14, ఫిబ్రవరి 2012, మంగళవారం

విరాళాల సేకరణ

స్కూల్ పిల్లలు...  స్వచ్చంద  సేవా సంస్థలకి విరాళాలు సేకరించే కార్య కర్తలా !? 

మానవ జీవితంలో ఇతరలుకి సాయం చేయడం,వీలయితే సేవ చేయడం తప్పకుండా చేయాలి. పెద్దలు పిల్లలకి అటువంటి విషయాలు నేర్పించాలి. తప్పులేదు. 

స్వచ్చంద  సేవా సంస్థలు పాఠశాలలో విరాళాల సేకరణ చేయడం ఒక ఎత్తయితే.. విద్యార్ధుల చేత.. విరాళాల  సేకరణ చేయించడం మరొక కోణం. 

దాదాపు నాలుగైదు నెలలుగా మా ఇంటి చుట్టుపక్కల ప్రేవేట్ స్కూల్స్  లో చదువు కునే పిల్లలందరూ.. బధిరుల సేవ చేయు నిమిత్తం అనో, శారీరక,మానసిక వైకల్యం ఉన్నవారికి సహాయం కోసం అనో.. ఫండ్స్ కలక్ట్ చేయాలని పిల్లలపై ఒత్తిడి తెచ్చి  ప్రింటెడ్ మేటర్ ఉన్న కార్డ్ ఇచ్చి పంపడం చేస్తున్నారు. అవేసుకుని పిల్లలు ఎక్కే గడప దిగే గడప తో..అలసి పోతున్నారు. 

కొంత మంది అయితే పిల్లలని.. భిక్ష గాళ్ళని కసురుకున్తున్నట్లు కసురుకుంటున్నారు కూడా..  వాళ్ళ చిన్నబోయిన మొహాలని చూస్తే..జాలి అనిపిస్తుంది.

ఆ విషయమే చెపుతూ.. ఆ నిధుల సేకరణ ఏదో.. పిల్లలతోనే చేయించక ,టీచర్స్  పిల్లలతో.సమూహంగా వెళ్లి చేస్తే బాగుంటుంది కదా..అన్నాను ఆ స్కూల్ టీచర్ తో..పోట్లాడినట్లుగానే. ఆవిడ మొహం ఇంత లావు పెట్టుకుని.. ఈ సారి అలాగే చేస్తాం లెండి అంది.   

సేవా సంస్థల ముసుగులో.. అతి తేలికగా డబ్బు సంపాదించే మార్గాలలో.. ఇది ఒక మార్గం ఏమో..అనుకుంటాను. 
ఎందు కంటే.. సేవ చేస్తున్నామని చెప్పుకోవడం ప్యాషన్ అయిపొయింది కాబట్టి.

మా ఇంటి పై భాగంలో ఉండే "మౌని" అనే చిచ్చుర పిడుగు.. ఆంటీ..మీరు నాకే ఫండ్స్ ఇవ్వాలి. వేరెవరికన్నా ఇస్తే..వాళ్ళు నాకన్నా ఎక్కువ కల్లెక్ట్   చేసినవాళ్ళు అవుతారు అని నాకు రూల్స్ పెట్టి కట్టి పడేసింది కూడా.. 

ఏది ?ఒకసారి నన్ను ఆ..సేవా సంస్థ వివరాలు చూడనీ..!అని చెప్పి తీసుకుని చూస్తే..ఆశాసేవా సంస్థ అని ఉంది. ఆ సంస్థ వాళ్ళు వాళ్ళ ఆశ్రమ చిరునామా ని కానీ.. శాశ్వత చిరునామా కానీ ఏమి లేవు. ఇలా స్కూల్ పిల్లల చేత నిధులు సేకరింపజేసి..వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నవారికి స్కూల్  యాజమాన్యం ఎలా సహకరిస్తుందో అర్ధం కాదు. 

ఎంతో మంది పీటర్ సుబ్బయ్యలు మన చుట్టూ ఉన్నారు. అనాధ పిల్లలని చేరదీసినట్లు చేరదీసి వారిని.. దత్తత పేరిట విదేశాలకి  అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే బాలభవన్ లో చేర్పించిన పిల్లలని.. ఆ సంస్థ నిర్వాహకులే.. బాల కార్మికులగా పంపే.. వాళ్ళు ఉన్నారు. మా ప్రాంతం లో అయితే.. అనాధ పిల్లలు లేకుండానే ఉన్నట్లు చూపించి.. విదేశాల నుండి నిధులు సేకరించే వాళ్ళు ఉన్నారు. అలాటి వారికి దండన ఉంటుంది అనుకోండి. 

 ఇలాటి వారి మూలంగా నిజంగా సహాయం అవసరం ఉన్న వారికి  సహాయం అంద కుండా పోతుంది. 

మొన్నీ మధ్య..ఒక ఆదివారం ఉదయాన్నే నేను బయటకి వెళ్ళే సమయానికి ఒక యుక్త వయస్కురాలు అనాధ వృద్దాశ్రమం కి నిధులు సేకరిస్తున్నాం అని,సహాయం చేయమని వచ్చింది.ఆశ్రమం  పేరు అడ్రస్ ఇచ్చి వెళ్ళండి..మేము నలుగురైదుగురం కలసి బట్టలు,బియ్యం లాటివి అందజేస్తాం అని చెప్పాను. వృద్ధులకి ప్రత్యేక   ఆశ్రమం లేదు. ఇంట్లోనే నడుపుతున్నాం అని చెప్పింది.సరే ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి అంటే ఒక నంబర్ ఇచ్చి వెళ్ళింది. అలా జరిగిన ఓ..వారానికి 

మా ఫ్రెండ్స్ అందరం కలసి కొన్ని బట్టలు, నిత్యాసర వస్తువులు,బియ్యం అన్నీ కొని ఆ ఆశ్రమం వాళ్ళ కి ఇచ్చి వద్దామని ఆ నంబర్ కి డయల్ చేసి అడ్రెస్స్ చెప్పమన్నాం. అది అనాధ ఆశ్రమం కాదని..అందులో ఉన్న వారు వృద్దులే కానీ.. ఇంకా అనాధ ముద్ర పడలేదు .. అలా అని ముద్ర పాడినప్పుడు  ..మేమే మీకు కాల్ చేస్తాం.అప్పుడు వచ్చి పుణ్యం కట్టుకోండి..అని చెప్పి నషాలాని కి   అంటేలా మాటలు పెట్టారు. అలా ఉంటాయండి ముసుగు సేవలు. 

ఇంకోసారి సేవ అని  అనకుండా.. కాస్త జాగ్రత్తఃగా.. వచ్చిన వాళ్ళని భూతద్దం లో చూడటం మొదలు పెట్టాను అని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.:))))) 

4 వ్యాఖ్యలు:

కాయల నాగేంద్ర చెప్పారు...

విద్యార్థులు చేత విరాళాలు సేకరించే బదులు
టీచర్లే ఆ విరాళాలు సేకరించి, పిల్లల చేతుల
మీదుగా అనాధలకు ఇప్పిస్తే బాగుంటుంది.

రాజి చెప్పారు...

మీరు చెప్పింది నిజమండీ..
గుంటూరు లో నేను స్వయంగా చూశాను
ఇలాంటి ఒక అనాధాశ్రమాన్ని..
పేరుకి అనాధలు పది మంది వుంటే వూర్లో పిల్లల్ని కూడా కలిపి వాళ్ళ పేర్లు కూడా చెప్పి డొనేషన్స్ తెచ్చుకుంటూ వుంటారు..

అజ్ఞాత చెప్పారు...

there are bad elements, all r not bad

వనజవనమాలి చెప్పారు...

నాగేంద్ర గారు..పిల్లలకి సహాయ గుణం ని అలవర్చడం,తాము ఇవ్వడమే కాకుండా.. ఇతరులనుండి.. విరాలాలని సేకరించి ఇవ్వడం ..అనేది నేర్పడం మంచి నేర్పడమే. అది సామూహికంగా అందరు కలసి చేసే పనిని.. పిల్లలపై నెడుతున్నారు. ఆ విషయం గర్హించాల్సిన విషయం కదా!
@ రాజీ.. నిజం కదూ.. మనం ప్రశ్నించాలి కూడా కదా!? కానీ చొరవ చేయలేం కూడా.
@శర్మ గారు.మీరన్నది నిజమే.. కానీ ఎక్కువ మంది సేవ భావాన్ని మరచి.. సేవ అన్న దానిని అడ్డుపెట్టుకుని ఎందుకు అలా చేస్తున్నారని బాధ.
అందరికి స్పందిన్చినందులకు ధన్యవాదములు.