29, అక్టోబర్ 2012, సోమవారం

పూల గుత్తులు









ఇదిగో..  చిన్నప్పుడు ఇలా కొరికేసిన చెల్లెలిపై  అన్నకి అసలు కోపం లేదు. ఇప్పటికి తరగని  ప్రేమ తప్ప .


ఇంటి వెనుక తోటలో పూసిన ఈ  పూల గుత్తులు  ని  "అన్న "    భద్రంగా కెమెరాలో  బందించి చెల్లికి కానుకగా పంపాడు .

ఆ "అన్న"కు చెల్లి ఇచ్చిన కానుక ఈ పాట "కన్నీళ్లకే కన్నీరొచ్చే" ...

28, అక్టోబర్ 2012, ఆదివారం

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ

ఇటీవల  శ్రీ శైల  మల్లికార్జునుడిని  స్పర్శ దర్శనం గావించుకుని..భ్రమరాంబిక చరణారవిందములను దర్శించుకుని

ప్రశాంత మైన మనసుతో.. నూతన శక్తితో..తిరిగి వచ్చాను.


అప్పటి చిత్రాలు కొన్ని..




సకల జనులకు ఆ ఆది దంపతుల కరుణా కటాక్షాలు ప్రసరించాలని కోరుకుంటూ..

27, అక్టోబర్ 2012, శనివారం

జ్ఞానం అజ్ఞాతంలో ఎందుకట..!?

ఏమిటీ..     ఈ మధ్య ..    ఆకట్టు కునే పోస్ట్ లు ఏమి వ్రాయడం  లేదు.. !? అడిగింది నా ఫ్రెండ్ రమ.

ఏది..అసలు తీరిక చిక్కడం లేదు. పని ఒత్తిడి..అన్నాను నేను.

కోతలు కోయకు.. ఎంత ఒత్తిడి అయినా అర్ధరాత్రుళ్ళు మేల్కొని వ్రాసిన పోస్ట్ లు ఎన్నో..గుర్తు తెచ్చుకో..అని నిర్మొహమాటంగా అడిగేసింది.

 నువ్వన్నది..నిజమే ! కానీ ఎందుకో..ఈ మధ్య..కీ బోర్డ్ పైన వ్రేళ్ళు కదలను అంటున్నాయి అన్నాను నిరాసక్తగా .

ఏమైంది..తల్లీ.. సబ్జక్ట్స్ కరువా..అంది.

 కాదు.వ్రాయాలనుకున్నవి చాలా అలా పెండింగ్ లో పది పేరుకు పోయి ఉన్నాయి. నాకే ఒక సందేహం ముంచుకొస్తుంది. నేను బాగా వ్రాయగల్గుతున్నానా..లేదా..అని. అన్నాను.

ఎందుకంత సందేహం..!? నువ్వు బాగా వ్రాస్తున్నావు కదా!అంది.

ఆ..కదా..లోనే కథ అంతా ఉంది. ఉదాహరణకు ..చెపుతాను విను. అన్ని బ్లాగులలో విషయాలు లాంటివి కాదు కదా నాకు బాగా నచ్చిన బ్లాగర్ లా నేను ఒక పోస్ట్ అయినా వ్రాశానా..లేదా..అని నాకు సందేహమే!

"అమయ" సామాన్య గారిలా.. ఆకట్టుకునేలా..అద్భుతంగా నేను వ్రాయ గలనా..!?

"అమృత మథనం " బుద్ధా మురళి గారి లాగా..రాజకీయ వ్యంగం  వ్రాయగలనా?  చదివి అర్ధం చేసుకునే బుర్ర కూడా నాకు లేదాయే!

"కాలక్షేపం కబుర్లు"..అంటూ ఎంతో..ఎదిగిన మనసు..తో..ఒదిగి మరీ.. "కష్టేఫలి"  అంటూ అపరిమితమైన జ్ఞానం కల్గిన శర్మ గారిలా ఒక పోస్ట్ అయినా వ్రాయగలనా!?

అలాగే ఎదురైనా ప్రతి అనుభవాన్ని.. కవిత్వంలో చెప్పగల "కవితాసమాహారం"  "మేరాజ్" లాంటి కవయిత్రిని కాలేను అన్న బాధ ఉంది.

జనరంజకంగా.."జనవిజయం " అంటూ..అనేకానేక సామాజిక సృహని పెంపొందించే వ్యాసాలూ నేను వ్రాయ గలనా!?

సుతి మెత్తగా..ఆహ్లాదంగా అనేక అంశాలను సృశిస్తూ రాజీ పడని రాజీ గారిలా.. :"నా చిన్ని ప్రపంచం" ఇదే అని సగర్వంగా  చాటుకోగాలనా!?

ఇక.. మెరుపులా ఝుళిపిస్తూ..ఉరుములా గర్జిస్తూ...  జడివాన లాంటి  బాదుడుతో   సరి క్రొత్త ఆలోచనాలోచనా ల్లోకి సగటు మనిషి ని తోసుకు వెళ్ళే "పనిలేక " పోస్ట్ ని నా పనికిమాలిన వ్రాతతో  ఒకటైనా వ్రాయగలనా!?

సాదా సీదాగా కనిపిస్తూ..నలుగురికి ఉపయోగ పడితే చాలు అనుకుని నా అనుభవాలని..అంత ఓపికగా ఒద్దికగా.."మై వాల్యుబుల్ లేసేన్స్"  ఉపయోగకరంగా వ్రాయగలనా!?

అందుకే వ్రాయడం తగ్గించి.. ఏ  పాటో..లేక ఏ ఫోటో నో..పెట్టి..అమ్మయ్య ! ఈ రోజు పోస్ట్ పూర్తయ్యింది..అని..ఊపిరి పీల్చుకుంటున్నాను అని ఏకబిగిన చెప్పేసాను {మా అమ్మమ్మ పోసిన వస సార్ధకం అవుతుంటుంది అపుడప్పుడు)

అయిందా..నీ పోలికల ప్రహసనం !?
అయినా నీకిదేం ..పోయే కాలం దాపురించింది..? ఈ మధ్య నీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది అంది రమ.

అదేం  లేదే!  పర్సనాలిటీ డెవెలప్మెంట్ బుక్స్ తెగ .చదివేసాను కూడా..అన్నాను.

ఎదో తేడా అయితే ఉంది..కాస్త మనసు విప్పి చెప్పుకుంటే బాధ తగ్గును కదా ! నాకు తోచిన ఉచిత సలహా కూడా వినవచ్చును అంది.

అంత భరోసా ఇచ్చాక కూడా..నేను పెదవి విప్పక పొతే బాగుండదు.. స్నేహ ద్రోహి నవుతాననుకుని.. మనసులో ఉన్న బాధనంతా వేల్లగ్రక్కేసాను.

ఎవరో..ఒక అపరిమిత జ్ఞాన సముపార్జనుడు.. నన్ను ఎగతాళి చేసాడు.అప్పుడు నాకు సందేహం వచ్చింది. ఆ.. నేను వ్రాస్తున్నదేమిటి?  వ్రాయాలనుకుని ఉన్న ఎన్నో ఆలోచనలని..చేతి దురదతో..వ్రాయడం తప్ప ఇంకోటి కానరాలేదు.

అలాగే ఈ బ్లాగ్ లలో గంటకోమారు..తలదూర్చి.. పని చెడ గొట్టుకునిమరీ తెగ చదివేసి.. జ్ఞానం వచ్చేస్తున్నదని..తెగ మురిసిపోవడం తప్ప..అందుకే.. వ్రాయకూడదు,చదవకూడదు అన్న వైరాగ్యం వచ్చేసింది ..అని నిజాయితీగా చెప్పేసాను.

ఇలాటిది ఏదో ఉంటుందని నేను ఊహించాను. అయినా..అంత సున్నిత మనస్తత్వం అయితే..ఎలా.. !? ఎవరో..ఎదో అన్నారని నువ్వు వ్రాయడం మానేస్తావా!? ఎవరి గొప్ప వారిదే! అందుకు ఉదాహరణగా ఒక కథ చెపుతాను విను.అంది.

ఏ  మహర్షి చెప్పిన జ్ఞాన బోధ  ..ఇది..? అడిగాను ఆసక్తిగా..

"రమ మహర్షి ణి " చెప్పిన కథ అనుకో..అంటూ చెప్ప సాగింది.

ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. అతనికి కొంత తోట ఉంది.అందులో అనేక మహా వృక్షాలు రక రకాల ఫల వృక్షాలు,పూల మొక్కలు కాయ గూరల చెట్లు ఉన్నాయి.

ఆ రైతు ఆ తోటలో మొక్కల మధ్య బోదెలు వేసుకుంటూ ఉన్నాడు. అతనికి కొన్ని మాటలు వినిపించసాగాయి. ఎక్కడ నుండి..ఆమాటలు వినబడుతున్నాయి అనుకుంటూ చూట్టూ పరికించి చూసి.. ఓ.. మామిడి వృక్షం..ప్రక్కనే ఉన్న ఓ..మిరప మొక్కతో మాట్లాడుతున్నదిగా గమనించి.. ఆసక్తిగా వినసాగాడు.

ఒక మామిడి చెట్టు,ఒక మిరప చెట్టు..ఎవరికీ వారు నేనే నీకన్నా గొప్ప అంటూ..వాదులాడుకున్తున్నాయి.

ఆ మామిడి చెట్టు ఇలా అంటుంది.. నేను చూడు.. ఎంత బాగా ఎదిగి ఉన్నానో..నాకు ఎన్నో కొమ్మలు..రెమ్మలు,చివురులు.కవులు నన్ను ఎంత బాగా వర్ణించారో..! ప్రతిచోటా  నా రెమ్మలు విరిచి తోరణం కట్టనిదే ఏ శుభ కార్యం జరగదు. అలాగే నా చివురులు తిని.కోయిల ఎంత కమ్మగా పాడుతుందో!
నా పై..ఎన్ని పక్షులు గూళ్ళు అల్లుకుంటాయో ! అంతెందుకు..!? మానవమాత్రులు కూడా  నా నీడన సేదదీరీన  వారే !.పూత  పూసి పిందెగా మారినప్పటి నుండి.. అందరి దృష్టి నాపైనే! రక రకాల వంటలలో నన్ను ఉపయోగించుకుంటారు.లొట్టలు వేసి తింటుంటారు.రక రకాల ఊరగాయలు వేసి నిల్వ చేసుకుంటారు. పండిన నా పండ్లని జుర్రుకుని తింటుంటారు.  నావల్ల తోట యజమానికి ఎంత లాభం.. నాతొ సాటి రాగలరా వేరేకరు? అని తనని తానూ కీర్తించు కుంటూ..

నువ్వు ఉన్నావ్..చూడు..భూమికి రెండడుగులు..వళ్ళంతా కారం. నిన్ను చూస్తే ఒక్కరైనా దగ్గరికి వస్తారా..అమ్మో! మంట..అంటూ దూరంగా పారిపోతారు.. ఎండి కట్టే అయినా తగలబెడితే కూడా కోరు. మనుషులని ఉక్కిరి బిక్కిరి చేసేస్తావు? నీది ఒక బ్రతుకేనా ?అంటూ.. ఎద్దేవా చేస్తూ.. విరగబడి నవ్వుతుంది.

ఆ మాటలు వింటున్న మిరప చెట్టు చిన్నబోయింది . మామిడి చెట్టు చెప్పింది  నిజమే కదా! అనుకుని తనపై తనే జాలిపడింది. అలాగే..అందరు మెచ్చని దగ్గరకి రానీయని ఈ హీన బ్రతుకు నాకెందుకు ?అని దిగులు పడింది.

రైతు..  వాటి మాటలు వింటూ ఆలోచిస్తూ ఉన్నాడు.అంతలో.. మబ్బులు క్రమ్మి పెద్ద వర్షం పడసాగింది. రైతు.. తన పని ని వదిలేసి.. ముందు మామిడి చెట్టు క్రిందకి వచ్చి నిలబడ్డాడు. అంతలోనే ఈ చెట్టు పై  పిడుగు పడే అవకాశం ఉంది అనుకుని..భయపడి..ప్రక్కనే ఉన్న గుడిసె లోకి పరుగు పెట్టాడు.

 ఒక గంట పాటు పెళ పెళ మని ఉరుములతో,గాల్పులతో..కురిసిన అకాల వర్షానికి మామిడి వృక్షం కొమ్మలు విరిగి,కాయలు రాలి నామ రూపాలు లేకుండా ద్వంసం అయిపొయింది. వాన త్రగ్గాక వచ్చి చూసిన తోట యజమాని.. ఆశ్చర్యపోయాడు. ఛీ.. మామిడి చెట్లు వల్ల ఎప్పుడు ..నాశనమే.. ఒక్క సంవత్సరం అన్నా.. పూర్తి పంట తీస్తామనే నమ్మకమే లేదు. అని తిట్టుకున్నాడు.

మిరప మొక్క వంక చూసాడు. అంత వానలోని.. చెక్కు చెదరక  బుడం కాయల్లాంటి   పండిన ఎర్రటి కాయలతో..నిలిచి ఉంది.

ఈ సృష్టిలో.. అన్నీ సమానం కాకపోవచ్చు.కాని దేని ప్రత్యేకం దానిదే కదా! గొప్పవని అజ్ఞానం తో విర్రవీగుతూ ఉండటం కన్నా  ఉనికిని నిలబెట్టుకుంటూ.. నిలబడే ప్రయత్నం చేయడం అన్నిటికన్నా స్పూర్తినిచ్చే విషయం అని అనుకుంటూ  ..

మొత్తానికి ఈ వాన సాయంత్రం మంచి పాఠం నేర్చుకున్నాను అనుకున్నాడు రైతు. అని చెప్పి ముగించింది. నావంక చూసింది..అర్ధం అయిందా..అన్నట్లు.

బండెడు మేథ్స్ , సైన్స్ పుస్తకాలు,పాలిటిక్స్ ,హిస్టరీ,ఇంకా వేదోపనిషత్తులు చదివి ఉండక పోవచ్చు  అంతగా కంప్యుటర్ నాలెడ్జ్ లేక  పోవచ్చు.  సంస్కృతం,ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం లేకపోవచ్చును.పుస్తకాలు రుబ్బి రుబ్బి మెదడు లో గుజ్జుగా మార్చు కోలేక పోవచ్చును. ఏదో..శ్రుత పాండిత్యం..కాసిని పుస్తకాలు చదివిన  కూసింత జ్ఞానం తో..ఇలా ఉన్నాను.

అపరిమిత జ్ఞానం ఆర్జించాం అనుకునే జ్ఞానులు .. ఎగతాళి చేస్తే మాత్రం నేను ఎందుకు బాధ పడాలి...!?  అది వారి నైజం. నేను బాధ పడను కాక పడను .

జ్ఞానం అజ్ఞాతంగా ఉండి అజ్ఞానం అని ఎగతాళి చేసినా బాధపడను. నాకు తోచినది వ్రాస్తుంటాను సరేనా! అని హామీ ఇచ్చేశాను.

జ్ఞానం అజ్ఞాతంలో  ఉండి ..ఎగతాళి చేయడం కాదు. పదిమంది మధ్య మెలిగి.. పదుగురు మెచ్చుకుంటే..పదుగురికి ఉపయోగపడితే ..పరమార్ధం.అంతేనా..అన్నాను.

 కుశాగ్ర బుద్దికి "విజయీ భవ"  అంది మా రమ మహర్షిణి .. అభయ హస్తం చూపిస్తూ..

ఇంతకీ..ఈ పోస్ట్..అయినా నేను బాగా వ్రాయ గల్గానా.. లేదా..అని సందేహమే..!


26, అక్టోబర్ 2012, శుక్రవారం

ప్రయాణం అంటూ ..



ప్రయాణం అంటూ

గాయపడని మనసు
వేటు పడని  మాను
లేకుంటే..
చింతకి చిగురాశకు తావెక్కడ !?


కరదీపం లాంటి స్నేహం తోడుంటే..
రాళ్ళు ఉంటేనేం,ముళ్ళు ఉంటేనేం!


అలసిన మనసుకు
తీరని ఆశకు ...
తీరం చేరలేని నావకు
తప్పని కల్లోల పయనం

ప్రయాణం అంటూ మొదలయ్యాక
చేరాల్సిన గమ్యం 
దూరమైతేనేం..దగ్గరైతేనేం?
కొనసాగించాల్సిందే కదా!

22, అక్టోబర్ 2012, సోమవారం

అమ్మ ఆశ్శీస్సులు..

చిన్ని..! బంగారం..!!



ఈ రోజు.. ఉద్యోగంలో  చేరుతున్న నీకు.. కొండపై కొలువున్న" కనక దుర్గమ్మ " ఆశ్శీస్సులు నిండుగా లభించి..

ఉద్యోగ నిర్వహణలో.. సాటి లేని మేటి ప్రతిభని అందించి.. ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి-  సామర్ధ్యం,  వినయ విధేయతలు,ఓపిక - ఒద్దిక నీకు ప్రసాదించాలని "అమ్మ"ని  మనసారా కోరుకుంటూ..

ఉద్యోగ భాధ్యతలో.. ఇమిడిపోవడానికి సమాయత్తమైన ..నీకు.. "విజయోస్తు " యశస్వి భవ.. బంగారం.




హృదయపూర్వక శుభాకాంక్షలు .. నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..

ప్రేమతో..దీవెనలతో.. అమ్మ.





21, అక్టోబర్ 2012, ఆదివారం

స్త్రీ స్వరూపం

నిన్న నా ఫ్రెండ్ రమ..కాల్ చేసి..

మా ఇంటి ప్రక్క గుడిలో పీఠం  పెట్టాం. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకారాలు  జరుగుతున్నాయి..ఒక్క రోజు అయినా వచ్చావా.? అంది.

రాలేను అసలు ఓపిక లేదు. అంత సేపు కూర్చోలేను కూడా అన్నాను.
కాసేపు డెంగ్యూ జ్వరాన్ని తిట్టి నా పై  సానుభూతి కురిపించింది.
ఏం  చేస్తున్నావ్..!? అడిగాను.

నైవేద్యం చేస్తున్నాను. .అంది.

వంట ఇంటికి పరిమితం అయ్యే ఆడవారు.. పుట్టిన దగ్గర నుండి ఎలా విందు..కను విందు చేస్తారో..

 ఒక ఆసు కవిత ..చెపుతున్నాను విను ...

ఇదిగో..ఆ కవిత ఇది.
ఎక్కడో ఏదో ..లోపం ఉంది. అయినా .కూడా ఇలా షేర్ చేస్తున్నాను.

చిన్నారిగా చిలక పలుకులు పలుకుతూ..
బుడి బుడి అడుగులు వేస్తూ
తల్లిదండ్రులకు కనువిందు చేస్తూ..

కౌమారదశలో కనిపించి కనిపించని అందాలతో..
కుర్రకారుకు ఉచిత ప్రసాద విందు నందిస్తూ..

సతి గా మారి ప్రాణ సఖునికి..
ఏకాంత మందిరంలో..తెరచాటు నైవేద్యం అందిస్తూ..

తల్లిగా మారి పతికి, సంతతికి కూడా.
జీవిత కాలపు  మహా నైవేద్యం ,,అందిస్తూ..

ఆణువణువూ..అంకితం అయ్యే .. స్త్రీ త్వం ..

గురించి .. ఆలోచిస్తూనే.. మరి కొంత వివరణ కోసం వెతికాను.ఇదిగో. ఇలా వివరంగా కనిపించింది.

శరన్నవ రాత్రుల  సందర్భంగా... స్త్రీ స్వరూపం గురించి.. ఈలింక్ లో ఎంత బాగా వివరించారో చూడండి.

20, అక్టోబర్ 2012, శనివారం

దసరా మాముళ్ళండీ !!


కరంట్ బిల్ కట్టడానికి వెళ్లాను. బిల్ డబ్బులు ఇచ్చి నాకు తిరిగి రావాల్సిన డెబ్బయి రూపాయలు కోసం చూస్తున్నాను.

ఏమిటి మేడం !? అన్నాడు అతను

చేంజ్  రావాలి కదండీ ..అన్నాను నేను. అవి దసరా మామూలు క్రింద వేసుకున్నాం ..అన్నాడు.

అదేమిటి.. మీకు కూడా "దసరా మాములా?" ఆశ్చర్యంగా ..అన్నాను.

మాకు  కాంట్రాక్టర్  లు బిల్లుకి ఒక రూపాయి ఇస్తారు.అవేం  సరి పోతాయండీ!  అందుకే అడుగుతుంటాం అన్నాడు.

మాట్లాడ లేక వదిలేసుకుని వచ్చేసాను. నా దగ్గరే కాదు..అందరి దగ్గర డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు.

దసరా.. అంటేనే..సరదా పండుగ అనుకుంటాం కదా!

ఇప్పుడు సరదా ఏమో కాని... ఎవరు పలకరించినా ..గుండె గుభేల్  మంటుంది.

పేపర్ బాయ్  దగ్గర నుండి.. పని చేసేవాళ్ళు , బట్టలు ఉతికే ఆమె, పోస్ట్ మేన్ , టెలిపోన్ లైన్ మేన్ , గ్యాస్ డెలివరీ అబ్బాయి,వీధులు శుభ్రం చేసేవాళ్ళు, మురుగు కాలువలు శుభ్రం చేసే వాళ్ళు,నైట్ వాచ్ మెన్,ఇస్త్రీ వాడు,ఇంకా కరంట్ రీడింగ్ తీసుకువేల్లెవాడు,బిల్ కట్టించుకునే వాడు, నెట్ బిల్ కట్టించుకునే వాడు , వీధి కుళాయికి నీళ్ళు వదిలే వాడు..

అమ్మయ్య.. ఇంతటితో..పూర్తయ్యారు. అందరికి దసరా మామూలు సమర్పించాము.(మనసులో తిట్టుకుంటూనే)
వారి సేవలకి వారు ఎలాగు జీత భత్యాలు పుచ్చుకుంటూనే ఉంటారు. అయినా  మనకి సొంత పనులు చేసినట్లు ఫీల్ అయి పోతారు.

ఏదోలే..సంవత్సరానికి ఒకసారి అడుగుతుంటారు. వాళ్లకి ఇచ్చినంతనే.మనకి ఉన్నది తరిగిపోదు. మీ ఆడవాళ్ళు ఒక చీర కొన్న విలువ కంటే తక్కువ ..అంటారు మగవారు.

ఒక మాదిరి ఆదాయం ఉన్నవారికి అయితే పర్లేదు.

మధ్య తరగతి కుటుంబానికి మాత్రం.. ఈ దసరా..మాముళ్లు పీక్కు తినేవే! .సామాన్య మానవుడికి నిత్యావసరాలు తీరడమే కష్టం అయిపోయి.. పస్తులు ఉండటమో..పచ్చడి మెతుకులు తినడమో..మామూలు అయిపోతే..ఈ మాముళ్ళు  పీడ  తగులుకుని..మొహం చాటేసుకుని..బ్రతకాల్సి వస్తుంది...అంది.. మా ప్రక్క ఇంటి పద్మ గారు.

పేరుకి పాతిక వేలు సంపాదిస్తున్నా.. నెలాఖరికి సరుకులు నిండుకుంటే తెచ్చుకోవాదానికి పైస్సా ఉండదు. ఒకటవ తారీఖు కోసం  ఎదురు చూడాల్సిందే! ఇంకెక్కడా దసరా..మామూళ్ళు  ఇస్తాం. ఇవ్వమని ముఖం మీదే చెప్పేస్తున్నాను. అంది. ఇంకో ప్రక్కింటి ఆమె.

పండగంటే .. పిండివంటలతో  విందు భోజనం చేయడం కాదు.పస్తులు  ఉండకుండా..ఉంటె చాలనుకోవాలి

కరంట్ లేదు, శుభ్రమైన మంచి నీరు లేదు. పారిశుద్ధ్యం లేదు.  అన్ని ప్రత్యామ్నాయం   అయిపోయి. వేరే వాటి కోసం వెదుక్కోవాల్సి వస్తుంది.. అన్నింటిని  మించి రోగాల బారిన పడి వేలకి వేలు హాస్పిటల్స్ కి పోయకుండా ఉంటె చాలు అన్నాను నేను. ఎందుకంటే..ఒక నెల క్రితం  హాస్పిటల్ బిల్  భారీగా చెల్లించి చేతులు కాలి ఉన్నాను. మళ్ళీ ఈ నెలలో అనుకోని ఈ దసరా మాముళ్ళ ఖర్చులోకటి   తప్పని సరి ఖర్చులు ..జాబితాలో.. ఇవి చేరినాయి.

 ప్చ్.. ఏం  చేద్దాం..? దసరా మాముళ్ళండీ !

మధ్య  తరగతి మంద హాసాలు ఇవి.

త్రిగుణాత్మికే





శరన్నవరాత్రులలో.. ఈ రోజు.. జ్ఞాన సరస్వతిగా.. దర్శనమిస్తున్న.. "అమ్మ" తన  కరుణా కటాక్షం ని  అందరిపై కురిపించించి.. అందరిని జ్ఞాన మార్గం లో పయనింప జేయాలని  కోరుకుంటూ.. ముకుళిత  హస్తాలతో..వేడుకుంటూ..

ఈ ..పాట  వైష్ణవి భార్గవి వాగ్దేవి ...త్రిగుణాత్మికే 



ఇదే పాట  పరిచయం గతంలో.. ఈ  లింక్ లో.. చూడండి

17, అక్టోబర్ 2012, బుధవారం

సోలార్ కాంతుల అనుభవాలు

సోలార్ కాంతులతో  మా ఇల్లు  అనే పోస్ట్ ని   ప్రతి రోజు చాలా మంది ఆసక్తిగా చూస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి

 సోలార్ లాంతరులు ఏర్పాటు చేసి దాదాపు పది నెలలు అవుతుంది. నా అనుభవాలు  ఇతరులకి ఏ మాత్రం ఉపయోగపడినా చాలా సంతోషం . ఉపయోగపడాలని కూడా  ఈ పోస్ట్.

పగలు 33 డిగ్రీల ఉష్టోగ్రత ఉంటె.. దాదాపు ఎనిమిది గంటల పాటు  లైట్స్ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా బాగా ..వెలుగుతూనే ఉంటాయి.

ఒక్కో లైట్ ని ఆరు అడుగులు లేదా అయిదున్నర అడుగుల  ఎత్తులో ఎదురుగా అమర్చుకుంటే..మా పనికి సరిపడా వెలుతురూ..అందుతుంది.

అలాగే హాల్లో లైట్ ని ..రాత్రి తెల్లవార్లు వేసి ఉంటుంది.  ఇప్పటి వరకు ఎలాంటి సర్వీసింగ్ అవసర పడలేదు.

అయితే ఇంటి మొత్తంకి సరిపడా పవర్ సప్లయ్ లభించాలంటే విడివిడిగా లైట్స్ అమర్చుకునే కంటే ఇంటిమోత్తానికి సరిపడా పవర్ ని అందించే..సోలార్  పానల్ ని  అమర్చుకుంటే చాలా బాగుంటుంది.   అందుకోసం..ఏబై వేలు ఖర్చు పెడితే..సరిపోతుంది.స్వంత గృహం ఉన్నవారికి ఇది చాలా బెస్ట్. అని చెప్పారు. చాలా వరకు జాతీయ బ్యాంక్ లు సబ్సిడీ అందిస్తున్నాయి కూడా .

సోలార్  పవర్ సిస్టం ఏర్పాటు చేసుకుంటే.. కేంద్ర ప్రభుత్వం నుండి 40% వరకు సబ్సిటీ లభించుతుంది.
అక్షయ్ ఊర్జా.కార్యక్రమం ద్వారా ఈ వివరాలు విన్నాను. సోలార్ పానల్ ని అమర్చుకోవడం చాలా సులభం కూడా.

మా వసతి గృహంలో.. కొన్ని ఇబ్బందుల వల్ల అలాంటి అవకాశం  లభించకపోవడం వల్ల లైట్స్ ఏర్పాటు చేసుకోవడం తోనే సరి పెట్టుకున్నాను.

ఇప్పుడు ఇన్వర్టర్ .ఏర్పాటు చేసుకున్నాం

ఇంటి అవసరాల కోసం సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు..ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని..నిర్ణయం  తీసుకుంటే బావుంటుంది.

సోలార్ పవర్ వివరాల కొరకు ఈ లింక్ చూడండి.

అలాగే ..అప్పటి పోస్ట్ లింక్..ఇది.

16, అక్టోబర్ 2012, మంగళవారం

వీణ పలుకులు - ఇనుప ములుకులు








కాసిని కబుర్లు ..మళ్ళీ  ఈ రోజు కబుర్లే!

మా వర్కర్ పెరుమాళ్   మంచి పనిమంతుడు . చాలా   కష్ట పడి డిల్లీ,రాజస్థాన్ ,లక్నో ,కలకత్తా లలో కొన్ని సంవత్సరాలు  పాటు ఉండి సంప్రదాయమైన చేతి కుట్టు పనిలో చాలా పరిణితి సాధించాడు. తను బాగా పనిచేయడమే కాదు తను  సంపాదించిన ప్రావీణ్యం అందరూ సాధించలేరని అహంకారం కూడా.తన తోటి పనివారలని చులకనగా మాట్లాడుతూ ఉంటాడు.

నేను సూచించిన పని ని కూడా చేయకుండా నిర్లక్ష్యం గా ఉంటూ తనకి నచ్చినట్లు ఉంటూ..నేనే లేకపోతే  మీ వర్క్ షాప్ ఉండదు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు .

వాడి విపరీత దోరణి చూసి చూసి వాడిని పీకి పడేసాను ప్రావీణ్యం ఉందికదా అని నోటిని తాటిమట్టలా మారిస్తే ఊరుకుంటానా !? తాడి తన్నే వాడి తల తన్నేవాడు ఉంటాడు అన్నట్టు  పెరుమాళ్ దగ్గర పని నేర్చుకున్న ఇంకొకతను  బీహారీ వాలా పనికి కుదిరాడు.అతనికన్నా పనితనం,జీవకళ తో.. సజీవ చిత్రాలా అన్నంత గొప్పగా పనితనం ఉంది.
అయినా విద్వత్ ఉన్నవాడు సంప్రదాయ కళలను పునరుద్దించి భావితరాలకు భద్రపరచేవాడు అంత ఆహంకారిగా ఉంటే ఎలా.!? వినయంగా మంచిగా ఉంటే సొమ్ము ఏం పోతుందో !  పెరుమాళ్  పనితనాన్ని ని మెచ్చుకునే వాళ్ళు కూడా  చాటుగా అతని నోటి దురుసుని అసహ్యిన్చుకుంటూనే ఉంటారు చాలామంది నోటివెంట ఆ మాట విన్నాను.

నాకు  కొన్ని మాటలు గుర్తుకు వచ్చాయి
"కొన్ని మాటలు వీణ పలుకులు "
అవి ఆచరణలో ఇనుప ములుకులు...
                                                    

కత్తి  కంటే కలం గొప్పదన్న మాట
కల్ల కాక పోవచ్చును కాని
కలం బలం తెలియని కరుకు రక్కసికి
కలం నాల్క చిలక పలుకుల్ వినలేని  చెవిటికి
నెత్తురు తాగి జీవించే నిర్ధయుడికి
మర్ధనం ఒకటే మహౌషదం
అందుకే తాత్కాలికంగా
పెన్ను జేబులో పెట్టి గన్ను చేత పట్టాను
ఏం చేయను ఎంత శాంతించినా  తప్పలేదు
కొన్నిమాటలు వీణ పలుకులు
అవి ఆచరణ లో ఇనుప ములుకులు.
                                                                  - దాశరధి

ఇంతకీ.. కొన్ని పనులు,కొన్ని మాటలు ఇనుప ములుకులు. వీణ పలుకులు వలె సున్నితంగా కూడా చెప్పవచ్చని తెలిసికూడా చెప్పలేని వారిని.. వెలివేయడం తప్ప (అదేనండీ పెరుమాళ్ కి ఉద్వాసన చెప్పినట్లు) ఏం చేయగలం!?

15, అక్టోబర్ 2012, సోమవారం

ఆశలు వేరైనా...

నీ కొడుకు కి  అన్నీ నీ బుద్దులే వచ్చాయి..అన్నారు మా వారు.

పొగిడారో.. తెగిడారో .. నాకు అర్ధం కాలేదు. మాట్లాడినది పోన్ లైన్ లో కాబట్టి.. ఫేస్ రీడింగ్ చూసి తెలుసుకునే అవకాశం లేకపోయింది.

నాలుగు రోజుల క్రితం "కష్టేఫలే" మాస్టారు..పోలిక గురించి ఒక పోస్ట్ వ్రాసారు. నాకు వెంటనే అది గుర్తుకు వచ్చింది. పోలిక మంచిదా..చెడ్డదా..అని విశ్లేషించుకుంటూ..నా బిడ్డ ముచ్చట్లు. కొన్ని.

 నా సంగతి ఏమో కాని మా అబ్బాయి మాత్రం చాలా సుతిమెత్తని హృదయం కలవాడు. ఒకసారి మేము ఇద్దరం బ్యాంకు కి వెళ్లి వస్తున్నాం. ఒక చిన్న పిల్లాడు దాదాపు ఆరు ఏడు ఏళ్ళు ఉంటాయేమో.. సైకిల్  నేర్చుకుంటూ.. తనకన్నా ఎత్తుగా ఉన్న సైకిల్ ని హ్యాండిల్ చేయలేక క్రిందకి పడిపోయాడు.. అతని పై సైకిల్ పడిపోయింది. రోడ్డు పై వెళుతున్న అందరు ఆ దృశ్యం చూస్తూనే ఉన్నారు. మా అబ్బాయి వెంటనే తన బండి ఆపి నన్ను హడావిడిగా  దిగమని  బండి స్టాండ్ వేసి ఆ అబ్బాయి దగ్గరకి పరుగుపెట్టి వెళ్ళాడు ఆ సైకిల్ ని లేపి ప్రక్కన పెట్టి ఆ పిల్లాడిని లేపి ప్రక్కన కూర్చోపెట్టి  దెబ్బలు ఏమైనా తగిలాయేమో  అని చూసి..  అలా రోడ్డుపైకి రాకూడదని,జాగ్రత్తగా నేర్చుకోమని సలహాలు చెప్పి  వచ్చాడు.

ఏం నాన్నా! ..ఇంతమంది వెళుతున్నారు కదా.. ఎవరు ఆగలేదు .నువ్వు ఎందుకమ్మా ..అలా పరుగులు పెట్టావ్? అన్నాను.

అమ్మా.! ఆ సైకిల్ బరువు ఎంత ఉంటుందో. నాకు తెలుసమ్మా.. చిన్నప్పుడు అలాంటి సైకిల్ నేర్చుకోవడానికి ఆ వయసులో ఎన్ని సార్లు క్రింద పడిపోయానో.. ఎన్ని దెబ్బలు తగిలాయో..నాకు గుర్తు ఉంది  అని  చెప్పాడు .

నాకు వెంటనే అప్పటి విషయాలు గుర్తుకు వచ్చాయి. ఏడేళ్ళ వయసు అప్పుడు  బరువు ఎక్కువగాకల బి.ఎస్.ఏ సైకిల్ వేసుకుని  మా  నివాస స్థలం నుండి   మూడు కిలోమీటర్లు ఆ సైకిల్ తోక్కుకుని వెళ్లి  పరిచయస్తుల ఇంటిలో ఆ  సైకిల్  ఉంచి..అక్కడి నుండి స్కూల్  బస్ ఎక్కి నెల్లూరు స్కూల్ కి వెళ్ళేవాడు. నా బిడ్డకి ఎప్పుడు కష్టమే! అని బాబు వాళ్ళ నానమ్మ..కూడా ఈ విషయం తల్చుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు . అలా ఒక సంవత్సరం గడిచాక ..ఇలా స్కూల్ కి పంపడం కష్టంగా ఉంది కాని.. తిరుపతి దగ్గర మోహన్ బాబు స్కూల్లో జాయిన్  చేద్దాం,,ఆన్నారు
ఇంట్లో మగవాళ్ళు అందరు.

హాస్టల్  లో .ఉంచడమే..అందుకు నేను ఒప్పుకోను.. కుదరదు అంటే కుదరదు..అని  తీర్మానం చేసేసాను. తర్వాత బాబుకి సౌకర్యంగా స్కూల్కి వెళ్ళే విధంగా మేమే మారిపోయాం అనుకోండి.తర్వాత తన చదువులు అన్నీ పట్టణ పరిధిలోనే పూర్తి చేసుకున్నాడు.

వి.ఆర్ ఎస్.ఈ లో చదివేటప్పుడు.. మధ్యాహ్నం లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్ళేవాడు కాదు. అందరు పిల్లలు అంతే అనుకోండి.  వీలైనంత స్టయిలిష్ గా తయారయి మొబైల్,బైక్  లేనిదే ఇల్లు కదిలి కాలేజ్ కి వెళ్ళని రోజుల్లో కూడా మా అబ్బాయిని చాలా సైలెంట్గా వాచ్ చేస్తూ ఉండేదాన్ని. ఎక్కువగా పాకెట్ మనీ ఇవ్వడం ఉండేది కాదు. రోజుకి ఫిఫ్టీ రూపీస్. అంతే.. ఓ..థర్టీ రూపిస్ పెట్రోల్  కి మిగతా..ట్వంటీ క్యాంటీన్ కి వెళ్ళే ఖర్చులకి. అంతే!

అమ్మా..మనీ ఇవ్వమ్మా ..అంటే..వెంటనే ఎందుకమ్మా..అని అడిగేదాన్ని. ఎందుకు అని అడగకుండా ఇవ్వవా?చిరాకు పుట్టిస్తావ్..అని విసుక్కునేవాడు. అడిగినప్పుడల్లా.. డబ్బు ఇస్తే..అదుపు తప్పి పోతారని నా భయం కూడా.

నేను పనిలో ఉన్నాను కదా.. నువ్వు తీసుకో..అంటే.. బీరువాలో ఎంత డబ్బు ఉన్నా కూడా.. నేను ఎంత ఇస్తానో అంతే తీసుకునేవాడు తప్ప వన్ రూపీ కూడా ఎక్కువ తీసుకునేవాడు కాదు. తోటి పిల్లల  దృష్టిలో  తను ఒక పిసినారి. అని అందరు కామెంట్ చేసినా ఒర్చుకునేవాడు కూడా..  నిజాయితీగా సంపాదించేవాడికి ఒక  హండ్రెడ్ రూపీస్ సంపాదించడం ఎంత కష్టమో..తెలుసా..అంటాడు అని తన ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు.

అలాగే మా అబ్బాయి ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పారు.

వాళ్ళ ఫ్రెండ్స్ అందరు.. క్రికెట్ ఆడటానికి స్టేడియం కి వెళ్ళారు. ఇన్నింగ్స్ మధ్యలో..అందరూ జ్యూస్ తాగుతున్నారు మా అబ్బాయి వెళ్ళే టప్పటికి  ఒక వృద్ద భిక్షకుడు అందరి దగ్గరకి వెళ్లి ఒక రూపాయి ఇవ్వండి  బాబూ..అని అడిగి ఇప్పించుకున్తున్నా.డ ట . మా అబ్బాయిని చూసి ఒక రూపాయి ధర్మం చేయి  బాబు అన్నాడట. మా అబ్బాయేమో..మాట్లాడకుండా వెళ్లి..జ్యూస్ షాప్ ముందు నిలబడి అతనికి ఆర్డర్ చేయడంలో ఉన్నాడట,

ఆహా..  అడగక అడగాక  వీడినే అడుగుతున్నాడు.వీడు కాని ఇవ్వడు..! అని ఎగతాళి చేసుకుంటూనే ఉన్న ఫ్రెండ్స్ కి సమాదానంగా తనతో పాటు ఆ వృద్దునికి కూడా..జ్యూస్ తీసుకువచ్చి ఇదిగో..తాతా ..తీసుకో..అన్నాడట. అంతే..అందరి నోళ్ళు మూతబడ్డాయి.

మనం ఇతరులకి ఇచ్చేటప్పుడు..మనం తినేది ,మనం త్రాగేదే ఇవ్వాలి.మిగిలిపోయ్యాయని..పాడైపోయాయని వాటిని మనకన్నా బలహీనమైన స్థితిలో ఉన్నవారికి  అలాటివి ఇవ్వకూడదు..అని మా అమ్మ చెపుతుంది...అన్నాడట.

ఒకసారి..తన క్లాస్స్ మేట్ "రమ్య"అనే అమ్మాయి {ఇప్పుడు తను తను ఆస్ట్రేలియా లో  ఉంది.) తనకి ఎంబ్రాయిడరీ బ్లౌసెస్ కోసం వచ్చి.."నిఖిల్" మీ అబ్బాయి కదా ఆంటీ..మీరు చాలా గ్రేట్ ఆంటీ..! మీరు మీ అబ్బాయిని  బాగా పెంచారు.ఒక మంచి అబ్బాయి అంటే "నిఖిల్ " అని మా క్లాస్మేట్స్ ఆడపిల్లలు అందరూ చెప్పేమాట ఇది. "నిఖిల్ " లాంటి అబ్బాయి ఉన్నందుకు మీరు చాలా గర్వపడాలి అనిచేప్పివెళ్ళింది.

ఇంతకన్నా ఒక తల్లికి కావాల్సింది ఏముంది.!? నేను ఏం  చెప్పానో.. చేసి చూపించానో..అందుకు అనుగుణంగానే పెరిగి పెద్దయ్యాడు మా అబ్బాయి.

తనకి ఓ..మంచి ఉద్యోగం లభించింది అని చెప్పినప్పుడు చుట్టుప్రక్కల అందరితో.. ,ఇంకా నిజమైన  నా శ్రేయాభిలాషులకి ...ఆ సంతోషకర విషయాన్ని చెప్పినప్పుడు.. "నిఖిల్" కి ఏంటి.. వాడు బంగారం అని మురుసుకున్నప్పుడు  ఆనందం కల్గింది.

కానీ నాకైతే  వెనువెంటనే దిగులు కల్గింది.తనకి ఏరోనాటికల్ ఇంజినీర్ అవ్వాలని కోరిక .అది నెరవేరలేదు.
ఓ.మంచి క్రికెటర్ అవ్వాలని కోరిక. చదువులని వదిలేసి.. పూర్తిగా క్రికెట్ వైపు  మళ్ళ డానికి  నేను ఒప్పుకోలేదు. అలాగే "ప్రేమికుల రోజు " చిత్రం తీసిన డైరెక్టర్ ఖదీర్ ..తన స్టిల్స్ చూసి సినిమా రంగం కి రమ్మని ఆఫర్ ఇచ్చినప్పుడు తనకి ఆ విషయం తెలియకుండానే జాగ్రత్త పడ్డాను.

ఇప్పుడు అయితే.. ఓ..ఇండస్ట్రియలిస్ట్ కావాలనుకుని తనకి నచ్చిన చదువు ని చదువుకుని కూడా.. ఇష్టంలేకపోయినా సరే... అధిక సంపాదన కోసం సాఫ్ట్ వేర్ జాబ్ వైపు మళ్ళిన బిడ్డని చూస్తే..దిగులుగా ఉంది.
లైఫ్ అంటే.. కొన్ని తీరని ఆశలు కూడా నేమో ..చిన్నీ  బంగారం!!  అని  మా  అబ్బాయికి చెప్పాలనిపిస్తుంది.నేర్పాల్సివస్తుంది.

కొంచెం దిగులుగా ..
ఆశలు వేరైనా..లభించింది ..మాత్రం సంతోషమే! భగవత్ సంకల్పం అలా ఉంది.  ఆందుకూ కృతజ్ఞతలు చెబుతూ..
గాడ్ బ్లెస్స్ యూ..మై చైల్డ్..
.

13, అక్టోబర్ 2012, శనివారం

హృదయ పుష్ఫం


మనం రోజు పూజకు అనేక పుష్ఫాలతో భగవంతుని పూజించాలనుకుంటాం
అలాగే  అనేకానేక పుష్ఫాలని సేకరించుకుంటాం.
పూజకై..ఇవిగో..ఈ  పూవులన్నీ ...











ఇన్ని  పూవులు సేకరించి..పూజించి ..హృదయ పుష్ఫమును  మాత్రం  ఆయనకి సమర్పించడం మర్చిపోతామేమో !  అందుకే..మనుషుల్లో ఆసూయా , ఈర్ష్యా ద్వేషాలు ..కోపతాపాలు,మదమత్సరాలు ఏవి అడుగంటకుండా  ఉండనే ఉండవు..

అవన్నీ లేకుండా  ఉండేవారు భగవంతుడితో సమానం  కదా!
కనీసం పువ్వులలాంటి..స్వచ్చమైన నవ్వులు మనసు ఉండాలని కోరుకుంటూ.  ఈ మంచి పాట

ఎవరు   నేర్పేరమ్మ ఈ కొమ్మకి ...

12, అక్టోబర్ 2012, శుక్రవారం

యాన్ ఐడియా కెన్ చేంజ్


  "యాన్ ఐడియా కెన్  చేంజ్ యువర్ లైఫ్ "..

సెల్ పోన్స్ జీవితాన్ని మార్చివేస్తున్నాయి. ముఖ్యంగా  విద్యార్ధుల జీవితాలని.  కమ్యూనికేషన్ కోసం తల్లిదండ్రులు ముచ్చటపడి  సెల్  పోన్స్ కొని పిల్లలకి  ఇవ్వడం వల్ల వారి చదువు పట్ల  శ్రద్ద తగ్గిపోతుంది కాబట్టి  
 హాస్టల్ లో ఉండి చదువుకునే పిల్లలకి సెల్ పోన్స్  ని ఇవ్వడం ని నిరోధించిన కళాశాల  యాజమాన్యం  కి తెలియకుండా కూడా విద్యార్దుల దగ్గర  సెల్ పోన్స్  ఉంటున్నాయని వినికిడి కూడా ఉంది.

అలాగే  విజిటర్స్  దగ్గర నుండి రిక్వెస్ట్ చేసి తీసుకున్న సెల్ పోన్ ల నుండి విద్యార్ధులు తల్లిదండ్రులతో మాట్లాడటం లేదని.. ఎవరు ఎవరికో పోన్ చేసి మాట్లాడుతుంటారు కాబట్టి.. సెల్ పోన్స్  ఇవ్వవద్దని  కఠినమైన రూల్స్ పెట్టారు.
సెల్ పోన్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ కూడా.. కదా !

విద్యార్ధులు వద్ద సెల్ పోన్స్  ఉండటం వల్ల  అవసరం కి ఉపయోగపడటం కన్న హాని ఎక్కువ కల్గుతున్న సందర్భాలు ఎక్కువ.

ముఖ్యంగా మెసేజెస్ సౌలభ్యంతో.. సవ్వడి లేకుండా చాటింగ్ ఆ తరువాత దమ్ముంటే డేటింగ్ ఇంకొక కోణంలో యాక్సిడెంట్స్ ఎక్కువై పోయాయి.  తల్లిదండ్రులు వద్దన్నా  పీడించి కొనిపించిన  సెల్ పోన్ ఉంటె చాలు రీచార్జ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు. నాన్ స్టాప్ టాకింగ్ తో.. చదువుని చంకన పెట్టినట్లే!

ఒకప్పుడు ఓడిస్సా రాష్ట్రంలో  ఒక గ్రామంలో గ్రామ పెద్దలు  ఆడ పిల్లలకి సెల్ పోన్స్  ఇవ్వడంని నిషేదించాలని తీర్మానం చేస్తే .. నాకే విషయం నచ్చక  ఆడ-మగ వివక్ష  ఎందుకు అని బాధపడిన వారిలో నేను ఒకదాన్ని.

కానీ ఇటీవల వింటున్న ఆడపిల్లల అర్ధాంతర చావులకి కారణభూతం అవుతుందని తెలుస్తుంటే.. సెల్ పోన్స్  ఉండటం కూడా  చేటు అవుతుందని.. అనిపిస్తుంది.

విజయవాడ మేరీ స్టెల్లా  కాలేజ్లో.. పోస్ట్ గ్రాడ్యుయేషన్  చదువుతూ హాస్టల్ లో ఉంటున్న అమ్మాయి..  ఒక సెలవు రోజు తండ్రితో మాట్లాడి ఏ.టి.ఏం కార్డ్ తో.. డబ్బు విత్ డ్రా చేసుకుని.. సాయంత్రం హాస్టల్ కి వెళ్ళలేదు. మరునాడు..మా ప్రక్క వూరి పొలాల మధ్య పంటకాలువలో  శవమై ఉంది.  వ్యవసాయం చేసుకుంటూ ఉన్న ముగ్గురు ఆడపిల్లలని ఉన్నత విద్యలు చదివిస్తున్న ఆ తల్లి తండ్రుల గుండె మంటకి కారణం సెల్ పోన్ మాత్రమే  కారణం అని తెలిసింది.  శాస్త్ర సాంకేతిక విజ్ఞానం,సమాచార  విప్లవం పుణ్యమా అని అభివృద్ధి కన్నా వినాశ కరమే ఎక్కువ కనబడుతుంది." పెరుగుట విరుగుట కొరకే " అన్న నానుడి గుర్తుకు వస్తుంది.

ఎనిమిది తొమ్మిది తరగతులు చదువుతున్న వారి దగ్గర కూడా సెల్ పోన్స్ ఉంటున్నాయి. సెల్ పోన్స్  వాడకంని పెద్దలు  ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు. ఎదిగి ఎదగని వయస్సులో పరిపక్వత లేని ఆలోచనల  వల్ల  సెల్ పోన్  వాడకం ప్రమాదకారి అవుతుంది.

పద్దెనిమిది ఏళ్ళకు ఓటు హక్కు లాగా.. ఇరువది ఒక్క ఏళ్ళకు సెల్ పోన్  కనెక్షన్ ఇచ్చే విధంగా నిబంధన ఉంటె బాగుంటుంది అనుకుంటున్నాను. అండర్ ఏజ్ వారికి డ్రగ్స్,మద్య పానీయం అమ్మడం యెంత నేరమో.. సెల్ పోన్ ఉండటం నేరం గా పరిగణిస్తే బావుండును కదా!

కేవలం సమాచారం తెలియడం కోసమే పోన్ అవసరం అని భావిస్తే.. అతి ముఖ్య మైన పరిమితమైన  నెంబర్స్ కి మాత్రమే  కాల్  వెళ్ళే విధంగా  కార్డ్ సిస్టం ఏర్పాటు చేసి.. పబ్లిక్  టెలి  పోన్స్   నుండి అవుట్ గోయింగ్ వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం.. ఆ బిల్ ని తల్లి దండ్రులు చెల్లించడం చేస్తే బావుంటుందేమో..అని  అనుకుంటున్నాను.

పిల్లల జీవితాలు బాగుండాలంటే.. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలేమో..! పిల్లలు అడుగుతున్నారని సెల్ పోన్ కొని ఇచ్చే తల్లిదండ్రులు .. సెల్ వారి జీవితాలని హెల్ చేస్తుందని ఒక్క నిమిషం ఆలోచించినా చాలు. కొన్నేళ్ళు వారిని కాపాడుకున్నట్లే.. !

విద్యార్ధి!  యాన్ ఐడియా కెన్  చేంజ్ యువర్ లైఫ్.!!


10, అక్టోబర్ 2012, బుధవారం

నచ్చినా - నచ్చక పోయినా..


ముఖ  పుస్తకం  లో  స్వీయ చిత్రాలు  ప్రచురించుకోవడం  వల్ల ఇబ్బందులకి   గురవుతారని ఓ.ప్రక్క హెచ్చరిస్తున్నా  కూడా  వినకుండా అత్యుత్సాహం తో... షేర్  చేసుకుంటున్న వారిని చూస్తే  ఏమనుకోవాలో అర్ధం కాక జుట్టు  పీక్కుంటున్నాను ..అన్నాను నా స్నేహితురాలితో..

పీక్కుంటే ఉన్న జుట్టు  కూడా పోతుంది..అంత పని చేయకు. అయినా మంచి చెపితే ఎవరు వింటారు ? అని అంది

అవును మరి..

"ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠాన్ని " అని పాడుకోవడం ఎందుకు? అని సిరివెన్నెల గారిని తలచుకున్నాను.

చాలా కాలం నుండి వింటున్నాం..అమ్మాయిల ఫొటోస్ షేర్ చేయడం ప్రమాదం అని. అయినా వినడం లేదు. అందంగా ఉంటారు,ఆత్మవిశ్వాసం అధికం.

అబ్బ! అంతా చాదస్తం ! ఎం జరుగుతుంది.. లే! అని కొట్టి పారేయడం షరా మామూలే!

అమ్మాయిలే కాదు.. పెళ్లీడు కొచ్చిన అమ్మాయి ఉన్న తల్లి కూడా.. సింగిల్  స్టెప్ పైట వేసుకుని హీరోయిన్ లెవల్ లో ఫోటో కి పోజిచ్చి ..మళ్ళీ ఆ ఫొటోస్ ని ముఖ చిత్రంలో షేర్ చేసుకోవడం.. చూసాను.

అలాగే   అందమైన అమ్మాయిలూ  రోజుకొక  ఫోటో ని షేర్ చేయడం.. ఆ ఫోటో  కి   గుంపుజనం   అంతా లైక్ లు కొట్టడం .. ఇంకొందరు సొంగ కార్చుకునే బలహీన మనస్కులైతే హీరోయిన్ కన్నా నువ్వే అందం గా ఉన్నావు .. పిచ్చేక్కిస్తూ ఉన్నావ్ అని కామెంట్  పెడితే కూడా.. థాంక్ యు చెప్పే అమ్మాయిలూ ..

అమ్మో.. వీళ్ళు అమ్మాయిలా..? యువకుల మనసులతో..ఆడుకునే పిశాచాలు  అని అనుకోక తప్పదు. వీటిని  అన్నిటిని.. అన్ని పైత్యాలని చూసి చూసి రోత పుట్టిపోయింది అనుకో.. అని  ఆవేశంగా చెప్పి  మనసులో బాధని వెళ్ళగ్రక్కి కాస్త శాంతించాను.

ఇవన్నీ చూడటం ఎందుకు.. మనకి ఇష్టం లేదని.. అలా ప్రవర్తించడం మానమని మనం చెప్పగలమా! ఒకవేళ చెప్పినా  వింటారా? అక్కడ ఇమడ లేకపోతే  ఆ ముఖ చిత్రం కి బై బై చెప్పరాదు.. అని సలహా చెప్పింది.

 లాగిన్ అవడం చాలా తేలిక. డిలెట్  చేయడం చాలా కష్టం.రెండు మూడు సార్లు ఆ ప్రయత్నం చేసాను. కొందరు ఫ్రెండ్స్ వచ్చి చేరుతున్నారు. వారితో.. స్నేహం కోసం తప్పడం లేదు అన్నాను. ఒక రకంగా నాకు అయిష్టం కూడా ఏర్పడింది.

ఇంకొక విషయం చెప్పనా.. !? ఇప్పుడు పేస్ బుక్  అంటే పెళ్లి చూపుల వేదిక.  ఒక అమ్మాయి వడ్డాణం  పెట్టుకుని మరీ ఫోటో షేర్ చేసుకుని స్టేటస్  చెపుతుంది. అయినా ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి సంబంధం కుదరలేదు ..అని చెప్పాను.

మా పరిచయస్తులలో ఒక అబ్బాయి కి పెళ్లి సంబంధం ఖరారు అయింది. అబ్బాయి తప్ప అందరు అమ్మాయిని చూసి మెచ్చి సంబంధం ఖాయం చేసుకున్నారు. అబ్బాయి అమ్మాయి ఫొటోనే చూసాడు. పెళ్లి రెండు రోజులు ఉందనగా అబ్బాయి.. అమ్మాయి పేస్ బుక్ లో అమ్మాయికి యాడ్  అయ్యాడు. వెంటనే ఆ అమ్మాయిని నేను చేసుకోను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. పెళ్లి క్యాన్సిల్  అన్నాడు. కారణం ఏమిటంటే.. ఆ అమ్మాయికి  నాలుగు వందలమంది పైగానే ప్రెండ్స్  ఉన్నారు.. అందులో మూడొంతులు మంది అబ్బాయిలే ఉన్నారు. నాకు వద్దు అన్నాడట.

ఇలా ఉన్నాయి.. వైపరీత్యాలు. ఎవరిని తప్పు పడతాం?

స్నేహం చేయడం,లేదా స్నేహితులు అందరూ సమూహంగా ఉండటం.. ఇష్టాలు, అభిప్రాయాలు కలసి.. ఏదైనా సామాజిక అంశాలు పట్ల స్పందించడం, తమ వంతు  స్పందన తెలుపుకుంటూ.. వీలయితే  ఎలా మెలగాలో చెప్పుకోవడం ఇవన్నీ తప్పు అని నేను అనను. కానీ.. అధిక సమయాలు  సోషల్  నెట్వర్క్ లలో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ.. అక్కడే సర్వస్వం ఉన్నట్లు ఇతర కుటుంబ సభ్యులకి ప్రాధాన్యం ఇవ్వకుండా.. మెలగడం.. ఏం  బావుంటుంది. !?

అన్నిటికన్నా తమ ఫొటోస్ ని షేర్ చేసుకోకుండా ఉంటె బావుంటుంది. వారి ఫొటోస్ ని తస్కరించి.. కాని చోట్ల వాడే వారికి సులభంగా  అందించి.. ఇబ్బందులలో పడే ప్రమాదం అయితే  ఉంది కదా! అమ్మాయిలూ  కాస్త ఆలోచించండి.

అందం గా ఉంటారు. ఫోటో పెట్టుకోవడం తప్పు కాదు. కానీ..దొంగల చేతికి తాళాలు ఇవ్వడం లాంటి పని ఇది.
అలాగే అందం కన్నా.. ఆత్మ విశ్వాసంతో..  మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం నేర్చుకుంటే..  నిత్యం మొబైల్ అప్లోడ్స్ అవసరం ఉంటుందంటారా!? ఆలోచించండి.

( ఈ  నా మనసులో మాట  నా ఫేస్  బుక్ ఫ్రెండ్స్ కి ఎవరికైనా వర్తిస్తే.. మన్నించండి. నొప్పించాలని నేను ఈ పోస్ట్ వ్రాయడం లేదు. రిస్క్ లో పడవద్దని, స్వీయ చిత్రాలకి ప్రాముఖ్యత ఇవ్వడం తగ్గిస్తే బావుంటుందని ఉద్దేశ్యంతో.. వ్రాసాను. ఎవరికైనా నచ్చకపోతే.. లేదా నచ్చినా కూడా..సమంగానే స్వీకరిస్తాను.)

9, అక్టోబర్ 2012, మంగళవారం

నాయకి విరహ వేదన

ఆమె నవ  రస భావనలను చిత్రించిన వేటూరి కలం కుంచె ..

అక్షర సాగరాన్ని మధించి   అమృతమైన పాట మధురాన్ని చవి చూపిన ..వేటూరి కలం కుంచె తెలుగువారి మది మదిని సృశించి వెళ్ళింది.  

కోట్లానుకోట్ల  రసజ్ఞుల మానసాన్ని వీణని మీటినట్లు మీటి సంగీత సాగరంలో తెనుగు నుడికారపు సొగసులను నిండుగా ముంచి తేల్చి..వేల పాటలగా పల్లకిలో ఊరేగుతుంది.

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటియించు నీవని తెలిసి ఆకాశ మై  పొంగే ఆవేశం కైలాసమే ఒంగే నీ కోసం ...అంటూ.. సిరి సిరి మువ్వల  సవ్వడిలను అక్షీకరిస్తూ..మలి అడుగు వేసిన

గళమునకు లేవు  ముత్యాల సరాలు .కరములకు లేవు  బంగారు కడియాలు మదిలో లేవు సంపదలు మీద ఆశలు మది లోన లేవు పసిడి కాంక్షలు .. బొమ్మకి ఉన్న ఆభరణం... అందాలకందని ..మంచి గుణం.. అంటూ..తన మనసులోని మాటని ..సీత కథ  చిత్రంలోని  పాటగా వెల్లడించుకుంటూ..

సప్తస్వర సంగీతం నవరసాల సాహిత్యం రంగరించుకున్నది రంగుల వలయం ..సుందరం..సుమధురం ...అంటూ తన సినీ సాహిత్య ప్రస్తానం లో సాగుతూ..
..పదేళ్ళ లో తెలుగునాట పాటల్లో సగం పాటలు  కలం కుంచె ఒలికించిన చిత్ర రాజాలు అంటే అతిశయోక్తి కాదేమో!


వేటూరి కలం ఒలికించిన ఆమె నవ రస భావనలని .. పరిచయం చేస్తూ.. మొదటగా ఈ పాట 

కథానాయకి విరహ వేదనకి అక్షర రూపమిచ్చి.. విరహానికే విరహం పుట్టించే ఈ పాట .. "రెండు రెళ్ళ ఆరు " చిత్రంలో పాట.

రాజన్-నాగేంద్ర స్వర కల్పనలో.. ఎస్. జానకి గారి గళం ఒలికించిన ఈ పాట  అందరి  దృష్టిలో పడని పాట కాబట్టి అంతా పాపులర్ కాలేక పోయింది అనుకుంటాను.  

జంధ్యాల గారి చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంటుంది. కథానాయకి "రజని " పై చిత్రీకరించినట్లు గుర్తు.  

పాట సాహిత్యం:

విరహ వీణ .. నిదుర రాక వేగే వేళలో 
శృతిని మించి రాగమేదో పలికే  వేళ 
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో 
విరహ వీణ .. నిదుర రాక వేగే వేళలో 
వేగే వేళలో 

జడలో విరులే జాలిగా రాలి  జావళి పాడేనులే 
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీ తోడు కోరేనులే   
జడలో విరులే జాలిగా రాలి  జావళి పాడేనులే 
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీ తోడు కోరేనులే   
లేలేత వలపు సన్నాయి పిలుపు రావాలి సందె ళ్ళు దాకా..

విరహ వీణ .. నిదుర రాక వేగే వేళలో 
వేగే వేళలో 

ఎదలో కదిలే ఏవో కధలు ఏమని తెలిపేదిరా
చీకటి పగలు వెన్నెల సెగలు నీనీడ కోరేనులే 
ఎదలో కదిలే ఏవో కధలు ఏమని తెలిపేదిరా
చీకటి పగలు వెన్నెల సెగలు నీనీడ కోరేనులే  
ఈ నాటకాలు మన జాతకాల రాసాయి ప్రేమలేఖ 
ఈ దూరం ఎన్నాళ్ళ దాక 

విరహ వీణ .. నిదుర రాక వేగే వేళలో 
వేగే వేళలో 



3, అక్టోబర్ 2012, బుధవారం

వ్యక్తివి కాదు శక్తివి.

గతంలో నేను  "చిల్డ్రన్స్ చాయిస్"   (link) అనే పోస్ట్  వ్రాసాను.

అది ఎక్కువ మంది చూసినట్లు లేదు. మళ్ళీ అదే పోస్ట్ ని షేర్ చేసే ఉద్దేశ్యం లేదు కాని ఒకసారి చదివితే బావుండు అనిపిస్తుంది.

మనం మన పిల్లలకి నేర్పవలసినవి.. ఇవ్వవలసినవి ఇలా ఉంటాయని ..ఓ..పుస్తకంలో చదివాను. మన  పిల్లల  పట్ల మనం భాధ్యతగానో, ప్రేమగానో, అతి ప్రేమగానో, మన పని ఒత్తిడుల వల్ల  వాళ్ళ ని  మన నిర్లక్ష్యాల తోనో పెంచుతూ.. వారి భవిత సక్రమార్గంలో పయనించ  కుంటే  వారి కన్నా..మనమే ఎక్కువ బాధ పడాల్సి ఉంటుంది కదా!

మన పిల్లలని ఎలా పెంచాలో మనకి ఎవరు చెప్పారు. అనేది ముఖ్యం కాదు. పిల్లల మనస్తత్వాన్ని బట్టి మనకి కొన్ని కొన్ని విషయాలు అవగాహన కల్గినా పూర్తిగా పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందో.. అనేక మనస్తత్వాలపై పరిశీలన చేసిన నిపుణులకే తెలుస్తుంది. అందుకే నిపుణులు చెప్పిన ఈ విషయాన్ని ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా కొంచెమైనా ఉపయోగ పడితే అంతే చాలు.

పిల్లలలో మనం పెంపొందిన్చాల్సిన మంచి విషయాల గురించి.. ఇలా చెప్పారు.

నీవు వ్యక్తివి కాదు శక్తివి....లో.
                  

2, అక్టోబర్ 2012, మంగళవారం

"ఠాకూర్ కా కువా"

సాహిత్యాన్ని  చదవడం వల్ల  ఆ సాహిత్యం వచ్చిన కాలంలో ఆనాటి సామాజిక పరిస్తితులకి అద్దం పట్టే ఎన్నో విషయాలని మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాంటి కథే ఈ రోజు నేను  తెలుగు అనువాదంలో  చదవడం  జరిగింది.

నిమ్న జాతి కులస్తులపై అగ్రవర్ణాల ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందనే విమర్శలో నిజం ఉందో ..లేదో తెలియదు కానీ .. .

సుమారు వంద సంవత్సరాల క్రితమే ఇందుకు సంబంధించిన చైతన్యాన్ని  జనులలో కల్పించడం కోసం ఉపన్యాస్ సామ్రాట్ గా (ఉపన్యాస్ అంటే నవల అని అర్ధం) పేర్కొనే" ప్రేమ చంద్"   కలం అందించిన 
ఈ కథ లో భారతీయ జాతి వ్యవస్థని పట్టి ఇస్తుంది. 

ప్రాణులన్నిటికినీ  సమముగా చెందవలసిన గాలి,నీరు కేవలం జాతి విశేషత వల్ల కొందరికే పరిమితం కావడం అన్నదానిని జీర్ణించుకోలేక   వ్యతిరేకించ వలసిన విషయాన్ని  ప్రేమ చంద్ ఆలోచనలను మధించి  వచ్చిన రచన.. "ఠాకూర్ కా కువా"




ఆ కథ ఇలా క్లుప్తంగా.. 

జోఖూ నిమ్న జాతి కులానికి చెందిన వ్యక్తి. అతడు మంచి నీళ్ళు త్రాగడం కోసం కుండలో ఉంచిన నీరుని ఒక పాత్రతో తీసుకుని త్రాగబోతుండగా ఆ త్రాగే నీరు దుర్వాసన వస్తుంది భర్త అలాంటి నీరు త్రాగడానికి ఇబ్బంది  పడటం చూసిన   భార్య గంగి కడవతో నీరు తీసుకురావడానికి వెళుతుంది. 

ఆ గ్రామంలో రెండే రేడు బావులు ఉంటాయి. ఒకటి ఠాకూర్ ది ,మరొకటి సాహు ఆనే మరో కుల పెద్దది. 
వీరు అగ్ర కులాలకు చెందినవారు అవడం వల్ల నిమ్న జాతి వారిని నీళ్ళు తీసుకువెళ్ళడానికి ఒప్పుకునేవారు కాదు. అయితే జోఖు భార్య అయినటువంటి గంగి ఆ దుర్వాసన వచ్చే నీరు భర్త తాగకుండా చేయాలని ..
ఎలాగైనా సరే  అయినా సరే బావి నుంచి ఒక కడవ నీరు తీసుకు రావాలని నిర్ణయించుకుని.. బావి వద్దకు వెళుతుంది .

అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు అవుతుంది. గ్రామంలో జనులందరూ  శారీరక శ్రమతో అలసి పోయి  నిద్ర పోతుంటారు.  గంగి ఠాకూర్   ఇంటి సమీపం కి చేరుకునే సరికి ఇంకా  ఆ ఇంటి నుండి వెలుగు కనబడుతూ.. మేల్కునే ఉన్నారని గ్రహించి..  ప్రక్కనే ఉన్న చెట్లు వెనుక నీడలో వేచి ఉంటుంది. అప్పుడు ఓ..ఇద్దరు స్త్రీలు వచ్చి నీరుని తోడ్కొని వెళతారు.  వారు అగ్ర కులానికి చెందినవారు. నిమ్న జాతికి చెందిన వారు  ఆ బావి వైపు తొంగి చూసే సాహసం కూడా చేయరు.  

ఆమె మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఠాకూర్ చాలా స్వార్ధ పరుడు. తన ఇంటి పై భాగమును ప్రభుత్వ కార్యాలయానికి కిరాయికి ఇచ్చి.. అవకాశాను సారం లంచాలు తీసుకుని పనులు చేయిస్తూ ఉంటాడు. అగ్ర కులాలు వారు దొంగ తనాలు చేస్తారు.కుతంత్రాలు చేస్తారు. అబద్దాలు ఆడతారు. పండితుడి ఇంట్లో పన్నెండు నెలలు జూద క్రీడ జరుగుతూనే ఉంటుంది. సాహు అయితే నెయ్యిలో నూనె కలిపి అమ్ముతాడు. వీళ్ళు పనులు చేయించుకుంటారు. దానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వడానికి మొండి చేయి చూపెట్టి పనులు చేయించుకోవడం వల్ల హక్కుగా భావిస్తారు. 

ఎప్పుడైనా.. గంగి గ్రామంలో ప్రవేశించినప్పుడు వారు కోరిక నిండిన కళ్ళతో చూస్తూ ఉంటారు. వాళ్ళ చూపులు శర్రేరం పై పాము పాకినట్లు జలదరింపజేస్తుంటాయి అని గుర్తు చేసుకుంది.  కొంచెం సేపటికి ఠాకూర్ ఇంటి తలుపులు మూసుకుంటాయి.  ఆ అవకాశం దొరకడం కోసమే చూస్తున్న ఆమె  వెంటనే మంచి నీటి బావి వద్దకు వెళుతుంది. 

జాగ్రత్తగా తను తీసుకు వచ్చిన తాడుని కడవకి బిగించి అమృతాన్ని దొంగిలించే దొంగలా మెల్లగా కదులుతూ.. మనసులో అనేక దేవుళ్ళని తలచుకుని..కడవని బావిలోకి దింపుతుంది. శబ్దం కాకుండా.. నీరు నింపి నాలుగు చేదలు లాగేసరికి కడవ కళ్ళకి కనబడింది. వంగి  కడవని అందుకునే లోపే భళ్లుమనే శబ్దంతో..ఠాకూర్ ఇంటి తలుపులు తెరుచుకుంటాయి. గంగి భయంతో చేతిలో ఉన్న తాడు వదిలివేసింది. నీటితో నిండి ఉన్న ఆకడవ ధడేలు మన్న శభ్డంతో బావిలో పడిపోయింది. ఆ శబ్దానికి ఎవరు? ఎవరక్కడ !? అంటూ ఠాకూర్ బావి వైపు వచ్చాడు. 

గంగి భయంతో.. పరుగు తీసింది. ఇల్లు చేరుకునే సరికి భర్త జోఖూ.. దుర్వాసన వచ్చే అదే నీటిని త్రాగుతూ కనబడతాడు.  మారాలని కోరుకున్నా మారని వారి జీవితాలని ప్రతి బింబిస్తూ ఈ కథ ఉంటుంది. 

 స్థూలంగా ఇది కథ. ఇలాటి  విషయాలు ఉన్న కథలు మనకి తెలుసు.. 

అయితే.. కథలోని  వర్ణన చాలా బాగుంటుంది. నిమ్న జాతి జనులు పడే కడగండ్లు కళ్ళకు కట్టినట్లు పాఠకుడిని కట్టి పడేస్తాయి. ప్రేమ చంద్ శైలి అటువంటిది.. వారి రచనలలో సమాజంలో పేరుకుని ఉన్న కుసంప్రదాయాలు, అసమానతలు, కార్మిక కర్షక దయనీయ స్థితులు తో పాటు సమాజంలో సామాజిక కట్టుబాట్ల బంధనాలలో బలి అవుతున్న స్త్రీ అంతర్మధనాన్ని సూక్ష్మాతి సూక్ష్మం గా చెప్పడం జరిగింది.

ఈ కథ చదువు తున్నంత సేపు మహీధర రామమోహనరావు గారి "కొల్లాయి గడితేనేమి" మదిలో మెదిలింది. 

మంచి పుస్తకాలు చదవడం వల్ల..మన ఆలోచనలు కూడా పరిణితి చెందుతాయి అనిపించింది. 

1, అక్టోబర్ 2012, సోమవారం

స్పూర్తి

ఐశ్వర్యంలో  ఆభరణం చదువు.!
దారిద్ర్యంలో ఆశయం చదువు..!! 

ఈ కొటేషన్ ఎక్కడ చదివానో గుర్తులేదు.. కానీ బాగా నచ్చి.. ఓ   మందపాటి కార్డ్ పై స్కెచ్ పెన్  తో వ్రాసి మా హాల్లో  వ్రేలాడదీసాను. మా ఇంటికి వచ్చినవారు అందరూ.. ఆ కోట్స్ ని వ్రాసుకుని వెళ్ళేవారు. 
అలాగే ఇంకొక  విషయం కూడా అలాగే వ్రేలాడదీసాను. (యండమూరి రచన లో చదివి) 

నిరంతర గెలుపు నిజమైన గెలుపు కాదు 
గెలుపు కోసం పోరాటం ఓటమి కాదు.
పారిపోతే గెలుపు రాదు..
నిరర్ధక విజయాలు ఎన్ని అయితేనేం?
నిజమైన విజయం కోసం తాత్కాలికంగా ఓడిపోతూనే ఉండాలి. గెలుపొండాలి. 
లక్ష్యం గొప్పది అయితే ఆత్మ విశ్వాసం ఆయుధమవుతుంది.

జీవన పథంలో అలసినప్పుడల్లా... ఈ  స్పూర్తికర వ్యాక్యాలు చూసుకుంటూ .. నన్ను నేను రీచార్జ్ చేసుకుంటూ ఉండేదాన్ని.  

ప్రతి మానవుడు జీవితమంతా సక్సెస్ వైపే ప్రయాణం చేయాలనుకుంటా డట. అపజయాలని అసలు తట్టుకునే శక్తి కొందరిలో ఉండదు. 
ప్రతి విషయానికి అసహనం,అసంతృప్తి.తగిన శ్రమ లేకుండానే..కోరుకున్నవన్నీ ఒళ్ళో వాటంతట అవే వచ్చి పడతాయని..కలలు కంటూ ఉంటారు. 

మనం చరిత్రని తిరగేస్తే అనేక మంది విజయ గాధల వెనుక అనేక అపజయాలు ఉన్నట్లు తెలుస్తుంది. 
ఒక వ్యక్తి కాని,సంస్థ కాని,దేశం కాని అభివృద్ధి పథంలోకి రావాలంటే చాలా కష్ట పడాలి. కష్ట పడకుండా ఏది ఆయాచితంగా రాదు. వచ్చిన దేది కూడా మనది కాదు. అలాగే అదృష్టం అని అంటూ ఉంటారు. అదృష్టం కన్నా ముందు సాధించాలి ఆనే కోరిక,పట్టుదల,క్రమశిక్షణ ఇవేమీ లేకుండా అదృష్టం తన్నుకు రాదు. 

అదృష్టం అంటే 10 % శాతం అనుకూల పరిస్థితులు రావడం..90 % కఠోర శ్రమ..అనుకుంటాను. 
ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే ఈ రోజు.. కెరీర్ గైడెన్స్ బుక్స్ చదివాను.అందులో.. కొన్ని అంశాలు బాగా నచ్చాయి.  ఆ అంశాలని మనం చేసుకుంటూనే ఇలా అనుకున్నాను.  

గతంలో మనకి లభించిన అపజయాల నుండి పాఠాలు నేర్చుకుని..వర్తమానాన్ని ఎంజాయ్ చేస్తూ..భవిష్యత్ కోసం ప్లానింగ్ జరగాలి.వర్తమానం లో బ్రతకడం ఎంత అవసరమో.. గతం లో చేసిన తప్పులని తెలుసుకుని ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడం అవసరం.
The art of wise living is to be present in the present as a present.

చాలా మంచి విషయం కదా! మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తూ.. ఈ షేరింగ్..