రసోద్దీపనం - వనజ తాతినేని
రావోయ్… అలా చేతిలో చెయ్యేసుకుని
చైత్ర పున్నమి వెన్నెల్లో షికారు చేసి వద్దాం.
పుడమి అంతా పసివాడు రంగులతో
ఆడుకుంటున్నట్టు వుంది. ప్రకృతి కే కాదు మనుషులకు
వసంతం ఉత్సవం చేస్తుంది. ఈ అట్లాంటా నగర సరిహద్దుల్లో
గిబ్స్ గార్డెన్స్, చుట్టూరా వేలకువేలుగా వికసించిన డాఫోడిల్స్
బారులు తీరిన తులిప్ వనాలు పుడమిని అభిషేకించే చెర్రీ పూలు
భూలోక స్వర్గం అంటే ఇదే కాబోలు అన్నట్టు వుంది.
త్వరగా రావోయ్.. నాలుగు పక్కలా తిరిగేసి
ఏడాదంతటికి సరిపడా సౌందర్య దాహం తీర్చుకుందాం.
కనుల లోగిళ్ళల్లో ఇంద్రధనుస్సు పూయించుకుందాం.
పట్టు పరుపు ఎందుకు మనకు, పండు వెన్నెల చాలు
ఇంద్ర భోగాలెందుకు మనకు, భాగస్వామ్యంలో
ఆస్వాదించే ఇంద్రియ జ్ఞానం చాలును కదా.
ముడుచుకున్న మనసులు విప్పి నాలుగు తీపి మాటలు
చెప్పుకుందాం. మధ్యలో కొన్ని చెణుకులు విసురుకుందాం
మన మధ్య ఏర్పడిన అగాధాలు పూడ్చేసుకుందాం
జ్ఞాపకాల పొరల్లో విశ్రమించిన తొలినాళ్ళ దాంపత్య
మాధుర్యాన్ని తట్టిలేపుదాం.అనేక పువ్వులను నేనై
నువ్వొక తుమ్మెదవై సరాగాలాడుకుందాం.
తెల్లారింది మొదలు ఉరుకుల పరుగుల రోజూ వారి యాత్ర.
నువ్వొక గాలిపటం నేనొక కుర్చీలో హఠం.
సోషల్ మీడియాలో క్షణాల్లో మారిపోయే స్పందనల్లాగా
ఏది అంటదు ఏది వదలదు.పచ్చనోట్ల పచ్చదనం తప్ప.
జిందగీ మొత్తం నిరంతరం తీరాన్ని తాకే అలలకు మల్లే
యాంత్రిక లయలో తూగుతుంది.
అంతస్తులు హోదాలు లక్ష్యాలుగా మారిపోయిన క్రమంలో
ఇక జీవన సౌరభం ఆస్వాదనకు తావెక్కడ?
ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరే నువ్వు కూరుకుపోతున్న కళ్ళతో
మసక చందమామలా నా వైపు చూసి ఓ విసుగు నవ్వు విసురుతావ్
నీకై ఎదురుచూపులో అలసి నేను తామర మొగ్గలా
ముడుచుకుంటాను. మొహమాటంతో చెరో దిండును కావిలించుకుంటాం.
రోజూ నిన్న లాగానే మొన్న లాగానే తెల్లారుతుంది.
మూడు పదులు దాటకముందే పోగు చేసుకోవాల్సిన
అసంఖ్యాకమైన అనుభూతుల స్థానంలో అంతులేని అసహనాలు.
బహిర్గతం కానివ్వని నైరాశ్యం. శరీరాల సమస్త పనితీరు
తెలిసిన మనవి సంయోగ వియోగాలు లేని చప్పిడి కూటి బతుకులు.
రుచి విహీనమైన మన బతుకులో నవ ఉత్తేజం నింపే
కొత్త రక్తం ఎక్కించుకుందాం. ఈ రోజైనా కాస్త త్వరగా.. రావోయ్ !
రొమాంటిక్ కవి ఖయ్యామ్ కవిత్వ గీతం
చాందిని రాత్ మే ఏక్ బార్ తుజే దేఖా హై అంటూ
మంద్రంగా పిలుస్తోంది. ఓ కొంటె చూపుల కుర్రాడా! మన
యవ్వనకాల ప్రేమలో మరోమారు నిండా మునిగిపోదాం రా!
ఆర్డర్ పెట్టిన ఖరీదైన వాలెంటినో డోన్నా బోర్న్ ఇన్ రోమా,
బ్లాక్ ఒపియం ఈ డి పర్ఫ్యూమ్ బహుమానాలెందుకు?
మూరెడు మల్లెలు మురిపెంగా నువ్వు జడలో తురమని
ఆ ఆహ్లాదాలెందుకు?
ఏక్ తార బెనారస్ పట్టు చీర నాకెందుకు!?
ఏక్ తార ని మీటే నీ వ్రేళ్ళు వుండగా
నా ఒంటరితనాన్ని భగ్నం చేసి అధరాల ఐక్యత రాగాలు
ఆలపించి దిగుళ్ళ తెరచాపని కిందికి దించేద్దాం రా..
నా గొంతు శృతి చేసుకుంటుంది. ఎదలో మోహన లాహిరి అంటూ
ఆ యుగళగీతాన్ని అందుకోను వేగిరం వచ్చేయ్.
నీ నులి వెచ్చని స్పర్శ లో నా బాధ మంచు ముద్దలా కరిగిపోవాలి
లేదంటే జఢత్వం కఠినత్వం పేరుకుపోతుందేమో.
లేబర్ రూమ్ లో నొప్పితో విలవిల్లాడుతూ వున్న స్త్రీ ని
నేను కరుకు మాటలతో గాయపరుస్తానేమో!
నువ్వు అత్యవసర వైద్య సేవలు అందిస్తూ
సహాయకులపై అకారణ కోపం ప్రదర్శిస్తావేమో!
రసవిహీనంగా మారిన మన జీవనశైలి ని
రసభరితం చేసుకుందాం త్వరగా వచ్చేయవోయ్!
పున్నమి కరిగి నా కన్నీరుగా మారకముందే ..
త్వరగా వచ్చేయవోయ్.! త్వరగా వచ్చేయ్!!
24 March 2026.
05 April 2026 ది ఫెడరల్ తెలంగాణ డాట్ కామ్ లో ప్రచురితం.
********************
..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి