24, ఫిబ్రవరి 2016, బుధవారం

ఆడ పిల్ల







ఈ చిత్రం చూడండి .. ఒక భారీ వృక్షాన్ని మూలాలతో సహా పెకిలించి వేరొక చోటుకి తరలిస్తున్నారు కదా ! 
విత్తనాలు, మొక్కలని నాటడమే కాదు  అశోకుడు చెట్లు నాటించెను అని చదువుకున్నట్లు ... ఇలా చెట్లు నాటడానికి తరలింబడుతున్నాయి. ఈ చిత్రం చూడగానే నాకు వెంటనే ఒక విషయం తళుక్కుమని  మెరిసింది . పద్దెనిమిదేళ్ళ పాటు అంతకన్నా ఎక్కువగానో తక్కువగానో  పుట్టింటి పెరటి చెట్లో  పెరిగిన వృక్షమనే ఆడపిల్లని పెళ్లి పేరుతో ఇంకొక ఇంటికి పంపినప్పుడు కూడా ...  సమూలంగా పెకిలించ వేయబడ్డ అంతటి వృక్షం   తిరిగి జీవించడానికి తనని నిలబెట్టుకోవాడానికి ఎంత సంఘర్షణ  అనుభవిస్తుందో ... అలాంటి సంఘర్షణే  పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళిన ఆడబిడ్డ అనుభవిస్తుంది. అమ్మాయిల మనసుల్లోకి  మీరెప్పుడైనా తొంగి చూసే ప్రయత్నం చేసారా ?  ఫ్రెండ్స్ .. ఆ ప్రయత్నం చేయండి ... ప్లీజ్ ... చేస్తారు కదా ! ఇలాంటి భావనల తోనే నేను వ్రాసిన "ఇంటి పేరు" కథ చదవండి . అమ్మలని,  అమ్మాయిలని, తోడబుట్టిన వాళ్ళని స్త్రీ లని అందర్నీ అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి . 

10, ఫిబ్రవరి 2016, బుధవారం

మేక్ ఇన్ ఇండియా

మా విజయవాడకి పండగ కాని పండగ 27 సంవత్సరాలగా వస్తూనే ఉంది.  ఆ పండగ వస్తుందనగానే ఇల్లిల్లూ జేబు తడుముకుంటుంది. జనవరి 1 వ తేదీ నుండి అంట. హమ్మయ్య పర్వాలేదు . .. జీతం రాళ్ళు జేబులో పడ్డాకే 11 రోజుల పండగ వస్తుంది. పిల్లలకి మొన్న మొన్ననేగా క్రిస్టమస్ కో, న్యూ ఇయర్ వేడుకల కోసమో  బట్టలు కొన్నాం. మళ్ళీ ఇప్పుడే ఈ పండగ  ముంచుకొచ్చింది. సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికో నాయనమ్మ దగ్గరకో వెళ్ళాలని ముచ్చట పడుతుంటే అటెళ్ళాలా - ఇటెళ్ళాలా  అని డైలమా లో పడ్డారు పిల్లలు.

నాన్నా ..నాన్నా ! ముందు ఈ పండక్కి వెళదాం. ఇక్కడ మా కోసం ఖర్చు పెట్టినదంతా ఊరు నుండి రాగానే ఇచ్చేస్తాం . ప్లీజ్ ఒప్పుకో నాన్నా ! పిల్లలు బతిమలాడుతున్నారు. "నన్నే  అడుగుతున్నారు కానీ  మీ అమ్మ దగ్గర టెండర్ పెట్టాలని మీకు తోచడం లేదు. ఆవిడ గారు అన్నింటి కంటే చీరలకో, నగలకో ప్రాధాన్యత ఇస్తారు. ఈ సారికి మీ అమ్మని అడగాల్సిందే " .అని చెప్పాడు నాన్న.   "మీరేం ..ఎగతాళి చేయనవసరం లేదు. ఈ సారి నా జీతంలో అగ్ర భాగం ఈ పండగ కోసమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. అయితే ఒక షరతుకి అందరూ ఒప్పుకోవాలి".. ఏదో మెలిక పెడుతుంది అమ్మ. అది సాధ్యం కానిదే అయుంటుంది అని ఆలోచిస్తున్నారు.

అంతగా ఆలోచించాల్సిన పని లేదు. రోజూ ఇంటికి రాగానే మీ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. టీవి ఆన్ చేయకూడదు. ఇంట్లో ఉన్న నలుగురు చేతిలో అదే  ఉండాలి .. అలా అయితే ప్రతి నెలా నా జీతం లో నుండి అగ్రభాగం ఇలాంటి పండగల కోసం ఖర్చు పెడతాను. మీ ముగ్గురూ ఆలోచించుకోండి .. అమ్మ సవాల్ విసిరి వంటింట్లోకి వెళ్ళింది. పిల్లలిద్దరూ నిరాశగా ముఖాలు పెట్టారు.

మన PM "మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా " అని స్తోత్రం వల్లిస్తుంటే  ... అమ్మ ఏంటో మొబైల్, టీవి ఇంట్లో నిషిద్దం కాని నిషిద్దం అంటుంది"  ఆ ... యన్స్ వాళ్ళు పేస్ బుక్ కూడా ఫ్రీ గా ఇచ్చారు. ఫ్రీ గా ఇచ్చిందాన్ని  ఉపయోగించుకోకపొతే ఎలా ?  మెదడు మోకాలులో ఉంటుందని అమ్మ లాంటి వాళ్ళని చూసే అని ఉంటారు .  విసుగ్గా అన్నాడు అబ్బాయి. మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్రెండ్స్ తో చాట్ చేయడమెలా !? అమ్మాయి అసంతృప్తితో ఆలోచనలో పడింది.
ఏమిటో ఈ ఆడవాళ్ళు . కాసిని డబ్బులు సంపాదించడం మొదలు పెట్టగానే అంతా తామే కరక్ట్  గా మాట్లాడుతున్నట్టు, కరక్ట్ గా చేస్తున్నట్లూ బిల్డప్ ఇస్తారు. టీవీ చూడక,మొబైల్  వాడకపోతే  అవి  ఉండటమెందుకు ?  ఇంట్లో అలంకారినికి తప్ప ?  స్వగతంలో అనుకున్నానుకుని పైకే అనేసాడు నాన్న.

అమ్మ వంటింట్లో నుండి కోపంగా బయటకి వచ్చి ... నేను..  మరి దాని గురించే అడుగుతున్నాను . ప్రతి సంవత్సరం మా విజయవాడలో పండగ పండగ అంటూ వెళ్లి మోయలేక మోయలేక మోసుకొచ్చి మరీ షో కేస్ లో అలంకరిస్తున్నారు అవేంటో అలంకరణ సామాగ్రిలా ! అవలా పడి  ఉంటునప్పుడు ... ఆ పడి ఉండేదేదో ... పెట్టెలో పడుండే నగో ..బీరువాలొ వరసల్లో అమిరిపోయే చీరైతే మాత్రమేమిటీ ? మేక్ ఇన్ ఇండియా కూడా   చేయవలసిన తీరులో చేసుకుంటూ పోతేనే సాధ్యం. టీవీ ముందు కూర్చుంటేనో,  కంప్యూటర్  ముందు కూర్చుంటేనో, మొబైల్ లో చాట్ చేస్తూంటూ కూర్చుంటే తయారవదు. మన PM లాగా విదేశాలు చుట్టేస్తున్నంత మాత్రానే రాదు.  కుళ్ళు జోక్స్ మీకు మాత్రమే వచ్చనుకోకండి .. కచ్చగా అనేసి వచ్చినంత స్పీడ్ గా వెళ్ళిపోయింది  వంటింట్లోకి.




పిన్ డ్రాప్ సైలెన్స్.  ముగ్గురూ  ... ఆలోచనలో పడ్డారు. కాసేపటికి  నాన్న డిష్  డిస్ కనెక్ట్ చేసేసాడు . అబ్బాయి, అమ్మాయి కొంత అసంతృప్తి తోనే మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి .. షో కేస్ లోపల పెట్టేసి మధ్యాహ్నానికల్లా పండగ కి వెళ్ళడానికి  రెడీ అయిపోయారు. అమ్మ అందరికి సంతోషంగా వడ్డించింది. అందరూ కలసి PWD గ్రౌండ్స్  (స్వరాజ్య మైదానం ) దగ్గర బస్ దిగి తల పైకెత్తి కనబడుతున్న హోర్డింగ్ వొంక చూసారు . 
                      ఇదిగో ఇలా ..  కనబడింది ఆ  నలుగురికి. ఇదే  మా విజయవాడ కి వచ్చే అసలైన పండగ .


 రాత్రయ్యేవరకూ ... ఇలా జనాల్లో కలసి తిరుగుతూ ... ఉన్నారు.
అన్ని పండుగల కంటే ఇదే అసలైన పండగని ఇక్కడ ఖర్చైన ప్రతి రూపాయిని సద్వినియాగం చేసుకుంటే .. బావుంటుందనే ఆలోచనతోనే...  ఈ పోస్ట్ .
(ఈ పండగ గురించి మళ్ళీ ఇంకో పోస్ట్ లో ... )

9, ఫిబ్రవరి 2016, మంగళవారం

మనసు పొరల్లో



చాలా రోజుల తర్వాత మనసు పెట్టి ఉద్విగ్నంగా చదివిన రచన " మనసు పొరల్లో "

అసలేం జరిగిందంటే ... అస్తమాను ఆన్లైన్ లో ఉంటానన్నమాటేగానీ చదవడం తగ్గిపోయింది. వెబ్ రీడింగ్ కష్టమైపోయింది. కళ్ళకి సులోచానాలు వచ్చి చేరాయి. ఎప్పుడూ ఫేస్ బుక్ చూడటం సరిపోయింది.   గాలి కబుర్లు,సొల్లు కబుర్లు,ద్వేషం నిండిన మాటలు,ఇతర మతాల పట్ల ద్వేషాన్ని నింపుకున్న మనుషులు, వారి ప్రవర్తన, వెకిలితనం  ఇవన్నీ చాలా చాలా విసుగనిపించాయి. అప్పుడప్పుడు డీ యాక్టివేట్ చేసి పడేయాలి అనిపించేది సిగిరెట్ తాగడం ఎన్నో సార్లు మానేసాను అని అన్నట్టు.

ఫేస్ బుక్ అంతా మంచి కాదు,  అంతా చెడూ కాదు.  ఏదో ఆ బుక్ లోపలి పేజీల్లో కాస్త నచ్చిన వాళ్ళ ప్రక్కన కాలక్షేపం చేసాను. మధ్య మధ్యలో వెబ్ పత్రికలూ చదవడం. ఈ వెబ్ పత్రికలూ చాలా వచ్చేసాయి మరి. కౌముది , ఈ మాట, విహంగ,సారంగ, తానా,గో తెలుగు, వాకిలి, పత్రిక, అచ్చంగా తెలుగు, అక్షర, ఇంకా దృష్టికి రానివి ఎన్నో ... అలాగే మధురవాణి కొత్తగా రాబోతున్న అరుగు ..ఇంకా ఏమేమి ఉన్నాయో ! (నా జ్ఞాపక శక్తికి పరీక్ష అన్నమాట ఇది. హమ్మయ్య పాస్ అయి ఉంటాననే అనుకుంటున్నా) అలా ఫేస్ బుక్ కి, వెబ్ పత్రికలకి అతుక్కుపోయి బ్లాగ్ ని అటక పై పెట్టానని అతిగా చింతించిన రోజులున్నాయి. అలాగే "మాగంటి" వారితో వియ్యం అందుకున్నాక కాస్త సమయాలని వారికి కేటాయించి ఆ కుటుంబాలతో కలవడం..  అలా వాటి మధ్య వీటి మధ్య  బిజీ బిబీగా రోజులు గడిచి పోతున్నాయి.

అప్పుడప్పుడు చిన్న చిన్న ఘాతాలతో బాధ పెట్టిన ఫేస్ బుక్ ఆకస్మికంగా ఏదో పెద్ద విద్యుత్ ఘాతాన్ని ఇచ్చింది. కాస్త బాధగా పుచ్చుకుని "కల చెదిరింది కథ మారింది కన్నీరే..  ఇక మిగిలింది"  అని పాడుకుంటూ (సమయానికి ఆ పాటే గుర్తుకువచ్చింది. తప్పో, ఒప్పో కూడా తెలియరాలేదు. నిజం ) డీ యాక్టివేట్ చేసాను. హమ్మయ్య అంటూ తలబరువు శుభ్రంగా  కడుక్కుని... కాసేపు ఏవేవో పుస్తకాలు చదివి  మళ్ళీ అలవాటు ప్రకారం సిస్టం ఆన్ చేసాను. కాస్త ఇటువైపు చూసి బ్లాగుల వైపు చూసి బాగానే దిగులుపడి .. ఎలాంటి బ్లాగ్ లోకం !!  ఇప్పుడెలా మారిపోయింది !? అని విచారం ముంచుకొచ్చి ... ఇంకో Tab లోకి స్కిప్ అయ్యాను. ఏదో లింక్ పట్టుకుని  అలా అలా దీర్ఘంగా మునిగిపోయి ... తర్వాత  "కౌముది" లో తేలాను. ఒక కథ చదివి ... ముచ్చటేసింది.  "ఒక పువ్వు కథ" .. చాలా బావుందనిపించి ...   అలా అలా ఆలోచిస్తూ .. "మనసు పొరల్లో ".. భువన చంద్ర గారి మ్యూజింగ్స్ 26 వ భాగం సెండాఫ్ ఎంత బాధాకరమైనది ... అని చదువుతూ ... నిజంగా అంతే కదూ...  కదూ అనుకుంటూ ఆ భాగం  మొత్తం చదువుతూ కన్నీటితో తడిసి ముద్దైపోయాను.

అరెరే .. నేను కౌముది వెబ్ పత్రికని చదవకుండా వదిలేస్తూ చాలా పొరబాటు చేసాననుకుంటూ .. వెనక్కి వెళ్లి 2014 జనవరి నుండి 2016 జనవరి వరకు 25 నెలల మనసు పొరలని కదలకుండా చదివేసాను. ఎన్ని సార్లు మనసుకి దగ్గరగా వచ్చిందో ..చెప్పలేను. మనసు పొరల్లోని మధురమైన జ్ఞాపకాలు,చేదు గుళికలు అన్నీ అన్నీ మనసుకెక్కించుకుని తడిసి ముద్దై పోయాను. కొన్ని వాక్యాలు నేను వ్రాస్తే కూడా ఇలాగే  ఉంటాయని చాలా...  చాలా సార్లు అనిపించింది. అనేక పాటలు, మనసుకి దగ్గరగా వచ్చిన మనుషులు అన్నీ కలల్లోకి వచ్చిన మనుషుల్లా అలా కదలాడుతూ ఉంటే అయిదు గంటలు కదలకుండా ఏకబిగిన చదివేసాను.

భువనచంద్ర  గారి మనసు పొరల్లోని వ్యక్తులలో నాకు బాగా నచ్చినవారు డా:గోపాలకృష్ణ గారు, పెద్దమ్మ, బబులి.
ఉమ పట్ల సానుభూతి, 1971 ఇండో పాక్ సరిహద్దులలో జరిగిన యుద్ధం మిగిల్చిన  గుండె కోత దుఃఖభరితంగా ఉంది.  సుమిత్ర చెప్పిన కథ, ఆమ్రపాలి కథలు విన్నప్పుడు చాలా బాధ, స్నేహపాత్రులు స్వామి , ముజుందార్,కాట్రగడ్డ ప్రసాద్ గార్లు ..ఇలా ఒక్కరూ ఒకో ముద్ర వేసేసారు. ఏ దిగులు కల్గించనిది నమ్రత ఒక్కటే ! ఇక PB శ్రీనివాస్ గారి గేయాల సంఖ్యా,  కొవ్వలి నవలల  సంఖ్యా  చూసి అచ్చెరువొందాను. మనిషికున్న అనేక బాధలనుండి సాంత్వన కల్గించేది, మరపు కల్గించేది సాహిత్యబలం అని నేను మరొకసారి  నమ్ముతున్నాను.

జ్ఞాపకాలని ఎవరూ వరుసగా పుస్తకాల్ని షెల్ఫ్ లో సర్దినట్లు క్రమంలో పేర్చలేరు. ఇటుకలతో గోడలు నిర్మించినట్లు నిర్మించలేరు . ఎప్పుడు ఏది గుర్తుకువస్తే అదే ... అలా అలా అలల్లా కదలాడుతూ ఉంటాయి. మనసు పొరల్లో దాగున్న అనేకానేక జ్ఞాపకాలని హృద్యంగా  అందిస్తున్న "భువనచంద్ర" గారిని అభినందించకుండా ఉండలేం. మనసుపొరల్లో ని తలుచుకుంటూ ...

అర్జంట్ గా  ఇంటిపనులకి, వంట పనికి స్వస్తి చెప్పి (ఎప్పుడూ ఉండే పనే కదా ఇది  ముందు సినిమా చూడాలనే ఆత్రుత)  మళ్ళీ ఇంకోసారి   "మేరానామ్  జోకర్" సినిమా చూడాలి "మళ్ళా" ఎమెస్కో వాళ్ళ ప్రచురణ లో విడుదలయ్యిందో లేదో, వెన్నెలా వెన్నెలా పాట ఇంకో నాలుగుసార్లు చూడాలి అనుకుంటున్నాను. ఇవి ఇప్పటికిప్పుడు నా ఆలోచన. ఇంకా కొన్ని హిందీ పాటలు కూడా చూడాలి.

ఫ్రెండ్స్ ....  మీరందరూ కూడా అలా అలా వెళ్లి  మనసు పొరల్లో ...
మనసు పిడికెడంత  ఆలోచనలు ఆకాశమంత .. మనసు ముంగిట్లోని దృశ్యాదృశ్యాలకి అక్షరరూపాన్ని తప్పక చదవండి .

మళ్ళీ ఇన్నాళ్ళకి  నాతో బ్లాగ్ లో పోస్ట్ వ్రాయించిన నా మనసు ... మనసు పొరల్లోకి వెళ్లి సంచరిస్తూనే ఉంది . మళ్ళీ ఇంకో పోస్ట్ త్వరలో వ్రాస్తాననే నమ్మకం కల్గిస్తుంది. మళ్ళీ వస్తాను. వస్తూనే ఉంటాను .

మనసు పొరల్లో ..లింక్ ఇది . http://www.koumudi.net/Monthly/2016/february/index.html (లేటెస్ట్ సంచిక ఇది )

2014 జనవరి సంచిక లింక్ ..ఇక్కడ నొక్కి ... .ఆ లింక్ లోకి వెళ్లి చదవడం మొదలెట్టండి .