30, జూన్ 2012, శనివారం

లవ్ ఫర్ ఎవెర్


ఒకనాడు ......

వలపు సంద్రంలో మునిగాక
తలపుల చిత్తడి ఆరేదెక్కడ
నేను నీ వశమై,పరవశమై
వేడుకోళ్ళుకి కరిగి వీడుకోలు చెరిగి
కాలాలు తరిగి ... ప్రే మికులుకి ఇవి నిత్య నూతనమేమో !

వేరొకనాడు..

స్మృతిపథంలో...
హృదయ లయ తప్పిన క్షణం
మనసులు ముడివేసుకున్న తరుణం
ఎడబాటు లో వేసారి యెద కృంగిన వైనం
నిట్టూర్పుల వేదన లో గ్రహించిన మోసం
ఆశలు అన్నీ దోచుకుని వెళ్ళిన ద్రోహం
వెల్లువై ముంచెత్తే జ్ఞాపకాలలో తడిసి పోతూ..

ఎల్లప్పుడూ..

ప్రేమైక జీవన నాదం
ఆనాటిది, యీ నాటిది, యే నాటిదీ
ప్రేమ మాత్రం పురాతన మైనది !

29, జూన్ 2012, శుక్రవారం

మనసులొకటే


తడచి బరువెక్కిన రెప్పలు ఎత్తి చూసాను
ఎదురుగా ఉన్న రెండు కళ్ళ నిండానూ దుఃఖ చారికలు
అవును మరి ..
రెండు కళ్ళకీ కలలు,కన్నీళ్లు ఒకటే
కష్ట -సుఖాలు రెండు మనసులకు సమానమే!


28, జూన్ 2012, గురువారం

మా "వాఘ్య"

అన్ని జన్మలకన్న ఉత్కృష్ట మైన మానవ జన్మ ఎత్తిన మనం ఇతర జీవుల పట్ల భూతదయ కల్గి ఉండటం చాలా మంచిది.అవసరం కూడా

మనతో పాటు ప్రకృతిలోని అన్ని జీవులకు జీవించే అవకాశాన్ని మనం కల్పించాలి.ఒక వేళ అలా కల్పించలేకపోయినా వాటి జీవన విధానానికి మనం భంగం వాటిల్ల నీయకుండా  ప్రక్కకు తొలగి వెళ్లిపోవాలి.

చాలా మంది ఇతర జీవుల పట్ల చాలా దయతో ప్రవర్తిస్తుంటారు.అలాటి వారిని చూసి నేను మనఃస్పూర్తిగా హర్షిస్తూ ఉంటాను.

 "మాలాకుమార్" గారి సాహితీ బ్లాగ్లో "మా వీధి మహారాణి కి పురుడొచ్చింది " చూసి వచ్చిన తర్వాత గుండె బరువెక్కింది.

అందుకు కారణం  మా "వాఘ్య"

"వాఘ్య" అంటే మరాఠా యోధుడు చత్రపతి శివాజీ పెంపుడు జంతువు. విశ్వాసానికి,స్వామి భక్తి కి నిదర్శనం.." వాఘ్య" శివాజీ మరణించిన తర్వాత అతని చితి మంటలలో దూకి తన స్వామి భక్తి ని చాటుకున్న కుక్క "వాఘ్య"

నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. ఛత్రపతి శివాజీ చరిత్ర అంటే మరీ ఇష్టం.

ఆ ఇష్టం వలనే.. మేము పెంచుకుంటున్న కుక్క పిల్లకి "వాఘ్య" అని పేరు పెట్టాను.

మేము పెంచుకోవడం అనేకంటే మా అబ్బాయి "నిఖిల్ చంద్ర " ప్రేమగా పెంచిన "వాఘ్య" అంటే బాగుంటుంది.

మా అబ్బాయి చాలా సున్నిత మనస్కుడు. తనకి మొక్కలన్నా,జంతువులన్నా వల్లమాలిన ప్రేమ.

నాకు పెళ్ళై  అత్తవారింటికి వెళ్ళే టప్పటికి మా ఇంట్లో రెండు "భైరవ"లు ఉండేవి.

ఒక దాని పేరు రాజు. రెండవది "నాన్సీ" (నాన్సీ రీగన్ ప్రభావం ఏమో..మావారు దానికి అలా నాన్సీ అని పేరు పెట్టారు)

ఈ రెండు మా ఇంటికి సింహాలవలె కాపలా .కాసేవి. చీమ చిటుక్కుమన్నా పసిగట్టి మమ్మల్ని జాగురుకత తో మేల్కొల్పేవి. మా పెయ్యలతోను,కోళ్ళ తోనూ కూడా ఆడుకునేవి . వాటి ఆటలు చూస్తే ఎంతొ సరదాగా ఉండేవి కూడా.

"రాజు" అయితే రాజు లాగే ఉండేది . ఇంత పొడవుగా ఉండేది. వెన్ను విరిచి నిలబడిందంటే..చూసేవాళ్ళకి పై ప్రాణాలు పైనే పోయేవి. వాటికి ఆహారం పాలు,అన్నం అప్పుడప్పుడు గ్రుడ్లు..అంతే!

అర్ధరాత్రుళ్ళు మా పొలం లో జొరబడి దొంగతనంగా అరటి తోటలో గెలలు నరుక్కుని వెళ్లేవారి పని పట్టాలన్నా  లేదా.. నీళ్ళ కాలువలకి అడ్డువేసి నీళ్ళు వాళ్ళ  పొలాలలోకి మళ్ళించు కునేవారిని గుర్తించాలనుకుని  యజమాని బయలుదేరి .. రాజూ ..వెళదాం . రా!  అనగానే అలా గస్తీ కి వెళ్ళేటప్పుడు.. యజమాని కన్న ముందే పరుగులు తీసి..వాళ్ళని నిలువరించేది. కదిలితే..కండలు ఊడిపోవాల్సిందే! అలాటి రాజు.ఏడెనిమిదే ఏళ్ళు మాతో ఒకరిగానే మెలిగేది. ఒకరోజు హటాత్తుగా మాయమయిపొయింది. చుట్టూ ప్రక్కల ఊర్లలో కూడా వెతికారు. ఎక్కడా కనబడలేదు. ప్రాణాలతో ఉంటే..మా రాజు.. ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్న తిరిగి వచ్చి ఉండేది. ఎవరో వచ్చి మత్తుమందు జల్లి బస్తాలో కట్టి వేసుకుని వెళ్లిపోయారని తర్వాత తెలిసింది. మా ఇంట్లో ఎవరు గ్రుక్కెడు మంచి నీళ్ళు త్రాగకుండా ఏడ్చి..ఏడ్చి..ఊరుకున్నాం.

ఇక నాన్సీ రాజు లేని దిగులుతో.. తొందరగానే చనిపోయింది.

తర్వాత మా ఇంట్లోకి మళ్ళీ పెంపుడు జంతువులని అంగీకరించలేకపోయాం కూడా.

మా అబ్బాయి కొంచెం పెద్దవాడు అయ్యాక తన చదువు కోసమని చెప్పి మా వ్యవసాయ క్షేత్రం ని వదిలి ఒక విలేజ్  లోకి షిఫ్ట్ అయ్యం. అక్కడ అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. మా అబ్బాయి రోజు గుడి దగ్గర వాలే పావురాళ్ళని చూసి తను పావురాళ్ళని పెంచుకోవాలని ఇష్టపడ్డాడు.సరే అని వాళ్ళ నాన్నగారు రెండు పావురాలని తెప్పించి పంజరాలు ఏర్పాటు చేయించి ఇచ్చారు. వాటికి ధాన్యం ఆహారం గా పెట్టేవాళ్ళం. బాగా అలవాటు అయ్యేవరకు పంజరంలోనే ఉంచి..బాగా అలవాటు అయ్యాయి అనుకున్న తర్వాత   బయటకి స్వేచ్చగా వదిలేసేవాళ్ళం. అలా పావురాల కువ కువలతో.. మా ఇల్లు సందడిగాను ఉండేది. కాస్త అపరిశుభ్రం గాను ఉండేది. అది నాకు అసలు నచ్చేది కాదు. ఒక విధమైన నీచు వాసన ..ఆ వాసన రాకుండా బోలెడంత శ్రమ పడాల్సి వచ్చేది. అందుకనే పంజరాలని మా ఇంటి బయట ఉన్న నూరు వరహాల చెట్టుకి వేలాడదీసాను.అందులో అప్పుడప్పుడు మాత్రమే ఉండి..ఎక్కువ సేపు క్రిందనే తిరిగేవి.

మా అబ్బాయి స్కూల్ నుంచి రావడం వాటిని చేతుల్లోకి తీసుకోవడం..వాటికి కబుర్లు చెప్పడం,ధాన్యం వేయడం..ఇలా పొద్దంతా గడిపెసేవాడు. హోం వర్క్ లు చేయకుండా అలా చేస్తే ఊరుకుంటానా..! బాగా కోప్పడే దానిని.

ఒకరోజు తెల్లవారేసరికి రెండు పావురాళ్ళు విగత జీవులై పడి ఉన్నాయి.ఇక మా అబ్బాయి ఏడుపు చూడలేము.అలా ఏడ్చాడు అన్నమాట.. పావురాళ్ళ మరణం కి కారణం ఏమంటే అర్ధరాత్రి ఒక పిల్లి కోడి పిల్లలని తినడానికి వచ్చి అవి దొరకక పావురాళ్ళ పై దాడి చేసి మెడని కొరికేసి చంపేసింది.

ఇది జరిగిన కొన్నాళ్ళకి మా ఇంటి వెనుక భాగంలో బాడుగ కి ఉండే ఓ..ముస్లిం కుటుంబం వారికి పెద్ద ఆల్షేషియన్ డాగ్ ఉండేది. వాళ్ళ కుటుంబానికి దానికి ఆహారం పెట్టడం తలకి మించిన భారం అయ్యేది. ఆ ఆల్షేషియన్ డాగ్ కి వాళ్ళు పెట్టె ఆహారం చాలక చాలా కోపంతో.. కట్టేసిన గొలుసులని కూడా తెంచేసి  మీద పడేది. ఓ.. నాలుగు అడుగుల పొడవు వంద కేజీలు బరువు ఉండేదేమో కూడా.. దానిని అదుపు చేయాలంటే చాలా కష్టం అయ్యేది.

ఆ కుక్క యజమాని ..నాకు ఒక విషయం చెప్పారు. మేము ఈ కుక్కని పెంచలేకపోతున్నాం..ఎవరికైనా ఇచ్చేద్దాం అంటే మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఆ కుక్క చూలింత కూడా. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు తీసుకుని దీని ని అమ్మేస్తాం. అప్పటి వరకు మీరు ఒక పూట ఆహారం పెట్టారా ..అని అడిగింది. నేను సరే నని ..ఆ కుక్కకి ఆహారం పెట్టేదాన్ని.ఓ..అరకేజీ బియ్యం నాలుగు గ్రుడ్డ్లు, వాటితో పాటు..ఓ..అరకేజీ మాంసం కూడా దానికి పెట్టాల్సి వచ్చేది. నేను తప్ప ఆ కుక్క సమీపం కి ఎవరు వెళ్ళేవారు కాదు. నేను ఆహరం పెడతాను కాబట్టి నన్ను ఏమి అనేది కాదు.
ఆ కుక్క..ప్రసవించి మూడు పిల్లలు పెట్టింది. రెండు ఆడ + ఒక మగ. పుట్టిన నాలుగు రోజులకి ఆడ కుక్క పిల్లలని ఒక్కోదానిని ఆరు వేల రూపాయలకి ఆ ముస్లిం కుటుంబం వాళ్ళు అమ్మేసుకున్నారు. ఇక మిగిలింది మగ కుక్క పిల్ల. (ఆడ కుక్క పిల్లలకి రేటు ఎక్కువట.ఉత్పత్తి కోసమేమో!)

మా అబ్బాయి రోజూ  ఆ కుక్క పిల్లని చూసి మురిసి పోయేవాడు కాని తల్లి కుక్కని చూసి భయపడి దగ్గరికి వెళ్ళేవాడు కాదు.

మనం ఆ బుజ్జి కుక్క పిల్లని పెంచుకుందాం అమ్మా ! అని అడిగాడు.ఆ బుజ్జి ముండని చూస్తే..నాకు ముద్దు వచ్చింది.అలాగే అన్నాను.నేను తల్లి కుక్కకి ఆహారం ఇవ్వడం మూలంగా నాకు ఆ బుజ్జి ముండని ఫ్రీగా ఇచ్చేసారు.
సాయంత్రానికి తల్లిని అమ్మేసారు. అలా తల్లిబిడ్డల రుణాన్ని కాష్ చేసుకోవడం బాధ అనిపించిది కాని..ఆ ఆల్షేషియన్ పెంచడం మాత్రం చాలా కష్తం  పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు..? అని బాధపడ్డాను

ఇక మా ఇంట్లో పెరిగే బుజ్జి కుక్క పిల్లకి "వాఘ్య" అని నామకరణం చేసాను. దానికి తల్లికి లా మాంసాహారం ఇవ్వకూడదనుకుని ఒక్క పాలు మాత్రమే అలవాటు చేసాం. అప్పటికి ఈ పెడి గ్రిల్ గట్రా ఉంటాయని నాకసలు తెలియదు.మా "వాఘ్య" కి స్నానం చేయించడం పాలు త్రాగించడం,దానిని ముద్దులాడటం మా అబ్బాయి వంతు.

"వాఘ్యా..అని పిలవడం ఆలస్యం.. పరుగులు పెట్టేది. నోరు తెరిచిందా  ఆపడం భలే కష్టం గా ఉండేది. వాఘ్యా..అన్న పేరు.. చాలా ఫేమస్.అయి కూర్చుంది అడిగిన వారికి అడగని వారికి అందరికీ వాఘ్య అంటే ఎవరో దాని స్వామి భక్తి ఏమిటో తెగ చెప్పేసేదానిని కూడా!. భలే పేరు పెట్టారండీ.వెదికి పెడతారు అన్న కాంప్లిమెంట్ వచ్చేది.  అది నాకు చాలా గర్వంగాను ఉండేది.

నెల్లూరు జిల్లాలో నవంబర్ మాసం అంటే..తుఫాను ల కాలం అన్నమాట. ఆ సంవత్సరం ఎడతెగని వర్షాలు కురిసాయి. నాకు విపరీతమైన జలుబు  ఎన్ని మందులు వాడినా కంట్రోల్ అయ్యేది కాదు. అప్పుడు డాక్టర్ అడిగారు..మీ ఇంట్లో పెంపుడు జంతువులూ ఉన్నాయా..? అని

నేను మా వాఘ్య గురించి చెప్పాను. అయితే దానికి దూరంగా ఉండండి అని చెప్పారు. అంతే! ఇక వాఘ్యకి మా ఇంట్లో ప్రవేశం లేకపోయింది. బయట వరండాలో కట్టేసే వాళ్ళం.వాఘ్య చిన్నది కాబట్టి దానికి టాయిలెట్ హాబిట్స్ ఇంకా బాగా అలవాటు కాలేదు. అనారోగ్యం వల్ల శుభ్రం చేయాలంటే నాకు చాలా చిరాకు వచ్చేది. అప్పట్లో చాలా మానసిక మైన ఒత్తిడి ఉండటం వల్లనేమో నేను ఎలర్జికల్ ఆస్తమా కి గురి అయ్యాను.

అందుకని "వాఘ్య" ని వరండాలో నే ఉంచడం వల్ల వర్షానికి తడచి పోయేది. వర్షపు జల్లుల నుండి తప్పించుకుని వర్షం పడని చోటున తలదాచుకోవడానికి నేను అవకాశం ఇవ్వలేదు. వాఘ్యాని గొలుసుతో బందించి వేసాను. అలా రెండు రోజులు తడచి దానికి జ్వరం వచ్చి కన్ను తెరవకుండా పడి ఉండేది. మా వారు పశువుల హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఇంజ్జక్షన్ చేయించారు. కానీ ఫలితం లేకపోయింది. "మా వాఘ్య" చనిపోయింది.

చనిపోయిన "మా వాఘ్య" ని చూసి ..మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు. నువ్వే.. శుభ్రం శుభ్రం అంటూ..వర్షంలో కట్టేసి..దానిని చంపేసావు..నువ్వే చంపేసావు.. నువ్వే చంపేసావ్ !! అని నన్ను పదే పదే కోపంగా,రోషంగా అన్నాడు.

నేను మనసులో ఎంతో.. ఏడ్చాను. (ఇప్పటికీ  ఆ విషయం తలచుకుంటే నాకు దుఃఖం ముంచుకొస్తుంది. ఇప్పుడు కళ్ళ నీళ్ళు కారుతున్నాయి) నేను తప్పు చేసానని అర్ధం అయింది. మా అబ్బాయి నన్ను నిందించడంలో తప్పు లేదనికూడా అనుకున్నాను.

జ్వరంతో..కళ్ళు తెరవకుండా ఉన్నప్పుడు కూడా.. వాఘ్యా.. అని పిలిస్తే..మెల్లగా కనులు విప్పి తోక ఊపి మళ్ళీ నీరసంగా కళ్ళు మూసుకున్న మా వాఘ్య నే గుర్తుకు వస్తూ ఉంటుంది. వాఘ్యని మరువడం నా వల్ల కాలేదు. (అంతర్లీనంగా దాని మరణం కి కారణం నేనే అని ఏమో)

మా అబ్బాయిని వాఘ్య మరణం నుండి బయటకి తీసుకు రావడం చాలా కష్టం అయింది. వెటర్నరీ డాక్టర్ వచ్చి .. వాఘ్య తల్లి కి వ్యాక్సిన్ సరిగా వేయించక పోవడం వల్ల వాఘ్య మాత్రమే కాదు..తనతోపాటు పుట్టిన పిల్లలు అన్నీ కూడా చనిపోయినవి ..అని చెప్పాక గాని .. కొంచెం శాంతపడినట్లు కనబడలేదు. వాఘ్య..వాఘ్య అని మాతో పిలిపించుకుని.. పసి దానిగా ఉండగానే మాకు దూరమైన వైనం నాకు చాలా  చాలా బాధాకరం.

నిజానికి పుట్టిన తర్వాత ఇమ్యునైజేషన్ కోసం వ్యాఘ్య కి వాక్సినేషన్ వేయించాలని కూడా నాకు తెలియదు. అలా జరిగిపోయింది అంతే!

మా అమ్మ..అనేవారు..ఈ ఇల్లు బాగో లేదమ్మా, బిడ్డ ముచ్చట పడి పావురాళ్ళు పెంచుకుంటే చనిపోయాయి,కుక్క పిల్లని పెంచుకుంటే అదీ చనిపోయింది. నీకు  కూడా ఆరోగ్యం సరిగా లేదు..అని బాధపడేవారు. నేను కూడా ఏమిటో ఇలా జరుగుతున్నాయని  భయపడ్డాను కూడా ! అప్పటి పరిస్థితి అది.

ఓ..రెండు ఏళ్ళ క్రితం కూడా మా అబ్బాయి..మనం కుక్కపిల్లని పెంచుకుందాం  అమ్మా  అని అడిగితె  నేను తీవ్రంగా వ్యతిరేకించాను.మన ఇంట్లో మరో వాఘ్య ని ఉండటం చూడలేను "వద్దు" అన్నాను.

"వాఘ్య " ని నేను మరువలేను. ఆ చిన్ని ప్రాణం మరణానికి నేను కారణం అయ్యానేమో అని నాకు తీరని వేదన.

మా అబ్బాయికి నేనెప్పుడు ఆ విషయంలో సారీ చెపుతుంటాను .

అలాగే ఏ మాత్రం భూతదయ లేకుండా ఓ..చిన్ని ప్రాణం పట్ల నేను చూపిన నిర్దయ.. నన్ను నేను క్షమించుకోలేనిది. వ్యక్తిగా నాలో ఉన్న ఈ లోపం నన్ను వెంటాడేది వేదించేది.

ఇలా పంచుకున్నందుకు.. బాధ నుండి నేను కొంచెం తెరిపిన పడ్డాను అనుకుంటూ...

స్వామి భక్తికి ,విశ్వాసానికి నిదర్శనం ఈ అసలైన "వాఘ్య"



27, జూన్ 2012, బుధవారం

ఎవరికీ వారే యమునాతీరే

జోరున వర్షం. హైదరాబాదీ వాసుల యిక్కట్లు చెప్పనలవి కాదు. నడిరోడ్లపై ప్రవహించే నీటికి దిశా లేదు,  పల్లం యెరుగదు. ఎక్కడికక్కడ ఆక్రమించేసుకుని  భవన నిర్మాణాలు చేపట్టిన  ఫలితం వల్ల తాగడానికి నీళ్ళు లేకపోయినా వానాకాలం మాత్రం నగరం నీళ్ళలో నానుతుంది. జనం విరక్తిలో నానుతారు. ఎప్పటికీ  తీరని సమస్య యిది అనుకుంటూ తిట్టు కుంటూ వానలో తడుస్తూనే యెలాగో యింటికి  వచ్చి పడింది శాంతి.
కాస్త సేదతీరి తన కొలీగ్ ప్రియ చెప్పిన  ఆమె  స్వీయ కథని  శాంతి వ్రాయడం మొదలెట్టింది

కథ పేరు "ఎవరికీ వారు యమునా తీరే''   అంతేనా  "

ఇంటికి వెళ్లేందుకు పార్కింగ్ ప్లేస్ లో నుండి బండి బయటకి తీసాడు రాజేష్. జేబులో సెల్ ఫోన్ మ్రోగింది. రింగ్ టోన్ బట్టి తల్లి ఫోన్  చేసిందని అర్ధమై బండి ఆపేసి ఫోన్ తీసి  "అమ్మా, బాగున్నావా, " అనడిగాడు.

నాకేం రోగం, దుత్తలాగా బాగానే వున్నాను. నువ్వెక్కడ వున్నావు? అడిగింది రాజేష్ తల్లి లలిత.

అమ్మకి లలిత అని  పేరు యెవరు పెట్టారో కానీ .. యే  అంబిక,చండిక అనో పేరు పెడితే సరిపోయేదని మనసులో అనుకుని.. నాకు ఆఫీస్ పని  అయిపోయింది. ఇప్పుడే యింటికి బయలదేరబోతున్నాను.

అయితే యెక్కడికి వెళ్ళకుండా త్వరగా యింటికి వచ్చేయి. నేను మీ నాన్నగారు మీ యింటికి  దగ్గరలో వున్న మీ నాన్నగారి ఫ్రెండింట్లో  జరిగే పంక్షన్ కి వస్తున్నాం అని చెప్పి పోన్ పెట్టీసింది.

రాజేష్ ఆ మాట విని కంగారు పడ్డాడు. అమ్మ యిప్పుడే రావాలా! ఇప్పుడేం  చేయాలి అనుకుంటూ వేగంగా  పది నిమిషాల లోపే  యింటికి  చేరుకున్నాడు.

రాజేష్ యింటికి  చేరేటప్పటికే.. అతని అమ్మ-నాన్న  పార్కింగ్ ప్లేస్ లో యెదురు  చూస్తున్నారు.
తలుపులు తెరిచి  లోపలకి రండమ్మా అన్నాడు. లలిత లోపలకి అడుగు పెడుతూనే యేమిటి యిల్లంతా యేదో నీచు వాసన వస్తుంది అంది.

రాత్రి వర్షంలో తడవడం వల్ల బట్టలు తడిచి పోయాయి. ఉదయం వాటిని వుతకక పోవడం వల్ల కొంచెం వాసన వేస్తున్నట్లున్నాయి అంటూ  కిటికీ తలుపులు తీసి మంచి నీళ్ళు కావాలా నాన్నగారు అని అడిగాడు. నేను తీసుకుని త్రాగుతానులే, అమ్మాయి వచ్చేటప్పటికి యెంత  సమయం పడుతుంది  అని అడిగారు.

నిన్న వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ . ఆఫీస్ నుండి యింటికి  వచ్చే సరికి నాలుగు గంటలు పట్టింది. ఈ రోజు ఎన్ని గంటలు పడుతుందో యేమో

ఈ లోపులో లలిత యిల్లంతా  వో చూపు చూసింది.ముఖం చిట్లించి  ప్రొద్దున్న యింటి పని యే౦ చేయలేదా, సింక్ నిండా అంట్ల గిన్నెలు, యెక్కడ చూసినా బట్టలు, ప్రక్క బట్టలు కూడా సర్ధకుండా యిల్లంతా శుభ్రం చేసుకోకుండా యే౦ వుద్యోగాలు చేయడం? కోడలు మరీ సాగించుకుంటుంది. వాకిలి తుడచి ముగ్గు కూడా పెట్టినట్లు లేదు.మా కాలం నాడు మేము యిలాగే  వుద్యోగం చేసామా, ఇంటా-బయటా చేసుకుని పిల్లలని స్కూల్ కి పంపించుకుని అన్ని సర్దుకుని వుద్యోగం చేయలేదా?

రాజేష్ యేమీ మాట్లాడలేదు. మీ ఆవిడ మరీ సాగించుకుంటుంది.ఇంతకీ వుదయం వంటైనా చేసిందా లేదా అని ఆరాగా అడిగింది.

ఆ..  చేసింది లేమ్మా ! తనకి కొంచెం జ్వరంగా వుండి టైం కి లేవలేకపోయింది.అందుకే అన్ని యెక్కడివి అక్కడ వదిలేసి పరుగులు పెట్టాల్సి వచ్చింది అని సంజాయిషీ యిచ్చుకుని .. ప్రిజ్ లో నుండి పాల పేకెట్ తీసి  కాఫీ కలపడానికి పాలు పెట్టి ప్రెష్ అవడానికి బాత్ రూం లోకి వెళ్ళాడు. రాజేష్ బయటకి వచ్చే సరికి స్టవ్ పై వున్న పాలు పొంగి స్టవ్ ఆరిపోయింది.

లలిత అలాగే కూర్చుని పేపర్ చూస్తుంది కాని పాలు పొంగిన వాసన గమనించినా గమనించనట్లే వుండిపోయింది.

రాజేష్ తల్లి వైఖరి గమనించాడు.తన మీద ప్రేమ కన్నా తన భార్య ప్రియ పై వున్న ద్వేష భావం వల్లనే తల్లి అలా మెలుగుతుందని అర్దమైనా  యే౦ మాట్లాడలేడు. మళ్ళీ కొన్ని పాలు పోసి స్టవ్ దగ్గరే నిలబడి ఆలోచన చేస్తున్నాడు.

కోడల్ని  వుద్యోగం చేయవద్దని  గృహ నిర్వహణ చూసుకోమని లలిత గారి అభీష్టం. ఎంతో కష్టపడి చదివి మంచి రాంక్ లు సాధించి వుద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని  మరచి పోయి సాధారణ గృహిణిగా వుండటం కుదరదని ప్రియ వాదన.

పైగా అత్తగారు వుద్యోగం   చేస్తూ తనని యింటికే  పరిమితమయి వుండాలని  అనడం ప్రియకి నచ్చలేదు.

ఒక్కడే కొడుకైనా యిద్దరి వుద్యోగాలు పేరిట సొంత యిల్లు వదులుకుని వాళ్ళు వొక మూల వీళ్ళు వొక మూల వేరు కాపురాలతో.. యిరుకు మనసులతో యెవరు యింకొకరితో కలవలేని అహాలతో అడ్డుగోడలు కట్టుకుని బ్రతకడం మామూలు విషయం అయిపొయింది. ఓ.. కప్ కాఫీ ఆతిధ్యంతో యెవరికి వారు యమునా తీరుగా యెవరి బతుకులు వారివి. కనీసం కలసి నప్పుడైనా మనఃస్పూర్తిగా మాట్లాడుకోలేని భేషజాలు.

జీవితం అంటే కొన్ని ప్రత్యేక  పరిస్థితుల్లో అవసరాలకి అనుగుణంగా కుదించుకుని బ్రతికేయడం అన్నమాట ..అనుకుంటూ ..కాఫీ కలిపి తల్లికి,తండ్రికి యిచ్చి తను ఓ..కప్ తెచ్చుకుని కూర్చున్నాడు.

ఆప్యాయంగా మాట్లాడుకోవడానికి మాటలు లేవు. మౌనం మధ్య పది నిమిషాలు గడచిపోయాయి. ఆవిడ యెప్పుడుకి వస్తుందో  వెళదాం పదండి.. అంటూ లేచి నిలబడింది లలిత.

అమ్మా, నాన్న గారు మళ్ళీ యిక్కడికే రండి, భోజనం చేసి వెళ్ళవచ్చు అని చెప్పాడు రాజేష్.

గురువారం నేను ఉపవాసం వుంటానుగా. మీ నాన్న గారిని మాత్రమే కోడలి చేతి వంటని తిని తరించమను. అంటూ నడచింది.

వాళ్ళని లిఫ్ట్ వరకు సాగనంపి తల్లి మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ..వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి సింక్లో వున్న గిన్నెలన్ని శుభ్రం చేసాడు. బెడ్ షీట్లు మార్చి యిల్లంతా శుభ్రం చేసాడు. డ్రయర్ లో వున్న బట్టలు తీసి తీగలపై ఆరేసాడు.

ప్రిజ్ లో యే౦ కూరలు వున్నాయో  చూసాడు. ఏవో నిన్న,మొన్నటి కూరలు రెండు కనిపించాయి.ఆ గిన్నెలు తీసి బయట పడేసి వెజిటేబుల్ ట్రే లో వున్న  వంకాయలు తీసి రెండు ఉల్లిపాయలు తీసి వాటిని నీట్ గా కట్ చేసి వంకాయ కూర చేసి అందులో పాలు పోసాడు. పాలు పోసి చేసిన  వేడి వేడి కూరంటే తండ్రికి చాలా యిష్టం అని కూడా అనుకున్నాడు.

ఇన్ని పనులు చేసినా ప్రియ  యింటికి చేరలేదు. ప్రియ త్వరగా  వస్తే బాగుండును. అమ్మ-నాన్న మళ్ళీ వచ్చేసరికి కూడా రాకుంటే అమ్మ ఆనే మాటలు వినడం కష్టం అనుకున్నాడు.

కుక్కర్లో రైస్ పెట్టి ప్రిజ్ లో నుండి తీసిన కూరలని ఆ కుక్కర్ లిడ్ పై జాగ్రత్తగా పెట్టాడు రైస్ అయ్యేటప్పటికి కూరలు వేడి పడతాయి. మూడు కూరలతో నాన్నకి భోజనం పెట్టిన ప్రియని తల్లికి పరిచయం చేయాలని రాజేష్ ఆశ.

ఆ ఆశ నెరవేరదు అన్నట్లు ప్రియకన్నా తల్లి తండ్రి ముందే వచ్చేసారు.

ఇల్లంతా తిరిగి చూసి పని అమ్మాయి కూడా లేదుగా,  యింటెడు పనంతా నువ్వే చేసావా అడిగింది ఆరాగా.

ఎంత వుద్యోగం చేసినా నీ చేత ఓ చిన్న పని కూడా చేయించలేదు. ఇప్పుడు పెళ్ళాం కోసం అన్ని పనులు చేస్తున్నావు? నీకు సిగ్గు లేదురా, అదేమన్నా మహా రాణిలా పెరిగి వచ్చిందా, యింత వాజమ్మవి అనుకోలేదు అని రుస రుస లాడింది.

లలితా యేమిటా మాటలు, మన యింట్లో  యిలాటి పనులు నేను చేయడం లేదా! ఇప్పుడు కొత్తగా రాజేష్ చేసినది యేముంది? భార్యాభర్తలు వుద్యోగాలు చేస్తుంటే  యిలాటి పనులు తప్పవు. నీకు మాత్రం సాగినన్ని రోజులు సాగాలేదా!  మా అమ్మ బ్రతికి వున్నంత కాలం నీకు యింటి పని చేసే పని లేకుండా తనే చేసి పెట్టేది. నాన్న మార్కెట్ కి వెళ్లి కూరలు, పచారి తేవడం వల్లనే కదా ముగ్గురు పిల్లలని పెంచి పెద్ద చేసాం అది మర్చిపొతే యెలా అన్నాడాయన.

ఆహా , పెద్ద చేసారు లెండి. వుద్యోగం చేసినా నేను యిలా మీతో యింటి పనులు వంట పనులు చేయించానా, ఈ తరం  వాళ్ళు మొగుడిని పెళ్లైన  గంటకే కొంగున ముడేసుకుని అడ్డమైన చాకిరి చేయించుకోవడం,కోరినవి సాధించు కోవడం చేస్తున్నారు.కాస్త హద్దు-అదుపు అక్కరలేదా? మగవాడు యింటి పని చేయడం యె౦త నామోషి. కాస్త యింగిత జ్ఞానం వుండవద్దూ . గోల్డ్ మెడల్స్ సాధించగానే సరా అని ఈసడించుకుంది.అయినా మన యింటి పనులతో పోల్చుకుంటే యీ పని వొక లెక్కా! ఈ పని కూడా చేయలేక యెక్కడివి అక్కడ పడేసి వెళ్ళడం హోటల్స్ వెంట పడటం ఈ కాలం వారికి అలవాటై పోయింది. అదేం పద్దతులో యేమిటో, యేమైనా  అంటే మేము సంపాదిస్తున్నాం.ఇంటా-బయట చేసే వోపిక లేదు అనడం నేర్చారు..అని  ఆపకుండా చదివేసింది.

ఈ మాటలు వింటూనే ప్రియ లోపలికి వచ్చింది.వస్తూనే  హోటల్ నుండి తెచ్చిన పేకింగ్ ని టేబుల్ పై పెట్టి అత్తమామాలని పలకరించి.. ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిందని చెప్పింది.

నువ్వు యెప్పుడు వస్తే యేమిటి లేమ్మా.. అరవ చాకిరి చేయడానికి మా పిచ్చి సన్నాసి వున్నాడు కదా! అన్నీ వాడే చేసేసాడు అంది లలిత.

ప్రియ మాట్లాడలేదు. జ్వరం తగ్గిందా, మధ్యాహ్నం  భోజనం చేసావా అని అడిగాడు రాజేష్. తల వూపి లోపలకి వెళ్ళింది. వెనుకనే రాజేష్ వెళ్ళాడు. అమ్మ మాటలు పట్టించుకోకు. ప్రెష్ అయి రా, నువ్వే వచ్చి వడ్డించు. లేకపోతే  అమ్మ మాటలకి అడ్డుకట్ట వేయలేం అని చెప్పి బయటకి వచ్చేసాడు.

ఓ పావు గంట తర్వాత వచ్చి .. భోజనం చేయండి అని పిలిచింది.లలిత కూర్చున్న చోటు నుండి లేవలేదు. మీ అత్తయ్య యీ పూట వుపవాసం లేమ్మా.. అని చెప్పారు రాజేష్ తండ్రి. అయితే టిఫిన్ చేయండి అత్తయ్యా.. అని అడిగింది. నాకు యేమి సహించదు. మీరు త్వరగా కానిస్తే మాదారిన మేము వెళతాం అంది

ప్రియ మనసు చిన్నబోయింది.

భోజనాలు వడ్డిస్తూ మామగారికి తను తీసుకు వచ్చిన "పరోఠా" లని వడ్డించింది.

రోజు యిలా హోటల్ తిండే తింటున్నారా  ఆరాగా అడిగింది లలిత.

లేదత్తయ్య గారు. రాజేష్ కి "పరోఠా" యిష్టం కదా! ఇక్కడ బస్ స్టాప్ దగ్గర హోటల్ లో యీ ఐటం చాలా స్పెషల్. అందుకే తెచ్చాను.

ఇష్టం అని చెప్పి రోజు వంట చేయకుండా  తప్పించు కుంటున్నావన్నమాట అంది లలిత.

ఆ మాటకి వొళ్ళు మండిపోయింది ప్రియకి .

అత్తయ్య గారు..యేమీ అనుకోక పొతే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఈ "పరోఠా" మీరు యింత  బాగా చేయగలరా, నా సాఫ్ట్ వేర్ వుద్యోగం మీరు చేయగలరా, యెవరి ప్రతిభ వారిది. యెవరి రంగాలు వారివి. ఇంట్లో యెవరు సాయం చేయకుండానే మీరు మీ డ్యూటీస్ సక్రమంగా చేసేసారా? మా పెళ్లి అయి రెండేళ్ళు అవుతున్నా మీరు నన్నింకా పరాయి దానిగానే చూస్తారు.సూటి పోటీ  మాటలు అంటారు.భార్య భర్తలు వొకరికొకరు పనులలో సాయం చేసుకోవడాన్ని తప్పుగా అనుకోవడంలో  మిమ్మల్నే చూస్తున్నాను. రాజేష్ కి యింటి పనులు చేయడం కొత్తేమి  కాదు కదండీ!  పెళ్లి కాక ముందు మా అబ్బాయి బంగారం,నాకు కష్టం వుండకూడదని యింటి పనులలో సాయం చేస్తాడు అని మురుసుకున్న మీ అబ్బాయే యివాళ పెళ్ళాంకి సేవలు చేస్తే  వాజమ్మ అయిపోయాడా,  మీరు ఒక రిటైర్డ్  టీచర్ . కుటుంబ సభ్యులందరినీ బెత్తం పట్టుకుని దండించినట్లే మాట్లాడతారు..మీరిలాగే వుంటే మన మధ్య బంధాలు కొనసాగవు కూడా అని  నిర్మొహమాటంగా చెప్పేసింది.

ఎప్పుడు యెదురు  మాట్లాడని కోడలు అలా మాట్లాడే సరికి లలిత దిమ్మెర పోయింది.

రాజేష్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడసాగాడు. విచిత్రంగా లలిత వైపు నుండి సౌండ్ లేదు.

వేగవంతమైన జీవన విధానంలో అన్నీ  మారిపోతున్నాయి. ఇంకా మా కాలంలో లాగానే ప్రతి పని మనం అనుకున్నట్టే జరగాలని పొద్దునే లేచి వాకిలి వూడ్చి  ముగ్గులు పెట్టాలని,స్నానం చేసే వంట చేయాలని,భర్త తిన్నాకే భార్య తినాలని యిలాటివన్నీ కుదరదని మీకు తెలియదా, మీరు అత్తగారు ఆనే రోల్ నుండి బయటకొచ్చి మరో స్త్రీ లాగా  ఆలోచించి చూడండి. మీ అబ్బాయి  వెన్నుముక లేకుండా  యింటి పనులు చేస్తున్నాడని అనుకోవడం చాలా విచారం. మీ అమ్మాయిలని అయితే మీరు అలా అనగలరా అని అడిగేసింది ప్రియ.

మగవాళ్ళ పెదవులపై  బిగబట్టిన నవ్వు.

మీలా ప్రతి అత్త యిలాగే  అనుకుంటే  వో రెండు తరాల వెనక్కి స్త్రీల జీవితాలు వెళ్ళినట్లే.  మనం చదువుకున్నది, సాధిస్తున్నది సమానత్వం కోసం మాత్రమే కాదు కుటుంబం కోసం కూడా.  మీరది అర్ధం చేసుకోవాలి.

లలిత మూతి తిప్పి వెళ్ళడానికన్నట్లు లేచి నిలబడింది.

  ప్రియ కూడా  లేచి నిలబడి "సంవత్సరానికి తొమ్మిది  లక్షల జీతాన్నివదులుకుంటే మీలో అత్తరికం శాంతిస్తుందా, నాకు వచ్చిన గోల్డ్ మెడల్స్ అలంకార ప్రాయంగా గోడకి వేలాడుతుంటే మీ పెద్దరికం గౌరవింపబడుతుందనుకుంటున్నారా? నేను యింటి  పనులు, వంటపనులకే పరిమితమైతే ఓ అచ్చమైన గృహిణిని అనిపించుకోవడమే అయితే  నేను యింత చదువుకోవడం, పనిలో నైపుణ్యం పెంచుకోవడం కోసం యితర దేశాలు వెళ్ళడం అవసరం అంటారా? వుద్యోగం అవసరమో కాదో యెవరికీ వారు ఆలోచించుకోవాలి. అదే వుద్యోగం చేయడం అభిరుచి మాత్రమే అయితే కాదనడం యె౦తవరకు భావ్యమో మీరూ ఆలోచించాలి" అంది ప్రియ.

అంతా వింటున్న రాజేష్ తండ్రి కల్పించుకుని "అమ్మాయి ప్రియా ! మీ యిద్దరు కూడా మీ ఆలోచనలు మార్చుకోవాలి. అప్పుడే మనది వొక కుటుంబం అవుతుంది.లేకపోతే  యెవరికీ వారే యమునాతీరే " అని చెప్పారు

ఎవరి ఆలోచనలో వారు.. యెవరి దారిలో వారు నేతిబీరకాయలో నెయ్యంత  కుటుంబ అనుబంధాలు .

ఇంతకీ అత్త కోడలు యెవరు యెవరిని మార్చారు?

తెలిసి చెప్పలేకపోతే వెయ్యి అక్షర తిట్లు తప్పవు అని బుర్ర హెచ్చరించింది. ఆ తిట్లుకి సిద్దపడే ఈ కథకి ముగింపు చెప్పడంలేదు శాంతి. తేల్చి వ్రాసేయడానికి అదేమన్నా తేలికైన విషయమా యేమిటీ!?

26, జూన్ 2012, మంగళవారం

బిడ్డ ముచ్చట్లు

నిన్న ఉదయం ..మా అబ్బాయి కి కాల్ చేసాను. (మిస్సుడ్) రెండు మూడు సార్లు అలా కాల్ చేస్తే కానీ .. కాల్ చేయలేదు.

ఏం
.. నాన్నా! ఎలా ఉన్నావు..?అని యోగ క్షేమాలు అన్నీ అడిగిన తర్వాత..

చిన్నీ
..! వారం పైనే అయింది నువ్వు కాల్ చేసి. ఫ్రెండ్స్ కి పేస్ బుక్ లో లైక్ లు,కామెంట్స్ పెట్టె సమయంలో....రెండు నిమిషాలు కేటాయించి "అమ్మకి కాల్ చేయ వచ్చును కదా!" చాలా స్మూత్ గా అడిగాను.

"అబ్బా.. అలా మాటలతో.. చివాట్లు పెట్టకమ్మా! కొత్త ప్లేస్ కదా..బిజీగా ఉన్నాను." అని చెప్పాడు.

అమ్మ
-నాన్న కూడా బిజీగానే ఉంటారు. పిల్లలని మాట్లాడించ కుండా ఉండగలరా!
అంటూనే.. చిన్నప్పుడే నయం వారం వారం ఒక ఉత్తరం వ్రాసేవాడివి అని చెప్పాను.

సరే ఉత్తరాలు అలా ఉండేవి. మా అబ్బాయికి అప్పుడు అయిదు సంవత్సరాలు. మేము నెల్లూరు దగ్గర ఉండేవాళ్ళం.
మా అబ్బాయి మా చెల్లి దగ్గర విజయవాడ లో ఉండి చదువుకునేవాడు.

అప్పుడు
అలా ఉన్న అబ్బాయి ఇప్పుడు ఇలా ఉండటం కొత్తేమి కాదు లోకానికి విరుద్దం కాదుకాని...
ఎందుకో.. అలా గుర్తుకు వచ్చింది.

బిడ్డలు
దూరంగా ఉన్నప్పుడు వారి చిలిపి చేష్టలు, సరదా మాటలు.. తలచుకోవడం ....తీయని అనుభూతి.
మాటలు, చేష్టలు మధురాతి మధురం. తన చిన్నప్పటి విషయాలు నేను చెపుతూ ఉంటే.. ఇంకా చెప్పు ,ఇంకా చెప్పు ..అంటూ.. పదే పదే చెప్పించుకుని నవ్వుకోవడం తనకి ఇష్టం.

ఇప్పుడు
నీకు చెప్పడం ఏమిటీ!? తర్వాత మీ పిల్లలకి కూడా కథలు కథలుగా వర్ణించి చెప్పనూ.. అంటూ దీర్ఘం తీసి మరి చెపుతాను.

అయితే
ఇప్పుడే నీ బ్లాగ్ లో వ్రాసేయి.. విషయాలు.. ఈ విషయాలు నీ బ్లాగ్ చూసి మరి తెలుసుకుంటారు అని అడిగాడు.

అలా అన్నాక కాదనగలనా!?

ఒక
సరదా విషయం.

ఒకసారి
.. మా అబ్బాయిని ..కోపంగా "దున్నపోతు" అని తిట్టాను.

అప్పుడు
ఏం మాట్లాడలేదు కానీ.. కాసేపు ఆగిన తర్వాత ..'అంబా ,అంబా..అంటూ పిలవడం మొదలెట్టాడు.

ఏమిటి
.. పిలుపులు అసహ్యంగా..అన్నాను నేను.

మరి
నువ్వేగా..ఇందాక "దున్నపోతు" అన్నావు. మరి నేను ..అంబా..అంబా అనేకదా పిలవాలి ..అని చెప్పాడు.

నేను
ఒకటే నవ్వు. అమ్మో.. పిల్లాడి దగ్గర ఇలా నోరు పారేసుకోకూడదు అని లెంపలు వేసుకున్నాను.

ఇంకో
సరదా విషయం.

ఒకసారి
తన పిక్స్ ఆన్లైన్ లో పంపాడు. పిక్స్ చూస్తూ.. ఉన్నాను.

ఎలా
ఉన్నాయి అమ్మా..పిక్స్ అని అడిగాడు.

ప్రకృతి
దృశ్యాలని కెమెరాలో బంధించడం తనకి చాలా ఇష్టం. ప్రకృతి దృశ్యాల కన్నా.. మా అబ్బాయి ఫొటోస్ నే నేను చూసుకుంటున్నాను.

మళ్ళీ
అడిగాడు.. పిక్స్ ఎలా ఉన్నాయమ్మా! అని .

నేను
చాలా బాగున్నాయి అని చెప్పి కాకి పిల్ల కాకికి ముద్దు..అన్నాను.

నాతో
..చాట్ చేస్తూనే..కాసేపటి తర్వాత "చెప్పు కాకి ..ఇంకేమిటి విషయాలు? "అని అడిగాడు.

మళ్ళీ
ఒకటే నవ్వులు.

ఇలాటి
విషయాలు చాలా ఉండేవి.
మా అబ్బాయి ఉంటే ..ఇల్లంతా చైతన్యమే!

అప్పుడప్పుడు
..కొంచెం డల్.. అంతే!

ఎందుకో
.. రోజు.. చాలా బాగా అబ్బాయి గుర్తుకువస్తున్నాడు.

2009
లో అనుకోకుండా వరదలు సంభవించినప్పుడు.. వరద తాకిడికి గురైన ప్రాంతాల ప్రజల ఇబ్బందులు విని
మేము సహాయం చేయాలనుకున్నాం. కారు తీసుకుని మా బాబు నేను, ఇంకొక ఇద్దరం కలసి వెళ్ళాము. మా వంతుగా
రెండు క్వింటాల్ బియ్యం.. డెబ్బయి జతల బట్టలు క్రొత్తవి కొని.. కృష్ణా తీర ప్రాంతంలో కొల్లూరుకి సమీపంలో లంక ప్రాంతంలో వరదకి గురయిన గ్రామాన్ని ఎన్నుకుని అక్కడ వరద భాదితులకి మా చేతనైన సాయం చేసాం.

సమయంలో ..కొందరికి మాత్రమే సాయం అందటం చూసి.. మిగతా అందరికి కూడా హెల్ప్ చేస్తే బాగుండేది కదా అమ్మా..అంటూ తను తెగ ఫీల్ అయ్యాడు.

అలాగే
"రాజోలి' ప్రాతం లో వారికి తన పుట్టిన రోజు సందర్భంగా నగదు సాయం పంపించాము.

జెమిని
మ్యూజిక్ ద్వారా..(జయతి ప్రోగ్రాం వెన్నెల ద్వారా) మూడు వేల సాయం అందించాను.

ఇంకా
మన వంతు సాయం చేయాలమ్మా.. ఆనే నా బిడ్డకి భగవంతుడు.. శక్తి ఇస్తాడని నా నమ్మిక.

ఇబ్బందుల
లో ఉన్న వారికి తన వంతు సాయం చేయాలనుకునే సుతి మెత్తని హృదయం కల..మా ఇంటి దీపం.. మా అబ్బాయి గురించి కొన్ని ముచ్చట్లు ఇవి.

తన
సుతిమెత్తని హృదయం వల్ల అపాత్ర దానం చేసి తను ఎక్కడ ఇబ్బంది పడతాడేమో అని .. అమ్మ దిగులు.


చిన్నప్పుడు నాకు ..వ్రాసిన ఉత్తరాలు. తన వయసు అప్పుడు అయిదేళ్ళు అప్పటి ఫోటో నే..క్రింది ఫోటో.




25, జూన్ 2012, సోమవారం

ఏమనిపిస్తుంది !?


ఈ చిత్రం ని చూడండి.

మనం చట్టసభల కి పంపుతున్నది వీరినా..?

మనం చాలా ఆలోచించాలి కదా!

సరే ఈ చిత్రం .. చూడండి.

చిత్రం .. "ప్రజాసాహితీ "మాస పత్రిక ముఖ చిత్రం ఇది.

ఈ చిత్రం చూసి నేను చాలా ఆలోచించాను.

మనం ఏం చెయ్యలేమా!?

శతకోటి ప్రశ్నలు..

మరి ఈ చిత్రం చూసిన మీకు ఏమనిపిస్తుంది !?

24, జూన్ 2012, ఆదివారం

అమ్మాయి ..లా ల లా ల లా లా


అమ్మాయి ఉంటుంది ఒక రంభలా..
అనుకున్నాను అందరిలాగే ఆమె ఒక అబల
ఏడిపించడానికి చూశాను నేను ఒక గుడ్లగూబలా
కానీ తెలుసుకున్నాను ఆత్మ రక్షణ విద్యలో ఆమె ఒక సబల
అంతే, దూకింది నా పైకి అంబలా
వాయించింది నా వళ్ళంతా తబలా
( ఈ రోజు ఓ..బస్ స్టాప్లో ఈవ్ టీజర్స్ ని చూసి వచ్చి సరదాగా ఓ..ఆశు కవిత )

21, జూన్ 2012, గురువారం

మా ఊరి గర్వకారణం

ఈ రోజు ఉదయం మాములుగా న్యూస్ పేపర్ ఓపెన్ చేసాను. అప్పుడప్పుడు వ్యాపార సంస్థల పరిచయాలతో కూడిన ప్రకటనా పత్రములు (పాంప్లెట్ ) దర్శనమిస్తూ ఉంటాయి కదా ! ఆ మాదిరే ఒక పాంప్లెట్ దర్శనమిచ్చింది. ఆ పాంప్లెట్ చూడటం తోనే నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయినాయి. దరహాసం ముంచుకొచ్చింది. పాఠశాలల పునః ప్రారంభం అయి పదిహేనురోజులు కావస్తుంది. ఈసారి ప్రభుత్వ పాఠశాల ల ఫలితాలు కూడా ప్రేవేట్ పాఠశాల ఫలితాలతో పోటీ పడుతున్నాయి. ఆ విషయాన్ని తెలియజేస్తూ.. ప్రభుత్వ పాఠశాల లు కూడా ప్రకటనల ద్వారా ఇంటింటికి ప్రచారం చేసుకోవలసి వచ్చింది. అందుకే నేను ఆ పాంప్లెట్ ని చూసి అలా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఆ పాఠశాల ఫలితాలు చూడండి. ఈపాఠశాల నుండి కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ నారాయణ, టి.క్రాంతికుమార్, రమాదేవి (ఈనాడు రామోజీరావు గారి భార్య) పరిటాల ఓంకార్.. ఇలా చాలా మంది ఈ పాఠశాల నుండి వెళ్ళినవారే! ఆ పాఠశాల మా వూరి పాఠశాల .. కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల లు కూడా ఉత్తమ ఫలితాలు అందిస్తూ.. విద్యార్ధులని (తల్లిదండ్రులని ) ఆకర్షించుకోవడానికి ఇలా ప్రకటనలు ఇచ్చుకుంటూ ఇంటింటికి పరిచయం చేసుకోవడం కించిత్ బాధాకరం అయినప్పటికీ ఆంగ్ల మాధ్యమ విద్య పట్ల ఆకర్షణ కల్గిన తల్లిదండ్రులకు ఫలితాలని తెలియజేసి పైసా ఖర్చు లేకుండా మీ పిల్లలకి చదువు ని అందించే ప్రభుత్వ పాఠశాల లని ఉపయోగించుకోండి. ప్రభుత్వం ప్రజలకి అందించే సేవలని వృధా కానీయకండి. పాఠశాలలు నిర్వహించే సొమ్ము కూడా ప్రజలదే అని చెప్పడం కూడా నేమో! ఏమైనా మా వూరికి గర్వకారణమైన ఈ పాఠశాల గురించి నేను చెప్పడం కన్నా ఫలితాలు తో పాటు మిగిలిన ప్రత్యేకతలు చూడండి. మా అత్తమ్మ, మావారు,ఇంకా మా కుటుంబంలో ఇంకో ఇద్దరు ఈ పాఠశాల విద్యార్ధులే !

19, జూన్ 2012, మంగళవారం

కావ్య ఆయుధం


మోహన సహజంగా దైర్య వంతురాలు. చిన్న చిన్న విషయాలకి పెద్దవైన సమస్యలకి కూడా భయపడదు.

స్త్రీలు సుకుమార హృదయులు అంటారు. ఆ సుకుమారం కావాల్సి వస్తే ఆమె శరీరంలోనూ,ఆమె ప్రవర్తన లోను, మాటలోనూ, మనసులోనూ పువ్వు
లా మెత్తనైన సుకుమారమే వుంటుంది. చాలా విషయాల్లో వజ్ర కఠోరమైన మనసు ఉంటుంది.

ఆమె మొండి మనిషి. ఒక విషయానికి ప్రాముఖ్యతనిస్తే అదే విషయానికి కట్టుబడి వుంటుంది.అలాగే తన ఆలోచన తప్పని తెలిస్తే యితరుల ఆలోచన కూడా మంచిదని అనిపిస్తే తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. అటువంటి ఆమెకి ఒక సమస్య వచ్చి పడింది.

ఇంట్లో టీవి పెడితే అందులో ధారావాహిక హత్యోదంతాలు, సీరియల్స్ లో తుపాకులు పట్టుకుని తిరిగే లేడీ విలన్లు, కొట్టుకోవడాన్ని యె౦జాయ్ చేస్తూ ప్రోత్సహిస్తూ వుండే లాగా వస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే వొడలంతా వణుకు ముంచు కొస్తుంటుంది.

హింస నట్టడవుల్లో కాదు, తుపాకీ గుండ్ల శబ్ధం దేశ సరిహద్దుల రక్షణలో కాదు నడిమింట్లోనే వున్నట్లు వుంటుంది.

ఆమెకి హింస అంటే అంతులేని భయం. చాప క్రింద నీరులా జనజీవితాలని కబళించే హింస ప్రక్కనే భయం భయంగా బ్రతుకుతున్నట్లు వుంటుంది. కన్ను తెరిస్తే హింస. కన్ను మూసే దాక తప్పదా? అనుకుంటుంది.

మనసుకైన గాయం,శరీరానికైన గాయం యేదైనా గాయం గాయమే కదా! తక్కువో,యెక్కువో గాయం చేసిన బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదా  అనుకుంటుంది.

మోహనకి హింస అంటే నిజంగా భయమే! ఎవరైనా చిన్న పిల్లని చిన్న దెబ్బ కొట్టినా బేలగా మారిపోతుంది.

మోహన చిన్నప్పుడు ఆమె తండ్రి తల్లి రాజేశ్వరిని చీటికి మాటికి కొడుతుండేవాడు. ఆమె మౌనంగా భరించేది.అలాగే తల్లి కాకుండా కొంత మంది తల్లి లాటి ఆడవాళ్ళు నోటికి పనిచెప్పి గయ్యాళితనాన్ని అపాదించుకున్నారు. పాపం భర్త కొడితే కొట్ట గలరా, తిడితే యెదురుగా తిట్టగలరా? వాళ్ళ అణువూ అణువూ ప్రతివతా లక్షణాలని బోధించి బోధించి అత్తవారింటికి పంపిన పెంపకమాయే! మొగుడు తిడితే పడాలి,కొడితే పడాలి. వాళ్ళు లేనప్పుడు ఆ కోపాన్ని పిల్లలపై ప్రదర్శించాలి, ఇతరులపై గయ్యాళి తనం ప్రదర్శించాలి. అంతే తెలుసు.

అవన్నీ చూస్తున్న మోహన యె౦దుకు వీళ్ళంతా మొగుడి అహంకారాన్ని భరిస్తారు.రోకలి బండ తీసుకుని తిరిగి కొడితే ఏమవుతుంది అనుకునేది. నేనైతే యిలా వుండను,ఇలా పడను గాక పడను 
మనసులోదృఢంగా అనుకుంది    

ఆలాంటి రోజులు ఆమెకి రానే వచ్చాయి. ముందు తరాన్ని చూసి చూసి మోహన తన కాలంకి కాస్త నోరు పెగిలే దైర్యం వచ్చింది. బానిసత్వాన్ని, మొగుడి దౌష్ట్యాన్ని, వ్యసనాలని భరించాల్సి రావలసిన అవసరం లేదని తెలుసుకుని ప్రశ్నించడం మొదలెట్టింది. అక్కడా మొగుడి అహంకారమే కనబడింది. అతని కర్కశ పాదాలకి ఆమె దేహం బలి అయ్యేది. రక్తం ధారలై కారేది, మొగుడిని చూస్తే భయం కల్గేది. బేలగా, దైన్యంగా మారిపోయేది. చీటికి మాటికి కళ్ళల్లో కన్నీళ్లు కాపురం చేసేవి.

తనని హింసించిన వాడిని కత్తితో పొడిచి చంపాలని అనుకుంది. కానీ ఆమె ఆ పని చేయలేక పోయేది.వాడు సృహ తప్పేలా కొడుతున్నా,అందుబాటులో కత్తి ఎదురుగా కనబడుతున్నా పొడిచి చంపేయాలనే కక్ష  వున్నాకూడా ఆ పని చేయలేక భరించేది. ఏళ్ళ తరబడి భరించి భరించి మొగుడి నుండి దూరంగా పారిపోయింది.

మోహన కి ఓ కూతురు ఉంది. ఆ పిల్ల పేరు కావ్య.  ఇప్పుడు ఆ పిల్లకి ఆత్మ విశ్వాసం, చదువు-ఉద్యోగం వున్నాయి.

తల్లిలో పేరుకుని వున్న భయాన్ని చూస్తే బాధ. టప్ మన్న చప్పుడు వినబడితేనే భయం తో వణికి పోతుంది. ఎవరినో కొడుతున్నారు  అనేది. అలాటి దృశ్యాలు చూడకుండా,కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యం కాదు కనుక టీవిని త్యజించేసింది.

మోహన కూతురు కావ్యకి పెళ్లి అయింది. ఆ పెళ్ళికి ముందు అబ్బాయి గుణ గణాలు విచారించి జాగ్రత్తలు తీసుకుని మంచి అబ్బాయి అనుకుని నమ్మకం కుదిరిన తర్వాతే పెళ్లి జరిపించారు. అయినా సంవత్సరం లోపులోనే అల్లుడు అమ్మాయి పై చేయి చేసుకున్నాడు.రక్తం కళ్ళజూచాడు, ఎముకల డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం తెప్పించాడు. ఇక సాక్ష్యం లేకుండా  మనసుకి తగిలిన గాయాలెన్నెన్నో!

ఒక రోజు అల్లుడిలోనూ మొగుడు అనే అహంకారాన్ని కళ్ళారా చూసిన పాపానికి మోహనలో భయం రేగింది. పిచ్చిదయిపోయింది.

ఓ గదిలోకి వెళ్లి గడియ వేసుకుని కూర్చుంటుంది. పురుషుడిని యెవరిని చూసినా భయం. అమ్మో! వాడు చంపేస్తాడు,రక్తం కారేటట్లు కొడతాడు. ఇదిగో చూడు నా తల పగిలిపోయింది. నా చెవి తెగిపోయింది నా పళ్ళు వూడిపోయాయి. నాకు యిలాంటి మొగుడు వద్దు, ఇంకెవరికి వద్దు, వద్దు వద్దు..అసలు ఆడవాళ్ళకి మొగుడేవద్దు అని తనలో తనే మాట్లాడుకుంటుంది.

కావ్యా!  నీ మొగుడిని కత్తితో పొడిచి చంపేయి. ఎన్ని తరాలు భరిస్తాం ? అని ఆ చీకటి గదిలోనుండే అరుస్తుంది, ఏడుస్తుంది. ఆ మాటలు విన్న బయటవాళ్ళు పాపం పిచ్చి పట్టింది అనడం కావ్యకి వినబడింది. తల్లి దాక్కున్న గది ముందుకి వెళ్లి తలుపు తట్టింది. మోహన తలుపు తీయలేదు.
ఇంకో ప్రక్కకి వెళ్లి కిటికీ తెరవబోయింది ఆ కిటికీ కూడా తెరుచుకోలేదు.

అమ్మా!తలుపు తీయమ్మా! అని పిలిచింది. తలుపు అయితే తీయలేదు కాని మోహన కూతురితో ఇలా చెప్పింది. 

"కావ్యా! నీకు నా రాత రాకూడదని అనుకున్నాను. తరాలు మారినా ఆడదాని తలరాత మారలేదే తల్లీ! మొగుడుని తిడితే తిడతారేమో కాని కొడితే కొట్టలేరు.అది క్షమా గుణమేమో, బలహీనతేమో!"

మొగుడు అనేవాడు నోటికి పని చెపుతాడు,కాలికి పని చెపుతాడు,చేతులకి పని చెపుతాడు. ఇంకా వేటికైనా పని చెపుతాడు. ఇవన్ని మొగుడి బలం యేమో! అబల శరీరం అలాటివన్నీ వోర్చుకోగలదా? మనసు గాయపడకుండా ఉంటుందా ?

నేను యీ హింసని చూడలేను , చూడలేను చచ్చిపోతాను, నేను చచ్చి పోతాను. పొగిలి పొగిలి యేడుస్తుంది.హృదయవిదారకంగా యేడుస్తుంది. తల్లి యేడుపు యుగ యుగాల బానిసత్వం లో నుండి వుబికి వస్తున్న గంగా ప్రవాహంలా తోచింది. మండుతున్న అగ్ని పర్వతం నుండి వెదజల్లబడుతున్న లావాలా తోచింది.

స్త్రీల పై అత్యాచారాలకి పాల్పడేవాళ్ళు , హత్యలకి పాల్బడే వాళ్ళు ఆమెని శారీరక బలహీనమైనదిగా భావించి అలా చేయగలరు అంటే వొప్పుకోలేము. స్త్రీకి  తన  మాన ప్రాణాలపై దాడి జరుగుతున్నప్పుడు మానసికంగా బలహీనమైపోతుంది. ఆ మానసిక బలహీనత పైనే వాడు దెబ్బ కొట్టి తనకి కావలసిన విధంగా జులుం విసురుతాడు.  ప్రవర్తిస్తాడు.  నేను మానసికంగా బలహీనం కాకూడదు. అప్పుడే శారీరకంగా బలహీనం కాలేను. ఈసారి నా భర్త కొడితే నేను వుపేక్షించ లేను అని ఆలోచించసాగింది కావ్య. కాసేపు ఆగిన తర్వాత అనుకుంది.

అవును, మొగుడు దాష్టీకాన్ని భరించాల్సిన అవసరం యేముంది? అతను కొడితే కొట్టనవసరం లేదు,తిడితే తిట్టనవసరం లేదు.చంపాల్సిన వసరం లేదు.మరో రాజేశ్వరి, మరో మోహన లా ఈ తరం స్త్రీ గా నేను అలా వుండకూడదు నా చేతిలో ఒక ఆయుధం ఉంది. అది చట్టం ఆనే ఆయుధం.చట్ట సహాయం తీసుకుంటాను న్యాయ దేవతకి మొరపెట్టుకుంటాను. వ్యవస్థ పై నాకు నమ్మకముంది. అదే నా ఆయుధం అనుకుంది. ఆ దిశగా కదిలింది.

18, జూన్ 2012, సోమవారం

కాళ్ళ చెప్పు కరుస్తాది

ఇరవయ్యి రోజులపాటు ఉత్తరభారత దేశ  తీర్ధయాత్రలు చేసి  ఆ రోజే ఇంటికి తిరిగి వచ్చారు సుగుణమ్మ.
ఆమెనింటికీ తీసుకురావడానికి రైల్వే స్టేషన్ వరకు ఎదురెళ్ళలేదు కాని తిరిగి తిరిగి వచ్చిన ఆమెకి ఏ పని భారము మోపకుండా కాస్త విశ్రాంతినిచ్చి ప్రయాణాల అలసటని తీర్చుకోనిచ్చేద్దాం అనుకుంది కోడలు.

ఇంట్లోకి అడుగు పెడుతూనే హాల్లో ఆమెకి కనిపించిది ఓ పెద్ద పనస కాయ.

ఒక దుప్పటిని ఎక్కువ మడతలు వేసి నేల తగలకుండా జాగ్రత్తగా పెట్టారే  అనుకుని "పనసకాయ ఎక్కడిది.? కొన్నారా? ఎంత తీసుకున్నారు " అడిగింది కోడలు హేమ ని .

"కొనలేదు అత్తయ్య గారు ..సురేష్ వచ్చాడు, వాడు తెచ్చాడు." చెప్పింది హేమ.

"సురేషా !? ఎవరు వాడు?"  అడిగింది..గుర్తుకు రానట్లు,

"అదేనండీ.. మన ఇంట్లో పని చేసేవాడే..ఆ సురేష్.." అని చెప్పింది హేమ.

"వాడా..దిబ్బాడా? వాడెప్పుడు వచ్చాడు? ఎంత పెద్ద పనస కాయ తెచ్చాడు? మన చేలో చెట్టుకి  కాసిన కాయా..? " ఆశ్చర్యంగా అడిగింది.

"అవునంట అత్తయ్యగారు. మొన్న మదర్స్ డే రోజు వచ్చాడు.ఓ..రెండు గంటలు కూర్చుని వెళ్ళిపోయాడు. పెద్దామె  .. ఉంటే బాగుండేది..ఆమెని చూసి చాలా ఏళ్లయిందని చాలాసార్లు అనుకున్నాడు కూడా "  చెప్పింది హేమ.

"అవునా..!" అంటూ  మొహం చేటంత చేసుకుందావిడ.

"ఎంతైనా అక్కడ వాళ్ళందరికీ మనమంటే చాలా అభిమానం" ..అని చెప్పిఅంతలోనే  "ఇటువైపు ఎందుకొచ్చాడంట దిబ్బోడు? అంది ఆరాగా.

"వాడిప్పుడు కార్ డ్రైవర్గా పని చేస్తున్నాడంట. వాడు పని చేసే ట్రావెల్ ఏజన్సీ నుండి బాడుగకి ఒక కారు ఈ టౌన్ కి వచ్చిందట. ఆ రోజు మద్రాస్ కి పోవాల్సి ఉన్నా కూడా ఆ డ్యూటీకి నేను వెళతానని సురేష్ ఇటువైపు వచ్చాడట. వాడిప్పుడు ..ఎంత దర్జాగా ఉన్నాడో! చక్కటి మాట తీరు ..చూస్తే వాడెక్కడో..మారు మూల పుట్టి పెరిగాడనుకోరు." అంది హేమ.

"అంతేగా మరి ప్రపంచం చూస్తే ఎన్ని విషయాలు తెలుస్తాయో! ఈ ఇరవయ్యి రోజులు తిరిగితేనే  నాకు బోలెడు తెలిసింది అట్టాంటిది వాడు రోజు ఊర్లేమ్మట తిరుగుతుంటే ఎందుకు నేర్చుకోడు" అంది.

 మళ్ళీ మాటాడుతూ "మన వూర్లో అందరు బాగున్నారటనా!? ఏం కబుర్లు చెప్పాడు దిబ్బోడు? "అడిగింది.

"మీరు వాడినింకా "దిబ్బోడు" అనడం మానరా? వాడు వింటే ఇప్పుడింకా బాధపడతాడు.." చెప్పింది.

"చచ్చాడులే!ఎలా పిలిస్తే ఏమైంది? వాళ్ళు లేబరోళ్ళు, లేబర్ ని లేబర్ గానే చూడాలి, నెత్తి కెక్కించు కోకూడదు " అని విసురుగా అంది.

"ఇక్కడంటే అన్నారు గాని  ఇంకెక్కడైనా  ఇప్పుడు మీరన్న మాటని నలుగురిలో అన్నారనుకోండి.చాలా ఇబ్బందులు వస్తాయి "..అని భయం ప్రదర్శించింది.

"ఎందుకనను! ఎక్కడైనా, ఎప్పుడైనా అంటాను " అంది డంకా మోయిన్చినట్లు.

అత్త గారిని మార్చడం నావల్ల కాదని మనసులో అనుకుని "సరే స్నానం చేసి రండి. భోజనం చేసి కాసేపు పడుకుంటే బాగుంటుంది మీకు  " అంది

భోజనం తిన్నాక అత్తగారిని కాసేపు పడుకోమని చెప్పి ..ఓ పుస్తకం తీసుకుని చదువుకుంటూ కూర్చుంది.

ఆ సాయంత్రం పనసకాయని బయటకు జేర్చి ..పదునైన చాకుకి నూనె పట్టించి పనస కాయని కోసి తొనలు తీసి ఓ..గిన్నెలో వేస్తూ సురేష్ ని గుర్తు చేసుకుంది.

అప్పుడు వాడికప్పుడు పదేళ్ళ వయసు . హేమ వాళ్ళింట్లో పనికి కుదిరాడు. మూడవ తరగతి చదువయిపోయిన తర్వాత సెలవల తర్వాత వచ్చిన ఏరువాక పౌర్ణమికి పనికి వచ్చాడు.

వాడిని చూసి వీడు.. మరీ చిన్న పిల్లవాడు. తమ ఇంట్లో పని చేయ గలడా!? అనుకుంది. అయినా పాపం చదువు మానిపించి పనిలో పెట్టడం ఏమిటీ ? అని అనుకుంది.   అంతా చిన్న వాడు పని చేయడం హేమకి నచ్చలేదు.

వాడిని ఏం పేరు..అడిగింది ..హేమ.. "సురేష్..అమ్మా..! చెప్పాడు. చిన్న చిన్న పనులు చెప్పడం మినహా వాడికి పెద్ద పెద్ద పనులు చెప్పడం నచ్చేది కాదు. వాడు మాత్రం పశువులకి నీళ్ళు పెట్టడం, మేత వేయడం, పేడ దీయడం తో పాటు.వాకిళ్ళు ఊడ్చి కల్లాపు చల్లడం,పంపు కొట్టి  తొట్లలో నీళ్ళు నింపడం,అంట్లు తోమడం పనులుతో పాటు ఆ పనులు అయ్యాక .. పచ్చి గడ్డి కోయడం కూడా చేయాల్సి వచ్చేది.అలా పోద్దస్తమాను పనులు చేయడంతో పాటు..రాత్రి ఎనిమిది తొమ్మిది దాక ఉండి..ఇంట్లో మగ వాళ్ళందరికీ పొయ్యి పై నీళ్ళు కాసి బకెట్లతో నీళ్ళు తోడి బాత్ రూమ్లలో పెట్టడం కూడా వాడి వంతే !

పాపం చిన్న బిడ్డ! వాడికి ఎంత పని భారం అనుకునేది. వాడికి పని సాయం చేస్తుంటే.. పని వాళ్ళని పని చేయనీయకుండా "ఇదే సగం పని చేసి వాళ్ళని పని చేయనీయకుండా నేర్పుతుంది" ఇంకెందుకు అన్ని పనులు నువ్వే చేయి..వాడిని పనిలో నుండి తీసి పారేస్తే సరి" అంటూ  భర్త,అత్తా గారు కలసి మాటలాడుకునే వాళ్ళు.

"మన బిడ్డ మీద ఒక అయిదారేళ్ళు పెద్ద. పాపం వాడు అన్ని పనులు చేయడం కష్టం కదూ!" అనేది.

సురేష్ ని అందరు "దిబ్బోడా" అని పిలిచే వాళ్ళు. ఆ పేరు తో పిలిచి నప్పుడల్లా వాడికి కోపం వస్తున్నట్లు తోచేది. వాడికి సురేష్ అని పేరు ఉంది. అయినా ఎవరు ఆ పేరు తో పిలిచే వాళ్ళు కాదు.

వాళ్ళ అమ్మకి అయిదుగురు కొడుకులు.సురేష్ మూడవవాడు.వాడి పుట్టుకప్పుడు..వాడి అమ్మ నొప్పులు పడుతూ బహిర్భూమికి వెళ్లాలని బయటకి వచ్చి ఎరువు దిబ్బ దగ్గరకి వెళ్ళేటప్పటికి ..అక్కడే వాడు పుట్టడం వల్ల వాడికి దిబ్బాడు అన్న పేరు స్థిరపడిపోయింది. స్కూల్ లో వేసిన తర్వాత అటెండెన్స్ పిలిచే టప్పుడు అయ్యవారు వాడిని పేరుతొ పిలవడం,లేదా వాడితో మాట్లాడే టప్పుడు పేరు వాడటం వాడికి పరమానందంగా ఉండేది.

ఇప్పుడు హేమ కూడా వాడిని దిబ్బోడా.. అని పిలవకుండా సురేష్..అని పిలవడం చేస్తుంటే..ఆ పిలుపు విన్నప్పుడల్లా వాడి కళ్ళల్లో కాంతులు కనబడేవి హేమకి.

తన నాలుగేళ్ల కొడుకు కూడా తమ ఇంట్లో అందరిలా వాడిని దిబ్బోడా అని పిలవడం చేస్తుంటే.."తప్పు వాడిని అలా పిలవకూడదు. వాడి పేరు సురేష్.. నువ్వు వాడిని సురేష్ అని పిలవాలి" అని చెప్పేది.

రాత్రి ఏడు గంటలవుతున్నప్పుడు కథల పుస్తకాలు,బొమ్మల పుస్తకాలు కొడుకు ముందు పరచి తనకి చదువు నేర్పుతుంటే సురేష్ ఆసక్తిగా చూసేవాడు. వాడికి నాలగవ తరగతి పుస్తకాలు తెప్పించి ..చదువుకోమని చెప్పేది. వాడు ఆ పుస్తకాలు చదవడం మానేసి చిన్న బాబుకి చెప్పే రైమ్స్,కథలు ఆసక్తిగా వినేవాడు.

స్కూళ్ళు తెరిచే రోజులు వచ్చేసాక ..ఆ ఊళ్ళో ఉన్న బడిలో ఉన్న ఒకే ఒక అయ్యవారు.. ఇంటింటికి తిరిగి పాత వాళ్ళని బడికి రమ్మని పిలవడం, కొత్త వాళ్ళని చేర్చడం తో పాటు.. రోజు బడికి రాని వాళ్ళని వెదుక్కుంటూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం బడికి రాని పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి..పిల్లలని సరిగా పంపి చదువుకోనివ్వమని హిత బోధ చెయ్యడం చేసేవారు.

ఆయనలో మంచితనం, బాధ్యత తో కూడిన ఉద్యోగ నిర్వహణ చూసి ఆ అయ్యోరంటే హేమకి చాలా గౌరవం ఉండేది.

"ఏం సార్.. ఓపికగా వూర్లో పిల్లకాయల్ని వెదికి  వెదికి బడికి తోలుకుని పోతా ఉండారు.." అనేది హేమ.

"అమ్మా! ఈ మాత్రం అయినా పిల్లల వెంటబడి చదువు చెప్ప కుంటే ఈళ్ళ బతుకులు మారేదేట్టాగా తల్లీ.. తీసుకునే జీతం రాళ్ళకి న్యాయం చేయడమే కాదు..అజ్ఞానాన్ని తరిమేయడం కోసరం మన వంతు మనం ఏమైనా చేయాలి కదమ్మా.." అనేవారు.

మారు మాట్టాడకుండా నమస్కారం పెట్టి తలవంచి అభివాదం చేసింది హేమ.

"సురేష్ ని కూడా బడికి తీసుకుపోండి సార్.." అని చెప్పింది.

"నేను చెప్పి చూసాను హేమమ్మా.. అందుకు వాళ్ళ అమ్మ ఇట్టా చెప్పింది "అయ్యవారు.. వాడు పనికి పోకపోతే వాడి కూడు పెట్టె పరిస్థితి  మా ఇంట లేదయ్యా. మా ఆయన ఏ పని పాట చేయకుండా సోమరిగా మంచాన్ని అంటిపెట్టుకుని పడుకుంటే నేనేడ తెచ్చిపెట్టేది!? ఏటా బాలింతని..చూలింతని..అని చెప్పిందమ్మా ! ఇంక మాట్లాడే దానికి ఇషయం ఏముందమ్మా ! కనీసం ఇకనైనా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిచుకునేందుకు అయినా ఒప్పించినా నయం. కడుపుకింత కూడు,ఒంటికి ఇంత గుడ్డ, ఆలోచించడానికి నాలుగచ్చరాలు లేని సంతతిని దేశం మోసే పరిస్థితులు నుండి కాపాడిన వాళ్ళమయినా అవుతాం "అని చెప్పారు..

చాలా కాలం వరకు ఆ అయ్యోరు చెప్పిన మాటలే గుర్తొచ్చేవి హేమకి.

డ్రాప్ ఔట్స్ ఎందుకు ఉంటున్నారో.. తెలిసి కూడా ఏ విధమైన చర్యలు చేప్పట్టలేని ఆసక్తతకి బాధ కల్గేది. పేరుకి  మాత్రమే ఉన్న విద్యా కమిటీల తీరు తెన్నులు ఏ పాటివో కూడా తెలుసు. మన వంతు మనం ఏం చేస్తున్నాం ? అని ప్రశ్నించుకునేది. 


తమ ఇంట్లో అందరు చదువుకున్న వాళ్ళే! పదేళ్ళు ఉన్న పసి వాడిని పనికి పెట్టుకోకూడదు, పెట్టుకున్నా వాడి చేత అడ్డమైన చాకిరి చేయించకూడదన్న ఇంగిత జ్ఞానం లేనందుకు బాధపడేది. . .

పదేళ్ళు కూడా నిండని సురేష్ చదువుని పని రాక్షసి మింగేస్తునా ఎదురు చెప్పలేని ఇల్లాలితనం హేమది. కనీసం వాడి చదువుకి బ్రేక్ పడకుండా ఉండాలని చూసేది.

రాత్రి పూట అందరూ టీవి చూస్తుంటే వాడి దృష్టి టీవి మీదకి మళ్ళ కుండా నాలుగవ తరగతి పుస్తకాలు చదవించాలని విఫల ప్రయత్నం చేసేది.

వాడు పుస్తకాలు ముందేసుకుని మూసుకు పోతున్న కళ్ళని బలవంతంగా తెరుచుకుంటూ.. చదువుతూ ఆలాగే పడి నిద్ర పోయే వాడు. రాత్రి తొమ్మిదవుతుండగా సురేష్ తండ్రి వచ్చి వాడిని నిద్ర నుండి లేవదీసుకుని పోయేవాడు.ఒకోసారి అక్కడే వదిలేసి పోయేవాడు.

హేమ అత్తగారయితే..వాడు అక్కడే పడి నిదరపోయినా మరుసటి రోజు పనిలోకి ఆలస్యం కాకుండా ఉదయాన్నే పని చేయడం మొదలెడతాడు కదా అని చూసి చూడనట్టు ఊరుకునేది.

ఒకోసారి వాడు హాల్లో అలా నిద్రపోతుంటే నడిచేటప్పుడు కాళ్ళకి అడ్డుపడుతున్నాడని వాడిని కాలితో తట్టి లేపేది. అది చూసి హేమకి చాలా కోపం ముంచుకోచ్చేది వాడు ఏమన్నా పశువా.. లేదా ప్రాణం లేని బండా? కాలికి అడ్డం వచ్చిందని కాలితో తన్ని పక్కన తోయడానికి అనుకునేది. ఆడవాళ్ళలో సున్నిత హృదయం ఉంటుందంటారు. నలుగురు బిడ్డలని కన్న తల్లి. వేరొక బిడ్డని కాలితో తన్నే కరకుతనం ఈమెకి ఎలా వచ్చిందోనని  ఆశ్చర్యం,అసహ్యం రెండు కల్గేవి హేమకి. మనిషి తనం, మనసు తనం లోపించి..కరకురాతి గుండె  అత్త గారిది అనుకుంది  


ఆమెని చూసో లేక వాళ్ళ ఇంట నిమ్న కులస్థుల పట్ల అలాటి వివక్ష ఉండేదో..కాని ఇంట్లో అత్తగారు ఆమె కొడుకులు అలాగే ప్రవర్తించే వాళ్ళు. హేమ భర్తతో పోట్లాడేది. నోటితో చేసే పనికి మీరు కాళ్ళు ఉపయోగిస్తారు అది ఎంత తప్పో మీకు తెలియదా? అని అడిగేసేది.

"అవును మరి మీ ఇళ్ళల్లోలా పని చేసేవాళ్ళని పిన్నమ్మా అని, అత్తా అని పిలిచే అలవాటు మాకు లేదు"  అని ఎగతాళి చేసేవాడు భర్త.

హేమ వాళ్ళ పుట్టింట్లో..బట్టలుతికే చాకలమ్మని పిన్నమ్మా అని పిలవడం,పక్కింటి గౌడ కులస్థులామెని అత్తా అని పిలవడం అలవాటుగా ఉండేది. తమకన్నా పెద్దవాళ్ళని పేర్లతో పిలవలేక వరసలు పెట్టి పిలవడం చేసే వాళ్ళు అది చాలా పల్లెల్లో అలవాటు కూడా. ఆ విషయాన్ని పోల్చి చెప్పి ఎగతాళి చేస్తున్నారని అర్ధమై వాళ్ళతో వాదించడం దండుగ అనుకుని మౌనంగా ఊరుకునేది.

హేమ కొడుకు దిబ్బోడా ..అని పిలుస్తుంటే తప్పని ఒక్క సారి చెప్పింది .మళ్ళీ ఎప్పుడు అలా పిలవనే లేదు. 


తల్లి ఏది నేర్పితే పిల్లలు అదే నేర్చుకునే తీరతారు.తమ మాట విన్నా వినకపోయినా మంచి మాట చెప్పడమయినా చేయక పొతే ఎలా? తల్లికి ఏం తెలుసు, తల్లి చెపితే పిల్లలు వింటారా అనుకుంటే ఎలా..? పిల్లలకి  మంచి చెడు వివరించి చెప్పడం తల్లి యొక్క భాద్యత మొక్కగా ఉన్నప్పుడే వంచే ప్రయత్నం చేయలేదు కాబట్టే తన భర్త కాళ్ళతో ముఖం పై కొట్టి తన వికృత్వాన్ని ప్రదర్శించేవాడు. ఇదంతా అహంకారం కాక ఇంకేమిటి తల్లికి తగ్గ తనయులు అనుకునేది.

ఇక సుగుణమ్మ అయితే అంట్లు శుభ్రంగా తోమలేదని,వాకిలి శుభ్రంగా చిమ్మలేదని వాడిని తిట్టిపోసేది. గిన్నెలు విసిరి కొట్టి మళ్ళీ చేసిన పనినే చేయించేది. చద్దన్నం,పచ్చడి మాత్రమే వాడికి ఎల్లప్పుడూ వేసేది. హేమ వాడికి అన్నం పెట్టినప్పుడు మాత్రం ఇంట్లో చేసినవి అన్ని వేసి కడుపు నిండా భోజనం పెట్టేది. అది గమనించి "నువ్వుసలు వాడికి అన్నం పెట్టబాకు"  అని కసిరేది. కొడుకుకి పిర్యాదు చేసేది. ఒరేయ్ అబ్బాయి.. లేబర్ వాళ్ళని నెత్తికి ఎక్కించుకోవద్దని నీ పెళ్ళాం కి చెప్పు. అప్పుడకది.. బాగా పెట్టేది..నేను పెట్టకుండా మాడ్చేదాన్ని అయ్యానా..! అని సాధించి పెట్టేది.

హేమ అవన్నీ పట్టించుకునేది కాదు. అలా నాలుగేళ్ళు పాలేరుగా పని చేసి.. తర్వాత సురేష్ రావడం మానేసాడు.

హేమకి తెలుసు సురేష్ తండ్రి తను చేసిన అప్పు తీర్చడం కోసం వేరే చోట ఎక్కువ జీతానికి పనికి కుదిర్చాడని.. పోన్లే!వాడికి కొత్త చోటులో కాస్త పని భారం అయినా తగ్గుతుంది..అనుకుంది.

ఆ తర్వాత ఒక ఏడాదికి అక్కడి నుండి వేరొక చోటుకి హేమ వాళ్ళు దూరంగా వచ్చేసారు.

అప్పుడప్పుడు ఎవరి ద్వారా నయినా పల్లెలో కబుర్లు తెలుస్తూ ఉండేవి. సురేష్ ఇళ్ళలో పాలేరు పనులు చేయడం మానేసి ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నాడని ..నెమ్మది నెమ్మదిగా కారు డ్రైవర్ గా మారాడు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో.. సంతోషంగా ఉన్నాడని

ఒక రోజు ఇంటి అడ్రస్స్ వెదుక్కుని మరీ వచ్చాడు సురేష్. వాడిని చూసి హేమకి చాలా సంతోషం కల్గింది.
ఒరేయ్..ఎంత ఎదిగి పోయావురా..? నాకు నిన్న మొన్నటి సురేష్ లాగానే ఉన్నావంటూ వాడిని ఆత్మీయంగా భుజం మీద చరచి తన సంతోషాన్ని ప్రకటించింది.

"అమ్మా.. చాన్నాళ్ళ నుండి రావాలనుకుంటున్నాను. ఇదిగో ఇప్పటికి కుదిరింది. అబ్బయ్య బాగున్నాడమ్మా! నాయుడెక్కడి వెళ్ళాడు? పెద్దామె ఏది? కనబడలేదు  అంటూ వరుస ప్రశ్నలు.

"అన్ని ప్రశ్నలు ఒకేసారికి అడుగుతా ఉంటే.. నేను జవాబు చెప్పేది ఎట్టాగురా..!? నువ్వేమి మారలేదు "అంటూ నవ్వి " అందరు బాగున్నాం రా! నాయుడు నెల్లూరు లోనే కదా ఉండాడు. పెద్దామె యాత్రలకి వెళ్ళింది. ఇక అబ్బయ్య వేరే దేశంలో  చదువుకుంటున్నాడు కదా ! " అని చెప్పింది.

"ఏమిటిరా ! మన వూరి కబుర్లు. అందరూ  ఎలా ఉన్నారు..? అంటూ పేరు పేరునా అడిగి తెలుసుకుంది.అప్పుడప్పుడు మన ఊరిని చూస్తుంటానురా" అని చెప్పింది. "ఈ మధ్యన నువ్వు మన వూరికి రానేలేదు కదా..ఎట్టా చూసినావు అమ్మా.."అడిగాడు.

ఇదిగో చూడు అంటూ.. ఇంటర్ నెట్ ఓపెన్ చేసి .గూగుల్ మాప్ లో వాళ్ళ ఊరుని చూపించింది. మీరు డాబా ఇల్లు కట్టుకున్నారు కదూ ! అంటూ ఇదిగో .ఇదేనా అంటూ చిత్రం ని పెద్దది చేసి చూపింది. అంత చిన్న పెట్టెలో తన ఇల్లు కనబడటం చూసి  సంతోషిస్తూ "ఇప్పుడు పోన్ ల లో కూడా ఈ మాదిరి కనబడుతుంది కదమ్మా.."   అన్నాడు సురేష్.

"అవును రా.. గుప్పిట్లో ప్రపంచం కనబడుతుంది "అని నవ్వింది. "అబ్బయ్యతో మాట్లాడతావా..? "అంటూ.. కొడుకు కి పోన్ కలిపి.. "మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు!" అంటూ పోన్ సురేష్ కి ఇచ్చింది.వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నాక "మనం మళ్ళీ మాట్లాడుకుందాం "అని కొడుకుకి చెప్పి ..సురేష్ కి  ఇంట్లో ఉన్న డబ్బాలు అన్ని వెదికి వెదికి తినే దానికి పెట్టింది. "నువ్వు ఇవి తింటా ఉండు. నేను వంట చేస్తాను "అంటూ పనిలో పడింది.

సురేష్ హేమ వెంట వంట ఇంటి గుమ్మంలోకి వచ్చి నేల మీద చతికిల బడ్డాడు.

"చెప్పరా ..ఏమిటి విశేషాలు? " అని అడిగింది.

"అమ్మా.. అబ్బయ్యని బాగా పెంచినావు. ఈ పాలి నన్ను సురేష్ అని కూడా పిలవలేదు.." ఏమి అన్నా బాగున్నావా? అని అడిగినాడు" అని చెప్పాడు.

"పల్లెల్లో అయితే బేధాలు ఉంటాయి కాని చదుకున్న వాళ్లకి అవన్నీ ఏముంటాయి రా..? "అని చెప్పింది. 


"అమ్మా..అందరూ బిడ్డలని మీకులాగా సాకరు కదమ్మా.. నేను మన ఇంటికాడ పని మానేసాక సుధాకర్ రెడ్డి ఇంట్లో పని చేసినా,శ్యాం అన్న ఇంట్లో పని చేసినా..కానీ ఎవరు నీ అంతా మంచిగా చూడనూలేదు.. మంచిగా ఉండాలని చెప్పలేదు. నన్ను చిన్నాడు అని కూడా చూడకుండా అరవ చాకిరి చేయించారు. ఒక్కళ్ళు కూడా సురేష్ అని పేరు పెట్టి పిలిచినాళ్ళు లేరు. అందరు దిబ్బోడా..అని పిలిచినాళ్ళే ! ఎక్కడా మా కులపోళ్ళకి ఇలువే లేదు. మా ఇళ్ళల్లో పిల్లకాయలు ఎక్కువే! కూటికే లేకపోయే! ఇంక చదువులు ఏడ చదువుకుంటాం!మేమింకా కాపోళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాంటి వాళ్ళమే అనుకుంటా ఉంటారు. పెద్దామె, నాయుడు కూడా .   వాళ్ళు ఇద్దరూ కాలితో తన్నిన సంగతి కూడా నేనింకా  మర్చిపోలేదమ్మా! చెప్పులు కూడా ఒకోతూరి వేసుకున్న కాళ్ళని కరుస్తాయి. కాలం ఒకే లాగ ఉంటాదా! మేము అయిదుగురు అన్నదమ్ములుంటిమి. పనులు చేసో, కయ్యలు మగతాలకి జేసో  మేము కయ్యలు కొనుక్కున్నాం. మాకాడ ఇప్పుడు అయిదెకరాల కయ్యి ఉంది ..ఇప్పుడిప్పుడే మేము తెలుసుకుంటూన్నాం. మా పిల్ల కాయలని బడి పంపుతున్నాం. మా నాయన చేసిన తప్పులని మేము చేయడం లేదులేమ్మా..అని చెప్పాడు ఆవేశంగా.

""మనుషుల అహంకారం అట్టాగే ఉంటుంది లేరా..!నువ్వు అనుకున్నట్టు అందరూ  అట్టాగే ఉండరు ..అని చెపుతూ వాతావరణం ని తేలిక చేసాను అనుకుంది. "ఇప్పుడిప్పుడు  మీరు చాలా తెలుసుకున్నారు. అది సంతోషమే కదరా ..సురేష్." అంది హేమ.

మనసులో బెరుకుగానే ఉంది తను చనువు కొద్ది ఏరా అన్నా కూడా ఏమైనా అనుకుంటాదేమోనని సంశయించింది కూడా.

"ఆడ పిల్లలకి చదువెందుకు అనుకోకుండా నీ పిల్లలని చదివించు " ..అని చెప్పింది హేమ.

"మా పిలకాయలని బడికి పంపుతున్నానమ్మా.."అని చెప్పి.. "ఒక సారి .. నట్టింట్లోకి రామ్మా.. " అని పిలిచాడు.

"ఎందుకురా..? కాసేపాగు ..వంట అయిపోయాక పోదాం" అంది. "లేదమ్మా ..నువ్వు అర్జంటుగా ఓ పాలి..ఇటురావాలి .." అని పిలిచాడు.

స్టవ్ మంట తగ్గించి చేతులు తుడుచుకుని హాల్లో కొచ్చి నిలబడింది .."ఇటు..కూర్చోమ్మా!"  ..అంటూ కుర్చీ ముందు జరిపాడు. హేమ కూర్చుంది

"అమ్మా.. ఇయి తీసుకో ! "అంటూ.. ఓ..కవరు చేతికి ఇచ్చి "నన్ను దీవించమ్మా.!" అంటూ హటాత్తుగా వంగి హేమ కాళ్ళకి దణ్ణం పెట్టాడు.

"ఒరేయ్! ఏమిటిరా ఇది.. నా దీవెనలు ఎప్పుడు నీకుంటాయి. అయినా ఏమిటి ఇవన్నీ? " అడిగింది.

"అమ్మా.. ఈ రోజు మదర్స్ డే..అంట కదమ్మా.. నిన్నటేల నుండి టీవి లలో ఎక్కడ చూసినా అవే చెబుతుండారు నాకు నిన్ను చూడాలనిపించింది ..అందుకే వచ్చేసాను.."  అని చెప్పాడు.

సురేష్ ఇచ్చిన కవరు ప్రక్కనే ఉన్న టేబుల్ పై పెట్టింది.

"అమ్మా..కవరు తీసి చూడమ్మా..నీ కోసం ఒక చీర తెచ్చాను" అని చెప్పాడు. నవ్వుకుంటూ కవరు లోనుంచి చీర తీసి చూసి "చాలా బాగుందిరా..నువ్వు చీరలు బాగానే సెలక్ట్ చేస్తున్నావే!"అని ఒక మొట్టికాయ వేసింది..నవ్వుతూ. ..వాడి అభిమానానికి కళ్ళు చెమర్చగా

"ఇదిగోనమ్మా..మనం నాటిన  పనస చెట్టు కాయ.." అంటూ తెచ్చి హేమ ముందు పెట్టాడు. పెద్ద పనస కాయ. ఆ కాయని చూస్తూ.  చాలా పెద్ద కాయలు కాస్తున్నాయి..కదా! అంది సంతోషంగా  


అవునమ్మా ! అక్కడెవరూ  మనం ఉన్నప్పుడు సేద్యం చేసినట్టు చేయడం లేదు. అప్పుడు ఉండే కళాకాంతులే లేవమ్మా.. కయ్యలన్నీ బోసిగా, బీళ్లుగా మారిపోయి  ఖాళీగా ఉండి..పోనాయి" బాధగా  చెప్పాడు.

"మనకి ప్రాప్తం లేదు, అందుకే అమ్ముకోవాల్సి వచ్చింది "  అంది హేమ బాధగా..

ఆ కబుర్లు ఈ కబుర్లు చెపుతూ ఓ..గంట పైగానే ఉండి..భోజనం చేసి.. "అమ్మా..భద్రం అమ్మా!..అబ్బయ్య కూడా భద్రంగా ఉండాలి .. ఇటువైపు వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటాను." అని చెప్పాడు అభిమానంగా. 

అలాగే! తప్పకుండా వస్తూ ఉండరా! పెద్దామె కూడా నిన్ను చూసి సంతోషిస్తుంది" 
 "అబ్బయ్య పెళ్ళికి నన్ను మర్చిపోకుండా పిలవాలి" అంటూ పోన్ నెంబర్ ఇచ్చి ..హేమ దగ్గర  అందరి నెంబర్లు తీసుకుని వెళ్ళాడు..

పనస కాయ కోస్తూ..ఈ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంది. వెట్టి చాకిరీ చేసే వాళ్ళందరూ ఈ పనసకాయ పై భాగంలాంటి వారు, లోపలున్న  మధురమైన తొనలు తినేవాళ్ళందరూ భూస్వాములు అని పోలిక ఇచ్చుకుంది హేమ.

తీయని సువాసన వెదజల్లుతున్న పనస తొనలు తింటూ "ఎంతైనా దిబ్బోడు మన సొమ్ము తిని పెరిగిన వాడు .అది మర్చిపోలేక ..మనమంటే ఉన్నఅభిమానం ఇలా చూపించాడు"  అనుకుంటుంది సుగుణమ్మ.

"అవును మరి! అగ్రకులం, భూస్వామి తనం అనే పెత్తనంతో  మనం  చూపిన  ఆదరణ మర్చిపోయేటట్లు ఉంటే  కదా! వ్యంగంగా అనుకుంది హేమ తన మనసులో. ఆమె ఇప్పటికీ అత్త చాటున  ఓ కోడలే!


17, జూన్ 2012, ఆదివారం

నీ - నా అనే భావం

మనుషుల్లో నీ నా అనే భావం మనం ఎంత వద్దనుకున్నా.. పారద్రోలాలనుకున్నా పోయేది కాదు.

మనిషి కి మనిషికి మధ్య "స్వచ్చమైన ప్రేమని వెదకడం అంటే ఎండమావుల నీళ్ళు త్రాగి దాహం తీర్చుకోవడం లాంటిది"

"స్వచ్చమైన స్నేహం దొరకడం అంటే మన అంతరంగాన్ని వేరోకరిలో చూడగలగడం వంటిది"
రెండు సాధ్యం అవుతాయో లేదో.. నేను ప్రయత్నం కూడా చేయలేదు.

అందుకు ఏమంటాను అంటే.. ఈ స్వచ్చమైన స్నేహం,స్వచ్చమైన ప్రేమ రెండు ఇవ్వగలగడం నాకు సాధ్యం కాకపోవచ్చును కదా!

కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ జీవిత భాగస్వామ్యం చేసుకోవాల్సిన వ్యక్తితో బంధం ముడి పడేటప్పుడు ఆ వ్యక్తీ గురుంచే కాకుండా ఆ వ్యక్తి సమీప బంధువులని మన వారిగా భావించడం కూడా అవసరం ..అత్యవసరం కూడా.

ఈ మధ్య నేను విన్న విషయం ఒకటి చెప్పదలచాను.

ఒక మధ్య తరగతి కుటుంబంలోని యువతికి తగిన వరుడిని వెదకడం మొదలుపెట్టారు. కానీ ఆ అమ్మాయికి వచ్చిన సంబంధాలలో ఏ ఒక్కటి మ్యాచ్ అవడం లేదు.

అమ్మాయి చదువుకుంది.ఉద్యోగం చేస్తుంది. ఆమెకి తల్లిదండ్రులు,ఒక తమ్ముడు ఉన్నారు. పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయికి,అబ్బాయి తల్లిదండ్రులకి ఆ అమ్మాయి ఒక షరతు గురించి చెపుతుంది.

పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. వద్దనడానికి వీలు లేదు.ఉద్యోగం చేసినా ఆ డబ్బు భర్తకి ఇవ్వడం గాని భర్త కుటుంబంలోని వ్యక్తుల అవసరాలకి వాడటం కాని చేయకూడదు. ఆ అమ్మాయి జీతం అంతా ఆ అమ్మాయి తల్లిదండ్రులకి మాత్రమే ఇచ్చేటట్లు ఒప్పుకుంటే ..పెళ్ళికి ఒప్పుకుంటాను అని లేక పొతే లేదు అని.చెపుతుంది. పెళ్ళికి ముందే ఇన్ని షరతులు పెట్టె అమ్మాయి భర్త తల్లిదండ్రులు గురించి కూడా నాకు ఏ భాద్యత లేదని అంటే.. అతని పరిస్థితి ఏమిటి? అని అందరికి వస్తున్న సందేహం.

అందువల్ల ఆ అమ్మాయికి వివాహం జరగడం లేదు.

వివాహ విషయాలు మాట్లాడుకునేటప్పుడు ముందు జాగ్రత్తగా కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకోవడం అవసరమే అయినప్పటికీ ఆ అమ్మాయి ఆలోచన ఏమిటో నాకైతే బోధపడలేదు. ఒకవేళ వివాహం తర్వాత భర్త ఆమె సంపాదనని పుట్టింటి వారికి ఇవ్వనివ్వడని భయం కావచ్చు తల్లిదండ్రులని ఆర్ధికంగా ఆదుకోవాలనే తాపత్రయం కావచ్చు. ఆ అమ్మాయి విధించే షరతు లో ముందు జాగ్రత్త ఉంది కానీ ఇలా మాట్లాడటం ని జీర్ణించుకునే అంతగా మన సమాజం మారలేదు.

అలాగే అబ్బాయికి కూడా తల్లిదండ్రి బాధ్యతలు ఉంటాయి కదా!అతను అవన్నీ చూసుకోవాలి కదా! అని మధ్యవర్తిత్వం జరిపే వాళ్ళు ఆమెని అడిగినప్పుడు అవన్నీ నాకు తెలియవు అతని తల్లిదండ్రులని చూసుకుంటాడో లేదో అది అతని ఇష్టం అని జవాబు ఇచ్చింది అట.అంటే భర్త తో పాటు అతని తల్లిదండ్రుల పట్ల ఆ అమ్మాయికి భాద్యత ఉన్నట్లా లేనట్లా? నా భర్త నావాళ్ళు అని కూడా ఆ అమ్మాయికి ఉండాలి కదా ! అమ్మాయిల ఆలోచనలు ఇలా ఉండటం సమంజసంగా లేదని మాత్రం అనుకోగలం.

మన తెలుగు సినిమాలలో.. కుటుంబ భాద్త్యత కోసం వివాహ జీవితాలని త్యాగం చేసిన నాయిక పాత్రలు గుర్తుకు వచ్చ్చాయి. "అంతులేని కథ" లో "సరిత", "సంధ్య" చిత్రం లో" సంధ్య" పాత్ర అప్రయత్నం గా గుర్తుకు వచ్చాయి. త్యాగం చేయడం ఆడవాళ్ళ ఒక్కరి హక్కే కాదు. భాద్యతల కోసం,బంధాల కోసం జేవితాలని కరిగించిన పురుషులు ఉన్నారు.

పెళ్ళికి ముందు కొన్ని మాటలు అనుకోవడం లో అభ్యంతరం ఏమి ఉండదు కానీ ..తప్పని సరి షరతులు పెట్టుకుని.. ఆ ఒడంబడిక పై జీవితం పంచుకుని నడక సాగించడం మాత్రం కష్టమైన పనే!

నాకు తెలిసి చాలా మంది కాకపోయినా.. కొంత మంది అయినా భార్య తల్లిదండ్రులకి సహాయం చేసే వారిని చూస్తుంటాం.అయినా ఈ కాలం లో కన్న తల్లిదండ్రులే పరాయి వాళ్ళు అయిపోయి,అత్తింటి బంధువులే నట్టింట్లో తిష్ట వేసుకున్న సన్నివేశాలు నిత్య కృత్యం అయిపోతుంటే.. ఆ అమ్మాయి ఎందుకు తొందరపడి షరతులు పెట్టి వచ్చిన సంబందాలన్నిటిని చెడగొట్టు కుంటుంది అని వ్యాఖ్యానించాను నేను.

ఏం చేస్తాం ఆడపిల్లల కాలం ఇది.చదువు,ఉద్యోగం..చేతిలో ఆయుధాలు అయిపోయాయి మరి. అన్నారు.ఇంకొక ఆవిడ.

భార్య భర్త ల మధ్య నీ-నా అంతరాలు ఉంటే ఆ కాపురాలు ఎలా సవ్యంగా సాగ గలవు?

నేను చదివిన ..ఓ..పర్షియన్ కథ గుర్తుకు వచ్చింది.
ఇద్దరు ప్రేమికులు ఉంటారు. ప్రేమికుడు.. అర్ధరాత్రి వచ్చి తలుపు తడతాడు. ఆమె లోపలి నుండి.. ఎవరు నువ్వు అని అడుగుతుంది. అతను " నేనే".. అని సమాధానం ఇస్తాడు. ఆమె తలుపు తీయదు.

రెండసారి అతను తలుపు తడతాడు. ఆమె మళ్ళీ అడుగుతుంది ..ఎవరు మీరు అని. అతను మళ్ళీ" నేనే ..నీ ప్రేమికుడిని" అని చెపుతాడు. అయినా ఆమె తలుపు తీయదు.

మూడవసారి అతను తలుపు తడతాడు. ఆమె మళ్ళీ లోపలి నుంచి అడుగుతుంది ఎవరు నీవు ?అని.
అప్పుడు అతను ..ఓ.. ప్రియురాలా.. !నువ్వే నేను. నేనే నువ్వు ..అని బదులిచ్చాడట. అప్పుడు కాని తలుపు తెరవబడ లేదట..

అల్లాటి బంధం ఏర్పడినప్పుడు కాని వారు వేరు వేరు వ్యక్తులు కాదు. ఇరువురు ఒకటే! అనే భావం కల్గితే తప్ప కలసి మనుగడ సాగించలేరు అని తోస్తుంది కదా! మనకు.

దురదృష్టవశాత్తు..నేటి జీవన విధానంలో నీ -నా భావం పెరిగిపోయి ఎవరికీ కావాల్సినవి వారికి లభించాలి.అవి లభించక పొతే.. ఆ కాడిని ఒదిలేసి.. ఇంకో కాడిని వెదుక్కోవటం ..అది నచ్చక పొతే ఇంకోటి వెదుక్కోవడం లో ప్రవేశించి చాలా కాలం అయిపొయింది.అందుకే ముందు జాగ్రత్తగా ఇలాటి షరతులు ఏమో అని కూడా అనుకున్నాను.

ఆలోచనా విధానం లో మార్పులు జీవితాల గతినే మార్చివేస్తున్నాయి. లైఫ్ గ్యారంటీ యే కాదు.. లైఫ్ పార్టనర్ గ్యారంటీ కూడా లేని కాలం ఇది.

నీ-నా అనే భావం తగ్గించే విధం గా ఇరువురి భావనలు ఏకమైన ఒక పాట వినండి.
నువ్వు నేను ఏకమైనాము ఆనేపాట ని విని చూడండి.

16, జూన్ 2012, శనివారం

ఆకాశాన సగం మనం..

ఆకాశాన సగం మనం..
వినడానికి ఎంత బాగుందో..
ఎన్నెన్ని ఇనప కచ్చడాలు దాటాం..
నిత్యం సమరం చేస్తూనే ఉన్నాం..

ఉనికిని నిలబెట్టుకోవడానికి
మనుగడ సాగించడానికి ..
ఆధార
పీఠం కోల్పోకుండా ఉండటానికి ..

మనవాళ్ళే
.. మనవాళ్ళే..
మనని అనుమానపు దృక్కులతో ..
వెంటాడి
వేటాడిన క్షణాలు..
మనలని
మానసికంగా చంపేస్తాయి .
కూపస్థ
మండూకాల్లా .. బ్రతకమని
అనరు
కానీ.. హస్తిమ శకాంతర భేదంతో 
ఉండాలని
కోరుకుంటారు.
ఇంకానా ..... ఇంకానా.. అనుకోకండి ..
అరఘడియ
ఆలస్యం అయిందంటే ..
మన
మీద ప్రేమ కన్నా..,
మన
భద్రత మీద భయం కన్నా..
ఇరుగుపొరుగు
ఏమనుకుంటారో అని భయం ..
ఎదిగేది ఎక్కడ.. ఎదగనిచ్చేది ఎక్కడ..?
శరణార్ధ శిభిరాల్లోనే నయం..
చింతనలోనైన..స్వేచ్చగా మనగల్గుతారు


అవసరాల బానిసత్వ కొట్టంలో..
జీతం
రాళ్ళ పాలిచ్చే పసురాళ్ళం మనం..
జీవితపు
రంగస్థలం మీద
మనది
కాని జీవితంలో నటిస్తున్న
నట
ఊర్వశి' లం మనం.
విజ్ఞానపు
పూలతో అలంకరించుకున్న
వసంత
భామినులం ..మనం..
వ్యక్తిత్వపు
పరిమళాలు ,సమర్ధతా నైపుణ్యాలు ఉన్న
పట్టమహిషు 
 "లం మనం..
అయినా
మనకన్నా. బోనుసాయి మొక్కలే నయం ..
గర్వంగా పదుగురికి ప్రదర్శిస్తారు. .

మనువు
ఒక లోహపు గది..
తనువు
ఒక మోహపు నది..
నిత్యం
మనసు మల్లెలా
నలుగుతూనే
ఉంటుంది .
.. ఆలోచనా విధానంలోను
మనగల్గలేని
మనం..
ఎప్పటకి చరణదాసిలా..
మిగిలిపోతే
బాగుండునట ..
పురాణాల్లో లా కాకుండా
చరిత్రలో
శోకపర్వాలు , వనవాస ఘట్టాలు లేని
మనకొక
అధ్యాయాలు మిగుల్చుకుంటూ..
భవితలో
.. మన లాటి మనం
లేకుండా
మరింత చైతన్యశీలురుగా .
ఎదిగే
దిశలో మనలో
మనం
. మనం మనం...

15, జూన్ 2012, శుక్రవారం

ప్రియునికై అన్వేషణ

ఉదయం నుండి ఒకటే వెదుకుతున్నాను. కనబడితే ఒట్టు. నాకు తను లేకుండా.. ఒక గంట కూడా పొద్దు పొతే ఒట్టు వెదుకుతూనే ఉన్నాను విసిగి వేసారి పోయాను. 

అందరిని అడుగుతున్నాను..అతను కనబడ్డాడా? అని ఎవరు అని అడిగారు.

అయ్యో..అతనే! ఏమని చెప్పను..అతను అంటే అతనే..కనబడ్డాడా..?అని అడిగాను. అందరు లేదని సమాధానం ఇచ్చారు. అయ్యో! నా జానేమన్! నీ ఎడబాటు ఎంత దుఃఖం ! నేను ఈ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను .

 "నిధి ఛాలా సుఖమా! నీ పెన్నిధి చాలా సుఖమా!" అంటే..నీ పెన్నిధి చాలా సుఖమని చెప్పనా!? ఎందుకు అలా దాక్కుని నన్ను విసిగిస్తావు? అని తిట్టుకున్నాను కూడా. 

 అతని చల్లని స్పర్శతో..నా దేహపర్యంతం అలముకున్న బాధ అంతా క్షణకాలంలో మాయం అయిపోతుంది. నా నిర్లక్ష్యం తో అతనిని దూరం చేసుకున్న బాధ "ఇంతింతై వటుడింతై" రీతిన నన్ను బాధిస్తుంది.
 

 స్నానపానాదులు అవసరం లేదు,అన్నపానీయాలు సహించడం లేదు.అక్షరం పై దృషి నిలుపలేను..వీనుల విందైన సంగీతాన్ని ఆస్వాదించ లేకున్నాను. మనశ్శరీరాలు అతని జాడ కోసం వెతికి వెతికి డస్సి గొన్నాయి. మావారిని,మా అత్తగారిని,అందరిని అడిగాను నా ప్రియుడు ఎక్కడ ? అని. ఎవరికీ తెలుసు ?..నీ ప్రియుడు నీ ఇష్టం! భద్రంగా ఎక్కడ దాచుకున్నావో,లేక ఎక్కడ చేజార్చుకున్నావో! అని..విసుక్కున్నారు. 


 అసలు నాకు ప్రియుడు అవసరం రాదనుకున్నాను. మా పిన్నికి ప్రియుడు ఉన్నాడు,మా చెల్లికి ప్రియుడు ఉన్నాడు..ఛీ  ఛీ .... నాకు ప్రియుడి అవసరం రానే రాకూడదు అనుకున్నాను. 

 మనం ఏదైతే వద్దనుకుని ద్వేషిస్తామో.. అదే మనలని వెంటాడుతుంది చూడు అని పిన్ని,చెల్లి హెచ్చరించారు. వాళ్ళు అన్నట్లుగానే..ప్రియుని అవసరం నాకు వచ్చి పడనే పడింది. ఒక్కసారి ప్రియుని చెంత సాంత్వన చెందానా.!? ఇక నేను అతన్ని ఒదిలిపెడితే ఒట్టు. అది మొదలు నా ప్రియుడు ఎప్పుడు నన్ను అంటి పెట్టుకుని ఉండాల్సిందే!. 


 నా ప్రియుడు దూరం అవుతాడు అని ముందస్తు సూచనలు కనబడాగానే..అతని ఆచూకి వెతికి వెతికి ..చేజిక్కించుకుని ..గుప్పిట బిగించుకుని విజయగర్వంతో...మురిసి ముక్కలైపోతాను. 

 నా ప్రియుడు నా ప్రక్కన ఉంటే ఏ బాధ, గాధ నన్ను దరిచేరవు అని ఉల్లాసంగా ,ఉత్సాహంగా అధికంగా సామర్ధ్యాన్ని మించి పనులు చేసుకుంటాను. నను అంతలా అలరించే ప్రియుడు ఉంటే..మరి నేను అలా ఉండకుండా నిరుత్సాహముగా ఎలా ఉంటాను చెప్పండి.? 

 పొద్దస్తమాను వెదికాను వెదికాను. నా కళ్ళలో నీళ్ళు ఊరుతున్నాయి. ఎక్కడున్నావు ప్రియా !..ఒక్క సారి కనబడవా!? . నిన్ను రోజు అతిగా ఉపయోగించుకుని ఇబ్బంది పెట్టాను కదా! ప్రామిస్..నన్ను నమ్ము ఇక పై అంతగా నిన్ను ఇబ్బంది పెట్టను సరేనా! అని వేడుకున్నాను. మంచమెక్కి దిగులుగా పడుకున్నాను. 

కాసేపాగేసరికి నాకు ఒక చిన్న ఆచూకి దొరికింది . వెంటనే లేచి వెతికాను. ఆఖరికి .. నా ప్రియుడు నన్ను కనికరించాడు. ఎక్కడ ఉన్నాడో.. కనబడ్డాడు. నాకు దొరికి పోయాడు..మంచానికి బెడ్ కి మద్య దాక్కుని ఉన్నాడు. బయటకి తీసి బెడ్ మీద పడేసి.. అమ్మయ్య .అనుకున్నాను.

 నా.."ఒలిని" జెల్ నాకు దొరికిన్దోచ్! ఇక ఏ నడుము నొప్పులు,బెణుకులు,మెడ నొప్పులు, కీ బోర్డ్ పై టక టక మని నొక్కిన నొక్కులకి వచ్చిన నొప్పులకి సర్వ బాధ నివారిణి .."ఒలిని" రియల్ పెయిన్ రిలీఫ్ .. నా అసలైన ప్రియుడు. 

13, జూన్ 2012, బుధవారం

పుస్తకాలని మింగేసిన సొగసు..

ఒక అయిదు రోజుల క్రితం నా స్నేహితురాలు వైష్ణవి చెప్పాపెట్టకుండా వచ్చేసింది.

నీకు ఎంత దైర్యం ..కాల్ కూడా చేయకుండా వచ్చేశావు? అన్నాను.


నువ్వు ఎక్కడికి వెళతావ్?నీకు ఇల్లే కదా స్వర్గసీమ.నెట్ సీమనే ప్రపంచం అంది కొంచెం ఎగతాళి, జాలి కలిపి


తను చెప్పింది నిజమే! ఎన్నోసార్లు ఎక్కడికైనా వెళ్ళాలనుకుని లాస్ట్ మినిట్ లో కూడా డుమ్మా కొట్టి ముసుగు తన్ని పడుకున్న సందర్భాలు చాలా ఉంటాయి.


నువ్వు ఎవరిలోనూ కలవలేవు..అన్న అపవాదులు వస్తుంటాయి.


సమూహంలో ఉన్నా ఒంటరి తనం వరించే కన్నా .. ఒంటరి తనంలోనే స్వేచ్చ ఉందని సమూహపు శక్తి ఉందని వాళ్ళకేమి తెలుసు పాపం అనుకుంటాను.


మా వర్కర్స్ అందరు ఎండల వేడికి తట్టుకోలేక ఇళ్ళకి పరుగులు తీసారు. అబ్బ నాకు బాగా రెస్ట్ దొరికింది అని సంతోషం కల్గింది.


మా ఫ్రెండ్ వైష్ణవి ఎక్కడికి అయినా వెళదామా !? అని అడిగింది. శ్రీ శైలం ,కిన్నెరసాని,ఉజ్జయిని
..ఈ మూడు తన చాయిస్.

నేను ఇప్పుడు కాదులే!అన్నాను. సరే.. ఓ..నాలుగు గంటల కబుర్లు తర్వాత వెళతాను అంది. అప్పుడేనా ..అన్నాను. మరి సినిమాకి వెళదామంటే!? ఉంటాను అంది.


రాక్షసి..నాలుగేళ్లగా ట్రై చేస్తుంది. నాతొ సినిమా చూపించాలని.నన్ను వదిలేయి తల్లో..! అని ఈ సారి అనలేదు. తన కోసం వంద గజాల దూరంలో మా ఇంటి వెనుక ఉన్న ధియేటర్ లో సినిమాకి టికెట్స్ తెప్పించుకుని వెళ్ళాం.:ఏడేళ్ళ తర్వాత నా వీక్షణంలో చోటు చేసుకున్న చిత్రం "గబ్బర్ సింగ్"


సరే ఎక్కువగా చిరంజీవిని చూసినట్లు,అప్పుడప్పుడు పవన్ కళ్యాన్ ని చూసి నట్లు.. డాం డాం అంటూ..ఎన్ని వందల బుల్లెట్లు పేలిన శభ్దాలు వింటున్నాను అనుకుంటూ..నాకు కావాల్సిన కాస్ట్యూమ్స్ డిజైన్స్ చూస్తూ..(సినిమా మొత్తం లో నాకు అవే విలువైనవి.ఎందుకంటే.. ఆ డిజైన్స్.. కొందరికి అన్నం పెడతాయి..నాకు కొంత డబ్బు సంపాదించి పెడతాయి కాబట్టి).మనసులో ఘాడంగా ముద్ర వేసుకుని పవన్ కళ్యాన్ క్యాస్తూమ్స్ ని వీలైనంత మెచ్చుకుని.. హమ్మయ్య సినిమా అయింది అని దీర్ఘంగా నిట్టూర్చి ..ఇంటికి వచ్చి పడ్డాం.


మళ్ళీ కాసేపు బ్లాగ్ ముచ్చట్టలలో పడ్డాం కూడా. కాసిని పాటలని కళ్ళల్లో వేసుకుని,సంగీతానికి సేదతీరి సినిమా తాలూకు జిడ్డుని,దురదని వదిలించుకుని.. నిద్దర పోయాం.


తెల్లవారి వైష్ణవి వేళతానూ అంటూ.. బయలు దేరింది. అమ్మాయి సిటీ లోకి నేను వస్తాను ఉండు. ఇవాళ కాస్త మేఘాలు గొడుగు పడుతున్నాయి. హాపీ గా షాపింగ్ చేసుకుందాం అని పదకొండు గంటలకల్లా బయలుదేరి పోయాం.


మొట్టమొదటగా ఏలూరు రోడ్డుకి వెళ్ళాలనుకున్నాం. అక్కడే కదా అన్ని పుస్తకాల షాపులు. ఇక లెనిన్ సెంటర్ లో సెకండ్ హాండ్ పుస్తకాలు దొరికేవి.


నేను అయితే కొనుక్కోవాలనుకున్న పుస్తకాల పేర్లతో.పెద్ద లిస్టు రాసుకున్నాను.


సాహితీ విరూపాక్షుడు,విషాద కామ రూప, విముక్త,జమీల్యా,అనుభవాలు-జ్ఞాపకాలు,స్వీయ చరిత్రం,శశిరేఖ ..ఇంకా మిత్రులు అడిగిన తన్హాయి .ప్రజా శక్తి బుక్ స్టాల్ కూడా చూడాలనుకున్నాను

వెళ్ళే ముందు. కొంత డబ్బు మాత్రమే తీసుకుని క్రెడిట్ కార్డు అన్నీ భద్రంగా బీరువా లోపల పడేసి (అక్కడ కొంత కంట్రోల్ ఉండటం కోసం అన్నమాట) వెళ్ళాను

సరే.. ఇంటి ముందు బస్ ఎక్కేసి బీసెంట్ రోడ్డు దిగాం.చిన్న షాపింగ్ పని చూసుకుని..వెళ్లిపోదాం అనుకున్నాం. కానీ చపల చిత్తముల్ కదా.. ఓ.. షోరూం లోకి దారితీసాం. అక్కడ ఖర్చు పెట్టాలనుకున్న డబ్బు వేరుగా..పుస్తకాల లిస్టు కోసం వేరుగా పెట్టిన డబ్బు అన్నీ ..కలిపి.. రంగుల చీరల అందానికి దాసోహం అయిపోయినాయి. నిజంగా చెప్పాలంటే అక్కడ ప్రాధాన్యత డబ్బు-షాప్ లో చీరలు మాత్రమే నిజం. నేను మాత్రం నిమిత్తమాత్రురాలిని.



ఆఖరికి ఓ..అయిదు వందలైన బుక్స్ కోసం కేటాయించాలనుకుని బయటపడబోతు..కాష్ కౌంటర్ ముందు..డబ్బు చెల్లించి బయటపడబోతు.. అలా ..క్షణకాలం చూసాను.

నన్ను అమితంగా ఆకర్షించిన


"అదిగదిగో..నల్లని రంగు పై..చిల్లి రెడ్ పోల్కం బుతీస్ ఉన్న బ్రాసో శారీ " అబ్బ ఎన్నాళ్ళ నుండి వెదుకుతున్నాను లో బడ్జెట్ లో పోల్కం బుటీస్ చీర కోసం ..అంటూ.. ఆ చీర ధర చూసి పర్సులు వెదుక్కున్ని మరీ ఇద్దరి పర్స్ లలోని డబ్బు లెక్క కట్టి ఆ చీరకి సరి పోయిన తర్వాత హమ్మయ్య..చీర సొంతం అని సంతోష పడి.. ఎవేరేస్ట్ ఎక్కిన ఆనందం పొంది బయట పడ్డాం.


ఇంకెక్కడి పుస్తకాల షాప్ !!?? గోవిందా గోవిందా..!


కానీ నాకు తెలుసు.. వేలాది రూపాయలు పోసి కొన్న చీరని కట్టినప్పటి అందం కన్నా .. ఒక పుస్తకం చదివినపుడు కల్గిన జ్ఞానం అందం మన నడకలో.. అడుగు అడుగునా,మన ముఖంలో అణువూ అనువునా ఉట్టి పడుతుంది అని.


నేను కొన్న బ్లాక్ &రెడ్ పోలకం బుటీస్ బ్రాసో చీరని నా కళాత్మక ఆలోచనలు నింపి మా వర్కర్ల పనితనం జేర్చి డిజైనర్ ఫీస్ గా మార్చి అలా పెడతానో లేదో.. ఎవరో ఒకరు మెచ్చేస్తారు. కాని
నేను మాత్రం ఎవరికో ఒకరికి మాత్రమే సేల్ చేస్తాను. అప్పుడు బోలెడు పుస్తకాలు కొనుక్కోవచ్చు అనుకుంటాను.

కానీ ..
అమ్మో..చీరని వదలడమే! ఎంత మాత్రం కుదరదు. కుదరుదంతే! బుజ్జి ముండ ఎంత అందంగా ఉంది. మా అత్తమ్మ మొహం చిట్లించినా సరే! మా రమ,మా చెల్లి..ఇంకా నలుపు వీరాభిమానులు పోటీ పడినా సరే.. ఇవ్వను కాక ఇవ్వను.

ఇప్పుడు .. ఎవరు నాకు చీర పెట్టాలని అనుకుంటున్నారో..వాళ్ళ కోసం వెదుకుతాను..వెదుకుతున్నాను. చీర నా వార్ద్రోబ్ లో.. పుస్తకాలు నా కంటికి ఎదురుగా చదవమని ఊరిస్తూ.. అదీ దృశ్యం అన్నమాట. ముందరున్న దృశ్యం.

12, జూన్ 2012, మంగళవారం

నాకు నచ్చిన పుస్తకాలు " ఆత్మ కథలు"

ఏడెనిమిది గంటలు విధ్యుత్ కోత నాకు బోలెడు సంతోషం కల్గిస్తుంది. కారణం పుస్తకాలు చదువుకోవచ్చు. అదే కోత లేకుంటే.. ఏ టీవి,లేదా ఇలా బ్లాగ్ లు చూడటం.

బ్లాగ్లు చదవలేకపోవడం కూడా వెలితిగానే ఉన్నప్పటికీ ఆ వెలితి లేకుండా పూడ్చేది పుస్తక పఠనమే.

నాకు బాగా నచ్చే పుస్తకాలు ఆత్మ కథలు.

"ఆత్మ కథ " అనేది విదేశీ సాహిత్య ప్రక్రియ.

ఆత్మ కథలో ప్రధానంగా ఉండవలసిన జీవ లక్షణం నిజాయితీ కల్గి ఉండటం.నిజ జీవితాల కథలు వాస్తవానికి అద్దంపడుతూ, వ్యక్తిత్వాలను కళ్లముందు ఆవిష్కరిస్తాయి. ఆ విధంగా వాటికి ఆకర్షణ లభిస్తుంది

జాతి పిత మహాత్మా గాంధి వంటి మహోన్నత వ్యక్తులు తమని తాము కించ పరచుకునే విధంగా యదార్ధ విషయాలను బహిర్గతం చేయరు. "సత్య శోధన" పేరిట మన తెలుగులో కూడా లభ్యం అవుతుంది.

ఆత్మ కథలలో.. బాల్యం నుండి ఆత్మ కథ వ్రాసే నాటి వరకు అత్యంత నిజాయితీగా చెప్పడం జరుగుతుంది కాబట్టే ..ఆత్మ కథల ద్వారా.. వ్యక్తుల నడవడిక, బలహీనతలు,వైఫల్యాలు మొదలగునవి తెలుసుకోవచ్చు. వారి అనుభవాలు-జ్ఞాపకాలు..పాఠకులకు పాఠాలు లాంటివే!

మహాత్మా గాంధి, జవహర్లాల్ నెహ్రు ,రచయిత్రి కమలా దాస్, నటుడు దేవానంద్,మహా కవి శ్రీ శ్రీ మొదలైన వారు ఆత్మ కథలు వ్రాశారు. వీరు దారుణమైన నిజాలు వ్రాసి..ఆత్మ కథ అంటే ఏమిటో ఎలా ఉంటుందో రుచి చూపించారు.

చార్లీ చాప్లిన్ ఆత్మ కథ కూడా ..ఎంతొ ప్రసిద్ది చెందినది.

అలాగే మాజీ రాష్ట్రపతి పి జే అబ్దుల్ కలాం వ్రాసిన "వింగ్స్ ఆఫ్ ఫైర్" మన దేశ ప్రజలపై ఎంతటి గొప్ప ముద్రని వేసిందో కదా!

నవయుగ ఆంద్ర వైతాళికులు కందుకూరి వీరేశ లింగం గారిచే తెలుగులో మొట్ట మొదటిగా వెలువడిన ఆత్మ కథా గ్రంధం.

ఇక తెలుగు లో స్త్రీలలో ఆత్మ కథ వ్రాసిన మొదటి వారు..ఏడిదం సత్యవతి గారు.

అలనాడు "నవోదయ" పత్రికలో ధారావాహికంగా ప్రచురింప బడిన శ్రీపాద వారి యదార్ధ కథ."అనుభవాలు-జ్ఞాపకాలూనూ.

సంపాదకులు శ్రీ నీలం వెంకట శేషయ్య గారు అభ్యర్ధించగా శ్రీ పాద వారు సమ్మతించి వారి ఆత్మ కథని అందించారు అట.
అనుభవాలు-జ్ఞాపకాలూనూ ..గ్రంధం ఆనాటి సమాజంలోని వివిధ పోకడలకు ఒక నిలువుటద్దం.అప్పటి జన జీవితానికి అచ్చమైన ప్రతి బింబం.

మరణ సమయానికి ముందు ఆనేకానేక భాదల మధ్య అనుభవాల దొంతరల తొ అనారోగ్యంతో బాధపడుతూ పురిపండా అప్పలస్వామి గారికి వ్రాసిన చివరి లేఖ వీలునామా లాంటిది .చదువరుల కన్నులను చేమరింపజేసే, గుండెలు పిండి చేసే దారుణమైన లేఖతో..ఈ గ్రంధం ముగుస్తుంది .

తెలుగు వారు అందరు చదవ వలసిన గ్రంధం శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి... అనుభవాలు-జ్ఞాపకాలూనూ..

చలం ఆత్మకథ కూడా తప్పకుండా చదవ వలసిన కథ. రచనలలో చలం,వ్యక్తి గత జీవితంలో చలం వేరు కాదని మనకి తెలుస్తుంది.

 మళయాళ ఆంగ్ల రచయిత్రి కమలా నయ్యర్ (కమల సురయ్య ) నా కథ (My Story) సంచలనం సృష్టిందనే చెప్పవచ్చు.

రచయిత్రి ముదిగొండ సుజాతా రెడ్డి,మల్లెమాల సుందర రామిరెడ్డి,సినీ తారలు డాక్టర్ భానుమతి,జమున , గొల్లపూడి మారుతీ రావు గారు,జయసుధ మొదలైన వారు కూడా ఆత్మ కథలు వ్రాశారు.

ఇప్పుడు నా జీవనయానం లో ..కే.వరలక్ష్మి గారు తన ఆత్మ కథ వ్రాస్తున్నారు.

మనం చదివే పుస్తకం మంచి పుస్తకం అయితే గొప్ప జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. మనపై అమిత ప్రభావాన్ని చూపుతుంది.

నాకు సినిమా వాళ్ళు వ్రాసిన ఆత్మ కథల కన్నా రచయితలూ వ్రాసిన ఆత్మ కథలు నచ్చుతాయి. ఆ ఆత్మ కథలలో సామాజిక అంశాలు,అప్పటి కాలమాన పరిస్థితులు..సంప్రదాయం మొదలగు విషయాలు చాలా విపులీకరించి చెపుతుంటారు. ఆ విధంగా మనకి చరిత్ర లో విషయాలు తెలుస్తుంటాయి.

మంచి పుస్తకం మన చేతిలో ఉండటం చాలా అవసరం కూడా అనిపిస్తూ ఉంటుంది కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత.
మీకు నచ్చిన ఆత్మ కథలు ఉంటే చెప్పండి. (తెలుగు) ఈ సారి అవి కొని చదవడానికి ప్రయత్నం చేస్తాను.

11, జూన్ 2012, సోమవారం

మిల్తీ హై జిందగీ మై మోహబ్బత్ కభీ కభీ

హాయ్.. ఫ్రెండ్స్ ! ఎవరైనా చెప్పగలరా అని అడిగితే  వచ్చిన స్పందన చాలా సంతోషం కల్గించింది.

నాకు చిన్నప్పటి నుండి వివిధ భారతి ముంబై స్టేషన్ నుండి వినవచ్చే హిందీ పాటలు వినడం చాలా ఇష్టం. అలా నేను చిన్నప్పటినుండి వినే పాట .. నేను పుట్టినప్పుడు వచ్చిన సినిమాలోని పాట "ఆంఖే " చిత్రం లో పాట .. అంటే చాలా చాలా ఇష్టం.

కొన్ని పాటలు వింటూ ఆ సాహిత్యం ని అర్ధం చేసుకుంటుంటే మధురాలు ఊరతాయి.అలాటి కోవ లోకి చెందిన పాట ఈ పాట సాహిత్యం చూడండి ఎంత బాగుందో. ! నిన్న నేను పోస్ట్ చేసిన వ్రాతలు నేను చాలా ఇష్టంగా చెప్పిన పాట సాహిత్యమే ! హిందీ నుండి తెలుగు అనువాదం ని నిన్నటి పోస్ట్ లో అందించాను కదా.. ఆ సాహిత్యమే .. మళ్ళీ ఇక్కడ,

"జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు

హృదయంలో నిండినవారికి ఇవ్వడం జరుగుతుంది అప్పుడప్పుడు

చూపుల ప్రశ్నలకు సిగ్గుపడుతూ మోము చాటు చేయొద్దు.
అదృష్టం అలాటి స్థితిలోకి తీసుకు వెళుతుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు

వసంతం గవాక్షం రోజు తెరుచుకోదు ఓ..ప్రియతమా ..
ప్రళయం వస్తుంటుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు

యవ్వనపు దారిలో ఒంటరితనాన్ని  దాటలేవు
మరొకరి అవసరం వస్తుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు

ఈ జన సందోహంలో కలసి పొతే ఎక్కడా మళ్ళీ ఎవరు దొరకరు
దగ్గర కావడానికి సమయం దొరుకుతుంది అప్పుడప్పుడు
హృదయంలో నిండినవారికి నాయకుడు అయ్యే అవకాశం దొరుకుతుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు... "

ఇక్కడ పాట వినేయండీ! చాలా చాలా నచ్చేస్తుంది.. అనుకుంటున్నాను.


హిందీ సాహిత్యం ఇంగ్లిష్ లో ..
సాహిత్యం: షహీద్ లుధియాన్వి
సంగీతం :రవి

Milatii Hai Zindagii Mein Mohabbat Kabhii-Kabhii
Hotii Hai Dilbaron Kii Inaayat Kabhii-Kabhii
Sharmaa Ke MuNh Na Pher Nazar Ke Savaal Par
Laatii Hai Aise MoD Par Qismat Kabhii-Kabhii
Khulate NahiiN Hani Roz Dariche Bahaar Ke
Aatii Hai Jaan-E-Man Ye Qayaamat Kabhii-Kabhii
Tanahaa Na Kat SakeNge Javaanii Ke Raaste
Pesh Aa_Egii Kisiikii Zaruurat Kabhii-Kabhii
Phir Kho Na Jaane Ham Kahiin Duniyaa Kii BhidD Mein
Milatii Hai Paas Aane Kii Muhalat Kabhii-Kabhii
Hotii Hai DilbaroN Kii Inaayat Kabhii-Kabhii
Milatii Hai ZiNdagii Mein Mohabbat Kabhii Kabhii