1, ఆగస్టు 2018, బుధవారం

తాజాగా స్పందన

తాజాగా .. కవిత్వ కథ పై ..... ఓ అభిమాన పాఠకుడి లేఖ. పాఠకులు keen observation లో ఉంటారని నా మెయిల్ కి వచ్చిన ఈ అభిప్రాయం చూసినప్పుడు తెలిసింది. 100% నా మనసులోని భావాలకి అనుగుణంగా వచ్చిన రివ్యూ యిది. stun అయ్యాను కూడా. ఈ పాఠకుడు నా మిత్ర బృందంలో వారే కావచ్చు. ఎనీ వే.. చాలా సంతోషం. ఈ లేఖపై ఉన్న దాన్ని యధాతధంగా ..టైప్ చేసి పోస్ట్ చేస్తున్నాను. గతంలో వాణి వెంకట్ ,సరళ మోహన్ ,మంజు యనమదల గారి లాగా ఈ అజ్ఞాత అభిమాని నాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు . బొమ్మదేవర నాగ కుమారి గారూ మీకు కూడా lot of thanks.

**********************

నేను ఫేస్ బుక్ లో ఎక్కువ సంచరించను. నచ్చినవి చదువుకుంటాను. నన్ను బాగా ఆకర్షించిన కవిత "తాజాగా " అనే కవిత గురించి నా మనసుకు అనిపించిన నాలుగు మాటలు.

అసలు కవిత్వమంటే ఏమిటీ అనే ప్రశ్నకు మృదువుగా ఇది కాదా కవిత్వం అంటూ చెప్పిన కవిత.

వ్రాసిన కవి వయసుని బట్టి చూస్తే తలలు బోడులవ్వును కానీ తలపులు బోడులగునా అన్న హాస్య సామెత గుర్తుకొస్తుంది.

నిజానికి ఈ కాలంలో రొమాన్సిజం తగ్గింది. స్త్రీ పురుషుల మధ్య సంభాషణల్లో సరస సల్లాపాలేమిటో తెలియదు. గిలిగింతలు పెట్టే సంభాషణల బదులు అధికారాలతో ఏరా, పోరా, నీ యమ్మ, దీనెమ్మ జీవితం ఇలాంటి పదాలతో ముతక భాషా సంభాషణలు నూతనంగా వర్ధిల్లుతున్నాయి. ఇకపోతే యువతీ యువతుల ప్రేమ కవిత్వమూ బాగా బాగా వర్ధిల్లుతుంది. కానీ మనసుని నిత్య యవ్వనంగా ఉంచే ఔషదం ఏమిటో చాలా మందికి తెలియదు. అది ఈ కవితలో చాలా వుంది. అలాగే ఈ కవిత గొప్ప దైర్యంతో నిజాయితీగా వ్రాసిన కవిత కూడా. పురుష కవులందరూ కావ్య నాయికల గురించి వ్రాసినప్పుడు స్త్రీ రచయితలు మాత్రం తమ కావ్య నాయకుడి గురించి చెప్పకూడదా ఏమిటీ అనిపిస్తుంది. నిజానికి యద్దనపూడి సులోచనారాణి గారిలాంటి రచయిత్రులు ఎప్పుడో ఆ పని చేసారనుకోండి. కవిత్వంలో నూతన ఒరవడి ఈ కవనంలో కనబడింది. అసలు ఈ కవితలో మధ్యభాగమంతా దృశ్యరూపమే. ఎంత లలితంగా మృదుత్వంతో స్త్రీ సహజమైన లాలిత్యంతో వ్రాసారో!

అసలే చంద్రబింబం లాంటి ముఖం అంట. ఆ ముఖంపై ముడతలనీ కవిత్వం చేసారు. వయసు మీద పడినప్పుడో ఆలోచనల్లో భ్రుకుటి ముడిపడినప్పుడో ఫాలభాగంపై ముడతలు కనబడతాయి ఎదురుగా ఉండి చూసేవారికి. చంద్రబింబం లాంటి ముఖంపై మూడు అడ్డగీతలూ అనడం కవి యొక్క సునిసత్వం కనబడుతుంది. చంద్రుని కాంతి గ్రోలి తూలి వెలిగే కళ్ళు చల్లని చూపులు అని చెప్పడానికి కవి వర్ణన అంత రమణీయ భావం ఒలికించడం సంతోషానికి గురిచేసింది. కళ్ళలోకి కళ్ళు ప్రవహించిన క్షణాలని అరంగుళం దూరంలో ఆపేసి అన్నారు. అలా ఆపేయడమంటే ఎంత దగ్గరతనముందో అంతకు మించి బిడియమూ సరిహద్దు రేఖ ఏదో చప్పున స్పురించడం వల్లో అరంగుళం దూరంలో ఆపేసి రెండు ముంజేతులను కళ్ళకద్దుకోవడం కవిత్వం కాదూ అన్నారు.వ్యక్తి పట్ల ప్రేమే కాదు బలీయమైన ఆరాధన ఉంటేనే ఆ ముంజేతులని కళ్ళ కద్దుకోవడం జరుగుతుంది. ఇక్కడ కవి భావన గౌరవంగా హుందాగా గొప్పగా కనబడింది. ఈ కవికి ఏది కవిత్వమో ఏది కవిత్వం కాదో బాగా తెలుసు. అలాగే గొప్ప స్క్రీన్ ప్లే కూడా తెలుసుననిపించింది. నాటక రంగంతో పరిచయముందేమో అనిపించింది.

అయిదో ప్రపంచమా అన్న సంభోధన పైనే అందరి దృష్టి మళ్ళింది కానీ మేకప్ పొరల మధ్య అన్నది ఎవరూ పట్టించుకోలేదు. కవి యొక్క కావ్య నాయకుడు నిత్యం మేకప్ వేసుకునే ఒక సినీ హీరో కావచ్చు లేదా బ్యూటీ కాన్సియష్ ఉన్న దగ్గర మనిషి కావచ్చు అనిపించింది. పైగా ఏళ్లకేళ్ళుగా అంటూ పాతమనిషినే చూపించారు. క్షణ క్షణం పూసే భావాలు అంటూ రాగరంజితమైన మనసుని అద్దంలో చూపెట్టారు. చెప్పడమెలాగూ అని ఇక అనుకోవడం కూడా కుదరదని చెప్పెసేసారు. వైయుక్తికమైన తాత్వికత భావనలు బలంగా జొప్పించబడ్డ కవిత ఇది. ఈ కవిత చేరేవాళ్ళకి చేరితే బాగుండుననిపించింది.

భావోద్వేగం కనబడకుండా కవిత్వం అంటే ఇదీ చెప్పిన కవయిత్రిని నిలువెత్తు పూలవర్ష హర్షంతో అభినందిస్తూ 

                                                                                                               - ఓ పాఠక ప్రేమికుడు.

ఆ కవిత ..ఇదిగోండి

తాజాగా ...

కవిత్వం వ్రాయడానికి

కలమూ కాగితమూ కీ బోర్డ్ డిజిటల్ పేజీ యే కావాలా యిప్పుడు ?

ఆ గుబురు మీసాల క్రింద దాక్కున్న చిన్న చిర్నవ్వు ఆ గడ్డం నొక్కు

చంద్రకాంతిని గ్రోలి తూలి వెలిగే ఆ కళ్ళు

మేకప్ పొరలు దాయలేని

నుదిటి మీద మూడు అడ్డు గీతలు చాలవూ

ఆ చంద్ర బింబం లాంటి ముఖాన్ని రెండు అరచేతుల మధ్యకి తీసుకుని

కళ్ళలోకి కళ్ళు ప్రవహించిన క్షణాలని

అరంగుళం దూరంలో ఆపేసి భుజాలమీదుగా క్రిందికి సాగి

రెండు ముంజేతులను అందుకుని కళ్ళ కద్దుకోవడం కవిత్వం కాదూ ..

ఏళ్ళకేళ్ళుగా .. క్షణ క్షణానికి తాజాగా పూచే భావాలివి

నా అయిదో ఆకాశమా .

రానే కూడదు కానీ

వచ్చాక సౌందర్య సృహ అంటుకోనిదెపుడని

రాలినప్పుడు కానీ ఆగనిది ఈ మృదు మధుర కవనమని

చెప్పడమెలాగూ అనడం ఇక కుదరదని.






కామెంట్‌లు లేవు: