కథానిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కథానిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, నవంబర్ 2012, ఆదివారం

బంగారు

ఇంట్లోనుండి బాల్కనీ  లోకి వచ్చి నిలబడ్డాను

ఎదురింటి తలుపు తీసే వుంది. తీసే వుందని యె౦దుకంటున్నానంటే  తలుపులు మూసి వుంటే  లోపల యే౦ జరుగుతుందో తెలియదు కదా! అయినా యెదుటి వారింట్లోనూ, ప్రక్క వారింట్లోనూ,వెనుక వారింట్లో కి  తొంగి చూసి  యే౦ జరుగుతుందో తెలుసుకోవడం నా అభిమతం కాదు

యధాలాపంగా చూడటం, యేదైనా విభిన్న దృశ్యం అయితే  ఆసక్తిగా పరిశీలించడం చేస్తుంటాను.ఎదుటవారు చేసే పనుల పై ఆసక్తి చూపడం మంచిది కాదని తెలుసు.అయినా అదే పని చేయడం వెనుక నా ఉద్దేశ్యం మనుష్యుల  నైజం విభిన్న రూపాలలో ఉండటానికి తగిన లాజిక్ వుంటుందని నేను భావించడమే!

నిజంగా ప్రతి మనిషి కూడా తను చేసే పనిలో లాజిక్ ని వెదుక్కుంటాడేమో!

ఎదురింట్లో నేను చూసిన దృశ్యం రోజూ లాంటిదే! రోజులో దాదాపు పద్దెనిమిది గంటలపాటు ఆ టీవి  మ్రోగుతూనే  ఉంటుంది ఆ టీవి ముందు యెవరు కూర్చుని  ఉండరు.

"ఎందుకండీ టీవి చూడటం కుదరనప్పుడు అలా పెట్టేసి  వుంచుతారు అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం .."ఔరా"అన్పించక తప్పదు. ఆ మాట యేమిటంటే ..మేము యెవరం టీవి చూడకపోయినా పెట్టి వుంచడం యెందుకంటే   మా పని అమ్మాయి కోసమే! అలా టీవిలో వచ్చే మాటలు వింటూ పని చేసుకుంటూ వుంటుంది .టీవి పెట్టకపొతే పనికి రానని మొండికేసింది పనులు చేసుకోలేక విసుగేస్తున్నా, చెవుల్లో హోరుమనిపిస్తున్నా టీవి ని భరించక తప్పదు,తడిసి మోపెడు భారమయ్యే కరంట్ బిల్  కట్టక తప్పదు  అందామె . వారి పనిపిల్ల టీవిలో వచ్చే దృశ్యాలని అర కొర చూస్తూ వింటూ  పని చేసుకుంటూ వుంటుంది.అదివరకయితే ఆ పిల్లని చూస్తూ నవ్వుకునేదాన్ని కాని యిప్పుడు  నాకు "బంగారు " కళ్ళల్లో మెదిలింది. అది అంతే! పదే పదే టీవి పెట్టమని అడుగుతుండేది.

"బంగారు" నా మదిలో మెదలడం  ఆ రోజులో యెన్నోసార్లు. ఇంతకీ "బంగారు " యెవరు అంటే  వో ఆరు నెలలు కాలం  వెనక్కి వెళ్ళాల్సిందే!

రోజులాగే మా చాకలి బట్టలుతుకుంది.ఆ అమ్మాయికి బాల్య దశ వీడలేదు. బాల్యంతో బండ పని చేయించడం నాకిష్టం వుండదు. ఆ పిల్లతో ఆమాట యీ మాట మాట్లాడుతూ సాయం చేస్తూ వున్నాను. ఇంతలో వీధి  గేటు ముందు యేదో కలకలం. నేను వెళ్లి చూసాను. యేడెనిమిదిమంది ముష్టి పిల్లలు. వాళ్ళలో యిద్దరు అబ్బాయిలు కొట్టుకుంటూ వుంటే   మిగిలినవారు వినోదంగా చూస్తూ నవ్వుకుంటున్నారు.వాళ్ళందరిలో వున్న వొకే  వొక అమ్మాయి కొట్టుకుంటున్న వారిద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు యేమాత్రం తగ్గక పోగా.. కోడి  పుంజుల్లా కలబడుకుంటూనే ఉన్నారు. నేను గట్టిగా వో కేక వేసి  మందలిస్తూన్నట్లే .."ఎందుకురా కొట్టుకుని చస్తున్నారు?"

వాళ్ళు సమాధానం చెప్పలేదు కాని ఆ పిల్ల చెప్పింది. రోజువారిలా కాకుండా వొకరు వెళ్ళే వీధిలోకి రెండవ వాడు వెళ్లి  యిళ్ళల్లో పదార్ధాలు అడుక్కోవడం వల్ల ..గొడవలు వచ్చాయని. ఆ పిల్ల ఆవిషయం చెపుతూ మాటలకి అనుగుణంగా చక్రాల్లాంటి కళ్ళు త్రిప్పుతూ చేతులు త్రిప్పుతూ చూపడం చూసి ముచ్చటేసింది.ఎనిమిదేళ్ళు ఉంటాయేమో! మంచి రంగే  కానీ మట్టి గొట్టుకుని మసి బారినట్లు  వుంది.
."ఒరేయ్ మీరిద్దరూ అట్టా కొట్టుకొకండి రా, కావాలంటే యీ రోజు నాకు దొరికినదంతా యిచ్చేస్తాను" అంది. ఆ పిల్ల ఆ మాట అనడం ఆలస్యం వొకడు వచ్చి ఆ పిల్ల గిన్నెలో సేకరించుకుని పెట్టుకున్న ఆహార పదార్ధాలన్నీ తన గిన్నెలోకి వేసుకుని.. ఖాళీ గిన్నెని నేలకేసి కొట్టి వెళ్ళిపోయాడు. "వాడికి ఎందుకిచ్చావ్? నేను నీకు పెట్టను పో..అంటూ ఆ పిల్లని వదిలేసి పోయాడు మరొకడు. "పెట్టకుంటే పోనీలేరా, మీ ఇద్దరు కొట్టుకోకుంటే సాలు" అంటూ ..
పాపం ఆ పిల్ల ఆ ఖాళీ గిన్నెని తీసుకుని  వీధి కుళాయి దగ్గరికి వెళ్లి శుభ్రం చేసుకుని కళ్ళు చేతులు కడుక్కుని పొట్ట నిండా మంచి నీళ్ళు త్రాగి యివతలకి వచ్చింది. నాకు ఆ పిల్లని చూస్తే జాలి వేసింది.నేను "అన్నం పెడతాను రా.." అంటూ పిలిచాను వచ్చి గేటు బయట నిలబడింది. భవానీకని తీసి వుంచినఇడ్లీని .ఆ పిల్లకి పెట్టాను. పరుగులు తీస్తూ తన వాళ్ళని వెదుకుతూ వెళ్ళిపోయింది ఆ పిల్ల.

వాళ్ళంతా  యెక్కడ ఉంటారు? రోజంతా పనిపాటా లేకుండా గిన్నెలేసుకుని వూరంతా తిరుగుతూ వుంటారు అని అడిగాను భవానీని.  చాలా యేళ్ళ  నుండి హైస్కూల్  ప్రక్కనే వున్న ఖాళీ స్థలంలో వుంటారమ్మా.! వీళ్ళకి తల్లి దండ్ర్లులు యెవరూ లేరనుకుంటాను అంది.

"రోజు యిలా అడుక్కుని తింటూ బతికేస్తారా ? అంటూ మళ్ళీ అడిగాను.ఒకో రోజు ప్లాస్టిక్ కాగితాలు యేరుకుంటూ వుంటారు.యింకో రోజు చెత్త కుండీల దగ్గర కనబతారు. ఏమి దొరకనినాడు ముష్టికి బయలు దేరతారు" అని చెప్పి వాళ్ళ పనే హాయి " అంది. "యే౦  యె౦దుకని ?" అడిగాను. "కష్టం చేసే పని లేదు కదమ్మా." అంది.

"ఇంకేం అయితే నువ్వు అల్లా వెళ్ళు" అని అన్నాను. "మొదటి నుండి అలా వెళ్ళడం అలవాటు లేదు కదమ్మా."అంది నొచ్చుకున్నట్లు.

"పుట్టిన ప్రతి వొక్కరు పని చేసుకుని బ్రతకాలి.అప్పుడే పని విలువ తెలుస్తుంది.అలా అడుక్కు తినడం  యెంత హీనమైనదో, వాళ్ళకి తల్లి తండ్రి యెవరు  దిక్కు లేదు కాబట్టి మంచి చెడు చెప్పేవాళ్ళు లేక అలా తయారయ్యారు.అంతే !

 మౌనంగా తన పని ముగుంచుకుని వెళ్ళిపోయింది.   రోజు అయితే ఆ అమ్మాయికి టిఫిన్ పెట్టి పంపేదాన్ని. ఈ రోజు.. ఆ ముష్టి  పిల్లకి పెట్టడం వల్ల  యీ పిల్లకి లేకుండా పోయింది. అనవసరంగా సంభాషణ పెంచి భవానీకి  బాధ కల్గించానేమో అనుకున్నాను. తను  కూడా వయసుకి మించి బండ చాకిరి చేసే బాల కార్మికురాలే! తండ్రి త్రాగుబోతుతనంతో యేడవ  తరగతి చదువుకి  గండి పడి నాలుగిళ్ళలో  బట్టలుతికే పనిలో పడింది. అందుకే ముష్టి వాళ్ళ పనే హాయి అనుకోగల్గింది అనుకున్నాను.

ఇంతలో ఉయ్యాలలో వున్న పాప  నిద్ర లేచి యేడుపు అందుకుంది. " అయ్యో !   యిక నా పని పూర్తి  అయినట్టే" అని చింతపడుతూ పాపను సముదాయించుకుంటూనే  వంట పూర్తి చేసుకుని ప్రక్కవీధిలో వున్న కాన్వెంట్ లో ఎల్.కే.జీ చదువుతున్న  మా బాబుకి క్యారేజ్ తీసుకు వెళ్లాను. ఈ లోపు నిద్ర పోతున్న పాపని కాస్త చూస్తూండమని ప్రక్కింటామెకి చెప్పి వెళ్లాను.

 బాబు చదువు కోసమని మావారితో దెబ్బలాడి పల్లె నుండి పట్టణానికి కాపురం మార్చాక కాని తెలిసి రాలేదు అన్ని పనులు చేసుకుంటూ యిద్దరు పిల్లలని సముదాయిన్చుకోవాలంటే తల ప్రాణం తోక కొస్తుంది. ఊర్లో అయితే అత్తగారి సాయం ఉండేది. చేసుకున్నవారికి  చేసుకున్నంత మహాదేవా అని  పెద్దలు ఊరికే అనలేదు  కదా అని అనుకుంటూ..
పాపని యెత్తుకోవడానికి వొక పిల్లని చూసి  మాట్లాడి పంపమంటావా  అన్న అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది,తను చెప్పిన సమాధానం గుర్తుకు వచ్చింది. పసి పిల్లని మోసేందుకు మరో పసిది బలి అవ్వాలా ! వద్దు అని ఖరాఖండిగా అన్నమాట కూడా గుర్తుకొచ్చింది.నిజమే కదా ! ఇళ్ళలో పనులకి ఆడపిల్లలని బలి చేసేది తల్లిదండ్రులు ,పనులు చేయించుకునే వాళ్ళు కూడా!

నా ఇబ్బందులేవో నేను పడుతూ రోజులు గడుస్తూ ఉన్నాయి. బాబుకి అన్నం తినిపించి  వచ్చే వరకు కూడా పాప  నిద్ర  పోతూనే ఉంది.

ఒక రోజు ఆరోజు నేను చూసిన ముష్టి  పిల్ల వీధి గేటు దగ్గరే నిలబడి..యెదురుగా కనబడే టీవి వంక ఆసక్తిగా చూస్తూ నిలబడి వుంది. అది చూసి గేటు తాళం తీసి లోపలకి పిలిచాను. బెరుకు బెరుకుగా లోపలి వచ్చింది. టీవి చూస్తావా? అడిగాను తల ఊపింది. సరే కూర్చో అన్నాను. కూర్చుని టీవిని శ్రద్దగా చూస్తుంది." అన్నం తిన్నావా" అడిగాను అవును కాదు అన్నట్లు మధ్యస్తంగా తల వూపింది.ఒక ప్లాస్టిక్ ప్లేట్ లో అన్నం తీసుకువచ్చి పెట్టి తిను అన్నాను. మొహమాట పడిపోయింది. "నేను లోపలకి వెళతాను లే! తిను" అంటూ బెడ్ రూమ్లోకి వెళ్లి కాసేపటి తర్వాత వచ్చి చూస్తే అన్నం తినేసి ప్లేట్ కడిగేసి ప్రక్కన పెట్టి ఉంచింది. "నీకు యెన్నేళ్ళు"? అడిగాను. "తెల్వదు" అంది.   "మీ అమ్మ -నాన్న ఎవరు?" మళ్ళీ అడిగాను. "అది తెలవదు" అంది.   "మా ఇంట్లో వుంటావా?" అడిగాను. "ఓ.. ఉంటాను" అంది. ఉండటం అంటే వూరికే వుండటం కాదు.అచ్చంగా యిక్కడే వుండి  పోవాలి " నాకు సాయం చేయాలి.పాపని ఎత్తుకోవాలి."అన్నాను తలూపింది. "అయితే కాసేపాగిన తర్వాత బజారుకి వెళదాం,నీకు బట్టలు కొని యిస్తాను "అని చెప్పాను. ఆ పిల్ల ముఖంలో సంతోషం. బజారుకి తీసుకు వెళ్లి ఓ..మాదిరి రేటులో మూడు జతల బట్టలు కొంటుంటే షాపతను విచిత్రంగా చూసాడు.  ఇంటికి వచ్చాక .ఓ షాంపు పేకెట్ యిచ్చి శుభ్రంగా తల స్నానం చేసి రమ్మని చెప్పాను. స్నానం అయిన తర్వాత కొత్త బట్టలు వేసుకుని కడిగిన ముత్యంలా ఉంది. నీ పేరు ఏమిటి? అడిగాను. "రంభ " అంది. నాకు నవ్వు వచ్చింది. ఆ పేరు యెవరు పెట్టారు? అడిగాను "నేనే పెట్టుకున్నాను"..అంది." సినిమాలు బాగా చూస్తావా? "ఆ చూస్తాను. రైలు స్టేషన్  కాడ,బస్ స్టాండ్ లోను చూత్తాము.ఏరిన సామానుకి డబ్బులు యెక్కువ వస్తే హాల్లో కెళ్ళి చూస్తాం " అని వివరంగా చెప్పింది. ఎక్కడ పడుకుంటావు? రైల్ స్టేషన్ కాడ, ఒకోసారి పోలీసు వాళ్ళు అక్కడ పడుకోవద్దని కొడతారు. అప్పుడు హై  స్కూల్  కాడికి చేరుకుంటాం.ఒకోసారి తినడానికి యేమీ వుండదు.అప్పుడు అడుక్కుంటాం..అంటూ వాళ్ళ యెతలు  చెపుతుంటే  హృదయం కలచి వేసింది.

ఇక నుండి నీ పేరు బంగారు.. బాగుందా ? బంగారు బంగారు.. అని రెండు సార్లు అనుకుని భలే బాగుంది అంది. ఇక నుండి నన్ను "అమ్మా!" అని పిలువు అన్నాను.ఆశ్చర్యంగా చూసింది.

సాయంత్రం అయ్యేసరికి ఆ పిల్ల స్నేహితుల గుంపు గుంపు  ఆ పిల్లని వెదుక్కుంటూ మా యింటి ముందుకు వచ్చి పడింది. అది వాళ్ళ దగ్గరకి వెళ్లి నేను యిక యిక్కడే వుంటాను. ఈ అమ్మ నాకు అన్నం పెట్టింది, కొత్త బట్టలు కొని పెట్టింది అంటూ వొంటిమీద బట్టలు చూపింది. ఈ ఇంట్లో టీవి ఉంది. ఆడుకోవడానికి బోలెడు బొమ్మలు ఉండాయి. ఇంకా పాప బాబు కూడా వున్నారు.  ఇక నేను మీతో వుండను మీ వెంటరాను అని సంతోషంగా చెప్పింది.

నేనూ  బయటకి వచ్చి..ఇక నుండి యీ పిల్ల మీతో రాదు. ఇక్కడే ఉంటుంది అని చెప్పా ను. వారి కళ్ళల్లో ఆశ్చర్యం,కొందరి కళ్ళల్లో ఈర్ష్యా కూడా కనిపించాయి. వారందరికీ తలా ఒక అరటి పండు యిచ్చి యెప్పుడైనా బంగారుని చూడాలనుకుంటే రావచ్చని చెప్పాను. వాళ్ళకి కనబడేదాక చేతులు వూపి లోపలకి వచ్చింది. ఏడుస్తున్న పాపని దానికి అందించి నేను వంట యింట్లోకి వెళ్లాను. తర్వాత బాబుకి స్నానం చేయిస్తుంటే నా ప్రక్కనే నిలబడి చూస్తూ వుంది. బాబుకి హోం వర్క్ చేయిస్తూ నువ్వు కూడా చదువు కోవాలి అన్నాను. కిసుక్కున నవ్వింది. పలక తీసి అక్షరాలూ వ్రాసి ఇచ్చాను. అ,ఆలు వద్దు.. ఏ.బి.సి.డి లు కావాలి అని అడిగింది. నేను నవ్వుకుని వ్రాసి యిచ్చాను. అయిదే అయిదు నిమిషాల్లో నాలుగు అక్షరాలూ వ్రాసి చూపించింది.చురుకైనదే అనుకున్నాను.

ఆ రాత్రి పల్లె నుండి వచ్చిన మావారు హాల్లో చాప మీద పడుకుని వున్న బంగారుని చూసి యెవరు యీ పిల్ల అని అడిగారు. ఊరునుండి అమ్మ తీసుకొచ్చి దింపి వెళ్ళింది అని చెప్పాను. తెల్లవారిన తర్వాత బంగారుని మరొక సారి చూసి యెక్కడో చూసినట్లు వుంది అని అనుమానంగా అడిగారు. నిజం చెప్పాను. ఇలాగే చేరదీయి.. యెప్పుడో వొకప్పుడు  అదును చూసుకుని చేతికందినవి వేసుకుని పారిపోతే కాని తెలుస్తుంది అన్నారు. "పాపం దాని మొహం చూస్తే అలా కనబడటం లేదండీ! అన్నాను నేను.

ఎవరు యెవరు యెలాంటి వారో వాళ్ళ ముఖం మీద కనబడుతుందా ఏమిటీ అన్నారు విసుగ్గా.

పాపం ఆ గుంపులో యేడెనిమిది మంది మధ్య అది వొక్కతే  ఆడ పిల్లండీ!! వాళ్లతో తిరుగుతూ రేపు పెరిగి పెద్దదైతే దానికి యెన్ని యిబ్బందులు వస్తాయోనండీ! మనం కాస్త జాలి చూపితే మన దగ్గరే ఉంటుంది కదా.. కన్విన్స్ చేస్తూ అడిగాను.
"అలా అని వూర్లో వున్న అనాధలనందరినీ చేరదీస్తావా? తా దూర కంత  లేదు కాని వూర్లో వాళ్ళ పాపపుణ్యాలు మనకే కావాలి " అని వ్యంగంగా అన్నారు. మా పుట్టింటి వాళ్ళు బాగా కట్న కానుకలు యివ్వలేదని అప్పుడప్పుడు దెప్పుతూ ఉంటారు. అప్పుడు ఆ మాటలు నాకు బాధ అనిపించలేదు.   ఎలాగైనా వొప్పించాలి అన్న పట్టుదలతో.. మనం పూజలు పేరిట యెంతో  డబ్బు ఖర్చు పెడుతుంటాం. దానికన్నా యిలాటి వారికి సాయ పడితే మంచిది కదండీ. మంచి పనులు చేస్తే దేవుడు హర్షిస్తాడు అన్నాను.

సరి సర్లే! తర్వాత  యేమైనా  కంప్లైంట్స్ వస్తే  మాత్రం వూరుకునేదే లేదు. అన్నారు హెచ్చరికగా.

"అమ్మయ్య ..ఆయన వొప్పుకున్నారు అదే చాలు అనుకున్నాను." ఈ మాటల్లన్నీ వింటున్న బంగారు..
బాబు గారు! నేను అలాంటి పనులు యేమి చేయను. బుద్దిగా వుంటాను.మీరు చెప్పినట్టు చేస్తాను అంది. ఒక్క క్షణం దాని వంక  చూసి సరే..జాగ్రత్తగా వుండు, మళ్ళీ మీ వాళ్ళతో కలిసావా యింట్లో నుండి  గెంటేయడమే! అని అన్నారు. అది తల వూపి యివతలకి వచ్చేసింది.

నేను  నిద్ర లేచినప్పుడే లేచి ,నేను చెప్పిన పనులు అన్నీ చేస్తూ.. వొద్దికగా వుండేది.  నెల రోజులు తిరిగేటప్పటికి మా యింట్లో  అందరి నోటా దాని పేరు మారు మ్రోగి పోయేది. మా పాప కూడా.. వచ్చీ రాని మాటలతో.. దాని పేరు చెపుతూ వుండేది. అది చూసి  చాలా సంతోష పడేది బంగారు. ఆఖరికి దాని వైపు అనుమానంగా చూసే మా వారి మెప్పు కూడా పొందింది. ఆయన దాని కోసం ప్రత్యేకంగా పుస్తకాలు కూడా తీసుకొచ్చి  యిచ్చారు. మా అత్త గారు అయితే పనిలో సాయంగా ఉంటుంది తనతో పంపమని అడిగారు. మా వారు "వద్దులేమ్మా అది అక్కడ వుండటం కష్టం అని అన్నారు.

బంగారు మా యింటికి  వచ్చిన క్రొత్తల్లో "ఇదేంటి వీళ్ళు ఆ దెష్టపు ముఖం దాన్ని తెచ్చి యింట్లో  పెట్టుకున్నారు.అని ముఖం చిట్లించుకునే  వాళ్ళు. తర్వాత తర్వాతేమో జీతం భత్యం లేని పని పిల్ల దొరికింది.   యే అమ్మ కన్న బిడ్డో! యిక్కడ  చాకిరీ చేయడానికి పుట్టింది అనే వారు. నేను బంగారుకి  చక్కగా తలదువ్వి జడలు వేస్తుంటే దూరంగా జరిగి పోయేవారు.

బంగారుకి టీవి చూడటం బాగా అలవాటు అయింది. చదువుకో అంటే కాస్త  అయిష్టంగా వుండేది.ఖాళీ సమయాల్లో టీవి.పెట్టు  అమ్మా చూస్తాను అనేది. కాసేపు చూడనిచ్చి ఆపేసేదాన్ని.ఆ పిల్ల ముఖంలో అసంతృప్తి కనిపించేది ,   కాసేపు చదువుకో అంటే అయిష్టంగా చూసేది. వచ్చే సంవత్సరం నిన్ను కూడా స్కూల్లో జాయిన్ చేస్తాను. ఇప్పుడు బాగా చదువు కోవాలి అని చెప్పేదాన్ని.

అప్పుడప్పుడు బంగారు ని చూడటానికి తన ఫ్రెండ్స్  వచ్చేవారు. వాళ్ళు వచ్చినప్పుడు తను చాలా సంతోషంగా ఉండేది. వాళ్ళు వెళ్ళిపోయాక చాలా దిగులుగా ఉండేది

 " .ఏమిటి బంగారు దిగులుగా వున్నావ్ అంటే  ఏం లేదమ్మా,  మా వాళ్ళు అందరు అలాగే ఉన్నారు. నేను ఒక్కదాన్నే యిక్కడ బాగున్నాను.  లోకంలో చాలా మంది డబ్బున్న వాళ్ళు వున్నారు కదమ్మా..మీకు లాగా అందరూ యెవరో వొకరిని చేరదీసి చూడవచ్చు కదమ్మా అంది. ఆ ప్రశ్నకి సమాధానం నాదగ్గర లేదు. మేమందరం చిన్నప్పటి నుండి కలిసే వున్నాము. నా చిన్నప్పుడు నుండే వాళ్ళ౦దరు  యెవరికి యే౦ దొరికినా  నాకు తీసుకొచ్చి పెట్టేవారు.  ఏది దొరికినా అందరం పంచుకుని తినేవాళ్ళం. నేను కడుపు  నిండా తిన్నా వాళ్ళే గుర్తుకొస్తున్నారు,పాపం .. వాళ్ళిప్పుడు యెలా వున్నారో."అంది. దాని చిన్ని మనసులో వాళ్ళ పట్ల ఉన్న ప్రేమాభిమానాలకి కదిలి పోయాను.

సరేలే ! మనం వారానికి  వొకసారి వారికి భోజనం పెడదాం సరేనా అన్నాను.  ఆ మాటకే బంగారు ముఖంలో సంతోషం.ఆ రాత్రి అంతా  బంగారు అన్న మాటలు గురించే ఆలోచిస్తూ వున్నాను.

అన్నమాట ప్రకారం మా వారు లేకుండా చూసి ఏ పులిహారో,దద్దోజనమో చేసి వారి అందరికి యిచ్చేదాన్ని. ఒక అనాధ  శరణాలయం అడ్రస్ సంపాదించి వారందరినీ అక్కడ జాయిన్ చేయించి వచ్చాను. ఇక వాళ్ళ గురించి దిగులు పడకు. వాళ్ళు బాగానే ఉంటారు. బడికి వెళ్లి చదువుకుంటారు అని చెప్పాను. ఒక వారం రోజులకి వాళ్ళని మేము చూడటానికి వెళ్ళేటప్పటికి వొక్కరు కూడా అక్కడ లేరు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు అని చెప్పారు.తర్వాత వొక రోజు యిద్దరు పిల్లలు బంగారుని ఛూడటానికి వచ్చారు. శరణాలయం నుండి యె౦దుకు వచ్చేసారని అడిగితే ..అక్కడ సరిగా అన్నం పెట్టడం లేదని ,కొడుతున్నారని,బయట పనులకి పంపిస్తున్నారని చెప్పారు. వాళ్ళు కాసేపు వుండి వెళ్ళిపోయారు.

మర్నాడు ఉదయానికి బంగారుకి మంటల జ్వరం ముంచుకు వచ్చింది. హాస్పిటల్ కి తీసుకుని వెళితే మామూలు జ్వరమే అని చెప్పి మందులు ఇచ్చారు. రెండు రోజులు  తర్వాత అలాగే ఉండి  జ్వరం వస్తూ ఉంది. . బంగారుని హాస్పిటల్ కి తిప్పడం చూసిన మా వారు.. విసుక్కునే వారు. ఏ దిక్కుమాలిన సంతానమో..ఇది. దీని శరీరంలో ఎయిడ్స్ లాంటివి యేమన్నా దాగి ఉన్నాయేమో.. బజార్లు వెంట తిరిగేపిల్లని తీసుకు వచ్చి యింట్లో  పెట్టావ్? ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ డబ్బులు వదిలిస్తున్నావ్?అన్నారు. ఆ మాటకి హడలిపోయాను. ఆయన పల్లెకి వెళ్ళాక మళ్ళీ హాస్పిటల్కి తీసుకు వెళ్లి  డాక్టర్ గారికి నా అనుమానాలు  అన్నీ చెప్పి బ్లడ్ టెస్ట్లు చేయిస్తే నెగిటివ్  అన్న  రిపోర్ట్  చూసి ఊపిరి పీల్చుకున్నాను. దానికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. కాని యెందుకో దిగులుగా వున్నట్టు అనిపించేది. ఆ దిగులు యె౦దుకో నాకు తెలుసు.ఆ దిగులు తీర్చేందుకు నేను ఆసక్తురాలిని. ఒక విధంగా బంగారు మీద కోపం వచ్చేది.

ఒక రోజు మధ్యాహ్నం అన్నం తింటూ.. అమ్మా! నేను మా వాళ్ళ దగ్గరకి  వెళ్ళిపోతా అంది. ఎవరే మీ వాళ్ళు అని గద్దించాను కోపంగా.. మా ప్రక్క యింటి  వాళ్ళు మా యింటి  వైపు తొంగి చూస్తున్నారు. అది మాట్లాడలేదు. .

సాయంత్రం వేళ  నా ప్రక్కకి వచ్చి అమ్మా, నేను వెళతానమ్మా..అని అడిగింది. నాకు యేడుపు ముంచుకు వచ్చింది ఆరు నెలలు కాలం దానిని నా బిడ్డగానే చూసాను. ఏం  తక్కువ చేసాను.. అయినా అది యిక్కడ వుండనంటుంది నేను మాట్లాడ లేదు.

"అమ్మా! పెన్నలో మునిగి రంగడి  గుడిలో ప్రసాదం  తిని చిత్తు  కాగితాలు యేరుకుని  యేదో వొకటి తినడమే బాగుంది  నేను యిక్కడ వుండలేను పంపించేయండమ్మా" అంది.కాదంటే మళ్ళీ జ్వరం తెచ్చు కుంటుందని "సరేలే."అన్నాను.

ఉదయం నేను నిద్ర లేచేటప్పటికి బంగారు నిద్ర  లేచి  వెళ్ళడానికి తయారుగా ఉంది. వెళతాను అంది కాని నిజంగానే వెళ్ళదు అనుకున్న నేను ఖంగుతిన్నాను.బంగారు పాపని ఎత్తుకుని ముద్దాడింది.పాపా పద్దాక  యేడ్చి అమ్మని యిబ్బంది పెట్టమాకు. బాబూ !  అల్లరి చేయకుండా అమ్మ చెప్పినట్టు విను అంటూ అప్పగింతలు పెట్టింది. దానికని కొన్న బట్టలు అన్నీ తీసుకోమన్నాను. ఒక పాత  బేగ్ ఇచ్చి అది కప్పుకునే దుప్పటి కాక మరో పాత దుప్పటి ఇచ్చాను.  బేగ్ చాలా బరువుగా తయారయింది టిఫిన్ పెడితే తినకుండా పొట్లం కట్టింది.ముఖం చూస్తే తేటగా సంతోషంగా కనబడింది. వాళ్ళ వారి దగ్గరకు వెళుతున్నందుకు కాబోలు. బేగ్ తీసుకుని బయలు దేరింది  నాకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి గుమ్మం మెట్ల మీద కూలబడ్డాను. గేటు దాక వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చింది

"అమ్మా! మా అమ్మ యెవరో నాకు తెల్వదు నువ్వే మా అమ్మ అనుకుంటా వుండాను. ఒక్కసారి నిన్ను వాటేసుకుంటానే " అంది. నేను తల ఊపాను. మెట్ల మీద కూర్చున్న నా ప్రక్కకు వచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి నా వీపుపై వాలింది అప్రయత్నంగా దాని చుట్టూ నా చేతులు బిగుసుకున్నాయి. కొద్ది సేపు అలా ఉంది. ఓ..నిమిషం తర్వాత నన్ను విడిపించుకుని బేగ్ తీసుకుని వెనక్కి తిరిగి అయినా  చూడకుండా పరుగెత్తింది. అది కూడా యేడుస్తుందేమో..నాకు లాగానే అనిపించింది. చాలా సేపు అలానే నిస్తేజంగా కూర్చుండిపోయాను. ఏ పని చేయబుద్ది  కాలేదు.

నన్ను నేను విశ్లేషించుకోవడం మొదలు పెట్టాను.బంగారుని చేరదీయడం పట్ల నా స్వార్ధం వుంటే వుండవచ్చు కాక. అది అప్పుడప్పుడు నన్ను అడిగే ప్రశ్నలు, అనాధల జీవితాల గురించి నన్ను ఆలోచింపజేసాయి.మనిషిలో యే మూలో దాగి ఉన్న జాలి దయలతో దానిని చేర దీసి రోజులు గడుస్తున్న కొద్ది దానితో పెంచుకున్న అనుబంధాన్ని అది తేలికగా తెంచుకుని వెళ్ళిపోయింది. అది నాతో  శాశ్వతంగా  వుంటుందని నేను ఆలోచించడం వల్లనే నాకు యీ బాధ తప్పదనిపించింది.ఏ పని చేస్తున్నా  బంగారు నా వెనుక వెనుక తిరుగుతున్నట్లు వుంది. కోపం వస్తుంది. అయినా నేను తనకి  యే౦ తక్కువ చేసాను? కడుపున పుట్టిన బిడ్డలా  కాకపోయినా బాగానే చూసాను.

వచ్చే యేడాదికి స్కూల్ కి పంపాలనుకున్నాను. నాలుగు అక్షరాలూ నేర్పించి యేదో ఒక కుట్టు సెంటర్లో చేర్పించి దాని బతుకుకి  ఒక మార్గం వేయాలనుకుంటే అది యిలా.. వెళ్ళిపోయింది. నాలుగు నెలల క్రితమే అకౌంట్ ఓపెన్ చేసి నెలకి మూడు వందలు లెక్కన   సేవింగ్ చేయడం  మొదలెట్టింది. యేమిటో..అదిలా వెళ్లి పోయింది. పసి మొగ్గ లాంటి దాని జీవితం యేమవుతుందో, యెవరైనా చిదిమేస్తారేమో అన్న ఆలోచనలు  ముంచేస్తున్నాయి.

రెండు రోజులు గడచి పోయాయి.చుట్టూ ప్రక్కల అందరు.. బంగారు చేత గొడ్డు చాకిరి చేయించడం వల్లనే అది వెళ్ళిపోయింది అని  యిష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించుకుంటున్నారు.రెండు మూడు రోజులు పల్లెకి వెళదామని  అనుకుంది   వెంటనే సందేహం ముంచుకొచ్చింది. బంగారు యేదన్న ప్రశ్నలు వస్తే అత్త గారికి యే౦  సమాధానం చెప్పాలి అనుకుని పల్లెకి వెళ్ళే వుద్దేశ్యం మానుకుంది. నాలుగు రోజులుగా  పొలం పని ఒత్తిడి వల్ల భర్త  యింటికి రావడం లేదు.ఈ రోజో,రేపో రావచ్చు. బంగారు యేది? అని అడిగితే  యే౦ సమాధానం చెప్పాలి? ఆలోచిస్తుంది.

ఆరు గంటలు దాటింది. చీకటితో పాటే వర్షం కూడా మొదలయింది. కరంట్ పోతుందని ముందు జాగ్రత్తగానే దీపం బుడ్డి ,కాండిల్స్ అగ్గి పెట్టె అన్నీ రెడీగా పెట్టుకుంది.  చాప పరచుకుని  పిల్లలని ఆడిస్తూ కూర్చుంది.  ఏడుగంటలు సమయంలో కరంట్ పోయింది. వరండా గ్రిల్స్ కి  తాళం వేద్దామని వెళ్లి.. వీధి  గేటు వైపు చూసాను. జోరున కురుస్తున్న వర్షంలో అప్పుడే మెరిసిన మెరుపు వెలుగులో బంగారు నిలబడి ఉండటం కనబడింది.

బంగారు.. త్వరగా లోపలకి రావే! యెందుకు అలా తడుస్తావ్? అని కేక వేసాను. గబా గబా బంగారు లోపలకి వచ్చింది.  తడిసిన దాని బట్టలు విప్పేసి తుడుచుకోమని తుండు ఇచ్చాను. మా వారి పాత షార్ట్ ఒకటి వేసుకోమని యిచ్చాను. వేడి వేడి అన్నం పెట్టాను. ఆత్రంగా తింది . నేను అలానే  చూస్తూ వూరుకున్నాను. అన్నం తిని చాప వేసుకుని పడుకుంటూ.. అమ్మా.. నేను యెక్కడికీ వెళ్ళను. యిక్కడే వుంటాను అంది. నేను కోపంగా వెళ్ళడం,రావడం అంతా నీ యిష్టమేనా..? అసలు ఎందుకు వెళ్ళావ్? అని గట్టిగా అరిచాను.అది తలవంచుకుని కూర్చుండిపోయింది. జాలి వేసింది. మళ్ళీ వెళతాను అని అనవు కదా! రెట్టించి అడిగాను. అడ్డంగా తల ఊపింది.

ఆ రాత్రి బంగారుకి విపరీతమైన జ్వరం వచ్చింది .నాకు ఒకటే కంగారు. ఇంట్లో ఉన్న మందులు యేవో ఇచ్చాను.
రాత్రంతా వొకటే కలవరింతలు."ఒరేయ్! నన్ను వదిలేయండి రా, నేను వెళ్ళిపోతాను, నాకు భయం వేస్తుంది..నన్ను కొట్టవద్దు..అన్నా..అంటూ వొకటే యేడుపు . నాకు భయం వేసింది. బంగారుని తట్టి లేపాను. ఏమైంది బంగారు..? అడిగాను. నా గొంతులో  వినబడిన ప్రేమకి అది పెద్ద పెట్టున ఏడ్చింది.

"అమ్మా.. నాతో వుండాళ్ళంతా మంచి వాళ్ళు కాదమ్మా.. రైలు స్టేషన్ కాడ   యెవరో రౌడీ అన్న దగ్గర పని చేస్తా వుండారు. గంజాయి అమ్ముతున్నారు. రైళ్ళలో దొంగతనాలు చేస్తున్నారు. జేబులు కొట్టేస్తున్నారు. రంగడు గుడి దగ్గర,రాజరాజేశ్వరి గుడి దగ్గర అడుక్కుంటున్నారు. ఏవేవో చెడ్డ పనులు చేస్తున్నారు.  కష్ట పడి  పని చేస్తే పొట్టలు నిండవు అంట..పని చేస్తాను అన్నా నమ్మి పని చేయించుకునే వాళ్ళు వుండరట. నేను మంచి మాటలు చెప్పబోతే యెగతాళి చేసారు.  నన్ను మూలా  పేట  గుడి దగ్గర వో  అన్న దగ్గరికి నన్ను తీసుకు వెళ్ళారు. వాడు నన్ను అక్కడే వుండమన్నాడు.  వాడు  రాత్రేల  వొంటిమీద చెయ్యేసి  యేమేమిటో చేయబోయాడు.నేను గట్టిగా  అరిచాను, యేడ్చాను. ప్రక్కన వాళ్ళు అలికిడికి వాడు నన్ను అక్కడే వదిలేసి పారిపోయాడు.  నేను అక్కడి నుండి తప్పించుకుని రాత్రంతా తిరుగుతూనే ఉన్నాను.  తెల్లారి మా వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్లాను. నన్ను తీసుకువెళ్ళి బొంబాయి వాళ్లకి అమ్మేస్తాడని చానా డబ్బులు వస్తాయని  మా వాళ్ళు చెప్పుకుంటున్నారు.  భయం వేసి పారిపోయి  వచ్చేసానమ్మా" ..అని చెప్పి యెక్కి యెక్కి  యేడుస్తుంది.   నా గుండె దడ దడ లాడింది.  కిటికీ తలుపులు కూడా మూసి వచ్చి మరొక చాప వేసుకుని దాని ప్రక్కనే పడుకున్నాను.

బంగారు ! వాడు నిన్ను యేమి చేయలేదు కదా అన్నాను. ఆ మాట దానికి అర్ధం అయ్యే వయసు లేదు.అర్ధం అయ్యేటట్టు యెలా అడగాలో నాకు తెలియలేదు.  ఆ సంగతి అడిగి దానిని యింకా  భయపెట్టడం మంచిది కాదని వూరుకున్నాను. మొదటిసారి దానిని కని దిక్కులేనిదానిగా  వొదిలేసిన తల్లిని తిట్టి పడేసాను.

 బంగారు."అమ్మా.. వాళ్ళు వచ్చి నన్ను పట్టుకు వెళతారేమో, నాకు భయం వేస్తుందమ్మా.." అంటూ నా ప్రక్కకు జరిగి పడుకుంది." నీకేం  భయం లేదు నేను ఉన్నానుగా !" అంటూ బంగారు వొంటి మీద చేయి వేసి వెన్ను నిమురుతూ వున్నాను. అది నన్నే చూస్తూ కాసేపటికి  నిద్ర పోయింది.

తెల్లవారిన తర్వాత బంగారు భయపడుతున్నట్లే  తనతో కలసి పెరిగిన వాడు వొకడు యింకొక  మనిషి మా యింటికి వచ్చారు.  నాకు కాళ్ళు వొణుకు తున్నా సరే  దైర్యం కూడా దీసుకుని బయటకి వచ్చాను.వాళ్ళు  బంగారుని పంపివ్వమని అడిగారు.నేను వాళ్లతో పంపడం కుదరదని చెప్పాను. మళ్ళీ యింకో సారి యిటువైపు  వస్తే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తాను అని బెదిరించాను. వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆ రోజే  నాకు వరసకు బాబాయ్ అయ్యే హెడ్ కానిస్టేబుల్ని పిలిపించి  ఈ విషయం చెప్పాను. ఆయన ఆ యేరియా ఎస్సై దగ్గరకి తీసుకుని  వెళ్లి  కంప్లైంట్ వ్రాయించి యిప్పించారు. ఒక సాధారణ మైన ఇల్లాలిని నేను ఇవన్నీ చేయడం పోలీస్ స్టేషన్కి రావడం  మా కుటుంబంలో యెవరికైనా తెలిస్తే  నన్ను పుట్టింటికి పంపడం ఖాయం .అదే విషయాన్ని  ఎస్సై గారికి చెప్పాను.

మీ యింటి వైపు చూడ కుండా నేను యాక్షన్ తీసుకుంటాను మీకేం భయం లేదు. మళ్ళీ యింకోసారి పోలీస్ స్టేషన్ కి రావాల్సిన అవసరం వుండదు.. మీరు వెళ్ళండమ్మా అని ఆయన హామీ ఇచ్చారు.

నేను బంగారు తిరిగి వచ్చేస్తుంటే నా దగ్గరకు వచ్చి" మీరు చాలా మంచి పని చేస్తున్నారమ్మా!కాస్తంత ప్రేమ అభిమానం చూపి వారి కడుపుకి నాలుగు మెతుకులు పెట్టి మంచి మార్గం చూపితే  లక్షల మంది  పిల్లలు  అనాధలుగా ఉండరు. అనాధలన్నవారే ఈ సమాజంలో వుండరు. ఇన్ని జాడ్యాలు ఉండవు" అని అభినందించారు.

"ఒకోసారి విసుకున్నా మా వారి సహకారం లేకుంటే  నేనీ పిల్లని చేరదీసే అవకాశం వుండేది కాదండి "అని చెప్పి సెలవు తీసుకుని వస్తూ మళ్ళీ బంగారు కోసం బట్టలు కొనడానికి షాపుకి వెళ్లాను.   ఇంటికి వచ్చాక బంగారు మాములుగానే  బాబుతో ఆడుకుంటూ పాపని ఆడిస్తూ నా వెనుక వెనుకనే తిరుగుతూ ఉంది. మళ్ళీ  యీ పిల్ల వచ్చేసిందే అంటూ ఇరుగు పొరుగు పలకరింపులు మొదలెట్టారు.

ఆ రాత్రికి బంగారు  యింకా  భయపడుతూనే వుంటుందేమో అన్నట్టు బంగారు  ప్రక్కనే నేను చాప వేసుకుని పడుకున్నాను.   అది నిశ్చింతగా నిద్ర పోయింది. అది యిక యెప్పటికి మా యింటిని వదలదు గాక వదలదు. నిద్రపోతున్న దాని అమాయకమైన ముఖం చూస్తూ అనుకున్నాను  అవును,నాకిప్పుడు ముగ్గురు బిడ్డలని.




(ఈ కథానిక  2002 వ సంవత్సరంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి "వనితా వాణి " కార్యక్రమం ద్వారా.. ప్రసారం అయినది. )


 .

4, అక్టోబర్ 2011, మంగళవారం

అమ్మకో లేఖ

ఈ లేఖా సాహిత్యం 2001 వ సంవత్సరంలో మార్చి  నెలలో ..(తేదీ గుర్తులేదు )  ఆకాశవాణి విజయవాడ కేంద్రం  వనితావాణి లో ప్రసారమైనది. (స్క్రిప్ట్ యధాతదంగా )       

********************
అమ్మకో లేఖ -వనజ తాతినేని 

పోస్ట్ మెన్  తెచ్చే లేఖ  కోసం ఆ తల్లి ఇంట్లోకి వీధి వాకిలికి మధ్య  తిరగలి రాళ్ళ మధ్య పడి తిరిగే గింజలా తిరుగుతూనే ఉంది. ఎలా వుందో తన కూతురు. అత్తింట్లో యెన్ని భాదలు పడుతుందో! ఇన్నాళ్ళు వుత్తరం  రాయకుండా యెప్పుడూ  లేదు.. అనుకుంటూ  వీధీ వాకిట్లోకి వెళ్లి వీధి చివర వరకు  చూపుల దారి వేసివస్తుంది. 

ఉత్తరం రాలేదు కానీ ఒక దుర్వార్త వచ్చి గుండెని పిండి పిండి చేసేసింది. ఎవరి వుత్తరం కోసమైతే యెదురుచూసిందో ఆ కూతురు ఆ అమ్మకి వుత్తరం వ్రాయకుండానే మూడేళ్ళ కొడుకుతో సహా స్నానాల  గదిలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండురోజుల ప్రయాణం చేస్తే కానీ ఆ వూరికి చేరడం కష్టం కనుక ఆత్మహత్య గనుక లేనిపోని గొడవలెందుకని  దహన సంస్కారాలు నిర్వహించాం అన్న కబురుతో  కడసారి చూపుకి కూడా వీలవక ఆ తల్లి గుండెలవిసేలా యేడుస్తూనే  వుండగా .. ఆ తల్లికి అప్పటిదాకా యెదురు చూసిన లేఖ రానే వచ్చింది.  ఆత్రుతతో ఉత్తరం చదవసాగింది. ఆ ఉత్తరం తల్లి గుండె  బరువుని మరింత పెంచింది. 


అమ్మా! నెల రోజుల నుండి నా ఉత్తరం కోసం యెదురు చూస్తూ వుంటావ్  కదూ!  నేను నిత్య సంఘర్షణతో, అయోమయంలో వున్నాను కదమ్మా!
 
ఏ భావాన్ని యెలా ప్రకటించి నీకు వ్రాయగలను చెప్పు ? ఇప్పుడు నేను వ్రాస్తున్న యీ ఉత్తరం నీకు  మునుపటి వుత్తరాల్లా ఆనందం  కల్గిస్తుందో  లేదో కానీ ఆలోచింప జేస్తుందని నా నమ్మకం. ఏమిటీ యీ  ఉపోద్ఘాతం అని ఆశ్చర్యపోకు. స్త్రీల జీవితాలకే  లేదు కదమ్మా! 

మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేయ గల్గిన నైపుణ్యం సాధించారు కానీ మానవ విలువలు యిలా వుండాలని హద్దులు యేర్పరచ  లేకపోతున్నాడు  కదమ్మా! తరాలు మారే కొద్దీ అంతరాలు యేర్పడినప్పుడు మనసులు-అనుబందాలు అర్ధం లేనివే అవుతున్నాయి.పాత నుండి కొత్తకి పరుగులు  తీస్తూ వుండటం నాగరికత చిహ్నం అంట కదా!

ఏది శ్వాశతం కానీ ఈ అనంత సృష్టిలో మనిషి మనుగడకి ఊపిరి పోసే సరికొత్త ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టేసి "గుడ్డెద్దు చేలోపడి మేసినట్లు మనం జీవనం సాగిద్దామా? దానికి నో!అనే సమాధానం యిస్తారు కదా! ఫండ మెంటల్ రైట్స్ ఏర్పరచుకున్న మనం వాటిని నిర్వర్తించ కుండటంలో   వైఫల్యం చెందుతున్నాం. సమాజానికి మానవుడికి గల అవినాభావ సంబందాన్ని  గుర్తించాలని నా అభిప్రాయం.

సమాజం ఆరోగ్యం గా ఉండటానికి  కుటుంబాలు దోహదం చేస్తాయని ప్రపంచ వ్యాప్తంగా ఘోషించుకుంటూన్నాం.
ఆ కుటుంబం ఆరోగ్యంగా వుండటానికి మాత్రం భాద్యురాలు స్త్రీ అంటుంది మన భారతీయ సమాజం.
 కుటుంబంలో కష్ట-నష్టాలు,సుఖ-దుఖాలు అన్నింటికీ స్త్రీయే ఆధారం అన్నట్టు పెద్ద బరువుని ఎత్తి చేతులు దులుపుకుంటున్న మగధీరులు,వారికి తాన అంటే తందానా రీతిలో సమజమూను.

అసలు సమాజంలో స్త్రీకి పురుషుడుకి సమానమైన భాద్యతలు, స్తితి కూడా ఉండాలని భావించకపోవడమే అసలైన పొరబాటు. పొరబాట్లు అలవాటైన లోకంలో అడుగడుగునా అణచివేస్తూ క్రుశింపజేస్తూ నిరంతర జీవన ప్రయాణంలో సాగి పోవాల్సిందే తప్ప స్పీడ్ బ్రేకర్ లు,టర్నింగ్ పాయింటులు మచ్చుకైనా కానరాక మనుగడ సాగిస్తుంది మన భారతీయ మహిళ.


పుట్టుక ముందే తల్లి ద్వారా పోరాటం నేర్చుకుని మరీ పుడుతుంది నేడు పుట్టే ప్రతి ఆడ శిశువు. 
పుట్టుక నుండే తల్లిదండ్రుల ఆంక్షలు,పెరిగిపెద్దయ్యేటప్పుడు అన్నదమ్ముల ఆంక్షలు,చదువు కోసం ఆరాటం, ఉద్యోగం కోసం పోరాటం. ఇక జీవిత భాగస్వామ్యి ఎంపికలో తన ప్రమేయం లేక తల్లిదండ్రుల ఇష్టాలకి తలొగ్గి భాద్యతలు గుర్తించి మసలుకునే నాలాటి వారు ఎందరో!


అంతా ఎడ్జెస్ట్ మెంట్ ఎడ్జెస్ట్ మెంట్. తీరా మెట్టినింట స్వజాతి మనుషుల నుండే  ఈర్ష్యా-ద్వేషాలతో కూడిన వేధింపు   చర్యలు. జీవితం చుక్కాని లేని నావలా సాగిపోతుందో,సుడిగుండంలో పయనించాల్సి వస్తుందో..అంతా భయం భయం.
పుట్టిన దగ్గర నుండి కడసారి కాటి వరకు ఎన్నెన్నో ఘట్టాలు,అణచి వేతలు.

నేటి స్త్రీ  తన వ్యక్తిత్వం కోల్పోకుండా వుండాలని ఉనికిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే  ఉంది. ఇదంతా ఎందుకు రాస్తున్నానో..నీకు అర్ధమవుతూ ఉంటుంది కదమ్మా! వైవాహిక జీవితంలో నేను అనుభవిస్తున్న నరక యాతన నుండి విముక్తి కోరుతున్నానని ఈ కష్టాల కడలి ఈదలేక వొడ్డున చేరదామనే నా పోరాటం నీరు కారుస్తూ మీరందరూ చేస్తున్న ప్రయత్నాలు నా మనసుని బాధిస్తున్నాయి. ఏ బిడ్డ అయినా తల్లి దగ్గర కష్టం పంచుకుంటుంది.బిడ్డని దగ్గరకు తీసుకుని ఓదార్చుతూ  తన చల్లని స్పర్శతో ఆత్మవిశ్వాసం కల్గించాలి కానీ నువ్వేమిటమ్మా ..నా నిర్ణయాన్ని  ఆక్షేపిస్తున్నావు? 

వ్యసనాలకి బానిసైన  భర్త పెట్టె మానసిక,శారీరక హింసలకి తట్టుకోలేని ఒక భార్య భర్త నుండి విడాకులు పుచ్చుకుని మానసిక ప్రశాంతతో బ్రతకాలనుకోవడం నేరమా?

ఒక స్త్రీ తన అంతరంగాన్ని విశదీకరించి వ్రాస్తున్న ఈ వుత్తరం మీ లాటి తల్లులని మారుస్తుందని నా నా నమ్మకం.
భార్య భర్తల మద్య ప్రేమ ఉండాలి..కానీ ఇక్కడ ఆంక్షలు.సహకారం ఉండాల్సిన చోట ఏర్పాటువాదం,అవగాహన ఉండాల్సిన చోట అహంకారాలు రాజ్యమేలుతున్నాయి. బతుకు బండి సాఫీగా నడవడానికి మూల సూత్రాలని మరచిన భార్యాభర్తల మద్య సమన్వయము యెలా సాధ్యం  చెప్పు?

సంసారం అంటే స్త్రీని గుర్రంలా మార్చి కళ్ళకు గంతలు కట్టి,ముకు తాడు బిగించి పగ్గాలు చేత బూని స్వారి చేసేవాడా పురుషుడు? 
కదలక పొతే కొరడా దెబ్బలని భరించ మన్నట్లు ఉంటుంది.మీ పెద్దల ఆలోచన  కూడా.. 
సుఖాలు లేకున్నా పర్లేదు.కష్టాలు మాత్రం వద్దనుకుని రాజీ పడి బ్రతుకుని ఈడ్చే స్త్రీలు ఎక్కువని చెప్పక తప్పదు సమానత్వం ఎండమావి లా గోచరిస్తుందని... 

ఏ దేశ చరిత్ర   చూసినా ఏముంది గర్వ కారణం? అబలల పై అత్యాచారాలు,యాసిడ్ దాడులు,భర్తల నిరంకుశత్వ  ధోరణి, ఆ దోరణి  భరించలేని భార్యలు ఎదురు తిరిగి భర్తని చంపే   స్థితికి జారిపోవడం ..ఇలాటివి వింటున్నాం. మన  దేశంలోనూ  ఇటువంటివి  అప్పుడప్పుడు  జరుగుతూనే  ఉన్నాయి  కదా !

కుటంబ  హింసని భరించలేని స్త్రీలు  విడాకులు కోరుకుంటే  ఆ స్త్రీకి అడుగడుగునా అవమానాలు,అవహేళనలు తప్పవు. తప్పులు అనీ పురుషుడివి అయినా నోరెత్తని ఇరుగు-పొరుగు సైతం విడాకులు కోరుకోగానే ఆ స్త్రీకి అక్రమ సంబంధాలు అంటగడతారు అలా తిరిగి కోలుకోనివిధంగా అపవాదులు వేసి తృప్తి పడతారు.


స్త్రీకి ఇలాంటివి అధిగమించే శక్తి కావాలి .ఆసరా అందించే వారి సంఖ్యా పెరగాలి. సభ్య సమాజంలో స్వేచ్చగా,గౌరవంగా బ్రతకడానికి చేయూత నివ్వాలి.కానీ మీలాటి వారందరూ చెప్పే మాటలు మాలాటి వారిని అడుగడునా అణచివేస్తూ..వికృత కోణాలలో ఆలోచించి వికృత రూపాలలో వేయి కోరలు  చాచి మమ్మల్ని కాటు  వేస్తున్నాయి.మా ధైర్యాన్ని   సన్నగిల్లిన్ప జేస్తున్నాయి . పరువు-ప్రతిష్టలకి వెరచి  సమాజం ఏమనుకుంటుందో అని భయంతో..అర్ధపం పర్ధం లేని మూర్కత్వపు చట్రాలలో బిగించి  చట్టాలనాశ్రయిస్తే ప్రయోజనం ఉండదని  కోర్టుల చుట్టూ తిరిగలేమని సమస్యలని,కష్టాలని  కడుపులోనే దాచుకోమని సలహా ఇస్తారు.

స్త్రీలకి  విద్యావకాశాలు పెరిగాయి. ఆ చదువలని సాగనీయడం లేదు.  చదువుకోవాలనే కోరికకి అడ్డుకట్టవేసి పెళ్లి చేసి మీ భాద్యత తీర్చేసుకున్నాము అనుకుంటున్నారు.   ఎట్టకేలకు కొంత మంది చదువుకుని ఉద్యగం చేస్తూ ఆర్ధిక స్వాతంత్ర్యం సాధించుకుంటే ఆ సంపాదన తన అవసరాలకి సైతం వాడుకునే స్వేచ్చ లేదు. 

ఈ పురుషాధిక్య ప్రపంచంలో ద్వితీయ శ్రేణి పోరురాలిగా జీవితం గడుపుతూ విముక్తి కోసం ఆక్రోశిస్తూ .. ఆడదానిగా పుట్టడం కంటే అడవిలో మాని పుట్టడం మేలని నిరాశ,నిసృహలతో కాలం వెళ్ళదీస్తూ..ఉంది. 

"మాతృస్వామ్య హక్కు కొల్పడమే ప్రపంచ చరిత్రలో స్త్రీ జాతి పొందిన పరాజయం అని.. స్త్రీని భోగ్య వస్తువుగా,వంట మనిషిగా,పిల్లలని కానీ పెంచే యంత్రంగా మార్చివేసారని ఎలుగెత్తి ఘోషించాడు..ఎంగెల్స్."


ఈనాటి మహిళా సంఘాలు సైతం అసలు సమస్యలని మరచి కొన్ని సమస్యలకే పరిమితం అయిపోతున్నారు.


మన చరిత్రలో యుద్దాలలో ధైర్య సాహసాలతో పోరాడిడిన స్త్రీ మూర్తులున్నారు.మార్గాన్ని నిర్దేశించిన వీరమాతలున్నారు. కానీ జీవితం అనే యుద్దంలో పోరాడేవారికి ఉత్శాహం  ఇవ్వలేని  మీలాటి వారు చరిత్రని పాఠాలుగా మార్చి చెబుతున్నారు. తప్పు చేయడం మగవారి వంతు వాటిని తప్పక భరించడం ఆడవారి ఖర్మం అంటూ  అదేదో పాటించవలసిన తప్పనిసరి హక్కు అయినట్లు నీతి బోధ చేస్తారు తప్ప  స్త్రీ మనసును,మనిషిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం  లేదు.

జీవితం అంటే కొంత సర్డుబాటే కాదనం.  మీ లాటి వారు ప్రతి క్షణం సర్దు బాటు అనుకోమంటారు. మనం నిర్దేశించుకున్న కొన్ని విలువలు ప్రకారం  జీవితాన్ని  జీవించడం కోసం అనుకోవడం  లేదు.  ఎక్కడినా స్త్రీకి వ్యక్తిత్వం మేల్కుంటే అక్కడ  వందమంది పురుషులు  అణచి వేయడా సమాయతమై ఉంటారు.అది సుపీరియర్ కాంప్లెక్స్ కాదా? అర్ధం పర్ధం లేని పంతాలకి పోయి కాపురం నాశనం చేసుకుంటావా? మగవాళ్ళు తప్పు చేస్తారు ఓర్చుకోవాలి అంటూ మళ్ళీ మళ్ళీ    చెప్పే పాత పాటలే వినే ఓర్పు నాకు లేదు. విడాకులు తీసుకుని నీ బిడ్డని పెంచగాలవా? అంటుంది మా అత్తగారు సవాల్ విసురుతూ..

నా చదువు నన్ను చదువు కొనిస్తే ఇలాటి పరిస్థితి వచ్చి నప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది ఉండేది కదా!ఆర్ధిక స్వాతంత్ర్యం తో..నా బిడ్డని నేను పోషించుకునే స్థితి నాకు ఉండేది కదా.. అయినా ఇప్పుడు నాకు  దిగులు లేదమ్మా ! స్వయం ఉపాది కల్పనతో ఏదో ఒకటి చేయ గలననే దైర్యం,ఆత్మ విశ్వాసం  పుష్కలంగా ఉంది.

ఆర్ధిక స్వాతంత్ర్యం ,ఆత్మ విశ్వాసం లేని స్త్రీలు రాజీ పడిపోయి ఒకరిమీద ఆధారపడే దుస్థితి కల్గినదుకు అనుక్షణం సిగ్గుపడుతూ.. క్షణ క్షణం మరణిస్తూ.. నిత్యం సంఘర్షణతో ఆత్మ వంచనతో బతకడం జీవితం జీవించడం అనిపించు కుంటుందా?
 పాశ్యాత్య    దేశాలల్లో నవనాగారికతతో,ఆర్ధిక స్వాతంత్ర్యం ఉన్న స్త్రీలు చిన్న చిన్న సమస్యలకే విడాకులు పుచ్చుకునే సంస్కృతి ఉంటె ఉండవచ్చు కాక. మన దేశ సంస్కృతిలో   పెరిగిన స్త్రీలు ఎన్నో కష్టాలను భరించిన తర్వాత కానీ విడాకులు కోరుకునే పరిస్థితి వస్తుంది అని అర్ధం చేసుకోలేకపోతున్నారు కదమ్మా!పాశ్యాత్య నవనాగరికతను దిగుమతి చేసుకుని  మన భారతీయ కుటుంబ జీవన విదానాంకి భంగం కల్గిస్తున్నారంటూ మన  దేశం లోని ప్రతి స్త్రీని  అణగ ద్రోక్కడం సమంజసమా?  కాయ కష్టం చేసే స్త్రీలు సైతం ఆర్ధిక స్వాతంత్ర్యం తో.. తన ఆత్మాభిమానం నిలుపోగల్గుతుంది. ఉన్నంత లో  తన బిడ్డలని పెంచుకుంటుంది.  ఉన్నత వర్గాలలో పుట్టిన స్త్రీలు చదువు ఆర్ధిక స్వాతంత్ర్యం కల్గి తమ ఉనికిని కాపాడుకోగల్గుతున్నారు. మద్య తరగతి వారు మాత్రం దైర్యం లేక,తెగింపు లేక తెగని ఆలోచనలతో.ఊగిసలాడే మనస్తత్వం తో..స్వయం నిర్ణయం  తీసుకోలేక నిరంతర యుద్ధం చేస్తూ..కుటుంబ జీవనం అనే రాజుని గెలిపించి తాను మాత్రం సైనికుడిలా ఒరిగిపోతుంది. 

మద్య తరగతి స్త్రీకి ప్రతినిధిగా తప్పనిసరి పరిస్తుతుల్లో  మరలా రాజీ  పడిపోవడానికి నా మనసు అంగీకరించడం లేదు.ఆత్మ వంచనతో జీవించడం కన్నా ఆత్మ విశ్వాసంతో..పయనించాలి అనుకుంటున్నాను.  మా పక్కింటి పిన్ని గారు తప్పులు చేసిన భర్తని క్షమించడంలోనే ఔదార్యమ్ ఉంటుందని అంది. పత్శా తాపం  కల్గిన మనిషిని  క్షమించవచ్చు, కావాలని తప్పుడు దారిలో పయనిస్తున్న మనిషిని  భరిస్తూ జరిగినవన్నీ మరచి నటన అనే ముసుగు వేసుకుని కాపురం చేయడం నల్గురి దృష్టిలో  గౌరవంగా   ఉంటుందేమో కానీ నాకు మరణంతో సమానం.

స్త్రీకి వ్యక్తిత్వం ఉంటే అది శాపం అవుతుందా? చలం వ్యతిరేకించిన ఆలోచనల ధోరణి దశాబ్దాలు దాటినా అలాగే ఉంది. మారనిది,మాయనిది స్త్రీల పై అణచివేత,కొన్ని దేశాలలో ఓటు హక్కు లేదు.మరికొన్ని దేశాలలో స్త్రీల పై జరిగే అత్యాచారాలకి అంతే లేదు.ఇదీ ప్రపంచ దేశాలలో స్త్రీల దుస్థితి.కొంత లో కొంత మన భారత దేశంలోనే నయం అని తృప్తి పడతాం కానీ    మానవ హక్కులు పరిరక్షించే ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ సంస్థ భారతీయ కుటుంబ స్త్రీల మనోగతాలను పరిశీలిస్తే తెలుస్తుంది. లెక్కలేనన్ని హింసాయుత దారుణాలు,వెలుగులోకి రాని అసంఖ్యాక దురాగతాలు .
నా స్నేహితురాలు అంది. భార్య-భర్తలు విడిపోవచ్చు  కానీ తల్లి దండ్రులు విడిపోకూడదని. వ్యసన పరుడైన తండ్రి నీడ బిడ్డల మీద పడటం ఏ మాత్రం మంచిది? తండ్రి చూపే  ప్రేమ,ఆదరణ కన్నా అతని దుర్వ్యసనాలే బిడ్డలపై ప్రభావం చూపుతాయని మానసిక వేత్తల అభిప్రాయం లెక్కలోకి తీసుకోరేం?


చదువుకుని ఉద్యోగం చేస్తూ ఆర్ధిక స్వాతంత్ర్యం కల్గిన నా ఫ్రెండ్ అక్క తన వ్యక్తిత్వము కాపాడుకునే ప్రయత్నంలో  విడాకులు పుచ్చుకుని  తన పిల్లలని పదిలంగా కాపాడుకుంటుంది. తనకి తరచు ఒక కల వస్తుంది అని చెబుతుంది. అది ఏమిటంటే తన కొడుకు తనని తండ్రి ప్రేమ నుండి దూరం చేసావని దూషిస్తూ అర్ధం పర్ధం లేని క్రమశిక్షణ కి గురి చేస్తున్నావని,తరచూ  నిందిస్తున్నావని అడుగుతావని అంటూ ఉంటాడట. ఆ కల నుండి మేలుకుని ఆలోచిస్తూ ఉంటానని, ఆ కల నిజం అయినా ఆశ్చర్య పోనని అంటుంది.  ఆమె భర్త తరపు బంధువులు  తరచు ఆమె ఇంటికి వస్తూ అలాంటి ఆలోచనలే ఇంజెక్ట్ చేస్తున్నారని తెలుసుకుని వారికి దూరంగా ఉంచడం చేస్తుంది.

స్త్రీలు తమ వ్యక్తిత్వాలని తాకట్టు పెట్టి  పిల్ల కోసం అన్నీ   భరించి తన రక్తమాంసాలను కరిగించి  తనకంటూ ఏమి మిగుల్చుకోకుండా  బిడ్డల బంగారు భవిష్యత్తు కుటుంబ జీవనంలోనే చూపగలదా? ఒంటరి మహిళల్లో  అలా పెంచలేరా?  అలా అనీ భరించి త్యాగమయి అనిపించుకోవడంలో.. జీవితం అంతా  అరగదీసుకోవాలా?  బిడ్డలు తల్లి త్యాగాలు గుర్తిస్తారా?  బిడ్డలు గుర్తిస్తారని తల్లి త్యాగాలు చేస్తుందా? అని ఆవిడ అడిగే ప్రశ్నలకి ఎవరు సమాధానం చెపుతారు? విడాకులు తీసుకున్నందుకు   ఆమె చుట్టూ జేరి ఆమెని మాటలతో చిత్రవధకి  గురుచేసి ఆమె నిర్ణయం తప్పని ఉద్భోద చేస్తూ ఉంటే ఈ ఊరినుండే బదిలీ   చేయించుకుని వెళ్లి పోయింది. తన నిర్ణయాలకి తనని వదిలేయక జీవితం అంతా తల్లిదండ్రుల కోసం, భాద్యతల కోసం,బిడ్డల కోసం,కుటుంబం కోసం, కరిగిపోయే కొవ్వొత్తిలా కరిగిపోవాలనుకోవడమే  ఈ సమాజం విధించే ఆంక్ష లైతే స్త్రీ శిశువు పుట్టగానే చంపేయడం మంచిది అనిపించక మానదు. అమ్మా! నన్ను అలా ఎందుకు చంపేయలేదు. నాకు ఎన్ని భాదలు తప్పి పోయేవో!నీకు పదే పదే నా భాదలు చెప్పి విసిగించే వారు ఉండే వారు కాదు. ఇక నిన్ను ఇబ్బంది పెట్టె ఉత్తరాలు వ్రాయను. దైర్యంగా తలెత్తుకుని జీవించే నీ కూతురిని చూస్తావు కూడా!

స్త్రీ మనసుని ఔపాసన పట్టిన వారు ఎవరైనా ఉంటే ఎన్ని కోణాలలో స్త్రీలో ఉదాత్త గుణాలని చూడ గల్గుతారో!ఒక మంచి వెంట చెడు ఒక చెడు వెనుక మంచి ఉంటాయన్న వేదాంతాన్ని ఒంట  బట్టించుకుని తల్లిగా కుటుంబ జీవనం ని విడిపోనివ్వకుండా బతుకు బండిని లాగక తప్పదనే నీ మాటని పెడ చెవిని పెట్టి మీ తరంలో మీరు తీసుకోలేని నిర్ణయాన్ని  మా తరంలో సాహసించి  నేను తీసుకున్నందుకు ఆక్షేపించినా సరే నేను నా నిర్ణయాన్ని మార్చుకోదలుచుకోలేదు.  అభినందనలు అందిస్తూ చేయూతనిస్తారో! ఆక్షేపిస్తారో! నావి అన్నీ ప్రశ్నలే! ప్రశ్నలోనే సమాధానం ఉందని  అమ్మలందరూ తెలుసుకోలేని వారు కాదు. అయిన మౌనం వహిస్తారు. మౌనం అర్ధాంగీకారం అనుకునే కన్నా మాకు స్పష్టమైన మీ ఆలోచన,అనుభవాల ధోరణి  పంచడం కావాలి. నేడు కాకున్నా  రేపు మాత్రం తప్పక మాదవుతుంది అనే ఆశతో ముందుకు సాగిపోయే "ఆమె" కి ప్రతినిధిని నేను. అపరాజితని నేను. 

అమ్మా నన్ను తప్పు చేస్తే దండించే నీవు  నేను తప్పుడు నిర్ణయం తీసుకుంటే దండించే అధికారం ఉందని మరువకు. ఎప్పుడైనా ఏదైనా చెప్పకుండా చేయని నేను ఇప్పుడు నీకు తెలియ కుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేక నా వేదనని.. నా లాటి వారి వాస్తవ స్థితులని తెలిపే ప్రయత్నం చేసాను.అర్ధం చేసుకుంటావనే ఆశతో ..


                                                                                                               ఇక ఉంటాను మరి
                                                                                                                          ఇట్లు
                                                                                                                        అపరాజిత.                                               
            ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ లేఖలో నా ప్రశ్నలు నీ ప్రశ్నలు సమస్త స్త్రీ ప్రశ్నలు ఉన్నాయమ్మా! వీటికి బదులు దొరికేది ఎన్నడు ? నేనూ నిన్ను అర్ధం చేసుకోలేని సమాజంలో మనిషినే నమ్మా ..నన్ను క్షమించు నన్ను క్షమించు తల్లీ .. అని ఏడుస్తూనే ఉంది. 

*************౦**************

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

మర్యాద వారోత్సవాలు

చాలా రోజుల తర్వాత బసెక్కి ప్రయాణం చేయాల్సిన అవసరమొచ్చింది ఆమెకి. ఒకింత అయిష్టంగానే బస్టాప్ కి బయలుదేరింది.  అప్పుడే స్టాప్ లో ఆగి ఆగనట్లు ఆగి వెంటనే కదులుతున్న బస్ ని హడావిడిగా యెక్కేస్తూ  రెండు నిమిషాలకి వొక బస్ వస్తూనే వుంది అయినా అందరకీ  తొందరే ,వేగవంతమైన ప్రపంచం రాష్ట్ర రోడ్డు సంస్థ నడిపే బస్సుల్లో కనబడుతుంది అని.

బస్ అంతా కిక్కిరిసి వుంది. పిల్లలని చంకనేసుకున్న తల్లులు, తల్లులు కన్నా భుజాలపై  పుస్తకాల సంచుల భారాన్ని మోస్తున్న పిల్లలు, భుజానికి హ్యాండ్ బేగ్ తగిలించుకుని పై రాడ్ ని పట్టుకుని వ్రేలాడుతున్న వుద్యోగినిలు, స్త్రీలకి కేటాయించిన సీట్లలో దర్జాగా కూర్చుని చోద్యం చూస్తున్న పురుష పుంగవులు. ఇది రోజూ కనబడే పరిపాటి దృశ్యాలు. టికెట్ తీసుకుంటూ కండక్టర్ ని అడిగింది ఆమె. మేడమ్ ! యింతమందిమి ప్రయాసపడుతూ  నిలబడి  ప్రయాణం చేస్తుంటే లేడీస్ సీట్లు ఖాళీ చేయించరేమిటీ ?

రోజూ యిదే పరిస్థితి, మీ మాట  మేము వినేదేమిటీ  అన్నట్లు చూస్తారు. ఒకోసారి గంటల తరబడి మేము నిలబడి ప్రయాణం చేస్తూనే వున్నాం. పదినిమిషాలు  ఆమాత్రం నిలబడి ప్రయాణం చేయలేరా ఆకాశంలో సగమంటూ బ్యాగులు తగిలించుకుని వుద్యాగాలకి బయలుదేరినవాళ్ళు అంటూ నోరు పారేసుకుంటున్నారు. ఎంతమందితో వాదించగలం ? నా డ్యూటీ నేను చేయాలికదా ! మీరే అడిగి సీట్లు ఖాళీ చేయించుకుని కూర్చోండి అంటూ ముందుకు వెళ్ళింది లేడీ కండక్టర్.

ఆమె బస్ అంతా పరికించి చూసి స్త్రీల సీట్లలో కూర్చున్నవారిని సీట్లు ఖాళీ చేయమని అడిగింది. మనసులో తిట్టుకుంటూ లేచి సీట్లిచ్చారు కొందరు. కొంతమంది సర్దుకుని కూర్చున్నారు. మరొక సీట్ లో ఒక స్త్రీ -పురుషుడు కూర్చుని వున్నారు. భార్యాభర్తలు కాబోలు, వారిని విడదీయడం యెందుకులే  అని యెవరికి వారు  వూరుకున్నారు. అలాగే ఇరవై నిమిషాలు ప్రయాణం సాగింది. మధ్యలో  కారుతున్న చెమట వరద. ఇంట్లో చెప్పుకోవడానికి సమయం లేనట్లు ఆడంగుల సొద. అబ్బా .. నరకమంటే ఇదేనేమో.  డ్రైవర్ బాబూ .. తొందరగా పద పద ఆమె మనసులో విసుక్కుంది. వెహికిల్ మీద వెళితే పావు గంట పట్టే ప్రయాణం. ప్రతి స్టాపుకి ఆగి ఆగి ముప్పావు గంట పడుతున్న  ప్రయాణం యిది. ఛీ వెదవది ..అంతా ఆలస్యమే, అందుకే బస్ యెక్కనిది అని తనని తానే  తిట్టుకుంది.   

అంతలో షడన్ బ్రేక్ తో బస్ ఆగింది. చంకలో ఉన్న పిల్లతో సహా తల్లి పడిపోయింది. ఆమెని లేవదీసి దెబ్బలేమైనా  తగిలాయేమో నని చూస్తూ ..ఏమిటయ్యా ఈ షడన్ బ్రేక్ అని అరిచింది ఒకావిడ. ముందు రోడ్డు పై చూడండి. మూడడుగుల యెత్తు వున్న  డివైడర్ ని కూడా అవలీలగా దూకి యెక్కడ బడితే అక్కడ హఠాత్తుగా రోడ్డు దాటేస్తుంటే బ్రేక్ వేయక యే౦ చేయాలి. జనాన్ని గుద్ది చంపేస్తామా ? బుద్ధి లేదు  జనాలకి " అంటూ పైకి అని తర్వాత వినబడకుండా తిట్టుకుంటూ ఉంటూంటే సందట్లో సడేమియా అన్నట్లు అరవై యేళ్ళు పైబడిన వృద్దుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన బస్ లోకి యెక్కబోయాడు. ఎత్తుగా వుండే బస్ మెట్టు యెక్కలేక రాడ్ పట్టుకుని యెక్కడానికి ప్రయత్నించే లోపే బస్ కదిలింది. ఒక కాలు బయట ఇంకో కాలు లోపల  పెట్టి సర్కస్ ఫీట్లు చేస్తూ .. సరిగా యెక్కనీయకుండా యేమిటయ్యా ఆ తొందర  అని అరుస్తున్నాడు.  యేమిటండీ .. యెక్కనిచ్చేది, మీ యిష్ట ప్రకారం యెక్కడబడితే అక్కడ యెక్కేయడమేనా, మా ప్రాణాలు దీయడానికి బయలుదేరతారు అంటూ విసుగుతో కూడిన తిట్ల దండకం మొదలెట్టాడు డ్రైవర్. వృద్దులు,పిల్లలు యెక్కే౦దుకు తక్కువ యెత్తులో వుండే put board అవసరం గురించి అప్పటిదాకా మాట్లాడుకున్న  వారు కూడా ఆ  పెద్దాయనకి లేచి సీట్ యివ్వలేదు. ఆయనలాగే రాడ్ పట్టుకుని వ్రేలాడుతున్నాడు. అంతలో బస్ ఆగింది. యెవరు దిగుతారో సీట్ ఖాళీ అవుతుందా అని వెదుక్కు౦ది. భార్యభర్తలిద్దరూ కూర్చున్నారని అనుకున్న సీట్ లో నుంచి ఆ స్త్రీ లేచి నిలబడింది. అమ్మయ్య సీట్ దొరికింది అనుకుని ఆమె అటువైపు అడుగులేయబోయింది.

స్టాప్ లో  ఆమె ఒక్కతే బస్ దిగి వెళ్ళింది. అతను అలాగే సీట్ లో కూర్చుని వున్నాడు. వాళ్ళ వెనుక సీట్ లో కూర్చున్న వొకాయన బస్ కదలబోతుంది దిగరేమిటీ అనడిగాడు. ఈ రోజు కొంచెం పని వుంది. మార్కెట్ కి వెళ్లి పని చూసుకుని వస్తాను అన్నాడు. అప్పుడు అనుమానం వచ్చింది ఆమెకి. అప్పటివరకూ అతి ప్రక్కన కూర్చుని ప్రయాణం చేసిన ఆమె ఇతని భార్య కాదు. తోటి ప్రయాణికురాలు మాత్రమే అని నిర్దారించుకుంది. దిగి వెళ్ళిపోయిన స్త్రీ రూపాన్ని గుర్తుకుతెచ్చుకుంది. చాలా సాధారణంగా వుంది అయినా యెలాంటి బిడియం లేకుండా పరాయి పురుషుడి ప్రక్కన  గంటకి పైగా కూర్చుని ప్రయాణం చేసింది. బస్ లో మిగతా  వుద్యోగినులు అతని ప్రక్కన సీట్ ఖాళీగా వున్నా కూర్చుని ప్రయాణం చేసే సాహసం చేయలేకపోతున్నారని అనిపించి "ఇక్కడ వ్రేలాడుతున్న ఆడవాళ్ళ అవస్థ చూసైనా మీకు సీట్ ఖాళీ చేయాలనిపించడం లేదా అనడిగింది. కూర్చోమనండి, నేనేమైనా వద్దన్నానా ? మీరైనా కూర్చోవచ్చు అన్నాడు. అతని మాటల్లో వ్యంగ్యం గుర్తించి వోల్లుమండి పోయింది ఆమెకి. యెంత పొగరు వీడికి స్త్రీల పట్ల యింత చులకన భావమా ? మర్యాద వారోత్సవాలు జరిపి స్త్రీలకి కేటాయించిన సీట్లు వారికే ఇవ్వమని, స్త్రీలని గౌరవించమని చెవుల్లో శంఖం వూది మరీ చెప్పారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు . అవన్నీ శుద్ధ దండగ అని ఆలోచిస్తూ వుంది.

ఇంతలో ట్రాఫిక్ కి అంతరాయం కల్గింది. రెండు వైపులా వాహనాలు బారులు బారులుగా నిలిచిపోయాయి. ఏమిటా అన్న ఆసక్తితో బయటకి చూస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  మహిళలు జరుపుతున్న  ప్రదర్శన.  మహిళపై జరుగుతున్నా లైంగింక వేధింపులు ,ఈవ్ టీజింగ్ , వరకట్న వేధింపులు, మహిళా రిజర్వేషన్లు గురించి యెలుగెత్తి నినదిస్తూ సాగుతున్న ప్రదర్శన పట్టుమని వందమంది కూడా లేని లేమి తనం. మహిళా సమస్యల గురించి వేదికలెక్కి ఉపన్యసించే టపుడు అందరూ సమైక్య వాదులే,మాహిళాభివృద్ధి  కాంక్షించే వాళ్ళే ! కానీ వారితో నడవడానికి వొక్క పురుషుడు కానరాడు. ఇలా అంత రంగంలో తలపోస్తున్న ఆమెకు వెనుకనుండి స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. వీళ్ళకి వొళ్ళు బలిసి హద్దు అదుపు లేకుండా రోడ్డున పడ్డారు. ఇంట్లో మగవాళ్ళు చవటలు కాబట్టి ..అనుకుంటున్న మాటలు వొంటికి  కారం రాసుకున్నట్లు అనిపించింది.  బస్ లో సగానికి  పైగా మహిళలున్నా యెవరూ ఆమాటలు విననట్లే నటించారు. ఎవరెవరితోనో వాదన మనకెందుకన్నట్లు.

స్త్రీలు నిలబడి ప్రయాణం చేస్తున్నారు తప్ప పురుషుడి ప్రక్క సీటు ఖాళీగా వున్నా కూర్చునే సాహసం చేయరు. ఇందాకటి స్త్రీ పెద్దగా చదువుకున్నట్టు కూడా లేదు.అయినా యెంత సహజంగా దైర్యంగా కూర్చుని ప్రయాణం చేసింది. నాలాంటి వారికి యెన్నెన్ని సంశయాలు, యెంత బిడియం. రైల్లో అయితే పర్లేదు కానీ బస్ లో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుని ప్రయాణం చేసే సాహసం స్త్రీలలో యింకా రాలేదు అపర్ణాసేన్ మిస్టర్ అయ్యర్ & మిసెస్ అయ్యర్ చిత్రంలో కూడా హీరోయిన్ వేరొక పురుషుడి ప్రక్కన బిడియపడుతూ కూర్చున్న వైనం గుర్తుకొచ్చింది అప్రయత్నంగా ఆమెకి.  పొరబాటుగా శరీరాలు తగిలనంత మాత్రానే అపవిత్రమయిపోతామన్న భయం స్త్రీలకి మాత్రమేనా ? లేక ఆ స్త్రీలకి సంబంధిన మగవాళ్ళది కూడానా అనుకుంటూ కాళ్ళు నొప్పి పుడుతున్నట్టు అనిపించి .. పురుషుడి ప్రక్కన ఖాళీగా వున్న సీట్లో టక్కున కూర్చుంది.

 ఆమె అలా కూర్చోగానే బస్ లో వున్న కొందరి చూపుల్లో ఆశ్చర్యం, నొసలు చిట్లించడం గమనించింది. కూర్చునే ముందు లేని ఆలోచన అప్పుడు కల్గింది ఆమెకి . ఎవరైనా తప్పు పట్టినా పట్టించుకోకూడదు అనుకుంది దృఢ౦గా . ఇంకో స్టాప్ రాగానే మరికొన్ని సీట్లు ఖాళీ అయ్యాయి. అయినా ఆమె అతని ప్రక్క నుండి లేచొచ్చి ఖాళీ అయిన సీట్లో కూర్చోలేదు.ఇలాంటి విషయాల వల్లే స్త్రీ చాలా వెనుకబడి వున్నారనిపించింది. ఏ వాన కురిసినప్పుడో , బంద్ ప్రకటించినప్పుడో, ట్రాఫిక్ జామ్ అయినప్పుడో త్వరగా యింటికి చేరాలని ఆదుర్దా  అవసరం వున్నప్పటికీ కూడా యెవరి వాహనంలో అయినా లిఫ్ట్ అడగాలంటే భయం. లిఫ్ట్ యివ్వాలన్నా సంశయం. ఆకాశంలో సగం అన్నది యెంత అబద్దం. మనం యెదిగింది యెక్కడ? కేవలం ఆలోచనల్లో మాత్రమేనా? ఆలోచనల్లోనే కాదు ఆచరణలో కూడా అన్నది యెవరో వొకరు దైర్యంగా నడిచి చూపాలి అనుకుని దైర్యంగా సర్దుకుని కూచుంది. బస్టాండ్ కి వచ్చి ఆగింది బస్. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు యెవరి తొందరలో  వారు . ప్రక్కన కూర్చున్న పురుషుడు కూడా వేరే సీట్లో కూర్చునే ప్రయత్నం చేయలేదు.

మళ్ళీ అనేక ఆలోచనలు. మనం నిజంగా నాగరికత సాధించామా, నాగరికత అనేది మన వేష భాష ల్లోనే కానీ, మన ఆలోచనల్లోనే కానీ ఆచరణలో మాత్రం శూన్యం అనుకుంటుండగా యెవరి పలకరింపుకో  వులికిపడింది.కాస్త పరిచయం వున్న మనిషే ! నవ్వి బాగున్నారా అని అడిగింది. మార్కెట్ కా అనడిగింది ఆమె. అవును అంది ..ప్రక్కన  యెవరూ .. అర్ధోక్తిలో ఆగింది ఆమె . మావారు కాదు అందామె. మరి ఆశ్చర్యంగా చూసింది . కొద్ది క్షణాల తర్వాత ఫ్రెండ్ ..ఆ ..అని అడిగింది. నా ప్రక్కన కూర్చున్నతను యెవరో చెపితే కానీ ఆ రాత్రికి ఆమెకి నిద్రపట్టదేమో అన్నంత యిదిగా అడుగుతుంటే  "కాదండీ .. నా తోటి ప్రయాణికుడు " అంతే అంది. ఆవిడ ముఖంలో మళ్ళీ టన్నుల కొద్దీ ఆశ్చర్యం. అంతలోకి మార్కెట్ రానే వచ్చింది.అందరూ దిగే పనిలో వున్నారు.ఆమె మాత్రం ఆఖరిన నిలబడి యెదురుగా కనబడుతున్న డిపో మేనేజర్  ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంది. ఎందుకమ్మా  నెంబర్ వేసుకుంటున్నారు అనడిగాడు డ్రైవర్. మీ మీద రిపోర్ట్ చేయడానికి కాదులే ! మర్యాద వారోత్సవాల ఫలితాలు గురించి చెపుదామని అని బస్ దిగిపోయింది ఆమె.

***********************