కొందరు కథకులు కవులు ప్రపంచ కథల దినోత్సవం ప్రపంచ కవితా దినోత్సవం.. అంటూ రెండూ వరుసగా వచ్చాయని వున్నాయని గుర్తు చేసారు. పాఠకుడికి రోజూ కథ కవిత దినోత్సవమే కదా! కథ గురించి రాసిన మంచి కథ గురించి చెప్పుకుందాం. .. అనుకున్నాను.
కథ అనగానే నాకు నాయనమ్మ చెప్పిన కథలే జ్ఞాపకం వస్తాయి.
నాయనమ్మా ఈ కథ నీకు యెలా తెలుసు నీకు యెవరు చెప్పారు అని అడగడం తెలియని వయస్సులో అమాయకంగా ఆమె చెప్పే కథ వింటూ.. ఆశ్చర్యపోతూ అనుమానంగా ఆలోచిస్తూ కళ్ళ మూసుకుంటే ఊహా ప్రపంచంలో అనేక దృశ్యాలు మెదులుతూ కళ్ళు తెరిస్తే అవన్నీ మాయమై అయ్యో అవన్నీ యేమైపోయాయని దిగులుపడుతూ.. మళ్ళీ యేదేదో వూహించుకుంటూ కళ్ళు మూసుకుంటే కనబడే వేరొక దృశ్యాలు నిరాశ పెడితే వుసూరుమంటూ.. నాయనమ్మ చెప్పే కథలకు ఊ కొడుతూ ఊ కొడుతూ.. నిద్రలోకి జారుకోవడం. కలల మధ్యలో పొంతనలేని కథలకు కలవరింపులతోనో గావుకేకలతో యింట్లో అందరినీ నిద్ర లేపడం... అవ్వన్నీ యిపుడు తలుచుకోవడం మధురంగానే వుంటాయి.
ఇప్పుడు నా మనుమరాలికి కథ చెబుతుంటాను. ఐ పాడ్ కనబడకపోతేనో టివీ పెట్టకపోతేనో మెల్లగా నాయనమ్మ పక్కన చేరి కథ చెప్పుకుందామా అని అడుగుతుంది. అనగనగా వొక రాజు అంట అనే కథ తనకు చెప్పడం వచ్చేసాక మరికొన్ని కథలు చెబుతుంటే ఊ హూ.. అంటూ కళ్ళు విప్పార్చుకుని చెవులు రిక్కించి శ్రద్దగా వింటూ వుంటుంది. విశ్యజనీయమైన ముచ్చట కూడా యిది..
కథ గురించి చెప్పుకుని ఆ తర్వాత కథ చదివేద్దాం
కథ మనది కాదని కొందరంటే.. భలే వారు కథ మనది కాకపోడమేమిటీ? మనమేమి కథను విదేశీయుల నుండి అరువు తెచ్చుకోలేదు. విదేశాల్లో short story పుట్టకముందే మనకు సంస్కృతంలో కథలు ఉప కథలు వుండేవనే ఆధారాలు వున్నాయని చెపుతారు. లిపి పుట్టకముందు వాగ్రూపంలో కూడా కథలు చెప్పుకునేవారు. తరతరాలుగా కథ సజీవ స్రవంతిలా ప్రవహిస్తూనే వుందని వుండబోతుందని కొందరు అన్నారు.
నేను పరిచయం చేయబోతున్న కథ “ఏ నాటికి ముగియని కథ” రచన.. యు ఆర్ అనంతమూర్తి. కన్నడ రచయిత. కన్నడంలో రాసిన యీ కథ శంకరగంటి రంగాచార్యులు తెలుగులో అనువాదం చేసారు. ఈ కథ గురించి సూచనాప్రాయంగా చదివి వెబ్ అంతా వెదికాను. ఒక కథల ప్రేమికుడు యీ కథను పంపించారు. ఈ కథలో వొక సౌందర్యం వుంది. భావుకత వుంది.తరతరాల పాటు విస్తరించిన ప్రయాణం వుంది. అదే ఈ కథను మర్చిపోనివ్వని కథగా నిలిపింది. ఇది మీ కథ నా కథ అందరి కథ. కథ చదివాక భలే వుంది కథ.. నిజమే కథ.. మన అవ్వలకు యెవరు చెప్పారో యీ కథ అనుకుంటాం..
తొంభై యేళ్ళు వున్న వొక వృద్ధుడు తన భార్య మునిమనుమడికి చెపుతున్న కథ ను వింటూ.. తన బాల్యం గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. తన మునిమనుమడు లాగే తాను కూడా అవ్వ వొడిలో పడుకుని ఆమె చెప్పే కథను వింటూ… తర్వాత ఏమైంది కథ అయిపోయిందా అని అడిగేవాడినని గుర్తుచేసుకుంటాడు. ఆమె కథ అయిపోలేదని అయిపోదు కూడా అని చెబుతూ వుంటుంది. నాలుగైదు తరాలు ఆ కథను వింటూ తన కొడుకులు మనుమనుమలు మునిమనుమలు ఆ కథ వింటూనే వుంటారని ఆ ముదుసలి భార్య కథను సాగదీసి సాగదీసి యింకా యేవో జతకూరుస్తూ కథ చెబుతూనే వుంటుందని విసుగుపడుతూనే ఆ కథ ముదుసలికి యెవరు చెప్పివుంటారు నేనే కదా చెప్పి వుంటానని యవ్వనకాలం నాటి ఆలు మగల సరాగాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. సాధారణంగా జేజమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పినట్టు కథ కంచికి మనమింటికి అని తేలికగా ముగించి పిల్లలను నిద్రపుచ్చే కథ ను ఆ అవ్వ చెప్పదు. ఆ కథ యేమిటంటే..
ఆ కథ ఒక రాకుమారుడు రాకుమారి ప్రేమను వారు మరణించాక వారిరువురు మళ్ళీ మళ్ళీ పుట్టడం ఒకో జన్మలో కలిసి వుండటం వొకో జన్మలో యెడబాటుతో దుఃఖించడం.. తో కథలో అనేక మార్పులు కూర్పులు చేరుతూ కథ సాగిపోతూనే వుంటుంది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అనురాగబంధం అది వొక జన్మతో తీరిపోయేదికాదని ఏడేడు జన్మల వరకూ అది ముడిపడే వుంటుందని అవ్వ చెప్పే కథ అంతర్లీనంగా బోధిస్తూ వుంటుంది. ఆ తర్వాత ఏమైంది కథ అయిపోయిందా అని పిల్లలు అడుగుతూనే వుంటారు. కథ అయిపోతే ఈ ప్రకృతి లో చెట్లు కాయలు కాయవు తీగలు పూలు పూయవు అని అవ్వ చెప్పే వుంటదని అది తను భార్యకు చెప్పే వుంటానని ముదుసలి పురుషుడు అనుకుంటూ వుండగా రచయిత కథ ను ముగిస్తాడు.
అనాదిగా స్త్రీ పురుషులిరువురూ వొకరి కోసం వొకరు పుడుతూనే వుంటారు. ప్రకృతిలో వివిధ రూపాల్లో జీవిస్తూ మరణిస్తూ వుంటారు.. అదొక కాల జీవ ప్రవాహం. అది కొనసాగుతూనే వుంటుంది.
కాలమూ ప్రవాహం జీవితం వెనక్కి మళ్ళటం అంటూ వుండదు అనేక మార్పులు చేర్పులు చేసుకొంటూ ముందుకు సాగిపోవడమే .. .. ఇదెన్నడూ
కంచికి చేరని కథ.. తరతరాలు వంశపారంపర్యంగా అవ్వలు పిల్లలకు చెప్పే కథ లాంటి కథను యీ రచయిత యెంత హృద్యంగా చెప్పాడో..
.
మీరూ చదవండి యీ కథ. .. ..
అనగనగా.. అనగనగా.. ఒక రాకుమారుడు ఒక రాకుమారి..
….. అంట.. కథ చదివించేది.. రేపు అంట..( పైన వున్న టపాలో.. )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి