గిల్లికజ్జాలు..
ఏమే! టీ పెడతావా! ఫ్యాక్టరీకి పోయిరావాలి. ట్రక్కులన్నీ ఆడ్నే ఇరుక్కపోయాయ్, దగ్గరుండి అన్ లోడు చేపిచ్చాలి.
పక్కనే వున్న ఆమెలో ఉలుకు పలుకూ లేదు.అట్టా అని నిద్రపోవడం లేదు.
మళ్ళీ.. అతని పిలుపులు. .. ఆమెను పేరుతో పిలుస్తూ.
ఈసారి ఆమె చికాకుగా రియాక్ట్ అయింది.
“ఎందుకలా గట్టిగా అరుస్తారు, నాకేమన్నా చెముడా ఏంటి!?” విసుగ్గా టీ పెట్టడానికి లేచింది.
ఐదంతస్థుల అపార్ట్మెంట్ లో modular kitchen లో .. ఐదు బర్నర్ ల స్టౌవ్ ముందు నిలబడి ఒకదానికి అగ్గి ముట్టించింది.నీళ్ళు పోసి తాజ్మహల్ టీ పొడి మూడు స్పూన్ లు వేసింది. అల్లం కొమ్ము చాకుతో గీరి ఒక పెద్దముక్కను నాలుగైదు చిన్నముక్కలను చేసి అందులో వేసింది.చిన్న రోట్లో రెండు యాలక్కాయలు కొట్టి మరుగుతున్న టీ నీళ్ళలో పడేసింది. ఫ్రిడ్జ్ లో పాలు తెచ్చి పావుశేరు పాలు మరుగుతున్న టీ డికాషన్ లో పోసింది.ఐదు నిమిషాలు గడిచాక అతను వచ్చాడు. ఇంకా అవలా.. అంటూ.
“అవుతున్నయిలే, అంతా తొందర,టీ మరగకపోతే ఏం బావుంటాయి? చూరు నీళ్ళు లాగా రంగు, నీళ్ళ కంపు” అంది ముఖం చిట్లించి.
“మొన్న శ్యామ్ మనింటి దగ్గర టీ తాగి పోయి కవిత తో చెబుతున్నాడు. అన్న వాళ్ళింటికి పోయినా. వదిన టీ చేసి ఇచ్చింది. టీ రుచి బ్రహ్మాండంగా వుంది కానీ అంత స్ట్రాంగ్ మనం తాగలేం. పాపం! అన్న రోజూ అట్టాంటి టీ తాగుతూ మనింటికాడ ఈ టీ ఎట్టా తాగుతాడో అన్నాడు.”
అని భార్య ముఖంలోకి చూసాడు.
“ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ పాడతాను నేను అని చెప్పలేక పోయినావా?” అంది ఆమె.
“నీ యమ్మ, కొట్టానంటేనా?అని మీదకు వచ్చాడు.
“ఇదిగో టీ, తాగి పో, కబుర్లు చెప్పింది చాలు కానీ.”
“ట్రాక్టర్ లో ఆయిల్ పోయించాలి. డబ్బులున్నాయా?”
ఆమె మాట్టాడకుండా ఎమర్జన్సీ మనీ లో నుండి 320 రూపాయలు అతనికి ఇచ్చింది. పుల్ ట్యాంక్ డీజిల్ ధర అంతే, అప్పుడు.
“సర్లే కానీ.. ఎందుకు? ఆ మురుగు చెరువుని అందంగా ఫోటోలు తీసుకుని వచ్చి ఫేస్ బుక్ లో పెడుతున్నావు. నీ లాంటి తిక్కల మేళాన్ని నా జన్మలో ఎక్కడా చూడలేదు. దొరికావ్ నాకు.” ఇంకా ఏదో వినబడని సణుగుడు.
ఆమె పళ్ళు బిగించి కళ్ళు పెద్దవి చేసింది. తర్వాత నిదానంగా అంది. “నువ్వు నాకు దొరికినట్టే”.
“అది కాదే! అది మురుగు చెరువు కదా! పక్కనే వాకింగ్ చేస్తంటే కంపు కొట్టట్లేదు.” ఆరా తీసాడు.
“కంపు లేదూ ఏమి లేదు. అయినా ఎవరి కంపు నీళ్ళేమిటి? అసలు చెరువు ఎంత గొప్పదో! ఊర్లో వాళ్ళు వాడిన నీళ్ళేగా. జనాల మురికిని నీళ్ళ ద్వారా మోసుకొచ్చి చెరువుకి చేరుతుంది. జనాల మురికిని భూమి పీలుస్తూ ప్రక్షాళనం చేస్తుంది. ఇంక కంపు ఏమిటి? చచ్చిన కుక్కలను, కోళ్ళను, ప్లాస్టిక్ కవర్లను టైర్లను అన్నిటినీ తెచ్చి అక్కడ పడేసేది కాక రోజూ తగలబెట్టేది గాక. మళ్ళీ చెరువు కంపు అంటావా? అది వుండబట్టే ఊర్లో గ్రౌండ్ వాటర్ లెవల్ తగ్గకుండా ఉంటుంది. ఇంకోసారి మురికి కంపు అన్నావంటే ఊరుకోను” అంది ఆమె.
“నీ అంత రెటమతం దాన్ని చూడలేదు.నీతో వాదులాడను నాకు తీరిక లేదు పోమ్మా, నే పోతన్నా!
“సరేలే.. ఒక మాట చెబుతా విను.”
“సరే! తొందరగా చెప్పు.? “
“అబ్బయ్య నీకు లాగా చెడ్డమాటలు మాట్లాడుతున్నాడు. ఈ మధ్య విన్నాను వాడి మాటల్లో.ఆడ్ని నేను ఎంత బాగా పెంచాను. ఏంటి వీడూ వాళ్ళ నాన్న లాగా చెడ్డ పదాలు మాట్లాడుతున్నాడు అని దిగులు పుట్టింది అనుకో. వాడికి ఒకసారి చెప్పు పో, మీ అమ్మ బాధపడతా వుంది. కోడలు ఏమనుకుంటుంది? మా అత్త కొడుకుని దరిద్రపు సంస్కారం లేని పెంపకం పెంచింది అని అనుకోదు. అసలు వాడు చిన్నప్పుడు నిన్ను చూసే నేర్చుకుని వుంటాడు. ఇప్పుడు అసహనంలో లోపల్నుండి తోసుకుంటూ వస్తున్నాయి. ఎక్కడికి పోతాయ్ జీన్స్. కోపం ఆమె మాటల్లో.
“ఎందుకే.. అబ్బాయి కోపంగా వుండటం? అంతా బాగానే ఉంది కదా! ఏం .. ఏమైనా ఇబ్బందులా!? మనకేమైనా చెబుతాడా, ఏంది? అయినా నీకు తెలిసి వుంటదిలే! ఏమైంది?”
“ఏం కాలేదు లే, ఇల్లు కట్టుకోవడం కుదరడం లేదు గా. ప్లాట్ కొనమని అడుగుతున్నా. అలాగే అన్నాడు. ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకో stress గా వుండినాడు బిడ్డ. ఆ బ్యాంక్ వాడు కూడా తెగ విసిగిస్తున్నాడులే!”
“ప్లాట్ కొనడం ఎందుకు? మన స్థలంలో duplex ఇల్లు కట్టుకోండి. చక్కగా ఉంటది.”
“ఆ.. .. దీర్ఘం తీసింది ఆమె. నువ్వు చెప్పావనే.. ఈ ఊరు వచ్చిపడ్డాను. నిన్ను కట్టుకొని 40 ఏళ్ళు అయ్యింది. నువ్వు గనుక సదరంగ వుంటే మాకెందుకు ఈ తిప్పలు? ఇంత చిన్నగూడు కట్టుకోలేకపోయాం. ఇంక నా తోట, పూల మొక్కలు ఏడ లే! ఉన్నదాంట్లో సర్దుకుందాం అని తీర్మానం చేసుకున్నా,” అంది ఆమె కినుకగా.
“అయ్యో!” అన్నట్టు చూసాడు అతను జాలిగా ఆమె వైపు. కదిలాడు వెళ్ళబోతున్నట్లు.
“వైట్ డ్రెస్ ఎందుకు!? మార్చుకుని పో! మళ్ళీ నేను అంత తెల్లగా బాగా ఉతకలేను.”
“హే పో! నేనిట్టాగే పోతా!”
“నువ్వు ఏ నాడు నా మాట విన్నావు కనుక. నేను మాత్రం నీ మాట తు చ తప్పకుండా వింటా! అందుకే నువ్వు చెప్పినట్టు ఈ ఊరు వచ్చి.. నువ్వు పెరిగిన తావుల్లో చేలల్లో తిరుగుతూ వుంటా. ఆఖరికి నువ్వు పోయిన వల్లకాడు కే పోవాలని నిశ్చయించుకుని ఈ ఊరు వచ్చాను.” అంది ఆమె.
అట్టాగే కాసేపు నిలబడి ఆమె ముఖం లోకి బాధగా చూసాడు. నెమ్మదిగా కదిలాడు.
“ఇదిగో..చూడు ! పోరంకిలో వియ్యాల వారింటికి వెళ్ళి.. చిన్న మనుమరాలు ని చూసి పో! చిన్నది.. అచ్చం నీలాగానే వుంది. పోలికలు రంగు జుట్టు చూపు మాట చేత అన్నీ.. నువ్వే! నీ కొడుకు నీ పేరు కలిసి వచ్చేటట్టు పేరు పెట్టుకున్నాడు. పిల్ల ని చూసి పో. అబ్బాయి కి కూడా కనబడు ఓ సారి. మీ అమ్మకు కూడా కనబడి పో! అన్నీ నేనే చెప్పాలా! నా ఒక్కదానితోనేనా వాదులాడేది!. వాళ్ళేం పుణ్యం చేయలా!? పాపం.”
“సరే లేవే! ఒక్కదానివే ఉన్నావని నీకు కనబడి పోతున్నా! ఫ్యాక్టరీ లో సీరియల్ వచ్చేసే వుంటంది. బిన్నా పోవాలి. పోయొస్తా! “
“ ఇదిగో ఏమండీ, ఇంకొకటి చెబుతున్నా విను. నువ్వు చెరువు ఫోటోలు తీయొద్దు అన్నా, ఫేస్ బుక్ లో పెట్టవద్దు అన్నా పెట్టేది పెట్టేదే! నేనేం నీ మాట వినను.వినను, వినను. చెరువు మన ఊరి జనాల మురికిని మోసే మహాతల్లి. మహాతల్లి 🙏 చేతులు జోడించాను నేను.
చేతులు జోడిస్తూనే వున్నానా! ఎక్కడ నుండో పెద్ద మెరుపు చెళ్ మని శబ్దం. పక్కనే పిడుగు పడ్డట్టు.. గుండెలదిరిపోయే ఉరుములు. ఠక్కున లేచి కూర్చున్నాను.
కాసేపు అయోమయం. కాసేపటికి స్వాధీనంలోకి వచ్చాను. ఏంటి!? కల ఇలా వచ్చింది మిట్ట మద్యాహ్నపు కలలో. ఎంత స్పష్టంగా కనబడ్డారు ఆయన.🤔🤔🤔
ఇప్పుడు అసలు నేను నేనే నా!, వేరేనా? కలలో నిజంగా నన్ను నేను చూసుకున్నానా?
ఏమిటబ్బా! కలలో.. ఇలా కనబడ్డాడు ఆయన. ఇల్లు కట్టుకోండి అని చెప్పిన తన కోరిక పక్కన పెట్టానని ఇలా కలలో కనబడ్డారా? నెల్లూరు జిల్లాలో మా వ్యవసాయ క్షేత్రంలో కాసేపు, ఇక్కడ మా ఇంట్లో కాసేపు నాతో మెసిలి మేమిద్దరం వాదులాడుకుంటూనే కష్టసుఖాలు పంచుకున్నాం. ఏవో హెచ్చరికలు చేసుకున్నాం. మంచి సెబ్బర చెప్పుకున్నాం, సూచనలు చేసుకున్నాం..
95 లో రూపంతో ఆయన. వర్తమానం లో ఉన్న నేను. అచ్చం ఇట్టాగే వుండేవి మా ఇరువురి మధ్య సంభాషణలు. ఆయన నెల్లూరు మాండలికం. నాది పడమట కృష్ణా జిల్లా భాష.
ఫ్రాయిడ్ కలల గురించి ఏం చెప్పారు? తెలుసుకోవాలి.
అసలు నాకు కలలో జరిగిన విషయాలు ఇంత బాగా గుర్తు వుండటం ఏమిటి? అందరికీ ఇలాగే గుర్తు వుంటాయా? 2016 -17 లలో ఫేస్ బుక్ లో నా ఫోటోలు పెట్టడం ఇష్టం వుండేది కాదు ఆయనకు. చుర చుర చూసేవారు. ఏమిటో ఈ కలలు.. అర్థాలు.
హే మై మేన్… అనుకోలేదు నువ్వొస్తావని.
ఈ కల గురించి చెపితే.. మా అత్తమ్మ కంటి వంక చుక్క నీరు కారకుండా ఏడుస్తారు. ఆమెది రహస్య దుఃఖం.😢నాకు ఒక్కసారి కూడా కనబడలేదు అంటారు.
(ఉదయం ఏమి రాయడం లేదు అనుకున్నాను కదా! ఇప్పుడు రాయించేసింది కల. అంతే! ఏదీ మన చేతుల్లో వుండదు. జరిగేదే జరుగుతుంది)
.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి