వెలుగు నీడలు - వనజ తాతినేని
నది ఒడ్డున ఆమె.
అనేక రంగులు పువ్వుల రూపంలో
ఆకుపచ్చ చీరను ఆశ్రయించి ఆమెను చుట్టుకున్నాయి
సూర్యుడు క్షితిజంపై వాలి, అలసి ఇంటికి చేరే ఆనందంలో,
ఎదురుగా నిలబడిన ఆమెపై
పచ్చని కాంతి వలయాన్ని కానుకగా సృష్టించాడు.
నదిని లోతుగా హృదయంతో చూస్తున్న ఆమె గంభీరమైన కన్నుల్లో
ఏవో నీలి నీడలు తీరని కోరికల ఛాయలు.
నది ఒడ్డున వున్న దట్టమైన చెట్ల మధ్య గాలి వాటుగా
వెలుగు నీడలు క్షణానికి ఓసారి రూపు మార్చుకుంటున్నాయి.
ఇదంతా చూస్తూ..ఆమె వెనుక నున్న అతను.
అతని హృదయం లాగానే చూపుల నీడలు కూడా
ఆమెను కాచుకుని వున్నాయి.
అలల శబ్దంలో వలలు విసిరిన శబ్దం
అప్పుడప్పుడు మరబోటు శబ్దం.
తనను చుట్టుముట్టే వెండి మేఘానికి అందకుండా
కొంటెగా చటుక్కున కిందకి జారిన సూర్యుడు
బంగారు జరీ రంగు అంచును అద్దాడు కానుకగా.
ఆమె ఫక్కున నవ్వింది. వెనుదిరిగి మళ్ళీ నవ్వింది.
జీవితమంతా నిజమైన ప్రేమలకై పరితపించిన ఆమెకు
నక్షత్రం లా స్థిరమైన ప్రేమతో కావలి కాస్తున్న అతనూ
ఆమె ఎందుకు నవ్విందో తెలియకపోయినా నవ్వాడు.
ప్రేమంటే.. ఆమె/అతడు సంబంధించిన
ప్రతిదీ తనదిగా త్రికరణశుద్ధిగా భావించడం
కొన్ని దుఃఖాలు కొన్ని సంతోషాలు
వెలుగు నీడలు ఇదే జీవితం..
ఈ జీవితం ముడిపడి వుంటుంది
ప్రియమైన వారి ప్రేమ అనే శ్వాస దారంతో.
18 April 2026 10:25pm.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి