వనజవనమాలికథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వనజవనమాలికథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, డిసెంబర్ 2023, శనివారం

నీరెండ చాయల్లో


 నీరెండ ఛాయల్లో (An Inner Battle story)


జీవితానికి అవసరమైనది వాస్తవమే అయినప్పటికీ అప్పుడప్పుడూ ఊహల్లో బతకడం ఆనందం కల్గిస్తుంది. చెద పురుగు తొలుస్తుందేమో అన్నట్టు ఆలోచనలు కుట్టి చంపుతున్నప్పుడు నిద్ర లేచిన ఓ ఊహజనిత ఉన్మాదం  జీవితాన్ని కూడా గాడి తప్పిస్తుంది. ప్రస్తుతం నేను అదే స్థితిలో వున్నాను. 

కిటికీ అద్దాల బయట మేఘాలు భీకరంగా దుఃఖిస్తున్నాయి. భూమి సంతోషంగా నవ్వుతున్న సంగతిని క్షణాలపాటు టార్చ్ లైట్ వేసి చూపించింది మెరుపు. ఉరుము శబ్ధంలో అవమానం అవమానపడింది.  జేవురించిన కోపంతో మేఘాలు మరింత వర్షించాయి. భూమి తల్లిలా  కరిగి సముద్రుడి వైపు దోవ చూపించింది. మేఘాలు తండ్రిని చేరుకుని గాఢ పరిష్వంగం లో ఊరట పొందాయి. చిన్నగా నవ్వుకున్నాను. వాడు కూడా నవ్వాడు..  

ఉత్తరపు వైపు కిటికీ తెరిచాను.గాలి స్నానం చేసినంత హాయిగా వుంది. ఆయనవెరో చెప్పాడు స్నానాలు కూడా ఐదు రకాలని. స్నానం చేయడానికి షవర్ క్రింద నిలబడి నీళ్ళు మీద పడకుండా పడుతున్న ధారలన్నింటిని మగ్ లోకి నింపుకుని ఒంటిపై వొలుపుకోవడం అదొక పని లేని వ్యాపకం. ఒక్కో ధార తనకు ముఖ్యులైన పరిచయం వున్న వ్యక్తుల ఆలోచనలే అయినట్టు అవి ప్రవాహంలా మారి తనను తడిపేస్తున్నట్లు.. తనను అలా తడపడానికి వారికి ఏం హక్కుంది!? అందుకే వారందరిని మగ్ లోకి వొడువుగా వొడిసి పట్టి గుమ్మరించుకోవడం అనే ఊహ నాకు అమితానందం కల్గిస్తుంది. నన్నే తడుపుదామనుకున్నారా, చూసారా..మీ అందరినీ కలిపేసి కలగాపులగం చేసేసి మీ తిక్క ఎలా కుదిర్చానో.. అంటాను. 

భలే వాడు వీడు అని వాడూ పగలబడి నవ్వుకుంటున్నాడు. నేను మరింత నవ్వుకుంటూనే బట్టలు ధరించి వ్యాహాళికి బయలుదేరాను. వీధి మలుపు తిరిగాను.ఖాళీ అరుగు కనబడింది.  ఆరాగా చూస్తున్న వాడికి చెప్పాను. 

ఆ ఇంటి అరుగుపై కూర్చుని వచ్చేపోయే బాటలారులను పలకరిస్తూ నిలబెట్టేసి ఆరాలడిగి  బంకసాగుడు మాటలతో కాలక్షేపం చేసే పెద్దామె మరణించిందట అని. “అయ్యో అవునా” అన్నాడు విచారంగా. ఆ వార్త వినగానే నీ ఫీలింగ్ యేమిటో? ఆరా తీసాడు. 

“కొత్తగా యేముంటుంది?  తెలియగానే కాసేపు నిజంగానే విచారం. అంతలోనే ఒక తుస్కారపు ఆలోచన. పోతే పోయిందిలే, బ్రతికి ఉద్దరించేది ఏముంది గనుక? పనులపై వెళ్ళేవాళ్ళను ఆపి విసిగించడం తప్ప.” అనుకున్నానని చెప్పాను. 

వాడు విని మౌనంగా వున్నాడు. 

“ఇపుడెవరిని విసిగిస్తదో మరి.  పాపం పుణ్యం తక్కెడలో ఆమెక్కడో.. అదో చిదంబర రహస్యం కదా!” అని అడిగాను.

మళ్ళీ వాడు మౌనమే.

వాడిక నాతో మాట్లాడడు. దిక్కులు చూసాను.నాలా వ్యాహాళికి బయలుదేరిన నలుగురు కలిసారు. ఆరోగ్య అవగాహన వీడియోల్లో చెప్పబడిన విషయాల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడి అరెస్ట్ వరకూ అదానీ కంపెనీల షేర్ ల పతనం నుండి అనంతపురంలో సాగుతున్న పాదయాత్ర వరకూ చర్చించుకున్నాక అలుపొచ్చి యింటి దారి పట్టామందరం. 

వాడు నాతోపాటు లోపలికి వచ్చాడు. 

అలవాటుగా తినాలి.అధరువు గా వండి పెట్టేవాళ్ళు లేకపోయాక తప్పేదేముంది? 

“తప్పించుకున్నన్నాళ్ళు తప్పించుకోలేదేమిటీ? నిన్నెవడు వండమన్నాడు యిది, అంటూ చేయి విసిరింది మర్చిపోకు” గుర్తు చేసాడు వాడు. 

“ఏడిసావులే.. నోర్మూసుకుని వుండు. వంటేమన్నా బ్రహ్మ విద్యా!?” కసిరాను వాడిని. 

ధార కింద గిన్నె పెట్టి అది సగం నిండే సమయానికి డబ్బాలో బియ్యం తెచ్చి గిన్నెలో వేయాలి. అదీ లెక్క. ఆ లెక్క సరిగా పాటించబోయి పట్టు దప్పి ఇరవై గింజలదాకా సింక్ పాలు. 

వెంటనే వాడు మౌనం వీడి “యిప్పుడు నీకు ఆ ధాన్యం పండించే రైతు గుర్తుకు రావాలి అతని పట్ల గౌరవం ఉప్పొంగాలి” అన్నాడు.  

“అబ్బే అదేంలేదే, నేను తినే తిండిలో కొంత తగ్గుతుందే అనుకుంటున్నా” అన్నాను.

“మనుషులను అంతగా ద్వేషించకు తట్టుకోలేరు.. అవసరం లేకపోయినా ప్రేమించినట్లు నటించు. కొన్నాళ్ళకు పండిపోతావు నటిస్తున్నానని నువ్వు కూడా మర్చిపోతావు” అన్నాడు వాడు. అంగీకరించాను. కానీ ఆ విషయం వాడికి చెప్పను. గ్రహిస్తాడు కదా, నాకు నోరు నొప్పి యెందుకంటా!. 

లేత రంగుల కర్టెన్స్ కదలాడుతుంటే మనసు కదులుతుంటుంది కాంచన కోసం. నీలిమబ్బు దుప్పటి పరిచిన మెత్తని శయ్య నిండుచందమామ లాంటి దిండ్లుతో దశాబ్దాల అలసటను తీర్చడానికి తయారుగా వుంచి.  రా.. రమ్మని ఆహ్వానిస్తుంటే చూడనట్లు నటిస్తుంది. ప్రతిది ఆమెకు నచ్చేటట్టు శ్రద్ద తీసుకుంటాను. గుత్తులు గుత్తులుగా పూచే కస్తూరి పూలను తీసుకొనివచ్చి గాజు ప్లవర్ వేజ్ లో అలంకరిస్తాను.  ఈ మధ్య ఆమె వొచ్చినపుడు  కొత్తగా అలాంటి పరిమళమేదో చుట్టుముట్టినట్టు ఉంటుంది గనుక. డ్రాయింగ్ రూమ్ వరకూ మాత్రమే పరిమితమైన  పరిమళాన్ని బెడ్ రూమ్ వరకూ విస్తరింపజేసుకుని ఊహలో బ్రతుకుతుంటాను. అరమరికలు లేకుండా ఆమె వస్తానంటుందేమో అని ఆశ పడుతుంటాను. 

 ఇప్పుడైతే షరతులు వుంటాయని గుర్తు చేస్తాడు వాడు. “అంధకారంలో తవుళ్ళాట యెందుకు?  చిత్తశుద్ది లేదు నీకు” అని ముల్లుగర్రతో పొడిచాడు కూడా. 

అడిగేద్దాం తాడోపేడో తేల్చేసుకుందాం అని వడి వడిగా కాంచన  ప్లాట్ ముందుకు వెళ్ళి బెల్ మోగించాను. స్నానం చేస్తూ వుండొచ్చు. వచ్చి తెరుస్తుందని అక్కడే నిలబడి పది నిమిషాలు తర్వాత మళ్ళీ మోగించాను.” నేను ఇక్కడ” అంటూ వెనుక నుండి పలకరింపు. పక్కకు తొలగి నిలబడితే తాళం తీసి తలుపు తెరిచింది. 


“అల్లం చాయ్ తాగుతారా, రండి. “  ఆ పాటి పలకరింపుకే అనురాగ గంగ ఉబుకుతుంది నాలో నేనా..  లేక కాంచన లోనా.  అందుకే ఆహ్వానమా?


“భోజనం రెడీగా వుంది” అంటూనే మెల్లిగా అనుసరించాను. 

బేగ్ సోఫాలో పడేసి వాష్ రూమ్ కి వెళ్ళింది. ఎదురుగా ఉయ్యాల బల్లపై బోర్లా పడి వున్న డైరీ.. పక్కనే పెన్. ఆమె గుణ శీలాలు గురించి కూపీ లాగబోయాను.

చేతిలోకి తీసుకోబోతే వాడు వద్దు వద్దు అంటున్నాడు. కళ్ళు

అక్షరాల వెంట కిలోమీటర్ల వేగంతో పరుగు పెడుతున్నాయి. 

“అనురాగమా! సప్తవర్ణపు సూర్య కిరణమై నువ్వు నన్ను తడుముతుంటే మనఃకమలం వికసించక ఊరుకుంటుందా! ఇంకా దాగుడుమూతలాట యెందుకు? 

కవిత్వమా ప్రేమలేఖా!  నిశ్శబ్దపు అణుబాంబు పేలింది నాలో.

ఇంకా చదవబోయాను. తలుపు చప్పుడై చప్పున డైరీ అక్కడ పెట్టి వెనుదిరిగి “ఏదైనా నవలేమో అని చూసాను”. ఆత్మవంచన తన విశ్వరూపాన్ని యెక్కడైనా చూపవచ్చని అనుకుంటూ.  

నవ్వింది. చల్లటి నీరు గ్లాస్ లో పోసి .. కావాలా అన్నట్టు చూసింది. తల అడ్డంగా ఊపాను. 

వాడు చెబుతూనే వున్నాడు వద్దు వద్దు అని. వాడి మాట వింటే బావుండేది. స్నాక్స్ తెచ్చిచ్చి యెదురుగా కూర్చుంది. మాట పెగలడం లేదు. లోతుగా పరిశీలన చేస్తున్నట్లు వున్నాయి చూపులు. 

ఇంకా ఆమె యెదురుగా కూర్చుని వుంటే నా వక్ర మనోభావాలు బహిర్గతమయ్యేటట్లే వున్నాయి. గొంతు పెగిలించుకుని “ఇంటి పనికి వంట పనికి వొక మనిషి కావాలనుకుంటున్నాను. మీకెవరైనా పరిచితులు వుంటే పంపరూ” అన్నాననుకొని గొణిగాను. లేచి వచ్చేసాను. కాంచన ను నువ్వు అనకుండా మీరు అనడం తెలుస్తూనే వుంది నాకు. అంత యెడం వచ్చేసిందా?

ఇంటికొచ్చాక నాలో యేవో అనుమానపు ఛాయలు  పిల్ల పాములై పిగిలిపడ్డాయి.అవి త్వరగానే పెరిగి పెద్దవై  విషనాగులై పడగలెత్తి నర్తిస్తున్నాయి. కాంచన మరో బంధంలోకి వెళ్ళబోతుందా లేకపోతే తనపై యెందుకంత తిరస్కరణ?. 

ఉన్నట్టుండి  వాడు పకపకా నవ్వసాగాడు.  

“కూలిపోయిన వంతెనలు ఎవరు నిర్మిస్తారు కొత్త వంతెనలు నిర్మించుకోవాలనుకుంటారు కానీ” అన్నాడు. 

ఎదురుగా అద్దం పట్ మని శబ్దం చేస్తూ కిందకి జారి పడింది. 

“పగిలిన వాటికి మోత యెక్కువ”  రెచ్చగొట్టినట్టు అన్నాడు మళ్ళీ వాడే. 

“షటప్” అరిచాను. 

రెండు రోజుల తర్వాత కాలింగ్ బెల్ మోగుతుంది అదే పనిగా. తలుపు తెరవకుండానే తలుపు అద్దంలోనుండి చూసాను. 

 అపరిచితురాలు. కాంతి తగ్గిన ఖరీదైన డ్రెస్ ధరించినా  పేదరికపు ఛాయలు  ఆమె ఒంటిని వొదిలిపోలేదు. నూనె రాసి బిగించి వేసిన జడ రోల్డ్ గోల్డ్ చెవికమ్మలు. వక్షస్థలం కప్పుతూ  కొంగులు ముందుకు వేసుకున్న చున్నీతో  ఒక విధమైన నిర్లక్ష్యపు ధోరణితో గుమ్మం ముందు నిలబడివుంది. తలుపుతెరిచి ఏమిటని అడిగాను.  

“పనికి, వంటకి మనిషి కావాలన్నారట. కాంచన గారింట్లో చేస్తాను. ఉదయం తొమ్మిదిన్నరకు మాత్రమే రాగలను. గరుకైన మాట తీరుతో  షరతులు చెప్పింది. అడ్డంగా తల ఊపబోయి నిలువుగా ఊపేనేమో! “రమ్మంటారా” అంటూనే లోపలికి అడుగువేసింది. 

లోపల వాడు ఫక్కున నవ్వాడు. నవ్వుతూనే వున్నాడు.   ఇల్లంతా తిరిగి వచ్చి “నెలకు ఆరువేలు ఇవ్వండి. వంట రెండు పూటలకు కలిపి ఉదయమే చేస్తాను.  రోజూ కూరగాయలు రెడీగా పెట్టాలి.”

తల ఊపాను. “నా పేరు లలిత” అంది. మళ్ళీ తల ఊపాను.  

కొన్నాళ్ళ తర్వాత “సార్ గారూ! మీరూ ఆ కాంచన గారూ భార్యభర్తలంట కదా! “ ఆశ్చర్యంగా అడిగింది లలిత. 

అవునని చెబుతూ.. మా ముప్ఫై యేళ్ళ వివాహ బంధాన్ని నేనొక  ప్రయోగం చేసినప్పటి విషయాలను జ్ఞాపకం చేసుకున్నాను.

 

*****************

 “స్త్రీలు అందంగా వుండటమే గొప్ప విషయం అనుకుంటారు. అందంతో పాటు మిగిలినవన్నీ వుంటేనే కదా సంసారాన్ని చక్కదిద్దుకుంటారు. మగవాడు అష్టకష్టాలు పడి సంపాదించి అంతా భార్య చేతుల్లో ధారపోస్తే ఇంటి పని వంట పని మార్కెట్ పనులు చేసుకోవడం పిల్లలను చూసుకోవడం పెద్దలకు  తలలో నాలుకలా వుండగల్గడం ఏమంత గొప్ప విషయమని?” అక్కసు అంతా పదునైన మాటల తూటాలుగా మార్చి  పేల్చాను చాలాసార్లు. . 

“అదే పని మీరు చేయండి. ఇప్పుడు  పిల్లల పెద్దల భాద్యత కూడా లేదు. నేను ఉద్యోగం చేసి మీరు నా చేతికిచ్చినన్ని డబ్బులు మీ చేతుల్లో ధారపోస్తాను” అంది సహనం చచ్చిన కాంచన.  

వాదన పెరిగింది. సరదాగా అనుకున్న మాటలే సీరియస్ గా తీసుకోవడం. నేను మెడికల్ లీవ్ తీసుకుని ఇంట్లో కూచోవడం.  ఆమె ఉద్యోగం వేట. 

హేళన చేసాను కానీ మహాలక్ష్మి లాంటి ఆమె రూపం డిగ్నిటీ  ప్లస్ పాయింట్ అయి ఒక ఛానల్ లో ఫ్యామిలీ కౌన్సిలర్ గా స్థిరపడిపోయింది. గుక్క తిప్పుకోకుండా యెన్నో విషయాలు మాట్లాడుతుంటే నా భార్య యేనా ఈమె అని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. 

భరించలేకపోయాను. నాఉద్యోగం నేను చేస్తాను. నువ్వు నీ ఛానల్ ఉద్యోగం మానేసి యింట్లో అదివరకటి గృహిణిలా వుంటే చాలన్నాను. కుదరదు మూడేళ్ళకు అగ్రిమెంట్ రాసాను అంది. 

కుదరకపోతే నీ దారి నీది నా దారి నాదే అన్నాను. ఆమె లక్ష్యపెట్టలేదు. నా మగవాడి అహంకారం వూరుకుంటుందా.. విడాకులిస్తానన్నాను. ఆమె ఆశ్చర్యంగా చూసింది.  ఒకే ఇంట్లో వుంటూనే విడాకుల నోటీసు అందుకుంది.  ఆ రోజే ముఖ్యమైన వస్తువులు బట్టలు సర్దుకుని వెళ్ళిపోయింది. పదిరోజుల్లో తన నగలు అమ్మేసి యెదురుగానే చివరగా వున్న ప్లాట్ కొనుక్కొంది. విడాకులకు ఆమోదించి సంతకం పెట్టేసింది.

 పిల్లలు అయినవాళ్ళందరూ ఈ వయసులో మీకిదేం పోయేకాలం, విడాకులేమిటి అని ఆశ్చర్యపోయారు, బుగ్గలు నొక్కుకున్నారు. బుర్ర తొలిచి తిన్నన్నాళ్ళు  తిని తర్వాత మీ చావు మీరు చావండని యెవరి  దారిన వారు పోయారు. కాంచన నువ్వెవరో నేనెవరో అన్నట్టు అపరిచితురాలు మాదిరి వుండసాగింది. 

తనకు బంధనాలేవో తెగిపోయి స్వేచ్ఛగా వున్న భావన. కొన్ని నెలలు బాగానే గడిచింది. స్నేహితులు పార్టీలు వంట పని లేని స్విగ్గీ జుమాటో ఆర్డరులు. మగవాళ్ళు పెళ్ళిచేసుకుని చాలా తప్పు పని చేస్తున్నారు. పెళ్లిలో లేని హాయి వొంటరిగా బతకడంలో వుందని నొక్కి వక్కాణించాను. 

కాంచన అప్పుడప్పుడు కనబడుతూ వుంటుంది. గతంలో కన్నా అందంగా ప్రశాంతంగా కనబడుతుంది. నాకే ఇంటి తిండి కరువై రుచుల పేరిట నానా రకాల గడ్డీ తిని జీర్ణ వ్యవస్థ దెబ్బతింది. మందులు చప్పిడి కూడు. ఒక్కసారిగా వయసు పదేళ్ళు పైబడినట్లు వుంది. పిల్లలు రాయబారం చేసారు. ఛానల్ లో ఉద్యోగం మానవసరం లేదు.. ఎప్పటిలా కలసి వుండండి అని. 

కావాలంటే ముప్పూటలా క్యారియర్ పంపుతాను కానీ కలసి వుండలేనంది. ఆ పని కూడా మానవత్వంతో చేస్తున్నాను అనేది. ఆ జాలి మానవత్వం నాకెందుకు? భార్య కావాలి కానీ. 

“ఆమె ను  బానిస గా చూడకపోయినా అర్ధ బానిసగా చూసావ్, నిత్యం కొత్త ఆకర్షణ లేకపోయినా రాత్రుళ్ళు కనీసం కాలు మీద  కాలు వేసుకుని పడుకోవడానికి వొక తోడు కావాలి లే అనుకునేవాడివి కదా!” గుర్తు చేసాడు వాడు.  

“అవును రా! ఇప్పుడనిపిస్తుంది పొరబాటు చేసానని. నిర్మించుకున్న ఊహా చిత్రాలన్నీ క్షణంలో పేకమేడల్లా కూలిపోతే.. నేను కూడా వీధి వైపు అరుగులున్న ఇంటి నొక దానిని అన్వేషించాలేమో జీవితం డొల్లించడానికి అని భయపడుతున్నాను.  అందుకే కాంచనతో సయోధ్య కోసం యిన్ని వేషాలు” అన్నాను. . 

“సయోధ్య కోసం వెళ్ళిన వాడివి. అందుకేనా, పని మనిషి వంట మనిషిని చూసి పెట్టమన్నావా?” ఫక్కున నవ్వాడు.  

 మౌనం వహించి పార్క్ వైపు నడక సాగించాను. పడమటి యెండ మీద పడి పొడుగ్గా నీడలు. చెట్ల నీడల్లో నా నీడ జాడ వెతుక్కోలేకపోతున్నా. 

**************

రోజులు గడుస్తున్నాయి. 

రెండు నెలలకల్లా పని మనిషి లోని ఆడతనంతో నా వొంటరి మగతనం జత కట్టింది ఇంటి మనిషిని చేస్తాననే హామీతో. అది కాంచన దృష్టికి అందటం అసాధ్యం అనుకున్నాను కానీ..చివరకు ముఖం పగలగొట్టుకున్నంత పనైంది. . 

ఆఖరి ప్రయత్నంగా పార్క్ లో  ఎదురుగా కూర్చుని వాదన మొదలెట్టాను. 

“మనిషికి అసలు వివాహమే లేకపోతే ఏ సమస్యా ఉండదు. అన్నింటికీ అదే మూల కారణం.  ప్రతి భార్యా  తన శారీరక, మానసిక, ఆర్థిక అవసరాలన్నీ సరదాలన్నీ భర్త దగ్గర ఆశించడం, భర్తే  ఆ అవసరాలన్నీ  తీర్చాల్సివుండటం.  ఇవన్నీ  వివాహం ద్వారానే జరుగుతాయని అంచనాలుంటాయి విశ్వాసాలుంటాయి.పుట్టిన దగ్గర్నుండి అదే నూరిపోస్తారు మీ ఆడవాళ్ళకు, మొగుడనే వాడికి అదెంత కష్టమో ఆలోచించరు. ఎక్కువమంది మగవాళ్ళు అవన్నీ భరిస్తూ గుండె పోటుతో పోయేదందుకే”

“ఒక స్త్రీ భర్తకు అన్ని విధాలా తగిన భార్య అనిపించుకోవాలంటే చాలా కష్టం కదా! ముప్పూటలా  వంట చేసి పిల్లలను కని వారికి  కావాల్సినవి సమకూర్చి  భర్త అత్తమామలకు సేవ చేస్తూ మళ్లీ ఉద్యోగం కూడా చేయాలంటే కష్టం.  అందుకే చాలా మంది  స్త్రీలు విసుగు చెంది కారణాలు వెతుక్కుని మరీ వివాహ బంధం వద్దు అనుకుంటున్నారు లెండి.”

“స్త్రీకి ఏ కాలంలోనైనా పురుషుడి నీడ అవసరం” మనువు చెప్పిన దానిని వల్లె వేయబోయాను. 

“అదే మనువు స్త్రీలు తమను తాము యెలా రక్షించుకోవాలో కూడా చెప్పాడు”  కొంచెం ఆగి అంది.ఇంకొక మాట మరిచాను అన్నట్టుగా వొత్తి చెప్పింది. “దాంపత్య సంబంధాల్లో బాధ వలన పునరుత్పత్తి  కారణాల వల్ల కేన్సర్ బారినపడి చనిపోయేది కూడా స్త్రీలే యెక్కువట”

మాట్లాడటానికి ఇంకేమీ మిగల్లేదనిపించింది. 


“ఆధిపత్య ధోరణి, శ్రమ దోపిడీ  రెండూ రెండు కళ్ళు పురుషుడికి”  అని లేచి వెళ్ళింది. దింపుడు కళ్ళెం ఆశతో వెనుకనే నడిచాను.  గేట్ దగ్గర ఆగి అంది. 


“సెక్సువల్ డిజైర్స్ మగవాడిలో కనిపించని మూడోకన్ను. నేనింకా దగ్దం కాదల్చుకోలేదు. పాపం లలిత!!” అని వ్యంగ్యంగా  నవ్వు విసిరి వడివడిగా వెళ్ళిపోయింది. 


తూలి పడిపోబోయాను. ఆసరా కోసం చూసాను.ఆమె వెనక్కి చూడకుండా దూరంగా వెళుతూవుంది. ఆశాసౌధమేదో కూలిపోయింది. ఇక సరికొత్త ప్రశ్నాపత్రం నాదే జవాబు నాదే!

వాడు ఫక్కుమని నవ్వాడు. వాడి మీద నేను విరుచుకు పడ్డాను. “నా ప్రతి చర్యకు ముందు నేను నీతో  మాట్లాడుతూనే వుంటాను. నువ్వెందుకు నన్ను హెచ్చరించ కూడదూ మందలించకూడదూ” అని. నా తప్పులను వేరొకరిపై  ఆయాచితంగా నెట్టేయడం నాకు సులభతరమైన పని. 

“ఎద గాయాన్ని సృశిస్తే యుగళ గీతాలు పుట్టవు రా పూల్.   బాధాతప్త గేయాలు మాత్రమే వినిపిస్తాయి” అన్నాడు.


వాడి మీద కోపం బుస్సున పొంగింది కానీ  వాస్తవమైతే కఠోరంగా వుంది.పైగా నిండా దుఃఖం వుంది.  అయోమయంలో  రోజులు వెళ్ళమారుస్తున్నప్పుడు కాస్త ఊహలను మేతగా  మార్చుకోవాలి. వాడితో మాటలు మానేస్తే సరి. 

 అసలు వాడెవరంటే.. 

విచిత్రమేమి కాకుండానే.. నేను ఇద్దరు మనుషులం. ఒకొరితర్వాతొకరు  మాత్రమే బయటకొస్తుంటారు. మనిషికి ఒంటరితనం విరామమెరుగని యుద్దం. ఆ యుద్ధంలో కత్తి డాలు రెండూ ఆలోచనలే. మనసుకే మనస్త్రాణం అవసరం.వాడూ నేనూ వేరు కాదు. వేరు వేరుగా వున్నప్పుడు జరిగిన కథ ఇది. కాంచన దూరం అయ్యాక బాగా తోడయ్యాడు వీడు. 

అవునూ, లలిత ను ఏం చేద్దామిప్పుడు!? మళ్ళీ వాడికి దూరంగా జరిగి బయటకు వచ్చి చేసిన ఆలోచన ఇది. వాడిని చంపేస్తే సరి. శత్రువుని  వశపర్చుకొని జగత్తునందు అజేయంగా వుండాలని యెవరికి మాత్రం వుండదు. హమ్మయ్య, రిలీఫ్ గా ఫీల్ అయ్యాను. 

******************సమాప్తం*******************


(కొత్త చూపు కథా సంకలనం లో కథ )




24, ఆగస్టు 2023, గురువారం

కాటుక మబ్బులు



ఎడిట్ చేయని .. అసలు కథ. నిడివి దృష్యా మూడు పేజీలకు కథ కుదించక ముందు నేను పంపిన అసలైన కథ ఇది. (గమనించగలరు)


కాటుక మబ్బులు  - వనజ తాతినేని


పెళ పెళ మంటూ కొమ్మ విరిగి నేలబడిన చప్పుడు. తలొంచుకుని జొన్నలను కడుగుతున్న సరిత  వులికిపడి చప్పుడైన వైపు చూసి క్షణం ఆలస్యం చేయకుండా ఆడకి పరుగుపెట్టింది.. 


కొబ్బరాకులు చీల్చి ఈనెలను కట్టకడుతున్న  భూదేవమ్మ యిరిగి పడిన కొమ్మను చూసి “ అనుకుంటూనే వున్నా కాయల బరువు యెక్కువై కొమ్మ యిరిగిపోతాదని. అట్టే అయింది” అనుకుంటూ గబ్బుక్కున లేవబోయి మళ్లీ కూలబడింది. ఏడు పదులు దాటిన ముసల్ది కాలు చేయీ తీసుకుని మళ్లీ లేవబోయే సరికి యింకో కొమ్మ యిరిగిపడింది. 


మనుమడి పెళ్లాం సరిత “ఓయమ్మో! అత్తోయ్ ! నువ్వు చెట్టెందుకు యెక్కావ్! దిగు, దిగి రా..ముందు. ఆడ్నించి పడితే యేమైనా వుందా?” కేకలు బొబ్బలు పెడతాంది. భూదేవమ్మ సత్తువకొద్ది పరిగెత్తుకొచ్చి చెట్టుకు దూరంగానే వుండి పైకి చూసింది.కోడలు మీనమ్మ చెట్టు పంగలపై కాళ్ళుంచి నిచ్చెన యెక్కుతున్నట్టు యింకో పంగ కోసం చూపులతో  యెతుకుతుంది. 


“అమ్మే మీనమ్మా! ఏడికే అట్టా ఆకాశం లోకి యెక్కతావున్నావ్, కొమ్మలు యిరిగి పడింది తెలియడంలా, ఆడనుంచి పడితే నడుములు యిరుగతాయ్, కిందకి దిగమ్మా” బతిమాలింది.

 

“నేను దిగను, అల్లదిగో ఆ చిటారుకొమ్మన  పెద్ద మామిడికాయ వుంది. నేను అది కోసుకున్నాక దిగుతా” 


“ఓసి నీ పిచ్చి తగలెయ్య నువ్వు యెక్కింది మామిడిచెట్టు కాదే మునగ చెట్టు” అని మనవరాలి సాయ చూసి “అమ్మీ నువ్వు  యింటోకి పోయి మామిడికాయ వుంటే పట్టుకొని రా లేకుంటే అంగట్లో కొనుక్కొని రా, బిన్నా రా, నేను మీ అత్తను మాటల్లో పెట్టి పైకి యెక్కకుండా జూస్తా”  

 

సరిత  వురుకుతా యింట్లోకి పోయింది 


“మీనమ్మా నీకు మామిడి కాయ కావాలా,  అది నీకు అందదుగానీ  చిక్కం కట్టిన గెడ కర్రతో కోసుకుందువుగాని కిందకు రామ్మా”


“నేను రాను. మామిడికాయ కోసుకుని ఈడే కూకుని తింటా,నువ్వు పోయి రవ్వొంత ఉప్పు కారం పట్టుకొచ్చియ్యి” ఇంకో కొమ్మ యెక్కబోయింది.


“పైకి వద్దులే, ఇదిగో నీక్కనబడకుండా యీడో మామిడికాయ దాక్కుంది చూడు. నువ్వే కోయాలంట నువ్వే తినాలంట. కోద్దువు రా.. రా! అని పిలుస్తుంది చూడు” నమ్మబలికింది. 


“అయ్, నేనే కొయ్యాలంట నేనే తినాలంట మీకు యెవరికీ పెట్టనంట”.. మాటలను లల్లాయి పదాలుచేసి పాడుకుంటూ నిదానంగా దిగుతుంటే .. ఊపిరి బిగబట్టుకుని చూస్తావుండింది. 


సరిత పరిగెత్తుకుంటూ వచ్చి పమిటచెంగుచాటు నుండి మామిడి కాయ తీసి భూదేవమ్మ చేతికిచ్చింది.ఆమె కోడలు చూడకుండా వొత్తుగా వున్న మునగ కొమ్మపై మామిడికాయను వుంచి కోడలికి  చూపిచ్చి “ ఇదిగో మామిడి కాయ, బిన్నా కోసుకో! మళ్లీ ఈ  అమ్మి కోసుకుపోద్దేమో” అని ఊరించింది.


“ఆయ్ ఆయ్ భలేగుంది మామిడికాయ్” అనుకుంటూ దిగొచ్చి  చటుక్కున ములక్కాడ ను తుంపుకుని రెండుగా విరిచేసి తేగలు నమిలినట్టు నములసాగింది. 


“ అయ్యో కూతురా! నువ్వు యింత మతిస్థిమితం లేకుండా పొయ్యావేమిటే,యిదంతా మా ఖర్మ కాకపోతే ” నెత్తి కొట్టుకుంది భూదేవమ్మ. అమ్మమ్మ మనవరాలు యిద్దరూ చెరో చేయి పట్టుకుని సావిడిగదిలో మంచం పై కూర్చుండబెట్టారు. సరిత బయటకొచ్చి తలుపు గడియబెట్టి కర్రల కిటికీలోంచి చూసి “అమ్మమ్మా బయట గడిపెట్టా. నిన్నేమైనా కొట్టుద్దేమో జాగ్రత్త.”


“అది ఎవర్నీ యేమనదులేవే, ఓటిదంటే అంతా ఓడుదన్నట్టు దాన్ని అంత సలీజుగా చూత్తావ్, నేనుంటాలే నువ్వు బో..” కసిరింది. 


“మా ఆయనతో నేను నీళ్లోసుకున్నా పుల్లపుల్లగా యేవైనా తినాలుందని  పుల్ల మామిడికాయ తెచ్చిమ్మని సిగ్గు లేకుండా అడిగా, తెచ్చిచ్చినాడనుకున్నావా, లేనే లేదు. ఇన్నేళ్ళకు మన చెట్టు కాసింది గనక తింటన్నా, భలే బాగుందత్తా! నువ్వు కూడా వొక ముక్క తింటావా? మంచి పిల్లలు పుడతారంట.బొద్దుగా ఆరోగ్యంగా వుంటారంట”. సగం ములక్కాయను భూదేవమ్మ నోటి దగ్గర పెట్టి అడిగింది. 

 

రవ్వొంత నవ్వు రవ్వొంత యేడుపు కలగలిపి వచ్చాయ్. 

“నాకొద్దులే, కాయంతా వొకేతూరి తింటే నీక్కూడా నోరు పులిసిపోద్ది. కాసిని నీళ్లు తాగి పడుకో’ మందు బిళ్లలేసిన మంచి నీళ్ల గ్లాసు చేతికిచ్చింది.


“ అట్టే, నువ్వు చెపితే నేనెప్పుడైనా కాదన్నానా, నువ్వు కూడా పడుకో, అన్నం తిన్నావా నువ్వు, పెట్టుకొచ్చేనా.. అంటూ మంచం మీద నుండి లేవబోయింది. “నేను యిందాకే  తిన్నాలే.. నువ్వు పడుకో”.


బుద్దిగా పడుకుంది మీనమ్మ.  అమ్మయ్య! గట్టి వాన కురిసి తెరిపిన పడ్డట్టుంది పేణానికి  అనుకుంది. 


అమ్మమ్మా! “ నీతో అమ్మ మాట్టాడుద్ది అంట.. ఫోన్ తీసుకొచ్చి యిచ్చింది సరిత. ఎట్టుంది నీ కోడలికి అడిగినట్టుంది కూతురు. 


“ఏం చెప్పను లేవే మా యెతలు. ఎవురూ ఆర్చేది తీర్చేది కాకపోయే.  పూటకొక గండం. కొంసేపు యేమారినా యేం తంటాలు తెచ్చి పెట్టుదో నన్న భయమైపోయే. నిన్న చూస్తే మిద్దె మీదకుపోయి వాటర్ ట్యాంకు యెక్కి కూర్చుని పిల్లకాయలను బంతెయ్యి అంటది. పదిరోజుల కిందట యెనక నుంచి స్కూల్ బస్ పైకి యెక్కి కూర్చుని నేను కూడా స్కూల్ కి పోతా అని గోల. అణుకువ గల బిడ్డ దానికి యెందుకు యిట్టా వచ్చిందో, కాస్తయినా నెమ్మళ పడితే జొన్నాడో వేదాద్రి కో పోయి మూడు నిదర్లైనా చేపిచ్చుకని రావాలనుకుంటున్నా” 

“అన్న యేమంటున్నాడు?, నేను ఫోన్ చేసి మాట్టాడితే దానికి పిచ్చి లేదు యేం లేదు అన్నీ యేసాలు అన్నాడు” 


ఆ మాట వినగానే   భూదేవమ్మకు కోపం తన్నుకొచ్చింది. 


“ఏసాలు ఆడికి చేతైనట్టు పెపంచంలో యెవురికైనా  చేతోచ్చా . సీకటి పడే టయానికి యేనాడైనా యింటికాడ పడివుండాడా.. ఎప్పుడూ మంది కొంపల్లోనూ మంచె కాడ తెల్లారిపోయే! దాని యేడుపంతా పీల్చుకొని పీల్చుకొని గట్టిబడిపోయిన బూరగ దూది దిండు పాటి అయినా మనం అర్ధం చేసుకోవాల. సాటి ఆడదాన్ని అర్దం చేసుకోకుంటే యెట్టా, నీకు వచ్చినయి యింటి ముందు అంపాపురం తాడిచెట్టుకు వచ్చినయి యేళ్ళు, ఇప్పుడంటే అన్నావ్ గానీ ఇంకోతూరి ఆ మాటంటే అన్నోళ్ళు యెవురైనా చెప్పుచ్చుకొడతా. “


“ఆడు అన్నాడని చెప్పినాను కానీ నేను ఆమాట అన్నానా, సరితే  పిచ్చిదానితో యమ యాతనలు పడతన్నాం అంటే కూడా సర్ది చెపుతున్నా. నీ కోడలిని నువ్వే చూసుకో. తూరి తూరి పిలిచి నా పిల్లను విసిగిచ్చబాకు. నీ వల్ల కూడా కాకపోతే పిచ్చాసుపత్రి లో వేసుకోండి” 


“నేను వుండగా దాన్ని పిచ్చాసుపత్రిలో యెందుకేస్తానే, ఇంకో రెండు నెలలు మందులు వాడితే తగ్గిపోద్దని డాక్టరమ్మ చెప్పింది. నీ కూతురికి బరువో భయమో అయితే ఏరు కాపురం పెట్టి దూరంగా పోయి వుండమను. ఇంకోసారి పిచ్చాసుపత్రి గిచ్చాసుపత్రి అన్నావంటే దవడ పగిలిద్ది”  యెర్ర బటన్ ని కసిగా నొక్కింది. ఫోన్ మనుమరాలి చేతికిచ్చింది. 


**********

“అబ్బయ్యా శ్రీకరూ, చిన్నోడా బంగారు కొండా! మీ కోసరం అవ్వ చాక్లెట్లు దాచిపెట్టింది, రాండి, తీసుకోండి.. పిలిచింది మీనమ్మ. కొట్టాల ముందు బంతాట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ చాక్లెట్ల మీద ఆశతో జంకు జంకుగా దగ్గరకు వచ్చారు. వాళ్ళు దగ్గరకు రాగానే గట్టిగా హత్తుకుని ముద్దులాడింది. ఒళ్ళో కూసిండ బెట్టుకుని ఆటలాడింది. అవ్వ పిచ్చిది అని చెప్పింది అమ్మ. అదంతా వొఠ్ఠిదే అనుకున్నారు పిల్లలిద్దరూ. మీనమ్మ పెద్ద కొడుకు వేణు  యిదంతా చూస్తూ ”అమ్మకు నయమైపోతుంది పర్లేదు” అనుకున్నాడు. 


మీనమ్మ దుప్పటి కింద దాచిపెట్టిన కవరు లోనుంచి యేదో రహస్యంగా తీసి పిల్లకాయల చేతుల్లో పెట్టి గుప్పిట మూసేసి చాక్లెట్లు తినండి అంది. పిల్లలిద్దరూ గుప్పిట తెరిచి  వాటిని చూసి ముఖం నల్లంగా పెట్టుకుని “ఛీ. చాక్లెట్లు కాదియ్యి, నీ మందులు, నువ్వే తిను మాకొద్దు” దూరంగా పారిపోబోయారు. వాళ్ళు విదిలిచ్చుకుని పోవాలనుకుకొద్దీ గట్టిగా పట్టుకుని మందులు కాదియ్యి చాక్లెట్లే తినండి తినండి.. అని బలవంతంగా పెట్టబోయింది. పిల్లలు భయపడి గగ్గోలు పెట్టి యేడ్వసాగారు.. వేణు గబాల్న వచ్చి మీనమ్మను ఎనక్కి నెట్టి పిల్లకాయలను యెడంగా తీసుకోయి.. అవ్వా అని గట్టిగా అరిచాడు.


 ఏందబ్బయ్యా! అంత గట్టిగా అరుస్తున్నావ్ అంటా వచ్చింది భూదేవమ్మ. 


“ఆమె ను బైటకు రానీయొద్దని చెప్పినానా లేదా.. చాక్లెట్లని పిల్లకాయలకు మందుబిళ్ళలిచ్చి తిననంటే నోట్లో కుక్కుతుంది. ఈ పిచ్చిమేళంతో మేము యేగలేం కానీ హాస్ఫిటల్ లో పెట్టేసి వస్తా” 


“వద్దులేరా అబ్బయ్యా, బయటకు రాకుండా నేను చూస్తాగా. పిల్లలు భయపడతన్నారనుకుంటే సరితను పిల్లకాయలను ఊరికి పంపియ్యి” అని బతిమలాడుకుంది.  


మీనమ్మ నిదరబోతందిలే! లేచేవోపు చీరలకు గంజేసుకుని.తలస్నానం చేసుకుని వద్దాం అని తలుపు గడియపెట్టి పొయ్యింటి వైపు యెల్లింది భూదేవమ్మ.పనులన్నీ ముగించుకుని అన్నం గిన్నె పట్టుకుని వస్తుంటే కన్ను వాచిపోయి చిరిగిపోయిన చొక్కాతో సావిడి గది నుంచి బయటకొస్తున్న కొడుకు శేషగిరి ని అనుమానంగా చూస్తూ.. ఏమైందిరా.. అని అడిగింది.


“ఏముందీ!.. పిచ్చిది, మదమెక్కిన ముండ, దానమ్మ సిగతరగ,  మొగుడిని అని కూడా సూడకుండా వొళ్ళంతా రక్కింది కొరికింది”. కాళ్ళతో నేలని తాపుతూ అదీ చాలక యెదురుగా వుండ నీళ్ళకుండపై కోపమంతా చూపించాడు. 


“ఒళ్ళు బాగోలేని దగ్గర నీ మగోడి యేసాలేంటిరా.. అవతలకి పో..” అంది చీత్కారంగా.


కళ తప్పిన ముఖంతో  చింపిరి జుట్టుతో చిక్కిశల్యమైపోయి

మంచానికి అంటుకుపోయిన కోడలు కళ్ళనిండా కన్నీటితో ఏవేవో గొణుక్కుంటూ వుంటే .. పిచ్చిదాని మాటల్లా కాకుండా లోతుగా వున్నట్టు అనిపిచ్చి మనసు పెట్టి  వినింది.


“నేను యింకోతూరి తప్పు చేత్తానా.. పూట పూటకి దొంగ కూడు తినే కుక్క కు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ముట్టనిస్తానా,భద్రంగా కాపలా కాయనూ..”


దేవుడేంటి, నైవేద్యం యేమిటి? అయోమయంగా చూసింది. తరువాత లోతుగా  ఆలోచన చేస్తుండగా.. 


“అత్తా! నేనేమైనా తప్పు మాట్లాడానా, నిజమే కదా చెప్పాను. తప్పు చేస్తే కూడా వొప్పుకోవాలి. కప్పెట్టేసుకుని  మోసం చెయ్యకూడదు గందా”  అంది మీనమ్మ.


 కిటికి దగ్గర తచ్చాడుతున్న సరితను చూసిన భూదేవమ్మ..

“ఏమోనే అమ్మా! నువ్వూ నీ పిచ్చి మాటలు, ఊకో, యెవరైనా యింటే  నీ మాటలకు యింకా నాలుగు కల్పితాలు చేసి రచ్చకెక్కిస్తారు.  దానికి బయటోళ్ళదాకా యెందుకు మనింటోవాళ్ళే చాలునుగందా”


వాత పడ్డ సరిత చప్పుడు చేయకుండా లోపలికి జారుకుంది. 


 రేయంతా ఆలోచనలు చేసిన భూదేవమ్మ తెల్లవారుఝామున  నిద్రలోకి జారుకుని పెళ్లున యెండ కాసేటప్పుడు మేల్కొంది. ఆ సరికే ఆమె  కళ్లకు శుభ్రంగా స్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకుని ముఖాన కాసంత బొట్టెట్టుకుని కనబడింది మీనమ్మ.  నిండా ఆశ్చర్యంలో మునిగి వుండగానే.. 


“అత్తా!కార్తీకమాసం కదా తులసి ముందర దీపాలు యెలిగిచ్చా చూడు” అంది. “ఇది కార్తీకమాసం కాదే అమ్మా  నవరాత్రులు”  మనసులో అనుకుని  గుమ్మం ముందుకొచ్చి చూసింది. నడవంతా కడిగి ముగ్గులు పెట్టి నిజంగానే తులసమ్మ దగ్గర దీపాలు పెట్టి వుండటం చూసి సంబరపడింది. మరొకనాడు చేతులు జోడించి ఈనుతున్న ఆవు చుట్టూ  ప్రదక్షిణలు చేస్తున్న మీనమ్మ ను చూసి ఆశ్చర్యపోయింది. 


 దీనికి పిచ్చి కొంత తగ్గి మాములు మనిషిగా మారతంది. ఓపిగ్గా యింకొన్నాళ్లు లాక్కొద్దాం. ఇంటి ముందర  కానుగ చెట్టు కింద మంచమేసి కూర్చోబెడితే సరి.దారిన వచ్చే పోయే వాళ్ళను చూసైనా మనుషుల లోకంలో పడుద్ది అనుకుంది. ఆలోచన మొదలైంది తడవూ దినంబు ఆ  పనే చేస్తుంది భూదేవమ్మ. కొందరు చెట్టు కింద కూర్చున్న మీనమ్మను పలకరించి కాసేపు మాట్టాడి ఆమెకు నిజంగా పిచ్చే అని తీర్మానించుకుని పోతే మరికొందరు పిచ్చి లేదు యేమి లేదు మనిషి మాములుగా వుందని మాటలతో యెదురుకోలు ఆడుకున్నారు. . 


చీర చెంగు ముఖాన యేసుకుని దారినపోయే  పిల్లలతో దాగుడుమూతలు ఆడుతూ కొట్టంలో ఆవులకు మేతేస్తూ ఆటిని నీళ్లకు వొదిలి గంగడోలు నిమురుతూ తువ్వాయిలతో ఆడుకుంటూన్న కోడలిని చూసి ఆనందపడింది భూదేవమ్మ.


ఒకనాడు సందేళ   కానుగు చెట్టు కింద కూసుని వుంది మీనమ్మ. క్రీగంట ఆమె వైపు చూసుకుంటూ వీధిలో నడిచి పోతున్న మనిషిని చూస్తూ పకపకా నవ్వింది. గేటు కాడికి పరిగెత్తిపోయి ఆ మనిషిని చేయి వూపి పలకరించింది.  అతను తనపాటికి తాను నడుచుకుంటూ పోతా వుంటే అదే పనిగా చూస్తానే వుండే కోడలి కళ్ళల్లో వెలుగు పెదాల పై సన్ననవ్వు చూసి ఆశ్చర్య పోయింది.  అంతలోనే మీనమ్మ  యెనక్కి మళ్ళి రెండు చేతులతో నేలమీద దుమ్మును తీసి నెత్తి మీద పోసుకుంటూ “రాధాకృష్ణుల పెళ్ళంట ఊరూ వాడలో వింతంట. తారాచంద్రుల ప్రేమంట,మొగుడికేమో మటంటా” పాడుకుంటా వుంది.


ఏయ్, లోపలికి పో, ఎదురుగా నిలుచుండి గుడ్లిరిమి చూస్తున్న మొగుణ్ని వెనక్కి నెట్టి గుప్పిళ్ళ నిండా దుమ్ము తీసి అతని ముఖాన జల్లింది. కోపంతో వూగిపోయినతడు  చేతికందిన దుడ్డు కర్రతోనూ అదిరిగిపోయాక గడ్డిమోపు కట్టుకునే రబ్బరు తాడుతో ముందు యెనక చూడకుండా బాదుతుంటే వీధి లో నడుస్తున్న మనషులు జాలిగా చూసారు.  వీధిలో పోతున్న ఆ మనిషి కూడా పాతేసిన గుంజలా నిలబడి మరీ చూసాడు. భూదేవమ్మ వచ్చి కొడుక్కి అడ్డుపడకపోతే ఘోరం జరిగిపోయి వుండేది. మీనమ్మ శవమై పడి వుండేది.



నెత్తరోడుతున్న గాయాలను దుమ్ము నిండిన తలను కడుగుతూ “పక్క పాపిట తీసిందని పక్కలిరగ తన్నినాడు పరాయి మగోడిని చూస్తే వూరుకుంటాడా”  లోపలిమాటను యెల్లగక్కింది. కోడలి వీపు పై వాతలకు వెన్న రాస్తూ.. కాలంనాటి ముచ్చటొకటి చెప్పుకొచ్చింది.


నా చిన్నప్పుడు మా వూళ్ళో ఇంద్రమ్మ అనే ఆమె సంవత్సరానికి వొకసారి శ్రావణ మాసంలో రాధా కళ్యాణం చేసేది. పొన్నచెట్టు కింద రాధ బొమ్మ ను కృష్ణుడి బొమ్మను నిలబెట్టి అచ్చం బృందావనాన్ని సృష్టించేది. ఎంత బాగుండేది అనుకొన్నావ్.  ఆ కళ్యాణానికి పిల్లలే పేరంటాళ్ళు అతిధులు. ఒక్క మగ పురుగును కూడా రానిచ్చేది కాదు. రాధా కళ్యాణం చేస్తే  యిష్టపడిన మగాడి ప్రేమ దక్కుద్ది అంట అని చెప్పేది. అదేదో బొమ్మల పెళ్ళి అని, అరిసెముక్క లడ్డూలు పెడతారనే సంబరం తప్ప ఆ వయస్సులో ఆ మాటలు నాకేడ అర్ధమయ్యేయి! ఇప్పుడు ఆలోసిత్త్తావుంటే ఆ పెళ్ళిలో పరమాత్మమంతా బోధపడిద్ది. రాధాకృష్ణులు వయస్సుతో సంబంధంలేని ప్రేమికులు గందా. లోకమంతా వింతగా తప్పుగా చెప్పుకోకుండా వారిద్దర్ని భార్యాభర్తల్లాగా నిలబెట్టాలని ఇంద్రమ్మ లాంటి వాళ్ళు చేసే తతంగం కాబోలు అని వ్యాఖ్యానించింది. 


మర్నాటికల్లా శేషగిరి  ఇనుప గొలుసులు తెచ్చి  మీనమ్మ కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసాడు.బీగాలు కూడా వేసాడు.  పిచ్చిది అందరినీ కొడుతుంది అని అడిగినోళ్ళకు అడగనోళ్లకు అందరికీ ప్రచారం చేసాడు.


 గొలుసుల బరువుతో కాళ్ళీడుస్తూ ముంజేతులకు పుళ్ళు పడి వొంటి మీద బట్ట కూడా సరిజేసుకోలేక అన్నింటికి తనపై ఆధారపడిన కోడలిని చూసి  కడుపులో నుండి దుఃఖం పొర్లుకొచ్చింది. “అయ్యో కూతురా! నీ గ్రహచారం బాగుండలేదు కదే, ఎవురితోనూ యేలెత్తి చూపించుకు యెరగని నీకు యీ అవమానపు కాలం యెందుకు రావాల” అని ఆక్రోశపడింది.  కొడుకు యిల్లు దాటాకా బండరాయెత్తి గొలుసుల తాళం పగలగొట్టి సంకెళ్ళు విసిరి పారేసింది. 


దీపాల అమాస ముసురు తగ్గి తెల్లమేఘాల మధ్య చంద్రుడు చల్లగా వెలుగులుజిమ్మే కాలంలోకి వచ్చిపడ్డాడు.వేణు  పిల్లలకు దసరా సెలవులొచ్చాయనే వొంకతో భార్య పిల్లలను తీసుకుని అత్తగారింటికి పోయి నెల్నాళ్ళు అవుతున్నా అయిపు లేడు.చేను వెన్నుమీద వుంది  యెరువు మందు చల్లాలన్న సోయ కూడా లేదేమో సన్నాసికి  అనుకుంటూ వేణుకి ఫోన్ చేసింది.  మనుమడు మాట్టాడిన తీరుకి యెడా పెడా వాయించింది భూదేవమ్మ.. 


“మీ అయ్య కొంప ముఖమే సూడట్లేదు. పొయ్యి నెలయ్యింది నీ తోడబుట్టిందానికి కన్నతల్లి అన్న మమకారమే లేకపోయ్యె, రెండు పండగలు వొచ్చిపోయినా తిరిగి చూడకపొయ్యే.  నీ తమ్ముడు హాస్పిటల్ లో చూపిచ్చి మందులిప్పించి చేతులు దులిపేసుకుంటుండే,  మీలో ఎవ్వుర్రా అమ్మ ను బాగా చూసుకునేది. మనసు పెట్టి పట్టుమని తలో వొక నెలైనా దగ్గరుండి చూసుకుంటిరా. పైగా దాని చేతులకు కాళ్ళకు గొలుసులేస్తుంటే చూసి గమ్మున వూరుకుంటిరి. నవమాసాలు మోసి కనీ చనుబాలు తాపి మీ పియ్యెత్తి మీ ముక్కు తుడిసి మీ గుడ్డలుతికి మిమ్మలను అపురూపంగా పెంచిన అమ్మను యిట్టాగేనా చూసేది. పైగా అది యెవుడితోనో లేచిపోయింది అంటావుంటిరి. నెలాపదినాళ్ళు వాడితో వుండింది మీలో యెవురైనా చూసినారా? చెప్పుకునే వాళ్ళు యెవురైనా కళ్ళారా సూసేరా. పిచ్చిదై తిరుగుతుంటే చూసినాళ్ళు ఆచూకీ చెప్పినారు కాబట్టి పోయి తీసుకొచ్చినారు.. అదే గదా జరిగింది. దానికి పిచ్చి లేకపోతే డాక్టరు మందులెందుకిస్తారనే యింగితగానం వుండొద్దు మీకు.మళ్ళీ మీయందరూ చదువుకున్నోళ్ళంట, థూ!. ఎన్నాళ్ళు కొంప సేద్యం వొదిలిపెట్టి వుంటారో వుండండి. మీ అమ్మను పిచ్చి ఆసుపత్రిలో చేర్పిచ్చేది  యెందుకు అది పిచ్చి తగ్గి  సుబ్బరంగా తిరుగుతుంటే.. మీరు వస్తే రండి లేకుంటేలేదు”  కరాఖండిగా చెప్పింది.


ఫోన్ లో మాట్టాడిందంతా వింటానే వుంది మీనమ్మ.వెక్కి వెక్కి యేడ్చింది. మనసు బరువుదీరా యేడ్చింది. కల్మషం అంతా కరిగిపోయిందాకా యేడ్చింది. వాన ధారగా కురిసినంతగా యేడ్చింది. 


ఆ రోజూ మాములుగానే తెల్లవారింది అందరికీ. భూదేవమ్మ కు తప్ప. ఆమె ఆశలను వమ్ము చేసి బతుకునే తెల్లార్చుకుంది మీనమ్మ. మగతగా పడి వుండటానికిచ్చిన మందు మాత్రలన్నీ వొకేసారి వేసుకుని శాశ్వత నిద్రలోకి జారిపోయిందని దుప్పటి కింద ఖాళీ డబ్బా చెప్పింది. 


“అయ్యో కూతురా! యెంత పని చేసినావే. ఇష్టాన్ని బతికిచ్చుకోవాలంటే చావడం వొక్కటే మార్గం అనుకుంటివా, ఈ మసల్దానితో వొక్క మాటన్నా చెప్పివుంటే  యాభై యేళ్ళకు పైగా మొగుడు లేని ముండగానే వుండి బతుకంతా తీపిగా యిష్టంగా బతికిన బతుకు గురించి చెప్పి వుండేదాన్ని కదే.” నెత్తి బాదుకుంటూ యేడ్చింది.  కడచూపు చూడటానికి వొచ్చిన వారికి కూడా ఆ గోస మనసుకి తాకి నిలువెల్లా కదిలించింది.  


మేము మనుషులమే అంటూ ఆయిన వాళ్ళు కంటికి కడివెడులెక్క కురిసి తేలారు.  కాస్త ఆలస్యంగా జరగవలిసిన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. గుండె పగిలేదాకా యేడ్చి శోష వచ్చి పడిపోయిన భూదేవమ్మ ను నడిమింట్లోకి చేర్చారు. తెప్పరిల్లాక చల్ల కలిపిన నీళ్ళు మాడు మీద చల్లుకుని మూడు ముంతలు నీరు పైనుండి గుమ్మరిచ్చుకుని వణుకుతున్న వొంటితో చీర చుట్టుకుని యింట్లోకి నడవకుండా.. సావిడి గదిలోకి నడిచింది. మీనమ్మతో పాటు మీనమ్మ గురుతులు మాయమైపోయి బోసిపోయిన గదిని చూసి మరింత బావురుమంది. గది నడిమ కూలబడింది. కోడలితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. పద్నాలుగేళ్ళ పిల్లప్పుడు కాపురానికి వచ్చింది.ముప్పై యేళ్ళు  తల్లో నాలుకలా మెలిగింది. ఎంత పని చేసేవే బిడ్డా. అని పొగిలి యేడ్చింది భూదేవమ్మ. 


 గది గోడలు తామిద్దరూ రాత్రి చెప్పుకున్న రహస్యాన్ని మళ్ళీ వినిపిస్తున్నట్టు అనిపించింది ఆమెకు.


************

“అత్తమ్మా.. నీకో మాట చెబుతా, నిజమే చెబుతా నమ్మాలి నువ్వు.”


“చెప్పవే తల్లీ.. నువ్వెప్పుడైనా అబద్దం చెప్పావా”  


“నాకు పిచ్చి లేదత్తమ్మా.”అంది అత్త కళ్ళలోకి సూటిగా చూస్తూ.


“నాకు ఆ ఇసయం ఇడమరిచి చెప్పాలంటే పిచ్చి మొహమా! మందులేసుకోకుండా దిబ్బగుంటలో పడేసినప్పుడే కనిపెట్టా.  నీ మనసు నీ ఆలోచన నా కన్నీ తెలుసు. నువ్వు మాత్రం యేం చేత్తావ్, శరీర ధర్మం చెప్పింది చేసావ్. నువ్వు తప్పు చేసానేమో అన్న ఆలోచనతో   నలిగిపోవడం పాత కాపరంలో యిమడలేకపోవడం నాకు తెలియదనుకున్నావా?  తప్పు ఉసిగొల్పిన వొంటిదా  కోరుకున్న మనసుదా అని మధనపడతన్నావ్, తప్పు రెండింటిదీ అయితే  నువ్వసలు పశ్చాత్తాప పడనేకూడదు మానసిక దుఃఖం అసలే కూడదు”


“నువ్వీ మాటలు అంటుంటే యెందుకో మా తాత బాగా గుర్తొస్తున్నాడు. నీ వొళ్ళో కాసేపు పడుకొంటా అత్తమ్మా.”


“రావే తల్లీ.నా వొళ్ళో రవ్వొంతసేపు వొడ్డిగిల్లు. మనస్సు నెమ్మళం చేసుకో”  ఓదార్పుగా తల నిమిరింది తను. ఆశ్రమంలో గురువులు చెప్పే మాటలు మననం చేసుకుని కోడలి మనసు నెమ్మదిపడేటట్టు నాలుగు మాటలు చెప్పింది కూడా. 


“శారీరక ధర్మం ప్రకారం నడవాలనుకునే వారికి తప్పొప్పులు ఆలోచనలు అంటకూడదు. తొర్రలో పడ్డ నిప్పు రవ్వంత అయినా చెట్టునే దహించేస్తుంది.  గతం గతః అనుకో, అప్పుడే నీకు మనఃశ్శాంతి” 


కళ్ళ నీళ్ళతో చీర చెంగులో ముఖం దాచుకుంటూ.. 

“నేను చచ్చిపోతే ఏడుస్తావా అత్తమ్మా” అంది


అప్పుడైనా తట్టలేదు..ఈ మంద మెదడుకి,  ఇది యేదో అఘాయిత్వం తలపెట్టిద్ది అని.. 


అప్పుడు తను అంది


“ఏం మాటలే అయ్యి.  జరిగిందేదో జరిగిపోయింది. నేనుండంత కాలమూ..  నీ మొగుడి తో సహా యే  ఈగను  నీ మీద వాలనివ్వను. రోజూ చేనుకు పోదాము. పనులు చేసుకుందాం. మంచి తిండి తిని మంచి గాలి పోసుకొని ఆరోగ్యంగా నిలబడాలి నువ్వు. నీ మొగుడు చూసినప్పుడు మాత్రం పిచ్చిదానిలా  నటిస్తావుండు చాలు. ఆడు నీ జోలికి రానే రాడు అంటూ తన మాటలకు తనే పగలబడి నవ్వింది. మీనమ్మ  నవ్వకుండా నిశ్శబ్దంగా కన్నీరు కార్చింది. కరువుదీరా యేడ్వనీ, ఏడుపు మనిషికి మంచి ఔషదం అన్నట్టు  గమ్మున వుండిపోయింది. ఆ కన్నీటికి అర్థం ఇదా. మరోమారు గుండె బద్దలైంది. 


***************

మాత్రల డబ్బాన్ని అట్టెందుకు అందనిచ్చావ్ అవ్వా అంటా మనవరాళ్ళిద్దరూ  కూతురు మూకుమ్మడిగా భూదేవమ్మ చుట్టూ జేరి ఏట కుక్కలు మాదిరి వాసన కనిపెడుతూ కూపీ లాగను మొదలెట్టారు. 


“పిచ్చిది, ఎప్పుడు యేమి చేత్తదో నేనట్టా చెప్పేదే అమ్మల్లారా?”


“ ఏమోలే! పొరపొచ్చాలు అందరికీ వుంటాయి. మానబోయే పుండుని కెలుక్కుని బాధపడటం యెందుకు? ఇకనైనా నాయన్ని కనిపెట్టుకుని వుండవ్వా” అంది జయ.


“ మీ అమ్మకు బిడ్డ రూపంలో వున్న శత్రువ్వి గదే నువ్వు” దవడ గట్టిగా బిగించి నిరసనగా చూసింది మనుమరాలి వైపు.  


 “నువ్వు మాత్రం ఆ పిచ్చితనంతో యెన్నాళ్ళు పడతావ్ లే,మరిన్ని బాధల్లేకుండా తొందరగానే ముగిచ్చుకుని పోయింది నిన్ను వొడ్డున పడేసింది” అంది కూతురు.


అందరినీ నిర్లిప్తంగా నిస్తేజంగా చూసి మాట పొదుపు జేసింది భూదేవమ్మ. మనస్సులో గట్టిగా అనుకుంది..


కోడలి రహస్యాన్ని  యేనాటికి బైటకు పొక్కనియ్యకూడదు.కష్టమో కామితమో  యేదైనా యెట్టాంటిదైనా బిడ్డను అక్కునజేర్చుకుని ఆదరించాలే తప్ప వీధిన యేసుకుంటామా? తెల్లని గుడ్డపై  వున్న మరకలను బయటేసుకుని తిరగమని యే తల్లి చెబుతుంది? రహస్యాలను బట్టబయలు చేయని గది  గోడల్లా యిపుడు   తనూ వొక  నిలువెత్తు రహస్యపు గోడ, అంతే!


**************సమాప్తం***************







   


20, మార్చి 2023, సోమవారం

ఔనా!

 


ఔనా!    -వనజ తాతినేని. 

పన్నెండేళ్ళుగా  మెదడు  నిండా ఓ పాత్రను మోస్తున్నాను. అప్పుడామె తన కథను చెపుతున్నప్పుడు  కనులు పెద్దవి చేసి చెవులు రిక్కించి ఆశ్చర్యంతో రోమాలు నిక్కబొడుచుకున్నట్లు జ్ఞాపకం వుంది. ఇదంతా ఆమె చెప్పిందా నేను  నిజంగానే విన్నానా అనుకుంటూ   నన్ను నేను గిల్లి చూసుకున్నాను కూడా. స్త్రీ పురుష సంబంధాల గురించి లోతుగా ఆలోచిస్తున్నప్పుడల్లా ఆ పాత్ర   గుర్తుకొస్తుంటుంది. గుర్తుకొచ్చినప్పుడల్లా రెండు మూడు రోజులు ఆలోచిస్తూ వుంటాను. మరి ఆమె చెప్పిన విషయమైతే సామాన్యమైన విషయంలా నేను భావించలేదు మరి. 


ముఖ్యంగా కథ రాయాలి అనుకున్నప్పుడల్లా నన్ను గురించి రాయి అని ఆమె అడుగుతున్నట్లే వుండేది.  రాసే సాహసం చేయలేదు అనను కానీ రాయకూడని విషయాలు కొన్ని ఉంటాయని గిరిగీసుకుని కూర్చున్నాను. సాధారణంగా  ధనబలం వుండి ఎవరేమనుకుంటే నా కేమిటి నా జీవితం నా ఇష్టం అనుకుంటూ జీవితం పట్ల  అమితాసక్తితో  విచ్చలవిడిగా విహరించేవారిని  మనం చూస్తుంటాం కదా ! ఆ కోణంలో చూస్తే ఆ పాత్ర అంత నాగరిక జీవనంలో జీవించిన పాత్రా కాదు. పెద్ద చదువుసంధ్యలున్న స్త్రీ లా కూడా అనిపించలేదు.  అలా అని ఆమె కడు పేదరికంలో జీవనం కొనసాగిస్తూ అవసరాల కోసం శరీరాలను ఫణంగా పెడుతూ  నిర్లక్ష్యంగా బ్రతికే తెగువ కల్గిన పాత్రా కాదు.  ఈ రెండు రకాల మధ్య గల మధ్యతరగతి జీవితం గడిపే కుటుంబ స్త్రీ అంత నిర్భయంగా నిస్సంకోచంగా   మసలగల్గినదంటేనే ఆశ్చర్యం నాకు. ఇప్పుడిక కథలోకి వెళదాం.


**************


పన్నెండేళ్ళ క్రితం వారం రోజుల్లో అమెరికాకు ప్రయాణమవుతున్న కొడుకును తీసుకుని శ్రీశైలం వెళ్ళాను నేను.  మధ్యాహ్నం పన్నెండుకల్లా అక్కడకు చేరుకున్న మాకు వసతి సౌకర్యం లభించేసరికి రెండుగంటల సమయం పట్టింది. మర్నాడు గురుపౌర్ణమి. పుణ్యక్షేత్రాలన్నీ రద్దీగా వుంటాయన్న సంగతి మర్చిపోయాను. ఎప్పుడూ విడిది చేసే సత్రానికి వెళ్ళి రూమ్ అడిగితే ఎంతమంది అడిగాడు. నేను అబ్బాయి అనగానే మా వంక పట్టి పట్టి చూసి కాసేపు ఆగండి అన్నాడు. అరగంట వేచివున్నా మాకన్నా వెనుక వచ్చినవారికి రూమ్ లు కేటాయిస్తూ మమ్మల్ని అలాగే నిలబెట్టాడు. అతని వద్దకు వెళ్ళి గోత్రం పేరు ఇంటి పేరు చెప్పాను. “ఖాళీ లేవమ్మా, ఇద్దరు వుంటే అసలు ఇవ్వడం లేదు” అన్నాడు. అబ్బాయి వంక నా వంక అతను చూసే చూపులు నాకు అవమానంగా అనిపించేయి.


 స్నేహితురాలికి ఫోన్ చేసాను. ఆమె బంధువులు ఎవరో వున్నారని తెలిసి,మాట సాయం చేస్తారని.  అప్పుడు ఆమె మాటలు వింటే నేను అబ్బాయి మాత్రమే ఎందుకు వచ్చామా అని చింతించాను. తల్లి కొడుకు కలిసి వెళ్ళినా అనుమానంగా చూసే రోజులు వచ్చేసాయి. పుణ్యక్షేత్రాల పవిత్రతను చెడగొడతన్నారని ఎవరికి పడితే వారికి రూమ్ లు ఇవ్వడం లేదంట. ఇరవై రాకముందే బిడ్డలు పుట్టి వాళ్ళు తాటిచెట్లలా పెరిగితే మనం నలబైల్లో వుండి వాళ్ళకు అక్కల్లా కనబడతన్నాం. నలుగురైదుగురు వుంటామంటే తప్ప ఇద్దరికి మాత్రం రూమ్ లు ఇవ్వడం లేదంట”అంది. 


“అమ్మ కొడుకు అని నిరూపించడానికి ఆధారాలు కూడా పట్టుకెళ్ళాలా.. ఆ సంగతి తెలిసి వుంటే అబ్బాయి పాస్ పోర్టు, రేషన్ కార్డు తెచ్చుకునేదాన్నిగా అని విసుకున్నాను. సత్రం రిసెప్షన్ లో రూమ్ లు ఇచ్చేవాడు  పిల్లాడిని నన్ను ఎంత  అనుమానంగా చూసాడో తెలుసా! ఎంత అవమానం అనిపించిందో నాకు. ఇంకెప్పుడూ ఈ సత్రానికి రాను. విరాళాలు రాయను” అన్నాను చికాకుగా. 


అక్కడి నుండి గంగ సదన్ కి వచ్చి రూమ్ తీసుకుని ప్రెష్ అయి భోజనానికి వెళ్ళడానికి కిందకు వస్తుండగా ముందెళ్ళిన  సత్రం గుమస్తా ఎదురై “ఇందాక పొరబాటు జరిగిందమ్మా, క్షమించాలి మీరు. భోజనానికి మన సత్రానికే రావచ్చు. ఇక్కడ ఖాళీ చేసి అక్కడికి వస్తే ఏసి రూమ్ ఇస్తామన్నారు” అన్నాడు.


 స్నేహితురాలి ఫోన్ సిఫారసు ఫలితం అని అర్థమై “వద్దులెండి. మీ రూల్స్ ఏమిటో తెలిసాయి కదా. ఈ సారి వచ్చినపుడు అన్ని వివరాలు తెలిసేటట్టు ఆధారాలు వెంట తెచ్చుకుంటాం అన్నాను విసురుగా. అసలు అబ్బాయి ముందు అలాంటి విషయం వొకటి చర్చకు రావడం నాకు ఇష్టం లేకపోయింది. 


ప్రదోషసమయంలో  మల్లికార్జునుడి దర్శనం అమ్మ వారి హారతి ప్రాతఃకాల అభిషేకం అమ్మవారికి కుంకుమ పూజ అన్నీ ప్రశాంతంగా జరిగిపోయాక.. నేను గుడిలో ప్రదక్షిణలు చేసుకుంటాను వస్తావా అని అడిగాను అబ్బాయిని. “రాత్రి సరిగ్గా నిద్రపోలేదమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వు తీరిగ్గా ప్రదక్షిణలు చేసుకుని రా” అని రూమ్ తాళం తీసుకుని వెళ్ళిపోయాడు.  నాలుగు ప్రాకారాల మధ్య చుట్టూ రద్దీగా సంచరిస్తున్న భక్తులను  తప్పించుకుంటూ  నేను కొన్ని ప్రదక్షిణలు చేసిన తర్వాత మా పక్కనే వున్న రూమ్ లో వున్నావిడ ఎదురైంది. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. పంచాక్షరీ జపిస్తూ వున్న నేను పట్టించుకోనట్టూ ముందుకు సాగాను. 


ఆమె పేరు మీనమ్మ అని చెప్పినట్టు గుర్తు. చామానఛాయ రంగుతో  కళగల ముఖంతో బలిష్ఠమైన ఆకృతితో చాలా ఉత్సాహంగా కనబడింది. మళ్ళీ తర్వాత ప్రదక్షిణలో వృద్ద మల్లికార్జునుడి గుడి దగ్గర ఎదురైంది. 


నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి పలకరించింది. ఎన్ని ప్రదక్షిణ లు చేస్తున్నారు అని. నోరు విప్పక తప్పింది కాదు. అంతటితో ఆగకకుండా  ఏ ఊరు ఏం చేస్తారు అని వివరాలు అడిగింది. చెప్పిన తర్వాత “ తన పేరు చెప్పింది.  నా వయస్సు ఎంతనుకున్నావ్ “ అని అడిగింది  నా ప్రదక్షిణకు అంతరాయం కల్గిస్తూ, నడకలో నడక కలుపుతూ. 


చిరాకు పడ్డాను.  ఆమెను అంతకు ముందు రోజు దేవాలయం పరిసరాల్లో చూసాను. రాత్రి సత్రం భోజనశాలలో చూసాను. ఉదయాన్నే పాతాళగంగకు నేను దిగుతుంటే మెట్లెక్కుతూ ఎదురైతే చిన్న చిరునవ్వుతో పలకరించాను. ఇప్పుడీమె ఎదురై ఆరాలు తీయడం ఈ అసంబద్దమైన ప్రశ్న వేయడం. అసలు ఆమెకు ఎంత వయస్సు వుంటే నాకెందుకటా అని మనస్సులో విసుక్కుంటూనే అప్రయత్నంగా నలభై నలబై అయిదు మధ్య వుంటాయేమో అని సమాధానమివ్వగానే గలగలా నవ్వింది. “ఏబై నాలుగు” అంది. ఓహో అన్నట్టు చూసానేమో! 


“కాసేపు ఈడ కూర్చుందామా “ అని అడిగింది. కాదనబుద్ధి కాలేదు. త్రిఫల వృక్షాల క్రింద చప్టాపై కూర్చున్నాం. 


“ఎన్ని రోజులైంది!? మీరొచ్చి “ అన్నాను.


 “నెలా పదిరోజులైంది”


“ఎందుకు అన్ని రోజుల నుండి వున్నారు? ఏమైనా మొక్కు వుందా  లేదా మండల దీక్ష లాంటిదా”  


పకపకా నవ్వింది. గుండె జల్లుమంది. అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. 

నిన్న సాయంత్రం రూమ్ శుభ్రం చేసే ఆమె మాటలు గుర్తొచ్చాయి.  వాళ్ళది కన్నడ రాష్ట్రం.  మనిషి చూస్తే  ఉత్సాహంగా ఆరోగ్యంగానే వుండట్టు వుంటుంది. చేష్టలు చూస్తే ఏమిటో పిచ్చి పిచ్చిగా గొణుక్కుంటూ చేతులు తిప్పుకుంటూ నవ్వుకుంటూ వుంటది. కొడుకు అనుకుంటా. రోజు రెండు పూటలా చేయి పట్టుకుని వదలకుండా తిప్పుకుంటా వస్తాడు. నలబై రోజులు నిద్ర చేస్తే పిచ్చి గిచ్చి తగ్గుద్ది ఒంటి మీద చేరిన దెయ్యాలు వొదులుతయ్యి అని చెప్పారంట. ఓపిగ్గా తిప్పుతున్నాడు బిడ్డ” అని. 


“కూర్చో బుజ్జమ్మా” అంటూ చేయి పట్టుకుని గుంజింది. బెరుకు బెరుకుగా కూర్చున్నాను. 


“నిన్ను చూస్తుంటే నా మనస్సులో వున్నదంతా విప్పి చెప్పుకోవాలని అనిపిస్తుంది” అంది. 


ఎందుకు అని అడగలేకపోయాను. మనిషి సాత్వికంగా ముఖం  పవిత్రంగా కళకళలాడుతూ వుంది.మాట్టాడకుండా ఆమె వంక నిశితంగా చూసాను.


“ నీతో వచ్చింది కొడుకా” అనడిగింది. 


“అవును, ఒక్కడే కొడుకు, వారం రోజుల్లో అమెరికా కి పై చదువులు చదవటానికి పోతున్నాడు. స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు అందుకుని పోవాలని వచ్చాం. అభిషేకం చేసుకున్నాం. స్వామి స్పర్శ దర్శనం అయింది. రాత్రికి బయలుదేరతాం” అన్నాను. 


“నాతో వుండింది నా కొడుకు అనుకొంటివా” అడిగింది. 


“అవును, అట్టాగే వున్నాడు, అలాగే అనుకుంటున్నా”


మళ్ళీ గట్టిగా నవ్వింది. నా చెవి దగ్గర ముఖం పెట్టి రహస్యం చెబుతున్నట్టు చెప్పింది. “అందరూ అనుకునేటట్డు  వాడు నా కొడుకు కాదు నా ప్రియుడు” అంది. 


ఆశ్చర్యపోలేదు వేగంగా ఆలోచించాను. సందేహం లేదు ఈమెకు నిజంగానే మతి భ్రమించి వుంటుంది. ఇంతకు ముందు తన వయస్సెంత అని అడిగింది ఇప్పుడిలా. తొందరగా ఈ మనిషిని వదిలించుకుని పోవాలి అనుకుంటూ చుట్టుపక్కల ఎక్కడైనా ఆమె కొడుకు కనబడతాడేమో అని చూపులతో గాలిస్తున్నాను. 


“నువ్వు నమ్మడం లేదు కదూ, నేను చెప్పింది నిజం బుజ్జమ్మా! దేవళంలో కూర్చుని అబద్దం ఎందుకు చెపుతాను. నన్ను నమ్ము” అంది దీనంగా.


“నీ నిజాలన్నీ నాకెందుకు, నన్ను వొదిలేస్తే నా ప్రదక్షిణ లు నేను చేసుకుంటా “ విసుగు ప్రదర్శించాను. 


“నా సొదే అనుకో నా కథే అనుకో అది కూడా వింటే నీకు పుణ్యం దక్కుద్ది అనుకో. ఇలాంటి కథ నువ్వెప్పుడూ విని వుండవు’’ అని ఊరించింది.


కథలంటే ఇష్టం కనుక “సరే చెప్పు మరి”అన్నాను వింటే కానీ వొదిలి పెట్టేటట్టు లేదని. 


“నేను  కాపు బిడ్డను. నెల్లూరు ఆత్మకూరు కాడ చిన్న పల్లె. పద్నాలుగేళ్ళ వయస్సుప్పుడు    రాయచూర్ కి వలసబోయిన కుటుంబంలో వాడికిచ్చి పెళ్ళిజేసారు. వొళ్ళు ఇరగ పనిచేయడం మొగుడు చెప్పినమాట ఎదురుచెప్పకుండా ఇనడం. మోటుమనిషి. ముగ్గురు బిడ్డల తల్లినయ్యానన్నమాటే కానీ  నేను మనసు నిండా సుఃఖ పడిందే లేదు. భర్త ప్రేమ దక్కిందే లేదు. అంతా అతుకుల బొంతే అనుకో. మన పెద్దాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే.. అందరూ అని కాదులే.. మా తాత లాంటోళ్ళు అనుకో ’’


చెప్పడం ఆపి కాసిని నీళ్ళు తాగింది. కథ వినే ఉత్సాహంలో ఆలస్యం భరించలేకుండా వున్నా నేను. 


“మా తాత పెద్ద కవి లే. కవిత్వం రాసేవాడు. గజళ్ళు చదివేవోడు. అందరికీ నోరార విప్పి చెప్పేవాడు. జమీన్ & రైతు చదివి వినిపిస్తా వుండేవాడు. మా నాయన చిన్నగా వున్నప్పుడే మా అవ్వ చనిపోయిందంట. మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా నలుగురు బిడ్డలను సాకినాడు. రోజూ ఆయన  వొళ్ళో కూర్చుని ఇన్న మాటలే అనుకో, బాగా గమనం వుండాయ్. ఇట్టా అనేటోడు “ బొట్టా! మనిషన్న  వాడికి జీవితంలో అన్ని దశల్లోను ప్రేమ శాంతి దొరకాలి. సముద్రం నుంచి కొంత, అడవి నుంచి కొంత, నాయన నుంచి కొంత, అమ్మ నుంచి కొంత, సేయితుల నుంచి కొంత, భర్త నుంచి కొంత, బిడ్డల నుండి కొంత ఇట్టా అందరి నుండి కొంత కొంత గ్రాసం ప్రేమ జవురుకుంటే కానీ ఈ కట్టె చల్లారదు” అని. 


“ఆయనెందుకు చెప్పాడో కానీ ఆయన చెప్పినవేమి నాకెప్పుడూ దొరకలేదు. ఆకులుపోకలు అందుకున్నప్పుడు నుండి ఎదురు చూపే మిగిలింది. మొగుణ్ని మనసు నిండా కరువుదీరా కౌగలించుకున్నదే లేదు. ఈ ఆకలి శరీరానిది కాదు మనసుది. బిడ్డల పెళ్ళిళ్ళై మనవళ్ళు మనవరాళ్ళు పుడుతున్న కొద్దీ ముసలిదాన్ని అయిపోతన్నాను నా మనసు ఆకలి తీరకుండా ఏడ చచ్చిపోతానేమోనని వొకటే దిగులయ్యేది. నేను మాత్రం జీవమున్న ప్రతిదాన్ని నిండా కావిలించుకుంటాను. పిల్లలు, పిల్లల పిల్లలను,దూడను  పెయ్యను కుక్కను మేకను పిల్లిని ఆఖరికి అంతంతలావు మానులను కూడా వాటేసుకుంటాను.అయినా మనసుకు నెమ్మది లేదు. కంటినిండా నిదుర పట్టేది కాదు. ఆఖరికి నా ఆకలిని కనిపెట్టినవాడు ఒకడు కనిపించాడు. కుడియెడంగా నా కొడుకు వయస్సు వున్నవాడు. వాడిని తగులుకున్నాను. తప్పా ఒప్పా అని ఆలోచించలేదు నేను. శరీరానికేనా భోగానుభవం మనస్సుకు ఉండొద్దూ. ఆకలిగా వున్నప్పుడు అందుబాటులో వున్నది తిని ఆకలి తీర్చుకున్నట్టు మొగుడు పెళ్ళాం మధ్య  కాపురం సక్రమంగా  వర్దిల్లినా  వాళ్ళ మధ్య గాఢానురాగం లేకపోతే అది ఓటి కుండ లెక్క. నలబై ఏళ్ళ కాపరంలో మొగుడి గుండెల మీద పడి ఆదమరించిది లేదు. నా మనస్సు సేదదీరింది లేదు. కంటికి కనబడని నరమానవుడికి తెలియని వియోగ దుఃఖం ఏదో  ఎప్పుడూ నన్ను అతుక్కొని వుండేది.  అందుకే దైర్యం చేసా. ఈ నలబై రోజులు వాడు నన్ను ప్రియంగా చూసుకున్నాడు. వాడు నా ఆకలిని గుర్తించాడో అశాంతిని కనిపెట్టాడో ఆర్తిని అర్దం చేసుకున్నాడో కానీ నలభై రోజుల నుండి మరో లోకం చూయిచ్చాడు. స్వర్గం అంటే ఇట్టాగే వుంటదేమో అనిపించింది అనుకో. ఇప్పుడు నా మనసుకు తృప్తిగా నెమ్మళంగా వుంది. ఇట్టా చేసినందుకు నేనేమి సిగ్గుపడటం లేదమ్మాయ్! పాపభీతి బిడియం నన్నేం తరుముకొస్తలేదు. దేవుడు సాచ్చిగా చెబుతున్నా, నువ్వు నమ్మాలి” అంది. 


ఆశ్చర్యమో అసహ్యమో అయోమయమో ఏమో తెలియదు. ఇది నిజమా అబద్దమా అన్న ఆలోచనా లేదు. నోట మాటరాలేదు. ఎలాంటి మనిషిని విన్నాను. ఇంత దైర్యమా, తెంపరితనమా! పైగా అపరిచితురాలినైన నాకు కూర్చోబెట్టి మరీ చెపుతుంది అని నివ్వెరపోయి కళ్ళు విప్పార్చుకుని ఆమెనే చూస్తూ..  ఔనా! అని మాత్రం అనగల్గాను. 


మళ్ళీ చెప్పడం మొదలెట్టింది. 

“మొన్న మా ఊరు వాళ్ళు కనబడ్డారు. ఊరంతా గోలగోలగా వుంది. నువ్వు ఈడ వుండావా అని ఆశ్చర్యంగా అడిగారు. ఈపాటికి నేను ఈడ వుండానని నా కుటుంబానికి ఉప్పు అందేవుంటంది. నా మొగుడో పిల్లకాయలో రేపో మాపో వచ్చి ఇక్కడ వెతుకుతారు. నన్ను తీసుకునిపోతారు. పరువు కోసం అసలు విషయాన్ని  గంప కింద దాపెట్టి   తీర్ధయాత్రలకు వెళతానంటే   వద్దంటున్నామని ఎవరితో చెప్పాపెట్టకుండా   గుళ్ళు గోపురాలు చూడటానికి  పోయిందని  అని చెప్పుకుంటాడేమో నా మొగుడు”  చెప్పడం ఆపి మళ్ళీ గల గలా నవ్వింది. 


“ఒకవేళ ఇదంతా తెలిసి ఈ ముసలిముండకు రంకు మొగుడు కావాల్సొచ్చిందా అని కోడళ్ళు అసహ్యించుకున్నా, కూతురు చీదరగా చూసినా, జవసత్వాలు చచ్చిన మొగుడు రొప్పుతూ కాళ్ళతో కుమ్మినా లెక్కపెట్టేదే లేదు. ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు నాకు  కావాల్సింది నాకు దక్కించుకున్నాను. ఈ తృప్తి చాలు నాకు “ అంటూ గర్వంగా సంతృప్తిగా నవ్వింది. 


నేను నోటమాట రాక వింటూ వుండిపోయాను.


ఇంకో సంగతి చెప్పనా నీకు, ఇక్కడ నిత్యం  పాతాళగంగకు పోయి పచ్చలబండను చూసివస్తాను. ఎందుకో తెలుసా! కూతురిని మోహించిన రాజు ని పచ్చలబండవై పడివుండమని శపించింది అంటగా. మరి నేను కొడుకు వరుసయ్యే వాడిని మోహించాను కదా! లోలోన నేను ఏ బండను అవుతాననే భయం అనుకుంటా.  మనిషి బతికివుండగానే కోరికతో పెయ్య కాలుతుంటే చచ్చినాక వచ్చే పాపపుణ్యాల గురించి చింత ఎందుకంటా అంటా నేను. నువ్వు ఏమన్నా అనుకో,ఎవురికో వొకరికి నా లోపలి బాధ చెప్పుకోకపోతే కుమ్మరి పురుగు తొలిచినట్టు మెదడును ఈ విషయం తొలిచేత్తా వుంటంది. అందుకే చెప్పుకుని తెరిపిన పడ్డా. ఇప్పుడు మనసంతా తేలిగ్గా వుంది” 


వింటున్న నాకు ఆమె చెప్పిన విషయం జీర్ణం కావడానికి సమయం పట్టేట్టు అనిపించింది. ప్రశాంతంగా ప్రదక్షిణలు చేసుకుంటూ వున్న నన్ను కదిలించి మరీ  ఒక విధమైన షాక్ యిచ్చింది. 


“వస్తాను బుజ్జమ్మా! వాడు కూడా బయలుదేరతానంటున్నాడు. పెళ్శి కావాల్సిన పిల్లోడు. వాడన్నట్టు  రేపో మాపో మా  వాళ్ళ కంటబడి నలుగురు నోళ్ళల్లో నానడం ఎందుకు చెప్పు? నేను కూడా ఈ రూమ్ ఖాళీ చేసి మా కన్నడ సత్రంలో రూమ్ తీసుకుంటా. పోయొస్తా! రహస్యాలు నేను దాచుకోలేనబ్బా పొట్టపగిలిపోద్ది” గలగలా నవ్వుకుంటూ వెలుపలి ద్వారం వైపుకు నడుచుకుంటూపోయింది. 


ఆ క్షణంలో విచిత్రంగా ఆమె పట్ల నాకు అసహ్యం కల్గలేదు. అభావంగా ధ్వజస్థంభం దగ్గరకు చేరుకుని చేతులు జోడించి నమస్కరించుకుని తిరిగి ప్రదక్షిణ ప్రారంభించాను. 


నేను రూమ్ కి చేరేసరికి మీనమ్మ రూమ్ లో పిల్లలతో కూడిన కుటుంబం కనబడింది. 


రాత్రి బస్టాండ్ లో  మీనమ్మ ఇద్దరు ముగ్గురు మనుషుల మధ్య కూర్చుని తనలో తనే మాట్టాడుకుంటూ తేడాగా నవ్వుకుంటూ చెదిరిన బొట్టు చిరిగిన జాకెట్ తో కనబడింది. ఆమెనే చూస్తున్న నన్ను చూసి నవ్వింది. 

విషయం అర్ధమై పలకరిద్దామని దగ్గరకు వెళ్ళాను. కన్నడ యాస తెలుగు లో  “అమ్మా, కాస్త దూరంగా వుండమ్మా,ఆమె కు మైండ్ సరిగా లేదు, మనుషులను కొడతంది రక్కుతుంది’’ అన్నాడు వయసు మళ్లి తల నెరిసిన అతను.


నేను మీనమ్మ వైపు అనుమానంగా చూసి వెనక్కి జరిగాను. 


“అవును,నేను కొడతా,తిడతా,రక్కుతా,  అంతా నా ఇష్టం. నువ్వు నా పతి దేవుడివి పతి దేవుడివి,పతిదేవుడివి, సుగంధం తెలియని రాతి దేవుడివి” రాగం తీసింది.


“నెలన్నర అయింది ఇల్లు ఇడిచి. ఏడేడో తిరిగాం. ఆఖరికి ఈడ దొరికింది. పిచ్చి ముదిరిపోయింది” అన్నాడు. మనసులో నవ్వుకున్నాను.


మేము ఎక్కిన బస్ కదిలేటప్పుడు విండో సీట్ లో కూర్చున్న నన్ను చూస్తూ.. 


“ బుజ్జమ్మా, నన్ను గుర్తుంచుకో, టాటా’’ అని చెయ్యి వూపింది.నేను చెయ్యి ఊపాను. “ నువ్వు పిచ్చి వాళ్ళతో కూడా ఫ్రెండ్ షిప్ చేస్తావమ్మా” అన్నాడు నా కొడుకు నవ్వుతూ.


************

కథ అయిపోయింది. 


ఆనాడు ఆమె చెప్పిన విషయం సామాన్యమైన విషయం కాకపోబట్టే  ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆలోచించి చూస్తే.. అదొక ఆశ్చర్యకరమైనదిగా తోస్తుంది. 


మీనమ్మ కోణంలో  నుండి చూస్తే ఏది పవిత్రం, ఏది పాపం ఏది పుణ్యం.  ప్రతి మనిషి కోర్కెల పుట్ట. ఆ పుట్టలో నిదురించిన సర్పాలెన్నో! అవకాశం దొరికిన చోట దైర్యం వున్నవాళ్ళు పాపపుణ్యాల భీతి లేనివారు బిడియాలను సంకోచాలను వొదిలి తమకు కావాల్సింది పొందుతారు. మిగిలిన వారు నీతినియమాల పేరిట వారిపై కొరడా ఝళిపించాలనుకుంటారు. 


సహజీవనాలు తప్పుకాదు అని చెప్పుకుంటున్న ఈ కాలంలో మీనమ్మ ను నేనెలా తప్పు పట్టేది? అలాగని ఎలా సమర్దించేది!? వావివరుస లేకుండా బాబాయి కొడుకుతో అక్రమ సంబంధం నెరిపే బంధువుల అమ్మాయిని చూస్తూ,  సొంత పిన్ని కూతురినే గర్భవతిని చేసిన ఇంజినీరింగ్ చదివే యువకుడు గురించి విని.. ఏమిటీ కాముక లోకం! ఎక్కడుందీ లోపం!? అమలిన శృంగారం గుమ్మరించిన పూర్వ కథలు హాస్యాస్పదం అని పిల్లలకు  సెక్స్ ఎడ్యుకేషన్ ముఖ్యమని వాదించే వారిని చూస్తూ  సెక్స్ ఎడ్యుకేషన్ పోర్న్   ఒకటి కాదు అని వొప్పించడానికి ప్రయత్నించే నేను ఈ కథ కాని కథ గురించి రాయటానికే సంసిద్దురాలినయ్యాను. విజ్ఞత విచక్షణ వున్నవాళ్ళు ఎప్పుడూ వుంటారు. అవి లేని వారి గురించే మనం జాగ్రత్త పడాలి. చలం రాజేశ్వరి ని దాటి మనం చాలా ముందుకువచ్చాం. రాయడానికి చర్చించడానికి ఇంకా సంకోచాలు వుంటే ముందు ముందు లోకం ఏమికానున్నదో. మీనమ్మ భర్త లాంటి భర్తలకు భార్యల హృదయాన్ని టార్చ్ వేసి చూపించాలి కదా! 


విలువలు మారుతున్నప్పుడు రచనలు కూడా మారాలి కదా! మంచినీళ్ల ప్రాయంగా  ఎల్లప్పుడూ నీతులు వల్లించడం  ఏదైతే వుందో అది మురుగునీటి గుంటను శుభ్రం చేయాలనుకుని అందులో గంగాళం మంచినీటిని గుమ్మరించినట్లు వుంటుందని నాకనిపించింది. 


అందుకే  మీనమ్మ కథ ఇప్పుడిలా మీ ముందుకొచ్చి కూర్చుంది. పన్నెండేళ్ళు నా ఆలోచనల్లో మోసిన బరువును మీరు మోయాలిపుడు. అన్నట్టు మీనమ్మ ను వొకటి అడగడం మరిచాను. మీరు పుస్తకాలు చదువుతారా, మీ తాతగారు చలం పుస్తకాలు కానీ మీతో చదివించారా అని. ఆమె చలం పాత్ర అనిపించింది మరి. ఆమె ఎక్కడైనా ఎదురైతే మీరీ విషయం అడగడం మర్చిపోవద్దే. 


****************౦*****************


#ఈస్తటిక్_సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.