17, ఆగస్టు 2019, శనివారం

శుభం కరోతి కళ్యాణం

స్వయంగా చేసిన వీడియో ..  చిత్రాలన్నీ స్వయంగా తీసినవి. Mp3 Google నుండి సేకరణ.Shubham Karoti Kalyanam
Aarogyam dhana sampada:
Shatru buddhi vinaashaaya
Deepa jyotir namostute

Deepo jyothir parabrahma
Deepo jyothir janardhana:
Deepo harathume paapam
Sandhya deepa namosthute


9, ఆగస్టు 2019, శుక్రవారం

కురిసింది వాన

వాన కోసం యెదురుచూపు
వానొక్క దాని కోసమే కాదు

కురవడం మొదలెట్టాక వానొక్కటే కాదు.
చుట్టూర రంగులు కురవడం మొదలె్ట్టాయి.
ఒంటిగాను గుత్తులు గుత్తులు గానూ
మూకుమ్మడి పరిమళాలు నన్ను కమ్మేసేయి
అది పగలో రాత్రో కలలోనో మెలుకువలోనో తెలియనంతగా.

అంతలోనే ముసురులో వచ్చిన చుట్టంలా దిగులు చుట్టేసింది

చాలీచాలని చెక్కపెట్టెల గూటిలో తడుస్తున్న కూనల అరుపులు
సంపెంగ చెట్టుపై గూటిలో నిలువుగా మెడచాచి
ఎర్రని నోరు తెరిచి తమ యిబ్బంది చెప్పడానికి భాష రాక సతమతమయ్యే కాకి పిల్లలు

సంతోషమూ విచారమూ పక్క పక్కనే..
ఏది శాశ్వతం కాదన్న యెఱుకలో..
8, ఆగస్టు 2019, గురువారం

తులసి పూలు

నేను రచయితలని గురువులు అనుకుంటూ చదివేను. రచయిత చెప్పినది ఆలోచించుకోడమే కానీ ఇది ఎందుకిలా రాసేరు అని ప్రశ్నించలేదు. - నిడదవోలు మాలతి
ఇపుడు ప్రశ్నించే తరం మన ముందు వుంది. అది మొన్న తెనాలిలో జరిగిన కొత్తకథ 2019 ఆవిష్కరణ సభలో విద్యార్ధులు చాలా ప్రశ్నలే వేసారు.
నేను కూడా వొక ప్రశ్నతో వచ్చానిపుడు. మహ్మద్ ఖదీర్ బాబు రీ టోల్డ్ కథల సంకలనం నుండి పొద్దున్నే వొక కథ చదివాను. “పుష్పలత  నవ్వింది” అనే  కథ. రచయిత కరుణ కుమార్.
రీ టోల్డ్ చేయబడిన యీ మంచి కథలో.. వొక వాక్యం.. ఇదేంటి.. యిలా వ్రాసేరు అని అనుకున్నా.. “పూలు పూయని తులసి మొక్కే నిత్యం పూజలు అందుకుంటుంటే నీకేంటి? దాన్ది పుణ్యమైతే ఈ మార్గం ఎంచుకున్న మన్ది కూడా పుణ్యమే” అంటుంది పుష్పలత తల్లి. ఈ వాక్యం వ్రాసింది “కరుణ కమార్” or ఖదీర్ బాబు?
తులసి మొక్క పూలు పూయకపోవడం యేమిటి? అగ్రికల్చర్ కస్టమ్స్ కళ్ళుకప్పి మరీ వేరే దేశాలకు భారతీయులు తులసి విత్తనాలు తీసుకువెళుతుంటే..
ఇలా రచయితలు నాతో సహా యేదో వొక విషయంలో పరధ్యానంలో పొరబడుతూనే వుంటారు. పాఠకులు ప్రశ్నిస్తూనే వుంటారు అని చెప్పడమే నా వుద్దేశం తప్ప భూతద్దంతో చూడటం కాదు. మహ్మద్ ఖదీర్ బాబు రీ టోల్డ్ కథలు 26 ఇంతకు ముందే చదివాను. మిగతా కథలు కోసం మళ్ళీ కొనుక్కొచ్చుకున్నాను. రూపాయలు 150/ యే కానీ.. విలువైన పుస్తకం. అబ్బూరి ఛాయాదేవి గారి రచన “సుఖాంతం” ను మా కిట్టీ పార్టీ సభ్యులకు వినిపించాను కూడా.
సరే మరి... పూలు పూసిన తులసి ని కూడా చూడవచ్చు. 
మాటలో మాట ...

గతంలో నేను కూడా మబ్బులు విడివడి అనే కథలో రంజాన్ రాఖీ పండుగ ఒకే రోజు వచ్చాయని వ్రాసేను. అప్పుడు ఎవరో చూసి చెప్పేదాకా నేనిలా వ్రాసేనని నాకు తెలియదు. ఆ దెబ్బతో వొళ్ళు దగ్గరపెట్టుకుని వ్రాయడం మొదలెట్టాను. ఇలాగే పరధ్యానంలో వ్రాసేవి కొన్నైతే .. కావాలని ఇతర మతం, సంప్రదాయాల పై కావాలని వ్యాఖ్యానించేవారు కొందరు. తర్వాతా వివాదాలు. ఇప్పుడు మరీ సందు ఎప్పుడు దొరుకుతుందా అని కాసుకుకూర్చుని ఉన్నట్టు వుంటారు. ఇతర మతస్తుల గ్రంధాలు అందరూ చదివి ఉండరు. కానీ వ్రాయడం చేస్తారు. మనోభావాలు దెబ్బతిన్నాయని వాదనలు. యేమిటో ..  అర్ధమై చావదు. ముసుగులు వేసుకుని బయటకు కనిపించే మనుషులు వేరు అంతరంగం వేరు అన్నట్టు వుంటున్నారు. ఇదో వేదన. మనుషులకు దూరంగా పారిపోవడం నయం లా ..వుంది. ఇక స్నేహాలు కూడానా ! 

మా ఇంట తులసితో నా స్నేహం ... యిలా ..

తులసిపూలు 


7, ఆగస్టు 2019, బుధవారం

స్పీక్ అవుట్..

నాకు ప్రశ్నించే వాళ్ళంటే యిష్టం .  పదే పదే ప్రశ్నించడాన్ని నచ్చక నన్ను నా కుటుంబసభ్యులే విసుక్కున్నందుకు కోపగించుకున్నందుకు, సమాధానమివ్వకుండా మాట దాటేసి మనుషులే మరీ దూరంగా జరిగినందుకు మరీ మొండితనంగా ప్రశ్నించడం నా అలవాటు. సమాధానం రాదని తెలిసినా మౌనంగా వుండేదాన్ని కాదు.
మా అబ్బాయికి పంతొమ్మిది ఏళ్ళప్పుడు ఒక ప్రశ్న వేసాడు. అమ్మా ..నాన్నగారు అలా ఆస్తులన్నీ అమ్మి నాశనం చేస్తుంటే మెదలకుండా నీకేమి పట్టనట్టు అలా వూరుకుంటావేమిటీ, నీకు భాద్యత లేదా .. వాటిని కాపాడి పిల్లాడికి యివ్వాలని" అని అన్నాడు. అప్పటిదాకా నాకు సంబంధించని ఆస్తిపాస్తుల గొడవ నాకెందుకులే అనుకున్నదాన్ని ఆ మాటతో .. మేల్కొని ఆస్తులు అమ్ముతాను అన్నప్పుడల్లా ఉక్కుపాదం మోపాను. అలా కొంత నిలిచింది. ఆ ప్రశ్న నా కొడుకు వేయకుండా వుంటే నేను పట్టనట్టే వుండేదాన్ని.
ఇక రెండవసారి ప్రశ్న నాకు :). ఎప్పుడూ ..నేను ఫోన్ చేసి మాట్లాడటం లేదు అనకపోతే.. నువ్వే యెందుకు ఫోన్ చేయకూడదూ ..నీ దగ్గర ఫోన్ లేదా.. డబ్బులు లేవా, సమయం లేదా అని ప్రశ్నించడం మొదలెట్టాడు. నేను ఇంకెప్పుడూ ..ఆమాట అంటే వొట్టు. నేనే ఫోన్ చేస్తాను. మా అత్తమ్మ నా పట్ల యెలా వున్నా కొంత కినుక వహించి నేను ఆమె వద్దకు వెళ్ళడం మానేస్తే .. ఎందుకు రావు నువ్వు  అని ప్రశ్నించి  నా భాద్యత  గుర్తు చేస్తే ... మనసులో యెన్ని వున్నా ఒక కోడలిగా ఆమెకు పెద్ద వయసులో యెంత సహాయకారిగా వుండాలో అంత వరకూ నేను వుండి తీరుతున్నాను. అలా ఎవరు ప్రశ్నించినా జవాబుదారిని నేనైనప్పుడు తప్పకుండా నన్ను నేను దిద్దుకుంటాను. అందులో నాకేమీ నామోషీ లేదు.
ఇలా ఎవరు సమంజసమైన ప్రశ్న వేసినా నాకు చూడముచ్చటగా వుంటుంది. స్నేహాన్ని కాపాడుకోవాలనే దుగ్ధ లేకుండా ప్రశ్నించి నామీద హోరాహోరీగా పోరాడే వాళ్ళు (ప్రశ్నించేవాళ్ళు ) అంటే నాకిష్టం.

మొన్న కొత్తకథ 2019 ఆవిష్కరణ సభ తెనాలి  ASN కాలేజ్ లో విద్యార్ధుల మధ్య జరిగినప్పుడు .. డిగ్రీ ఫైనలీయర్ అమ్మాయి వొక ప్రశ్న వేసింది. స్త్రీలకు తమ తమ ఇష్టాలకు అనుగుణంగా వొంటరిగా వుండి ఆత్మ గౌరవంతో బ్రతికినప్పుడు యెక్కువ విలువ వుంటుందా..గృహిణిగా అందరినీ మెప్పిస్తూ బ్రతకడంలో విలువ వుంటుందా అని. అదేదో భేతాళ ప్రశ్నలా అనిపించింది నాకు. ఆది కావ్యం నుండి పురాణ ఇతిహాసాల నుండి నేటి సాహిత్యమంతా చదివినా .. నీకు సమాధానం చాలా తేలికగా అర్ధమవుతుంది అమ్మా ..రచయితలైనంత  మాత్రాన నీ ప్రశ్నకి సమాధానం చెప్పగల్గినవాళ్ళు యెవరూ లేరు. సమాధానం చెప్పినా భిన్నాభిప్రాయాలు ఉన్న సమాజంలో యేది మంచిది అన్నది మనకి మనం నిర్ణయించుకునేది. ఇంకొకరు నిర్ధారించేది  కాదు.  గుడిపాటి వెంకటాచలం మాత్రం ఆత్మ గౌరంగా బ్రతకమని చెపుతారేమో కానీ ఆచరణలో అది యెలా సాధ్యమో చెప్పడం కష్టం అని చెప్పాలని అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి సమూహంలో తప్పిపోయింది. బహుశా పెళ్ళయ్యే వరకూ ఆ ప్రశ్న అడుగుతూనే వుంటుందేమో..తర్వాత అర్ధం చేసుకుంటుందేమో మరి.
చివరగా చెప్పేదేమిటంటే ప్రశ్నించే నోటిని అదుపు చేసే శక్తులు మన మధ్యనే చాలా వున్నాయి. ప్రశ్నించే వారికి మద్దత్తుగా  వెళ్ళిన వారిని అదుపు చేయాలనే మూకలు కాచుకు కూర్చునే వున్నాయి. అయినా ప్రశ్నించే వాళ్ళంటేనే నాకిష్టం. అందుకే నన్ను కొందఱు డబుల్ టంగ్ అంటుంటారు. నా వ్యతిరేకతను అర్ధం చేసుకోరు నా సానుభూతిని అర్ధం చేసుకోరు. ఏది మాట్లాడినా రాసినా  గుడ్డిగా మద్దతు తెలిపితే మన వర్గం లేకపోతే శత్రు వర్గం అనే సంకటస్థితిలో ... తటస్థ అభిప్రాయాలు కల్గి వుండటం నేరం. ఏదో ఒకటి మాట్లాడాలి.. మాట్లాడాలి. లేకపోతే ఫలానా వర్గం కన్నింగ్ లు అనిపించుకోవడం సాధారణమైపోయింది. ప్రశ్నిస్తే .. మెజారిటీ అహంకారం అయి కూర్చుంటుంది. ప్రశ్నించడం నాకిష్టమైనా నోరు మూసుకుని కూర్చోవాల్సి వస్తుంది. తప్పదు మరి కాలం ఎలాంటిది ? మరి యిలాంటి కాలంలో మాట్లాడు ..మాట్లాడితేనే ... ఇంకొందరు మాట్లాడితేనే మనం ప్రశ్నిస్తేనే  చర్చ జరిగి మరిన్ని అభిప్రాయాలు బయటకువస్తాయి అని చెప్పడం సబబుగా వుంటుందా అని ఆలోచిస్తున్నా.   కానీ నేనిప్పుడు క్రమేపీ పిరికిదానిగా మారుతున్నా .. మొన్ననే facebook ఫ్రెండ్  దేవీరమ  క్రొత్తపల్లి చెప్పారు ..నేనంటే ఫైర్బ్రాండ్ ని కనబడని మెతక అని  :) .  నిజమేనేమో ... అనుకుంటే తప్పులేదసలు 

21, జులై 2019, ఆదివారం

" పూవై పుట్టి" కథ వెనుక ..

ఫ్రెండ్స్ ....
కొత్త కథ 2019 లో వున్న నేను వ్రాసిన కథ " పూవై పుట్టి" రచన వెనుక ఉన్న కథ
ఈ కథ గురించి తప్పనిసరిగా మీతో చెప్పాల్సిన నాలుగు మాటలు
ఈ కథను వ్రాసాక ఒకో పత్రికకు పంపి తిరిగి వచ్చినప్పుడల్లా tone మార్చి తిరగ వ్రాసాను. అలా మూడుసార్లు తిరగ వ్రాసిన కథ యిది. ఈ కథను ముగ్గురు మిత్రులు చదివారు. ఎవరికీ యిది నేను వ్రాసిన కథ అని చెప్పలేదు. ముగ్గురూ మూడు రకాల అభిప్రాయాలు చెప్పారు కానీ వొకరు కూడా యీ కథలో నిజ జీవిత ఛాయలను కనుగొనలేక పోయారు.. కొత్త కథ 2019 కి పంపినపుడు టైటానిక్ సురేష్ గారు ఆ కథను క్యాచ్ చేసారు. బాగా తీసుకువచ్చారు వనజ గారూ అని మెచ్చుకున్నారు.
ఈ కథ వ్రాయడం వెనుక నా ఆలోచనల్లో వూపిరి సలపనితనం వుంది. ఒక వేదనటీగ నా మస్తిష్కం పై వాలుతూ వుండి నన్ను నిలవనీయకుండా చేసింది. కథ వ్రాయక ముందు విపరీతంగా హోమ్ వర్క్ చేయాల్సి వచ్చింది. వ్రాసిన తర్వాత చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యాను. ఇప్పుడీ కథ బావుంది బాగోలేదు అనే ప్రశంస విమర్శ కోసం కూడా నేను యెదురుచూడటం లేదు. కథ పాఠకలోకంలోకి వెళ్ళింది అది చాలు. ఈ కథకు వొక మంచి ప్లాట్ ఫామ్ దొరికింది అది చాలు.
ఇంకొక విషయం ఏమిటంటే వంద కథలు వ్రాసిన అనుభవంలో ఈ కథను యెలా పడితే అలా వ్రాయలేదు. పూవు పూవు కలిపి జాగ్రత్తగా మాలనల్లినట్లు ఓర్పుగా కూర్చి కూర్చి వ్రాసాను. రచయితగా ఈ కథ వ్రాయడం నాకెంత తేలికో అంత కష్టమనిపించిన కథ యిది. మనసు ఉగ్గబట్టుకోలేక వ్రాయకుండా వుండలేని తనంలో వ్రాసాను. ఈ కథ వ్రాయాలని తపించాను. వ్రాసిన తర్వాత నా మనసుకు మరియు ఆలోచనకు నచ్చిన, సంతృప్తినిచ్చిన కథ యిది. నేనెపుడూ చెబుతూవుంటాను.. నాకథలన్నీ ముప్పాతిక వంతు జీవితకథ పావు వంతు కల్పన అని.. ఈ కథ పూర్తిగా కల్పన అనుకుంటే మంచిది. నన్నెవరూ ప్రశ్నలు వేయకుండా వుంటారు. పోనీ పూర్తిగా.. జీవితకథ అనుకోండి. అపుడుకూడా నన్నేమి అడగకండి. Even then I feel safe. 
బంగారు పళ్ళేనికి కూడా గోడ చేర్పు అవసరం.
అక్షరాలు బంగారం అవునో కాదో తెలియాలంటే... ఏదో వొక గోడ అవసరమైన కాలం... ఈ కాలం  పత్రికలు ప్రచురించడానికి అనుమతించని కథలు రావాలంటే ఇలాంటి కథాసంపుటాలు రావాల్సిన ఆవశ్యకత వుందని నేను భావిస్తున్నాను.
Thank you so much కొత్తకథ 2019. Thanks Khadeer Garu & Suresh Garu
కొత్త కథ 2019 ను కొనండి, చదవండి. చదువుతారు కదూ

16, జులై 2019, మంగళవారం

దృష్టి కోణం


కొన్ని కథలను పత్రికలు ససేమిరా ప్రచురించవు. ఎవరి ప్రామాణికాలు,విధానాలు, ఉద్దేశ్యాలు వారికి వుంటాయి కదా!
అందువల్ల రచయితలకు యిబ్బంది కూడా లేదు. ఎక్కువమంది చదవాల్సిన రచనలను ఆలస్యంగా తక్కువమంది చదువుతారు. లేదా ఆలస్యంగా యెక్కడో ప్రచురితం అవుతాయంతే..అంతే !
ఒక మాసపత్రికలో లో పబ్లిష్ అవబోయిన కథ ఆఖరినిమిషంలో ఎడిటర్ కథ చదివి తన నిర్ణయం మార్చుకోవడం వల్ల cancel అయింది. కథ పంపి ఏడు నెలలు. పరిశీలన ప్రచురణకు వెళ్ళేముందు జరుగుతుంది అనుకుంటాను . అదీ... రచయితకు ప్రచురణకు వెళుతుంది అని తెలియజేసాక కూడా నిర్ణయం మారవచ్చు. అది దృష్టి కోణం వల్ల కావచ్చు. కథలు ప్రచురించని పత్రికల వారిపై నాకు యెలాంటి వ్యతిరేకత కూడా లేదు. వూరికే నా ఆలోచనలను పంచుకుంటున్నాను అంతే!
నేను ఆ మాస పత్రికకు పరిశీలన కొఱకు పంపిన కథ “ పగిలిన కల” ఆ కథలో కుల వివక్ష, దళితులను అణిచివేసే అగ్రకుల అహంకారం కన్నా.. దళితులు aggressive గా ఆలోచనలు చేసి atrocity act కేసులు పెడుతూ విచారణలో అవి false cases అని నిరూపితం అయ్యాక కూడా కక్షపూరిత స్వభావంతో యితరులపై దాడి చేయడం క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతుంది. వారి aggressive thoughts మూలంగా వారి వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబానికి ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీ లకు అన్యాయం జరుగుతుంది. కేసు బలంగా వుండటం కోసం ఈవ్ టీజింగ్ చేస్తున్నారనో కులం పేరున తిట్టి అవమానించారనో అత్యాచారం చేయ ప్రయత్నించారనో స్త్రీలతో కేస్ లు పెట్టించడం లాంటి చర్యలకు దిగుతున్నారు. అలాంటి సందర్భాలలో ఆ చర్యలు స్త్రీల మనఃసాక్షికి విరుద్దంగా తనవారే తమని వ్యక్తిగత ఆస్తిగా పరిగణించడం తమకి అవమానంగా మిగులుతున్నాయని భావించడం జరుగుతుంది. ఇలా జరుగుతుందని నోరు విప్పి చెప్పే స్త్రీలు కూడా తక్కువే! ఇటువంటి చర్యల వల్ల ప్రతి స్త్రీ తన పురుషుడి చుట్టూ అల్లుకున్న కలలన్నీ పగిలిపోతాయి. వాళ్ళకు అవమానంతో పాటు దుఃఖం మాత్రం మిగులుతుంది.
ఈ అంటరానితనం ఉందనుకుని aggressive గా వుండే వారికి కూడా atrocity act ఒక ఆయుధమై పోయిందని కొందరు దళిత స్త్రీలు వాపోయిన సందర్భాలున్నాయి. పనిపాటలు చేసుకుని బ్రతికే వారికి పనులు దొరకడం కష్టమైపోయిందని అదివరకు కనిపించని వెలి అప్పుడే మొదలైందని అగ్రకులాల వారు దళితులని భయంగా చూస్తున్నారని చదువుకునే పిల్లలు సైతం స్నేహానికి దూరం జరుగుతున్నారని చెప్పడం జరిగింది.
నేను స్త్రీ కోణంలోనే ఆ కథ వ్రాసాను. ఎందుకంటే అణచివేతకు గురవుతున్నామని భావించే పురుషులు కూడా తమ అహంకారాన్ని చూపేది వారి వారి స్త్రీల పైనే అన్నది మరువరాదు. నా కలమెప్పుడూ నేల విడిచి సాము చేయదు.
కథ అంటే కొందరికి ఊహాకల్పన కావచ్చు. నా దృష్టిలో కథంటే జీవితం.
సరే ..ఈ కథ ఇంకొక పత్రికకు పంపే ఆలోచన లేదు. నేను ప్రచురించే "దుఃఖపు రంగు " కథా సంపుటిలో అముద్రిత కథగా రాబోతుంది.
ప్రచురణకు నోచుకోని కథలు వల్ల రచయితలకు వారి వారి అనుభవాలు రాటుదేల్చుతాయి. 🙂
ఫోకోస్ లేకపోతే చిత్రాలు బాగా రానట్లు ఫోకోస్ లేకపోతే కొన్ని సమస్యలు బయటకి రావు

                                                      (చిత్రాలు  గూగుల్ నుండి సేకరణ)