1, డిసెంబర్ 2019, ఆదివారం

స్త్రీ జాతికి మరణ శాసనమైన యువత అరిషడ్వర్గాల ఉచ్చు

 స్త్రీ జాతికి మరణ శాసనమైన యువత అరిషడ్వర్గాల ఉచ్చు  
ఇటీవల జరిగిన ఒక యదార్ధ సంఘటన ..కి అక్షర రూపం. మీ పిల్లలు కూడా ఇలా చేస్తున్నారేమో ..గమనించుకోండి. 

పట్టణానికి దూరంగా  నిత్యం వేలాది వాహనాలు రణగొణ ధ్వని వినబడే రహదారి నుండి రెండు పర్లాంగుల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో  ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజ్. ఉదయం పదకొండు గంటల సమయం. తరగతులు జరుగుతున్నాయి. పనివారు హాస్టల్ గదులను శుభ్రం చేస్తున్నారు.

ఆ క్యాంపస్ కి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్న సరిత మేడమ్ రోజూ లాగానే  కారిడార్ లో సంచరిస్తూ పరిశీలన చేస్తూ.. మధ్యలో కాసేపు నిలబడింది. ఆమె వయసు నలబైకి పైన.  అందంగా వుంటుంది. ఆ అందానికి  తగ్గట్టు మంచిగా రెడీ అవుతుంది. గౌరవభావం కల్గించేలా వస్తాధారణ చేస్తుంది. అపుడు ఆమె నిలుచున్న చోటుకు  రెండు గదుల తర్వాత  సిక్ రూమ్ వుంది.  ఆ గది నుండి బయటకు వచ్చిన ఒక స్టూడెంట్ రెండు రోజులగా జ్వరంతో బాధ పడుతూ సెలవుతీసుకుంటున్నాడు.   అతని పేరు హరీష్ .    ఆ గదికి ఎదురుగా వున్నబిల్డింగ్  గదులలో క్లాస్ లు జరుగుతున్నాయి. ఆ క్లాస్ లు అతను హాజరయ్యే క్లాస్ లే కావడంతో నిలబడి వింటున్నాడనుకుంది ఆమె.

ఆ స్తూడెంట్ ని పలకరిస్తూ  దగ్గరకు వెళ్ళింది. "ఏం ..హరీష్.. ఎలావుందీ జ్వరం తగ్గింది కదా ... క్లాస్ లకు వెళ్ళిపోతావా అని పలకరించింది. "పర్వాలేదు మేడమ్ ..ఈ రోజు ఆగి రేపటికి క్లాస్ లకి వెళ్ళిపోతాను " అన్నాడు. ఓకే ..ఇక్కడెందుకు నిలబడతావ్ ..క్లాస్ లో పిల్లలు నీ వంక చూస్తుంటారు లోపలి వెళ్లి రెస్ట్ తీసుకో .. "అని చెప్పి కొద్దీ దూరంలో వెళ్లి నిలబడి మెయిన్ గేట్ వైపు చూస్తూ పరిశీలిస్తూ నిలబడింది. కొన్ని నిమిషాల తర్వాత..లోపలి వెళ్ళకుండా ఇంకా అక్కడే నిలబడి ఉన్న హరీష్ వైపు దృష్టి సారించింది. అతను వెంటనే తన ప్యాంట్ జిప్ తెరిచి తన   జననాంగాన్ని  బయటకు తీసి అటుఇటు వూపుతూ ఆమెకు చూపించి సైగ చేసాడు. ఆమె షాక్ తింది. సిగ్గుతో తలవంచుకుని  తన గదిలోకి వెళ్ళిపోయింది .

స్టాఫ్ అందరికి ..నాన్ టీచింగ్ స్టాఫ్ మెస్ స్టాఫ్  తో సహా అందరిని  మూడు గంటలకు కాన్ఫరెన్స్ హాలుకి తప్పని సరిగా రమ్మని సర్క్యులర్ పంపింది. అందరికీ ఆశ్చర్యం. అకస్మాత్తుగా ఎందుకీ సమావేశం అని ఆలోచిస్తున్నారు. అదే సమయానికి హరీష్ తల్లిని మాత్రమే తప్పనిసరిగా రావాలని ఫోన్ చేసి చెప్పింది. ఆమె జ్వరంతో ఉన్న పిల్లాడు ఎలా వున్నాడో అనుకుని కంగారుపడుతూ కాలేజ్ కి చేరుకుంది.మూడింటికి కాన్ఫరెన్స్ హాలుకి చేరుకున్న కొందరు ఆమెకు సన్నిహితముగా వుండే వారు  .."ఎందుకు మేడమ్.. ఈ అత్యవసర సమావేశం ? ఏం జరిగిందో చెప్పండి. సస్పెన్స్ భరించలేకపోతున్నాం"  అని అడిగారు. వెయిట్ ప్లీజ్ .. అంది ఆమె.  సరిగ్గా మూడు గంటల అయిదు నిమిషాలకు ..హరీష్ ని ఆ హాలుకి పిలిపించింది. అతని తల్లి అనేక అనుమానాలతో అర్ధం కానీ భయాలతో టెన్షన్ తో లేచి నిలబడి .ఏం జరిగింది మేడమ్ ..అని అడిగింది.

ప్రిన్సిపాల్ లేచి నిలబడి హరీష్ దగ్గరికి వచ్చింది. మృదువుగా కూల్ గా "నాన్నా ..హరీష్ .. పొద్దున్న నేను కారిడార్ లో నిలబడి ఉన్నప్పుడు .. నువ్వు నాకు తీసి చూపించావు కదా .. అది తీసి ..ఇప్పుడు మీ అమ్మకు చూపించు. ఇక్కడున్న స్త్రీలందరికీ కూడా చూపించకు. కేవలం మీ అమ్మకు మాత్రమే చూపించు చాలు . నా  కన్నా మీ అమ్మ చాలా అందంగా ఉంటుంది. ఇంకా నా వయస్సు కన్నా కూడా వయసులో చాలా చిన్నది. నీకు అన్ని సమయాలలో అందుబాటులో కూడా ఉంటుంది. తీసి చూపించి సహకరించమని నాకు చేసినట్లు సైగ చేయి "  అంది అందరికి వినబడేటట్లు. అందరిలో కొందరు  ఆశ్చర్యంతో నోరు తెరిచారు. కొందరు కిసుక్కున నవ్వారు. కొందరు వాడిని చెప్పు తీసుకుని ఎడాపెడా వాయించాల్సింది మేడమ్ అన్నారు ఆవేశంగా.

హరీష్ తల్లి అవమానంతో ..కోపంతో దుఃఖంతో లేచి నిలబడింది. హరీష్ దగ్గరకు వెళ్లి చెప్పు తీసుకుని ఎడా పెడా వాయించేసి తుపుక్కున ముఖాన ఊసి .."మేడమ్ .. వీడు యిక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలులేదు.  ఇక చదువుకోవడానికి కూడా అనర్హుడు. టీసీ ఇచ్చేయండి మేడమ్" అని అడిగింది. హరీష్ చేసిన తప్పుకు మౌనంగా తలొచుకుని నిలబడే వున్నాడు. అతన్ని అక్కడే వొదిలేసి ..తల్లిని తీసుకుని ఆఫీస్ రూమ్ కి వెళ్లి .. అతన్ని ఇంటికి పంపించే పనిలో పడింది ప్రిన్సిపాల్ మేడమ్ .

ఇంత సస్పెన్స్ క్రియేట్ చేయడం ఎందుకు ? ఆ పని చేసిన వాడిని అప్పుడే చెప్పుతో కొట్టి బయటకు పంపించాల్సింది అని కొందరు, పాపం తల్లి ఏం చేస్తుంది ..వీడివికృత చేష్టలకు ఆమెను అనడం న్యాయమా అని కొందరు ..ఈ కాలం పిల్లలు ఇట్టాగే చచ్చారు వయసు వరస వావి ఏమి లేకుండా .. సినిమాలు అట్టా  నేర్పుతున్నాయి అని కొందరు. అలా తలొక రకంగా వ్యాఖ్యానించుకుంటూ వెళ్లిపోయారు.

నాకు మాత్రం ఆ ప్రిన్స్ పాల్ మేడమ్ సరిగ్గాన్నే ప్రవర్తించింది అనిపించింది. ఏ మాత్రం ఆవేశానికి లోనుకాకుండా ..కూల్ గా ప్రవర్తించి ..మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరికీ తెలియకుండా తల్లిదండ్రులను  అతన్ని మాత్రమే పిలిపించి .. మీ అబ్బాయి ఇలా చేసాడు అని చెప్పడం కూడా సరైనది కాదు. మా వాడిది తప్పై పోయింది మేడమ్ . క్షమించండి వాడి తరపున మేము మీ కాళ్ళు పట్టుకుంటాం అని కాళ్ళావేళ్ళు పడేవారు తప్ప .. ఇలాంటి పరిష్కారం ఉండేది కాదు. ప్రిన్సిపాల్ విజ్ఞతతో వ్యవహరించారు.

హరీష్ ప్రవర్తన నేటి యువతలో చాలామంది  ఆలోచనా విధానానికి పరాకాష్ట.  కన్నందుకు తల్లిదండ్రులు వారిని సంస్కారవంతులుగా పెంచడంలో విఫలం అయ్యారని చెప్పవచ్చు. అసలు ఇల్లు మాత్రమే కాకుండా సమాజం యేమి  నేర్పుతుంది పిల్లలకు .. ఇది ఆలోచించుకోవాలి మనం.  .. 

కామెంట్‌లు లేవు: