3, డిసెంబర్ 2019, మంగళవారం

రచయితలూ మాములు మనుషులే!

మనుష్యులు మనుష్యుల్లాగానే ఉంటారు

రచయితలైనంత మాత్రాన భిన్నంగా ఏమీ ఉండరని... కొంతమంది రచయితలను సమీపంగా చూసినప్పుడే తెలిసింది. అందుకే మనిషిని మనిషిగానే కలవడమే తప్ప రచయితగానే పాఠక అబిమానిగానో కలవడం నాకిష్టం ఉండదు. నా అనుభవంలో కొందరిని గమనించి ... ఇప్పుడు మరింత దూరంగా ఉంటున్నాను. 



నాలుగేళ్ళ క్రితం ఒక రచయిత్రి (విదేశాల్లో ఉంటారు) ఇక్కడ సాహిత్య రాజకీయాలు గురించి చెపుతూ ..ఇద్దరు రచయిత్రుల గురించి చెపితే .. నేను ఆ విషయాన్ని తేలికగా తీసుకుని ..ఈమె తోటి రచయిత్రుల మీద ఇలా విషంగ్రక్కుతున్నారేమిటి . వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళ జాణతనాలు వాళ్ళ లాబీయింగ్ లు గురించి ఈమె యింత అసహ్యంగా మాట్లాడటం తప్పు కదా ... అని నిరసన తెలిపినట్లు ఆమెతో మాట్లాడటం మానేసాను . ఐ మీన్ .. ఆమె నెంబర్ ని బ్లాక్ చేసి ఫ్రెండ్షిప్ కట్ చేసాను. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ  మనుషుల స్వభావాలు తెలుస్తున్న కొద్దీ .. లోతుగా అర్ధం చేసుకున్నదాన్ని బట్టి ఆమె చెప్పబోయిన విషయాలు నిజమని నాకనిపిస్తుంది. అబ్బబ్బ ..ఎక్కడ లేనివన్నీ ..ఇక్కడే ఉన్నాయబ్బా ... నాకు త్వరగా విరక్తి కల్గింది. రాత నుండి, నిర్మొహమాటంగా మాట్లాడటం నుండి విముక్తి కల్గించు తండ్రీ .. రాత గీత అనకుండా ..ఏదో నర్మగర్భంగా మాట్లాడుతూ అదోమాదిరి కాలక్షేపం చేస్తాను అని బుద్దిగా వినాయకుడి ముందు గుంజీలు తీసి దణ్ణం పెట్టుకున్నాను.


ముఖ్యంగా కాస్త పేరున్న పెద్ద రచయితల కుళ్ళు మనస్తత్వాలు అహంకారాలు తామే సమాజాన్ని  ఉద్దరించేస్తున్నామనే  విరగబాటుతనాలు సంఘాల పేరుతో పనిచేస్తూ  తోటి మనుషులను మిగతా సంఘాల్లో వారిని వెలివేసినట్టు చూడటం నిజాయితీకి సత్యదూరంగా గ్రూప్ రాజకీయాలు చేయడం ఇక రివ్యూ ల కోసమైతే కాకాలు పట్టడం రివ్యూలు వ్రాసేవారిని ఆత్మా బంధువులు అనుకోవడం ..కొద్దీ నెలల కాలంలోనే ప్రముఖ రచయితలు అయిపోవడం ప్రముఖులతో పొగిడించుకోవడం కోసం ఏ అధమ స్థాయి కైనా దిగజారడం ఇవీ ..స్థూలంగా కొందరి రూపాలు.


మనం వద్దన్నా ఫోన్ చేసి .. వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని వినిపిస్తారు. బిందెడు నీళ్ల కోసం వీధిలో కొట్లాడుకునే మనుషుల స్థాయిలో పేరు కోసం వీళ్ళు పడే తాపత్రయాలు దిగజారుడుతనాలు చెవినపడే కొద్దీ అర్ధమవుతున్న కొద్దీ అసహ్యం కల్గింది. ఇలాంటి వాళ్ళ ఒరవడిలో పడి సీనియర్ రచయితల రచనలు అనేక సంకలనాలలో చోటు చేసుకోక కావాలని చేసే నిర్లక్ష్యాల వల్ల నిజమైన పాఠకులకు దూరం అవుతున్నాయి. మంచి సాహిత్యం గుర్తింపులేక మరుగునపడకపోయినా పాఠకులకు అందక తెలియకుండా పోతుంది. పుస్తకాలు కొనేవాళ్లే లేకపోవడం తెలుగు సాహిత్యానికి పట్టిన దుర్గతి అయితే .. అసలు మంచి రచనలు వెలుగులోకి రాక .. వచ్చినవి చెత్త అవడం మూలంగా మరింత దుర్గతి పట్టబోతోంది. ఒక సీనియర్ రచయిత వ్యాఖ్యను ఉదహరిస్తాను. "ఇప్పటి రచనలలో వక్రమార్గం కనబడుతుంది.  కొనియాడబడుతున్న రచయితలలో చాలామంది pervert గా వున్నారు. ఇది సాహిత్యానికి చాలా చేటు చేస్తుంది " అన్న రచయిత మూడు భాషల్లో ప్రావీణ్యులు. ఒక భాషలో నుండి మరొక భాషలోకి తర్జుమా చేసే రచయిత. వారు సమకాలీన సాహిత్యాన్ని నిత్యం చదువుతూనే వుంటారు. 



వినదగు నెవ్వరు చెప్పినా ..అని మాత్రం అనుకోవడం లేదండీ .. నేనిప్పుడు ఒకే ఒకామెతో మాట్లాడతాను ..ఆమెతో కూడా మాటలు బంద్ చేస్తే ..ఈ సాహిత్య విషయాలు రచయితలూ గురించి మాట్లాడటం మొత్తం బంద్ అయిపోతుంది. హాయిగా వుండాలని అనుకుంటున్నాను. సాహిత్య ఉద్దండుల్లారా ..స్రష్ఠల్లారా మీకూ మీ కోటరీలకూ  మీ లాబీయింగ్ లకు మీ రాజకీయాలకు మీ మెచ్చుకోళ్ళకు మీ కుయుక్తులకు మీ పురస్కారాల అవార్డుల పిచ్చికి  శతకోటి వందనాలు. 


రచనల్లో కన్నా రచయితల జీవనవిధానంలోనే ..ఎన్నో కథలు వున్నాయి. అందరూ అనేక పాత్రలు . ఒకొకరి  దగ్గర ఒకో ముసుగు బయటకు తీస్తారు . వారందరికీ లౌక్యం వుంది. రచయిత రచన ఒకటిగా ఉండాలని లేదు. వారి రచనలకూ వారి ప్రవర్తనకు హస్తిమశకాంతరం   బేధం వుంది.  అందుకే వారిని అర్ధం చేసుకోవడం కష్టం. అందరికి దూరంగా వుంది అక్షరాలకు సన్నిహితంగా ఉండటం వలన మనసుకి హాయి శాంతి కలుగుతాయని కాస్త ఆలస్యంగా గ్రహించాను. 





కామెంట్‌లు లేవు: