28, జూన్ 2012, గురువారం

మా "వాఘ్య"

అన్ని జన్మలకన్న ఉత్కృష్ట మైన మానవ జన్మ ఎత్తిన మనం ఇతర జీవుల పట్ల భూతదయ కల్గి ఉండటం చాలా మంచిది.అవసరం కూడా

మనతో పాటు ప్రకృతిలోని అన్ని జీవులకు జీవించే అవకాశాన్ని మనం కల్పించాలి.ఒక వేళ అలా కల్పించలేకపోయినా వాటి జీవన విధానానికి మనం భంగం వాటిల్ల నీయకుండా  ప్రక్కకు తొలగి వెళ్లిపోవాలి.

చాలా మంది ఇతర జీవుల పట్ల చాలా దయతో ప్రవర్తిస్తుంటారు.అలాటి వారిని చూసి నేను మనఃస్పూర్తిగా హర్షిస్తూ ఉంటాను.

 "మాలాకుమార్" గారి సాహితీ బ్లాగ్లో "మా వీధి మహారాణి కి పురుడొచ్చింది " చూసి వచ్చిన తర్వాత గుండె బరువెక్కింది.

అందుకు కారణం  మా "వాఘ్య"

"వాఘ్య" అంటే మరాఠా యోధుడు చత్రపతి శివాజీ పెంపుడు జంతువు. విశ్వాసానికి,స్వామి భక్తి కి నిదర్శనం.." వాఘ్య" శివాజీ మరణించిన తర్వాత అతని చితి మంటలలో దూకి తన స్వామి భక్తి ని చాటుకున్న కుక్క "వాఘ్య"

నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. ఛత్రపతి శివాజీ చరిత్ర అంటే మరీ ఇష్టం.

ఆ ఇష్టం వలనే.. మేము పెంచుకుంటున్న కుక్క పిల్లకి "వాఘ్య" అని పేరు పెట్టాను.

మేము పెంచుకోవడం అనేకంటే మా అబ్బాయి "నిఖిల్ చంద్ర " ప్రేమగా పెంచిన "వాఘ్య" అంటే బాగుంటుంది.

మా అబ్బాయి చాలా సున్నిత మనస్కుడు. తనకి మొక్కలన్నా,జంతువులన్నా వల్లమాలిన ప్రేమ.

నాకు పెళ్ళై  అత్తవారింటికి వెళ్ళే టప్పటికి మా ఇంట్లో రెండు "భైరవ"లు ఉండేవి.

ఒక దాని పేరు రాజు. రెండవది "నాన్సీ" (నాన్సీ రీగన్ ప్రభావం ఏమో..మావారు దానికి అలా నాన్సీ అని పేరు పెట్టారు)

ఈ రెండు మా ఇంటికి సింహాలవలె కాపలా .కాసేవి. చీమ చిటుక్కుమన్నా పసిగట్టి మమ్మల్ని జాగురుకత తో మేల్కొల్పేవి. మా పెయ్యలతోను,కోళ్ళ తోనూ కూడా ఆడుకునేవి . వాటి ఆటలు చూస్తే ఎంతొ సరదాగా ఉండేవి కూడా.

"రాజు" అయితే రాజు లాగే ఉండేది . ఇంత పొడవుగా ఉండేది. వెన్ను విరిచి నిలబడిందంటే..చూసేవాళ్ళకి పై ప్రాణాలు పైనే పోయేవి. వాటికి ఆహారం పాలు,అన్నం అప్పుడప్పుడు గ్రుడ్లు..అంతే!

అర్ధరాత్రుళ్ళు మా పొలం లో జొరబడి దొంగతనంగా అరటి తోటలో గెలలు నరుక్కుని వెళ్లేవారి పని పట్టాలన్నా  లేదా.. నీళ్ళ కాలువలకి అడ్డువేసి నీళ్ళు వాళ్ళ  పొలాలలోకి మళ్ళించు కునేవారిని గుర్తించాలనుకుని  యజమాని బయలుదేరి .. రాజూ ..వెళదాం . రా!  అనగానే అలా గస్తీ కి వెళ్ళేటప్పుడు.. యజమాని కన్న ముందే పరుగులు తీసి..వాళ్ళని నిలువరించేది. కదిలితే..కండలు ఊడిపోవాల్సిందే! అలాటి రాజు.ఏడెనిమిదే ఏళ్ళు మాతో ఒకరిగానే మెలిగేది. ఒకరోజు హటాత్తుగా మాయమయిపొయింది. చుట్టూ ప్రక్కల ఊర్లలో కూడా వెతికారు. ఎక్కడా కనబడలేదు. ప్రాణాలతో ఉంటే..మా రాజు.. ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్న తిరిగి వచ్చి ఉండేది. ఎవరో వచ్చి మత్తుమందు జల్లి బస్తాలో కట్టి వేసుకుని వెళ్లిపోయారని తర్వాత తెలిసింది. మా ఇంట్లో ఎవరు గ్రుక్కెడు మంచి నీళ్ళు త్రాగకుండా ఏడ్చి..ఏడ్చి..ఊరుకున్నాం.

ఇక నాన్సీ రాజు లేని దిగులుతో.. తొందరగానే చనిపోయింది.

తర్వాత మా ఇంట్లోకి మళ్ళీ పెంపుడు జంతువులని అంగీకరించలేకపోయాం కూడా.

మా అబ్బాయి కొంచెం పెద్దవాడు అయ్యాక తన చదువు కోసమని చెప్పి మా వ్యవసాయ క్షేత్రం ని వదిలి ఒక విలేజ్  లోకి షిఫ్ట్ అయ్యం. అక్కడ అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. మా అబ్బాయి రోజు గుడి దగ్గర వాలే పావురాళ్ళని చూసి తను పావురాళ్ళని పెంచుకోవాలని ఇష్టపడ్డాడు.సరే అని వాళ్ళ నాన్నగారు రెండు పావురాలని తెప్పించి పంజరాలు ఏర్పాటు చేయించి ఇచ్చారు. వాటికి ధాన్యం ఆహారం గా పెట్టేవాళ్ళం. బాగా అలవాటు అయ్యేవరకు పంజరంలోనే ఉంచి..బాగా అలవాటు అయ్యాయి అనుకున్న తర్వాత   బయటకి స్వేచ్చగా వదిలేసేవాళ్ళం. అలా పావురాల కువ కువలతో.. మా ఇల్లు సందడిగాను ఉండేది. కాస్త అపరిశుభ్రం గాను ఉండేది. అది నాకు అసలు నచ్చేది కాదు. ఒక విధమైన నీచు వాసన ..ఆ వాసన రాకుండా బోలెడంత శ్రమ పడాల్సి వచ్చేది. అందుకనే పంజరాలని మా ఇంటి బయట ఉన్న నూరు వరహాల చెట్టుకి వేలాడదీసాను.అందులో అప్పుడప్పుడు మాత్రమే ఉండి..ఎక్కువ సేపు క్రిందనే తిరిగేవి.

మా అబ్బాయి స్కూల్ నుంచి రావడం వాటిని చేతుల్లోకి తీసుకోవడం..వాటికి కబుర్లు చెప్పడం,ధాన్యం వేయడం..ఇలా పొద్దంతా గడిపెసేవాడు. హోం వర్క్ లు చేయకుండా అలా చేస్తే ఊరుకుంటానా..! బాగా కోప్పడే దానిని.

ఒకరోజు తెల్లవారేసరికి రెండు పావురాళ్ళు విగత జీవులై పడి ఉన్నాయి.ఇక మా అబ్బాయి ఏడుపు చూడలేము.అలా ఏడ్చాడు అన్నమాట.. పావురాళ్ళ మరణం కి కారణం ఏమంటే అర్ధరాత్రి ఒక పిల్లి కోడి పిల్లలని తినడానికి వచ్చి అవి దొరకక పావురాళ్ళ పై దాడి చేసి మెడని కొరికేసి చంపేసింది.

ఇది జరిగిన కొన్నాళ్ళకి మా ఇంటి వెనుక భాగంలో బాడుగ కి ఉండే ఓ..ముస్లిం కుటుంబం వారికి పెద్ద ఆల్షేషియన్ డాగ్ ఉండేది. వాళ్ళ కుటుంబానికి దానికి ఆహారం పెట్టడం తలకి మించిన భారం అయ్యేది. ఆ ఆల్షేషియన్ డాగ్ కి వాళ్ళు పెట్టె ఆహారం చాలక చాలా కోపంతో.. కట్టేసిన గొలుసులని కూడా తెంచేసి  మీద పడేది. ఓ.. నాలుగు అడుగుల పొడవు వంద కేజీలు బరువు ఉండేదేమో కూడా.. దానిని అదుపు చేయాలంటే చాలా కష్టం అయ్యేది.

ఆ కుక్క యజమాని ..నాకు ఒక విషయం చెప్పారు. మేము ఈ కుక్కని పెంచలేకపోతున్నాం..ఎవరికైనా ఇచ్చేద్దాం అంటే మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఆ కుక్క చూలింత కూడా. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు తీసుకుని దీని ని అమ్మేస్తాం. అప్పటి వరకు మీరు ఒక పూట ఆహారం పెట్టారా ..అని అడిగింది. నేను సరే నని ..ఆ కుక్కకి ఆహారం పెట్టేదాన్ని.ఓ..అరకేజీ బియ్యం నాలుగు గ్రుడ్డ్లు, వాటితో పాటు..ఓ..అరకేజీ మాంసం కూడా దానికి పెట్టాల్సి వచ్చేది. నేను తప్ప ఆ కుక్క సమీపం కి ఎవరు వెళ్ళేవారు కాదు. నేను ఆహరం పెడతాను కాబట్టి నన్ను ఏమి అనేది కాదు.
ఆ కుక్క..ప్రసవించి మూడు పిల్లలు పెట్టింది. రెండు ఆడ + ఒక మగ. పుట్టిన నాలుగు రోజులకి ఆడ కుక్క పిల్లలని ఒక్కోదానిని ఆరు వేల రూపాయలకి ఆ ముస్లిం కుటుంబం వాళ్ళు అమ్మేసుకున్నారు. ఇక మిగిలింది మగ కుక్క పిల్ల. (ఆడ కుక్క పిల్లలకి రేటు ఎక్కువట.ఉత్పత్తి కోసమేమో!)

మా అబ్బాయి రోజూ  ఆ కుక్క పిల్లని చూసి మురిసి పోయేవాడు కాని తల్లి కుక్కని చూసి భయపడి దగ్గరికి వెళ్ళేవాడు కాదు.

మనం ఆ బుజ్జి కుక్క పిల్లని పెంచుకుందాం అమ్మా ! అని అడిగాడు.ఆ బుజ్జి ముండని చూస్తే..నాకు ముద్దు వచ్చింది.అలాగే అన్నాను.నేను తల్లి కుక్కకి ఆహారం ఇవ్వడం మూలంగా నాకు ఆ బుజ్జి ముండని ఫ్రీగా ఇచ్చేసారు.
సాయంత్రానికి తల్లిని అమ్మేసారు. అలా తల్లిబిడ్డల రుణాన్ని కాష్ చేసుకోవడం బాధ అనిపించిది కాని..ఆ ఆల్షేషియన్ పెంచడం మాత్రం చాలా కష్తం  పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు..? అని బాధపడ్డాను

ఇక మా ఇంట్లో పెరిగే బుజ్జి కుక్క పిల్లకి "వాఘ్య" అని నామకరణం చేసాను. దానికి తల్లికి లా మాంసాహారం ఇవ్వకూడదనుకుని ఒక్క పాలు మాత్రమే అలవాటు చేసాం. అప్పటికి ఈ పెడి గ్రిల్ గట్రా ఉంటాయని నాకసలు తెలియదు.మా "వాఘ్య" కి స్నానం చేయించడం పాలు త్రాగించడం,దానిని ముద్దులాడటం మా అబ్బాయి వంతు.

"వాఘ్యా..అని పిలవడం ఆలస్యం.. పరుగులు పెట్టేది. నోరు తెరిచిందా  ఆపడం భలే కష్టం గా ఉండేది. వాఘ్యా..అన్న పేరు.. చాలా ఫేమస్.అయి కూర్చుంది అడిగిన వారికి అడగని వారికి అందరికీ వాఘ్య అంటే ఎవరో దాని స్వామి భక్తి ఏమిటో తెగ చెప్పేసేదానిని కూడా!. భలే పేరు పెట్టారండీ.వెదికి పెడతారు అన్న కాంప్లిమెంట్ వచ్చేది.  అది నాకు చాలా గర్వంగాను ఉండేది.

నెల్లూరు జిల్లాలో నవంబర్ మాసం అంటే..తుఫాను ల కాలం అన్నమాట. ఆ సంవత్సరం ఎడతెగని వర్షాలు కురిసాయి. నాకు విపరీతమైన జలుబు  ఎన్ని మందులు వాడినా కంట్రోల్ అయ్యేది కాదు. అప్పుడు డాక్టర్ అడిగారు..మీ ఇంట్లో పెంపుడు జంతువులూ ఉన్నాయా..? అని

నేను మా వాఘ్య గురించి చెప్పాను. అయితే దానికి దూరంగా ఉండండి అని చెప్పారు. అంతే! ఇక వాఘ్యకి మా ఇంట్లో ప్రవేశం లేకపోయింది. బయట వరండాలో కట్టేసే వాళ్ళం.వాఘ్య చిన్నది కాబట్టి దానికి టాయిలెట్ హాబిట్స్ ఇంకా బాగా అలవాటు కాలేదు. అనారోగ్యం వల్ల శుభ్రం చేయాలంటే నాకు చాలా చిరాకు వచ్చేది. అప్పట్లో చాలా మానసిక మైన ఒత్తిడి ఉండటం వల్లనేమో నేను ఎలర్జికల్ ఆస్తమా కి గురి అయ్యాను.

అందుకని "వాఘ్య" ని వరండాలో నే ఉంచడం వల్ల వర్షానికి తడచి పోయేది. వర్షపు జల్లుల నుండి తప్పించుకుని వర్షం పడని చోటున తలదాచుకోవడానికి నేను అవకాశం ఇవ్వలేదు. వాఘ్యాని గొలుసుతో బందించి వేసాను. అలా రెండు రోజులు తడచి దానికి జ్వరం వచ్చి కన్ను తెరవకుండా పడి ఉండేది. మా వారు పశువుల హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఇంజ్జక్షన్ చేయించారు. కానీ ఫలితం లేకపోయింది. "మా వాఘ్య" చనిపోయింది.

చనిపోయిన "మా వాఘ్య" ని చూసి ..మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు. నువ్వే.. శుభ్రం శుభ్రం అంటూ..వర్షంలో కట్టేసి..దానిని చంపేసావు..నువ్వే చంపేసావు.. నువ్వే చంపేసావ్ !! అని నన్ను పదే పదే కోపంగా,రోషంగా అన్నాడు.

నేను మనసులో ఎంతో.. ఏడ్చాను. (ఇప్పటికీ  ఆ విషయం తలచుకుంటే నాకు దుఃఖం ముంచుకొస్తుంది. ఇప్పుడు కళ్ళ నీళ్ళు కారుతున్నాయి) నేను తప్పు చేసానని అర్ధం అయింది. మా అబ్బాయి నన్ను నిందించడంలో తప్పు లేదనికూడా అనుకున్నాను.

జ్వరంతో..కళ్ళు తెరవకుండా ఉన్నప్పుడు కూడా.. వాఘ్యా.. అని పిలిస్తే..మెల్లగా కనులు విప్పి తోక ఊపి మళ్ళీ నీరసంగా కళ్ళు మూసుకున్న మా వాఘ్య నే గుర్తుకు వస్తూ ఉంటుంది. వాఘ్యని మరువడం నా వల్ల కాలేదు. (అంతర్లీనంగా దాని మరణం కి కారణం నేనే అని ఏమో)

మా అబ్బాయిని వాఘ్య మరణం నుండి బయటకి తీసుకు రావడం చాలా కష్టం అయింది. వెటర్నరీ డాక్టర్ వచ్చి .. వాఘ్య తల్లి కి వ్యాక్సిన్ సరిగా వేయించక పోవడం వల్ల వాఘ్య మాత్రమే కాదు..తనతోపాటు పుట్టిన పిల్లలు అన్నీ కూడా చనిపోయినవి ..అని చెప్పాక గాని .. కొంచెం శాంతపడినట్లు కనబడలేదు. వాఘ్య..వాఘ్య అని మాతో పిలిపించుకుని.. పసి దానిగా ఉండగానే మాకు దూరమైన వైనం నాకు చాలా  చాలా బాధాకరం.

నిజానికి పుట్టిన తర్వాత ఇమ్యునైజేషన్ కోసం వ్యాఘ్య కి వాక్సినేషన్ వేయించాలని కూడా నాకు తెలియదు. అలా జరిగిపోయింది అంతే!

మా అమ్మ..అనేవారు..ఈ ఇల్లు బాగో లేదమ్మా, బిడ్డ ముచ్చట పడి పావురాళ్ళు పెంచుకుంటే చనిపోయాయి,కుక్క పిల్లని పెంచుకుంటే అదీ చనిపోయింది. నీకు  కూడా ఆరోగ్యం సరిగా లేదు..అని బాధపడేవారు. నేను కూడా ఏమిటో ఇలా జరుగుతున్నాయని  భయపడ్డాను కూడా ! అప్పటి పరిస్థితి అది.

ఓ..రెండు ఏళ్ళ క్రితం కూడా మా అబ్బాయి..మనం కుక్కపిల్లని పెంచుకుందాం  అమ్మా  అని అడిగితె  నేను తీవ్రంగా వ్యతిరేకించాను.మన ఇంట్లో మరో వాఘ్య ని ఉండటం చూడలేను "వద్దు" అన్నాను.

"వాఘ్య " ని నేను మరువలేను. ఆ చిన్ని ప్రాణం మరణానికి నేను కారణం అయ్యానేమో అని నాకు తీరని వేదన.

మా అబ్బాయికి నేనెప్పుడు ఆ విషయంలో సారీ చెపుతుంటాను .

అలాగే ఏ మాత్రం భూతదయ లేకుండా ఓ..చిన్ని ప్రాణం పట్ల నేను చూపిన నిర్దయ.. నన్ను నేను క్షమించుకోలేనిది. వ్యక్తిగా నాలో ఉన్న ఈ లోపం నన్ను వెంటాడేది వేదించేది.

ఇలా పంచుకున్నందుకు.. బాధ నుండి నేను కొంచెం తెరిపిన పడ్డాను అనుకుంటూ...

స్వామి భక్తికి ,విశ్వాసానికి నిదర్శనం ఈ అసలైన "వాఘ్య"



8 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

మనలోని మనసు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంతస్సంఘర్షణకు లోనయినప్పుడు మనమేంటో మనకు ఎంతో కొంత తెలుపుతుంది. బోయవాడు వాల్మీకి గా మారింది హృదయ చలనం వల్లనే కదా వనజ గారు.

శ్రీలలిత చెప్పారు...

వాఘ్యని తలుచుకుని మీరు పడుతున్న మానసిక వ్యథ వింటుంటే మనసంతా కలచినట్టయిపోయింది. ఇన్నేళ్ళయినా దాని పట్ల మీ ఙ్ఞాపకం ఇంత పచ్చిగా వుందంటే మీ మనసు ఎంత సున్నితమైనదో తెలుస్తోంది. దాని పట్ల మీకున్నమీ ఙ్ఞాపకాలే దాని ఆత్మకి శాంతి.
ఓం శాంతి..శాంతి..శ్శాంతిః..

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
జంతువుల పట్ల మీకుండే ప్రేమ కనిపిస్తోంది...
కొన్ని సంఘటనలు వేరే కారణాల వలన జరిగినా దానికి మనమేనేమో! అని
భావించడం అది మనలో ఉండే మంచితనాన్ని చూపిస్తుంది...
మీ "వ్యాఘ్య "కి తప్పక ఆత్మశాంతి కలుగుతుంది మీ ప్రార్థనలతో...
@శ్రీ

భాస్కర్ కె చెప్పారు...

pets patla meekunna prema chaala goppadandi, pet unte intlo o pasipapa unnatle.

జలతారు వెన్నెల చెప్పారు...

:((

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మీ జంతు ప్రేమ చాలా గొప్పది.కానీ అన్ని జీవుల పట్ల అదే ప్రేమ చూపిస్తున్నామా అని ఆలోచిస్తే ఎక్కడో బాధ.మీ రచనా శైలి అలవోకగా సాగిపోతుంది.కాకపోతే పెద్ద పోస్ట్ అయింది.

Meraj Fathima చెప్పారు...

manam chesina sevalu anniti kante janthu seva goppadi. emi cheppamantaaru naalugu uoora kukkalaku roju vanta chesi peduthunna evvaru okka mudda vayyaru, avi nannu chestune avchhestaayi , mee dayaa hridayam goppadi madam.

ranivani చెప్పారు...

వనజ గారూ !మీ బాధ చదువుతూ ఉంటే నాకూ చాలా బాధ కలిగింది .