17, మార్చి 2023, శుక్రవారం

పైడి బొమ్మ

పైడి బొమ్మ - వనజ తాతినేని


ఆఫీస్ పనిలో తలమునకలై వున్న నాకు అమ్మ నుండి వెంట వెంటనే ఫోన్ కాల్స్.  మూడవసారి కూడా ఫోన్ వస్తే యేదో అత్యవసరమైన విషయమే అయివుండచ్చని ఫోన్ తీసాను. “అమ్మాయ్! ఆండాళ్ చనిపోయిందట. ఆశ్రమం వాళ్ళు ఫోన్ చేసారు. మామయ్య నేను బయలుదేరుతున్నాం. నువ్వు కూడా వచ్చెయ్యి “ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. 


అనారోగ్యమేమి లేకుండా లోకం నుండి హఠాత్తుగా సెలవు తీసుకోవడం బాధాకరం అనిపించింది. విజ్ఞులు వచ్చినపని అయిపోగానే సెలవు తీసుకుంటారట. ఆమెకు అయినవాళ్ళు యెవరూ లేనట్టు ఆశ్రమంలో వుండటం తనకు నచ్చలేదు. వెళ్ళినప్పుడల్లా నాతో వుందువు గాని వచ్చేయ్ అని బతిమాలింది. 

నేను వొంటరిగా వుండాలనుకుంటున్నానమ్మా.. మీ తాతయ్య నాకు వుండటానికి కావాల్సిన యేర్పాట్లు అన్నీ చేసారు.ఇంకేం కావాలసలు? మరి అంతగా వుండలేను అనుకున్నప్పుడు నీ దగ్గరకు వస్తానులే, అపుడు కాదనకు అనేది. అవి వుత్త మాటలేనని నాకూ తెలుసు. 

ఆఫీస్ లో అనుమతి తీసుకుని యింటికొచ్చి ఒక జత బట్టలు పెట్టుకుని  హడావుడిగా బస్ యెక్కాను. రెండు గంటల ప్రయాణం ఆశ్రమానికి. 


 నా ఆలోచనల్లో..మా తాతయ్య రామచంద్రరావు.  పేరుకు తగ్గట్టే చల్లని చూపు మధురమైన వాక్కు. ఆజానుబాహువు. ఆయనలో ఒకటే లోపం. బి.సరోజాదేవి లాంటి అందగత్తైన మా అమ్మమ్మ సరోజ ను కారడవి లాంటి ఊరిపాలు చేసి  పట్టణంలో చిన్నిల్లు పెట్టాడు.  పుట్టిన బిడ్డలనిద్దరిని కూడా  అమ్మమ్మకు దూరం చేసి చిన్నామె సంరక్షణలో వుంచాడు. 


చిన్నమ్మమ్మ పేరు ఆండాళ్. ఊటీకి దగ్గర మా ఊరు అని చెపుతూ వుంటుంది. తాతయ్య వ్యాపారం చేసేవాడు. ఎస్టేట్ ల నుండి కాఫీ గింజలు తేయాకు  టోకు ధరకు కొనుగోలు చేసి చిన్న చిన్న పట్టణాలలో వ్యాపారులకు సప్లై చేసేవాడు. అందువల్ల  నెలకు ఇరవై ఐదు రోజులు  ఆయనకు దేశ సంచారమే సరిపోయేది. ఒకోసారి నెలల తరబడి కూడా వచ్చేవాడు కాదంట. అమ్మమ్మకు  తాతయ్య మేనమామే నట.  


అమ్మమ్మ, వాళ్ళమ్మ ఒంగోలుకు దగ్గరలో పల్లెలో వుండేవారు. ఉన్న కొద్దిపాటి  పొలంలో వ్యవసాయం చేయించుకుంటూ  పుష్కలమైన పాడిపంటలతో  అలరారే కుటుంబం. ఇంటికి వచ్చిన అందరినీ కాదనకుండా ఆదరించడమే తెలుసు. తాతయ్య కూడా వ్యాపారంలో బాగా ఆర్జించసాగడంతో ఆ ఊరిలో వారికి గౌరవ మర్యాదలకు లోటు లేదు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆండాళ్ ను తీసుకొచ్చి ఒంగోలులో చిన్నిల్లు పెట్టి అందరూ చెవులు కొరుక్కునేటట్టు చేసాడని జేజమ్మ అంటూ వుంటే వినేదాన్ని. అమ్మమ్మ జేజమ్మ మెటికలు విరుస్తూ ఆండాళ్ ని  తిట్టిపోసేవారు. పట్టణంలో ఇంటికి  ఊరందరికీ ప్రవేశం వున్నా అమ్మమ్మకు జేజమ్మకు ప్రవేశం వుండేదికాదు.

ఆండాళ్ అమ్మమ్మ అంత అందంగా కాకపోయినా కాస్త రంగు తక్కువతో కొద్దిగా ఎత్తు తక్కువతో కళకళలాడే ముఖంతో పరిశుభ్రంగా వుండేది.  అలుపన్నది లేకుండా గానుగ రోలులో కణెం లా తిరుగుతూ ఇంటిని దేదీప్యమానంగా వెలిగిస్తూ వుండేది. ముఖ్యంగా తాతయ్యకు ఆమె చేతి కాఫీ అంటే మరీ ఇష్టం. కాఫీ పేరుతో ఆమెను రోజుకు  ఐదారుసార్లు విసిగిస్తూ వుండేవాడు.  ఆండాళ్  పిల్లల ముఖం చూసి మనసు కనిపెట్టేది కళ్ళు చూసి కడుపు నింపేది. ఆ నైపుణ్యం యెక్కడి నుండి వచ్చిందో ఆమెకు. ఎంత అల్లరి చేసినా విసుక్కునేది కాదు తాతయ్యకు ఫిర్యాదు చేసేది కాదు. తాతయ్య ఊళ్ళో వున్నా లేకపోయినా ఇద్దరు  పిల్లలనూ బడికి పంపడం ప్రెవేట్ కి పంపడం చూసుకునేదట.. అమ్మకు పెళ్ళైన తర్వాత కూడా యెక్కువ కాలం పుట్టింట్లోనే వుండేదట. నాన్నకు సరైన ఉద్యోగం లేదని  కొన్నేళ్ళు, కాన్పులకని  కొన్నేళ్ళు అక్కడే మకాం. అమ్మ తమ్మడిని తీసుకుని వెళ్ళిపోయినా తాతయ్య ఆండాళ్  ల పెంపకంలోనే తను పెరిగింది. తాతయ్య ఆండాళ్ ఎక్కువ మాట్లాడుకోవడం చూడలేదు. తనకు పదేళ్ళు వచ్చిందాకా ఆండాళ్  యే అమ్మమ్మ అనుకునేది.  ఏళ్ళు  గడిచేకొద్ది చుట్టుపక్కల వారి మాటలను బట్టి నాకూ కొన్ని అర్దమవసాగాయి. 


 మామయ్య చదువు తర్వాత వ్యాపారం సన్నగిల్లడం  కుటుంబ ఖర్చులు పెరిగిపోవడం వల్ల యింట్లో ఆర్ధిక యిబ్బందులు మొదలైనాయి. ఉద్యోగం రాగానే మామయ్య పెళ్ళి చేసుకుని వేరు కాపురం వెళ్ళి పోయాడు. అప్పులయ్యాయి గనుక పల్లెలో వున్న పొలం అమ్మాలని ప్రయత్నిస్తే అమ్మమ్మ జేజమ్మ అమ్మడానికి వీల్లేదని అడ్డుపడ్డారు.అప్పులతో అల్లాడే కుటుంబానికి  ఆమె సంపాదనే ఆసరా అయ్యింది.అయినా నన్ను మా ఇంటికి పంపేవారు కాదు. పిల్ల మాకేం బరువు అనేది ఆండాళ్. రాత్రింబవళ్ళు కష్టపడేది. పొద్దు పొడిచే సమయానికి డాబా నిండా వడియాలు పెట్టేది. పచ్చళ్లు పట్టి అమ్మేది.  తెలిసిన వారింటికి వెళ్ళి పిండి వంటలు చేసి వచ్చేది. 

 తాతయ్యకు ఆర్ధికలేమి వలన కలిగిన నిస్సహాయత మనోవ్యధ యెక్కువై  ఆరోగ్యం దెబ్బతింది. పక్షవాతం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని డాక్టర్ చెప్పారు. ఆండాళ్  ప్రతి రోజూ నాలుగైదుసార్లు ఆయన అరికాళ్ళకు అరచేతులకు కొబ్బరినూనె రాసి మృదువుగా నొక్కేది. ప్రేమగా సేవలు చేసేది. కళ్ళతో ఎన్నో మాట్లాడేది.మీకేమీ పర్వాలేదు నేనున్నానుగా అని భరోసా యిచ్చేది. 


తాతయ్య చనిపోయే ముందూ తర్వాత కూడా ఆండాళ్  దుఃఖం ఆమె సంస్కారంతో కూడిన ప్రవర్తన ఏళ్ళకేళ్ళు గడిచిపోయినా మరచిపోదామన్న మరపురాదు. రోజులో గంటలో చెప్పలేము పరిస్థితి విషమంగానే వుందని చెప్పినప్పటి నుండి ఆయన పాదాల దగ్గర కూర్చుని కన్నీళ్ళు కారుస్తూనే వుంది. పచ్చి గంగ కూడా ముట్టలేదు. ఆఖరి శ్వాస విడిచాక ఆ పాదాలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అంతిమసంస్కారం జరపడానికి ఊరికి తీసుకుని వెళతామంటే మారుమాటాడకుండా వొప్పుకుంది. అసలు భార్య ఆమే కదా అంది కానీ తాను కూడా వైధవ్యం ధరించింది. దినవారాలు అయ్యాక ఆమె పెట్టె పట్టుకుని జ్ఞాపకంగా తాతయ్య వస్తువులను కొన్నింటిని తీసుకుని  ఆశ్రమానికి వెళ్ళిపోయింది.  కంటి రెప్పల్లా పెంచిన యిద్దరు బిడ్డల్లో వొక్కరు కూడా ఆమెని నిలువరించలేదు.  తాతయ్య ఇంటిని ఇంటి చుట్టూ వున్న స్థలాన్ని యెపుడో యిద్దరు బిడ్డల పేరిటా వీలూనామా వ్రాసాడంట. ఆ సంగతి ఆండాళ్ కూ తెలుసునంట. తాతయ్య ఆమెకు ఆస్థులేవి యివ్వకుండా అన్యాయం చేసాడనిపించింది నాకు.  

ఫోన్ లో యెపుడు మాట్లాడినా తన కన్నా తాతయ్యను ముందు తీసుకెళ్ళి భగవంతుడు తనకు అన్యాయం చేసాడని గొప్ప స్నేహితుడిని కోల్పోయానని యేడుస్తుంది.స్నేహితుడు అంటదేమిటి అనుకునేదాన్ని నేను.  మహా వుంటే అమ్మ కన్నా పదేళ్ళు ఎక్కువుంటాయేమో. తాతయ్య వయస్సు కన్నా పదిహేడేళ్ళు తక్కువంట. అమ్మ చెపుతుంటే విన్నాను. ఆయన మనసు గ్రహించి యే పనైనా చెప్పకుండా చేసేసేది అంట. ఇంతలోనే ఆమె కూడా దూరమై పోతుందని అనుకోలేదు. తాతయ్య వస్తువులు ఆమె దగ్గర భద్రంగా వున్నాయి. ముఖ్యంగా తాతయ్య డైరీని తను చేజిక్కించుకోవాలి. అందరి గురించి ఏదో ఒకటి రాసిన ఆయన తన గురించి యేమి వ్రాసాడో తెలుసుకోవాలి. బీరువాలో  ‘’పైడి బొమ్మ’’ అనే శీర్షిక పెట్టిన చక్కని అందమైన పద్మం చిత్రం వుండేది. వంగ పువ్వు రంగు వంకాయ రంగుకు మధ్య రంగుతో నింపబడిన పద్మమూ లేతాకు పచ్చ ముదురాకు పచ్చ కాకుండా మధ్యాకు పచ్చ రంగులో  పద్మం కింద కనీ కనబడకుండా వుండే ఆకులు కొలనులో నల్లని నీరు అన్నీ కలిపి యెంతో సహజంగా వుండేది ఆ చిత్రరాజం. ఎక్కువగా అదే రంగు చీరలు ఆండాళ్ కట్టుకుని రవివర్మ చిత్రంలో వున్న స్త్రీలా  నట్టింటిలో తిరుగుతూ వుండేదన్న సంగతి స్పురించింది నాకు.  తాతయ్య చనిపోయాక బీరువాలో వున్న ఆ చిత్రాన్ని పరిశీలనగా చూసింది తను. అది తాతయ్య చిత్రించినదే. ‘’ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం‘’ అని వ్రాసిన వాక్యం క్రింద ఆయన సంతకం వుండేది.  తాతయ్యపై సినిమా పాటల సాహిత్యప్రభావం యెక్కువ కదా అనుకున్నాను కూడా.

ఆశ్రమం దగ్గర బస్ ఆగింది.జ్ఞాపకాలు ఆగాయి. అమ్మ మామయ్య అప్పటికే వచ్చి వున్నారు. హార్ట్ ఎటాక్ అంటున్నారు అన్నాడు మామయ్య. ఆండాళ్ భౌతిక కాయాన్ని  చూపించారు. ఆమెతో వున్న అనుబంధాన్ని తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు అమ్మ మామయ్య. నాకు దుఃఖానికి మించిన బాధ.  తాతయ్య ఆమె కలసి ఇరవై యేళ్ళు వచ్చే వరకూ తమ బిడ్డగా అపురూపంగా పెంచారు నన్ను. విద్యాబుద్ధులు నేర్పించారు. వారికి నేనేమి చేసే అవకాశమే యివ్వలేదు. అంతిమసంస్కారం మీరు చేసుకుంటానంటే ఆ యేర్పాటు చేస్తామన్నారు ఆశ్రమం వారు. అమ్మ మామయ్య వైపు చూసింది. మామయ్య నేను చేస్తానని ముందుకెళ్ళాడు. వారు ఆ యేర్పాటులలో వుండగా ఆండాళ్ వున్న గది వైపు నడిచాం అమ్మ నేనూ.

అంతలో “అమ్మాయ్ నీలోత్పలా!  నీకో విషయం చెప్పాలి” అంది అమ్మ. చెప్పు అన్నట్టు చూసాను. “ఆండాళ్ ను  మామయ్య నేనూ పిన్నీ అంటాం కానీ ఆమెకు తాతయ్యకు భార్యభర్తల మధ్య వుండే సంబంధం యేమీ వుండేది కాదు. వాళ్ళది మానసిక బంధం అంతే “ అంది. 

నాకు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. “నిజమా  అమ్మా! అన్నేళ్ళపాటు వారిద్దరూ ఒకే గూటిలో ఆలుమగల్లా కాలం గడిపారు అంటే చాలా ఆశ్చర్యంగా వుంది.” 

“ఈ విషయంలో ఇద్దరిలో యెవరు గొప్ప అంటే యిద్దరూ గొప్పవాళ్ళే. ఆమె మా నాన్న మాటను మన్నించింది. మా నాన్నతోనే జీవితం అనుకుంది. మా నాన్న ఆమెను గుంభనంగా ప్రేమించాడు. ఆమెకు గౌరవమిచ్చాడు. ఈ విషయాలన్నీ తాతయ్య డైరీలో వుంటాయి. మేమెప్పుడో చదివాం. ఆ డైరీ ఇపుడు కూడా వుండే వుంటుంది చూడు”అంది. 

ఇతరుల డైరీ చదవడం సంస్కారం కాదని వీళ్ళకు యెవరు చెప్పాలి అని మనసులో విసుక్కున్నా డైరీ చదవాలనే ఆత్రుత నాకంటుకుంది. తాళం వేసిన పెట్టెను అక్కడపుడు బద్దలు కొట్టటం బాగోదని ఓపిక పట్టాను. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆమె పెట్టె తీసుకుని తిరిగి కారెక్కాం. కారెక్కగానే  నేను చేసిన మొదట పని పెట్టె తాళం పగలగొట్టడం. తాతయ్య డైరీ అందులోనే వుంది. పచ్చకర్పూరం ఎండిన మరువం కలిపి పెట్టిన ప్లాస్టిక్ సంచీలో తాతయ్య ఫోటో, పెన్ను, వాచీ, డైరీ కనబడ్డాయి. అమ్మ మామయ్య ఆండాళ్ తాతయ్య గురించిన మాటల్లో మునిగిపోయారు. నేను డైరీ తీసుకుని చదవడం ప్రారంభించాను. 

************

1983 శ్రీ రుధిరోద్గారి  నామ సంవత్సరం నవంబరు 20. కార్తీక పౌర్ణమి.   

“చాంద్ కో పాస్ జో సితారా హై..ఓ సితారా హసీన్ లగతా హై ‘’ ఆప్ కీ ఫర్మాయిష్ లో కొత్త  సినిమా పాటను వింటూ శృతి కలుపుతున్నా.  నేను కూడా ఈ పాట వినిపించమని వివిధభారతి బొంబాయి కేంద్రానికి  నెలనాళ్ళ క్రితం హిందీ లోనే ఉత్తరం వ్రాసాను. అయినా నా కోరికను మన్నించలేదని నాకర్దమైంది. నా పేరు వినబడకపోయినా ఎవరో కోరిక మీదకు నేను వినాలనుకున్న పాట  రేడియోలో వినబడింది కదా అని సంతోషించాల్సింది పోయి  ముసిరిన ఈగల్లాంటి యీ ఆలోచనలు నాకెందుకు అనుకుంటూనే  మళ్ళీ యెంతైనా వుత్తరాది వాళ్ళకు మద్రాసీలంటే చిన్న చూపు. తెలుగు వారిని కూడా మద్రాసీలనడం మరింత బాధ పెడుతుంది. అందుకే కదా తెలుగుదేశం పార్టీ పుట్టింది అని తలపోసాను. అన్యమనస్కంగా పాట విని.. అరే  పిచ్చి ఆలోచనల్లో పడి పాటను విని పూర్తిగా ఆస్వాదించలేకపోయానే అని కించిత్ విచారపడ్డాను కూడా. 


 అంతలో వాలు కింద రోడ్డు వారనే వున్న మురుగన్ హోటల్ దగ్గర యేదో కలకలం. ఒళ్ళో పెట్టుకున్న రేడియోని మంచంపై పెట్టి టార్చి లైట్ తీసుకుని బయటకు రాబోయాను.. సన్నగా జల్లు పడుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళి గొడుగు తీసుకుని విప్పుతూ బయటకు నడిచాను. వేళ కాని వేళ యీ మారుమూల ప్రాంతానికి యింతమంది రావడం యేమిటి? ఈ గొడవ యేమిటి అని వడివడిగా క్రిందకు నడిచాను. నలుగురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు మురుగున్ భార్యను చుట్టుముట్టారు. ఆడవాళ్ళిద్దరూ  పిడికిలి బిగించి ఆమె బుగ్గల్లో పొడిచి అసహ్యకరంగా తిడుతున్నారు. నాకు తమిళం అంత బాగా రాకపోయినా వాళ్ళు అసహ్యకరంగా తిడుతున్నారని అర్దమైంది. ఆమె నన్ను చూసింది. రెండు చేతుల్లో ముఖం దాచుకుని మరింత దుఃఖపడింది. అభిమానం కల మనిషి.ఇంకో యిద్దరు మనుషులు మురుగన్ ని ప్రక్కకు తీసుకెళ్ళి మంతనాలు ఆడుతున్నారు. అతను సరియ సరియ అని తలవూపుతున్నాడు. ఏంటి విషయం అని అడిగాను. కాస్తో కూస్తో తెలుగు వచ్చిన మురుగన్ యేమి మాట్లాడలేదు. వచ్చిన వారిలో వొకతను తమిళంలో నాకు అర్దమయ్యీ కానట్టు చెప్పాడు.


 ఈమె మురుగన్ భార్య కాదంట. భార్యను యిద్దరు పిల్లలనూ వొదిలేసి యీమెతో కలసి వచ్చేసి రెండేళ్ళు అయిందట. అప్పటి నుండి వెతుకుతుంటే యిప్పటికి తెలిసిందట యిక్కడ వున్నట్టు. నా చెల్లెలికి ఆమె బిడ్డలకు అన్యాయం చేస్తే నేనూరుకుంటానా, వీడిని నాతో కూడా తీసుకుపోతా.  మర్యాదగా ఆమెను ఆమె దారి చూసుకోమనండి. ఇకమీదట వాడు యీమెను కలవడానికి వీల్లేదు. ఈమె వాడిని వెదుక్కుంటా రాకూడదు. కలసినట్టు తెలిస్తే యిద్దరిని నరికేస్తాను అన్నాడు చొక్కా కింద దాచిన గీత కత్తి దూసి కృూరంగా.


కాసేపటికి హోటల్ లో వున్న సామాను అంతా మూటలు కట్టి  వాళ్ళు వేసుకొచ్చిన మినీ లారీ లోకి యెక్కించి సామానేసిన మూట లాగానే మురుగన్ ను అందులో కుదేసి ఆమెను వొదిలేసి వెళ్ళిపోయారు.  మురుగన్ వెళ్ళేముందు ఆమె ముందుకు వచ్చి ఆమె కళ్ళల్లోకి చూపు నిలపలేదు ఒక్క మాటా మాటాడలేదు. వెన్నుజూపి పారిపోయిన ఆ మనిషిని ఆ  మనిషెళ్ళిన దారిని చూసి ఆమె యేడ్వడం ఆపేసింది. నన్ను వొక్క క్షణం చూసి గుడిసె లోపలికి వెళ్ళి తడిక బిగించుకుంది.


 వాన కురవడం ఆగిపోయింది. మబ్బుల మాటు నుండి కురిసిన వెన్నెల  అంతకు ముందు తేయాకు పొదలపై కురిసెళ్ళిన వాననీళ్ళపై పడి కిందకి జారుతుంటే వెన్నెల వర్షంలా తోచింది. ఆమె బతుకులా తోచింది.కాసేపు అక్కడే నిలబడ్డాను. వెళ్ళబుద్ది కాలేదు. అక్కడే వుండి యేమి చేయాలో ఆమెనెలా వోదార్చాలో కూడా తెలియలేదు. కాటేజీకి వచ్చి పడుకున్నానన్న మాటే కాని కన్ను మూత పడలేదు. ఆలుమగల మధ్య అనుబంధం అంత బోలుగా వుంటుందా ఓటిగా వుంటుందా! వారి మధ్య అప్పటిదాకా వున్న ప్రేమ నమ్మకం విశ్వాసం అన్నవి లేకపోయాక వొకొరికొకరు యేమి కారా.. కాదన్నట్టు మురుగన్ రెండోసారి వెళ్ళిపోయి అది నిజం చేసాడు. అది ప్రేమా మోహమా? నా భార్య కూడా నన్ను మోసం చేసింది. ఇంటికి దూరంగా యెన్ని నెలలు ముఖం చాటేయగలడు? ఊరికి వెళితే ఊరి మనుషుల యెగతాళి చూపులను అమాయకత్వం నటిస్తున్న భార్య నటననూ నాన్నా అంటూ తనను చుట్టుకునే  రెండు జతల చిన్నారి చేతులను వారి ప్రేమను భరించలేడు.హృదయం భగ్గుమంటుంది.కన్ను మూతపడనంటుంది.


కోడికూయక ముందే మురుగన్ హోటల్ ముందు నిలుచున్నాను. ఆమె తడిక పక్కకు జరిపి బయటకు వచ్చింది. చేతిలో చిన్న బట్టల మూట. అక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్దపడినట్లుంది. మసక చీకట్లో యెదురుగా వున్న నావైపు వొకసారి చూసి రెండడగులు ముందుకేసింది. ఆమె వెనుక నడుస్తూ..


“ఎక్కడికెళతావ్ “ 


“ ఏమో తెలియదు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు”


“ఈ ప్రపంచం నువ్వు అనుకున్నంత మంచిది కాదు”


“తెలుసండీ, మేము చిత్తూరోళ్ళం. కోయంబత్తూరులో బనియన్ల కంపెనీలో పనిచేసేదాన్ని. మురుగన్ మాటలు నమ్మి ఇల్లు విడిచి పెట్టి వచ్చేసాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి పోనూ” కన్నీరు పెట్టుకుంది. 


“నాతో వస్తావా, నాకూ పెళ్ళైంది, ఇద్దరు బిడ్డలున్నారు. నిన్ను మోసం చేయను. నీకు కడుపు నిండా తిండి పెట్టి, నీడ నివ్వగలను”


ఆమె అడుగులు నెమ్మదించాయి. ఆమె అడుగులలో అడుగు కలిపి నీకిష్టమైతే నాపై నమ్మకం వుంటే  ఊటి రైల్వే స్టేషన్ లో  వేచివుండు. మధ్యాహ్నం మూడు గంటల బండికి  మా ఊరు వెళ్ళిపోదాం.” జేబులో నుండి  రెండు వంద నోట్లు తీసి ఆమెకిచ్చాను. “ఇష్టం లేకపోతే  నువ్వు వేచివుండనవసరం లేదు” 


ఆమె తలూపి నడుచుకుంటూ  ముందుకెళ్ళింది.  నేను అర్జెంట్ గా చేయవలసిన పనులు ముగించుకుని కొన్ని పనులు వేరొకరికి అప్పజెప్పి రైల్వే స్టేషన్ కు చేరుకున్నాను. ఆమె అక్కడ వేచివుంది. రెండు టికెట్లు తీసుకుని ఆమె చేతిలోని బట్టల మూటను ఇంకో చేతిలోకి తీసుకోబోయాను. ఆమె మొహమాటపడింది. 


చొరవగా లాక్కుని పద అన్నాను. ఆమె భుజం చుట్టూ చెంగు కప్పుకుని నన్ను అనుసరించింది. రైలెక్కి సీట్లో కూర్చున్నాక నీ పేరేమిటి అని అడిగాను. “ఆండాళ్, పద్మవల్లీ ఆండాళ్ “ అంది. 


********


1983 నవంబరు 23 వ తేది బుధవారం రాత్రి 10:30 గంటలు


ఒంగోలు లో రైలు దిగి  నేరుగా బజారుకు వెళ్ళి ఆమె కోసం నాలుగు చీరలు  కొన్నాను. జాకెట్ ముక్కలు తీసుకుని కుట్టడానికి టైలర్ కు ఇచ్చాను. ఆ రోజు హోటల్ లో రూమ్ తీసుకుని అక్కడే బస చేసాము. తెల్లవారుఝామునే లేచి స్నానాలు ముగించి తయారై  రిక్షా కట్టించుకుని నేను కొన్న  కొత్త యింటికి వచ్చాము. గడప దగ్గర కొబ్బరికాయ కొట్టి దేవుడి పటాల ముందు దీపం వెలిగించిది. పాలు పొంగించి పాయసం చేసింది. దేవునికి నైవేద్యం పెట్టి నాకు ప్రసాదం పెట్టింది. నేను కళ్ళకద్దుకుని యింత నోట్లో వేసుకుని యింత ఆమెకి పంచాను.  ఆమె వంట చేస్తుంటే నేను సహాయం చేస్తూ నా అంతరంగాన్ని బయట పెట్టాను. 


“నా పేరు తెలుసు కదా నీకు”


“తెలుసు రామచంద్రరావు” అంది. 


“నాకు ఆయనలా ఏక పత్నీవ్రతుడై వుండటం ఇష్టం. నీకు నీడ కల్పిద్దామనే ఉద్దేశంతో తప్ప నీపై నాకెలాంటి వికారాలు లేవు. నాభార్య పై తప్ప ఇంకొకరిపై నాకు మనసు వుండదు. నేను అలాగే వుండాలనుకుంటున్నాను, నీకు భర్త అనే తోడు నీడ కావాలనుకుంటే నాకొక మాట చెప్పు చాలు. మంచి మనిషిని చూసి పెళ్ళి జరిపిస్తాను” అని చెప్పాను. ఆమె కళ్ళనిండా నీళ్ళు. 


నేనలా బజారుకు వెళ్ళి యింట్లోకి సామాను కొనుక్కొస్తాను విశ్రాంతి తీసుకో.. అని బయటకు వెళ్ళాను. 


నేను బజారు నుండి ఇంటికి వచ్చేసరికి నా స్నేహితుడు అతని భార్య. ఇంతలోనే గాలి కబురు వారికి వెళ్ళనే వెళ్ళింది. తెలుసుకుందామని ఇంటికి వచ్చిన వారిని ఆప్యాయంగా లోనికి ఆహ్వానించి మర్యాదలు చేసి రామచంద్రరావు గారి భార్యను. రెండు రోజుల క్రిందటే తిరుమలలో పెళ్ళి చేసుకున్నాం అని చెప్పిందట. మిత్రుడు నిజమేనా అని అడిగాడు అనుమానంగా. నిజమేనని చెప్పాను. మన కులమేనా అడిగాడు. ఇపుడు ఆమె కులమే నాదీనూ అన్నాను. 


 మర్నాడు పల్లెకు వెళ్ళి పిల్లలను తీసుకువెళతాను. చదువు సంధ్యలు లేకుండా పిల్లలు బలాదూరుగా తిరుగుతున్నారు పట్టణంలో స్కూల్ లో చేర్పిస్తాను అన్నాను. 


ఇంట్లో పెద్ద యుద్దమే జరిగింది. ఇంత అవమానం నేను భరించలేను. బావిలో దూకి చనిపోతానని బెదిరించింది అక్క.


ఆ పని నీ కూతుర్ని మందలించలేనపుడే చేయాల్సింది. ఇప్పుడు చేసి నీ కూతురుకు యీ మాత్రం అండ లేకుండా కూడా చేయకు” అన్నాను. 


నా పిల్లలను నేనివ్వను.. నేనే పెంచుతాను అంది సరోజ.  వీధిలోకి వచ్చి వీళ్ళిద్దరూ నా పిల్లలు కాదని చెప్పు వదిలేసి వెళతాను అన్నాను తీప్రంగా. జంకింది సరోజ.


పిల్లలను తీసుకుని బస్టాపుకు వచ్చాను. వెంబడించిన అక్క  “తల్లి లేకుండా పిల్లలను యెలా పెంచుతావు రా.. తీసుకొచ్చిన దాన్ని నమ్మి పిల్లలను తీసుకెళుతున్నావ్. అది యెంత మాత్రం చూస్తుందో ఆ సంబండం యెన్నాళ్ళో నేను చూడనా” అని వెక్కిరించింది. 

“అది జరగదు కానీ సెలవలకు పంపించిపోతాను. వాళ్ళ మనసులు విరిచి పంపకుంటే అదే చాలు’’ అన్నాను.


అక్క దుమ్మెత్తిపోస్తూ శాపనార్ధాలు పెట్టింది.  తల్చుకుంటే బాధ నిలువెల్లా కమ్ముకుంటుంది. ఏమీ వ్రాయలేని బాధ యిది. హ్మ్!  


పాళీ విరిగి సిరా ముద్దగా.. కాగితం చిరిగి లోతుగా గుచ్చుకుని ముక్కలైన హృదయానికి సంకేతంలా తోచింది. మరొక పేజీ తిప్పాను...

***********

1983 నవంబరు 25 వ తేది శుక్రవారం రాత్రి 08:00

నిన్న రాత్రి పిల్లలను తీసుకుని వచ్చేసరికి పొద్దుపోయింది. 

ఆమెకు నా మాటంటే ఎంత నమ్మకమో.నీళ్ళ పొయ్యి మండుతూనే వుంది. వంట చేసి తయారుగా వుంచింది. గబగబ గుమ్మంలోకి  యెదురొచ్చి పిల్లలను చేయిపట్టుకుని లోపలికి పిలుచుకుని వెళ్ళింది. నీళ్ళు తొలిపిచ్చి స్నానం చేయమంది.  వేడిగా భోజనాలు వడ్డించి చాపలేసి తెల్లని పక్కలు పరిచింది. చలిపుట్టకుండా దుప్పట్లు కప్పింది. పిల్లాడికి ఐదేళ్లు.  పదేళ్ళ ఆడపిల్ల.  అమ్మాయికి తల్లి అంటే ఇష్టం తండ్రంటే మరింత ఇష్టం కాబట్టి తండ్రి తీసుకువెళతాను అనగానే వచ్చేసింది కానీ ఆమెను చూసి ముఖం చిట్లించింది. ఎవరామె? పనిమనిషా అని అడిగింది. కాదు మీ పిన్ని. పిన్నీ అని పిలవాలని చెప్పాను. అయిష్టంగా తలవూపింది.

************ 

1987 అక్టోబర్ 2 రాత్రి 10:00 గంటలు

ఆమె సరోజను సరోజ ఆమెను చూసుకోలేదు ఒకొరినొకరు కలిసే అవకాశమూ లేదు. సరోజ గురించి ఆమె యేనాడు ప్రశ్నించి యెరగదు. తెలుసుకోవాలనే వుత్సాహం ప్రదర్శించేది కాదు. ఆ రోజు ఆదివారం. పిల్లలను సినిమాకు తీసుకుని వెళుతూ  ఆమెను రమ్మని అడిగాను. ఆమె రానంది.  “సిరివెన్నెల” బాగుంటుంది అంట.. రా.. పిన్ని అంటూ పిల్లలు బలవంత పెట్టారు.  ఇంటికి వచ్చిన నాలుగేళ్ళ తర్వాత అదే ఆమె బయటకు అడుగుపెట్టడం. సినిమా హాలులో ఇంటర్వెల్ సమయంలో పిల్లలకు వాళ్ళ అమ్మ కనబడింది. పిల్లలు ఆమె దగ్గరికి వెళ్ళారు. సరోజ ఈమె వంక తీక్షణంగా చూసింది. పక్కనున్న కృష్ణమాచార్యులకు వేలుపెట్టి  యీమెను చూపింది. ఈమె ఆమెను చూసింది అంతే. ఒక్కమాట లేదు  ఒక్క ప్రశ్న లేదు ఆమె గురించి. సంస్కారం కులంలోను ధనంలోను లేదని నాకు అనిపించిన క్షణాలు అవి. తర్వాతెపుడో కృష్ణమాచార్యులకు పెళ్ళైందని భార్య ఆ ఊరు కైతే కాపురానికి రానందని భార్య వూరికి  అతనే వెళ్ళిపోయాడని చెప్పారు. అంతకు మునుపే సరోజ వొంటి మీద బంగారానికి రెక్కలొచ్చి అతనితో వెళ్ళిపోయాయని తెలిసింది. 

లోకులు పలుగాకులు. నా తమ్ముడు దాన్నెవతనో తీసుకొచ్చి కాపురం పెట్టాక  ఉక్రోషంతో ఆ బ్రాహ్మడితో చనువుగా తిరిగింది కానీ అంతకు ముందంతా అది నిప్పు అని మా అక్క కథలు కథలుగా చెప్పడం నాకు తెలుస్తూనే వున్నాయి. కొందరిని చూస్తే అసహ్యం కల్గుతుంది వారు రక్తస్పర్శ కల్గిన వారైనాసరే. అక్క, సరోజ ఇద్దరిదీ ఒకే స్వభావం. వారిది జాణతనం కూడా కాదు. దిగజారుడు మనస్తత్వం. నన్నెరిగిన వారినెరిగిన వారెవరైనా యేదైనా చెప్పబోయినా నాదగ్గర వాళ్ళ ప్రసక్తి తేవొద్దని నిష్కర్షగా చెప్పేసాను. మనసులు దూరమయ్యాక మనుషులు దగ్గరలో వున్నా లేనట్టే.

**********

1993  శ్రీముఖ నామ సంవత్సరం  నవంబరు 28 ఆదివారం

కార్తీక పౌర్ణమి  సాయం సమయం

అమ్మాయి  వుదయం నుండి నొప్పులు పడుతుంది. బిడ్డ నొప్పులు యెలాంటివో అనుభవం లేకపోయినా ఆ నొప్పులు తనకు తెలుసునన్నంత ఇదిగా ప్రసూతి విభాగం వరండాలో కాలు చేయి ఆడక కంగారుగా తిరుగుతుంది ఆమె. గంట తర్వాత ఆడపిల్ల  పుట్టిందన్న వార్తతో ఆనందపడింది. “నీలోత్పల’’ అని పేరు పెడదాం మీకిష్టం కదా ఆ పేరంటే అంటే నేను ఆశ్చర్యపోయాను. ఏనాటి బంధమో యిది. మనసెరిగి ప్రవర్తించే సహచరి దొరకడం యెంత అదృష్టం. ఆ మురుగన్ నా పాలిట దేవుడు అనుకున్నాను.  హాస్పిటల్ బయట చెట్టుకింద నిలబడి పౌర్ణమి నాటి చంద్రుడిని చూస్తూ అనుకున్నాను. 

కచ్చితంగా  పదేళ్ళైంది ఆమె నా జీవితానికి తోడై.  పదేళ్ళగా పిల్లలిద్దరూ యీ యింటికి ఆమె ప్రేమకు బాగా కుదురుకున్నారు. వాళ్ళు తెలివి కలవారు గోప్యం కలవారు. యెవరితో యెలా మసలుకోవాలో బాగా నేర్చుకున్నారు. ఆమె యెపుడూ పల్లె సంగతులు అడగదు. అక్కడ నుండి యేమైనా వస్తే పిల్లల గదిలోనే పెట్టిస్తుంది. ఇక్కడ నుండి  పంపే వాటిలో యేమైనా మర్చిపోతే గుర్తుచేస్తుంది. నిస్వార్దంగా ప్రేమించడం ఆమెకు లభించిన గొప్ప సుగుణం. అపుడపుడూ నాకు పశ్చాత్తాపం. ఆమెకు ఆశ కల్పించి తీసుకువచ్చి నాలుగు గోడలకు బందీని చేసానని. ఆమెకు తెలుగు మాట్లాడం మాత్రమే వచ్చు. పిల్లలతో పాటు కూర్చుని తెలుగు వ్రాయడం చదవడం నేర్చుకుంది.ఇంగ్లీష్ కూడా బాగానే నేర్చుకుంది. మలిసంధ్య వేళలో దీపాలు వెలిగించి.. చాప పరుచుకుని వ్యాస పీఠంపై సుందరకాండను వుంచి రోజుకు రెండు మూడు సర్గలు చదివి వినిపించేది. ఒకోసారి పిల్లలను చదమనేది.  నోళ్ళు నొక్కుకున్న బంధువర్గం అంతా మెచ్చుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు బాగా పెరుగుతున్నారని ప్రశంసించేవారు. 

అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను. మంచి సంబంధం వచ్చింది.  ఆ పట్నవాసపు కాపురం గురించి వారికి తెలిసినా అభ్యంతరం లేకుండానే  వొప్పుకున్నారు. కట్నకానుకలు వస్తు వాహనాలు బట్టలు అన్ని కొరత లేకుండా కొనుక్కోమని చెప్పాను. అమ్మాయి తన పెళ్ళి పల్లెలో చేయమని అడిగింది. నాకు యిష్టం లేదని చెపితే ఆమె మొదటిసారి అభ్యంతరం చెప్పి నా నిర్ణయం తప్పని చెప్పింది. అమ్మాయి కోరిక సమంజసమైనదని పెళ్ళి అక్కడే జరగాలని అంది. అవసరమైన అన్ని పనులు చేసి పెళ్ళి సమయానికి తెర చాటున నిలిచిపోయింది. ఎలాంటి భావం వ్యక్తం కానీయకుండా భార్య పక్కన నిలబడి  అమ్మాయి పెళ్ళి కార్యక్రమం నిర్వహించాను. సరోజ నాతో మాటలు కలపటానికి ప్రయత్నించింది.  పదేళ్ళపాటు ఇంటికి రాకుంటే లోకులు యేమనుకుంటారు.. అపుడపుడు వచ్చి పోవాలి కానీ అంటూ యింకా యేవేవో చెప్పబోయింది. నేను చెయ్యి అడ్డుపెట్టి వారించాను. 

“సరోజా! నీకూ నీ బిడ్డలకూ యే లోటుపాట్లు జరగనీయడం లేదు. నువ్వు కావాలనుకున్న జీవితంలోకి నువ్వు నడిచావు. నాకు వీలైనది నేను చేస్తున్నాను. తప్పులను వేలెత్తి చూపడం నాకిష్టంలేదు.“ అన్నాను. ఆ నాడే పెళ్ళికి వచ్చిన బంధువులతో పాటు  నేనూ వెనుదిరిగాను.ఎవరి అంతరాత్మే వారికి న్యాయదేవత. అంతకన్నా చెప్పడానికి నాదగ్గర వాక్యాలేమీ లేవు.  జరిగిన వాటిని గుర్తు చేసుకుంటూ  భారంగా నిట్టూర్చి గంభీరాన్ని  అలంకారంగా ధరించడం అలవాటు చేసుకున్నాను. అమ్మాయి పెళ్ళైనా పుట్టిల్లు యిదే అనుకోవటం.. పండుగలకు అల్లుడిని ఆహ్వానించడం చూలింత వేడుకలు అన్నీ యిక్కడే జరిగిపోతున్నాయి.

********

1994 ఏఫ్రియల్ 12 మంగళవారం ఉగాది పర్వ దినం

మనుమరాలికి “నీలోత్పల” అని పేరు పెట్టాం. నీలోత్పల బోసి నవ్వులతో ఇల్లంతా వెలిగిపోతుంది. ఆమె ఇంకా వెలిగిపోతుంది. ముప్పై నాలుగేళ్ళకే అమ్మమ్మ అయినందుకు సంబరపడేది . అలా పిలిపించుకోవాలని త్వరపడుతుంది ఆ పైడి బొమ్మ. నిజమే ఆమె నా పైడి బొమ్మ. నా మైథిలి.  నేను ఏమీ  చెప్పినా ఆదేశించినా నా మాట జవదాటక నా మాటకు నాకూ వన్నె తెచ్చి నన్ను ఏకపత్నీవ్రతుడిగా నిలిపి వుంచడానికి కృషి చేసింది. నేనిలా నిలిచి వుండటానికి  నా జీవితంలో ప్రశాంతతకు కారణం ఆమే కదా. నిజంగా ఆమె కదా నా దీపధారి, మానసిక సహచరి!! యాగం చేసేటపుడు రామచంద్రుడు స్వర్ణసీత విగ్రహాన్ని తన పక్కన కూర్చుండబెట్టుకుంటే సంసార యజ్ఞం చేయడానికి ఈ పైడిబొమ్మను తన పక్కన నిలబెట్టుకున్నాడు. ఈమె నా స్వర్ణసీత, పైడి బొమ్మ పద్మవల్లీ ఆండాళ్  కదా! ఆమె సహచర్యంలో యెన్నో మార్లు గర్వంగా వొడలు ఉప్పొంగింది నాకు. ఆలుమగల మధ్య అనురాగం కన్నా స్నేహమే ఎక్కువ వుండాలి.అపుడే వారి మధ్య అపగాహన వుంటుంది. ఆమె స్నేహమయి.అందుకే తన జీవితం ఇలా సౌఖ్యంగా గడిచిపోతుంది. ‘’నీ చెలిమిలోనున్న.. నెత్తావి మాధురులు నా హృదయ భారమునే మరపింప చేయు’’ లోలోన పాడుకుంటూ... ఈ జన్మకీ అదృష్టం చాలు రామా రఘరామా...

**********

అరే “పైడి బొమ్మ’’ నేను కాదన్నమాట అనుకుని  నిరాశపడి పేజీలు ముందుకు తిప్పాను నేను. చివరికంటా ఖాళీగా కనబడ్డాయి. వెనక్కి చూసింది. వ్రాసిన పేజీలు చాలానే వున్నాయి. అందులో వొక పేజీని చదవసాగాను.


******************


1983 సంవత్సరం ఏఫ్రియల్ 14 ఉగాది పండుగ అంబేద్కర్ జయంతి. 


ఈ రోజు నా మనసనే అద్దం ముక్కలైన రోజు. విరిగిన ముక్కలలో సరోజ బింబం వికృతంగా తోస్తుంది. అసలు నేను వుత్తరం వ్రాయకుండా యింటికి యెందుకు బయలుదేరాలి. ఉత్తరం వ్రాసి వుంటే సత్యం నాకంట పడకుండా  నాలో లీల మాత్రం అనుమానంగా మిగిలివుండేదేమో! నేను ఉగాది పండుగ రోజు పిల్లలతో వుండాలని యింటికి రావడం అది మధ్యరాత్రి కావడం వలన చూడకూడని దృశ్యం చూడవలసి వచ్చింది.  నా పడక గదిలో సరోజ కృష్ణమాచార్యులు ఏకశయ్యాగతులై వుండటం నా కళ్ళారా చూసాను. తలుపు తీసిన అక్క  నన్ను చూసి నివ్వెరపోయింది. పిల్లలిద్దరూ వేరొకగదిలో నిద్రపోతున్నారు. సరోజ ఆదమరిచి నిద్రపోతుంది. పాపం, దానిని లేపడం యెందుకు? పిల్లలు పగలల్లా విసిగించేస్తున్నారు. చంటాడైతే మరీనూ. నువ్వెళ్ళి నాలుగు చెంబులు గుమ్మరించుకురా.. కాస్త యెంగిలి పడుదువుగాని అని నన్ను పెరట్లోకి పంపే ప్రయత్నం చేసింది.


నేను చేతిలో సంచీ సూట్కేస్ కిందకి జారవిడిచి అక్కడున్న కుర్చీలో కూలబడ్డాను. అక్క కంగారు పడుతుంది పడక గదిలోకి వెళతానేమో అని. ఆమెను చూసి జాలేసింది.  “నాకు రూఢీ అయింది. ఇక మసిపూసి మారేడుకాయ చేయకక్కా! సరోజను కృష్ణమాచార్యులను బయటకు పిలువు” అన్నాను. తలుపు తట్టింది. సరోజ కొంత సేపటికి తలుపుతీసింది. అతను ఇంకో గుమ్మం గుండా బయటకు వెళ్ళిపోయాడు. బీరువా తీసి కొన్ని ముఖ్యమైన పత్రాలు తీసుకొని సూట్కేసులో సర్దుకుని బయటకు నడిచాను. ఒరేయ్ తమ్ముడూ! నేను చెప్పేది వినరా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ వొక్కసారికి దాన్ని క్షమించరా.. అని అడ్డం పడింది. తొందరలో  వచ్చి నా బిడ్డలను తీసుకుని వెళతాను. ఇక మీ నీడన వారిని పెరగనివ్వను దృఢంగా చెప్పేసి పట్టణం బాట పట్టాను. 

ఆ అర్దరాత్రి అవమానభారంతో ముక్కలైన హృదయంతో వొంటరిగా నడుస్తూ.. ఆలోచించుకున్నాను. ద్రోహానికి పునాదాలు యెక్కడ పడ్డాయో తరచిచూసుకున్నాను. సరోజకు నేను తగినవాడిని కాదా .. ఎందుకిలా చేసిందామె? ప్రేమంటే శారీరక సుఖం మాత్రమేనా? తనలో లేనిది కృష్ణమాచార్యుడిలో యేమి చూసింది. అతను తనకన్నా అందగాడూ కాదు చదువరి ఆస్థిపరుడు కూడా కాదు. కేవలం మాటకారి. ప్రతి వేసవిలో ఉగాది నుండి నలబై వొక్క రోజులపాటు నిత్యం హరికథా కాలక్షేపం చెప్పడానికి  వూరికి వస్తాడు. అతనికి వసతి భోజన సౌకర్యం ఏర్పాటు చేసానంది అక్క. మంచి పనే కదా అందునా సహ బ్రాహ్మణుడికి సాయం చేయడం అనుకున్నాను. మొదట ఆడపిల్ల పుట్టింది సరోజకు. నాలుగేళ్ళ వరకూ మళ్ళీ యే విశేషంలేదు. తనూ వ్యాపారం వృద్ధి చేయాలని యెక్కువ కాలం బయట గడుపుతున్నాడు. భార్యభర్తల మధ్య ప్రేమ అవగాహన వుంటే విరహం అదేమంత పెద్ద విషయంలే అని భావించాను. 


సరోజ అతని ఆకర్షణలో పడింది. అక్క కూడా చూసిచూడనట్టు వూరుకుంది. వాంతులు చేసుకుంటున్న కూతురిని చూసి కొంపమునగబోతుంది అని గ్రహించి వున్న పళంగా రమ్మని తాను జబ్బు పడ్డానని వుత్తరం రాయించింది. నేను నెలరోజులు ఇంటిపట్టున వుండే విధంగా గట్టి పట్టు పట్టింది. నేను ఊటీ వెళ్ళిన నెల తర్వాత సరోజ నెల తప్పిందని ఉత్తరం వ్రాయించింది. నెలకోమారు నేను యింటికి రావడం చేస్తూనే వున్నాను.  ఏడవ నెలలోనే ప్రసవం జరిగిందని మగపిల్లవాడు పుట్టాడని తల్లిబిడ్డ క్షేమంగా వున్నారని వుత్తరం అందుకున్న నేను వెంటనే బయలుదేరి యింటికి వెళ్ళాను. బిడ్డను చూస్తే ఏడవనెలలో పుట్టిన బిడ్డలా లేడు. మా ఇద్దరిలో యెవరి పోలిక కాదు. ఏదో చిన్నపాటి అనుమానం ప్రవేశించిది నాలో. 

కృష్ణమాచార్యులు చెన్నకేశవస్వామి గుడిలో పూజారిగా కుదురుకున్నాడు. ఎక్కడ ఉరవకొండ ఎక్కడ మా వూరు. వందల మైళ్ళ దూరంలో అతను యిక్కడ వుండాలనుకోవడం యేమిటి అనుకున్నాను కానీ అపుడైనా అనుమానం రాలేదు.బతుకు తెరువు కోసం  యెవరు యెక్కడికైనా వెళ్ళాలి తను వ్యాపారం కోసం రాష్ట్రాలన్నీ తిరగడంలేదూ అని సర్ది చెప్పుకున్నాను. గౌడెన్ నిర్మించడం కోసం కొన్ని నెలలు నేను  వూరిలోనే వుండిపోయాను. కృష్ణమాచార్యులు నన్ను అన్నయ్య అంటూ అంటి పెట్టుకుని తిరిగేవాడు. అతను పెళ్ళి చేసుకుని భార్యను కాపురానికి తెచ్చుకునే వరకూ మనింట్లోనే వుండనీయి అక్కా అన్నాను నేను కల్మషం లేకుండా.  ఒకసారి సరోజ అతనితో చనువుగా మసలడాన్ని చూసి మందలించాను.  అతని తీరే అంత! అయినా నువ్వే కదరా యింట్లో తీసుకొచ్చి పెట్టావు అంది అక్క నెపం నాపై వేసి తెలివిగా.

 పెద్దవుతున్న బాబును చూస్తుంటే కృష్ణమాచార్యులను చూస్తున్నట్టే అనిపించసాగింది. వాడిని యెత్తుకుంటే యేవేవో అనుమానాలు. మనసును సంభాళించుకుని దృష్టిని బట్టి సృష్టి.  నిర్మలమైన పసివాడిపైనా నా పిచ్చి ఆలోచన. వీడు నా బిడ్డ. ఏ బిడ్డకైనా తండ్రి అంటేనే నమ్మకం. సరోజపై తనకు పూర్తి నమ్మకం వుంది. చపలచిత్తురాలన్నమాట నిజమే కానీ ఆమె నాకు ద్రోహం చేస్తుందా? నేను నెలల పర్యంతం ఇంటికి దూరంగా వుంటున్నానని బెంగ పడితే అనవసరంగా యేదేదో వూహించుకుని భయపడకు.  నేనెన్నడూ పరస్త్రీ వైపు కన్నెత్తి చూడడనని  తనకెపుడు ద్రోహం చేయనని వాగ్ధానం చేసాడన్న సంగతి గుర్తుచేసుకున్నా. సరోజ కూడా అలాగే వుంటుందని భావించి మనసు తేలిక పరచుకున్నాను. పైగా భార్యను అనుమానించడం సంస్కారం కాదని తనను తాను మందలించుకున్నాడు. గౌడౌన్ నిర్మాణం పూర్తయ్యాక మళ్ళీ వ్యాపారంలో మరింత  యెక్కువ దృష్టి పెట్టాను. ఈనాడు యిలా కళ్ళారా    సత్యాన్ని చూడాల్సివస్తుందని కలలో కూడా అనుకోలేదు.మనసు దుఃఖిస్తుంది.

 ఆనాడు వాగ్ధానమైతే చేసాను కానీ ఆమె చేత వాగ్ధానం చేయించుకోలేకపోయాను కదా. నమ్మకమే భార్యభర్తల మధ్య నిజమైన పెట్టుబడి అనుకున్నాను.. కానీ అక్కడే నేను మోసపోయాను. ఆ అవమానం సహించలేను ఆమెను క్షమించనూ లేను. ఇక ఈ జీవితానికి స్త్రీ సహచర్యం అనేది లేదు. తన మనసును  గాయపరచుకోలేడు. ఇది నా తిరుగులేని నిర్ణయం.  ఇది నా యిష్టదైవం  శ్రీరామచంద్రుని పై ఆన. 

***** ******

డైరీ చదవడం ఆపేసిన నేను ధారాపాతంగా కారుతున్న నీటిని తుడుచుకున్నాను. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకున్నాను.


‘’అబ్బాయ్.. ఎక్కడున్నావు? అమ్మమ్మను హాస్ఫిటల్ కు తీసుకెళతానని అన్నావు కానీ ఇంత వరకూ అయిపు లేవూ, మీ అక్క ఫోన్ చేసినా తీయడం లేదు. ఏం బిడ్డలు రా బాబూ.. మీరు’’..అని ఇంకేదో గొణిగింది సరోజ అమ్మమ్మ ఫోన్ లో.


‘’వస్తాం లే అమ్మా, అంతకన్నా ముఖ్యమైన పనిలో వున్నా ఈ రోజు’’ అని మామయ్య ఫోన్ కట్ చేసాడు. 


‘’తమ్ముడూ ఆండాళ్ పిన్ని ని మన దగ్గరే వుంచుకుంటే ఇంకా చాలా యేళ్ళు బతికేదిరా. మనమే ఆమెను గాలికి వొదిలేసాం’’ అని అమ్మ. 


“అవునక్కా.. అలా చేస్తే నాన్న కూడా సంతోషించేవారు. మనం అమ్మ మాటలు విని చెడిపోయాం’’ అన్నాడు మామయ్య పశ్చాత్తాపం విచారం కలబోసిన గొంతుతో.


ఇక మిగతా పేజీలు చదవకుండానే తాతయ్య ఆండాళ్ ల కథంతా నాకర్దమైపోయింది. 


డైరీ మూసేసాను. అందులో  మిగిలినవన్నీ తాతయ్య ఆలోచనలే. ఆండాళ్ గురించి వ్రాసినవన్నీ పూర్తిగా చదివేసింది. తనకు కావాల్సినది అంత వరకే! అప్పటివరకూ మా సరోజ అమ్మమ్మపై వున్న సానుభూతి అంతా  తాతయ్య వ్రాసుకున్న నిప్పులాంటి రాతల వల్ల పలుచబడిపోయింది. 


నా మనసంతా పద్మవల్లీ ఆండాళ్  నిండివుంది. ఆమె కురిపించిన అవ్యాజమైన ప్రేమలో తడిసి మునకలైన రోజులు గుర్తొస్తున్నాయి. వర్ణించలేని భావనలు యెన్నెన్నో ఆలోచనలు  నాపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. మనుషులు ఇంత గొప్పగా వుంటారా? వుంటారనడానికి సాక్ష్యం వుంది.భగవంతుడు ఒక బొమ్మను యింకొక బొమ్మతో ముడిపెట్టడంలో అశ్రద్ద చూపుతాడేమో. అందుకే బంధం ముడిపడిన బొమ్మతో తాతయ్యకు మనసింకక వ్యాకులత.మనసు ముడిపడిన మనుషుల మధ్య వున్న దూరమేమో విరహపు యాతన. శారీరక అవస్థలను అధిగమించి మనోధర్మంతో ముప్పై యేళ్ళకు పైగా  వారిద్దరూ కలిసి  విభిన్నంగా జీవించారు విస్మయపరిచారు. మానసిక బంధాలకు ప్రతీకగా నిలిచారు. ’’ కలవని తీరాల నడుమ కల కల సాగెను యమున’’  పెదవులపై పదములు నర్తించగా  చప్పున వేటూరి గుర్తొచ్చాడు.

 పద్మవల్లీ  అండాళ్ ..పైడి బొమ్మా...  ఐ లవ్ యూ సో మచ్. రామచంద్రరావు తాతయ్యా  యూ ఆర్ సో గ్రేట్. తాతయ్య డైరీని ఆరాధనగా చుంబించాను. 


*************************0******************************


#ఈస్తటిక్ _సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.

కామెంట్‌లు లేవు: