24, ఏప్రిల్ 2026, శుక్రవారం

నిమ్నగ నడక

 


నిమ్నగ నడక   - వనజ తాతినేని.


ఏమని ప్రవహించనూ.. ఏమని వర్షించనూ

జీవనది కాగలనా కారు మేఘమై కరుణించగలనా

నెర్రులిచ్చిన పంటపొలం లా  హృదయపు అంచులు చిట్లిపోయిన  

ఆ  వైపు గట్టుదాటి  ఏమని ప్రవహించను ?  

అశ్వినిదేవతలు మనువుకు హలం పట్టించి  విత్తనం ఇచ్చినట్లు 

బహుమానంగా ఏమివ్వగలను?

ఏమని ప్రవహించనూ… ఏమని వర్షించనూ..


నెయ్యమవ్వనా, కయ్యమవనా?

హిమానీనదాల వలె  చల్లగా వుండనా

పోనీ హేమంతంలో తొలి వెలుగులా వెచ్చగా ప్రవహించనా

సగర పుత్రులకు శాపవిమోచనం చేసిన గంగలా ముంచెత్తనా

సకల కరువులను తీర్చగల గలగల గోదావరి లా ప్రవహించనా 

గంభీర కృష్ణవేణిలా మందగమనంతో జీవరసాన్ని నింపనా? 

ఏమని ప్రవహించనూ.. ఏ విధంగా వర్షించనూ? 


వినతులు ప్రణతులు ఆర్తి పలుకులు నిందాస్తుతులు

మొండితనం జగ మొండితనం అన్నీ చూస్తాను.

అడుగడుగునా  బండల్లా కొండల్లా ప్రత్యక్షం.

ఆటంకాలు ప్రతి బంధకాలు ఏవైనా తోసి పడేస్తూనే  

సంరక్షణ చేయబోతాను. కారుణ్యమవనా కామితములు ఇయ్యనా

ఏమని ప్రవహించనూ.. ఎంతలా వర్షించనూ?  


అతివ హృదయం కదా! అతి ని కూడా కట్టడి చేయగల

మంత్రం వేస్తాను. అవకాశం ఇద్దాం, చూద్దాం.

మనో వికారాలు మాయమవ్వాలన్నా 

హృదయ ప్రక్షాళన చేసుకోవాలన్నా 

వేచి చూడటం ధర్మం అని. దీపం చుట్టూ తిరిగే చిమ్మటల వైపు 

ఏమని ప్రవహించనూ.. ఏ రీతిగా వర్షించనూ ? 


తనువంతా తడిని నింపుకున్న నది ముందు

కుప్పిగంతులు కూడా బహు సుందరమే! 

నవ్వుకుంటూ కాసిన్ని ప్రేమ తుంపరులు జల్లుకుంటూ

గమ్యం వైపు సాగిపోతాను. కడలికి ఎన్నో నదుల బంధం. 

నిమ్నగ కు  కడలి  అంతిమ గమ్యం.


………………(0)…………………


23 April 2026. 08:20 pm. 

Today, highly influence of visiting Hamsaladeevi—the confluence of the river and the ocean—



 


కామెంట్‌లు లేవు: