17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

దేవత - ప్రేమ దేవత

రైలు రెండు గంటలు ఆలస్యంగా వస్తున్నందుకు  క్షమాపణ చెబుతూ పదే పదే  త్రి భాషల్లో వినవస్తున్న ఎనౌన్స్ మెంట్  వింటూ చాలా అసహనంగా ''ఈ దేశంలో.. రైళ్ళు   సకాలంలో యెప్పుడు  ప్రయాణించాయి గనుక " అనుకున్నాడు కుమార్.

ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటు లాగా యీ రెండు గంటల  ఆలస్యాన్ని  భరించడం కూడా తనవల్ల
కాదనుకుంటూ వెయిటింగ్ రూమ్లో కూర్చున్న సీట్ లోనుండి లేచి  నుంచుని  పాకెట్లో నుండి సిగెరేట్ పేకెట్ తీసాడు. లైటర్ తో సిగెరేట్ వెలిగించుకుని ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చి  గట్టిగా రెండు దమ్ములు లాగి  బిగించి  రింగులు రింగులుగా గాలిలోకి వదులుతూ కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు కుమార్. అలా సిగెరేట్ తాగుతూ వుంటే  ప్రక్కన సీట్లో కూర్చున్న ఆమె ఒడిలోని మూడేళ్ళ బుడతడు  తనవంకే కన్నార్పకుండా చూస్తున్నట్లు  గమనించి చిన్నగా నవ్వుకున్నాడు.

తన కొడుక్కి అంత వయసున్నప్పుడే యిలాగే రింగులు రింగులుగా పొగ వదలడం వాడికి  భలే ఆశ్చర్యంగా ఉండేది. తన చిన్ని చిన్ని చేతులతో చప్పట్లు కొడుతూ.. "భలే భలే ! డాడీ.. మళ్ళీ అలా చేయి,అలా చేయి "అంటూ..
గంతులేసేవాడు. వాళ్ళమ్మ ఆ దృశ్యాన్ని   చూస్తే వెంటనే..  వాడిని యెత్తుకుని ప్రక్కకు తీసుకు వెళ్ళిపోయేది.

 "వాడు సరదా పడుతున్నాడు..చూడనీ" అంటుంటే.. "అదేమన్నా మంచి విషయమా సరదా పడుతూ చూడటానికి. మీ ఆరోగ్యం అంటే మీకు లెక్కలేకపోవచ్చు. వాడి ఆరోగ్యం ముఖ్యం కదా!" అనేది.

ఆలోచనలో చేయి చురుక్కుమంది అప్పటి ఆమె మాటల్లాగే!

ఆ సిగెరెట్ ని ప్లాట్ ఫారం   పై విసిరేస్తూ..యాధాలాపంగా పక్కక్కి చూసాడు..

ఏదో అయస్కాంతం ఆకర్షించినట్లు అతని చూపులటువైపు మళ్ళాయి.   అతని  కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవయినాయి.  కొంచెం దూరంలో ఆమె ప్రయాణీకులతో కలసి కూర్చుని వుంది.

పింక్ చీరలో .అబ్బ!  యెంత బాగుంది.  అందమా, కాదు కాదు, అరే! తనకసలు పింక్ కలర్ చీరే  నచ్చదు. తన భార్యకిష్టమైన రంగు. ఆమె  ఆ రంగు చీరెప్పుడు కట్టుకున్నా చిరాకుగా చూసేవాడు.  తన చూపులను ఆమె  అర్ధం చేసుకుని వార్ద్రోబ్ లో ఆ కలర్ చీరే లేకుండా చేసుకుంది.  ఇప్పుడేమిటీ ఆ రంగు చీర కట్టుకున్న ఆమెని అలా చూస్తున్నాను అనుకున్నాడు.

ఆమెలో  అందాన్ని మించిన యేదో గ్రేస్.. హుందాతనం. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏ విదమైన మేకప్ లు లేకుండా సహజ సిద్దమైన అందం. తనకి చాలా చాలా నచ్చింది. ఆమెని తన సొంతం చేసుకోవాలన్న ఆశ కల్గింది.  తాను యెన్నో అందాలని చూసాడు.సమీపంగాను,బాహ్యంగాను కూడా. అవేమి తనకి గుర్తు రావడంలేదు.

ఎన్నో యేళ్ళుగా కాంచని అందం యేదో ఆమెలో కనబడుతుంది. బాగా వెనక్కి జరిగి ఆమెనే చూస్తూ..నిలబడ్డాడు.
నలబై పైన  వుంటాయేమో.. అలా వయసు వున్న యితర స్త్రీలలా కనిపించడంలేదు.  కొంచెం సన్నగా చామాన చాయ రంగులో  నల్లని జడ తో.  చెంపల దగ్గర అక్కడక్కడా వెండి తీగల్లా మెరుస్తూ వున్నా కూడా అవేమి లెక్క అన్నట్లు తళుకులీనే ఆమె చర్మసౌందర్యం .. "వాటే..బ్యూటిఫుల్ లేడీ!"

రెండు గంటలేమిటీ నాలుగు గంటలపాటు ఆలస్యం అయినా  సరే ఆ సౌందర్యాన్ని చూస్తూ కాలం గడిపేయవచ్చు. అలా పదినిమిషాలు గడచిపోయాయి. అయిదు నిమిషాలకొకసారి తగలేసే సిగెరెట్ అసలు వొక్క సారాన్నా  గుర్తుకురాలేదు.

ఆమె మందస్మిత ముఖారవిందాన్ని   చూస్తే చాలు ఆకలి దప్పికలు మర్చి పోవచ్చు . ఆమెలో యెక్కడా అసహనం అన్నది కనిపించడం లేదు. చాలా రిలాక్స్ గా కూర్చుని చుట్టూ పక్కల చూస్తుంది.  తానూ దూరంగా వెనుకగా వున్నాడు కాబట్టి తనని గమనించే అవకాశమే లేదు. హ్యాపీగా అలా చూస్తూ వుండిపోవచ్చు.

ఇంతకూ ముందు తననే కన్నార్పకుండా చూసిన బుడతడు వాళ్ళమ్మ చేతిలోనుండి జారి పోయి ప్లాట్ పారం మీదకి వెళ్లి నడవాలని ఆరాట పడుతున్నాడు. ఆ బుడతడి తల్లికి మోసి మోసి విసుగేసిందేమో అలా వదిలేసింది. వాడు నడుస్తూ ఆమె ముందుకు వెళ్ళాడు.  వాడు అక్కడే తిరుగుతూ  వుంటే చిరు దరహాసంతో ఆత్మీయంగా చూస్తూ వుంది.

తను కాకుండా యింకో యిద్దరు ముగ్గురు ఆమె పై చూపుల వల వేసే వుంచారు. ఒకరు..మాటి మాటికి తల తిప్పుతూ..కాస్త సభ్యతగా,ఇంకొకరు సభ్యత మరచిపోయి ఆబగా.  ఇంకొకరు తనలా దొంగలా చూస్తూనే ఉన్నారు.

ఆమె చుట్టూ పక్కల రైలు కోసం వేచి చూస్తున్న వారిలో  ఆమె కన్నా తక్కువ వయసులో వున్నవారు,అందంగా వున్నవారు,అందంగా వున్నామనుకుని యెబ్బెట్టుగా అలంకరించుకున్న వారు ఉన్నారు.   కానీ వాళ్ళపై  చూపు నిలవడం లేదు.

అందమైన కనుదోయి కొంచెం అలసినట్లున్న ఆ కళ్ళల్లో  అందం కన్నా ఆకర్షణ కన్నా విజ్ఞానం నింపుకున్నట్లు మెరుస్తూ  ఉన్నాయి. ఆమె ముందు తిరుగుతున్న ఆ  బుడతడు పరుగులు పెట్టబోయి.. యెదురుగా వస్తున్న వారిని తట్టుకుని దబీ మని పడిపోయాడు. వాడి తల్లికంటే   ఆమె ముందు లేచి వెళ్ళి  వాడిని లేపి ఎత్తుకుని సముదాయించ సాగింది. ఆ లాలనలో ప్రేమ,దయ నిండుకుని వున్నాయి. ఆ బుడతడి తల్లి వాడిని కుదురుగా వుండవెందుకని.. ? అంటూ కోపంగా రెండు దెబ్బలు వేసింది.  ఇక వాడి యేడుపు తారా స్థాయికి చేరుకుంది.

"అయ్యో, యె౦దుకలా కోపగించుకుంటారు. పిల్లలని అలా విసిగించుకోకూడదు."  అని చెప్పి ఆ బుడతడిని యెత్తుకుని.. అలా ప్లాట్ ఫారం పై అటు వైపుకి తీసుకువెళ్ళింది.. దూరంగా వున్న యేమేమో చూపి వాడి యేడుపు మాన్పించ ప్రయత్నం చేసింది.   ఆమె మాటలకి మంత్రం వేసినట్లు.. ఆ కన్నీటి కళ్ళల్లో యేదో ఆనందం అరవిరిసిన నవ్వులు.  వాడితో సమానంగా ఆమె  నవ్వుతూ చాలా ప్రశాంతంగా కనిపించింది.

ఆ బుడతడిది యెంత అదృష్టం. ఆమె బాహువుల మధ్య  అన్నీ మరచి ఆనందంగా ఆడుకుంటున్నాడు. తిరిగి తెచ్చి వాడిని వాళ్ళ మ్మకి యివ్వబోయింది. వాడు ఆమెని వదల లేదు. అలాగే యెత్తుకుని నిలబడింది. ఆమె భుజం పై తల వాల్చి ఆ స్పర్శని అనుభవిస్తూ వాళ్ళ మ్మ వైపు చూడనైనా చూడటం లేదు. ఆ బుడతడి స్థానంలో వుండి
తను కూడా అలా సేదతీరితే యెంత బాగుండును.  కుమార్ లో వొక కోరిక మొదలైంది.

ఆడవాళ్ళలో అందం అంటే ఇతరులపై ప్రవహింపజేసే ప్రేమ, కళ్ళల్లో కరుణ, కొంత దయార్ద్ర హృదయం,మనిషిని అర్ధం చేసుకునే తత్త్వం, యితరుల  తప్పులని క్షమించే గుణం , యే సమస్యనైనా యెదుర్కునే దైర్యం. ఇలాటి సహజ గుణాలే  అసలయిన అందము,అలంకారమూనూ .. అవి లేకపోతే  ..యెంత అందమైనా శోభించదు..రా, నీ మనసులో నీ భార్య అందంగా లేదన్న సంగతి మరచి పోయి అణుకువగా,అర్ధం చేసుకునే గుణం వున్నఆ  పిల్లతో.. హాయిగా కాపురం చేసుకో అని అమ్మ చెపుతున్నా వినకుండా వసి వాడి పోయే అందాల కోసం ఆరాట పడ్డాడు.

పై పై అందాలు అన్నీ యవ్వనం,డబ్బు,హోదాలున్నప్పుడు వుండి తర్వాత కరిగిపోతాయి అన్నయ్యా.  నువ్వు ప్రేమించిన" లత " కంటే  వదిన అందంగా లేదని భావించి  వదిన  అంటే ప్రేమ లేదని అయిష్టం గా వుంటావు. పెళ్లి చేసుకున్నాక అలా వుండటం తప్పని  పెద్ద చదువులు చదువుకున్ననీకు నేను చెప్పాలా అన్నయ్యా,  వదిన నీకు నచ్చలేదంటావు కానీ నాకు మాత్రం  యెంతో బాగుంటుంది అనేది సుజాత.

ఎవరు యేమన్నా  ఊ..హు.. తను వింటేగా,  కోరుకున్న అందాల దేవత " లత" కోసం అన్వేషణ.
భార్య  నుండి దూరంగా, తను కోరుకున్న అందాల అన్వేషణలో అలసే దాకా తిరుగుతూనే వున్నాడు. ఎండ మావుల వెంట పరుగులు తీసినట్లు. తనకి అశాంతి తప్ప యే౦ మిగిలింది? అందుకే తనలో యెప్పుడు చిరాకు,అసహనం,గిల్టీ నెస్.  అలా వొప్పుకోవడం అనుకోవడం నామోషీతనమేమో కానీ..అంతకన్నా యెక్కువైన భావమే వెంటాడుతూ, బ్రతుకంతా వేటాడుతూ..

ఏం మిగిలింది? యే౦ సాదించాను? ఆత్మ విమర్శ అతనిలో..

కొన్నేళ్ళ  జీవనం తర్వాత ఆఖరికి "లత" వేరొక ధనవంతుని  భార్యగా తనొక పావులా మిగిలిపోయారు.

రెండు గంటలు గడచిపోయాయి. ట్రైన్ వస్తుందన్న ఎనౌన్స్ మెంట్. ఆమె లేచి నిలబడింది. చేతిలో చిన్న బ్రీఫ్ కేస్ తీసుకుని  ముందుకు వెళ్ళింది. తనని గమనించనే లేదు.

ఆమె వెనుకనే నడుస్తున్నాడు. ఆమె ఎక్కిన బోగీనే యెక్కాడు. ఆమె తన రిజర్వేషన్  ప్రకారం తన సీట్ నెంబర్ సరి చూసుకుంది. సర్దుకుని కూర్చుంది. ఆమెకి కుడి వైపు వున్న విండో సీట్ తనకి కేటాయించబడ్డ సీట్.

కూర్చుంటూ ఆమె వైపు   చూసాను. ఆమె నా వైపు చూసింది.  ఆ కళ్ళల్లో ఒక్క క్షణం సంతోషం. మరు క్షణం కదలాడిన ఓ విషాద వీచిక తన చూపుని దాటి పోలేదు. 

కుమార్ ఆమెని మాట్లాడించే సాహసం చేయలేదు.   ఆమె లెక్చరర్ గా వర్క్ చేస్తున్నట్లు విన్నాడు. ఇప్పుడు యెక్కడ వుంటున్నారో..తెలియదు.  కొడుకు  యే౦ చదువుతున్నాడో అంతకన్నా తెలియదు.  మౌనం గానే  ప్రయాణం సాగుతుంది.

సమాంతరమైన పట్టాలపై  ఒకే  ప్రయాణం. ఎన్నటికి కలవని  రెండు పట్టాలపై జీవన ప్రయాణం.
నా ప్రయాణం లో ఆమె నా అందాల దేవత కాదు ప్రేమ దేవత. చేజారిన ప్రేమ దేవత.  మూసిన కళ్ళలో కురవని వర్షం లోలోపలకి ప్రవహిస్తూ అతనిని  ముంచేస్తూ..

ఓ.. పది  గంటల ప్రయాణం తర్వాత రైలు  ఆగింది. చుట్టూ యింకా చీకటే ఉంది.  కుమార్  యింకా మేల్కొనలేదు. కళ్ళు విప్పి చూసాదు.  ఆమె సీటు ఖాళీ.  ఆమె దిగవలసిన స్టేషన్లో దిగి పోయింది అనుకున్నాడు.  ఆ చీకట్లో బయటి నుండే తన చెల్లెలి పిలుపులు వినవస్తున్నాయి.

 అన్నయ్య త్వరగా దిగు. ట్రైన్ కదలబోతుంది అని.  లగేజ్ తీసుకుని వడి వడిగా దిగాడు.

"జాగ్రత్త అన్నయ్యా.    జాగ్రత్తగా దిగు.  ట్రైన్  ఆలస్యంగా రావడం వల్ల  సరిగా సమయాన్ని అంచనా వేయలేక పోవడం వల్ల రిసీవింగ్ కి మీ బావ గారు రాలేకపోయారు. ఇంట్లో పెళ్లి పనులు యెన్ని వున్నా సరే నువ్వు వస్తున్న ఆనందంలో అవి వదిలేసి కూడా నేనే వచ్చేసాను "  అంది చెల్లెలు ప్రేమగా, సంతోషంగా.

 సుజాతని  చూసి ఓ నాలుగేళ్ళు దాటి ఉంటుంది. సుజాత కూతురు పెళ్లి అంటే తప్పని సరై బయలుదేరి వచ్చాడు. ఆమె సంగతి సుజాతకి తెలుసేమో అని అడగాలనుకున్నాడు.

 అంతలోనే అన్నయ్యా ! నీకు ఒక సర్ ప్రైజింగ్..గిఫ్ట్. అంది సుజాత.   ఏమిటమ్మా అది  అని అడిగాడు కుమార్.

ఏమిటో చూడు .అంటూ అడ్డు తొలగింది.  కుమార్ అటు వైపు చూసాడు. పింక్ కలర్  చీరలో ఆమె.

ఆమె అతని  ప్రేమ దేవత. అతని భార్య, యెప్పుడో పోగొట్టుకున్న పెన్నిది.

"మీ వదిన  ఇక్కడ " ఆశ్చర్యంగా అడిగాడు.

"అవునన్నయ్యా ! మేనకోడలి   పెళ్ళికి  మేనమామ సతీ సమేతంగా వచ్చి  పద్దతి ప్రకారం  మట్టెలు తొడగాలి బట్టలివ్వాలి కదా!  మరి వదిన కూడా  రాకుంటే యెలా? " అంది.

అర్ధమై చాలా సంతోషంగా, సంభ్రమంగా అడిగాడు. " నిజంగానా!? "

" నిజంగానే  నిజం" అన్నది ఆమె చల్లని చిరునవ్వుతో.

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

good

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ నిజమేనండీ కొన్నిటి విలువ వాటిని కోల్పోయినప్పుడే తెలుస్తుంది..
అది మనుషులైనా కావచ్చు,వస్తువులైనా కావచ్చు.
మొత్తానికి కధ సుఖాంతమయ్యింది.
కధ చాలా బాగుందండీ!

సుభ/subha చెప్పారు...

Intresting..

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

వనజగారు కథ బాగుంది అండి( అన్నయ్య నీకు ఒక సర్ ప్రైజింగ్..గిఫ్ట్. ఏమిటో.. చూడు. అంటూ అడ్డు తొలగింది. కుమార్ అటు వైపు చూసాడు. పింక్ కలర్లో చీరలో ఆమె. ఆమె అతని ప్రేమ దేవత.
ఇక్కడ!? ఆశ్చర్యంగా.. అడిగాను. మేనకోడలి పెళ్ళికి మేనమామ సతీ సమేతంగా వచ్చి సారె ఇవ్వాలి కదా! వదిన రాకుంటే..ఎలా..? అంది.
నిజంగానా.. సంభ్రమంగా అడిగాను.
నిజం.. అన్నది ఆమె చల్లని చిరునవ్వుతో. ) నాకు చివరిలో అర్ధం కాలేదు అసలు చివరకి ఏమి జరిగింది. ట్రైన్ లో వచ్చినామే ఈమె ఒకటేనా? వేరే నా? ఆమెనే ఇతని బార్య నా?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ కథ నచ్చినందుకు ధన్యవాదములు. ముగింపు నాకు కూడా నచ్చింది. బాహ్య పరమైన సౌందర్యం కి ఇచ్చే ప్రాముఖ్యత కంటే.. అంతఃసౌందర్యం కి విలువనిస్తూ .. మనుగడ సాగించాలని .ఆలోచన తో..ఈ కథా రచన. konni అనుభవాలు కూడా కథ వ్రాసేందుకు ప్రేరేపించాయి.

@కష్టే ఫలే గారు ..ధన్యవాదములు.

@ సుభ గారు బాగున్నారా? కథ నచ్చినందుకు ధన్యవాదములు.

@బాలు గారు.. పింక్ చీరే ఆమె అతని భార్య. ముగింపులో .. ఆలు -మగల కలయిక.కథ ముగింపు వరకు..పింక్ చీరే ఆమె కుమార్ భార్య అని ఎక్కడా చెప్పబడదు. అందుకే మీరు కొంచెం అర్ధం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు ఓకే..నా.. చాలా సంతోషం. కథ చదివి వ్యాఖ్య వ్రాసినందులకు ధన్యవాదములు.

జ్యోతిర్మయి చెప్పారు...

వనజ గారూ కథ బావుంది. మీ శైలి చాలా బావుంటుంది. ఇలా కథలు వ్రాస్తూ ఉండండి.

బాలకృష్ణా రెడ్డి చెప్పారు...

కధ బాగుంది ..కధనం అంతకన్నా బాగుంది .

కొన్నాళ్ళు వెంటాడే స్వభావం ఏ రచనకైనా అవసరం

అది మీ కధలో పుష్కలంగా ఉంది .

మంచి కధ అందించినందుకు ధన్యవాదాలు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Thank you very much..Bala krishna reddy gaaru.

Ennela చెప్పారు...

మీ బ్లాగ్ ని ఎప్పుడూ వివరంగా చూసిన గుర్తు లేదండీ, ఈ రోజు చదువుతున్నా..చాలా బాగుంది.