17, జూన్ 2012, ఆదివారం

నీ - నా అనే భావం

మనుషుల్లో నీ నా అనే భావం మనం ఎంత వద్దనుకున్నా.. పారద్రోలాలనుకున్నా పోయేది కాదు.

మనిషి కి మనిషికి మధ్య "స్వచ్చమైన ప్రేమని వెదకడం అంటే ఎండమావుల నీళ్ళు త్రాగి దాహం తీర్చుకోవడం లాంటిది"

"స్వచ్చమైన స్నేహం దొరకడం అంటే మన అంతరంగాన్ని వేరోకరిలో చూడగలగడం వంటిది"
రెండు సాధ్యం అవుతాయో లేదో.. నేను ప్రయత్నం కూడా చేయలేదు.

అందుకు ఏమంటాను అంటే.. ఈ స్వచ్చమైన స్నేహం,స్వచ్చమైన ప్రేమ రెండు ఇవ్వగలగడం నాకు సాధ్యం కాకపోవచ్చును కదా!

కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ జీవిత భాగస్వామ్యం చేసుకోవాల్సిన వ్యక్తితో బంధం ముడి పడేటప్పుడు ఆ వ్యక్తీ గురుంచే కాకుండా ఆ వ్యక్తి సమీప బంధువులని మన వారిగా భావించడం కూడా అవసరం ..అత్యవసరం కూడా.

ఈ మధ్య నేను విన్న విషయం ఒకటి చెప్పదలచాను.

ఒక మధ్య తరగతి కుటుంబంలోని యువతికి తగిన వరుడిని వెదకడం మొదలుపెట్టారు. కానీ ఆ అమ్మాయికి వచ్చిన సంబంధాలలో ఏ ఒక్కటి మ్యాచ్ అవడం లేదు.

అమ్మాయి చదువుకుంది.ఉద్యోగం చేస్తుంది. ఆమెకి తల్లిదండ్రులు,ఒక తమ్ముడు ఉన్నారు. పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయికి,అబ్బాయి తల్లిదండ్రులకి ఆ అమ్మాయి ఒక షరతు గురించి చెపుతుంది.

పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. వద్దనడానికి వీలు లేదు.ఉద్యోగం చేసినా ఆ డబ్బు భర్తకి ఇవ్వడం గాని భర్త కుటుంబంలోని వ్యక్తుల అవసరాలకి వాడటం కాని చేయకూడదు. ఆ అమ్మాయి జీతం అంతా ఆ అమ్మాయి తల్లిదండ్రులకి మాత్రమే ఇచ్చేటట్లు ఒప్పుకుంటే ..పెళ్ళికి ఒప్పుకుంటాను అని లేక పొతే లేదు అని.చెపుతుంది. పెళ్ళికి ముందే ఇన్ని షరతులు పెట్టె అమ్మాయి భర్త తల్లిదండ్రులు గురించి కూడా నాకు ఏ భాద్యత లేదని అంటే.. అతని పరిస్థితి ఏమిటి? అని అందరికి వస్తున్న సందేహం.

అందువల్ల ఆ అమ్మాయికి వివాహం జరగడం లేదు.

వివాహ విషయాలు మాట్లాడుకునేటప్పుడు ముందు జాగ్రత్తగా కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకోవడం అవసరమే అయినప్పటికీ ఆ అమ్మాయి ఆలోచన ఏమిటో నాకైతే బోధపడలేదు. ఒకవేళ వివాహం తర్వాత భర్త ఆమె సంపాదనని పుట్టింటి వారికి ఇవ్వనివ్వడని భయం కావచ్చు తల్లిదండ్రులని ఆర్ధికంగా ఆదుకోవాలనే తాపత్రయం కావచ్చు. ఆ అమ్మాయి విధించే షరతు లో ముందు జాగ్రత్త ఉంది కానీ ఇలా మాట్లాడటం ని జీర్ణించుకునే అంతగా మన సమాజం మారలేదు.

అలాగే అబ్బాయికి కూడా తల్లిదండ్రి బాధ్యతలు ఉంటాయి కదా!అతను అవన్నీ చూసుకోవాలి కదా! అని మధ్యవర్తిత్వం జరిపే వాళ్ళు ఆమెని అడిగినప్పుడు అవన్నీ నాకు తెలియవు అతని తల్లిదండ్రులని చూసుకుంటాడో లేదో అది అతని ఇష్టం అని జవాబు ఇచ్చింది అట.అంటే భర్త తో పాటు అతని తల్లిదండ్రుల పట్ల ఆ అమ్మాయికి భాద్యత ఉన్నట్లా లేనట్లా? నా భర్త నావాళ్ళు అని కూడా ఆ అమ్మాయికి ఉండాలి కదా ! అమ్మాయిల ఆలోచనలు ఇలా ఉండటం సమంజసంగా లేదని మాత్రం అనుకోగలం.

మన తెలుగు సినిమాలలో.. కుటుంబ భాద్త్యత కోసం వివాహ జీవితాలని త్యాగం చేసిన నాయిక పాత్రలు గుర్తుకు వచ్చ్చాయి. "అంతులేని కథ" లో "సరిత", "సంధ్య" చిత్రం లో" సంధ్య" పాత్ర అప్రయత్నం గా గుర్తుకు వచ్చాయి. త్యాగం చేయడం ఆడవాళ్ళ ఒక్కరి హక్కే కాదు. భాద్యతల కోసం,బంధాల కోసం జేవితాలని కరిగించిన పురుషులు ఉన్నారు.

పెళ్ళికి ముందు కొన్ని మాటలు అనుకోవడం లో అభ్యంతరం ఏమి ఉండదు కానీ ..తప్పని సరి షరతులు పెట్టుకుని.. ఆ ఒడంబడిక పై జీవితం పంచుకుని నడక సాగించడం మాత్రం కష్టమైన పనే!

నాకు తెలిసి చాలా మంది కాకపోయినా.. కొంత మంది అయినా భార్య తల్లిదండ్రులకి సహాయం చేసే వారిని చూస్తుంటాం.అయినా ఈ కాలం లో కన్న తల్లిదండ్రులే పరాయి వాళ్ళు అయిపోయి,అత్తింటి బంధువులే నట్టింట్లో తిష్ట వేసుకున్న సన్నివేశాలు నిత్య కృత్యం అయిపోతుంటే.. ఆ అమ్మాయి ఎందుకు తొందరపడి షరతులు పెట్టి వచ్చిన సంబందాలన్నిటిని చెడగొట్టు కుంటుంది అని వ్యాఖ్యానించాను నేను.

ఏం చేస్తాం ఆడపిల్లల కాలం ఇది.చదువు,ఉద్యోగం..చేతిలో ఆయుధాలు అయిపోయాయి మరి. అన్నారు.ఇంకొక ఆవిడ.

భార్య భర్త ల మధ్య నీ-నా అంతరాలు ఉంటే ఆ కాపురాలు ఎలా సవ్యంగా సాగ గలవు?

నేను చదివిన ..ఓ..పర్షియన్ కథ గుర్తుకు వచ్చింది.
ఇద్దరు ప్రేమికులు ఉంటారు. ప్రేమికుడు.. అర్ధరాత్రి వచ్చి తలుపు తడతాడు. ఆమె లోపలి నుండి.. ఎవరు నువ్వు అని అడుగుతుంది. అతను " నేనే".. అని సమాధానం ఇస్తాడు. ఆమె తలుపు తీయదు.

రెండసారి అతను తలుపు తడతాడు. ఆమె మళ్ళీ అడుగుతుంది ..ఎవరు మీరు అని. అతను మళ్ళీ" నేనే ..నీ ప్రేమికుడిని" అని చెపుతాడు. అయినా ఆమె తలుపు తీయదు.

మూడవసారి అతను తలుపు తడతాడు. ఆమె మళ్ళీ లోపలి నుంచి అడుగుతుంది ఎవరు నీవు ?అని.
అప్పుడు అతను ..ఓ.. ప్రియురాలా.. !నువ్వే నేను. నేనే నువ్వు ..అని బదులిచ్చాడట. అప్పుడు కాని తలుపు తెరవబడ లేదట..

అల్లాటి బంధం ఏర్పడినప్పుడు కాని వారు వేరు వేరు వ్యక్తులు కాదు. ఇరువురు ఒకటే! అనే భావం కల్గితే తప్ప కలసి మనుగడ సాగించలేరు అని తోస్తుంది కదా! మనకు.

దురదృష్టవశాత్తు..నేటి జీవన విధానంలో నీ -నా భావం పెరిగిపోయి ఎవరికీ కావాల్సినవి వారికి లభించాలి.అవి లభించక పొతే.. ఆ కాడిని ఒదిలేసి.. ఇంకో కాడిని వెదుక్కోవటం ..అది నచ్చక పొతే ఇంకోటి వెదుక్కోవడం లో ప్రవేశించి చాలా కాలం అయిపొయింది.అందుకే ముందు జాగ్రత్తగా ఇలాటి షరతులు ఏమో అని కూడా అనుకున్నాను.

ఆలోచనా విధానం లో మార్పులు జీవితాల గతినే మార్చివేస్తున్నాయి. లైఫ్ గ్యారంటీ యే కాదు.. లైఫ్ పార్టనర్ గ్యారంటీ కూడా లేని కాలం ఇది.

నీ-నా అనే భావం తగ్గించే విధం గా ఇరువురి భావనలు ఏకమైన ఒక పాట వినండి.
నువ్వు నేను ఏకమైనాము ఆనేపాట ని విని చూడండి.

12 వ్యాఖ్యలు:

Sai చెప్పారు...

చాలా బాగా చెప్పారండీ...నిజం..
నువ్వు-నేను అనే భావం ఉండనే కూడదు..

భాస్కర్ కె చెప్పారు...

chakkaga chepparandi,
mari a ammay problems ento,
evvaru guide chesthunnaro.

పల్లా కొండల రావు చెప్పారు...

మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా ఉన్నంత కాలం మనిషిని-మనసుని 'మనీ' శాసిస్తుంది. వ్యవస్థలో మార్పు ద్వారా మనిషి మనీషి గా మహాత్ముడిగా మారగలడు. మనుషుల మధ్య అంతరాలను మనిషి సృష్టించుకున్నవే. వాటిని వదిలించుకోవలసిందీ మనిషే. అది అసాధ్యమేమీ కాదు. సుదీర్ఘ పోరాటం లో క్రమంగా రూపుమాసి పోతాయి. కానీ ఈ వ్యవస్థ ఇలాగే ఉంటూ మానవత్వపు విలువలు కోసం వెతకడమంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి బాధపడడమే అవుతుంది.

అజ్ఞాత చెప్పారు...

!నువ్వే నేను. నేనే నువ్వు ..
ఇలా అనుకోలేక బాధలు కొని తెచ్చుకోడం

కాయల నాగేంద్ర చెప్పారు...

ఈ కులుషిత వాతావరణంలో పడి ఆ అమ్మాయి మైండ్ బ్లాక్ అయింది. వెంటనే కౌన్సిలింగ్ అవసరం.

జలతారు వెన్నెల చెప్పారు...

వనజ గారు, నాకు ఆ అమ్మాయి పెట్టిన షరుత్తులో తప్పేమి కనపడలేదు. సమాజం మార్చ గలిగేవారు ఆ అమ్మాయి లాంటి వారే! అబ్బాయి తల్లితండ్రులకు ఆర్ధికం గా సహాయపడటం కాని, ఏ విషయం లోను లోటు లేకుండా చూసుకోవడం బాధ్యత అయినప్పుడు, అమ్మాయి కూడా తన తల్లితండ్రుల కు ఆర్ధికపరంగా సహాయ పడాలనుకోవటం లో తప్పేమి లేదు. సమాజం ఇంకా అంత ఎదగలేదు కనక, (అమ్మాయి పెళ్ళి అయ్యాక, తన తల్లి తండ్రులకు క్రమం తప్పకుండా ఆర్దిక సహాయం చెయ్యటం అన్నది accept చెయ్యగల స్తితి) ఆ అమ్మాయి ముందు ముందు పొరపత్యాలు రాకుండా తీసుకునే ముందు జాగ్రత్త లా అనిపించింది.మధ్యవర్తిత్వం చేసే వాళ్ళకి కూడా ఆ అమ్మాయి అబ్బాయి ఎమీ చెయ్యలనుకుంటున్నాడొ అతని ఇష్టం అనడం లో నాకైతే తప్పు కనిపించలేదు.

శశి కళ చెప్పారు...

నిజం చెప్పారు వనజగారు...ఇప్పుడు సంబంధాలలో అలాగే మాట్లాడుకోవటం జరుగుతుంది.
తప్పొప్పుల ప్రసక్తి లేదు ఏమో...ఎవరి వీలు వాళ్ళు చూసుకుంటున్నారు.ఒకరికి ఒకరు ఉండటం చాలా సమస్యలు లేకుండా చేస్తుంది

అజ్ఞాత చెప్పారు...

చాలా ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు...

వనజ తాతినేని చెప్పారు...

సాయి .. గారు మీ స్పందనకి ధన్యవాదములు.
@ది ట్రీ భాస్కర్ గారు.. ధన్యవాదములు.
@పల్లా కొండలరావు గారు..నిజమేనండీ! ఆర్ధిక సంబంధాలే మానవ సంబంధాలు . మీ స్పందనకి ధన్యవాదములు.

వనజ తాతినేని చెప్పారు...

కష్టేఫలె గారు.. ఇప్పుడు నీ-నా భేదమే ఎక్కువగా ఉంది కదండీ! మనం అని అనుకున్నప్పుడే జీవిత రధం నల్లేరు మీద నడకలా సాగుతుందేమో అని అనుకోకపోవడం విచారం. ధన్యవాదములు.
@ నాగేంద్ర గారు మీరు అన్నట్లే నాకు ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ అవసరం అనిపించింది. ధన్యవాదములు.
@ జలతారు వెన్నెల గారు..ఆ అమ్మాయి తన వైపు మాత్రమే ఆలోచిస్తుంది. రెండవ వైపు ఆలోచించడం లేదు. పెళ్ళైతే భర్త కి ఉన్న తల్లిదండ్రులని చూసుకోవాల్సిన భాద్యత కూడా ఆమెకి ఉంది కదా!. ఆమెకి తల్లి తండ్రి ఎంత విలువైనవారో,అతనికి అతని తల్లిదండ్రులు ముఖ్యమే కదా!ఇరువురు కలసి ఇరువురి భాద్యతలు కలసి పంచుకోవాలని చెప్పి ఉంటే సాన్జసంగా ఉండేది కదా..అని నా అభిప్రాయం.
మీ స్పందనకి థాంక్ యు!
@శశి కళ గారు.. థాంక్ యు వేరి మచ్! బాగున్నారా?
@mhsgreamspet ..రామకృష్ణ గారు.. థాంక్ యు వేరి మచ్..

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

కొత్త కోణం .అమ్మాయి ఆస్తి లో భాగం తీసుకున్నప్పుడు తల్లి తండ్రులను సాకే బాధ్యత కూడా తీసుకోవాలి.సమస్యంతా ఇక్కడే వుంది.అమ్మాయిని ఎంతోకొంత ఇచ్చి సాగనంపి ఆస్తి అబ్బాయికిస్తే అబ్బాయిలే సాకాలి కదా మరి.ఆడపిల్లలకి ఆస్తి హక్కు వచ్చింది కానీ సరిగా అమలు కావటం లేదు.

వనజ తాతినేని చెప్పారు...

రవి శేఖర్ ..గారు తల్లిదండ్రులని చూడాలంటే ముఖ్యంగా ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే బాధ్యత దానంతట అదే వస్తుంది. ఆలుమగలు ఇరువురు ఇద్దరి భాద్యతలని పంచుకోవాలనుకుని అనుకుంటే.. అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఏమైందండీ!ఎవరైనా ఒకటే కదా! మనలో ఆ భావనలు పోయినప్పుడే నీ-నా బేధం పోతుందని నా అభిప్రాయం అండీ! మీ స్పందనకి ధన్యవాదములు.