10, ఆగస్టు 2018, శుక్రవారం

కుడ్య కళ

రెండు రోజుల క్రితం శ్రీశైలం వెళ్లాను . స్వామీ దర్శనం తో పాటు  మళ్ళీ మళ్ళీ చాలా చూసాను. గతంలో చూసినవే. అందులో శివాజీ స్పూర్తి కేంద్రంతో పాటు .. ప్రత్యేకంగా దేవాలయం చుట్టూ ఉన్న ప్రాకారాలపై ఉన్న శిల్ప కళని చూసి తీరాల్సిందే. ఆ కుడ్య కళలో చరిత్ర కనబడుతుంది . చాలా ఫొటోస్ తీశాను. అందులో మచ్చుకు కొన్ని ... మిగతావన్నీ వీడియో చేసి చూపిస్తాను .



















3, ఆగస్టు 2018, శుక్రవారం

బతుకు రంగస్థలం పై బోన్సాయ్ మొక్కలు

వెలుతురు బాకు ముందుమాట




వనజ తాతినేని నా చేతిలో వెలుతురు బాకు " ని పెట్టి చానాళ్ళై పోయింది. ఇంత అలసత్వం యెప్పుడూ జరగలేదు. రకరకాల కారణాల వల్ల ఇంత జాప్యం జరిగింది, మీరెప్పటికైనా వ్రాయండి, మీ ముందుమాట వుండాలి "అన్న ఆమె అభిమానం తన గురించి ఎక్కువగా ఆలోచించేందుకు కారణమైంది."గతంలో "తను వుత్తమ కథకురాలిగా "భూమిక"అవార్డ్ ని అందుకున్న సందర్భంలో మొదటిసారి  కలుసుకున్నాం. అప్పుడే మీరు వ్రాయాలి అనే మాట తీసుకుంది. మంచి కథలు వ్రాసే వ్యక్తిగా గుర్తింపు పొందిన వనజ కవిత్వంలోనూ తన పత్యేకతను నిలుపుకుంది.

భూమికలోనూ, వెబ్ మాగజైన్స్ లోనూ, పత్రికలలోనూ,కవి సంగమం లోనూ అడపాదడపా తన కవితలు చదువుతూనే వున్నాను. పుస్తక రూపంలోకి వచ్చేసరికి రాణించే కవితలే ఎక్కువగా కనిపించాయి. రాన్రాను భాషలో మార్పు కవితా శీర్షికలలో మార్పు,  వ్యక్తీకరణలో మార్పు, వస్తు ఎన్నికలో,  కవిత్వ చిక్కదనంలో మార్పు స్పష్టంగా  కనిపిస్తున్నాయి.

స్త్రీలు రచయిత్రులుగా మారాలంటే ఇల్లు,  వంటిల్లు ఆమెపై యెంత వొత్తిడిని తీసుకొస్తాయో "చెక్కేసిన వాక్యం " కవితలో వ్యక్తీకరించింది. వాక్యాన్ని చెక్కుతుండగానే పెన్సిల్ ముక్క విరిగినట్లుగా అధికారాల మధ్య నిసృహగా వాక్యమెక్కడో జారిపోతుంది అంటుంది. "పాకశాలలో చిక్కబడిందే స్త్రీల జీవితమనేది యెప్పటికీ మారని నిర్వచనమే  దానిని  చెరిపేయాల్సింది కూడా మనమే అంటుంది. ఈ కవిత చదువుతుంటే వసంతా కన్నాభిరామన్ గుర్తొచ్చారు .  స్త్రీల నైటీలకి కానీ, దుస్తులకి గానీ వొక జేబు వుండాలి.అందులో ఓ పేపర్ పెన్నూ వుంటే ఎంతపనిలో వున్నా క్షణంపాటు వెలిగే భావాలని రికార్డ్ చేసుకుని తర్వాత రాసుకోవచ్చు అన్నారు.

వనజ హృదయ అత్యంత సున్నితం. ఒక పువ్వు పూయగానే తానే వొక రేకై విరిసినట్లుగా అనుభూతి చెందటం కనిపిస్తుంది. అస్వతంత్ర వాతావరణంలో స్త్రీల చుట్టూ వేసిన ముళ్ళ కంచెలని గమ్మత్తుగా, చిత్రంగా,వాస్తవంగా, వ్యంగంగా "జీవిత కథ"లో రాసింది. నా జీవితమనే పుస్తకంలో అన్ని భాంధవ్యాలు వ్రాసిన వాక్యాలే వున్నాయి. ముఖ చిత్రం మాత్రం మధ్యలో వచ్చిన భర్త చేతిలోని కుంచెలో వొదిగిపోయింది. నేను రాయకుండానే నా జీవిత కథ ముగిసిపోయింది అంటుంది. స్త్రీల జీవితాల్లో జారిపోతున్న రోజుల గురించి "అంబరాన పక్షులేసిన దారి  గుండా / చూపు సారిస్తూ /వలస పోయిన పక్షిలా నువ్వు / కనురెప్పల దాహానికి వాయిదా వేసి / రాత్రి కొసన వ్రేలాడే నెలవంకతో / జామంతా సహవాసం చేస్తూనే వుంటున్నా " సున్నితమైన, భావోద్విగ్నమైన,  సుకుమారమైన వేదనార్తిని కలగలిపిన అక్షర నక్షత్రాలున్నాయి కవితలో .


తనని తానూ అన్వేషిస్తున్న క్రమంలో రాసుకున్న కవిత "జీవితాన్వేషణ " ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి ,ఎక్కడ  పారేసుకున్నానో  ఎంతకీ గుర్తుకురావడంలేదు/ దీపమూ నాచేతిలోనే వుంది దారమూ నాచేతిలోనే వుంది  అనే సృహని వెలిబుచ్చింది. వనజ కథకురాలవ్వడం వల్ల కథన రీతిలో కొన్ని కవితలున్నాయి. విషయం పట్ల వొక స్పష్టత వున్న కవయిత్రి. బతుకు పట్ల భరోసా వున్న కవయిత్రి. స్త్రీలని గురించిన ఆలోచనా వేదనల కలబోతల చిత్రాలుగా అనేక కవితలని మలిచింది.

తమిళ రచయిత్రి "సల్మా : తానొక రచయిత్రిగా నిలబడటానికి చేసిన ఘర్షణ,కుటుంబీకులు పేపర్ ను కూడా కనబడనీయకుండా చేస్తే  ఆమెలోని తృష్ణ ను మాత్రం విడిచిపెట్టక టాయ్ లెట్ పేపర్లమీద  రాసిన వైనం  విన్నప్పుడు మనకు స్త్రీల పట్టుదల,శక్తి దైర్యం,రచనాసక్తులను స్పష్టంగా గమనించవచ్చు.

వనజ కవిత్వంలో కూడా అంతర్లీనంగా ప్రవహిస్తూండే రచనా గుణం అనేక కవితల్లో ఆవిష్కారమైంది. దేహక్రీడలో తెగిన సగం కవితలో .. దేహం నదిలో / ఎత్తు పల్లాలు వొంపుసొంపుల సొగసులను /ఆబగా కొలుచుకునే కామచిత్తులకు/ ప్రవహించినంత మేరా పచ్చదనాన్ని నింపే /ఆ నది అంతరంగం అర్ధమయ్యేది ఎప్పుడు? ..అని సూటిగా ప్రశ్నిస్తుంది.

"గాయం వేల సందర్భాలు " కవితలో ఇలా అంటుంది . :గాయానికి తెలుసు, మాను ఎండినా తీగకు  ఆధారమైనట్లు

తనని తాను నిలబెట్టుకోవాల్సిందే. ఆత్మని ఆశ్రయించాల్సిందే / అందుకే గాయం నడుస్తూనే వుంది,వేలసంధర్భాలని తనలో దాచేసుకుని /.

ఏకాంతమంటే  ఏకాకితనం కాదంటూ, అది ఆలోచనలకి నగిషీ పెట్టేదని , అక్షరాలకు సొబగులద్దె క్షణాలని ,దీపం చుట్టూ కాంతి వ్యాపించినట్లుగా తన చుటూ ఏకాంతం వ్యాపిస్తుంద౦ది.

సమాజం కోసం అడుగువేసినా సహచరుని రాక కోసం నిరీక్షించే వొక హృదయం మాట్లాడిన మాటలని "నిరీక్షణ " కవితలో ప్రతిభావంతంగా వెల్లడించింది. అతనెప్పటికీ రాలేడేమో అనే  స్పష్టమైన నిజం తెలిసినా,  అతడికై చూసే చూపులు "ప్రేమంటే క్షణికమైన మోహం కాదని /ప్రేమంటే ఎడతెగని నిరీక్షణ అని ఎందరికి తెలుసు ? అంటూ అత్యున్నతమైన ప్రేమ స్వరూపాన్ని తెలిపిందిలా.

గతంలో చాలా మంది రైతుల జీవితాల గురించి, వ్యవసాయ కష్టాలు గురించి, రైతుల ఆత్మహత్యల గురించి యెన్నెన్నో కవితలు వ్రాసారు. వోల్గా రైతు ఆత్మహత్య చేసుకున్నాక వొంటరిగా మిగిలిపోయిన అతని భార్య గురించి వ్రాసింది. ఇది మొదటి కవిత అయితే వనజ వ్రాసినది రెండో కవిత . "నువ్వు వొదిలేసిన కాడితో " నేను సాయంగా వుండానన్న సంగతి మరిచేసి / నిన్ను కన్నోళ్ళకి మనం కన్నోళ్ళకి నన్నే వొంటి నిట్టాడిని చేసి పోయాక /నన్ను గాలికి వొగ్గేసి నువ్వు గాలిలో కలిసి పోయాక / నేను రోజూ  దైర్యమనే మందు తాగుతూనే వున్నాను /.. నా చుట్టూ తిరిగే చూపులకి ముళ్ళ కంచెలు కొట్టి /మా చూపులకి అగ్గి రగిలించుకుని / ఆమడ దూరంలో వాళ్ళని ఆపేసి / నువ్వు వొదిలేసిన కాడితో బ్రతుకు సేద్యం చేస్తూనే వుందాల /బ్రతుకుతూనే వుండాల.

ఇలాంటి స్థితిగతులని పిల్లల కోసం, తీర్చాల్సిన అప్పుల కోసం వొంటరి పోరాటాన్ని స్త్రీలు ధైర్యంగా చేస్తున్నారనడంలో, మధ్యలో ఆపేయకుండా  నడిపే స్త్రీల దైర్యాన్ని తెలిపింది. ఐ యాం ఆల్వేస్ యే లూజర్ " కూడా  ఆలోచనాత్మకమైన కవిత. స్త్రీల ఉనికిని అద్భుతంగా చెప్పిందందులో. వెలుగు రేకల వైపు నడుస్తూ చీకటితో సహవాసం చేసే దీశాలిని / నదిలో మునకకి వెరువని యోదురాలిని / పడిలేచే కెరటానికి ఆకురాలుకాలానికి ప్రతీకని నేను /అనంతకాలానికి నేను స్త్రీని అని నిశ్చయ ప్రకటన చేస్తుంది.

వర్తమానంలో స్త్రీల స్థితిని గురించి, పిల్లలు, కుటుంబం ఆమెనెలా "ఖాళీ సంచి "లాగా మిగిల్చేస్తారో చెప్పిన కవిత. కాస్త నాలుగు గోడలు దాటి / మస్తిష్కాన్ని బద్దలు కొట్టే ఆలోచనల తావున / పావురంలా స్వేచ్ఛగా , శాంతిగా మసలాలనుకుంటే / జీవితం జీవితాన్నే ఒక ఖాళీసంచి గా మార్చి / బిడ్డలెప్పుడో చేతికి తగిలించుకుని / వెళ్లిపోయారని గుర్తుకు వచ్చినప్పుడు / జీవితమంటే అర్ధం కాని సంవేదన / ఎందుకయ్యిందో ఎరుక పడతారు.  ఈ ఎరుకను అన్ని సందర్భాలలోనూ తెలిసిన వ్యక్తి కాబట్టి మెచ్యూరిటీ సాధించిన కవిత్వమీమెది.


" వాకపల్లి  " దుర్ఘటన జరిగిన తర్వాత వాళ్ళని కలిసిన సందర్భంలో, వాళ్ళతో మాట్లాడిన తర్వాత అత్యంత విశాదమనిపించిన విషయం నలబై మూడు మంది రచయిత్రులం భూమిక టీం లా యేర్పడి వారి దగ్గరకి వెళ్లాం . సామాజిక అత్యాచారానికి బలైన పసిపిల్లల తల్లులు కూడా వున్నారు. పొదల్లోకి పిల్లలని విసిరేసి వాళ్ళను క్రూరంగా హింసించారు .అసలు యేమీ జరగలేదు అంటున్న ప్రభుత్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు. " భూమి పలికితే ఆకాశం నమ్మదా ?" అని ప్రశ్నించారు. ఒళ్ళు జలదరించింది. మా భర్తలకి మామీద కోపం లేదు , మేము కలిసి వుండాటానికి సిద్దమే, కాని మా  కట్టుబాట్లు వొప్పుకోవు, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి.  తప్పు కట్టాలి , అప్పుడే మా ఇళ్ళల్లోకి మాకు ప్రవేశం. మేము ,మా భర్తలు ,మా పిల్లలు అప్పటిదాకా విడిపోవాల్సిందే అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఇష్యూ  మీద కూడా వనజ "ఒక మౌనం వెనుక " అని కవిత రూపంలో సంభాశించింది.

భార్యా భార్తలైపోయాక గతంలోని ప్రేమలు గుర్తొచ్చినా వివేకంతో ఎలా ప్రవర్తించాలో "మూడో మనిషి " ఎంత క్షోభకి గురవుతుందో తెలిపిన కవిత ఇది. అలాగే "రూపకశ్రేణి" కవితలో .. ఇప్పుడిప్పుడే  అన్నింట్లో కాకపోయినా కొన్నిట్లో అయినా మిమ్మల్ని దాటేసిన వాళ్ళం/ ఆఫీసు ,వంటిల్లు , మాతృత్వం అన్నీ మీకేనా అని మా అధిక సామర్ధ్య౦ చూసి/ లోలోపల దుఃఖిస్తూ మాకేం లేవా ? మేము ద్వితీయ శ్రేణీ నా అంటూ ఘోషించే మీ ప్రశ్నకి మేము సంసిద్ధం / అంటూ దృఢ౦గా పలికింది.

ప్రకృతిలో గాఢ నుభూతిని పొందిన కవిత, ఆమె మృదుతత్వాన్ని అద్భుతమైన పోలికతో హృద్యంగా వెలువరించిన కవిత "రాత్రి ఓ అంతరంగ రహస్యం "

చిన్నారి కవయిత్రి  "అంజన " నీలి మేఘాలులో రాసిన కవిత 'అమ్మను నేనే ,బొమ్మను నేనే అని మొదలవుతుంది. "నాల్గింట మగనాలి " కవిత చదువుతుంటే అది గుర్తొచ్చింది. ఆడపిల్లని అరణంగా రాసిచ్చిన మానవ జాతికి / అమ్మవు నువ్వే బొమ్మవు నువ్వే !

తనువంతా కరిగించి మనసంతా కుదించి / ఓ పాత్రలో వొదిగేస్తావ్ / వీడ్కోలు యాత్రలో నీపై దండలై పూసేది ఈ త్యాగాలే / నీ జనం చరితార్ధం చేసిన గాధలని / తామ్ర పాత్ర లేకలపై భద్రపరిచి యుగయుగాలు పాఠాలు భోధిస్తారు / ఆకాశాన సగం మనం అయినా మనల్ని అణిచేసేది నిజం /  వేయి తలల ఆదిశేషునై  విలువల వ్యాకరణం నేర్పిస్తా /నీ ధీరత్వం, వీరత్వం అన్నీ కూకటి వేళ్ళతో పెకిలిస్తా / అనే ధోరణితో కవిత ప్రయాణిస్తుంది.

జీవితం "నీటి ప్రయాణం " లాంటిది అంటుంది ఒక చోట . వేదాంత ధోరణితో తప్పిదాలన్ని పలక మీద రాసిన అక్షరాలైతే ఎంత బాగుందు అనుకుంటుంది. నీడలా వెంటాడే శాశనాలు ,ఊడల్లా విస్తరించే ఆత్మ నూన్యతలు, వెంటాడే నీడ వేటాడే నీడ నన్ను ప్రాణం లేని శిలని చేసింది అన్న జ్ఞాన స్పృహ ని వెల్లడించింది.

ఇంకొక మంచి కవిత " ఆకాశాన సగం మనం " - అవసరాల బానిసత్వ కొట్టంలో జీతంరాళ్ళ పాలిచ్చే పశురాళ్ళం మనం / జీవితపు రంగస్థలం మీద మనది కాని జీవితంలో నటిస్తున్న నట ఊర్వశిలం మనం / వ్యక్తిత్వపు పరిమళాలు విజ్ఞానపు పూలు సమర్ధతా నైపుణ్యాలు వున్న మనం / అయినా మనకన్నా బోన్సాయ్ మొక్కలే నయం / మనువు వొక లోహపు గది తనువు ఒక మోహపు నది / పురాణాల్లోలా  కాకుండా చరిత్రలో శోక పర్వాలు వనవాస ఘట్టాలు లేని/ మనకొక అధ్యాయాలు మిగిల్చుకుంటూ/ భవితలో మనలాంటి మనం లేకుండా మరింత చైతన్యశీలురుగా/ ఎదిగే దిశలో మనలో మనం మనతో మనం . ఈ కవితా వాక్యాలు చాలు . ఆమె ఎంత ఆశావాదో, భవిష్యత్ తీరాలవైపు యెంత నమ్మకంతో ప్రయాణం మొదలుపెడుతుందో తెలియడానికి.  " ఆధునిక మహిళ " కవితలో స్త్రీ సంపూర్ణ స్వరూపాన్ని చిత్రకారిణిలా చిత్రించింది.

" ఇంటి పేరు " కవిత కూడా స్త్రీని ఎంత చిత్ర విచిత్రంగా హింసిస్తుందో  చెప్పే కవిత . "తిరిగొచ్చిన ఇంద్ర ధనుస్సు "  కూడా ఆలోచింపజేసే కవిత.  మళ్ళీ రేపోస్తుందిలే ఇంద్ర ధనుస్సు , దిగులుపడకు అనే వోదార్పుతో జ్ఞానబోధ కలిగి ఈ సారి నవ్వులో కన్నీళ్లు చిట్లాయి / నీ కన్నీటి బింధువుపై పడిన నవ్వు కిరణమై ఇంద్రధనుస్సై తోటంతా విరిసింది అంటుంది .

"పునీత " కవితలో  ఈ కవితల ప్రయాణానికి తాత్కాలిక  బిందువు పెట్టబడింది . ప్రాణ౦ దేహమూ వేరుకానట్లే / హీనత్వమూ  దీనత్వమూ నీ చిరునామాగా మార్చకు / ఆపాదించే అధికారం  వొకరికి ఇవ్వనేల? వగచనేల ?  /ప్యూరిటీ అంటూ యేమీ లేదిక్కడ ? అకృత్యమెలా జరిగినా దాడి రూపమేదైనా / జరిగిన ప్రతి సారీ నువ్వు ఆత్మ విశ్వాసమనే ఇనుప కచ్చధం ధరించాలి / నీ దేహమే వొక ఆయుధం కావాలి/మొగ్గ  బేల ముగ్ధ పోలికలని మై పుట్  అంటూ ఈడ్చి కొట్టాలి / జీవన కదనరంగాన్ని దున్నే హలాలమవ్వాలి /క్షేత్రధర్మాన్ని నిర్వర్తించే కరవాలమవ్వాలి / దోచినవాడి తల నేలకూలాలి / దొరికితే వాడిని దొరకకపోయినా /వాడికన్నా భయంకరమైన లోకాన్ని చీల్చి చెండాడటానికి నీకొక  దేహం కావాలి / లే లేచి దేహాన్ని నిలబెట్టు /జీవం నింపుకో /జీవితేచ్చ రగిలించుకో /నువ్వు తలచుకుంటే నీ రాతని/ వేరొకరు గీసిన గీతలని మార్చేసే గీతావాక్యమవుతావ్ /గుండె గానం వినిపిస్తావ్ ..అంటూ లైంగిక దాడికి గురవతున్న వాళ్ళంతా యెలా మారాలో ..ఈ కవితలో స్పూర్తి నింపే  విధంగా వ్రాసింది.


వనజ కవిత్వంలో ముప్పావు వంతు పైగా స్త్రీ సంబంధమైనవిగానే కవితలున్నాయి . బతుకు రంగ స్థలం మీద ఎవరెవరో యిచ్చిన పాత్రలలో నటిస్తూ జీవిస్తున్నట్లుగా ఉన్న వేల వేల స్త్రీల ముఖాలని పరిచయం చేసింది. మహా వ్రుక్షాలైన స్త్రీలు ఇళ్ళలో బోన్సాయ్ మొక్కలుగా పెరుగుతున్న వైనాన్ని వేదనతో వినిపించింది.


గోడలే తప్ప కిటికీలు దర్వాజాలు లేనివాళ్ళం /ఇప్పుడిప్పుడే అక్షర గవాక్షం గుండా /హరితవనాల వైపు తొంగి చూస్తున్న వాళ్ళం ..అని మొదలైన "ద్వారాల మాట " కవిత చాలా శక్తివంతమైన కవిత. తినాలనుకున్నప్పుడల్లా ఇన్స్టంట్ పుడ్ లా ఓ ఆడతనాన్ని చేజిక్కిన్చుకోవాలనుకునే వేటగాడి మనస్తత్వాన్ని / నిల్వ ఆహారాలను వేడి  చేసుకునే ఓవెన్ లా / ఇంట్లో ఓ ఆడది ఉండాలనుకునే అవసరాల ఆలోచనలకి నీళ్ళోదిలి చూడు, సత్యాన్ని చూడు   అని గట్టిగా హెచ్చరిస్తూనే ఉగ్గబట్టుకున్న ఇన్నాళ్ళ దుఃఖావేశాలను, వొడిలో బలవంతంగా మోస్తున్న నిప్పుల ముద్దను విసిరి పారేస్తూ, మళ్ళీ ఇలా అంటుంది. మీకన్నా ఒక ద్వారం ఎక్కువున్న వాళ్ళం / ఆ లోకాన్ని చూడటానికి అనుమతినిచ్చిన వాళ్ళం / నిత్య సాంగత్యపు గాయాల సలుపు తీరకుండానే జీవనౌషదాన్ని పూసుకుంటూ   యంత్రాల్లా పరుగెడుతున్నవాళ్ళ౦/ద్వారాల పైనే వున్న మీ కాముక దృష్టిని మరల్చి /360 డిగ్రీల  కోణంతో చూపులలో విశాలత్వం నింపండి / అంటూ స్త్రీల జీవితాల్లో మార్పులనీ పురుషుల  దృష్టి కోణంలో మార్పు కోసం తపన పడింది . దీన్నొక విమర్శగా  కాక అందరం కలిసి జీవించాల్సిన సందర్భంగా భావించి మళ్ళీ ఇలా అంటుంది. ఎటు తిప్పినా ఇద్దరం కలిసి తిరగాల్సిన వాళ్ళమే కదా ! ఎదురు పడుతూనైనా వెనుకగానైనా నడవాల్సిన వాళ్ళమే కదా ! ప్రేమతో చెపుతున్నాం పరుశంగానూ చెపుతున్నాం / ఎలా చెప్పినా ఇది మీరు వినే తీరాలి/ ఇది రుధిర ద్వారాల మాట / దశమ ద్వారాల మాట ? అంటూ ధిక్కార స్వరంతో చెపుతుంది. తాను కలలు  కన్న  'యుటోపియా' ను చూడాలనుకోవడమే కాక ఆ ఊహా స్వర్గ నిర్మాణానికి అక్షరాల ఇటుకలను పేర్చింది. యెవరి ఆయుధం వారి చేతిలోనే వుండాలిప్పుడు /అరువు ఆయుధాలు ఎన్నటికీ దొరకవు /అని స్పష్టం చేస్తుంది.మానసిక చైతన్యం రావాలని, ధైర్యంగా పరిస్థితులని ఎదుర్కునే శక్తి స్త్రీలకి రావాలని ఇంచు మించు అన్ని కవితలలో ఇవే భావాలు వెల్లడించడం వల్ల  స్త్రీల జీవితాల పట్ల ఆమెకి ఉన్న కమిట్మెంట్, సిన్సియారిటీ కన్పిస్తాయి .


 ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదం,మతోన్మాదం  వల్ల  అమాయకులపై హింస పెట్రేగి  జనుల జీవితాలని అతలాకులం చేస్తుంది.


రెండు దేశాల మద్యనో రెండు ఇజాల మద్యనో/సరిహద్దుల వెంబడి మానవత్వపు నది/మెలికెలు తిరుగుతూ ప్రవహిస్తూనే ఉంది/దానిని మళ్ళించి మన హృదయసీమల్లో/శాంతిని పండించే  విత్తనాలు నాటాలి/

హృదయాలని తట్టి లేపే పని మొదలెట్టాలి/అంటూ ఆర్ద్రత తో "వెలుతురు బాకు " ను గుచ్చుతూ సామాజిక సృహతో 

మతమవసరంలేని మానవాలయాలని నిర్మింప జేసుకుందామని, మనిషి మదిలో మసిలే మానసిక చీకట్లను రూపుమాపడానికి

వెలుతురు బాకులతో దండయాత్ర  చేద్దాం అని తన వెలుతురు బాకు కవిత్వంతో ముందుకొచ్చింది. 


రచనని వొక సామాజిక భాద్యత గా తీసుకుని రాస్తున్న వనజ కలం నుండి మరెన్నో కవితలు వెలుగు చూడాలని ఆశిస్తున్నాను . ఒక మంచి కవితలని చదివిన అనుభూతిని కల్గించి నందుకు  అభినందిస్తున్నాను..

                                                                                                                                డా.శిలాలోలిత

                                                                                                                                             

05 -06-2018. 


1, ఆగస్టు 2018, బుధవారం

తాజాగా స్పందన

తాజాగా .. కవిత్వ కథ పై ..... ఓ అభిమాన పాఠకుడి లేఖ. పాఠకులు keen observation లో ఉంటారని నా మెయిల్ కి వచ్చిన ఈ అభిప్రాయం చూసినప్పుడు తెలిసింది. 100% నా మనసులోని భావాలకి అనుగుణంగా వచ్చిన రివ్యూ యిది. stun అయ్యాను కూడా. ఈ పాఠకుడు నా మిత్ర బృందంలో వారే కావచ్చు. ఎనీ వే.. చాలా సంతోషం. ఈ లేఖపై ఉన్న దాన్ని యధాతధంగా ..టైప్ చేసి పోస్ట్ చేస్తున్నాను. గతంలో వాణి వెంకట్ ,సరళ మోహన్ ,మంజు యనమదల గారి లాగా ఈ అజ్ఞాత అభిమాని నాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు . బొమ్మదేవర నాగ కుమారి గారూ మీకు కూడా lot of thanks.

**********************

నేను ఫేస్ బుక్ లో ఎక్కువ సంచరించను. నచ్చినవి చదువుకుంటాను. నన్ను బాగా ఆకర్షించిన కవిత "తాజాగా " అనే కవిత గురించి నా మనసుకు అనిపించిన నాలుగు మాటలు.

అసలు కవిత్వమంటే ఏమిటీ అనే ప్రశ్నకు మృదువుగా ఇది కాదా కవిత్వం అంటూ చెప్పిన కవిత.

వ్రాసిన కవి వయసుని బట్టి చూస్తే తలలు బోడులవ్వును కానీ తలపులు బోడులగునా అన్న హాస్య సామెత గుర్తుకొస్తుంది.

నిజానికి ఈ కాలంలో రొమాన్సిజం తగ్గింది. స్త్రీ పురుషుల మధ్య సంభాషణల్లో సరస సల్లాపాలేమిటో తెలియదు. గిలిగింతలు పెట్టే సంభాషణల బదులు అధికారాలతో ఏరా, పోరా, నీ యమ్మ, దీనెమ్మ జీవితం ఇలాంటి పదాలతో ముతక భాషా సంభాషణలు నూతనంగా వర్ధిల్లుతున్నాయి. ఇకపోతే యువతీ యువతుల ప్రేమ కవిత్వమూ బాగా బాగా వర్ధిల్లుతుంది. కానీ మనసుని నిత్య యవ్వనంగా ఉంచే ఔషదం ఏమిటో చాలా మందికి తెలియదు. అది ఈ కవితలో చాలా వుంది. అలాగే ఈ కవిత గొప్ప దైర్యంతో నిజాయితీగా వ్రాసిన కవిత కూడా. పురుష కవులందరూ కావ్య నాయికల గురించి వ్రాసినప్పుడు స్త్రీ రచయితలు మాత్రం తమ కావ్య నాయకుడి గురించి చెప్పకూడదా ఏమిటీ అనిపిస్తుంది. నిజానికి యద్దనపూడి సులోచనారాణి గారిలాంటి రచయిత్రులు ఎప్పుడో ఆ పని చేసారనుకోండి. కవిత్వంలో నూతన ఒరవడి ఈ కవనంలో కనబడింది. అసలు ఈ కవితలో మధ్యభాగమంతా దృశ్యరూపమే. ఎంత లలితంగా మృదుత్వంతో స్త్రీ సహజమైన లాలిత్యంతో వ్రాసారో!

అసలే చంద్రబింబం లాంటి ముఖం అంట. ఆ ముఖంపై ముడతలనీ కవిత్వం చేసారు. వయసు మీద పడినప్పుడో ఆలోచనల్లో భ్రుకుటి ముడిపడినప్పుడో ఫాలభాగంపై ముడతలు కనబడతాయి ఎదురుగా ఉండి చూసేవారికి. చంద్రబింబం లాంటి ముఖంపై మూడు అడ్డగీతలూ అనడం కవి యొక్క సునిసత్వం కనబడుతుంది. చంద్రుని కాంతి గ్రోలి తూలి వెలిగే కళ్ళు చల్లని చూపులు అని చెప్పడానికి కవి వర్ణన అంత రమణీయ భావం ఒలికించడం సంతోషానికి గురిచేసింది. కళ్ళలోకి కళ్ళు ప్రవహించిన క్షణాలని అరంగుళం దూరంలో ఆపేసి అన్నారు. అలా ఆపేయడమంటే ఎంత దగ్గరతనముందో అంతకు మించి బిడియమూ సరిహద్దు రేఖ ఏదో చప్పున స్పురించడం వల్లో అరంగుళం దూరంలో ఆపేసి రెండు ముంజేతులను కళ్ళకద్దుకోవడం కవిత్వం కాదూ అన్నారు.వ్యక్తి పట్ల ప్రేమే కాదు బలీయమైన ఆరాధన ఉంటేనే ఆ ముంజేతులని కళ్ళ కద్దుకోవడం జరుగుతుంది. ఇక్కడ కవి భావన గౌరవంగా హుందాగా గొప్పగా కనబడింది. ఈ కవికి ఏది కవిత్వమో ఏది కవిత్వం కాదో బాగా తెలుసు. అలాగే గొప్ప స్క్రీన్ ప్లే కూడా తెలుసుననిపించింది. నాటక రంగంతో పరిచయముందేమో అనిపించింది.

అయిదో ప్రపంచమా అన్న సంభోధన పైనే అందరి దృష్టి మళ్ళింది కానీ మేకప్ పొరల మధ్య అన్నది ఎవరూ పట్టించుకోలేదు. కవి యొక్క కావ్య నాయకుడు నిత్యం మేకప్ వేసుకునే ఒక సినీ హీరో కావచ్చు లేదా బ్యూటీ కాన్సియష్ ఉన్న దగ్గర మనిషి కావచ్చు అనిపించింది. పైగా ఏళ్లకేళ్ళుగా అంటూ పాతమనిషినే చూపించారు. క్షణ క్షణం పూసే భావాలు అంటూ రాగరంజితమైన మనసుని అద్దంలో చూపెట్టారు. చెప్పడమెలాగూ అని ఇక అనుకోవడం కూడా కుదరదని చెప్పెసేసారు. వైయుక్తికమైన తాత్వికత భావనలు బలంగా జొప్పించబడ్డ కవిత ఇది. ఈ కవిత చేరేవాళ్ళకి చేరితే బాగుండుననిపించింది.

భావోద్వేగం కనబడకుండా కవిత్వం అంటే ఇదీ చెప్పిన కవయిత్రిని నిలువెత్తు పూలవర్ష హర్షంతో అభినందిస్తూ 

                                                                                                               - ఓ పాఠక ప్రేమికుడు.

ఆ కవిత ..ఇదిగోండి

తాజాగా ...

కవిత్వం వ్రాయడానికి

కలమూ కాగితమూ కీ బోర్డ్ డిజిటల్ పేజీ యే కావాలా యిప్పుడు ?

ఆ గుబురు మీసాల క్రింద దాక్కున్న చిన్న చిర్నవ్వు ఆ గడ్డం నొక్కు

చంద్రకాంతిని గ్రోలి తూలి వెలిగే ఆ కళ్ళు

మేకప్ పొరలు దాయలేని

నుదిటి మీద మూడు అడ్డు గీతలు చాలవూ

ఆ చంద్ర బింబం లాంటి ముఖాన్ని రెండు అరచేతుల మధ్యకి తీసుకుని

కళ్ళలోకి కళ్ళు ప్రవహించిన క్షణాలని

అరంగుళం దూరంలో ఆపేసి భుజాలమీదుగా క్రిందికి సాగి

రెండు ముంజేతులను అందుకుని కళ్ళ కద్దుకోవడం కవిత్వం కాదూ ..

ఏళ్ళకేళ్ళుగా .. క్షణ క్షణానికి తాజాగా పూచే భావాలివి

నా అయిదో ఆకాశమా .

రానే కూడదు కానీ

వచ్చాక సౌందర్య సృహ అంటుకోనిదెపుడని

రాలినప్పుడు కానీ ఆగనిది ఈ మృదు మధుర కవనమని

చెప్పడమెలాగూ అనడం ఇక కుదరదని.