ప్రేమ వల్లకాటిలో.. - వనజ తాతినేని
టక్ టక్ టక్.. అర్ధరాత్రి తలుపు చప్పుడు ఏదో అనుమానం సూచిస్తుంది. భయం భయంగా లేచింది కానీ అడుగు ముందుకు పడలేదు జయమ్మకి. రెండోసారి ఇంకా గట్టిగా చప్పుడు. వేరొక మంచంపై పడుకున్న సుబ్బారావు లేచి వచ్చాడు. “అబ్బాయ్ తలుపు కొడుతుంటే దేభ్యం మొహం వేసుకుని చూస్తావేమే తలుపు తీయకుండా”.. అంటూ తనే వెళ్ళి తలుపు తీసి ఎదురుగా నించున్న వాళ్ళని చూసి జంకుతూ ఒక్క అడుగు వెనక్కి వేసాడు.
జయమ్మ ఊహించినదే జరిగింది అనుకుంటూ లోపల వణుకుని కప్పిపుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. “ఈ ఫోటో లో వుంది నీ కొడుకేనా, ఈ నెంబర్ కొడుకుదేనా?” అడిగాడు ఎస్సై. గొంతు తడారిపోతుంది సుబ్బారావుకి. కొడుకు ఏమైనా వెధవ పని చేసాడా లేక వాడికేమైనా ప్రమాదం జరిగిందా! కీడు శంకించే మనసుతోనే “అవునండి” అని మాత్రం అనగల్గాడు.
“ ఇప్పుడు ఎక్కడ వున్నాడు? ఏం చేస్తున్నాడు? మీకు ఫోన్ చేస్తున్నాడా? “
“ఫోన్ చేయడం లేదండీ, నెల రోజులు పైనే అయిందండీ, ఎక్కడున్నాడో తెలియదండీ, తెలిస్తే గంటల్లో పట్టుకొస్తానండీ” సుబ్బారావు అన్నాడు.
“ ఆ పిల్ల మైనర్. నగలు పట్టుకుని వచ్చేసింది అంట. మీకేమైనా తెలుసా? “
“తెలియదండీ, ఈ అవిటి బిడ్డ తో చదువు సంధ్య అబ్బని పిల్లాడితో ఉన్న ఊళ్ళో బతకలేక ఇక్కడికొచ్చి పని గట్రా చేసుకుని గుట్టుగా బతుకుతున్నామండీ, మా పిల్లగాడు మంచోడే నండీ, ఇట్టా ఎందుకు జరిగిందో ఏమిటో మాకు తెలియదండీ” సుబ్బారావు వేదన.
“ నాక్కూడా ఏమీ తెలియదండీ, మా శేఖర్ క్కూడా ఎన్నో ఏళ్ళు లేవండి, ఇరవై సంవత్సరాలకు తక్కువండీ” అంది జయమ్మ.
ఆమె వైపు అనుమానంగా చూసాడు. “ఎంతమంది ఇళ్ళలో పని చేస్తావ్, నీ ఫోన్ ఇయ్యి” గదమాయించాడు.
ఫోన్ ఇవ్వక తప్పలేదు. నిజం ఎక్కువ రోజులు దాగదని అర్థమైంది జయమ్మకి.
రెండు రోజుల్లోనే ఆమెకు వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా శేఖర్ ని ముంతాజ్ తో సహా పట్టుకుని వచ్చారు.
పదవ తరగతి పరీక్షలు రాసిన ముంతాజ్ ఇంటర్మీడియట్ తప్పిన శేఖర్ ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే కొత్త బంగారు లోకం సినిమాలో హీరో హీరోయిన్స్ కన్నా ఎక్కువగా. కన్నవాళ్ళు ఆ పిల్లకు పెళ్ళి చేయాలని నగలు డబ్బులు కూడబెడుతున్నారు. ఆ నగలు కొద్దిపాటి డబ్బు పట్టుకుని ఇంట్లో నుండి వచ్చేసింది. విషయం తల్లికి చెప్పాడు శేఖర్. అదే పొరపాటైంది. జయమ్మ ముందు కంగారు పడింది. తర్వాత నగలు చూసి ఆశపడింది. వాళ్ళిద్దరిని ఎటైనా వెళ్ళిపొమ్మని తొందర పెట్టింది. ఆ పిల్ల తెచ్చిన నగలు ఎక్కడైనా కుదువపెట్టి డబ్బులు తెమ్మని అడిగాడు. వెంటనే తన దగ్గర దాచుకున్న ఇరవై వేలు ఇచ్చి ఊరు దాటించింది. పెద్దగా ధనవంతుడు కాని, రాజకీయ నాయకులెవరి అండదండ లేని చిరు ఉద్యోగి ముంతాజ్ తండ్రి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగ్గా తిరగ్గా వారు దయతలచి ప్రేమికుల ఆచూకీ కనుక్కునే సరికి నలభై రోజులు దాటింది. ఈ లోపు శేఖర్ దగ్గర డబ్బులు అయిపోయాయి. తల్లికి ఫోన్ చేసి డబ్బులు పంపమని అడుగుతూ తన ఆచూకీ తనే ఇచ్చాడు. పోలీస్ విచారణలో జరిగింది జరిగినట్టు చెప్పాడు.
ముంతాజ్ కి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకి అప్పగించేసారు. నగల సంగతి చెప్పమని శేఖర్ ని లోపల పడేసారు. కిడ్నాప్ కేస్, సెక్షన్ 87 పెట్టారు. జయమ్మ ని గుచ్చి గుచ్చి అడిగారు. కాసేపు అమ్మేసి నా బాకీలు తీర్చేసుకున్నానని, కాసేపు కుదవ పెట్టానని చెప్పింది కానీ నిజం చెప్పలేదు. తెల్లవారేటప్పటికి లారీ డ్రెవర్ తో కలిసి నగరం దాటింది. ఇవన్నీ తెలిసిన అపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ వారిని వుండనివ్వలేదు. అభిమానం మెండుగా గల సుబ్బారావు తలెత్తుకోలేక సామాను సర్దుకుని సొంతూరికి వెళ్ళిపోయాడు. అక్కడా అయినవాళ్ళ ప్రశ్నలకు, సూటి పోటీ మాటలకు, ఎగతాళి నవ్వులకు తట్టుకోలేక అవిటి పిల్లకు అన్నంలో విషం కలిపి తినిపించి తనూ ఉరి వేసుకున్నాడు.
జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ గా వున్న శేఖర్ తండ్రి చెల్లి అంత్యక్రియలకు వచ్చాడు. గుండెలు పగిలేలా ఏడ్చాడు. ముంతాజ్ ఇంట్లో నుండి వచ్చేసి తన ఆటోలో కూర్చున్నప్పుడు తండ్రితో విషయం చెబితే పరిస్థితి ఇలా వుండేది కాదని వెక్కి వెక్కి ఏడ్చాడు. జయమ్మ ఎక్కడుందో తెలియదు.అంతకు ముందంతా నోటితో చూపులతో విచారణ చేసి తీర్పులిచ్చేసిన ఊళ్ళో మనుషులే అయ్యో పాపం! అంటూ తలా ఒక చేయి వేసి ఆదుకున్నారు.
**********
“ఇవాళ లేదు రేపూ లేదు ఎల్లుండీ లేదు, ఇంకెప్పుడూ లేదు”
“…………” ఎయిర్ పాడ్స్ వాడటం వల్ల అవతల మాటలు వినబడటం లేదు.
“ఇంకెప్పుడూ ఎందుకు కలవలేం అంటే నేను పెళ్ళి చేసుకుంటున్నాను కాబట్టి”
“…………”
“నోర్మూసుకో, ఎక్కువ మాట్లాడితే ఈసారి నీ ఎముకల్లో సున్నం కూడా మిగలదు” ఈ మాట హిందీలో చెపుతుంది.
కింద ఫ్లోర్ బాల్కనీలో కూర్చుని వున్న శేఖర్ చెవిలో ఈ మాటలు పడగానే ఉలికిపడి లేచి నిలబడ్డాడు.ఎవరో తననే హెచ్చరించినట్లు అనిపించింది. చాలా సేపటి నుండి ఫై ప్లోర్ బాల్కనీలో నిలబడి మాట్లాడుతున్న అమ్మాయి మాటలు వింటున్నాడు. వినాలని కాకపోయినా వినడం అలవాటైంది. శేఖర్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే వున్న స్టూడెంట్ లేడీస్ హాస్టల్ లో పని చేస్తున్నాడు అనడం కంటే ఆశ్రయం పొందుతున్నాడు అంటే సబబు. తెల్లవారుజామున మొదలైన పనివేళలు రాత్రి పదిన్నరకు కానీ ముగియదు. మధ్యలో చాలా మందితో మాట్లాడతాడు. కానీ ముభావంగా అంటీ ముట్టనట్లుగా అవసరమైనంత మాత్రమే! రాత్రి విశ్రాంతిగా రెండో కుర్చీపైన కాళ్ళు బారచాపుకుని కూర్చొని ఫై నాలుగు ప్లోర్ ల్లో వుండే విద్యార్థినుల ఫోన్ సంభాషణలు వింటూ కాలక్షేపం చేస్తాడు. పక్కనే వున్న జెంట్స్ హాస్టల్ లో విద్యార్థులు వీళ్ళతో ఫోన్ లో హస్క్ కొడుతూ వుంటారు. వీలైతే హాస్టల్ వాచ్మెన్, వార్డెన్ కళ్ళు కప్పి ఈ బిల్డింగ్ లోకి రావడానికి దారులు వెతుకుతూ వుంటారు.
ఇదంతా చూస్తూ ముంతాజ్ ప్రేమను గుర్తు చేసుకుంటాడు శేఖర్. అమాయకంగా స్వచ్చంగా వుండేది. తనంటే పిచ్చి ప్రేమ. పెద్దవాళ్లు తమని విడదీస్తుంటే సుడిగాలికి వణికే తీగలా అల్లాడిపోయింది.వెనక్కి వెనక్కి చూస్తూ “అతన్ని కొట్టొద్దు, నేనే అతన్ని బతిమలాడి పెళ్ళి చేసుకుందామని ఒప్పించి తీసుకెళ్ళాను, మాకు పెళ్ళి అయిపోయింది,అతనే నా భర్త” అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళింది.ఇప్పుడెలా వుందో?
ప్రేమోత్సాహం పరవళ్లు తొక్కుతూ వుండగా చేసిన తప్పు వల్ల జీవితమే తల్లక్రిందులైంది. ఒక్కసారిగా అనాధగా మారాడు. దిక్కుతోచని స్థితిలో పశ్చాతాపంతో కుమిలిపోతున్నాడు.
“ఇప్పుడు అనుకుని ఏం లాభం! ముంతాజ్ ఇల్లొదిలి వచ్చేసినప్పుడు నేనైనా వెనక్కి పంపించాల్సింది. యవ్వనావేశం గుడ్డిగా ఏ పనైనా చేయిస్తుంది మరి” అని.
మనుషులందరికీ ..మనుషులు ఇక్కడ విశ్రమించారు అని తెలియజేసే చోటు కన్నా .. ఇది నా సొంత ఇల్లు అని చెప్పుకోవడానికి ఒక ప్రదేశం, ఇదిగో వీళ్ళు నా వాళ్ళు అని చెప్పుకోవడానికి నలుగురు మనుషులు అవసరం.
ఇక్కడైతే తన ఊరేంటో పేరేమిటో అన్నది కూడా ఎవరికీ తెలియదు. చేతిలో సాదా ఫోన్ వుంది. కానీ చేయడానికి ఎవరి నెంబరు తన దగ్గర లేదు. ఎందుకు లేదు అంటే లేదు, అంతే! అది వరకు తన చేతిలో ఖరీదైన ఫైవ్ జీ ఫోన్, అరగంటకోసారి ప్రియురాలితో చాటింగ్, వాటర్ బాటిల్స్ బట్వాడా కి సంబంధించిన కాల్స్ తో పాటు “ఏరా! ఇంకా అన్నానికి రాలేదు, వచ్చి తినేసి పో” అని ప్రేమగా పిలిచే నాన్న కాల్స్. కొసరి కొసరి వడ్డించి తినిపించే అమ్మ. లైఫ్ అంతా పండగ చేస్కో పో అన్నట్లు వుండేది. ఇప్పుడేముంది? తీరని దుఃఖం అంతులేని నిసృహ. మనసు చుట్టూ మూడు వైరాగ్యాలు అలుముకున్నాయి. శ్మశాన వైరాగ్యం,ప్రేమ వైరాగ్యం, జైలు వైరాగ్యం.
కొద్ది నెలల్లోనే తను ఎంత నరకప్రాయమైన జీవితం చూసాడో. జీవితానికి పూర్తిగా వ్యతిరేకమైన చీకటి కోణం చూసాడు. జైల్లో కూడా దౌర్జన్యం చేసే రౌడీలు, దొంగతనాలు చేసినవారు, కిరాతకంగా హత్యలు చేసినవారు. ఏ పాపం ఎరగకుండానే హత్యానేరం మోపబడినవాళ్ళు, చేయని నేరాన్ని నెత్తిన వేసుకుని తన తరపున వాదించడానికి లాయర్ నియమించుకోవచ్చని తెలియనివాళ్ళు, లాయర్ ని నియమించుకోవాలని తెలిసినా స్థోమత లేనివాళ్ళు.. పూచికత్తు ఇవ్వడానికి ఎవరూ లేని వాళ్ళు. చీకట్లో లైంగిక వేధింపులకు పాల్పడే వారు, వేధింపులకు గురవుతున్నామని దైర్యంగా చెప్పుకోలేని వాళ్ళు ఇలా నానా రకాలు.
దుర్భరమైన జైలు జీవితం చవిచూసిన సున్నిత మనస్కులు ఎవరూ కూడా మళ్ళీ ఏ నేరం చేయాలనుకోరు. తమ క్రోధాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలనుకుంటారు.
ఉదయం పది గంటల కల్లా భోజనం. సాయంత్రం ఐదు గంటలకు భోజనం. ఆరు గంటలకి చీకటి గదుల్లోకి ముడుచుకోవడం. రోజు నాలుగు సార్లు హాజరు వేస్తారు. నేరారోపణ దృవీకరించని రిమాండ్ లో వున్న వ్యక్తులకు చేతి తడిని బట్టీ రాజభోగాలు. సిగరెట్ పెట్టెకు ఒక రేటు, బిర్యానికి ఒక రేటు, మందు బాటిల్ కి ఒక రేటు,శిక్షలో భాగంగా పని చేయకుండా వుండటానికి ఒకరేటు. రాత్రుళ్ళు దోమలు కుట్టకుండా టేబుల్ ఫ్యాన్ కి ఒకరేటు. ఈ రేట్లు భరించగల్గిన వాళ్ళు కొందరు జైలు జీవితం అంటే భయపడరు. సరదాగా వెకేషన్ కి వెళ్ళినట్లు వెళ్ళి దర్జాగా తిరిగి వస్తారు.
ఈ హాస్టల్ ఓనర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ తో పాటు బిల్డర్ కూడా! భూమి తగాదాల్లో ఆవేశంలో ఎదుటి వారిపై దాడి చేసిన కేసులో సాక్ష్యాలు గట్టిగా వుండటంతో పదహారు రోజులు రిమాండ్ లో వున్నాడు. అప్పుడు తన గురించి అడిగితే చెప్పాడు. బెయిల్ కి పూచీకత్తు కట్టేవారు లేక నెలల పర్యంతం రిమాండ్ ఖైదీగా చస్తూ బతుకుతున్నానని. ఆయన తన కథ విని “అరె రే! ఎంత కష్టం వచ్చిందిరా అబ్బాయీ” అన్నాడు.
“జైలు ఒక కథల చెట్టు. మనం కాసేపు అక్కడ కూర్చుంటే చాలు, ఆ చెట్టు నుండి ఆకుల్లా కథలు రాలుతుంటాయి.” అన్నాడు ఆయన. అసహాయ దుఃఖాలు. కొన్ని కరడుగట్టిన దుఃఖాలు. కొన్ని పశ్చాత్తాప దుఃఖాలు. మరిన్ని హృదయవిదారక దుఃఖాలు. ఆ దుఃఖాలు అన్నీ కథలు విన్నట్టు వినీ వదిలేయలేదు విష్ణు నారాయణ. దయతలచి కొంతమంది పేర్లు కాగితంపై రాసుకున్నాడు. తాను బయటకు వచ్చాక లాయర్ ని నియమించి పూచీకత్తు కట్టించి కొందరికి పాత వెలుగుల ప్రపంచం చూసే అవకాశం కల్గించాడు. జీవితాన్ని మార్చుకోమని హిత బోధ చేసాడు. బాగా మెతకగా వున్న మంచివాడు అనిపించిన శేఖర్ అనాథ అని తెలుసు కాబట్టి మళ్ళీ ఆయనే ఆశ్రయం కూడా కల్పించాడు.
ప్రేమించడం నేరం కాకపోయినా తగిన వయసు లేకుండా కలిసి బ్రతకాలనుకుని ఇల్లు దాటడం ఎంత అవివేకమో అన్నది అప్పుడు తెలియదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. పెట్టిన కేసులకు తోడు ఫోక్సో కేసు కూడా పెట్టి ఉంటే ఏం జరిగేదో! అసలు తను బయటకు వచ్చేవాడా? మగ ప్రేమికులారా వినండి! ప్రేమంటే ఆత్మబలి. తప్పు ఇరువురిదైనా శిక్ష మగవాడికే!
********
“శేఖర్.. నాతో రా” అని పిలిచాడు విష్ణు నారాయణ. యజమాని పట్ల ఎనలేని విశ్వాసం. చేతిలో పని ఒదిలేసి గబగబా వచ్చాడు.
“కారెక్కు” మారు మాటాడకుండా వినయంగా వెనక సీట్లో ఎక్కి కూర్చున్నాడు.
“ఎందుకు ఏమిటీ అని అడగవా!”
“సార్.. జైల్లో జీవితం మగ్గకుండా బయటపడేసారు, నీడ ఇచ్చారు, తిండి పెడుతున్నారు ఈ బట్టలు, ఫోన్, చెప్పులతో సహా మీరు ఇచ్చినవే! ఇన్ని ఇచ్చిన మీరు రమ్మంటే ఎందుకు ఏమిటి అని అడుగుతానా సర్!”
విష్ణు నారాయణ మనసులో ముచ్చటపడ్డాడు. చిన్నగా నవ్వుకున్నాడు. ఎదుటి వారు కష్టాల్లో వుంటే సాయం చేయడం అలవాటు చేసుకున్నాడు. సాయం పొందిన వారు ఎంతో కొంత అభివృద్ధి చెంది ఆ సాయాన్ని మర్చిపోకుండా వినయంగా వుండి కృతజ్ఞత చూపిస్తే మరింత ఇష్టం.
“ఈ రోజు నుండి నా కారుకి డ్రైవర్ గా వుందువు గాని, లైసెన్స్ కి అప్లై చేద్దాం, మరేమంటావు? “
“సరే సర్”
కారు హైవే పైకి దారి తీసింది. కాసేపు ప్రయాణించాక చెప్పాడు.
“ముంతాజ్ వాళ్ళ నాన్న నీతో మాట్లాడాలి అన్నాడు, రమ్మన్నాను”
శేఖర్ ముఖంలో రంగులు మారాయి. “ఎందుకు సర్! ఆయన ఎన్నిసార్లు అడిగినా ఆ నగలు గురించి నాకేం తెలియదు, అసలు మా అమ్మ ఎక్కడుందో నాకు తెలిస్తే కదా” చేతుల్లో ముఖం దాచుకుని భోరున ఏడ్చాడు. ఏడుస్తూనే అడిగాడు “మీరు నాకు ఇంకో సహాయం కూడా చేయండి సర్. మా అమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలి, నగల కోసం కాదు అమ్మ కోసం. అమ్మ ప్రేమ కావాలి నాకు” తల్లి ప్రేమకై అలమటిస్తున్న బిడ్డను చూస్తే జాలి కల్గింది.
విష్ణు నారాయణ కారు ఆపాడు. శేఖర్ ని కరువు తీరా ఏడవనిచ్చాడు. వెనుక డోర్ తీసి అతని పక్కన కూర్చుని ఓదార్పుగా భుజం మీద చెయ్యేసాడు. “అలాగే! వెదికించే ప్రయత్నం చేద్దాం, మనసు గట్టి చేసుకో” ఇదిగో కాసిని నీళ్ళు తాగు అంటూ ఆ నీళ్ళలో హితం ధైర్యం భరోసా కలిపి ఇచ్చాడు.
“వాళ్ళు నగలు గురించి మాత్రమే అడగడం లేదు, ఆ పిల్లకి పెళ్ళి చేయాలని చూస్తుంటే సంబంధాలు ఎక్కడం లేదంట. లేచిపోయి రెండు నెలలు వేరేవాడితో గడిపిన పిల్ల అని ఊరూరా తెలిసిపోయింది. ఇంకెవరు చేసుకుంటారు” అంటున్నాడు. అదీగాక ముంతాజ్ కూడా వేరే వాడితో పెళ్ళి అంటే ఆత్మహత్య చేసుకోబోయింది అంట. ఆ పిల్లాడినే వచ్చి మా అమ్మాయిని తీసుకుపొమ్మను మాకొద్దు ఆ బరువు భారం, కేస్ కూడా విత్ డ్రా చేసుకుంటాం” అని అంటున్నాడు. మరి నువ్వేం అంటావ్?
చెప్పేదంతా మౌనంగా విన్నాడు. చాలాసేపు మాట్లాడలేదు. ఆలోచించుకోని అన్నట్లు ఒంటరిగా వదిలేసి పంట చేల మధ్య వున్న తూము మీద కూర్చున్నాడు విష్ణు నారాయణ. ఎవరికో ఫోన్ కూడా చేసాడు. పావుగంట తర్వాత ముంతాజ్ తండ్రి వచ్చాడు. ఏమయ్యా శేఖర్ ! అని పలకరించాడతను. బదులుగా తలదించుకున్నాడు. “ముంతాజ్ నీతో మాట్లాడతానంది. ఇదిగో మాట్లాడు బేటా! “ రింగ్ చేసి ఫోన్ చేతికి ఇచ్చాడు.
“సారీ అంకుల్, నేనిప్పుడు ఆమెతో మాట్లాడలేను.” ఫోన్ కట్ చేసాడు.
“మీకు దణ్ణం పెడతాను, మీరు ముంతాజ్ కి పెళ్ళి ప్రయత్నాలు చేయకండి. మీరు విషయం దాచిపెట్టి చేసినా దాయకుండా చేసినా పెళ్ళి తర్వాత ఆమె జీవితం ఏమీ బాగుండదు. అది మీక్కూడా తెలుసు. నేను కూడా ఆమెను ఇప్పుడు తీసుకొచ్చుకోలేను. తాడు బొంగరం లేకుండా ఆట ఆడలేను అంకుల్. ముంతాజ్ తో కలిసి బ్రతికే ఉత్సాహం కూడా నాకిప్పుడు లేదు. నా కుటుంబం అంతా చెల్లాచెదురైపోయింది. తప్పు మా ఇద్దరిదే అయినా దీనికంతటికి కారణం ముంతాజ్ అనే ఫీలింగ్ మూలంగా నేను ఆమెతో సరిగ్గా వుండలేనేమో! ముందు ఆమెకు చదువు చెప్పించండి.నేను కూడా సరిగ్గా లేను, నా కాళ్ళ మీద నేను నిలబడేదాకా నాకూ అవకాశం ఇవ్వండి. నన్ను నమ్మండి.మీకు అంతగా నమ్మకం లేకపోతే రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. మీ అమ్మాయిని మాత్రం మీ దగ్గరే వుంచుకోండి.” చేతులు జోడించాడు.
ఇదంతా వింటున్న విష్ణు నారాయణ ముంతాజ్ తండ్రిని దూరంగా తీసుకువెళ్లాడు. “కుర్రాడు బాగా నలిగిపొయ్యాడు. తండ్రి చెల్లెలు మరణం తల్లి అలా వెళ్లిపోవడం, జైల్లో వుండటం వల్ల మనసు చెదిరిపోయింది.మానసికంగా నలిగిన వాడిని బలవంతంగా పెళ్ళి వైపుకు నెట్టొద్దు. కుర్రాడు మంచోడు. విరక్తిలో దిక్కుతోచని స్థితిలో వున్నాడు. కొన్నాళ్లు పనిపాటాలో నలిగితే గట్టి పడతాడు, సంపాదన పరుడు అవుతాడు. మీ అమ్మాయికి పెళ్లి ప్రయత్నాలు మాని కాలేజీలో చేర్పించండి. వాళ్ళిద్దరికి పెళ్లి చేయించే బాధ్యత నాది. నా మీద నమ్మకం వుంచండి.” భరోసా ఇచ్చాడు.
“ అతనికి అండదండగా మీరున్నారనే నమ్ముతున్నాను. బిడ్డని కళ్లలో పెట్టుకుని చూసుకున్నాం. ప్రేమ దోమ అని ఇట్టా జరిగిపోయింది.” పైజమా జేబులో నుండి కర్చీప్ తీసుకుని కళ్ళు ముక్కు తుడుచుకున్నాడతను.
మళ్లీ కారు దగ్గరికి వచ్చాడు. “ బేటా! జరిగిందేదో జరిగిపోయింది. మాకు జరిగిన తలవంపులు కన్నా నీకు జరిగిన నష్టం చాలా పెద్దది. దైర్ఘ్యం గా వుండు. ముంతాజ్ నెంబర్ ఇది” అని ఓ కాగితం శేఖర్ చేతిలో పెట్టాడు. “నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు. ఇవాళే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాను. వెళ్లొస్తా బేటా!” అంటూ చేతులు కలిపి సెలవు తీసుకున్నాడు.
ఐదు నిమిషాలు తర్వాత విష్ణు నారాయణ వచ్చాడు. “శేఖర్, ఆర్టివో ఆఫీస్ కి వెళదామా”
“అలాగే సర్”
కారు స్టార్ట్ చేస్తూ .. అద్దం కొద్దిగా కిందకు వంచి చూసాడు. శేఖర్ తన చేతిలో వున్న కాగితం మడత విప్పి ఆ ఫోన్ నెంబర్ నే తదేకంగా చూస్తూ కనిపించాడు.
**********(*) **********

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి