంట్ వారు ఇచ్చిన డబ్బుని ఇలా వృధా చేస్తుంది అనేవారే   ఎక్కువ ఉండేవారు. ఆమె ప్రతి రోజు సాయంకాలం సమయంలో.. తన ఇంటి అవసరాలకి సరిపడా తాజా కూరగాయలని కొనుక్కుని వెళుతూ.. కాసేపు మా కాంపౌండ్ లో అందరి దగ్గర కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళేవారు.

ఆమె గురించి చెప్పాలంటే..  మేరీ లిల్లీ యమ్మ  .  ఈ పేరు వినగానే మనం ఏ విదేశీయురాలో అనుకుంటాం.కానీ ఆవిడ అచ్చ తెలుగు ఆడపడచు.
ఆమె తండ్రి బ్రిటిష్ వారి కాలంలో బందరు పట్టణంలో వారి దగ్గర నౌఖరీ చేసేవారట. బ్రిటిష్ వారి అలవాట్లు, వారి మతం అన్నీ బాగా ఒంటబట్టించుకుని ఒక విధంగా జీర్ణం చేసుకుని తన జీవన విధానాన్ని బ్రిటిష్ వారి లాగా మార్చుకున్నారు. అలా ఆయన తనకి పుట్టిన బిడ్డలలో ఆఖరి బిడ్డకి మేరి లిల్లీ అని పేరు పెట్టారట. తర్వాత మనకి స్వాతంత్ర్యం రావడం బ్రిటిష్   వాళ్ళు  దేశం వీడి వెళ్ళిపోయినా వారి ప్రభావం మాత్రం అలాగే నిలిచి పోయింది. మేరి లిల్లీయమ్మ తల్లి హిందువే అయినప్పటికీ భర్త అవలంభించే క్రిస్టీయానిటి  పట్ల వ్యతిరేకం   ఉన్నా  కూడా.. తన పెద్ద కూతుర్లకి హిందూ సంప్రదాయంలోనే వివాహం జరిపించారు.

మేరీ లిల్లీయమ్మ తండ్రి మాత్రం మేరీలిల్లీయమ్మ కి ఆఖరి అమ్మాయి అనేమో  బందర్ హిందూ కాలేజ్ లో చేర్పించి చక్కగా చదివించారు, ఆవిడ బాగా చదువుకుని టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నారు. కానీ ఎందుకో వివాహం పట్ల విముఖత ప్రదర్షించేవారట. తాము క్రిస్టియన్స్ మి కాదు.. అచ్చమైన హిందువులమే..మమ్మల్ని క్రిస్టియన్లుగా భావించి మమ్మల్ని దూరంగా నెట్టకండి అనే ఆవేదన ఆమె మాటల్లో బాగా వినిపించేది    మతం పేరిట దూరంగా నెడుతున్నారని వ్యతిరేకభావం పెంచుకుని వచ్చిన క్రిస్టియన్ మతస్తుల పెళ్లి సంబంధాలను తిప్పికొట్టేది అని చెప్పుకునేవారు. ఆమెకి ఆమె పేరు కూడా ఇష్టం ఉండేది కాదు. తనకి రసవిహారి అనే ప్రాణ స్నేహితురాలు ఉండేది అని ఎప్పుడు ఎక్కువగా  చెప్పేవారు. అల్లాగే బూరగడ్డ నిరంజనరావు గారిని కృతజ్ఞతగా తలచుకునేవారు. ఆమెకి ఉద్యోగం ఇప్పించడానికి సాయ పడ్డారని కృతజ్ఞత అన్నమాట.

ఆమె  రిటైర్  అయ్యేటప్పటికి హయ్యర్ గ్రేడ్ టీచర్.  వివాహం చేసుకోకపోవడం వల్ల తన అక్క లిద్దరి పిల్లలని తన పిల్లలుగానే భావించి.. వాళ్ళకి మంచి-చెడు చూస్తూ ఉండేవారు. ఇక అక్క కొడుకు ఎర్రబాబు అని ఒకతను ఉండేవాడు.అతనికి పెద్దగా చదువుసంధ్యలబ్బక.. ఎక్కడ ఎక్కడో ఉంటూ అలాగే వివాహం చేసుకుని ఇతర రాష్ట్రాలలోనే ఉండేవారు.అతనికి ఇద్దరు కూతుర్లు. యెర్ర బాబు బాధ్యతా రాహిత్యం మేరి లిల్లియమ్మ కి అంత నచ్చకపోయినా..అతనంటే ప్రేమ ఉండేది. అలాగే ఇంకో   అక్క కొడుకు అంటే కూడా ప్రేమగా ఉండేది.  ఇంకా అక్కల కూతుళ్ళు మనుమరాళ్ళు గురించి చెప్పేవారు. సురేంద్ర అనే అతనికి  ఒక స్టేషనరీ షాప్  ఉండేది అని చెప్పేవారు.నాకు ఆమె తెలిసేటప్పటికి వృద్దాప్యం లో ఉన్న  తన అక్క ,ఆమె మతి స్థిమితం   లేని కొడుకుకి  ..ఆమె అండగా ఉండేవారు.వంట చేయడం,వారి బాగోగులు చూడటం, నాలుగైదు పేపర్స్   చదవడం ఆమె దిన చర్యగా ఉండేది. నా వద్ద ఉన్న బుక్స్ తీసుకుని వెళ్లి చదివి మళ్ళీ భద్రంగా తెచ్చి ఇచ్చేవారు. పిల్లలకి ఉచితంగా ట్యూషన్స్ చెప్పేవారు. ఆవిడ పాఠం చెపుతుంటే.. యెంత బాగా నాటుకునేదో.అలాగే ఏ విషయమైనా కూడా అంత బాగా  చెప్పేవారు.

ఒక రోజు నేను ఆవిడతో మాట్లాడుతూ ఉండగా .. ముంబాయి వెళ్ళే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్  గురించి ప్రస్తావన వచ్చింది. నేను మీతో కలసి ముంబయి వస్తానమ్మా..అన్నారు. ఎందుకు ఆంటీ..మేము టూర్ కి వెళ్ళడం లేదు. పర్చేజింగ్ కి ఐదుగురు ఆరుగురు కలసి వెళుతున్నాం.అటునుండి..సూరత్ ,వారణాసి కూడా వెళతాం. అన్నాను ఆవిడ స్థితిని దృష్టిలో ఉంచుకుని. నేను ముంబాయి లో టాటా  కేన్సర్ ఇనిస్ట్యూట్ కి వెళ్ళాలి. చెకప్ కోసం. నాకు ఎవరు తోడూ లేరు మీతో కలసి వస్తాను . అని అడిగారు. సరే అని ఆవిడకి టికెట్ రిజర్వ్ చేయించాను. ఆమె టికెట్ కి   రాయితీ కూడా ఇచ్చారు. అలాగే ఆమెకి సహాయంగా వెళుతున్న వారికి రాయితీ ఉంటుందని చెప్పారు.

అలా ఆమెని మాతో కలసి ముంబాయి తీసుకు వెళ్లి కేన్సర్ హాస్పిటల్ లో చెకప్ చేయించుకుని వచ్చే క్రమంలో చాలా ఇబ్బంది పెట్టేవారు. మేము కలసి వెళ్ళిన వాళ్ళందరూ నలబయిల లోపు వారు.  కావలసిన వస్తువులు,వస్త్రాలు కోసం ఎక్కడికైనా పరుగులు తీయడం,వాకబు చేసుకోవడం,వస్త్ర మార్కెట్ లు అన్నీ తెగ చుట్టేయడం ఉండేది. మేము విడిది చేసిన రూమ్లో ఉండండీ అంటే వినేవారు  కాదు, మేము  షాపింగ్ కోసం ముంబాయి నగరం అంతా..ఎక్కువ లోకల్ ట్రైన్ లోనే ప్రయాణం చేయాల్సి రావడం, రైల్వే   స్టేషన్ లో మెట్లు ఎక్కడం దిగడం ఆలస్యం అవడం జరిగేది. మా ఏజంట్ తో సహా అందరు  విసుక్కునేవారు. పెద్దవారికి సహాయం చేయకపోతే.. ఎలా అనేదాన్ని.  పాపం కాస్త వెనుక బడి నడిచేవారు తప్ప  మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టేవారు కాదు.మేము షాపింగ్లో ఏం కొంటున్నా.. ఆమెకి కావాలని తీసుకునే వారు తప్ప. :)

ఆమె బ్రెస్ట్  కేన్సర్ తో బాధపడుతూ అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవడం ఆమెకి ముంబాయి చాలా  పరిచయమే! ,ఆమె భాషా పరిజ్ఞానం,అనుభవం మాకు ఉపయోగపడేవి కూడా. అందుకే అందరూ విసుక్కున్నా..మళ్ళీ ఆమెతో ప్రేమగా మాట్లాడేవారు. రెండు సార్లు అయితే మా అందరితో..  కలసి సూరత్ కూడా వచ్చారు. ఆమెని అక్కడే వదిలి ఒక సారి జైపూర్ వెళ్ళాం. వచ్చాక తెగ నసపెట్టారు నేనూ వచ్చీదాన్ని అని. అప్పుడు..మా గ్రూఫ్ లో వాళ్ళంతా.. ఇదిగోండి..వనజ గారు.. ఆమె వస్తే.. మనకి షాపింగ్ కుదరదు. ఈ సారి ఆవిడని తీసుకు రావద్దు అని గట్టిగా చెప్పేశారు.

అలా నాలుగేళ్ళలో టీచర్ గారు అని పిలిచే ఆమె నాకు ఆంటీ అయిపోయారు. చాలా శ్రద్దగా కేన్సర్ ఇనిస్ట్యూట్ లో ఆమెకి చెకప్ చేయించి డాక్టర్లతో వివరంగా మాట్లాడేదాన్ని.అది ఆవిడని కదిలించి వేసేది అనుకుంటాను. పదే పదే కళ్ళు తుడుచుకునేవారు. ఆమె మొదటి సారిగా ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఎవరు లేని ఏకాకి తనం ఒక స్నేహితురాలు ఆమెకు తోడు ఉండటం లాటి విషయాలు చెప్పేవారు. టాటా కేన్సర్ ఇనిస్ట్యూట్ చూస్తేనే మనసు విచలితమయ్యి పోయేది. అక్కడ ఉన్న బాధాతాప్త హృదయాలని..చిన్న చిన్న పిల్లలు కేన్సర్ బారినపడి.. వైద్యం కోసం వచ్చిన వారిని చూస్తే..ఏమిటీ జీవితం అనిపిస్తుంది. వైరాగ్యం వచ్చేసేది. నాకైతే మరణం అంటే ఉన్న భయం పోయింది కూడా ఒక రకంగా.

మా అమ్మ సర్వికల్ కేన్సర్ తో బాధపడి మరణించడం నేను ఎప్పుడు మర్చిపోలేను. డబ్బు ఉంది వైద్యం అందు బాటులో ఉంది.. ఓ..డయాగ్నేస్టిక్  లాబ్  వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అమ్మకి ఉన్న కేన్సర్ ని  ప్రధమ దశలో  గుర్తించకపోవడం దురదృష్టకరం.  అమ్మ చనిపోతారు అని తెలిసిన తర్వాత ఆమెని ఒదిలి నేను ఒక్క రోజు కూడా ఉండలేదు. చిన్న పిల్లకి సేవ చేసినట్లు సేవ చేసాను. బ్రతకాలన్న ఆమె ఆశ తీరనందుకు ఏడ్చేదాన్ని. అలా నాకు ఆమెలో  చనిపోయిన మా అమ్మ కనబడేదేమో..ఆమెకి ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ సాయం కావాలన్నా చేసేదాన్ని.  

వనజా.. అంటూ నేను ఉండే మూడవ అంతస్తుకి వినబడే వరకు కాంపౌండ్   లో నిలబడే గట్టిగా నాన్ స్టాప్ గా పిలుస్తూ ఉండేవారు.  మా అత్తగారు తెగ విసుక్కునేవారు కూడా. ఏమిటి ఆంటీ..అంటే.. రహస్యంగా చేతి వేళ్ళు చూపించేవారు. డబ్బు అవసరపడిందని అర్ధం చేసుకుని.. క్రిందికి దిగి వెళ్లి ఇచ్చేదాన్ని. అది ఆవిడకి మామూలే..వచ్చే పెన్షన్ డబ్బు అంతా.. ఏ అక్క కొడుకు ఆర్ధిక  అవసరాలకి ఎగదన్నుకు  పోయేవారు. లేదా ఏ మనుమడి,మనుమరాలకో వెళ్లిపోయేవి.  ఆ విషయం చెప్పుకోవడం కూడా ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. నాకు మెడిసన్ కి యెంత డబ్బు అయినా చాలడం లేదమ్మా..అనేవారు. ముంబై లో చెకప్ అప్పుడు తప్ప ఆవిడ మళ్ళీ తన ఆరోగ్యం కోసం ఎప్పుడు ఖర్చు పెట్టరు అని నాకు తెలుసు. అలా ఉండేది ఆమె జీవితం.

తర్వాత మేము ఇల్లు మారడం వల్ల ఆమెతో నాకు దూరం పెరిగింది. ఎప్పుడైనా తనే వచ్చి నన్ను చూసి వెళ్ళేవారు. మా అబ్బాయిని చూసి మెచ్చుకుంటూ.. వరాల కొడుకుని కన్నావమ్మా.. అనేవారు.అంతలోనే. మా అబ్బాయితో..’’మీ అమ్మ చాలా గ్రేట్ లేడీ. తనకి ఎప్పుడు అండ-దండ ఉండాలి’’ అని చెప్పేవారు.  వాళ్ళ మనుమడుని పోల్చుకుంటూ ఇప్పుడు బాగా చదువుకుంటూన్నాడని   చెప్పేది.

అలా రోజులు జరుగుతూ ఉండగా.. సాయంత్రం ఆరు గంటలప్పుడు మా ఇంటికి వచ్చారు. నేను అప్పుడు స్నానం చేస్తున్నాను. ఇంటికి ఎదురుగా రోడ్డుకి అవతకి వైపునే నిలబడి నన్ను పిలుస్తున్నారట. లోపలకి రమ్మన్నా రారు. ఆవిడ తత్త్వం అంతే! స్వయంగా నేను వెళ్లి ఇంట్లోకి రండి ఆంటీ అని వెంటబెట్టుకుని లోపలకి తీసుకు వస్తే తప్ప రారు. అది నాకు తెలుసు కాబట్టి వెంటనే.. హడావిడిగా చీర కుచ్చెళ్లు పెట్టుకుంటూనే లోపలికి రండి ఆంటీ..అని ఆమె దగ్గరికి వెళ్లాను. ఎక్కడికో  వెళుతున్నావు కదమ్మా..అన్నారు. నా ఒంటిమీద ఉన్న  ఖరీదైన చీర చూసి. 

“అవునాంటీ..ఓ..ఫంక్షన్   కి బయలు దేరుతున్నాను. రండి..కాఫీ.తాగి వెళ్ళవచ్చు. ఏమైనా డబ్బు అవసరమా” అని అడిగాను. “లోపలికి రానమ్మా.. నువ్వే బయలుదేరి  త్వరగా రా.. బస్ స్టాప్ వరకు కలసి వెళదాం” అని అక్కడే నిలబడిపోయారు. నేను అయిదు నిమిషాల్లో బయటపడి.. మాట్లాడుకుంటూ.. బస్ స్టాప్ వైపు కి వెళ్ళే నడకలో..ఆమె చాలా దిగులుగా ఉన్నారని గ్రహించాను. ఏమిటి ఆంటీ..అని అడిగాను. ఏం లేదమ్మా..నిన్ను చూడాలని వచ్చాను అని.. మీరు వెళ్ళిరండి. నేను ఇంటికి వెళతాను అని అన్నారు. బస్ స్టాప్ ల కోసం చెరో వైపు విడిపోయాం.  అదే ఇక ఆవిడని ఆఖరి చూపు చూడటం.

తెల్లవారి సాయంత్రం లిల్లీయమ్మ కనబడటం  లేదంట అన్న వార్తా విన్నాను. అయ్యో..ఇదేమిటి నిన్ననేగా వచ్చారు అని అన్నాను. పరిచయస్తుల అందరి దగ్గర వాకబు చేస్తున్నారు కానీ..ఆమె ఎవరి ఇంట ఉండనే ఉండదు. ఏదో జరిగింది అనుకుంటూ..ఆ రాత్రి అంతా నిద్ర పట్ట లేదు. మిస్సింగ్ కేస్  మాత్రం నమోదు చేసి..వీలైనంత తిట్టుకుని..  అసహనం గా రోజులు లెక్క పెట్టుకుంటున్న ఆమె అక్క కొడుకులని  ఊరి ప్రెసిడెంట్ గారు మందలించి.. మా వూరి ప్రక్కనే ప్రవహిస్తూ   వెళ్ళే బందరు కాలువ వెంబడి వెతికించమని సలహా చెప్పారట. అల్లా వెతుకుండగా.. ఆమె మృతదేహం ఓ ఊరి లాకుల సమీపంలో దొరికింది.

ఆమెకి అంత్య క్రియలు కూడా అంత బాగా జరిపించలేదని తెలిసింది.ఆవిడ తనకున్న ఇంటిని ఆస్థిపాస్తులను.. అక్క కొడుకులకి వివరంగా వ్రాసి వీలునామా వ్రాయించే ఉంచారట, ఆరోగ్యం బాగోక వండి పెట్టె వారు లేక..వాళ్ళకు పెట్టావు అని వీళ్ళు, వీళ్ళకి పెట్టావని వాళ్ళు  డబ్బు కోసం ఆమెని సాధించడం తప్ప ప్రేమ,ఆదరణ పంచని కొడుకులు కాని కొడుకుల పట్ల విరక్తి భావం పెంచుకుని.. ఎవరికి భారం కాకుండా.. బాగా తిరుగుతూ ఉన్న స్థితిలోనే బలవంతంగా తనువు చాలించారు అని నాకు అర్ధమైంది.

తన వంతుగా విద్యా సేవ చేసి.. ఆ సేవలకి లభించిన ఫలితాన్ని జాగ్రత్తగా కొద్దిగా గొప్పో దాచుకున్న డబ్బుని,ఇంటిని అన్నిటిని వారికే పంచి.. తను కనుమరుగయ్యారు అని తలచుకుంటూనే గుండె బరువుగా మారుతుంది.ఆమె పోయి మూడేళ్ళు అయినా సరే  డిసెంబర్ మాసం వస్తే చాలు..ముంబాయి ప్రయాణం టాటా కేన్సర్ ఇనిస్ట్యూట్  మేరీ లిల్లియమ్మ గుర్తుకు వస్తారు. మనసు మూగగా రోదిస్తుంది కూడా.

మేరీ లిల్లియమ్మ అంటే.. ఓ..విజ్ఞానపవనం. ఓ..నిస్వార్ధ ప్రేమ జీవి. ఓ..ఆత్మాభిమాని. ఓ.. పరాయి దేశ, పర మత ద్వేషి. అలాగే ఓ..నాస్తికురాలు. ఓ..స్నేహశీలి .

మేరీ లిల్లియమ్మ అంటే.. సన్నగా పొడవుగా పెద్ద బొట్టు పెట్టుకుని, చక్కని నలగని నూలు చీర ధరించి,హ్యాండ్ బేగ్ తగిలించుకుని కొద్దిగా పక్కకి వంగి నడుస్తూ వెళుతుండటం గుర్తుకు వస్తుంది.

మరణానికి భయపడకుండా..నెమ్మదిగా.. నిండుగా ప్రవహించే..బందరు కాలువలోకి నెమ్మదిగా దిగి..ముందుకు ముందుకు నడచి వెళ్లి.. మునిగి తేలుతూ..శ్వాస వదలిన రూపమే కనులముందు కదలాడి.. మనసు విషాద రాగం ఆలపిస్తుంది.

ప్రేమతో  పెద్దలని బాగా చూసుకోవాలని  తనెరిగిన వారందరికీ ఉద్భోద చేసినట్లు ఉంటుంది.

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఉడాన్
అప్పుడే చురుక్కు మనిపించే పాల్గుణ మాసపు ఉదయపు ఎండలో.. వడివడిగా నడుస్తూ బస్ స్టాప్ వైపుకి వెళుతున్నాను .

అబ్బా జాన్  ఎదురొచ్చి... షబానా! ఏ మహీనా కే కమాయి కే పైసా లావో " అన్నాడు.

"బిల్కుల్ బాబా.." అంటూ..ఆగకుండానే ముందుకు కదిలాను. అమ్మీ ఎప్పుడు ఆ వంట గదిలోనే ఉంటుంది అయినా వంట చేయడం త్వరగా అవదు. వంటయి లంచ్ బాక్స్  తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. లేకపోతే ప్రతి రోజు తన మధ్యాహ్నపు    భోజనానికయ్యేఖర్చుతో ఇంటిల్లపాది రెండు కూరలతో రెండు పూటలా తినవచ్చు అని  ఆలోచిస్తుంది. తండ్రి అనారోగ్యంతో పని చేయక రెండేళ్ళు  అవుతుంది. ఆయన  మందులకి, మంచి ఆహారం అందించటానికి తనకన్నా చిన్నవైన నాలుగు చేతులు కష్టపడుతూనే ఉన్నాయి. అయినా అవసరాలు తీరవు. రోజు ఏమేమి సరుకులు నిండుకున్నాయో అవి కావాలని అమ్మీ తనకి మాత్రమే చెపుతూ ఉంటుంది. తండ్రి దర్జీ పనిలో ఆదాయం బాగా ఉన్న రోజుల్లో విలాసంగా బ్రతికిన తమ కుటుంబం ఇప్పుడు అర్ధాకళ్ళతో బ్రతకాల్సి వస్తుందని  దిగులు ముంచుకొస్తుంది.

తమ ఇంటి ప్రక్కనే ఉంటున్న ఉష ఆంటీ (నేను ఆమెని నా రెండో అమ్మ అంటాను) అమ్మీతో ఎప్పుడూ చెపుతూనే ఉండేది "ఆదాయం బాగా వస్తున్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేయండి. ఇద్దరాడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళకి, మగ పిల్లల చదువులకి ఆదుకుంటాయని.

అందుకు భిన్నంగా ఎప్పుడు చూసినా...  ఇంటినిండా చుట్టపక్కాలు. కిలోలకి కిలోలు బిర్యాని డేగిసాలు దించడం తప్ప ఏమి ఉండేది కాదు. మామూలు చదువులు మానేసి "మదర్సా లో చదువుకోవడం వల్ల ఇప్పటి చదువులు ఏమిటో తెలియక పోవడం తో.. ఉన్న టెన్త్ క్లాస్స్ అర్హత తోనే .ఈ నెట్ సెంటర్లో ఈ చిన్న పాటి ఉద్యోగం అయినా దొరికింది. అది కూడా తనకి వరుసకి అన్నయ్య అయ్యే బంధువుల అబ్బాయి రికమండ్ చేయడం వల్లనే దొరికింది. తమ్ముళ్ళు ఇద్దరు కూడా చదువు మానేసి చేతి పనులు చేస్తున్నారని  రోజూ అమ్మీ కళ్ళు ఒత్తుకుంటుంది. చెల్లెలు పొద్దస్తమాను ఇంట్లో దర్జీ పని చేసి సంపాదిస్తూనే ఉంటుంది. పాతికేళ్ళు దాటినా ఆడ పిల్లలకి పెళ్లి చేయలేక పోతున్నామని  అమ్మి మామయ్యల దగ్గర వాపోతూ ఉండేది. అన్నీ వింటూ తను మౌనం వహిస్తుంది. ఇప్పటికే ఇంటద్దె భారం అయిపోయి సరిగా అద్దె కట్టక  ఇల్లు కాళీ చేయాల్సిన పరిస్థితి. అయినా పొద్దుగూకే సరికి అబ్బాజాన్ కి.. మాత్రం ఓ క్వార్టర్ బాటిల్ కి అయినా డబ్బిచ్చుకోవాలి,అలాగే  రెండో మూడో సిగేరేట్ పేకెట్లు  కొనివ్వక తప్పదు. ఇలా ఇంటి పరిస్థితులు గురించి ఆలోచించు కుంటూ బస్ ఎక్కి కూర్చున్నాను.

కండక్టర్ టికెట్ అడిగాడు.డబ్బులు ఇచ్చి స్టేజి పేరు చెప్పాను.

"మీరు ఏం చెపుతారో మాకు అర్ధం కాదు.  కాస్త ఆ నకాబ్ తీసి చెబితే మాకు సులువు. మా ఖర్మ కొద్ది రోజూ.. ఈ ఊరుకొచ్చే బస్ డ్యూటీలే వేసి చావ బెడతారు." అని విసుక్కున్నాడు.

ప్రక్కనే ఉన్న ఊరి నిండా మా  మతస్తులే ఉండటం మూలంగా స్త్రీలందరూ..బురఖా ధరించే బయటికి రావడం కద్దు. తను చూసుకోకుండా ఆ బస్సే  ఎక్కింది. వాళ్ళల్లో తన బంధువులు ఉండవచ్చు అయినా తను గుర్తు పట్టలేదు. అంతా బురఖా ధరించే ఉన్నారు తనలాగే! తను పని చేసే నెట్ సెంటర్ లోను అంతే! 

“ఏమిటయ్యా !  మీ చెల్లెలి అందం చూసి నేను ఉద్యోగం ఇస్తే ఆ అందానికి ఎప్పుడు ముసుగు వేసుకుని వస్తుంది. కౌంటర్లోకూడా   బురఖా తీయకుండానే కూర్చుంటానంటుంది, ఇలా అయితే నా నెట్ సెంటర్ కాస్త మూసుకోవాల్సిందే!”అని అంటాడు.

తను మదర్సాలో చదువుకున్నప్పుడు ఖురాన్లో ఏం చెప్పబడిందో.. తనకి..ఆణువణువూ జీర్ణించుకు పోయింది. తమ మతంలోని స్త్రీలు తప్పని సరిగా.. బయటి వెళ్లి నప్పుడు బురఖా ధరించాలని పర పురుషుల కంట పడకుండా జాగురకతతో..తమని తాము కాపాడుకోవాలని ఉంటుంది. తమ మత స్త్రీలు అందరు అలానే పాటిస్తారు కూడా. బురఖా వేసుకున్న స్త్రీలని చూస్తే అందరికి ఎగతాళే ! తతిమా .వాళ్ళ కుటుంబాలలోని స్త్రీలు మాత్రం గాజులు వేసుకుని, ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని వారి వారి సంప్రదాయాలని వారు పాటించడం లేదు !? వారి సంప్రదాయాలని ఛాందసం   అని తాము చిన్న చూపు చూసామా! లేదు కదా!? అని బేరీజు వేసుకున్నాను.

సిటీ లో బస్ స్టాప్లో దిగి మెయిన్ రోడ్ నుండి కొంచెం లోపలకి ఉన్న నెట్ సెంటర్ కి వెళ్ళి సెక్యూరిటి అతని సాయంతో హడావిడిగా తెరిపించింది. ఇంకొంచెం ముందు రండమ్మా!వచ్చే వాళ్ళు ఇంత ఆలస్యంగా తెరిస్తే ఎలా అని తెగ గొడవ చేస్తున్నారు అన్నాడు. వచ్చే వాళ్ళలో..చాలామంది చాటింగ్ కోసం వచ్చే వాళ్ళే! టైం నోట్ చేసుకుని.. సిస్టం అప్పగించే ముందు.. కావాలని మాటలు కలుపుతారు. ఆ బురఖా తీయవచ్చు కదండీ..అంటారు. ఇద్దరు ముగ్గురు కలసి.. ద్వందార్ధాలతో.. మాట్లాడుతూ ఉంటారు. అమ్మడు బుల్లెట్ ప్రూఫ్ తీయదురా.. తీస్తే అందాలన్నీ కనబడతాయనేమో..అంటాడొకడు. అసలు అక్కడ చూడదగ్గవి ఏమైనా ఉన్నాయో లేదో.. అంటాడు ఇంకొకడు. కళ్ళ నీళ్ళు జల జల రాలతాయి. అవి రాలినట్లు ఈ లోకానికి తెలియనవసరం లేదు. ఆ పరదా మాటునే ఇంకి పోతాయి.

“అసలు నువ్వు నీ పరదాని తీస్తే..  పొద్దస్తమానం వీళ్ళందరు  పిచ్చి కుక్కల్లా నీ చుట్టూ తిరగరు? అంటుంది నా రెండో అమ్మ. ఆమెకి నేను అంటే చాలా ఇష్టం. మా షబానా ని చూడండీ. కళ్ళెత్తితే కనకాభిషేకాలే! తన తెలివి తేటలకి, మాట తీరుకి , మంచితనానికి ఎంతటి వీరుడైనా, ధీరుడైనా పడిపోవాల్సిందే! అని హాస్యమా డుతుంది. స్వచ్ఛంగా తెలుగు మాట్లాడే తనని చూసి ఆశ్చర్య పోతుంది. నీకు ఇలాటి భాష ఎలా వచ్చు..? అనడుగుతుంది . అవును మరి నేను తెలుగుదేశం లో పుట్టక పోయే అని  తను నవ్వుతుంది. నేను పుట్టింది ముస్లిం కుటుంబంలో అయినా పెరిగింది.. అంతా హిందువుల మధ్యనే! ఆ మాత్రం రాకుండా ఎలా ఉంటుంది. మీ పండుగలు అన్నీ నా పండుగలే కదా!  కాదా ?అని అడుగుతాను.  అప్పుడు ప్రేమగా ఓ..మొట్టికాయ వేసి..మురిసిపోతుంది. తన వెంట వాళ్ళ బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు.. బొట్టు లేకపోయినా వాళ్ళ అమ్మాయినే అనుకునే వారు. చిదిమి దీపం పెట్టవచ్చు మీ అమ్మాయికి పెళ్ళి చేస్తారా అని అడుగుతుంటే..మేమిద్దరం నవ్వుకునే వాళ్ళం  తప్ప నేనొక ముస్లిం అమ్మాయినని  అసలు చెప్పేది కాదు. ఆమెకి నాకు ఉన్న అనుబంధం అలాంటిది.

నెట్ సెంటర్ యజమాని..నలబయిలకి దగ్గర పడినవాడు. కావాలని రాత్రి పొద్దు పోయేవరకు కూర్చో బెడతాడు. ఒక రోజు" ఏం పెర్ఫ్యూమ్ వాడతావ్" అని అడిగాడు.

"లేదు..నాకు అలవాటు లేదు " అంటే అపనమ్మకంగా చూసాడు. ఒక రోజు సమీపంగా వచ్చి నిలబడి.. " నీ శరీర సుగంధం నన్ను పిచ్చివాడిని చేస్తుంది. నువ్వు అవునంటే.. ఈ నెట్ సెంటర్ నీ సొంతం చేస్తాను" అని అన్నాడు. వెంటనే అక్కడి నుండి  లేచి విసురుగా  ఇంటికి వచ్చేసింది తను . రెండు రోజులు జ్వరంగా ఉందనే వంక పెట్టి పడుకుండి పోయింది. మూడవ రోజు..నెట్ సెంటర్ యజమాని తన అన్నయ్యని తీసుకుని ఇంటికి వచ్చాడు. అన్నయ్య “ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు! అలాటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త తీసుకుంటాను అంటున్నాడు” అన్నాడు. వాడే అసలు ఇబ్బంది అని చెప్పలేక పోయింది. తను తెచ్చే జీతం రాళ్ళ కోసం ఎదురు చూసే ఇంట్లో వాళ్లకి తన ఇబ్బందేమిటో  వివరించి చెప్పలేదు.

అలా నెలలు గడుస్తున్నాయి. అబ్బాజాన్  సమీప బంధువుల వైపు నుండి నా కోసం  పెళ్ళి సంబంధం వచ్చింది. అమ్మాయి మాకు నచ్చింది పైగా అరబిక్ లో ఖురాన్ గ్రంధంని బాగా చదువుకున్నపిల్ల గనుక కట్న కానుకలు ఏమి అక్కరలేదు పెళ్ళి జరిపించండి అని అడిగారట. అబ్బా ...అమ్మతో చెపుతూనే నావైపు "ఏమంటావ్?" అన్నట్లు చూసారు. అబ్బా జాన్ ముందు ఎప్పుడు నోరు విప్పి మాట్లాడని అమ్మి వెంటనే..  "ఆ ఇంట్లో నేను పిల్లని ఇవ్వను" అనేసింది.

“పైసలు అడగడం లేదు,మనకీ  బరువు తగ్గుతుంది " అన్నాడు అబ్బాజాన్
   
 " ఆ ఇంట్లో అందరు ఛాందసులు. ఆడవాళ్ళందరు వంటిళ్ళల్లో మగ్గి పోవాల్సిందే!  లోకం ముఖం చూడనివ్వరు. పైగా పిల్లవాడు ఖాజీ.. ఆ గడ్డం పెంచుకుని ఎప్పుడూ.. ఊర్లమ్మట తిరుగుతూ..ఉంటాడు. పిల్లలిక చాలనుకునే ఆపరేషన్లు ఉండవు, ఒక సరదా ఉండదు సంతోషం ఉండదు,  నేనక్కడ పిల్లనివ్వడానికి ఒప్పుకోను " అని అమ్మీ ఖరాకండిగా  చెప్పేసింది.

"అలాటిచోట పిల్లని ఇవ్వకుంటే.. మరి ఎందుకు మదర్సాలో పెట్టి ఏళ్ళ తరబడి చదివిన్చావ్? ఆడ పెత్తనాలు ఎక్కువ యిపోయాయి." అని అబ్బాజాన్  బాగా కోపగించుకున్నాడు.

"ఖురాన్ చదవడం అనేది అల్లా గురించి తెలుసుకోవడానికి, మంచి-చెడు తెలుసుకోవడానికి .
లోకమంతా  మారింది. అదివరకంత  చాందసంగా ఎవరూ  ఉండటం లేదు. ఆ ఇంట్లో  నేను పిల్లనివ్వనంటే ఇవ్వనని చెప్పేసింది.

పిల్ల చేత ఉద్యోగం చేయించుకుని  కూర్చుని తింటున్నారు. అయినా ఉద్యోగం చేసిన పిల్లని మా ఇంట కోడలిగా చేసుకోమని మళ్ళీ వాళ్ళే అన్నారని వార్త మోసుకొచ్చింది తన మేనత్త.

ఆరోజు ఇంట్లో పెద్ద యుద్దమే జరిగింది. అమ్మి  నన్ను ఉద్యోగం  మానేయమంది. ఆ క్షణం నేను చేస్తున్న ఉద్యోగం మానేద్దామనుకున్నాను, కానీ మానలేకపోయాను. అప్పటి అవసరాలు అలాటివి కూడా.

మత సంప్రదాయాలు మనిషికి నడవడికని నేర్పాలి కానీ మనిషి మనుగడనే శాసిస్తున్నట్లు ఉంటే ఎలాగో నాకర్ధం  కాలేదు ?  సంప్రదాయం పాటిస్తూనే లోకంలో మనుగడ సాగించుకునే స్వేచ్ఛ తమకి లేదా? పరదా వేసుకోవడమన్నది కేవలం మాకు మాత్రమే సంబంధించిన విషయం. పరదా వేసుకోవడమో, లేదా వేసుకోక పోవడమో వల్ల ఇతరులకి వచ్చే ఇబ్బంది ఏమిటి?

తన మతానికి  చెందిన అబ్బాయ్ ఒక హిందువుల పిల్లని ప్రేమించాడు. ఆ అమ్మాయితో సినిమాకి షికార్లకి తిరగాలని అతని కోరిక. ఆ అమ్మాయి పెళ్లి జరిగే వరకు అలాటివి కుదరదు అంటుంది. అతనేమో పోనీ నేను ఒక ఉపాయం చెప్పనా? అంటాడు. ఆ అమ్మాయి ఏమిటని అయిష్టంగానే అడుగుతుంది. నేను బురఖా తీసుకుని వస్తాను అది వేసుకుని నాతో రా.. ఎవరికి అనుమానం రాదు  ఎవరికీ తెలియదు కూడా అంటాడు. "ఏమే! మీ బురఖా.. ఇందుకు  మాత్రం భలే ఉపయోగ పడుతుందా? రహస్య ప్రేమికులని కలపటానికి " అంటుంది కోపంగా నా రెండో అమ్మ.అలా బురఖా పవిత్ర భావాన్ని  చెడగొట్టే వారు ఉన్నారు.

అలాగే తన పెద్దమ్మ కూతురు.. నసీమా . ఆమె కూడా మదర్సాలోనే తనతో కలసి కొంత కాలం చదువుకుంది తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువులు చదివింది. నసీమా ఓ..పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంది. కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చింది. ఆమెని తీసుకుని నా రెండో అమ్మ ఇంటికి వెళ్లాను. ఆ పిల్ల గురించి ఆమెకి చెపుతూ చదువు పూర్తయ్యే వరకు నా లాగే బురఖా వేసుకునే కాలేజ్ కి వెళ్ళేది. కేంపస్ సెలక్షన్స్ లో సెలక్ట్ అయ్యాక ఉద్యోగం కోసం బాండ్ వ్రాసింది. వేలల్లో జీతం. అక్కడ బురఖాకి ప్రవేశం లేదు. అయినా ఇంటినుండి బురఖా వేసుకునే వెళుతుంది. ఆఫీసుకి వెళ్ళిన తర్వాత లోవెయిస్ట్ పేంట్ వేసుకుని.. పొట్టి చొక్కాలు తొడుక్కుని ఆ చొక్కాని పదే పదే కిందకి లాక్కుంటూ జుట్టు విరబోసుకుని, చేతులమీద నూనుగు మాత్రమైనా  రోమం కనబడకుండా నీట్ గా తయారయి వెళుతుంది. ఈ అమ్మాయి చేసేవన్నీ మత విరుద్దమైన పనులే! అని చెప్పాను.

  ఏమిటే ఇలా చేస్తున్నావ్ అని నసీమా నడిగితే..

 నసీమా  ఇలా చెప్పుకొచ్చింది. కాలం మారింది,  నేను నా మతాచారాలు ప్రకారమే బురఖా వేసుకుని ఉద్యోగం చేస్తానంటే.. ఒప్పుకోరు.  ఒప్పుకోమని  చెప్ప కుండానే… "వస్త్ర ధారణ అన్నది మీ ఇష్టం, కానీ ఇంకా పురాతనంగా ఉండటం ఎందుకు? మీ ముస్లిం దేశాల లలో మహిళా ప్రధానులు, అధ్యక్షులే..బురఖాని విసర్జించారు. బురఖాకి మీరు కూడా  స్వస్తి చెప్పండి "అంటారు. అలాగే తోటి ఉద్యోగస్తులు..మనపట్ల చూపే చిన్న చూపు, వెటకారాలు,అశ్లీల హాస్యపు మాటలు విని నేను బురఖాని విసర్జించాను. కానీ అది అక్కడ మాత్రమే.. మన ఇళ్ళల్లో మన వారి మధ్య మన సంప్రదాయం పాటించడం నాకు చాలా ఇష్టం కూడా. ఒక వేళ రేపు నా పెళ్లి అయిన తర్వాత నా భర్త బురఖా వద్దన్నా వేసుకోమన్నా అది కేవలం నా ఇష్టం మాత్రమే కానీ వేరొకరి ఇష్ట ప్రకారం నేను నడుచుకోను ఎవరి ప్రభావం నాపై ఉండదు, ఉండనివ్వను  అంది దృఢంగా.. 

అప్పుడు నా రెండో అమ్మ ఇలా చెప్పింది. నిజానికి మీ ముస్లిం స్త్రీలు చదువుకుంటున్నారు. వారికి నాగరికత తెలుసు.ఎంతో మంది అందగత్తెలు ఉన్నారు .అలా అని వారిని ఈ బాహ్య ప్రపంచంలో వెల్లడించుకోవాలో లేదో అన్నది వారి వారి వ్యక్తి గతం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది అజ్ఞానం లో ఇంకా  బురఖా బందీఖానాలో బ్రతుకుతూ ఉన్నారు కూడా! వాళ్ళ బ్రతుకుల్లో మార్పు అవసరమనుకుంటే వాళ్ళు పోరాడతారు. వాళ్ళ తరపున మరి కొందరు పోరాడతారు.  ప్రపంచం మారుతుంది. మార్పు అవసరం కూడా అని చెప్పింది. ఇంకా లోతుగా ముచ్చటిస్తూ ... ముస్లిం రచయిత్రులు కూడా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్రాయడానికి కుటుంబం ఒప్పుకోక పోవడం, వారి పైన ఆంక్షలు ఉన్నట్లు వారు వివిధ సందర్భాలలో చెప్పుకుంటారు. అయినా వారు వ్రాయడాన్ని మానలేదు కదా!  అంది మరింత వివరంగా.  ఆమె పరిశీలనకి ఆశ్చర్యపోతూ ... నేను, నసీమా కూడా  అవునన్నట్లు తల ఊపాం.

తర్వాత ఈ విషయం గురించి తెగ ఆలోచించేదాన్ని. ఎక్కడో..నాకు ఆచూకీ దొరికినట్లే దొరికి జారిపోయేది. సందేహం తీర్చుకోవడానికి అమ్మీని అడిగేదాన్ని. బురఖా వేసుకోకుంటే ఏమవుతుంది ?  అని.

"ఏమి అవదు. ప్రపంచంలో అందరు బురఖా వేసుకునే బయటికి వెళుతున్నారా..? మన వాళ్ళు కాని వారు బ్రతకడం లేదా !? అలాగే మనమూ బ్రతుకుతాము. కాకపొతే సంప్రదాయం లేనివాళ్ళ మని ఆడిపోసుకుంటారు అంతే.." అనేది. అలాంటి ఆలోచనలు అమ్మీ లో ఉండటం నాకు ఆశ్చర్యమే !

కొన్నాళ్ళకి నా రెండో అమ్మ వెంట నేను సూరత్ వెళ్లాను. ఆమె వెంట నేను ఎక్కడికయినా వెళ్ళే స్వేచ్చ  ఉంది. విజయవాడలో ట్రైన్ ఎక్కగానే  వెంటనే స్వేచ్చగా పక్షిలా ఎగరాలనిపించింది నాకు. బురఖా తీసి బేగ్ లో అడుగుకి కుక్కేసాను. స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నాను. అలాగే బురఖా లేకుండానే నా రెండో అమ్మ వెంట ఒక నాలుగయిదు రోజులు హాయిగా తిరిగాను. అలా అని అయిదు పూటలా నమాజు చేసుకోవడం మానలేదు.

ఆ రోజు గురు పూజోత్సవం. అమ్మ వెంట నేను ఆ కార్య క్రమానికి వెళ్ళాను. అక్కడ అడిగిన వారందరికీ ఎప్పటి లాగానే మా అమ్మాయి అని చెప్పి పరిచయం చేసింది. వాళ్ళు అందరికి పసుపు కుంకుమ ఇస్తూ.. నా నుదుటిన  కుంకుమబొట్టు  పెట్టారు. నేను అభ్యంతరం చెప్పలేదు. అదేమిటి ..ఒక ముస్లిం అమ్మాయి వాళ్ళ సంప్రదాయానికి విరుద్దంగా ముఖాన బొట్టు ఎలా పెట్టించుకుందని ఆశ్చర్యం వద్దు.

" అవును ! నేను మారాను. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలనుకుంటానో అలాగే ఉంటాను నా కోసం, నన్ను అమితంగా ఇష్టపడే వాళ్ళ కోసం కూడా.   మతం, దేవుడు, ఆచారాలు వ్యక్తికి వికాసం కల్గించాలి. వికాసం కల్గించలేనివి,  మనిషిని మభ్య పెట్టేవి విసర్జించాలి" అనుకున్నాను.

మనిషి జీవితం గాలిపటం లాటిది. ఆ గాలి పటం ఎగరడానికి ఆధారం దారం. ఆ దారం మతం, ఆచారం కానవసరం లేదు  కదా !

4, ఫిబ్రవరి 2012, శనివారం

కలవని స్నేహమా! మరణం సత్యమా?

కాలం   బహు చిత్రమైనది. 
ఎవరిని ఎప్పుడు కలుపుతుందో .. ఎప్పుడు ఎందుకు   విడదీస్తుందో.. అంతా అదో అంతు తెలియని నిగూడ రహస్యం 
ఓ.. ఇద్దరి మనసుల మధ్య స్నేహాన్ని చిగురింపజేసి ఆలోచనలని ఆత్మీయతని కలబోసుకునుని ఎన్నటికి   వీడని చెలిమి బలిమితో ముందుకు సాగాలనుకుంటారు. కానీ ఎందుకో  హటాత్తుగా  దారులు వేరవుతాయి   ఆ చెలిమి చేయి జారుతుంది. చేజారిన చెలిమి కై  జీవితాంతం వెతుక్కుంటూనే ఉంటారు. తాము వెతుకుతున్న చిన్న నాటి స్నేహం చేరువైతే..ఆ ఆనందం చెప్పనలవి గాదు.

అందుకే ..ఎవరైనా  స్నేహితులు ఎవరైనా వారు మిస్ అయిన స్నేహితుల గురించి చెపుతుంటే.. వారిని వెదకడాని   నేను సహాయం చేస్తుంటాను. ఆ స్నేహితులు కలుసుకున్న     అపురూప క్షణాలని కళ్ళ చెమరింపల మధ్య,హృదయ ద్రవిన్పుల మధ్య ఆనందంగా వీక్షిస్తాను . 

"కొప్పర్తి" గారు ప్రస్తుతం ఆంద్ర ప్రదేశంలో ప్రముఖంగా పేర్కొన్న   దగ్గ  పది మంది కవులలో ఒకరు . వారిని నేను రెండు మూడు సభలలో చూడటం..వారి ప్రసంగాన్ని శ్రద్దగా వింటూ చాలా నెలల పాటు మననం చేసుకుంటూ కవిత్వంని మరింతగా  లోతులు గా చూడటం నేర్చుకుంటున్నాను . 2010 డిసెంబెర్ నెలలో జరిగిన 'తానా" కవిత్వం  పోటీలను "మా ఎక్సరే  సాహితీ సంస్థ నిర్వహించినప్పుడు నేను  ఆ   కవిత్వం ప్రోగ్రాం ని నిర్వహించాను. అప్పుడు "కొప్పర్తి" గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.అప్పటి పరిచయంలో.. మాటల్లో మా వూరి ప్రస్తావన వచ్చింది. మాది పోరంకి .. వూరు ఆనగానే కొప్పర్తి   గారి కళ్ళల్లో  లో ఓ.. సంతోష వీచిక కదలాడటం చూసాను. వెంటనే.. నాకు   పోరంకి లో  ఒక స్నేహితుడు ఉండాలి. అతని అడ్రస్స్ కొంచెం   కనుక్కుని   చెప్పమని వివరాలు అందించారు. నేను వారు ఇచ్చిన వివరాలు ప్రకారం రెండు మూడు సార్లు వెతికి   చూసాను. కానీ సఫలం కాలేక పోయాను.

అదే విషయం ని మళ్ళీ కొప్పర్తి   గారు..ఓ..సభలో కలసి   అడిగే వరకు నేను వారి స్నేహితుడి చిరునామా కనుక్కుని ఇవ్వలేకపోయాను . నిజానికి నేను కనుక్కోలేకపోయాను   అని చెప్పడానికి కూడా  సిగ్గు పడ్డాను.  
మొన్నీ మధ్య డిసెంబర్ 25 న మళ్ళీ వారు మా ఎక్సరే అవార్డ్ల పంక్షన్ కలసినప్పుడు .. నాకు  వారి స్నేహితుల గురించి మరింత వివరాలు అందించారు. నేను వెంటనే ఒక   పేపర్ పై వ్రాసుకుని నా హాండ్ బాగ్ లో భద్ర పరచుకున్నాను. 

తెల్లవారి మళ్ళీ కొప్పర్తి   గారి నుండి పోన్ వచ్చింది. మర్చి పోకుండా వారి స్నేహితుల వివరాలు అడిగి చెప్పమని రిక్వెస్ట్ చేయడం వల్ల వారు ఎంతగా తన స్నేహితుని కోసం పరితపిస్తున్నారో..అర్ధం అయింది.వెంటనే..నేను నా ల్యాండ్ లైన్  ముందు కూర్చుని అరగంట లోపునే వారి స్నేహితుని వివరాలు కనుక్కున్నాను. ఎక్కడో చిన్న ఆచూకి దొరికింది. అలా రోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒక స్నేహితునికి తన స్నేహితుని చిరునామా తెలిసి మాట్లాడటం అనే మహత్తర క్షణం కోసం నేను ఎదురు చూసాను. కానీ..ఓ..నాలుగు రోజులకి చిరునామా దొరికింది  మాకు సమీపంలోనే వారు ఉన్నట్లు తెలుసుకుని     కొప్పర్తి గారి స్నేహితుడి  ఇంటికి .. నేను కొన్ని   నిమిషాలలోనే నా తూనీగ పై..  తూనీగ కన్నా ఆనందంగా పరుగులు తీశాను. ఇద్దరి మిత్రుల కలయిక   కళ్ళారా చూడాలనుకున్నాను.

అక్కడికి వెళ్ళగానే నాకు తెలిసిన విషయం చాలా బాధ కల్గించింది.  ఎప్పుడో..బాల్యంలో వీడిన ఆ చెలిమి హస్తం తిరిగి కలవకుండా విధి విడదీసింది అని నాకు   తెలియగానే నేను నిస్సత్తువుగా  కూలబడి పోయాను.అసలు జరిగినది ఏమంటే ..  కొప్పర్తి గారి స్నేహితుడు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మరణించారని చెప్పారు. నాకు  కల్గిన ఆశానిఘాతం కి నేను తేరుకోలేక పోయాను. ఈ విషయం కొప్పర్తి గారీకి  చెప్పాలా వద్దా ..అని ఆలోచించాను.  ఆరోజు జనవరి 1 వ తేది ఆ విషయం చెప్పి వారిని బాధ పెట్టడం ఇష్టం లేక   ఊరుకున్నాను. నేను అసలు విషయం చెప్పడం వల్ల కొప్పర్తి గారు ఎంత బాధపడతారో..నాకు తెలుసు. వారి ఇరువురి స్నేహంపట్ల.. కోవేలకుంట్లలో .. వారు గడిపిన బాల్యం,విజయవాడలో..వాళ్ళ కాలేజి   కబుర్లు కొప్పర్తి    గారి మది పుటల్లో..యెంత గాధంగా ముద్రించుకుని ఉన్నాయో,వారి స్నేహం యెంత గొప్పదో.. వారి చెపుతుంటే విని.. కూడా వారికి  ఈ విషయం చెప్పడం భావ్యం కాదేమో అని నెల్లాళ్లుగా ఆలోచిస్తూనే ఉన్నాను.

కొప్పర్తి గారి మనసులో వారి స్నేహితుడిని బ్రతికి   ఉంచి.. ఎక్కడో  ..ఆచూకి   తెలియని మిత్రుడిలా ఉన్చేయాలని అనుకున్నాను. మరలా నా నిర్లక్ష్యం  వల్లనో లేదా ఎదుటి మనిషి కి చిన్నపాటి సహాయం చేయని మనిషిగా నేను మిగిలిపోవడం మంచిదా అని ఆలోచిస్తున్నాను.  ఈ రోజు కాకపోయినా   ఎప్పుడైనా కొప్పర్తి గారికి విషయం చెప్పడం మంచిదా లేదా..అని ఆలోచిస్తూనే ...

 ఇన్నాళ్ళకి ఈ రోజు నేను  కొప్పర్తి గారికి  మిత్రుడి మరణం తాలూకు  సమాచారాన్ని అందించి.. ఆ నాటి చెలిమి ఒక కలలా ముగిసిపోయింది మిత్రమా.. మరల కలవలేని ఆ చెలిమి..నాలో..ఇంత విషాదాన్ని నింపింది అని అనిపించేలా   వారికి ఈ రోజు తెలియ పరుస్తూ ఉన్నందుకు బాధగాను,బరువుగాను  కూడా ఉంది.  ఆ  మిత్రుడి ఆశల వల ఖాళీగానే మిగిలిపోయింది. కలల అల స్నేహ తీరం ని తాక  కుండానే సముద్ర గర్భంలోనే నిశ్చలంగా ఉండిపోయింది    

జీవన మార్గంలో దారులు వేరైనప్పుడే కాదు మృత్యువు కూడా చెలిమిని విడదీస్తుంది.    " ఒక శాశ్వతమైన వాక్యం కోసం జీవించినంత కాలం వ్రాస్తూనే ఉండాలి"అన్నది కొప్పర్తి గారి  మాట.   అది "స్నేహం  కోసం పరితపిస్తూ ఉండటం కూడా నేమో! 

స్నేహమా!మరణంలో కూడా  నీ నీడగా  నేను లేకుండా చూసుకున్నావా ? నన్ను నీ జ్ఞాపకాలతో జీవించి మరణించమని. ..  అంటుందేమో.. నిజమైన స్నేహం. 
కలవని స్నేహమా! మరణం సత్యమా?   మిత్రుని మరణాన్ని చేరవేసినందుకు   క్షమాపణలతో ..  ఈ   పోస్ట్.      
             

2, ఫిబ్రవరి 2012, గురువారం

ఒకే ఒక జీవితం

ఒకే  ఒక  జీవితం


ఈ పాట విన్నారా?  పైన లింక్లో    వినేయండీ .మంచు మనోజ్ చిత్రం "మిస్టర్ నోకియా ' లో పాట ఇది. 

అమ్మా ! ఈ పాట విన్నావా!? బాగుంది విను అంటూ డౌన్లోడ్ లింక్ ఇచ్చాడు. మా అబ్బాయి. తన పాటల ఎంపిక ఎప్పుడూ నచ్చుతుంది నాకు. 

పాట సాహిత్యం ..వింటూనే హృదయం ఆర్ద్రమైనది

సాహిత్యం చూడండీ! 

ఒకే ఒక్క జీవితం 
ఇది చేయి జారి పోనీయకు 
మళ్లీ రాని ఈ క్షణాన్ని మట్టి పాలు కానీయకు 
కష్టమనేది  లేని రోజు లేదు కదా 
కన్నీరు దాటుకుని   సాగిపోక తప్పదు గా
అమ్మ కడుపు వదిలిన  అడుగడుగు 
ఆనందం కోసం ఈ పరుగు 
కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు... ఓ...ఓ......ఓ....ఓ.. 

నువ్వెవరో నేనెవరో   
రాసిన దెవరో   మన కథని 
నువ్వు నేను చేసినవా మన పేరున జరిగివేవన్నీ   
ఇది మంచిదని అది చెడ్డదని 
లోపాలు వేయగల వారెవరు?
అందరికి,చివరాఖరికి 
తుది తీర్పు ఒక్కడే పై వాడు
 అనుకున్న మేలు నీవు 
 అనుభవాలేగా రెండూ
దైవం చేతి బొమ్మలేగా 
నువ్వు నేను ఎవరైనా 
తలో పాత్ర వేయకుంటే 
కాలయాత్ర జరిగేనా? 
నడి సంద్రమందు   నిన్ను ముంచాక   
ఎదురీద కుండ   మునకేస్తావా? 
నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని 
ఆ దరికి చేర్చవా? ..ఓ..ఓ..ఓ...ఓ...హొ... .

పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే 
బతుకు అనే మార్గంలో తనతో ఎవరు నడవరులే 
చీకటిలో, నిశిరాతిరిలో  నీ నీడ కూడా నిను వదలదులే. 
నీ వారను వారంటూ  లేరంటూ   నిను నమ్మితే మంచిదిలే!
చితి వరకు నీతో నువ్వే నువ్వే 
చివరంటూ నీతో నువ్వే నువ్వే 
చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనే లేదనుకో 
నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో
లోకాన నమ్మకం లేదసలే 
దాని పేరు మోసమై మారేనులే 
వేరవరి సాయం ఎందుకులే 
నిను నిన్ను నమ్ముకో.. 
 హొ...ఓ..ఓ..ఓ.. ఓ..ఓ... ఓ.. 

సంగీతం యువన్ శంకర్ రాజా
ఇంతకీ ఈ పాట యూత్ నచ్చే  చాన్స్ లేదని నాకు అనిపిస్తుంది. ఒరవడి మారుతుందేమో ఎదురు చూడాలి.