#వనజతాతినేని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
#వనజతాతినేని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, సెప్టెంబర్ 2024, గురువారం

రాజు-వెట్టి

 


కారు ఊరిని వెతుక్కుంటూ బయలుదేరింది. 

గూగుల్ మ్యాప్ సాయంతో ఊరు చేరిన చంద్ర డ్రైవర్ తో  “ఆంధ్ర దేశంలో ఊళ్ళన్నీ ఇలాగే వున్నాయా?”


“ఆ.. ఇలాగే వుంటాయండీ. రైతువారీ పద్దతి ఇప్పుడు ఎక్కడుందండీ,  జనం అంతా సిటీల్లోనే కదా వుండేది” . వివరణో ఆరోపణో అంతు చిక్కలేదు.


 “ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందట మా తాత చనిపోయినప్పుడు వచ్చాను. సరిగ్గా ఇల్లు కూడా  గుర్తు పట్టలేను.లీలగా జ్ఞాపకం. తండ్రి భూషణరావుకి ఫోన్ చేసాడు. ఎంగేజ్ వస్తుంది.  “ఎవరితోనో మాటల్లో వున్నారు. ఈలోపు  ఊరంతా తిరిగి చూద్దాం. గుడి వుంటుంది మా ఇంటికి దగ్గర్లో”  సూచన ఇచ్చాడు.  ఊరి వీధులన్నీ చుట్టేస్తుంటే అక్కడక్కడా  అరెకరంలో కాకపోయినా పది ఇరవై సెంట్ల స్థలంలో వున్న ఇళ్ళు దైన్యవదనాలతో వెలిసిపోయిన రంగులతో  ముందు వాకిట్లో జిల్లేళ్ళు మొలిచి వెనక పెరడంతా పిచ్చి చెట్లు అలవికాని తీగలు అల్లుకుని లోపలికి అడుగుపెట్టడానికి వీలుకాకుండా వున్నాయి. పరీక్షగా మనసుపెట్టి చూస్తే   దీపం పెట్టే దిక్కు కోసం అలమటిస్తూ గత జ్ఞాపకాలతో ఊపిరి పీల్చుకుంటున్నట్టు వున్నాయి. కొన్ని ఇళ్లు రేపో మాపో కూల్చివేయబడటానికి సంసిద్దంగా వున్నాయన్నట్లున్నాయి. 


మనుషులు ఈ ఇళ్ళను నిర్మించుకునేటప్పుడు  తమ భావి తరాలు  రాజ్యాలు ఏలినట్టు ఊరిని ఏలాలనుకుని ఎన్నెనో ఊహలు కలలు ఆశలతో  ఉత్సాహంతో ఇల్లు కట్టించుకుని  వుంటారు!? వందేళ్లు గడిచినా చెక్కు చెదరని ఆ ఇళ్ళల్లో వారసులు లేకున్నా సరే మనుషులైనా ఉండటం లేదు. బదులు ఎలుకలు పందికొక్కులు పాములు గబ్బిలాలు రాజ్యమేలుతూ భీతిగొల్పుతున్నాయి అనుకున్నాడు చంద్ర. 


గుడి దగ్గరకు చేరుకున్నాక.. అక్కడికి దగ్గరగా వున్న ఇల్లును గుర్తించాడు. వీధి దర్వాజాకి అటునిటూ గోడపై నిలిపిన ఎద్దుల బొమ్మలు. ఠీవిగా కనబడుతున్నా పాకుడుబట్టి నల్లబడిపోయి కళ కోల్పోయి పెచ్చులూడిపోయి గత వైభవ చిహ్నాలుగా మిగిలివున్నాయి.  దర్వాజా పక్కన నల్లటి రాతి పలక పై తాత తాత పేరు. లంకా రామచంద్రయ్య. ఆయన పేరే తన పేరు కూడా!  తరాలు మారుతూ నాగరికత అద్దుకుంటూ తన దాకా ప్రయాణించింది. దర్వాజా తలుపులు మూసి తాళం వేసి వుంది. పగలగొట్టడానికి కూడా సాధ్యపడని ఇత్తడి తాళం అది. అప్పుడు వచ్చాడు పొలం కౌలు కు చేసే తిరుమలరావు. తనను పరిచయం చేసుకుంటూ “వచ్చేటప్పుడూ ముందుగా చెప్పాల్సింది బాబూ!” అన్నాడు.


 “లోపలికి వెళ్ళడానికి వీలవుతుందా”. 

అతను గొడ్డలి కొడవలి తెచ్చి కాస్త దారి శుభ్రం చేసాక  వరండా వరకూ వెళ్ళడం వీలైంది. సింహద్వారం ముందు వున్న మెట్లపై కూర్చుని చుట్టూ పరికించాడు. రాతి పలకల్లోంచి రావిచెట్లు మొలుచుకొచ్చి మనిషి ఎత్తును దాటి కొమ్మలు విస్తరించాయి. 


“శుభ్రం చేస్తానే వుంటామండీ మళ్ళీ పుట్టుకొస్తాయి.కొబ్బరిచెట్లకాయలు మామిడికాయలు వొక్కటి మిగలనీయరండీ,గోడలు దూకి కోసుకెళ్ళిపోతారు” 

గోడలవైపు చూసాడు. ఏడడుగులెత్తు. పెదవులు విచ్చుకున్నాయి చంద్ర కి.

 

ఇల్లు లోపల కూడా చూద్దురుగాని రండి. తాళం తీసి లోపలికి నడిచాడు. మాస్క్ తగిలించుకుని లోపలికి వెళ్ళాడు. చీకటి గుహలా గబ్బిలాల నిలయం లా తోచింది. “అంతా పాడుబడిపోయిందండీ, స్థలమే కానీ ఇల్లు ఏ మాత్రం పనికిరాదు అండీ”  అభిప్రాయం వెలిబుచ్చాడు తిరుమలరావు.  ఫోన్ టార్చ్ వేసుకుని వేలాడుతున్న సాలెగూడులు తెంచుకుంటూ ఇల్లంతా తిరిగిచూసాడు చంద్ర. 


ఆజానుబాహుడు ఒంటిమీద ఎర్రమట్టి రంగు తేలుతూ  ముతకపంచె చొక్కా  పైపంచె వేసుకుని తలపాగా చుట్టుకుని లావుపాటి వెండి కడియం తొడిగిన దండ చేతిలో  చేతి కర్ర ఊతగా చేసుకుని నిలబడ్డ వృద్దుడు కళ్ళముందు కదలసాగాడు. కుడి చెవి కి కుట్టిన బంగారు కాడ దానికి వేలాడే బుళాకు  దట్టమైన కనుబొమలు  విశాలంగా వుండే నుదురు పెద్ద పెద్ద కళ్ళు కోటేరేసిన ముక్కు  గుబురు మీసాలు  నిడుపాటి గడ్డం ఎర్రని పెదవులు సాగదీసి పళ్ళన్నీ కనిపించేలా నవ్వే నవ్వు. తన వెనుక నీడలా అనుసరిస్తున్నట్టు అనిపించసాగింది చంద్ర కి.  


“ ఉరమరగా తొంబై ఏళ్ళు ఈ ఇల్లు కట్టి. నాకు అప్పటికి యాభై యేళ్ళు పై మాటే, మారేడుమిల్లి కొయ్యలగూడెం  అడవులకు వెళ్లి నల్లమద్ది టేకు చెట్లు నరికించి దూలాలు చేపిచ్చి గానుగ సున్నంతో కట్టిన ఇల్లు. ఐదుగురు కొడుకులకు ఐదిళ్ళు కట్టిచ్చా” అని ఆ మనిషి చెబుతున్నట్టు  తను విన్నట్టు వుంది అనుకున్నాడు.


 బ్లాక్ మ్యాజిక్ సినిమాలు గుర్తొచ్చి మనసులో చిన్నపాటి జంకు.దాన్ని జయించడానికి.. తిరుమలరావుతో మాట కలుపుతూ “మీ పిల్లలు ఏమి చేస్తారు అడిగాడు. “డిగ్రీ దాకా చదువుకున్నారండీ. ఉద్యోగాలు రాలేదండీ. ఆ అమెజాన్ లో స్విగ్గీ జొమాటో ల్లోను డెలివరీ బోయ్ లుగా పనిచేసి ఎదుగుబొదుగు కనబడక తిరిగి వచ్చేసారండీ. నాలుగు గేదెలను కొన్నాం. రోజుకు ఇరవై లీటర్ల పాలు అమ్ముతాం. ఒకడు ఆ పని చేస్తాడు. ఇంకొకడు మునగతోట వేసి అంచులెంట ఆర్గానిక్ కూరగాయలు పండిస్తాడండి. ఈ ఏడు మా సొంత పొలంలో రెండు ఎకరాల జెముడు మొక్కలు వేసామండీ. ఇప్పుడిప్పుడే కాయలు వచ్చాయండీ. మరో రెండు ఏళ్ళకు చేనంతా పూర్తి పంట కొచ్చేత్తది అండీ.  గర్వం తొంగిచూసింది.  తను బ్యాక్ యార్డ్ లో కూరగాయలు పండించినప్పటి సంతోషం లాంటిది వెయ్యరెట్లు పైనే కనబడింది చంద్ర కి. 


మళ్ళీ అతనే అన్నాడు. “బాబయ్యా..మీరు ఈ  ఇల్లు అమ్మాలనుకుంటే ఎవరికీ అమ్మబాకండి బాబూ! నేనే కొనుక్కొంటాను. ఏళ్ళ తరబడి మీ భూముల్ని కంటికి రెప్పలా చూసుకొన్నాను  కూడానండీ, మీఇంటి మనిషినే అనుకుని కాస్త తక్కువకే ఇయ్యాలండీ” అన్నాడు వినయంగా. 


 చంద్ర నవ్వి ఊరుకున్నాడు. 

 

“మీ బాబాయి గారితో మాట్టాడి మీరు వెళ్ళిపోయేలోపు ఇల్లు అమ్మకం ముగిచ్చేసుకుని  రిజిస్ట్రేషన్ కూడా చేయిచ్చుకుంటే పనై పోద్ది బాబూ! మీ నాన్న గారిని ఎప్పుడడిగినా అబ్బాయిని రానీ వాడు సంతకాలు చెయ్యాలిగా అని దాటేత్తున్నారు. మీరు వచ్చారుగా.. అందుకే తొందరపడుతున్నా.  మీ బాబాయి గారిని పిలిచి మధ్యవర్తులను పెట్టుకుని మాట్టాడుకుందాం”. ఈ ఇంటిని తను సొంతం చేసుకుంటే కానీ నన్ను  కదలనిచ్చేటట్టు లేడు అనుకున్నాడు చంద్ర. ఇంటి బయటికి వచ్చి చుట్టూ తిరిగి చూసి మళ్ళీ గుమ్మం ముందు మెట్టు మీద కూర్చుని ముఖం తుడుచుకుని బాటిల్ లో నీళ్ళు తాగి.. వరి పొలం, మామిడితోటకి కూడా వెళదాం అన్నాడు. 


“అలాగేనండీ.. తమరు కాఫీ టిఫిన్ పుచ్చుకున్నాక వెళదాం, మా ఇంటికి రండి” అన్నాడు తిరుమలరావు.  


“దారి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం  తిరిగి వెళ్ళేటప్పుడు చూద్దాం. పొలానికి కారు వెళుతుంది కదా?”


“మీ పొలాలకు రాజమార్గం పడిపోయింది.” నేను బండి మీద వెళతా వుంటా మీరు మావెనకాలే రండి” దారి తీసాడతను. 


వెనుక సీట్లో కూర్చుని ఇరుపక్కలా వున్న పంటపొలాలను చూస్తూంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించిందతనికి.  ఖాళీ మాగాణి పొలం చూసుకుని మామిడితోటకు వెళ్లారు. మూడు రకాల ఫల భారంతో మామిడి చెట్లు ఏదో సందేశాన్ని ఇస్తున్నట్టు వున్నాయి. డ్రైవరు, తిరుమలరావు ఆవకాయ కు పనికొచ్చే కాయలు పక్వానికొచ్చిన కాయలు కోసి అట్ట పెట్టెల్లో ప్యాక్ చేసుకోవడానికి తోట లోపలికి వెళ్ళారు. కారు సీట్ సరిజేసుకుని విశ్రాంతిగా పడుకొని రెండు రోజులుగా వస్తున్న కలలను విశ్లేషించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. నిద్ర ఆవహించింది.  మళ్ళీ  చెవి పక్క గుస గుస వినిపించింది. ఆ చెవి పోగు వున్న మనిషే.గంభీరమైన ఆ గొంతు లో వేదన పొంగిపొర్లుతా వుంది.


“అనిమనుమడా! మా అప్పుడు చెరువు పక్కగా వుండేవి ఈ ముదిరాజుల ఇళ్ళు.ఇప్పుడు ఊరంతా విస్తరించాయి. రైతు కుటుంబాలు వ్యవసాయం వొదిలేసి పోతే  ఆ పొలాలను నమ్ముకుని వ్యవసాయం చేస్తూ పాడి పంటలు ఊతగా చేసుకుని వాళ్ళిప్పుడు మన ఇళ్ళను పొలాలను కొనుక్కోగల స్థితిమంతులు అయ్యారు. మన వాళ్ళేమో బియ్యం దొరకని దేశంలో ఏవేవో తిని సర్దుకుంటున్నారు. సత్యం చెబుతాను వినుకో, ఎప్పుడైనా భూమి ఉన్నోడిదే రాజ్యం. పంట పండించిన వాడికే నోట్లోకి నాలుగువేళ్ళు వేళ్ళే కాలం మళ్ళీ వస్తుంది చూడరా! నేను చెప్పేది నిజం అవుద్ది. రాసి పెట్టుకో.  కాస్తో కూస్తో వున్న భూమిని ఇల్లును అమ్మవొద్దు రా తండ్రీ!” అభ్యర్ధన. 


మళ్ళీ.. ఆ గొంతే.. “అదిగో కనబడుతున్న పాటిదిబ్బలన్నీ వొకప్పుడు మనవే!  పొగాకు వేసేవాళ్ళం. బాయి నీళ్లతో మోట తోలి తోట తడిపే వాళ్ళమి. అదంతా నా కొడుకులకి పంచి ఇస్తిని. వాళ్ళు వాళ్ళ కొడుకులికి అప్పజెప్పితిరి. అందరూ అమ్ముకుని పోయారు. నా మనుమడి కూతురు అదే మీ పెద్ద తాత కూతురు. చర్చికి రాసి ఇచ్చింది ఆ స్థలం. ఆ పక్కనే మీ తాతకిచ్చిన స్థలంలో దేవుడి బండలుండేవి. వినాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అమ్మవారు అయ్యవారు అంతా వుండిరి. వారికి కప్పు లేకుండే. ఎన్ని తరాలుగా అట్లా వుండిదో నాకు తెలియదు. పట్టించుకునే నాధుడు లేకపోతే గుడి ఏంటి ఇల్లేంటి అన్ని శిథిలమే!  ఆ శిథిల శిల్పాలు ఎక్కడెక్కడ వాళ్ళో ఎవరెవరో వచ్చి ఎత్తుకుపోయే. ఇప్పుడు ఆ భూమి లేకపోయే. ఒకప్పుడు బొడ్రాయి మన ఇంటి వెనక వుండేది. ఇప్పుడు దక్షిణపు పక్క ఊరంతా కాలగర్భంలో కలిసిపోయే! నేను పోతిని నా కొడుకులు పోతిరి వాళ్ళ కొడుకులు మూడొంతులు పోతిరి. ఊరొదొలి పోతిరి నగరం వొదిలి పోతిరి దేశం వొదిలి పోతిరి.  అట్టా పోయినవాళ్ళు ఎప్పుడో వొకసారి వొచ్చి ఉన్న కాసిని భూముల్ని ఇళ్ళని అమ్మకుంటింటిరి. ఇంకా అమ్ముకోవడానికి నీలా ఊరికి వస్తిరి. నాకు మనసంతా గింజుకుంటది. దుఃఖం తడిపేస్తది.” ఆ మనిషి పొగిలి పొగిలి ఏడుస్తున్న శబ్దం, కట్టవేయలేని దుఃఖం.కట్టడి చేయలేని దుఃఖం. గుండెని మెలిపెడుతున్న దుఃఖం.


“మనుమళ్ళు, ముదిమనుమళ్ళు, అనిమనుమళ్ళు నగరాల్లో మహా నగరాల్లో విదేశాల్లో తలదాచుకోవడానికి ఇంత నీడ కోసం  నేల విడిచి సాము చేస్తూ గజాల్లో తమను తాము ఇరికించుకుంటూ పాతిక ముప్పై ఏళ్ళు బ్యాంక్ లకు తమను తాము తాకట్టు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఈ ఇళ్ళన్నీ ఏం కావాలి, ఈ భూములు ఏమి కావాలి!?  నేనూ, పంచపాండవుల్లాంటి నా కొడుకులు ముప్పొద్దులా రెక్కలు ముక్కలు చేసుకుని  అరక దున్ని ఆరుగాలం కళ్ళలో వొత్తులేసుకుని పంట పండించి కొండపల్లి నవాబులకు సగం పైగా శిస్తులు కట్టితిమి. మిగిలినయ్యే పొతింగా సర్దుకుంటూ పాలు అమ్మి పెరుగు అమ్మి నెయ్యి అమ్మి పిడకలమ్మి గంజి తాగి కాణీ కాణీ కూడబెట్టి దివాణం వాళ్ళదో అగ్రహారం వాళ్ళదో భూముల్ని కొని సాగుజేస్తిమి. కష్టపడి నూట యాభై ఎకరాలు చేస్తిమి.నాలుగక్షరాలు చదువుకొని వచ్చి మీ ఎకరాలు  మీరు సాగు చేసుకోమంటిమి. చదువు చంకనేసుకుని మనవళ్ళు ఊరు దాటెల్లి వాళ్ళ  పిల్లల చదువుల కోసమని వ్యాపారం కోసమని భూములని అవగ్గా అమ్ముకుంటురి. “ 


“ఇక్కడ పండించే వాడు లేక భూమాత పిక్కటిల్లుతుంది. అవగ్గా ఈ భూములన్నీ అమ్ముకుని పోయి ఒక ఐదారు సెంట్లలో ఇల్లు కొంటావ్.. ఈ మట్టిని అమ్ముకుని పోయి అక్కడ మట్టిని మనసారా హత్తుకుగోలవా? నీకో సంగతి తెలుసా!  మట్టికి మనిషికీ ఎగతెడని బంధం. మునిమనుమడి కొడుకా!. నీ పూర్వీకులెవరని నీ బిడ్డలు అడిగితే నువ్వు తడుముకోకుండా సమాధానం చెప్పగలవా? వాళ్ళు నడయాడిన నేల ఇది అని గర్వంగా చెప్పగలవా? చూపగలవా? 

నేను కూడా మూడవ తరగతి చదువు చదివినాను లే! అప్పుడప్పుడు దొరలతో కూడి షికారికీ పోయేవాణ్ని. మైలారం నాటక సమాజం లో నాటకాలు ఏసినాం చూసినాను.ఇంగ్లీషు రవ్వొంత తెలుసు నాకు.


“మనిషి అంటే what about అంటే నీకెన్ని భాషలు వచ్చు ఎన్ని డిగ్రీలు చదివినావు ఎన్ని కోర్సుల్లో ప్రావీణ్యం సంపాదించావు అన్నదే కాదు.. నువ్వు పుట్టిన దేశం నువ్వు ఆడిపాడిన నేల నీ పూర్వీకులు ఎవరు? వారి వృత్తి ఏమిటి, మీ ఆచారాలేమిటి? అన్నవి కూడా! మనిషి అంటే ఏడు తరాల సంస్కృతి. అది నీ రక్తంలో ప్రవహిస్తూ వుండాలి. తిండికి గడవకపోతే  వలసలు పోవాలి. మితిమీరిన కోర్కెలతో పోయి అవస్థలు పడకూడదు.ఆడ చానామందికి నిలవ వీడలేదు చేయడానికి నౌఖరీ లేదు అంట. ఆ అరకొర బతుకులు మీకెందుకు నాయనా!”


“ఆన్లైల్ చదువులు ఆన్లైన్ ఉద్యోగాలు ఒళ్ళొరగని పనులు రకరకాల పైత్య వాత రోగాలు. ఇతర దేశాల నుండి కొనుక్కొచ్చిన దినుసులు ధాన్యాలు ఫ్యాక్టరీ పాలు కొనుక్కొని తింటూ తాగుతూ మీరంతా ఆ శీతల దేశంలో ఏం సంతోషంగా వుండినారు చెప్పు. నువ్వు నీ బిడ్డల్ని తీసుకుని ఊరికి వచ్చేయ్ రా అయ్యా! ఇక్కడ  మూడు కాలాలు ఆరు బుుతువుల గొడుగులో వుండటానికి ఇల్లు దున్నుకోవడానికి నేల తాగడానికి స్వచ్ఛమైన నీరు నీ బిడ్డలకు చదువుకోవడానికి బడి గుడి అన్నీ వుండాయి. పరాయిచోట అస్థిమితంగా బతికే బతుకు నీకెందుకు రా అయ్యా! మనం కడుపు కి వొక ముద్ద తింటున్నందుకు మట్టికి దాస్యం చెయ్యాలి. మట్టి కి మనిషికి అదే విడదీయరాని బంధం.  అనిమనుమడా! నా బంగారు తండ్రీ! నువ్వు నీ మూలాల్లో సద్దుకుని చల్లంగా వుండరా! ఈ భూముల్లో పంట పండించుకుని తృప్తిగా తినండి. తరాలు తరాలు చల్లగా వుండండి. నువ్వు తిరిగి రాకపోతే నా ఆత్మ క్షోభిస్తూనే వుంటది. క్షోభిస్తూనే వుంటుంది.అది గుర్తుంచుకో..నే పోతన్నా బిడ్డా! పోతున్నా.”


వీపు పై కొరడా ఝళిపించినట్లై ఉల్కిపడి మేలుకున్నాడు చంద్ర. టైమ్ చూసుకున్నాడు. గంటన్నర పైనే అయింది తను విశ్రమించి. కల గన్నట్టు లేదు. ఎవరో తన పక్కనే కూర్చుని మాట్లాడిపోయినట్లు వుంది. వాటర్ బాటిల్ తీసి సగం పైనే గటగటా తాగేసాడు. కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు.  తిరుమలరావు డ్రైవరు మామిడికాయల బాక్స్ లు డిక్కీ లో నింపుతున్నారు. మండించే ఎండ బదులు ఆకాశమంతా నల్ల  మేఘాలు వొక దానితో వొకటి అల్లుకుంటున్నాయి. చిక్కుముడులు వేసుకుని విడదీసుకోవడం కుదరదన్నట్లు మెరుస్తూ ఉరుముతూ  కాసేపు కుండపోత  కురిసి బరువును తగ్గించుకుని అంతలోనే తేలిపోయాయి. చంద్ర మనసులో తిష్ద వేసుకుని మెదడులో రూపుదిద్దుకున్న ఆలోచనల మేఘాలు మాత్రం ఇంకా బరువెక్కి వున్నాయి


తిరుమలరావు ఇంటి దగ్గర ఆగి ..టీ తాగి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమైనారు. మధ్యలో విజయవాడ కు వెళ్ళి ఇల్లు బేరం కుదర్చమని గుర్తుచేసాడు తిరుమలరావు. బాబాయి ఇంటికి వెళ్లాడు. ఆత్మీయతలు పంచుకుని అతిథి మర్యాదలు అయ్యాక ఇల్లు అమ్మాలనుకున్న సంగతిని బాబాయ్  తనే ప్రతిపాదించాడు. “మీ నాన్న వ్యాపారాలు చేసి సంపాదిచ్చాడు.నాకేం వుంది?  పెన్షన్ మీద బతుకుతున్నాను. ఆడపిల్లలకు భారీగా పెళ్లిళ్లు చేసి అంతా అమ్ముకుంటిమి. రోగానికి రొష్టు కి డబ్బు కావాలి గా. వెంటనే అమ్మేద్దాం” అన్నాడు. అలాగే బాబాయ్ ! నాన్నను తీసుకుని వచ్చే వారంలో మళ్ళీ వస్తాను” అన్నాడు చంద్ర.


ఇంటికి చేరాక భూషణరావుకి  చెబితే “ఇప్పుడెందుకురా అమ్మడం, ఆంధ్ర కు ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిందిగా. దానికి లోపల్నే వుంది మన ఊరు. ఇప్పుడొద్దులే!” అన్నాడాయన. ఆ మంచి రేటేదో ఇప్పుడే వస్తుంది. నా  ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండే. వాడికి అప్పజెబుదాం. మీ అన్నదమ్ములిద్దరూ కలిపి మాట్టాడుకోండి అని పురమాయించాడు. 


ఆ రాత్రి చంద్ర  భార్య లత తో మాట్లాడుతూ పల్లె విశేషాలు చెప్పసాగాడు. అతని మాటల్లో సంతోషాన్ని గ్రహించింది.  ఆలోచనల లోతును పసి గట్టింది.


“రిటన్ వచ్చేద్దాం అనుకుంటున్నా! నువ్వేమంటావ్”లతా?” అడిగాడు.


“ ఆ…ఇక్కడ మాత్రం ఏముంది లెద్దూ! స్వేచ్ఛగా బతుకుదామనుకుని వచ్చి ఏడాదిలో సగం రోజులు అడుగు బయటకు వేయకుండా నాలుగు గోడలకు బందీ.  అయిన వాళ్ళందరిని వదిలేసుకుని ఇక్కడ బానిస బతుకుతున్నాం. ఎప్పుడు ఊడిపోద్దో తెలియని ఉద్యోగం  విపరీతమైన వర్క్ లోడ్. జూబ్లీ హిల్స్ లో పుట్టి పెరిగిన కోటీశ్వరుడి కూతుర్ని అన్నమాటే కానీ ఇక్కడ గొడ్డు చాకిరీ తో చచ్చిపోతున్నా. రొటీన్ లైఫ్. వెనక్కి వెళ్లిపోదాం అనిపిస్తుంది నాక్కూడా” అంది విసుగ్గా..  


“నిజం కదా లతా! వచ్చిన జీతం అంతా ఇంటి కోసం కారు కోసం తీసుకున్న అప్పులు కట్డడానికి, మెడికల్ ఇన్సూరెన్స్లు  క్రెడిట్ కార్డ్ లకు సరిపోయే! ఐదు రోజులు పని రెండురోజులు ఇంటికి కావాల్సినవి తెచ్చుకోవడంతో సరిపోధ్ది. అదీ కాక  ఎప్పుడు ఎక్కడ గన్ పేలిన చప్పుడు వినబడుద్దేమోనన్న భయం. పక్క నున్న వాడిని నమ్మలేని భయం. కొంతమందికి కొందరంటే ఇష్టంలేదు. ఆ కొందరికి మనలాంటి వారిని చూస్తే ఇష్టం లేదు.దాడులు దోపిడీలు తిరస్కారమైన చూపులు.H1b ముద్ర వేయించుకున్న బానిసలం అనిపిస్తుంది. వద్దు, ఇవన్నీ వద్దు. వచ్చేద్దాం. ఈ ఒత్తిడితో కూడిన జీవితం మనకి వొద్దు. మనుషుల అవసరాలు తీర్చే డాలర్ లు సంపాదిస్తున్నాం అన్నమాటేగానీ..  మన మానసిక అవసరాలన్నీ మన నేల తోనే ముడిపడి ఉంటాయి అని నాకు బాగా అర్ధమవుతుంది. నీతో డిస్కస్ చేసాక కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నాను.  నువ్వు వొప్పుకున్నావ్ థాంక్యూ డియర్”  మనఃస్పూర్తిగా అన్నాడు చంద్ర. 


వారం రోజుల తర్వాత అనుకున్న దానికన్నా ఎక్కువ ధరకు ఇల్లు అమ్మకం జరిగిపోయింది. అన్నదమ్ములిద్దరూ డబ్బు పంచుకున్నారు. రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్ పై  పేరు చూసి అన్నదమ్ములిద్దరూ ఆశ్చర్యపోయారు.ఎల్ ఆర్ చంద్ర సన్నాఫ్ భూషణరావు. 


“ఇది తాత ముత్తాతల ఆస్థి. ఎవరికో ఎందుకు అమ్మడం? అది నాక్కావాలి. నేను తిరిగి వచ్చేస్తున్నాను.ఈ ఊరిలోనే వుంటాను” అన్నాడు చంద్ర. భూషణరావు కొడుకు వైపు విసుగ్గా చూసాడు. తిరుమలరావు ముఖం మాడ్చుకున్నాడు.బాబాయి భార్య ధర తక్కువకు ఇచ్చేసారు అని గోలచేసింది. మేనత్తలు మేము పుట్టి పెరిగిన ఇల్లు పరాయి  పాలు కాలేదని సంతోషించారు. 


నెల రోజుల్లో లతా పిల్లలిద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడే పిల్లలిద్దరికీ స్కూల్‌ అడ్మిషన్ తీసుకున్నారు.  చంద్ర రిమోట్ జాబ్ చేస్తూనే.. దగ్గరుండీ ఇల్లు బాగుచేయించుకున్నాడు.  ప్రతిరోజూ గుడికి వెళ్ళి ఇలవేల్పు పట్టాభిషిక్త రామచంద్రుడిని దర్శించుకుని  ఆధునిక వ్యవసాయం చేసుకునేందుకు శక్తినిమ్మని కోరుకున్నాడు. లత ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి ఉవ్విళ్ళూరుతుంది.వివరాలు సేకరిస్తుంది. 


తనకు కలలో కనబడిన పెద్దమనిషి చిత్రాన్ని గీయించుకుని  ఫ్రేమ్ చేయించుకుని వచ్చాడు చంద్ర. వెలుగులు విరజిమ్మే ఇంట్లో హాల్లో ఆ చిత్ర పటాన్ని పెట్టించాడు. జీవకళ ఉట్టిపడుతూ వున్న ఆ చిత్రపటాన్ని చూసి “ఎవరు డాడీ ఈయన !? అని అడిగాడు చంద్ర కొడుకు. “మా తాత తాత ఆయన. నేను ఐదవతరం వాడిని, నువ్వు ఆరోతరం, ఏడో తరం కూడా ఈ నేల పైనే వర్ధిల్లాలి” అన్నాడు ఆలోచనల్లో ఆశలు అల్లుకుంటూ. కల యో నిజమో భ్రాంతి యో… ఏదో వొకటి  తనలో నిబిడీకృతమైన ఆలోచనలు ఇలా వాస్తవరూపంలో సాక్షాత్కరించడం  ఏనుగెక్కినంత ఆనందంగా వుంది చంద్ర కి.


“మా తాత కూడా ఇదే పోలికల్తో వుండట్టు జ్ఞాపకం వుందిరా అబ్బాయ్!” అన్నాడు భూషణరావు. వ్యాపారంలో పండిపోయిన మనిషి. కొడుకు కోసం తమ వారసులు అమ్ముకున్న భూములను కొనడానికి ప్రయత్నిస్తున్నాడు.చంద్ర తల్లి మణి పెద్దలు కలలో కనబడుతున్నారంటే వారిని మనం మర్చిపోయామని. అమావాస్య రోజున పితృ తర్పణాలు వొదలాలి అని అన్నదమ్ములిద్దరినీ హెచ్చరించింది. తిరుమలరావు అతని కొడుకులిద్దరూ పిలిస్తే పలకడానికి సిద్దమైపోయారు. చంద్ర వారి అభివృద్ధికి సాయం చేస్తానని మాటిచ్చాడు. 


ఆ రాత్రి  బహుళ పంచమి మసక వెన్నెల్లో ఆరుబయట నులక మంచంపై పడుకుని.. కనీ కనబడని నక్షత్రాలను వెతుకుతూ..తన పూర్వీకులను తల్చుకున్నాడు. “నాన్న ముత్తాతా! అని తాతా!  ఇదిగో చూడు, నువ్వు కోరుకున్నట్టే మన ఇంటికి వచ్చేసాను. నువ్వు చెప్పినట్టు తల్లి గర్భం నుండి బయటపడినప్పటి నుండి తిరిగి మట్టిలో కలిసే వరకూ మట్టి తోనే మనిషికి అనుబంధం. ఒక బంధం విడిపోతే మరొక బంధం లతలా పెనవేసుకుపోతుంది. మళ్లీ  ఆ బంధం విడిపోతుంది. ఒక ఆశ నశిస్తే మరొక ఆశ చిగిరిస్తుంది. నడిపిస్తుంది. ఇదే తరతరాల జీవితం. ఇదే జీవితం అని నాకర్ధమైంది”. అన్నాడు. 


ఊరి వారందరూ దారిన వెళుతూ ఆ ఇంటి వీధి ద్వారానికి ఒక వైపు నల్లని గ్రానెట్ రాయిపై బంగారు రంగులో మెరుస్తున్న  “లంకా రామచంద్రయ్య నిలయం” రెండో వైపు పలకపై  “అనిమనుమడు లంకా రామచంద్ర” అనే పేర్లతో ముచ్చటగొల్పుతూ  కళకళలాడుతున్న ఆ ఇంటిని చూస్తూ మా పిల్లలు కూడా వెనక్కి వచ్చేస్తే బాగుండ్ను అనుకుంటారు. వాళ్ళ ఆశలు బిడ్డల ఎత్తుకు ఎగురుతాయో లేదో కాలమే చెప్పాలి. 


*********************సమాప్తం***********************







20, జులై 2024, శనివారం

పడవపాట

 పడవ పాట

నీటిని నమ్మి ఏలేలో 

నేలున్న దీ హైలేసా

 నేలను నమ్మి హైలేసా 

పంటావున్నది హైలేసా 

పంటను నమ్మీ ఏలేలో 

ప్రజలుండారూ హైలేసా 

ప్రజలాకోసం ఏలేలో 

పంటున్నాదీ హైలేసా 

పంటను నమ్మి ఏ లేలో 

కాపున్నాడు హైలేసా 

కాపును నమ్మి ఏలేలో

రాజ్యం ఉండాది హైలేసా

రాజ్యాన్ని నమ్మి ఏ లేలో 

రాజుండాడూ హైలేసా 

రాజ్యంలోనా ఏ లేలో 

నువ్వున్నావు హైలేసా 

నిన్నూ నమ్మీ ఏలేలో 

నేనున్నాను హైలేసా 

మనలను నమ్మీ ఏలేలో 

పడవుండాది హైలేసా 

పడవను నమ్మి ఏలేలో 

బ్రతుకుండాదీ హైలేసా హైలేసా .....హైలేసా



17, జులై 2024, బుధవారం

అప్ డేట్

 నిశిరాత్రి నీ గృహ ద్వారం ముందు నిలబడే వున్నాను.. నీ పిలుపు అందుతుందని. 

నువ్వు నమ్మవు.. బుుజువు చూపమంటావ్

 రాత్రిపూట ప్రయాణం సాగించిన నీడ ఆచూకీ అక్కడెందుకుంటుంది? . ఇసుక పై నడిచిన గుర్తులు గాలికి చెరిగిపోతాయి. 

బురదలో నడిచిన పాదముద్రలు జడివానకు కొట్టుకెళ్ళాయి. ఇంకెలా నమ్మించను నేను అని వేడుకున్నాడు అతడు,  . 

ఓరి పాతకాలపు ప్రేమికుడా!  నీ కవి భాష తో సంజాయిషీ చెప్పింది చాలు. మా ఇంటి గుమ్మానికి వెన్ను ఆనించి ఓ సెల్ఫీ దిగి నాకు పంపించు చాలు. కాస్త తొందరగా  అప్ డేట్ అవ్వొచ్చు..  రా బాబూ.. అంది  ఆ ప్రేమికురాలు  నిసృహగా. 

నిజమే మరి. టెక్నాలజీ ముంగిట్లో ప్రేమ కూడా అప్ డేట్ అవ్వాల్సిన అవసరం వుంది. 

5, జులై 2024, శుక్రవారం

విభిన్న ఆకర్షణ

 విభిన్నమైన ఆకర్షణ 

ముళ్ళ చెట్టు పండ్ల చెట్టు పూల చెట్టు అన్నీ పై పై స్వభావాల్ని ప్రదర్శిస్తాయి. భూమి లోపలంతా వేళ్ళు కలగలుపుకుని పెనవేసుకునే వుంటాయి. 

స్తీ తీగ లాంటిది పురుషుడు ఆధారం అంటారు కానీ.. 

తీగ తను పెనవేసుకున్న మానును ఎదగనివ్వదు. మాను తన కింద తీగను ఎదగనివ్వదు. పరస్పర శత్రువులు. ఒకరిపై వొకరు పై చేయి సాధించాలనే కాచుకుకూర్చుంటారు.



11, జూన్ 2024, మంగళవారం

Code of conduct అంటే !?

Code of conduct అంటే ఏమిటి. అని అడిగాడు తండ్రి. అతని స్నేహితుడు ఆలోచిస్తున్నాడు.. 
ఈ కథలో మీకు సమాధానం దొరుకుతుందేమో వినండీ.. “త్వరపడి” కథ ఆడియో బుక్ లో.. 



‘’త్వరపడి ‘’ కథ ఆడియో లో వినండీ… 


 

3, జూన్ 2024, సోమవారం

I am an Author ..

 నేనొక రచయిత ని.. అవునంటారా కాదంటారా!? 

భోజరాజుకు కథలు చెప్పిన 32 సాలభంజికలు

వొక్కొక్కరే ముందుకు రావాలిప్పుడు. 🤗🫢

**********

ఓ సాహిత్య కార్యక్రమానికి హాజరై శ్రద్దగా సభను వింటున్నాను. నన్ను పలకరించి తనను పరిచయం చేసుకున్నాడు ఆ యువ రచయిత. ఓ రెండు పుస్తకాలు నా చేతిలో వుంచి.. 

‘కథలు రాయడం చాలా సులభం, తెలుసా అండీ “ అన్నాడు.

అవునా! అన్నట్టు చూసాను. లోలోపల నాకెందుకు.. వొక్కో కధ రాయటానికి సంవత్సరాలు తరబడి పడుతుంది.. నాలో ఆలోచనాశక్తి సన్నగిల్లిందేమో! విభిన్నమైన అంశాలతో కథలు రాయాలని అవి అందరూ మెచ్చుకోవాలని అత్యాశ కాబోలు అనుకుని .. 

“ఎన్ని కథలు రాసారు ఇప్పటికి” అన్నాను .. నా వయసులో సగం వయస్సే వున్న అతన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ.. 

“150 పైగానే రాసాను. ఇంకా కవిత్వం వ్యాసాలు సమీక్షలు కూడా ! “ అన్నాడు.

“ఎన్నేళ్ళ రచనా ప్రస్థానం”.. నా ప్రశ్న 

“కేవలం ఐదేళ్ళేనండీ.. మహాప్రస్థానం చదివే తీరిక దొరకలేదు నాకు. కానీ నా జీవితకాలంలో ఆరుద్ర సమగ్ర సాహిత్యం అంత రాయాలని నా కోరిక అండీ.” అన్నాడు. 

‘మంచిది. చేతి కీళ్ళు అరిగిపోగలవు జాగ్రత్త ‘’ అన్నాను. 

అతను పక్కకెళ్ళాక  ఇంకో రచయిత మిత్రుడొచ్చి.. “ఏమిటీ ఆ యువ రచయిత తో అన్ని కబుర్లు” అన్నాడు. 

 అతను చెప్పినవన్నీ చెప్పాను. 

గట్టిగా నవ్వి ఆ రచయిత కి మెదడు తో పని ఎందుకు? రెండు చిన్న పనులు తెలుసంతే! Copy > paste సోషల్ మీడియా వేదిక, కథల యాప్ .అతని రచనల్లో నీ కథలు కూడా వున్నాయి .. చూసుకో! అని హెచ్చరించాడు. 

 ఓహో అదా సంగతి అని నవ్వుకున్నాను… 

నేను రాసినదాన్ని ఎలా భద్రపరచుకోవాలి.. అచ్చమైన రచయిత మెదడుకి పని చెప్పానన్నమాటే కానీ.. ఈ గ్రంధచౌర్యం భావ చౌర్యం  చేసిన ప్రసిధ్ధ రచయితలు  గుర్తొచ్చి మరింత నవ్వుకున్నాను. 

ఆంగ్ల రచనలు చదివి తమ భాషలో కథలు రాసి ఎందరో ప్రసిద్దులైనారు. ఒకామె ఒక ప్రసిద్ద బెంగాలీ నవల గురించి ఆంగ్లంలో  వ్యాసం చదివి తన భాషలోకి అనువదించి వ్యాసం రాసింది. అలాంటికోవలో వాడే ఈ రచయిత అనుకున్నాను. 

ఇతనూ… ఎప్పుడో వొకప్పుడు ఏ ఫేస్ బుక్ గోడ పైనో  తన కథ చూసి .. నా రచన ఇది అని గగ్గోలు పెట్టటం ఖాయం.

ఈ మధ్య వొక రచయిత అన్నారు .. storyline చెబితే ChatGPT 10 pages కథ ఇచ్చింది అంట. దాన్ని 100 పేజీల నవల రాస్తాడు అంట. లక్షల రూపాయల బహుమతి, అకాడమీ అవార్డ్ లు రావచ్చు నేమో! 😊

ప్రపంచమా! వర్దిల్లుమా… ఆలోచనాశక్తి నశించి.. ChatGPT Al తోనూ copy>paste తోనూ.. 😢😢

……….. 

PS: నా ఆలోచనాశక్తి తో రాసాను. 😊🎈




28, మే 2024, మంగళవారం

చెరగని గీత ఆడియో లో

 నలుపు తెలుపు చామాన చాయ గోధుమ రంగు పాల గులాబీ రంగు.. ఏ రంగైతేనేం!? అందరిలో ప్రవహించేది ఆ రక్తమే కదా అది ఒకటే రంగు కదా! అంటారు కానీ ఈ రంగుల మధ్య యెన్ని అంతరాలు వున్నాయో, జాతి దేశం మతం కులం వర్ణం అన్నీ వివక్ష ని చూపించేవే! 

కంప్యూటర్ యుగంలో మనుషులే భూగోళం అంతా తిరిగేస్తున్నారు. కానీ, మనుషుల మధ్య అంతరాలు యెన్నో తిష్ఠ వేసుకునే వున్నాయి. తమ మనస్సుల్లో అవి చెరగని గీత లు గీసుకునే వున్నాయి. మనిషి తనం ప్రదర్శించలేని మానవత్వం చూపలేని గిరి గీసుకుని కూర్చున్న మనుషుల మధ్య పసి మనసులు గాయపడ్డాయని తెలియకుండానే గాయపడే సందర్భాలెన్నో! అదేమిటో తెలుసుకోవాలంటే “చెరగని గీత” కథ వినండీ..




https://youtu.be/SAJ7NhRD1C4?si=l0L0GVBrpb1RoZeK

22, మే 2024, బుధవారం

తల్లి-రుకైయ్యా రీహానా ఆడియో లో

 కథల ఒడ్డున.. కాసాపు ఆగుదామా! 

సృష్టిలో ఉత్కృష్టభావాన్ని భాగాలుగా విడగొడితే అందులో మాతృప్రేమకే అగ్రస్థానం లభిస్తుంది. అది పశువైనా శిశువైనా సరే. జంతువులు పశుపక్ష్యాదులు అనేక కీటకజాతులలో మాతృప్రేమ సొంతంగా మనుగడ సాగించేంతవరకే పరిమితంగా వుంటుంది. తర్వాతంతా ఆ సంతతి ప్రకృతిలో తమలాగానే ఇంకొకటిగా అనుకుంటూ మనుగడ సాగిస్తాయి. 

ప్రత్యేకంగా మనిషికి మాత్రమే కొన్ని బంధాలు అనుబంధాలు జీవితాంతం పెనవేసుకుని వుంటాయి.

అందులో ప్రతి మనిషికి అమూల్యమైనది మాతృప్రేమ. మాతృ ప్రేమకు మించిన ప్రేమ ఉంటుందా లోకంలో అని ఆశ్చర్యపడటం వింతేమి కాదు కూడా. 

ఇటీవల కాలంలో  అప్పుడప్పుడూ మాతృత్వ లక్షణం మసకబారుతున్నదా అనే అనుమానాలు పొడజూపినట్లనిపించినా.. అనేకానేక ఉదంతాలు విన్నా చూసినా చదివినా హృదయం చెమరిస్తుంది. అమ్మ ప్రేమకు మన అణువణువు అంజలి ఘటిస్తుంది. 

 చాలాకాలం క్రిందట ఒక ఉర్దూ కథ చదివాను. ఆ కథ చదివిన పిమ్మట చాలా దుఃఖం కల్గింది. ఆ దుఃఖాన్ని అనుభవించడం ప్రతి మనిషికీ చేతనవును కూడా మరీ హృదయం అంత పాషాణం కాకపోయినట్లైతే!

మనకుతల్లి లేదా అమ్మ అనే భావనే అపురూపం. తల్లిబిడ్డలది నాభీసంబంధం. ఎక్కడో  దూరంగా బిడ్డకు ఇసుమంత కష్టం కల్గినా నొప్పి కల్గినా.. అది అమ్మ మనసుకు తెలిసిపోతుంది. బిడ్డ క్షేమం కోసం తల్లడిల్లుతుంది. వీలైతే ఆ బాధ తాను భరించి బిడ్డకు ఆ బాధనుండి విముక్తి కల్గించాలని తపన పడుతుంది. కానీ దేహమానసిక బాధలు ఎవరివి వారే భరించాల్సిరావటం ప్రకృతిచ్చిన శిక్ష. 

ఈ కథలో తల్లి అత్యంత సాధారణమైన తల్లే. ఆమెలో ఏ ప్రత్యేకతలు లేవు. అయితే మాత్రమేం.. ఆమె నిరంతర ఆలోచనా స్రవంతి కొడుకు చుట్టూనే. అతని బిడ్డల చుట్టూనే. ఏనాడు చిన్న ఆరోపణ కూడా చేయని ఆమె తల్లి ప్రేమ మనల్ని వెక్కివెక్కి ఏడిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ తర్వాత తనను చూడవచ్చిన బిడ్డకు రాచమర్యాదలు జరిపించాలని ఘనమైన అతిధి సత్కారాలు చేయాలని అతనికీ అతని బిడ్డలకూ కానుకలనివ్వాలని తపించిపోయింది. ఆ కొడుకుతో పాటు కథ చదువుతున్న మనం కూడా  ఉద్విగ్నతకు గురవుతాం. కొడుకు పశ్చాతాపంతో మొదలైన కథ ముగింపుకొచ్చేసరికి అణువణువును కరిగించి కన్నీటి వర్షంలో తడిపేస్తుంది. ఒక స్త్రీ రచయితగా మరొక స్త్రీ అంతరంగ చిత్రణను అద్భుతంగా ఆవిష్కరించిన కథను అందరూ చదివితీరాలనే ఆకాంక్షతో ఈ కథను పరిచయం చేస్తున్నాను.. 

మీరూ  ఈ కథను చదవండి. మనలో ఆవిరైపోతున్న మానవత్వ విలువలను మేలుకొలుపుతుందీ కథ. మనని కనిపెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని మనను సున్నితంగా హెచ్చరిస్తుంది.

 రుకైయ్యా రీహానా వ్రాసిన “తల్లి"  కథను నేను చదివిన ఉత్తమకధలలో ఒకటిగా పరిచయం చేస్తున్నాను వినండీ..

హృద్యమైన కథ… వినండీ.. 



4, ఏప్రిల్ 2024, గురువారం

హృద్యమైన కథ

 బహుమతి

ఒక పోస్ట్‌మాన్ ఒక ఇంటి తలుపు తట్టి 

" ఉత్తరం" అని పిలిచాడు.

"వస్తున్నాను" అని ఇంటిలోపల నుండి చిన్నపిల్ల గొంతు వినిపించింది.

కానీ ఆ వ్యక్తి రాలేదు. మూడు, నాలుగు నిమిషాలు గడిచాయి. 

 పోస్ట్‌మ్యాన్ కి కోపం ముంచుకొస్తుంది.  “ఏయ్, త్వరగా వచ్చి లెటర్ తీసుకో… అని అరిచాడు. 

మళ్ళీ చిన్నపిల్ల గొంతు వినిపించింది ఇలా..  “సార్, డోర్ కింద లెటర్ పెట్టండి. నేను వస్తున్నాను."

పోస్ట్‌మాన్, “ఇది రిజిస్టర్డ్ లెటర్. దీనికి ఆమోదం కావాలి. కాబట్టి, మీ సంతకం అవసరం."

కొద్ది నిమిషాల తర్వాత తలుపు తెరిచినప్పుడు చిరాకుపడ్డ పోస్ట్‌మ్యాన్ “అయ్యో ! అనవసరంగా నోరు జారానే అని చింతించాడు.

కాళ్లు లేని ఒక అమ్మాయి ఉత్తరం తీయడానికి అతని ముందు మోకరిల్లింది.

పోస్ట్ మ్యాన్ శాంతియుతంగా ఉత్తరం అందజేసి విచారంగా వెనక్కి వెళ్లిపోయాడు.

ఇలాగే రోజులు గడిచిపోయాయి.

పోస్ట్‌మ్యాన్ ఆ అమ్మాయి ఇంటికి ఉత్తరం ఇవ్వడానికివచ్చిప్పుడల్లా అతను తలుపు తెరిచే వరకు ఓపికగా వేచి ఉండేవాడు.

దీపావళి సమీపిస్తోంది, పోస్ట్‌మ్యాన్ ఎప్పుడూ చెప్పులు లేకుండా ఉండటం అమ్మాయి గమనించింది.

 పోస్ట్‌మ్యాన్ లేఖను అందించడానికి వచ్చిన తర్వాత, ఆ అమ్మాయి నిశ్శబ్దంగా నేలపై ఉన్న పాదముద్రల నుండి పోస్ట్‌మ్యాన్ పాదాలను కొలిచింది.

దీపావళికి ముందు ఆ అమ్మాయి అతనితో "అంకుల్, ఇది మీకు నా దీపావళి బహుమతి" అని చెప్పింది.

పోస్ట్‌మ్యాన్, "నువ్వు నాకు కూతురి లాంటిదానివి, నీ నుండి నేను బహుమతి ఎలా పొందగలను?" అన్నాడు.

కానీ ఆ అమ్మాయి మృదువుగా ఒప్పించడంతో పోస్ట్‌మ్యాన్ ప్యాకెట్‌ని అందుకుని ఇంటికి తీసుకెళ్లి తెరిచాడు.

అందులో ఒక జత బూట్లు చూసినప్పుడు అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి, ఎందుకంటే అతని మొత్తం సేవలో, అతను చెప్పులు లేకుండా ఉన్నాడని ఎవరూ గమనించలేదు.

మరుసటి రోజు, పోస్ట్‌మాన్ తన పోస్టాఫీసుకు చేరుకుని, తక్షణమే తనను బదిలీ చేయాలని పోస్ట్ తన పై అధికారిని వేడుకున్నాడు.

పోస్ట్‌మాస్టర్ కారణం అడగగా.. అతను కన్నీళ్లతో ప్రతిదీ చెప్పాడు. 

"అయ్యా, ఈరోజు తర్వాత నేను ఆ వీధికి వెళ్ళలేను. ఆ చిన్నారి నన్ను చెప్పులు లేకుండా చూసి బూట్లు ఇచ్చింది. నేను ఆమెకు కాళ్ళు ఎలా ఇవ్వగలను?"

( తమిళ మూలం)



 ఈ హృద్యమైన కథ నేను వినిపించాను. వినండీ

30, డిసెంబర్ 2023, శనివారం

నీరెండ చాయల్లో


 నీరెండ ఛాయల్లో (An Inner Battle story)


జీవితానికి అవసరమైనది వాస్తవమే అయినప్పటికీ అప్పుడప్పుడూ ఊహల్లో బతకడం ఆనందం కల్గిస్తుంది. చెద పురుగు తొలుస్తుందేమో అన్నట్టు ఆలోచనలు కుట్టి చంపుతున్నప్పుడు నిద్ర లేచిన ఓ ఊహజనిత ఉన్మాదం  జీవితాన్ని కూడా గాడి తప్పిస్తుంది. ప్రస్తుతం నేను అదే స్థితిలో వున్నాను. 

కిటికీ అద్దాల బయట మేఘాలు భీకరంగా దుఃఖిస్తున్నాయి. భూమి సంతోషంగా నవ్వుతున్న సంగతిని క్షణాలపాటు టార్చ్ లైట్ వేసి చూపించింది మెరుపు. ఉరుము శబ్ధంలో అవమానం అవమానపడింది.  జేవురించిన కోపంతో మేఘాలు మరింత వర్షించాయి. భూమి తల్లిలా  కరిగి సముద్రుడి వైపు దోవ చూపించింది. మేఘాలు తండ్రిని చేరుకుని గాఢ పరిష్వంగం లో ఊరట పొందాయి. చిన్నగా నవ్వుకున్నాను. వాడు కూడా నవ్వాడు..  

ఉత్తరపు వైపు కిటికీ తెరిచాను.గాలి స్నానం చేసినంత హాయిగా వుంది. ఆయనవెరో చెప్పాడు స్నానాలు కూడా ఐదు రకాలని. స్నానం చేయడానికి షవర్ క్రింద నిలబడి నీళ్ళు మీద పడకుండా పడుతున్న ధారలన్నింటిని మగ్ లోకి నింపుకుని ఒంటిపై వొలుపుకోవడం అదొక పని లేని వ్యాపకం. ఒక్కో ధార తనకు ముఖ్యులైన పరిచయం వున్న వ్యక్తుల ఆలోచనలే అయినట్టు అవి ప్రవాహంలా మారి తనను తడిపేస్తున్నట్లు.. తనను అలా తడపడానికి వారికి ఏం హక్కుంది!? అందుకే వారందరిని మగ్ లోకి వొడువుగా వొడిసి పట్టి గుమ్మరించుకోవడం అనే ఊహ నాకు అమితానందం కల్గిస్తుంది. నన్నే తడుపుదామనుకున్నారా, చూసారా..మీ అందరినీ కలిపేసి కలగాపులగం చేసేసి మీ తిక్క ఎలా కుదిర్చానో.. అంటాను. 

భలే వాడు వీడు అని వాడూ పగలబడి నవ్వుకుంటున్నాడు. నేను మరింత నవ్వుకుంటూనే బట్టలు ధరించి వ్యాహాళికి బయలుదేరాను. వీధి మలుపు తిరిగాను.ఖాళీ అరుగు కనబడింది.  ఆరాగా చూస్తున్న వాడికి చెప్పాను. 

ఆ ఇంటి అరుగుపై కూర్చుని వచ్చేపోయే బాటలారులను పలకరిస్తూ నిలబెట్టేసి ఆరాలడిగి  బంకసాగుడు మాటలతో కాలక్షేపం చేసే పెద్దామె మరణించిందట అని. “అయ్యో అవునా” అన్నాడు విచారంగా. ఆ వార్త వినగానే నీ ఫీలింగ్ యేమిటో? ఆరా తీసాడు. 

“కొత్తగా యేముంటుంది?  తెలియగానే కాసేపు నిజంగానే విచారం. అంతలోనే ఒక తుస్కారపు ఆలోచన. పోతే పోయిందిలే, బ్రతికి ఉద్దరించేది ఏముంది గనుక? పనులపై వెళ్ళేవాళ్ళను ఆపి విసిగించడం తప్ప.” అనుకున్నానని చెప్పాను. 

వాడు విని మౌనంగా వున్నాడు. 

“ఇపుడెవరిని విసిగిస్తదో మరి.  పాపం పుణ్యం తక్కెడలో ఆమెక్కడో.. అదో చిదంబర రహస్యం కదా!” అని అడిగాను.

మళ్ళీ వాడు మౌనమే.

వాడిక నాతో మాట్లాడడు. దిక్కులు చూసాను.నాలా వ్యాహాళికి బయలుదేరిన నలుగురు కలిసారు. ఆరోగ్య అవగాహన వీడియోల్లో చెప్పబడిన విషయాల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడి అరెస్ట్ వరకూ అదానీ కంపెనీల షేర్ ల పతనం నుండి అనంతపురంలో సాగుతున్న పాదయాత్ర వరకూ చర్చించుకున్నాక అలుపొచ్చి యింటి దారి పట్టామందరం. 

వాడు నాతోపాటు లోపలికి వచ్చాడు. 

అలవాటుగా తినాలి.అధరువు గా వండి పెట్టేవాళ్ళు లేకపోయాక తప్పేదేముంది? 

“తప్పించుకున్నన్నాళ్ళు తప్పించుకోలేదేమిటీ? నిన్నెవడు వండమన్నాడు యిది, అంటూ చేయి విసిరింది మర్చిపోకు” గుర్తు చేసాడు వాడు. 

“ఏడిసావులే.. నోర్మూసుకుని వుండు. వంటేమన్నా బ్రహ్మ విద్యా!?” కసిరాను వాడిని. 

ధార కింద గిన్నె పెట్టి అది సగం నిండే సమయానికి డబ్బాలో బియ్యం తెచ్చి గిన్నెలో వేయాలి. అదీ లెక్క. ఆ లెక్క సరిగా పాటించబోయి పట్టు దప్పి ఇరవై గింజలదాకా సింక్ పాలు. 

వెంటనే వాడు మౌనం వీడి “యిప్పుడు నీకు ఆ ధాన్యం పండించే రైతు గుర్తుకు రావాలి అతని పట్ల గౌరవం ఉప్పొంగాలి” అన్నాడు.  

“అబ్బే అదేంలేదే, నేను తినే తిండిలో కొంత తగ్గుతుందే అనుకుంటున్నా” అన్నాను.

“మనుషులను అంతగా ద్వేషించకు తట్టుకోలేరు.. అవసరం లేకపోయినా ప్రేమించినట్లు నటించు. కొన్నాళ్ళకు పండిపోతావు నటిస్తున్నానని నువ్వు కూడా మర్చిపోతావు” అన్నాడు వాడు. అంగీకరించాను. కానీ ఆ విషయం వాడికి చెప్పను. గ్రహిస్తాడు కదా, నాకు నోరు నొప్పి యెందుకంటా!. 

లేత రంగుల కర్టెన్స్ కదలాడుతుంటే మనసు కదులుతుంటుంది కాంచన కోసం. నీలిమబ్బు దుప్పటి పరిచిన మెత్తని శయ్య నిండుచందమామ లాంటి దిండ్లుతో దశాబ్దాల అలసటను తీర్చడానికి తయారుగా వుంచి.  రా.. రమ్మని ఆహ్వానిస్తుంటే చూడనట్లు నటిస్తుంది. ప్రతిది ఆమెకు నచ్చేటట్టు శ్రద్ద తీసుకుంటాను. గుత్తులు గుత్తులుగా పూచే కస్తూరి పూలను తీసుకొనివచ్చి గాజు ప్లవర్ వేజ్ లో అలంకరిస్తాను.  ఈ మధ్య ఆమె వొచ్చినపుడు  కొత్తగా అలాంటి పరిమళమేదో చుట్టుముట్టినట్టు ఉంటుంది గనుక. డ్రాయింగ్ రూమ్ వరకూ మాత్రమే పరిమితమైన  పరిమళాన్ని బెడ్ రూమ్ వరకూ విస్తరింపజేసుకుని ఊహలో బ్రతుకుతుంటాను. అరమరికలు లేకుండా ఆమె వస్తానంటుందేమో అని ఆశ పడుతుంటాను. 

 ఇప్పుడైతే షరతులు వుంటాయని గుర్తు చేస్తాడు వాడు. “అంధకారంలో తవుళ్ళాట యెందుకు?  చిత్తశుద్ది లేదు నీకు” అని ముల్లుగర్రతో పొడిచాడు కూడా. 

అడిగేద్దాం తాడోపేడో తేల్చేసుకుందాం అని వడి వడిగా కాంచన  ప్లాట్ ముందుకు వెళ్ళి బెల్ మోగించాను. స్నానం చేస్తూ వుండొచ్చు. వచ్చి తెరుస్తుందని అక్కడే నిలబడి పది నిమిషాలు తర్వాత మళ్ళీ మోగించాను.” నేను ఇక్కడ” అంటూ వెనుక నుండి పలకరింపు. పక్కకు తొలగి నిలబడితే తాళం తీసి తలుపు తెరిచింది. 


“అల్లం చాయ్ తాగుతారా, రండి. “  ఆ పాటి పలకరింపుకే అనురాగ గంగ ఉబుకుతుంది నాలో నేనా..  లేక కాంచన లోనా.  అందుకే ఆహ్వానమా?


“భోజనం రెడీగా వుంది” అంటూనే మెల్లిగా అనుసరించాను. 

బేగ్ సోఫాలో పడేసి వాష్ రూమ్ కి వెళ్ళింది. ఎదురుగా ఉయ్యాల బల్లపై బోర్లా పడి వున్న డైరీ.. పక్కనే పెన్. ఆమె గుణ శీలాలు గురించి కూపీ లాగబోయాను.

చేతిలోకి తీసుకోబోతే వాడు వద్దు వద్దు అంటున్నాడు. కళ్ళు

అక్షరాల వెంట కిలోమీటర్ల వేగంతో పరుగు పెడుతున్నాయి. 

“అనురాగమా! సప్తవర్ణపు సూర్య కిరణమై నువ్వు నన్ను తడుముతుంటే మనఃకమలం వికసించక ఊరుకుంటుందా! ఇంకా దాగుడుమూతలాట యెందుకు? 

కవిత్వమా ప్రేమలేఖా!  నిశ్శబ్దపు అణుబాంబు పేలింది నాలో.

ఇంకా చదవబోయాను. తలుపు చప్పుడై చప్పున డైరీ అక్కడ పెట్టి వెనుదిరిగి “ఏదైనా నవలేమో అని చూసాను”. ఆత్మవంచన తన విశ్వరూపాన్ని యెక్కడైనా చూపవచ్చని అనుకుంటూ.  

నవ్వింది. చల్లటి నీరు గ్లాస్ లో పోసి .. కావాలా అన్నట్టు చూసింది. తల అడ్డంగా ఊపాను. 

వాడు చెబుతూనే వున్నాడు వద్దు వద్దు అని. వాడి మాట వింటే బావుండేది. స్నాక్స్ తెచ్చిచ్చి యెదురుగా కూర్చుంది. మాట పెగలడం లేదు. లోతుగా పరిశీలన చేస్తున్నట్లు వున్నాయి చూపులు. 

ఇంకా ఆమె యెదురుగా కూర్చుని వుంటే నా వక్ర మనోభావాలు బహిర్గతమయ్యేటట్లే వున్నాయి. గొంతు పెగిలించుకుని “ఇంటి పనికి వంట పనికి వొక మనిషి కావాలనుకుంటున్నాను. మీకెవరైనా పరిచితులు వుంటే పంపరూ” అన్నాననుకొని గొణిగాను. లేచి వచ్చేసాను. కాంచన ను నువ్వు అనకుండా మీరు అనడం తెలుస్తూనే వుంది నాకు. అంత యెడం వచ్చేసిందా?

ఇంటికొచ్చాక నాలో యేవో అనుమానపు ఛాయలు  పిల్ల పాములై పిగిలిపడ్డాయి.అవి త్వరగానే పెరిగి పెద్దవై  విషనాగులై పడగలెత్తి నర్తిస్తున్నాయి. కాంచన మరో బంధంలోకి వెళ్ళబోతుందా లేకపోతే తనపై యెందుకంత తిరస్కరణ?. 

ఉన్నట్టుండి  వాడు పకపకా నవ్వసాగాడు.  

“కూలిపోయిన వంతెనలు ఎవరు నిర్మిస్తారు కొత్త వంతెనలు నిర్మించుకోవాలనుకుంటారు కానీ” అన్నాడు. 

ఎదురుగా అద్దం పట్ మని శబ్దం చేస్తూ కిందకి జారి పడింది. 

“పగిలిన వాటికి మోత యెక్కువ”  రెచ్చగొట్టినట్టు అన్నాడు మళ్ళీ వాడే. 

“షటప్” అరిచాను. 

రెండు రోజుల తర్వాత కాలింగ్ బెల్ మోగుతుంది అదే పనిగా. తలుపు తెరవకుండానే తలుపు అద్దంలోనుండి చూసాను. 

 అపరిచితురాలు. కాంతి తగ్గిన ఖరీదైన డ్రెస్ ధరించినా  పేదరికపు ఛాయలు  ఆమె ఒంటిని వొదిలిపోలేదు. నూనె రాసి బిగించి వేసిన జడ రోల్డ్ గోల్డ్ చెవికమ్మలు. వక్షస్థలం కప్పుతూ  కొంగులు ముందుకు వేసుకున్న చున్నీతో  ఒక విధమైన నిర్లక్ష్యపు ధోరణితో గుమ్మం ముందు నిలబడివుంది. తలుపుతెరిచి ఏమిటని అడిగాను.  

“పనికి, వంటకి మనిషి కావాలన్నారట. కాంచన గారింట్లో చేస్తాను. ఉదయం తొమ్మిదిన్నరకు మాత్రమే రాగలను. గరుకైన మాట తీరుతో  షరతులు చెప్పింది. అడ్డంగా తల ఊపబోయి నిలువుగా ఊపేనేమో! “రమ్మంటారా” అంటూనే లోపలికి అడుగువేసింది. 

లోపల వాడు ఫక్కున నవ్వాడు. నవ్వుతూనే వున్నాడు.   ఇల్లంతా తిరిగి వచ్చి “నెలకు ఆరువేలు ఇవ్వండి. వంట రెండు పూటలకు కలిపి ఉదయమే చేస్తాను.  రోజూ కూరగాయలు రెడీగా పెట్టాలి.”

తల ఊపాను. “నా పేరు లలిత” అంది. మళ్ళీ తల ఊపాను.  

కొన్నాళ్ళ తర్వాత “సార్ గారూ! మీరూ ఆ కాంచన గారూ భార్యభర్తలంట కదా! “ ఆశ్చర్యంగా అడిగింది లలిత. 

అవునని చెబుతూ.. మా ముప్ఫై యేళ్ళ వివాహ బంధాన్ని నేనొక  ప్రయోగం చేసినప్పటి విషయాలను జ్ఞాపకం చేసుకున్నాను.

 

*****************

 “స్త్రీలు అందంగా వుండటమే గొప్ప విషయం అనుకుంటారు. అందంతో పాటు మిగిలినవన్నీ వుంటేనే కదా సంసారాన్ని చక్కదిద్దుకుంటారు. మగవాడు అష్టకష్టాలు పడి సంపాదించి అంతా భార్య చేతుల్లో ధారపోస్తే ఇంటి పని వంట పని మార్కెట్ పనులు చేసుకోవడం పిల్లలను చూసుకోవడం పెద్దలకు  తలలో నాలుకలా వుండగల్గడం ఏమంత గొప్ప విషయమని?” అక్కసు అంతా పదునైన మాటల తూటాలుగా మార్చి  పేల్చాను చాలాసార్లు. . 

“అదే పని మీరు చేయండి. ఇప్పుడు  పిల్లల పెద్దల భాద్యత కూడా లేదు. నేను ఉద్యోగం చేసి మీరు నా చేతికిచ్చినన్ని డబ్బులు మీ చేతుల్లో ధారపోస్తాను” అంది సహనం చచ్చిన కాంచన.  

వాదన పెరిగింది. సరదాగా అనుకున్న మాటలే సీరియస్ గా తీసుకోవడం. నేను మెడికల్ లీవ్ తీసుకుని ఇంట్లో కూచోవడం.  ఆమె ఉద్యోగం వేట. 

హేళన చేసాను కానీ మహాలక్ష్మి లాంటి ఆమె రూపం డిగ్నిటీ  ప్లస్ పాయింట్ అయి ఒక ఛానల్ లో ఫ్యామిలీ కౌన్సిలర్ గా స్థిరపడిపోయింది. గుక్క తిప్పుకోకుండా యెన్నో విషయాలు మాట్లాడుతుంటే నా భార్య యేనా ఈమె అని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. 

భరించలేకపోయాను. నాఉద్యోగం నేను చేస్తాను. నువ్వు నీ ఛానల్ ఉద్యోగం మానేసి యింట్లో అదివరకటి గృహిణిలా వుంటే చాలన్నాను. కుదరదు మూడేళ్ళకు అగ్రిమెంట్ రాసాను అంది. 

కుదరకపోతే నీ దారి నీది నా దారి నాదే అన్నాను. ఆమె లక్ష్యపెట్టలేదు. నా మగవాడి అహంకారం వూరుకుంటుందా.. విడాకులిస్తానన్నాను. ఆమె ఆశ్చర్యంగా చూసింది.  ఒకే ఇంట్లో వుంటూనే విడాకుల నోటీసు అందుకుంది.  ఆ రోజే ముఖ్యమైన వస్తువులు బట్టలు సర్దుకుని వెళ్ళిపోయింది. పదిరోజుల్లో తన నగలు అమ్మేసి యెదురుగానే చివరగా వున్న ప్లాట్ కొనుక్కొంది. విడాకులకు ఆమోదించి సంతకం పెట్టేసింది.

 పిల్లలు అయినవాళ్ళందరూ ఈ వయసులో మీకిదేం పోయేకాలం, విడాకులేమిటి అని ఆశ్చర్యపోయారు, బుగ్గలు నొక్కుకున్నారు. బుర్ర తొలిచి తిన్నన్నాళ్ళు  తిని తర్వాత మీ చావు మీరు చావండని యెవరి  దారిన వారు పోయారు. కాంచన నువ్వెవరో నేనెవరో అన్నట్టు అపరిచితురాలు మాదిరి వుండసాగింది. 

తనకు బంధనాలేవో తెగిపోయి స్వేచ్ఛగా వున్న భావన. కొన్ని నెలలు బాగానే గడిచింది. స్నేహితులు పార్టీలు వంట పని లేని స్విగ్గీ జుమాటో ఆర్డరులు. మగవాళ్ళు పెళ్ళిచేసుకుని చాలా తప్పు పని చేస్తున్నారు. పెళ్లిలో లేని హాయి వొంటరిగా బతకడంలో వుందని నొక్కి వక్కాణించాను. 

కాంచన అప్పుడప్పుడు కనబడుతూ వుంటుంది. గతంలో కన్నా అందంగా ప్రశాంతంగా కనబడుతుంది. నాకే ఇంటి తిండి కరువై రుచుల పేరిట నానా రకాల గడ్డీ తిని జీర్ణ వ్యవస్థ దెబ్బతింది. మందులు చప్పిడి కూడు. ఒక్కసారిగా వయసు పదేళ్ళు పైబడినట్లు వుంది. పిల్లలు రాయబారం చేసారు. ఛానల్ లో ఉద్యోగం మానవసరం లేదు.. ఎప్పటిలా కలసి వుండండి అని. 

కావాలంటే ముప్పూటలా క్యారియర్ పంపుతాను కానీ కలసి వుండలేనంది. ఆ పని కూడా మానవత్వంతో చేస్తున్నాను అనేది. ఆ జాలి మానవత్వం నాకెందుకు? భార్య కావాలి కానీ. 

“ఆమె ను  బానిస గా చూడకపోయినా అర్ధ బానిసగా చూసావ్, నిత్యం కొత్త ఆకర్షణ లేకపోయినా రాత్రుళ్ళు కనీసం కాలు మీద  కాలు వేసుకుని పడుకోవడానికి వొక తోడు కావాలి లే అనుకునేవాడివి కదా!” గుర్తు చేసాడు వాడు.  

“అవును రా! ఇప్పుడనిపిస్తుంది పొరబాటు చేసానని. నిర్మించుకున్న ఊహా చిత్రాలన్నీ క్షణంలో పేకమేడల్లా కూలిపోతే.. నేను కూడా వీధి వైపు అరుగులున్న ఇంటి నొక దానిని అన్వేషించాలేమో జీవితం డొల్లించడానికి అని భయపడుతున్నాను.  అందుకే కాంచనతో సయోధ్య కోసం యిన్ని వేషాలు” అన్నాను. . 

“సయోధ్య కోసం వెళ్ళిన వాడివి. అందుకేనా, పని మనిషి వంట మనిషిని చూసి పెట్టమన్నావా?” ఫక్కున నవ్వాడు.  

 మౌనం వహించి పార్క్ వైపు నడక సాగించాను. పడమటి యెండ మీద పడి పొడుగ్గా నీడలు. చెట్ల నీడల్లో నా నీడ జాడ వెతుక్కోలేకపోతున్నా. 

**************

రోజులు గడుస్తున్నాయి. 

రెండు నెలలకల్లా పని మనిషి లోని ఆడతనంతో నా వొంటరి మగతనం జత కట్టింది ఇంటి మనిషిని చేస్తాననే హామీతో. అది కాంచన దృష్టికి అందటం అసాధ్యం అనుకున్నాను కానీ..చివరకు ముఖం పగలగొట్టుకున్నంత పనైంది. . 

ఆఖరి ప్రయత్నంగా పార్క్ లో  ఎదురుగా కూర్చుని వాదన మొదలెట్టాను. 

“మనిషికి అసలు వివాహమే లేకపోతే ఏ సమస్యా ఉండదు. అన్నింటికీ అదే మూల కారణం.  ప్రతి భార్యా  తన శారీరక, మానసిక, ఆర్థిక అవసరాలన్నీ సరదాలన్నీ భర్త దగ్గర ఆశించడం, భర్తే  ఆ అవసరాలన్నీ  తీర్చాల్సివుండటం.  ఇవన్నీ  వివాహం ద్వారానే జరుగుతాయని అంచనాలుంటాయి విశ్వాసాలుంటాయి.పుట్టిన దగ్గర్నుండి అదే నూరిపోస్తారు మీ ఆడవాళ్ళకు, మొగుడనే వాడికి అదెంత కష్టమో ఆలోచించరు. ఎక్కువమంది మగవాళ్ళు అవన్నీ భరిస్తూ గుండె పోటుతో పోయేదందుకే”

“ఒక స్త్రీ భర్తకు అన్ని విధాలా తగిన భార్య అనిపించుకోవాలంటే చాలా కష్టం కదా! ముప్పూటలా  వంట చేసి పిల్లలను కని వారికి  కావాల్సినవి సమకూర్చి  భర్త అత్తమామలకు సేవ చేస్తూ మళ్లీ ఉద్యోగం కూడా చేయాలంటే కష్టం.  అందుకే చాలా మంది  స్త్రీలు విసుగు చెంది కారణాలు వెతుక్కుని మరీ వివాహ బంధం వద్దు అనుకుంటున్నారు లెండి.”

“స్త్రీకి ఏ కాలంలోనైనా పురుషుడి నీడ అవసరం” మనువు చెప్పిన దానిని వల్లె వేయబోయాను. 

“అదే మనువు స్త్రీలు తమను తాము యెలా రక్షించుకోవాలో కూడా చెప్పాడు”  కొంచెం ఆగి అంది.ఇంకొక మాట మరిచాను అన్నట్టుగా వొత్తి చెప్పింది. “దాంపత్య సంబంధాల్లో బాధ వలన పునరుత్పత్తి  కారణాల వల్ల కేన్సర్ బారినపడి చనిపోయేది కూడా స్త్రీలే యెక్కువట”

మాట్లాడటానికి ఇంకేమీ మిగల్లేదనిపించింది. 


“ఆధిపత్య ధోరణి, శ్రమ దోపిడీ  రెండూ రెండు కళ్ళు పురుషుడికి”  అని లేచి వెళ్ళింది. దింపుడు కళ్ళెం ఆశతో వెనుకనే నడిచాను.  గేట్ దగ్గర ఆగి అంది. 


“సెక్సువల్ డిజైర్స్ మగవాడిలో కనిపించని మూడోకన్ను. నేనింకా దగ్దం కాదల్చుకోలేదు. పాపం లలిత!!” అని వ్యంగ్యంగా  నవ్వు విసిరి వడివడిగా వెళ్ళిపోయింది. 


తూలి పడిపోబోయాను. ఆసరా కోసం చూసాను.ఆమె వెనక్కి చూడకుండా దూరంగా వెళుతూవుంది. ఆశాసౌధమేదో కూలిపోయింది. ఇక సరికొత్త ప్రశ్నాపత్రం నాదే జవాబు నాదే!

వాడు ఫక్కుమని నవ్వాడు. వాడి మీద నేను విరుచుకు పడ్డాను. “నా ప్రతి చర్యకు ముందు నేను నీతో  మాట్లాడుతూనే వుంటాను. నువ్వెందుకు నన్ను హెచ్చరించ కూడదూ మందలించకూడదూ” అని. నా తప్పులను వేరొకరిపై  ఆయాచితంగా నెట్టేయడం నాకు సులభతరమైన పని. 

“ఎద గాయాన్ని సృశిస్తే యుగళ గీతాలు పుట్టవు రా పూల్.   బాధాతప్త గేయాలు మాత్రమే వినిపిస్తాయి” అన్నాడు.


వాడి మీద కోపం బుస్సున పొంగింది కానీ  వాస్తవమైతే కఠోరంగా వుంది.పైగా నిండా దుఃఖం వుంది.  అయోమయంలో  రోజులు వెళ్ళమారుస్తున్నప్పుడు కాస్త ఊహలను మేతగా  మార్చుకోవాలి. వాడితో మాటలు మానేస్తే సరి. 

 అసలు వాడెవరంటే.. 

విచిత్రమేమి కాకుండానే.. నేను ఇద్దరు మనుషులం. ఒకొరితర్వాతొకరు  మాత్రమే బయటకొస్తుంటారు. మనిషికి ఒంటరితనం విరామమెరుగని యుద్దం. ఆ యుద్ధంలో కత్తి డాలు రెండూ ఆలోచనలే. మనసుకే మనస్త్రాణం అవసరం.వాడూ నేనూ వేరు కాదు. వేరు వేరుగా వున్నప్పుడు జరిగిన కథ ఇది. కాంచన దూరం అయ్యాక బాగా తోడయ్యాడు వీడు. 

అవునూ, లలిత ను ఏం చేద్దామిప్పుడు!? మళ్ళీ వాడికి దూరంగా జరిగి బయటకు వచ్చి చేసిన ఆలోచన ఇది. వాడిని చంపేస్తే సరి. శత్రువుని  వశపర్చుకొని జగత్తునందు అజేయంగా వుండాలని యెవరికి మాత్రం వుండదు. హమ్మయ్య, రిలీఫ్ గా ఫీల్ అయ్యాను. 

******************సమాప్తం*******************


(కొత్త చూపు కథా సంకలనం లో కథ )




7, సెప్టెంబర్ 2023, గురువారం

ದೇಹದ ಕ್ರೀಡೆಯಲ್ಲಿ ಕಡಿದುಹೋದ ಅರ್ಧ...

 Taken from the anthology of feminists poetry

SANGHATITHA edited / compiled by

Jwalitha Denchanala garu : 


telugu poem : Vanaja Tatineni

kannada translation : S D Kumar


ತೆಲುಗು :  ವನಜಾ ತಾತಿನೇನಿ

ಕನ್ನಡಕ್ಕೆ : ಎಸ್ ಡಿ ಕುಮಾರ್


ದೇಹದ ಕ್ರೀಡೆಯಲ್ಲಿ ಕಡಿದುಹೋದ ಅರ್ಧ...


ಆಡಿ ಪಾಡುವ ಮುಗುದ ಬಾಲ್ಯದ ದೇಹದ ಮೇಲೆ

ಮೊಗ್ಗಿನಂತೆ ತಿವಿದುಕೊಂಡು ಬರ್ತಿರುವಾಗ

ಬಲವಂತವಾಗಿ ಹೇರಿದ ಹೆಣ್ಣು ಮಗು ಎಂಬ ಜ್ನಾನ

ಹದಿಮೂರರ ಪ್ರಾಯದಲ್ಲಿ ಯೌವ್ವನದ ದೇಹದ ಮೇಲೆ

ವಸಂತೋತ್ಸವ ಬಿರಿದಾಗ ಬಿಡಲಾರದ ಮುಗ್ಧತೆ


ನೀನು ಹೆಣ್ಣೇ ಕಣೆ ಎಂಬಂತೆ

ನಖಶಿಖಾಂತ ನೋಟಗಳಲಿ

ತಿವಿತಿವಿದು ತಡವಿದಾಗ

ಒಳಗೊಳಗೇ ಭಯ, ಕಂಪನಗಳು

ಅಲ್ಲಿಯವರೆಗೆ ಇಲ್ಲದ ಲಜ್ಜೆಯ ಪರದೆ ಸೆರಗಾಗಿ

ತನುವನ್ನೆಲ್ಲ ಸುತ್ತಿಕೊಳ್ಳುವ ಮುಗ್ಧತ್ವ


ಬಯಕೆಗಳ ಅಪ್ಪುಗೆಯಲ್ಲಿ ನಲುಗುತ್ತಿದ್ದರೂ

ಮೋಹದ ಪಾರವಶ್ಯತೆಯಲ್ಲಿ ಮುಳುಗಿದ್ದರೂ

ನಲುಗಿದ ಕಾಯಕ್ಕೆ ಅವೇ ತೀರದ

ಅಲಂಕಾರ ಅಂತ ಅರ್ಧಭಾಗ ನಿರ್ಧರಿಸಿದ ಮೇಲೆ


ಅನಂತ ಸೃಷ್ಟಿಯ ರಹಸ್ಯದಂಚುಗಳನ್ನು ಸೋಕುವ

ಕೇಳಿವಿಲಾಸದಲ್ಲೂ ಮುಖ್ಯ ಭೂಮಿಕೆಯಾಗಿ

ಕಾಮ್ಯ ವಸ್ತುವಾಗಿ ಭೋಗವಸ್ತುವಾಗಿ

ಬದಲಾದ ಕುಚದ್ವಯಗಳಿಗೆ

ಪ್ರತಿಯೊಂದು ಅನುಭವವೂ ಗರಳವೇ  !

....................

....................

ದೇಹದ ನದಿಯಲ್ಲಿ

ಹಳ್ಳ ದಿಣ್ಣೆ, ಸೊಗಸು, ತಿರುವುಗಳನ್ನು

ಆತುರಾತುರವಾಗಿ ಅಳೆಯುವ ಕಾಮಚಿತ್ತರಿಗೆ

ತಾನು ಹರಿದಷ್ಟೂ ಉದ್ದಕ್ಕೂ ಹಸಿರುತ್ವವನ್ನು

ತುಂಬುವ ಆ ಜೀವನದಿಯ

ಅಂತರಂಗ ಅರ್ಥ ಆಗೋದು ಯಾವಾಗ  ?


ಬಿದ್ದುಕೊಂಡ ನಗ್ನ ದೇಹದ ಮೇಲೆ

ಉಳಿದ ಅರ್ಧದ ಮೇಲೆ

ವಿಶೃಂಖಲವು ಮಾಡಿದ ಗಾಯ ಸ್ರವಿಸುತ್ತಲೇ ಇದೆ

ಅಂತ:ಚಕ್ಷುವಿನಿಂದ ಸೌಂದರ್ಯ ಪುರುಷನನ್ನು

ಹೆರಲಾಗದ

ವಿಕೃತಾಲೋಚನೆಗಳ ಕುರ

ರಾಜವೃಣಕ್ಕಿಂತಲೂ ಭೀಕರವಾದುದು  !


A lost half in body sports...


On the innocent childhood body of dancing and singing

Coming back eating like a bud

The birth of a girl child who was forced

On the body of youth at the age of thirteen

The innocence that cannot be spared when the spring festival is over


As if you're a woman

Nakhashikhant in the views

When this is too late

Fear and vibrations inside

For the screen capture of shame not there till then

The innocence that surrounds itself


Despite the embrace of desires

Though immersed in the need of attraction

There is no shore for the hard work.

After deciding halfway to be decorated


Sucking the mysterious branches of infinite creation

Become a main ground in hearing as well

As a sexual object, as a sexual object

To the changed Kuchadvaya

Every experience is simple!

....................

....................

In the river of body

Ditch dine, elegance, twists

For the lustful people who measure in hurry

The greenery as long as it flows

The filling of that life

When will you understand the inner self?


On the fallen naked body

On the other half

The wound made by the chaos just keeps on healing

The beauty man from the eye

Can't be bored

The sheep of distorted thoughts

More horrible than the royalty !


దేహ క్రీడలో తెగిన సగం -వనజ తాతినేని


ఆడి  పాడే అమాయకపు బాల్య  దేహం పై

మొగ్గలా  పొడుచుకు వస్తున్నప్పుడు

బలవంతంగా   జొప్పించిన ఆడపిల్లననే జ్ఞానం

పదమూడేళ్ళ ప్రాయంలో యవ్వనపు దేహం పై 

వసంతం విరిసినప్పుడు వీడని అమాయకత్వం 


నువ్వు ఆడదానివే సుమా అన్నట్లు 

నఖశిఖ పర్యంత చూపులతో..

గుచ్చి గుచ్చి తడిమినప్పుడు.. 

లోలోపల భయం, గగుర్పాటు తో 

అప్పటిదాకా లేని సిగ్గుతెర పైట అయి 

తనువంతా  చుట్టుకునే ముగ్ధత్వం 


కాంక్షల కౌగిలిలో నలిగిపోతున్నా

మోహపు పరవశంతో ఉప్పొంగినా 

నలిగిన  మేనుకు  అవే  తరగని

అలంకారమని సగభాగం నిర్ధారించాక


అనంత సృష్టి  రహస్యపుఅంచులు తాకే 

కేళీవిలాసంలో ముఖ్య భూమిక గా  

కామ్య వస్తువుగా భోగ వస్తువుగా 

మారిన  కుఛ ద్వయాలకి 

అన్నీ గరళమైన  అనుభావాలే ! 


చిన్నిచేతులతో  తడిమి  తడిమి 

ఆకలికి  తడుముకుంటూన్నప్పుడు  

ఆ పాలగుండెలు 

బిడ్డఆకలిని తీర్చే అమృతభాండాలని

ఆ గుండెలు పరిపూర్ణ  స్త్రీత్వపు చిహ్నాలని

తన్మయత్వంతో

తెలుసుకున్నక్షణాలు మాత్రం స్వీయానుభావాలు. 


అసహజపు అందాలను ఆబగా చూసే వారికి 

సహజం అసహజమైనా,అసహజం సహజమైనా.. 

ఆ దేహం పై క్రీడలాడునది..ఈ నరజాతి వారసుడు  

చనుబాలు కుడిచిన నాటిని మరచిన బిడ్డడే కదా.. 


అసహజంగా పెరిగిన కణ సముదాయాలని కుతికలోకి కోసి.. 

ఓ సగ భాగాన్ని పనలని పక్కన పడేసినట్లు పడేసాక..

అయ్యో అనే  జాలిచూపులు భరించడం,.  

నువ్విక పనికరావనే వెలివేతలు సహించడం కన్నా

ప్రాణంపొతే బాగుండునన్న భావనే అధికం.  


అమ్మ - అమృత భాండం, స్త్రీ-సౌందర్యం..ఉద్దీపనం  సారూప్యమైనవే !


దేహం నదిలో 

ఎత్తు పల్లాలు,ఒంపు సొంపులు ,సొగసులును 

ఆబగా కొలుచుకునే కామచిత్తులకి  

ప్రవాహించినంత మేరా పచ్చదన్నాని నింపే 

ఆ నది అంతరంగం అర్ధమయ్యేది ఎన్నడు? 


పరచిన నగ్న దేహం పై మిగిలిన సగం పై 

విశృంఖలం చేసిన గాయం స్రవిస్తూనే ఉంది.

అంతఃచక్షువుతో సౌందర్యపుఝడిని కనలేని 

వికృతమైన ఆలోచనల కురుపు  

రాచ పుండు కన్నా భయంకర మైనది.


( "విహంగ " వెబ్ మేగజైన్  మార్చి 2012)



#TeluguPoetryInEnglish

#VanajaTatineni

#PoetryInTelugu

#poetryintelugu


24, ఆగస్టు 2023, గురువారం

కాటుక మబ్బులు





ఎడిట్ చేయని .. అసలు కథ. నిడివి దృష్యా మూడు పేజీలకు కథ కుదించక ముందు నేను పంపిన అసలైన కథ ఇది. (గమనించగలరు)


కాటుక మబ్బులు  - వనజ తాతినేని


పెళ పెళ మంటూ కొమ్మ విరిగి నేలబడిన చప్పుడు. తలొంచుకుని జొన్నలను కడుగుతున్న సరిత  వులికిపడి చప్పుడైన వైపు చూసి క్షణం ఆలస్యం చేయకుండా ఆడకి పరుగుపెట్టింది.. 


కొబ్బరాకులు చీల్చి ఈనెలను కట్టకడుతున్న  భూదేవమ్మ యిరిగి పడిన కొమ్మను చూసి “ అనుకుంటూనే వున్నా కాయల బరువు యెక్కువై కొమ్మ యిరిగిపోతాదని. అట్టే అయింది” అనుకుంటూ గబ్బుక్కున లేవబోయి మళ్లీ కూలబడింది. ఏడు పదులు దాటిన ముసల్ది కాలు చేయీ తీసుకుని మళ్లీ లేవబోయే సరికి యింకో కొమ్మ యిరిగిపడింది. 


మనుమడి పెళ్లాం సరిత “ఓయమ్మో! అత్తోయ్ ! నువ్వు చెట్టెందుకు యెక్కావ్! దిగు, దిగి రా..ముందు. ఆడ్నించి పడితే యేమైనా వుందా?” కేకలు బొబ్బలు పెడతాంది. భూదేవమ్మ సత్తువకొద్ది పరిగెత్తుకొచ్చి చెట్టుకు దూరంగానే వుండి పైకి చూసింది.కోడలు మీనమ్మ చెట్టు పంగలపై కాళ్ళుంచి నిచ్చెన యెక్కుతున్నట్టు యింకో పంగ కోసం చూపులతో  యెతుకుతుంది. 


“అమ్మే మీనమ్మా! ఏడికే అట్టా ఆకాశం లోకి యెక్కతావున్నావ్, కొమ్మలు యిరిగి పడింది తెలియడంలా, ఆడనుంచి పడితే నడుములు యిరుగతాయ్, కిందకి దిగమ్మా” బతిమాలింది.

 

“నేను దిగను, అల్లదిగో ఆ చిటారుకొమ్మన  పెద్ద మామిడికాయ వుంది. నేను అది కోసుకున్నాక దిగుతా” 


“ఓసి నీ పిచ్చి తగలెయ్య నువ్వు యెక్కింది మామిడిచెట్టు కాదే మునగ చెట్టు” అని మనవరాలి సాయ చూసి “అమ్మీ నువ్వు  యింటోకి పోయి మామిడికాయ వుంటే పట్టుకొని రా లేకుంటే అంగట్లో కొనుక్కొని రా, బిన్నా రా, నేను మీ అత్తను మాటల్లో పెట్టి పైకి యెక్కకుండా జూస్తా”  

 

సరిత  వురుకుతా యింట్లోకి పోయింది 


“మీనమ్మా నీకు మామిడి కాయ కావాలా,  అది నీకు అందదుగానీ  చిక్కం కట్టిన గెడ కర్రతో కోసుకుందువుగాని కిందకు రామ్మా”


“నేను రాను. మామిడికాయ కోసుకుని ఈడే కూకుని తింటా,నువ్వు పోయి రవ్వొంత ఉప్పు కారం పట్టుకొచ్చియ్యి” ఇంకో కొమ్మ యెక్కబోయింది.


“పైకి వద్దులే, ఇదిగో నీక్కనబడకుండా యీడో మామిడికాయ దాక్కుంది చూడు. నువ్వే కోయాలంట నువ్వే తినాలంట. కోద్దువు రా.. రా! అని పిలుస్తుంది చూడు” నమ్మబలికింది. 


“అయ్, నేనే కొయ్యాలంట నేనే తినాలంట మీకు యెవరికీ పెట్టనంట”.. మాటలను లల్లాయి పదాలుచేసి పాడుకుంటూ నిదానంగా దిగుతుంటే .. ఊపిరి బిగబట్టుకుని చూస్తావుండింది. 


సరిత పరిగెత్తుకుంటూ వచ్చి పమిటచెంగుచాటు నుండి మామిడి కాయ తీసి భూదేవమ్మ చేతికిచ్చింది.ఆమె కోడలు చూడకుండా వొత్తుగా వున్న మునగ కొమ్మపై మామిడికాయను వుంచి కోడలికి  చూపిచ్చి “ ఇదిగో మామిడి కాయ, బిన్నా కోసుకో! మళ్లీ ఈ  అమ్మి కోసుకుపోద్దేమో” అని ఊరించింది.


“ఆయ్ ఆయ్ భలేగుంది మామిడికాయ్” అనుకుంటూ దిగొచ్చి  చటుక్కున ములక్కాడ ను తుంపుకుని రెండుగా విరిచేసి తేగలు నమిలినట్టు నములసాగింది. 


“ అయ్యో కూతురా! నువ్వు యింత మతిస్థిమితం లేకుండా పొయ్యావేమిటే,యిదంతా మా ఖర్మ కాకపోతే ” నెత్తి కొట్టుకుంది భూదేవమ్మ. అమ్మమ్మ మనవరాలు యిద్దరూ చెరో చేయి పట్టుకుని సావిడిగదిలో మంచం పై కూర్చుండబెట్టారు. సరిత బయటకొచ్చి తలుపు గడియబెట్టి కర్రల కిటికీలోంచి చూసి “అమ్మమ్మా బయట గడిపెట్టా. నిన్నేమైనా కొట్టుద్దేమో జాగ్రత్త.”


“అది ఎవర్నీ యేమనదులేవే, ఓటిదంటే అంతా ఓడుదన్నట్టు దాన్ని అంత సలీజుగా చూత్తావ్, నేనుంటాలే నువ్వు బో..” కసిరింది. 


“మా ఆయనతో నేను నీళ్లోసుకున్నా పుల్లపుల్లగా యేవైనా తినాలుందని  పుల్ల మామిడికాయ తెచ్చిమ్మని సిగ్గు లేకుండా అడిగా, తెచ్చిచ్చినాడనుకున్నావా, లేనే లేదు. ఇన్నేళ్ళకు మన చెట్టు కాసింది గనక తింటన్నా, భలే బాగుందత్తా! నువ్వు కూడా వొక ముక్క తింటావా? మంచి పిల్లలు పుడతారంట.బొద్దుగా ఆరోగ్యంగా వుంటారంట”. సగం ములక్కాయను భూదేవమ్మ నోటి దగ్గర పెట్టి అడిగింది. 

 

రవ్వొంత నవ్వు రవ్వొంత యేడుపు కలగలిపి వచ్చాయ్. 

“నాకొద్దులే, కాయంతా వొకేతూరి తింటే నీక్కూడా నోరు పులిసిపోద్ది. కాసిని నీళ్లు తాగి పడుకో’ మందు బిళ్లలేసిన మంచి నీళ్ల గ్లాసు చేతికిచ్చింది.


“ అట్టే, నువ్వు చెపితే నేనెప్పుడైనా కాదన్నానా, నువ్వు కూడా పడుకో, అన్నం తిన్నావా నువ్వు, పెట్టుకొచ్చేనా.. అంటూ మంచం మీద నుండి లేవబోయింది. “నేను యిందాకే  తిన్నాలే.. నువ్వు పడుకో”.


బుద్దిగా పడుకుంది మీనమ్మ.  అమ్మయ్య! గట్టి వాన కురిసి తెరిపిన పడ్డట్టుంది పేణానికి  అనుకుంది. 


అమ్మమ్మా! “ నీతో అమ్మ మాట్టాడుద్ది అంట.. ఫోన్ తీసుకొచ్చి యిచ్చింది సరిత. ఎట్టుంది నీ కోడలికి అడిగినట్టుంది కూతురు. 


“ఏం చెప్పను లేవే మా యెతలు. ఎవురూ ఆర్చేది తీర్చేది కాకపోయే.  పూటకొక గండం. కొంసేపు యేమారినా యేం తంటాలు తెచ్చి పెట్టుదో నన్న భయమైపోయే. నిన్న చూస్తే మిద్దె మీదకుపోయి వాటర్ ట్యాంకు యెక్కి కూర్చుని పిల్లకాయలను బంతెయ్యి అంటది. పదిరోజుల కిందట యెనక నుంచి స్కూల్ బస్ పైకి యెక్కి కూర్చుని నేను కూడా స్కూల్ కి పోతా అని గోల. అణుకువ గల బిడ్డ దానికి యెందుకు యిట్టా వచ్చిందో, కాస్తయినా నెమ్మళ పడితే జొన్నాడో వేదాద్రి కో పోయి మూడు నిదర్లైనా చేపిచ్చుకని రావాలనుకుంటున్నా” 

“అన్న యేమంటున్నాడు?, నేను ఫోన్ చేసి మాట్టాడితే దానికి పిచ్చి లేదు యేం లేదు అన్నీ యేసాలు అన్నాడు” 


ఆ మాట వినగానే   భూదేవమ్మకు కోపం తన్నుకొచ్చింది. 


“ఏసాలు ఆడికి చేతైనట్టు పెపంచంలో యెవురికైనా  చేతోచ్చా . సీకటి పడే టయానికి యేనాడైనా యింటికాడ పడివుండాడా.. ఎప్పుడూ మంది కొంపల్లోనూ మంచె కాడ తెల్లారిపోయే! దాని యేడుపంతా పీల్చుకొని పీల్చుకొని గట్టిబడిపోయిన బూరగ దూది దిండు పాటి అయినా మనం అర్ధం చేసుకోవాల. సాటి ఆడదాన్ని అర్దం చేసుకోకుంటే యెట్టా, నీకు వచ్చినయి యింటి ముందు అంపాపురం తాడిచెట్టుకు వచ్చినయి యేళ్ళు, ఇప్పుడంటే అన్నావ్ గానీ ఇంకోతూరి ఆ మాటంటే అన్నోళ్ళు యెవురైనా చెప్పుచ్చుకొడతా. “


“ఆడు అన్నాడని చెప్పినాను కానీ నేను ఆమాట అన్నానా, సరితే  పిచ్చిదానితో యమ యాతనలు పడతన్నాం అంటే కూడా సర్ది చెపుతున్నా. నీ కోడలిని నువ్వే చూసుకో. తూరి తూరి పిలిచి నా పిల్లను విసిగిచ్చబాకు. నీ వల్ల కూడా కాకపోతే పిచ్చాసుపత్రి లో వేసుకోండి” 


“నేను వుండగా దాన్ని పిచ్చాసుపత్రిలో యెందుకేస్తానే, ఇంకో రెండు నెలలు మందులు వాడితే తగ్గిపోద్దని డాక్టరమ్మ చెప్పింది. నీ కూతురికి బరువో భయమో అయితే ఏరు కాపురం పెట్టి దూరంగా పోయి వుండమను. ఇంకోసారి పిచ్చాసుపత్రి గిచ్చాసుపత్రి అన్నావంటే దవడ పగిలిద్ది”  యెర్ర బటన్ ని కసిగా నొక్కింది. ఫోన్ మనుమరాలి చేతికిచ్చింది. 


**********

“అబ్బయ్యా శ్రీకరూ, చిన్నోడా బంగారు కొండా! మీ కోసరం అవ్వ చాక్లెట్లు దాచిపెట్టింది, రాండి, తీసుకోండి.. పిలిచింది మీనమ్మ. కొట్టాల ముందు బంతాట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ చాక్లెట్ల మీద ఆశతో జంకు జంకుగా దగ్గరకు వచ్చారు. వాళ్ళు దగ్గరకు రాగానే గట్టిగా హత్తుకుని ముద్దులాడింది. ఒళ్ళో కూసిండ బెట్టుకుని ఆటలాడింది. అవ్వ పిచ్చిది అని చెప్పింది అమ్మ. అదంతా వొఠ్ఠిదే అనుకున్నారు పిల్లలిద్దరూ. మీనమ్మ పెద్ద కొడుకు వేణు  యిదంతా చూస్తూ ”అమ్మకు నయమైపోతుంది పర్లేదు” అనుకున్నాడు. 


మీనమ్మ దుప్పటి కింద దాచిపెట్టిన కవరు లోనుంచి యేదో రహస్యంగా తీసి పిల్లకాయల చేతుల్లో పెట్టి గుప్పిట మూసేసి చాక్లెట్లు తినండి అంది. పిల్లలిద్దరూ గుప్పిట తెరిచి  వాటిని చూసి ముఖం నల్లంగా పెట్టుకుని “ఛీ. చాక్లెట్లు కాదియ్యి, నీ మందులు, నువ్వే తిను మాకొద్దు” దూరంగా పారిపోబోయారు. వాళ్ళు విదిలిచ్చుకుని పోవాలనుకుకొద్దీ గట్టిగా పట్టుకుని మందులు కాదియ్యి చాక్లెట్లే తినండి తినండి.. అని బలవంతంగా పెట్టబోయింది. పిల్లలు భయపడి గగ్గోలు పెట్టి యేడ్వసాగారు.. వేణు గబాల్న వచ్చి మీనమ్మను ఎనక్కి నెట్టి పిల్లకాయలను యెడంగా తీసుకోయి.. అవ్వా అని గట్టిగా అరిచాడు.


 ఏందబ్బయ్యా! అంత గట్టిగా అరుస్తున్నావ్ అంటా వచ్చింది భూదేవమ్మ. 


“ఆమె ను బైటకు రానీయొద్దని చెప్పినానా లేదా.. చాక్లెట్లని పిల్లకాయలకు మందుబిళ్ళలిచ్చి తిననంటే నోట్లో కుక్కుతుంది. ఈ పిచ్చిమేళంతో మేము యేగలేం కానీ హాస్ఫిటల్ లో పెట్టేసి వస్తా” 


“వద్దులేరా అబ్బయ్యా, బయటకు రాకుండా నేను చూస్తాగా. పిల్లలు భయపడతన్నారనుకుంటే సరితను పిల్లకాయలను ఊరికి పంపియ్యి” అని బతిమలాడుకుంది.  


మీనమ్మ నిదరబోతందిలే! లేచేవోపు చీరలకు గంజేసుకుని.తలస్నానం చేసుకుని వద్దాం అని తలుపు గడియపెట్టి పొయ్యింటి వైపు యెల్లింది భూదేవమ్మ.పనులన్నీ ముగించుకుని అన్నం గిన్నె పట్టుకుని వస్తుంటే కన్ను వాచిపోయి చిరిగిపోయిన చొక్కాతో సావిడి గది నుంచి బయటకొస్తున్న కొడుకు శేషగిరి ని అనుమానంగా చూస్తూ.. ఏమైందిరా.. అని అడిగింది.


“ఏముందీ!.. పిచ్చిది, మదమెక్కిన ముండ, దానమ్మ సిగతరగ,  మొగుడిని అని కూడా సూడకుండా వొళ్ళంతా రక్కింది కొరికింది”. కాళ్ళతో నేలని తాపుతూ అదీ చాలక యెదురుగా వుండ నీళ్ళకుండపై కోపమంతా చూపించాడు. 


“ఒళ్ళు బాగోలేని దగ్గర నీ మగోడి యేసాలేంటిరా.. అవతలకి పో..” అంది చీత్కారంగా.


కళ తప్పిన ముఖంతో  చింపిరి జుట్టుతో చిక్కిశల్యమైపోయి

మంచానికి అంటుకుపోయిన కోడలు కళ్ళనిండా కన్నీటితో ఏవేవో గొణుక్కుంటూ వుంటే .. పిచ్చిదాని మాటల్లా కాకుండా లోతుగా వున్నట్టు అనిపిచ్చి మనసు పెట్టి  వినింది.


“నేను యింకోతూరి తప్పు చేత్తానా.. పూట పూటకి దొంగ కూడు తినే కుక్క కు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ముట్టనిస్తానా,భద్రంగా కాపలా కాయనూ..”


దేవుడేంటి, నైవేద్యం యేమిటి? అయోమయంగా చూసింది. తరువాత లోతుగా  ఆలోచన చేస్తుండగా.. 


“అత్తా! నేనేమైనా తప్పు మాట్లాడానా, నిజమే కదా చెప్పాను. తప్పు చేస్తే కూడా వొప్పుకోవాలి. కప్పెట్టేసుకుని  మోసం చెయ్యకూడదు గందా”  అంది మీనమ్మ.


 కిటికి దగ్గర తచ్చాడుతున్న సరితను చూసిన భూదేవమ్మ..

“ఏమోనే అమ్మా! నువ్వూ నీ పిచ్చి మాటలు, ఊకో, యెవరైనా యింటే  నీ మాటలకు యింకా నాలుగు కల్పితాలు చేసి రచ్చకెక్కిస్తారు.  దానికి బయటోళ్ళదాకా యెందుకు మనింటోవాళ్ళే చాలునుగందా”


వాత పడ్డ సరిత చప్పుడు చేయకుండా లోపలికి జారుకుంది. 


 రేయంతా ఆలోచనలు చేసిన భూదేవమ్మ తెల్లవారుఝామున  నిద్రలోకి జారుకుని పెళ్లున యెండ కాసేటప్పుడు మేల్కొంది. ఆ సరికే ఆమె  కళ్లకు శుభ్రంగా స్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకుని ముఖాన కాసంత బొట్టెట్టుకుని కనబడింది మీనమ్మ.  నిండా ఆశ్చర్యంలో మునిగి వుండగానే.. 


“అత్తా!కార్తీకమాసం కదా తులసి ముందర దీపాలు యెలిగిచ్చా చూడు” అంది. “ఇది కార్తీకమాసం కాదే అమ్మా  నవరాత్రులు”  మనసులో అనుకుని  గుమ్మం ముందుకొచ్చి చూసింది. నడవంతా కడిగి ముగ్గులు పెట్టి నిజంగానే తులసమ్మ దగ్గర దీపాలు పెట్టి వుండటం చూసి సంబరపడింది. మరొకనాడు చేతులు జోడించి ఈనుతున్న ఆవు చుట్టూ  ప్రదక్షిణలు చేస్తున్న మీనమ్మ ను చూసి ఆశ్చర్యపోయింది. 


 దీనికి పిచ్చి కొంత తగ్గి మాములు మనిషిగా మారతంది. ఓపిగ్గా యింకొన్నాళ్లు లాక్కొద్దాం. ఇంటి ముందర  కానుగ చెట్టు కింద మంచమేసి కూర్చోబెడితే సరి.దారిన వచ్చే పోయే వాళ్ళను చూసైనా మనుషుల లోకంలో పడుద్ది అనుకుంది. ఆలోచన మొదలైంది తడవూ దినంబు ఆ  పనే చేస్తుంది భూదేవమ్మ. కొందరు చెట్టు కింద కూర్చున్న మీనమ్మను పలకరించి కాసేపు మాట్టాడి ఆమెకు నిజంగా పిచ్చే అని తీర్మానించుకుని పోతే మరికొందరు పిచ్చి లేదు యేమి లేదు మనిషి మాములుగా వుందని మాటలతో యెదురుకోలు ఆడుకున్నారు. . 


చీర చెంగు ముఖాన యేసుకుని దారినపోయే  పిల్లలతో దాగుడుమూతలు ఆడుతూ కొట్టంలో ఆవులకు మేతేస్తూ ఆటిని నీళ్లకు వొదిలి గంగడోలు నిమురుతూ తువ్వాయిలతో ఆడుకుంటూన్న కోడలిని చూసి ఆనందపడింది భూదేవమ్మ.


ఒకనాడు సందేళ   కానుగు చెట్టు కింద కూసుని వుంది మీనమ్మ. క్రీగంట ఆమె వైపు చూసుకుంటూ వీధిలో నడిచి పోతున్న మనిషిని చూస్తూ పకపకా నవ్వింది. గేటు కాడికి పరిగెత్తిపోయి ఆ మనిషిని చేయి వూపి పలకరించింది.  అతను తనపాటికి తాను నడుచుకుంటూ పోతా వుంటే అదే పనిగా చూస్తానే వుండే కోడలి కళ్ళల్లో వెలుగు పెదాల పై సన్ననవ్వు చూసి ఆశ్చర్య పోయింది.  అంతలోనే మీనమ్మ  యెనక్కి మళ్ళి రెండు చేతులతో నేలమీద దుమ్మును తీసి నెత్తి మీద పోసుకుంటూ “రాధాకృష్ణుల పెళ్ళంట ఊరూ వాడలో వింతంట. తారాచంద్రుల ప్రేమంట,మొగుడికేమో మటంటా” పాడుకుంటా వుంది.


ఏయ్, లోపలికి పో, ఎదురుగా నిలుచుండి గుడ్లిరిమి చూస్తున్న మొగుణ్ని వెనక్కి నెట్టి గుప్పిళ్ళ నిండా దుమ్ము తీసి అతని ముఖాన జల్లింది. కోపంతో వూగిపోయినతడు  చేతికందిన దుడ్డు కర్రతోనూ అదిరిగిపోయాక గడ్డిమోపు కట్టుకునే రబ్బరు తాడుతో ముందు యెనక చూడకుండా బాదుతుంటే వీధి లో నడుస్తున్న మనషులు జాలిగా చూసారు.  వీధిలో పోతున్న ఆ మనిషి కూడా పాతేసిన గుంజలా నిలబడి మరీ చూసాడు. భూదేవమ్మ వచ్చి కొడుక్కి అడ్డుపడకపోతే ఘోరం జరిగిపోయి వుండేది. మీనమ్మ శవమై పడి వుండేది.



నెత్తరోడుతున్న గాయాలను దుమ్ము నిండిన తలను కడుగుతూ “పక్క పాపిట తీసిందని పక్కలిరగ తన్నినాడు పరాయి మగోడిని చూస్తే వూరుకుంటాడా”  లోపలిమాటను యెల్లగక్కింది. కోడలి వీపు పై వాతలకు వెన్న రాస్తూ.. కాలంనాటి ముచ్చటొకటి చెప్పుకొచ్చింది.


నా చిన్నప్పుడు మా వూళ్ళో ఇంద్రమ్మ అనే ఆమె సంవత్సరానికి వొకసారి శ్రావణ మాసంలో రాధా కళ్యాణం చేసేది. పొన్నచెట్టు కింద రాధ బొమ్మ ను కృష్ణుడి బొమ్మను నిలబెట్టి అచ్చం బృందావనాన్ని సృష్టించేది. ఎంత బాగుండేది అనుకొన్నావ్.  ఆ కళ్యాణానికి పిల్లలే పేరంటాళ్ళు అతిధులు. ఒక్క మగ పురుగును కూడా రానిచ్చేది కాదు. రాధా కళ్యాణం చేస్తే  యిష్టపడిన మగాడి ప్రేమ దక్కుద్ది అంట అని చెప్పేది. అదేదో బొమ్మల పెళ్ళి అని, అరిసెముక్క లడ్డూలు పెడతారనే సంబరం తప్ప ఆ వయస్సులో ఆ మాటలు నాకేడ అర్ధమయ్యేయి! ఇప్పుడు ఆలోసిత్త్తావుంటే ఆ పెళ్ళిలో పరమాత్మమంతా బోధపడిద్ది. రాధాకృష్ణులు వయస్సుతో సంబంధంలేని ప్రేమికులు గందా. లోకమంతా వింతగా తప్పుగా చెప్పుకోకుండా వారిద్దర్ని భార్యాభర్తల్లాగా నిలబెట్టాలని ఇంద్రమ్మ లాంటి వాళ్ళు చేసే తతంగం కాబోలు అని వ్యాఖ్యానించింది. 


మర్నాటికల్లా శేషగిరి  ఇనుప గొలుసులు తెచ్చి  మీనమ్మ కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసాడు.బీగాలు కూడా వేసాడు.  పిచ్చిది అందరినీ కొడుతుంది అని అడిగినోళ్ళకు అడగనోళ్లకు అందరికీ ప్రచారం చేసాడు.


 గొలుసుల బరువుతో కాళ్ళీడుస్తూ ముంజేతులకు పుళ్ళు పడి వొంటి మీద బట్ట కూడా సరిజేసుకోలేక అన్నింటికి తనపై ఆధారపడిన కోడలిని చూసి  కడుపులో నుండి దుఃఖం పొర్లుకొచ్చింది. “అయ్యో కూతురా! నీ గ్రహచారం బాగుండలేదు కదే, ఎవురితోనూ యేలెత్తి చూపించుకు యెరగని నీకు యీ అవమానపు కాలం యెందుకు రావాల” అని ఆక్రోశపడింది.  కొడుకు యిల్లు దాటాకా బండరాయెత్తి గొలుసుల తాళం పగలగొట్టి సంకెళ్ళు విసిరి పారేసింది. 


దీపాల అమాస ముసురు తగ్గి తెల్లమేఘాల మధ్య చంద్రుడు చల్లగా వెలుగులుజిమ్మే కాలంలోకి వచ్చిపడ్డాడు.వేణు  పిల్లలకు దసరా సెలవులొచ్చాయనే వొంకతో భార్య పిల్లలను తీసుకుని అత్తగారింటికి పోయి నెల్నాళ్ళు అవుతున్నా అయిపు లేడు.చేను వెన్నుమీద వుంది  యెరువు మందు చల్లాలన్న సోయ కూడా లేదేమో సన్నాసికి  అనుకుంటూ వేణుకి ఫోన్ చేసింది.  మనుమడు మాట్టాడిన తీరుకి యెడా పెడా వాయించింది భూదేవమ్మ.. 


“మీ అయ్య కొంప ముఖమే సూడట్లేదు. పొయ్యి నెలయ్యింది నీ తోడబుట్టిందానికి కన్నతల్లి అన్న మమకారమే లేకపోయ్యె, రెండు పండగలు వొచ్చిపోయినా తిరిగి చూడకపొయ్యే.  నీ తమ్ముడు హాస్పిటల్ లో చూపిచ్చి మందులిప్పించి చేతులు దులిపేసుకుంటుండే,  మీలో ఎవ్వుర్రా అమ్మ ను బాగా చూసుకునేది. మనసు పెట్టి పట్టుమని తలో వొక నెలైనా దగ్గరుండి చూసుకుంటిరా. పైగా దాని చేతులకు కాళ్ళకు గొలుసులేస్తుంటే చూసి గమ్మున వూరుకుంటిరి. నవమాసాలు మోసి కనీ చనుబాలు తాపి మీ పియ్యెత్తి మీ ముక్కు తుడిసి మీ గుడ్డలుతికి మిమ్మలను అపురూపంగా పెంచిన అమ్మను యిట్టాగేనా చూసేది. పైగా అది యెవుడితోనో లేచిపోయింది అంటావుంటిరి. నెలాపదినాళ్ళు వాడితో వుండింది మీలో యెవురైనా చూసినారా? చెప్పుకునే వాళ్ళు యెవురైనా కళ్ళారా సూసేరా. పిచ్చిదై తిరుగుతుంటే చూసినాళ్ళు ఆచూకీ చెప్పినారు కాబట్టి పోయి తీసుకొచ్చినారు.. అదే గదా జరిగింది. దానికి పిచ్చి లేకపోతే డాక్టరు మందులెందుకిస్తారనే యింగితగానం వుండొద్దు మీకు.మళ్ళీ మీయందరూ చదువుకున్నోళ్ళంట, థూ!. ఎన్నాళ్ళు కొంప సేద్యం వొదిలిపెట్టి వుంటారో వుండండి. మీ అమ్మను పిచ్చి ఆసుపత్రిలో చేర్పిచ్చేది  యెందుకు అది పిచ్చి తగ్గి  సుబ్బరంగా తిరుగుతుంటే.. మీరు వస్తే రండి లేకుంటేలేదు”  కరాఖండిగా చెప్పింది.


ఫోన్ లో మాట్టాడిందంతా వింటానే వుంది మీనమ్మ.వెక్కి వెక్కి యేడ్చింది. మనసు బరువుదీరా యేడ్చింది. కల్మషం అంతా కరిగిపోయిందాకా యేడ్చింది. వాన ధారగా కురిసినంతగా యేడ్చింది. 


ఆ రోజూ మాములుగానే తెల్లవారింది అందరికీ. భూదేవమ్మ కు తప్ప. ఆమె ఆశలను వమ్ము చేసి బతుకునే తెల్లార్చుకుంది మీనమ్మ. మగతగా పడి వుండటానికిచ్చిన మందు మాత్రలన్నీ వొకేసారి వేసుకుని శాశ్వత నిద్రలోకి జారిపోయిందని దుప్పటి కింద ఖాళీ డబ్బా చెప్పింది. 


“అయ్యో కూతురా! యెంత పని చేసినావే. ఇష్టాన్ని బతికిచ్చుకోవాలంటే చావడం వొక్కటే మార్గం అనుకుంటివా, ఈ మసల్దానితో వొక్క మాటన్నా చెప్పివుంటే  యాభై యేళ్ళకు పైగా మొగుడు లేని ముండగానే వుండి బతుకంతా తీపిగా యిష్టంగా బతికిన బతుకు గురించి చెప్పి వుండేదాన్ని కదే.” నెత్తి బాదుకుంటూ యేడ్చింది.  కడచూపు చూడటానికి వొచ్చిన వారికి కూడా ఆ గోస మనసుకి తాకి నిలువెల్లా కదిలించింది.  


మేము మనుషులమే అంటూ ఆయిన వాళ్ళు కంటికి కడివెడులెక్క కురిసి తేలారు.  కాస్త ఆలస్యంగా జరగవలిసిన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. గుండె పగిలేదాకా యేడ్చి శోష వచ్చి పడిపోయిన భూదేవమ్మ ను నడిమింట్లోకి చేర్చారు. తెప్పరిల్లాక చల్ల కలిపిన నీళ్ళు మాడు మీద చల్లుకుని మూడు ముంతలు నీరు పైనుండి గుమ్మరిచ్చుకుని వణుకుతున్న వొంటితో చీర చుట్టుకుని యింట్లోకి నడవకుండా.. సావిడి గదిలోకి నడిచింది. మీనమ్మతో పాటు మీనమ్మ గురుతులు మాయమైపోయి బోసిపోయిన గదిని చూసి మరింత బావురుమంది. గది నడిమ కూలబడింది. కోడలితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. పద్నాలుగేళ్ళ పిల్లప్పుడు కాపురానికి వచ్చింది.ముప్పై యేళ్ళు  తల్లో నాలుకలా మెలిగింది. ఎంత పని చేసేవే బిడ్డా. అని పొగిలి యేడ్చింది భూదేవమ్మ. 


 గది గోడలు తామిద్దరూ రాత్రి చెప్పుకున్న రహస్యాన్ని మళ్ళీ వినిపిస్తున్నట్టు అనిపించింది ఆమెకు.


************

“అత్తమ్మా.. నీకో మాట చెబుతా, నిజమే చెబుతా నమ్మాలి నువ్వు.”


“చెప్పవే తల్లీ.. నువ్వెప్పుడైనా అబద్దం చెప్పావా”  


“నాకు పిచ్చి లేదత్తమ్మా.”అంది అత్త కళ్ళలోకి సూటిగా చూస్తూ.


“నాకు ఆ ఇసయం ఇడమరిచి చెప్పాలంటే పిచ్చి మొహమా! మందులేసుకోకుండా దిబ్బగుంటలో పడేసినప్పుడే కనిపెట్టా.  నీ మనసు నీ ఆలోచన నా కన్నీ తెలుసు. నువ్వు మాత్రం యేం చేత్తావ్, శరీర ధర్మం చెప్పింది చేసావ్. నువ్వు తప్పు చేసానేమో అన్న ఆలోచనతో   నలిగిపోవడం పాత కాపరంలో యిమడలేకపోవడం నాకు తెలియదనుకున్నావా?  తప్పు ఉసిగొల్పిన వొంటిదా  కోరుకున్న మనసుదా అని మధనపడతన్నావ్, తప్పు రెండింటిదీ అయితే  నువ్వసలు పశ్చాత్తాప పడనేకూడదు మానసిక దుఃఖం అసలే కూడదు”


“నువ్వీ మాటలు అంటుంటే యెందుకో మా తాత బాగా గుర్తొస్తున్నాడు. నీ వొళ్ళో కాసేపు పడుకొంటా అత్తమ్మా.”


“రావే తల్లీ.నా వొళ్ళో రవ్వొంతసేపు వొడ్డిగిల్లు. మనస్సు నెమ్మళం చేసుకో”  ఓదార్పుగా తల నిమిరింది తను. ఆశ్రమంలో గురువులు చెప్పే మాటలు మననం చేసుకుని కోడలి మనసు నెమ్మదిపడేటట్టు నాలుగు మాటలు చెప్పింది కూడా. 


“శారీరక ధర్మం ప్రకారం నడవాలనుకునే వారికి తప్పొప్పులు ఆలోచనలు అంటకూడదు. తొర్రలో పడ్డ నిప్పు రవ్వంత అయినా చెట్టునే దహించేస్తుంది.  గతం గతః అనుకో, అప్పుడే నీకు మనఃశ్శాంతి” 


కళ్ళ నీళ్ళతో చీర చెంగులో ముఖం దాచుకుంటూ.. 

“నేను చచ్చిపోతే ఏడుస్తావా అత్తమ్మా” అంది


అప్పుడైనా తట్టలేదు..ఈ మంద మెదడుకి,  ఇది యేదో అఘాయిత్వం తలపెట్టిద్ది అని.. 


అప్పుడు తను అంది


“ఏం మాటలే అయ్యి.  జరిగిందేదో జరిగిపోయింది. నేనుండంత కాలమూ..  నీ మొగుడి తో సహా యే  ఈగను  నీ మీద వాలనివ్వను. రోజూ చేనుకు పోదాము. పనులు చేసుకుందాం. మంచి తిండి తిని మంచి గాలి పోసుకొని ఆరోగ్యంగా నిలబడాలి నువ్వు. నీ మొగుడు చూసినప్పుడు మాత్రం పిచ్చిదానిలా  నటిస్తావుండు చాలు. ఆడు నీ జోలికి రానే రాడు అంటూ తన మాటలకు తనే పగలబడి నవ్వింది. మీనమ్మ  నవ్వకుండా నిశ్శబ్దంగా కన్నీరు కార్చింది. కరువుదీరా యేడ్వనీ, ఏడుపు మనిషికి మంచి ఔషదం అన్నట్టు  గమ్మున వుండిపోయింది. ఆ కన్నీటికి అర్థం ఇదా. మరోమారు గుండె బద్దలైంది. 


***************

మాత్రల డబ్బాన్ని అట్టెందుకు అందనిచ్చావ్ అవ్వా అంటా మనవరాళ్ళిద్దరూ  కూతురు మూకుమ్మడిగా భూదేవమ్మ చుట్టూ జేరి ఏట కుక్కలు మాదిరి వాసన కనిపెడుతూ కూపీ లాగను మొదలెట్టారు. 


“పిచ్చిది, ఎప్పుడు యేమి చేత్తదో నేనట్టా చెప్పేదే అమ్మల్లారా?”


“ ఏమోలే! పొరపొచ్చాలు అందరికీ వుంటాయి. మానబోయే పుండుని కెలుక్కుని బాధపడటం యెందుకు? ఇకనైనా నాయన్ని కనిపెట్టుకుని వుండవ్వా” అంది జయ.


“ మీ అమ్మకు బిడ్డ రూపంలో వున్న శత్రువ్వి గదే నువ్వు” దవడ గట్టిగా బిగించి నిరసనగా చూసింది మనుమరాలి వైపు.  


 “నువ్వు మాత్రం ఆ పిచ్చితనంతో యెన్నాళ్ళు పడతావ్ లే,మరిన్ని బాధల్లేకుండా తొందరగానే ముగిచ్చుకుని పోయింది నిన్ను వొడ్డున పడేసింది” అంది కూతురు.


అందరినీ నిర్లిప్తంగా నిస్తేజంగా చూసి మాట పొదుపు జేసింది భూదేవమ్మ. మనస్సులో గట్టిగా అనుకుంది..


కోడలి రహస్యాన్ని  యేనాటికి బైటకు పొక్కనియ్యకూడదు.కష్టమో కామితమో  యేదైనా యెట్టాంటిదైనా బిడ్డను అక్కునజేర్చుకుని ఆదరించాలే తప్ప వీధిన యేసుకుంటామా? తెల్లని గుడ్డపై  వున్న మరకలను బయటేసుకుని తిరగమని యే తల్లి చెబుతుంది? రహస్యాలను బట్టబయలు చేయని గది  గోడల్లా యిపుడు   తనూ వొక  నిలువెత్తు రహస్యపు గోడ, అంతే!


**************సమాప్తం***************