13, జూన్ 2012, బుధవారం

పుస్తకాలని మింగేసిన సొగసు..

ఒక అయిదు రోజుల క్రితం నా స్నేహితురాలు వైష్ణవి చెప్పాపెట్టకుండా వచ్చేసింది.

నీకు ఎంత దైర్యం ..కాల్ కూడా చేయకుండా వచ్చేశావు? అన్నాను.


నువ్వు ఎక్కడికి వెళతావ్?నీకు ఇల్లే కదా స్వర్గసీమ.నెట్ సీమనే ప్రపంచం అంది కొంచెం ఎగతాళి, జాలి కలిపి


తను చెప్పింది నిజమే! ఎన్నోసార్లు ఎక్కడికైనా వెళ్ళాలనుకుని లాస్ట్ మినిట్ లో కూడా డుమ్మా కొట్టి ముసుగు తన్ని పడుకున్న సందర్భాలు చాలా ఉంటాయి.


నువ్వు ఎవరిలోనూ కలవలేవు..అన్న అపవాదులు వస్తుంటాయి.


సమూహంలో ఉన్నా ఒంటరి తనం వరించే కన్నా .. ఒంటరి తనంలోనే స్వేచ్చ ఉందని సమూహపు శక్తి ఉందని వాళ్ళకేమి తెలుసు పాపం అనుకుంటాను.


మా వర్కర్స్ అందరు ఎండల వేడికి తట్టుకోలేక ఇళ్ళకి పరుగులు తీసారు. అబ్బ నాకు బాగా రెస్ట్ దొరికింది అని సంతోషం కల్గింది.


మా ఫ్రెండ్ వైష్ణవి ఎక్కడికి అయినా వెళదామా !? అని అడిగింది. శ్రీ శైలం ,కిన్నెరసాని,ఉజ్జయిని
..ఈ మూడు తన చాయిస్.

నేను ఇప్పుడు కాదులే!అన్నాను. సరే.. ఓ..నాలుగు గంటల కబుర్లు తర్వాత వెళతాను అంది. అప్పుడేనా ..అన్నాను. మరి సినిమాకి వెళదామంటే!? ఉంటాను అంది.


రాక్షసి..నాలుగేళ్లగా ట్రై చేస్తుంది. నాతొ సినిమా చూపించాలని.నన్ను వదిలేయి తల్లో..! అని ఈ సారి అనలేదు. తన కోసం వంద గజాల దూరంలో మా ఇంటి వెనుక ఉన్న ధియేటర్ లో సినిమాకి టికెట్స్ తెప్పించుకుని వెళ్ళాం.:ఏడేళ్ళ తర్వాత నా వీక్షణంలో చోటు చేసుకున్న చిత్రం "గబ్బర్ సింగ్"


సరే ఎక్కువగా చిరంజీవిని చూసినట్లు,అప్పుడప్పుడు పవన్ కళ్యాన్ ని చూసి నట్లు.. డాం డాం అంటూ..ఎన్ని వందల బుల్లెట్లు పేలిన శభ్దాలు వింటున్నాను అనుకుంటూ..నాకు కావాల్సిన కాస్ట్యూమ్స్ డిజైన్స్ చూస్తూ..(సినిమా మొత్తం లో నాకు అవే విలువైనవి.ఎందుకంటే.. ఆ డిజైన్స్.. కొందరికి అన్నం పెడతాయి..నాకు కొంత డబ్బు సంపాదించి పెడతాయి కాబట్టి).మనసులో ఘాడంగా ముద్ర వేసుకుని పవన్ కళ్యాన్ క్యాస్తూమ్స్ ని వీలైనంత మెచ్చుకుని.. హమ్మయ్య సినిమా అయింది అని దీర్ఘంగా నిట్టూర్చి ..ఇంటికి వచ్చి పడ్డాం.


మళ్ళీ కాసేపు బ్లాగ్ ముచ్చట్టలలో పడ్డాం కూడా. కాసిని పాటలని కళ్ళల్లో వేసుకుని,సంగీతానికి సేదతీరి సినిమా తాలూకు జిడ్డుని,దురదని వదిలించుకుని.. నిద్దర పోయాం.


తెల్లవారి వైష్ణవి వేళతానూ అంటూ.. బయలు దేరింది. అమ్మాయి సిటీ లోకి నేను వస్తాను ఉండు. ఇవాళ కాస్త మేఘాలు గొడుగు పడుతున్నాయి. హాపీ గా షాపింగ్ చేసుకుందాం అని పదకొండు గంటలకల్లా బయలుదేరి పోయాం.


మొట్టమొదటగా ఏలూరు రోడ్డుకి వెళ్ళాలనుకున్నాం. అక్కడే కదా అన్ని పుస్తకాల షాపులు. ఇక లెనిన్ సెంటర్ లో సెకండ్ హాండ్ పుస్తకాలు దొరికేవి.


నేను అయితే కొనుక్కోవాలనుకున్న పుస్తకాల పేర్లతో.పెద్ద లిస్టు రాసుకున్నాను.


సాహితీ విరూపాక్షుడు,విషాద కామ రూప, విముక్త,జమీల్యా,అనుభవాలు-జ్ఞాపకాలు,స్వీయ చరిత్రం,శశిరేఖ ..ఇంకా మిత్రులు అడిగిన తన్హాయి .ప్రజా శక్తి బుక్ స్టాల్ కూడా చూడాలనుకున్నాను

వెళ్ళే ముందు. కొంత డబ్బు మాత్రమే తీసుకుని క్రెడిట్ కార్డు అన్నీ భద్రంగా బీరువా లోపల పడేసి (అక్కడ కొంత కంట్రోల్ ఉండటం కోసం అన్నమాట) వెళ్ళాను

సరే.. ఇంటి ముందు బస్ ఎక్కేసి బీసెంట్ రోడ్డు దిగాం.చిన్న షాపింగ్ పని చూసుకుని..వెళ్లిపోదాం అనుకున్నాం. కానీ చపల చిత్తముల్ కదా.. ఓ.. షోరూం లోకి దారితీసాం. అక్కడ ఖర్చు పెట్టాలనుకున్న డబ్బు వేరుగా..పుస్తకాల లిస్టు కోసం వేరుగా పెట్టిన డబ్బు అన్నీ ..కలిపి.. రంగుల చీరల అందానికి దాసోహం అయిపోయినాయి. నిజంగా చెప్పాలంటే అక్కడ ప్రాధాన్యత డబ్బు-షాప్ లో చీరలు మాత్రమే నిజం. నేను మాత్రం నిమిత్తమాత్రురాలిని.ఆఖరికి ఓ..అయిదు వందలైన బుక్స్ కోసం కేటాయించాలనుకుని బయటపడబోతు..కాష్ కౌంటర్ ముందు..డబ్బు చెల్లించి బయటపడబోతు.. అలా ..క్షణకాలం చూసాను.

నన్ను అమితంగా ఆకర్షించిన


"అదిగదిగో..నల్లని రంగు పై..చిల్లి రెడ్ పోల్కం బుతీస్ ఉన్న బ్రాసో శారీ " అబ్బ ఎన్నాళ్ళ నుండి వెదుకుతున్నాను లో బడ్జెట్ లో పోల్కం బుటీస్ చీర కోసం ..అంటూ.. ఆ చీర ధర చూసి పర్సులు వెదుక్కున్ని మరీ ఇద్దరి పర్స్ లలోని డబ్బు లెక్క కట్టి ఆ చీరకి సరి పోయిన తర్వాత హమ్మయ్య..చీర సొంతం అని సంతోష పడి.. ఎవేరేస్ట్ ఎక్కిన ఆనందం పొంది బయట పడ్డాం.


ఇంకెక్కడి పుస్తకాల షాప్ !!?? గోవిందా గోవిందా..!


కానీ నాకు తెలుసు.. వేలాది రూపాయలు పోసి కొన్న చీరని కట్టినప్పటి అందం కన్నా .. ఒక పుస్తకం చదివినపుడు కల్గిన జ్ఞానం అందం మన నడకలో.. అడుగు అడుగునా,మన ముఖంలో అణువూ అనువునా ఉట్టి పడుతుంది అని.


నేను కొన్న బ్లాక్ &రెడ్ పోలకం బుటీస్ బ్రాసో చీరని నా కళాత్మక ఆలోచనలు నింపి మా వర్కర్ల పనితనం జేర్చి డిజైనర్ ఫీస్ గా మార్చి అలా పెడతానో లేదో.. ఎవరో ఒకరు మెచ్చేస్తారు. కాని
నేను మాత్రం ఎవరికో ఒకరికి మాత్రమే సేల్ చేస్తాను. అప్పుడు బోలెడు పుస్తకాలు కొనుక్కోవచ్చు అనుకుంటాను.

కానీ ..
అమ్మో..చీరని వదలడమే! ఎంత మాత్రం కుదరదు. కుదరుదంతే! బుజ్జి ముండ ఎంత అందంగా ఉంది. మా అత్తమ్మ మొహం చిట్లించినా సరే! మా రమ,మా చెల్లి..ఇంకా నలుపు వీరాభిమానులు పోటీ పడినా సరే.. ఇవ్వను కాక ఇవ్వను.

ఇప్పుడు .. ఎవరు నాకు చీర పెట్టాలని అనుకుంటున్నారో..వాళ్ళ కోసం వెదుకుతాను..వెదుకుతున్నాను. చీర నా వార్ద్రోబ్ లో.. పుస్తకాలు నా కంటికి ఎదురుగా చదవమని ఊరిస్తూ.. అదీ దృశ్యం అన్నమాట. ముందరున్న దృశ్యం.

6 వ్యాఖ్యలు:

జ్యోతిర్మయి చెప్పారు...

స్నేహితురాలితో ఓ రోజు...మీకు ఎండలు తగ్గాయన్నమాట..బావుందండీ...

భాస్కర్ కె చెప్పారు...

cheere gelichindi,
bhaagundandi mee kathanam.

జలతారు వెన్నెల చెప్పారు...

ఆ నలుపు చీర నాకే! మీరు అలా అలా కరిగిపోయి ఇచేస్తున్నారు నాకే!!! :)) సరదాకి అడిగానండోయి వనజ గారు

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంతకీ "గబ్బర్ సింగ్" ఎలా ఉంది అండి

Meraj Fathima చెప్పారు...

nijame kadaa meeru sremapadi thayaaru chesi verevariko ivvaleru, poneee vennelagaarike ichheyandi

వనజ తాతినేని చెప్పారు...

జ్యోతిర్మయి గారు..ఎండలు తగ్గాయి అండీ.. నాకు కూడా బాగా తీరిక దొరికింది.అందుకే కాస్త రిలాక్స్ గా ఉంటున్నాను. థాంక్ యు!
@భాస్కర్ గారు.. చీరల కబుర్లు కాదండి..అక్కడ బుక్స్ కొనుక్కోలేదనే బాధ ఎక్కువగా ఉంది. కొద్ది రోజుల్లో..చాలా లిస్టు నాదగ్గర ఉంటుంది.థాంక్ యు!
@జలతారు వెన్నెల గారు..అలాగే ,అలాగే..:) థాంక్ యు!!
@ ప్రిన్స్.. మళ్ళీ ఒకసారి పోస్ట్ చదివేయండి..గబ్బర్ సింగ్ గురించి నేను ఏం చెప్పానో.. తెలిసి పోతుంది. :)) ఓకే.. థాంక్ యు!!
@మీర్జా ఫాతిమా ..గారు.. అలాగే .. అలాగే!ఇంతకీ మీ పేరు నేను సరిగానే ఉచ్చరించానా!? థాంక్ యు!!