20, ఏప్రిల్ 2026, సోమవారం

విరామ బిందువు

 


విరామ బిందువు   - వనజ తాతినేని 

మనుషులు ఏవేవో ఎందుకు కోరుకుంటారు 

వస్తువులు అయితే.. ఎలాగోలా సంపాదించగలరేమో! 

సంపాదించక పోయినప్పటికి డీలా పడిపోరు.

జీవచ్ఛవంలా కనబడరు. సాగిలబడిపోరు.


వారు వస్తువులను మించి సంచరిస్తున్న రంగులను కోరుకుంటారు. 

అన్ని రంగులు ఒకే చోట ప్రదర్శించలేని మనుషులు 

వారి ఇరుకు జీవితాల్లో నుండి కాస్త దూరంగా జరిగి 

వీరికి చిక్కుకుంటారు. అవి పూల తోటలో ముళ్లకంపలో 

తెలియకుండానే.. లోలోపలికి అల్లుకోవటం.

తర్వాత తీరిగ్గా దుఃఖాన్ని మోసుకుంటూ తిరగడం. 

ఎందుకీ.. పితలాటకం.


తుఫాను వచ్చినప్పుడు తీరమంతా గుబులుగా వుంటుంది 

ఎదుర్కోడానికి సంసిద్ధంగా ఉంటుంది 


కాని కోర్కెలు కోరుకునే వారు కూడా అలాగే సంసిద్ధం 

చేసుకుని వుండాలి. కాలక్షేపం ప్రేమలకు వారి మానసిక 

వ్యూహాలకు బలి పశువులు కాకూడదు. 

జీవితం శుభలగ్నం సినిమా కాదు 

మనసును డెట్టాల్ తో కడగడానికి వీలూ లేదు


జీవితం ఎప్పుడైనా ప్రేమలో పడవచ్చు 

బాధ్యతలు ఇచ్చిన వాగ్దానాలు లేకపోతే! 


ప్రేమంటే.. ఏమిటో కాదు. 

కొంచెం శ్రద్ధ తో కూడిన ఆరా, మరికొంత ఇష్టం. 

ఒకే గూటిలో కువ కువ లాడుతూ వుండాలనుకోవడం. 


కానీ మనుషులు ఏవేవో ఊహించుకుంటూ అపోహలో 

జీవితాన్ని గందరగోళం చేసుకుంటారు. 

జీవన సారాన్ని కోల్పోతారు. 


ఆకర్షణీయమైన జీవితాల్లో వుండే బడబానలం

వాంఛిస్తూ వుంటారు. జీవితమంతా విరామ బిందువు 

లేకుండా ప్రేమిస్తూనే వుంటారు. 


తమ  నడకలో తగిలే రాళ్ళను తట్టుకొని 

ఎదురుదెబ్బలు కముకు దెబ్బలు తింటూనే వుంటారు 

లేదా రాళ్ళను ఇతరులపై విసిరి తృప్తి పడుతూ వుంటారు. 


మనుషులు ఏవేవో ఎందుకు కోరుకుంటారు 

జ్ఞానం అనుభవం రెండు విడివిడిగా వుండవు.

రెండూ కలసే వుంటాయి. ప్రేమించడం తప్పు కాదు.

వైఫల్యాల నుండి ఏమి నేర్చుకోకపోవడమే తప్పు. 

పాఠాలు చదువుకుంటూనే పాఠాలు చెప్పవచ్చు 

నిత్యవిద్యార్ధిలా.. కవి లా. 


15 April 2026. 06:30am.






కామెంట్‌లు లేవు: