ప్రేమ శాపం కూడా!
అతి ప్రేమ నీకు శాపం లాంటిది అవుతుంది
జాగ్రత్త !!
ప్రేమ లోని భక్తి కూడా తాను ప్రేమించే దాన్ని
నాశనం చేయగలదు, జాగ్రత్త !!
మితిమీరిన ప్రేమ కూడా..
నీలాగా శాశ్వతం కాదు, జాగ్రత్త!!
అతి ప్రేమ బరువు కింద..
నువ్వు నలిగి పోగలవు, జాగ్రత్త!!
గబ్బిలంలా జ్ఞాపకాలను పట్టుకుని
వేలాడే రాత్రుళ్ళు నీకు చిరునామా కాగలవు జాగ్రత్త!!
వాన కురిసినట్టు ప్రేమ కురిసి
మాయమైపోతుంది. జాగ్రత్త!!
డోలాయమానంలో సాలెగూడు వల లోకి
గుడ్డిగా ప్రవేశించకు జాగ్రత్త!!
నీదిగా భ్రమించే ప్రేమ అక్షరాల ఇంద్రజాలం.
అది తుడిచి పెట్టుకుపోతుంది జాగ్రత్త.!!
వందల మైళ్ల దూరం నుంచి మనసు
మనసుతో మాట్లాడుతుంది అనుకుంటావ్
అదంతా మాంత్రిక గారడీ. జాగ్రత్త!!
నీ అర్ధం లేని అనుమానాలతో ఇతరులను
ద్వేషిస్తూ ముఖం చాటు చేసుకోకు.జాగ్రత్త!!
నువ్వు ఇతరులను ప్రేమించే ముందు..
నీ హృదయంలో ఎవరున్నారో చూసుకో, జాగ్రత్త!!
నువ్వు ప్రేమించే వారి హృదయంలో ..
ఎవరున్నారో అంజనం వేసి చూడకు, జాగ్రత్త!!
వీటన్నింటికి విరుగుడు మందు..
చంచలమైన నీమనసుకు తాళం వేయి జాగ్రత్త!!
నిన్ను నీవు ప్రేమించుకోవడమే శాప విమోచనం.
జాగ్రత్త .. జాగ్రత్త.. జాగ్రత్త.
(Insta ప్రేమల్లో మునిగి ఒక యువతి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.అబ్బాయి పై కేస్. ఏమి ఎరుగని ఇంకొక అమ్మాయి. ముగ్గురూ అవివాహితులే)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి