20, మార్చి 2023, సోమవారం

ఔనా!

 ఔనా!    -వనజ తాతినేని. 

పన్నెండేళ్ళుగా  మెదడు  నిండా ఓ పాత్రను మోస్తున్నాను. అప్పుడామె తన కథను చెపుతున్నప్పుడు  కనులు పెద్దవి చేసి చెవులు రిక్కించి ఆశ్చర్యంతో రోమాలు నిక్కబొడుచుకున్నట్లు జ్ఞాపకం వుంది. ఇదంతా ఆమె చెప్పిందా నేను  నిజంగానే విన్నానా అనుకుంటూ   నన్ను నేను గిల్లి చూసుకున్నాను కూడా. స్త్రీ పురుష సంబంధాల గురించి లోతుగా ఆలోచిస్తున్నప్పుడల్లా ఆ పాత్ర   గుర్తుకొస్తుంటుంది. గుర్తుకొచ్చినప్పుడల్లా రెండు మూడు రోజులు ఆలోచిస్తూ వుంటాను. మరి ఆమె చెప్పిన విషయమైతే సామాన్యమైన విషయంలా నేను భావించలేదు మరి. 


ముఖ్యంగా కథ రాయాలి అనుకున్నప్పుడల్లా నన్ను గురించి రాయి అని ఆమె అడుగుతున్నట్లే వుండేది.  రాసే సాహసం చేయలేదు అనను కానీ రాయకూడని విషయాలు కొన్ని ఉంటాయని గిరిగీసుకుని కూర్చున్నాను. సాధారణంగా  ధనబలం వుండి ఎవరేమనుకుంటే నా కేమిటి నా జీవితం నా ఇష్టం అనుకుంటూ జీవితం పట్ల  అమితాసక్తితో  విచ్చలవిడిగా విహరించేవారిని  మనం చూస్తుంటాం కదా ! ఆ కోణంలో చూస్తే ఆ పాత్ర అంత నాగరిక జీవనంలో జీవించిన పాత్రా కాదు. పెద్ద చదువుసంధ్యలున్న స్త్రీ లా కూడా అనిపించలేదు.  అలా అని ఆమె కడు పేదరికంలో జీవనం కొనసాగిస్తూ అవసరాల కోసం శరీరాలను ఫణంగా పెడుతూ  నిర్లక్ష్యంగా బ్రతికే తెగువ కల్గిన పాత్రా కాదు.  ఈ రెండు రకాల మధ్య గల మధ్యతరగతి జీవితం గడిపే కుటుంబ స్త్రీ అంత నిర్భయంగా నిస్సంకోచంగా   మసలగల్గినదంటేనే ఆశ్చర్యం నాకు. ఇప్పుడిక కథలోకి వెళదాం.


**************


పన్నెండేళ్ళ క్రితం వారం రోజుల్లో అమెరికాకు ప్రయాణమవుతున్న కొడుకును తీసుకుని శ్రీశైలం వెళ్ళాను నేను.  మధ్యాహ్నం పన్నెండుకల్లా అక్కడకు చేరుకున్న మాకు వసతి సౌకర్యం లభించేసరికి రెండుగంటల సమయం పట్టింది. మర్నాడు గురుపౌర్ణమి. పుణ్యక్షేత్రాలన్నీ రద్దీగా వుంటాయన్న సంగతి మర్చిపోయాను. ఎప్పుడూ విడిది చేసే సత్రానికి వెళ్ళి రూమ్ అడిగితే ఎంతమంది అడిగాడు. నేను అబ్బాయి అనగానే మా వంక పట్టి పట్టి చూసి కాసేపు ఆగండి అన్నాడు. అరగంట వేచివున్నా మాకన్నా వెనుక వచ్చినవారికి రూమ్ లు కేటాయిస్తూ మమ్మల్ని అలాగే నిలబెట్టాడు. అతని వద్దకు వెళ్ళి గోత్రం పేరు ఇంటి పేరు చెప్పాను. “ఖాళీ లేవమ్మా, ఇద్దరు వుంటే అసలు ఇవ్వడం లేదు” అన్నాడు. అబ్బాయి వంక నా వంక అతను చూసే చూపులు నాకు అవమానంగా అనిపించేయి.


 స్నేహితురాలికి ఫోన్ చేసాను. ఆమె బంధువులు ఎవరో వున్నారని తెలిసి,మాట సాయం చేస్తారని.  అప్పుడు ఆమె మాటలు వింటే నేను అబ్బాయి మాత్రమే ఎందుకు వచ్చామా అని చింతించాను. తల్లి కొడుకు కలిసి వెళ్ళినా అనుమానంగా చూసే రోజులు వచ్చేసాయి. పుణ్యక్షేత్రాల పవిత్రతను చెడగొడతన్నారని ఎవరికి పడితే వారికి రూమ్ లు ఇవ్వడం లేదంట. ఇరవై రాకముందే బిడ్డలు పుట్టి వాళ్ళు తాటిచెట్లలా పెరిగితే మనం నలబైల్లో వుండి వాళ్ళకు అక్కల్లా కనబడతన్నాం. నలుగురైదుగురు వుంటామంటే తప్ప ఇద్దరికి మాత్రం రూమ్ లు ఇవ్వడం లేదంట”అంది. 


“అమ్మ కొడుకు అని నిరూపించడానికి ఆధారాలు కూడా పట్టుకెళ్ళాలా.. ఆ సంగతి తెలిసి వుంటే అబ్బాయి పాస్ పోర్టు, రేషన్ కార్డు తెచ్చుకునేదాన్నిగా అని విసుకున్నాను. సత్రం రిసెప్షన్ లో రూమ్ లు ఇచ్చేవాడు  పిల్లాడిని నన్ను ఎంత  అనుమానంగా చూసాడో తెలుసా! ఎంత అవమానం అనిపించిందో నాకు. ఇంకెప్పుడూ ఈ సత్రానికి రాను. విరాళాలు రాయను” అన్నాను చికాకుగా. 


అక్కడి నుండి గంగ సదన్ కి వచ్చి రూమ్ తీసుకుని ప్రెష్ అయి భోజనానికి వెళ్ళడానికి కిందకు వస్తుండగా ముందెళ్ళిన  సత్రం గుమస్తా ఎదురై “ఇందాక పొరబాటు జరిగిందమ్మా, క్షమించాలి మీరు. భోజనానికి మన సత్రానికే రావచ్చు. ఇక్కడ ఖాళీ చేసి అక్కడికి వస్తే ఏసి రూమ్ ఇస్తామన్నారు” అన్నాడు.


 స్నేహితురాలి ఫోన్ సిఫారసు ఫలితం అని అర్థమై “వద్దులెండి. మీ రూల్స్ ఏమిటో తెలిసాయి కదా. ఈ సారి వచ్చినపుడు అన్ని వివరాలు తెలిసేటట్టు ఆధారాలు వెంట తెచ్చుకుంటాం అన్నాను విసురుగా. అసలు అబ్బాయి ముందు అలాంటి విషయం వొకటి చర్చకు రావడం నాకు ఇష్టం లేకపోయింది. 


ప్రదోషసమయంలో  మల్లికార్జునుడి దర్శనం అమ్మ వారి హారతి ప్రాతఃకాల అభిషేకం అమ్మవారికి కుంకుమ పూజ అన్నీ ప్రశాంతంగా జరిగిపోయాక.. నేను గుడిలో ప్రదక్షిణలు చేసుకుంటాను వస్తావా అని అడిగాను అబ్బాయిని. “రాత్రి సరిగ్గా నిద్రపోలేదమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వు తీరిగ్గా ప్రదక్షిణలు చేసుకుని రా” అని రూమ్ తాళం తీసుకుని వెళ్ళిపోయాడు.  నాలుగు ప్రాకారాల మధ్య చుట్టూ రద్దీగా సంచరిస్తున్న భక్తులను  తప్పించుకుంటూ  నేను కొన్ని ప్రదక్షిణలు చేసిన తర్వాత మా పక్కనే వున్న రూమ్ లో వున్నావిడ ఎదురైంది. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. పంచాక్షరీ జపిస్తూ వున్న నేను పట్టించుకోనట్టూ ముందుకు సాగాను. 


ఆమె పేరు మీనమ్మ అని చెప్పినట్టు గుర్తు. చామానఛాయ రంగుతో  కళగల ముఖంతో బలిష్ఠమైన ఆకృతితో చాలా ఉత్సాహంగా కనబడింది. మళ్ళీ తర్వాత ప్రదక్షిణలో వృద్ద మల్లికార్జునుడి గుడి దగ్గర ఎదురైంది. 


నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి పలకరించింది. ఎన్ని ప్రదక్షిణ లు చేస్తున్నారు అని. నోరు విప్పక తప్పింది కాదు. అంతటితో ఆగకకుండా  ఏ ఊరు ఏం చేస్తారు అని వివరాలు అడిగింది. చెప్పిన తర్వాత “ తన పేరు చెప్పింది.  నా వయస్సు ఎంతనుకున్నావ్ “ అని అడిగింది  నా ప్రదక్షిణకు అంతరాయం కల్గిస్తూ, నడకలో నడక కలుపుతూ. 


చిరాకు పడ్డాను.  ఆమెను అంతకు ముందు రోజు దేవాలయం పరిసరాల్లో చూసాను. రాత్రి సత్రం భోజనశాలలో చూసాను. ఉదయాన్నే పాతాళగంగకు నేను దిగుతుంటే మెట్లెక్కుతూ ఎదురైతే చిన్న చిరునవ్వుతో పలకరించాను. ఇప్పుడీమె ఎదురై ఆరాలు తీయడం ఈ అసంబద్దమైన ప్రశ్న వేయడం. అసలు ఆమెకు ఎంత వయస్సు వుంటే నాకెందుకటా అని మనస్సులో విసుక్కుంటూనే అప్రయత్నంగా నలభై నలబై అయిదు మధ్య వుంటాయేమో అని సమాధానమివ్వగానే గలగలా నవ్వింది. “ఏబై నాలుగు” అంది. ఓహో అన్నట్టు చూసానేమో! 


“కాసేపు ఈడ కూర్చుందామా “ అని అడిగింది. కాదనబుద్ధి కాలేదు. త్రిఫల వృక్షాల క్రింద చప్టాపై కూర్చున్నాం. 


“ఎన్ని రోజులైంది!? మీరొచ్చి “ అన్నాను.


 “నెలా పదిరోజులైంది”


“ఎందుకు అన్ని రోజుల నుండి వున్నారు? ఏమైనా మొక్కు వుందా  లేదా మండల దీక్ష లాంటిదా”  


పకపకా నవ్వింది. గుండె జల్లుమంది. అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. 

నిన్న సాయంత్రం రూమ్ శుభ్రం చేసే ఆమె మాటలు గుర్తొచ్చాయి.  వాళ్ళది కన్నడ రాష్ట్రం.  మనిషి చూస్తే  ఉత్సాహంగా ఆరోగ్యంగానే వుండట్టు వుంటుంది. చేష్టలు చూస్తే ఏమిటో పిచ్చి పిచ్చిగా గొణుక్కుంటూ చేతులు తిప్పుకుంటూ నవ్వుకుంటూ వుంటది. కొడుకు అనుకుంటా. రోజు రెండు పూటలా చేయి పట్టుకుని వదలకుండా తిప్పుకుంటా వస్తాడు. నలబై రోజులు నిద్ర చేస్తే పిచ్చి గిచ్చి తగ్గుద్ది ఒంటి మీద చేరిన దెయ్యాలు వొదులుతయ్యి అని చెప్పారంట. ఓపిగ్గా తిప్పుతున్నాడు బిడ్డ” అని. 


“కూర్చో బుజ్జమ్మా” అంటూ చేయి పట్టుకుని గుంజింది. బెరుకు బెరుకుగా కూర్చున్నాను. 


“నిన్ను చూస్తుంటే నా మనస్సులో వున్నదంతా విప్పి చెప్పుకోవాలని అనిపిస్తుంది” అంది. 


ఎందుకు అని అడగలేకపోయాను. మనిషి సాత్వికంగా ముఖం  పవిత్రంగా కళకళలాడుతూ వుంది.మాట్టాడకుండా ఆమె వంక నిశితంగా చూసాను.


“ నీతో వచ్చింది కొడుకా” అనడిగింది. 


“అవును, ఒక్కడే కొడుకు, వారం రోజుల్లో అమెరికా కి పై చదువులు చదవటానికి పోతున్నాడు. స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు అందుకుని పోవాలని వచ్చాం. అభిషేకం చేసుకున్నాం. స్వామి స్పర్శ దర్శనం అయింది. రాత్రికి బయలుదేరతాం” అన్నాను. 


“నాతో వుండింది నా కొడుకు అనుకొంటివా” అడిగింది. 


“అవును, అట్టాగే వున్నాడు, అలాగే అనుకుంటున్నా”


మళ్ళీ గట్టిగా నవ్వింది. నా చెవి దగ్గర ముఖం పెట్టి రహస్యం చెబుతున్నట్టు చెప్పింది. “అందరూ అనుకునేటట్డు  వాడు నా కొడుకు కాదు నా ప్రియుడు” అంది. 


ఆశ్చర్యపోలేదు వేగంగా ఆలోచించాను. సందేహం లేదు ఈమెకు నిజంగానే మతి భ్రమించి వుంటుంది. ఇంతకు ముందు తన వయస్సెంత అని అడిగింది ఇప్పుడిలా. తొందరగా ఈ మనిషిని వదిలించుకుని పోవాలి అనుకుంటూ చుట్టుపక్కల ఎక్కడైనా ఆమె కొడుకు కనబడతాడేమో అని చూపులతో గాలిస్తున్నాను. 


“నువ్వు నమ్మడం లేదు కదూ, నేను చెప్పింది నిజం బుజ్జమ్మా! దేవళంలో కూర్చుని అబద్దం ఎందుకు చెపుతాను. నన్ను నమ్ము” అంది దీనంగా.


“నీ నిజాలన్నీ నాకెందుకు, నన్ను వొదిలేస్తే నా ప్రదక్షిణ లు నేను చేసుకుంటా “ విసుగు ప్రదర్శించాను. 


“నా సొదే అనుకో నా కథే అనుకో అది కూడా వింటే నీకు పుణ్యం దక్కుద్ది అనుకో. ఇలాంటి కథ నువ్వెప్పుడూ విని వుండవు’’ అని ఊరించింది.


కథలంటే ఇష్టం కనుక “సరే చెప్పు మరి”అన్నాను వింటే కానీ వొదిలి పెట్టేటట్టు లేదని. 


“నేను  కాపు బిడ్డను. నెల్లూరు ఆత్మకూరు కాడ చిన్న పల్లె. పద్నాలుగేళ్ళ వయస్సుప్పుడు    రాయచూర్ కి వలసబోయిన కుటుంబంలో వాడికిచ్చి పెళ్ళిజేసారు. వొళ్ళు ఇరగ పనిచేయడం మొగుడు చెప్పినమాట ఎదురుచెప్పకుండా ఇనడం. మోటుమనిషి. ముగ్గురు బిడ్డల తల్లినయ్యానన్నమాటే కానీ  నేను మనసు నిండా సుఃఖ పడిందే లేదు. భర్త ప్రేమ దక్కిందే లేదు. అంతా అతుకుల బొంతే అనుకో. మన పెద్దాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే.. అందరూ అని కాదులే.. మా తాత లాంటోళ్ళు అనుకో ’’


చెప్పడం ఆపి కాసిని నీళ్ళు తాగింది. కథ వినే ఉత్సాహంలో ఆలస్యం భరించలేకుండా వున్నా నేను. 


“మా తాత పెద్ద కవి లే. కవిత్వం రాసేవాడు. గజళ్ళు చదివేవోడు. అందరికీ నోరార విప్పి చెప్పేవాడు. జమీన్ & రైతు చదివి వినిపిస్తా వుండేవాడు. మా నాయన చిన్నగా వున్నప్పుడే మా అవ్వ చనిపోయిందంట. మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా నలుగురు బిడ్డలను సాకినాడు. రోజూ ఆయన  వొళ్ళో కూర్చుని ఇన్న మాటలే అనుకో, బాగా గమనం వుండాయ్. ఇట్టా అనేటోడు “ బొట్టా! మనిషన్న  వాడికి జీవితంలో అన్ని దశల్లోను ప్రేమ శాంతి దొరకాలి. సముద్రం నుంచి కొంత, అడవి నుంచి కొంత, నాయన నుంచి కొంత, అమ్మ నుంచి కొంత, సేయితుల నుంచి కొంత, భర్త నుంచి కొంత, బిడ్డల నుండి కొంత ఇట్టా అందరి నుండి కొంత కొంత గ్రాసం ప్రేమ జవురుకుంటే కానీ ఈ కట్టె చల్లారదు” అని. 


“ఆయనెందుకు చెప్పాడో కానీ ఆయన చెప్పినవేమి నాకెప్పుడూ దొరకలేదు. ఆకులుపోకలు అందుకున్నప్పుడు నుండి ఎదురు చూపే మిగిలింది. మొగుణ్ని మనసు నిండా కరువుదీరా కౌగలించుకున్నదే లేదు. ఈ ఆకలి శరీరానిది కాదు మనసుది. బిడ్డల పెళ్ళిళ్ళై మనవళ్ళు మనవరాళ్ళు పుడుతున్న కొద్దీ ముసలిదాన్ని అయిపోతన్నాను నా మనసు ఆకలి తీరకుండా ఏడ చచ్చిపోతానేమోనని వొకటే దిగులయ్యేది. నేను మాత్రం జీవమున్న ప్రతిదాన్ని నిండా కావిలించుకుంటాను. పిల్లలు, పిల్లల పిల్లలను,దూడను  పెయ్యను కుక్కను మేకను పిల్లిని ఆఖరికి అంతంతలావు మానులను కూడా వాటేసుకుంటాను.అయినా మనసుకు నెమ్మది లేదు. కంటినిండా నిదుర పట్టేది కాదు. ఆఖరికి నా ఆకలిని కనిపెట్టినవాడు ఒకడు కనిపించాడు. కుడియెడంగా నా కొడుకు వయస్సు వున్నవాడు. వాడిని తగులుకున్నాను. తప్పా ఒప్పా అని ఆలోచించలేదు నేను. శరీరానికేనా భోగానుభవం మనస్సుకు ఉండొద్దూ. ఆకలిగా వున్నప్పుడు అందుబాటులో వున్నది తిని ఆకలి తీర్చుకున్నట్టు మొగుడు పెళ్ళాం మధ్య  కాపురం సక్రమంగా  వర్దిల్లినా  వాళ్ళ మధ్య గాఢానురాగం లేకపోతే అది ఓటి కుండ లెక్క. నలబై ఏళ్ళ కాపరంలో మొగుడి గుండెల మీద పడి ఆదమరించిది లేదు. నా మనస్సు సేదదీరింది లేదు. కంటికి కనబడని నరమానవుడికి తెలియని వియోగ దుఃఖం ఏదో  ఎప్పుడూ నన్ను అతుక్కొని వుండేది.  అందుకే దైర్యం చేసా. ఈ నలబై రోజులు వాడు నన్ను ప్రియంగా చూసుకున్నాడు. వాడు నా ఆకలిని గుర్తించాడో అశాంతిని కనిపెట్టాడో ఆర్తిని అర్దం చేసుకున్నాడో కానీ నలభై రోజుల నుండి మరో లోకం చూయిచ్చాడు. స్వర్గం అంటే ఇట్టాగే వుంటదేమో అనిపించింది అనుకో. ఇప్పుడు నా మనసుకు తృప్తిగా నెమ్మళంగా వుంది. ఇట్టా చేసినందుకు నేనేమి సిగ్గుపడటం లేదమ్మాయ్! పాపభీతి బిడియం నన్నేం తరుముకొస్తలేదు. దేవుడు సాచ్చిగా చెబుతున్నా, నువ్వు నమ్మాలి” అంది. 


ఆశ్చర్యమో అసహ్యమో అయోమయమో ఏమో తెలియదు. ఇది నిజమా అబద్దమా అన్న ఆలోచనా లేదు. నోట మాటరాలేదు. ఎలాంటి మనిషిని విన్నాను. ఇంత దైర్యమా, తెంపరితనమా! పైగా అపరిచితురాలినైన నాకు కూర్చోబెట్టి మరీ చెపుతుంది అని నివ్వెరపోయి కళ్ళు విప్పార్చుకుని ఆమెనే చూస్తూ..  ఔనా! అని మాత్రం అనగల్గాను. 


మళ్ళీ చెప్పడం మొదలెట్టింది. 

“మొన్న మా ఊరు వాళ్ళు కనబడ్డారు. ఊరంతా గోలగోలగా వుంది. నువ్వు ఈడ వుండావా అని ఆశ్చర్యంగా అడిగారు. ఈపాటికి నేను ఈడ వుండానని నా కుటుంబానికి ఉప్పు అందేవుంటంది. నా మొగుడో పిల్లకాయలో రేపో మాపో వచ్చి ఇక్కడ వెతుకుతారు. నన్ను తీసుకునిపోతారు. పరువు కోసం అసలు విషయాన్ని  గంప కింద దాపెట్టి   తీర్ధయాత్రలకు వెళతానంటే   వద్దంటున్నామని ఎవరితో చెప్పాపెట్టకుండా   గుళ్ళు గోపురాలు చూడటానికి  పోయిందని  అని చెప్పుకుంటాడేమో నా మొగుడు”  చెప్పడం ఆపి మళ్ళీ గల గలా నవ్వింది. 


“ఒకవేళ ఇదంతా తెలిసి ఈ ముసలిముండకు రంకు మొగుడు కావాల్సొచ్చిందా అని కోడళ్ళు అసహ్యించుకున్నా, కూతురు చీదరగా చూసినా, జవసత్వాలు చచ్చిన మొగుడు రొప్పుతూ కాళ్ళతో కుమ్మినా లెక్కపెట్టేదే లేదు. ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు నాకు  కావాల్సింది నాకు దక్కించుకున్నాను. ఈ తృప్తి చాలు నాకు “ అంటూ గర్వంగా సంతృప్తిగా నవ్వింది. 


నేను నోటమాట రాక వింటూ వుండిపోయాను.


ఇంకో సంగతి చెప్పనా నీకు, ఇక్కడ నిత్యం  పాతాళగంగకు పోయి పచ్చలబండను చూసివస్తాను. ఎందుకో తెలుసా! కూతురిని మోహించిన రాజు ని పచ్చలబండవై పడివుండమని శపించింది అంటగా. మరి నేను కొడుకు వరుసయ్యే వాడిని మోహించాను కదా! లోలోన నేను ఏ బండను అవుతాననే భయం అనుకుంటా.  మనిషి బతికివుండగానే కోరికతో పెయ్య కాలుతుంటే చచ్చినాక వచ్చే పాపపుణ్యాల గురించి చింత ఎందుకంటా అంటా నేను. నువ్వు ఏమన్నా అనుకో,ఎవురికో వొకరికి నా లోపలి బాధ చెప్పుకోకపోతే కుమ్మరి పురుగు తొలిచినట్టు మెదడును ఈ విషయం తొలిచేత్తా వుంటంది. అందుకే చెప్పుకుని తెరిపిన పడ్డా. ఇప్పుడు మనసంతా తేలిగ్గా వుంది” 


వింటున్న నాకు ఆమె చెప్పిన విషయం జీర్ణం కావడానికి సమయం పట్టేట్టు అనిపించింది. ప్రశాంతంగా ప్రదక్షిణలు చేసుకుంటూ వున్న నన్ను కదిలించి మరీ  ఒక విధమైన షాక్ యిచ్చింది. 


“వస్తాను బుజ్జమ్మా! వాడు కూడా బయలుదేరతానంటున్నాడు. పెళ్శి కావాల్సిన పిల్లోడు. వాడన్నట్టు  రేపో మాపో మా  వాళ్ళ కంటబడి నలుగురు నోళ్ళల్లో నానడం ఎందుకు చెప్పు? నేను కూడా ఈ రూమ్ ఖాళీ చేసి మా కన్నడ సత్రంలో రూమ్ తీసుకుంటా. పోయొస్తా! రహస్యాలు నేను దాచుకోలేనబ్బా పొట్టపగిలిపోద్ది” గలగలా నవ్వుకుంటూ వెలుపలి ద్వారం వైపుకు నడుచుకుంటూపోయింది. 


ఆ క్షణంలో విచిత్రంగా ఆమె పట్ల నాకు అసహ్యం కల్గలేదు. అభావంగా ధ్వజస్థంభం దగ్గరకు చేరుకుని చేతులు జోడించి నమస్కరించుకుని తిరిగి ప్రదక్షిణ ప్రారంభించాను. 


నేను రూమ్ కి చేరేసరికి మీనమ్మ రూమ్ లో పిల్లలతో కూడిన కుటుంబం కనబడింది. 


రాత్రి బస్టాండ్ లో  మీనమ్మ ఇద్దరు ముగ్గురు మనుషుల మధ్య కూర్చుని తనలో తనే మాట్టాడుకుంటూ తేడాగా నవ్వుకుంటూ చెదిరిన బొట్టు చిరిగిన జాకెట్ తో కనబడింది. ఆమెనే చూస్తున్న నన్ను చూసి నవ్వింది. 

విషయం అర్ధమై పలకరిద్దామని దగ్గరకు వెళ్ళాను. కన్నడ యాస తెలుగు లో  “అమ్మా, కాస్త దూరంగా వుండమ్మా,ఆమె కు మైండ్ సరిగా లేదు, మనుషులను కొడతంది రక్కుతుంది’’ అన్నాడు వయసు మళ్లి తల నెరిసిన అతను.


నేను మీనమ్మ వైపు అనుమానంగా చూసి వెనక్కి జరిగాను. 


“అవును,నేను కొడతా,తిడతా,రక్కుతా,  అంతా నా ఇష్టం. నువ్వు నా పతి దేవుడివి పతి దేవుడివి,పతిదేవుడివి, సుగంధం తెలియని రాతి దేవుడివి” రాగం తీసింది.


“నెలన్నర అయింది ఇల్లు ఇడిచి. ఏడేడో తిరిగాం. ఆఖరికి ఈడ దొరికింది. పిచ్చి ముదిరిపోయింది” అన్నాడు. మనసులో నవ్వుకున్నాను.


మేము ఎక్కిన బస్ కదిలేటప్పుడు విండో సీట్ లో కూర్చున్న నన్ను చూస్తూ.. 


“ బుజ్జమ్మా, నన్ను గుర్తుంచుకో, టాటా’’ అని చెయ్యి వూపింది.నేను చెయ్యి ఊపాను. “ నువ్వు పిచ్చి వాళ్ళతో కూడా ఫ్రెండ్ షిప్ చేస్తావమ్మా” అన్నాడు నా కొడుకు నవ్వుతూ.


************

కథ అయిపోయింది. 


ఆనాడు ఆమె చెప్పిన విషయం సామాన్యమైన విషయం కాకపోబట్టే  ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆలోచించి చూస్తే.. అదొక ఆశ్చర్యకరమైనదిగా తోస్తుంది. 


మీనమ్మ కోణంలో  నుండి చూస్తే ఏది పవిత్రం, ఏది పాపం ఏది పుణ్యం.  ప్రతి మనిషి కోర్కెల పుట్ట. ఆ పుట్టలో నిదురించిన సర్పాలెన్నో! అవకాశం దొరికిన చోట దైర్యం వున్నవాళ్ళు పాపపుణ్యాల భీతి లేనివారు బిడియాలను సంకోచాలను వొదిలి తమకు కావాల్సింది పొందుతారు. మిగిలిన వారు నీతినియమాల పేరిట వారిపై కొరడా ఝళిపించాలనుకుంటారు. 


సహజీవనాలు తప్పుకాదు అని చెప్పుకుంటున్న ఈ కాలంలో మీనమ్మ ను నేనెలా తప్పు పట్టేది? అలాగని ఎలా సమర్దించేది!? వావివరుస లేకుండా బాబాయి కొడుకుతో అక్రమ సంబంధం నెరిపే బంధువుల అమ్మాయిని చూస్తూ,  సొంత పిన్ని కూతురినే గర్భవతిని చేసిన ఇంజినీరింగ్ చదివే యువకుడు గురించి విని.. ఏమిటీ కాముక లోకం! ఎక్కడుందీ లోపం!? అమలిన శృంగారం గుమ్మరించిన పూర్వ కథలు హాస్యాస్పదం అని పిల్లలకు  సెక్స్ ఎడ్యుకేషన్ ముఖ్యమని వాదించే వారిని చూస్తూ  సెక్స్ ఎడ్యుకేషన్ పోర్న్   ఒకటి కాదు అని వొప్పించడానికి ప్రయత్నించే నేను ఈ కథ కాని కథ గురించి రాయటానికే సంసిద్దురాలినయ్యాను. విజ్ఞత విచక్షణ వున్నవాళ్ళు ఎప్పుడూ వుంటారు. అవి లేని వారి గురించే మనం జాగ్రత్త పడాలి. చలం రాజేశ్వరి ని దాటి మనం చాలా ముందుకువచ్చాం. రాయడానికి చర్చించడానికి ఇంకా సంకోచాలు వుంటే ముందు ముందు లోకం ఏమికానున్నదో. మీనమ్మ భర్త లాంటి భర్తలకు భార్యల హృదయాన్ని టార్చ్ వేసి చూపించాలి కదా! 


విలువలు మారుతున్నప్పుడు రచనలు కూడా మారాలి కదా! మంచినీళ్ల ప్రాయంగా  ఎల్లప్పుడూ నీతులు వల్లించడం  ఏదైతే వుందో అది మురుగునీటి గుంటను శుభ్రం చేయాలనుకుని అందులో గంగాళం మంచినీటిని గుమ్మరించినట్లు వుంటుందని నాకనిపించింది. 


అందుకే  మీనమ్మ కథ ఇప్పుడిలా మీ ముందుకొచ్చి కూర్చుంది. పన్నెండేళ్ళు నా ఆలోచనల్లో మోసిన బరువును మీరు మోయాలిపుడు. అన్నట్టు మీనమ్మ ను వొకటి అడగడం మరిచాను. మీరు పుస్తకాలు చదువుతారా, మీ తాతగారు చలం పుస్తకాలు కానీ మీతో చదివించారా అని. ఆమె చలం పాత్ర అనిపించింది మరి. ఆమె ఎక్కడైనా ఎదురైతే మీరీ విషయం అడగడం మర్చిపోవద్దే. 


****************౦*****************


#ఈస్తటిక్_సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.


కామెంట్‌లు లేవు: