#కవిత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
#కవిత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఫిబ్రవరి 2026, గురువారం

గ్రీకు సుందరి - తోటరాముడు

 



నా కొత్త కవిత  “ప్రేమ ప్రకటనా పత్రము “  

ది తెలంగాణ డాట్ కామ్ లో ప్రచురితం. 

ఈ లింక్ లో ప్రేమ ప్రకటనా పత్రము  చదవండి ప్లీజ్! ధన్యవాదాలు 

24, జనవరి 2026, శనివారం

గాయాల గానం




గాయాల గానం   - వనజ తాతినేని.


ఇవాళ దుఃఖం పలుకరించింది. గాయాల సలపరం

ఎన్నో పురాతన దుఃఖాలను తవ్వి తీసింది.

కాలం గాయాలను మాన్పుతుందని ఎవరైనా అంటే 

గాయం లోపల ఓ అగ్నిపర్వతం దాగి వుంది అంటాను.


గాయం చెద రేగినట్టు రేగుతూనే వుంటుంది.

అది ఎన్నటికీ అదృశ్యం కాదు. 

ప్రతి గాయం ఒక విస్ఫోటనం

శకలాలు శకలాలుగా శరీరాన్ని తాకిన గాజు పలక

శరం లా గుచ్చి రంపంతో  పర పరా కోసిన అటవిక క్రీడ  


మానిపోయిన మచ్చల పై  తడిమి చూస్తే గాయం లోతు అందకపోవచ్చు

నది లోతు ఎంతో మనకు తెలుస్తుందా, అంతే! 

పోనీ నది కింద ఉన్న భూమి లోతు నదికి తెలుస్తుందా?  

నదిని దాటడానికి తెప్ప సాయం తీసుకున్నట్టు 

గాయానికి గాయానికి మధ్య వంతెన వేసి

జీవితాన్ని దాటడానికి యత్నిస్తున్నా.


గాయపడినప్పుడు కల్గిన బాధ నొప్పిని కూడా 

సృజనాత్మకంగా చిత్రీకరించే వుంటాను. 

పనిముట్టు మనదే అయినప్పుడు రూపాలకు ఏమి కొదవ ? 

తుఫానులా పలకరించి పోయే గాయాల జ్ఞాపకం మంచిదే!


గాయాలు చేసిన మనిషిని క్షమించేసి వుంటాను

ఆ గాయాల గుర్తు మాత్రం  మాసిపోదు. 

మనుషుల ముఖాన్ని గాయంతో పోల్చుకుంటాను 

ఆసరా తెచ్చుకుని మరీ గాయపరిచాడు కనుక.

గాయం నా పాత సహచరుడు.

నా నడక అతను చేసిన గాయాల జ్ఞాపకాలే! 


ఉంగరంలో పళ్ళ మధ్య  చక్కని బిగింపుతో  

కూర్చున్న వజ్రంలా నాలో మాయని గాయం

గాయ గేయంలో లయ తూగు బరువు  

అన్నీ సరిగ్గా అమిరాయి.  రుజువు కావాలా?

నా మణికట్టును పట్టుకుని నాడి ని చూడు. 

గాయాలు ప్రవహిస్తున్న సవ్వడి వింటావ్. 

వినబడని పాట అది.


నాకుగా.. నేనేం మిగల్లేదు. గాయాలుగా మిగిలాను.

 గాయాలపై పూలు పూయడం చూసారా ఎవరైనా! 

జీవన మకరందాన్ని ఆస్వాదించేది ఎలా?

గాయం నా జీవన గానం, యానం.  

గాయం నాలో జ్వాల, నా జీవశక్తి 

మానడానికి పట్టే సమయం నా జీవిత కాలం.


(18/01/2026 ఆదివారం ధి ఫెడరల్ తెలంగాణా డాట్ కామ్ లో ప్రచురింపబడింది)







2, డిసెంబర్ 2025, మంగళవారం

చెలికానితనం

 


చెలికానితనం    - వనజ తాతినేని.


కాళిదాసు రచించిన  శాకుంతలం నాటకమో మేఘసందేశమో కాదు

పోతన వర్ణించిన శరదృతువు కాదు

ఆముక్తమాల్యద లో వర్ణించిన  వర్షరుతువు కాదు

ఇదేదో పొడుపు కథలా కనబడే పద్యమూ కాదు

సంయోగ వియోగాలకు అతీతమైనది ఈ ప్రేమ రుతువు

 

నువ్వు వలపు గాలానికి చిక్కిన చేప వి కాదు

నేను  భావజాలానికి లొంగిపోలేదు

ఎవరో దయతలచి నిన్ను నాకు బహుమతిగా ఇవ్వలేదు 

ఏ తావుల్లోనో నిను వెతకకుండానే ప్రాప్తించినావు 

నన్ను నీవు తెలుసుకున్నావు, నిన్ను నేను కనుగొన్నాను. 

వస్తువు ఒకరైతే రూపం మరొకరిది


గాఢనిద్ర వలె తిమిరం కమ్మేసినప్పుడు 

నా స్వరజ్ఞానం నీతో స్వరచాలనం చేసింది

వాగ్ధానాలు అవసరం లేని వాగ్వాదాలు అసలేలేని మౌనమూ

గానమూ కలసిన ధ్యానముద్ర మనది.


కలలు కననూలేదు కల్లలైనాయని చింత పడనూలేదు. 

కలయిక వున్నప్పుడు ఎడబాటు వుంటుందనే ఎరుక కల్గిన మనం  

అదృశ్య గొలుసులతో బంధించబడి వున్నాం

చిక్కుముడులు పడనీయని బ్రహ్మ ముడులు వేసుకోని బంధం మనది. 


నీ పరిచయాన విస్మృతిపథాన పడిపోయిన నా బాల్య జ్ఞాపకాలు 

తిరిగి నాలో జాగృతమైనట్లు 

అనువాద భాషలవసరంలేని హృదయభాషని

అక్షరాలతో మార్పిడి చేసుకుంటూ..ఘ్రాణేంద్రియశక్తితో వర్ధిల్లుతూ

కాలానుగుణంగా ఎవరి త్రోవన వారు నడుస్తూ.. 

అల్పమో ఆధిక్యమో దూరమో దగ్గరో  అన్న లెక్కలు లేకుండా. 


నేను రూపసిని కాకపోయినా నువ్వు గుణవంతుడివే అయినా 

ఈ చెలికానితనం వర్ధిల్లక మానింది కాదు. 

ఒక వస్తువు నో ఒక విషయాన్నో నాతోపాటు ఆలోచిస్తావు. 

అనుభూతి చెందుతావు. ఈ భావ సారూప్యం చాలును!


మనోఃఫలకం పై ముద్రించిన నీ ఊహా చిత్రం 

ఆనందసౌరభాన్ని చిలికి చిందించినట్లు వుంది

ఆలోచన కలిసిన నాలుగు క్షణాలు ప్రేమలో 

నిండా మునకలు వేసినట్టు వుంటుంది. 

ఏ ప్రేమ జీవితాంతం అంటి పెట్టుకుని వుంటుంది గనుక

లిప్తపాటు ప్రేమలు మనవి.  


కథలు రాసే నేను కథలో కథ వుంటుందని 

ఆ కథ పూలదండలో కనబడని దారంలా అంతర్లీన సూత్రంలా

దాగి వుంటుందని ఏం చెప్పను? 

పగిలిన వేణువులో కూడా అపశృతుల సంగీతం వినిపిస్తుంది

కరివానలో కూడా తటిల్లత క్షణకాలం వెలుగునిస్తుంది

అక్షరాలకు ఆవేశం వుంది చదివే హృదికి అనుభూతి వుంది అని తప్ప


కల్పిత గాథలకి జీవం పోసేది మనసే కదా! 

గొలుసు కథను మనలా  అందుకుంటారెవరో!

ఈ రోజు నదిని నేను చంద్రుడివి నీవు.

తీరాన అలంకరింపబడిన  రెల్లు పూల తోరణానివి నీవు. 

ఈ చీకటి రాత్రంతా తలలూపుతూ కవిత్వంలా పలకరిస్తూ వుంటావ్


మనుషులు తిరగని మనోవీధిలో రద్దీ లేని ప్రయాణం మనది.

కాస్త పుస్తకం చేతిలోకి తీసుకుందాం.

తన కాలంలో గుర్తింపబడని విస్మరింపబడిన కవి పేరు ని 

ఆత్మీయంగా స్పృశించి నచ్చిన వాక్యాన్ని కళ్ళకు అద్దుకుందాం.

పుట పుటతో పుటం పెట్టుకుందాం తెల్లవారే వరకూ.

నిద్రలేమి కళ్ళలో జీవితాన్ని వెలిగించే వెలుగుతో.

వేయి పున్నముల వెలుగు .. ఒక్క కవి వాక్యం.

 
2025 నవంబర్ 30 ఫెడరల్ తెలంగాణ డాట్ కమ్ లో ప్రచురితం.

3, నవంబర్ 2025, సోమవారం

అగ్ని కణిక

 



పుస్తకం - వనజ తాతినేని 

పుస్తకం  

నా చీకటిని వెలిగించిన అగ్ని కణిక. 

పుస్తకం నా తల్లి అందించిన స్తన్యం

నా లేలేత చదువుకి ఊపిరిలూదిన “సమత” నా వెన్నుముక.  

పుస్తకం ఒక మార్గం. 

మార్గాన్ని సూచించే చూపుడు వేలు కూడా.

ఫుస్తకం శిఖర అధిరోహణం. 

బాటలో రాళ్ళు ముళ్ళు ఏరి వేయడం నేర్పే  బోధనా పాఠం.

పుస్తకం నను కూర్చుండబెట్టే ఉన్నతాసనం.

నేను యెక్కివచ్చిన సోపానాలు కూడా.

పుస్తకం దర్పణం.

నన్ను నాకు ముసుగు లేకుండా   చూపెడతుంది. 

పుస్తకం ఏకాంత కారాగారం . 

నా అంతర్ముఖ ప్రపంచానికి త్రోవ చూపిన దివ్వె. 

పుస్తకం ఒక ప్రచోదని 

జీవితమనే సముద్రంలో 

సమస్యల సుడిగుండాలను తప్పించేది

పుస్తకం నేను ధరించిన రెక్కలు.  చేత పట్టకమునుపు ఎగరలేని పక్షిని నేను.

పుస్తకం ఒక తరువు. 

నిత్యవసంతమై రాల్చుతున్న పూల వర్షమే.. నేను నేర్చుకున్న వర్ణమాల. 


(వాసిరెడ్డి సీతాదేవి నవల  “సమత” నేను మొట్టమొదట కూడబల్కుకొని చదివిన పుస్తకం)

27, అక్టోబర్ 2025, సోమవారం

యూ మేక్ మి హ్యాపీ గ్రాండ్ పా..




You make me Happy Grandpa 

                          - వనజ తాతినేని 


నిజం చెప్పు.. అబ్బాయీ!!

నా చిటికెన వేలు పట్టుకుని నాతో నడుస్తూ 

అమాయకంగా ముచ్చట్లు చెబుతున్న పసివాడికి 

నీతి బోధల కథలు చెప్పాలా వద్దా? 


కాస్త అటు ఇటుగా మనం చూసే 
ప్రపంచాన్నే వాడూ చూస్తున్నాడు. 

మనం పీల్చే గాలి వాడు పీలుస్తున్నాడు. 

బహుశా వాళ్ళమ్మ  వాడికి మంచి ఆహారాన్ని 

వద్దన్నా మాయ చేస్తూ కథలు చెప్తూ తెరపై 

కార్టూన్ కథలు చూపిస్తూ తినిపిస్తూ ఉంటుంది. 


వాడు పసివాడుగా వున్నప్పుడే ఎక్కువగా

నచ్చేసాడు నాకు. 

మన మాయలో పడ్డట్టు నటిస్తూనే 

మనను మాయలో పడేసేవాడు. 

ఇంక వాడికి తెలియనిది ఏమి లేదు. 


కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ  

తెలుసుకోవాల్సింది తెలుసుకుంటూ అవసరమైనవి 

అనవసరమైనవన్నీ పోగుచేసుకుంటాడు. 

ఏది అట్టి పెట్టుకున్నాడో ఏది ఖాళీ చేస్తాడో 

ఎలా చెప్పగలం మనం? 

ఏదైనా ఒకటి రెండు స్వీయానుభవాలు 

తర్వాత జాగురకతతో వుంటాడేమో! 


మనం చెప్పాల్సింది నిప్పు కాలుతుంది 

నీటిలో దిగకూడదు మేడ మీద నుండి పడిపోతావు

రోడ్డుకి ఎడమ పక్కనే నడవాలి.

ఆ ఆకులు పండ్లు తినకూడదు 

మనిషిని గుడ్డిగా నమ్మకు లాంటి భద్రతా 

హెచ్చరికలు మాత్రమేనా!  ఇంకేమీ వద్దా!?


అమ్మ నాన్న తప్ప వేరెవరూ లేని ఇంట్లో
తాను విన్నవి కన్నవి  చేసినవి బలవంతంగా
చేయించినవి ఇలా ప్రతి పని  నుండి ఏదో వొకటి 
నేర్చుకుని అనుభవాన్ని ప్రోది చేసుకుంటూ  
ఆ చిన్నారి పెద్దల చిటికెనవేలు విడిపించుకుని 
ముందుకు వెళ్ళిపోతాడు. 


నేనెప్పుడైనా తలపులలో  వొకసారి.. 

వద్దన్న పనులు చేసే ఆకతాయిని

చిత్రాంగి కబుర్లు చెప్పే అమ్మాయిని

చూసి రమ్మంటే ఏకంగా కాల్చి వచ్చే కోతిని

స్నేహితుడి ఏడుపు చూసి ఆనందించే ప్రకోపిని..   

వాళ్ళను ఇలాంటి కొన్ని బండ గుర్తులతో 

జ్ఞాపకం చేసుకొంటానేమో! 

వారేమో .. మనతో గడిపిన కాలాన్ని చాపలా 

చుట్ట చుట్టుకుని నెత్తిన మోసుకెళతారేమో!? 


కానుకగా బాహ్యంగా కనిపించే కొన్ని 

వస్తువులను ఇచ్చి వెళ్ళగలనేమో!  

కానీ అంత కన్నా అపూర్వమైన నిధి కూడా 

ఇచ్చి వెళ్ళగలం అన్న సంగతి నీకూ తెలుసు. 

రుజువులు దశాబ్దాల క్రితం మరణించిన 

అమ్మమ్మ ను తాతయ్యను నువ్వు జ్ఞాపకం చేసుకోవడం. 


మా అమ్మమ్మ గుర్తుగా నా దగ్గర 

ఓ స్టీల్ కేన్ వక్కపొడి డబ్బా వున్నాయి. 

మా నాయనమ్మ తాతయ్య గురించి 

పురావస్తు ఆధారాలు  నా దగ్గర ఏమీ లేవు. 

కల్మషం లేని నది వొడ్డున స్వేచ్ఛగా 

ప్రేమతో సంచరించిన  కాలం, 

పిచ్చాపాటి మాటల్లా అనిపించే కొన్ని

అద్భుతమైన విషయాలు అందులో నిబిడీకృతమైన 

నీతి కథల్లాంటి సందేశాత్మక దృశ్యాలు 

అమూల్యమైన జ్ఞాపకాలు మినహా! 


నాక్కావల్సివచ్చినప్పుడల్లా గతాన్ని తలుచుకుంటూ 

నా నెత్తిన చుట్టిన చాపను పరుచుకుని 

ధూళి లాంటి జ్ఞాపకాలను ఏరుకుంటాను. 

అందులో నాకో సందేశం వుంటుంది. 

నాకై నేనెలా వుండాలో ఇతరుల పట్ల 

ఎలా మెలగాలో అని. 


ఇప్పుడు చెప్పు!? 
మన పసివాడికి ఏమైనా చెప్పాలా వద్దా!? 
అదీ వీడియో కాల్ లోనే కదా! 


బతికివున్న అమ్మ నాన్నలనే మర్చిపోతున్న

తరానికి ప్రతినిధి నువ్వు. 

పిల్లలకు చెప్పేవి పోసుకోలు కబుర్లు అనుకుంటావ్ నువ్వు. 

మీ విలువైన సమయం మొబైల్ ఫోన్ లో  

దాగి ఉంటుంది గనుక. 


కాల సృహ లేని ముసలి వాళ్ళ తాపత్రయం

తమ ముద్ర ను పిల్లల మనసులో 

నాటి పోదాం అనే దుగ్ధ కొంత 

ఏకాకి బతుకుకి కాస్త ప్రేమ రంగు అద్దుకోవాలనే 

అత్యాశ తప్ప ఇంకేముంటుంది చెప్పు?


I love you Grandpa 
My sweet sweet grandpa .. 
you make me happy ..
అని అడుగుతున్నట్టు కలలు 
ఊరిస్తున్నాయి రా!
కన్నీరు కూడా వొంటరైంది. 
తుడిచే చేయొకటి కరువై. 

21/10/2025 The Federal.com నేటి మేటి కవిత గా ప్రచురితం.